కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 20 - తలపులమ్మ పంపిన ఊరు... టంగుటూరు!
టంగుటూరులో ML అంటే పెద్ద కంపెనీ కింద లెక్క. ITC తర్వాత ML కంపెనీయే.
నాదొక చిన్న ఆఫీసు, పక్కనే పెద్ద గ్రేడింగ్ హాల్ పత్తిపాటి సుబ్బారావు (ఎ ర్రబ్బాయి) గారిది. దాదాపు ఐదారొందలమంది - చుట్టుపక్కలున్న - జమ్ములపాలెం, కాకుటూరివారి పాలెం, ఆలకూరపాడు, ఉప్పలపాడు - గ్రామాల నుంచి గ్రేడింగుకి వచ్చేవాళ్ళు.
ఇద్దరు సూపర్‌వైజర్లు - షేక్ ఆదమ్ అని ఒక సీనియర్ గ్రేడింగ్ సూపర్‌వైజరు - పేరయ్య అని ఒక జూనియర్ గ్రేడింగ్ సూపర్‌వైజరు - సాంబశివరావు అని ఒక క్లర్కు - నాగేశ్వర్రావు అని ఒక ఆఫీసు బాయ్ - కోటయ్య అని ఒక వాచ్‌మన్ కమ్ సెక్యూరిటీ - ఇదీ నా టంగుటూరు బ్రాంచ్ ఆఫీస్ స్టాఫ్. ప్రస్తుతానికి క్యాషియర్ లేడింకా. బ్రాంచ్ మేనేజర్ కమ్ క్యాషియర్ నేనేనన్నమాట.
మాకు పద్ధెనిమిది బయ్యింగ్ పాయింట్స్ ఉండేవి - నెల్లూరు నుంచి చౌదరి పాలెం, కావలి, వేటపాలెం- ఇలా చీరాల దాకా 18 ఉండేవి. వీటన్నిటికీ పద్ధెనిమిది మంది బయ్యర్లు ఉండేవాళ్ళు. అన్నాబత్తుని వెంకటసుబ్బయ్య జమ్ములపాలెం నుంచొచ్చేవాడు. ఆయన ఓ కమ్యూనిస్ట్ లీడరు. లక్ష్మయ్య గారికి బాగా కావాల్సిన వాడు. ఈ 18 మంది బయ్యర్లని ఆయనే పెట్టాడు. ఆయనే ఆ బయ్యర్ల టీముకి లీడర్ కూడా. ఆయన నేనంటే "పంతులుగారు" అంటూ ప్రాణం ఇచ్చేవాడు. నేను నా ఆఫీసు చుట్టూ చిన్న గార్డెన్ ఒకటి వేయించాను. దానికోసమని ఆయనే వెంకన్న అని ఒకణ్ణి పెట్టాడు తోటమాలిగా.
ఇక టంగుటూరులో బీనీడి వెంకట నరసయ్యగారు మంచి ఫ్రెండయ్యాడు. ఆయన్ని బట్టి అందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. పత్తిపాటి సుబ్బారావు (ఎర్రబ్బాయి ) తమ్ముడు చిన్నా అని అతను కరాటే ఫైటర్. అతను కూడా మంచి ఫ్రెండయ్యాడు నాకు. అంతే కాకుండా పైడి కిష్టయ్య అని ఇంకొకతను, గుత్తా వెంకటసుబ్బయ్యగారు, బెల్లం కోటయ్యగారు - వీళ్ళందరూ కూడా మంచి స్నేహితులయ్యారు నాకు.
సింగరాయకొండలో మిట్టపల్లి వాళ్ళ కంపెనీ ఉండేది. అది కూడా ఒక ఫ్యాక్టరీ . మిట్టపల్లి పాండురంగారావు గారని ఆయన కూడా పరిచయమయ్యారు. అప్పుడప్పుడూ సరదాగా కలుస్తూ ఉండేవాళ్ళం.
మాకు అప్పుడు చైనా ఆర్డర్స్ వస్తూ ఉండేవి. మా 18 బయ్యింగ్ పాయింట్సులో దాదాపు 3 వేల టన్నుల పొగాకు కొన్నాము. చాలా వేగంగా కొన్నాము.
అప్పుడు ఫ్యాక్టరీలు అవసరమయ్యి బీనీడి వెంకటనరసయ్య గారి ఫ్యాక్టరీ, మిట్టపల్లి వారి ఫ్యాక్టరీ, అలాగే ఆంజనేయ టొబాకో కంపెనీ అని చెప్పేసి దాముచర్ల ఆంజనేయులుగారు - ఆయన ఫ్యాక్టరీ, తర్వాత గూడూరు భూషయ్యగారు - ఆయన ఫ్యాక్టరీ, లావణ్య టొబాకోస్ అని చెప్పేసి ఒంగోలు ఫ్యాక్టరీ ఒకటి - తర్వాత టంగుటూరులో భారత్ లీఫ్ అని రంగారావుగారి ఫ్యాక్టరీ ఒకటి ఉండేది - ఇన్ని ఫ్యాక్టరీలు ఆపరేట్ చేసేవాళ్ళం. వీటన్నిటికీ నేనే ఇన్-ఛార్జ్. అక్కడ ప్యాకింగులు, ఇక్కడ గ్రేడింగులు అన్నీ నేనే చూస్తూ ఉండేవాణ్ణి.
ఇలా అంతా బాగానే నడుస్తోంది. అన్నీ చేస్తున్నా, ఇంత వ్యవహారం నడుపుతున్నా అప్పుడెప్పుడో కృష్ణస్వామిగారన్నట్టు జీతం మాత్రం నెలకి మూడంకెల్లోనే నడుస్తోంది. నేను సవాల్ చేసినట్టుగా ఐదంకెలు కానే కావట్లేదు. సరే! ఇప్పుడే కదా మేనేజ్‌మెంటు వైపుకి వచ్చింది. కొంతకాలం కానీయ్ చూద్దామనుకున్నాను.
అన్నట్టు మేమింకా కొండలరావు గారింట్లోనే అద్దెకి ఉండే రోజుల్లో - ఓ సారి ఏం జరిగిందంటే నేనో రోజు రాత్రి పూట కంపెనీ నుంచి ఇంటికి వస్తున్నాను. వచ్చే దారిలో బెల్లం కోటయ్యగారి ఇల్లు ఉంది. అక్కడ రోడ్డు మీద నల్ల కుక్కొకటి పడుకుని ఉంది. ఆ చీకట్లో నాక్కనపడక దాన్ని తొక్కేహాను. టక్కన నా పిక్క పట్టుకుని పీకేసింది అది.
ఎలాగో ఇంటికి వచ్చేశాను. మా ఇంటికెదురుగుండా కఱ్ఱ సాము చేసే సుబ్బారావు ఉండేవాడు కదా! అతను అంత రాత్రి పూట వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి నాతోపాటే డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఆ డాక్టర్ గారు కుక్క కరిచిన చోట అంతా చూశాడు. శుభ్రం చేసి కట్టు కట్టాడు.
"ఓ పధ్నాలుగు ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ చెయ్యాల. ఆపకుండా వరసగా పధ్నాలుగు రోజులు చెయ్యాలి" అన్నాడు డాక్టరు గారు.
"ఇంజెక్షన్ చెయ్యి కానీ బొడ్డు చుట్టూ వద్దు - నువ్వు చేతికి చేస్తావో, తుంటికి చేస్తావో చేసుకో - బొడ్డు చుట్టూ మాత్రం వద్దు" అని చెప్పా నేను.
"సరే అయితే!" అని రోజూ తుంటికి చేసేవాడు. "ఒక్కరోజు వేయించుకోవడం తప్పినా మళ్ళీ పధ్నాలుగు చేయించుకోవాలి" అన్నాడు.
సరే అని రోజూ వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటున్నాను. సరిగ్గా పది రోజులయ్యాక చిలకలూరిపేట నుంచి ఫోనొచ్చింది అర్జెంటుగా బయల్దేరి రమ్మని. ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికెళ్లి "ఆ మిగిలిన నాలుగు ఇంజెక్షన్లూ చేసెయ్యవయ్యా" అంటే ఆయన కుదరదన్నాడు. ఇలాక్కాదని చెప్పి చిలకలూరిపేట వెళ్ళిపోయాను. అక్కడ పనవ్వగానే వెనక్కొచ్చిన తర్వాత ఓ రోజు ఆఫీసుకి వెళ్తున్న నన్ను - డాక్టర్ గారు రోడ్డు మీద ఆపి "పది రోజులు కాగానే ఇంజెక్షన్లు ఆపేశావు . మళ్ళీ రా - నీకు మొదట్నుంచీ మళ్ళీ పధ్నాలుగు రోజుల పాటు ఇంజెక్షన్లు చెయ్యాలి అన్నాడు.
నేను ఆయనతో "నేను మళ్ళీ పధ్నాలుగు చేయించుకోను. చేస్తే ఆ మిగిలిన నాలుగు చెయ్యి. లేకపోతే లేదు. నన్ను కరిచిన కుక్క బతికే ఉంది. దానికేమీ పిచ్చి పట్టలేదు. రోజూ దాన్ని చూస్తూనే ఉన్నాను. పైగా దానికి బిస్కెట్లు అవీ పెడుతున్నాను. అది కూడా రోజూ తోకాడించుకుంటూ నా వెనకే వస్తోంది. నాకింకేమీ ఢోకా లేదు. . అంచేత ఇటుపైన ఇంక నీ దగ్గరికి రాను. ఇంకా గట్టిగా మాట్లాడావంటే ఆ మిగిలిన ఇంజెక్షన్లు నువ్వు చేసేసుకో" అని చెప్పేసి వచ్చేశా.
"ఈయన రాక్షసుడండి, బాబూ! ఇంత మొండోడేంటండీ ఈ పంతులు?" అని ఆ తర్వాత అన్నాబత్తిన వెంకట సుబ్బయ్యతో అన్నాడట ఆ డాక్టర్.
వెంకట సుబ్బయ్య వచ్చి "ఏంది పంతులూ! ఆ డాక్టరన్నట్టే నువ్వేం రాక్షస జాతివాడవయ్యా?!" అంటూ ఒకటే నవ్వు.
ఇహ బయ్యింగ్ సీజన్లో పొగాకు ఎక్కువ కొనేశామన్నాను కదా! లక్ష్మయ్యగారేమో ఫోన్ల మీద ఫోన్లు - "ఆపెయ్యండి కొనడం ఇంక" అంటూ.
ఈ వెంకటసుబ్బయ్యేమో ఆగట్లేదు. టీము లీడరు ఆయనే కదా! పైగా పెద్దాయన. మంచి అడ్మినిస్ట్రేటరు. ఆ పరిసరాల్లో మంచి పలుకుబడి ఉన్నవాడు.
ఆయన వెళ్ళి పొగాకు కొనకుండా ఆపడమెలా అని ఆలోచించి నేనేం చేశానంటే - మా కంపెనీకి ఉన్న పద్ధెనిమిది డీజిల్ కార్లలోనూ డీజిల్ అయిదు లీటర్లకి మించకుండా ఉండేలా చూశాను. అప్పుడు అవి ఓ పట్టాన స్టార్ట్ కావు. ఆయన ఎక్కడికీ వెళ్ళలేడు అని.
అది తెలిసి ఆయన ఏం చేశాడంటే "నీ పని ఇట్టా ఉందా? నాకు ఏరియాకి వెళ్ళడానికి ఒక్క కారు కూడా లేకుండా చేస్తావా నువ్వు?" అన్జెప్పి - పదిహేడు కారుల్లోంచి లీటరు, లీటరు చొప్పున డీజిల్ తీసి పద్ధెనిమిదో కారులో పోసి - ఆ కారేసుకుని చక్కా వెళ్ళిపోయాడు.
వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పా "ఓయ్ వెంకటసుబ్బయ్యా! నీ వల్ల నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది ఇక్కడ. ఇక పొగాకు కొనకయ్యా బాబూ!" అంటే - పాపం! - అప్పుడు నా మాట విని కొనుగోలు ఆపేశాడు.
అప్పట్నుంచి నన్ను చూస్తే "బ్రాహ్మణస్య! ఘాతకస్య !" అనేవాడు అంటే "పంతులూ - నువ్వు పాపిష్టోడు!" అని ఆయన భాషలో. హహహహా!
ఆయన ఎటువంటి వాడంటే ఒక ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచె వేసుకుని -కమ్మూనిస్టు లీడరు - రష్యా అంతటి చలిదేశానికి ఆయన విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు - దాదాపు పది రోజులు - అదే ఖద్దరు చొక్కా, అదే ఖద్దరు పంచె - చేతిలో వావిలాల గోపాలకృష్ణయ్య గారేసుకున్నట్టుగా ఓ చిన్న చేతి సంచీ - అందులో ఇంకో నాలుగు జతలు ఖద్దరు పంచెలు, చొక్కాలు - కోటు కూడా వేసుకోకుండా - రష్యా వెళ్ళాడు. అంత మొండోడు ఆయన! ఎంత మొండివాడో అంత మంచి మనిషి - అలాంటి మంచి మనిషి నాకు మంచి స్నేహితుడు కూడా!
<వచ్చేమాటు తరువాయి కథ>
"నీ పని ఇట్టా ఉందా? నాకు ఏరియాకి వెళ్ళడానికి ఒక్క కారు కూడా లేకుండా చేస్తావా నువ్వు?" అన్జెప్పి - పదిహేడు కారుల్లోంచి లీటరు, లీటరు చొప్పున డీజిల్ తీసి పద్ధెనిమిదో కారులో పోసి - ఆ కారేసుకుని చక్కా వెళ్ళిపోయాడు.
రిప్లయితొలగించండికారులవి పద్ధెనిమిదుండు
కదలరాదని కారులేవీ -
కారునున్న డీజిలంత తోడు...
కదలని కారు-కారునా డీజిలేమొ ఐదుండు
పంతాన అన్నాబత్తిన తోడియెత్తె -
ఒక్కొక్క లీటరు కారు, కారు నుంచి...
కూడె ఒక కారుకి ఐదుకి తోడు పదిహేడు
దడదడమని కదలాడె కారు
దడ పుట్టించుతు అన్నాబత్తిన ఉరికాడు!"
సుపర్బ్! బోల్డుసార్లు నవ్వుకున్నా ఊహించుకుని ఆ మొత్తం సీన్!
కదా :)) భలే ఆయన అన్నాబత్తిన వెంకటసుబ్బయ్య గారు!
తొలగించండి