11, మార్చి 2018, ఆదివారం

మా బావ నా కోసం రాసిన గాలికబుర్లు - ఆ పై కొన్ని పేర్ల కబుర్లు



"గాలిలోనే... మాటిమాటికీ... వేలితో నీ పేరు రాయడం - ఏమయిందో ... ఏమిటో ..."  - రాంగోపాల్ వర్మ తన  కోసమే రాయించాడేమో ఈ పాట అన్నంతగా ఇష్టం పెంచేసుకుని - అదే లైన్‌ని పదేపదే  హమ్ చేస్తుండే మా బావ, తన ప్రాజెక్ట్ పని మీద ఫ్లైట్‌లో వెళ్తూ, వస్తూ నాకు రాసిన ప్రేమలేఖలు  - గాలి (బావ) కబుర్లు. 



పెళ్ళికి ముందు, పెళ్ళైన కొత్తలో ప్రేమలేఖలు రాయడం, చదువుకోవడం మామూలే. కానీ పెళ్ళైన ఇన్నేళ్ళకి కూడా ప్రేమలేఖలు, వాటి తో పాటు నాకిష్టమైన ఫోటోలు, ఓ అందమైన పుస్తక రూపంలో అందుకోగలగడం నా అదృష్టం.

ఇంట్లో ఉన్నంత సేపు కబుర్లు చెప్తూ, వింటూ వున్నా కూడా తనకి తనివి తీరలేదట. అందుకే ప్రతీ వారం చేసే విమానప్రయాణం ఎలాగూ తప్పదు. ఆ ప్రయాణ సమయంలో ఏదో పుస్తకం చదువుకోవటమో, పక్కన కూర్చున్న వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండటమో, లేకపోతే పడుకోవటమో చెయ్యటం కాకుండా, నాకు ప్రేమలేఖలు రాయాలనిపించిందట.  తన లాప్‌టాప్ మీద నాకు చెప్పాలనుకున్న కబుర్లు రాయడం కోసం ఎప్పడెప్పుడు విమానం ఎక్కుతానా అని ఆరాటపడేవారట.

అలా జూన్‌లో రాయడం మొదలు పెట్టిన గాలి(లో)కబుర్లు డిసెంబర్‌కి పూర్తయ్యాయి. అంతలోనే వచ్చిన ఒక ఆలోచన ఈ కబుర్లన్నిటినీ ఒక పుస్తకంగా మార్చి నాకు ఇస్తే నేను చదివితే ఎలా వుంటుందా అని.

అది మొదలు తన కొలీగ్స్ అనిల్, కుమార్ గార్లతో కలిసి సాయంత్రం ఆఫీస్ పని అయిపోగానే వాళ్ళ ఆఫీస్ చుట్టుపక్కల వున్న OfficeMax, Kinko's ఇవన్నీ తిరగడం - అవే కాకుండా గూగుల్‌లో వెతికి ఎక్కడెక్కడో వున్న ప్రింటింగ్ స్టోర్స్‌కి వెళ్ళడం - అక్కడ వాళ్ళకి తెలుగులో టైప్ చేసిన కాంటెంట్ చూపించడం - వాళ్ళేమో ఈ ఇంటర్నేషనల్ ఫాంట్ ఇప్పటిదాకా ఎప్పుడూ ప్రింట్ చేయలేదు, ప్రయత్నిస్తాం కానీ ఎలా వస్తుందో చెప్పలేం అనడం. తనేమో తన ఫ్రెండ్స్ కి వీకెండ్ లో ఎక్కడెక్కడికి వెళ్ళాలో లిస్ట్ రాసి ఇవ్వటం, వాళ్ళు అక్కడకి వెళ్లి కనుక్కుని రావటం. కానీ అంతా సీక్రెట్, surprise గా ఉంచాలని చెప్పటంతో, వాళ్ళు కూడా బోల్డంత థ్రిల్డ్ గా ఫీల్ అవ్వటం! ఎక్కడా తనకి నచ్చిన పబ్లిషర్ దొరక్క పోవటంతో, తనే రాత్రుళ్ళు కూర్చుని, ఆ పేజీలన్నింటినీ ఫొటోస్ తీసి, ప్రతీ  పేజీ కి contextual గా సరిపోయేలా మా పాత ఫొటోస్ లోంచి కొన్నింటిని తీసి, వాటికి attach చేసి, ఆ compilation ని షట్టర్ ఫ్లై వాడికి పంపించి - ఓ మాంచి ఫోటో బుక్ తయారు చేయించారట.

ఇదో దాని కవర్ పేజీ, ఇంకా దాన్లోని ఓ కొన్ని కబుర్లు ...




ఫ్లైట్ వెళ్తుంటే చాలా బావుంటుంది బుజ్జాయ్. ప్రతి వారం విమానం జర్నీ చేస్తూ వుంటే రొటీన్ గానే వుంటుందేమో అందరికీ. కాని నాకెందుకో చాలా ఇంటరెస్టింగ్ గానే వుంది ఇంకా. మబ్బుల కన్నా పైన వెళ్తూ వాటిని పైనుంచి చూస్తూ వుంటే, భలే సరదాగా, విచిత్రంగా వుంటుంది.
---- ---- ---- ----

వర్షం వచ్చేలా వున్నప్పుడు దూరంగా మబ్బుల మధ్యలో మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మబ్బులు తెల్లగా కొన్ని నల్లగా కొన్ని ఎర్రగా కొన్ని దోరగా కొన్ని కోరగా వుంటాయి. అలానే, ఇంత ఎత్తులో వెళ్తున్నా కింద వూళ్ళల్లో వెలిగే లైట్లు అక్కడక్కడా కనిపిస్తూ వుంటాయి మసక మసకగా ఏ మబ్బూ లేనప్పుడు. విమానం ఫిలడెల్ఫియా, మన సెయింట్ లూయిస్ లకి దగ్గరగా వచ్చినప్పుడు చాలా బావుంటుంది. నేను మొట్టమొదటిసారిగా అమెరికా వచ్చినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అవుతున్నప్పుడు సాయంత్రం ఐదో ఆరో ఏడో అయ్యుంటుంది - అప్పుడు బయటికి చూస్తూ ఎలా ఫీల్ అయ్యానో ఇప్పటికీ విమానం లోంచి సిటీ లైట్లు ఎప్పుడు చూసినా అలానే అనిపిస్తుంది - నువ్వు కొత్త బంగారం పెట్టుకుని నాకు చూపిస్తూ మురిసిపోతావే ..అలా - ఊరంతా బంగారం అలంకారంగా పెట్టుకుని ఆకాశంలో ఎవరికో బోల్డంత ఆనందంగా చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. బోల్డన్ని ఎల్లో లైట్లు మధ్యలో అక్కడక్కడా తెల్ల లైట్లు - నీ బంగారం గొలుసుల్లో ముత్యాల్లాగా, వజ్రాల్లాగా. 

 ---- ---- ---- ----

మొన్న గురువారం వచ్చేటప్పుడు నా పక్కనున్న వాడు, నన్ను బోల్డంత ఆశ్చర్యంగా అడిగాడు - అదేంటీ అలా ఎలా టైపు (తెలుగు లో) చేస్తున్నావు అని అడిగాడు. నేను ఒకసారి కళ్ళు మూసి కొంచెం నెమ్మదిగా తెరిచి, చేతిని నెమ్మదిగా వూపుతూ 'జస్ట్ మేజిక్' అన్నా. వాడు కొంచెం కోపంగా చూసేలోపు నవ్వుతూ ఇక్కడ స్టాండర్డ్ డయలాగ్ just kidding అని - వాడికి ఈ టూల్ గురించి చెప్పా. వాడు కూడా నాలానే కళ్ళు తిప్పుకుంటూ ఓహో అదా సంగతి అని తెగ ఆనంద పడి, వాడు మొన్నీ మధ్య Japan వెళ్ళినప్పుడు google translate తో ఎలా మేనేజ్ చేసింది నాకు చెప్పాడు.  
 ---- ---- ---- ----

 ఒక్కసారి, జస్ట్ మళ్ళీ ఒక్కసారి టైం వెనక్కి వెళ్ళగలిగి, మనం మన స్నేహం ఇంకొంచెం ముందుగా మొదలు పెట్టగలిగితే  ... 
టైం లో వెనక్కి వెళ్ళగలగాలి, కానీ ఇప్పటివరకు జరిగినవన్నీ జరుగుతాయి అని తెలిసి వుండాలి. అంటే, ఎప్పుడైతే నిన్ను విసుక్కున్నానో, నీ మీద కోపం తెచ్చుకున్నానో ఆ సందర్భాలన్నీ మళ్ళీ అలాగే రిపీట్ అవ్వాలి. అలా జరుగుతున్నప్పుడు కూడా నేను నిన్ను మంచిగా బోల్డంత ఇష్టంగా చూసుకోవాలి.
 ---- ---- ---- ----

ఇల్లంతా హడావిడిగా తిరుగుతూ ఏంటో పాటలు పాడుకుంటూ, నవ్వుకుంటూ , పిల్లల్ని నన్ను సమానంగా విసుక్కుంటూ, కోపం తెచ్చుకుంటూ, వేటికోసమో వెతుక్కుంటూ, మధ్యలో అప్పుడప్పుడూ 'దొరికిందిరోయ్' అనుకుంటూ - ఇలా రకరకాలుగా కనిపించే, వినిపించే నిన్ను తలచుకున్న ప్రతిసారీ ఎక్కడ వున్నా, ఎంతమందిలోనైనా - నాకు తెలియకుండానే నా మొహంలో నవ్వు వచ్చేస్తూ ఉంటుంది.

 ---- ---- ---- ----


... నువ్వు శ్రద్ధగా చీర కట్టుకునే విధానం, కట్టుకుని ఓ అని మురిసిపోతూ నవ్వుకుంటూ, ''బావా సీ" అంటూ వయ్యారాలు పోవటం, ఇల్లంతా బొమ్మరిల్లులా సర్దటం, నువ్వూ ఓ బొమ్మలా పండగలకి దేవుడి ముందు కూర్చుని దండాలు  పెట్టటం, పెళ్ళైనప్పటినుంచి ఇప్పటివరకూ కొత్త చీర కట్టుకున్న ప్రతిసారీ నా కాళ్ళకి నమస్కారం చెయ్యటం (నీ భుజాలు పట్టుకుని పైకి లేపి దగ్గరికి తీసుకుంటే నీ మొహం మీద కనిపించే చిరునవ్వు), సినిమాలు చూసేటప్పుడు ఏదో చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా కార్టూన్స్ చూస్తారే అలా చూడటం, బాంక్ కి వెళ్ళినప్పుడల్లా ఏ నగలు తెచ్చుకోవాలా అనే డైలమా చూపులు, కార్ డ్రైవ్ చేసేటప్పటి స్నూపీ చూపులు - ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేని విషయాలైనా ఎప్పుడూ అన్నీ గుర్తు వస్తాయి. వెంటనే నాకు తెలియకుండానే మొహం మీదకి నవ్వు  వచ్చేస్తుంది. చాలా హాయిగా అనిపిస్తుంది.  ఓ ... మేరే ... దిల్ కే చైన్ ...చైన్ ఆయే మేరె దిల్ కో దువా కీజియే... !

 ---- ---- ---- ----

డబ్బు కావాల్సిందే. దాని విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా వుండాల్సిందే . కానీ వెధవ డబ్బులు వుంటే ఎంత, పోతే ఎంత - అందరు మంచిగా వుంటే చాలు అని నేనెప్పుడూ అనుకుంటాను. అదే చెప్తూ వుంటాను కదా. నువ్వు కూడా అలానే మాట్లాడితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకే నా మొహం మీదకి నా సిగ్నేచర్ నవ్వు వచ్చేసింది నువ్వు అలా అనగానే. మిగతా వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ, నువ్వు మాత్రం నిజంగా బోల్డంత మంచిదానివే బంగారం !

---- ---- ---- ----
 
ఈ మధ్య కొంచెం అబద్ధాలు చెప్పటం నేర్చుకున్నానోయ్ బంగారం.! మొన్న Monday రాత్రి 'ఇవాళ తొందరగా బజ్జుంటా బుజ్జాయ్' అని నీతో (అబద్ధం) చెప్పానా? కానీ ఫోన్ పెట్టేసి, ఓ రెండు గంటలు కూర్చుని ఈ stationery ని వెతికి డిజైన్ చేశా. బావుందా? నీకు నచ్చిందా?! ఇంకా కొంచెం మార్చాలి., కుదిరితే వచ్చే వారం చేస్తా.

---- ---- ---- ----

(నువ్వెంత ఖోపంగా చూసినా సరే, ఏ కారణం లేకుండా నాతో ఉత్తుత్తి గొడవలు పెట్టుకుని ఏడిచేటప్పుడూ, ఇంకా నన్ను సిగరెట్ తాగటానిక్కూడా వెళ్ళనివ్వకుండా సినిమాని, వాటి పేర్లు పడేటప్పటినుంచీ మొత్తం చూడాలని గొడవ చేసేటప్పుడు మాత్రం ఓ చిన్న బుజ్జి రాక్షసిలా ఉంటావ్. అందులో సందేహం లేదు.)

 ---- ---- ---- ----

ఎప్పుడో అప్పుడప్పుడు కొంచెం కోపంలో వున్నప్పుడు నిన్నేమైనా అని బాధ పెట్టి వుంటానేమో కానీ, నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే. ఎంతిష్టం అనడిగావనుకో ..... బుజ్జిగాడికి చెప్తానే... అలా రెండు చేతులూ ఇలా దూరంగా పెట్టి.... అంతిష్టం అంటాను. అంతకన్నా ఏం చెప్పలేను.

---- ---- ---- ----

అవీ ... పొగడికల మాలలల్లి ఈ లల్లీకో పొగడ-మాలే వేసేశారు - తన గాలికబుర్లలో.

ఇవొక ఎత్తైతే - నాకు తను పెట్టిన పేర్లు బోల్డున్నాయి.

(ఇంకో తమాషా విషయం - పెళ్ళైన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా మేమిద్దరం ఎవరికైనా చెప్పేటప్పుడు తప్ప ఒకరినొకరం పేరు పెట్టి పిలుచుకోలేదు.)

నచ్చినవేళల్లో నన్ను మెచ్చుకుంటూ పెట్టిన పేర్లు కొన్ని.

నేను తనని ఇబ్బంది పెట్టిన సమయాల్లో కూడా తాను నొచ్చినా నేను నొచ్చుకోకుండా ఆ విషయాన్ని నవ్వుతూ నాకర్థమయ్యేలా - ఒక వేళ పదిమందిలో వున్నప్పుడు చెప్పాల్సి వచ్చినా నాకు మాత్రమే అర్థమయ్యేలా సందర్భానికి తగిన హిట్ (హింట్) పేర్లు ఇంకొన్ని.

నన్ను మొట్టమొదటగా పిలిచిన పేరు బుజ్జాయ్. 

దానికి బంగారం ఎప్పుడొచ్చి జత కలిసిందో సరిగ్గా గుర్తు లేదు కానీ దాని గురించి తాను ముచ్చటగా చెప్పిన ముచ్చట ఒకటి - "అన్నట్లు చెప్పానా? నేనొక్కడినే ఇండియా వెళ్ళినప్పుడు - అంకుల్, బాబు, నేను డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. అప్పుడే నువ్వు ఫోన్ చేశావు. "చెప్పు బంగారం!"అంటూ నీతో మాట్లాడుతూ ఉంటే అది నీతోనని తెలిసి వాళ్ళిద్దరూ ఎంత మురిసిపోయారో తెలుసా?! మరి పెళ్ళప్పుడే చెప్పాను కదా అంకుల్ కి - నాకు కాలం గడిచే కొద్దీ పెరిగే బంగారాన్ని ఇస్తున్నారు మీరు అంటూ ;) "

ప్రశ్నకి ప్రశ్న అడగడం తప్ప ప్రతి ప్రశ్నకీ ఒక జవాబు మాత్రమే ఉంటుందన్న రూళ్ళు-రుమాళ్ళు అస్సలు పట్టించుకోని, పాటించని నేను తనడిగిన ఏ ప్రశ్నకైనా ఇచ్చే బదులు ప్రశ్నే!

ఉదాహరణకి -  ఫోన్ చేసి "బయటికి వచ్చాను. దగ్గర్లో ఇండియన్ స్టోర్ వుంది ఇంట్లోకేమైనా కావాలా?" అంటే "ఆ స్టోర్ చిన్నదా, పెద్దదా?" అంటూనో, "ఫలానా వాళ్ళు పార్టీకి పిలిచారు కాలెండర్లో నోట్ చేశావా?" అనడిగితే "ఏ కాలెండర్లో? అసలు నోట్ చేయకపోతే గుర్తుండదా?" అనో - ఒక్క మాటలో అవును, కాదు అని చెప్పగలిగే ప్రశ్నలకి కూడా ఏదో ఒక ఎదురు ప్రశ్న వేసే నాకు దొరికిన బిరుదు ప్రశ్నావళి.

ఎప్పుడైనా, ఏదైనా అనుమాన పడుతూ ఏమైనా అడిగితే, నాకొచ్చే ధర్మాధర్మ విచక్షణ లేక  (అ) ధర్మసందేహాలకి, నేను పాడే శంకవరాళి రాగానికనుగుణంగా నా కనువైన పేరు శంకరి కాక మరేంటి?


ఇంక తను సరదాగా చెప్పే విషయాలని కూడా అంతగా లోతుగా, చురుగ్గా ఆలోచించకుండా నిజమని నమ్మేసే నా ఇంకో పేరు మందా-రం. ఒకసారి ఎలెక్ట్రానిక్స్ ఎక్కువగా కొనేసి ఇల్లంతా వైర్ల మయం చేసేస్తున్నారని నేను గొడవ పెట్టాను చాలా - ఇంకేమైనా కొంటే అస్సలు కుదరదు అని చెప్పేశాను.  అప్పుడే సామ్స్ లో కొత్త డాన్-అండ్-డస్క్ లైట్స్ చూశారు తను. మా ఇంటికి బావుంటాయని కొనేశారు. (ఆ రోజు తనతో నేను షాపింగ్ కి వెళ్ళలేదు).   ఇంటికి రాగానే చేతిలో ఆ లైట్లు పట్టుకుని కిచెన్ లో ఏదో హడావిడిగా వున్న నాకు వాటిని చూపిస్తూ "చూశావా, మన మెయిల్ బాక్స్ లో ఎవరో పెట్టి వెళ్ళారు. ఏదో కొత్త ప్రాడక్ట్ అనుకుంటా ఫ్రీ శాంపుల్ లా వుంది" అనగానే నా కళ్ళు ఒకసారి వెలిగాయి - "అబ్బో ఎంత మంచి లైట్లో - ఎవరో గాని మంచి పేరున్న కంపెనీ అయుంటుంది" అని తెగ మురిసిపోయాను. తను కూడా ముసిముసిగా నవ్వుతూ "అవునే మందారం" అన్నారు. అసలు విషయం తర్వాత ఎప్పుడో తెలిసిన తర్వాత కానీ "మందా-రం" సంగతి అర్ధం కాలేదు. 

తను Fridays ఇంట్లోంచి పని చేసేటప్పుడు, నేను నా ఆఫీస్ కాల్స్ లో మాట్లాడేవి విని, "ఆహా..యామిని అమెరికా వచ్చిన దగ్గర్నుంచీ నువ్వు కూడా yeah-హాకారాలు చేసేస్తున్నావు" అన్నారు.

పుట్టింది కోనసీమలో అయినా గుంటూరు, ప్రకాశం, రాయలసీమల్లో చదివి, పెళ్ళయ్యాక బెంగళూరు చేరి, ఆ తర్వాత అమెరికా వలస వచ్చి స్థిరపడిన తర్వాత ఎవరికీ పట్టియ్యని యాసతో తెలుగు మాట్లాడుతున్నానూ అనుకునే నేను - ఎక్కడో ఒకచోట తనకి దొరికిపోతాను గోదావరి యాసలో మాట కూడా పాటలా సా...గా.. దీ ...సే ... దీర్ఘసుమంగళి గా

పాపం - తనేదో వీకెండు - కొంచెం తీరిగ్గా లేచి సావకాశంగా రోజుని సాగిద్దాం అనుకునే లోపు వంటింట్లోంచి స్వగతంగా, పోట్లాటకి స్వాగతంగా - ఈ ఏడాది కూడా landscaping చేయించడానికి కుదరట్లేదు స్ప్రింగ్ దాటి సమ్మర్ కూడా వచ్చేస్తోంది అనో, ఆ బేస్మెంట్ గోడ దగ్గర  లీక్ ఇంకా పెద్దదవుతోంది షానన్ ని పిలుస్తారా లేదా ఈ వారమైనా అనో - నాలో నేనే మాట్లాడుకునే సమయంలో లివింగ్ రూంలోంచి ఒక పాట వినిపిస్తుంది ...మా-నస-వీణా ... మధు గీతం... మన సంసారం సంగీతం అంటూ :)) .

అప్పుడీ మా-నస-వీణ మానసంలో మెదులుతుంది  ఓ పాట. అది మల్లెపందిరి సినిమాలో ఎస్ జానకి పాడిన తొలిచూపు తోరణమాయే కళ్యాణ కారణమాయే కి బదులుగా ఎస్పీబీ విరిచి తొలిచూపు తో-రణమాయే అంటూ పాడిన పాట.

ఇంకో పేరు గూగ్లీ. అబ్బే! ఈ పేరుకీ క్రికెట్ ఆటకి ఏం సంబంధం లేనే లేదు. ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులైనా మంత్రదండంతో మాయం చేసినట్లు, అంజనానిక్కూడా అందనట్లు ఎక్కడో చిలక-ప్రాణంలా భద్రంగా దాచేసినా అవసరమైనప్పుడు ఇట్టే సెర్చ్ చేసుకొచ్చి చేతికిస్తానని అపర-గూగుల్ అవతారాన్నే నేనని మెచ్చి నాకిచ్చిన పేరు గూగ్లీ. 


ఇంకేంటబ్బా...మర్చిపోయాను ... ఆ ... అదే! తనెన్నో సార్లు ఫోన్ లో చెప్పినా  వాటన్నిటికీ - అంటే ఎలాంటివంటే - కార్లో కొత్త ఇన్సూరెన్స్ కార్డ్ పెట్టు, రోజూ  గుర్తు పెట్టుకుని బోల్డన్ని మంచినీళ్ళు తాగు, బుజ్జిగాడి చేత కూడా తాగించు - అంటూ తను చెప్పేవాటిని ఫోన్ పెట్టేయగానే మర్చిపోయి మళ్ళీ తనొచ్చి గుర్తు చేశాక కూడా అదసలు ఇంతకు ముందు మీరు చెప్పారా, నేను విన్నానా అన్నట్లు వుంటానని పెట్టారబ్బా ఆ పేరు - ఏంటది? గజని కాక ఇంకేంటది?

మా అమ్మే ఒక్కోసారి ఆశ్చర్యపోతుంది - నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోశానేమో - అంటూ. అది ఓ సారి తను విని, దాన్ని ఇంకొంచెం హైలైట్ చేస్తూ, మా అమ్మతో ఒప్పేసుకుంటూ - ఆంటీ సరిగ్గా చెప్పారు అంటూ వాగే నా దేవీ!  - నా వాగ్దేవి! అంటూ నా వాగ్ధారకి గుర్తింపునిచ్చారు.

పుట్టినరోజులకో, సెలవు రోజుల్లోనో - పిల్లల కన్నా ఎక్కువగా సరదా పడి వాళ్ళు మనసు పడ్డారనో - వాళ్ళ వంకతో నేనాడేసుకుందామనో లెగోలో, ఇంకోటో కొనేసి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తానని శాంటాకి పోటీగా శాంటీని చేశారు నన్ను.

ఎక్కడికి వెళ్లినా ఏం కొనాలన్నా డెబిట్టో, క్రెడిట్టో - ఏదో ఒక కార్డు వాడితే సరిపోతుంది. ఒక్కోసారి కొన్ని చోట్ల డబ్బులే కావాలంటారు - ఏ చారిటీ కోసం పెట్టిన ఏ చిన్న స్టాల్ లోనో,స్కూల్ స్టోర్ లోనో. అలాంటప్పుడు లేదనకుండా వాలెట్ అరల-అలలు మధించి చిల్లరభాండం తెచ్చి అందించే నా పేరు ధనలక్ష్మి.

iPad లో తెగ బ్లాగులు చదివేసి, పాటలు విని-వినిపించే నేను ఐ-పద్మిని.

ఎక్కువుగా సాధిస్తున్నట్లు తనకి అనిపించినప్పుడు నాకు ఇచ్చిన ఇంకో నామధేయం సాధ్వి
 
బుజ్జాయ్, బంగారం, ప్రశ్నావళి, శంకరి, మందారం, యామిని,  దీర్ఘసుమంగళి, మానసవీణ, గూగ్లి, గజని, వాగ్దేవి, శాంటీ,  ధనలక్ష్మి, ఐ-పద్మిని,  సాధ్వి  ....ఎన్ని పేర్లో కదా!

ఇవన్నీ....... ఒకెత్తు.

వీటన్నిటినీ మించి విమల అన్నటికన్నా ఇంకో ఎత్తు.

మా ఆడపడుచు పెళ్ళిలో షాపింగ్‌కి నన్ను తోడు రమ్మంటూ - ఇంటా బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్ - అని పాడుతూ ఉంటే  "అబ్బా - ఇంక పదే పదే అడగొద్దు నన్ను - నేను రాను అక్కడికి - ఇప్పుడొస్తే నాకు వంట చేయటం కుదరదు - మళ్ళీ మీకే ఆకలేస్తుంది పన్నెండింటికల్లా - అప్పటికప్పుడు నేను పరిగెత్తలేను - మీరే వెళ్ళి రండి " అంటూ పేచీ నాది.

దానికి బదులుగా "ఈ ఒక్కసారీ వెళ్ళొచ్చేద్దాం - తొందరగానే ఒక గంటలో - రా విమలాదేవీ!" అంటూ సముదాయింపు.

అప్పటికే పక్కనుండి మా ప్రళయకలహాన్ని వింటున్న మా అమ్మ "విసుగు ముందు పుట్టి తర్వాత పుట్టింది లలితా పరమేశ్వరి" అంటూ "ఇంతకీ విమల ఎవరండీ" అని తీసింది ఆరా.

కంట్లోంచి పెదవుల మీదికి జారిందో - లేక పెదవుల మీంచి కంట్లోకి ఎగిసిందో కనిపెట్టలేని చిరునవ్వు మెరుపు మొహమంతా వెలిగిస్తుంటే - చిలిపితనపు చిలకరింతతో ఆ ఆరాకి అందిన మాఱుమాట "మీరన్నదే ఆంటీ! విసుగుతో పుట్టి మా ఇంటిని మెట్టి వెలిగిస్తున్న మీ-మా విసుగు మహా లక్ష్మి - విమల - విమలాదేవి  :) "

మా అమ్మెప్పుడూ అంటుంది - మాట చూస్తే మామిడల్లం, మనసు చూస్తే పటికబెల్లం - మా లల్లీకి అని. ఆ విషయాన్ని అంత మంచిగా అర్థం చేసుకుని - తను నాకు పెట్టిన విమల అనే పేరుని వినగానే మా అమ్మ మొహమంతా కమ్మిన నవ్వుని, ఆవిడ పొందిన సంతోషాన్ని పోల్చాలంటే ఏ దివిటీ వెలుగులూ సరిపోవు.

తనకి ఆ పేరంటే ఎంత ఇష్టమంటే - నాకో బుల్లి కారు కొని, దానికి personalized license plate గా ఆ పేరుని అలకరించేంత :)

35 కామెంట్‌లు:

  1. మీ బ్లాగు నేను మిస్ అవకుండా చదివే బ్లాగుల్లో ఒకటి.
    నాకొక ధర్మ సందేహం.
    నా అభిమాన బ్లాగర్ ‘ కొత్తావకాయ’ గారి ‘మదిని కోరికలు... మదన గీతికలు’ అన్న ప్రముఖ పోస్ట్ లోని ‘విమల’ మీరేనా??
    ఆ పోస్ట్ ను ప్రింట్ చేసుకుని మరీ దాచుకున్నాను.
    తరచూ చదువుకుంటూ ఉంటాను.
    ఆ పోస్ట్ చివర్లోని కామెంట్లలో మధురవాణి గారి కామెంట్ పైన ఉన్న అనానిమస్ కామెంట్ మీదేనా?
    మీదైన ప్రత్యేకమైన శైలి ప్రస్ఫుటంగా మరీ కనిపిస్తోంది ఆ కామెంట్ లో.
    అప్పటికి మీకు బ్లాగు లేక అనానమస్ గా వచ్చారా?
    కానీ మీరేనని నాకు రూఢిగా అనిపించడానికి కారణం మీరు తరచుగా వాడే పదం ‘బోల్డన్ని’ ఆ కామెంట్ లో ఉండటం.
    అంతేకాదండోయ్, అది మీ బ్లాగు పేరు కూడా.
    పైగా సమాధానంలో కొత్తావకాయ గారు మీకు సహస్ర నామాలున్నాయని పెద్ద క్లూ కూడా ఇచ్చారు.
    మీరు అనానిమస్ గా వచ్చారని మీ ఐడెంటిటీ బయటపెట్టకుండానే ఇది మీ కధే అని చెప్పకనే
    చెప్పారు.
    మీరు వారికి బాగా కావలసినవారు అనుకుంటాను.
    కరెక్ట్ గానే కనిపెట్టేనా? చెప్పగలరు.
    ఇంక మీ ఈ పోస్ట్ విషయానికి వస్తే ఆరాధనకు పరాకాష్ట, ప్రమాణం శతనామాలూ, సహస్ర నామాలే కదా!
    ఇంత అన్యోన్యమైన మీ జంట....
    నాకన్నా మీరు చిన్నవారైతే ఆశీస్సులు. పెద్దవారైతే నమస్కృతులు.

    రిప్లయితొలగించండి
  2. eppaTinunchoe blog follow avutunnaa comment cheyyalaedu..baagundani eam cheptaam ani...baagundi mee photo book :))

    రిప్లయితొలగించండి
  3. మీరు ఇలాంటి ముచ్చటైన బహుమతులు మీ వారి నుంచి మరిన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లలిత గారు.

    రిప్లయితొలగించండి
  4. Anniversary blog...Simply wonderful. God bless you both with many more years of love and togetherness 💐

    రిప్లయితొలగించండి
  5. చేతిలో చెయ్యేసి చెప్పు బావ....విమలని తలచుకొంటే నాక్కూడా నవ్వొచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యగామిగారు! బావ చేతిలో చెయ్యేసే కాదు - తల మీద చెయ్యి పెట్టి ఒట్టు పెట్టారు :) విమల మిమ్మల్నీ నవ్వించిందీ - ధన్య!

      తొలగించండి
  6. ఎంతయినా ఆ నీళ్ళ మహత్యం ఆ గాలి మహత్యం లేకపోతే ఇన్నిన్ని కబుర్లు ఊడిపడవండే ఆయ్, బావ కబుర్లు సూపరంతే

    రిప్లయితొలగించండి
  7. ఆ మొదటి అజ్ఞాత గారి వ్యాఖ్య చూసి మళ్ళీ మా కొత్తావకాయ గారి బ్లాగులోకెళ్ళి ఆ పోస్ట్ చదివి మీ కామెంట్ చదివి ధృవీకరించుకున్నా "మాట మామిడల్లం మనసు పటికబెల్లం గారో"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను కూడా మళ్ళీ కొత్తావకాయ గారి పోస్ట్, అంత కన్నా శ్రద్ధగా కామెంట్లు చదివి వస్తున్నా.
      ‘సవ్వడి’ గారి కామెంటు కు జవాబుగా కొత్తావకాయ గారు “ అన్నీ బయట పెటట్టేయడం కష్టం. ఇలాంటి వారిని బయట చూడగలం. కానీ ఎవరికి వారు వెతికి పట్టుకోవలసిందే” అన్నారు. ఇన్నేళ్ళకు బయటకు వచ్చారన్నమాట.
      ప్రేమకు, వివాహానికి విలువలు అర్ధాలు మారిపోతున్న ఈ రోజులలో మీ లాంటి వారిని చూడగలగడం అరుదు.
      మీజంటకు శుభాకాంక్షలు.
      మూర్తి

      తొలగించండి
    2. శ్రీనివాస్‌గారు: మరేండి...భలే పట్టేశారు!

      తొలగించండి
    3. మూర్తిగారు: మీ ఆత్మీయపూరిత వ్యాఖ్యకు, శుభకామనలకు ధన్యవాదాలు.

      తొలగించండి
  8. Its awesome. బద్రి గారి మేఘ సందేశాలు అమోఘం.

    రిప్లయితొలగించండి
  9. అక్కా బావగారి సందేశాలు చదువుతున్నట్టులేదు ...బాపు రమణలు బొమ్మలతో చూపించే చక్కని కథ చూస్తున్నట్టే ఉంది...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీ కమెంట్ చదివి మీ బావగారు మురిశారు, హనుమాన్!

      తొలగించండి
  10. లలితా! ముందుగా మీ ఇద్దరికీ పెళ్ళిరోజు శుభాకాంక్షలు. కొంచెం లేటుగా.........
    దాదాపు 23 సంవత్సరాల క్రింద మీ తులసి పెళ్లిలో మొదటిసారిగా ‘విమల’ పరిచయం.
    పెళ్ళిలో అన్నీ నీవై, హడావుడిగా తిరిగేస్తుంటే మీ అమ్మగారు కాఫీనో, కనీసం మంచి నీళ్ళన్నా తాగమని బ్రతిమాలుతుంటే నువ్వు మీ అమ్మగారిని టైం లేదని విసుక్కున్నావు.
    మీ కుట్టి నవ్వుతూ,”అసలు మీరు పెట్టుండాల్సింది లల్లెమ్మకు ‘విమల’ అని పేరు. బావగారు చూడండి ఎంత సరిగ్గా పెట్టారో విమల అని”. అంది.
    అప్పుడు తెలిసింది ఈ’విమల’ అనబడే ‘విసుగు మహా లక్ష్మి’ పేరు, పేరు వెనక కధ రెండూ.
    అంతవరకూ ముద్దుపేర్లు అడ్డపేర్లు ఇంతందంగా కూడా పెట్టుకునే వాళ్ళుంటారని తెలీలేదు.
    ఆ తర్వాత ‘శంకరి, మా’నస’వీణ, వాగ్దేవి కూడా అక్కడే పరిచయం అయ్యారు :-)
    మరి ఇన్నేళ్ళలో మాకు విమల లోని విసుగు మాత్రం పరిచయం కాలేదు.
    సందర్భానికి సరిగ్గా సరిపోయే అపురూపంగా దాచుకోదగ్గ పోస్ట్.
    కారు నంబరు ప్లేట్, గాలికబుర్లు టైటిల్, typical of Badari.
    P.S: Btw, Sai says he was the photographer of the good old picture that you posted :-)











    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీ! నా జ్ఞాపకాలని నాతో పాటు నేను తలుచుకున్నంత ఇష్టంతోనే నువ్వూ తలుచుకుంటావు - ఎంత గొప్ప విషయం కదా! నీకు బోల్డన్ని థాంక్స్! అవును - ఆ ఫోటో సాయి తీసిందే :)

      తొలగించండి
  11. ఒక బ్లాగుకి అభిమానులుండటం సహజం. ఒక రచయిత్రి గురించి ఇంకొక రచయిత్రి అంత బాగా వ్రాయడం మాత్రం నాకు సంతోషంగా ఉంది. బ్లాగుల్లో రచయత(త్రి)లకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. మొదటి అజ్ఞాత ఎంత బాగా గుర్తు పెట్టారో చదివి ఆశ్చర్యం వేసింది. మీరు ఎప్పటినుండో బ్లాగుల్లోనే ఉన్నారన్న మాట ! ఫోటో బుక్ గురించి నేను చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను. బుక్ కవర్ పేజీ చాలా బాగుంది. బావ కబుర్లు చాలా బాగున్నాయి. మగవాళ్ళే ఎక్కువగా విరహ/ప్రేమ గీతాలు వ్రాసినా కూడా (ఈ రోజుల్లో) మరీ ఇంత పొయెటిక్ గా ఉంటే నాకు మరింత ఆశ్చర్యం వేస్తుంది. అభినందనలు. ఏదయినా బ్లాగ్ చదివి ఆనందించేలోపు నీళ్ళ మహాత్యం, గాలి మహాత్యం అంటూ ప్రాంతీయ/జిల్లాల వాదం లేవనెత్తే వ్యాఖ్యలు చూస్తే అరచేతి మంట నెత్తికెక్కి "కోమల"నైపోతాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారికగారు! నా గురించి ఎవరూ ఏమీ రాయలేదు.
      నేను గత రెండేళ్ళుగానే బ్లాగ్ కొంచెం ఏక్టివ్‌గా రాస్తున్నాను - అంతకుముందు జస్ట్ చదివేదాన్ని - అది కూడా ఒకట్రెండు బ్లాగులు మాత్రమే - అన్నీ కాదు.
      మా ఫొటోబుక్ మీకు నచ్చినందుకు, మా బావ కబుర్లు మెచ్చినందుకు సంతోషం. మీ అభినందనలకు ధన్యవాదాలు.

      తొలగించండి
  12. వెరీ నైస్ మీరు ఎప్పుడూ ఇలానే హ్యాపీగా మీ వారి నుండి బహుమతులు అందుకోవాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆత్మీయపూరిత వ్యాఖ్యకి ధన్యవాదాలు, కాత్యాయిని!

      తొలగించండి
  13. అద్భుతో అద్భుతస్య అద్భుతః ! ఇద్దరూ ఇద్దరే రాయటంలో. బహుశా పాతికేళ్ళ సహవాసం కావొచ్చు. మీకు లేరు ఎవరూ సాటి !

    రిప్లయితొలగించండి
  14. ముద్దు పేర్లను ఇంత మురిపెంగా abbreviate levels లో humorous గా చెప్పిన తీరు ఎంత ముద్దుగా గా ఉంది అంటే **ముద్దు కే ముద్దొచ్చే మందారంలా** ఉంది. మనస్ఫూర్తి గా అభినందనలు. రామనవమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయశ్రీ గారు: చాలా ఆలస్యంగా చూశాను మీ ఈ వ్యాఖ్య :( ఏమీ అనుకోకండి. మీ మంచిమాటలకు బోల్డన్ని ధన్యవాదాలు!

      తొలగించండి
  15. సినిమాల్లోనో, నవలల్లోనో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది కానీ నిజజీవితంలో ఇలా ఎవరైనా ఇంతందంగా ప్రేమించుకుంటారా అని బోల్డంత ఆశ్చర్యపోయి, బోల్డుబోల్డంత ఆనందపడ్డాను. కానీ కొంచెం అంటే కొంచెం జెలసిగా ఉంది. మీరు నిండు నూరేళ్లు ఇలాగే సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని ప్రతిస్తున్నాను��

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మంచి విషెస్‌కి చాలా థాంక్స్, లతగారు! నా బ్లాగ్ చదువుతున్నందుకు ఇంకా బోల్డన్ని థాంక్స్!

      తొలగించండి