29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ప్రవాస జీవనపు వంటింటి-కల్పభూజం

ఆ రోజులు - అల్లప్పటి రోజులు - అవెలాంటి రోజులంటే...
చెట్టుమీద మామిడి కాయ సరాసరి పప్పులోకి డుబుక్కుమని దూకే రోజులు
తీగమీంచే బుల్లి బుల్లి  కాకరకాయలు పచ్చలు పొదిగినట్లు హెచ్చులు పోయే రోజులు
నవనవలాడే వంకాయలు ఏ నవకాయపిండివంటలూ మా సాటి కావని కొమ్మ చిటారున చులాగ్గా మిలమిలలాడే రోజులు
పుష్యరాగం వంటి లేత అరటి దూట నున్నగా, వైఢూర్యాల దొంగాళ్ళు-పిల్లేళ్ళు ఊదారంగు దొప్పల్లో పొదువుకున్న అరటిపువ్వు మిన్నగా వంటింట కళకళలాడే రోజులు
తల్లి-పీచుపీచు, పిల్లలు-రత్నమాణిక్యాలు లేని -  తండ్రి-గరగరల కూర-పనసకాయ విరవిరలాడే రోజులు
తోటకూర మడిలోనే ఓ పక్కగా చిట్టిచిట్టి తలలూచుతూ వుండే కొత్తిమీరని ముక్కులతోనే వెతికే పట్టేసే రోజులు

తోటలో వనలక్ష్మిలా తిరుగుతూ మా చెల్లాయత్త - ఈ పూటకి ఏం వండుకుందామర్రా? - అని కూడా వున్న పిల్లసైన్యాన్ని అడుగుతూ - ఆ పూటకి కావల్సిన కూరలన్నీఒడినింపుకుని వంటింటి అరుగు మీద - పప్పులోకి ఇది, కారం పెట్టిన కూరకైతే అది, దీంతో పచ్చడి చేసుకుందామే- అంటూ శాకాలన్నిటినీ పంపకాలు చేసి - చివరాఖరుకి - మన చంద్రావతి ఇంటికి వెళ్ళి రావాలర్రా మీరు - అంటే ఎందుకబ్బా అంటే - మా ఇంటి పెరట్లో లేని రెండు చెట్ల ఆకులకి - దబ్బాకులకి, కరివేపాకు రెబ్బలకి.

ఏ వేళలో చంద్రావతి ఇంటికి వెళ్ళినా మేడమెట్లెక్కి పైకెళ్ళి ఆ మేడమీద ఎప్పుడూ తాళమేసి ఉండే బొమ్మలగది దర్శనం మాకొక అదనపు లాభం. అందుకని చంద్రావతి ఇంటికి వెళ్ళడానికి మేమెప్పుడూ సిద్ధమే. ఎక్కడికెళ్ళడానికి కాదూ - అని దీర్ఘం తీసి అడిగితే - ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పాలి మరి! ఆడే కాలు - పాడే నోరు బహు చురుగ్గా వుండే ఆటపాటల రోజులవి.

ఈవలనున్న అమ్మమ్మ ఇంటినుంచి రోడ్డుకావల వున్న చంద్రావతి గారింటికి - కాలు మార్చి కాలు మీద కుంటుకుంటూ, గెంతుకుంటూ వెళ్ళి - పెద్దపెద్ద స్తంభాల అరుగుల మధ్యనున్న బోల్డన్ని మెట్లెక్కి -మహా బరువుగా వుండే సింహద్వారపు తలుపొకటి తెరిచి లోపలికెళ్తే - తన ఇద్దరు కూతుళ్ళు - మిస్సమ్మ, బేబీతో కలిసి నవ్వుతూ మమ్మల్ని - రండమ్మా రండి ఎప్పుడొచ్చారూ, సెలవులా , ఉంటారా ఓ పద్రోజులూ? - అని పరామర్శిస్తూనే - ప్రసాదుగారి మేనకోడళ్ళొచ్చారు- అని - దబ్బాకులూ, కరివేపాకేనా? - అని అంటూనే పెరట్లో పక్కపక్కనే వున్నదబ్బ, కరివేప చెట్లనుంచి ఆకులు, రెబ్బలు దూసి ఇచ్చేవారు.

ఈలోగా మేమొకసారి మేడమీదకి మిస్సమ్మతోనో, బేబీతోనో ఒక్కసారి వెళ్ళి - అక్కడ ఓరగా తెరిచివున్న కిటికీలోంచి - లోపల అలమారుల్లో, నేలమీద  - పరుచుకుని వున్న బోల్డన్ని మట్టిబొమ్మలు, చెక్కబొమ్మలు, చందనపుబొమ్మలు, నాలుగ్గిన్నెల ప్లాస్టిక్ టిఫిన్ క్యారియర్లు, ఇత్తడి డేగిసాలు, లక్కపిడతలు - ఓహ్ ! ఒకటి కాదు రెండు కాదు - కనుచూపు సోకినంత మేరా - ఎటు చూసినా బొమ్మలే.

కళ్ళనిండా ఆ బొమ్మలు నింపుకుని - ఘుమఘుమలాడే దబ్బాకులు, కరివేపాకు పట్టుకుని మళ్ళీ గెంతుకుంటూ ఇంటికి వచ్చేసేవారం.

మా లక్ష్మిదొడ్డ  కవ్వంతో చిలికిన వెన్నమజ్జిగలో, తరవాణి కుండలో దబ్బాకులు పోచి చల్ల-అమృతం తయారు చేస్తే,  ఉడికించిన కందిపప్పు, పోపు రుబ్బి అరటికాయ, ఆనపకాయ వేసి - కళపెళలాడే  సాంబారులో, కొబ్బరి తియ్య పచ్చడిలో కరివేపాకు దూసి వేసి మా చెల్లాయత్త తనవంతు పుల్ల-అమృతం వండే వారు.

అద్దీ - తెలిసీ తెలియని వయసులో అలా మొదలైన కరివేప సావాసం - తరవాత్తర్వాత మా అమ్మ నాకోసమని - నాకిష్టమని ఇష్టంగా వండే వంటల్లో కరివేపాకు మెరుస్తూ, ముక్కుని మురిపిస్తూ ఉండేది.

అప్పటి రోజుల్లో - ఏ రోజు కూరలు ఆ రోజు తాజాగా కొనుక్కునే రోజుల్లో - చిన్నప్పుడు గిద్ద బియ్యానికి గుప్పెడు కరివేపాకు  అంటూ కూరలు తెచ్చే సుబ్బమ్మ బేరాలతో తెల్లారేది. వస్తుమార్పిడి గురించి అదొక దృష్టాంత సహిత ప్రయోగాత్మక పాఠం.

ఆ తర్వాత కొంచెం హెడ్డు పైకొచ్చి హైస్కూల్ రోజుల్లో సెలవులకి హైద్రాబాదు వెళ్ళినప్పుడు - అమెరికా వెళ్తున్నామని ఎవరైనా చెప్పినా,  ఇంకెవరో వెళ్తున్నారని తెలిసినా - వెంటనే పురుషోత్తం బాబయ్య - "అమెరికాలో కరివేపాకు దొరకదు , తప్పకుండా పట్టికెళ్ళండి" - అని మరీ మరీ చెప్తుంటే - ఆయన మాటలకి అందరితో పాటు నేనూ సరదాగా నవ్వేసేదాన్ని.

ఆడుతూ పాడుతూ పెద్దయ్యి - పెళ్ళయ్యి - వంటింటి-రాజ్యానికి ఏకచత్రాధిపతి నమూనాలో అనేక-పాత్రాధిపత్నిని అయ్యాక నా వంటల్లో కరివేపాకు ధారాళముగా - కరివేప ఆకుంది కొమ్మాలేకుండా పులిహోర సాంబారు ఘుమఘుమలాడాయి - అని దేవులపల్లి వారి గోరింటాకు-పాట వరసలో  పాడేసుకుంటూ దూసేసి వాడేసేదాన్ని.

అప్పటివరకూ కథలో పెద్ద మలుపులేవీ లేవు - కలుపుకున్న అన్నంలో కందని వేళ్ళకందిన ఆకుని కూరలో కరివేపాకులా - టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌లా - తీసిపారేయడమే.

అలా అలా - కాలం జరిగి మేము గాల్లో ఎగిరి - ప్రవాసం వచ్చామా - అప్పుడు మొదలయిందిక ఒక మెలిక.

ఈ నేల బట్టో , నేలలో వేసిన విత్తు బట్టో, రకరకాల దేశాల వెరైటీ వెరైటీ వంగడాల వల్లో  - ఏ శాకమూ అంత రుచిగా అనిపించేది కాదు. ఉన్నంతలో కరివేపాకు వేసిన వంటలు కొంచెం తినబుల్‌గా ఉండేవి.

అప్పుడర్థమయ్యింది - పురుషోత్తం బాబయ్య చేసిన కరివేప-ఆవశ్యక-ఉపదేశం.

వలసపక్షులమై ఎగిరొచ్చిన తొలినాళ్ళలో - మేమున్న చోట ఇండియన్‌స్టోర్లు అంతగా ఉండేవి కాదు. ఉన్న ఒకటీ రెండు కొట్లలో వడిలిపోయిన వంకాయలు, ఎండిపోయిన కరివేపాకు, పండిపోయిన కొత్తిమీర, సెల్-బై-డేట్ దాటి పుష్కరమైన గ్లూకోన్-డీ ప్యాకెట్లు ఉండేవి.

అందుకని కొంచెం దూరమైనా చైనావాళ్ళో - వాళ్ళలా వుండే మరేవాళ్ళో - నడిపే గ్లోబల్ ఫుడ్స్ అనే నానాదేశ-సరుకులు, కూరలు దొరికే అంగడికి వెళ్ళేవాళ్ళం.

అక్కడ ఆకుపచ్చ ఫోమ్-ట్రేలలో అందంగా  పేర్చి అమర్చిన కూరలు, ఆకుకూరలతో పాటు - ఒక పక్కగా - పదంటే పది రెబ్బలకి ఒక్కింటికీ పదేసి చొప్పున ఆకులతో అక్షరాలా-అంకెలారా వందంటే వంద ఆకుల కరివేపాకు పాకెట్టు ముత్యం-మూడ్డాలర్లకి కొనుక్కుని నలక్కుండా భద్రంగా ఇంటికి తెచ్చుకునేదాన్ని.

ఆ వందాకుల-కరివేపాకు - రెండు వారాల - అంటే పధ్నాలుగు రోజుల - అందులో కొన్ని పొద్దున్న ఫలహార వేళల  మినహాయించి - దాదాపు ముప్పైరెండు పూటల వంటకి - అనగనగా పూట వంటకి సరిగ్గా మూడాకుల లెక్కతో - వాడాలి అన్నది ఖచ్చితమైన ప్రణాళిక.

ఎప్పుడైనా పొరపాటున ముందుగా అయిపోతే మళ్ళీ కరివేపాకు తెచ్చుకునేదాకా వండిన ప్రతి  పదార్థమూ ప్రతిపదార్థాలు అర్థం కాని పద్యంలా, అసలు అర్థమే లేని శబ్దంలా - అనుకున్న రుచిలో కాకుండా ఇంకేదో రుచిలో ఏదేదోలా అనిపించేది.

మమ్మల్ని చూద్దామని, మాతో ఉందామని, మా పిల్లల ఆటపాటల్ని కనులారా కానీ, చెవులారా విని ఆనందిద్దామని అమెరికా వచ్చి - "చేసినన్నాళ్ళు చేశారు - మీరు హాయిగా కూర్చుని నేను వండింది తినండి" - అంటున్నా వినకుండా - మాకేదో వండి పెట్టేద్దామనుకుని హడావిడి పడుతూ మా అమ్మో, అత్తగారో - ఫ్రిజ్ తెరవగానే - వాళ్ళు ఏ కూర తీసినా అంతగా పట్టించుకోని నేను - కరివేపాకు దగ్గరకొచ్చేటప్పటికి - అసలు ఆ ట్రే మీద అతికించిన ప్లాస్టిక్ wrap ఎంత జాగ్రత్తగా తీయాలీ  - అందులోంచి రెండంటే రెండో, మరీ అంతగా కావాలనుకుంటే మూడో ఆకులు సున్నితంగా ఎలా ఈనె నుంచి వేరు చేయాలో - చెప్తూ అదేదో కరుణశ్రీ వారి పుష్పవిలాపం శైలిలో

నేనొక ప్లాస్టిక్కు ట్రేని తెరిచి - సుతారపు ఈనె వంచి 
గోరానిచి  మెల్లిగాను - ఆకునొక్కటి తుంచినాను

అన్నట్టు- కరివేప-పత్ర-పర్వరీణ-విమోచనా-విలాసము చూపుతుంటే మా అమ్మ తన పక్కనున్న మా అత్తగారితో అననే అంది - "మా లల్లి కరివేపాకు ఇచ్చే వరస చూస్తుంటే అదేదో సినిమాలో అల్లురామలింగయ్య - పూట వంటకి సామాన్లు కొలిచిస్తాడూ వాళ్ళావిడకి - అది గుర్తొస్తోందీ" - అంటూ.

ఇంక బదరి అయితే - "మా ఇంట్లో బంగారమైనా డ్రెస్సర్ మీదో, టేబుల్ మీదో - ఎక్కడపడితే అక్కడ వదిలేస్తాం కానీ కరివేపాకు మాత్రం భద్రంగా చలి తగిలి కమిలిపోకుండా బోల్డన్ని ప్లాస్టిక్కు పొరల్లో భద్రంగా దాచిపెడతాము" - అంటూ ఎంతో ముచ్చటగా నా కరివేపాకు-సంరక్షణ ముచ్చట చెప్తూ వుంటారు.

ఒకసారి ఇలాగే మూడేళ్ళ క్రితం దసరా-బొమ్మలకొలువు పేరంటానికి పిలిచారని మా ఇంటి దగ్గర వుండే ఒక తమిళవీట్టుకెళితే వాళ్ళింట్లో కొలువై వున్న కరివేప్పిలై మరం చూసి మరం-మరం- రొంబ మనోహరం అనేసుకుని - "కరివేప్పిలై ఎనక్కు పిడికుదు - నీంగ ఎనక్కు కొడుక్కిరాంగ? "- అని వచ్చీరాని అరవంలో అరవకుండా అడిగితే - ఆ వీడావిడ ఆవిడ మాట్లాడే అసలరవంలో మాట్లాడితే నాకేమీ అర్థం కాదని గ్రహించినదై - తమిళింగ్లీషులో ఏమందంటే - "రేపో కుండీలో మట్టి పోసుకుని తే - నేను మొక్క పెట్టి ఇస్తాను - చేతికి ఇవ్వను - జాగ్రత్తగా వేళ్ళు నలక్కుండా వేస్తేనే బతుకుతుంది" - అని చెప్తే భయభక్తులతో కళ్ళు విప్పుకుని చెవులప్పగించి విని తల గట్టిగా ఊపి - రెండోరోజు ఆవిడ చెప్పినట్టే కుండీలో మట్టి పోసుకెళ్ళి కరివేప-మరపు-సిరిని మా ఇంటికి తెచ్చుకున్నాను. ఇస్తూ ఇస్తూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఆవిడ అననే అంది - "నువ్వేదో అరవంలో అడిగావని ముచ్చటపడి ఇస్తున్నాను కానీ తల్లి మొక్కని వీడి ఈ పిల్ల మొక్కలు బతుకుతాయో లేదో - Kariveppilai is very sensitve you know"- అంటూ.

నా అతి జాగ్రత్త ఎక్కువయ్యో, లేక అరవావిడ వాక్కు ఫలించో - ఆ రెండు పిల్ల-కరివేప్పిలై మొక్కలూ వారం తిరిగేటప్పటికి తలలు వాల్చి, ఆకులు రాల్చి - శిశిరానికి చోటిచ్చి శీతవేళకి సమసిపోయాయి.

ఆ తర్వాత - ఇండియన్ స్టోరులో దొరికిందని ఇంకో మొక్క తెచ్చి వేసినా - అదీ తలా వాల్చేసి ఆకులు రాల్చేసింది.

నాకింక హరితాంగుష్ఠం లేదని నిశ్చయించుకుని కరివేప-మొక్క-పెంచుట కార్యక్రమానికి ముక్తాయింపు పలికాను.

నాకు అతి పెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే - వారానికో, రెండు వారాలకో వెళ్ళే కూరల అంగడిలో. అలాంటి ఒకానొక రోజు - కూరలు కొంటున్న నా దగ్గరికి వచ్చి - కన్నడాలో పలకరించి - కూరలబుట్ట-సహిత-నన్ను - "వరలక్ష్మీ హబ్బక్కె హరిశిణ-కుంకుమ తొగొళ్లక్కె నమ్మనేగె బన్ని" - అంటూ ఆహ్వానించిన శాంతి ఇంటికి పేరంటానికి వెళ్ళాను.

శాంతి పెట్టిన పుళియోగిరె తింటూ బావుందంటూ ఉండగా నా కంట పడింది పుట్టు-కరిబేవు-సొప్పిన మర.

తను చెప్పే మాటలకి నేను తలూపుతున్నా నా చూపెక్కడో ఉందని కనిపెట్టిన శాంతి నా కంటి-చూపుల వెంట గీత గీసుకుంటూ వెళ్తే అది కరిబేవు దగ్గర ఆగిందని తేలింది.

వెంటనే - నేనడక్కుండానే - గబగబా రెండు మొక్కలు తీసి ఒక తడిపిన కిచెన్ టవల్‌లో చుట్టి నాకిచ్చింది - శనగల వాయనంతో పాటు. 

దాన్నలాగే తెచ్చి ఇంటికి వచ్చీ రాగానే ఒక కుండీలో మట్టిపోసి వేసి నీరు పోసేశాను - కానీ అంతగా ఆశలేం పెట్టుకోలేదు - నిలుస్తుందని. ఆ తమిళావిడ అంత జా.....గ్రత్తగా అదేదో organ transplant స్థాయిలో వేసిస్తేనే మనలేదు - ఈ కిచెన్ టవల్‌లో తెచ్చిన మొక్క మొలుస్తుందా, నిలుస్తుందా - అని.

వంటింటి కిటికీలో ఎండ తగిలేచోట పెట్టి - జలుబు చేస్తుందేమో ఎక్కువ పోస్తే అన్నట్లు కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ - మొన్న పొరపాటున టీ-కాచిన నీళ్ళు పోశాను - ఏదో ఎప్పటిదో ఎక్కడో విన్న గులాబీ-మొక్క పోషణ చిట్కా గుర్తొచ్చి - దాన్ని తప్పుగా బియ్యం-కడుగు నీళ్ళు పోయాల్సిన కరివేపాకుకి  అన్వయించుకుని.

అమ్మో ! ఇంకేముంది - మొక్క అలిగి వాలిపోతుందేమో అనుకున్నాను.

కానీ ఆశ్చర్యం ... రాజన్-నాగేంద్ర గారి బాణీలో పాడుకోవడానికి వీలుగా ...



కరివేప మొక్క మారాకు వేసే - మారాకు వేసే టీకాయ తోనే 

మొత్తానికి బతికింది - మా ప్రవాస జీవనపు వంటింటి-కల్పభూజం. 

కరివేపాకు వాడడంలో నావైన నియమాలు:

నాకు కొన్ని వంటల్లో కరివేపాకు తో పాటు కొత్తిమీర mutually exclusive (ME)... కొన్నిట్లో complementary (C)... కొన్నిట్లో optional (O).

ఆ వైనమేమనగా...
ఉప్మాలో అల్లం, పచ్చిమిరపకాయ, ఉల్లి తరుగుతో పాటు ఘనంగా వేయాలి కరివేపాకు - కొత్తిమీర పైపైన జల్లనగు  - (O)
చింతపండు పులిహోరకి ప్రాణమైనది కరివేపాకు - నిమ్మకాయ, మామిడికాయ రకాలకి కొత్తిమీర బాగు (ME)
సాంబారు రుచికి త్రాణమైనది కరివేపాకు - పప్పుపులుసుకి కొత్తిమీర మిన్నగు (ME)
దద్ధోజనానికి ధరలో పేరు తెచ్చినది కరివేపాకు - ఇందులో జతగా కొత్తిమీర వుండదగు (C)
ఏ కూరకైన రుచి కూర్చునది కరివేపాకు - కొన్నింటిలోనే కొత్తిమీరతో కలపదగు (O)
నీరసాలు తగ్గించు మిరియాల చారుకి "రస"సిద్ధి కలిగించు - కొత్తిమీర-కరివేపాకు  (C)

నాకెంతో ఇష్టమైన కరివేపాకుకో నాదైన ఓ సిన్మతీ గిద్యం:

కరివేప ఆకులు దట్టిన
పులిహోరయు కూర సాంబారు వాసన మించున్
చారును రస సిద్ధి పొందగ
సువాసన గల ఆకులివె ఇలలో సిన్మతీ! 




19, సెప్టెంబర్ 2017, మంగళవారం

త్వామనురజామి - 17 - మాట లేని రోజు అది - వాక్కు లేని walk అది!

కిందటి 19 చెప్పిన కబుర్లు: త్వామనురజామి - 16 - సెలవులు రావాలి ...మేమంతా - ఇంటికి వెళ్ళాలి!


ఇంక రెండు రోజుల్లో ప్రయాణం.


రోజూలాగే క్లాసులకి వెళ్ళివచ్చాను.

క్లాసులు ఆటవిడుపుగా జరిగాయి. సెలవులకి ముందు కదా - అందులోనూ డిసెంబర్ 21కి ఇంటికి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేది జనవరి 21కే.

నెలరోజులు ఎంచగ్గా ఇంట్లో ఉండొచ్చు అన్న ఆనందం ఒక పక్కా - దాదాపు ఏడాదింపావుగా హాస్టల్ రూముల్లో చిన్ని చిన్ని స్నేహపు మొలకల్లా మొదలయి - ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో - ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో - అన్న ఆత్రేయ పాటే ప్రవచనంలా - ఆ పాటకి నిర్వచనంలా -  క్లాసులు, కబుర్లు, పాటలు, అలకలు, అల్లరుల మధ్య - ఇప్పుడు మైత్రీలతల్లా అల్లుకున్ననేస్తాలని వదిలి ఒక నెల ఉండాలీ అన్న బెంగ ఒక పక్కా - ఆ బెంగని దాచుకుంటూ దాటవేయడానికి అన్నట్లు - "నేను సెలవులనుంచి వచ్చేటప్పుడు నీకోసం ఇది తెస్తాను, నీకిష్టం కదా!" - అంటూ చేసుకుంటున్న చిట్టి-పొట్టి-చిన్నారి రోజుల్ని జ్ఞాపకం చేసే అమాయకపు వాగ్దానాలు, "నేను తప్పకుండా నీకు ఒక్క లెటరైనా రాస్తాను" అంటూ చేతిలో చెయ్యి వేయకపోయినా అంత పనిచేస్తున్నట్టూ పెడుతున్న ఒట్లూ,  రైల్వే స్టేషన్‌కి ఎవరెవరు కలిసి ఒక రిక్షాలో వెళ్ళాలీ అనే ప్లానులూ-ప్రణాళికలూ - ఓహ్! క్లాసుల్లో పాఠాలు వింటున్నా , హాస్టల్లో భోజనాల దగ్గర కలిసినా - అవే ఆలోచనలు, అవే కబుర్లు.

మా చుట్టూ వున్న గాలికి కూడా చుట్ట చుట్టుకుని తన పెట్టె సర్దుకుని తన పుట్టినిల్లు వెతుక్కుంటూ వెళ్ళిపోవాలనిపించేంతగా  - పాదాలు నేల మీద నిలవని అమ్మాయిల కబుర్ల సరిగమలు - ప్రయాణపు పదనిసలు.

ఆ రోజు క్లాసులు కూడా అంత సీరియస్‌గా జరగలేదు. వచ్చిన ప్రతీ లెక్చరర్ ఒక పావుగంట ముందే పాఠం ముగించేశారు.

అదుగో - అప్పుడే - తనకే ప్రత్యేకమైన ఒక వెండి-tinge - అంటే రెండు పల్చగా వున్న వెండి తీగలు గొంతులో బిగించి ఉంచారేమో - అనిపించే హాయైన గొంతుతో కూనిరాగాలు తీస్తూ వుండే మా మెరుపుతీగ సునీత - అన్నపూర్ణ, సోనియా అడిగారని - కళ్ళ నిండా ఇష్టాన్ని నింపుకుని నిశ్చలంగా తన హీరోయిన్ అర్చనని చూస్తూ హీరో నవీన్ నిశ్చల్ పాడే रात कली एक ख्वाब में आयी - और गले का हार हुई  పాడింది. అదే మొదటిసారి సునీత పాడగా నేను విన్నది - <ఇప్పటికీ ఆ పాట విన్న ప్రతిసారీ అప్పటి సునీత గొంతు గుర్తుకొస్తుంది.>

అప్పుడే మా క్లాసు గాన-కోయిలలందరూ సెలవులకి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళే - మా పడుచుదనపు-రైలు-బండిలో ఆడుకోబోయే అంత్యాక్షరి అనే పాటల-ఆటకి గొంతులు శృతి చేసుకోవడం మొదలుపెట్టారు. 

నేను క్లాసులన్నీ అయి హాస్టల్ రూంకి రాగానే - సూట్‌కేస్‌లో - బట్టలు, పుస్తకాలు, శిల్పంలో కొన్న న్యూఇయర్ గిఫ్ట్స్, గ్రీటింగ్‌కార్డ్స్ - అన్నీ సర్దేసుకున్నాను.

చదివినా చదవకపోయినా Koontz - O'Donnell, Keith Davis నాతోపాటు వున్నారంటే - ఎలాగోలా నా బుర్రలోకి ఎక్కేస్తారు - అని అదో ధైర్యం. అందుకే సెలవులకి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా - ఎందుకే మోసుకొస్తావు ఎలాగూ చదవ్వు, మాచేత బరువు మోయిస్తావు - అని పప్పి, కుట్టి విసుక్కున్నా - తప్పకుండా ఓ రెండు టెక్స్ట్‌బుక్స్ పట్టుకెళ్ళేదాన్ని.

ఆరోజు సాయంత్రం -  శ్రీలత, సంగీత, గుత్తిపద్మజ  - ఏదో కొనుక్కోవాలని కాలేజ్‌స్టోర్‌కి వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో పాటు స్టోర్ దాకా వెళ్ళాను కానీ - లోపలి వెళ్ళాలని అనిపించలేదు - అందుకే కాలేజ్‌స్టోర్‌కి ఎదురుగా వుండే మా స్టేజ్ కున్న మెట్ల మీద కూర్చున్నాను.

మా హాస్టల్ నుంచి బయటికి వెళ్ళాలన్నా - బయటినుంచి హాస్టల్ వైపు రావాలన్నా - ఒక చిన్న గేటు దాటి పద్మావతి పాలిటెక్నిక్ హాస్టల్ (మా ఓల్డ్ హాస్టల్) మీదుగా వెళ్ళొచ్చు. ఆ దారే మేము సాధారణంగా తిరుపతి టౌనులోకి బస్సులెక్కడానికి వెళ్ళాలంటే వాడేవాళ్ళం.

ఆ చిన్నగేటుకి ఇవతలగా ఎడం పక్క కాలేజ్‌స్టోర్, మధ్యలో మేము వార్షికోత్సవాలకి ఆడే-పాడే-వారిని చూసి ఆనందించడానికి ఒక స్టేజ్, కుడి పక్కన కాలేజ్ అసెంబ్లీ మీటింగులో, SPIC-MACAY కార్యక్రమాలో జరిగే ఒక పొడవైన హాలు ఉండేవి.

అదుగో - ఆ స్టేజ్ మెట్లమీదే నేను కూర్చున్నది ఆ వేళ - నేనూ పల్చని బంగారు ఎండకి మాచింగ్‌గా పసుపు రంగు చుడీదార్ వేసుకుని.
 
శీతాకాలపు సాయంత్రం.

బోల్డంత నీలంగా వున్న మబ్బుల్లేని ఆకాశం.

నారింజ రంగు సూరీడు.

బంగారు వన్నె ఎండ.

ఆ నులివెచ్చని మలిసంజలో ఎండకాగుతూ నేను.

ఒక కన్ను చేత్తో మూసుకుని ఇంకో కంటి కనురెప్ప మీద చూపుడువేలు నొక్కిపెట్టి - ఆ లేలేత ఎండ వెలుగురేఖల్లో - నాకై నేను సృష్టించుకున్న వాన-లేని-వానవిల్లు చూసుకుంటూ - ఆ కిరణమాలి కిరణాలను మాలిమి చేసుకుని ఆడుకుంటున్నాను.

ఇంతలో ఎదురుగా ఇద్దరు అబ్బాయిలు వస్తూ కనిపించారు. - నా వైపే.

అందులో ఒకతను - రాజశేఖర్ - అప్పటికి రెండు సార్లు అతనితో మా(పో?)ట్లాట అయింది.

అతన్ని చూడగానే నాకోసమే వచ్చి ఉంటారని అనిపించి - అనుకోకుండానే లేచి వాళ్ళిద్దరికీ ఎదురెళ్ళాను.

అప్పటికే రెండు సార్లు రాజశేఖర్‌తో చాల రూడ్‌గా మాట్లాడాను - అదీ కాక ఇవాళ ఇంటికి వెళ్తున్నానన్న సంబరంలో హుషారుగా వున్నాను - అందుకే ఈసారి కొంచెం మంచిపిల్లలా ప్రవర్తిద్దామని - నవ్వుతూ పలకరించాను.

"హాయ్... హాయ్... "

"హాయ్" (నా రెండు "హాయ్" లకీ - ఒకే "హాయ్" బదులు - రాజశేఖర్‌ నుంచి - లుప్తమైన ఆ రెండో "హాయ్" గురించి అంతగా పట్టించుకోలేదు).

నేనెప్పుడూ అబ్బాయిలతో తెలుగులో మాట్లాడేదాన్ని కాదు - ఏసీ కాలేజ్‌లో డిగ్రీ చదివేటప్పటినుంచీ అదే అలవాటు - ఇంగ్లీషులో మాట్లాడే అమ్మాయిలని అబ్బాయిలు అంత తొందరగా ఏడ్పించరని tried & tested & proven fact - నావరకూ.

నన్ను పలకరించిన రాజశేఖర్‌కి ఒక పక్క నేను, ఇంకో పక్కన ఆ కొత్త అబ్బాయి - ముగ్గురం నడవడం మొదలు పెట్టాము.

కాలేజ్‌స్టోర్‌లో వున్న శ్రీలత వాళ్ళకి నాతో ఇది అలవాటే - వాళ్ళతో నేను వెళ్ళడం - ఈలోగా కొత్తగా ఫ్రెండ్స్ అయిన శుభ, రజని, అరుణ కనిపిస్తే వాళ్ళతో నేను వాకింగ్‌కి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం - రాత్రి డిన్నర్ టైంకి నెమ్మదిగా రూంకి చేరడం - ఈ రోజూ వాళ్ళు స్టోర్ నుంచి బయటికి రాగానే నేను కనిపించకపోతే - నేనెప్పటిలాగే ఎటో "ఆకలా... దాహమా ...చింతలా ... వంతలా ... ఈ కరణి వెఱ్ఱినై  ఏకతమ తిరుగాడ..." అని పాడుకుంటూ తిరిగివస్తానని అనుకుంటారని నాకు తెలుసు. అందుకే వాళ్ళకి చెప్పకుండానే ఆ ఇద్దరు అబ్బాయిలతో కబుర్లు చెప్తూ నడవడం మొదలు పెట్టాను.

మహా అయితే ఒక పది నిముషాలు గడిచి ఉంటాయి - మా చిన్నగేటు దాటి పాలిటెక్నిక్ హాస్టల్ దాటి పెద్దగేటు దగ్గరికి వెళ్ళేలోగా జరిగిన సంభాషణ వరస ఇదిగో ఇదీ:

"Hmm ... What brings you here?"

"We are here just to say "hi" to you"

ఇంతకు ముందు విన్నదే - అయినా ఈసారి అంతగా కోపం రాలేదు.

"That's nice of you. You know one thing? I am going home day after"

చెప్తున్న నా గొంతులో దాచుకోలేని సంతోషం.

"Really? By Narayanadri?"

"Yes - I got my tickets reserved last week"

నయం - అక్కడితో ఆగాను - రిక్షాలు, మాట్లాడేసుకున్నాం - సూట్కేసులు సర్దేసుకున్నాం - అంటూ ఏంటేంటో అంటూ-పొంతూ లేకుండా మాట్లాడేయకుండా.

"Oh - good to know. We need to go now. Bye!"

పర్లేదు - పది నిముషాల్లో వెళ్ళిపోతున్నారు - ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా - మంచబ్బాయిలే!

"Bye." అంతలో ఒక సందేహం - "One more thing - why is your friend so quiet?"

"He doesn't say anything - except smiling." - అని చెప్తూ నాకు ఇంకోసారి bye చెప్పేసి ఇద్దరూ పాలిటెక్నిక్ గేట్ దాటి పద్మావతి కాలేజ్ గోడ పక్కనుంచి SVU కి వెళ్ళిపోయారు.

ఒక్క నిముషం - నేను విన్నది నిజమేనా - అని అనిపించింది.

"ఆ రెండో అబ్బాయికి మాటలు రావా? అమ్మో - మాట్లాడకుండా అసలెవరైనా వుండగలరా? మాట్లాడకుండా ఉంటూ అసలు MBA ఎవరైనా చదవగలరా? ఆ అబ్బాయి నవ్వు ఎంత బావుంది - వెన్నెల్లా? ఆ అబ్బాయి వెనకాల వెళ్ళి ఇంకొక్కసారి ఆ నవ్వుమొహం చూస్తే ఎంత బావుండునో కదా?" - ఇలా ఆలోచిస్తూ వెనక్కి వస్తూ ఉంటే పాలిటెక్నిక్ హాస్టల్ (అదే మా ఓల్డ్ హాస్టల్) ముందు వుండే బజ్జీలకొట్టు దగ్గర బజ్జీలు కొనుక్కుని తింటూ కబుర్లు చెప్పుకుంటున్న ప్రగతి, మాధవీలత, ఉష, అపర్ణ కనిపించారు. మాధవీలతతో పాటు జర్నలిజంలోనో, Law లోనో  కొత్తగా చేరిన వాళ్ళ చెల్లెలు (తన పేరు మర్చిపోయాను - ఉమ అనుకుంటాను - ఉమామహేశ్వరి - కానీ నేను తప్పుగా గుర్తు పెట్టుకుని ఉండొచ్చు - ఎందుకంటే తనని ఎక్కువగా మాధవీలత చెల్లెలు అని రిఫర్ చేయడమే అలవాటు నాకు అప్పట్లో) కూడా వుంది. తననీ పలకరించి పరిచయం చేసుకుందామని వాళ్ళ దగ్గర ఆగాను.

నన్ను చూడగానే - మా క్లాసులో విశాఖయాసతో గలగలా కబుర్లు చెప్పే ప్రగతి - "మా క్లాసులో గోలపిల్ల ఇదే - గోలా చేస్తుంది - గోలగా పాడుతుంది కూడా" అని చెప్పేసి నేను అడగ్గానే పాడేస్తానని కూడా ప్రకటించేసింది.

అడగనివారిది పాపం - అడిగినవారిది అడిగినంత భాగ్యం అనుకునే టైప్ నేను - పాటల విషయంలో - ఆరోజు నేను పాడిన పాట (ఈ పాట అప్పుడే కలిసి వెళ్ళిన మూగ అబ్బాయిని గురించి ఆలోచిస్తున్న నాకు అనుకోకుండా తట్టి నే పాడేసిన పాట) :

కొమ్మ మీది కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది 
అది కూన విన్నదీ - ఓహో అన్నది

ఈనాడు చిగురించు చిగురాకు వగరే 
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో 
నాడు ఆ రాగ మే గుండె జతలో 
తానె శృతి  చేర్చి లయ కూర్చునో 
అని తల్లి అన్నది - అది పిల్ల విన్నది 
విని నవ్వుకున్నదీ -కలలు కన్నది 

కొమ్మ మీది కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది 
అది కూన విన్నదీ - ఓహో అన్నది  
ఈ లేత హృదయాన్ని కదిలించినావు 
నాలోన రాగాలు పలికించినావు 
నాకు తెలిసింది నీ నిండు మనసే 
నేను పాడేది నీ పాటలే 
అని ఎవరు అన్నది - అది ఎవరు విన్నది 
ఈ చిగురు చెవులకే - గురుతు వున్నది 

కొమ్మ మీది కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది 
అది కూన విన్నదీ - ఓహో అన్నది. 

పాట పాడడం అయిపోగానే - ప్రగతీ వాళ్ళకి bye చెప్పేసి దాదాపుగా పరిగెడుతున్నట్టుగా రూంకి వెళ్ళాను.

అక్కడ శ్రీలత తన మంచం మీద కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటున్నారు.

"శ్రీలతా! మీకో విషయం తెలుసా? ఇవాళ ఒక మూగ MBA అబ్బాయిని కలిశాను. మీగ్గుర్తుందా? - మనమొకసారి గుంటూరు వెళ్ళేటపుడు ఒక పింక్ షర్ట్ అబ్బాయి మన కంపార్టుమెంట్ లోనే వచ్చాడూ - అతని ఫ్రెండ్ ఇతను - మూగతను. కానీ MBA student. ఎంత గ్రేట్ కదా?!"

"మూగబ్బాయి MBA ఎలా చేయగలడు లల్లీ! నువ్వు మరీ చెప్తావు"

"లేదు, శ్రీలతా! నిజంగా. నేను చూడకపోతే మీలాగే నమ్మేదాన్ని కాదు - అతనికి నవ్వడం తప్ప ఏమీ రాదు"

"Really ?"

"అవును - అంతసేపు నేనూ - రాజశేఖర్ - అదే ఆ పింక్ షర్ట్ అబ్బాయి - మాట్లాడుతూనే వున్నామా - అస్సలతను ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు - అసలెవరైనా అలా మాట్లాడకుండా వుండగలరా? మీరే చెప్పండి!"

"ఏమో లల్లీ ! నువ్వింత చెప్తున్నావంటే నిజంగానే మూగవాడై ఉంటాడు. నువ్వన్నట్టు నిజంగానే చాలా గ్రేట్! అవునూ - MBA వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ అవీ ఉంటాయి కదా - మరెలా మేనేజ్ చేస్తాడో?"

"ఏముంది పేపర్ మీద రాసిస్తే వేరే ఎవరైనా చదువుతారేమో - ఎంత తెలివైన వాడు కాకపొతే MBA లో సీట్ ఇస్తారు వాళ్ళూ? ఆ మాత్రం consider చేయలేరా ఏంటి?" - అప్పుడే ఆ మూగ అబ్బాయి వైపు - అతనేదో నా ఫ్రెండ్‌లా సమర్థిస్తూ మాట్లాడేశాను నేను.

ఇంక ఆ రాత్రి డిన్నర్ దగ్గర కూడా కాసేపు ఆ మూగబ్బాయి గురించి సంగీత, పద్మజవల్లి, గుత్తిపద్మజ - అందరికీ చెప్పేశాక కానీ నా సరదా, సంబరం తీరలేదు - ప్రపంచంలో ఎనిమిదో వింత కనుక్కున్నంతగా కలిగిన నా ఉత్సాహం ఆగలేదు.

ఆ రాత్రి నిద్ర వచ్చేదాకా - కొమ్మమీది కోకిలమ్మ పాట  - continuous hum అన్నమాట !

ఇక్కడ ఆగి మళ్ళీ నే మిగిలిన కథ చెప్పడానికి వచ్చేలోగా ఈ పోస్ట్ టైటిల్ పాట - అసలు పాట ఏదో పట్టి-చెప్పండి.

ఈ కింది కొసరు పాట పట్టి-పట్టి పాడెయ్యండి:

టైపు చేసి నింపినా పేజీ నిండదు 
బోలెడన్ని చెప్పినా కథలు తరగవు
వారానికి ఒకటి అయినా - నెలకి నాలుగు పోస్టులైనా 
కబుర్లు చెప్పకపోతే ... ఆ హాయి నిండదు



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>



9, సెప్టెంబర్ 2017, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 4 - రైలు ప్లాట్‌ఫారం నుంచి జైలు యూనిఫారం దాకా పళ్ళయ్యకథ

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 3 - మూడాటలు-ఆరుస్వారీలు

SLC లోకొచ్చాను.

ఫస్ట్ ఫారం నుంచి SLC వరకు మాతో పాటు ఆరుగురు ఆడపిల్లలు, ముప్ఫయి నాలుగు మంది మగపిల్లలం - మొత్తం నలభై మంది మా క్లాసులో.

SLC లో వెంట్రప్రగడ జగన్నాథరావుగారని మా హెడ్మాస్టరు - ఆయన కూడా క్లాసులు తీసుకునేవారు. అనాతవరం నుంచి తెలుగు మాస్టారు - కర్రా చంద్రశేఖర శాస్త్రిగారు, ఆకెళ్ళ సుబారావుగాని ఇంకొక టీచరు వచ్చేవారు. వెంట్రప్రగడ జగన్నాథరావుగారు భీమనపల్లిలో ఉండేవారు.

ఆరుగురు ఆడపిల్లల్లో ఒకమ్మాయి మా సుబ్బన్న మాస్టారి కూతురు - పరిమి సుబ్బలక్ష్మి. ఇంకొకామేమో సోషల్ మాస్టారి కూతురు కృష్ణవేణి. ఇంకొకమ్మాయేమో గుండాబత్తులప్రభావతి అని అనాతారం నుంచే వచ్చేది - మిల్లు వాళ్ళమ్మాయి. ఇంకో అమ్మాయి మారిశెట్టి సూర్యకుమారి అని. ఇంకొక అమ్మాయేమో క్రిస్టియన్ అమ్మాయి - డోరాగ్రేస్ అని. ఆరో అమ్మాయి పేరు గుర్తు లేదు. ఈ ఆరుగురు ఆడపిల్లలు ఫస్టుఫారం నుంచీ మాతోనే కలిసి చదువుకున్నారు.

మాకు SLC లోకి వచ్చేటప్పటికి మాథ్స్‌లో కాంపోజిట్టు, జెనరల్ అని రెండుండేవి. ఈ కాంపోజిట్టు కొంచెం కష్టం - ఆ ఈక్వేషన్స్ అవీ నాకు వచ్చేవి కావు. అసలే ఆల్జీబ్రా - గుండె గాబ్రా కదా! అందుకని నేను జెనరల్ తీసుకున్నా. క్లాసుని  A, B సెక్షన్లు చేశారు. ఎవరి సెక్షన్ వాళ్ళం వున్నా - మాథ్స్‌కి మాత్రం కాంపోజిట్ వాళ్ళందరూ ఒక క్లాసుకి, జెనరల్ వాళ్ళం ఒక క్లాసుకి వెళ్ళేవాళ్ళం. ఈ రావడం - పోవడంలో ఏమైందంటే - ఒకరోజు - ఒక అమ్మాయిని - ఎవరితోనో ఆట్లాడుతూ పరిగెత్తుతూ వెళ్తూ - చూసుకోకుండా గుద్దేశాను. ఆ అమ్మాయి చేతిలో పుస్తకాలు కిందపడిపోయాయి. నేను నవ్వుకుంటూ పారిపోయాను.

అది మా హెడ్మాస్టరు చూశారు - ఎక్కడో దూరం నుంచి.

ఆయన దగ్గర ఒక అలవాటుండేది - ఆయనదగ్గర మాం... ఛి పేకబెత్తమొకటి ఆయన రూములో ఉండేది. ఆయన ఎవరినయినా కొట్టాలనుకుంటే వాడినే పంపించి ఆ బెత్తం తెప్పించేవారు. తెప్పించి చితగ్గొట్టేహేసేవారన్నమాట.

నన్ను పిలిచి "ఒరే వడ్లమానీ! అక్కడ సత్యం ఉంటాడు - వాణ్ణడిగి నేనిమ్మన్నానని చెప్పి ఆ బెత్తం తీసుకురా! " అన్నారు.

సత్యం అంటే మా బళ్ళో గంటలు కొట్టే అటెండరు.

నాకప్పుడే అర్థం అయిపోయింది - మనకు మూడింది ఇవాళ అని.

సరే! వెళ్ళాను ఊపుకుంటూ హెడ్మాస్టరు గారి ఆఫీసుకి.

సత్యం, రాజు అని ఇద్దరు ఉండేవారు. దసరా వచ్చిందంటే చెరో రెండు రూపాయలు ఇచ్చేవాణ్ణి - ఆ రోజుల్లోనే. అది అప్పటికి చాలా గొప్ప. అంచేత నేనంటే వాళ్ళకి - పాపం - ప్రత్యేక అభిమానం ఉండేది.

"సత్యం! హెడ్మాస్టరు బెత్తం తెమ్మన్నారు - అది ఇటియ్యి" అన్నాను.

వాడికి తెలుసు నన్నే కొట్టేస్తారని.

అయినా కూడా "ఎవరికీ మూడింది బాబూ ఇవాళా ?" అనడిగాడు.

"ఏమో - నాకేం తెల్సు. ఎవడో అల్లరి చేశాడు లోపల - నన్ను బెత్తం తీసుకు రమ్మన్నారు" అన్నాను.

"సరే అయితే - తీసుకెళ్ళు బాబూ!" అంటూ భద్రంగా ఇచ్చాడు బెత్తం.

ఆ బెత్తం పట్టుకుని వచ్చాను.

వచ్చేటప్పటికి "చెయ్యి పట్టమ్మా!" అని రెండు చేతులూ చాచి పెడితే తెగ బాదేహారు. చేతులు ఉబ్బిపోయినై.

ఆ ఉబ్బిపోయిన చేతులతో - ఇంకా రోజుకి ఆటల్లేవు - ఎలాగోలా కష్టపడి సైకిలు తొక్కుకుంటూ ఇంటికివెళ్ళాను.

అన్నం తినడానిక్కూడా లేదు - చేతులంతా మంటలు. మా అమ్మే - ఉయ్యాలబల్ల మీద కూర్చోబెట్టి - నోట్లో పెట్టేహేది అన్నం.

మా నాన్నగారికి అనుమానమొచ్చింది.

"ఏమైందిరా అది?" అనడిగారు.

"అబ్బే! ఏం లేదు. ఆడుతూ ఆడుతూ చేతులు కింద ఆనించేశాను. అక్కడ రాళ్ళేవో వున్నాయ్. అంచేత అవేవో తగిలాయి" - అనేదో అబద్ధం ఆడేశాను.

ఈ లోపులో - తెలుగు మాస్టారు - మా చుట్టం కూడా ఆయన - కర్రా చంద్రశేఖరశాస్త్రిగారు - ఆయనొచ్చారు.

వచ్చి - "నారాయణగారూ! - ఏడీ ఉన్నాడా మనవాడూ ?!" అన్నారు.

"ఆ రండి మాస్టారూ - ఏంటి సంగతి?" అన్నారు మా నాన్న.

"ఏం లేదు - ఇవాళ వీడూ ... ఏదో అల్లరి చేసుకుంటూ వచ్చి ఓ అమ్మాయిని గుద్దేహాడు. హెడ్మాస్టరు పట్టుకుని చితక్కొట్టేహాడు. ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను" అన్నాడాయన.

ఇంక చూసుకోండి మా నాన్నగారు మళ్ళీ ఫుట్‌బాల్ ఆడేశారు నన్ను - ఇంకెప్పుడూ మళ్ళీ ఇలాంటి వెధవపనులు చేయకంటూ.

ఇవాళ్టి రోజుల్లో అయితే కుర్రాణ్ణి కొట్టారంటే పెద్దలెళ్ళి స్కూల్ మీద పడి టీచర్సుని తిడుతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళని తిట్టడం కాదు మమ్మల్నే చితకబాదేసేవారు - మళ్ళీ ఇంట్లో "వెధవా! తప్పు చేశావు" అన్చెప్పి.

ఒక సంగతి మర్చిపోయాను - ఫిఫ్తుఫారంలో వున్నప్పుడు మా అన్నయ్యగారికి అమ్మాయి పుట్టింది - విజయవాడలో ప్రసవించారు మా వదినగారు. విజయవాడలో విజయా మెడికల్ సిండికేట్‌లో పనిచేసే వారు మా అన్నయ్య. మా వదినవారిని ప్రసవం అయ్యాక ఐదో నెల్లో ఒకసారి అనాతవరం తీసుకొచ్చారు.

విశాఖపట్నంలో మా అక్కయ్య లలిత, బావగారు రామంగారు (లాయరుగారు) వుండేవాళ్ళు. విశాఖ నుంచి మా లలిత కూడా ప్రసవానికి వచ్చింది. ఆమెకీ ఆడపిల్ల పుట్టింది.

వదినగారు, లలిత అక్కయ్య ఓ పదిహేను రోజులు అనాతవరంలోనే ఉన్నారు. అంతలో మా వదినగార్ని విజయవాడ పంపించాలి - మరి మా అక్కయ్యని వైజాగ్ పంపించాలి.

మా అక్కయ్య " నేను కూడా విజయవాడ వెళ్తాను - అక్కడ నాలుగు రోజులుండి వైజాగ్ వెళ్తాను " అంది.

వాళ్లకి ఎస్కార్టుగా నన్ను పంపించారు - నాకు సెలవులప్పుడు.

 బోల్డు లగేజీ.

ఈ లోపులో - మా పెద్దక్క పాపాయి అమలాపురంలో ఉండేది - "నేను కూడా వస్తాను, మంగళగిరి చూద్దాం అందరం కలిసి" - అంది.

మేమందరం కలిసి బయల్దేరి - రాజమండ్రి వెళ్ళి - ఈ రాజమండ్రేంటంటే బొబ్బర్లంక వెళ్ళి అక్కడ్నుంచి లాంచీ ఎక్కి లాంచీలో గోదారిమీదెళ్ళాలి - వెళ్ళి - రాజమండ్రి వెళ్ళి అక్కడ విజయవాడకి ట్రైన్ ఎక్కాలన్నమాట. అదీ అప్పటి పరిస్థితి.

మా ఇంట్లో వున్న అలవాటేంటంటే - పళ్ళయ్య ఉండేవాడు కదా మా ఇంట్లో !?- ఎవరు ఊరు వెళ్ళినా కూడా - ఇటు వేపు వెడితే బొబ్బర్లంక రేవు గోదారి దాటి లాంచీ మీద అవతల ట్రైన్ ఎక్కేవరకూ ఉండాలి - ట్రైన్ ఎక్కించి మళ్ళీ అతను వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే అటువైపు కాకినాడవైపు విశాఖపట్నం వెళ్ళాలంటే - ముక్తేశ్వరం వచ్చి రేవు దాటించి కోటిపల్లిలో మమ్మల్ని బస్సెక్కించి వెనక్కెళ్ళిపోయేవాడన్నమాట. ఇది మామూలు ప్రాక్టీసు మాకింటి దగ్గర అప్పుడు.

సరే! ఈ పళ్ళయ్య కూడా మాతో పాటొచ్చాడు.

లగేజీ, పిల్లలు, మా ఇద్దరక్కయ్యలు, మా వదినగారు, ఎస్కార్ట్ నేను - రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళి టౌన్‌స్టేషన్‌కి వెళ్ళాం.

వెళ్ళాక - పళ్ళయ్యని లగేజీ పట్టుకోమని - అందరినీ ప్లాట్‌ఫారం మీదకెళ్ళిపొండి - టికెట్లు నేను పట్టుకొస్తానని చెప్పి - నేనేం చేశానంటే - విజయవాడకి టిక్కెట్లు తీశాను నాలుగు. ప్లాట్‌ఫారంటికెట్టు మర్చిపోయాను. అప్పటికహలు గుర్తు లేదు నాకు - తీయాలని కూడా తట్టలేదు.

టికెట్లు తీసుకుని వెళ్ళిపోయాం స్టేషన్ లోపలికి. ఈలోగా హౌరా నుంచి మెయిలొచ్చింది. ఆ మెయిల్లో విజయవాడ వెళ్ళాలి. లగేజీ అంతా సర్దేసుకుని మెయిలెక్కేశాం.

ఎక్కేసేటప్పటికీ - మెయిలు కదలబోతుండగా పళ్ళయ్య గబగబా నా దగ్గరకొచ్చి - "బాబిగారు - నేను బయటికెళ్ళాలి - ఎలాగా - ఎలా వెళ్ళాలి?'  - అన్నాడు.

అప్పుడు గుర్తుకొచ్చింది - అమ్మో-  ప్లాట్‌ఫారం టికెట్ తీయలేదని.

ఎదురుగుండా నల్ల కోటేసుకుని స్టేషను మాస్టరెవరో కనబడుతున్నాడు. ఆయన్ని చూపించి "పళ్ళయ్యా! ఓ పని చెయ్యి - ఆయన దగ్గరకెళ్ళి అడుగు. ఎలా వెళ్ళాలో ఆయన చెప్తాడు" - అని చెప్పేసి - పళ్ళయ్యకి భోజనానికి, వెనక్కి వెళ్ళడానికి డబ్బులిచ్చి - మేం వెళ్ళిపోయాం.

ఈ పిచ్చి పళ్ళయ్యేమో ఆయన దగ్గరికెళ్ళి - "నేనూ మా కామందులూ వచ్చామండి అమలాపురం నుంచి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి చెప్ప" మంటే - సరే ఇక్కడే కూర్చో అనీ - "టికెట్టుందా , ప్లాట్‌ఫారం టికెట్టూ?" - అనడిగాడట ఆయన.

"నాకేం ఇవ్వలేదండీ మా కామందులూ" - అని పళ్ళయ్య జవాబు.

అది వినగానే పళ్ళయ్యని రైల్వే పోలీసులకి అప్పగించేశాడాయన.

ఆ రోజుల్లో రైల్వే పోలీసులకి అప్పగిస్తే తిన్నగా సెంట్రల్ జైలుకి పట్టుకుపోయేవారు.

పళ్ళయ్యని ఆ పళంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి అతను కట్టుకున్న పంచె, చొక్కా, భుజం మీది తువ్వాలు తీసేసి జైలుడ్రెస్సు వేసేశారు చారలది - వేసేసి లాకప్పులో పడేశారు.

సరే -  మేమూ విజయవాడ వెళ్ళిపోయాం.

ఇక్కడ ఇంటి దగ్గర మా నాన్నగారు వాళ్ళు రెండు రోజులకీ పళ్ళయ్య రాకపోతే - లగేజీ అదీ వుంది కదా, పళ్ళయ్యని కూడా విజయవాడ తీసుకుపోయి ఉంటార్లే - అనుకున్నారు. మేమేమో ఈ పాటికి ఇంటికెళ్ళి పోయి వుంటాడులే అనుకున్నాం.

కానీ ఆ రెండు రోజులూ జైల్లో వున్నాడు పళ్ళయ్య.

అదృష్టవశాత్తూ ఆ జైల్లో తెలిసున్న కానిస్టేబుల్ ఒకడు చూశాడు పళ్ళయ్యని.

"ఏంటి పళ్ళయ్యేగారూ - ఇక్కడున్నారు?" అడిగితే పళ్ళయ్య ఏడుస్తూ - ఇలా ఇలా జరిగింది - అని చెప్తే - పాపం అతను - ఇంటికెళ్ళాక పంపిద్దురు గానీ - అని డబ్బులు కట్టి, విడిపించి - ఇంటికి పంపించాడు.

పళ్ళయ్య అనాతవరం వెళ్ళి - గుమ్మంలోంచే ఏడుస్తూ వెళ్ళి మా నాన్నగారికి జరిగిందంతా చెప్తే ఆయన అది విని ఆ కానిస్టేబుల్‌కి పంపించాల్సిన డబ్బులు - మనియార్డర్ కట్టమని మళ్ళీ పళ్ళయ్యకే ఇచ్చి పంపించారు.

ఈ విషయం మా నాన్నగారు - మేము విజయవాడనుంచి విశాఖ వెళ్ళేలోగా ఓ పోస్టుకార్డు మీద రాసి - విశాఖపట్నం మా లలిత అక్కయ్య మావగారికి పోస్ట్ చేశారు.

మేమీలోగా ఇక్కడ విజయవాడ వెళ్ళాం కదా! - అక్కడ అమ్మన్నత్తయ్య అనీ మా తాతగారి దాయాదుల సంతానంలో ఒకరు -  ఆవిడ కొడుకు రామకృష్ణగారని విజయవాడలో వుండేవారు.

ఆ అమ్మన్నత్తయ్య, మా అక్కలు, నేను -  అందరం కలిసి మంగళగిరి వెళ్ళాం.

చక్కగా నడుచుకుంటూ మెట్లెక్కి కొండ మీదికి వెళ్ళాం.

పూజారి ఏదో పనుండి కిందికి వెళ్ళాడు. ఎంతసేపటికీ పైకి రావట్లేదు.

ఈలోగా నేను మా అమ్మన్నత్తయ్య దగ్గరికెళ్ళి "చూడు అమ్మన్నత్తయ్యా - నువ్వు కూడా స్నానం చేసి మంచి పొత్తుపంచె కట్టుకొచ్చావ్ - ఆ శఠగోపం ఏదో మా నెత్తిన పెట్టి, ఆ ప్రసాదం ఏదో పెట్టేస్తే మనం కిందకి వెళ్ళిపోవచ్చు కదా - ఎంతసేపుంటాం ఇక్కడ ఇలా మనం?" - అన్నాను.

పాపం - ఆవిడ " వద్దురా బాబూ. ఆయన మళ్ళీ వచ్చి ఏమన్నా అనుకుంటాడు - మనకొద్దులే - కాసేపు కూర్చుందాంలే" - అంది.

"అలా కాదు చేయవమ్మా తల్లీ. ఏమనుకోడు - నేను చెప్తాను కదా ఆయన్తోటి?!" - అనేటప్పటికి మా అమ్మన్నత్తయ్య - వెర్రావిడ - గబగబా వెళ్ళి ఆ పళ్ళెం పట్టుకొచ్చేసి - ఆ శఠగోపం మా నెత్తిన పెట్టేసి, తీర్థం చేతుల్లో పోసేసి, పూలు, ప్రసాదం పెట్టేసింది.

ఈ లోపులో పూజారి రానే వచ్చాడు. వచ్చి ఇంక ఆయన ఒక మాట కాదు - "తల్లీ - ఈ పనేంటిది ? నేనిదంతా సంప్రోక్షణ చేసుకోవాలి - ప్ర్రాయశ్చిత్తం చేసుకోవాలి - అంతా అపవిత్రం చేశారు - వెళ్ళండి" - అని తెగ వాయించి పడేశాడు.

పాపం - మా అమ్మన్నత్తయ్యకి మొహం చిన్నదైపోయింది. నేనెళ్ళి దూరంగా మెట్ల దగ్గర మాట్లాడకుండా కూర్చున్నాను.

కిందకి దిగి బస్సెక్కి విజయవాడ వస్తూ ఉంటే - మా అక్కలిద్దరూ, అమ్మన్నత్తయ్య - ఈ విషయం చెప్పుకుంటూ ఉంటే బస్సులో విన్న వాళ్ళందరూ ఒకటే నవ్వు.

ఆ తర్వాత విజయవాడలో ఇంకో రెండు రోజులుండి - విశాఖపట్నం బయల్దేరాం. నేను - మా ఇద్దరక్కయ్యలూ, వాళ్ళ పిల్లలూ.

విశాఖపట్నంలో రైలు దిగి రిక్షాలు చేసుకుని ఇంటికి చేరాం - మేం గుమ్మంలో దిగేటప్పటికి - నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు అందరూ అక్కడ.

నన్ను చూసి నవ్వుతున్నారు - ఏమయిందా అని నేనకుంటూ వుంటే - లోపలి వెళ్ళగానే మా మావయ్యగారు - మా అక్క మావగారు" ఏం పని చేశావయ్యా బాబీ నువ్వు? " అన్నారు ఎదురొచ్చి.

"నేనేం చేశానండి ?" - అని నేను .

"ఆ పళ్ళయ్యని జైల్లో పెట్టించావు కదా?" అన్నారాయన.

"నేను పెట్టించడమేంటండి?"  - అన్నాను అయోమయంగా.

అప్పుడాయన అనాతవరం నుంచి మా నాన్నగారు రాసిన పోస్టుకార్డు సంగతి చెప్పారు.

అలా నేను ప్లాట్‌ఫారం టికెట్టు తీయించకపోవడం పళ్ళయ్యకి జైలు యూనిఫారం వేయించింది.


<వచ్చేనెల తరువాయి కథ>



3, సెప్టెంబర్ 2017, ఆదివారం

మా ఇంటి మహమ్మద్ రఫీ కోసం...


ఇల్లే కైలాసం నీకు
చల్లని నీ పొదరిల్లు ఎదురు చూస్తోంది నీకోసం

ఇల్లాలున్న చోటే వైకుంఠం అన్నావు
చెల్లాయత్త నీ గది బయట గడుస్తున్న గంటలో అరవై యుగాలు లెక్కెడుతోంది

మా అన్న, మా బావ అంటూ నా-అన్నవారొచ్చిన  ప్రతిరోజూ నీ ఇంట పండగ
తమ్ములు-మరదళ్ళు, చెల్లెళ్ళు-బావమరుదులు - వచ్చి వేచి వున్నారు నీ కనుసైగ కోసం

ఇంటి-ఆడపడుచు నవ్వులే నువ్వడిగిన కానుక
ఆడపడుచులు కన్నీటి తళుకుల చిరునవ్వు దీపాలు వెలిగించి తెచ్చారు


మా చెవుల్లో రఫీ పాటంటే నీ గొంతే వినబడేంతగా నువ్వు సొంతం చేసుకున్న పాటలు
పాడగలిగిన వేళ పెదవులపై, పాడజాలని వేళ మదిలో ...
మొన్నా నిన్నటి నుంచి - నీ పాటే మోగుతోంది
"ప్రియతమా.... ప్రియతమా... నా మది నిన్ను పిలిచింది గానమై" - అంటూ

ఉయ్యాల్లో పసిపాపవై పరుండిన వేళ జోల పాడారేమో గాని
రెండోబాల్యంలో అలసి సోలిన నిన్ను ఈ రోజు గోల చేసి లేపాలని ఉంది
 
గాలిసంకెలల చిక్కి రాలేక వున్నాను
బెంగగా ఉంది ప్రసాద్ మామయ్యా!
ముమ్మారు పలికి - పలికించవా?
ఓం నమశ్శివాయ!  ఓం నమశ్శివాయ!! ఓం నమశ్శివాయ!!!