19, మార్చి 2022, శనివారం

త్వామనురజామి 2.0 - 1 - హమ్ సింఘాసన్ పర్ జా బైఠే ...జబ్ జబ్ కరే ఇరాదే...

దీనికి ముందు కబుర్లు  చదవాలంటే, ఒకసారి ఇక్కడికి వెళ్లి రండి: త్వామనురజామి - 52 - మళ్ళీ మొదలెడుతున్నా!

*******
*******

    ఇంతకు ముందు చెప్పినట్టే... అక్కడెక్కడో ఆగిన మా కథ  త్వామనురజామి - 50 - ఒకరికొకరం మేలి-సగం! ని మళ్ళీ మొదలెడుతున్నా. 


        కదిలిపోయిన కాలం - రాసేసిన పేజీలు 

        కదులుతున్న కాలం - పేర్చుకుంటున్న మాటలు'

        కలిపి కూర్చుకున్న - బ్రతుకు పుస్తకం 

        మా "త్వామనురజామి" వెర్షన్ 2

 త్వామనురజామి 2.0... 

        మళ్ళీ మొదలెడుతున్నా!


*******
*******


    జ్ఞాపకాలతో ఒక సులువుంది. అదేంటంటే ఎవరి గురుతుల లోకానికి వారికి వారే రాజూ, రాణీ. 

    ఆ గురుతుగద్దె ఎవరిదైతే  దాని మీద సర్వహక్కులూ కూడా వారివే. 

    క్షణక్షణానికి క్రితమైపోతున్న కాలంలో -  నా జ్ఞాపకాల పుస్తకాన్ని ఎప్పుడంటే అప్పుడు తెరిచి పెట్టుకుని - కావాలన్నప్పుడల్లా తలుచుకుని తలుచుకుని - ఆ గడచిపోయిన కాలాన్ని మళ్ళీ మళ్ళీ జీవించడం నాకెంతో ఇష్టమైన వ్యాపకం. 

    అలా తలచుకున్న ప్రతీ గతం - ఇదిగో ఇప్పుడే నా చుట్టుపక్కలే జరుగుతుండగా నేను చూస్తున్నానా అన్నట్టుగా నాకు తోచడం - కొన్నిసార్లు కనుల వరించే వరం, మరికొన్నిసార్లు కనుల కురిసే వర్షం. 

    కనులు మురిసే కలల వరమైనా, కనుల కురిసే కలవరపు వర్షమైనా - నా ప్రతి జ్ఞాపకం నాకు అపురూపం. 

    అలాంటి గుర్తుల్లో - ఇంకొంచెం గుర్తుగా రాసి పెట్టుకోవాలనిపించిన కబుర్లే నా ఈ త్వామనురజామి 2.0. 

    ఇదిగో ... ఇప్పుడే ... హమ్ సింఘాసన్ పర్ జా బైఠే ...జబ్ జబ్ కరే ఇరాదే... అని పాడుకుంటూ నా జ్ఞాపకాల సింహాసనం మీద కూర్చుని కబుర్లు  చెప్పబోతున్నా. 

    ఇలాంటి కబుర్లు  చెప్తున్నప్పుడల్లా  - పాడుకుంటున్న పాటలు కూడా మీతో పంచుకుంటా. ఆ పాటలేవో మీరు కనిపెట్టగలరా అని మీతో సరదా-సవాలు ఆడుకుంటా.  

    కబుర్లాడుకుంటూ, పాడుకుంటూ, ఆడుకుందామా?!

*******
*******





    
    హమ్మయ్య! పెళ్లయ్యింది. 

    కొంగుముడులతో పాటు చిటికెనవేళ్లు కూడా మెలివేసుకుని బద్రి, నేను మా అత్తగారి ఇంటి ముందు కారు దిగి గేటు దాటి లోపలికి వెళ్లాము. 

    అక్కడ గుమ్మానికి అడ్డంగా నించున్న పెళ్లివారందరూ పేర్లు చెప్తే కానీ లోపలికి రానివ్వమన్నారు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్న నాకు ఇక ఆట్టే సాగదీయాలనిపించక "నేను, బదరీనారాయణ వచ్చాము" అని చెప్పేశాను. 

    పాపం! నేను చెప్పలేక సిగ్గు పడతాననుకున్న వాళ్ళందరూ కొంచెం ఉసూరుమన్నారు. 

    నేను మాత్రం ఏం చేయగలను? మెడ లాగేస్తున్న పూలజడ బరువు, దాంతో పాటు అసౌకర్యంగా ఉన్న మధుపర్కాల కట్టు. ఎప్పుడెప్పుడు కొంచెం మొహం కడుక్కుని ఫ్రెష్ అవుదామా అని ఉంది నాకు. 

    అన్నీ అనుకున్నట్టుగా అంత తొందరగా తెమిలితే చెప్పుకోవడానికేముంటాయి? 

    కొంగొత్త కోడలు గుమ్మం మీద పెట్టిన వడ్లమానికని తన్ని, కుడికాలుతో గడప దాటి అత్తవారింట్లోకి వచ్చే ఆనవాయితీ ఒకటి ఉంది కదా! ధాన్యం తెమ్మని పంపిస్తే గుంటూరులో అత్యుత్సాహులైన దుకాణాదారులెవరో నవధాన్యాలు పొట్లాలు కట్టి మరీ ఇచ్చారు. 

    మళ్ళీ ఎవరో హడావిడి పడి, పరుగులు పెట్టి మొత్తానికి ధాన్యం పట్టుకొచ్చారు. నేనంతకన్నా హడావిడిగా ఆ మానికని తన్నేసి ఇంట్లోకి పరిగెడుతున్నట్టుగానే వెళ్ళాను - నాతో పాటు కొంగుముడి పడ్డ బద్రిని కూడా నాతో పాటు లాక్కెళ్తున్నానన్న సంగతి మరచిపోయి. 

    కాకపోతే - మిన్ను విరిగి మీద పడ్డా - ఒకసారి దానికేసి చూసి మీద పడ్డ మిన్నుముక్కని "నువ్వు పొరపాటున నా మీద పడ్డట్టున్నావ్" అని బుజ్జగించి అవతలకి పంపించగల ఓర్పూ, ఓపికా ఉన్న బద్రిని నా విసురేంచేయగలదు? 

    "ఒక్క నిముషం, బుజ్జాయ్!" అని నా చెయ్యి పట్టి ఆపారు. ఇంతలో గురువుగారు వెంకన్న గారు మా కొంగుముడిని విప్పారు. 

    
*******
*******

    అలా అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత - ఆ మొదటి పదహారు రోజులు - అటు అత్తవారింట్లో, ఇటు అమ్మా వాళ్ళింట్లో - బద్రిని, నన్ను చూడడానికి వచ్చే స్నేహితులని కలవడంతో, కొందరితో బయటికి వెళ్లడంతో - ఇలా ఊపిరి సలపనీయని హడావుడితో గడిచిపోయాయి. 

    అన్నట్టు ఆ పదహారు రోజుల్లోనే ఏం జరిగిందంటే... 

    పెళ్ళైన వారం రోజులకో ఏమో - ఓ మధ్యాహ్నం పూట మా మరిది, ఆడపడుచు చెప్తున్న కబుర్లు వింటూ నవ్వుతున్న నాకు హఠాత్తుగా బాగా కడుపునొప్పి వచ్చింది. ఎంత అంటే ఏడుపు వచ్చేంత. బద్రి కంగారు పడి అక్కడ దగ్గర్లోనే ఉన్న ఒక డాక్టరు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. 

    ఆ డాక్టర్ నా పొట్ట మీద ఓ పదిసార్లు నొక్కి, నొసలు చిట్లించి - ఉన్నపళంగా వెళ్ళి ఎక్స్‌రే తీసుకురండి, పిల్లలూ!" అని మమ్మల్ని తరిమారు. 

    అమ్మో! ఏమయిపోయిందో అనుకుంటూ వెళ్ళి ఆ మిట్టమధ్యాహ్నపు ఎండలో వెళ్ళి ఎక్స్‌రే తీయించుకుని వచ్చాము. 

    అది చూస్తూనే ఆ డాక్టరు గారు పెదవి విరిచి "లాభం లేదు. అపెండిక్స్ పేగుల మధ్యలో చిక్కుకుపోయింది. ఏ నిముషమన్నా ఫెఠేల్మని ఫేలిఫోతుంది. ఫాఫం! ఈ మధ్యే ఫెళ్ళి ఛేసుకున్నట్టున్నావ్. ఫైకెళ్ళిఫోతావ్" అని గాఠిగా చేతులెత్తేసినట్టు చెప్పేశారు. 

    అది వింటూనే ఏడుపు మొదలెట్టిన నన్నో చేత్తో పట్టుకుని - "మరిప్పుడేం చెయ్యాలి, డాక్టర్?" అని అడిగిన బద్రికి ఆయనిచ్చిన సమాధానం "ఇంటికెళ్ళి మీ పెద్దవాళ్ళని పట్టుకురండి. రేపు పొట్ట కోసేసి పేగుల చిక్కులు తీసేసి అపెండిక్సుని రక్షించేస్తా" 

*******
*******

    ఇంకేముంది?! 

    ఇద్దరం నాలుగడుగులు వేస్తే నట్టింట్లో ఉన్నట్టుండే ఇంటికి వెళ్ళడానికి రిక్షా మాట్లాడారు బద్రి. అందులోకి నన్ను ఎంతో పదిలంగా పట్టుకుని ఎక్కించారు. 

    అప్పటికే నాకు చెప్పలేనంత నీరసం వచ్చేసింది. 

    "ఇంకేముంది - నేనిక బతకనేమో!" అనుకుని కళ్ళు మూసుకుని "అంతా భ్రాంతి యేనా? జీవితాన వెలుగింతేనా?" అని మనసులో పాడుకుంటున్నట్టు వెక్కివెక్కి ఏడుస్తూ  - బద్రి భుజమ్మీద తల పెట్టుకుని - రోడ్డు మీద వచ్చే ప్రతి గతుకు దగ్గర నా పొట్టలో అపెండిక్స్ చుట్టూ పేగులు స్వెట్టర్లు అల్లేస్తున్నట్టు ఊహించుకుంటూ - ఆ నాలుగడుగుల దూరం నాలుగొందల మైళ్ళలా ఫీలైపోతూ మొత్తానికి ఇంటి దగ్గర దిగాము. 

    ఇక అప్పుడు చూడాలి నా పరిస్థితి. 

    నడిస్తే నలిగిపోతానన్నట్టు అడుగులో అడుగేసుకుంటూ లోపలికి వెళ్ళిన నన్ను చూసి - నా వెనకాలే వచ్చిన బద్రి "డాక్టరేమన్నారంటే..." అని చెప్పిన మాటలు విని - మా అత్తగారు ఎంత కంగారు పడిపోయారో!

    అందులోనూ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయానికి వంట కాలేదని భోజనం చెయ్యలేదు. 

    మా అత్తగారికి అది గుర్తొచ్చి వెంటనే ఒక గిన్నెలో మెత్తగా పెరుగు అన్నం కలుపుకొచ్చి "వద్దు-వద్దు" అంటూ ఏడుస్తున్న నా నోట్లో "తినమ్మాయ్! కడుపులో చల్లగా వుంటుంది" అని "పెళ్ళై వారం కూడా కాలేదు. ఇలా అయిందేంట్రా" అని ఆవిడ కూడా ఏడుస్తూ  - మొత్తానికి అత్తాకోడళ్ళమిద్దరమూ ఒక విషాదభరిత వినోదాన్ని సృష్టించాము. 

*******
*******

    ఈలోగా విషయం తెలిసి అమ్మా-నాన్న వచ్చారు. 

    ఎంత పెద్ద విషయాన్నైనా మహ తేలిగ్గా కొట్టి పడేసే నాన్న - వస్తూనే - ఏడుస్తున్న నన్ను చూసి "ప్రతిదానికీ అలా కంగారు పడకూడదు. రేపు కదా ఈ డాక్టర్ ఆపరేషన్ చేస్తానన్నదీ. ఈ లోగా ఇవాళ సాయంత్రం మన శిష్టా బాలకామేశ్వర్రావు గారి తమ్ముడు డాక్టర్ శిష్టా విశ్వనాథ్ దగ్గరికోసారి వెళ్ళిరండి - అలా సర్దాగా రిక్షా ఎక్కి వెళ్ళి. ఆయన కూడా ఏమంటారో చూసి అప్పుడేం చెయ్యాలో ఆలోచిద్దాం" అన్నారు. 

    నాన్న చెప్పినట్టే ఆ రోజు సాయంత్రం బద్రి నన్ను రిక్షాలో డాక్టర్ విశ్వనాథ్ దగ్గరికి తీసుకెళ్ళారు. 

    ఆ రిక్షాలో వెళ్తున్నంతసేపూ నాకు నా పొట్టలో పేగులు  మెలికల ముగ్గులు వేసేసుకుంటున్న ఫీలింగ్. నాకేదో అయిపోతున్నట్టు  పొట్ట మీద కుడివేపు చెయ్యి గట్టిగా అదిమిపెట్టుకుని గతుకులు వచ్చినప్పుడల్లా రిక్షా ఎగరకపోయినా నేనే సీటు మీంచి ఒకసారి పైకి ఎగిరి కూర్చుంటూ మొత్తానికి చేరాల్సిన గమ్యస్థానం చేరాం.

    డాక్టర్ విశ్వనాథ్ నా పల్సూ - పొట్టా చూసి - "అబ్బే! ఇది అపెండిసైటిస్సే కాదు" అనేశారు. 

    నాకేమో బోల్డంత అనుమానం - ఈయన అసలు పొట్టే నొక్కి చూడట్లేదు అని.

    అందుకే గబగబా - "అంకుల్! ఆ డాక్టరు గారు నొక్కితే నాకెంత పొట్ట నొప్పి వచ్చిందో తెలుసాండీ?" అన్నా - అంటే మీరు సరిగ్గా టెస్ట్ చెయ్యట్లేదేమోనన్న నా అనుమానం ఆయనకి బాగా అర్థం అవ్వాలని.

    వెంటనే డాక్టరంకుల్ "మరి అలా నొక్కకపోతే నీకు నొప్పి ఎలా వేస్తుంది? ఆయనకి అపెండెక్టమీ చేసే అవకాశం ఎలా వస్తుంది. ఆయనసలే అపెండెక్టమీ స్పెషలిస్టు. అక్కర్లేనిదే కదా అని కోసి పారేస్తూ ఉంటాడు. జెలూసిల్ ఇస్తా. ఇంటికెళ్ళి తాగేసెయ్. రేప్పొద్దున్నకల్లా తగ్గిపోతుంది" అన్నారు. 

    "మరి నాకు అసలు కడుపు నొప్పి ఎందుకు వచ్చింది?" మళ్ళీ నా అనుమాన-స్వగతం. 

    "ఏముందీ! పెళ్ళిభోజనం బాగా చేసుంటావ్. అందుకొచ్చుంటుంది. అసలది అపెండిసైటిస్సే అయితే నువ్విలా రిక్షా ఎక్కి రాగలిగే దానివే కాదు. ఇక ఏమీ ఆలోచించకుండా ఇంటికెళ్ళిపో" అనేశారు డాక్టర్ విశ్వనాథ్ గారు. 

*******
*******


    ఇహ అక్కణ్ణించి ఇంటికి వస్తున్నప్పుడు మేమెక్కిన రిక్షా గాలిలో ఎగురుతున్న పడవలా తేలిగ్గా చులాగ్గా పరిగెడుతున్నట్టనిపించింది మా గుంటూరు రోడ్ల మీద. 

    మధ్యలో ఒక చోట రిక్షా ఆపి తనకిష్టమైన ఆకుసంపెంగ పూలు రెండు నాకు కొనిచ్చారు. 

    ఆ సంపెంగ పూల వాసన ఇప్పటికీ నా ముక్కుపుడక అంచున నిలిచి ఉన్నట్టనిపిస్తూ ఉంటుంది. 
    
*******
*******

    ఈ రోజుకి ఇక్కడ ఆపుతాను కబుర్లు. 

    వచ్చేమాటు మరిన్ని కబుర్లు నేను మోసుకొచ్చేలోగా "హమ్ సింఘాసన్ పర్ జా బైఠే ...జబ్ జబ్ కరే ఇరాదే... " అన్న మాటలు ఏ పాట లోనివో పట్టి నాకు చెప్పండేం?!


*******
*******
    
<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>



    

10 కామెంట్‌లు:

  1. ఈ అపెండిక్టమీ తమాషా మాకుటుంబంలోనూ‌ జరిగిందండి. మ చెల్లెలొకమ్మాయికి కడుపునొప్పి వచ్చి గిలగిల్లాడితే మీలాగే, డాక్టరు అర్జెంటుగా అపెండిక్టమీ చేసేయాలి అని చెప్పారు. నేనప్పుడు దూరంగ ఆఫీసులో ఉన్నాను. సెల్‌ఫోనుల రోజులు కావుకదా. ఆఫీసుకు ఫోన్ చేసి నన్ను పిలిపించి చెప్పారు వార్త. నేను హాస్పిటల్ చేరుకొనేటప్పటికే ఆపరేషన్ చేసారు. ఐనా అప్పుడప్పుడూ కడుపునొప్పి వస్తూ ఉండేది తనకి. మరొకొన్నేళ్ళు పోయిన తరువాత ఒక డాక్టరు గారు, మీరన్నట్లే చెప్పారు -- డబ్బుకొసం ఆయనెవరో అపెండిక్టమీ చేసినా చేసి ఉండచ్చూ -- అని!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి - సులువుగా అపార-ధనవంతులై పోదామనుకునే ఆ అపర-ధన్వంతరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  2. రెండు ఆకు సంపెంగలు చూడగానే
    విరిసిన కుసుమము నీవై మురిపించేవు....
    మేఘము నీవై నెమలిని నేనై..

    ఈ పాట కనుక్కోండి చూద్దాం.మీరేనా క్విజ్ లు ఇచ్చేది.మేము కూడా ఇస్తాం.మీరు చెప్పాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజానికి ఈ సారి మీ చేతిలో ఓడిపోదామనే అనుకున్నానండీ నీహారికా! కానీ పాట గుర్తుకొచ్చేసింది - మరేం చేయను...

      విరిసిన కుసుమము నీవై మురిపించేవు
      తావిని నేనై నిన్ను పెనవేసేను
      ఓహోహోహో
      మేఘము నీవై నెమలిని నేనై
      ఆశతో నిన్ను చూసి చూసి
      ఆడనా… ఆడనా… ఆడనా...
      ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది

      ఎన్నెన్నో బ్లాగుల బంధం - మీదీ నాదీ :)

      తొలగించండి
  3. లలిత గారైనా, నీహారిక గారైనా, ఎవరిచ్చినా సరే పాటల క్విజ్ సాల్వ్ చేయటం నావల్లనైతే కాదు!

    రిప్లయితొలగించండి
  4. భలేవారే మీలాగా కీర్తనలు ఎలాగూ వ్రాయలేము. మీ వంటివారు వ్రాసినవి చదివి, విని, పాడుకోవడమే చేయగలం.

    రిప్లయితొలగించండి
  5. ఆహా ఎంతటి అపురూపమైన పదాల కూర్పు...నిండు వేసవిలో దివాణంలో రెండు మల్లెన్టులకి పూసిన మల్లెలు, లతల్లా పాకిన సన్నజాజంటుకి పూసిన జాజులనీ కలిపి ఓకే మాలకట్టి, అద్దకం వేసిన వాయిల చీర కట్టుకుని, రెండువైపులా వేసిన ఒక బల్ల మీద ఒకవైపు ఓరగా కూర్చుని స్వాతి దిన పత్రికో, చందమామే మాస పత్రికో చదువుతూ, అప్పుడప్పుడూ లోపలకీ బయటకి వెళ్లి వచ్చే వారికి సన్న మల్లె జాజుల పరిమళాలను ఆఘ్రాణితమయ్యేట్లు చేస్తున్న ఆ నవయవ్వన గృహిణి ఆ బదిరీ నారాయణుని హృదయేశ్వరి మా లల్లెక్క మోములా లేవూ...

    ఇదీ నా జ్ఞాపకాల మదిలోంచి వచ్చినదే...😄

    రిప్లయితొలగించండి