చిన్నప్పట్నుంచి ఎన్ని కథలు విన్నానో, ఇంకెన్ని కథలు చదివానో లెక్కలేదు.
కథలదేముంది - వాటి పాటికి అవి "అనగనగా..." అంటూ మొదలైపోతాయి.
సాగినంతసేపు సాగి - తిరగ్గలిగినన్ని మలుపులు తిరిగి - చివరికి - "కథ కంచికి - మనమింటికి" అంటూ ముగిసిపోతాయి.
నేను కుదురుగా కూర్చుని విన్న కథలన్నీ మాత్రం - మా నాన్నమ్మ చెప్పగా విన్నవి మాత్రమే.
చిన్నప్పుటి వేసవి సెలవుల్లో - పగటి వేళలన్నీ - ఆటవిడుపులు.
సందెవేళకి - అరుగు మా కథల-విడిది.
పిల్లలందరం అరుగు మీదకి చేరేవాళ్ళం.
పగటి ఎండకి వెచ్చబడి ఉండేది అనాతవరం ఇంటి అరుగు.
ఆ అరుగుకున్న పైమెట్టు మీదున్న స్తంభం దగ్గర నాన్నమ్మ కూర్చునేవారు. ఒక కథ లోంచి ఇంకో కథ లోకి వెళ్తూ బోల్డన్ని కథలు చెప్పేవారు.
ఆ వేసవి సెలవులన్నాళ్ళు ...
సాయంకాలాలు...
మా కథల వేళలు...
*** *** *** *** ***
*** *** *** *** ***
నిజం చెప్పాలంటే - నేనడిగే ప్రశ్నలకి చెప్పదగిన సమాధానాలు మాత్రం చెప్పి - చెప్పదగని చోట "చండికవి నువ్వు" అన్న ఒక్క వాక్యంతో "ఇప్పుడు నీకు దీని అర్థం అవసరం లేదు" అని చెప్పకనే చెప్తూ - నన్ను ఒప్పించగలిగిన కథలు చెప్పినవారు మా నాన్నమ్మ మాత్రమే.
అలా విన్న కథల్లో అన్నీ ఒకేలా ఉండవు కదా!
ఒక్కో కథ విన్నాక - "హమ్మయ్య! అంతా బాగానే జరిగింది" అనిపిస్తుంది. నిద్రలో కూడా ఆ కథే కలగా కనాలనిపిస్తుంది.
ఇంకో రకం కథ విన్న దగ్గర్నుంచీ భలే సతాయిస్తుంది. "ఇది సరి కాదు కదా! ఇలా జరిగుండకూడదు కదా!" - అని పదేపదే అనిపిస్తుంటుంది.
*** *** *** *** ***
*** *** *** *** ***
అలా అనిపించిన ఒకానొక కథ - గజేంద్ర మోక్షం. పోతన భాగవతంలో అష్టమస్కంధంలోని పద్యాలతో సహా చెప్తున్నప్పుడెప్పుడూ - ఈ కథా, నాన్నమ్మ పాడే పద్యాలూ ఎంతో నచ్చేవి.
ఒకటా - రెండా? బోల్డన్ని పద్యాలు... పూర్తిగా పద్య-పాఠాలు అన్నీ గుర్తులేకపోయినా కనీసం గజేంద్రమోక్షంలో ఈ పద్యాలు ఉన్నాయీ అని గుర్తున్నవి:
"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై" ----- "కలఁ డందురు దీనుల యెడ" ----- "కలుగఁడే నా పాలి కలిమి సందేహింప గలిమిలేములు లేక గలుగువాఁడు?" ----- "లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె" ----- "అల వైకుంఠపురంబులో నగరిలో" ----- "సిరికిం జెప్పఁడు" ----- "అడిగెద నని కడువడిఁ"
చివర్లో శాపవిమోచనమై గంధర్వుడైన మొసలి అసలు పేరు "హూహూ" అని వినగానే ఎందుకో నవ్వొచ్చేసేది. "హూహూ" "హూహూ" అని పదేపదే అనుకుంటూ నవ్వుకునేదాన్ని.
ఈ పద్యాలూ, శాపవిమోచనాలూ ఇవన్నీ పక్కన పెడితే అసలా కథ వింటున్నంతసేపూ తలలో ఏవో పెంకి ఆలోచనలు నడుస్తూ ఉండేవి.
"నాన్నమ్మా! దెబ్బలాటలో ఏనుక్కెన్ని దెబ్బలు తగిలాయో మొసలికీ అన్నే తగిలాయి కదా? పైగా ఏనుగొచ్చి ఆ మడుగులో అంత సేపు కాకుండా కొంచెం సేపే స్నానం చేసి వెళ్ళిపోయి ఉంటే మొసలికి అంత కోపం వచ్చుండేది కాదేమో కదా? నాకు మొసలిని విష్ణువు అలా శిక్షించడం నాకు నచ్చలేదు. విష్ణువు దేవుడైతే ఏనుగునీ, మొసలినీ సమంగా చూడాల్సిందే" అని వాదించేదాన్ని.
దాంతో విష్ణువు అలా ఎందుకు చేశాడో నాకు సర్ది చెప్పడానికి ఇంకో కథ చెప్పేవారు నాన్నమ్మ. అలా ఒక కథ లోంచి ఇంకో కథ లోకి బోల్డన్ని కథలు చెప్పేవారు.
చిన్నప్పుడు విన్న ఆ గజేంద్రమోక్షం కథా, ఆ కథ విని మా నాన్నమ్మతో చేసిన వాదనా ఇన్నాళ్ళకి గుర్తుకు రావడానికి కారణాలు బోలెడు.
ఆ కారణాల వెనకాల కబుర్లు చెప్తా... వినుడు!
*** *** *** *** ***
*** *** *** *** ***
నాకు ఏ భాషలో అయినా rhyming words ఉన్న కవితలు చదవడం చాలా ఇష్టం.
అలాంటి ప్రాస కుదిరే మాటలు పేర్చుకుంటూ చిన్నచిన్న కవితలు రాసుకోవడం ఇంకా ఇష్టం.
అందులోనూ వీలైనన్ని లఘువులతో free verse లు రాయడం ఇంకాఇంకా ఇష్టం.
నాకు నచ్చిన గజేంద్రమోక్షం కథలో వున్న కరి-మకరి మాటలు తీసుకుని అదే కథని నా మాటల్లో ఓ కవితగా రాసుకున్నా. ఇది కూడా ఇప్పుడు కాదు - అప్పుడెప్పుడో కరుణ లేని కొరోనా మొదలైన రోజుల్లో.
*** *** *** *** ***
*** *** *** *** ***
అన్నట్టు ఇంకొక్క విషయం.
అప్పుడెప్పుడో రాసిన ఆ కైత ఇప్పుడిలా బయల్పడడానికి కారణం ఇటీవల దొరికిన ఓ బొమ్మ.
ప్రవీణ్‌మోహన్ అనే అతను పురాతన దేవాలయాల గురించి యూట్యూబులో పెట్టే వీడియోలు బద్రి చూస్తూ ఉంటారు.
నేనూ అప్పుడప్పుడూ చూస్తుంటాను.
ఈ మధ్య చూసిన ఒక వీడియోలో ప్రవీణ్‌మోహన్ చూపించిన ఈ గజేంద్రమోక్షం పోస్టర్ నాకు బోల్డు నచ్చింది.
నా చిన్నప్పటి ఆకతాయి ప్రశ్నకి జవాబిచ్చింది.
మొసలి కరుస్తుందేమోనని బెదిరి నారాయణుడి ఎడమ భుజమ్మీద చేరి మొహం దాచుకున్న ఓ బొద్దు -ఏనుగు.
ఏనుగుని భయపెట్టినందుకు తనని కోప్పడతాడేమోనని - అదిరి - "నన్నేమీ అనకు, ఇంకెప్పుడూ ఇలా చేయను"- అని అంటున్నట్టు బిక్కమొహమేసుకుని హరి దరికి చేరిన మొసలి.
ఆ రెండిటినీ రెండు చేతులతో దగ్గరికి తీసుకుని అలిగి కొట్టుకుని - తగవు తీర్చమని చెంత చేరిన అన్నదమ్ములని సముదాయిస్తున్నట్టున్న అమ్మలాంటి మొహమున్న విష్ణువు.
ఇంతటి అందమైన చిత్రమును - కనుగొనిన నా కనుగవదే ...కలిమి మరి!
వీళ్ళందరూ వున్న - నాకు నచ్చిన - ఆ పోస్టర్ కూడా ఈ కింద వుంది. చూడుడు!
దానికన్నా ముందు నా కైతని చదువుడు!
*** *** *** *** ***
*** *** *** *** ***
"హరి హరి" యనుచు మునకకని
కరి మడుగున కరిగె
"అరి యీ కరి" యనుకొని
మడుగున మఱుగుగ ఒదిగె మకరి
మడుగున మునిగిన కరిని కమ్మె మకరి
కరవగ కమ్మిన మకరికి జిక్కె కరి
కమ్మిన మకరికి - జిక్కిన కరి - హరిని వేడె
కమ్మిన మకరికి జిక్కిన కరి వేడిన హరి - సిరిని వీడె
కమ్మిన మకరికి జిక్కిన కరి వేడిన హరి వీడిన సిరి - తొడరె
సిరి తొడరిన హరి
వడివడి మడుగున కరిగె
మడుగున
కరిపై పరివెడలిన మకరిని
గదిమె హరి
అడగున
మకరికి అడలిన కరిని
గైకొనె హరి
మకరిని గదిమి కరిని గైకొనిన హరి
నెనరున - కరి నొక కరమున - అలముకొనె
కనికరమున - మకరినింకొక కరమున - అందుకొనె
ఇరుకరముల
కరిమకరులను
అనగిపెనగిన
కరివరదుని
కనుగొనిన కనుగవదె కలిమి మరి!
అనువుగ
శరణొసగి
అరసిన
సిరిపెనిమిటిని
కనుగొనిన కనుగవదె కలిమి మరి!
*** *** *** *** ***
*** *** *** *** ***
*** *** *** *** ***
*** *** *** *** ***
మీకింకో విషయం కూడా చెప్పాలండోయ్!
ఈ మధ్య విన్న ఒక All India Radio (AIR) - ఆకాశవాణి భక్తిరంజని - భక్తిగీతం ఒకటుంది.
అది దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు రాసినదట.
దానిని పాడిన వారు - శ్రీమతి శేషుబాయి గారట.
"కావేరి రంగ రంగ!" అంటూ మొదలయే ఆ పాట వినగానే నాకు మొట్టమొదటగా తట్టినది గజేంద్రమోక్షమే.
మొదటి చరణం - మడుగులో అడుగిడి, మకరితో పోరాడి - అలసి - అభయమడుగుతున్న కరి దీనాలాపనలా వుంది కదూ!
సగము పోయిన ప్రాణము -
నా స్వామి!
తగని దారుణ భారము...
అడుగిడగనే నేరము
నా తండ్రి!
అభయ మిడి కాపాడుము
కానీ - ఇది విన్నాక - ఈ చరణం లోని పదాలు - జీవితంలో ఏదో చేద్దామనుకుని - ఏదీ కలిసి రాక - ముందుకి సాగలేక - అలాగని వెనక్కి మరలలేక - "అన్యథా శరణం నాస్తి - త్వమేవ శరణం మమ" అనుకుని ఉనికికి అందకపోయినా, ఉన్నాడనుకునే వాడి మీద భారం వేసిన వారి మాటల్లా అనిపించాయి నాకు.
ఇంక రెండో చరణం: ఆదుకోరమ్మని అడుగుతున్న గజేంద్రుని - చేరి, కాపాడిన వైకుంఠవాసుని మెచ్చుకుంటున్నట్టు వుంది.
వైకుంఠ నగరి విడిచీ...
లోకాల నెల్ల కడచీ...
నా కంటి నీరు తుడిచీ...
చల్లగా... సాకగా... ఇటు వస్తివే!
ఇహ మిగిలింది మూడో చరణం.
దయకి, దేవుడవడానికి దామోదరుడు తనకు తానే సాటి అంటూనే తనను మించిన దీనత ఇంకెవరికీ వుండబోవదు అనేది కూడా సాటిలేనితనంగా చెప్పుకోవడం కవి చమత్కారం.
లెక్క ప్రకారం ఈ మూడో చరణం రెండోదిగా వుంటే ఈ పాట ఇంకాఇంకా బావుండేది.
ముందేమో - "నను పాలింపగ నడచీ వచ్చితివా! " అని పాడేసి, తర్వాతేమో "ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాదేలా?" అని పాడితే ఎలా?
అసలే పిలవగానే ముందూవెనకా చూసుకోకుండా పరిగెట్టుకొచ్చేసే సిరి తోడు లేని వెన్నుడాయె!
తికమకపడి తిరిగి తిన్నగా వైకుంఠానికెళ్లిపోడూ?!
ఏలాటి కరుణ నీది?
నా యన్న!
నీలాటి దైవమేది?
నా బోటి దీన యేది?
నా తండ్రి !
యీ పాటికైన రావే!
*** *** *** *** ***
*** *** *** *** ***
ఏదేమైనా కానీ - కొంచెం ముందువెనకలుగా అనిపించినా - తేలికైన మాటలతో - ఎంతో గొప్పగా రాసిన పాట. అంతే గొప్పగా కుదిర్చిన సంగీతం. ఇంకెంతో భక్తిగా పాడిన స్వరం.
యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=QgVlyld0xDI
కావేరి రంగ రంగ!
నాయన్న!
కస్తూరి రంగ రంగ!
దేవేరి యైన నీతో...
మా మనవి తెలిపి రక్షింప లేదా?!
సగము పోయిన ప్రాణము -
నా స్వామి!
తగని దారుణ భారము...
అడుగిడగనే నేరము
నా తండ్రి!
అభయ మిడి కాపాడుము
వైకుంఠ నగరి విడిచీ...
లోకాల నెల్ల కడచీ...
నా కంటి నీరు తుడిచీ...
చల్లగా... సాకగా... ఇటు వస్తివే!
ఏలాటి కరుణ నీది?
నా యన్న!
నీలాటి దైవమేది?
నా బోటి దీన యేది?
నా తండ్రి !
యీ పాటికైన రావే!
కావేరి రంగ రంగ!
నాయన్న!
కస్తూరి రంగ రంగ!
దేవేరి యైన నీతో...
మా మనవి తెలిపి రక్షింప లేదా?!
మా మనవి తెలిపి రక్షింప లేదా?!
మా మనవి తెలిపి రక్షింప లేదా?!
*** *** *** *** ***
*** *** *** *** ***
నే రాసుకున్నట్టు ....
ఇరుకరముల
కరిమకరులను
అనగిపెనగిన
కరివరదుని
కనుగొనిన కనుగవదె కలిమి మరి!
మీరేమంటారో మరి?!
~ పాటల భైరవి

ఏమంటాను లలితా! ఎంత బాగుందో చెప్పడానికి మాటల్లేవంటాను.
రిప్లయితొలగించండిఆ అజ్ఞాత కళాకారుడిలా, (మ)కరి వరదుని భక్త వాత్సల్యాన్ని, అంతందంగా చిత్రించడం మరొకరి వల్ల కాదేమో అంటాను.
అలతి అలతి పదాలతో మకరి గ్రస్త కరి పాద విమోచనాన్ని, ముక్త పద గ్రస్తంతో
నీలా ఇంత హాయిగా వర్ణించడం ఇంకొకరి వల్ల కాదేమో అంటాను.
Definitely one of your finest and my favourites.
Thanks for sharing such a priceless piece of artwork.
Saving the priceless artwork.
లక్ష్మి