26, జనవరి 2020, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 19 - కాకినాడ రేవులో ఓడెక్కి ... తుఫాను అలలలో ఊగామే!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 18 - జంగారెడ్డిగూడెంలో జాలీగా...

1979 ఏప్రిల్, మే ప్రాంతాల్లో మా కంపెనీకి చైనా ఎక్స్‌పోర్ట్స్ వచ్చాయి. ఆ ఆర్డర్ దాదాపు మూడువేల టన్నులో ఎంతో. అవన్నీ కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్‌పోర్ట్. అప్పుడేం చేశారంటే కాకినాడ పోర్టులో నాలుగు గోడౌన్లు - ఒక్కోటి 4000 చదరపు అడుగులు - అంటే మొత్తం పదహారువేల అడుగులు - వాటిని అద్దెకు తీసుకుని నన్ను కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు. కాకినాడ వెళ్ళి ఆ ఎక్స్‌పోర్ట్స్ చూడమని.

అప్పుడే మా పెద్దమ్మాయి లల్లీని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆరో తరగతిలో చేర్చాము. మళ్ళీ అంతట్లోనే ఈ కాకినాడ ట్రాన్స్ఫర్. మరి ఏ స్కూల్లో సీట్ దొరుకుతుందో చూడాలి. ఆ స్కూలుకి దగ్గరగా ఇల్లు దొరకాలి. ఇవన్నీ కుదిరితేనే కానీ మేమందరం కలిసి కాకినాడ వెళ్ళలేము. అందుకే నేనెళ్ళి మా సర్కిల్ మేనేజర్ రాజగోపాలుకి "ముందు నేనెళ్ళి ఇల్లూ, స్కూళ్ళూ చూసుకుని వస్తాను. ఆ తర్వాత ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాను" అని చెప్పాను. ఆయన సరేనన్నాక నేనొక్కణ్ణీ బయల్దేరి కాకినాడ వెళ్ళాను.

కాకినాడలో తిరుమల ఎక్స్‌పోర్ట్స్ అని చెప్పేసి  ఉండేది - వాళ్ళు C & F ఏజెంట్స్. వాళ్ళ ద్వారానే మా చైనా ఎక్స్‌పోర్ట్స్ వ్యవహారాలన్నీ జరిగేవి. అందులో కేలప్పన్ అని ఒకాయన, ఆయన కొడుకు రాజీవ్ - కేరళ వాళ్ళు వుండేవాళ్ళు. కేలప్పన్ మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళు  బియ్యం, ఊక (Rice Bran), మొక్కజొన్న లాంటివన్నీ ఎగుమతి చేస్తూ వుండేవాళ్ళు.

పొగాకుకి ప్రత్యేకించి ఒక విభాగం పెట్టి D S శాస్త్రి అని ఏలేశ్వరంలో చేసిన D S శాస్త్రికి అన్నగారీయన - దారా శాస్త్రి. ఆయన టొబాకోలో పని చేశాడు చిలకలూరిపేటలో MSN కంపెనీలో.

మద్ది లక్ష్మయ్యగారి అన్నగారుండేవాడు మద్ది సత్యనారాయణగారని. ఆయన కంపెనీలో ఈ దారా శాస్త్రి జనరల్ మేనేజరుగా పని చేశాడు. కాకినాడలో భానుగుడి సెంటర్ - పద్మాలయా థియేటర్ దగ్గర ఆయన ఇల్లుండేది. ఆయన సత్యనారాయణగారి కంపెనీలో పని మానేసి, కాకినాడకొచ్చి ఈ కేలప్పన్ కంపెనీలో టొబాకో డివిజన్‌లో చేరాడు. కేలప్పన్ కూడా టొబాకో ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్ వస్తాయని ఈ దారా శాస్త్రిగారిని మేనేజరుగా పెట్టుకున్నాడు.

సరిగ్గా అప్పుడే మద్ది లక్ష్మయ్యగారి చైనా ఎగుమతులు, పోలిశెట్టి సోమసుందరం గారివి, బొమ్మిడాల వాళ్ళవి రష్యా ఎగుమతులు అన్నీ కూడా తిరుమల ఎక్స్‌పోర్ట్స్‌కే వచ్చాయి. అవన్నీ దారా శాస్త్రిగారి ద్వారానే జరిగేవి.

దారా శాస్త్రిగారి దగ్గర శ్రీనివాసరావు గారని ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉండేవాడు. మూర్తి అని ఒక క్లార్కు ఉండేవాడు. ఆ టైములో నన్నూ అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు.

అక్కడ మద్ది లక్ష్మయ్యగారి టొబాకో ఎక్స్‌పోర్ట్స్ వ్యవహారాలు నన్ను చూడమన్నారు. సరే! అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. చైనా ఎక్స్‌పోర్ట్స్ నడుస్తున్నాయి. బానే చేయిస్తున్నాము. ఉద్యోగంలో కుదురుకున్నాను. మరి ఇప్పుడు ఇల్లు అద్దెకు తీసుకోవాలి కదా!

జగన్నాథపురంలో శ్రీనివాసరావుగారి ఇంటి దగ్గరే గారపాటి సుబ్బారావు గారని MSN చారిటీస్ స్కూల్లో పని చేసే ఓ తెలుగు లెక్చరర్ ఉండేవారు. ఆయన ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా వుంది అంటే వెళ్లి చూశాను. ముందు కటకటాలు, మధ్యలో గది, వంటిల్లు, వెనకాల చిన్న పెరడు - ఇల్లు బావుంది. ఆ ఇల్లు అద్దెకి తీసేసుకున్నాను. శ్రీనివాసరావుగారి భార్య కూడా MSN చారిటీస్ లోనే లెక్చరరుగా పని చేసేవారు. ఆవిడని మేము మేడం గారని పిలిచేవాళ్ళం.


ఆ ఇల్లు తీసుకున్నాక జంగారెడ్డి గూడెం వచ్చి, మళ్ళీ అప్పటికప్పుడు సామానంతా సర్దుకుని జంగారెడ్డిగూడెం నుంచి కాకినాడ వెళ్ళాము. లల్లీని, కుట్టీని కూడా MSN చారిటీస్ స్కూల్లో చేర్చాము.

గారపాటి సుబ్బారావు గారికి ఇద్దరు పిల్లలు - బాల, బాబి.

బాల మా లల్లీ కన్నా ఏడాది పెద్దది. బాబి మా కుట్టీ తోటివాడే. వాళ్ళతో పాటు సుబ్బారావుగారి తల్లి కూడా వుండేవాళ్ళు. ఆవిణ్ణి అందరమూ మామ్మగారనే పిలిచేవాళ్ళం.

సుబ్బారావుగారు బాబి చదువుకునే పాఠాలన్నీ ఆయన గొంతుతో ఓ కేసెట్లో రికార్డ్ చేసి రోజూ పొద్దున్నే బడికి వెళ్ళే ముందు బాబిని కూర్చోపెట్టి టేప్ రికార్డర్లో కేసెట్ పెట్టి వాడితో పాటు - పక్క వాటాలో వున్న మా అందరికీ కూడా వినిపించేవారు.

మొదట్లో ఆఫీసుకి బులెట్ మీద వెళ్ళేవాణ్ణి. పోనుపోనూ దానిమీద ఖర్చు పెరిగి అదో ఐరావతంలా తయారయింది. అందుకని దాన్ని జంగారెడ్డిగూడెం పంపించేసి రోజూ ఆఫీసుకి రిక్షాలో వెళ్ళి వచ్చేవాణ్ణి.

ఒకసారి ఏమైందంటే చైనాకి పొగాకు పంపించడానికి Fir wood cases లో ప్యాక్ చేశాము. ఆ పెట్టెలన్నీ స్టీమరుకి వెళ్ళిపోయాయి. ఇంతలో ఏమైందంటే కెప్టెన్ నుంచి కబురొచ్చింది.

ఏమనీ...?

"Hatches లో కేసులు అన్నీ చెదలు పట్టాయి. మీరొచ్చి రిపేరు చేసుకుంటారా, లేకపోతే అన్నీ సముద్రంలో పారేయమంటారా?" అని.

అది చూడగానే వెంటనే నేను, శ్రీనివాసరావుగారు, ఆ మూర్తి  అనేవాడు , విష్ణు అనే ముఠామేస్త్రి ఉండేవాడు - అతను, ఓ పదిమంది ముఠావాళ్ళు, ఓ పదిమంది కార్పెంటర్సు - ఇలా మేమందరం కలిసి ఓ ఇంజిన్ పడవలో ఓడ దగ్గరికి వెళ్ళడానికి బయల్దేరాం. అలా ఎందుకంటే కాకినాడ పోర్టులో షిప్ లోడింగుకి వెళ్ళాలంటే ఆరు మైళ్ళు సముద్రంలోకి వెళ్ళాలి. డైరెక్టు హార్బరుకి రాదది.

సరే! పడవలో మేమందరం పొద్దున్నే బయల్దేరాం రెండు పడవల్లో. ఆ పడవలో వెళ్ళడం ఎలాగంటే వెళ్ళేటప్పుడు ఇంజిన్ మీద తీసుకెళ్తాడు. వచ్చేటప్పుడు ఇంజిన్ ఆపేసి తెరచాప గాలివాలుకి తీసుకొస్తాడు ఆయిల్ ఆదా చేయడం కోసం. మొత్తానికి ఓడని చేరాం. పైకి వెళ్ళి ఆ hatches లో లోపలికెళ్ళిపోయాం. కార్పెంటర్లు పని మొదలుపెట్టేశారు.

అక్కడ మాకు భోజనము అదీ కెప్టెనే ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం అయింది.

మాకు తెలీలేదు కానీ అప్పటికి తుఫాను వస్తోందని అనౌన్స్ చేశారు. మాకా విషయం తెలీదు. Hatches లో ఉండిపోయాం. మధ్యాహ్నానికి First Flag ఎగరేశారట. సముద్రంలో అలల ఉధృతాన్ని బట్టి ఎగరేస్తారు కాబట్టి దాన్ని surf flag అంటారు. తుఫాను వచ్చినప్పుడు మూడు ఫ్లాగులు ఎగరేస్తారు. మొదటిది వచ్చినప్పుడు మాకు తెలీలేదు. ఇంతలో రెండోది కూడా ఎగరేశారు. అప్పుడు కెప్టెను మా దగ్గరికొచ్చి "మీరు వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కణ్ణించి. Second surf flag కూడా ఎగరేశారు. ఇంకా ఎక్కువ కాకుండానే మీరు ఒడ్డుకి వెళ్లిపోవడం మంచిది." అనగానే మేము కూడా బయల్దేరేశాం. ఈలోపులో మా పనులు కూడా అయిపోయాయి లోపల.

బయల్దేరామే కానీ షిప్పులోంచి పడవలోకి దిగలేకపోయాం. విపరీతమైన గాలి సముద్రంలో. మేము దిగుదామని చూస్తే ఆ నిచ్చెన అటూ ఇటూ ఓ....  ఊగిపోతోంది.

అప్పుడు కెప్టెను ఏం చేశాడంటే - పడవల్లోంచి కేసులు షిప్పులోకి చేర్చే క్రేన్స్ ఉంటాయి. మమ్మల్ని ఆ క్రేన్సులో కూర్చోబెట్టి పడవల్లోకి దించాడు. అందరం పడవుల్లోకి ఎక్కాం. మరి పడవవాళ్ళు ఇంజిన్లు ఆపేశారు కదా. తెరచాపలు ఎత్తారు.

మేమందరం రెండు పడవల్లో ఎక్కి వెళ్తుంటే.... అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుంటూ పడవలు వెళ్తుంటే అసలెలా ఉందంటే ... చుట్టూ ఎటు చూసినా నీళ్ళు. పైన ఆకాశం నల్లగా... ఆ నీడ పడి కింద నీళ్ళు ఇంకా నల్లగా ...పెద్ద పెద్ద అలలు... గాలి... భయంకరంగా వుంది. ఆ పెద్ద అలల్లోంచి సముద్రపు నీళ్లు మమ్మల్ని ఛెళ్ళుఛెళ్ళున కొట్టేస్తున్నాయి.

ఇంతలో శ్రీనివాసరావుగారికి ఆ పడవ కుదుపు, అలల తాకిడికి తట్టుకోలేక వాంతులు మొదలయ్యాయి.

మూర్తి ఏమో తెరచాప కొయ్య గట్టిగా పట్టుకుని కావలించుకుని కూర్చుని ఒకటే ఏడుపు ... "మా అమ్మకి నేనొక్కణ్ణే కొడుకుని బాబోయ్! ఇప్పుడు ఒడ్డుకెలా చేరుతాంరో దేవుడోయ్...!" అంటూ.

ముఠావాళ్ళు కొంచెం గట్టిగానే వున్నారు. లోపల్లోపల భయంగా వున్నా - అది బయటపడితే అందరూ ఇంకా బెంబేలెత్తిపోతారని - నేను ముఠావాళ్ళతో కలిసి ఈ భయపడ్తున్న వాళ్ళందరిని సముదాయిస్తూ "ఏం ఫర్వాలేదు. ఒడ్డుకి చేరిపోతాం. ఒకవేళ మన పడవ మునిగిపోయినా ఏ హెలికాఫ్టరో వచ్చి మనల్ని తీసుకెళ్తుంది. ఇబ్బంది లేదు. ఆల్రెడీ పోర్టుకి కబురెళ్ళింది మనం ఇలా పడవల్లో వస్తున్నామని" అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడి ధైర్యం చెప్తూ ...మొత్తానికి ఒడ్డుకి చేరాం.

ఇంక అదే ఆఖరు... ఆ తర్వాత ఇంకెప్పుడూ సముద్రం లోపలికెళ్ళలేదు - వెళ్ళే ఆలోచన కూడా చెయ్యలేదు.

<వచ్చేమాటు తరువాయి కథ>

19, జనవరి 2020, ఆదివారం

త్వామనురజామి - 43 - వింటా నీ మాట... విన్నానంటే ...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 42 - వింత-Chaట్లు వినవలె వింతవింతలూ...


న్యూ ఇయర్స్ డే శుక్రవారం వచ్చింది. శనివారం, ఆదివారం ఎలాగూ సెలవులు. నేను NAL కి వెళ్ళేటప్పటికి జనవరి నాలుగో తారీఖు అయ్యింది. ఎప్పట్లాగే విజయనగర్ నుంచి మెజెస్టిక్‌కి వెళ్ళే బస్సెక్కి కూర్చున్నాను. కొంచెం తలనొప్పి. దాన్ని మించి ఇదీ అని చెప్పలేని విసుగు.

నేనెక్కే సమయానికి సాధారణంగా బస్సులు ఖాళీగా ఉంటాయి. ఒకవేళ బస్సులో బోల్డుమంది ఉన్నారూ, నాకు కిటికీ పక్క సీటు దొరకదూ అనిపిస్తే ఎక్కేదాన్ని కాదు. ఇవాళా అంతే ... నాక్కావాల్సిన కిటికీ దగ్గర కూర్చున్నాను కానీ ఎప్పట్లా ఆ గ్లాస్ డోర్ తెరిచి వుంచుకోలేకపోయాను. ఆ చలిగాలికి తలనొప్పి ఎక్కువవుతున్నట్లుగా వుంది అందుకని. 

బదరి ఊళ్ళోనే వున్నా తనని చూడక ఇప్పటికి దాదాపు వారం రోజులవుతోంది. కొంచెం బెంగగా వుంది. ఇంకొంచెం చిరాగ్గా వుంది.

అటు అమ్మ-నాన్నల్ని, ఇటు బదరిని - ఇలా నన్నిష్టపడే వాళ్ళందర్నీ వాళ్ళు చెప్పే మాటలు వినకుండా కష్టపెడుతున్నానని. అలా అని వినకూడదని నాకేమీ లేదు. పోన్లే అని వినాలని అనిపించట్లేదు. ఎలాగోలా వాళ్ళందరూ నా మాట వింటే బావుండుననిపిస్తోంది. ఇలా ఏదేదో ఆలోచిస్తున్నా కూడా ముందేం జరగబోతోందో అన్న భయం కానీ, బాధ కానీ లేవు విచిత్రంగా. ఈరోజుకీరోజు బదరీని చూళ్ళేదన్న దిగులు తప్ప.

ఈలోగా మెజెస్టిక్ బస్టాండు వచ్చింది.

Already ఆలోచిస్తున్న తలని అలాగే ఉంచుకుని - తలొంచుకుని బస్సు ఆఖరి మెట్టు దిగుతూ, నా పింక్ సంచీని సర్దుకుంటూ చుట్టూ వున్న లోకంతో సంబంధం లేనట్లు - ఏకపంథాగామిలా - నేనెక్కి వచ్చిన విజయనగర్ బస్సు నన్ను దింపిన దగ్గర్నుంచి, ఇక నేనెక్కాల్సిన 333A మారతహళ్ళి బస్సెక్కడానికి అటు వైపు వెళ్తున్నానో లేదో కళ్ళ ముందు బదరి ప్రత్యక్షం.

కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, నీరసంగా ఏదో జ్వరం వచ్చి తగ్గినట్లుగా కనిపించారు. తనని అలా అక్కడ చూస్తానని అనుకోలేదేమో - ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బోల్డు ఏడుపొచ్చేసింది. నా పింక్ బేగ్ లోంచి కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకుంటూ గబగబా వెళ్ళి బదరి చెయ్యి పట్టేసుకున్నాను.

తను వెంటనే నవ్వుతూ "ఇలా ఎవరైనా ఏడుస్తారా చిన్నపిల్లలా?" అనగానే నాకు బోల్డు ఉక్రోషం... మామూలుగా ఐతే వెంటనే చెయ్యి విదిలించుకుని దూరంగా జరిగేదాన్ని. కానీ ఈసారి కోపం వచ్చింది ఎప్పట్లా నాక్కాదు. బదరి కోపాన్ని మొదటిసారిగా చూశాను వారం క్రితం. అందుకని కొంచెం నన్ను నేను తమాయించుకుని "నేనిప్పుడు 333A ఎక్కాలి." అన్నాను.

నేనెక్కబోయిన 333A బస్ వెళ్ళిపోతే మళ్ళీ అరగంట దాకా ఇంకోటి లేదు. అంతదాకా ఆగితే ఆఫీసుకి ఆలస్యమవుతుంది. ఆ సంగతి బదరీకి తెలుసు. అందుకని నన్ను ముందు బస్సెక్కమని సైగ చేసి తను కూడా నా వెనకాలే బస్సెక్కి నా పక్కన కూర్చున్నారు.

నాకు ఇంకా ఏడుపు వస్తూనే వుంది. కళ్ళలో నీళ్ళు ఊరుతూనే వున్నాయి. ఎవరికీ ఏమీ చెప్పలేకపోతున్నానన్న బాధ. నా పక్కన కూర్చున్న బదరీ కేసి తిరిగి ఇన్నాళ్ళూ ఎందుకు కనిపించలేదు అని అడగబోతున్న నన్ను "ష్!" అని ఆపి నా చేతిలో ఓ చిన్న కాయితం, ఓ book-mark పెట్టి "ముందా కళ్ళు తుడుచుకుని అవేంటో చూడోసారి..." అన్నారు.



తను అల్లిచ్చిన ఆ అల్లిబిల్లి పదాల అల్లికని చదువుతూనే నాకు - అది నాకోసమే రాశారన్న ఆనందం, నా గురించే రాశారని కొంచెం సిగ్గూ కూడా అనిపించాయి.

అవి కనిపించనీయకుండా "బానే వుంది కానీ... ఎంత కోపమొస్తే మాత్రం అలా వదిలి వెళ్ళిపోతారా? అన్ని రోజులు రాకుండా వుంటారా?" అని అలవాటైన అరువు-దెబ్బలాట ఆడబోయాను.

"అబ్బా! ఆ రెండోదేంటో కూడా చూడు. ఆ తర్వాత తీరిగ్గా పోట్లాడుకుందాం." అని తననగానే అప్పుడు చూశాను ఆ book-mark.

అది చూడగానే నాకింకేమీ మాట్లాడాలనిపించలేదు. బదరి నా పక్కనుండగా నేనింకేమీ ఆలోచించక్కర్లేదు అనుకుంటూ నిశ్శబ్దంగా బస్సు కిటికీ లోంచి బయటకి చూస్తూ కూర్చున్నాను. ఇక నాకు తనకొచ్చిన కోపం గురించి ఆరా తీయాలని కూడా అనిపించలేదు.

అన్నట్టు ఇంతవరకు చెప్పినట్లు లేను - బెంగుళూర్లో బదరి MBA క్లాస్‌మేట్స్ - శ్రీనివాస్, ధనంజయ రాజు, గిరిరాజ్, ఫ్రెడరిక్, సాయి సురేష్, మోహన్ (చిరుభాయ్) - వీళ్ళందరూ కలిసి బనశంకరి ఏరియాలో బ్యాంక్ కాలనీలో మామ్మగారింట్లో మేడ మీద ఒక్క గదిలో అద్దెకుండేవాళ్ళు. మద్రాస్ నుంచి వచ్చిన బదరి కూడా వాళ్ళ దగ్గరే వున్నారు. 

సరే! నేను మాట్లాడకుండా ఉండడం అస్సలలవాటు లేని బదరికి నేనలా రెట్టించకుండా ఉండడం వింతగా అనిపించినట్లుంది. తనే చెప్పడం మొదలుపెట్టారు.

"అసలేం జరిగిందంటే ... బుజ్జాయ్! నేను నీ దగ్గర్నుంచి అలా కోపంగా వెళ్ళిపోయానా? ఆ తర్వాత వెంటనే తగ్గిపోయిందిలే - పాపం! నీకిష్టం లేనివి ఇంకెప్పుడూ మాట్లాడకూడదని అనుకున్నాను కూడా. ఈలోగా రాకు మద్రాసు ప్రయాణం. అదవ్వగానే డిసెంబర్ 31కి విజయనగర్ లోనే మా వాళ్ళు ఓ పార్టీ పెట్టుకున్నారు. దానికి వెళ్ళే ముందు ఫ్రెడ్డీ (ఫ్రెడరిక్) చర్చ్‌కి వెళ్దామన్నాడు. నేను, ఫ్రెడ్డీ కలిసి తన స్కూటర్ మీద ఎక్కడో M. G. Road లో వున్న చర్చ్‌కెళ్ళి, అక్కణ్ణించి విజయనగర్ వెళ్ళేటప్పటికి రాత్రి పన్నెండు దాటిపోయింది. అప్పటికే మా వాళ్ళందరూ full మజాలో వున్నారు. ఆ సరదాలో సీనా నన్ను గట్టిగా పట్టుకుని బోల్డంత raw తాగించేశాడు. వెంటనే నాకు కడుపులో వున్నదంతా బయటికొచ్చేసింది. కళ్ళు తిరిగాయి. పాపం అందరూ చాలా కంగారు పడ్డారు. విజయనగర్ నుంచి నన్ను రూంకి తీసుకొచ్చారు. ఆ పడడం పడడం మళ్ళీ మూడు రోజులకి నిన్ననే లేచాను. భలే జరిగింది ఈ సారి న్యూ ఇయర్!" అని నవ్వుతూ చెప్తుంటే నాకు ఆ నవ్వు చూసి "ఈ అబ్బాయికి సరదాగా, భలేగా అనిపించనిది అసలేమైనా ఉందా?!" అనిపించింది.

"అవునమ్మాయ్... నీకింతకీ నేనెందుకు బెంగుళూరు వచ్చానో తెలుసా...? నీ కోసం, నా ఉద్యోగం కోసం... నీకు బెంగుళూరు ఇష్టం కదా! అదొక కారణమైతే నేను మీ నాన్నగారికి చెప్పిన మాట ఇంకో కారణం." అంటూ చెప్పడం కొనసాగించారు.

ఇవాళ మాట్లాడడం తన వంతు, విని "ఊఁ" కొట్టటం నా వంతులా వుంది. "ఆర్నెల్లు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని విన్నాను కానీ ఆర్నెల్లు దూరంగా ఉంటే తను నేనయ్యారు - మాట్లాడడంలో" అనుకున్నాను.

"మీ నాన్నగారు తిరుపతి వచ్చి కలిసినప్పుడు 'అసలేమనుకుంటున్నారు మీరు? ఓ ఉద్యోగం లేదు. అసలు రేపెలా వుంటుందో ఆలోచన వున్నట్టే కనబడట్లేదు. ఇక మా లల్లీని మర్చిపోతే మంచిది' అన్నట్టు మాట్లాడారు. అప్పుడు నేను 'సరే! అంకుల్... మళ్ళీ ఉద్యోగం వచ్చాకే మిమ్మల్ని కలుస్తాను' అని చెప్పాను. అందుకే... నీకిష్టమైన బెంగుళూర్లో ఉద్యోగం వెతుక్కోవడానికే వచ్చాను. ఇప్పటికి షాలిమార్ పెయింట్స్, దళాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి కొన్ని కంపెనీలకి apply చేశా. ఇంకా local గా కూడా వెతుకుతున్నా. మరి తొందర్లో వెళ్ళి మా కాబోయే మాంగార్ని కలవాలి కదా - మీ లల్లిని నాకివ్వమని అడగడానికి" అంటూ మళ్ళీ హాయిగా నవ్వారు.

నేనవన్నీ వింటూ నెమ్మదిగా చెప్పాను - సంక్రాంతికి గుంటూరు వెళ్తున్నట్లు. అది వినగానే ఇంతకు ముందు మా ఇద్దరి మధ్యా "ఫో" అంటే "ఫో" అనుకునేట్లు జరిగిన ఫో-ట్లాట గుర్తొచ్చిందేమో బదరి మాటలాపి కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. నేను వెంటనే - నేననుకుంటున్న మాట చెప్పకపోతే మళ్ళీ topic మారిపోతుందేమో అన్నట్లు - "నేను గుంటూరు నుంచి రాగానే మీతో ఒక్కసారంటే ఒక్కసారి రిజిస్ట్రార్ ఆఫీసుకి వస్తాను." అని గబగబా చెప్పేశాను - వింటా నీ మాట... విన్నానంటే ... Future అంతా winner అంటా...  అని లోపల్లోపల hum చేసుకుంటూ.

నేనన్నది వినగానే ఒక్కటంటే ఒక్క క్షణం తన కళ్ళల్లో చిన్న నవ్వు. మళ్ళీ అంతలోనే "నేనడిగాను, నువ్వొస్తానన్నావు. అలాగే వెళ్దాం. అసలు procedure ఏంటో కనుక్కుందాం. ప్రస్తుతానికి అంతకు మించిన ఆలోచన వద్దు. సరేనా?!" అనగానే నాకు నిజ్జంగా హాయిగా అనిపించింది - తను తనక్కావల్సింది తీర్చుకుంటూనే నా ఇష్టాన్ని మన్నిస్తున్నందుకు.

మేమిద్దరమూ అలా మాట్లాడుకుంటుండగానే  NAL దగ్గర దిగడం - నన్నక్కడ దింపి బదరి వెనక్కి వెళ్ళడం - జరిగాక మళ్ళీ ఇంకొన్ని రోజులు మామూలుగానే uneventful గా జరిగాయి.

అనుకున్నట్టుగానే సంక్రాంతికి గుంటూరు వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికే నాన్న రైలుపేటలో ఒక ENT సర్జన్ దగ్గర appointment తీసుకున్నారు. నేను ఇంటికి వెళ్ళిన రెండో రోజుకే నాన్న, నేను కలిసి ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ గారు చెప్పినట్లు నా ముక్కుకి X-ray తీయించుకుని వెళ్ళాము. డాక్టరుగారు నా X-ray చూసి ఒక చిన్న ఆపరేషన్ లాంటిది చెయ్యాలి అని చెప్పారు. నాకు ఆపరేషన్ అన్న మాట వినగానే భయం వేసింది. చిన్న ఇంజెక్షన్ చేస్తారంటేనే కళ్ళు గా...ఠిగా మూసేసుకుని, ఆ needle నాకు తగిలీ తగలకుండానే ఏడ్చేసే నాకు ఆపరేషనా!?

నా మొహంలో భయం తెలిసిపోయిందో ఏమో ఆ డాక్టర్ గారు - "అబ్బే!భయపడకమ్మా... ఆపరేషన్ అన్నానే కానీ అది చాలా చిన్న procedure. ఓ పదిహేను నిముషాల్లో అయిపోతుంది" అన్నారు.

సరే! ఇంతవరకు వచ్చాక తప్పదు కదా అనేసుకుని, అలా అని వెంటనే చేయించుకోవడానికి భయమేసి - కొన్ని రోజులైనా ఆలస్యమవుతుంది కదా అన్నట్లు "పండగ అయ్యాక చేయించుకుంటానని" నాన్నతో చెప్పాను.

ఈసారి సంక్రాంతి ఎప్పట్లాగే పండగ పండగ్గానే జరిగింది. పప్పి, కుట్టీలతో వెళ్ళి చిరంజీవి ముఠామేస్త్రి చూశాను. ఆ సినిమా చూసొచ్చాక - అందులో చిరంజీవి ఈ పేటకు నేనే మేస్త్రి పాటలో పొట్లకాయలు పట్టుకుని చేసిన కూర-walk మేం కూడా shuttle bats తలకిందులుగా పట్టుకుని ప్రాక్టీస్ చేశాం. మా ముగ్గురికీ actors మేమే, audience మేమే! ఆ తర్వాత తీరిగ్గా పాటలన్నీ తల్చుకుని ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా, ఏటవాలు చూపులో మౌనగీతమా పాటలో "ఏటవాలు చూపు" అంటే ఏంటి, ఆ ఏటవాలుకి angle ఎంత వుంటే బావుంటుంది అని పాటల్లో మాటల గురించి సరదా-మాట్లాడుకుని మా శీతాకాలపు మధ్యాహ్నాలని నీరెండలో వెచ్చవెచ్చగా గడిపేశాం.

పండగ అయిపోయింది. అనుకున్నట్టుగానే నాన్నతో ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆ డాక్టర్ గారిని అడిగాను - "General Anaesthesia ఇస్తారా అండీ?" - అని. ఏదో నొప్పి తెలీకుండా చేయించేసుకుందామని నా ఆశ. నేనడిగింది వినగానే డాక్టర్ గారు గట్టిగా నవ్వి - ఈ మాత్రం దానికి Local చాలు - అంటూనే నా పై పెదవి దగ్గర చిన్న syringe తో పొడిచి నాకు అక్కడ numb అయ్యాక చెప్పామన్నారు. ఓ పది నిముషాలు గడిచాయో లేదో ఆయన ఒక చిన్న స్టీల్ రాడ్ లాంటిది చూపించి "ఇది ఇప్పుడు నీ ముక్కులో పెట్టి లోపల మూసుకుపోయిన నీ sinus ని క్లియర్ చేస్తాను" అంటూనే దాన్ని నా ముక్కులో పెట్టేశారు. అది తగిలి నా ముక్కులో ఏదో చిట్లుతున్న శబ్దం. నాకు బోల్డు భయమేసేసింది. నా పక్కనే కూర్చున్న నాన్న చేతిని గట్టిగా పట్టేసుకున్నాను. మొత్తానికి ఆ ENT procedure డాక్టర్ గారు చెప్పినట్లే ఓ ఇరవై నిముషాల్లో ముగిసింది. నాకు చాలా నొప్పిగా అనిపించింది. అంతా అవగానే ఓ నెల రోజులు వాడమని ఏవో మందులు రాసిస్తూ డాక్టర్ గారు నాన్నతో "మీ అమ్మాయి ముక్కు బ్రిడ్జ్ లోనే వంకర ఉందండి. ఈ sinus పూర్తిగా తగ్గాలంటే దాన్ని కూడా సరిచెయ్యాలి." అన్నారు. అది వినగానే "అమ్మో! ఈయన మొత్తానికి నా ముక్కు కోసేయడానికి కంకణం కట్టుకున్నారు" అనుకున్నాను. కాకపొతే డాక్టర్ గారు అన్న మాటకి నాన్న వెంటనే "ఇప్పుడింకేమీ వద్దు లెండి. మళ్ళీ తను ఓ నాలుగు రోజుల్లో బెంగుళూరు వెళ్ళిపోవాలి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చెయ్యడానికి" అని చెప్పి డాక్టర్ గారికి ఫీజ్ ఇచ్చేసి నన్ను తీసుకుని ఇంటికొచ్చేశారు.

ఆ చిన్న ముక్కు-కోత అయిన నాలుగు రోజులకి బయల్దేరి మళ్ళీ బెంగుళూరు వెళ్ళాను. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈసారి అమ్మ, నాన్న అస్సలు బదరీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అంతా మామూలుగానే వున్నట్టు కనబడుతున్నా ఏదో తెలియని చిన్న దూరం... అచ్చు ఈ గజల్లా... ఏమీ గుచ్చుకోకుండానే కలిగే నొప్పిలా...

ఫాసలే ఐసే భీ హోంగే
ఏ కభీ సోచా న థా
సామ్‌నే బైఠా థా మేరే
ఔర్ వో మేరా న థా



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>




12, జనవరి 2020, ఆదివారం

ఉన్నకాలము మేలు ఏ కాలము కంటెన్...

క్యాలెండర్ మారింది. 

వచ్చిందేమన్నా అలాంటిలాంటి సంవత్సరమా? 
సమదృష్టి భరిత వత్సరం 20-20. 

కొత్త సంవత్సరం. 
కొత్త దశాబ్దం. 

కొత్తని కొలుచుకోవడానికి క్యాలెండర్లో తిరిగిన పుట మాత్రం సరిపోతుందా?
 
పాత జ్ఞాపకాలని కొత్తగా తలుచుకుంటూ 
కొత్త పరిచయాలని పాతగా మలచుకుంటూ 
పాత-కొత్తల మధ్య నే నేర్చుకున్న కొత్త పాఠాలేంటి? - అన్నదే ఈ కొత్త సంవత్సరపు మొగసాల నా తలపోత.

జరిగిపోయిన ఏడాదిని తలుచుకుంటూ - అప్పుడెప్పుడో అనుకునో, అనుకోకుండానో చేసిన ఒప్పులెన్ని? - ఇంతకు ముందు చేసేసినా, ఇప్పుడూ-ఇక ముందు చేయకూడని తప్పులెన్ని? - అని జరిగిపోయిన తప్పొప్పుల లెక్కలు వేసుకునే ప్రతీసారీ నాకు నన్నయ మహాభారతంలో ఆదిపర్వంలో వ్యాసుడితో సత్యవతికి చెప్పించిన పద్యం గుర్తొస్తుంది.

మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావులట్టుట సంప
త్ప్రతతు లతిక్షణికంబులు
గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్

వాగనుశాసనుడు నన్నయ్య చెప్పినట్లు గతకాలము మేలే.

కానీ గతాన్నే తలుచుకుంటూ, ఆ గతమే మేలనుకుంటూ ఆ గతవ్యామోహం లోనే ఉండిపోతే నేనున్న ఈ నేడు కాబోయేది రేపటికి గతమేగా?!

మరి రేపటికి గతమైన ఈ నేటిని మేటిగా రేపటి వేళ తలుచుకుని మురిసిపోవడానికి నేటికి నేడు మేలైనదిగా ఉండాల్సిందేగా?! 

అందుకు ఈ నేటిలో మనతో వున్నవాళ్ళతో, మనం కావాలనుకున్నవాళ్ళతో మనం సమ్మతంగా ఉండి తీరాల్సిందేగా. 

అంతే కాదు... గతం మేలు అని తలచుకోవడానికి, నెమరేసుకోవడానికి నేనంటూ వర్తమానంలో ప్రవర్తమానంగా ఉండాలిగా...

సరే! నేనిలా "గతము సంగతమా? వర్తమానము వర్ధమానమా?" - అని నాలో నేనే అనుకుంటుండగానే - కొత్త ఏడాది వేడుకలు ముగిసి పుట్టినగడ్డ మీద సంక్రాంతి సంబరాలు మొదలు. 

Whatsapp Chaటుల్లో - ఊరి కోవెల్లో జరుపుతున్న ధనుర్మాసపు పూజల విశేషాలు, ఎవరో ఎవరినో పండక్కి ఇంటికి వెళ్తున్నారా అని అడుగుటలు, ఇంకెవరో వెళ్తున్నామని చెప్పుటలు, గొబ్బిపాటలని జ్ఞాపకం చేసేవాళ్ళు, సందెగొబ్బెమ్మల పేరంటాలు చేస్తున్న చిట్టితల్లుల ఫోటోలు, ముగ్గులూ, ముచ్చట్లూ - భలే సందడీ, హడావిడీనూ. 

ఇంటి ముందు చూస్తేనేమో - నింగికెగసిన నీటిఆవిరి తనకు నల్లరంగు పులిమిందని అలిగిన వానమబ్బు ఒలకపోసిన ముగ్గు పిండిలా - నిన్న కురిసిన మంచుపూల కుప్పలు. 

వాటిని చూసి ఉస్సురంటే హుషారెలా? "అయ్యో" అనుకుంటే పండగ అయ్యేదెలా?

అందుకే మునుపెన్నడో వేసుకున్న ముగ్గుని వెతికి పట్టుకున్నా... నా బ్లాగున సంక్రాంతి చేసుకున్నా... 




దాంతో పాటే... చిన్ననాటి సంక్రాంతి రోజుల్లో కొలిచిన సందె-గొబ్బెమ్మని ఓసారి గుర్తు చేసుకున్నా... 

నెమలికంఠం రంగుకి గులాబీ అంచున్న పట్టు పరికిణీ మీద నెమలికంఠం రంగు జాకెట్టు. అమ్మ బిగించి వేసిన రెండు జడల కొసనా జడగంటలు. రెండు జడలను కలుపుతూ పెట్టిన చిట్టిచేమంతుల దండ. 

వేసుకున్న పరికిణీ కాలికడ్డం పడకుండా, గాలినీదు నేల-చేపలా పరిగెడుతూ వెళ్ళి - అమ్మ ఇచ్చిన నెమలి కుంకం-భరిణ పట్టుకెళ్ళి, బొట్టు పెట్టి "మా ఇంట్లో సందెగొబ్బమ్మ పేరంటానికి రా" అంటూ పిలుచుకొచ్చిన నేస్తులు రాధ, శైలజ, పద్మ, విజయలక్ష్మి ఆండాళ్. 

వాళ్ళు వచ్చేలోగా అలికిన నేల మీద నేను వేసిన కొబ్బరిబొండాల ముగ్గు మధ్యన - గుమ్మడిపూలు, బంతిపూలు, చిక్కుడుపూలు ముడుచుకుని - పసుపూ-కుంకం పెట్టుకుని ముస్తాబైన గొబ్బెమ్మలు సిద్ధం. 

ఈలోగా పిలిచిన కన్నె-పేరంటాళ్ళు వచ్చేసేవారు - చేతి గాజులు గలగల్లాడుతూ, కాలి పట్టీలు ఘల్లు-ఘల్లుమంటూ.

వచ్సిన వారితో చేరి గొబ్బెమ్మల చుట్టూ చేతులు తడుతూ తిరుగుతూ - 

"గొబ్బీయళ్ళో, గొబ్బీయళ్ళో... దుక్కూ దుక్కూ దున్నారంట" అంటూ మొదలుపెట్టి... 

"అటవీ స్థలముల కరుగుదమా" పాటలో కింద కూర్చుని - అక్కడ లేనట్టి గంధప్పీట ఉన్నట్టనుకుని - ఉట్టుట్టి గంధం తీసి "చల్లని గంధము తీయుదమా... , సఖియా మెడలో పూయుదమా..." అని పాడుతూ ఒకరి మెడలో ఒకరు తాకించిన వేళ్ళ చక్కిలిగింతలకి ముసిముసిగా నవ్వుకుంటూ...

"సుబ్బీ గొబ్బెమ్మా - సుబ్బణ్ణీయవే" అని పాడుతూ చివర్లో "మొగలీ పువ్వంటి మొగుణ్ణీయవే" అన్న చోట ఆ మొగుడంటే ఎవరో, ఏంటో తెలీకపోయినా - అన్నీ తెలుసన్నట్టుగా బడాయి పోతూ - ఆపుకోలేని నవ్వుతో పకపకలాడుతూ... 

"ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే ... మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే..." అని నడుం మీద ఎడమ చేయి ఆనించి, కుడి చేతి బొటన వేలెత్తి ఎదుట లేని యశోదమ్మనడుగుతూ...  

మా ఆడే ఆటలకి, పాడే పాటలకి మురిసి కళకళలాడ్తున్న సందెగొబ్బెమ్మకి హారతిచ్చి - అమ్మ చేసిన శనగపప్పు పాఠోళీ ప్రసాదం అరిటాకు దొప్పల్లో అందరితో పంచుకుని తిన్న ఆ పసితనపు పసిడి రోజుల గతమూ  మేలే!  

ఆ మేల్-గతాన్ని తల్చుకుంటున్న ఈ నాటి ఆనవాలూ మేలే!  

అందుకే నన్నయ్య చెప్పిన పద్యాన్ని నాక్కావాల్సినట్లు రాసుకున్నా... (పద్యంలో ఛందస్సు లుప్తమైతే అది నా తెలుగు-లేమికి గుర్తు మాత్రమే!)

నన్నయ్య నాడు నుడివిన దానికి నేటి నా నుడి:

మతి దలపగ ఈకాలం
బతి సంతస మొందనోపునట్టుల బంధు
స్నేహము లతిమధురంబులు
వర్తమానము మేలు భూతకాలము కంటెన్... 


ఇంకా గట్టిగా చెప్పాలంటే  -  
 
చేరువనున్న వారికి నవ్వులు పంచిన మేలు
అక్కఱనున్న వారి నొవ్వులు తుంచిన మేలు
ఉన్నచోట మన్నికగా నుండుటె మేలు  
ఉన్నకాలము మేలు ఏ కాలము కంటెన్...


5, జనవరి 2020, ఆదివారం

వారట అరుదైన మనుషులు - వారివి అపరంజి మనసులు

జీవితమంటేనే... 
మనుషుల కలయికలా...  
మనసుల కూడికలా..
ఒక్కొక్కరితో ఒక్కోలా... 

కాదనాలనుకున్నా-
కట్టి పడేసే ఏదో బంధమో... 
కావాలని చెయ్యకపోయినా -
వీడిపోనియ్యని కమ్మని కయ్యమో...
తలచుకొనే నెపమేదో ఉంటుందలా...
ఒక్కొక్కరితో ఒక్కోలా ... 

కమ్మని కాలాన -
కలిసివచ్చిన అనుకోని అనుబంధమో...  
కలిమిలా ముసిరి -
కుదురుకున్న విడలేని నెయ్యమో... 
నిలుపుకునే బలమేదో వస్తుందలా... 
ఒక్కొక్కరితో ఒక్కోలా ... 



21వ శతాబ్దంలో రెండో దశాబ్దపు చివరి ఏడాది 2019.
ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే మా వరకు మాకు ఎన్నో మొదళ్ళు వున్న ఏడు ఇది.

మొదటిసారిగా...
అన్నజింక ఉద్యోగంలో చేరడం...
బుజ్జిజింక ఒక్కడూ ఫ్లైట్ ఎక్కి సెలవులకి అన్న దగ్గరికెళ్ళడం...

మొదటిసారిగా...
పిల్లల్ని వదిలి మేమిద్దరం ఇంటికి, ఇండియాకి పెళ్ళికి వెళ్ళడం...
కటార్ వారి ఎకానమీని దాటి ఎక్కానమీ తరగతిలో వెళ్ళడం...

మొదటిసారిగా...
నాకు వంగూరి ఫౌండేషన్ వారి నుంచి అతిథిగా, వక్తగా రమ్మని ఆహ్వానం రావడం...
నేనొక్కదాన్నీ ఆర్లాండో వెళ్ళడం...
అలా వెళ్ళిన నన్ను కలవడానికే గంట ప్రయాణం చేసి నా ఆఫీస్ కొలీగ్, చెలి సిరి రావడం...

మొదటిసారిగా...
వంగూరి వారి సభలో నేను మాట్లాడిన నాలుగు మాటలూ విని నచ్చినవారు, నను మెచ్చినవారు నలుగురై, పదుగురై, పలువురై నన్ను అభిమానించడం...
అదే సభలో నాకు అపురూపస్నేహభాగ్యాలు - ఒకటి కాదు, రెండు కాదు... ఎన్నో కలగడం...

మొదటిసారిగా...
వంగూరి సాహితీ సదస్సులో కలిసిన మిత్రుల నుంచి క్రూజ్‌కి రమ్మని పిలుపు రావడం... 
వచ్చిందే తడవు మేము నలుగురం మొట్టమొదటిసారి క్రూజ్‌కి వెళ్ళడం...
ఎప్పట్నుంచో నేపథ్యసంగీతసహితంగా పాట పాడాలీ అన్న బదరి కోరిక కిశోర్ గారి వల్ల తీరడం...

మొదటిసారిగా...  
క్రూజ్ నుంచి - అప్పటికి కలిసింది మొదటిసారైనా - మమ్మల్ని వాళ్ళ స్నేహబంధంతో కట్టేసుకుని, వారి వెంటపెట్టేసుకుని, వారింట మమ్మల్ని అట్టేపెట్టేసుకున్న - సురేఖ-కిశోర్ గార్ల ఇంటికి వెళ్ళడం...
అలా వెళ్ళేటప్పుడు మొదటిసారిగా బదరి డ్రైవ్ చెయ్యకుండా వెనక సీట్లో హాయిగా పాడుకుంటూ, కునికి-పాటుకుంటూ ఉండడం - అది కూడా సురేఖ లాంటి నారీరథసారథ్యంలో... 


మొదటిసారిగా...
మా కుటుంబం ఒక మంచి, మరపురాని నూతనసంవత్సర ఆహ్వాన మహోత్సవ వేడుకలో పాల్గొనడం... 
అది మా 2019 తీపి జ్ఞాపకాల యాత్రకి మార్గశీర్షమై, హేమంతమున సరదాగా నడిచిన శారద-విభావరి కావడం...

అన్ని మొదటిసార్లూ మొదటిరకపు మేలు అనుభవాలే.

వీటిలో నేను రాసుకోవాల్సినవి, రాసి దాచుకోవాల్సినవి - ఏమనగా... కొంచెం వెనక్కి వెళ్ళి ఇప్పటికే మొదలెట్టి ఇకపై పూర్తి చేయాల్సిన వంగూరి సాహితీ సదస్సు విశేషాలు.

వాటికన్నా ముందుగా చెప్పాల్సినవి - డిసెంబర్ నెలలో సముద్రపుటలల మీద సాగిన నౌకాయాన విశేషాల  - వేడివేడి కబుర్లు వున్నాయి.

(శీర్షిక ఆలోచించుకుని అట్టేపెట్టుకున్నా - పదకొండతస్తుల ఓడ అదీ... పకపకలాడిన యాత్ర అదీ అంటూ ... దాసరివారి వరసలో)

వాటికి కొనసాగింపుగా మరీమరీ రాసుకోవాల్సినవి మా నవ్వులగని శారద సరదా-కబుర్లు. అవన్నీ త్వరలోనే చెప్తా...- అప్పటిదాకా - నా బ్లాగున - ఉండి రాగమవ్వుడి!  - అనగా... Stay Tuned! 

సరే! ఇవన్నీ ఒక ఎత్తు.

ఎంతటి మంచి అవకాశాన్ని కోల్పోబోతున్నామో తెలుసుకోకుండా "ఈ సారికి మీ ఇంటికి రాలేమూ" అంటున్నా, పదే-పదే మమ్మల్ని వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించి - క్రూజ్ అయిన తర్వాత వారింటికి వెళ్ళడానికి ఎంతో మొహమాటపడుతూ "సరే"నని ఒప్పుకున్న- మా బుజ్జిజింకల చేత "కిశోర్ అంకుల్, సురేఖ ఆంటీ మన బంధువులై మనకి దగ్గర్లో ఉంటే ఎంత బావుంటుందో కదా! " అనిపించిన సురేఖ-కిశోర్ గార్ల గురించి మామూలు మాటల్లో చెప్పలేక, అలా అని వాళ్ళ మంచితనాన్ని, గొప్పతనాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను కొలిచి చెప్పగలిగే గొప్పభాష నాకు చేతకాక మొట్టమొదటిసారిగా తెలుగులో Terzanelle రాశా - అచ్చంగా వాళ్ళ కోసమే!

తెలుగులో రాసే Terzanelle కదా - అందుకే ఈ మాటలపేర్పుకి ఇంతకు ముందెప్పుడో చెప్పినట్లు తరంగమాల (అలలదండ) అని పేరు పెట్టా.

ఈ Terzanelle / తరంగమాల / అలలదండ కథా-కమామీషు తెలియాలంటే ఇంతకుముందో కొత్త సంవత్సరానికని నే రాసిన English Terzanelle / తెలుగు తరంగమాల (అలలదండ) - ఇదిగో... ఇక్కడ చదవొచ్చు:
Here is a new page to turn.../ రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో...[New Year Terzanelle / తరంగమాల (అలలదండ)] 

సురేఖ-కిశోర్ గార్లకు అభిమానంతో ... ఈ తరంగమాల (అలలదండ):


వారట అరుదైన మనుషులు - వారివి అపరంజి మనసులు

వారి స్నేహమున చిక్కును కిశోర భానుకిరణాల నులివేడి 
వారితో చెలిమి కలకాలపు కలిమి కాక మరేమి?
వారట అరుదైన మనుషులు - వారివి అపరంజి మనసులు


వారికి వారే సాటి మనసిచ్చుటలో 
వారి సన్నిధిని మనసు విచ్చునహో   
వారితో చెలిమి కలకాలపు కలిమి కాక మరేమి?


వారి మాటల ఇంపున మనము మురియునట 
వారి చేరువన మనసునకూరట దొరకునదే  
వారి సన్నిధిని మనసు విచ్చునహో 


వారిని చేరిన విడువలేము ఎన్నటికీ 
వారి మనముల మనమై మనుమను మాటే మెదలునెప్పటికీ 
వారి చేరువన మనసునకూరట దొరకునదే  


వారినొక్కసారి కలిసినంతనే కలుగు కూరిమి
వారి ప్రేమమున దక్కును చంద్ర(సు)రేఖల చలువల చలిమి 
వారి మనముల మనమై మనుమను మాటే మెదలునెప్పటికీ


వారి జతలో మసలే భాగ్యము మాదని మేమన ...
వారి స్నేహమున చిక్కును కిశోర భానుకిరణాల నులివేడి
వారి ప్రేమమున దక్కును చంద్ర(సు)రేఖ చలువల చలిమి
వారట అరుదైన మనుషులు - వారివి అపరంజి మనసులు