27, జులై 2022, బుధవారం

కోయని చేయని కోతలరాయడు

    అనగనగా మా ఇంట్లో ఒకరోజు.... 

    ఇంట్లో ఉన్నవాళ్లు ముగ్గురు  - బుజ్జిగాడు, అమ్మ, నాన్నగారు. 

    నాన్నగారు కిటికీ లోంచి బయటికి చూస్తే అక్కడ అడుగుకి ఎక్కువగా, అడవికి తక్కువగా పెరిగిన గడ్డి కనిపించింది. 

    ఆ గడ్డిని చూడగానే నాన్నగారు బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళి  "మన లాను మో చెయ్యాల్రా నాన్నా!" అన్నారు. 

    "చెయ్యాలంటే చేసెయ్యండి నేనర్స్!" మీరేం చేసినా నేనేమీ అనుకోనన్నట్టున్న సమాధానం. 

    "అలాక్కాదురా నాన్నా! నిన్ను చెయ్యమంటున్నా! ఇప్పుడు చేసేస్తే నీకు వర్కౌట్ కలిసొస్తుంది" నాన్నగారి ఊరింపు. 

    "సరే, నేనర్స్! ఇంటి ముందు నేను చేస్తా... ఇంటి వెనక మీరు చెయ్యండి." అబ్బాయి గారి మొదటి బేరం. 

    "అలగలాగే!" గలగలలాడి సంబరపడి సంద్రమయ్యింది బద్రి తండ్రి-హృదయం. 




*** *** *** *** ***
*** *** *** *** ***

    తండ్రీతనయులిద్దరూ కూడబలుక్కుని గడ్డి కోద్దామని అనుకున్న రోజుకి వాన కురిసింది. 

    గడ్డికోత వాయిదా పడింది. 

    ఇంటి నట్టింట్లో వానాకాలపు-కబుర్లు నడిచాయి. 

    "నాన్నగాడూ...ఎండ రాగానే లాన్ మో చెయ్యాల్రోయ్! అంతే కాదురోయ్...ఇల్లు వేక్యూం కూడా చెయ్యాలి." 

    రాబోయే కాలంలో కాయబోయే ఎండని తలుచుకుంటూ - గడ్డి కోసేసి, దుమ్ము దులిపేసి - ఇంటా-బయటా ఇల్లు తళతళలాడిపోతున్నట్లు కలలు కనేస్తున్నారు నాన్నగారు.   

    ఆ కలల మైకంలో బద్రి తానుండగానే కొత్త బేరం మొదలవుతుంది.

    "నేనర్స్! మీరు ఇంటి బయట లాన్ మో చెయ్యండి. నేను ఇంట్లో వేక్యూం చేస్తా."

    "సర్లే...ఈ సారికి అలాక్కానిద్దాం! మళ్ళీ నువ్వో సగం, నేనో సగం చెయ్యడమెందుకు? ఇంటి ముందూ, వెనకా  లాన్ మో చేసేస్తాలే!"

*** *** *** *** ***
*** *** *** *** ***

    ఈ లోగా వాన వెలుస్తుంది. 

    వానవిల్లు మెరుస్తుంది. 

    నిండుగా ఎండొస్తుంది! 

    ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం - మొదలెట్టేటప్పుడు ఆడుతూ-పాడుతూ, చివరికొచ్చేసరికి ఆపసోపాలు పడుతూ నాన్నగారు గడ్డి కోసేస్తారు. 

    Weekend-Siesta ప్రియులు నాన్నగారు ఇంట్లోకి రాగానే బుజ్జిగాడితో చెప్పేస్తారు - "ఇవాళొద్దు  కానీ రేపు వేక్యూం చెయ్! నేనిక భోంచేసి హాయిగా పడుక్కుంటా". 

    "అలాగే నేనర్స్!" యూ డోంటు వర్రీ - జస్టు లీవిట్టుమీ అంటున్నట్టున్న బుజ్జిగాడి హామీ. 


*** *** *** *** ***
*** *** *** *** ***

    నాన్నగారు ఎదురు చూసిన రేపు రానే వచ్చింది. 

    మధ్యాహ్నం భోంచేస్తున్నప్పుడు నాన్నగారంటారూ... "నాన్నా! వేక్యూం చెయ్యాల్రా!" 

    "అలాగే నేనర్స్! ఆలోచిస్తా (I will think about it)!" కాదనడమన్నమాట నా నోట రాదన్నట్టే అంటాడు బుజ్జిగాడు. 

    మెల్లగా సాయంత్రమయ్యింది. 

    ఇల్లంతా ఎక్కడి దుమ్ము అక్కడే బద్ధకంగా పరుచుకుని పడుకుంది. 

    అక్కడక్కడా కిటికీల్లోంచి జారుతున్న సాయంకాలపు ఏటవాలు వెలుగుల్లో మా ఇంటి ధూళి నక్షత్ర-ధూళిలా మిలమిల్లాడి బడాయి పోతోంది. 

    బుజ్జిగాడు అప్పుడెప్పుడో మొదలెడ్తానని చెప్పిన చేదోడు-వాదోడు కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలయ్యేలా లేదు. 


*** *** *** *** ***
*** *** *** *** ***

    చీకటి ముసిరింది. 

    చల్లబడింది. 

    చలచల్లనివేళ - నిమ్మళంగా సన్-రూంలో కూర్చుని - మెల్లమెల్లగా మోగుతున్న పాటలు వింటూ - వాటితో పాటుగా సనసన్నగా పాడుకుంటున్న  నాన్నగారి పక్కన పిల్లిలా చేరి పాటలు వింటున్నాడు బుజ్జిగాడు. 

    "నాన్నగాడూ! చెప్పిందొక్కటన్నా చేశావా? లాన్ మో నాతోనే చేయించావ్! వేక్యూం సంగతి ఏం చేశావ్?"

    "అదేంటి నేనర్స్ ! అలా అడుగుతారు?  నేను చేస్తానన్నది చేశాగా!"

    "అంటే...  ఏం చేశావ్?"

    "ఆలోచించా !"

    (I did what I said I would do! కి ఒక్క మాటలో అచ్చతెలుగు మాట అది). 

    ఒక్క నిముషం నిశ్శబ్దం. 

    వాడేమన్నాడో - మేమేం విన్నామో - చెవులకి ఎక్కి , తలకి ఇంకి - ఆకళింపు అవడానికి ఓ రెణ్ణిమిషాలు పట్టింది.  

    అప్పుడు భళ్ళుమన్న మా నవ్వులకి మా ఇంటికప్పు ఉలిక్కిపడి ఒక్కసారి పైకి లేచి కూర్చుంది. 


*** *** *** *** ***
*** *** *** *** ***

10, జులై 2022, ఆదివారం

ౘదలచూలి పాట - 3 - చల్లగా... సాకగా... ఇటు వస్తివే!



    చిన్నప్పట్నుంచి ఎన్ని కథలు విన్నానో, ఇంకెన్ని కథలు చదివానో లెక్కలేదు. 

    కథలదేముంది - వాటి పాటికి అవి "అనగనగా..." అంటూ మొదలైపోతాయి. 

    సాగినంతసేపు సాగి - తిరగ్గలిగినన్ని మలుపులు తిరిగి - చివరికి - "కథ కంచికి - మనమింటికి" అంటూ ముగిసిపోతాయి. 

    నేను కుదురుగా కూర్చుని విన్న కథలన్నీ మాత్రం - మా నాన్నమ్మ చెప్పగా విన్నవి మాత్రమే.

     చిన్నప్పుటి వేసవి సెలవుల్లో - పగటి వేళలన్నీ  - ఆటవిడుపులు. 
    
    సందెవేళకి - అరుగు మా కథల-విడిది. 

    పిల్లలందరం అరుగు మీదకి చేరేవాళ్ళం.

    పగటి ఎండకి వెచ్చబడి ఉండేది అనాతవరం ఇంటి అరుగు. 

    ఆ అరుగుకున్న పైమెట్టు మీదున్న స్తంభం దగ్గర నాన్నమ్మ కూర్చునేవారు. ఒక కథ లోంచి ఇంకో కథ లోకి వెళ్తూ  బోల్డన్ని కథలు చెప్పేవారు. 

ఆ వేసవి సెలవులన్నాళ్ళు ... 
సాయంకాలాలు... 
మా కథల వేళలు... 

*** *** *** *** ***
*** *** *** *** ***

    నిజం చెప్పాలంటే - నేనడిగే ప్రశ్నలకి చెప్పదగిన సమాధానాలు మాత్రం చెప్పి - చెప్పదగని చోట "చండికవి నువ్వు" అన్న ఒక్క వాక్యంతో "ఇప్పుడు నీకు దీని అర్థం అవసరం లేదు" అని చెప్పకనే చెప్తూ - నన్ను ఒప్పించగలిగిన కథలు చెప్పినవారు మా నాన్నమ్మ మాత్రమే. 

    అలా విన్న కథల్లో అన్నీ ఒకేలా ఉండవు కదా! 

    ఒక్కో కథ విన్నాక - "హమ్మయ్య! అంతా బాగానే జరిగింది" అనిపిస్తుంది. నిద్రలో కూడా ఆ కథే కలగా కనాలనిపిస్తుంది. 

    ఇంకో రకం కథ విన్న దగ్గర్నుంచీ భలే సతాయిస్తుంది. "ఇది సరి కాదు కదా! ఇలా జరిగుండకూడదు కదా!" - అని పదేపదే అనిపిస్తుంటుంది. 

*** *** *** *** ***
*** *** *** *** ***

    అలా అనిపించిన ఒకానొక కథ - గజేంద్ర మోక్షం. పోతన భాగవతంలో అష్టమస్కంధంలోని పద్యాలతో సహా చెప్తున్నప్పుడెప్పుడూ - ఈ కథా, నాన్నమ్మ పాడే పద్యాలూ ఎంతో నచ్చేవి. 

    ఒకటా - రెండా? బోల్డన్ని పద్యాలు... పూర్తిగా పద్య-పాఠాలు అన్నీ గుర్తులేకపోయినా కనీసం గజేంద్రమోక్షంలో ఈ పద్యాలు ఉన్నాయీ అని గుర్తున్నవి:

    "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై"  ----- "కలఁ డందురు దీనుల యెడ"  ----- "కలుగఁడే నా పాలి కలిమి సందేహింప గలిమిలేములు లేక గలుగువాఁడు?"  ----- "లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె"  ----- "అల వైకుంఠపురంబులో నగరిలో"  ----- "సిరికిం జెప్పఁడు"  ----- "అడిగెద నని కడువడిఁ"

    చివర్లో శాపవిమోచనమై గంధర్వుడైన మొసలి అసలు పేరు "హూహూ" అని వినగానే ఎందుకో నవ్వొచ్చేసేది. "హూహూ" "హూహూ" అని పదేపదే అనుకుంటూ నవ్వుకునేదాన్ని. 

    ఈ పద్యాలూ, శాపవిమోచనాలూ ఇవన్నీ పక్కన పెడితే అసలా కథ వింటున్నంతసేపూ తలలో ఏవో పెంకి ఆలోచనలు నడుస్తూ ఉండేవి. 

    "నాన్నమ్మా! దెబ్బలాటలో ఏనుక్కెన్ని దెబ్బలు తగిలాయో మొసలికీ అన్నే తగిలాయి కదా? పైగా ఏనుగొచ్చి ఆ మడుగులో అంత సేపు కాకుండా కొంచెం సేపే స్నానం చేసి వెళ్ళిపోయి ఉంటే మొసలికి అంత కోపం వచ్చుండేది కాదేమో కదా? నాకు మొసలిని విష్ణువు అలా శిక్షించడం నాకు నచ్చలేదు. విష్ణువు దేవుడైతే ఏనుగునీ, మొసలినీ సమంగా చూడాల్సిందే" అని వాదించేదాన్ని. 

    దాంతో విష్ణువు అలా ఎందుకు చేశాడో నాకు సర్ది చెప్పడానికి ఇంకో కథ చెప్పేవారు నాన్నమ్మ. అలా ఒక కథ లోంచి ఇంకో కథ లోకి బోల్డన్ని కథలు చెప్పేవారు. 

    చిన్నప్పుడు విన్న ఆ గజేంద్రమోక్షం కథా, ఆ కథ విని మా నాన్నమ్మతో చేసిన వాదనా ఇన్నాళ్ళకి గుర్తుకు రావడానికి కారణాలు బోలెడు.  

    ఆ కారణాల వెనకాల కబుర్లు చెప్తా... వినుడు! 


*** *** *** *** ***
*** *** *** *** ***


    నాకు ఏ భాషలో అయినా rhyming words ఉన్న కవితలు చదవడం చాలా ఇష్టం. 

    అలాంటి ప్రాస కుదిరే మాటలు పేర్చుకుంటూ చిన్నచిన్న కవితలు రాసుకోవడం ఇంకా ఇష్టం. 

    అందులోనూ వీలైనన్ని లఘువులతో free verse లు రాయడం ఇంకాఇంకా  ఇష్టం. 

    నాకు నచ్చిన గజేంద్రమోక్షం కథలో వున్న కరి-మకరి మాటలు తీసుకుని అదే కథని నా మాటల్లో ఓ కవితగా రాసుకున్నా. ఇది కూడా ఇప్పుడు కాదు - అప్పుడెప్పుడో కరుణ లేని కొరోనా మొదలైన రోజుల్లో. 



*** *** *** *** ***
*** *** *** *** ***


    అన్నట్టు ఇంకొక్క విషయం. 

    అప్పుడెప్పుడో రాసిన ఆ  కైత ఇప్పుడిలా బయల్పడడానికి కారణం ఇటీవల దొరికిన ఓ బొమ్మ. 

    ప్రవీణ్‌మోహన్ అనే అతను పురాతన దేవాలయాల గురించి యూట్యూబులో పెట్టే వీడియోలు బద్రి చూస్తూ ఉంటారు. 

    నేనూ అప్పుడప్పుడూ చూస్తుంటాను. 

    ఈ మధ్య చూసిన ఒక వీడియోలో ప్రవీణ్‌మోహన్ చూపించిన ఈ గజేంద్రమోక్షం పోస్టర్ నాకు బోల్డు నచ్చింది. 

    నా చిన్నప్పటి ఆకతాయి ప్రశ్నకి జవాబిచ్చింది. 

    మొసలి కరుస్తుందేమోనని బెదిరి నారాయణుడి ఎడమ భుజమ్మీద చేరి మొహం దాచుకున్న ఓ బొద్దు -ఏనుగు. 

    ఏనుగుని భయపెట్టినందుకు తనని కోప్పడతాడేమోనని - అదిరి - "నన్నేమీ అనకు, ఇంకెప్పుడూ ఇలా చేయను"- అని అంటున్నట్టు బిక్కమొహమేసుకుని హరి దరికి చేరిన మొసలి. 

    ఆ రెండిటినీ రెండు చేతులతో దగ్గరికి తీసుకుని అలిగి కొట్టుకుని - తగవు తీర్చమని చెంత చేరిన అన్నదమ్ములని సముదాయిస్తున్నట్టున్న అమ్మలాంటి మొహమున్న విష్ణువు. 

    ఇంతటి అందమైన చిత్రమును - కనుగొనిన నా కనుగవదే ...కలిమి మరి!

    వీళ్ళందరూ వున్న - నాకు నచ్చిన - ఆ పోస్టర్ కూడా ఈ కింద వుంది. చూడుడు! 

    దానికన్నా ముందు నా కైతని చదువుడు! 


*** *** *** *** ***
*** *** *** *** ***

"హరి హరి" యనుచు మునకకని 
కరి మడుగున కరిగె

"అరి యీ కరి" యనుకొని 
 మడుగున మఱుగుగ ఒదిగె మకరి 

మడుగున మునిగిన కరిని కమ్మె మకరి 
కరవగ కమ్మిన మకరికి జిక్కె  కరి

కమ్మిన మకరికి - జిక్కిన కరి - హరిని వేడె  
కమ్మిన మకరికి జిక్కిన కరి వేడిన హరి - సిరిని వీడె
కమ్మిన మకరికి జిక్కిన కరి వేడిన హరి వీడిన సిరి - తొడరె 

సిరి తొడరిన హరి 
వడివడి మడుగున కరిగె 

మడుగున 
కరిపై పరివెడలిన మకరిని 
గదిమె హరి 

 అడగున
మకరికి అడలిన కరిని
గైకొనె హరి

మకరిని గదిమి కరిని గైకొనిన హరి 
నెనరున - కరి నొక కరమున - అలముకొనె  
కనికరమున - మకరినింకొక కరమున - అందుకొనె  

ఇరుకరముల
కరిమకరులను 
అనగిపెనగిన 
కరివరదుని 
కనుగొనిన కనుగవదె కలిమి మరి! 

అనువుగ  
శరణొసగి
అరసిన  
సిరిపెనిమిటిని 
కనుగొనిన కనుగవదె కలిమి మరి! 

*** *** *** *** ***
*** *** *** *** ***









*** *** *** *** ***
*** *** *** *** ***


  
    మీకింకో విషయం కూడా చెప్పాలండోయ్! 

    ఈ మధ్య విన్న ఒక All India Radio (AIR) - ఆకాశవాణి భక్తిరంజని - భక్తిగీతం ఒకటుంది. 

    అది దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు రాసినదట. 

    దానిని పాడిన వారు - శ్రీమతి శేషుబాయి గారట. 

    "కావేరి రంగ రంగ!" అంటూ మొదలయే ఆ పాట వినగానే నాకు మొట్టమొదటగా తట్టినది గజేంద్రమోక్షమే. 

    మొదటి చరణం - మడుగులో అడుగిడి, మకరితో పోరాడి - అలసి - అభయమడుగుతున్న కరి దీనాలాపనలా వుంది కదూ! 

సగము పోయిన ప్రాణము -
నా స్వామి! 
తగని దారుణ భారము...
అడుగిడగనే నేరము
నా తండ్రి! 
అభయ మిడి కాపాడుము


    కానీ - ఇది విన్నాక - ఈ చరణం లోని పదాలు - జీవితంలో ఏదో చేద్దామనుకుని - ఏదీ కలిసి రాక - ముందుకి సాగలేక - అలాగని వెనక్కి మరలలేక - "అన్యథా శరణం నాస్తి - త్వమేవ శరణం మమ" అనుకుని ఉనికికి అందకపోయినా, ఉన్నాడనుకునే వాడి మీద భారం వేసిన వారి మాటల్లా అనిపించాయి నాకు. 


    ఇంక రెండో చరణం: ఆదుకోరమ్మని అడుగుతున్న గజేంద్రుని - చేరి, కాపాడిన వైకుంఠవాసుని మెచ్చుకుంటున్నట్టు  వుంది. 

వైకుంఠ నగరి విడిచీ...
లోకాల నెల్ల కడచీ...
నా కంటి నీరు తుడిచీ...
చల్లగా... సాకగా... ఇటు వస్తివే!


    ఇహ మిగిలింది మూడో చరణం. 

    దయకి, దేవుడవడానికి దామోదరుడు తనకు తానే సాటి అంటూనే తనను మించిన దీనత ఇంకెవరికీ వుండబోవదు అనేది కూడా సాటిలేనితనంగా చెప్పుకోవడం కవి చమత్కారం. 

    లెక్క ప్రకారం ఈ మూడో చరణం రెండోదిగా వుంటే ఈ పాట ఇంకాఇంకా బావుండేది. 

    ముందేమో - "నను పాలింపగ నడచీ వచ్చితివా! " అని పాడేసి, తర్వాతేమో "ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాదేలా?" అని పాడితే ఎలా? 

    అసలే పిలవగానే ముందూవెనకా చూసుకోకుండా పరిగెట్టుకొచ్చేసే సిరి తోడు లేని వెన్నుడాయె! 

    తికమకపడి తిరిగి తిన్నగా వైకుంఠానికెళ్లిపోడూ?! 



ఏలాటి కరుణ నీది?
నా యన్న! 
నీలాటి దైవమేది?
నా బోటి దీన యేది?
నా తండ్రి !
యీ పాటికైన రావే!

*** *** *** *** ***
*** *** *** *** ***


    ఏదేమైనా కానీ - కొంచెం ముందువెనకలుగా అనిపించినా - తేలికైన మాటలతో - ఎంతో గొప్పగా రాసిన పాట. అంతే గొప్పగా కుదిర్చిన సంగీతం. ఇంకెంతో భక్తిగా పాడిన స్వరం. 

    యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=QgVlyld0xDI







కావేరి రంగ రంగ!
నాయన్న! 
కస్తూరి రంగ రంగ!
దేవేరి యైన నీతో... 
మా మనవి తెలిపి రక్షింప లేదా?!

సగము పోయిన ప్రాణము -
నా స్వామి! 
తగని దారుణ భారము...
అడుగిడగనే నేరము
నా తండ్రి! 
అభయ మిడి కాపాడుము

వైకుంఠ నగరి విడిచీ...
లోకాల నెల్ల కడచీ...
నా కంటి నీరు తుడిచీ...
చల్లగా... సాకగా... ఇటు వస్తివే!


ఏలాటి కరుణ నీది?
నా యన్న! 
నీలాటి దైవమేది?
నా బోటి దీన యేది?
నా తండ్రి !
యీ పాటికైన రావే!

కావేరి రంగ రంగ!
నాయన్న! 
కస్తూరి రంగ రంగ!
దేవేరి యైన నీతో... 
మా మనవి తెలిపి రక్షింప లేదా?!

మా మనవి తెలిపి రక్షింప లేదా?!
మా మనవి తెలిపి రక్షింప లేదా?!

*** *** *** *** ***
*** *** *** *** ***

నే రాసుకున్నట్టు .... 


ఇరుకరముల
కరిమకరులను 
అనగిపెనగిన 
కరివరదుని 
కనుగొనిన కనుగవదె కలిమి మరి! 

మీరేమంటారో మరి?!

~ పాటల భైరవి