10, నవంబర్ 2019, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 18 - జంగారెడ్డిగూడెంలో జాలీగా...

కిందటి మాటు కబుర్లు:   అవతారంగారి నారాయణగారి బాబి - 17 - నా కళ్ళు ఎఱ్ఱనా...ఎక్కాయి చప్పునా...


ఊఁ సరే! ఎక్కడాపానూ? అక్కడ ఎడం కాలి చెప్పు తీసి నిలబడ్డాను కదా!?

నిలబడేటప్పటికి స్టాఫ్ అందరూ మమ్మల్ని కాన్సంట్రేట్ చేశారు.

సర్కిల్ మేనేజర్ సీకే రాజగోపాల్ ఆ పక్క రూంలో వున్నాడు. ఆయన కూడా ఏదో గొడవవుతోందని లేచొచ్చాడు ఇక్కడికి.

ఆయనొచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉందంటే - నా ఎడం చేతిలో చెప్పుంది. నిలబడి వున్నాను. ప్రసాద్ కూర్చుని వున్నాడు. వాడికి చెమటలు పట్టేసినయ్. చాలా భయపడిపోతున్నాడు మనిషి.

అది చూసి వెంబడే నా మూడు మార్చుకుని,  కొంచెం... నవ్వు మొహం పెట్టి "చూడండి ప్రసాద్ గారూ! నేనిక్కడికొచ్చింది వర్క్ చేయడానికి. కూర్చుని చేసే పని కాదు నాది. పొగాకు బేళ్లొస్తుంటాయి. రైతుల చుట్టూ ప్లాటుఫారం మీత్తిరగాల. తర్వాతేమో ... ఆరొందల మంది గ్రేడర్స్ ఇక్కడ పని చేస్తున్నారు. ఇద్దరు గ్రేడింగ్ సూపర్వైజర్లు వుంటారు. వాళ్ళని కూడా ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉండాల. ఇంటాబెక్స్ నుంచి దొరలొస్తుంటారు. వాళ్ళ క్లాసిఫికేషన్స్ అవన్నీ కూడా నేనే అటెండ్ అవ్వాల. ఇన్ని పనులతో నేనాఫీసులో కూర్చుని పని చేసేది తక్కువ. తిరిగి చేసేది ఎక్కువ. పొద్దున్నించి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాన్నేను. ఈ ఆఫీసులో నా అసిస్టెంట్స్ అదుగో... ఆ రవి శంకర్ వాళ్ళూ వున్నారు. వాళ్లకి ఇలా చేయండి అని వర్క్ అప్పజెప్పి నేనేమో బయట తిరుగుతూ ఉంటా. ఈ చెప్పూ... ఈ బొటనవేలు దగ్గర రింగు తెగిపోయింది. ఇది నడవడానికి కొంచెం ఇబ్బందిగా వుంది నాకు. దీన్ని బయట కుట్టించాలంటే... ఆ చెప్పులు కొట్టేవాడు అర్దురూపాయి అడిగాడు నన్ను. నా జేబులో డబ్బుల్లేవ్. ఈ అర్దురూపాయ కోసం నేను కారేసుకుని చిలకలూరిపేట వెళ్లొచ్చి మీ దగ్గర అడ్వాన్స్ తీసుకొచ్చి చెప్పు కుట్టిచ్చుకోవాలా? లేక వీళ్ళిక్కడ నాకు అడ్వాన్స్ ఇచ్చి నా పని పూర్తి చేస్కోవాలా? అది క్లారిఫై చేయండి మీరు" అంజెప్పన్నా.

అనేటప్పటికీ ...  సీకే రాజగోపాల్ ఒక్కసారి నవ్వుకుని ఆయన రూములోకెళ్ళిపోయాడు.

స్టాఫ్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు "అమ్మో ఈయన భలే వేశాడు జోక"నిచెప్పి.

ఈ వీఎస్వీ ప్రసాద్ కూడా ... వాడికి మొత్తం దిగిపోయింది.

దిగిపోయి "అయామ్ సారీ...సారీ, సారీ, సారీ, అయామ్ సారీ" అనంటూ "చూడు మూర్తీ! సరే ..వాడి ఎకౌంట్ అలాగే కంటిన్యూ చెయ్. వాడెన్ని తీసుకున్నా అడ్వాన్సులు మేమక్కణ్ణించి పంపిస్తాము. అలాగే చేసుకోండి" అని వాడూ ఓ స్టేట్మెంట్ పడేశాడక్కడ.

సరే! నేను నా సీటుకి వెళ్ళిపోయాను.

సాయంత్రం అయ్యింది.

ప్రసాదు వచ్చి  "ఓయ్ కామేశ్వర్రావ్! బయటికెళ్దాం దా!" అన్నాడు.

అక్కడా వూళ్ళో దుర్గా వైన్స్ అని వుంది. ఒరేయ్! అక్కడికి పోనీరా" అన్నాడు.

ఆ దుర్గా వైన్సుకి నా బుల్లెట్ మోటర్ సైకిల్ మీద ఇద్దరం కలిసి వెళ్లాం.

వెళ్ళి కూచున్నాక "ఏరా! పొద్దున్న అలా చేసేశావేంట్రా? నన్ను కొట్టేస్తావేమోనని ఎంత భయ పడ్డానో నేను!" అన్నాడు.

వాడలా అనగానే "కాలేజీ రోజుల్నుంచీ నా సంగతి నీకు తెలుసు. నేనెటువంటి వాడ్నో. కొట్టినా కొట్టే వాణ్ణి. కాకపోతే నువ్వు ఫైనాన్స్ మేనేజరుగా వున్నావ్. నీ గౌరవం నీకివ్వాలి అన్జెప్పేసి అప్పటికప్పుడు నా మూడ్ మార్చుకుని అలా మాట మార్చేశాను. లేదంటే ఆ వేడిలో నేనేం మాట్లాడేవాణ్ణో, ఇంకేం చేసేవాణ్ణో నాకే తెలీదు. ఉద్యోగం మానుకుని వెళ్లిపోవడానికి కూడా సిద్ధమే నేను. కానీ తప్పు నీలో వుంది. నన్ను తిట్టకూడదు కదా! మన ఒప్పందం ఏమిటీ....!? లోపలున్నప్పుడు నన్ను మన్నించమని కూడా చెప్పలేదు నేను/ 'ఏమయ్యా! కామేశ్వర్రావ్1' అని పిలు. నేన్నిన్ను 'ఏమండీ!' అంటా. బయటికెళ్ళాక మనం మనం ఓ కాలేజీ వాళ్ళం - ఒరేయ్ అనుకుంటాం, తిట్టుకుంటాం, వెధవ అనుకుంటాం, ఇంకోటనుకుంటాం. పైగా చుట్టాలం కూడా మనం. అంచాత ఇక ముందు కూడా ఇటువంటి పిచ్చి పనులింక చెయ్యకు. ఈసారి చేస్తే మాత్రం ఇప్పుడేదో అక్కడ సరిచేశాను కానీ ముందుముందు ఇలా సరిచేయ్యను, సరిపెట్టుకోను. నిజంగా పడిపోతాయి నీకు" అని చెప్పాను.

వాడు కూడా "లేదు లేరా, బాబూ! తెలిసొచ్చింది" అన్నాడు.

దాంతర్వాత ఇద్దరం కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుని తొమ్మిదిన్నరకల్లా ఆఫీసు గెస్ట్ హౌసుకి వచ్చేశాం. భోజనాల్జేసి పడుకున్నాం. అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపొయింది.

నాకింక జంగారెడ్డిగూడెం నుంచి చిలకలూరిపేట వెళ్ళడం, రావడం రొటీన్ అయిపోయింది. 1978లో లక్ష్మయ్యగారు, సుబ్బన్నగారు ఏం చేశారంటే - పంతులుగారు చనిపోయాడు - సీకే రాజగోపాల్ కొత్తగా చేరాడు. కాస్త అనుభవం వున్నవాణ్ణి నేనున్నాను కదా అక్కడ! - కామేశ్వర్రావుకి జంగారెడ్డిగూడెం ట్రాన్స్ఫర్ పెట్టేద్దామనుకున్నారు. నాకు జంగారెడ్డిగూడెం ఇలా వస్తూ, వెళ్తూ ఉండడం కాక పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చేశారు.

సరే! నేను మళ్ళీ ఇంటెడు సామాను లారీలో కెక్కించుకుని గణపవరం నుంచి జంగారెడ్డిగూడానికి ఫ్యామిలీతో సహా వచ్చేశాను. అప్పుడో శాస్త్రి గారం పంతులుగారింట్లో అద్దెకి ఉండేవాళ్ళం. ఆయన పని చేసే బళ్ళోనే మా లల్లీని వేశాం మూడో తరగతిలో.

శాస్త్రి గారికి వున్న ఆరుగురు పిల్లల్లో ముగ్గురు మూగవాళ్ళు పాపం. వాళ్ళు సైగలతో మాట్లాడ్డం చూసి మా చిన్నపిల్ల కుట్టి నాలుగేళ్లది - అది కూడా ఇంట్లో మాట్లాడ్డం మానేసి సైగలు చేస్తూ ఉండేది. కొన్నాళ్ల పాటు అది మాటలు మర్చిపోతుందేమో అని భయపడ్డాం కూడా!

వాళ్ళింట్లో వున్నప్పుడే ఓ రోజు కుట్టికి తలంటు పోసి - తల తుడుచుకోకుండా పరిగెట్టేస్తున్న దాన్ని పట్టుకుని మా ఆవిడ మేము ఊర్నుంచి సామాన్లు సర్ది తెచ్చుకున్న చెక్క పేకేజ్ పెట్టె అంచు మీద కూర్చోబెట్టి తల తుడుస్తోంది. కుట్టి అటూఇటూ తలా విదిలిస్తూ కదులుతూ ఉంటే దాన్ని పట్టుకున్న వాళ్ళమ్మ చెయ్యి పట్టు తప్పి కుట్టి పేకేజ్ పెట్టెలోకి పడిపోయింది.

ఆ పడడంలో లేత ఒళ్ళేమో... కుడి చెయ్యి మోచేతి దగ్గర విరిగింది.

దాన్ని వెంటనే పూర్ణచంద్రరావుగారని ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన సిమెంట్ కట్టు కట్టి చేతిలో ఎముక తొందరగా అతుక్కోవాలంటే రోజూ కోడిగుడ్డు పెట్టామన్నారు. మా ఇంట్లో తినమండి అని చెప్పగానే 'అయితే మూడు పూటలా ముద్దపప్పు పెట్టండి' అని చెప్పారు. అలా మా కుట్టికి రోజూ కంచంలో మూడు పూటలా ముద్దపప్పే - పైగా కంచంలో మూడు చోట్ల మూడు గరిటెల పప్పు వెయ్యాల్సిందే - మూడుపప్పుల ఆమ్ - అంటూ పెట్టాల్సిందే! మూణ్ణెళ్లలో చెయ్యి బ్రహ్మాండంగా అతుక్కుంది.

మేమున్న శాస్త్రి గారింటికి దగ్గర్లోనే NBR ప్రసాద్, వాడి భార్యా వుంటుండేవాళ్లు. వాళ్లకి పిల్లల్లేరు. మా కుట్టి అంటే వాళ్ళకి మహా ప్రేమ! ఎంతసేపూ కుట్టిని తీసుకెళ్ళి దాంతో ఆడుకుంటూ ఉండేది ఆ అమ్మాయి.

ఓ రోజు రాత్రి శాస్త్రిగారబ్బాయి అటకెక్కి కింద పడిపోయాడు. వాడికి కాలు విరిగింది. వాణ్ణి కూడా పూర్ణచంద్రరావుగారి దగ్గరికే తీసుకెళ్ళాం. అదేమో రాత్రి పూట. డాక్టర్ గారి దగ్గర అసిస్టెంట్లు ఎవరూ లేరు. డాక్టర్ గారు "కామేశ్వర్రావు గారూ! మరెవరన్నా ఆ కాలు పట్టుకోవాలి. అప్పుడు కొంచెం లాగి సరిచేసి కట్టు కట్టాలి. మరి మీరు వుంటారా?" అనడిగారు.

"నేనుంటాలెండి. కాలు పట్టుకుంటాను" అన్నాను.

"కాలికి ఆపరేషన్ చెయ్యాలి. పిల్లాడేడుస్తాడు. మరి మీకు భయమెయ్యదా?" అనడిగారు డాక్టర్ గారు.

"నాకటువంటి భయాలేమీ లేవు. నేను పట్టుకుంటాను మీ పని మీరు కానియ్యండి" అని చెప్పి నేను కాలు పట్టుకుంటే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి కట్లూ అవీ కట్టేశాడు.

కొన్నేళ్లు ఆ పంతులు గారింట్లో వున్నా తర్వాత పిల్లలకి  హైస్కూల్ దగ్గరగా ఉంటుందని జిల్లా పరిషత్ హైస్కూలుకి ఎదురుగా వున్న రోడ్లో సుబ్బారావు గారని మాష్టారింట్లోకి మారాము. సుబ్బారావు గారి భార్య కూడా టీచరే. వాళ్ళిద్దరూ ఆ పక్కనే వున్న గణపవరం అనే వూళ్ళో పనిచేసేవాళ్ళు. ఈ గణపవరం పశ్చిమ గోదావరి జిల్లాలోది. ఇంతకు ముందు మేమున్న చిలకలూరిపేట దగ్గర గణపవరం కాదు.

ఆ సుబ్బారావు గారింట్లో ఓ పోర్షన్ మాకు అద్దెకిచ్చారు. అది రైల్వే కంపార్టుమెంటులా ఉండేది. ఇంకో పోర్షన్లో ముందు వుండే చిన్న గదిలో సుబ్బారావుగారి  తల్లీ, తండ్రీ ఉండేవారు. వాళ్ళని మేము తాతగారు, మామ్మగారు అని పిలిచేవాళ్ళం. వాళ్ళుండే గదికి వెనకాలున్న రెండు గదుల్లో జిల్లా పరిషత్ హైస్కూల్లో హిందీ టీచరుగా పనిచేసే శ్యామలా టీచర్ వాళ్ళ మామ్మగారితో అద్దెకుండేవాళ్లు.

మా ఆఫీసులో ASN మూర్తి అనే అతను గుంటూరులో ఏదో కాలేజీలో కేషియరుగా ఉద్యోగం వస్తే మా దగ్గర మానేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చిలకలూరిపేట నుంచి KTLN మూర్తిని కూడా జంగారెడ్డిగూడెం ట్రాన్స్ఫర్ చేశారు. అతను కూడా నా క్లాస్మేటే. ఆ KTLN మూర్తి కూడా మా ఇంటికి దగ్గర్లోనే ఓ గార్డు గారింట్లో పోర్షన్ అద్దెకి తీసుకున్నాడు. ఇలా అందరం ఓ చోట ఉంటూ ఉండేవాళ్ళం.

అప్పుడు మా కంపెనీలో మల్లిపూడి గంగరాజు, వీరాస్వామి అని వాచ్మెన్లు వుండేవాళ్ళు. వాళ్ళకి తమ్ముడొకడున్నాడు. వాడికి ఉద్యోగం లేదు. వాళ్ళేమో వాడికి ఉద్యోగం కావాలని అడిగారు. కంపెనీలో వేయించడానికి అవకాశం లేక వాణ్ణి  - వాడికో యూనిఫామ్ అదీ కుట్టించి - మేముండే వీధుల్లో గూర్ఖాగా పెట్టాను.

అన్నట్టు ఇక్కడో సంగతి చెప్పాలి. జంగారెడ్డిగూడెంలో వున్నప్పుడు ఓ రోజు సాయంత్రం చీకటి పడేవేళ ఆఫీసు నుంచి ఇంటికి నడుస్తూ వస్తున్నాను. నాతో పాటు మూర్తి కూడా వున్నాడు. వస్తుంటే హఠాత్తుగా కాలికేదో చుట్టుకున్నట్లు అనిపించింది. తీరా చూస్తే అది తాచుపాము. అంత చీకట్లోనూ మిలమిల్లాడుతోంది. ఒక క్షణం బుఱ్ఱ పనిచేయలేదు. వెంటనే ఏదైతే అదవుతుందని గట్టిగా కాలు విదిలించాను. నా అదృష్టం బావుండి ఆ విసురుకి అది దూరంగా పడిపోయింది. వెంటనే మూర్తి, నేను కలిసి అక్కడ పాము మంత్రం వేస్తాడని తెల్సిన ఒకతని దగ్గరికి వెళ్ళాం. అప్పుడతను నా చేత పచ్చిమిరపకాయ నమిలించి, దాని రుచి కారంగానే తెలుస్తోందని చెప్పగానే 'ఇక నీకేం భయం లేదు.పాము కాటెయ్యలా" అన్జెప్పి ఏదో పసరు తినిపించి ఇంటికి పంపేశాడు.

79 దాకా జంగారెడ్డిగూడెంలోనే వున్నాను. ఈలోగా మా అమ్మగారు అనాతవరం నుంచి నా కాపురం ఎలా వుందో చూద్దామని నా దగ్గరికి రావడం జరిగింది. ఆవిణ్ణి నేను స్వయానా జీపు డ్రైవ్ చేస్తూ ద్వారకా తిరుమల, భద్రాచలం తీసుకెళ్ళాను. ఆవిడెంత మురిసిపోయిందో - మా బాబి నన్ను జీపులో తీసుకెళ్లాడు - అంటూ.

79 లోనే మా కంపెనీకి చైనా ఆర్డర్లు ఎక్కువ వచ్చాయి. దాదాపుగా మూణ్ణాలుగు వేల టన్నుల ఆర్డరు వచ్చింది. చైనా వాళ్ళందరూ కూడా జంగారెడ్డిగూడెం వచ్చారు. లక్ష్మయ్యగారు కూడా వచ్చాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాం మేము. కోరాడ నరసింహారావుగారని కూచిపూడి నాట్యం చేసేవాడు. ఏలూరులో ఉండేవాడు. ఒకరోజు ఆయన ప్రోగ్రాం పెట్టించాము. ఇంకో రోజేమో ద్వారపూడి, అనపర్తి నుంచి బాణాసంచా తెప్పించి కాల్పించాము. లక్ష్మయ్యగారు ఓ రెండ్రోజులు వున్నాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఆయనకి విదేశాల్లో ఉన్నవారితో వ్యాపార లావాదేవీలు ఎక్కువ కదా! వున్న ఆ రెండు రోజుల్లో ఆయన ISD calls చెయ్యాలంటే నేనే టెలిఫోన్ ఎక్స్చేంజికి తీసుకెళ్ళేవాణ్ణి.

చైనా వాళ్ళ రాకతో ఓ రెండ్రోజులు అలా గడిచిపోయాయి - జంగారెడ్డిగూడెంలో జాలీగా...

<వచ్చేమాటు తరువాయి కథ>




2 కామెంట్‌లు:

  1. Chala gap తరువాత మళ్ళీ బావుంది జంగారెడ్డీ గూడెం లో జాలిగా👌👌

    రిప్లయితొలగించండి