3, నవంబర్ 2019, ఆదివారం

బంగారు మనసుల వంగూరి సదస్సు - 1 - ఎలా మొదలైందంటే...

"ఏంటిది? మళ్ళీ ఇంకో కొత్త బ్లాగు పరంపరా?"

"ఊఁ"

"ఇంతకు ముందు మొదలుపెట్టిన వాటి పూర్వాపరాలు అంతూపొంతూ లేవు. ఇంతలోనే ఇంకొకటా? ఏదీ వరసలో రాయవు. నీ వరసేం బాలేదమ్మాయ్!"

"సర్లే! నేనేమన్నా ఖాళీగా కూర్చున్నానా... ఓ చేత వండి వార్చాలా, రెండో చేత ఉద్యోగం చెయ్యాలా, త్రిపాద నక్షత్రంలా ఊళ్ళూరేగి రావాలా... ?"

"సరే తల్లీ! సరే! ఒకటీ, రెండూ, మూడూ అంటూ అంకెల్లెక్కెట్టింది చాలు. ఇంతకీ ఈ కొత్త సిరీస్ అయినా సీరియస్‌గా రాస్తావా? లేకపోతే ఇంకోసారి వరస తప్పి "సీరియల్ కిల్లరువి" అవుతావా?"

"హహహ! నాకు నువ్వూ పేర్లు పెడుతున్నావూ? భలే! అన్నిటితో పాటు ఇదీనూ... అలా వరసాగ్గా రాసేసుకు పోతే ఎదురుచూపులో వుండే మజా ఇంకేదీ? మొదలిప్పుడు. తరవాద్ది కుదిరినప్పుడు...చూపుల కన్నా ఎదురు చూపులే తీయన అన్నది వినలేదా?"

"మొత్తానికి ఆత్రేయ మాటలు బానే ఒంటపట్టించుకున్నావ్... తరవాద్ది ఎప్పుడో కూడా చెప్పు - లేకపోతే కబుర్ల తాజాదనం పోయి చద్ది వాసనేస్తాయ్.?

"తరవాణిలో వేసిన అన్నం చద్దిదైనా తాజాగా వండిందానికన్నా బలం. నా కథ, నాన్న కథ, పాట కథ, పాత సినిమా కథ - వారంవారం ఇన్ని రకాలున్నాయా? ఇవి కాక ఏవో ఎక్కిళ్ళలా చెప్పాపెట్టకుండా పుట్టుకొచ్చేసే ఎక్స్‌టెంపోర్ కబుర్లు వుండనే వుంటాయ. ఆచితూచి రాసెద... ఆపసోపాలు పడక వేచి చూడుడు"

"ఏదో నీ మనస్సాక్షిని కదా నాకైనా చెప్తావేమోనని నిన్నడిగాను చూడు... నన్ననాలి! ఇంతకీ ఈ "ఎలా మొదలైందంటే..." ని  ఎలా మొదలెడదామని?"

"అనాదిగా ఉందిగా అనగనగా... అలాగే. ఇదిగో! ఇహ నువ్వడగా వద్దు...నేననగా వినాలని అనుకోనూ వద్దు. ఇప్పటికే నాలో నేను మాట్లాడుకుంటున్నానని నలుగురూ నవ్వి పోతున్నారు. అనిపించినప్పుడు రాస్తా. అలా చూస్తూ వుండు... ఇప్పటికి ఇహ కాస్త అసింటా వుండు... నే రాసుకోవాలి!"
 ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......
 ......  ......  ......  ......   ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......  ......

ఎలా మొదలైందంటే... అబ్బో! అదో పెద్ద కథ! ఏడాదిగా జరుగుతున్న కథ... ఇలా మొదలెట్టేస్తున్నా...

అనగనగా మా ఊరుంది.
మా వూళ్ళో నేనున్నా.
నాకో బ్లాగుంది.
బ్లాగులో బోల్డన్ని పోస్టులు రాశా.
రాసినవన్నీ పోగేశా.
పోగేసినవన్నీ బొత్తిగ పెట్టి పొత్తాలుగా కుట్టా.
కుట్టినవన్నీ ఎందరో  చదువుల మించువారికి పంచిపెట్టా.

ఆ పళంగా ఓ రోజేమయిందంటే ఓ మేలైన ఈమెయిలు మొయిలులో మెరుపులా మెరిసింది.

ఆ మెయిలునున్న మేలు-కబురులేంటంటే...

లల్లీ, మీరు ఆప్యాయంగా పంపించిన బోల్డన్ని కబుర్లు అందాయి. అప్పుడే 150 పేజీలు  చదివాను...ఇక ఆగలేక మీ ఫోన్ నెంబర్ కోసం ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. అంత బాగా కబుర్లు ఎలా చెప్పాలో నీ దగ్గర నేర్చుకోవాలి ..అందుకూ. ..ఫోన్ నెంబర్ పంపిస్తే పిలుస్తాను. సరేనా? 
 
ఎవరా అని చూస్తే... 
వారెవరో కారు... 
అమెరికా హాస్య బ్రహ్మగా వాసికెక్కిన వారు -
వంగూరి వారు - 
శ్రీ చిట్టెన్ రాజుగారు. 
నవ్వులెన్నొ పంచి పెట్టెన్ రాజుగారు. 
మంచితనం పెంచి పెట్టెన్ రాజుగారు. 
 
వారడిగినదే తడవు నేను ఫోన్ నంబర్ పంచుటయు, వారు నన్ను పిల్చుటయు, మేమిరువురము బోల్డన్ని కబుర్లాడుకొనుటయు, ఆ ఆడిన కబుర్లు నన్ను ఆర్లాండోలో సాహితీసదస్సు దాకా తీసుకెళ్లుటయు జరిగెను. 
 
ఆ సదస్సున కలిసిన బంగారు మనసుల కబుర్లే ఈ "బంగారు మనసుల వంగూరి సదస్సు" సిరీస్. 
 
రాగల బ్లాగుల్లో నే తేగల కబుర్లు బహుబాగులు!
నా బ్లాగున - ఉండి రాగమవ్వుడి! :)

7 కామెంట్‌లు: