25, నవంబర్ 2018, ఆదివారం

ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం!!

ఉపోద్ఘాతం:

2010 లో జరిగిన విషయం. నాన్నకి ఒంట్లో నలతగా ఉందని తెలిసి కొంచెం బెంగగా వున్న నన్ను, నాతో పాటు బుజ్జిజింకని అప్పటికప్పుడు టికెట్లు కొని, ఇండియా ఫ్లైట్ ఎక్కించారు బదరి.

నాన్నని సర్‌ప్రైజ్ చేద్దామని మేము బయలుదేరినట్లు బాలాజీకి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు బదరి - బాలాజీకి కూడా నేను ఇండియా వస్తున్నానని ఎవరికీ చెప్పొద్దని చెప్పారు.

హైద్రాబాదులో తెల్లవారుఝామున నన్ను రిసీవ్ చేసుకున్నబాలాజీ నన్నూ, బుజ్జిజింకనీ ఆ రోజు పొద్దున్న పదింటికి  రాజమండ్రి ఫ్లైట్ ఎక్కించే ముందు నాన్నకి ఫోన్ చేశారు.

"అంకుల్! బదరి అమెరికా నుంచి మీకోసం ఏదో పంపించాడు. మీరోసారి పదకొండు గంటల ప్రాంతంలోరాజమండ్రి ఏర్‌పోర్ట్‌కి వెళ్ళాలండి"

"బదరి నాకేంటో పంపించడమేంటి? నిన్ననే కదా నాతో మాట్లాడాడు - నాకేం చెప్పలేదే !?" - నాన్న గొంతులో కంగారు.

బాలాజీ వెంటనే నాకేసి తిరిగి "అంకుల్ ఇప్పుడే రికవర్ అవుతున్నారు - ఆయన్ని టెన్షన్ పెట్టొద్దు ఇంక - చెప్పేస్తాను" అని, ఫోన్లో నాన్నతో "లలిత, కిరణ్ వచ్చారంకుల్! వాళ్ళిద్దరూ టెనో క్లాక్ ఫ్లైట్‌లో రాజమండ్రి వస్తున్నారు. రిసీవ్ చేసుకోండి" అని చెప్పేశారు.

నేనలా రాజమండ్రి వెళ్ళినప్పుడు నాన్నని చూద్దామని లలితత్తయ్య కూడా వచ్చారు వైజాగ్ నుంచి. హైద్రాబాదు నుంచి లక్ష్మిదొడ్డ, తంబి మామయ్య కూడా వచ్చారు. ఓ రెండు వారాల పాటు వాళ్లందరితో గడిపే అపురూప అవకాశం నాకది.

ఒక రోజు మధ్యాహ్నం పుస్తకాలు తిరగేస్తున్న నాకు స్వాతి లోనో, నవ్య లోనో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన 'సత్యభామ' సీరియల్ కనిపిస్తే చదివాను. నాకంతగా నచ్చలేదు.

అదే సంగతి  "ఏం చదువుతున్నావ్ లల్లీ?" అనడిన లలితత్తయ్యకి చెప్తూ ఆ పుస్తకం పక్కన పెట్టేశాను.

అప్పుడే లక్ష్మీప్రసాద్ గారు రాసిన 'ద్రౌపది' నవల గురించి నాకు చెప్తూ ఆ మాటల్లోనే "లల్లీ! నేను భారతం, భాగవతం పూర్తిగా చదివాను. రెండిట్లో పోతన భాగవతం మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటావ్?" అన్నారు అత్తయ్యనాకు టెస్ట్ పెడుతున్నట్లు.

దానికి సమాధానం చెప్పడానికి నేను ఆట్టే ఆలోచించలేదు. "అత్తయ్యా! భారతం రాసిన కవిత్రయం రాజరాజనరేంద్రుడు అడిగితే రాశారు. పోతన రామభద్రుడు చెప్తే రాశాడు - అదీ తేడా!" అన్న నా సమాధానం  లలితత్తయ్యకి నచ్చేసినట్లే అనిపించింది.

అప్పుడే  రాజమండ్రి నుంచి వస్తూ బమ్మెర పోతన రచించిన శ్రీ మద్భాగవతం రెండు వాల్యూములు తెచ్చుకున్నాను. అప్పట్నుంచీ వారానికి ఒకసారైనా కొన్ని పద్యాలు చదువుతూ చిన్నప్పుడు నా చేత భాగవత పద్యాలు వల్లె వేయించిన నాన్నమ్మని, రామ్ బాబయ్యని తలుచుకుంటూ వుంటాను.

ఎప్పటికైనా నాకు నచ్చిన భాగవత పద్యాల గురించి నాకు తోచిన నోట్స్ రాసుకోవాలని వున్నా ఎప్పటికప్పుడు వాయిదా వేసేస్తూ ఉండేదాన్ని.

ఈ సంవత్సరం అక్టోబర్లో  మా వూళ్ళో తెలుగుభాషాభిమానులూ, పుస్తకిష్టులూ అయిన అమృతరెడ్డిగారు ఫోన్ చేసి "TAS - Telugu Association of St. Louis వారి దీపావళి జ్ఞాపిక (souvenir)లో ప్రచురించడానికి వ్యాసాలు కావాలి, మీరేమైనా రాసివ్వండి లలితా!" అనడగ్గానే నాకు ముందుగా గుర్తొచ్చింది భాగవతం గురించి నేను రాసుకొందామనుకున్న నోట్స్.

వెంటనే ఆయనకి తప్పకుండా రాస్తానని చెప్పి పంపించిన నా భాగవత వ్యాసంలో "శ్రీరామ చంద్రుడిలా అని కాకుండా శ్రీరామచంద్రుడిలా అని ఆ extra space తీసేసి సరిదిద్దగలరా లలితా కొంచెం?" అంటూ కనీకనిపించకుండా వున్న పలుకురాళ్లలాంటి తప్పులని సరిచేసిన అమృతరెడ్డిగారికి, నా ఈ వ్యాసాన్ని TAS Souvenir కోసం టైప్ చేసినప్పుడు వచ్చిన తప్పులని ఓపిగ్గా దిద్దిన TAS President ఆలూరి జితేందర్ గారికి బోల్డన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ... పోతన భాగవతం మీద నా మొట్టమొదటి వ్యాసం - ఇదిగో ఇక్కడే... 


ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం!!  

రంగా లాలీ... పండరి రంగా లాలీ 
మంగళాంగా దయాంతరంగ శుభాంగా లాలీ 

తల్లికి విశ్వరూపము చూపిన నల్లవాడా 
చల్లని నీ కృప చల్లర మాపై గొల్లపిల్లవాడా !

రంగా లాలీ... పండరి రంగా లాలీ 
మంగళాంగా దయాంతరంగ శుభాంగా లాలీ


తరతరాలుగా తెలుగింటి అమ్మలు పొత్తిళ్ళలో పాపని కృష్ణుడే అనుకుని పాడుకున్న లాలి పాట ఇది.

ఒక తమాషా అయిన విషయం ఏంటంటే తెలుగునాట పెళ్ళైన ప్రతి అమ్మాయి తన భర్త శ్రీరామచంద్రుడిలా వుండాలనుకుంటుంది. తన కడుపున పుట్టిన కొడుకుని మాత్రం జుట్టు కట్టి, నెమలి పింఛం పెట్టి, ముత్యాల హారాలు వేసి, చిన్న పట్టుపంచె కట్టి చిన్నికృష్ణుడిలా అలంకరించి మురిసిపోతుంది. ఏతావాతా చివరికి తేలేదేంటంటే రాముడిలా ఉండాలనుకునే ఆ అమ్మాయి భర్త కూడా ఓ అమ్మకి కృష్ణుడి లాంటి కొడుకే!

ఇంతకీ అమ్మలందరూ తమ పిల్లలు కృష్ణుడిలా వుండాలని ఎందుకనుకుంటారో?... ఎందుకంటే వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో, తాతయ్యలో ఎప్పుడో ఒకప్పుడు కృష్ణలీలల్ని కథలుగా చెప్పే వుంటారు. నిజమైతే బావుణ్ణు అనిపించే ఆ కథల్లో కృష్ణుడేం చేసినా ముద్దుగా ఉంటుంది. ఉట్లు తెంపినా, వెన్న దొంగిలించినా, ఆ అల్లరికి, ఆగడానికి గోపెమ్మలకి కోపం వచ్చినా, కృష్ణుడి ముద్దుమోము చూడగానే ఆ కోపాన్ని మించిన మురిపెం కలుగుతూనే ఉంటుంది.

ఆ కథల్లోని కృష్ణుడికి భయమంటే తెలియదు. కోపం రాదు, విసుగు లేదు. సాధించలేని విషయం లేదు. సొంతం కాని విజయం లేదు. ఎలాంటి సందర్భంలో నైనా కృష్ణుడిదే పై చేయి. అన్నిటా కృష్ణుడికే అగ్రతాంబూలం. ఎన్నడూ కృష్ణుడు స్వేచ్ఛావిహారి. కృష్ణుడి జీవితంలో దుఃఖానికి తావు లేదు. అన్నిటా, అంతటా సుఖమే, శుభమే. అంత మధురమైన కృష్ణలీలల గురించి విన్నవారికి మధురాధిపతే అఖిలం మధురం అనిపించక మానదు. అందుకే కన్నకొడుకు మీద మమకారం వున్న తల్లి తన కొడుకు కృష్ణుడిలానే అందరి కన్నా మిన్నగా ఉంటూ, ఎప్పుడూ ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడపాలని కోరుకుంటుందేమో!

అంతటి మధురమైన కృష్ణలీలల్ని అచ్చతెలుగులో ఎంతో హృద్యంగా, హృదయంగమంగా కృష్ణుడి వేణుగానానికి దీటైన శబ్దాలంకార భూషితమై, బాలకృష్ణుడి సిరిమువ్వ గజ్జెల లయకి సరితూగు నడక గల పద్యాల్లో ఎవరైనా రచించగలిగితే, అది మనం చదవగలిగితే ఎంత బావుంటుందో కదా! అలా రచింపబడిన గ్రంథమే భాగవతం. ద్వాదశ స్కంధ పద్య మాణిక్య భూషితమైన శ్రీ మదాంధ్ర భాగవతాన్ని రచించిన వారు బమ్మెర పోతన. ఆ రచన ఎలా జరిగిందో పోతన పద్యంలోనే చదువుకుంటే బావుంటుంది.

పలికెడిది భాగవత మఁట
పలికించెడివాడు రామభద్రుం డఁట నేఁ
బలికిన భవహర మగునఁట
పలికెద వేఱొండు గాథ బలుకఁగ నేలా? 


తాను పలికినది భాగవతమట. దానిని పలికించింది సాక్షాత్తూ శ్రీరామ చంద్రుడట. అది పలికితే భవబంధాలు తొలుగుతాయట. అందుకనే ఇంత గొప్పదైన భాగవతం తప్ప ఇంకోటి పలకనని అంటూ పోతన భాగవత రచన సాగించారు.

తాను రాయబోయే కృష్ణలీలల లోని చిలిపిదనాన్ని తనకెవరన్నా ఆపాదించి ఆక్షేపణ చేయకుండా మర్యాదా పురుషోత్తముడైన రాముణ్ణి ఊతగా తెచ్చుకున్న పోతన ఎంత చమత్కారి అనిపిస్తూ ఉంటుంది నాకు భాగవతం చదువుతూ ఉంటే!

తెలుగు వారి ఆస్తిక-ఆస్తి అనదగ్గ గ్రంథాలు ముఖ్యంగా మూడు. అవి రామాయణ, మహాభారత, భాగవతాలు.

రామాయణంలో దంపతులైన సీతారాముల వియోగం నిర్వేదం కలిగిస్తుంది. మహాభారతం లోని దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య వైరం, ఆపైన జరిగిన కురుక్షేత్ర యుద్ధం మనసుని వ్యాకుల పరుస్తాయి.

అదే భాగవతం లోని ముఖ్యపాత్రధారి కృష్ణుడు ఎలాంటివాడంటే ... పోతన పదాల్లోనే చదువుకుంటే విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు - అంటే సర్వవ్యాపి, ప్రకాశించువాడు, ఎల్లప్పుడూ జయమే పొందువాడు, సహనశీలి అయినవాడు కృష్ణుడు. కృష్ణుడంటే ఆనందం. కృష్ణుడంటే నమ్మకం. కృష్ణుడంటే భరోసా. పిలిస్తే పలుకుతాడు. కృష్ణుడంటే సాక్షాత్తూ విష్ణువు అంశ.

విష్ణువు ప్రహ్లాదుడిని దుష్టుడైన తండ్రి పెట్టే బాధల నుంచి రక్షిస్తాడు. మొసలి కోరల్లో చిక్కుకున్న గజేంద్రుడిని కాపాడుతాడు. వామనుడై దానమడిగి బలి చక్రవర్తిని పాతాళానికి సాగనంపుతాడు. కృష్ణావతారంలో వేలితో కొండనెత్తి గోపాలకులకు కొండంత అండై నిలుస్తాడు. సత్యభామా సమేతుడై నరకాసురుని వధించి ఇంటింట దీపావళి జరిపిస్తాడు. అలాంటి కృష్ణుడి కథలు మధురాతి మధురంగా కాక ఇంక వేరేలా ఎలా ఉంటాయి? అంతటి మధురమైన కథల సముదాయమైన భాగవతాన్ని పన్నెండు స్కంధాలలో తీయనైన తేట తెలుగులో పోతన మనకందించారు.

అది కూడా ఎలా?

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్ 


నీచులైన రాజులకి అంకితమిచ్చి అగ్రహారాలు, వాహనాలు, డబ్బులు, వస్తువులు తీసుకొని, వాటిని ఈ లోకంలో అనుభవించి, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే సమ్మెట పోట్లు తినడం ఇష్టం లేక బమ్మర పోతరాజు అనే నేను ప్రపంచ శ్రేయస్సు కోరి అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను అని చెప్తూ భాగవత రచనకి పూనుకున్నారు.


భాగవతంలో దశమ స్కంధం అంతా శ్రీకృష్ణ లీలల గురించే. అందులో ఒక భాగంగా రుక్మిణీ కళ్యాణ విశేషాలు తెలిపే పద్యాలు కూడా వుంటాయి. మునుపటి రోజుల్లో కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం పద్యాలు చదివిస్తే తొందరగా వివాహం జరుగుతుందని నమ్మేవారు. 
 

అంతటి ప్రశస్తమైన భాగవతం లోని కొన్ని పద్యాలు ఇక్కడ తలుచుకుందాం.

మొదటగా ... బళ్ళోకి పంపిస్తూ చదువుకునే పిల్లలకి సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ దండం పెట్టుకోమని చెప్తూ ఎంతో మంది తల్లులు నెమరేయించిన పద్యం...

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు భారతీ! 


ధవళవస్త్రధారిణి అయిన సరస్వతీ దేవిని పోతన తన ఊహలో పోల్చడానికి ఎంత మంచి ఉపమానాలు వాడాడో ! శరత్కాల మేఘాలు, చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, మల్లెపూల దండలు, మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మొల్లలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగ - ఇవన్నీ కూడా తెల్లని తెలుపురంగులో భాసిస్తూవుంటాయట. సరస్వతీ దేవికి ఉపమానాలట. అట్టి చల్లని తల్లి  కటాక్షం ఎప్పుడు కలుగుతుందా అని పోతన అడుగుతున్నారు.

భాగవతంలో వున్న పద్యాల్లో 'ఇది బావుంది' అని ఎంచి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని పద్యాలూ కూడా ఒక దానిని మించి ఇంకొకటి అన్నట్లు ఎంతో బావుంటాయి అర్థ-శబ్ద-అలంకారాలతో.


మధురమైన కృష్ణలీలా కథామృతాన్ని గురించి ప్రహ్లాదుడి చేత పోతన పలికించిన పద్యం:

మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
మరుగునే సాంద్ర నీహారములకు? 


నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?


ఎంత అద్భుతమైన భావం! నారాయణ మంత్రం భజించే ప్రహ్లాదుడిని హరినామం మానమని అన్న తండ్రి హిరణ్యకశ్యపుడి మాటలు విని తన గురువైన చండామార్కుడితో ప్రహ్లాదుడు "ఓ గురూత్తమా! మందార పూలలోని తేనె తీయదనాన్ని అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల కేసి పోతుందా? స్వచ్చమైన ఆకాశగంగలో విహరించే రాజహంస  వాగుల దగ్గరకు వెళ్ళదు కదా? పాటలు పాడే కోయిల తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తింటుంది కానీ   కొండ మల్లెల వైపు పోతుందా? నిండు పున్నమి పండువెన్నెలలో విహరించే చకోర పక్షి మంచు తెరల వైపునకు వెళ్తుందా? అలాగే విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. హరిపాదాల మీద నిమగ్నమై వున్న నా మనసు ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు." అన్న సందర్భం లోనిది పైన ఉదాహరించిన సీసపద్యం.

ఇలా చెప్పుకుంటూ వెళ్తే భాగవతంలోని ఏ ఒక్క పద్యాన్నీ వదలాలనిపించదు. అలా అని మొత్తం భాగవతాన్ని ఇక్కడ రాసుకోవడం కుదరదు. అందుకని శబ్దాలంకార పూరితమైన పద్యాలు కొన్నిటిని మాత్రం ఇక్కడ గుర్తు చేస్తున్నాను. 

(గజేంద్ర మోక్షం నుంచి మూడు పద్యాలు)
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.


కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో? 



ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. 



(నరకాసుర వధ నుంచి రెండు పద్యాలు)
లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "

నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా!  


(గోపికా వస్త్రాపహరణం నుంచి ఒక పద్యం)
మామా వలువలు ముట్టకు
మామా! కొనిపోకుపోకు మన్నింపు తగన్
మా మాన మేల కొనియెదు?
మా మానసహరణ మేల? మానుము కృష్ణా! 


చివరిగా వామనావతారంలో బలి మహారాజు వామనుని మూడడుగుల దానమివ్వబోతుండగా వద్దని వారించిన శుక్రాచార్యునితో బలి చెప్పిన మాటల (ఈ కింది పద్యంలో) ద్వారా ఈ లోకంలో కీర్తి మాత్రమే శాశ్వతం అని చెప్తారు పోతన.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా! 


ఓ భృగుపుత్రా!  శుక్రాచార్యా! ఇంతకు మునుపు ఎందరో రాజులు ఉన్నారు . రాజ్యాలు ఉన్నాయి . వాళ్ళు తమ  ఔన్నత్యాన్ని చూసి గర్వించిన వారే! కాని వారెవరు తాము సంపాదించిందేదీ మూటగట్టుకొని పోలేదు కదా! కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదే!  శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారికి లేదనకుండా దానాలు చేశారు. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా!

ఎన్ని మంచి పద్యాలో భాగవతంలో! వాటిలో కొన్నింటినైనా ఇలా మళ్ళీ స్మరించుకోవడం ఎంతో బాగుంది.

అన్ని వందల పద్యాల భాగవతాన్ని సంక్షిప్తంగా ఒక శ్లోకంలో పాడుకునే వీలుంది. అదే ఈ క్రిందనున్న ఏక శ్లోకీ భాగవతం !

ఆదౌ దేవకి దేవి గర్భ జననం గోపీగృహే వర్ధనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీ సుతాం పాలనం
ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం

స్వస్తి!

19, నవంబర్ 2018, సోమవారం

త్వామనురజామి - 30 - థియేటర్లో సిన్మా వుంది - ఇంటర్నల్లు టెస్టు వుంది - దేనినీ మానుకోముగా...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:  త్వామనురజామి - 29 - ఎంచక్కా పండింది ఎర్రాని చుక్కా..

నిరుపమ నా రూంలోకి మారిన కొన్ని రోజుల్లోనే డిసెంబర్లో తన పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు పొద్దున్నే లేచి ఇద్దరం టౌన్ బస్సెక్కి గోవిందరాజస్వామి గుడికి వెళ్ళి తొమ్మిదింటికల్లా CC (కంప్యూటర్ సెంటర్) కి తిరిగొచ్చేశాం - ఆ రోజుకి మొదటి పీరియడ్ మొదలయ్యేలోగా.

ఫిఫ్త్ సెమిస్టర్ మొదలయింది. ఈసారి ఒక ఇంటర్నల్ ప్రాజెక్ట్ కూడా చెయ్యాలి. ఇద్దరేసి అమ్మాయిలు ఒక టీం. అప్పటికి అరుణ అనే హైద్రాబాదు అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిందని వాళ్ళ ఫామిలీ అంతా తిరుపతి వచ్చేశారు. తను కూడా హాస్టల్ వదిలేసి డే-స్కాలర్‌గా మారింది. రోజూ మోపెడ్ మీద CC లో క్లాసులకి వచ్చేది. నేను నా ఫిఫ్త్ సెమిస్టర్ ప్రాజెక్ట్ తనతో కలిసి చేశాను - dBase లో. మా క్లాస్ అమ్మాయిలు అందరం చుట్టుపక్కల వున్న Spartek Ceramics (శ్రీనివాస మంగాపురం దగ్గర ) లాంటి కంపెనీలకి అక్కడ మేము చేయదగ్గ ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా ఉంటుందా అని కనుక్కోవడానికి వెళ్ళేవాళ్ళం. చివరికి నేను, అరుణ ఏదో అకౌంటింగ్ ప్యాకేజ్ ఒకటి చేసినట్టున్నాం.

అప్పుడే సంజయ్ దత్, పూజా భట్ నటించిన "సడక్" సినిమా రిలీజ్ అయింది. నేను, నిరుపమ, సునీత, మల్లిక, నిగమ వెళ్దామని అనేసుకున్నాం. అనుకున్నదే తడవు మా సినీగేటు గుండా వెళ్లి చూసొచ్చి, హాస్టల్కి తిరిగొచ్చి, అడుగడుక్కీ సదాశివ్ అమ్రపుర్కర్ గుర్తొచ్చి, జడుపొచ్చి తెగ నొచ్చేసుకున్నాం.

ఇంతకీ మా సినీగేటు సంగతి చెప్పనేలేదు నేను. దాని గురించి చెప్పాలంటే ఒక చిన్నసైజు సినిమా స్టోరీ లాంటి జరిగిన కథ ఒకటి చెప్పాలి.

మా హాస్టల్లో అమ్మాయిలుఎక్కడికి వెళ్లినా సాయంత్రం ఆరున్నరకల్లా హాస్టల్‌కి వచ్చెయ్యాలి కదా! అలా రాకపోతే మరి పాపం! - మా వార్డెన్‌కి, మేట్రన్లకి బెంగొచ్చేస్తుంది కదా! - వారి ఆరోగ్యమే మా మహా భాగ్యం కదా!

మేమసలే...

ఎప్పటి కెవ్వరి కిష్టమో
అప్పటికా మూవీకేగి, మేట్రన్ల మనముల్‌
నొప్పించక, ఆరవ్వక ,
హాస్టల్కు అరుగువారు  MCAలు సిన్మతీ...


అన్నట్లు జాగ్రత్త పడేవాళ్ళం కాబట్టి ... ఎప్పుడైనా సినిమా చూడాలి అంటే మాట్నీకి వెళ్లి ఆరింటికల్లా హాస్టలుకి తిరిగి వచ్చేసేవాళ్ళం.

ఇప్పడు డిసెంబర్లో ఐదో సెమిస్టర్లో కథ నడుస్తోంది కదా.

ఇప్పటికి కొన్ని రీళ్లు వెనక్కి వెళ్తే,  క్రితం నెలలో అంటే మేమింకా నాలుగో సెమిస్టర్లో ఉండగా, మా సీనియర్లు ఇంకా మాతో ఉండగా - నవంబర్లో రెండు హిందీ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి శ్రీదేవి-అనిల్ కపూర్‌ల లమ్హే , ఇంకోటి అజయ్ దేవ్‌గణ్ డెబ్యూ మూవీ - ఫూల్ ఔర్ కాంటే. సీనియర్లతో చివరాఖరిగా కలిసి చూద్దామని అనుకుని శ్రీలత, సంగీత, గుత్తి పద్మజ, పద్మజవల్లి, నేను - అందరం కలిసి శ్రీలతకి ఫేవరెట్ హీరోయిన్ అయిన శ్రీదేవి సినిమా అన్జెప్పి లమ్హే కి వెళ్ళాం.

ఎడారిలో ఇలా అరుణ్ పాటకి నెమలిలా నాట్యం చేస్తూ పెద్ద శ్రీదేవి, రెండు జళ్ళేసుకుని అనిల్ కపూర్ని అవస్తలు పెట్టే చిన్నశ్రీదేవి,  ఎటు చూసినా శ్రీదేవే శ్రీదేవి   - ఆ సినిమా మాకొక memorable लम्हा.

నా వరకు నాకనిపించిన చిన్నచిన్న excitements  ఏంటంటే  దీపక్ మల్హోత్రా పెద్దశ్రీదేవిని "పల్లో ... పల్లో... " అని బోల్డు hollowగా పిలవడం ఒకటైతే,  "పంచీ బాదల్ ప్రేమీ కె పాగల్ ... హం కౌన్ హై సాథియా?  ఓ...యాద్ నహీ భూల్ గయా" పాట చివర్లో శ్రీదేవిని రెండు చేతుల్తో మేకపిల్లలా ఎత్తుకోబోయి ఆమెతో సహా జలపాతపు రాళ్ళ మధ్య పడిపోవడం ఇంకోటి.

అది చూసి తెగ నవ్వుకుని ఊరుకున్నానా ?.... అబ్బే! పరిగెత్తుకుంటూ 502-బికి వెళ్లి నిరుపమ, మల్లిక, నిగమ, సునీతలకి లమ్హేలో శ్రీదేవిని ఎత్తుకోలేక దీపక్ మల్హోత్రా ఎలా పడిపోయాడో వర్ణించి చెప్పి, చెప్పి వాళ్లతో మళ్ళీ అదే సినిమాకి వెళ్లి రెండోసారి చూసి వచ్చాను.

ఇంతలో  ఫూల్ ఔర్ కాంటే కూడా ఊళ్ళో ఇంకో థియేటర్లో ఉందని తెలిసింది. చూడకపోతే కళ్ళు నీలాలు కారతాయి - చూసెయ్యాలి మరి!

ఓ రోజు అమ్మాయిలమందరం ఏదో క్లాస్ కాన్సెల్ అయిందని CC మెట్ల మీద వరసా... గ్గా బొమ్మలకొలువులా కూర్చుని మాట్లాడుకుంటూ వున్నాము.

అప్పుడు నేను అందరూ ఒకచోట దొరికారు కదా అనుకుని వాళ్లతో  "మళ్ళీ ఫిఫ్త్ సెమిస్టర్ మొదలైతే బోల్డు బిజీ అయిపోతాం అందరం. మన 4th sem ఫైనల్స్‌కి ఇంకా టైం వుంది కదా...  ఈ లోగా ఈ ఒక్క సినిమా అందరం కలిసి చూద్దాం, ప్లీజ్, ప్లీజ్!" అనగానే బుద్ధిమంతులైన వాళ్ళందరూ ఏకగ్రీవంగా  "అమ్మో! ఫైనల్ సంగతి దేవుడెరుగు. రెండ్రోజుల్లో ఇంటర్నల్స్ వున్నాయి. కుదరదంటే, కుదరదు" అన్నారు.

నేను వెంటనే "ఇంటర్నల్స్ లేనప్పుడు, ఇంట్లో ఖాళీగా వున్నప్పుడు సినిమాలు ఎవరైనా చూస్తారు. కానీ ఇంటర్నల్స్ జరుగుతున్నప్పుడు కూడా బెదరకుండా సినిమాలు చూడగలిగేది ఒక్క MCA వాళ్ళే, అంటే మనమే! కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా chapter xerox copies మనతో తీసుకెళ్దాం. రిక్షాలో వెళ్ళేటప్పుడూ, క్యూలో టికెట్ల కోసం నించున్నప్పుడూ side-headings అన్నా చదువుకోవచ్చు కదా! Let's show to theworld how to utilize the available resources efficiently" అని ఏదేదో మాట్లాడేసి మొత్తానికి అందర్లోనూ సినిమావేశం కలిగించగలిగాను.

ఓ ఆదివారం మధ్యాహ్నం సాంబారన్నం - అప్పడాలతో తినేసి, ఎంచక్కా మొహాలు కడిగేసుకుని, జుట్లల్లుకుని, బుక్కులట్టుకుని, జట్లుజట్లుగా  బయల్దేరాం - ప్రగతి, మాధవీలత, ఉష, అపర్ణ, నిరుపమ, సునీత, నేను, మల్లిక, నిగమ - ఇంతవరకు గుర్తున్నారు - ఇంకా ఎవరెవరు వచ్చారో పూర్తి లిస్ట్ యాద్ నహీ అబ్ !

కొందరు ముందు వెళ్లిపోయారు. నిరుపమ, నేను, సునీత కొంచెం లేటుగా బయల్దేరాం. తీరా మా హాస్టల్ దగ్గరుంచి మా పాత హాస్టల్ వైపు నుంచి వెళ్లే దారిలో వుండే చిన్న గేటు తాళం వేసి వుంది. దానికి ఎప్పుడూ, అందులోనూ పగటిపూట ఎవరూ తాళం వేయరు. ఇదేంటబ్బా? అనుకున్నాం. అసలే సినిమాకి టైం అయిపోతోంది. మిగిలిన అమ్మాయిలందరూ మా CC పక్కనుంచి బాలాజీ కాలనీ రోడ్డు మీదగా వెళ్లి రిక్షా ఎక్కి వెళ్ళివుంటారు. మేం మాత్రం ఇటొచ్చి ఇలా చిక్కుకుపోయాం. ఇంకిప్పుడు ఈ తాళం ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా వేశారు అనాలోచించే తీరిక, ఓపిక రెండూ లేవు.  గేటు చూస్తే చిన్నది. మేం ముగ్గురం గబగబా ఆ చిన్నగేటు ఇనప చువ్వల మీదుగా ఎక్కి ఇట్నుంచి అటు దిగేశాం. గబగబా నడుచుకుంటూ వెళ్లి అటుగా వస్తున్న ఓ రిక్షా ఎక్కేసి సినిమా హాలు దగ్గరికి వెళ్లిపోయాం.

అక్కడికి వెళ్ళాక మా గేట్-క్రాసింగ్ అడ్వెంచర్ గురించి చెప్తుంటే బోల్డంత నవ్వుకుంటూ విన్న మా క్లాస్ అమ్మాయిలు చల్లగా చెప్పింది ఏంటంటే  - MCA అమ్మాయిలు పరీక్షలు దగ్గరికి వస్తుంటే చదువుకోకుండా సినిమాలు చూద్దామని ప్లాన్లు వేస్తున్నారని వేగుల వల్ల విని మా వార్డెన్ అయిన విజయలక్ష్మిగారు గేటుకి దగ్గరుండి మరీ గోద్రెజ్ తాళం వేయించారని, అందుకే వాళ్ళందరూ కొంచెం ముందుగా బయల్దేరి CC పక్క రోడ్డు లోంచి సినిమాకి వచ్చారని.

అదుగో... ఆరోజు ... అలా ... ఆ విధంగా... ఆ పళంగా - మేము దూకిన ఆ చిన్నగేటు మా సినీగేటు.

అంత ఆపసోపాలు పడి, ఆఘమేఘాల మీద వచ్చామా?!- టికెట్ కౌంటర్ ఇంకా తెరవనే లేదు. సరే! మేమందరం ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా టిక్కెట్ల క్యూలో నించుని మా మా xeroxలు తెరిచి పట్టుకుని చదువుకోవడం మొదలు పెట్టాము. నాకు తెల్సి మా బ్యాచ్ అమ్మాయిల్లా సినిమా టికెట్ల క్యూలో కూడా చదివేసుకున్న the most studious batch మాకు ముందు ఉండి వుండరు, మా తర్వాత వుండబోరు.



మొత్తానికి ఫూల్ ఔర్ కాంటే లో అజయ్ దేవ్‌గణ్ అంతగా నచ్చకపోయినా హేమ్మాల్ని మేనకోడలైన  మధుబాల ఉందని సరిపెట్టేసుకుని చూసేశాను (నాకప్పటికీ, ఎప్పటికీ సినిమా వాళ్లలో ఎవరు ఎవరికి చుట్టాలు అనేది ఒక ఇంటరెస్టింగ్ టాపిక్. అలాగే అప్పట్లో మోడలింగ్ చేస్తూ సినిమాల్లో కొచ్చిన హీరో, హీరోయిన్లని గుర్తు పట్టడం నాతో నేనే ఆడుకుని మురిసిపోయే ఒక fun  exercise  నాకు.)

సినిమా అయిపోయాక ముందు జాగ్రత్తగా మా సినీగేటు ఛాయలకి వెళ్లకుండా వేరే దారిలోంచి హాస్టల్ చేరుకున్నాం.

ఇంతలో ఏమయ్యిందంటే - హఠాత్తుగా ఓ ఆదివారం పొద్దున్నే అమ్మాయిలందరూ దోశె breakfast చేసి వస్తూ ఉండగా - మా డైనింగ్ హాల్ ఎదురుగుండా, అద్దాల తలుపుల వెనకాల వుండే నోటీసుబోర్డులో ఒకానొక నోటీసు కాయితం అతికించబడి కనిపించింది.

ఏమనీ?....  అంటే... "If anyone wants to watch so&so movie, go and get your tickets from the Warden" అంటూ.

అమ్మాయిలందరూ ఆ నోటీసుబోర్డు చుట్టూ గుంపుగా చేరి ముసిముసిగా నవ్వుకుంటున్నారు.  ఇంతలో MCA అమ్మాయిల్ని వార్డెన్ రమ్మంటున్నారని పిలుపు.

వెళ్లిన మాకు  "ఆ కాయితం ఎవరక్కడ పెట్టారో మర్యాదగా చెప్పండి" అంటూ వార్డెన్ నుంచి దబాయింపు.

మేమది వినగానే   "ఆయ్! హన్నా! మేము సినిమా క్యూలో కూడా చదువుకునేంత శ్రద్ధ వున్నవాళ్ళం. కాయితాలు అతికించడాలూ, అగ్గిపుల్లెట్టి అంటించడాలూ లాంటి విషయాల్తో మాకేమీ సంబంధం లేదు. అసలే...  క్లాసులోనో, ల్యాబ్ లోనో లేటయ్యి ఆలస్యంగా వచ్చే మాకు అన్నం, అప్పడాలూ తప్ప ఏమీ వుండట్లేదు. పైగా ఈ అభాండాలొకటి. వుండండి మళ్ళీ స్ట్రైక్ చేస్తాం" అనగానే "ఆ" అంటే ఆర్నెల్లు-ఉండి-పోయేవాళ్ళం మాతో గొడవెందుకని ఆట్టే మాట్లాడకుండా పంపించేసింది మా వార్డెనమ్మ.

ఇప్పటికీ ఆ నోటీసుకాయితం అంటించి తన ఒళ్ళు మండించిన వారెవ్వరో మా అప్పటి వార్డెన్ గారికి తెలిసే అవకాశమే లేదు ;)

ఈ సినిమాల విషయంలో ఇంకొక తమాషా కబురేంటంటే... సినిమాకి అందరం కలిసి వెళ్ళినప్పుడు పొరపాటున నేను కానీ, నిరుపమ కానీ - రిక్షాలకి, సినిమా టికెట్లకి అందరికీ కలిపి డబ్బులు మేమే పెట్టుంటే - మా డబ్బులు మాకు తిరిగి వచ్చేవరకూ అమ్మాయిలకి లెక్కలు చెప్పి, మాకెంత ఇవ్వాలో గుర్తు చేసి విసిగించేవాళ్ళం. అందుకే మమ్మల్నిద్దరినీ సునీత 'గుంటూరు మార్వాడీలు' అని తిట్టేది.

ప్రతిరోజూ సాయంత్రం నాలుగున్నరకి మా హాస్టల్లో టీ-టైం కదా! మేము మా మధ్యాహ్నం క్లాసులు అయిపోయి రూంకి తిరిగివచ్చే టైం అది.

నిరుపమ, నేను వస్తూవస్తూనే మూడో అంతస్తులో వున్న మా రూం దాకా వెళ్లి మా గ్లాసులు తెచ్చుకునే ఓపిక లేక కింద గదుల్లో ఎవరో ఒకరి దగ్గర గ్లాసులు అరువు తీసుకుని టీ తాగేసి, ఆ గ్లాసులు ఎవరివో వాళ్లకి కడిగి ఇద్దామనే మహామంచి ఉద్దేశ్యంతోనే  తీసుకుని మా రూంకి వెళ్లిపోయేవాళ్ళం. కానీ వెంటనే ఇచ్చేవాళ్ళం కాదు. అలా మా రూంలో చిన్నవీ, పెద్దవీ, రకరకాల ఆకారాలున్నవీ అయిన ఓ పే ...ద్ద స్టీలు గ్లాసుల గుట్ట పెరిగిపోతూ ఉండేది. అప్పట్నుంచీ ఎవరి రూంలోనైనా వాళ్ళ గ్లాసులు కనిపించకపోతే "ఆ గుంటూరు మార్వాడీల రూంలో వెతుకుదాం పదండి" అంటూ వచ్చి వాళ్ళ గ్లాసులు వాళ్ళు వెతుక్కుని, మా ఇద్దరినీ తిట్టి మరీ పట్టుకెళ్ళిపోయేవాళ్లు. అలా మా యథాశక్తి గళాసు-పోషణ చేసేవాళ్ళం నిరుపమా, నేనూను.

ఐదో సెమిస్టర్ రోజులిలా సాగుతుండగా... ఓ ఆదివారం ఎప్పట్లాగే రాత్రి తొమ్మిదింటికి ఇంటి నుంచి ఫోను...

ముందు అమ్మ, పప్పి, కుట్టి - respectively మాట్లాడారు . ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలెలా రాశానో కనుక్కున్నారు.  కుట్టి ఇంకో రెండ్రోజుల్లో వైజాగ్ వెళ్ళిపోతున్నానని చెప్పింది. అప్పుడది లలితత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి బండారు చిట్టిబాబుగారి దగ్గర లలితసంగీతం నేర్చుకుంటోంది.

చివర్లో నాన్న తీసుకున్నారు ఫోన్.

"లల్లీ! నేను తిరుపతి వద్దామనుకుంటున్నాను. నీకు దగ్గర్లోఎగ్జామ్స్ ఏమీ లేవు కదా?"

"ఏవో ఇంటర్నల్స్ తప్ప పెద్ద ఎగ్జామ్స్ ఏమీ లేవు నాన్నా! మీరొక్కరే వస్తున్నారా?"

"నాతో మన రవి కూడా వస్తాడు"

"ఊ ... అవునా?"

"అదే...  అతని పేరెవరన్నావ్?  అమ్మొచ్చి కలిసింది కదా ఆ మధ్య !"

"తనా ... తనూ ... బదరి...  నాన్నా!"

"అదే.... అతన్నే ఒకసారి కలవాలి నేనూ.... మాట్లాడాలి"

"సరే! నాన్నా! చెప్తాను."

"Alright! టికెట్స్ రిజర్వు అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను. Good Night!"

"Good Night, నాన్నా!"

ఫోన్ పెట్టేశారు. అప్పుడు తట్టింది నాకు - 4th Sem పరీక్షల ముందు దీపావళికని ఇంటికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ కూడా అస్సలు బదరి విషయమే ఎత్తలేదు. అందులోనూ నాన్న ఏవో సరదా విషయాలు మాట్లాడారు అంతే! తీరా అబ్బాయి గురించి మాట్లాడడం మొదలు పెడితే అది అట్నుంచి ఇంకెటో వెళ్లి - దానితో నాన్న కోపం ఆపుకోలేక నన్నేమైనా అంటే నేను బెంగ పెట్టుకుని పరీక్షలు బాగా రాయలేనేమో అనుకుని అందరూ గప్-చుప్‌గా వున్నారు. ఆలా జరిగిందంతా గుర్తు చేసుకోగానే - మా ఇంట్లో అందరికీ నేనంటే ఎంత ఇష్టమో కదా ...అనిపించింది. అంతకు మించి నాన్న వచ్చి ఏం మాట్లాడతారా అన్న చిన్న curiosity, కొంత బెంగ. మళ్ళీ - ఎలాగూ రాబోతున్నారు కదా ఇప్పట్నుంచే ఆలోచించేసి దిగులు పడిపోవడం ఎందుకని సర్దేసుకున్నాను.

ఇప్పటికీ కబుర్లు ఇక్కడికి చాలనుకుంటూ ఆపుతూ - నే రాసుకున్న కొసరు పాట ...అసలు పాటేంటో మరి!?


థియేటర్లో సిన్మా వుంది  - ఇంటర్నల్లు టెస్టు వుంది - దేనినీ మానుకోముగా...
క్యూలో నించునుండి  ...   చేతిలో బుక్కు పట్టి ...  ఇక్కడే చదువుతాముగా...
మేమేమో సిన్మా అంటే ... ఉరుకు ఉరుకు
ఇంటర్నల్లు టెస్టు అంటే ... బెరుకు బెరుకు
పాటలూ ఆటలున్న సిన్మా మేలు...
Sem లో ఫెయిలయితే గోలుమాలు...
త్వరగ ... త్వరగ ..  క్యూలో చేరుతాం !
హర్రీగా ... హర్రీగా...  బుక్స్ చదువుతాం!



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

12, నవంబర్ 2018, సోమవారం

మనసే జతగా పాడిందిలే - 12 - కవలపాటలు - తెలుఘంటసాల పాటనూ... హిందీలో తలత్ పాడెనూ...

అలవాటుగా తెరిచిన Desi Radio
అలవోకగా ఒత్తిన Hindi Non Stop Hits
అనుకోకుండా విన్న ఆ పాట
అప్పుడే ముగియబోతున్న ఓ తలత్ మెహమూద్ పాట
అరె! ఇది మన రాకుమారి - తోటరాముళ్ల పాట అనిపించిన పాట
అప్పటికప్పుడు కలమూ-కాగితమూ వెతుక్కుని రాసుకుందామనుకుంటే చిక్కినది ఒకే ఒక లైను - ఆ పాటలో చిట్టచివరి లైను "జహా నైన్ మిల్ గయే..." అంటూ
అక్కడ ... అలా... మొదలు... నా జత-రాగ పరిశోధన!
దొరికిందేమో ఒక్కటంటే ఒక్క లైను - అది కూడా పల్లవిలో మొట్టమొదటిదిలా లేనే లేదు. 
ఎక్కడని వెతకడం? ఎలా వెతకడం?
అప్పుడనుకున్నా - అండగా... గూగులుండగా...  తన పద-సెర్చుల అదనుండగా  - నాకెందుకింత బెంగా? - అని. 
అనుకున్నదే తడవు గూగులించా - అందులో తేలొచ్చిన పాటలన్నీ గాలించా... 
అద్గదీ! అలా దొరికేసింది నాక్కావల్సిన కవల-పాట ... హిందీ-డబ్బుడు వెర్షన్ ఆఫ్ తోటరాముడి పాట. 
అప్పనంగా యూట్యూబ్‌లో దొరికిన ఈ అబ్బురపు కవలపాటలు ఈ పూటకి నా బ్లాగ్రాతకి భాగ్యప్రదాతలు.
 

తెలుఘంటసాల-లీలల పాట:

మూవీ: పాతాళ భైరవి
కవి: పింగళి నాగేంద్రరావు
చెవికింపు (గా సంగీతం కూర్చినవారు): ఘంటసాల
మోవి: ఘంటసాల, పీ లీల
ఆడిన బొమ్మలివి: ఎన్టీఆర్, మాలతి

ఓ అంతఃపురపు రాకుమారి కోటలో, ఆ రాకుమారిని చూసి మరులు గొన్న తోటరాముడు తోటలో - జాబిలి నీడన వెన్నెల తోడుగా తెమ్మెర ఆడగా - ఆ జాబిలికి, వెన్నెలకి, తెమ్మెరకి - చెప్పుకుంటున్న ఊసుల పాట ఇది.

అమ్మాయీమణిని తోటరాముడు ఎంతో ఘాటుగా ప్రేమించాడట.  ఆ ఘాటు ప్రేమతో చూసిన చూపు తీవ్రమైనదట. ఆ తీక్షణమైన కన్నుకాటు తిన్న కన్నెమనసు కళలు విరిసి మురిసెనట. కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే...  కన్నుకాటు తినడం అన్న మాటల వాడుక ఈ పాటలో తప్ప నాకు తెలిసినంతలో ఇంకో పాటలోఎక్కడా వినలేదు. అందులోనూ ఇంత మంచి సందర్భంలో, ఇంకెంతో మంచి అర్థంలో.

తోటరాముడికేమో రాకుమారిలోతన మీద అప్పుడప్పుడే మనసు చాటున పుట్టిన లేలేత వలపు కనుచూపులోనే తెలిసిపోయిందట. ఆ వలపుని ఇంకా పెంచమని, విరహమతిశయించేలా చేయమని మార్కస్ బార్ట్లీ గారు కెమెరా కన్నుతో పట్టేసి వెండితెర మీద అట్టేపెట్టేసిన చంద్రుడిని, ఆ చంద్రుడే ఇచ్చాడా అనిపించేలా వెలిగిపోతూ వెలిగిస్తున్న వెన్నెలనీ, హాయిగా వీస్తున్న తెమ్మెరనీ - ఎంతగా పెంచాలో చెప్తున్నట్టుగా చెయ్యి ఊపుతూ మరీ చెప్తున్నాడు. ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే... అన్న లైను దగ్గర నందమూరివారి హస్తచాలనం నయనమనోహరం. ఘంటసాలవారి గాత్రమే నందమూరి సుందర రూపమయ్యిందో, నందమూరి అందమే ఘంటసాల గాత్రమాధుర్యాన్ని పెంపు జేసిందో తెలుసుకోలేనంతగా అద్భుతంగా ఉంటుంది ఆ మేల్కలయిక.  

కనిపించే  ౘందమామ, కనిపించని పిల్లగాలికి ఊగే పూలు, లతలు చూస్తూ -  ఈ పాట విన్నప్పుడల్లా నాకు చప్పున గుర్తుకొచ్చేది As You Like It లో Rosalind అన్న మాటలు...  

"No sooner met but they looked; no sooner looked but they loved; no sooner loved but they sighed; no sooner sighed but they asked one another the reason;"


షేక్స్పియర్ గార్రాసిన ఒక మంచి romantic comedy ని గుర్తు తెచ్చే ఈ పాటంటే నాకు భలే ఇష్టం.

ఇప్పటికి మరి ఈ పాట చూస్తూ, వింటూ, మీరూ అంటూ ఆనందించండి మరి! 








ఎంత ఘాటు ప్రేమయో - ఎంత తీవ్ర వీక్షణమో...  ఓ..
ఎంత ఘాటు ప్రేమయో...
కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే...
నా మనసు మురిసెనే...నా మనసు మురిసెనే...
ఎంత ఘాటు ప్రేమయో...

ఎంత లేత వలపులో - ఎంత చాటు మోహములో... ఓ..
ఎంత లేత వలపులో...
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే...
నా మనసు నిలిచెనే...  నా మనసు నిలిచెనే...
ఎంత లేత వలపులో...

ఈ జాబిలి...  ఈ వెన్నెల...  ఈ మలయానిలమూ...  
ఈ జాబిలి...  ఈ వెన్నెల...  ఈ మలయానిలమూ... 
విరహములో వివరాలను విప్పి జెప్పెనే...
ఎంత ఘాటు ప్రేమయో...

ఓ జాబిలి...  ఓ వెన్నెల...  ఓ మలయానిలమా...
ఓ జాబిలి...  ఓ వెన్నెల...  ఓ మలయానిలమా...
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే...
ఎంత లేత వలపులో... ఎంత చాటు మోహములో...  ఓ..
ఎంత లేత వలపులో...



హిందీ తలత్-గీతాదత్తుల నోట:  మూవీ: పాతాళ భైరవి
కవి: పండిట్ ఇంద్ర చంద్ర
చెవికింపు (గా సంగీతం కూర్చినవారు): ఘంటసాల
మోవి: తలత్ మహమూద్, గీతా దత్
ఆడిన బొమ్మలివి: ఎన్టీఆర్, మాలతి



ఈ హిందీ కవలపాటను అనుకోకుండా విన్నానన్నాను కదా! యూట్యూబ్ వీడియో కన్న తర్వాత ఇలా అనుకున్నా... అదే సీను, అదే రాగం, అదే ఏక్షను... (ఈ పాటకే మాత్రం సంబంధం లేని అందమైన-విలను ఆర్నాగేశ్వర్రావు అన్న అదే దెబ్బ, అదే చెయ్యి, అదే మడిసి మాటల్ని తలుచుకుంటూ ...)

మీరు కూడా తెలుగు పాటతో పాటుగా ఈ కింది హిందీ పాటని కూడా చూసి, విని, పాడుకుని ఆనందించండి మరి!





కహి ప్రీత్ సే భరా - కోయి గీత్ గా రహా
కహి ప్రీత్ సే భరా...
అఖియా మిలా మిలా - ముఝ్ కో బులా రహా
జియరా ఉమంగ్ మే - జియరా ఉమంగ్ మే
కహి ప్రీత్ సే భరా... 

జహా నైన్ మిల్ గయే... వహా ప్రాణ్ ఖిల్ గయే...
జహా నైన్ మిల్ గయే...
మేరే అంగ్ అంగ్ మే - కోయి ఛా రహా
మన్‌వా తరంగ్ మే - మన్‌వా తరంగ్ మే
జహా నైన్ మిల్ గయే...

యే చంద్రమ... యే చాంద్‌నీ... యే కలియా...  యే లతా...
యే చంద్రమ... యే చాంద్‌నీ... యే కలియా...  యే లతా...
లెహ్‌రా కే మన్ కా మేరే దే రహే పతా
కహీ ప్రీత్ సే భరా...

ఓ చంద్రమా...  ఓ చాంద్‌నీ... ఓ కలియా...  ఓ లతా...
ఓ చంద్రమా...  ఓ చాంద్‌నీ... ఓ కలియా...  ఓ లతా...
మేరీ ప్రీత్ కా సందేశ్‌వా దో ఉసే బతా
జహా నైన్ మిల్ గయే... వహా ప్రాణ్ ఖిల్ గయే
జహా నైన్ మిల్ గయే...



ఈ కవలపాటల గాలింపు-బ్లాగింపు ఇంతయ్యాక, చివరాఖరి తాలింపులా మర్రొంత నా పేరడీ-పాటా చేరుస్తానేం!
అదే వరసలో నే పాడేసుకుంటూ - మీరూ పాడేసుకుంటారనుకుంటూ...

ఇట్లు,
~ పాటల భైరవి 

తెలుఘంటసాల పాటనూ... హిందీలో తలత్ పాడెనూ...ఓ...
తెలుఘంటసాల పాటనూ...
ఇద్దరివీ వినినంతనే మురిసిపోతినే
నే పోస్టు రాస్తినే...  నే పోస్టు రాస్తినే...
తెలుఘంటసాల పాటనూ...


ఆ పాటకు...  పీ లీలయు...ఈ పాటకు... గీతాదత్తుయూ...
తమ వంతుగ తేనెపూతల గొంతులు కలిపిరే
తెలుఘంటసాల పాటనూ… హిందీలో తలత్ పాడెనూ… ఓ...
తెలుఘంటసాల పాటనూ… 


6, నవంబర్ 2018, మంగళవారం

ట్రంపో రాజా భవిష్యతి! అవునో కాదో చెప్పేదెవరంట?!

రెండేళ్ల క్రితం జనులందరు కూడి ఒత్తిన టచ్చుస్క్రీను బాలట్టు 
వేసినవారికి కౌంటవ్వని వోటు 
వేయనివారికి లోటవ్వని వోటు
దేశానికి తెచ్చిందో ట్రంపోటు 
వట్టిదెంత ఆ  వోటు!
ఓటిదెంతొ ఆ వోటు !  



రెండేళ్ల తర్వాత మళ్ళీ పిలుపు రండి రండి మీరందరని 
నచ్చినవారికి వెయ్యండని 
నచ్చనివారిని తొయ్యండని 
Rep నుంచి Dem కి జంపుడని 
అట్లు చేసిన బెదురును ట్రంపుడని 
చూదమింక ఎన్నిక త్రాసెటు తూగునోనని!
ఏళ్ళు రెండిక వేచివుండక ఎలాగూ తప్పదని!


రెండేళ్లు మరి ఆగాలి అందరమూ వోటేయుటకంట   
ఈలోగా డిబేట్లు జరుగునంట 
ట్విట్టర్లు తిట్టర్లవుదురంట
ట్రంపరి, ట్రంపారి - వీరిలో గెలిచేదెవరంట?
ఇంతా జరిగి చివరికి తేలేదేంటంట?
ట్రంపో రాజా భవిష్యతి! అవునో కాదో చెప్పేదెవరంట?!
 

4, నవంబర్ 2018, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 4 - టీనేజ్ vs. బీనేజ్

ఎండ అపురూపమైన Autumn మధ్యాహ్నవేళ...



(శిశిరం మంచి మాటే...కానీ "Autumn" feels like a harsh-less word as even the mention of it brings a pallete of bright hues, painting the memory vividly - with all the shades that are: of red, of orange, of purple,  of maroon... which motivates me to use this English cousin of శిశిరం)

తలుపు తెరిచీ తెరవగానే పలకరించిందో ఆకురాల్చు గాలి
ఆగాల గాలి... ఈల రాగాల గాలి
చెదురుమదురుగా వున్న మబ్బుల్ని అదిలించిన గాలి
ఎంత సేపా ఊసుపోని తిరుగుడు?  కురిసిపొండని కసిరిన గాలి
దగ్గర జేరి చిక్కనైన మబ్బుల చూసి మురిసిన గాలి
కరిమబ్బు గొడుగు కింద ఎంతలేసి చెట్లనూ ఊపేస్తున్న గాలి
వున్న పుంజీడు ఆకులనీ రాల్చేస్తున్న రాలుగాయి గాలి
చలి గాలి -  బరువెక్కిన తడి గాలి
కుదురుండని పొగరు గాలి
ఉండుండి వీస్తూ ఈ చెంపని ముట్టి, ఇంకో చెక్కిలి తాకి
అక్కడక్కడే ఒంటిని చుట్టి ఒణికిస్తూ ఉంటే
ఆ ఆగకుండా వీచే గాలి దొరికింది కదా అని అదెటూ ఎక్కడికీ మోసుకుపోదు, ఒకవేళ ఆరాటంతో మోసుకెళ్లినా నోరు లేని గాలి వూరు దాటనియ్యదనే భరోసా వుండనే వుంది కదా!
అందుకే కబుర్లాడడం మొదలెట్టా.
నేనన్న మాటకి "ఊఁ ...ఆఁ " అన్నట్లు చిన్నిచిన్ని ఈలలూ, ఊళలే తప్ప ఇంకో మాటే మాట్లాడదే ఆ వెఱ్ఱిగాలి!?
నాదే సవాలు, నాకే జవాబు
కాస్సేపటికి విసుగు రానే వచ్చింది - నా ఒంటిగొంతు రాగం వినీ వినీ
చుట్టూ చూశా
కనుచూపుమేర ఇళ్ళు
ఇళ్ల చుట్టూ చెట్లూ
చెట్ల బారుల మధ్య దారులు
ఆ దారుల అప్పుడోటీ, అప్పుడోటీ సాగే కారులు
ఒక్కసారిగా బెంగొచ్చింది
ఒక్కదాన్నే వున్నానన్న దిగులేసింది

నేనేమన్నా మణులడిగానా, మాన్యాలడిగానా - PGW గారి Wooster మోస్తరులో - regular meals, a good show with decent music every now and then, one or two pals to totter round with, I ask no more - అనే కదా నేననేది? మీల్సూ, షోసూ ఉంటే సరిపోదుగా! ఊసుపోని వేళల ఊసులాడుకోవడానికి Pals తప్పనిసరే కదా!

చటుక్కున లేచి ఒక వేడివేడి కాఫీ కలుపుకున్నాను
చేత ఫోన్ పట్టి దూరానున్న చెలిమి-కలిమితో మాట కలుపుకున్నాను.


"హలో బావున్నావా?"

"నువ్వేనా? ఎంత కుదురుగా పలకరిస్తున్నావ్? ఇది నిజమేనా?"

"అబ్బా! అప్పుడప్పుడన్నా మంచిదాన్ననిపించుకోనీ. ఇంతకీ breakfast చేశావా?"

"ఎందుకూ? నీతో మాట్లాడడానికి strength వుందో లేదో అని పరీక్షిస్తున్నావా?"

"ఏదో మరి నా స్వార్థం! గాలితో ఊసులు చెప్పీ చెప్పీ ఉసూరుమంటున్నాను. మనిషితో మన్నికైన భాషలో కబుర్లకి కలవరిస్తున్నాను. ఆకలి కేకలు వెయ్యకపోతే ఇంకో నాలుగు మాటలెక్కువ చెప్తావని."

"బానే వుంది. మంచి టైంకే చేశావనుకో ఫోన్. ఇప్పుడే ఓట్లతో పోసిన అట్లు తిని వున్నా. నీతో మాట్లాటకి నేను సిద్ధం."

"ఓట్లతో అట్లు - rhyme భలేగా కుదిరింది."

"దానికే మురుస్తావే, మరి మిల్లెట్లతో పుల్లట్లు అంటే ఇంకేమంటావో?"

"ఏమంటాను ... దోశలే కాదు ప్రాసలూ బా వేస్తావంటాను. ఇంతకీ మీ ఊరెలా వుంది?"

"ఊరుకేం? ఊరికే వూరేగాలనిపించేలా వుంది. ఊరేగడమంటే గుర్తొచ్చింది. ఈసారి Halloween కి ఎప్పట్లానే నీ బుజ్జిజింకతో కలిసి ఊరేగావా?"

"అబ్బే... ఎక్కడా?! వాణ్ణి ఎంత అడిగానో - 'మళ్ళీ వచ్చే ఏడాది హైస్కూల్‌కి వెళ్తావూ, పెద్దవాణ్ణయ్యానంటావూ, అందుకని మనిద్దరం ఎంచక్కా వేషాలేసుకుని, అందర్నీ భయపెట్టేసి  సంచుల నిండా చాక్లెట్లు తెచ్చుకుందాం రారా' - అని"

"మరింతకీ వెళ్ళారా?"

"ఉహూఁ ! దానికి వాడేమన్నాడో తెలుసా? నేను టీనేజర్ని, రానన్నాడు. పైగా నేనైతే భయపెట్టాలంటే వేషం వేసుకోవాలి. నువ్వు మాత్రం నేనర్స్ అన్నట్లు ఎప్పుడూ ఎలా వుంటావో అలా వచ్చేసినా చాలు అన్నాడు చిలిపి నవ్వు బుగ్గసొట్టల్లో దాచేసుకుంటూ."

"హహ్హహ్హా... మాట్లాటలో నీకు వాడు సమవుజ్జీనే - అనుమానం లేదు. అయితే తండ్రీకొడుకులిద్దరూ నిన్నాటపట్టిస్తున్నారన్నమాట. మరి నువ్వు అలగలే?"

"అలకెందుకూ, ఉలుకెందుకూ? వున్నమాటేగా?! అయినా నిన్ను నిన్నుగా feaరించుటకూ, నీ రూపమె గాంచి దడిచేందుకు మేమున్నామని మందిగా పలికే వారెక్కడుండిన అదే భాగ్యమూ...అదే స్వర్గమూ... అన్నారు కదా!

"అలా నువ్వు తప్ప ఇంకెవరూ అనరు గానీ నీ జ్యేష్ఠుడేమంటాడు? వాడు నీ పార్టీనేనా?"

"వాడన్నదీ విను. మొన్నొక రోజు రాత్రి బుజ్జిజింకకి దుప్పటి కప్పి, ఇవతలకి వస్తూ 'లైట్ తీసేస్తాను కళ్ళు మూసుకో నాన్నా!'  అంటుంటే తమ్ముడికి Good Night చెప్పడానికి వచ్చిన అన్నగాడు 'తమ్ముడూ! A room with Amma in it is scarier than a room without light' అనడం దానికా తమ్ముడు గాల్లోకి కాళ్ళు లేపి మరీ చప్పట్లు కొట్టుకుంటూ నవ్వడం. నాకూ నవ్వొచ్చింది వాళ్ళిద్దరూ అలా కూడబలుక్కున్నట్లు నన్నాటపట్టించడం చూసి"

"బావుంది...  బావుంది... వాళ్ళు నిన్ను ఆట పట్టించడం. నువ్వు దాన్ని ఆనందించడం."

"వాళ్ళది టీనేజ్ అయితే నాది బీనేజ్ కదా మరి. వాళ్ళ మాటలు, పాటలు చూస్తూ I relive my past."

"టీనేజ్ అంటే తెలుసు నాకు. ఈ బీనేజ్ ఏంటి తల్లీ?"

"కనుక్కోకోలేకపోయావా? హహహ... బీనేజ్ అంటే ఏది విన్నా, ఏం చూసినా "been there once" అనిపించే ఏజ్. Teenage పిల్లలది, Beenage తల్లిది-తండ్రిది."

"హహహహహా... Teenage-Beenage సరి పోయింది!"

"ఇప్పటికే బోల్డుసేపైంది - ఇంక ఫోన్ పెట్టేస్తాను. ఇందాకే అడుగుదామనుకున్నాను మర్చిపోయాను. ఇందాక మిల్లెట్స్ అన్నావు. అంటే చిరుధాన్యాలు కదా! ఎక్కడ దొరుకుతున్నాయి? మా ఊళ్ళో ఇండియన్ స్టోర్లో ఉండేవి కానీ ఈ వారం వెళ్లినప్పుడు కనపళ్ళేదు."

"మాకు పొలాల్లో పండుతాయి. అమ్మావాళ్లు పంపిస్తారు తడవకి ఐదేసి కేజీలు అలా."

"మంచి మాట చెప్పావ్. పొలం వుందన్నావ్. ఎప్పటికీ ఉంచుకో. మా ఊళ్ళ పక్క పచ్చటి పొలాలు తవ్వుకుని చేపల చెరువులుగా చేసుకోవడమో, అమ్ముకుని అపార్టుమెంట్లు కట్టేసి అద్దెకిచ్చుకోవడమో చేస్తున్నారు. ముందుముందు తిండిగింజ దొరకని రోజులొస్తాయ్. తలుచుకుంటే బెంగగా ఉంటుంది. సర్లే! ఎన్నిటికని బెంగెట్టుకుంటాను కానీ ... ప్రస్తుతానికి నా మాటల బెంగ నీకు ఫోన్ చేశాక తగ్గింది. మళ్ళీ ఎప్పుడో ఇలాగే... వస్తా! మళ్ళొస్తా! మళ్ళీ పలకరిస్తా!"

"నాకూ బావుంది ఇలా మాట్లాడడం. వుంటాను మరి. Bye!"

"Bye !"

చివరాఖరి సిప్పు:

If you didn't have to start a conversation with a "Sorry" and end with a "Thank you", you definitely were talking with a friend.  ~meSayIt