ఇంతకు ముందు ఏం చెప్పానంటే: మళ్ళీ మొదలయింది - 1 - అహమపి some సమ్భాషణం కృతవతీ...
ఇంతకు ముందు చెప్పాను కదా - నా కాలేజ్ రోజుల్లోని సంస్కృతం "రామః - రామౌ - రామాః; హే రామ! - హే రామౌ! - హే రామాః!" అన్న రామ-శబ్దం దగ్గరే ఆగిపోయి అంతవరకే గుర్తుంది - అని.
అక్కడి నుంచి ఇవాళ్టి రోజు నాకంటూ ఒక "సంభాషణాంతః-శాటికా-న్యాయం!" ఉందీ అని చెప్పగలిగే వరకు జరిగిన నా సంస్కృత-ప్రస్థానం గురించినవే ఈ రోజు కబుర్లు.
అనగనగా... కోవిడ్-పూర్వం 2018వ సంవత్సరంలో...
అత్యుత్సాహంగా నేనే చేరానో - లేదా చేర్చబడ్డానో గుర్తులేని - శతకోటి వాట్సాప్ గ్రూపుల్లో ఒకానొక గ్రూపులో హైద్రాబాదు నుంచి ఎవరో పెద్దాయన ఉచితంగా ఈమెయిల్ ద్వారా సంస్కృతం నేర్పిస్తారు అన్న సందేశం ఒకటి చూశాను.
ఎప్పట్నుంచో సంస్కృతం నేర్చుకోవాలీ అనుకుంటున్న నాకప్పుడది మహా సమయోచితంగా, సముచితంగా అనిపించి వెంటనే ఆ పెద్దాయనకి ఈమెయిల్ ఇచ్చాను - నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఆసక్తిగా ఉంది, మీ ఈమెయిల్-స్కూల్లో చేరాలంటే ఏం చెయ్యాలీ అని అడుగుతూ.
దానికి బదులుగా వారడిగిన ఆవేదన పత్రంలో నా పుట్టుపూర్వోత్తరాలు, పూర్వ విద్యాభ్యాస, ప్రస్తుత ఉద్యోగ వివరాలు - నా ఛాయాచిత్రసహితంగా సమర్పించి ఆ ఈమెయిల్-బడిలో చేరాను. కాకపోతే అది ఎక్కువకాలం సాగలేదు.
ఆ విధంగా ... కోవిడ్-శకం 2020వ సంవత్సరం ఏప్రిల్ నెలలో...
నేను పంపించిన హోంవర్క్ ఈమెయిల్ - అందలేదనో, అందినా చదవడం కుదరలేదనో నన్ను ఆ ఈమెయిల్-బడి లోంచి బయటికి పంపించేశారు. "ఎందుకు-ఏమిటి" అని అడిగి ఆ పెద్దాయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ బడి మానేశా.
*******
*******
ఇంతలో .... మా ఎంసీఏ అమ్మాయిల గ్రూపులో రాధిక అని నా జూనియర్ ఒక రోజు సంస్కృతభారతి వారి "సమ్భాషణతః శాస్త్రపర్యంతమ్" అనే నాలుగు సెమిస్టర్ల కోర్స్ ఒకటి మొదలవుతోందని, ఆసక్తి ఉన్నవారు చేరండని ఒక సందేశం పంపింది.
అది చూసీ చూడగానే - ఒక్క నిముషం కూడా ఆలోచించకుండా ఆ కోర్సులో చేరాను.
అలా కోవిడ్-శకం 2021వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో నా మొదటి షణ్మాస్య (సెమిస్టర్) - సంస్కృత సమ్భాషణ - పాఠాలు మొదలయ్యాయి.
*******
*******
ప్రతి సోమవారం రాత్రి పది గంటల నుంచి పదకొండున్నర వరకు - అంటే వారానికి గంటన్నర సేపు నా సంస్కృతపాఠం జరుగుతుంది.
ఆ సోమవారం రోజు నేర్చుకున్న విషయాల మీద గృహకార్యం (హోంవర్క్) శుక్రవారం లోగా పూర్తి చేయాలి. మొదటి ఆరునెలలు నేర్పబడే విషయం "సమ్భాషణ" కాబట్టి గృహకార్యం కూడా రికార్డు చేసి ఆడియో ఫైల్‌లా సబ్మిట్ చేయాలి. మొత్తమ్మీద వారానికి దాదాపు మూడు గంటల చదువు.
క్రమం తప్పకుండా క్లాసుకి హాజరైతే మార్కులు, గడువు మించకుండా హోమ్ వర్క్ చేస్తే మార్కులు. సెమిస్టర్ చివర్లో ఓ మౌఖిక పరీక్షకి మార్కులు, ఇంకో గూగుల్ ఫార్మ్ పరీక్షకి మార్కులు - ఇవన్నీ చేసి పాస్ ఐతేనే తర్వాతి సెమిస్టర్‌లో కొనసాగే అవకాశం - ఇలాంటి నిబంధనలతో మొదలైంది నా సంస్కృత విద్య.
*******
*******
సంస్కృతం బళ్ళో - నేర్చుకోవడానికి కూర్చున్న నా బుద్ధికి రూపమిస్తే - నాకు ఇలా ఆనింది :)
మొట్టమొదటి క్లాసులో తెలుసుకున్న విషయమేంటంటే - సంస్కృతంలో ప్రతి నామవాచకపదాన్ని - పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలుగా వర్గీకరిస్తారని.
సాధారణంగా అః-కారాంత పదాలు పుంలింగ శబ్దాలు.
ఉదాహరణకి- చషకః (కప్పు), చమసః (చెంచా), వృక్షః (చెట్టు), స్యూతః (సంచీ), శునకః (కుక్క).
ఆ-కారాంత, ఈకారాంత పదాలు స్త్రీలింగ శబ్దాలు.
ఉదాహరణకి: కూపీ (నీళ్ళ సీసా), అంకనీ (పెన్సిల్), లేఖనీ (కలం), సఖీ (స్నేహితురాలు).
"మ్" అని అంతమయ్యే పదాలన్నీ నపుంసకలింగ శబ్దాలు.
ఉదాహరణకి: పుస్తకమ్ (పుస్తకం), మిత్రమ్ (స్నేహితుడు), పుష్పమ్ (పువ్వు), పృథుకమ్ (అటుకులు).
ఇది వినగానే నాకు హిందీ, స్పానిష్ భాషల్లో కూడా ఇలాంటి వర్గీకరణ వుంటుందని గొర్తుకొచ్చింది.
నే నేర్చుకున్న అన్ని సంస్కృత పదాల్లోకి ఓ మూడు మాటల గురించి మాత్రం ఇక్కడ తలుచుకుంటున్నాను.
మొదటి మాట: ఈకారాంత స్త్రీలింగ శబ్దం - అనిలచుల్లీ.
మొదటిసారి స్త్రీలింగ శబ్దాల్లో "అనిలచుల్లీ" అని విన్నప్పుడు అర్థం ఏంటో తెలుసుకోవాలనిపించి అర్థం ఏంటీ అని అడిగిన నాకు మా టీచర్ చెప్పిన సమాధానం "స్టవ్" అని.
అది వింటూనే నాకొక సందేహం " అదేంటి - అది సరి కాదేమో కదా? అనలం అంటే నిప్పు కదా. అనిలుడంటే వాయువు కదా? మరి పొయ్యిని అనలచుల్లీ అనాలేమో కదా?" అని.
నేనలా అడగ్గానే మా టీచర్ కూడా ఒక నిముషంలో ఆలోచించి "మీరడిగింది సబబు గానే ఉంది. తర్వాత చెక్ చేసి వచ్చే వారం క్లాసులో మీకు సమాధానం చెప్తాను" అన్నారు.
ఇంతలో స్క్రీన్ కేసి చూసిన నాకు "అనిలచుల్లీ" అన్న పదం కింద ఒక గాస్ స్టవ్ బొమ్మ కనిపించింది.
నేను వెంటనే "నాకు సమాధానం దొరికిందండి. అనిలచుల్లీ అంటే గాస్ స్టవ్. గాస్ అంటే వాయువే కదా. అర్థం సరిపోయింది" అనగానే మా అధ్యాపికా "అమ్మయ్య" అని ఊపిరి పీల్చుకున్నట్టనిపించిది నాకు.
అప్పుడే అనుకున్నాను నాకేమైనా సందేహాలుంటే విడిగా ఏ గూగుల్ చేసుకునో తీర్చుకోవాలి కానీ క్లాసులో హఠాత్తుగా అడిగి ఇబ్బంది పెట్టకూడదని.
అప్పుడే సంస్కృత "చుల్లీ" కి హిందీ "చూల్హా" చెల్లి అయుంటుంది అనిపించింది.
దాంతో పాటే ఒక బుల్లి-కపితని అల్లాలనిపించింది - అప్పుడెప్పుడో చిన్నప్పటి రోజుల్లో లాగా...
ఆయేగా... ఆయేగా... దూల్హా
ఆకే... సంభాలేగా చూల్హా
*******
*******
ఇక రెండో మాట: అకారాంత పుంలింగ శబ్దం - చషకః.
నీళ్లు తాగే గ్లాసూ - చషకః;
పాలు తాగే కప్పూ - చషకః;
ఆ మాటకొస్తే పానకం తాగే దొప్ప కూడా - చషకః.
నాకు మాత్రం ఈ మాట వినగానే మొట్టమొదట గుర్తుకొచ్చింది మాత్రం రఫీ సాబ్ మత్తుగా-గమ్మత్తుగా పాడిన"ఛల్‌కా యే జామ్" పాట. ఎప్పుడో తొందర్లోనే ఈ పాట గురించి రాసుకోవాలి.
*******
*******
ముచ్చటైన మూడో మాట: ఈకారాంత స్త్రీలింగ శబ్దం - (సమ)దర్వీ.
క్లాసులో నేర్చుకున్న మాట "దర్వీ" మాత్రమే.
దర్వీ అంటే గరిట. అదంత గ్లామరస్ మాటేమీ కాదు.
కాకపోతే తర్వాతెప్పుడో యూట్యూబ్‌లో సంస్కృతం వీడియో ఏదో చూస్తుంటే అక్కడ అట్లకాడని "సమదర్వీ" అంటుంటే విని - వెంటనే "భలే! దర్వీ అంటే ఒక పక్క లోతుగా వుండే గరిట, అదే సమదర్వీ అంటే రెండుపక్కలా సమంగా వుండే అట్లకాడ" అని అదేదో నేనే కనిపెట్టినట్టు తెగ మురిసిపోయాను.
నిజం చెప్పాలంటే సంస్కృతం నేర్చుకోవడం మొదలు పెట్టాక నాకు తెలుగు ఎంత రాదో తెలిసొచ్చింది. అందుకే యూట్యూబ్‌లో కూర్మాచారులు గారని ఒక తెలుగు ఆచార్యులవారు బోధింఛే తెలుగు పాఠాలు కూడా నేర్చుకోవడం మొదలు పెట్టాను.
అన్నట్టు సిలికాన్-అంధ్రా వారి తెలుగు ఎమ్మే చేద్దామని వారినీ సంప్రదించి - నాకు ప్రియమైన తెలుగు నేర్చుకోవడానికి రుసుము సరసంగా కాక మరీ "ప్రియంగా" వుందని విరమించుకున్నాను.
ఇక నా సంస్కృత దూరవిద్యలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే - సంభాషణ.
ఇద్దరో, ముగ్గురో, నలుగురో - కుదిరినంత మంది ఒక జట్టుగా కనీసం ఒక ఐదు నిముషాలు సంస్కృతంలో మాట్లాడగలగాలి.
నాకేమో మొదట్లో ఎవరితోనూ కలిసి సంభాషణ అభ్యాసం చేయడానికి కుదరలేదు.
అందుకే నా మొదటి సంభాషణ అసైన్‌మెంట్‌కి - బెంగళూరులో ఉన్న నా ఫ్రెండ్ అపర్ణతో ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఒక సంభాషణ రాసుకుని - కుడి చెవి మీద చెయ్యి పెట్టుకున్నప్పుడు నాలాగా, ఎడమ చెవి మీద చెయ్యి పెట్టుకున్నప్పుడు అపర్ణ లాగా మాట్లాడుతూ - అభినయించాను.
రెండోసారి నాకు ఇచ్చిన అసైన్‌మెంట్ - లోకయాన సంభాషణ - అంటే - బస్సులో సంభాషణ.
దాని కోసం సంభాషణ అయితే రాసుకున్నాను - కానీ ఎవరైనా పార్ట్‌నర్‌తో చేస్తే బావుంటుంది అనుకుని మా క్లాసులో ఉన్న స్వాతి అనే అమ్మాయిని అడిగితే తను నేను రాసిన సంభాషణ చూసి - నాతో కలిసి మాట్లాడడానికి ఒప్పుకుంది.
అదే ఇంతకు ముందు పోస్ట్‌లో పెట్టిన సంభాషణ.
అలా అనుకోకుండా స్వాతి-నేను సంస్కృతం ద్వారా స్నేహితులమయ్యాము.
ఆ బస్సులో సంభాషణలో నాకు ఇష్టమైన చీరల (శాటికాః) ప్రసక్తి కూడా వుంటుంది.
ఎంత బస్సులో మాటలైతే మాత్రం మరీ బస్సు స్టాపుల గురించి, టికెట్ల రేట్ల గురించే మాట్లాడుకోం కదా! పక్కనే కూర్చున్న వాళ్ళు కట్టుకున్న చీర నచ్చితే అడుగుతాం కదా!
చిన్నప్పుడు చదువుకున్న "ఆవు మీద వ్యాసం" ఉదాహరణ స్వాతికి చెప్పి దేని గురించి మాట్లాడమన్నా ఎలాగోలా అందులోకి నాకు ఇష్టమైన చీరల ప్రసక్తి తేనే తెస్తానని చెప్పుకుని ఇద్దరం నవ్వుకున్నాం.
అద్దీ... నేనే కనిపెట్టుకున్న "సంభాషణాంతః-శాటికా-న్యాయం" !
<<ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నా... మిగిలిన కబుర్లు ఇంకో మారు.... >>