12, ఫిబ్రవరి 2020, బుధవారం

పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 1 - నాంది








హలో మున్నమ్మా... !

ఏం చేస్తున్నావు నాన్నా?

ఇంతకీ ఎక్కడున్నావ్?

ఇప్పుడే బస్ దిగి ఇంటికి వెళ్తూ మాట్లాడుతున్నావా?

సర్సరే! ఏం లేదూ...నేను ఊర్కే call చేశాను.

నేను మాట్లాడుతూ వుంటాను...

నీకు కుదిరినంతవరకు మాట్లాడు...

మధ్యాహ్నం ఏం తిన్నావు? ఏంటీ ... ల్యాబ్ దగ్గర డైనింగ్ హాల్లో తినేశావా ఏదో!

అక్కడేముంటుందమ్మా మామూలుగా? బర్గరా?

పోన్లే ... కడుపు నిండా తిన్నావుగా? సాయంత్రం ఏంటీ ప్లాను? నువ్వు వండుకుంటున్నావా... లేకపోతే బయట్నుంచి ఆర్డర్ చేసుకుంటావా?

అవున్రా... నాన్నా! నేను పంపించిన ఆ కర్ణాటక ఉప్మా recipe try చేశావా? ఎలా వచ్చింది? బాగా కుదిరిందా?

అది చదవగానే భలే easy గా అనిపించి నీకు పంపించాను. అందులోనూ నీకు తెల్సు కదా నాకు ఉప్మా అంటే ఎంతిష్టమో! పైగా ఆవిడెవరో చాలా చక్కగా రాసింది - English లో.

నీకు జ్ఞాపకం ఉందిరా? చిన్నప్పుడు నిన్ను బజ్జోపెట్టేటప్పుడు రోజూ కథలు చెప్పేదాన్ని. అప్పుడు పుణ్యకోటి అనే ఆవు కథలో చివర్లో ఆవూ-పులీ కలిసి ఉప్మా చేసుకు తింటాయని చెప్పేదాన్ని.

అసలలా ఎందుకు చెప్పేదాన్నీ అంటే...

అసలేమో... ఆ కథలో ఓ పులి  ఆవుని తినేస్తాను అంటే అప్పుడా ఆవు - దాని పేరే పుణ్యకోటి - 'పులీ, పులీ! నన్నిప్పుడే తినొద్దూ. నేనింటికెళ్ళి నా బుజ్జిదూడకి బొజ్జ నిండా పాలిచ్చి వస్తాను, అప్పుడు తినూ' అని చెప్పి వెళ్తుంది కదా!

చెప్పినట్టే ఇంటికెళ్ళి బుజ్జిదూడకి పాలు పట్టి, దానికేమో అమ్మ లేనప్పుడు అల్లరి చెయ్యొద్దని చెప్పి, చుట్టూ వున్న ఆవు-ఆంటీలకి దూడని ముందుకొస్తే పొడవొద్దని, వెనక్కొస్తే కాళ్ళతో తన్నొద్దని, ఆకలేస్తే వాళ్ళ పిల్లలతో పాటు పాలు పట్టమని చెప్పి - మళ్ళీ పులి దగ్గరికి తిరిగొస్తుంది. నీగ్గుర్తొచ్చిందా  ఆ కథా?

అలా ఆవు పులి దగ్గరికి తిరిగొస్తుంది అని నేను చెప్తూ వున్నప్పుడు నా మెడ చుట్టూ చెయ్యి వేసి, ఓ బుల్లి ౘందమామ లాంటి మొహంతో నా కళ్ళలోకి చూస్తూ కథ వింటున్న నువ్వు - ఆ తర్వాత ఏమవుతుందా అన్నట్టు - ఆ ఆవు place లో అమ్మని, దూడ place లో నిన్ను నువ్వు ఊహించుకుంటున్నట్టు - భలే tension గా నీ చేత్తో నా మెడని గట్టిగా పట్టేసుకునేవాడివి.

అలా వచ్చిన పుణ్యకోటిని పులి మెచ్చుకుని తినదు అని నేను చెప్పగానే నీకు ఆ ending బాగానే నచ్చినట్టు అనిపించినా - చివర్లో "మరి పాపం! పులికి ఆకలేస్తోంది కదా! మరి దానికి అన్నం ఎవరు పెడతారు?" అనడిగావు.

మరప్పుడు నేను "అమ్మని... అర్రే! నాకది తట్టలేదే!" - అనేసుకుని "భలే అడిగావురా...నాన్నా! అదే చెప్పబోతున్నా..." అని - అప్పటికప్పుడు ఆ కథని ఇంకొంచెం extend చేసి "ఫుణ్యకోటిని మెచ్చుకుని పులి 'నిన్ను నేను తినను, ఇంటికి వెళ్ళిపో నీ దూడ దగ్గరికి' అంటుంది కదా అప్పుడు పుణ్యకోటి ఎంతో సంతోషించి గబగబా సుభద్రా ఆర్కేడ్‌లో వున్న షాపుకెళ్ళి వెళ్ళి ఉప్మా రవ్వ తెచ్చి, ఉప్మా చేసి పులికి పెడుతుంది. అప్పట్నుంచి పులి, పుణ్యకోటి ఫ్రెండ్స్ అయిపోతాయి" అని పూర్తి చేసేటప్పటికి - అప్పటికే సగం మూత పడ్డ కళ్ళతో కథ వింటున్న నువ్వు నవ్వుకుంటూ హాయిగా బజ్జునేవాడివి.

ఇంతకీ ఆ సుభద్రా ఆర్కేడ్ గుర్తుందా నీకు? మనం కాకినాడలో వున్నప్పుడు భానుగుడి జంక్షన్లో ఉండేది. ఇప్పుడూ వుందేమోలే! అమ్మ-నాన్నగారు ఆక్కడే ఆఫీసులో పని చేసేవాళ్ళం. పొద్దున్నించి సాయంత్రం వరకు నేనూ, సాయంత్రం కాగానే పువ్వులా స్నానం చేయించి, బుల్లి లాగూ-చొక్కా తొడిగి నిన్ను తీసుకొచ్చి నా కప్పజెప్పి - మనిద్దరం ఇంటికొచ్చేస్తే - అప్పట్నుంచి రాత్రి దాకా నాన్నగారు నీకోసం షిఫ్టుల్లో పనిచేసేవాళ్ళం కదా!

అద్దీ ... ఆ సుభద్రా ఆర్కేడే మన పుణ్యకోటి కథలోకి వచ్చేసింది - నా ఉప్మా మీది ఇష్టం మూలంగా.

అసలింతకీ ఇదంతా ఎందుకు మొదలెట్టానంటే బుజ్జిగాడూ! నువ్వెప్పుడూ అడుగుతుంటావు కదా - "అమ్మా! నువ్వు చేసే నీ వంటలు recipes రాసి పెట్టు నా కోసం" - అని.

నిజం చెప్పాలంటే నాన్నగాడూ... "నీ వంటలు" అన్నావు కానీ ... అవేవీ నేను కనిపిట్టినవి కాదు.

నేనెప్పుడూ వంట నేర్చుకోలేదు కూడా! మా నాన్నమ్మ, దొడ్డలు, అమ్మ, అత్తయ్యలు నా కోసం, నాకిష్టమని చేసిపెట్టిన వంటల రుచులు కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకుని , ఆ కూరల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో వాళ్ళు ఏమేం ingredients వాడి వుంటారా అని ఒక్కోదాన్ని విడివిడిగా వాసనని బట్టి, రుచిని బట్టి, texture ని బట్టి గుర్తు పట్టి - trial & error method లో ఒక్కో ingredient ని కలుపుతూ, ఇంకోసారి తీసేస్తూ - అలా నేర్చుకున్నానన్నమాట. అందుకని నేను చేసే వంటల recipeలు తప్పకుండా రాసి పెడతాను... దాని కన్నా ముందు selecting the ingreditents that go into that recipe and preparing them to make that recipe is the most important activity.

అంటే ఓ కూర వండే ముందు ఆ కూరకి ముక్కలు ఎలా తరుక్కోవాలీ, తరిగిన ముక్కల్ని ఎలాంటి గిన్నెలో వండాలీ, వండేటప్పుడు ముక్కల్ని ఎలా కలాపాలీ, చారు ఎంత సేపు కాచాలీ, సాంబారులో ఇంగువ ఎప్పుడు వెయ్యాలీ - ఇల్లాంటివి ఎన్నో చిన్నచిన్న విషయాలు ఒక unique textureనీ, taste నీ తీసుకొచ్చి మనం వండే వంటని ఒక experince లాగా, వండిన వంటని మనం ఎవరికోసమైతే వండుతున్నామో వాళ్ళకి ఒక expression of affection లాగా అనిపించేలా చేస్తాయి. దానికి నేను పెట్టుకున్న పేరు శాక-హృదయం. అదేంటీ అని అడుగుతున్నావా? తొందర పడకు మరీ... ఆ శాకహృదయం కథా-కమామీషూ చెప్తాగా...

నీకు నే కనిపెట్టిన శాకహృదయం గురించి నేర్పాలి.

అందుకే ఈ ఉపోద్ఘాతమంతా...

నీకు చెప్తూ నెమరేసుకుంటూ నేనూ, నేను చెప్పేది వింటూ నేర్చుకుంటూ నువ్వూ - మనిద్దరం కలిసి నేర్చుకోబోయే వంటింటి-పాఠాలకి నాందిగా నాదో సిన్మతీ గిద్యం...


పాకోత్సాహము వంటింటికి, వండిన ఇంతికి
పాకము వండినపుడె పుట్టదు, కూరలనా
శాక హృదయము ననుసరించి  వండగ
పాకోత్సాహంబు నాడు గల్గును సిన్మతీ

26 కామెంట్‌లు:

  1. ఎంత మంచి అమ్మ!!

    చిన్నప్పుడు బొజ్జ నింపడమే కాదు,వాళ్ళు పెద్దయ్యాక కూడా ఆము ని అభిమానించి అమ్మ రుచి అనుభవించే వరం పిల్లలకి ఇవ్వడం అద్భుతం!

    కోటి పుణ్యాల అమ్మ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భలే ... మీరెవరో పుణ్యాత్ములు ... ఇలా రాశానో లేదో అలా చదివేసి పొగిడేశారు ... బోల్డన్ని ధన్యవాదాలు !

      తొలగించండి
  2. Meeru chesina vantalu, meeru cheppina kadhalu kooda rayandi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నీ కాకపోయినా కొన్నైనా రాయాలనే ఈ సిరీస్ మొదలుపెట్టానండి. Thanks for your comment.

      తొలగించండి
  3. ఆవు,పులి కలిసి ఉప్మా చేసుకుని తిన్నాయా చివరలో.భలే ఉంది.నేను కూడా నా బుజ్జిగాడు పెద్దయ్యాక ఈ కధ చివరలో ఇలాగే చెప్తా లల్లమ్మా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆవుం పులి కలిసి ఉప్మా చేసుకొని ఎందుకు తిన్నాయంటే, ఉప్మా అంత గొప్ప 'పిండి'వంట మరేదీ లేదు కనుక. ఇంకా మరేమో లలిత గారికి ఉప్మా అంటేభలే ప్రీతి కనుక. ఏమాటకామాటే చెప్పాలి - నాక్కూడా ఉప్మా అంటే బోలెడంత యిష్టం. ఐతే పొద్దున్నే టిఫినేమిటీ అన్నది నాయిష్టం కాదు కనుక అది ఉప్మా కావటం బహుకష్టం. మా శారదకు ఉప్మా ఆట్టే సొక్కకపోవటం దురదృష్టం. హా! ఉప్మా! ఉప్మా!!

      తొలగించండి
    2. చిత్రమ్మా! భలే! మీ బుజ్జిగాడికి నువ్వు చెప్పబోయే కథలు రాసి పెట్టు. నేనూ చదువుకుంటా!

      తొలగించండి
    3. శ్యామలీయం గారూ! మీరూ ఉప్మాభిమానులన్నమాట. భలే!

      తొలగించండి
    4. వట్టి అభిమానినా? వీరాభిమానినండీ. ECILలో పనిచేసే రోజుల్లో, ఆఫీసు క్యాంటీనులో దాదాపు ప్రతిరోజూ ఉప్మా ఉండేది ఉదయం అల్పాహారంలో. నాకైతే భలే బాగుండేది అలా. అమెరికా పోయాక, ఉదయం అల్పాహారంగా ఐతే కార్న్‍ఫ్లేక్స్ లేదా బ్రెడ్‍బటర్‍జామ్ అని స్తిరపడిపోయింది. ప్రస్తుతం ఇడ్లీలు ప్రతిరోజూను - దారుణంగా. ఉప్మా అన్నది గొప్ప స్పెషాలిటీ టిఫిన్ అన్నమాట నాకు ఎప్పుడైనా కంఛంలోనికి వస్తే. అదీ సంగతి. అస్లు ఉప్మామీదనే పేద్ద వ్యాసం వ్రాసేయ వచ్చును. మీకు వీలుంటే వ్రాయండి కాదంటే నేనే ట్రై చేయాల్సి ఉంటుంది మరి.

      తొలగించండి
    5. పోకిరీ సినిమాలో మహేష్ బాబు "కుటుంబం మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు" డయలాగు గుర్తుకొచ్చింది.

      మా అమ్మ చిన్నప్పుడు (నా చిన్నప్పుడు లెండి, ఆమె చిన్నప్పుడు నేనింకా పుట్టలేదు)
      ఉపవాసం మూలాన శనివారం రాత్రి పూట ఫలహారం చేసేది. ఉప్మా, ఉప్పిడిపిండి, ఖిచిడీ, పులసటుకులు, పోపునబియ్యం, పూరి-పిట్ల లాంటివి ఒక్కపొద్దు స్పెషల్స్! పిల్లలమంతా అన్నం మానేసి వీటిమీదే పడే వాళ్ళము, ఆమెకు తక్కువ పడేవి. రానురాను ఇల్లంతా అదే "Saturday night fever" కి మారిపోయాం

      తొలగించండి
  4. పులికి పులిహోర తినిపించాలి గాని ఉప్మా పెడితే ఎలా చెప్మా!☺️

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య గారు! పులికి ఉప్మా పెట్టి కొంచెం సాధువుని చేద్దామని అంతే, అంతే! :)

      తొలగించండి
  5. <<<<"మరి పాపం! పులికి ఆకలేస్తోంది కదా! మరి దానికి అన్నం ఎవరు పెడతారు?">>>

    మీ అడుగుజాడల్లో రచయత అయ్యేటట్లు కనపడుతున్నాడండోయ్...చప్పట్లు👏👏👏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా రాతలన్నీ పిల్లలతో ఆడుతూ, కబుర్లాడుతూ రాస్తున్నవేనండి, నీహారికా! పిల్లల contribution కనిపించకుండా చాలానే వుంది. మీ చప్పట్లకి బోల్డన్ని థాంక్స్!

      తొలగించండి
  6. https://orugantiprasad.blog/2019/05/16/రధ-యాత్ర-2-అనాతవరం-దేవుడి-ప/

    You may like this site....just for information...not related to this post.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks for sharing the blog URL!
      ఓరుగంటి ప్రసాద్ మా వూరి అబ్బాయేనండి. వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు మంచి స్నేహితులు. తన బ్లాగ్ చదువుతూ వుంటాను నేను.

      తొలగించండి
  7. కర్ణాటక లో ఉప్మాని ఖారా బాత్ అంటారు. అది ఉప్మా వెర్షన్ 2.0 లాంటిది. ఉప్మా కంటే బాగుంటుంది.
    అయితే ఈ ఖారా బాత్ కి ఒకో హోటల్లో ఒకో టేస్ట్ ఉంటుంది. మనకి నచ్చిన చోట కంటిన్యూ అయిపోవాలి.
    ఖారా బాత్ తో కేసరి బాత్ కూడా ఇస్తే దానిని చౌ చౌ బాత్ అంటారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఉప్మా కంటే బాగుంటుంది."

      వ. ఔరా!

      తే. మిగుల దారుణ ముప్మాను మించునట్టి
      దెచటనో గల దను మాట నిపుడు విందు
      మది యసాధ్య మాచంద్రతారార్కకీర్తి
      శాలి యుప్మాకు నెద్దియు సాటిరాదు

      కం. ఒక్కొకచో నొక్కొక రుచి
      మిక్కిలి హాస్యాస్పదంబు మేలిమి రుచియుం
      జక్కగ స్థిరపడనిదియా
      యక్కట నుప్మాకు సాటి యనుట హతవిధీ

      ఆ. ఉండ దుప్పుమాకు రెండవ వెర్షను
      తనకుతానె సాటి ధరను కాన
      పొగడ నేల పొరుగు పుల్లకూర రుచుల
      తెలుగు రుచుల కెపుడు తిరుగులేదు

      వ. కాబట్టి తెలుగుప్రజలారా ఉప్మాకు ప్రత్యామ్నాయాలు వెదుకుతూ మీ నాలుకలను బండబార నీయకండి.

      తొలగించండి
    2. ఉప్మా రుచిగా ఉంటుందా రామనామం రుచిగా ఉంటుందా? గురువులు ఈ ధర్మ సందేహాన్ని తీర్చవలెనని మనవి!

      తొలగించండి
    3. నన్నే అడిగారా? ఎందుకంటే యే గురువులూ మీ సందేహం తీర్చలేదు. సరే నా ఉద్దేశం చెబుతాను. ఉప్మా రుచిగా ఉంటుందా అంటే అవును, రామనామం రుచిగా ఉంటుందా అంటే అవును. రెండూ రుచికరమైనవే. ఇబ్బంది లేదు. రెండూ సాటిలేనివే అంటే అదెట్లా అని మీ సందేహం. వినండి. ఉప్మా ఇచ్చేది ఇంద్రియసుఖం. రామనామసుఖం అతీంద్రియమైనది. ఒకటి బౌతికం రెండవది అధ్యాత్మికం. అదీ సంగతి.

      తొలగించండి
    4. మాకు ఆ పోలికలు ఏవీ తెలియవండీ! మాదంతా ఒట్టి ప్రసాదం భక్తి ☺️
      ఉప్మాని రామయ్య ముందు పెట్టి ఆయన ఆశగా దానిమీద చెయ్యి వేసేలోగా "మహా ప్రసాదం" అంటూ గిన్నెని లాక్కుని లోన పోపుగింజ కూడా మిగల్చకుండా తినడమే మా ప్రత్యేకత. ☺️☺️

      తొలగించండి
  8. ఉప్పు గలిపిన మావని , ఉప్పు _ మావు
    గలిసి తమిళుల ఉప్మావు కాస్త మారి
    తెలియ నుప్మాగ మారె , తెలుగు లున్ను
    తమిళ రుచులను పొందిరి తాము కూడ .

    శ్రీనాధుని కాలములో
    కానగ నుప్పిండి యనగ గన్పించు , గనన్
    మానుగ విధవల తిండిది ,
    దీనన్ ఉప్పుండ , దది యిదీ ,వేర్వేరే .

    రిప్లయితొలగించండి
  9. ఉప్పిడి పిండని జైగా
    రొప్పుగ దెలిపిరి , ' ఇడి ' యెట నుండునొ, ' నట ' లే
    దుప్పను నర్థమ్ము వొడము ,
    తెప్పలుగా తెలుగు దొఱకు తెలగాణములో .

    రిప్లయితొలగించండి
  10. పాకోత్సాహము..పద్యము.. సింబాలిక్ గా కవితకీ బ్లాగుకి ..బ్లాగర్లుచేసే పోస్టింగులకీ వర్తిస్తుందమ్మా!..హాయిగా ఉంది మీ బ్లాగుప్మా కొనసాగింపు సవరణ ..బహుబాగుబాగు

    రిప్లయితొలగించండి
  11. ఇంగువ పోపు పెట్టి కొబ్బరి తురుము వేసి చేసే బియ్యపు రవ్వ ఉప్పుడు పిండి బొంబాయి రవ్వ ఉప్మా కంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి