24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

పాడెనే భజనపాట... పాటకులై... యూట్యూబున

పొద్దున్నే నాన్ననుంచి వాట్సాప్లో ఒక యూట్యూబు లింకొకటి.

ఏంటబ్బా అని చూస్తే అది నేను చిన్నప్పట్నుంచీ చాలా సార్లు విన్న దశావతారాల భజన పాట - నాన్న పాడినది యూట్యూబ్లో పెట్టారు.

ఆయన ఇంతకు ముందు చాలాసార్లు చెప్పారు - హైదరాబాదు వెళ్లినప్పుడు మ్యూజిక్ స్టూడియో కి వెళ్లి పాట పాడానని.

గబగబా ఒకసారి పాట వినేసి - నాన్నకి ఫోన్ చేశాను - ఆ పాట పాడడం వెనకాల  కబుర్లేంటో విందామని.

"హలో నాన్నా - బావున్నారా?"

"బావున్నాను - కోయిలమ్మ చూస్తున్నాను టీవీలో" - అడక్కుండానే స్టేటస్ అప్డేట్

(ఒక్కోసారి కార్యక్రమం పేరునిబట్టి 'ఇప్పుడు నేను నీతో మాట్లాడనని' -  చెప్తున్నట్లు అర్థం చేసుకోవాలి నేను - అది జోధా అక్బర్ 566 వ ఎపిసోడ్ నాలుగోసారి చూస్తున్నదయినా సరే!)

"అయితే ఫోన్ పెట్టేయనా నాన్నా? మళ్లీ చేయనా అదయిపోయాక?"

"అబ్బే అక్కర్లేదు చెప్పుఏంటి విశేషాలు?"

"ఈ పాటేంటి నాన్నా? ఎప్పుడు పాడారు?"

"ఎప్పుడంటే - హైదరాబాదు వెళ్లినప్పుడు"

"అదే ఎప్పుడు?"

పక్కనే వున్న అమ్మకేసి తిరిగి అడిగారు "మనమెప్పుడు వెళ్లాం ?" - అమ్మ సమాధానం "డిసెంబర్లో వెళ్లాం కదా - పప్పీ దగ్గరికి?"

మళ్లీ నాతో  ఫోన్లో - "అదే లల్లీ ! డిసెంబర్ 27 దాకా హైదరాబాదులోనే వున్నాం. అప్పుడు బులుసు సత్యనారాయణమూర్తి అని నా SKBR కాలేజ్-మేట్ నాతో  - 'దశావతారాల పాట పాడూ - రికార్డు చేయిద్దాము'  అన్నాడు. నాకసలే జలుబుగా వుంది పాడలేనన్నా వినలేదు. రవీంద్ర అని ఒక హిందుస్థానీ పాడే అతను వున్నాడు . అతనికో రికార్డింగ్ స్టూడియో వుంది. అక్కడికి తీసుకెళ్లి నా చెవులకి హెడ్ఫోన్స్ అవీ పెట్టి, నా ముందు మైకు పెట్టి నన్నా స్టూడియోలో పెట్టేశారు - నేను పాడేశాను"

"బావుంది నాన్నా! ఇంతకీ ఆ బులుసు సత్యనారాయణమూర్తి గారేం చేస్తూ వుంటారు?"

"భగవద్గీత ఇంగ్లిష్ లో తర్జుమా చేస్తూ పుస్తకాలు రాశాడు - ఏదో వెబ్సైట్ కూడా ఉన్నట్టుంది - నాకో లింక్ పంపించాడు - నీకు ఫార్వార్డ్ చేస్తాను చూడు - ఈ ఫోన్ పెట్టేశాక "

{నాన్న పంపించిన BS Murthy గారి పుస్తకం లింక్ : Bhagavd-Gita Treatise of Self-Help
యూట్యూబ్ లింక్ : Bhagavd-Gita Treatise of Self-Help}
 
"ఇంతకీ ఆ యూట్యూబ్లో ఆ దశావతారాల బొమ్మ బావుంది - అదెక్కడిది?"

"అది కూడా తనే - గోపి అని ఒక ఆర్టిస్టు చేత వేయించాడు - బావుంది కదా!"

"బావుంది నాన్నా - చాలా - మీ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చేయించినట్టున్నారు - ఈ మొత్తం రికార్డింగంతా"

"అవును - నీ బ్లాగ్లో పెట్టేయ్"

"పెడతాలెండి బాబూ!  ఇప్పుడు పంపారుగా"

"దాంతోపాటు నేనింతకుముందు పాడిన ఆ ఆరు పాటలు కూడా పెట్టేయ్ - నువ్వు పాడిన నాన్నమ్మ పాట - 'కలువరేకులబోలు కనులు చూచుట చాలు ' విన్నాను - నువ్వు బా పాడలేదు "

"సరే - మీరే బాగా పాడతారు - ఒప్పుకుంటాను కానీ - ఓ రెండు నిముషాలు అమ్మకివ్వండి - ఆఫీసుకి టైమవవుతోంది - ప్రస్తుతానికి ఈ దశావతారాలు బ్లాగ్లో పోస్ట్ చేస్తాను - రేప్పొద్దున్న చూడండి"

"సరే ఇస్తానుండు" అని అమ్మకి ఫోన్ ఇచ్చారు.

అమ్మతో రెండంటే రెండే నిముషాలు గబగబా మాట్లాడి మళ్లీ రేపు చేస్తానని చెప్పి పెట్టేశాను.

ఇదిగో -  బులుసు సత్యనారాయణమూర్తిదగ్గరుండి రికార్డ్ చేయించగా మా నాన్న పాడిన దశావతారాల పాట -
అవధారు - దశావతారాల ఈ పాట జోరు :)






19, ఫిబ్రవరి 2017, ఆదివారం

త్వామనురజామి - 10 - పద్మావతి చేర...ట్రంకు సర్దాము...

కిందటి 19 చెప్పిన కబుర్లు

పద్మావతి యూనివర్సిటీ నుంచి - వచ్చి MCA లో చేరమని టెలిగ్రామ్ వచ్చింది కదా - నాన్న మంచిరోజు చూసి వారం రోజుల్లో బయల్దేరుదామని చెప్పారు.

ఇంకంతే - మా భీంనాయక్ గారి ఇంటి కాంపౌండ్ లో అద్దెకున్న వారి ఇళ్లలో సందడి మొదలయ్యింది.

మధ్యాంటీ, చివరాంటీ - రోజుకో కొత్త పచ్చడి  చేసి ఇచ్చేవారు.

ఇంట్లో జరిగే -  ప్రతి చిన్న - పెద్ద వేడుకలకి, పండగలకి - సందడి తెస్తూ వచ్చే - లక్ష్మిదొడ్డ, ప్రశాంతి - హైద్రాబాదునుంచి వచ్చారు.

ఆఫీస్ బోయ్ వెంకటేశ్వర్లు - వాళ్ల వూర్నించి బోల్డంత గోరింటాకు చేతులకి-పాదాలకి పెట్టుకోవడానికి తెచ్చాడు. అంతే కాకుండా హాస్టల్ లో నేను తినడానికి మంచి గేదెనెయ్యి కూడా తెచ్చాడు.

తెచ్చిన గోరింటాకును లక్ష్మిదొడ్డ మిక్సీలో వేసి రుబ్బేసింది.

ఆ మధ్యాహ్నమే భోజనాలవగానే  - పప్పి, కుట్టి,  ప్రశాంతి, నేను - మన్  చాహే గీత్ లో - రిం ఝిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే - ఆయీ రాత్ సుహానీ దేఖో ప్రీత్ లియే - లాంటి తలత్ మెహమూద్  తన మెత్తనైన గొంతుతో పాడే పాటలు వింటూ - ఎండే వెన్నెల్లా ఫీలయిపోతూ - గోరింటాకు చేతులకి, పాదాలకి పెట్టేసుకుని బోల్డన్ని కబుర్లు చెప్పేసుకున్నాం.

మా ఇంటిముందున్న - ఒక మూడడుగుల మట్టినేలలో - మా అమ్మ వేసిన తులసి మొక్క ముందు - రోజూ నేనే ముగ్గు వేసేదాన్ని. నేవేసే ముగ్గంటే మా అమ్మకి బోల్డంత ఇష్టం - పోత బాగా పడుతుందని - వేసినప్పుడల్లా అనేది - పద్మంలాంటి ముగ్గేస్తే పద్మంలాంటి మొగుడొస్తాడని. ఆ మాటెప్పుడూ అంతెక్కువగా పట్టించుకోలేదు - నా ముగ్గుని చూసి నాకు నేనే మురిసిపోవడం తప్ప.

ఆ తులసి మొక్క పక్కనే ఒక రెండు చంద్రకాంత మొక్కలు నావి. ఆ పక్కనే వుండే గులాబీ మొక్క పప్పీది.

మరి - నేను తిరుపతి వెళ్తే తులశమ్మ ముందు ముగ్గు ఎవరేస్తారు - అని తెగాలోచించి - ఆ ముగ్గు వేసే పనిని - మా పనమ్మాయి రాములమ్మ కూతురు శ్రీదేవికి అప్పగించాను. అలాగే చంద్రకాంత మొక్కలకి, గులాబీమొక్కకిరోజూ నీళ్లు పోయమని కూడా చెప్పాను.

ఇవన్నీ శ్రీదేవికి చెప్పేటప్పుడు ఎంతో దిగులుగా అనిపించింది - ఇంకొద్ది రోజుల్లో ఇంట్లో వాళ్లందరూ ఇక్కడే వుండి చెప్పుకునే కబుర్లు, నవ్వుకునే నవ్వులు -  ఇవేవీ - ఎక్కడో తిరుపతిలో వుండే నాకు - వినిపించవు, కనిపించవు అని.


సర్లే! నాకు దిగులని, బెంగని రోజులు దొర్లడం ఆగిపోదు కదా !

తిరుపతికి నాన్న నారాయణాద్రిలో టికెట్లు బుక్ చేశారు - అమ్మ, నాన్న, అమ్మాయి (నేను) - మాత్రమే కాకుండా మాతోపాటు రవి, శారద కూడా వస్తున్నారని చెప్పారు.

ఇంతకీ మా ఇంట్లో హడావుడి ఎలా ఉందంటే - మా అమ్మ ఆవిడ కాపురానికి వస్తూ తెచ్చుకున్న-  రెండు ట్రంకుపెట్టెలు అటకమీద వున్నవి  - వేంకటేశ్వర్లు చేత - కిందకి దింపించింది.

రెండిట్లో ఒకటి మా అమ్మమ్మ ఇచ్చిన పే...ద్దది.

ఇంకోటి - మా అమ్మకి నాన్నమ్మ అయిన - పప్పు సూరమ్మగారనబడే మా శివకోడు మామ్మతో - కాశీ, మద్రాసు, కలకత్తా - తిరిగొచ్చిన ఒక చిన్న పసుప్పచ్చపెట్టె - కొంచెం చిన్నది.

తెనాలి రామలింగడి ముందు  పాలు-పెరుగు పెట్టి వికటకవిని చేసినట్టు - నా ముందా రెండుపెట్టెలు పెట్టి నాచేత వికటాట్టహాసం చేయించింది మాఅమ్మ.

అవి రెండూ కలిసి నా బరువుకన్నా ఎక్కువ ఉన్నాయని అంచనా వేసి - ఒక్కటి చాల్లే - అని అందరూ తీర్మానించేసి - ఆ రెండిట్లో ఒకదాన్ని - నన్నెంపిక చేసుకోమన్నారు.

నా చదువు-పుస్తకాలకి, పుస్తకాల-చదువుకి, తినుబండారాలకి - అన్నిటికీ అనువుగా ఉంటుందని పెద్దపెట్టెని మా అమ్మే నా తరపున ఎంచేసింది.  అంతటితో ఆగక వెంకటేశ్వర్లుకిచ్చి పంపించి రంగులేయించుకు రమ్మంది.

మధ్యాహ్నానికల్లా పెద్ద ట్రంకుపెట్టె పెళ్ళికూతురిలా ముస్తాబయ్యి వచ్చింది - ఆకాశనీలం రంగు  మీద ఆకుపచ్చ ఆకులు, లతలతో - ఆ చివర్న గులాబీ పూలతో.

మా అమ్మ దానికి నాలుగు పక్కలా పసుపుగౌర్లు పెట్టి - "వినాయకా-విఘ్నేశ్వరా" అంటూ నాపుస్తకాలు, పొద్దున్న పాలల్లో తాగడానికి  ప్రొటినెక్స్ డబ్బా, రాత్రిపూట పాలున్నా లేకపోయినా నీళ్లలోనైనా కలుపుకు తాగుతానని కాంప్లాన్ డబ్బా - వగైరాలు సర్దేసింది.

నేను నా వంతు సర్దుబడిగా - అదే ట్రంకుపెట్టెలో - అప్పటికి  నాకు poetry ఎక్కువ చదివే అలవాటుండడంతో - దేవులపల్లి కృష్ణపక్షం, శ్రీశ్రీ మహాప్రస్థానం, తిలక్ అమృతం కురిసిన రాత్రి, Shakesperare - As You Like It లతో పాటు -  బారిష్టర్ పార్వతీశం కూడా పెట్టుకుని - వీటన్నిటితో పాటు నాకు ప్రశాంతి ఇచ్చిన బొమ్మ - షిప్లీని - కూడా పెట్టుకున్నాను.



షిప్లీని నేను ట్రంకుపెట్టెలో పెట్టడం చూసిన కుట్టి - "ఏంటే లల్లీ - దాన్ని పట్టుకుని 'జుజుజూ - జుజుజూ' అని పాడుకుంటూ తిరుగుతావా ఏంటి - మీ హాస్టల్లో?" అంటూ ఒకటే నవ్వు.

నేనేమన్నా అంటే -  ఇంకా మోసేస్తుందని -  అదన్నదేమీ నేను విననట్లు -  ట్రంకు మూత వేసేశాను.

మా అమ్మ లక్ష్మి దొడ్డ సాయంతో ట్రంకులో సర్దినవి సర్దగా - ఇంకా లక్ష్మి దొడ్డ పెట్టిన రేగు వడియాలు, చేసిన జంతికలు, నాకిష్టమని కొన్న సాల్ట్ బిస్కెట్లు - ట్రంకుపెట్టెలో పెడితే నలిగిపోతాయని ఇంకో బుట్టలో సర్దించింది.

వీటన్నిటితో పాటు హాస్టల్లో మంచంమీదకి - పరుపైతే నా అంతట నేను వేసుకోలేనేమో అని - కొంచెం తేలిగ్గా వుండే ఒక Kurl-on folding camp-kit.

బట్టలూ అవీ సర్దిన మామూలు సూట్కేస్ వుండనే వుంది. 

మొత్తానికి  పప్పి-కుట్టి నన్నాట పట్టిస్తూ అన్నట్లు రైలు కంపార్టుమెంటుకెక్కువ - గూడ్సుబండికి తక్కువ అనిపించేంత లగేజ్ తయారయింది.

ఈ ప్రయాణపు సన్నాహాలు ఇలా జరుగుతుండగా - ఇంకోపక్క చిన్నపాప్పిన్ని కొడుకు శ్రీను  - కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్ లో చేరే రోజు దగ్గరకొచ్చింది. నాన్న తీసుకెళ్లి జాయిన్ చేసి వచ్చారు.

శ్రీనుకి కాలేజ్ లో చేయబోయే రాగింగ్ గురించి బెంగగా ఉండేది. KLCE లో అప్పటికి -  ఏడో తరగతి నుంచి పదోక్లాసు దాకా టంగుటూరులో నా క్లాస్మేటు, ఫ్రెండూ అయిన - చంద్రశేఖర్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.  తన గురించి చెప్పగానే నాన్న నన్ను శ్రీనుని తీసుకుని ఒకసారి KLCE కి వెళ్లి చంద్రకి పరిచయం చేయమన్నారు.

ఓరోజు పొద్దున్నే ఎనిమిదింటికి బయల్దేరి శ్రీను, నేను నాన్-స్టాప్ బస్సులో విజయవాడ వెళ్లి - అక్కడినుంచి సిటీ బస్సులో - KLCE వున్న కుంచెనపల్లి వెళ్లాము. అక్కడ చంద్రాని కలిసి శ్రీనుని పరిచయం చేసి - వాణ్ణి కొంచెం రాగింగ్ చేయకుండా - అంటే సరదాగా పర్వాలేదు కానీ భయపెట్టేలా చేయకుండా చూడమని - చిన్న సైజు రికమెండేషన్ చేసి సాయంత్రం నాలుగింటికల్లా గుంటూరు వచ్చేశాం.

నాకసలే బస్సు ప్రయాణం పడేది కాదు. అందులోనూ ఆరోజు బోల్డంత ఎండగా వుంది. ఇంతోటి - ఇటో గంట, అటో గంట - బస్సు ప్రయాణానికే ఇంటికొచ్చేటప్పటికి ఇంకా బోల్డంత అలిసిపోయాను.

ఇంటికి రాగానే బయటే వేసి వున్న కేన్ కుర్చీల్లో వాలిపోయిన నన్ను చూసి మా ఇంట్లో వాళ్ల రియాక్షన్స్ ఏంటంటే... 

- అమ్మకేమో బెంగ - "ఇప్పుడే ఇలా అయిపోతే రేపు యూనివర్సిటీలో అన్నీ ఒక్కదానివే చూసుకోవాలి ఎలా ఉంటావో ఏంటో " అంటూ

- నాన్నేమో  బెంగ అనిపించినా పైకి చూపిస్తే నేనింకా వాలిపోతానని - కొంచెం కోపంగా - "అతి సుకుమారం - కటిక దరిద్రం. రేపట్నుంచీ తిరుపతి వెళ్లేదాకా రోజూ రెండు బకెట్లు నీళ్లు తోడు" అంటూ (అదేదో రెండు ఉద్ధరిణడు నీళ్లు పట్టే బకెట్టుతో నీళ్లు తోడితే నాకేదో కండలొచ్చేసి - ఫిట్నెస్ పెరిగిపోయేట్లు)

- లక్ష్మి దొడ్డేమో ఎప్పట్లాగే నిశ్శబ్దంగా  - గబగబా చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండి  తెచ్చి నాచేత తాగిస్తూ

- పక్కన చిన్ని ప్రశాంతి దాని బుల్లి చేతులతో నా చెయ్యి పట్టుకుని నాకేసే చూస్తూ

- అప్పటిదాకా నాతో పాటు వాడూఎండలో తిరిగొచ్చినా - పాపం - తలనొప్పితో బాధపడుతున్న నన్ను చూసి - వాడి అలసట మర్చిపోయి - మెడికల్ షాపుకి పరిగెత్తడానికి సిద్ధంగా శ్రీను

- నా ఎదురుగా ఇంకో రెండు కుర్చీల్లో కూర్చుని ఈ తమాషానంతా చూస్తూ - "అందుకేనే లల్లెమ్మా! మరీ ఏకసందాగ్రాహిలాగా బ్రాడీపేటలో గూడేసి వున్న రిక్షాల్లో ఎండ తగలకుండా తిరక్క - నాలా, పప్పెమ్మలా సైకిలు తొక్కి ఉంటే నీకీరోజు ఈ ఎండ దెబ్బ తగిలేదీ కాదు - మా అందరికీ ఈ పరిచర్యలు వీక్షించే శిక్షా ఉండేది కాదు. చెప్తే వింటావా పెడతావా - అనుభవించు" - జంతికల-కరకరల మధ్య మాటల-లొడలొడలాడిస్తూ కుట్టి ఉవాచ - దానికి నిశ్శబ్ద-వక్త పప్పీ తల-ఊచుట.

మొత్తానికి ఆ రోజు నేను ఆ తగ్గని తలనొప్పితోనే  తొందరగా పడుకోవడంతో అందరికీ సపర్యల-పర్వం నుంచి విడుపు దొరికింది.

ఆ విధంగా నా తిరుపతి ప్రయాణానికి ట్రంకుపెట్టె సర్దుట అనే ఒక ప్రహసనం విజయవంతంగా ముగిసింది.

ఆ తర్వాత రెండు రోజుల్లోనే మా తిరుపతి ప్రయాణం. అమ్మ-నాన్న తిరుపతినుంచి తిరిగివచ్చేదాకా పప్పీ-కుట్టీల దగ్గర లక్ష్మిదొడ్డ ఉండేలా ఒప్పందం కుదిరిపోయింది.

రైల్వే-స్టేషన్ కి వెళ్లేముందు ఇంటాంటీ, మధ్యాంటీ, చివరాంటీల దగ్గరికి -  పక్కనే వున్న ప్రసన్న వాళ్లింటికి వెళ్లి - అందరికీ వెళ్లొస్తానని చెప్పి నాన్న అప్పటికే పిలిపించిన రిక్షాలెక్కి అందరం రైల్వే స్టేషన్ కి వెళ్లాం.   ఇంకో రెండు రిక్షాల్లో పప్పి, కుట్టి, లక్ష్మిదొడ్డ, ప్రశాంతి, శ్రీను కూడా స్టేషన్ కి వచ్చారు.

సీటొచ్చిన ఆనందం - అందులోనూ అమ్మ-నాన్న నాతోనే వస్తున్నారు కదా - పప్పి-కుట్టిలని వదిలి వెళ్లడానికి అంత బెంగగా అనిపించలేదు - ట్రైన్ కదిలేంతవరకూ ఏంటేంటో కబుర్లు - నేను వదిలివెళ్తున్న పుస్తకాల, స్టాంప్-కలెక్షన్ల, బొమ్మల, చంద్రకాంతమొక్కల అప్పగింతలు.

ఈలోగా నారాయణాద్రి గుంటూరు వదిలే టైం అయ్యింది - నన్నూ, నా ట్రంకునూ, నా జ్ఞాపకాల-బొత్తినీ , దిగుళ్ల-ఒత్తిడినీ మోసుకుంటూ - తిరుపతివైపు కదిలింది.

(: ఓ చిన్న రిడిల్: ఈ పోస్ట్ టైటిల్ ఏ పాట పల్లవికి పేరడీ? :)

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

వనచరకొండల్లో నక్షత్ర దర్శనం - నాంది

2014 సంవత్సరం 

అమ్మా, నాన్నా జులై లో రావడం, వాళ్ళతో వెళ్లి అన్నగాణ్ణి కాలేజ్ లో చేర్పించడం, మళ్ళీ వాళ్ళని షికాగో విమానాశ్రయంలో ఎయిర్-ఇండియా విమానం ఎక్కించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. 

అసలు హైద్రాబాదులో విమానం ఎక్కి - ఇక్కడికి వచ్చేముందే చెప్పింది అమ్మ - నాన్నకి నడుము నొప్పి వస్తోందని - కానీ నాన్న డాక్టర్ దగ్గరికి అమెరికా నుంచి వెనక్కి వెళ్ళాక వెళ్దామని అనుకుంటున్నారని. 

నాకెందుకో అనిపించింది - నాన్నకేదో అది మామూలు నొప్పి కాదు, ఆయన కావాలనే డాక్టర్ దగ్గరికి వెళ్లడాన్ని వాయిదా చేస్తునారని. మళ్ళీ వాళ్ళేమన్నా టెస్టులు అవీ అంటే అమెరికా రావడం కుదరదని. 

మరి నేనేమో ఏడాది నుంచీ అంటూనే వున్నాను - "నాన్నా! మీరు వాడి అక్షరాభ్యాసానికి గుంటూరు వచ్చారు, మళ్ళీ వాణ్ణి కాలేజ్ లో చేర్పించడానికి కూడా రావాలి" - అని.

సరే - మొత్తానికి అమెరికా వచ్చారు.  

మేమిక్కడ నుంచి టికెట్లు కొంటే ఆరు నెలలకి కొనేస్తామని - మూడు నెలల్లో తిరిగి వెళ్ళేలాగా - అక్టోబర్ రెండవవారంలో ప్రయాణం ఉండేలా - టు అండ్ ఫ్రో టికెట్లు ఆయనే బుక్ చేసుకున్నారు. 

ఇక్కడ వున్నప్పుడు - వారానికి ఒక పది గంటలు ఆఫీస్ పని చేసేవారు. 

రాజమండ్రి నుంచి ఆఫీస్ వాళ్లు రిపోర్ట్స్ అవీ ఈ-మెయిల్ చేస్తే అవి సరి చూస్తూ - అవసరమైతే ఫోన్ లో కాన్ఫరెన్స్ కాల్స్ జరుపుతూ. 

బయటకి ఎక్కడకి వెళ్ళినా ఎక్కువసేపు నడవలేకపోయేవారు. నడుము మీద చేయి వేసుకుని కూర్చుండిపోతూ వుండేవారు. 

"కాలిఫోర్నియా అంటే బోల్డు తిరగాలి నాన్నా - పోనీ ఇంట్లో వుండండి నేనూ, తనూ వెళ్లి వాణ్ణి కాలేజ్ లో చేర్పించేసి వచ్చేస్తాము",  అంటే - "అబ్బే! ఇంత దూరం వచ్చాను - అమెరికా వెస్ట్ కోస్ట్ చూడాల్సిందే" అన్నారు.

బదరి - నాన్న ఉత్సాహం ప్లస్ ఆయన నడవడానికి పడుతున్న ఇబ్బంది చూసి అన్నారు నాతో - "అంకుల్ కి వాకింగ్ స్టిక్ కొంటే ఆయనకి నడవడానికి సపోర్ట్ గా వుంటుంది, కొంచెం హాయిగా నడవగలుగుతారు" - అని. 

వాకింగ్ స్టిక్ అన్న మాటే నాన్నకి నచ్చలేదు మొదట. 

ఆయనకి - తానెప్పుడూ ముచ్చటగా నెమరేసుకుని - చుట్టూ వున్న అందరితో పంచుకునే కుర్ర-తనం తాలూకు గత కాలపు జ్ఞాపకాలనుంచి నుంచి - వర్తమానంలో కర్ర-తనానికి జరగబోతున్న బదిలీ - అంత ఇష్టంగా అనిపించినట్లులేదు. 

కాని బదరి రోజూ ఆన్లైన్ లో రకరకాల మోడల్స్ లో చేతికర్రలు వెతికి - "అంకుల్! ఇది బావుందా, అది బావుందా" - అని అడుగుతూ - మొత్తానికి తనకి మాత్రమే సొంతమైన సమ్మోహనాస్త్రంతో - నాన్నలో మెల్లిగా చేతికర్రాసక్తిని పెంచారు. 

షాపింగ్ కి వెళ్ళిన ప్రతీ చోటా వాకింగ్ స్టిక్ గురించి వాకబు చేస్తూ చేస్తూ చివరికి Unlce Sam's అనే షాప్ లో లాఠీలా కనిపించే ఒక చేతికర్ర కొన్నారు. 

అది చిన్న బాటన్ లా వుండి  అవసరం అయినపుడు తెరుచుకునేలా గొడుగుకర్రలా పని చేస్తుందన్నమాట.

నాన్నకి అది నచ్చింది - సినిమాల్లో మిలిటరీ పాత్రధారులు పట్టుకునే స్టైలిష్ స్టిక్ లా. 

మొత్తానికి రోజూ సాయంకాలం ఒక గంట వాకింగ్ కి  వెళ్లి వచ్చేవారు. ఇదంతా ఎందుకంటే కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు నడవడానికి కావాల్సిన స్టామినా సమకూరుతుందని. 

అమ్మా, నాన్న వచ్చిన పని నిర్విఘ్నంగా జరిగింది. 

అందులో భాగంగా - అన్న ఈగిల్ స్కౌట్ సెరెమనీ -  చిన్నప్పట్నుంచి కారులో తిప్పిన తాతగారిని అన్న తన కార్లో షికారుకి తీసుకెళ్లడం - తాతగారు అన్నని లంచ్-డేట్ కి తీసుకెళ్ళడం - అన్నిటికన్నా ముఖ్యంగా తాతగారు-అమ్మమ్మ, నాన్నమ్మ - ముగ్గురూ కలిసి కాలిఫోర్నియా వచ్చి వాడిని కాలేజ్ లో చేర్పించడం - అన్నీ ఒకదాని తర్వాత ఒకటి - అనుకున్నట్టుగా కొన్ని- అనుకోకుండా కుదిరి కొన్ని - జరిగిపోయాయి. 

"టికెట్లు పోస్టుపోన్ చేసుకుని - అక్టోబర్ లో ఆకులు రంగులు మారతాయి - అవి చూసి ఇంకో నెలన్నరలో ఏదో ఒక  రోజు ఖచ్చితంగా స్నో పడుతుంది అది చూసి వెళ్ళండి" అంటే "అబ్బే - ససేమిరా కాద"న్నారు నాన్న. 

పాపం అమ్మకి ఉండాలనే వుంది. కానీ నాన్న వింటేగా. అనుకున్నట్టుగానే అక్టోబర్ లో ఇండియా వెళ్లారు. 

ఇండియా వెళ్ళిన వారం రోజుల్లో ఫోన్ లో అమ్మ గొంతు దిగులుగా వినిపించింది - "నాన్న నిన్న వెళ్లి అన్ని టెస్టులూ చేయించుకున్నారు. మన అపార్ట్ మెంట్ లో తెలిసిన డాక్టర్ గారు ఆ రిపోర్టులు చూడగానే - 'కామేశ్వర్రావుగారూ ముందు మీరు అర్జెంటుగా హైద్రాబాదు వెళ్లాల్సివుంటుంది ' అంటే - నాన్నేమో - 'డిసెంబర్ లో మావాళ్ల ఇంట్లో పెళ్లి వుంది అప్పుడు వెళ్తాను' అన్నారు. అది వినగానే డాక్టరు గారు - 'మీకెలా చెప్పాలో తెలియట్లేదండీ కానీ మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది' అని చెప్పేశారు. ఇంకో వారంలో ప్రయాణం. పప్పీ దగ్గరకి వెళ్తున్నాము" -అని చెప్పింది. 

హైదరాబాదులో పప్పీ దగ్గరికి వెళ్లారు - అమ్మా, నాన్న. 

స్టార్ హాస్పిటల్ లో డాక్టర్ గోపీచంద్ గారి దగ్గర appointment దొరికింది. 

Angiogram, ఇంకా మిగిలిన ప్రిలిమినరీ టెస్టులు అన్నీ అయ్యాక - రిపోర్టులు వచ్చాక వాటి గురించి మాట్లాడడానికి డాక్టర్ గోపీచంద్ గారి దగ్గరికి వెళ్లారు - అమ్మ, నాన్న, పప్పి. 

రిపోర్టులు అవీ చూసి డాక్టర్ గారు - తొందర్లోనే సర్జరీ చేయాలి అని చెప్పగానే - నాన్న ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడాలి అని చెప్పి - అమ్మని, పప్పీని డాక్టర్ గారి రూంలోంచి బయటికి వెళ్లమన్నారట. 

వాళ్లలా వెళ్లగానే - నాన్న, డాక్టర్ గోపీచంద్ గార్ల మధ్య జరిగిన సంభాషణ:

"డాక్టర్ గారు! ఎంతవుతుందండి ఈ ఆపరేషన్ కి? 

"దాదాపు XX లక్షల దాకా అవుతుందండి - రెండు స్టెంట్లు వెయ్యాలి - అదీ కాక Aortic Aneurysm మీకున్న ఇంకొక ప్రాబ్లెమ్. అది ఎప్పుడైనా రప్చర్ అవొచ్చు"

"ఎప్పుడైనా అంటే ఎన్నాళ్లు పడుతుందంటారు?"

"ఇవాళ కావొచ్చు - ఇంకో రెండేళ్లు పట్టొచ్చు"

"ఆపరేషన్ చేస్తే ఎన్నాళ్లు ఉంటానంటారు?"  

"ముందు మీరు సిగరెట్లు మానేయాలి - ఆపరేషన్ చేయాలి - అదికూడా 50-50 ఛాన్స్ - ఆ తర్వాత ఓ పదేళ్ల దాకా పర్వాలేదు"

"నాకిప్పుడు 69 ఏళ్లు - ఆపరేషన్ చేయకపోయినా రెండేళ్లుంటాను - చేస్తే 50-50 ఛాన్స్ అంటున్నారు - ఎందుకొచ్చిన గొడవ - నన్నొదిలేయండి - హాయిగా ఇంటికెళ్లిపోతాను"

డాక్టర్ గారేమీ మాట్లాడలేదు. 

ఎదురుగా టేబుల్ మీద వున్న బజర్ నొక్కారు -  నర్స్ లోపలికి వచ్చింది. 

నర్స్ తో డాక్టర్ గారు "బయట కామేశ్వరరావుగారి భార్య వుంటారు - ఒకసారి పిలు" అని చెప్పారు. 

నాన్న వెంటనే కంగారుగా "ఇప్పుడావిడని పిలవడం ఎందుకండీ డాక్టర్ గారు?!" అని కుర్చీలో ఇబ్బందిగా కదిలారు. 

"ఆపరేషన్ కాకపోయినా రెండేళ్లు వుంటాను కదా - చేయించుకోకూడదు అన్న మీ ప్లాన్ కూడా బావుంది - మీరన్నది ఆవిడకి కూడా చెబ్దామండి" - అన్నారు డాక్టర్.

.... ..... ..... 

(నాన్న ఆలోచిస్తున్నారు - డాక్టరు అమ్మని పిలవకుండా ఎలా ఆపాలా అని)

"మీ ఆవిడ నాకు ఆల్రెడీ చెప్పారు - మీరు ఆపరేషన్ వద్దంటారని. అందుకే" అంటూ మళ్లీ నర్స్ కేసి తిరిగి - "ముందావిణ్ణి పిలుచుకురా" అని చెప్పారు డాక్టర్ గోపీచంద్ గారు. 

నాన్న వెంటనే సర్దుకుని "వద్దు లెండి - ఆపరేషన్ కి ఎప్పుడు రావాలో ఆ వివరాలు చెప్పండి" అంటూ బయటికి నడిచారు.

హైద్రాబాదు -  హాస్పిటల్స్ అంటేనే పట్టపగలే చుక్కలు కనిపించే వైనం - అలాంటి నక్షత్ర దర్శనం - ఆపరేషన్ జరగబోతున్నా - చుట్టూవున్నవాళ్లందరూ కంగారు పడుతున్నా - అంత హడావిడిలోనూ నాన్న కావించిన  హాస్యప్రియత్వ-దర్శనానికి ఇది నాంది. ఇంక వనచరకొండలు అంటే ... ముక్తాయింపులో చెప్తాను. 

<ముక్తాయింపు వచ్చే నెల ఇంకొన్ని కబుర్లతో.... >

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

నాని 'నేను లోకల్' - నాన్న 'నేను వోకల్'

కిందటి గురువారం  ఫోన్లో టింగుమని శబ్దం చేస్తూ వచ్చిన ఈమెయిల్లో - నమస్కార్దేశిడాట్కామ్ వాళ్ల నుంచి ఒక సినిమెయిల్ మెరిసింది - నాని "నేను లోకల్" విడుదల అవుతోంది - చూడండహో అంటూ.

అది చూడగానే - ముందుగా వచ్చిన ఆలోచన - టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని చిన్నప్పటి రోజుల్లో సినిమాగమనం ఎలా తెలిసేదా - గుర్తు చేసుకుందాం ఒకసారి - అని.

ఒక గూడు రిక్షాలో - ముందుపక్క రిక్షా అబ్బాయి నెమ్మదిగా తొక్కుతుంటే - వెనకగా కూర్చుని ఒక చేత్తో పట్టుకున్న మైకులో - "నేడ్డే చ్చూడండి (ఆ 'డే' మీద - 'చూ' మీద ఒత్తి పలుకుతూ) మీ అభిమాన థియేటర్ <పేరేదైనా కావొచ్చు>   మీ అభిమాన నటుడి <పేరేదైనా కావొచ్చు>  సినిమా" అంటూ - ఇంకో చేత్తో రంగురంగుల సినిమా వివరాలున్న పాంఫ్లెట్ / కరపత్రాలు వెదజల్లుతూ - వెళ్లే సినిమా-బండబ్బాయి ప్రతి శుక్రవారం వచ్చే సిని-మా-చుట్టం.

ఆ సినిమా-బండ్ల సరదాలనుంచి ఈమెయిళ్ల పరదాలకి అప్డేట్ అయ్యాము.

బదరి, నేను - సినిమాల్లో కూడా అప్డేట్ అయ్యాము బాగానే. భాషాభేదం సరే - వయోభేదం కూడా చూడం - బుజ్జిజింకలతో కలిసి Finding Dory చూడడానికైనా వాళ్లకన్నా ముందే మేం తయారు.

సినిమా అంటే - మాకు - ముఖ్యంగా నాకు - ఇలాగే వుండాలి - చూసే మూడుగంటల సినిమా ఇంకో ముప్పై గంటలు ఆలోచించేలా చేయాలి - అన్న పట్టింపులేం లేవు.

తెలుగు భాష - యాస ఏదైనా సరే - మంచి మాటలతో వుండి, పాటలు అంతో ఇంతో వినసొంపుగా వుండి, హాస్యం పేరుతో సాటి మనుషులని తన్నకుండా-వెక్కిరించకుండా వుండి, హీరో-హీరోయిన్లు చూడముచ్చటగా వుండి - తెరంతా రంగురంగులుగా - "అబ్బా! కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా వేరే లోకం చూసొచ్చాము" అనేలా ఉంటే చాలు.

అసలు నిజం చెప్పాలంటే మొదట 'నేను లోకల్' సినిమా పేరు వినగానే వెంటనే ఇది చూసి తీరాలి అనిపించలేదు.

కానీ అప్పుడెప్పుడో ఈ నానిదే భలే భలే మగాడివోయ్ తర్వాత - అసలే ఈ మధ్య థియేటర్లో  తెలుగు సినిమాలు చూడలేదేమో - మా సినిమాకలి మిక్కిలిగా వుంది.

సరే - మన అచ్చతెలుగబ్బాయి -  చలాకీగా చులాగ్గా సినిమాని నడిపించేస్తాడసలే - నాని సినిమా కదా - వెళ్దామా అనుకున్నాము - కిందటి శుక్రవారం.

మేము తలిస్తే సరిపోదు కదా - బుజ్జిజింక దయతలచాలి - అసలే వాడికి శనివారం ఏదో లెక్కల పోటీ స్కూల్లో.

శుక్రవారం రాత్రి - బుజ్జిజింక కలల వేళ - దుప్పటి చెవులదాకా కప్పి - బుగ్గ మీద ముద్దు పెడుతూ - నాన్నగారు అడిగారు - "నాన్నా! రేపు సినిమాకి వెడదామా? మనమ్మ సినిమా-బెంగ తీరుద్దామా?" అని.

"తెలుగు సినిమానా - అమ్మో - గట్టిగా అరుస్తారేమో , రక్తాలొచ్చేలా కొట్టుకుంటారేమో ?" - బుజ్జిజింక నిద్ర మత్తులో కూడా ఇంతకు ముందు అప్పుడెప్పుడో చూసిన సినిమా తాలూకు పలవరింతే.

బుజ్జిజింక కలవరపాటుతో కూడిన పలవరింత విన్న అమ్మ - స్వగతంగా - "(కృష్ణవంశీ మొగుడి దెబ్బా - మజాకానా)" అనుకుంది.
సావకాశమైన గొంతుతో - ప్రకాశంగా -  నాన్నగారిచ్చిన  భరోసా- "లేదు నాన్నగాడు - ఇది సరదా సినిమా - ఇంతకు  ముందు చూసిన సినిమాలో నీకు నచ్చాడు - అదే అన్నీ మర్చిపోతూ ఉంటాడు - భలే భలే మగాడివోయ్ హీరో - ఆ నాని సినిమా".

"సరే - లెట్స్ గో " - వరమిచ్చేసిన బుజ్జి-దేవుడు పవళించాడు.

శనివారం - పొద్దున్న అబ్బాయి లెక్కల పోటీ - మధ్యాహ్నం అమ్మా-నాన్నల తమిళ-భాషా-తరగతి-భేటీ అయిపోగానే - సాయంత్రం భోజనాలు కాగానే తొమ్మిదిగంటల సినిమాటకి వెళ్లాం ముగ్గురం.

మా సినిమాచారం ప్రకారం -
నాకో బుట్టెడు చిప్స్----
పక్కనే చీజు----
ఇంకో పక్క  జకారమునకు హకారమాదేశించుకుని రెట్టించిన కారంతో నా చేత హాహాకారం చేయించే  హాలాపిన్యోస్  (Jalapeños) అనబడే గుండ్రని పచ్చిమిరపకాయ ముక్కలు---
బుజ్జిజింకకి Crunch-a-Bunch పొట్లం---
- కొనిపెట్టేసి ఇద్దర్నీ పట్టుకెళ్లి అన్నిటికన్నా పై....న వున్న వరసలో తన సరసన కూర్చోపెట్టుకున్నారు బదరి / నాన్నగారు.

కర కర చిప్స్ - కటుకు కటుకు Crunch - మిల్లులాడడం మొదలయింది.
దాంతో ఈ నేపథ్య సంగీతంతో టాకీ-సినిమా కాస్తా మూకీలా చూడాలేమో అని నాన్న చెవులు అల్లలాడడం కూడా.

బోల్డు మంది తెలిసినవారు ముందు-పక్క సీట్లలో కూర్చుని కనిపించారు.
కరకరలాడే నోటితో నవ్వుతూ -  కరాల-చాలనతో (కరచాలనం కాదు) - శబ్దం రాని పెదవుల కదలికతో 'హాయ్' అంటూ - కాసేపు పలకరింపుల-హడావిడి సాగింది.

ఇంతలో సినిమా మొదలయింది.

మెరిసే కళ్లతో చలాకీగా - మనకి బాగా తెల్సిన ఓ మంచబ్బాయిలా కనిపించే నాని సెప్టెంబర్ లో పరీక్షలు రాసే సీను.

పక్కనే కూర్చుని వున్న - బుజ్జిజింక - చాక్లెట్టు కటుకు-కటుకులు నెమ్మది నెమ్మదిగా కుహు-కుహులయి బుగ్గలు పూరించిన నవ్వులయ్యాయి.

మొత్తానికి ఈ సినిమాలో మాకు అనిపించినవి - నచ్చినవి - అవీ-ఇవీ-అన్నీ 

సినిమా మొత్తం సరదా-సరదాగా సాగిపోయింది - అక్కడక్కడా ఇల్లాజికల్ గా అనిపించినా - అంత పట్టించుకోలేదు మేము. 

నాని  (సినిమాలో పేరు బాబు) ఏక్షన్, డాన్స్, డైలాగ్ డెలివరీ - అన్నీ బావున్నాయి. అతిగా అరవకుండా - నెమ్మదిగా మాట్లాడినా కూడా -  ఆయాసపడకుండా ఆవేశం బాగా చూపించగలడీ అబ్బాయి - చూపుతో, మాటతో. 

కీర్తి సురేష్ - అమ్మాయి ముద్దబంతిపూవులా, ముద్దమందారంలా బావుంది - చుడీదార్ వేసుకున్నా , చీర కట్టుకున్నా ఒద్దికగా వుంది - సినిమాలో పాత్రకి తగ్గట్టు. 

హీరో బాబు - నాన్న - పోసాని - అరిచినా చిరాకెయ్యలేదు - అమ్మాయిని చూడగానే కోడల్ని చేసుకోవాలనే మంచి మామయ్యగా - బాబుని సపోర్ట్ చేసే బాబుగా - బావున్నాడు. 

ఒకప్పటి బాపు-బొమ్మ - ఇందులో బాబు-అమ్మ - ఈశ్వరీ రావు - కనిపించేది అంత ఎక్కువసేపు కాకపోయినా గుర్తుండిపోయే అమ్మ. 

కీర్తి నాన్న మరాఠీ నుంచొచ్చిన సచిన్ ఖేడేకర్ అట - కొంచెం కళ్ల దగ్గర అరవింద్ స్వామి గుర్తొచ్చాడు. 
శంకరాభరణం తులసి అయితే నిజంగా కీర్తికి అమ్మేమో అనేంతగా కుదిరింది పోలిక.

తులసి చూసే 'మనసు-మమత' సీరియల్ 'ఆమ్మో ఇదింకా ఉందా' అనిపించింది.
[దాదాపు నాలుగేళ్ల క్రితం  మా అత్తగారు టీవీలో రోజూ చూస్తుండగా ఇంట్లో పనిచేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు - వినకూడదనుకున్నా, వినిపించుకోకూడదనుకున్నా, వినీ-వినకుండా వినేసిన - హాంటింగ్ మెమొరీ ఈ సీరియల్ నాకు.] 
కామెడీ / హాస్యం కోసం వున్న సీనులు కొత్త ఐడియాలతో నిజంగా నవ్వు తెప్పించేలా వున్నాయి - పక్కవాళ్లు నవ్వుతున్నారని మొహమాటపడి మరీ నవ్వేలా కాకుండా.
ముఖ్యంగా హీరో బాబుని అన్యాయంగా జైల్లో పెట్టారని తెలిసి విడిపించడానికి -  స్నేహితులు - ఇరుగు పొరుగు వారు - చిన్నపిల్లలతో సహా - వచ్చి పోలీస్ స్టేషన్లో బోల్డన్ని కేసులు పెట్టే సీను యునీక్ గా వుంది.

అందులో ఒక చిన్న బాబు పెన్సిల్ పోయిందని కేసు పెట్టడానికి వచ్చి పెన్సిల్ ఎలా పోయిందంటే - ఒక అరగంట షార్పెనర్ లో పెట్టి తిప్పితే పోయిందని చెప్పినది - బుజ్జిజింకకి బాగా నచ్చేసింది. సబ్-టైటిల్స్ చదువుకుని సినిమాని బాగా ఎంజాయ్ చేశాడు. 

నవీన్ చంద్ర సబిన్స్పెక్టర్ గా - గొంతు కొంచెం hollow గా అనిపించినా అంతగా బోర్ కొట్టలేదు - ఈ అబ్బాయి కూడా బాగానే చేశాడు అనుకున్నాము. 

అన్నిటికన్నా నచ్చిన విషయం -  కాబోయే మామగారు ఏమనుకోరు అని తెలిసి, ఆయనే చెప్పిన తర్వాత హీరో బాబుని తన కాలర్ పెట్టుకునేలా చేసి (అరెస్ట్ చేయడానికి కారణం కావాలి కాబట్టి ) - అరెస్ట్ చేసినా - ఆ పోలీస్ స్టేషన్ సీను కూడా అక్కర్లేని డ్రామాలు,  రక్తాలు వచ్చేలా కొట్టుకోవడాలు (మా బుజ్జిజింక అన్నట్లు) లేకుండా చాలా నీట్ గా సివిలైజ్డ్ గా వుంది.
నాకెంతో ఇష్టమయిన వంశీ సినిమా - ఏప్రిల్ ఒకటి విడుదల-గోపి - కృష్ణభగవాన్ కి ఇంకొంచెం పెద్ద రోలు (రాతి రోలు కాదు - సినిమా పాత్ర రోలు) ఇచ్చుంటే బావుండేదనిపించింది. 
పాటల్లో "నెక్స్ట్ ఏంటి" బావుంది. మిగిలిన పాటలు అంతగా గుర్తు లేవు - ఇంకోసారి విని చూడాలి. 
"అరెరే ఎక్కడ" పాటలో హీరో గొంతుకి, హీరోయిన్ గొంతుకి అంత తేడా లేదు. 

సినిమాలో మాటలు ఎక్కువ డ్రామా లేకుండా మామూలు భాషలో వినడానికి హాయిగా వున్నాయి.
ఒకచోట బాబు కీర్తితో  జీవితమంతా గడపాలని వుంది అని చెప్తూ "మన పెళ్లయాక కూరలో ఉప్పు తక్కువయిందని నిన్ను తిట్టాలి" - ఇలాంటిదేదో అంటాడు - అది వినగానే - సహజనక్షత్రం చెప్పిన అతి సహజమైన డైలాగిది అని మురిసిపోయాం మేమిద్దరం.
ఇంతకు ముందు సినిమాలలో సరిగ్గా ఇదిగో - ఇలాంటి సందర్భాల్లో - హీరో - "నీ కంట్లోంచి నీరు రానీయను - నీ కాలు కందనీయను" అని చెప్పే అతిశయోక్తులు గుర్తుకొచ్చి - పోల్చి నవ్వుకున్నాం.
చివరిలో లోకల్ ఫీలింగ్ తో గెలిచినవాళ్లం నేను-ట్రంపూ అని బాబు అనడం సినిమాకి contemporaneity-advantage పెంచింది.
ఈ సినిమా sensible team-work కి మంచి ఉదాహరణ

"నేను లోకల్"  అన్న నాని  హంబుల్
కాని అలా అన్న నాని కీర్తి మాత్రం గ్లోబల్ 



ఉపసంహారం - మా నాన్న 'నేను వోకల్ (వీడియో కాల్లో)'

సినిమా చూసొచ్చి - ఆ కబుర్లు చెప్పుకుని కొంచెం లేటుగా పడుకుని - ఆదివారమే కదా అని - మరి కొంచెం లేటుగా లేస్తూ ఉంటే - నా ఫోన్ మోగింది - Out of Area అని చూపిస్తూ. 
ఎవరయుంటారబ్బా అని తీసి - హలో - అనగానే, అవతల నుంచి నాన్న "గొంతేంటి అలా వుంది - ఒంట్లో బాలేదా?" అంటూ. 

"లేదు నాన్నా - ఇప్పుడే లేస్తున్నాను"

"ఫోన్ సరిగ్గా చూశావా - నేను వాట్సాప్ లోంచి కాల్ చేస్తున్నాను - ఓసారి ట్రై చేద్దామని"

"అవున్నాన్నా చూశాను"

"సరే - అదేదో ఫేస్ టైం వుంది కదా - ఓసారి చెయ్యి అది"

"అబ్బా వద్దు నాన్నా - రాత్రి 'నేను లోకల్' సినిమాకెళ్లి వచ్చాము - ఇప్పుడే లేస్తున్నాను - ఇలా చూస్తే భయపడతారు"

"పర్లేదులే చెయ్యి ఒకసారి - అవునూ - నేను లోకల్ బావుందంటున్నారు ఇక్కడ కూడా - అలాగే శతమానం భవతి కూడా - అద్సరే కానీ ముందు ఫేస్ టైం లోకి రా"

ఇంకొదలరు - అనుకున్నది అయ్యేదాకా ... 

సరే - ఫేస్ టైం లాంటిదే కదా అని - వాట్సాప్ వీడియో కాల్ చేశాను. 

అట్నుంచి నాన్న ఫోన్ తీశారు. 

ఫోన్ స్క్రీన్ మీద ఇన్సెట్ లో నా మొహం బానే కనిపిస్తోంది - కానీ అటుపక్కనుంచి నాన్న కనిపించట్లేదు - స్క్రీన్ అంతా నల్లగా - అక్కడక్కడా ఏదో మిణుకు మిణుకు మంటూ చుక్కలు చుక్కలుగా కనిపిస్తోంది. 

ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. 

"ఏంటి నాన్నా! ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది - మీరసలు కనిపించట్లేదు నాకు "

అవతలి నుంచి "హహ్హహ్హహ్హ"

ఇవతలి నుంచి నేను అయోమయంగా - ఏంటా అనాలోచిస్తూ  -  "......"
"నేను చీకట్లో ఉంటే ఎలా కనిపిస్తాను?' అంటూ అటు నుంచి నవ్వులు
'మీరు చీకట్లో వుండి వీడియో కాలేంటి నాన్నా!"
"అసలెలా వస్తుందో చూద్దామని - హహ్హహ్హహ్హ - నేను వోకల్ గా ఓకే కదా"
"మీరు - బాబోయ్ - వుండాల్సిన వారు నాన్నా!" 

"హహ్హహ్హహ్హ"



3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

గళ్లలెక్కలు - కళ్లచిక్కులు

నేనూ - బుజ్జిజింక సరదాకి చేసే పనుల్లో లెక్కలొకటి .

లెక్కలంటే -
ఆకాశంలో చుక్కలని ఎంచేవో...
ఎంచలేక చుక్కలని చూపించేవో...
చుక్కలు చూసిన కళ్లకి చికాకు పెంచేవో కాదు...

లెక్కలంటే -
కొన్ని టక్కున ఎంచేవి
కొన్ని చప్పున చిక్కనివి
ఎంతో మక్కువ పెంచేవి
ఇంకెంతో చక్కనివి

అలాంటి ఒకానొక తమాషా-లెక్క ఇదిగో -



తెలుగులో ఈ లెక్క ఏంటంటే:

జూలియెట్ అనే అమ్మాయి "చదరాలని పట్టండి" అనే ఒక వేడుక-ఆటలో పోటీ చేస్తోంది. ఆ ఆటలో ఒక 4X4 చదరపు పటాన్ని చూసి - అందులో దాగున్న చదరాలని కనుక్కుంటే డబ్బులు గెలుచుకోవచ్చు.  ఆ అమ్మాయి కనుక్కున్న ప్రతీ చదరానికీ డబ్బులు బహుమతిగా ఇస్తారు. ఆ డబ్బుల లెక్క ఎలాంటిదంటే - ఒక 1X1 చదరానికి ఒక డాలరు, 2X2 చదరానికి నాలుగు డాలర్లు, 3X3 చదరానికి తొమ్మిది డాలర్లు, 4X4 చదరానికి పదహారు డాలర్లు - ఇస్తారన్నమాట. ఒకవేళ జూలియెట్ కనక అన్ని చదరాలని కనిపెట్టి - పట్టగలిగి - పటం కట్టగలిగితే ఆ అమ్మాయి ఎంత డబ్బు గెలుచుకుంటుంది?

(అసలయినా - రోమియోని తలచుకుంటూ ఏ బాల్కనీలోనో నించుని -
What's in a name? That which we call a rose
By any other word would smell as sweet.
- అనుకుంటూ వుండక జూలియెట్ ఈ గళ్ల లెక్కలు చేయడమేంటో కదా ?!)

ఆ జూలియెట్ సంగతేమో కానీ ఆ గళ్ల గళ్ల -లెక్క చూడగానే నాకూ, బుజ్జిజింకకీ - చెరి రెండు కళ్లూ మెరిశాయి.

చేతికొక  పేపరు, పెన్సిలూ పట్టుకుని -  చెరొక గళ్ల-చదరం గీసేసుకున్నాము.

అటు తిప్పాము - ఇటు తిప్పాము.

ముందు ఇందులో ఒక పే....ద్ద చదరం వుంది అనేసుకున్నాము - మేఫ్లవర్ ఎక్కని కొలంబస్సుల్లా - ఎదురుగా మరి అంత పెద్దదే కనిపిస్తోంది కదా!



తర్వాత - ఇందులో ఇంకా పదహారు బుల్లి బుల్లి చదరాలు వున్నాయి అని - నాలుగు నాలుగులు పదహారు - అంటూ ఎక్కాలేసి మరీ లెక్కేసేశాం.



తర్వాత - ఇంకొంచెమే వున్న 3X3 చదరాలు గబగబా రొక్కించి మరీ లెక్క చెప్పేశాం - నాలుగే నాలుగని .



చివరాఖరుగా - కుడి చేతి చూపుడు వేలుని, నడిమి వేలుని - మెలికలు మెలికలుగా - గళ్ల మీదుగా నడిపిస్తూ - 2X2 చదరాలు - ఆరని నేనంటే -

రెండార్ల వయసింకా లేకపోయినా - నీకన్నా ఆరున్నొక్కాకులు ఎక్కువే చదివానని - నాకు చెప్పీ చెప్పకనే చెబుతూ -

"అమ్మా ! నిన్ను కాదనాలని కాదు - కానీ అనాల్సొస్తోంది - క్షమించూ "

- అని మహా నేర్పుగా నన్ను నొచ్చనీయక - అలాగని ఇచ్చకపు మాటలాడక -

2X2 చదరాలు తొమ్మిదున్నాయని - నెమ్మదిగా లెక్కపెట్టి చూపించాడు నా బుజ్జిజింక.



ఇంకేముంది - లెక్క తేలిపోయింది.





జూలియెట్ కి ఇచ్చిన లెక్కలో వున్న 4X4 చదరంలో మొత్తం (16+9+4+1) = 30 చదరాలు వున్నాయి.

ఎలా లెక్క పెట్టాలో తెలిశాక ఇంకాగుతామేంటి?

ఇంకో కాయితం మీద 5X5, 6X6 - ఇలా వరుసగా గళ్లు పెంచుకుంటూ గీసుకుని - వాటిలో చదరాల లెక్క కూడా చూశాము.

ఏతావాతా తేలిందేంటయ్యా అంటే - ఇదిగో - ఈ కింద ఫొటోలో వున్నది....



[బుజ్జిజింకకి లెక్కలు కట్టడం ఇంకొంచెం-ఎక్కువ తెలిశాక - మళ్లీ ఈ లెక్కని Sum of the Squares of the first n natural numbers ఉపయోగించి ఇంకోసారి లెక్కగట్టి మేము తప్పో-రైటో - మా లెక్క మేం తేల్చుకుందాం అనేసుకున్నాం. ఇప్పటికి వాడి బుజ్జి-బుర్రకిది చాలు.]

"మరి జూలియెట్ కి వచ్చే డబ్బులో?" - అని నేనడగ్గానే - బుజ్జిజింక వేసిన లెక్క ఇది ...


16 (1X1)'s  = 16X1= $16
 9  (2X2)'s  =  9X4 = $36
 4  (3X3)'s  =  4X9 = $36
 1  (4X4)'s  =  1X16=$16

ఒక 1X1 చదరానికి ఒక డాలరు, 2X2 చదరానికి నాలుగు డాలర్లు, 3X3 చదరానికి తొమ్మిది డాలర్లు, 4X4 చదరానికి పదహారు డాలర్లు  - చొప్పున - మొత్తం (16+36+36+16) = అక్షరాలా అష్టోత్తర-శతానికి-ఒక నాలుగు-తక్కువగా-డాలర్లు అనగా $104/-.

లెక్కంతా అయిపోగానే -
ఒకళ్ల కళ్లు ఒకళ్లు చూసుకున్న
మా కళ్లకి
గళ్ల  లెక్కల్లో చిక్కుకుని
ముళ్లు పడ్డ మా కళ్లు
గళ్లు-గళ్లుగా
బుల్లి-బుల్లి వడగళ్లుగా
అయిపోయాయంటే
వేళాకోళం కానే కాదు మరి!
అంతే కాదు -

అమ్మనోట అనుకోకుండా వచ్చిన -
గళ్లలెక్కలు - కళ్లచిక్కులు 
చెంగుచెంగుమనే బుజ్జిజింక నోట
ఖంగుఖంగుమనే టంగు-ట్విస్టరయ్యింది