30, డిసెంబర్ 2020, బుధవారం

మళ్ళీ అదే అంటున్నా - ఉన్నకాలము మేలు ఏ కాలము కంటెన్...


ఓయ్ 2020... 

    చేసిందంతా చేసేసి ఏంటంత మెల్లిగా జారుకుంటున్నావ్? 

    అసలు మొదట నువ్వు వచ్చీ రాకుండానే - కొత్త దశాబ్దం మొదలైందని, ఖచ్చితమైన చూపు అంకెలు 20 / 20 కలుపుకొచ్చావని, చమత్కార భరిత - Vision 2020 వనీ, కలిసొచ్చే కాలానివని, కలకల నవ్వులతో కళకళలాడిస్తావని ఎంత మురిసిపోయానూ?


    నువ్వేం చేశావ్? 
    కలవరం తెచ్చావ్. 
    కల్లోలం రేపావ్. 
    కాలనేమి వారసులు కమ్మిన కాలమనిపించావ్. 
    కలిసుండనియ్యకుండా చేశావ్. 
    అయినవాళ్ళకి  కాకుండా చేశావ్. 
    ఇంటిని నాలుగ్గోడల బోనుని చేశావ్ 
    ఊపిరిని ఉన్నచోట బంధించే ముసుగు మాటున ఉంచేశావ్. 
    ఎందరి జీవితాలనో అస్తవ్యస్తం చేశావ్. 
    ఎందుకొచ్చిన కాలంరా ఇది అనిపించావ్. 

    సరిగ్గా ఏడాది క్రితం ఏమనుకున్నానూ? ఎంత మురిసిపోయానూ? ఓ సారి గుర్తు చెయ్యనా? 

వచ్చిందేమన్నా అలాంటిలాంటి సంవత్సరమా? 
సమదృష్టి భరిత వత్సరం 20-20

    నేననుకున్నట్టు నువ్వు సమదృష్టి భరిత వత్సరానివే - కానీ అందులో ఉన్న ఓ చిన్న మెలిక నేను గమనించలేదు సుమా! అదేంటంటే నువ్వు సమదర్శి-దృష్టి భరిత సంవత్సరానివని. 

    ఒక్కటి మాత్రం నిజం. నిన్నెప్పటికీ మరువలేం. నువ్వు చేసిన గాయం ఇప్పటిప్పట్లో మానేది కాదు. 

    నువ్వు మాత్రం ఏం చేస్తావులే! ఎప్పట్లాగే సెకన్లు నిముషాలుగా, నిముషాలు గంటలుగా, గంటలు రోజులుగా - తలొంచుకుని నీ దారిన నువ్వు పెరగడమూ, ముందుకు జరగడమూ తప్ప నీకుగా నువ్వు ఏమీ చెయ్యలేదని నాకు తెలుసు. 

    కాకపొతే - అన్నీ సవ్యంగా సాగుతుంటే, అంతా బావుంటే కాలం కలిసొచ్చిందనీ -  ఏ మాత్రం తడబడినా, ఓ చిన్న కుదుపిచ్చినా కాలం పామై కరిచిందనీ - జరిగే వాటన్నిటికీ కాలమే కారణమని అనుకోవడం మనుషులుగా మాకలవాటు. అందుకే మా కష్టాలకి, నష్టాలకి, కాలు కదపలేని బాధలకి నీదే బాధ్యత అంటున్నాం. 

    ఇంకొద్ది సేపట్లో పాతబడి, వాడిన మొహంతో నువ్వలా పోబోతున్నావా?! ఆ మలుపులో మొహమంతా వచ్చీరాని నవ్వు పులుముకుని, బిక్కుబిక్కుమంటూ, రానా-వద్దా అనుకుంటూ, ముందుకీ-వెనక్కీ ఊగిసలాడుతూ, అలా అని తోసుకొస్తున్న కాలాన్ని ఆపలేక, ఇప్పుడో-ఇంకో ఘడియకో వచ్చేస్తానన్నట్టున్న ఆ 2021 నీకూ కనిపించే ఉంటుంది. 

    ఆ వచ్చే కొత్త సంవత్సరం - నీ అంత కాకపోయినా ఎంతో కొంత తమాషా - అనగా some-వింత అయిన సంవత్సరమే! ఎలా అంటావా? 2021 అంటే 21 వ శతాబ్దపు 21 వ సంవత్సరం. భలే! 

    చూశావా! ఇప్పటి దాకా 20-20 వని నువ్వేం చేశావ్ అంటూ నిన్ను నిలదీస్తున్న నేను అంతలోనే 20-21 గురించి కొత్త లెక్కలేసుకుని ఇంతలోనే మురిసిపోతున్నాను. మనిషి పుట్టినప్పటినుంచి చెప్పిందే, మళ్ళీమళ్ళీ చెప్తున్నదే, నీకు మళ్ళీ చెప్తున్నా విను - మరపు మాకు సహజం. మరపు మాకు వరం. 

    ఎంతో చెడు జరిగిందని అందరం అనుకుంటున్న నీ కాలంలో - కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండేలా అంతో ఇంతో మంచి కూడా జరిగిందని - చేతులు కడిగించి, మూతులు మూయించి ఎంతో కొంత మార్పు తెచ్చానని - ఆట్టే మురిసిపోకు. 

    ఇంకో నాలుగు నాళ్ళు గడిచి మళ్ళీ నలుగురూ కూడే వేళ, నలుదిక్కులకీ వెళ్ళగలిగే వేళ - "నువ్వు నేర్పావూ-మేము నేర్చామూ" అనుకునే మంచి మచ్చుక్కూడా మిగిలుండదు. 

    ఇంకొక్క రోజులో నిరుడయ్యే నీకు నేను చెప్పేదొకటే! 

    ఇంత జరిగాక - "ఇప్పుడున్న కాలం బాలేదు, ఇంతకుముందు బావుంది, ఇక ముందు బావుంటుంది" - అన్న లెక్కలేమీ ఉండవు చూసుకో. 

    అలా అనుకోవడానికి అసలంటూ మనిషి మిగిలుండాలి కదా. 

    అందుకే - అంటున్నా!

ఓ ఇరవైన బాధల ఇరవై-ఇరవై!
నిను సాగనంపుతూ ... 

    ఇంతకు ముందు నేనన్నదే -
    అదే ...
    మళ్ళీ అదే అంటున్నా...

    మనిషి ఉంటూ
    మనిషిగా ఉంటూ
    మంచిగా ఉంటూ
    మంచి మనిషిగా ఉంటూ
    మనిషి అంటూ ఉంటే, మంచి అన్నది ఉంటే
    ఉన్నకాలము మేలు ఏ కాలము కంటెన్!


27, డిసెంబర్ 2020, ఆదివారం

తొందరపడి మా తోమరి - ఎందుకో ఆగిందీ... దెబ్బకి సాగిందీ...

ఈసారి కబుర్లు చెప్పటం మొదలెట్టేముందు - ఓ చిన్న పొడుపు కథ... 

అనగనగనగనగా... 
అక్కడెక్కడో పుట్టింది 
మా ఇంటికొచ్చింది 
సోమరి కాదు తోమరి తానంది
మీట నొక్కితే ఆడింది  
ఆడుతు పాడుతు తోమింది 
తోమి తోమి తోమలేక ఆగింది
ఆగింది, ఆగింది, ఆగిపోయింది 
అయ్యో! అనేలోగా - 
హఠాత్తుగా లేచి సాగింది
ఆడింది ఏంటది ? తోమింది ఏంటది?
ఆగింది ఎందుకది? సాగింది ఎక్కడికది?
చెప్పుకోండి చూద్దాం! 

    వారం వారం ఏం కబుర్లు చెప్తుందా అని ఎదురు చూసే నా నేస్తాలు ఇది చదవగానే ఏమనుకుంటారో. నన్నేమడగాలనుకుంటారో నాకు తెలుసు. 

అసలీ తోమరి ఏంటి? 
అంతకు ముందు ఆడుతున్నదేంటి? 
ఇప్పుడు ఆడక ఆగిందేంటి? 
ఆగినది ఆగినట్టుండక మళ్ళీ సాగిందేంటి?
ఆ సాగిందెక్కడికో చెప్పకుండా ఈ బ్లాగింగేంటి? 
హన్నా! - అని నన్ను నిలదీస్తారని తెలుసు. 

నేను రాయబోయేది ఏమన్నా -
ఇప్పుడే అందిన వార్తా? 
ఎప్పుడూ జరగని వింతా? 
చెప్పుకోదగిన విశేషమా? 
చెప్పుకోలేని రహస్యమా?
ఇంటికో, వంటింటికో పనికొచ్చే టిప్పా?
టైం-పాస్ గాసిప్పా?

    అబ్బే! అదేమీ కాదు! 

    ఇది చాలా మందికి - అతి సాధారణమైన, బహు సామాన్యమైన, మహా uninteresting topic కూడా అయ్యుండొచ్చు. నాకు మాత్రం మిగిలిన అన్ని విషయాల్లాగే - కాదేదీ ఇంటరెస్ట్ కనర్హం - అనిపించే విషయం. 

    ఒక రోజులో నేను చేసే పనులని నాలుగు రకాలుగా విభజిస్తే అవి ఇలా ఉంటాయి: 

సమయానికి చెయ్యాల్సిన పని - అంటే ఆఫీసు, ఉద్యోగం, అమ్మ-నాన్న-అత్తగార్ల సీరియళ్ళకి అంతరాయం కలక్కుండా వాళ్ళకి వీలైన టైములో ఫోన్ చేసి మాట్లాడడం లాంటివి. 
సమయం చూసుకుని చెయ్యాల్సిన పని - ఒంటికి చురుకిచ్చే నడక, మెదడుకి చురుకిచ్చే పజిల్స్.  
సమయం ఉంటే చెయ్యాల్సిన పని - చదవడం, రాయడం, స్నేహితులతో మాట్లాడడం లాంటివి. 
సమయం ఉందా లేదా అన్న ఛాయిస్ లేని పని - వంట, వంటింటి శుభ్రం. 

    ఉన్న ఇంతోటి పనులని ఎన్ని ముక్కలుగా విడగొట్టుకున్నా వీటన్నిటినీ చేసేటప్పుడు వేటికి కావాల్సిన ఉత్సాహం వాటికి ఉంచుకుంటేనే - నా రోజు ఆడుతూపాడుతూ గడుస్తుంది. లేకపోతే "సమయం ఉంటే చెయ్యాల్సిన పని"ని ఎక్కువ చేసేసి "సమయం ఉందా లేదా అన్న ఛాయిస్ లేని పని"ని ఎగ్గొట్టేయ్యాలనిపిస్తుంది. 

    అందుకే రాసి పెట్టుకున్నా: Happiness is... doing what I like & liking what I do అంటూ నా మాటగా. 

    నాకిష్టమైన పనిని చేయడమే ఆనందమనుకుని ఆగిపోక, చేసే ప్రతిపనినీ ఇష్టపడంలో ఆనందముందని అనుకోవడం హాయబ్బా!

    ఇంతకీ ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకూ అంటే ఇవాళ్టి కబుర్లలో హీరోయిన్ను - కిచెన్‌లో నా ఎయిడూ, మా వంటింటి తోమరి అనబడే కిచెన్ ఎయిడ్ - డిష్ వాషర్. 

    నాకు డిష్ వాషర్ ఒక మంచి కిచెన్ అసిస్టెంట్. నేను చెప్పినట్టు విని, నాకు కావాల్సినట్టు పని చేసే నాకనువైన డొమెస్టిక్ హెల్ప్.  


    సాధారణంగా డిష్ వాషర్ వాడకం గురించి ఒక కంప్లైంట్ లాంటి కామెంటు వినిపిస్తూ ఉంటుంది "మీ అమెరికాలో డిష్ వాషర్లు ఉన్నాయీ అనుకోవడమే కానీ మీరు అన్నీ కడిగి పెడితే కానీ అవేమీ తోమవట కదా?" అని. నేనది విన్నప్పుడల్లా డిష్ వాషర్లూ, వాటి ఉపయోగాలూ, వాటి వల్ల అయ్యే నీటి ఆదాలూ అంటూ ఓ పే...ద్ద పాఠం అప్పచెప్తూ ఉంటాను. ఎవరైనా వింటే నేనే ఆ డిష్ వాషర్లని తయారు చేసి అమ్ముతున్నానేమో అనుకునేలా. 

    అదే ఇక్కడ మళ్ళీ మళ్ళీ - పునరపి వచనమ్! అవధరించుడి!

    డిష్ వాషింగ్ అనేది మూడంచెల పధ్ధతి. 

    మొదటి అంచె - వండిన గిన్నెల్ని, వాడిన గరిటల్ని, తిన్న కంచాలని - వాటివాటికి అతుక్కున్న పదార్థాలని నీళ్లతో తొలిచి వదిలించడం. 

    రెండో అంచె - అన్నిటికీ సబ్బు అనబడు స్తోమక్షారం రాయడం. 

    మూడో అంచె - రాసిన సబ్బుని నీళ్లతో కడగడం. 

    డిష్ వాషర్ వాడేటప్పుడు మొదటి అంచె మాత్రమే నా వంతు. మిగిలిన రెండూ డిష్ వాషర్ వంతు. అంటే నాకు గిన్నెలు కడిగే టైములో రెండొంతుల టైము ఆదా. పైగా  కిందా, పైనా అన్ని పక్కల్నించీ వేడివేడి నీళ్ళు చల్లి గిన్నెలన్నిటికీ తలంటేసి ఎక్కడా జిడ్డు లేకుండా మిలమిలలాడేట్టు చేసే డిష్ వాషర్ అంటే నాకు బోల్డంత ఇష్టం. 

  "ఉద్యోగం పురుష లక్షణం" అని అప్పుడెప్పుడో ఎవరో  రాసి పెట్టేసి - అసలలా రాయడానికి కారణమైన సందర్భమేదో సరిగ్గా తెలీకపోవడంతో - బయటికెళ్ళి చేసే ఉద్యోగాలు మాత్రం మగపనులు, అవి కాకుండా మిగిలిన ఇంటి పనులన్నీ ఆడపనులని అనుకునేలా చేసేశారు. ఆ ప్రకారంగా గిన్నెలు కడగడం అనేది ఆడపని, అంతగా మాటాడుకోకూడని పని అయిపోయింది. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని పనులనీ ఆడా-మగా తేడా లేకుండా అందరూ వీలైనంత వరకు నేర్చుకోవాలి. అదే కదా చిన్నప్పుడు విన్న పేదరాశి పెద్దమ్మ కథల్లో నేర్చుకున్నది?! 

    ఇప్పుడు నేనో కథ చెప్తా... 

    అనగనగా ఓ రాజు. ఆయనకో రాణి. వాళ్ళకి ఓ రాకుమారుడు పుడతాడు. ఆ రాజేమో రాకుమారుడికి అన్ని విద్యలూ నేర్పిస్తాడు - ఒక ప్రత్యేకమైన కుట్టుతో బొంతలు కుట్టడంతో సహా. ఆ తర్వాత రాకుమారుడు దేశాటనకి వెళ్తాడు. ఈలోగా దుష్ట సేనాధిపతి పన్నాగాల వల్ల రాజ్యం పోగొట్టుకున్న రాజు, రాణి వేరే నగరానికి పారిపోయి మారు వేషాల్లో ఎక్కడో తలదాచుకుంటారు. ఈ విషయం దేశాటన నుంచి తిరిగొచ్చిన రాకుమారుడికి ఓ పేదరాశి పెద్దమ్మ చెప్తుంది. అప్పుడా రాకుమారుడు ఓ ప్రత్యేకమైన బొంత కుట్టి పేదరాశి పెద్దమ్మకి ఇచ్చి - ఎవరైతే ఆ బొంతని చూడగానే "ఇది ఫలానా కుట్టు" అని గుర్తుపట్టగలుగుతారో వాళ్ళ వివరాలు కనుక్కోమంటాడు. అలా తన తలిదండ్రుల జాడ తెలుసుకుంటాడు. ఆ ఆ తర్వాత దుష్ట సేనాధిపతిని ఓడించి తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యం తిరిగి సంపాదించుకుంటాడు. ఆ రాకుమారుడు బొంతలు కుట్టడం ఆడపని అని నేర్చుకోవడం మానేసి ఉంటే ఇంత కథ జరిగేది కాదు కదా! (ఈ కథ చిన్నప్పుడు విన్న పేదరాశి పెద్దమ్మ కథల వరసలో నేను అల్లుకున్న ఓ కథ.)

    ఇదంతా - అంటే పైన రాసిన పొడుపు కథలూ, పేదరాశి పెద్దమ్మ కథలూ - ఇవన్నీ కూడా - "గిన్నెలు కడగడం, డిష్ వాషర్లూ" లాంటి విషయాలు కబుర్లు రాయడానికి అనర్హం కాదని చెప్పడానికి నేను build చేసుకున్న persuasive argument. 

    ఇప్పుడింక అసలు విషయం లోకి - అంటే మా గిన్నె-తోమరి అనబడే డిష్ వాషర్ కబుర్లలోకి వస్తే... 

    కిందటి వారం మా డిష్ వాషర్ ఎప్పట్లాగే కిందా, పైనా అరల్లో ఉన్న గిన్నెలన్నిటినీ తళతళలాడేట్టు తోమింది. 

    డిష్ వాషర్లన్నాక ఏవైనా అదే పని చేస్తాయి. అందులో విశేషం ఏమీ లేదు. 

    మా గిన్నె-తోమరి కొంచెం తుంటరి. 

    తోమింది తోమినట్టుండక - పై అరలో పెట్టిన ఒక గాజు గ్లాసుని ముక్కలు చేసింది. 

    రెండేళ్ళ క్రితం ముచ్చట పడి కొనుక్కున్న గాజుగ్లాసులు మూడు ముక్కలవ్వడం ఇది మొదటి సారేమీ కాదు - మూణ్ణాలుగులీక్వల్టూ-పన్నెండో సారి. 

    "ఇంకెప్పుడూ ఇలాంటి గ్లాసులు కొనకూడదు" అని  ఆ పగిలిన గాజుముక్కలేరుతూ పన్నెండో సారి అనుకున్నా.  

    ఈ స్టెప్పు వరకూ ఇంతకూ ముందు పదకొండు సార్లు ఎలా జరిగిందో అదే సీక్వెన్స్ - అదేదో ఇంతకు ముందెప్పుడో అచ్చు ఇలాగే జరిగిందే అనిపించే deja vu లాగా. 

    మరుసటి రోజు పొద్దున్నే - ఉన్న రెండు అరల నిండుగా - కళాత్మకంగా సర్దిన కంచాలని, గిన్నెలని, గరిటల్నీ - కళ్ళ నిండుగా చూసుకుని - నీలి రంగులో జాలువారుతున్న డిష్ వాషర్ డిటెర్జెంటుని వేసి - ఆన్ చేయగానే - దడదడలాడుతూ హడావిడిగా తిరగాల్సిన మా డిష్ వాషర్ ఉన్నట్టుండి ఉలుకూ-పలుకూ లేకుండా ఉండిపోయింది. 

    డిష్ వాషర్ పని చెయ్యట్లేదు అని చెప్పగానే బదరికి వచ్చిన మొట్టమొదటి ఆలోచన - పగిలిన గాజు ముక్కలేమన్నా లోపల పడ్డాయేమోనని. మళ్ళీ మనకి మనమే అనుకోవడం ఎందుకని మా ఇంటికెప్పుడూ వచ్చే ఎలక్ట్రీషియన్ రిక్‌ని పిలిచి అతనికోసారి చూపిద్దామని అనుకుని ఫోన్ చేస్తే ఆయనేమో ఓ రెండ్రోజుల దాకా రావడం కుదరదన్నాడు. 

    ఇక చేసేదేముంది?! వంతుల వారీగా "ఆడుతు పాడుతు తోమేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ?!" అని ఆడుకుంటూ-పాడుకుంటూ కాలక్షేపం చేసుకున్నాం.  

    ఇంట్లో ఉన్న పిల్లజింకలిద్దరూ - అటొచ్చీ-ఇటొచ్చీ వంటింట్లో గిన్నెల-కొలువు చూస్తూ - "అమ్మా! డిష్ వాషర్ లేదు కదా - డిషెస్ ఏమైనా తగ్గించి వాడుతున్నావా?" అని పరామర్శించడం - దానికి నేను "డిష్ వాషర్ లేదని వండే డిష్షులు తగ్గలేదు కదమ్మా!" అని బదులివ్వడం.  

    ఇలా ఓ రెండ్రోజులు గడిచాక రిక్ వచ్చాడు. వస్తూనే డిష్ వాషర్‌ లోకి తొంగి చూసి - మల్టిమీటర్ పెట్టి దాని  నాడి చూసి - "మోటార్ బాగానే ఉన్నట్టుంది. ఇదిగో ఈ బయటున్న ఎలక్ట్రానిక్ టచ్ ప్యాడ్ పోయింది" అని చెప్తూనే  "ఇది కొత్తది వేయించుకునే బదులు ఇంకొక కొత్త డిష్ వాషర్ కొనుక్కోవడం మంచిది. మీరు కొత్తది కొన్నా దాని వారంటీ పీరియడ్ అయిపోగానే ఎలాగూ పాడవుతుంది. అందుకని ఆట్టే ఎక్కువ డబ్బులు పెట్టకుండా తక్కువలో కొనుక్కోండి" అని చెప్పి "నేను చేసిందేమీ లేదు కాబట్టి నాకు డబ్బులు ఏమీ ఇవ్వొద్దు" అని డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు - మా సత్యకాలపు రిక్!

    ఈ లోగా బదరి కిచెన్-ఎయిడ్ సపోర్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు "టచ్ ప్యాడ్ ఐదొందలవుతుంది. ఒక వేళ మీరంత పెట్టి కొందామనుకున్నా ఫిబ్రవరి దాకా అది మీకు పంపించడానికి కుదరదు" అంటూ "దాని బదులు కొత్త డిష్ వాషర్ కొనుక్కోండి" అని వాళ్ళ వంతు మార్కెటింగ్ కోటా పూర్తి చేసుకున్నారు. 

    ఇక ఇంట్లో కోలాహలం - కొత్త డిష్ వాషర్ కొనబోతున్న ఉత్సాహం. 

    "మనం ఒక మంచి డిష్ వాషర్ కొందాం. అదెలా ఉండాలంటే నువ్వు ఆఫీసులో ఉండగా నీ సెల్ ఫోనుకి  తోమిన గిన్నెల ఫోటోలు మెసేజ్ పంపించాలి. గిన్నెలు తోమడం అయిపోగానే అవి ఎవరు unload చెయ్యాలో అదే task assign చెయ్యాలి." అంటూ బోల్డన్ని ఊహలు బదరివి - నన్ను ఊరిస్తున్నట్టుగా. 

     మళ్ళీ అంతలోనే "అంట్లు తోమడానికి అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. ఆ రిక్కు చెప్పినట్టు మామూలుదేదో కొనుక్కుందాము" అన్జెప్పి చుట్టుపక్కల ఉన్న Appliance stores అన్నిటికీ వెళ్ళి వచ్చాము. ఏమీ నచ్చలేదు. ఆన్లైన్లో వెతుక్కుందాము అని ఇంటికొచ్చేశాము. 

    ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుకుంటున్నా - అన్ని దారులూ రోమ్ వైపు వెళ్ళేట్టుగా - మా మాటలన్నీ డిష్ వాషర్ గురించే. 

    ఇంతలో బదరి డిష్ వాషర్ దగ్గరికి వెళ్ళి - "చిన్నప్పుడు రేడియోలు పని చెయ్యకపోతే అటూ-ఇటూ రెండు దెబ్బలేస్తే పని చేసేది కదా! దీనికీ ఓ రెండు దెబ్బలేస్తా. ఎలాగూ పని చెయ్యట్లేదు. ఇప్పుడు కొడితే కొత్తగా పోయేదేమీ లేదు" అంటూ గట్టిగా రెండు దెబ్బలేసి ఈలోగా రిక్ నుంచి ఫోన్ వచ్చిందని అవతలికెళ్ళారు. 

    ఇంతకీ ఆ రిక్ ఎందుకు చేశాడంటే - అతనేదో కొనుక్కుందామని హోమ్ డిపోకి వెళ్తే అక్కడ డిష్ వాషర్లు చూసి మేము గుర్తొచ్చామట. అందుకని ఫోన్ చేశాడట. 

    బదరి రిక్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. నేనీ లోగా డిష్ వాషర్ దగ్గరికి వెళ్ళగానే నా చెయ్యి తగిలి "డ్ర్ర్ర్ ..." అని శ్రావ్యంగా పలికింది మా తోమరి. 

    వెంటనే "బావా!" అంటూ నా ఆనందాతిశయ కేక! 

    ఏమయిందో అని హడావిడిగా పరిగెత్తుకొచ్చిన బదరికి - తాను కొట్టిన దెబ్బలకి చుక్కలు కనిపించాయో ఏమో అన్నట్టు - చుక్కల్లాంటి లైట్లు వెలుగుతూ పనిచేస్తూ కనిపించింది మా కిచెన్-ఎయిడ్. 

    ఇహ ఇప్పుడు "దెబ్బకి డిష్ వాషర్ కూడా పనిచేస్తుంది" అన్నది మా ఇంటి కొత్త నానుడి. 

    ఏ పాటునైనా పాట కట్టేసి పాడేసుకోవడం మా అలవాటు... ఆ అలవాటులో ఒక పాటగా ... 
   
ఇది వారంటీ ఎండ్ అనీ 
ఇక గ్యారంటీ లేదనీ 
తొందరపడి మా తోమరి -  
ఎందుకో ఆగిందీ... 
దెబ్బకి సాగిందీ...

    

      అన్నట్టు కిచెన్-ఎయిడ్ వాళ్ళ ట్రబుల్ షూటింగ్ గైడ్‌లో ఈ "ఆగిపోయిన డిష్ వాషర్‌కి వెయ్యండి రెండు దెబ్బలు" టిప్ కూడా చేర్చుకోమని చెప్పాలి.  

 

20, డిసెంబర్ 2020, ఆదివారం

"సఖ్యం సాప్తపదీనం" అన్న బాసకి బాసటైన బాట

    సఖ్యం సాప్తపదీనం.

   ఏడడుగులు కలిసి నడిస్తే స్నేహితులవుతారట. మరి కలిసిన మొదటి రోజునే బోల్డన్ని అడుగులు కలిసి నడిచాం. ఆ సఖ్యం ఇంకెంత గట్టిగా ఉండాలీ? 

    ఆ నడకల పదాలలో సరిగమలు - ఇక్కడ రాసి పెట్టుకున్నా: 

    త్వామనురజామి - 17 - మాట లేని రోజు అది - వాక్కు లేని walk అది! 

    అడుగులేసి అక్కడితో ఆగామా?! ఆ పక్కరోజు కాక అటు పక్కరోజు కలిసి రైలు ప్రయాణం కూడా చేశాం. 

    ఆ రైలు ప్రయాణపు పదనిసలు - ఇక్కడ దాచిపెట్టుకున్నా: 

    త్వామనురజామి - 18 - పాడకున్న ఏమిలే - చదివేద్దాం రాతలే!

    త్వామనురజామి - 19 - बोलనంత సేపు స్నేహమా - నేను बोలాక కోపమా? 

    అక్కడితో - అప్పటికి అనుకోకపోయినా  - ఇంకొన్నాళ్ళకి - అనుకోకుండా ఎంతో జరిగిపోయింది.  ఆ తర్వాత కొన్నాళ్ళకి అనుకున్నంతా అయ్యింది. 

     ఇవాళ్టికి  నిన్నైన డిసెంబర్ 19 నాటి తొలిఅడుగులకి, ఇవాళ్టికి రేపైన డిసెంబర్ 21 నాటి తొలిప్రయాణానికి - ఇవాళ్టికి ముప్పై ఏళ్ళు. 

    ఒకటి కాదు, రెండు కాదు, ఐదూ-పదీ కాదు, ఏకంగా మూడుపదుల ఏళ్ళు - దాదాపుగా మూడు వందల అరవై నిండు పున్నములు. 

    తొలి అడుగుల నాటి ఆ శీతాకాలపు సాయంకాలం ఈ రోజుకీ నా కళ్ళ ముందు ఆ రోజు ఎలా మెరిసిందో అదే మెరుపుతో మెదులుతూ మురిపిస్తోంది. 


ఆ సాయంకాలం 
ఆ శీతాకాలపు చలిని అడగని-సాయం కాలం 
ఆ శీతాకాలపు ఎండని అడిగిన-సాయం కాలం 

అప్పటిదాకా... 
ఒక క్షణం - చుట్టుముట్టిన కొండగాలికి వణుకుతూ  
మరు క్షణం - వెచ్చకాగిన ఎండ వేడికి ఉరుకుతూ 

ఒక్కదాన్నీ - 
మా చదువుల ఒడి క్యాంపస్ దారుల్లో 
ఎండ వేసిన నీడ ముగ్గులతో ఆడుకుంటూ 
కనిపించని గాలితో మాటాడుకుంటూ 

నాదైన ప్రపంచంలో నాకై నేనే నంటూ  
నాకు నేనే తోడనుకుంటూ 
నాలో నేనే పాడుకుంటూ 
నాతో నేనే తిరుగాడుకుంటూ... ఉన్నానా?!

ఇంతలో నా కన్నెదుట 
కన్నెనైన నా కట్టెదుట 
నిలిచాడొక అబ్బాయి

మోగక - మదిలో మూగే పాటలా... 
నవ్వుతూ - సవ్వడి లేని మువ్వలా... 

ఆ నవ్వు  - పెదవుల మీంచి కన్నుల్లోకి పాకుతోందో 
ఆ నవ్వు - కన్నుల్లోంచి పెదవుల మీదికి జారుతోందో 
ఎటుదెటు సాగుతోందో 
తెలీనీక 

కనువిందుగా 
తళుకల్లె 
కనికట్టుగా
మిణుకల్లె
ఎటులెటు సోకుతోందో 
తోచనీక 

పలకరించె నన్ను 
నిలవరించె నన్ను 

నాకప్పుడు ఎందుకలా అనిపించిందో - 
కానీ - ఇది మూగసందేశమో... అనిపించి - 
అదే - నాకనువైన మనోరాగ సంకేతమో అనుకున్నా. 

అప్పుడు...  
మనసులో వలపే మెరిసిందో 
ఆ తలపుకే మనసే మురిసిందో 
ఆ పైనున్న మిన్నే వంగిందో 
నాకున్న కన్నే చెదిరిందో 

పుట్టిన ఇరవైయ్యొక్క ఏళ్ళకి మళ్ళీ కొత్తగా పుట్టాను
అప్పటి వరకు ఉన్న నేను నిన్ననయ్యా... 
అప్పటి నుంచి నేను తనదన్నదయ్యా!

**చెలి మనసే శివధనుసైనది 
తొలిచూపుల వశమైనది**
అన్న వేటూరి వారి పాట 
నిజమాయె మా పాలిట

   అంతే! 
ఆ మొదటి రోజు నడకలో కలిసిన అడుగులు 
అన్నై, ఇన్నై, బోల్డన్నై - 
మనువులయ్యాయి 
 మనుగడలయ్యాయి


("సఖ్యం సాప్తపదీనం" అన్న బాసకి బాసటైన బాట)


  

13, డిసెంబర్ 2020, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 21 - ఆత్మీయ అన్నాబత్తిన!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 20 - తలపులమ్మ పంపిన ఊరు... టంగుటూరు!


    టంగుటూరులో ML అంటే పెద్ద కంపెనీ కింద లెక్క. ITC తర్వాత ML కంపెనీయే. 

    నాదొక చిన్న ఆఫీసు, పక్కనే పెద్ద గ్రేడింగ్ హాల్ పత్తిపాటి సుబ్బారావు (ఎ ర్రబ్బాయి) గారిది. దాదాపు ఐదారొందలమంది - చుట్టుపక్కలున్న - జమ్ములపాలెం, కాకుటూరివారి పాలెం, ఆలకూరపాడు, ఉప్పలపాడు - గ్రామాల నుంచి గ్రేడింగుకి వచ్చేవాళ్ళు. 

    ఇద్దరు సూపర్‌వైజర్లు - షేక్ ఆదమ్ అని ఒక సీనియర్ గ్రేడింగ్ సూపర్‌వైజరు - పేరయ్య అని ఒక జూనియర్ గ్రేడింగ్ సూపర్‌వైజరు -  సాంబశివరావు అని ఒక క్లర్కు -  నాగేశ్వర్రావు అని ఒక ఆఫీసు బాయ్ - కోటయ్య అని ఒక వాచ్‌మన్ కమ్ సెక్యూరిటీ - ఇదీ నా టంగుటూరు బ్రాంచ్ ఆఫీస్ స్టాఫ్. ప్రస్తుతానికి క్యాషియర్ లేడింకా. బ్రాంచ్ మేనేజర్ కమ్ క్యాషియర్ నేనేనన్నమాట. 

    మాకు పద్ధెనిమిది బయ్యింగ్ పాయింట్స్ ఉండేవి - నెల్లూరు నుంచి చౌదరి పాలెం, కావలి, వేటపాలెం-  ఇలా చీరాల దాకా 18 ఉండేవి. వీటన్నిటికీ పద్ధెనిమిది మంది బయ్యర్లు ఉండేవాళ్ళు. అన్నాబత్తుని వెంకటసుబ్బయ్య జమ్ములపాలెం నుంచొచ్చేవాడు. ఆయన ఓ కమ్యూనిస్ట్ లీడరు. లక్ష్మయ్య గారికి బాగా కావాల్సిన వాడు. ఈ 18 మంది బయ్యర్లని ఆయనే పెట్టాడు. ఆయనే ఆ బయ్యర్ల టీముకి లీడర్ కూడా. ఆయన నేనంటే "పంతులుగారు" అంటూ ప్రాణం ఇచ్చేవాడు. నేను నా ఆఫీసు చుట్టూ చిన్న గార్డెన్ ఒకటి వేయించాను. దానికోసమని ఆయనే వెంకన్న అని ఒకణ్ణి పెట్టాడు తోటమాలిగా. 

    ఇక టంగుటూరులో బీనీడి వెంకట నరసయ్యగారు మంచి ఫ్రెండయ్యాడు. ఆయన్ని బట్టి అందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. పత్తిపాటి సుబ్బారావు (ఎర్రబ్బాయి ) తమ్ముడు చిన్నా అని అతను కరాటే ఫైటర్. అతను కూడా మంచి ఫ్రెండయ్యాడు నాకు. అంతే కాకుండా పైడి కిష్టయ్య అని ఇంకొకతను, గుత్తా వెంకటసుబ్బయ్యగారు, బెల్లం కోటయ్యగారు - వీళ్ళందరూ కూడా మంచి స్నేహితులయ్యారు నాకు. 

    సింగరాయకొండలో మిట్టపల్లి వాళ్ళ కంపెనీ ఉండేది. అది కూడా ఒక ఫ్యాక్టరీ . మిట్టపల్లి పాండురంగారావు గారని ఆయన కూడా పరిచయమయ్యారు. అప్పుడప్పుడూ సరదాగా కలుస్తూ ఉండేవాళ్ళం. 

    మాకు అప్పుడు చైనా ఆర్డర్స్ వస్తూ ఉండేవి. మా 18 బయ్యింగ్ పాయింట్సులో దాదాపు 3 వేల టన్నుల పొగాకు కొన్నాము. చాలా వేగంగా కొన్నాము. 

    అప్పుడు ఫ్యాక్టరీలు అవసరమయ్యి బీనీడి వెంకటనరసయ్య గారి ఫ్యాక్టరీ, మిట్టపల్లి వారి ఫ్యాక్టరీ, అలాగే ఆంజనేయ టొబాకో కంపెనీ అని చెప్పేసి దాముచర్ల ఆంజనేయులుగారు - ఆయన ఫ్యాక్టరీ, తర్వాత గూడూరు భూషయ్యగారు - ఆయన ఫ్యాక్టరీ, లావణ్య టొబాకోస్ అని చెప్పేసి ఒంగోలు ఫ్యాక్టరీ ఒకటి - తర్వాత టంగుటూరులో భారత్ లీఫ్ అని రంగారావుగారి ఫ్యాక్టరీ ఒకటి ఉండేది - ఇన్ని ఫ్యాక్టరీలు ఆపరేట్ చేసేవాళ్ళం. వీటన్నిటికీ నేనే ఇన్-ఛార్జ్. అక్కడ ప్యాకింగులు, ఇక్కడ గ్రేడింగులు అన్నీ నేనే చూస్తూ ఉండేవాణ్ణి. 

    ఇలా అంతా బాగానే నడుస్తోంది. అన్నీ చేస్తున్నా, ఇంత వ్యవహారం నడుపుతున్నా అప్పుడెప్పుడో కృష్ణస్వామిగారన్నట్టు జీతం మాత్రం నెలకి మూడంకెల్లోనే నడుస్తోంది. నేను సవాల్ చేసినట్టుగా ఐదంకెలు కానే కావట్లేదు.  సరే! ఇప్పుడే కదా మేనేజ్‌మెంటు వైపుకి వచ్చింది. కొంతకాలం కానీయ్ చూద్దామనుకున్నాను. 

    అన్నట్టు మేమింకా కొండలరావు గారింట్లోనే అద్దెకి ఉండే రోజుల్లో - ఓ సారి  ఏం జరిగిందంటే నేనో రోజు రాత్రి పూట కంపెనీ నుంచి ఇంటికి వస్తున్నాను. వచ్చే దారిలో బెల్లం కోటయ్యగారి ఇల్లు ఉంది. అక్కడ రోడ్డు మీద నల్ల కుక్కొకటి పడుకుని ఉంది. ఆ చీకట్లో నాక్కనపడక దాన్ని తొక్కేహాను. టక్కన నా పిక్క పట్టుకుని పీకేసింది అది. 

    ఎలాగో ఇంటికి వచ్చేశాను. మా ఇంటికెదురుగుండా కఱ్ఱ సాము చేసే సుబ్బారావు ఉండేవాడు కదా! అతను అంత రాత్రి పూట వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి నాతోపాటే డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఆ డాక్టర్ గారు కుక్క కరిచిన చోట అంతా చూశాడు. శుభ్రం చేసి కట్టు కట్టాడు. 

    "ఓ పధ్నాలుగు ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ చెయ్యాల. ఆపకుండా  వరసగా పధ్నాలుగు రోజులు చెయ్యాలి" అన్నాడు డాక్టరు గారు. 

    "ఇంజెక్షన్ చెయ్యి కానీ బొడ్డు చుట్టూ వద్దు - నువ్వు చేతికి చేస్తావో, తుంటికి చేస్తావో చేసుకో - బొడ్డు చుట్టూ మాత్రం వద్దు" అని చెప్పా నేను. 

    "సరే అయితే!"  అని రోజూ తుంటికి చేసేవాడు. "ఒక్కరోజు వేయించుకోవడం తప్పినా మళ్ళీ పధ్నాలుగు చేయించుకోవాలి" అన్నాడు. 

    సరే అని రోజూ వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటున్నాను. సరిగ్గా పది రోజులయ్యాక చిలకలూరిపేట నుంచి ఫోనొచ్చింది అర్జెంటుగా బయల్దేరి రమ్మని. ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికెళ్లి "ఆ మిగిలిన నాలుగు ఇంజెక్షన్లూ చేసెయ్యవయ్యా" అంటే ఆయన కుదరదన్నాడు. ఇలాక్కాదని చెప్పి చిలకలూరిపేట వెళ్ళిపోయాను. అక్కడ పనవ్వగానే వెనక్కొచ్చిన తర్వాత ఓ రోజు ఆఫీసుకి వెళ్తున్న నన్ను - డాక్టర్ గారు  రోడ్డు మీద ఆపి "పది రోజులు కాగానే ఇంజెక్షన్లు ఆపేశావు . మళ్ళీ రా - నీకు మొదట్నుంచీ  మళ్ళీ పధ్నాలుగు రోజుల పాటు ఇంజెక్షన్లు చెయ్యాలి అన్నాడు. 

    నేను ఆయనతో "నేను మళ్ళీ పధ్నాలుగు చేయించుకోను. చేస్తే ఆ మిగిలిన నాలుగు చెయ్యి. లేకపోతే లేదు. నన్ను కరిచిన కుక్క బతికే ఉంది. దానికేమీ పిచ్చి పట్టలేదు. రోజూ దాన్ని చూస్తూనే ఉన్నాను. పైగా దానికి బిస్కెట్లు అవీ పెడుతున్నాను. అది కూడా రోజూ తోకాడించుకుంటూ నా వెనకే వస్తోంది. నాకింకేమీ ఢోకా లేదు. . అంచేత ఇటుపైన ఇంక నీ దగ్గరికి రాను. ఇంకా గట్టిగా మాట్లాడావంటే ఆ మిగిలిన ఇంజెక్షన్లు నువ్వు చేసేసుకో" అని చెప్పేసి వచ్చేశా.  

    "ఈయన రాక్షసుడండి, బాబూ!  ఇంత మొండోడేంటండీ ఈ పంతులు?" అని ఆ తర్వాత అన్నాబత్తిన వెంకట సుబ్బయ్యతో అన్నాడట ఆ డాక్టర్. 

    వెంకట సుబ్బయ్య వచ్చి "ఏంది పంతులూ! ఆ డాక్టరన్నట్టే నువ్వేం రాక్షస జాతివాడవయ్యా?!" అంటూ ఒకటే నవ్వు. 

    ఇహ బయ్యింగ్ సీజన్లో పొగాకు ఎక్కువ కొనేశామన్నాను కదా! లక్ష్మయ్యగారేమో ఫోన్ల మీద ఫోన్లు - "ఆపెయ్యండి కొనడం ఇంక" అంటూ. 

    ఈ వెంకటసుబ్బయ్యేమో ఆగట్లేదు. టీము లీడరు ఆయనే కదా! పైగా పెద్దాయన. మంచి అడ్మినిస్ట్రేటరు. ఆ పరిసరాల్లో మంచి పలుకుబడి ఉన్నవాడు. 

    ఆయన వెళ్ళి పొగాకు కొనకుండా ఆపడమెలా అని ఆలోచించి నేనేం చేశానంటే - మా కంపెనీకి ఉన్న పద్ధెనిమిది డీజిల్ కార్లలోనూ డీజిల్ అయిదు లీటర్లకి మించకుండా ఉండేలా చూశాను. అప్పుడు అవి ఓ పట్టాన స్టార్ట్ కావు. ఆయన ఎక్కడికీ వెళ్ళలేడు అని. 

    అది తెలిసి ఆయన ఏం చేశాడంటే "నీ పని ఇట్టా ఉందా? నాకు ఏరియాకి వెళ్ళడానికి ఒక్క కారు కూడా లేకుండా చేస్తావా నువ్వు?" అన్జెప్పి  - పదిహేడు కారుల్లోంచి లీటరు, లీటరు చొప్పున డీజిల్ తీసి పద్ధెనిమిదో కారులో పోసి - ఆ కారేసుకుని చక్కా వెళ్ళిపోయాడు. 

కారులవి పద్ధెనిమిదుండు
కదలరాదని కారులేవీ - 
కారునున్న డీజిలంత తోడు... 
కదలని కారు-కారునా డీజిలేమొ ఐదుండు
పంతాన అన్నాబత్తిన తోడియెత్తె -
ఒక్కొక్క లీటరు  కారు, కారు నుంచి...  
కూడె ఒక కారుకి ఐదుకి తోడు పదిహేడు
దడదడమని కదలాడె కారు 
దడ పుట్టించుతు అన్నాబత్తిన ఉరికాడు!

    వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పా "ఓయ్ వెంకటసుబ్బయ్యా! నీ వల్ల నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది ఇక్కడ. ఇక పొగాకు కొనకయ్యా బాబూ!" అంటే - పాపం! - అప్పుడు నా మాట విని కొనుగోలు ఆపేశాడు. 

    అప్పట్నుంచి నన్ను చూస్తే "బ్రాహ్మణస్య! ఘాతకస్య !" అనేవాడు అంటే "పంతులూ - నువ్వు పాపిష్టోడు!" అని ఆయన భాషలో. హహహహా!

    ఆయన ఎటువంటి వాడంటే ఒక ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచె వేసుకుని -కమ్మూనిస్టు లీడరు - రష్యా అంతటి చలిదేశానికి ఆయన విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు - దాదాపు పది రోజులు - అదే ఖద్దరు చొక్కా,  అదే ఖద్దరు పంచె - చేతిలో వావిలాల గోపాలకృష్ణయ్య గారేసుకున్నట్టుగా ఓ చిన్న చేతి సంచీ - అందులో ఇంకో నాలుగు జతలు ఖద్దరు పంచెలు, చొక్కాలు - కోటు కూడా వేసుకోకుండా - రష్యా వెళ్ళాడు. అంత మొండోడు ఆయన! ఎంత మొండివాడో అంత మంచి మనిషి - అలాంటి మంచి మనిషి నాకు మంచి  స్నేహితుడు కూడా!


<వచ్చేమాటు తరువాయి కథ>

6, డిసెంబర్ 2020, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 23 - కవలపాటలు - కన్నడద "నగువ నయన", తెలుగులో "కలిసే సమయం"...

కలత పడిన మదికి మఱపు... 
మఱచి పోలేని వెలితికి తెరిపి... 
ఎప్పుడూ ఓ పాటే!

ఆ పాట... 
విన్నపాటున ఎదకు చేరుకుంటుంది 
చేరుకున్న చోట ఒదిగి చుట్టుకుంటుంది 
చుట్టుకున్న మదిని పట్టిపట్టి పలకరించి 
పలకరించిన ప్రతీ పూటా పలవరింతై 
పెదవుల మీద పదేపదే పలుకుతుంటుంది 

అదుపులేని - కలవరమై  
ఆపలేని - కలరవమై  
అదుపు లేని - ఆపలేని - కూనిరాగమౌతుంది 

ఆగలేక - ఉలికిపాటుగా  
సాగిపోతూ - ఉనికిపాటగా 
ఆగలేక - సాగిపోతూ - ఊపిరి-పాటౌతుంది 
  
పలికి పలికి
వెలితి తరిగి 
కలత కరిగి  
కలల మరిగి 
వెలుగుతున్న 
మదికి మెరుపు 
అప్పుడూ ఆపాటే!
 అది ఎప్పటికీ నా పాటే!

*******
*******


    ఒక్కో జ్ఞాపకం ఎంత బాధ పెడుతుందంటే ఆ జ్ఞాపకం గురించిన జ్ఞానమే లేకపోతే ఎంత బావుండునో అనిపించేంత. 

    కానీ ఒకసారి ఏదైనా జరిగిపోయాక దాని గురించిన జ్ఞానమూ, జ్ఞాపకమూ ఎంత విదిలించినా వదిలిపోవు. వదిలించుకోవాలనుకున్నా మరపు రావు. 

    విదిలించిన కొద్దీ మొండిగా, వద్దన్నా వదలక పెంకిగా వెంటనంటి వస్తూనే ఉంటాయి. వాటినల్లాగే రానిచ్చేస్తే ఇంకేమన్నా ఉందా? 

    ఉన్నచోట ఉండనీయక, తిన్న తిండి ఒంటబట్టనీయక, కంటి మీద కునుకు రానీయక - చికాకు పెడతాయి. 

    సరిగ్గా ... అలాంటప్పుడు హడావిడిగా ఓ పాట కోసం వెతుక్కుంటా. ఆ పాటతో పాటు - ఆ నొప్పి పెట్టే గురుతులని తిప్పి కొట్టే ఇంకో మంచి జ్ఞాపకం తోడు  తెచ్చుకుంటా. 

కన్నడద "నగువ నయన, మధుర మౌన ":

    అలా ఎప్పటి రోజులదో అప్పు తెచ్చుకున్న పాటొహటి - ఇవాళ్టి కవల పాటల్లో మొదటిది  -  అమ్మనుడి-తెలుగు తర్వాత బహు కమ్మగా అనిపించే కన్నడ భాషలో వచ్సిన "పల్లవి-అనుపల్లవి" సినిమా లోది. 

     ఆ పాటేంటంటే ఎస్పీబీ-ఎస్జానకి పాడిన ఇళయరాజా సంగీత-మంత్రజాలం "నగువ నయన, మధుర మౌన..." అన్న పాట. 

    ఈ కన్నడ సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా. ఇందులో నటించిన హీరో-హీరోయిన్లు అనిల్ కపూర్-కిరణ్ హిందీ సినిమాల్లోంచి వచ్చినవాళ్ళే . వీళ్ళిద్దరితో పాటు లక్ష్మి కూడా ఉంది ఈ సినిమాలో. ఇప్పటి వరకు ఈ పాట వినడమే కానీ సినిమా చూడలేదు. యూట్యూబ్‌లో ఉన్న ఈ కన్నడ సినిమా వచ్చేవారం చూడ్డానికి టిక్కు పెట్టుకుని ఉంచుకున్నాం. 

    ఈ పాట విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా గుర్తుకొచ్చే తీపి జ్ఞాపకాలు - ఒకప్పటి బెంగుళూరు రోజులు.

    కళ్ళ ముందు కలలా కదిలే  ఆ జ్ఞాపకాల్లో కనిపించేవి - MG రోడ్ కావేరి ఎంపోరియం ముందు నుంచి తిరిగిన దారులు - కబ్బన్ పార్క్ వెదుళ్ళ బాటల్లో మాటలూ - చెట్ల ఆకుల సందుల్లోంచి కురిసే వెచ్చటి నీరెండ వేసిన నీడ ముగ్గుల్ని తొక్కకుండా నడవాలంటూ ఆటలూ - చలిచలి నడకల్లో రోడ్డు పక్క బండి మీద కొనుక్కుని ఊదుకుంటూ తిన్న వేడివేడి మొక్కజొన్న పొత్తులు - ఎండ పొడకి ఉలిక్కిపడిన మబ్బు అలిగి ఉన్నట్టుండి కురిసిన పూలలాంటి చినుకులు - వడి పెరిగి చినుకులకి పరుగులిడిన నడకలకి గొడుగెత్తిన చెట్లు. 

    ఇవన్నీ ఒకెత్తు అయితే - రాత్రి కాగానే మంచు మేలిముసుగు చాటున రంగురంగు రత్నాల హారాలూ, తళతళలాడే వజ్రాల వడ్డాణాలూ అలంకరించుకుని మురిసిపోతున్నట్టుండే దీపకాంతుల బెంగుళూరిణి అందం ఇప్పటికీ కళ్ళ ముందు మెదిలి మురిపిస్తుంది.  

    బెంగుళూరుని ఇంతగా గుర్తు తెచ్చే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. నాకిష్టమైన ఈ పాటని మళ్ళీమళ్ళీ తలుచుకోవడానికి వీలుగా ఈ రోజుకి ఇలా కవల-పాటల్లో రాసుకున్నా!

     అన్నట్టు ఈ కవల-పాటల్లో తెలుగు పాటలో రొటీనుగా - తెలుగుని రోట్లో వేసి రుబ్బి - మీటర్ల కొద్దీ మేటర్ రాసినట్టు - ఎప్పట్లాగే అవే మాటలు - మందారాలు, శ్రీకారాలు, శృంగారాలు - గట్రాలు, ఎట్సెట్రాలు.  

     కన్నడ పాటలో మాత్రం కొన్ని మాటలు ఎంత బావున్నాయో! అందులో ఒకటి "ఎందెందు అళిసద రంగోలి" - అంటే అర్థం "ఎప్పటికీ చెరగని ముగ్గు". 

    ఇంకో  సొగసైన మాట "హొంగణసను".  ఈ మాటకి అర్థం "బంగారపు కలను" (హొన్ను + కణసను). ఈ సంధి ఏంటో తెలుసుకోవాలి :) 

కన్నడ పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=Dajcwrykmf8




లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ...
లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ....

ఉహు...హూహుహుహూ...అహ...హాహహహా...
లలలా..లలలల ...లాలా....


నగువ నయన... మధుర మౌన... 
మిడివ హృదయ ఇరె మాతేకె?
హొస భాషెయిదు - రస కావ్యవిదు
ఇద హాడలు కవి బేకె?

నగువ నయన... మధుర మౌన...
మిడివ హృదయ ఇరె మాతేకె?

నింగాగి హేళువె కథె నూరను
నానిందు నగిసువె ఈ నిన్నను
ఇరుళల్లి కాణువె కిరునగెయను
కణ్ణల్లి హుచ్చెద్ద హొంగణసను
జొతెయాగి నడెవె నా మళెయలు
బిడదంతె హిడివె ఈ కైయ్యను
గెళెయ! జొతెగె - హారీ - బరువె...
బాణ ఎల్లె దాటి నలివె... 

నగువ నయన... మధుర మౌన... 
మిడివ హృదయ ఇరె మాతేకె?

ఈ రాత్రి హాడో పిసుమాతలె
నా కండె  ఇనిదాద సవి రాగవ
నీనల్లి... నానిల్లి... ఏకాంతవె
నా కండె నమ్మదె హొస లోకవ
ఈ స్నేహ తందిదె ఎదెయల్లి
ఎందెందు అళిసద రంగోలి
ఆసే ... హూవా...  హాసీ...  కాదే...
నడె నీ - కణసా...  హొసకీ బిడదే... 

నగువ నయన... మధుర మౌన...
మిడివ హృదయ ఇరె మాతేకె?
హొస భాషెయిదు - రస కావ్యవిదు
ఇద హాడలు కవి బేకె?

లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ...
లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ....

తెలుగులో "కనులు, కనులు -కలిసే సమయం":


    ఇదే పాట తెలుగులో కూడా ఉంది - కానీ తెలుగులో జానకి బదులు చిత్ర పాడినట్టు అనిపించింది. తెలుగు పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=skxfOtR9XOE


లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ...
లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ....

ఉహు...హూహుహుహూ...అహ...హాహహహా...
లలలా..లలలల ...లాలా....

కనులు... కనులు... కలిసే సమయం 
మనసు... మనసు... చేసే స్నేహం
నీ చేరువలో - నీ చేతలలో
వినిపించెను శ్రీ రాగం

కనులు... కనులు... కలిసే సమయం
మనసు... మనసు... చేసే స్నేహం

నీ నవ్వులో విరిసె మందారము
నీ చూపులో కురిసె శృంగారము
నీ మాటలో ఉంది మమకారము
నా ప్రేమకే నీవు శ్రీకారము
పరువాలు పలికేను సంగీతము
నయనాలు పాడేను నవగీతము
నేనే నీకూ కానా ప్రాణం?!
నీవే నాకు కావా లోకం?!

కనులు... కనులు... కలిసే సమయం
మనసు... మనసు... చేసే స్నేహం

నీ గుండె గుడిలో కొలువుండనీ
నీ వెంట నీడల్లె నను సాగనీ
నీ పూల ఒడిలో నను చేరనీ
నీ నుదుట సిందూరమై నిలవనీ
చెవిలోన గుసగుసలు వినిపించనీ
ఎదలోన మధురిమలు పండించనీ
నీలో నేనే కరగాలట
రోజూ స్వర్గం చూడాలంట!


కనులు... కనులు... కలిసే సమయం
మనసు... మనసు... చేసే స్నేహం
నీ చేరువలో - నీ చేతలలో
వినిపించెను శ్రీ రాగం

లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ...
లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ....

*******
*******

అప్పుడెప్పుడో లేతమనసులు సినిమాలో ఓ పాటలో ఆరుద్ర రాసిన ఓ వాక్యముంటుంది "మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే" అని. 

అది బావుంటుంది. 

కానీ నాకు మాత్రం దాన్ని ""మాట కలుపుకున్న మౌనమే చెలిమి అగునులే" అని పాడుకోవడం poetic గా అనిపిస్తుంది. అలాగే పాడుకుంటూ ఉంటా కూడా. 

అలాగే నాకిష్టమైన జ్ఞాపకాల పాటల్ని ఎప్పటికప్పుడు తలుచుకుంటూ నా మాటల్లో - నా పాటగా "పాట నిలుపుకున్న జ్ఞాపకం పదిలమౌనులే" అని కూడా పాడుకుంటా.

అలా పాడుకుంటూ ... 

~ పాటల భైరవి 

30, నవంబర్ 2020, సోమవారం

థాంక్స్‌గివింగ్ తలపోతలు

    అలుపు తెలియని కాలం కదులుతూ, రోజుకి రోజు కలుపుకుంటూ వారాలు నెలలవుతూ, నవంబర్ నెలని కూడా దాటేస్తోంది. 

    మొన్నమొన్నటి దాకా రంగులతో హొయలొలికిన చెట్లు నవంబర్ వచ్చేటప్పటికి ఆకులు రాల్చేసుకుని ఉదాసీనపు ముసుగేసేసుకున్నాయి. 

    ఉత్తరమెరికాలో నవంబర్ నాలుగో గురువారం Thanksgiving పండగ - నాలుగు రోజుల సెలవు పండగ. 

    రావడమైతే దాని పాటికి అది పండగ వచ్చేసింది కానీ ఎప్పట్లాగే ఉందా? ఏమో అలా ఉన్నట్లు అనిపించట్లేదు. 

    ప్రతీ ఏడాదీ ఈ పండక్కి - మా వీధిలో -  ప్రతీ ఇంటి ముందూ రెండో, మూడో కార్లు అదనంగా ఉండేవి - ఇరుగు ఊళ్ళ నుంచో, పొరుగు రాష్ట్రాల నుంచో వచ్చిన బంధువులవో, స్నేహితులవో. కానీ ఈ సారి అలాంటి హడావిడే లేదు. 

    Black Friday sales అంటూ ఎలక్ట్రానిక్స్ అంగళ్ళ ముందు గురువారం అర్థరాత్రి నుంచే షాపుల ముందు కుదిరితే టెంట్లు వేసుకుని, కుర్చీల్లో కూర్చుని, కుదరని వాళ్ళు గోడకి ఆనించిన ఒంటి కాలి మీద నించుని - కబుర్లు చెప్పుకుంటూ ఆ స్టోర్ తలుపులు తెరిచేవరకూ చేసే శుక్రవారపు-జాగారం సరదాలే లేవు.  

    "మీకోసమే స్టోరులు తెరిచి ఉన్నాం, మీకోసమే ధరలు తగ్గించాం రండం"టూ - ఒళ్ళంతా దీపాలు చేసుకుని మిలమిల్లాడుతూ malls ఎంత ఊరించినా - అటు పక్కకి వెళ్ళాలనే ఊసే ఎవరికీ ఉన్నట్టనిపించలేదు. 

    అంతటా ఎప్పుడూ లేని - చప్పుడే లేని చప్పదనం. సందడి లేమి - స్తబ్ధత. 

    ఇక మా ఇంట్లో - ఉన్న నలుగురం - అందరం కలిసి ఉన్నాం - అదే దసరా, అదే దీపావళి, అదే థాంక్స్‌గివింగ్ - మా వరకు. రెండేళ్ళుగా నవంబర్ నాలుగోవారం మాతో గడపడానికి బోస్టన్ నుంచి వస్తున్న కెవిన్ ఈ సారి రాలేదు. తనని ఎన్ని సార్లు గుర్తు చేసుకున్నామో! 

    గురువారం పొద్దున్నే లేచి కిటికీ లోంచి బయటికి చూస్తే రోడ్డు మీద బంగారపు మలాములా పరుచుకున్న ఎండా, ఆ ఎండలో రెక్కలారబెట్టుకుంటున్న బుజ్జిపిట్టలూ తప్ప ఏ అలికిడీ లేదు మా వీధిలో. ఇంతలో బదరి వచ్చి నా పక్కనే నించుని తనూ బయటికి చూస్తూ - "మన ఎదురింటి వాళ్ళు పండక్కి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు" అంటుండగానే నేనూ అందుకుని "అవును ... ఎప్పుడూ గెంతులేస్తూ ఆడుకుంటూ కనిపించేది - వాళ్ళ కుక్క కూడా కనిపించట్లేదు" అంటూ ఉన్నాను. 

    మా ఇద్దరికీ బయట ఊళ్ళ నుంచి బంధువులు రాకపోతే పోనీ - కనీసం ఊళ్ళో ఉన్న వాళ్ళైనా ఉన్నచోట క్షేమంగా ఉంటే చాలు అన్న ఆశ - రోజూ కనిపించేవాళ్ళు కనిపించకపోతే చిన్నపాటి బెంగ. అందుకే మా ఎదురింటి కేసి చూస్తూ పక్కపక్కనే నించుని మాలో మేమే అనుకుంటున్నవి మాతో మేమే అంటూ, మేమన్నవి మేమే వింటూ నించున్నాము. 

    ఓ పది నిముషాల తర్వాత - నేను కిటికీ దగ్గర నుంచి ఇవతలికి వచ్చి -  రోజూ వచ్చే న్యూస్ పేపర్లో పజిల్స్ ఏవో చేసుకుంటూ ఉన్నాను. ఈలోగా బదరి నన్నోసారి కిటికీ దగ్గరికి రమ్మని పిలిచారు. ఏంటా అని చూస్తే మా ఎదురింటి వాళ్ళ కుక్క - గోధుమరంగు గిరజాల కుక్క - కుదురు లేని ముందరి కాళ్ళతో చెంగుచెంగున ఎగురుతూ - గాలికి రాలి పడే ఆకులతో ఆడుకుంటూ కనిపించింది. దాన్నలా చూడగానే ఎందుకో తెలీని సంతోషం. అంతా మామూలుగానే ఉందన్న ఆనందం. 

    ఈ మధ్య బదరి స్నేహతులతో మాట్లాడుతున్నప్పుడు airports అన్నీ ఎంత రద్దీగా ఉన్నాయో వాళ్ళు చెప్పారని వింటున్నప్పుడల్లా ఏంటో బాధ. సరే! బాధ పడితే రోజులు బాగవుతాయని భరోసా ఉంటే బాధ పడ్డా ఒకందం - లేకపోతే ఆ బాధకి అంతమూ ఉండదు, అర్థమూ ఉండదు. అందుకే అలాంటి విషయాలు నేను విన్నా విననట్టే ఉంటాను. ఎందుకంటే... 

కడుపు నిండనీయని కలత ఇది... 
కనురెప్పల మాటున కనకూడని కల ఇది... 
కల్ల ఐతే బావుండుననే నిజమిది... 
కనిపించని బూచితో దోబూచులాట ఇది...

    అన్నట్టు నాకు నచ్చిన విషయమొకటి చెప్పాలి. మా ఇంటికి వస్తుండే  జెఫ్ కిందటి వారమెప్పుడో బదరికి ఫోన్ చేసి అవీ ఇవీ మాట్లాడుతూ - వాళ్ళ అమ్మా-నాన్నగార్లు, అత్తా-మామగార్లు - ఈసారి థాంక్స్‌గివింగ్ పండక్కి  జెఫ్ వాళ్ళ ఇంటికి రాబోతున్నట్టు చెప్పాడు. అలా రావడం కోసం వాళ్ళు నలుగురూ పధ్నాలుగు రోజులుగా ఎవరినీ కలవకుండా, ఎక్కడికీ బయటికి వెళ్ళకుండా క్వారంటైన్‌లో ఉన్నారట. జెఫ్ వాళ్ళ అక్క టీచరుగా పని చేస్తుందట. ఆవిడ స్కూల్‌కి వెళ్తూ ఉండడం వల్ల - తన వల్ల జెఫ్ కుటుంబానికీ, పెద్దవాళ్ళకి ఇబ్బంది రాకూడదని - మొట్టమొదటిసారిగా తన తమ్ముడికి, తలిదండ్రులకి దూరంగా తన ఇంట్లో తనే పండగ చేసుకుంటుందని చెప్పాడట. ఎంత మంచిగా ఆలోచించింది ఆవిడ! మనుషులు దూరంగా ఉన్నా మనసుకి దగ్గరగా ఉండడం అంటే అదేనేమో! ఇది కదా జెఫ్ కుటుంబమంతా ఒకరికొకరుగా నిలబడి చేసుకుంటున్న నిజమైన థాంక్స్‌గివింగ్ పండుగ!

    సరే! ఇక మా ఇంట ఈ నాలుగు రోజుల సెలవుల పండగ ఎప్పట్లాగే నిండింది ... వేటితో అంటే... 

చల్లటి వేళల వెచ్చటి బువ్వలు
నవ్వుల జాలుల ఇచ్చకాల మాటలు 
పగటి పూట పుస్తకాలు, పజిళ్లు
సాయంకాలాల సినిమాలు 
రోజంతా ఏదో మూల గుయ్-గుయ్ మనే పాటలు... 


    ఈసారి నాలుగు-రోజుల సెలవుకి కొసమెరుపుగా ఇవాళ (ఆదివారం) కార్తీక పున్నమి వెన్నెల మెరుగులు ఉంటాయని మొన్నెప్పట్నుంచో మురిసిపోతున్నాను నేను. గురువారం నుంచి మబ్బుల్లేని ఆకాశం లోంచి తొంగి చూస్తూ పలకరిస్తున్న ౘందమామని చూస్తున్నప్పుడల్లా - ఈ వెలుగు పొర్ణమి దాకా ఉంటుంది కదా అన్న ఓ చిన్న ఆశ!

కానీ ఈ రోజు ... 
చురుకు ఎండల సూరీడు రాలేదు 
చలువ వెన్నెల చంద్రుడి జాడా లేదు 

వెల్ల అయిన వెలుగు లేదు 
వెల్లువంటి వెన్నెల లేదు 

తలెత్తి దండమెడదామంటే
దరిసెనమీయడే  వెలుగుఱేడు!   
కళ్లొత్తులు చేసుకున్నా 
కనిపించడే వెన్నెలఱేడు!

వాన పాటల జోలలాడి 
సోలిపోయెనేమో దినకరుడు!
మబ్బు పరుపుల ఊయలూగి 
నిదురించెనేమో  ౘందమామ!

పగటి వెలుగు మబ్బుల మాటాయె 
చల్లటి వెన్నెల చీకటి పాలాయె 


గుల్జార్ అన్నట్టు... 

खाली हाथ शाम आयी है - खाली हाथ जायेगी...!
ఆ గుల్జారే మళ్ళీ ఇంకోచోట అన్నట్టు ... 
दिन खाली खाली बर्तन है -और रात है जैसे अंधा कुआँ !

అట్టాగుంది ఈదురుగాలుల తూగుతున్న ఈ ఏటి కార్తీక పున్నమి. 

అయితే మాత్రం బెంగెట్టేసుకుంటామా ఏంటి?

రేపు రాకపోదా?
వెలుగు తేకపోదా?
ఆ రేపు దాపయి 
బూచి భయం మాయమయి 
పువ్వులల్లె విరిసిపోయె 
నవ్వులన్ని పోగుచేసి 
వెల్లువల్లె వెన్నెల కురిసిపోదా?




22, నవంబర్ 2020, ఆదివారం

అచ్చమైన మధ్యతరగతి మంద్రగానం - మిడిల్‌క్లాస్ మెలొడీస్... టాప్‌క్లాస్ భళారేస్!

ఇంతకు ముందు కూడా ఒకసారి కాదు - చాలాసార్లు - అనుకున్నాను. 
అనుకున్నదాన్ని అనుకున్నట్టుగానే రాశాను కూడా - "ఈ మలయాళం సినిమాలు ఇంత బావుంటాయి. మనుషుల కలల్లా, మన మధ్య జరుగుతున్న జరుగుతున్న కథల్లా ఉంటాయి. మన తెలుగులో కూడా మన ఊరి కథలు చెప్తూ, మనవారి కలలు చూపించేలాంటి సినిమాలు వస్తే ఎంత బావుంటుందో కదా!" అని. 

అదుగో - నేనేదైతే జరిగితే బావుంటుంది అనుకున్నానో - అచ్చు అలాగే ఉంది - వినోద్ అనంతోజు తీసిన సినిమా "మిడిల్‌క్లాస్ మెలొడీస్". 


కొందరుంటారు. 
కలలు కంటారు.
కన్న కలల్ని కథలుగా రాసుకుంటారు. 
రాసుకున్న కథల్ని కళగా మలుచుకుంటారు. 
మలచిన కళని తెర మీద బొమ్మలతో మళ్ళీ మనకి కథగా చూపిస్తారు. 
ఆ కొందరిలో కొద్ది-కొందరు  మాత్రం "అద్దిరబన్నా... ఇదిరా సినిమా!" అన్నట్టు తీస్తారు. 
ఆ కొద్ది-కొందరిలో మొట్టమొదటి సినిమాతోనే అలా అనుకునేలా చేసిన ఒకరు "మిడిల్‌క్లాస్ మెలొడీస్" సినిమా తీసిన దర్శకుడు వినోద్ అనంతోజు. 


నిన్న శుక్రవారం మధ్యాహ్నం - కొత్త తెలుగు సినిమా "మిడిల్‌క్లాస్ మెలొడీస్" బావుందట అని బదరి చెప్పగానే - ఆ సినిమా పేరే ఎంత మెలోడియస్‌గా అనిపించిందో!  ఒక్క నిముషం సినిమా పేరు తెలుగులో పెడితే ఇంకొంచెం బావుండేదేమో అనిపించింది కానీ "మధ్యతరగతి సంగీతం" అని మక్కికిమక్కి తెలుగులో మార్చి చదువుకున్నాక ఇంగ్లీషు పేరే చెవికి ఇంపుగా అనిపించింది. అయినా భావం బావుంటే భాషేదైనా బాగానే వినిపిస్తుంది. సినిమా బావుంటే పేరేదైనా సరిపోయిందన్నట్టుగా అనిపిస్తుంది. 

సినిమా చూడడం మొదలు పెట్టక ముందు అసలు ఎలాంటి expectations లేవు. కానీ ఒక్కో పరిసరం తెర మీదకి వస్తూ, ఒక్కో పాత్ర పరిచయం అవుతుండగా కొంచెం సేపటికి సినిమా చూస్తున్నామన్నట్టే అనిపించలేదు. 

ఈ సినిమా కథ గుంటూరులో మొదలై, గుంటూర్లోనే తిరుగుతూ, గుంటూర్లోనే ముగిసే కథ. 

కల, కథ, కళ అన్నీ పుష్కలంగా ఉన్న ఈ తెలుగు సినిమాలో లేనివేంటో చెప్తాను. 

మధ్యతరగతి అంటూ - సముద్ర తీరాన బాపు సెట్టింగుల్లా మెరిసిపోయే ఇల్లో, మండువా ఇల్లో, మరోటో చూపించలేదు. 

మధ్యతరగతి అంటూ - వాస్తవానికి దగ్గరగా చూపిస్తున్నామంటూ - మురికితనాలు, చూపించకూడని మరుగుప్రదేశాలు చూపించలేదు. 

అమ్మాయి అంటే ఎంత ఇష్టమున్నా తన కాలో, వేలో చూసి వెర్రిగా వెంట పడే అబ్బాయిలు లేరు. 

అబ్బాయి ఎంతగా వెంటపడుతున్నా మైమరిచిపోయి మెలికలు తిరిగే అమ్మాయిల్లేరు. 

మంచుకొండల్లో డాన్సుల్లేవు. దంచి కొట్టే ఫైటుల్లేవు. పంచు డైలాగుల్లేవు. నలుగురితో నవ్వుకోలేని సి-గ్రేడ్ జోకుల్లేవు. ప్రేమ విలాపాలూ, భామాకలాపాలూ లేవు. 

ఇహ ఇందులో ఉన్నవి - చూస్తున్న కొద్దీ ఊరించినవి - ఇంకోసారి చూద్దామా అనిపించినవి ... ఇవీ... 

గుంటూరు. 

గుంటూర్లో ఉన్న - కొత్తపేట, జిన్నా టవర్, ఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్, బ్రాడీపేట, అరండల్ పేట రోడ్లు. 

సెంటర్లో ఉండే మసాలా బళ్ళు. 

శనగపిండిలో మిరపకాయ ముంచి వేసిన బజ్జీలు మధ్యకి కోసి కూరిన ఉల్లిపాయ-కారం మసాలాలు. 

కోవా పూసిన మాల్పూరీలు. 

గుంటూరు చుట్టుపక్కల పల్లెటూళ్ళు. 

స్వఛ్చమైన గుంటూరు యాసలో వినిపించిన అచ్చతెలుగు భాష. 

"సుప్రీమ్ హీరో" అంటూ వినిపించే సెల్ ఫోన్ రింగ్ టోన్. 

సినిమా కోసం పని కట్టుకుని రంగులేయని అచ్చమైన మధ్యతరగతి ఇళ్ళు - ఆ చిన్న ఇళ్ళలో అతి సహజంగా అమరిన సామానులు. అన్నట్టు ఏ తిరణాల్లోనో ముచ్చటపడి కొనుక్కుని, దుమ్ము పడుతుందేమో అని ప్లాస్టిక్ కవర్లోనే ఉంచేసి మేకుకి వేళ్ళాడదీసిన గులాబీరంగు టెడ్డీబేరు కూడా ఉందండోయ్! ఇంటి పెరళ్ళూ, దండాల మీద ఆరేసుకున్న బట్టలూ, బాయిలర్లలో కాగుతున్న నీళ్ళూ. 

ఊరి మంచి కోసం నిలబడే పెద్దమనుషులు, వాళ్ళని నమ్ముకున్న ఊరివాళ్ళు. 

చీటీ పాటలు, చీటింగ్ చేసే కాంట్రాక్టర్లు. 

తను చేసే బొంబాయి చట్నీని నమ్ముకుని, ఉన్న ఆస్తిని అమ్ముకుని ఊరొదిలి వెళ్లిపోదామనుకునే ఓ అబ్బాయి రాఘవ - తనని ఆసరా కావాల్సి వచ్చినప్పుడు cheer చేస్తూ, ఆవేశపడితే చీవాట్లు పెడుతూ వెన్నంటి ఉండే ఓ మంచి ఫ్రెండ్ గోపాల్. 

రాఘవని చీవాట్లు పెట్టే నాన్న కొండలరావు, సపోర్టు చేసే అమ్మ లక్ష్మి.

టీనేజ్ ప్రేమలు, తియ్యని స్నేహాలు. 

ఆస్తి అమ్ముకోకుండా అట్టేపెట్టుకోవాలనే ఆశలు, ఉన్న ఆస్తిని తక్కువకి అమ్ముకుని మోసపోయామనుకునే నిరాశలు, విలువైన ఆస్తిని తక్కువ డబ్బుకే కొట్టెయ్యాలనుకునే దురాశలు. 

చిన్నచిన్న కోపాలు, పంతాలు, అరుచుకోవడాలు, అంతలోనే కలిసిపోవడాలు. 

అసలిందులో నటించిన అందరూ కూడా ఎంత బాగా చేశారంటే ఆ చిన్నచిన్న subtle expressions ని మళ్ళీమళ్ళీ చూడడానికి ఎన్ని సార్లు వెనక్కి వెళ్ళి చూశామో!

నిజానికి ఈ సినిమాలో నాకేం నచ్చిందో చెప్పాలంటే నేను సినిమా మొత్తం రాయాల్సొచ్చేలా ఉంది. 

అందుకే అసలు కథ చెప్పేయకుండా అక్కడక్కడా నచ్చినవి చెప్తా... 

గుంటూర్లో హోటల్ పెడతానని అంటున్న రాఘవతో గొడవ పడి - గట్టిగా అరిచి తిడతాడు వాళ్ళ నాన్న కొండలరావు. ఆ గొడవకి కోపం వచ్చి రాఘవ అన్నం కూడా తినకుండా అలిగి బయటికెళ్ళిపోయాక - అప్పటిదాకా ఇంత గొంతు పెట్టుకుని అరిచిన కొండలరావు - అసలేమీ జరగనట్టు "కాళ్ళు నొప్పిగా వున్నాయి కొంచెం పిసుకుతావా?" అనడగ్గానే ఆయన భార్య లక్ష్మి చూసిన చూపు ఎలావుంటుందంటే "కాళ్ళు కాదు పీక పిసుకుతాను" అన్నట్లుంటుంది. 

సెల్ఫోన్ల వ్యాపారం చేసే గోపాల్ తనకు కావాల్సిన సెల్‌ఫోన్లు కొనుక్కునే వంకతో కృష్ణ షాపుకి వెళ్ళి  - అక్కడ పని చేసే సేల్స్ గర్ల్ గౌతమితో ఎవరికీ వినిపించకుండా "బట్టలషాప్ దగ్గర ఉంటాను అక్కడికి రమ్మని" చెప్పి వెళ్ళి అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా గౌతమి రాదు. అప్పుడు మళ్ళీ గోపాల్ వెనక్కి వెళ్ళి "ఎందుకు రాలేదు"  అని అడిగితే గౌతమి "అక్కడ అన్నీ బట్టలషాపులే, ఎక్కడికని రానూ?" అనడుగుతుంది. ఈ సీనులో గోపాల్, గౌతమి, వాళ్ళిద్దరినీ గమనిస్తున్న షాప్ ఓనర్ కృష్ణ - ఈ ముగ్గురి ఏక్షన్ భలే ఉంది.  

ఈ సినిమాలో గోపాల్ సెల్‌ఫోన్లు కొనుక్కునే వంకతో తన షాపుకి వచ్చినప్పుడల్లా ఆ షాప్ ఓనరు కృష్ణగా నటించిన అతని నటన - అతను మొదటగా కనిపించిన సీన్ నుంచి చివరి సీన్ దాకా కనిపించిన emotional transition భలేగా అనిపించింది. 

మొదటి సారి గోపాల్ వచ్చినపుడు - తనకి కూతురు పుట్టిందని చెప్పి మురిసిపోతూ - అసలు గోపాల్ దృష్టి తాను చెప్పే విషయం మీద కన్నా తన కొట్లో పని చేసే గౌతమి మీద ఉందని కొంచెం చిన్నబుచ్చుకుని - ఆ తర్వాత గోపాల్ తన షాపుకి వచ్చినపుడల్లా - గోపాల్ గౌతమి కోసం వస్తున్నట్లు తనకి తెలిసిపోయినట్టూ - ఆ తర్వాత సీనులో వాళ్ళిద్దరి మధ్యా ఏం జరుగుతోందా అన్న కుతూహలంతో చూస్తున్నట్టూ - చివరికి వాళ్ళిద్దరి కథా సుఖాంతం అయిందని తెలిసినప్పుడు తనూ సంతోషించినట్టూ - ఎంత బాగా చేశాడో ఆ కృష్ణ పాత్రధారి. 

ఇంకో సీనులో - ముందుముందు ధర పెరగబోతోంది అని తెలియక తమ భూమిని మామయ్య నాగేశ్వరరావుకి హోటల్ షెడ్ కోసం రాఘవ, వాళ్ళ నాన్న కొండలరావు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారని తెలిసి - అలా జరక్కుండా ఆపుదామని రాఘవ మరదలు సంధ్య రాఘవకి ఫోన్ చేద్దామని చూస్తే రీఛార్జ్ చెయ్యాలని మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ అమ్మాయి ఫోను రీఛార్జ్ చేసుకోవడం కోసం వాళ్ళింటి దగ్గరగా ఉన్న ఓ షాపుకి వెళ్తుంది. అక్కడ ఆ షాపులో ఉన్న పెద్దాయన రీఛార్జ్ కోసమని ఒక్కో నెమ్మదిగా నంబర్ నొక్కుతూ బోల్డంత ఆలస్యం చేస్తాడు. ఈ సీనులో ఆ పెద్దాయన్ని చూస్తే Zootopia సినిమాలో sloth (మోటార్ వెహికల్స్ డిపార్టుమెంటులో పని చేసే Flash Slothmore) సీన్ గుర్తొచ్చింది.  

అసలు ఈ "మిడిల్‌క్లాస్ మెలొడీస్" సినిమాలో బాగా చెయ్యనిదెవరూ లేరు. బాగా లేనిదేదీ లేదు. ఈ సినిమా మాకెంత నచ్చిందంటే - ఇదిగో ఇవాళ కూడా రెండోసారి పెట్టుకుని - సీన్ సీనుకీ ముందుకీ-వెనక్కి వెళ్తూ ప్రతి చిన్న expression నీ పట్టిపట్టి చూస్తూ మాకు మేమే మురిసిపోయేలా. 

ఈ సినిమాలో ఎక్కడా - ఎవ్వరూ కూడా - అస్సలు నటిస్తున్నట్లే అనిపించలేదు. వాళ్ళకి రోజూ అలవాటైన పరిసరాల్లో మెలుగుతున్న వాళ్ళ జీవితాలని వాళ్ళకి తెలియకుండా ఏదో వీడియో తీసినట్టనిపించింది. 

నిజజీవితంలో ఎవ్వరూ కూడా పాటలు పాడేసుకుంటూ రోడ్ల మీద డాన్సులేసుకోంగా. అందుకే ఈ సినిమాలో కూడా ఎవ్వరూ అలా చెయ్యరు. ఉన్న నాలుగో, ఐదో పాటలు కూడా background లో వస్తుంటాయి. 

ఇందులో ఉన్న "సాంబశివా నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయె" అన్న పాటలో చరణాలు   "ఏమి చేతురా లింగా..." లో ఉన్నట్లుంటాయి. 

"మంచేదో, చెడ్డేదో.. రెంటికీ మధ్యదో" అన్న పాటలో "వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ..." అన్న మాటలు నాకు భలే నచ్చాయి. 

నాకు నచ్చిన మాటలున్న ఆ పాట ఇక్కడ: https://www.youtube.com/watch?v=94i3YO38QZ8




ఈ సినిమాలో ఇంకా నచ్చినవి - హోటల్ పక్కనున్న ఖాళీస్థలంలో ఎవరూ చెత్త వెయ్యకుండా ఉండాలని రాఘవ అక్కడ దేవుడి విగ్రహం పెట్టడం, తన హోటల్‌కి అడ్డంగా ఉందని గొడ్డలితో కొట్టెయ్యబోయిన మామిడిచెట్టు కాయల వల్లే రాఘవ హోటల్ నిలబడడం, చివర్లో రాఘవ మామిడిచెట్టు దగ్గరకెళ్ళి తను ఎక్కడైతే గొడ్డలితో నరకబోయాడో అక్కడ చేత్తో నిమరడం. 

ఇంకా బోల్డన్ని ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడే రాసేస్తే ఇంకా ఆ సినిమా చూడని వాళ్ళకి అంతా ముందే చెప్పేసినట్టవుతుందని ఆపేస్తున్నాను. 

ఒక మంచి కథ. మంచి నటన. మంచి పాటలు. మంచి సంగీతం. మంచి కెమెరా కన్ను. 
మంచి బోనస్‌గా - ఒక చిన్న సినిమా titbit - ఈ సినిమాలో ఇంకో దర్శకుడు (పెళ్లిచూపులు సినిమా తీసిన తరుణ్ భాస్కర్) నటించడం.    

ఇన్ని మంచి విషయాలున్న ఈ సినిమా అచ్చమైన మధ్యతరగతి మంద్రగానం. 

గోపరాజు రమణ (కొండలరావు), సురభి ప్రభావతి (లక్ష్మి), ప్రేమ్ సాగర్ (సంధ్య వాళ్ళ నాన్న - నాగేశ్వరరావు), ప్రభావతి (సంధ్య వాళ్ళమ్మ), ఆనంద్ దేవరకొండ (రాఘవ), చైతన్య గరికిపాటి (గోపాల్), వర్ష (సంధ్య),  దివ్య శ్రీపాద (సేల్స్ గర్ల్ గౌతమి), కట్టా ఆంథోనీ (పాలు పోసే అంజయ్య), ఎం ఎం నాయుడు (షాప్ ఓనర్ కృష్ణ), చాణక్య తేజస్ (సురేంద్ర),  - వీళ్ళే కాదు - ఈ సినిమాలో నటించిన అందరు నటులూ, పాటలు రాసిన వారూ, పాడినవారూ, అన్ని డిపార్టుమెంటులో పని చేసిన అందరూ - వీళ్ళందర్నీ నడిపించిన దర్శకుడు వినోద్ అనంతోజు - వీళ్ళందరూ - టాప్‌క్లాస్ భళారేస్!

~ సినీ-మా-లక్ష్మి

15, నవంబర్ 2020, ఆదివారం

ఆ సిన్మా ఓ హైపు రా! మన కలర్ ఫోటో మహబాగా క్లిక్కయ్యిందిగా !

ఆ మధ్య మలయాళ సినిమాలు తెగ చూసేశాం. C U Soon తర్వాత ఇక మలయాళం జోలికెళ్ళలేదు. 

ఆ తర్వాత ఓ రెండు మరాఠీ సినిమాలు కూడా చూశాం. 

అందులో ఒకటి - దాదా సాహెబ్ ఫాల్కే మొట్టమొదటి సినిమా హరిశ్చంద్ర ఎలా తీశారో అన్న దాన్ని ఆడుతూ, పాడుతూ చూపించేసిన "హరిశ్చంద్రాచి ఫేక్టరీ" అనే సినిమా.  

రెండో మరాఠీ సినిమా  - సైకిల్. 

కేశవ్ అనే ఒక జ్యోతిష్కుడు, ఆయుర్వేద వైద్యుడు - మంచి మనిషి - అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. 

కేశవ్ వాళ్ళ తాతగారికి బ్రిటిష్ వాళ్ళెవరో ఒక పసుపుపచ్చ సైకిల్ ఇస్తే - దాన్ని ఆయన చనిపోయేముందు తన మనవడైన కేశవ్‌కి బహుమతిగా ఇస్తాడు. 

కేశవ్‌కి ఆ సైకిల్ అంటే ఎంత ఇష్టమంటే దాని మీద ఎవర్నీ చెయ్యి కూడా వెయ్యనివ్వడు - ఆఖరికి వాళ్ళ నాన్నగారిని కూడా తొక్కనివ్వడు. 

కేశవ్ వాళ్ళ ఊళ్ళోవాళ్ళకి, ఆ ఊరికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కేశవ్ గురించి, అతని మంచితనం గురించి ఎంత తెలుసో, కేశవ్‌కి ఆ సైకిల్ అంటే ఎంత ఇష్టమో ఇంకా బాగా తెలుసు. ఓ రోజు ఆ సైకిల్‌ని ఇద్దరు దొంగలు ఎత్తుకుపోతారు. కానీ ఆ దొంగలు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఆ సైకిల్‌ని గుర్తు పట్టి "కేశవ్ ఎక్కడా?" అని అడుగుతూ ఉంటారు. ఆ దొంగలు తాము కేశవ్‌కి కజిన్స్  అని అబద్ధం చెప్పి , తమకి ఆ సైకిల్ తొక్కుకోమని ఇచ్చాడని చెప్పగానే వాళ్ళందరూ కేశవ్ బంధువులని ఆ దొంగలని చాలా మర్యాద చేసి వాళ్ళకి తమ ఇళ్ళలో భోజనం చెయ్యాల్సిందే అని బలవంతపెడుతూ ఉంటారు. 

ఇక కేశవ్ ఏమో సైకిల్ పోయిందన్న బెంగతో ఎలాగైనా వెతికి తెచ్చుకోవాలని అన్ని ఊళ్ళూ తిరుగుతూ ఉంటాడు. చివరికి ఏమవుతుందో ఎవరికి వారు చూస్తేనే బావుంటుంది. 

ఇహ ఇక్కడికి కథ ఆపేస్తా... ఈ సినిమా బావుంది. 

ఒక సైకిల్ మీద ఇష్టాన్ని గురించిన కథ. మంచివాళ్ళకి మంచే జరుగుతుంది అని అడుగడుగునా మంచితనం నింపుకుని చివరికి మంచిగా ముగిసే కథ. పాటలు-డాన్సులు, తాపులు-తన్నులు, punచులు-దంచుళ్ళు ఏమీ లేని ఒక ౘందమామ కథ లాంటి సినిమా. 

మలయాళం దాటి మరాఠీ మీదుగా మళ్ళీ తెలుగు వైపు వస్తుంటే - ఉన్నికృష్ణన్ కూతురు ఉత్తర పాడిన "అళగు" పాట గుర్తుకొచ్చింది. 

బదరికి ఆ పాట అంటే చాలా ఇష్టం - అందమైన తమిళ పదాలని ఆ పాప ఇంకా అందంగా పాడిందని. సరే! తనకంత ఇష్టమైన ఆ పాట ఉన్న "శైవం" సినిమా కూడా చూసేశాం. "

"శైవం" లో నచ్చిన విషయాలు ముచ్చటగా మూడు - తమిళ్ అనే పేరున్న పాపగా నటించిన సారా అర్జున్, "అళగు" పాట, ఆ సినిమా షూట్ చేసిన మండువా ఇల్లు. 

ఇన్ని భాషల సినిమాలు చదువుకుంటూ చూసి, చూసి - చివరికి తెలుగు సినిమాలు చూస్తున్నా కూడా సబ్-టైటిల్స్ చదవక పొతే సినిమా అర్థం కావడం మానేశాయ్.  అందుకే కొన్నాళ్ళు సబ్-టైటిల్స్ చదువుకునే సినిమాలు మానేద్దామని అనుకున్నాం. 

అప్పుడేం తెలుగు సినిమా చూద్దామా అని వెతికివెతికి - కీర్తి సురేష్ ఉంది కదా అని "మిస్ ఇండియా" పెట్టారు బద్రి. 

అసలా సినిమా కథేంటో - అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిన అబ్బాయితో సూట్కేసులు సర్దుకుని అమ్మా, నాన్నా, చెల్లీ - వెళ్ళేది అమలాపురమేమో అన్నట్టు - విమానమెక్కి అమెరికా వచ్చేయడమేమిటో - అలా వచ్చినవాళ్ళు ఒక పే... ద్ద mansion లాంటి ఇంట్లో దిగడమేమిటో - అన్నతో వచ్చిన చెల్లాయి అమెరికాలో రోడ్డు పక్కన బండి పెట్టి చాయ్ అమ్మడమేంటో - అమెరికా పోలీసులొచ్చి ఆ చాయ్ డబ్బాలూ, కప్పులూ ఎత్తుకుపోవడమేంటో - నేను సగం సినిమా కాగానే ఇక చూడడం ఆపేశాను. 

కీర్తి సురేష్ - తన వయసుకి తగ్గట్టు - కొంచెం సరదాగా నవ్వుతూ,  గలగల్లాడుతూ ఉండే సినిమాలు ఏమన్నా చేస్తే బావుండును. మరీ అంత గంభీరంగా ఉండే అంత పెద్ద పెద్ద గంగాళాల్లాంటి పాత్రలు ఇప్పుడే ఎందుకో ఆ అమ్మాయికి?! ఇలా ఎన్నిసార్లనుకున్నానో "మిస్ ఇండియా" చూశాక!

ఇంతలో మా దివాణం వారి చిన్నారి, నా పేరే పెట్టుకుని, నా లాగే సినిమాలకి మహారాజపోషకురాలైన లలిత వాట్సాప్ స్టేటస్‌లో "కలర్ ఫోటో" అన్న పేరు - పక్కన రెండు బొటనవేళ్ళు , ఇంకో రెండో నవ్వుమొహాలు కనిపించాయి. 

వాటిని చూడగానే "బావుందా?" అంటూ ఆశపడ్డా. 

నేనలా అడిగీ అడగ్గానే మా లలిత "అవునత్తా!" అంది. 

తను అలా అనీ అనగానే నేను బదరికి "కలర్ ఫోటో బావుందట - లలిత చెప్పింది" అని చెప్పాను. 

నేనలా చెప్పీ చెప్పగానే బద్రి అమెజాన్ ప్రైమూ, నెట్టుఫ్లిక్సూ, యూట్యూబూ అన్నీ వెతికేశారు. 

ఎన్ని వెతికినా, ఎంతసేపు వెతికినా ఎక్కడా దొరకదే ఆ కలర్ ఫోటో?! తీరా చూస్తే అది "ఆహా" లో మాత్రమే ఉందని తెలిసింది. 

ఉన్న ఓటీటీలు, యూట్యూబూ చాలక ఈ "ఆహా" కూడా ఎందుకులే అనుకుని einthusan ‌లో వెతికారు బద్రి. అక్కడ దొరికింది "కలర్ ఫోటో". 

అన్నట్టు "కలర్ ఫోటో" గురించి చెప్పే ముందు - నిన్ననే చూసిన ఇంకో మహా-hype సినిమా గురించి చెప్పాలి. 

అదే "ఆకాశం నీ హద్దురా..." అంటూ ఊరించిన డబ్బింగ్ సినిమా. 

ఈ సినిమా గురించిన ఆహాలూ-ఓహొలూ చాలా చదివి - నిన్న శనివారం రాత్రి భోజనాలయ్యాక - చూద్దామని plan చేసుకున్నాం. ఇప్పుడు కూర్చుని ఇది రాస్తూ అసలేం చూశామా అని ఆలోచిస్తూ ఉంటే  - ఆకాశంలో విమానాలు ఎగరడం, నేల మీద సూర్య పరిగెత్తడం తప్ప - ఇంకేమీ గుర్తు రావట్లేదు. 

గుర్తున్న ఒకే ఒక సీన్ - ఫ్లైట్ టికెట్ కోసం డబ్బులు తగ్గాయని ఎయిర్ ఫోర్స్‌లో పని చేసే సూర్య ఏడుస్తూ అందరి కాళ్ళూ పట్టుకోవడం - అలా నిజంగా జరిగిందో, సినిమా కోసం over-dramatize చేశారో కానీ అంత బాగా అనిపించలేదు. 

సాధారణంగా నేను సినిమా చూసేటప్పుడు - కరకరలు ఎక్కువ తినను - డైలాగులు వినిపించవని, అర్థం కావని. కానీ ఈ సినిమా సగం చూసేటప్పటికి ఏం విన్నా అర్థం కాదని అర్థమైపోయింది. వెంటనే ఓ జామకాయ కోసుకుని కచా-కచా నములుతూ చూసేశా!

ఇంతకీ ఈ రెండున్నర గంటల సినిమాలో ప్రతీ అరగంటకీ రకరకాల డ్రెస్సులేసుకుని మోహన్ బాబు ఎందుకొచ్చాడో, ఏం మాట్లాడాడో నేను తిన్న జామకాయ సాక్షిగా నాకు తెలీనే తెలీదు. 

ఇందులో నాకు నచ్చినదల్లా హీరోయిన్ కట్టుకున్న చీరలు, వేసుకున్న పువ్వులపువ్వుల జాకెట్లు. 

అన్నట్టు ఈ సినిమా చూసే ముందు - సాయంత్రం కొత్త ఫోన్లు కొనుక్కుందామని Costco కి వెళ్తే అక్కడ మా బుజ్జిజింక కిరణ్ గాడి ఫ్రెండ్ అనీష్ కనిపించి "హలో ఆంటీ" అని పలకరించాడు. మాస్క్ పెట్టుకున్నా నన్ను గుర్తు పట్టాడని ముచ్చటేసేసింది. తనతో మాట్లాడుతుంటే చెప్పా డు అంతకు ముందు రోజే "ఆకాశం నీ హద్దురా" సినిమా చూశానని. 

"ఎలా ఉంది సినిమా, అనీష్?" అని నేనడిగితే - కొంచెం మొహమాటంగా నవ్వి "కొంచెం Documentary లా ఉందాంటీ! కానీ inspiring గా ఉంది" అంటూ సర్దేశాడు. 

నిజ్జంగా చెప్పాలంటే - సినిమా చూశాక - నాకు ఆ పదిహేనేళ్ళ అబ్బాయి రివ్యూ నేను అంతకు ముందు చదివిన ఆహా-ఓహోల కన్నా సరిగ్గా అనిపించింది. 

మొత్తానికి చూసేశాక "ఆ సిన్మా ఓ హైపు రా!" అనిపించింది. అంతే...  అంతే... అంతే! 

ఇప్పుడు - ఇక "కలర్ ఫోటో" గురించి ... 

కిందటి శనివారం అంటే నవంబర్ 7 వ తారీఖున - అమెరికా అంతటా  ట్రంపా - బైడెనా అంటూ అన్ని పక్కలా ఓ...  హోరెత్తిపోతోంది. 

మేమైతే "ఏ రాయైతేనేం " పార్టీ. 

అందుకని అన్ని రకాల ఎల-క్షణ-వీక్షణాలకి దూరంగా ప్రశాంతంగా "కలర్ ఫోటో" చూద్దామనుకున్నాం. 

చూశాం! నచ్చేసింది సినిమా. 

"కలర్ ఫోటో" మహ బాగా క్లిక్కయ్యిందిగా... -  అనుకున్నాం. 

మలయాళ సినిమాలు చూస్తూ ఎప్పటికైనా మన తెలుగులో కూడా ఒక చిన్న స్టోరీ లైను తీసుకుని - ఆట్టే డ్రామా లేకుండా - మామూలు మనుషులు మాట్లాడే భాషతో - ఒక మంచి సినిమాగా ఎవరైనా తీస్తే బావుండును అనుకుంటూ ఉండేవాళ్ళం మేము. 

అదుగో... అల్లాంటి సినిమాయే ఈ "కలర్ ఫోటో". 

నాకు ఇందులో పాటలు నచ్చాయి. 
"అరెరె ఆకాశం లోనా ..." పాట కొంచెం ఎక్కువ నచ్చింది. అందుకే ఆ పాట యూట్యూబ్ లింక్ ఇక్కడ: https://www.youtube.com/watch?v=XWL75FhjtIk




ఈ సినిమాలో - ముగ్గురమ్మాయిలు - పద్దు (దివ్య శ్రీపాద), దీప్తి (చాందిని చౌదరి), దీప్తికి వదినగా చేసిన అమ్మాయి (విద్య) - చేసిన subtle action బోల్డు నచ్చింది. 

దీప్తి, వాళ్ళ వదిన వంటింట్లోంచి చూస్తూ - పెదవులు కదపకుండా - పళ్ళ చాటున మాట్లాడుతూ - అద్దం ముందు ముస్తాబవుతూ మీసం తిప్పుకుంటున్న రామరాజు(సునీల్)ని - కామెంట్ చేయడం భలే చేశారు. 

ఎప్పుడూ డాన్స్ డ్రామాలో అమ్మవారి వేషం వేసే దీప్తి ఒకసారి ప్రోగ్రాముకి తన అమ్మవారి costume ని పద్దుకి ఇచ్చినపుడు - పద్దు (దివ్య శ్రీపాద) మొహంలో కనీకనిపించని నవ్వు, ఆనందం, కృతజ్ఞత - అన్నీ ఒకేసారి కనిపించి ఎంత బావున్నాయో! 

బాలయేసు (హర్ష చెముడు) quick retorts నచ్చాయి. 

దీప్తిని పెళ్ళి చేసుకున్న చందు (ఆదర్శ్) మంచితనం బావుంది - నమ్మదగినదిగా లేకపోయినా. 

జయకృష్ణ (సుహాస్) గురించి చెప్పక్కర్లేదు. నటన చాలా బావుండడమే కాదు - ఒక స్టూడెంటుకి ఉండే natural body language ఈ అబ్బాయికి బాగా చేతనయింది. 

ఒక సీనులో జయకృష్ణ, బాలయేసు, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజ్ వెనకాల మెట్ల మీద కూర్చుని సిగరెట్లు కాలుద్దామనుకుని కూర్చున్నాక వాళ్ళ దగ్గర అగ్గిపెట్టె లేదని గుర్తొస్తుంది. అప్పుడు బాలయేసు జయకృష్ణని వెళ్ళి కాలేజ్ టెర్రేస్ మీద నుంచి అగ్గిపెట్టె తెమ్మంటే - సరేనని వెళ్తాడు జయకృష్ణ. అలా వెళ్తున్న జయకృష్ణ నడకలో చిన్నపాటి అలక్ష్యం, కొంచెం బద్ధకం - అందరూ కూర్చుని తననే పంపిస్తున్నారని కాసింత కినుక - ఆ కొన్ని సెకనుల నడకలో భలే చూపించాడు. 

ఇంకా ఈ సినిమాలో కనిపించిన కాయితంతో చేసిన కెమెరా, అగ్గిపెట్టె ఫోన్లు కూడా నచ్చాయి. 

కాకపోతే ఈ సినిమాలో ఒకట్రెండు పలుకురాళ్ళు - దీప్తికి ఉన్న disorder ఒక పలుకురాయైతే, దీప్తి భర్త చందు అతి మంచితనం మరీ కొరుకుడు పడలేదు.  

ఏదో పెళ్ళిచూపుల్లో ఒకసారి చూసి పెళ్ళి చేసేసుకుని - దీప్తికి ఉన్న mental disorder, ఆమె ఒంటి మీదున్న "కన్నయ్య"  అనే పచ్చబొట్టు సహితంగా - అంతగా ప్రేమించేస్తూ - ఆ అమ్మాయి అన్న మాటకల్లా తలూపడం - వింతగా అనిపించింది.  కానీ సినిమా కదా... ఫర్లేదనిపించింది.  

చివరాఖరిగా అస్సలు నచ్చనిదేమిటంటే ఇంత మంచి సినిమాని "ఆహా" కి మాత్రం పరిమితం చెయ్యడం. దాంతో పాటు అమెజాన్ ప్రైముకి కూడా ఇచ్చుంటే మహబాగా ఉండి ఇంకా ఆహా-ఓహో అనిపించేది. 

మన అచ్చ తెలుగు సినిమా - "కలర్ ఫోటో" - తీసిన దర్శకుడు సందీప్ రాజ్ బృందానికి జయహో!

~ సినీ-మా-లక్ష్మి 
 
 

8, నవంబర్ 2020, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 22 - కవలపాటలు - తమిళ వానవిల్లిన్ తుణ్డొండ్రు మణ్ణిల్ వంధు - తెలుగు పిల్ల ఒళ్ళు విల్లైనది...

అనుకున్నామని పరుగిడక - 
అనుకోలేదని నడకాపక -
అదే రోజు మళ్లీమళ్లీ వస్తుంటుంది... 

అనగనగా అదే రోజు - ఎప్పట్లాగే... 
ఆ రోజులో -  
అంతవరకు... అంతా మామూలుగానే...
అచ్చం అంతకుముందులాగే -
ఆ పాటా, ఈ పాటా పాడుకుంటుండగా ... 
అనుకోకుండా గుర్తుకొస్తుంది ఒక పాట 

అంతే ... 
అప్పట్నుంచి అంతకు ముందులా ఉండదు 
ఆ పాటలో పదం, స్వరం, రాగం, శృతి, లయ అంటూ ఇన్నుంటాయా?!
ఆ అన్నిటికీ ఒక్కో నేనుగా నేను ఎన్ని నేనులవుతానో?

పాటకు ముందు... అదే నేను 
పాట వింటూ... అదే నేను 
పాడుకుంటూ... అదే నేను 
పాటలో పాటనై ... అదే నేను 
పాట లోన మునిగి నేను -  అదే పాటనౌతా! 

పదం పదం పదే పదే అంటూ - అదే పాట నేనౌతా!
అదే పాట అదే పనిగ పాడి - పదే పదే పాటనౌతా!
*******
*******


మా ఊళ్ళో నవంబర్ నెల రాగానే రోజులు నిడివి తగ్గి నలుపు-తెలుపుల్లోకి మారుతుంటాయి. చలిచలిగా ముసురెక్కి మసకేస్తుంటాయి. ఆ నలుపు-తెలుపు రోజుల్లో తప్పకుండా గుర్తుకొచ్చే పాటలు కొన్నుంటాయి. అవి కూడా ఎలాంటివంటే పొద్దున్నే మొదలై రోజంతా 'నీ వెంటే నేనంటున్నట్టు' వదలకుండా కురిసే వానముసురులా - ముసిరి మురిపించేవి. 

అలాంటి ఓ పాటే నాకు మొన్న శుక్రవారం గుర్తుకొచ్చింది. అనుకోకుండా అదీ ఒక వాన పాటే. అసలు తమాషా ఏంటంటే ఇన్నేళ్ళుగా నాకు తెలిసింది ఒక్క తమిళ్ పాటే. కానీ మొన్ననే నాకు ఆ పాట తెలుగులో కూడా ఉందని తెలిసింది. ఇంకేముంది? నాకో కవల-కలిమి కలిసొచ్చింది. 

అందుకే అనుకుంటుంటాను నేను - కలిసొచ్చే బ్లాగ్రాతలకి కలిసికట్టుగా దొరికే కవలపాటలుంటాయని 

అసలింతకీ ఆ తమిళ్ పాట ఏంటో, దాని తెలుగు కవల-పాట ఏంటో చెప్పనేలేదు కదా నేను?!

అప్పుడెప్పుడో మేం బెంగుళూరులో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా విన్నానా తమిళ పాట. ఆ పాట ఉన్న సినిమా - భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 'కరుత్తమ్మ'. 

ఆ పాట మొదటిసారి విన్న రోజులు కూడా - వానమబ్బు గొడుగులో బెంగుళూరు వణుకుతున్న రోజులే. 

పాట రాసినవారు: వైరముత్తు 
పాట కట్టినవారు: రెహమాన్. 
పాట పాడిన వారు: చిత్ర, ఉన్నికృష్ణన్. 
పాటకు ఆడినవారు: వానచినుకులు, మహేశ్వరి, దగ్గుబాటి రాజా. 

ఒక చిన్న ఫిల్మీ titbit: మహేశ్వరి అతిలోకసుందరి శ్రీదేవికి చుట్టం;  రాజా దగ్గుబాటి వారి వారసుడు.  

ఇంతకీ ఆ పాట ఎలా మొదలవుతుందంటే ...  "తెన్మేర్కు పరువక్కాట్రు..." అంటూ నైఋతి ఋతుపవనాల చల్లని - కుదురు లేని గాలి తెమ్మెరలా - చినుకుల చిందులాటతో మొదలవుతుంది. 

పాట సాగుతున్నంత సేపూ నేపథ్యసంగీతంలో - ఆగకుండా నిలకడగా కురుస్తున్న వానలా  - ఒక వాద్యలయ ఉంటుంది. అక్కడక్కడా చినుకుల సందడి కూడా!

ఈ పాటలో తెలుపు, నారింజ, ఎరుపు రంగుల దుస్తుల్లో - రెపరెపలాడుతున్న కాగితపు పడవలా - ఊగుతూ, తూగుతూ మహేశ్వరి చేసిన డాన్స్ నాకు భలే నచ్చింది. 

వానవిల్లు లాంటి దేహంతో - రంగుకే హంగుగా - బొమ్మలా కదులుతున్న మహేశ్వరితో పాటు - కురుస్తున్న వర్షం, పారుతున్న నీళ్ళు కూడా - రెహమాన్ సంగీతంలో పదాలకి పాదాలు కదిపినట్టు, పాటలో చరణాలకి చరణాల లయ చేర్చినట్టు అనిపించింది నాకు.  

పాట వింటున్నంత సేపూ ఏదో తెలియని ఆనందం నిలువెల్లా వర్షంలా తడుపుతూనే ఉంది నన్ను. 

పాట వింటున్నంత సేపూ కనపడని చినుకులేవో నా చేత కూడా చిందులేయిస్తున్నట్టనిపించింది నాకు. 

పాట పాడుతున్న ఉన్నికృష్ణన్, చిత్రలకి పాడుతుండగానే పాట నచ్చేసినట్టుంది - పాట ఆరంభం నుంచి అంతం దాకా - ఆసాంతం పాటలో మాటల కన్నా ముందు ముసిముసి నవ్వులనేసినట్టున్నారు. పాటంతా నవ్వులమూటలా మోగుతున్నట్టనిపించింది. మువ్వల ఆటలా సాగుతున్నట్టనిపించింది. 

ముందే చెప్పానుగా... నాకు మొన్నటి వరకు తమిళ పాటొక్కటే తెలుసు. పాట రాసుకుందామని యూట్యూబ్‌లో వెతుకుతూ - అదే పాట తెలుగులో కూడా ఉందా అని వెతికితే - పాడబోయిన కీర్తన ఎదురయినట్టు - 'సిరిమల్లె మొగ్గ మీద' పాట కనిపించింది. అప్పుడే తెలిసింది తమిళ 'కరుత్తమ్మ' తెలుగు 'వనిత' అయ్యిందని. 

తెలుగు పాట ఉందని చూసీచూడగానే అనేసుకున్నాను - ఈ వారం కవలపాటల గురించి రాసేద్దామని. 

తమిళ, తెలుగు పాటల్లో నాకు ఏది ఎక్కువ నచ్చిందీ అంటే... తమిళ పాటే - ఒక మంచి కవితలా ఉంది. 

తెలుగు పాట - మరి...  పాపం! అనువాదపు పలుకురాళ్ళు పైకనలేని వేదన పుట్టించినా - ఉన్నికృష్ణన్, చిత్రల ముసిముసి గొంతుల మాటున పుట్టబోయిన వేదన మటుమాయమయ్యింది. అంతగా పట్టించుకోదగని చిరుగాయమయ్యింది. 

అన్నట్టు - ఇప్పటి దాకా - కన్నడ, హిందీ పాటలు రాసుకున్నాను కానీ - నేనెప్పుడూ తమిళ పాటలు తెలుగులో రాయలేదు - ఏ మాట ఎలా రాస్తే తప్పుగా అర్థం వస్తుందో అని. 

మొదటిసారిగా - మొట్టమొదటిసారిగా ఈ "తెన్మేర్కు పరువక్కాట్రు" పాట మాత్రం రాయకుండా ఉండలేకపోయాను. చాలా వరకు మాటలు సరిగ్గానే రాశాననుకుంటున్నాను. 

నాకు వినగా వినగా ఈ తమిళ పాట అర్థం అవుతున్నట్టుగానే అనిపించింది. అలా అనిపిస్తూనే అర్థమయిన పాట ఎంతో అందంగా వినిపించింది. 

ముఖ్యంగా రెండు వాక్యాలు... 'జయహో, వైరముత్తు!'  అనిపించాయి. 


కాదల్ ఎణ్ణుమ్ మంధిరథిన్ మాయమ్ ఎన్న - కల్లుం ముళ్ళుం ఇప్పోదు పూవానదే!

 "ప్రేమ అనే మంత్రగాడి మాయ ఏంటో - రాళ్ళూ ముళ్ళూ కూడా పూలల్లా అనిపిస్తున్నాయి" అని అమ్మాయి అంటే - దానికి బదులుగా అబ్బాయి - 

 వానవిల్లిన్ తుణ్డొండ్రు మణ్ణిల్ వంధు - యారుక్కుమ్ సొల్లామల్ పెణ్ణానదే!


 "వానవిల్లులోంచి చిన్నముక్క ఒకటి ఈ భూమ్మీదకి వచ్చి ఎవరికీ చెప్పకుండా పడుచుపిల్లైనది" అనడం అద్భుతమైన భావం. 

నాకింతగా నచ్చిన తమిళ పాట ఈ కింద ఓ మాటల-రాశిగా రాసి ఉంది. దాని కింద తెలుగు పాట కూడా ఉంది. 



తమిళ పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=YXfttDhW9YQ








తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
వెంకాడు పొత్తగళ్ళి - సట్టెండ్రు మొట్టువిడ
సెంగాటు చిల్లిచ్చెడి - సిల్లెండ్రు పూవెడుక్క్   
 
తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
వెంకాడు పొత్తగళ్ళి  - సట్టెండ్రు మొట్టువిడ
సెంగాటు చిల్లిచ్చెడి - సిల్లెండ్రు పూవెడుక్క్    
 
తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
  
వానోడుం మణ్ణోడుం ఇల్లాద వణ్ణంగళ్ - పెణ్ణోడుం కణ్ణోడుం నాన్ కాన్కిరేన్... 
తాళాతిళ్ ఇల్లాద సంగీద సారంగళ్ -  పారాట్టుమ్ ఉన్ పాట్టిల్ నాన్ కేట్కిరేన్... 
మళై తుళి ఎన్న తవం దాన్ సేయ్‌తదో?! - మలర్ కొణ్డ మార్బోడు తొట్టాదుదే... 
మళైతుళి తొట్ట ఇడం నీ తీండవో - నినై కైయిల్ ఉళ్ళూరక్ కళ్ళూరుదే... 
 
తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
వెంకాడు పొత్తగళ్ళి - సట్టెండ్రు మొట్టువిడ
సెంగాటు చిల్లిచ్చెడి - సిల్లెండ్రు పూవెడుక్క్   

తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
 
నీ యెండ్రుం నానెండ్రుం... ఇరు వార్తై ఒండ్రాగి - నామ్ ఎండ్ర ఓర్ వార్తై ఉణ్డానదే
 ఆణ్ ఎండ్రుం పెణ్ ఎండ్రుం... ఇరు వార్తై ఒండ్రాగి - ఆళ్ ఎండ్ర ఓర్ వార్తై ఉణ్డానదే
 కాదల్ ఎణ్ణుమ్ మంధిరథిన్ మాయమ్ ఎన్న - కల్లుం ముళ్ళుం ఇప్పోదు పూవానదే!
 వానవిల్లిన్ తుణ్డొండ్రు మణ్ణిల్ వంధు - యారుక్కుమ్ సొల్లామల్ పెణ్ణానదే!
 
తెన్మేర్కు పరువక్కాట్రు - తేనిపక్కం వీసుం - ఒరు సారల్ ... ఇంబచారల్... 
తెమ్మాంగు పాడిక్కొండు సిలు సిలువెండ్రు - సిందుదమ్మా...  తూరల్... ముత్తు తూరల్... 
వెంకాడు పొత్తగళ్ళి - సట్టెండ్రు మొట్టువిడ
సెంగాటు చిల్లిచ్చెడి - సిల్లెండ్రు పూవెడుక్క్ 


తెలుగు పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=J0eYqZEI1Yw






సిరిమల్లె మొగ్గ మీద - చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ  - వానగాలీ...  
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ -పైట జారీ... 
వెంటాడి పడ్డ చుక్క - ఝల్లంటు ముద్దు చేసి 
సింగారి సిగ్గు గిల్లి - చీరంత ముద్ద చేసె 

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ  - వానగాలీ...   
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ - మనసు జారీ... 
వెంటాడి పడ్డ చుక్క - ఝల్లంటు ముద్దు చేసి 
సింగారి సిగ్గు గిల్లి - చీరంత ముద్ద చేసె 

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ  - వానగాలీ... 

కోకంచు మీద నుండి జారేటి చుక్కల్లో - నీ వేడి నా ఈడు తాకిందిలే 
ఉయ్యాల ఊగించి - నాలోన ఆ వేడి - రాపాడి ఓ పాట పాడిందిలే 
వానచుక్క ఏమి తపం చేసిందనీ? మనసైన బంతాట ఆడిందిలే!
మత్తైన కన్నెతనం చల్లారదు - మనువైతే బంతాటే తెల్లారులూ...

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ - వానగాలీ...
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ -పైట జారీ...
వెంటాడి పడ్డ చుక్క - ఝల్లంటు ముద్దు చేసి 
సింగారి సిగ్గు గిల్లి - చీరంత ముద్ద చేసె 

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ  - వానగాలీ...   
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ - మనసు జారీ...

నీవంటు నేనంటు - ఇక రెండు లేవంటు - మనకంటు ఒక రోజు వచ్చిందిలే!
రేయంటు పగలంటు - ఇక పైన లేవంటు - నీ ఈడు ఒక ఊపు ఇచ్చిందిలే! 
కళ్ళ తోటి మంతరిస్తే కైపైనది - గుచ్చుకున్న ముల్లైన మల్లైనది 
వేడి ఎక్కి పిల్ల ఒళ్ళు విల్లైనది - వానమ్మ ఒళ్ళోన పెళ్ళైనది 

సిరిమల్లె మొగ్గ మీద చిట్టిజల్లు కొట్టెనమ్మ గాలీ - వానగాలీ...
ఆ వాన మత్తు లోన రెపరెపలాడిపోయానమ్మా - జారీ -పైట జారీ...
వెంటాడి పడ్డ చుక్క - ఝల్లంటు ముద్దు చేసి 
సింగారి సిగ్గు గిల్లి - చీరంత ముద్ద చేసె

*******
*******

చుట్టుముట్టి చుట్టమైన పాటని 
చేరదీసి చెట్టాపట్టాలేసుకుని 
పట్టుబట్టి పదం పట్టి
పట్టరాని పొంగులెత్తి 
పదం పదం పదే పదే అంటూ -
అదే పాట నేనౌతా!
అదే పాట అదే పనిగ పాడి - 
పదే పదే పాటనౌతా!

~ పాటల భైరవి