24, ఏప్రిల్ 2013, బుధవారం

చక్కిలాల లెక్క




అల్లసాని వారికి కావ్యం వ్రాయడానికి ఎన్ని కావాలో చూడండి 

నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త
ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,
దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

ఆయన ఆంద్ర కవితా పితామహులు కాబట్టి తప్పకుండా వ్రాయడానికి ఆ మాత్రం సరంజామా కావాల్సిందే.

ఆ పద్యం స్పూర్తితో  చదవడానికి నాకేం కావాలో నేనూ ఒక లిస్టు తయారుచేసుకున్నాను. 

ఒకానొక శీతాకాలపు మంచు కురిసిన మధ్యాహ్నం 
భోజనం చేసి siesta కై పడక గదికి తరలిన శ్రీవారు 
బొజ్జలు నిండి పుస్తకాలు చదువుతూ, బొమ్మలతో ఆడుకుంటూ వుండే పిల్లలు 
ఏటవాలుగా ఎండ పడుతూ వున్న కిటికీ ప్రక్కనున్న, కాళ్ళు చాపుకునే వీలుగల రిక్లైనర్ సోఫా 
ప్రక్కనే పళ్ళెంలో కరకరలాడే జంతికలో, చక్కిలాలో 
అన్నిటినీ మించి ఒక మాంచి తెలుగో, ఇంగ్లిషో పుస్తకం ...

అదిగో ...ఆ చక్కిలాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నా చిన్నప్పటి ఒక తమాషా లెక్కల చమత్కారపు కథ ఒకటి గుర్తుకొస్తుంది. అదేంటో చెప్పేస్తాను. మీరు మాత్రం చివర నేను ఇచ్చే సమాధానం చూడకుండా మీరు దీనిని విప్పగలరేమో చూడండి. ఇంకో విషయం "చక్కిలం" అంటే ఏంటో తెలియకపోతే కథలో దాని బదులు "మురుకు" ప్రతిక్షేపించేసుకోండి.

అసలు కథ మొదలు.

పూర్వం ఒక రాజు తన కోశాగారానికి  ఒక నమ్మకమైన కోశాధికారిని  (అంటే treasurer) నియమించే బాధ్యతని తన మంత్రికి అప్పగించారు. మంత్రి "కోశాధికారి కావలెను" అని ప్రకటించగానే బోల్డన్ని దరఖాస్తులు వచ్చాయి -  ధనాగారంలో ఉద్యోగం మరి. అన్ని రకాల పరీక్షలు, వడపోతలు అయ్యాక ఇద్దరు మిగిలారు. వాళ్లని రామయ్య, సోమయ్య అనేద్దాము. 

మంత్రి వాళ్ళిద్దరినీ పిలిచి ఇద్దరికీ చెరో పాతిక చక్కిలాలు, ఒక ఉత్తరం  ఇచ్చి అడవికి అవతల వున్న రాజుగారి బావమరిదికి అవి ఇచ్చి, బదులుగా ఆయన దగ్గరనుంచి తను పంపుతున్న లేఖకి సమాధానం తీసుకురమ్మనాడు. ఉత్తరాలు రెండూ పెట్టెలలో పెట్టి తాళం వేసి ఇచ్చాడు - దారిలో ఎవరూ తెరిచి చదవకుండా. ఆ పెట్టెలని తెరవగల తాళాలు రాజు గారు మరియు ఆయన బావమరిది మాత్రమే వుంటాయి అని కూడా చెప్పాడు. వీటన్నిటికీ తోడు ఇంకో షరతు - రామయ్య, సోమయ్య దారిలో తినడానికి ఏమీ తీసుకెళ్లకూడదు. ఇంకా రామయ్య, సోమయ్య విడివిడిగా బయలుదేరాలి; ప్రయాణంలో ఒకరికి ఒకరు తారసపడకూడదు.

మంత్రి ఇచ్చినవన్నీ తీసుకుని, నియమాలన్నీ మననం చేసుకుంటూ రెండో రోజు ప్రోదున్నే బయల్దేరారు రామయ్య, సోమయ్యలు. చెప్పినట్టే ఎవరికి  వారు ప్రయాణం చేసి వెళ్లి రాజుగారి బావమరిదిని విడివిడిగా కలిసి  మంత్రి ఇచ్చిన చక్కిలాలు, ఉత్తరం పెట్టె ఇచ్చారు. ఆ బావమరిది పెట్టెలోని ఉత్తరం చదువుకుని, చక్కిలాలు ఎలా వున్నాయో చూసుకుని, తెచ్చిన వారిని ఒకటి రెండు కుశల ప్రశ్నలు వేసి, ఆ ఉత్తరానికి సమాధానం వ్రాసి అదే పెట్టెలో పెట్టి తాళం వేసి రామయ్య సోమయ్యలని సాగనంపాడు.

మంత్రి రామయ్య, సోమయ్యలు తెచ్చిన సమాధానపు లేఖలని రాజుగారికి చదివి వినిపించాడు.

రామయ్య  తెచ్చిన లేఖ:

బావ గారికి నమస్కారాలు. ఉభయ కుశలోపరి. ఈ రామయ్య తెచ్చిన పెట్టెలో 21 చక్కిలాలు వున్నాయి. మాటల సందర్భంలో ఆకలేసి ఆగలేక చక్కిలాలు తిన్నానని, నన్ను ఏమీ అనుకోవద్దని చెప్పాడు.

సోమయ్య తెచ్చిన లేఖ:

బావ గారికి నమస్కారాలు. ఉభయ కుశలోపరి. సోమయ్య తెచ్చిన పెట్టెలో 25 చక్కిలాలు వున్నాయి. మనిషి మంచి మాటకారిలా వున్నాడు. అతను వున్న కాసేపు కబుర్లతో కాలమే తెలియలేదు.

ఆ లేఖల సారాంశం వినగానే రాజుగారికి రామయ్య మీద చాలా కోపం వచ్చేసింది. వెంటనే మంత్రి వైపు తిరిగి సోమయ్యని వేరే ఆలోచన లేకుండా కోశాధికారిని చేయమని ఆదేశించారు. 

మంత్రి చిరునవ్వు నవ్వి  ఆలేఖలలో ఆంతర్యం విప్పి చెప్పి,  రామయ్యే కోశాధికారి పదవికి తగినవాడు అనగానే రాజు మంత్రి తెలివితేటలను మెచ్చుకుని రామయ్యనే తన కోశాగారానికి అధికారిని చేశాడు.

ఇంతకీ మంత్రి ఏం చెప్పాడో మీరు కనుక్కోగలరా? క్రింది చుక్కలగీత దాటి మీ చూపు వెళ్ళేలోగా ఆలోచించండి. ఈలోగా మీకొక అనుమానం రావొచ్చు - అల్లసాని వారి పద్యానికి, ఈ చక్కిలాల లెక్కకి సంబంధమేంటీ అని. అస్సలేమీ లేదు - ఏదో బోడిగుండుకి, మోకాటికీ ముడెయ్యాలనే ఆత్రం తప్ప.

ఇంతకీ జవాబు తెలిసిందా ?లేదా....అయితే చూపుని కొంచెం ఆ చుక్కల క్రిందికి జరపండి మరి!
.......................................................................................................................................................................................

సరే మంత్రి రాజుకి చెప్పినది ఇదీ.....!!!

"సోమయ్య ఆకలి వేయగానే మూట విప్పి ఏదో నాలుగో, ఐదో చక్కిలాలు తినకుండా తను తిన్న విషయం బయట పడకుండా వుండాలని ప్రతీ చక్కిలానికి బయట చుట్టుని తినేశాడు. రాజుగారి బావమరిది అది ఎక్కడ కనిపెడతాడో అని మాటల గారడీ చేశాడు. రామయ్య అలా కాకుండా లెక్క తెలిసేలాగా ఒక నాలుగు తిన్నాడు - లెక్క పెట్టుకుంటారని తెలిసి కూడా. కోశాగారానికి అందుకే రామయ్యే తగిన వాడు."
......................................................................................................................................................................................
 మన దేశంలో ప్రస్తుతానికి చక్కిలాల సోమయ్య వారసులు చాలా మందే వున్నారని మీకనిపించట్లేదూ ? ;) 

~లలితా TS

అది నేనే – ఇది నేనే

అక్టోబర్ "విహంగ"లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


అదేంటో ఇండియా లో ఉన్నన్నాళ్ళూ ఇంగ్లీష్ గ్రామర్ బై-హార్ట్ చేశానా, అమెరికా వచ్చానో లేదో తెలుగు బడి మొదలెట్టేశాను. అదే నా గుడి అన్నాను. 

వూళ్ళో వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే "అదేంట్రా! మీ పిల్లాడికి తెలుగు నేర్పవూ? మన భాషని మనం కాకపోతే ఇంకెవరు బ్రతికిస్తార్రా" అని అడిగి కడిగేశాను. నాపిల్లలకి మాత్రం వాళ్లకి స్పానిషో, ఫ్రెంచో  ఏది ఇష్టమయితే  అది నేర్చుకునే  "ఫ్రీడం" ఇచ్చాను. పిల్లలని కనగలము  కానీ వాళ్ళ రాతలని తెలుగులో కనగలమా అని జోకేసి దాటేశాను.

ఆఫీసు లో తెలుగువాడు ఎదురుపడితే "హాయ్ మాన్! హౌ  ఇస్ ఇట్ గోయింగ్?" అని అడిగాను. మరి తెలుగులో మాట్లాడితే నొచ్చుకోడూ? అదే హిందీ  వాడు ఎదురైతే "కైసే  హో తుం భాయ్" అని "బోలా"ను. అలా అయితేనే మెచ్చి మేకతోలు కప్పుతాడు  కదా మరి.

ఎక్కిన ఎలివేటర్ లో తెల్ల వాడి ముందు తెలుగు మాట్లాడను గాక మాట్లాడను. అసలే ఆ తమిళ సోదరులని విసుక్కున్నట్టు నా తెలుగుని కూడా చీదరించుకుంటాడేమో! నా "ఆత్మా" భిమానం దెబ్బతిని పోదూ? అసలే తెలుగు జాతి మనది- నిండుగా వెలుగు జాతి మనది. 

మా పిల్లాడి వయోలిన్ కాన్సర్ట్ కి వెళ్లి దగ్గితే ఎక్కడ తీగలు బెదిరిపోతాయో అని గబా గబా బయటికి వెళ్ళానా, లేదా? సంగీతాభిమానం మరి. మన తెలుగు వెలుగు సంబరాల్లో నా మాటే కానీ ఏ పిల్లలు పాడిన పాటలూ వినపడలేదు. పోనిద్దురూ! ఇవాళ రేపు మన తెలుగు పాటలు వినేలా వున్నాయా అసలు? కనీసం ఇలా ఇగ్నోర్ చేస్తేనన్నా ఈ పిల్లలు వచ్చే ఏడాది పాటలు పాడడం మానేస్తారు. మనకీ సుఖం. వాళ్ళ అమ్మా నాన్నలకీ సంగీతం క్లాసులనీ, ప్రాక్టీసులనీ తిప్పే తిప్పలు తప్పుతాయి.

వచ్చేవారం ఇండియా వెళ్తున్నామండోయ్! అదొక తమాషా. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కుతానా అసలు మనింట్లో  ఉన్నట్టే వుంటుంది. పెట్టినవన్నీ తినేసి అలా కాళ్ళ దగ్గర పడేసుకున్నా అడిగేవాడు లేదు. పైగా ఫ్లైట్ ల్యాండ్ అవుతూ వుండగానే మన లగేజ్ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ! ఆ ఎయిర్ హోస్టెస్ మొత్తుకుంటూనే వుంటుంది లెండి- ఆ సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ అయేదాకా కదలొద్దు అని. మనం వింటామేంటి! ఆహా! మనకొకళ్లు చెప్పడం మనం వినడం అసలు మన జాతకం లోనే లేదు...హహ్హహ్హ! పైగా బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాసు కన్నా మనమే ముందు దిగిపోవచ్చు. అబ్బే! మీకు గుర్తు లేదూ శ్రీ శ్రీ ఏం చెప్పాడో - పదండి ముందుకు, పదండి తోసుకు అని .  మన పెద్ద వాళ్ళు చెప్పినది మనమే ఆచరించకపోతే ఇంకా పిల్లలకి ఏం నేర్పుతాం రేపు?

మరి లుఫ్తాన్స ఎక్కితే ఇంకో రకం గా ఉంటాను. వాడు రాస్తాడా ప్రతీ టాయిలెట్ సింక్ మీద  "మే వి అస్క్ యు టు వైప్  ది సింక్ క్లీన్ ఆఫ్టర్ యూస్ ఫర్ అథర్ పాసెంజర్స్ కన్వీనియెన్స్" అని ? మరి మనం పట్టించుకోకుండా వచ్చేస్తే ఎంత నామోషీ- మనం పల్లెటూరి బైతులు అనేసుకోడూ? అందుకే శుభ్రంగా తుడిచేసి వస్తాను. ఇంకా మిగిలినవన్నీ కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో చేసినదానికి పొంతన లేకుండా అన్ని రూల్సూ ఫాలో అయిపోతాను. అసలే జర్మనీ వాడి విమానం- వీపు మోత మోగించీ గలడు.

ఇంక ఇండియా లో దిగుతానా , ఆ ముంబై లో డొమెస్టిక్ ఫ్లైట్ ప్రహసనం వినండి మరి. ఆ పైలట్ గాడు రన్వే మీంచి ఎప్పటికీ విమానం కదపడు. అంతే ఒళ్ళు మండిపోయి వాడిని పిలిచి ఛడా-మడా తిట్టేశాను. ఏంటి అడుగుతున్నారు- ఇదే అమెరికాలో అయితే ఎం చేస్తానా అనా? ఏం చేస్తాను- నోరు మూసుకుని అంకీలు లెక్కెట్టుకుంటాను. ఇంక మన దేశానికొచ్చాకకూడా అలా ఉండాలంటే ఇంకెక్కడ మన మనసు విప్పి మాట్లాడతాము. అర్థం చేసుకోవాలి మరి మీరు!

మా వూళ్ళో ఖర్చు పెట్టడానికి చేతులు రావు. ఎక్కడ డాలరు తక్కువ ఉంటుందా అని కళ్ళు గుచ్చుకుని పేపర్ చిరిగేలా గాలించి చదివేసి, క్యూపాన్స్ (అవే లెండి లెద్దురూ కూపన్లు - మా "మెరక" దేశం లో అలానే అంటాము) చింపేసుకుని, ఒక వేళ ముందు రోజు డబ్బులు ఎక్కువ పెట్టి కొనేస్తే మళ్ళీ ఇవాళ వెళ్లి ఆ వాల్-మార్ట్ అమ్మాయికి నా చాంతాడంత లిస్టు ఇచ్చి అన్నీ రిటర్న్ చేసి మళ్ళీ ఈ రోజు ప్రైసింగ్ లో కొంటానా? ఎంత జాగ్రత్త పడకపోతే ఇండియా షాపింగ్ అవుతుంది మరీ? 

అదే ఇక్కడ అయితే నేనసలు ప్రైస్-టాగే చూడను. ఇంకేమైనా వుందీ - అసలే నా బాక్పాక్ కి ఇంకా లుఫ్తాన్స ట్యాగ్ ఉందండోయ్. అది చూసే కదా ఈ షాప్ వాడు ఏసి వేసి కోక్ ఇచ్చాడు. 

ఏంటో! మా "మెరక" దేశంలో తెలుగు మాట్లాడి, మాట్లాడి బోర్ కొట్టేసిందేమో ఇక్కడ ఫర్ ఎ చేంజ్, లెట్ మీ బీ మైసెల్ఫ్! ఓకే ! 

అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో, ఎన్నెన్నో! నాకే ఆశ్చర్యం వేస్తూ వుంటుంది నాలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా అని? ఏంటి దూకుడు సినిమా లో బ్రహ్మానందం గుర్తుకొస్తున్నాడా? వెరీ గుడ్! అలాక్కానీయండి మరి!

ఇంతకీ నేనేవరంటారా? ఇదిగిదిగో! బరువైన  పదాలు వాడి ఘనంగా ఉంటుందని నా గురించి ఒక కవిత రాశాను. చదివి మీరే తెలుసుకోండి ....

ద్వయీ భావంతో మెలిగే అద్వైతాన్ని 
నాకు నేనే అర్థం కాని అనర్థాన్ని 
నా వాక్కుని  నేనే ఖండించే వాదాన్ని 
వెరసి ఓ నయీ తత్పురుష సమాసాన్ని 
తలుచుకోదగని నస్మరంతి గాణ్ణి ...

~లలితా TS

అమ్మ చెప్పింది!

సెప్టెంబర్  "విహంగ"లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


నా చిన్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు అమ్మ వద్దని వారిస్తే "ఏం! ఎందుకు చేయకూడదు? మొన్నెప్పుడో నువ్విలాగే చేశావు కదా!" అంటే మా అమ్మ చాలా ఓపిగ్గా "పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయాలి కానీ చేసినట్టు కాదు" అని చెప్పేది. "అదే ఎందుకు?" అని రెట్టిస్తే "నీకు అమ్మ పెట్టేవి రెండూ పెడితే కానీ మాట వినేలా లేవు" అని ముద్దుగా విసుక్కునేది. మారాం చేసి ఇంట్లో మాత్రమే ఇలా చేస్తాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ మాటే వుంటాను అంటే "నక్క ఒకచోట ఊళలు పెట్టి ఇంకో చోట సంగీతం పాడదు" అని కట్టడి చేసేది. 

ఇదిగో ఈసారి  మా అమ్మ నేర్పిన ఆ అద్భుత పాఠము, మళ్ళీ ఆవిడే మప్పిన "అమ్మ పెట్టే  ఆ రెండిటి గురించి" చెప్పి, సంగీతం కాలేని ఊళల గురించి చెప్పేస్తానే మరి!!

చిన్నప్పుడు అర్థం కాలేదు కానీ చదువుల బడి లో, జీవితపు వేగంలో ఎన్నోసార్లు అమ్మ చెప్పిన మాటలు నిజమే కదా నిపించే ఎన్నో సంఘటనలు, అనుభవాలు. 

నేను బి. ఎస్సీ చదివేటప్పుడు పరీక్షలప్పుడు చాలా భయపడేదాన్ని - పరీక్షలో వచ్చే అన్ని ప్రశ్నలకీ జవాబులు వ్రాయగలనో , లేదో అని. అప్పుడు మా అన్న చెప్పేవాడు పాపం: కాలేజ్ మొదటి రోజునుంచీ చదువుకుంటే చివరికి సంవత్సరాంత పరీక్షలకి అంత గోళ్ళు కొరుక్కుంటూ చదవక్కరలేదని. అప్పటికి తన ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగంలో చేరిన క్రొత్త. నేను వెంటనే పెంకిగా "నువ్వు చదివావేంటి?" అని అడిగేదాన్ని. తను నవ్వేసి "నేను చేయలేదు కాబట్టే, ఏం కోల్పోయానో తెలుసు కాబట్టే నీకు చెప్తున్నాను" అని. నిజం కదా! ఆ మాట నాకిప్పటికీ "చద్దిమూట".

అలాగే పెద్దలు నేటి యువతకి సలహాలిస్తూ వుంటారు  - చెడు అలవాట్లకి దూరం గా ఉండమని. ఒకసారి అలవాటు అయినవి మానుకోవడం ఎంత కష్టమో అనుభవము వున్నవాళ్ళు కాబట్టి మీరైనా జాగ్రత్తపడి దురలవాట్లకి దూరంగా వుండండి అని తమ తర్వాత తరాలకి చెప్తూ వుంటారు. అలా ఎందుకు చెప్పారో అని వింటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. "నీతులు చెప్పే ముసలాళ్ళు-నిన్న మొన్నటి కుర్రాళ్ళు" అని ఆత్రేయ గారి పాట పాడేసుకుని తల ఎగరేస్తే మన గురించి అదే పాట పాడుకుని నవ్వుకోవడానికి మన తర్వాతి తరం సిద్ధంగా ఉండనే వుంటుంది. అందుకే మరి పెద్దవాళ్ళు చేసినట్టు చేయక చెప్పినట్టు విందామా మరి?!

సరే! వినకపోతే అమ్మ ఏం పెడుతుందో చూద్దామా? 

అనగనగా నాలాంటి ఓ అమ్మాయి. చక్కగా పెళ్లయింది. అత్తగారు కొత్తకోడల్ని మురిపెంగా చుట్టపక్కాలకి, చుట్టూ పక్కలవాళ్లకి చూపించుకుంటూ సాధ్యమయినంతవరకూ అమ్మాయి అమ్మ ఊసు ఎత్తి బెంగ పడకుండా వుంచడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఎంత చేసినా బొమ్మలాంటి అమ్మాయి మోములో నవ్వు పువ్వు పూయట్లేదని చూసి ఆ అత్తమ్మ ఎలాగైనా సరే అమ్మని మరిపించి కోడలు పిల్ల కళ్ళు మెరిపించాలని అనుకుని ఒకరోజు ప్రొద్దున్నే లేచి నవకాయ పిండివంటలతో వంట చేసి పెళ్లినాటి వెండి కంచంలో అరిటాకు వేసి అన్నీ వడ్డించి కొసరి కొసరి వడ్డించింది. ఎన్ని వేసినా, ఎంత పెట్టినా ఆ కోడలు పిల్ల "మా అమ్మ పెట్టే రెండూ కావాలి" అనసాగింది. అత్తగారు చాలా ఓపికగా "గారెలు రెండు వేయనా తల్లీ! పాయసం ఇంకో రెండు గరిటెలు వడ్డించనా? లడ్డు ఇంకో రెండు తింటావా?" అని ఎలా అడిగినా ఏం చేసినా అమ్మాయి దృష్టి అంతా "అమ్మ పెట్టే రెండిటి" మీదే. ఇంక విసిగిపోయిన అత్తగారు కోడలిపిల్ల నెత్తి మీద రెండు మొట్టిందండి (నయం! ఈరోజుల్లో అత్తాకోడళ్ళు కాదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కావలసినంత కాలక్షేపం టివిల వాళ్లకి, పత్రికల వాళ్లకి - బ్రేకింగ్ న్యూస్: అత్త పెట్టిన హింస-లేచిన కోడలి హంస" అని అర్థం పర్థం లేని శీర్షికతో). అత్తగారు అలా మొట్టీ మొట్టగానే ఆ కోడలుపిల్ల "ఆ! ఇవీ మా అమ్మ పెట్టే రెండూ" అని హాయిగా భోంచేసి లేచ్చక్కా పోయింది- కిల కిలా నవ్వుకుంటూ. అవండీ  మా అమ్మని విసిగిస్తే ఆవిడ నాకు పెడతాననేవి. అనేదే కానీ పాపం ఎప్పుడూ చల్లటి దీవెనలే పెట్టింది, కానీ ఆ రెండూ కానే కాదు.

ఇంక ఊళలు-సంగీతం గురించిన ఓ పిట్ట కథ. అనగనగా ఒక అబ్బాయి. వాడు ఒక మాదిరి టౌన్ లో చదువుకునే వాడు. శలవులకి అమ్మమ్మ-తాతగారు వున్న పల్లెటూరికి వెళ్ళేవాడు. వెళ్లేముందు వాళ్ళ అమ్మా-నాన్న చిలక్కి చెప్పినట్టు చెప్పేవారు - తాతగారి దగ్గర పొల్లు మాటలాడకూడదని, ఆయన నొచ్చుకుంటారని - మరి వాడు నోరు తెరిస్తే అన్నీ చెడ్డ మాటలే. వాడు "అన్నిసార్లు చెప్తారేం నాన్నగారూ! నాకు తెలియదా ఎక్కడ ఎలా ఉండాలో" అని అభయమిచ్చి వెళ్ళేవాడు. వెళ్ళిన మొదటి  పూట అతి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడాడు. ఆ రాత్రి ఆ కబురూ, ఈ కబురూ చెప్పుకుంటూ ఆరుబయట తాతగారి మంచం ప్రక్కన  మంచం వేసుకుని పడుకున్నాడు. ఇంతలో ఆదమరుపుగా నిద్ర పట్టబోతున్న సమయంలో చురుక్కుమని దోమ కుట్టడంతో చటుక్కున లేచి పెద్ద గొంతుతో: "ఈ దోమను తగలెయ్య! కుట్టి చంపేసింది. దీని పీక మీద కాలేసి తొక్కి చంపీయాలి" అనేసి మళ్ళీ పడుకుండి పోయాడు. చూశారా? ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్డామన్నా అసలు బుద్ధి సహకరించక ఎలా బయట పెట్టేసిందో? అందుకే అమ్మ చెప్పింది- మొదట్లోనే మంచి అలవాట్లు చేసుకోవాలి. ఇంట్లో ఇలానే వుంటాను, ఎక్కడికో వెళ్తే మార్చుకుంటాను అంటే అది అంత సులభం కాదు. నక్క ఒక చోట ఊళలు పెట్టి ఇంకో చోట సంగీతం పాడదూ" అని.

మా అమ్మ చెప్పిన కొన్ని వందల జీవిత పాఠాల్లో ఇవి కొన్నే - కానీ ఎప్పటికప్పుడు మనసుకి దన్నుగా నిలిచినవి.

“స్నేహ” రత్నాల కోసం…

జూన్  "విహంగ"లో నా కవిత  ఇక్కడ చదవండి.


స్నేహం

ఇరుగింట్లో, పొరుగింట్లో, బడిలో, గుడిలో

బువ్వలాటల్లో, కాకెంగిలి పంపకాల్లో

శ్రీరామ నవమి పందిట్లో నాలుగుస్తంభాలాట ఆడే వేళల్లో

నేలా-బండా ఎక్కి దిగే వేళల్లో

ఆగస్టు పదిహేను ఊరేగింపుల్లో

తప్పు ఎక్కాలకి ఉత్తుత్తి చెంపదెబ్బల్లో

మాష్టారింట్లో  కోడిగుడ్డు దీపం వెలుతుర్లో

సవర్ణదీర్ఘాది సంధులు, పైథాగరస్ సూత్రాల వల్లెల్లో

అమ్మ కోప్పడితే  తుడిచే కన్నీరులో

సాయంకాలం రామాలయపు అరుగుల మీద

తెలియని ఓదార్పునిచ్చిన  భగవద్గీత శ్లోకాలలో

కోతికొమ్మచ్చి కొమ్మల్లో, తొక్కుడు బిళ్ళాటలో

ఒప్పులకుప్పల్లో , చెమ్మచెక్కల్లో

శివరాత్రి జాగరణలో, అట్లతద్ది దాగుడుమూతలాటల్లో

నెల పట్టిన సంక్రాంతి ముగ్గుల్లో, గొబ్బి తట్టే వేళల్లో

వినాయకుడికి పత్రి కోసే వేళల్లో

అమ్మ పూజకి నందివర్ధనాల్ని ఎంచే వేళల్లో

పరీక్ష ముందు భయంలో పరీక్షలయిపోయిన సంబరంలో

వేసవి శలవుల్లో దొంగా-పోలీసు అయిన వైనాల్లో

మల్లెపూల జడల మురిపాల్లో, మొగలిరేకుల్లో

యవ్వనపు తొలిరోజుల చిరు రహస్యాలలో

మలి నాళ్ల భావోద్రేకాల్లో

ఎండల్లో, వానల్లో, చలిలో

మబ్బులు ముసురు పట్టిన వేళల్లో

రాత్రి లో, పగటిలో, కష్టం లో, సుఖం లో

ఎప్పుడూ నాతోనే వున్నావు

ఎక్కడ వెదికితే అక్కడే దొరికావు

అప్పుడప్పుడు చేయి విడిచినా

నిన్ను అందుకోవటం ఎలాగో నేర్పావు…

ఎవరూ నువ్వని ఎవరైనా నిన్నడిగితే

చెప్పు…స్నేహం!

నాకు నువ్వే చెలిమీ, కలిమీ, బలమని.

- లలితా TS


ప్రవాసాంధ్ర భాషా జీవ నాడి - తెలుగు నాడి



మే  "విహంగ"లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


(ఉత్తర అమెరికాలో ఉన్నత విలువలతో మేలైన కాగితం వుపయోగించి ప్రచురింపబడుతున్న "తెలుగునాడి" గురించి పరిచయ వ్యాసం ఇది.)

నిన్నా మొన్న మొదలైనట్టుగా వున్న పిల్లల స్కూల్ ఇయర్ ఇంకో నెల రోజుల్లో తరగతి  మార్చుకోవడానికి పరుగులు తీస్తోంది.  బడులలో పరీక్షల హడావిడి, ర్షాంతపు వేడుకల సందడితో మార్చ్ 21 న మొదలైన ఉత్తర అమెరికా వసంత కాలం  తన ఉత్సాహాన్ని ఈ బడి ఉత్సవాల్లో నింపినట్టు అనిపిస్తోంది. ఈ కోలాహలాన్నంతా చూస్తూ ప్రతీ సారి  లాగే మళ్ళీ ఒక్కసారి గడిచిపోయిన బడి రోజులు, వేసవి శలవులని గుర్తు చేసుకున్నాను. ప్రస్తుతానికి జరుగుతున్న కాలాన్ని- ఆట్టే శ్రమ పడకుండానే లభించే చిన్ని చిన్ని ఆనందాలని ప్రోగు చేసుకుంటూ - అనుభవిస్తూ, ఆస్వాదిస్తున్నా వెనకటి రోజులు తలచుకున్నప్పుడు మళ్ళీ మనసు ఉత్సాహపు క్రొత్త చిగుర్లు వేస్తున్నట్టే అనిపిస్తుంది. 

వేసవి కాలం వస్తూనే రోజుని పెద్దది చేసి, బడి సమయాన్ని చిన్నదిగా చేసేది - ఒంటి పూట బడులతో. ఆ ఎండ వేళల మధ్యాహ్నాల ఎండ వేడిని తెలియనీయకుండా "బాల మిత్రులతో" "చందమామ" వెన్నెల్లో కట్టిన "బొమ్మరిల్లులతో" మొదలుపెట్టి వేసవి శలవులలో నాన్నమ్మ కి చదివి వినిపించే ఆంద్ర పత్రిక ధారావాహికల దాకా  పుస్తక  పఠనా ప్రస్థానం జరిగిపోతూ వుండేది.   

అమ్మ, నాన్నలు ఇరుగు పొరుగు వారితో చెప్తుంటే విని, నేర్చుకున్న "ఇంటికి" అనే మాటని ఆరిందాలా వాడుతూ, శ్రీ రామ నవమి పందిరిలో నాలుగు స్తంభాలాట ఆడుతూ "మేము వచ్చే ఆదివారం ఇంటికి వెళ్తున్నామోచ్" అని అరుచుకుంటూ, ఎప్పుడెప్పుడా అని రోజులు లెక్కపెట్టుకుంటూ ఆ "ఆదివారం" రాగానే బస్సెక్కి కోనసీమ లో మా పెదనాన్నగారింటికి వెళ్ళడం వేసంకాలపు వెచ్చనైన జ్ఞాపకం. మా పెదనాన్నగారు రెండు తెలుగు దినపత్రికలు, ఆంగ్ల దినపత్రిక - ది హిందూ,  పిల్లలకి చందమామ, పెద్దలకి ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ వార పత్రికలు, స్వాతి, యువ మాస పత్రికలు, ఇంట్లో కాలేజ్ వయసు పిల్లలు చదవడానికి సితార, జ్యోతి చిత్ర తెప్పించే వారు. ఇవి కాక ఇంటి అలమారుల్లో ఎన్నో గ్రంథాలు, నవలలు...ఇవి, అవి అని కాకుండా అన్ని వయసుల వారికీ, అభిరుచులకితగిన పుస్తకాలు ఉండేవి. బహుశా ...అప్పుడే పుస్తకాలతో నా చెలిమి మొదలయిందేమో. 

ఇంట్లో నలుగురం- నేను, నాన్న, శ్రీనన్న, నాన్నమ్మ - శుక్రవారం కోసం తెగ ఎదురు చూసేవారం. ఆరోజు వార పత్రికలు నాలుగు వచ్చే రోజు. పేపర్ అబ్బాయి వచ్చే సమయానికి ఎవరు అరుగు మీద  వుంటే వాళ్లకి దక్కే అక్షరాలా అక్షరాల పెన్నిధి. సాధారణంగా నేనో, శ్రీనన్నో వుండేవాళ్ళం. శ్రీనన్న వున్న రోజున తను తన చేతికి వచ్చిన అన్ని పుస్తకాలని ఒక దాని మీద ఒకటి దొంతరగా పెట్టుకుని సావిట్లో పడక్కుర్చీలో కూర్చుని గబా గబా కళ్ళజోడు సర్దుకుంటూ "శ్రీ రామ నుంచి చిత్తగించవలెను" దాకా అన్నట్టు అట్ట మీద బొమ్మ మొదలు ఆఖరి పేజీ రీటా ప్రకటన దాకా చదివితే గానీ ఒక్కో పుస్తకం ఇచ్చేవాడు కాదు. తను ఒక పుస్తకం చదివి ఇవ్వగానే ఆ క్రొత్త కాగితాల కానుకని  తెరిచి ముక్కు మధ్య పేజీ లో పెట్టి గాఠిగా వాసన పీల్చి అరమోడ్పు కన్నులతో పుస్తకం తెరిస్తే ప్రక్కనే పెట్టిన ప్లేట్లో తరిగే జంతికల, దేవుడి పెళ్లి గారెల సాక్షిగా పుస్తక నోత్సవం సాగేది.

అలా మొదలుపెట్టిన పుస్తకాల స్నేహం నిరాటంకంగా సాగింది 2000 సంవత్సరం వరకూ. తేట తెలుగుతో బాటు ఇష్టం గా నేర్చుకున్న (నేర్చుకోగలిగిన) కన్నడ కస్తూరి ఘుమ ఘుమలూ, ఆంగ్ల సాహిత్యమూ  ఆస్వాదిస్తూ వున్న సమయంలో మాతృదేశం వదిలేయడమే కాక మాతృ భాష లో పుస్తకం చదవగలిగే అవకాశం దూరమయింది - ఉద్యోగ నిమిత్తం వలస రావడం వల్ల. ఉత్తర అమెరికా వచ్చిన క్రొత్తలోఅంతర్జాలం లో వెతుకుతూ వుంటే సిడ్నీ - ఆస్ట్రేలియా నుంచి భాస్కర రావు గారు నడిపే ఈ-పత్రిక కనిపించింది ఒకసారి. అంతే - పోగొట్టుకున్న ప్రియమైనదేదో దొరికిన భావన. ఒక్కో కథని, వ్యాసాన్ని గబగబా చదివేస్తే తొందరగా అయిపోతాయి అని రోజుకి ఇంతే చదవాలి అనుకుని కొంచెం కొంచెం గా చదివేదాన్ని. ఆన్లైన్ లో ఎంత చదివినా పుస్తక స్పర్శ లేని లోటు లోటుగానే వుండేది. 

2005 లో అనుకోకుండా మిత్రులని కలవడానికి షికాగో వెళ్ళినప్పుడు అక్కడ అందమైన పరికిణీ-ఓణీ  వేసుకున్న ఆడపిల్లలాంటి, క్రొత్త పెళ్లి కూతురులాంటి, పండు ముత్తైదువ లాంటి, పూలతో నిండిన చెట్టులాంటి - ఇన్ని విశేషణాలు చెప్తున్నానంటే ఎంతో అపురూపమయినది కనిపించి వుంటుంది అని మీకనిపిస్తోంది కదూ :) అవును - ఫెళ ఫెళ లాడే కాగితాలతో, బోల్డన్ని కథలూ కబుర్లతో ముస్తాబయిన "తెలుగు నాడి" అనే అమెరికా తెలుగు పత్రిక కనిపించింది. వెంటనే అస్సలు మొహమాట పడకుండా అడిగి తెచ్చేసుకున్నాను మా ఇంటికి.  అప్పటినుంచీ ఇప్పటిదాకా మా ఇంటి తేనీటి బల్ల తెలుగు నాడ్యాలంకృతయై భాసిస్తూనే వుంది.

2005 నుంచి 2009 దాకా తెలుగునాడి జంపాల చౌదరి గారి సంపాదకత్వం లో వెలువడేది. ఉత్తర అమెరికాలో తెలుగు వారు చాలా మందే వున్నా- తెలుగునాడి గురించి అంతగా ఎవరికీ తెలియకపోవడం వల్ల, తగినంతమంది  చందాదారులు చేరకపోవడం వల్ల, ఆర్ధికంగా ప్రోత్సాహం లేక - కృష్ణుడు కర్ణుడి మరణానికి "నా చేతను ...నీ చేతను...వరమడిగిన కుంతి చేతను..." అని చెప్పినట్లు అనేక కారణాల వల్ల 2009 జూన్ నెలలో తెలుగునాడి నిలిపివేశారు. అప్పుడే చిగురులు వేస్తున్న తెలుగు మొక్కకి నీరందక వాడినట్టు అయింది. తర్వాత మళ్ళీ డిసెంబర్ 2009 నుంచీ కృష్ణ కుమార్ గారి సారధ్యంలో, వాసిరెడ్డి నవీన్ గారి సంపాదకత్వంలో తెలుగునాడి పునరుద్ధరింపబడింది - ద్వైమాసిక పత్రికగా. 

ఇంతకీ తెలుగునాడి లో ఏమేమి విశేషాలుంటాయో నేను చెప్పనేలేదు కదూ...సరే మరి... ఈ క్రింది జాబితా చూసేయండి మీకే తెలుస్తుంది....
*ప్రత్యేక వ్యాసం  - మన రాష్ట్రంలో, రాజధానిలో ఏదో ఒక ప్రదేశాన్ని/ సంస్థని /  విశేషాన్ని గురించి అన్ని వివరాలతో ఆసక్తికరమైన పరిచయం
*శ్రీధర్ గారి రాజకీయ కార్టూన్లు
*రాజకీయ నాడి - రాష్ట్ర ప్రస్తుత రాజకీయ వేదిక గురించి వేడియైన, వాడియైన వ్యాసం
*వ్యక్తిగతం - మన రాష్ట్రంలో పుట్టి  జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన గొప్ప వ్యక్తుల పరిచయం
*కథలు - ముచ్చటగా మూడు - రాష్ట్ర వాసులైన రచయితలు వ్రాసే కథ ఒకటి; ప్రవాసాంధ్ర ప్రముఖులు వ్రాసే "అమెరికా కథ";  పాత పరిమళాలని మళ్ళీ నెనపుకి తెచ్చే "అలనాటి కథ"
*సరదా గళ్ళు - మెదడుకి పదును పెట్టే తెలుగు పదబంధం 
*బాలల కోసం - తాత్పర్య సహిత సుమతీ శతక పద్యం; ఒక తెలుగు సామెత - అది ఎందుకు, ఎలా వాడుకలోకి వచ్చిందీ; ఒక నీతి కథ; "పాటలంటే మాకిష్టం" అంటూ ఆటలలో పిల్లలు పాడుకునే పాట; ఒక బుజ్జి పాపడి స్వగతాలతో "బాల కార్టూను"
*నవ్వుకుందాం - అంటూ సరదాగా నవ్వించే హాస్యపు చెణుకులు 
*పాపినేని శివశంకర్ గారు నిర్వహించే నెల నెలా ఒక పద్యాన్ని పరిచయం చేసే శీర్షిక
*ధర్మ సందేహాలు - రామాయణ, మహాభారత, భాగవతాల గూర్చిన సందేహాల గురించి మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి సమాధానాలు 
*బూదరాజు రామకృష్ణ గారు నిర్వహించే తెలుగు మాటలను, జాతీయాలను పరిచయం చేసే శీర్షిక 
*నవలా పరిచయం - శీర్షికన పాత, క్రొత్త నవలా సమీక్షలు
*నివాళి - కీర్తిశేషులైన ప్రముఖుల ప్రస్తావన 
*కదిలే బొమ్మల కబుర్లు - సినిమా ప్రియులని అలరించే చలన చిత్ర విశేషాలు
*సినిమా సమీక్షలు
*కూనిరాగం - ఆపాత మధురాలలోని ఒక ఆణిముత్యం లాంటి పాట 
*ఇంకా బాపు గారి కార్టూన్లు.....

ఆంధ్ర దేశంలో వెలువడే అన్ని దిన, వార, మాస పత్రికలలోని ఆణిముత్యాలలాంటి కథలు, వ్యాసాల సమాహారంగా వెలువడే "తెలుగునాడి" నాలాంటి పుస్తక స్పర్శా ప్రియులకి దాచుకోవలసిన పెన్నిధిలా అనిపిస్తుంది.