16, ఏప్రిల్ 2023, ఆదివారం
ౘందమామ! నీ మీద నిందాయె!
3, ఏప్రిల్ 2022, ఆదివారం
పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 3 - హాం...ఫఠ్! ఆమ్‌చూర్-పులిహోర!
మున్నమ్మా! ఎలా వున్నావ్? ఏం చేస్తున్నావ్? ఎన్నిరోజులయ్యిందో మన శాకహృదయపు కబుర్లు చెప్పుకుని!
అప్పుడెప్పుడో పచ్చిమిరపకాయలు తరగడం దగ్గరే ఆగిపోయాను.
అదేంటో అంతసేపు పచ్చిమిరపకాయల గురించి చెప్పి - దాంతో పాటే అసలు పచ్చిమిరపకాయలే వెయ్యని సాంబారు రెసిపీ కూడా చెప్పాను కదా!
పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 2 - సాంబారు సంబరం, ములగాకు చూర్ణం
మళ్ళీ ఇన్ని రోజులకి కుదిరింది ఆవురావురనిపించే ఆమ్-కబుర్లు చెప్పుకోవడానికి.
అన్నట్టు - నిన్ననే ఉగాది పండగతో కొత్త సంవత్సరం మొదలైంది. ఈ సంవత్సరం పేరు శుభకృత్. అంటే చాలా మంచి చేసే సంవత్సరమని అర్థం.
ఈసారి మంచి వేపపూత దొరికింది. దాంతో మన ఇంటి ఉగాది పచ్చడి ఎంత బాగా కుదిరిందో! నువ్వే చూడు.
అసలింతకీ - నీకు రుచులు ఎన్నో, వాటి పేర్లు ఏమిటో తెలుసా?
నాకు తెలిసి రుచులు ఆరు.
అవి చేదు, వగరు, తీపి, కారం, పులుపు, కమ్మన.
ఉండుండు... నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు. మరి ఉప్పో? అనే కదా? ఉప్పు గురించి చెప్తా ... చెప్తా!
మనం రోజూ తినే భోజనంలో చెట్లు, మొక్కల నుంచి వచ్చే ఆకులు, కాయలు, పళ్ళు, గింజలు - వీటన్నిటికీ వుండేవి ఆరంటే ఆరే రుచులు.
కాకరకాయ చేదు, నేరేడుపండు వగరు, మామిడిపండు తీపి, పచ్చిమిరపకాయ కారం, చింతకాయ పులుపు, ఆనపకాయ కమ్మన.
తెలుగులో నోటికి రుచిగా అనిపించిన ప్రతి తినుబండారాన్ని, ఆదరువునీ "కమ్మగా" వుంది అంటారు. కానీ నాకు కమ్మన అనేది ఒక రుచి అనిపిస్తుంది.
అంటే నోట్లో పెట్టుకోగానే నాలుకకి తీపి, చేదు, కారం, వగరు, పులుపు - వీటిల్లో ఏ రుచీ అనిపించని వాటన్నిటి రుచి పేరు ఏంటీ అంటే మిగిలింది ఇంకేమిటి ? కమ్మనైన కమ్మదనం తప్ప?!
కమ్మటి రుచికి ఒక మంచి ఉదాహరణ చెప్పనా?
అప్పుడెప్పుడో తమ్ముడు నా చేత సంతకం చేయించి, వండనని ఒట్టువేయించుకుని మరీ : అదే కాయ - అదే పప్పు - అదే వద్దు! అన్నాడు చూడు "పెసరపప్పు -ఆనపకాయ" ముద్దకూర... ఆ కూరకి చేదు, వగరు, తీపి, కారం, పులుపు - ఈ రుచుల్లో ఏ రుచీ ఉండదు. అలా అని ఉప్పగానూ ఉండదు - కావాలని ఉప్పెక్కువ వేసేసుకుంటే తప్ప!
అన్నట్లు ఇంకో విషయమేంటంటే - చెట్లకి చిగిర్చే, పూసే, కాసే, పండే - ఆకులూ, పూలూ, కాయలూ, పళ్ళూ - వీటిలో ఈ ఒక్కదానికీ వుండని రుచి ఏంటో తెలుసా? ఉప్పు.
మనం తినే కాయలు, పళ్ళూ కావాలంటే చెట్లకి నీళ్ళు పొయ్యాలి.
ఆ కాయలు వేసి వండిన వంటలకి రుచిని పెంచే ఉప్పు మాత్రం సముద్రపు నీళ్ళు ఆవిరైతే వస్తుంది.
ఉప్పు రుచిని పెంచేదే (taste enhancer) తప్ప అదొక రుచి కాదు - నాకైతే అలాగే అనిపిస్తుంది, అనాలనిపిస్తుంది.
అది సరే కానీ ఉప్పు-కారం తర్వాత నాలుకకి తగిలీ తగలగానే జివ్వుమనిపించే రుచి పేరు ఏంటో తెలుసా? అది తెలుగులో palindrome కూడా.
అదేంటో చెప్పుకో! నీకు తట్టిందా - అదేంటో?
నే చెప్పేయనా?
పు... లు... పు.
అసలివాళ పులుపు గురించి ఎందుకు చెబ్దామనుకున్నానంటే దానికి కారణం - ఆమ్‌చూర్.
ఆమ్‌చూర్ అంటే ఆమ్ర-చూర్ణం అంటే మామిడికాయ పొడి.
ఈ పాండెమిక్ రోజులు మొదలయ్యాక మన ఇంట్లో జరిగిన ఒక చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే - చింతపండు పూర్తిగా మానేసి దాని బదులు ఆమ్‌చూర్ వాడడం.
మన కోనసీమ చారులో, కర్ణాటక రసంలో, మద్రాసు సాంబారులో, రోజూ చేసే రోటి పచ్చళ్ళలో, ఒక్కసారిగా పెట్టుకునే నిలవపచ్చళ్ళలో, చివరికి చింతపండు వేయాల్సిన పులిహోరలో కూడా ఆమ్‌చూరే వాడుతున్నాను.
ఆమ్‌చూర్‌తో పులిహోరా...? అని ఆశ్చర్యపోకు మరీ!
అసలు అదెలా మొదలైందంటే ...
ఓ రోజు నాన్నగారు తన ఫ్రెండ్ గిరి అంకుల్ భోజనానికి వస్తున్నారూ అని చెప్పగానే కొంచెం స్పెషల్‌గా వాంగీబాత్ చేద్దామా అని చూస్తే ఇంట్లో ఎప్పుడూ ఉండే కాప్సికమ్ కూడా లేకపోయింది. పులిహోర చేద్దామా అంటే చింతపండు ఉడికించేంత సమయం లేదు.
ఇహ అప్పుడు అనుకున్నా ... ఆమ్‌చూర్‌తో పులిహోర చేద్దామని.
వెంటనే గబగబా అన్నం వండేసి మన పెద్ద బేసిన్‌లో వేసి ఆరబెట్టా. అన్నం కొంచెం గోరువెచ్చగా కాగానే అందులోకి కొంచెం ఉప్పు, పసుపు, నువ్వుల నూనె, ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆమ్‌చూర్ వేసి కలిపాను.
అందులో మామూలు పులిహోరలో వేసినట్టే - నువ్వులనూనెలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నాలుగు మెంతిగింజలూ, కొంచెం జీలకఱ్ఱా, ఆవాలూ, ముద్ద ఇంగువా - పోపు వేసి - కరివేపాకు కూడా వేసేశాను. దాంతో పాటే ఇంకొంచెం జీడిపప్పూ, ఇంకొన్ని వేరుశనగగుళ్ళూనూ...
హాం...ఫఠ్! ఆమ్‌చూర్-పులిహోర తయార్!
నాన్నగారూ, గిరి అంకుల్‌కే కాకుండా తమ్ముడికి కూడా బాగా నచ్చింది. నేను చేసిన అప్పటికప్పటి హాంఫఠ్-పులిహోర.
నువ్వు కూడా ఎప్పుడైనా ఒకసారి చేసుకుని చూడు - పుల్లపుల్లగా బావుంటుంది.
అన్నట్టు నాన్నగాడూ...మొన్నొకరోజు తమ్ముడూ నేనూ మాట్లాడుకున్న సంగతోటి చెప్పాలి.
శుక్రవారం నాన్నగారూ, నేనూ, తమ్ముడూ ఎక్కడికో వెళ్తుంటే ఉన్నట్టుండి వాడు "I forgot అనడానికి తెలుగులో ఏంటీ?" అనడిగాడు.
"మరచిపోయాను అంటామమ్మా" అన్నాన్నేను.
దానికి వాడు "అంటే forget and die ? అందులో forget కి root-word ఏంటీ" అన్నాడు.
"Forgot అంటే 'మరచానూ' అంటే చాలు. కాకపోతే కొంచెం emphasize చేయడానికన్నట్టు అలా 'మరచిపోయానూ' అంటామూ అని చెప్తున్నాను.
ఇంతలో కార్ సైడ్-మిర్రర్‌లోంచి వాడి నవ్వు మొహం చూడగానే నాకు చటుక్కున ఇలా చెప్పాలనిపించింది.
"ఒరేయ్ బుజ్జిగాడూ! అలా అని ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు 'ఏమన్నా తిన్నావా?' అనడిగితే 'ఇప్పుడే తినిపోయానూ' అని చెప్పకు. అన్నిచోట్లా అలా వాడకూడదూ" అని గబగబా చెప్పాను.
లేకపోతే ఆ రౌడీ గాడి సంగత్తెలుసుగా - నే నేర్పిన తెలుగుని నా మీదే ప్రయోగిస్తాడు.
10, అక్టోబర్ 2021, ఆదివారం
సున్నాలెయ్ ...బోల్డు సున్నాలెయ్!
కన్యాశుల్కంలో గురువు-గిరీశం శిష్యుడు-వెంకటేశాన్ని "క్రియేషన్ అనగానేమిటి? అనడిగిన స్టైల్లో - ఎవర్నైనా అదాటున ఆపి "సున్నాలు ఎన్ని రకాలు?" అనడిగితే ఏమని చెప్తారు?
అసలూ ... శంకరాభరణం శంకరశాస్త్రిగారు అరుగు మీద కూర్చుని హార్మణీ వాయిస్తున్న దాసుకి ఏం చెప్పారో జ్ఞాపకం వుందా? "ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం వుంది, శృతి వుంది, స్వరం వుంది" అని కదా!
దాన్ని నా సున్నాలకి అన్వయిస్తే "ఒక్కొక్క 'సున్నాలు' అనే పదానికి ఒక్కో నిర్దిష్టమైన అర్థం వుంది, భావం వుంది, జ్ఞాపకం వుంది" గా మారుతుంది.
కద... కదా!
తెలుగులోనూ, లెక్కల్లోనూ సున్నా వస్తుంది అంటే నేను రాసిన పరీక్షల్లో మార్కుల రూపంలో కాదండీ... కాదు...
"అ పక్కన సున్నా పెడితే అం" అని తెలుగులో చదువుతాం; "ఒకటి పక్కన సున్నా పెడితే పది" అని లెక్కల్లో నేర్చుకుంటాం - కదా! అందుకే సున్నాని "ఉభయాక్షరం" అంటారు అనుకునేదాన్ని.
తర్వాత్తర్వాత కొంచెం పెద్ద తరగతుల్లో తెలుగు వ్యాకరణం చదువుకున్నప్పుడు నాకర్థమైన విషయాలు ఏంటంటే...
"అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః" అని చదువుకున్న అచ్చుల్లో చివరగా వచ్చే "అం అః -
లు" రెండూ అచ్చంగా అచ్చులే కాదని.
ఆ రెండిటినీ అచ్చుల్లో కలిపేశారు కానీ అవి అచ్చులకీ, హల్లులకీ - చెందిన, చెందని, చెందీచెందని - ఉభయాక్షరాలని.
అంతే కాకుండా అవి రెండూ కూడా ఉభయాక్షరాలు అనబడే "అరసున్న, నిండుసున్న, విసర్గ" అన్న మూడక్షరాల గుంపు లోవని తెలిసింది.
ప్రస్తుతానికి అరసున్న, విసర్గ జోలికి వెళ్ళను కానీ చూపులకి గుండ్రంగా, అందంగా కనిపించి - పలుకులకి నిండుగా, చందంగా వినిపించే నిండుసున్న గురించి ఇన్నేళ్ళకి నే నేర్చుకున్న విశేషాన్ని గురించిన బోల్డన్ని కబుర్లు చెప్పేసుకుంటా.
అసలు "నిండుసున్న" అన్నమాట వింటే నాకు మొట్టమొదటగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా? గుండ్రంగా వుండి, కనిపించినంత మేరా పండువెన్నెల పంచి పెట్టేసే నిండుచందమామ.
ఆ వెంటనే, వెనువెంటనే గురొచ్చేది "సున్నాలెయ్" పాట.
కాసేపు నా సున్నా-కబుర్లు పక్కనెట్టి ఈ "సున్నాలెయ్" పాట కబుర్లు చెప్తా. It takes all sorts to make a blog అన్నది నా-నుడి కాబట్టి. అంతే కాకుండా variety is the spice of blog కూడా కాబట్టి.
అందుకే ఇవాళ్టి కబుర్లు రకరకాల సున్నాల గురించి - కలగాపులగంగా.
మొదటగా "సున్నాలెయ్" పాట గురించి.
అనగనగా ఓ పాత హిందీ సినిమా. దాని పేరేమో "గోరా ఔర్ కాలా".
ఇందులో ఒక తెల్లరాజేంద్రకుమారు, ఇంకో నల్లరాజేంద్రకుమారు వుంటారు.
అందులో ఓ రాజేంద్రకుమారుకి రాజకుమారిగా ఉట్టుట్టినే నవ్వేసే హేమ్మాల్ని వుంటుంది.
ఇంకా అందులో ఓ పాటుంటుంది.
ఆ పాటనేమో పచ్చచొక్కా వేసుకున్న తెల్లరాజేంద్రకుమారూ. మిలమిల మెరిసే ఎఱ్ఱటి గౌనేసుకున్న హేమ్మాల్నీ - గడ్డిలో చెట్లకి వేళ్ళాడుతున్న తీగలు పట్టుకునీ, పడకుండా వుండడానికి ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని నడిచేస్తూ పాడేసుకుంటుంటారు. ఆ పక్కనే కత్తి చేత్తో పట్టుకుని తిరుగుతూ నల్లరాజేంద్రకుమారు కూడా కనిపిస్తాడండోయ్ - కొంచెం జాగ్రత్తగా చూస్తే.
ఆ పాటే "ధీరే ధీరే బోల్ .... కోయీ సున్ న లే...సున్ న లే - కోయీ సున్ న లే".
కానీ ఆ పాట ఎప్పుడు పాడుకున్నా "ధీరే ధీరే బోల్ ....కోయీ సున్నాలెయ్... సున్నాలెయ్...కోయీ సున్నాలెయ్" అనే నే పాడుకుంటా!
అలా పాడుకున్నప్పుడల్లా - ఒక్కోసారి - "ఎదురింటికి సున్నాలెయ్ - బోల్డు సున్నాలెయ్" అంటూ పరమానందయ్యగారి శిష్యులని గుర్తుతెచ్చుకుంటా.
ఇంకొక్కోసారి "చేయని లెక్కలకి సున్నాలెయ్ - బోల్డు సున్నాలెయ్" అంటూ అప్పుడెప్పుడో డిగ్రీ ఫస్టియర్లో ఔటాఫ్-సిలబస్ పేపర్ రాయలేక డ్రాప్ చేస్తే నాకు లెక్కల్లో వచ్చిన మొట్టమొదటి-చిట్టచివరి గుండుసున్నా జ్ఞాపకంగా పాడుకుంటా.
సరే! ఇంతకీ ఇక్కడ మా అమ్మ పేరు గురించి ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ తన పేరు ఇంగ్లీషులో రాసేటప్పుడు "PERIMDEVI" అని రాస్తుంది. కానీ నాకు అది "PERINDEVI" అయితే బాగుండునేమో అనిపించేది. అలా ఎందుకు అనిపించేదో మాత్రం నాకు అర్థం అయ్యేది కాదు.
కానీ ఇప్పుడు ఈ అనుస్వార సూత్రం తెలిశాక నాకు మా అమ్మ పేరు "PERINDEVI" అని రాయాలనిపించడం నాకు తెలియకుండానే తెలుగుని నేను సరిగ్గా అర్థం చేసుకున్నాననిపించి భలే సంతోషంగా అనిపించింది.
పేరిందేవి = పేరి+న్+దేవి (త థ ద ధ న)
హమ్మయ్య! నాకిప్పుడు ఇక సంక్రాంతి గురించి ఏ సన్దేహమూ లేదు - అది కచ్చితంగా "స+ఙ+క్రా+న్ +తి".
నాకు ఈ బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు మరొక్కసారి గట్టిగా అనిపించినదేమిటంటే చెప్పాలనుకోవాలే గానీ - శూన్యం లోంచి కూడా కబుర్లు పుట్టించొచ్చని.
చివరాఖరిగా సున్నా గురించి నాదో మాట...
2, మార్చి 2021, మంగళవారం
రాలుగాయి రాత
ఈ రోజుకి ఏ రోజూ నేను రాయని రోజు లేదు.
రాయడానికి సమయమూ, సందర్భమే అక్కరలేదు.
రాయదగ్గది ఉందా లేదా అని లేదు.
రాయడానికి ఏముందిలెద్దూ అనుకున్నదే లేదు.
నీలమో, నలుపో, ఎఱ్ఱదో, పచ్చదో, ఊదారంగుదో - రంగేదైనా పెన్నొకటి దొరికితే చాలు రాస్తాను.
అల్లిబిల్లిగా రాసే నా రాతకి కుదురు కావాలనిపించినప్పుడు ముక్కు విరిగి మూలనున్న పెన్సిలు నొకదాన్ని దొరకబుచ్చుకుని చెక్కిచెక్కి రాస్తాను.
కుదిరినప్పుడు చేతిరాత ఆపి టైపు-రాత రాస్తాను.
అది నాకే తట్టిన నా మాట కావొచ్చు, ఎప్పటిదో నచ్చిన పాట కావొచ్చు, అదాటుగా గుర్తొచ్చిన గాలిబ్ గీతమవొచ్చు - రాతకి వీలుగా తెరిచి పెట్టుకున్న తెల్లకాయితాల పుస్తకంలో రాసుకుంటాను నేను.
నా రాత నాకు నేనే రాసుకుంటూ నాకు నేనే చదువుకునే ఉత్తరం.
నా రాత నాకు మాత్రమే వినబడే ఊసు.
అనుకున్నదేదో మాటల్లో పేర్చలేని ఊసుపోని వేళ రాత నాకు ఊత.
ఎన్ని ఉన్నా ఇంకేదో కావాలనిపించే ఆరాటపు వేళ రాత నాకు ఊరట.
రాయడమంటే ఎంత ఇష్టమంటే అసలలాంటి ఇష్టమొకటి ఉంటుందనే ఎరుకే లేని చిన్నతనాన కేవలం మళ్ళీ మళ్ళీ బోల్డంత సేపు రాసుకోవచ్చు అన్న ఒకే ఒక్క - అదేదో పైకి చెప్పుకోలేని బాల్యచాపల్యపు అనాలోచితతో - సగం సంవత్సరం పాఠాలు అయిపోయిన తర్వాత తెలుగు నోట్సు, సైన్స్ నోట్సు కావాలని పడేసుకుని - దాదాపు వారం రోజుల పాటు అన్ని పాఠాల నోట్సు తిరిగి రాశాను. అప్పుడే - నాలుక కొనని పై పెదవికి ఆనించి - చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా పట్టించుకోకుండా - దీక్షగా తెగ రాసేస్తున్న నన్ను చూసి మా అమ్మ కూడా ఓ రోజంతా నా నోట్సు రాసేసింది.
దానికి ఆవిడ "ఎంత సేపట్నుంచో రాస్తున్నావు బ్రహ్మరాతలా. చేతులు నొప్పి రావట్లేదూ? నేనూ కొంచెం సాయం చేస్తా పట్టు" అంది కానీ అసలు విషయం ఏంటంటే తలొంచుకుని తెగ రాసేస్తున్న నన్ను చూసి ఇదేదో గొప్పపని చేసేస్తోందని అనిపించి ఆ గొప్పపని ఆవిడా చేసేద్దామని inspire అయి నాకు రాత-సాయం చేసేసింది.
సరే! నాకు రాయడం ఎంత ఇష్టమైనా రోజూ మాత్రం రాయడానికి ఏముంటుంది కదా? అందుకని నేనేం చేస్తానంటే రకరకాల రంగుల పెన్నులు పక్కన పెట్టుకుని - ఎఱ్ఱ పెన్నుతో క్రిప్టోక్విప్, ఆకుపచ్చ పెన్నుతో వండర్ వర్డ్, నీలం రంగు పెన్నుతో జంబుల్, ఊదారంగు పెన్నుతో క్రాస్-వర్డ్ - ఇలా ఏదో ఒక పెట్టెలోనో, గడిలోనో అక్షరాలు నింపుతూ, ఇంకో అక్షరాల గుంపులో మాటలు కనిపెట్టి వాటి చుట్టూ సున్నాలు చుడుతూ నా రాత-పోతలు పూర్తి చేసుకుంటాను.
కాసేపు నా రాయుట గురించి రాయుట ఆపి నా ఫ్రెండ్ అపర్ణ రాసిన రాతల గురించి కూడా రాస్తా.
ఒకే ఆత్మ, ఒకే పాట, ఒకే రాత మా ఇద్దరిదీ. పక్కపక్కనే కూర్చుని రాసుకునే నోట్సు కూడా ఇద్దరం ఒకేలా రాసేవాళ్ళం - లైను మొదలు పెట్టడం, పూర్తిచేయడం కూడా ఒకే మాటలతో - పైగా రాసేది running notes అయినా సరే!
అపర్ణ మంచి కవయిత్రి. ఇంగ్లీషులో చాలా మంచి classic poetry రాస్తుంది. మొదట్లో తెలుగులో కూడా రాసేది. పదో తరగతిలో ఉన్నప్పుడే తను రాసిన కవితకి రాష్ట్రస్థాయి - శ్రీశ్రీ స్మారక కవితల పోటీలో తనకి మొదటి బహుమతి కూడా వచ్చింది. ఆ కవిత నాకు గుర్తు లేదు కానీ తనే రాసిన ఇంకో కవిత గురించి మాత్రం ఇవాళ రాయాల్సిందే.
అప్పుడెప్పుడో - పదో తరగతి చదివేటప్పుడే మా అపర్ణ కవితలు రాసేదని చెప్పాను కదా!
నేను తనకి ఫ్రెండు అయీ అవగానే "రా ... నీకు నా పొయెట్రీ బుక్ చూపిస్తా"నంటూ నీలం ఇంకులో రాసిన గుండ్రటి అక్షరాలు అందంగా పేర్చిన ఒక రూళ్ళ నోట్ బుక్ నాచేతిలో పెట్టింది.
అందులో మొట్టమొదటి కవిత పేరు "తపన"
27, డిసెంబర్ 2020, ఆదివారం
తొందరపడి మా తోమరి - ఎందుకో ఆగిందీ... దెబ్బకి సాగిందీ...
ఈసారి కబుర్లు చెప్పటం మొదలెట్టేముందు - ఓ చిన్న పొడుపు కథ...
మా ఇంటికొచ్చింది
తోమి తోమి తోమలేక ఆగింది
ఆగింది, ఆగింది, ఆగిపోయింది
హఠాత్తుగా లేచి సాగింది
ఇప్పుడు ఆడక ఆగిందేంటి?
ఆ సాగిందెక్కడికో చెప్పకుండా ఈ బ్లాగింగేంటి?
నాకు డిష్ వాషర్ ఒక మంచి కిచెన్ అసిస్టెంట్. నేను చెప్పినట్టు విని, నాకు కావాల్సినట్టు పని చేసే నాకనువైన డొమెస్టిక్ హెల్ప్.
సాధారణంగా డిష్ వాషర్ వాడకం గురించి ఒక కంప్లైంట్ లాంటి కామెంటు వినిపిస్తూ ఉంటుంది "మీ అమెరికాలో డిష్ వాషర్లు ఉన్నాయీ అనుకోవడమే కానీ మీరు అన్నీ కడిగి పెడితే కానీ అవేమీ తోమవట కదా?" అని. నేనది విన్నప్పుడల్లా డిష్ వాషర్లూ, వాటి ఉపయోగాలూ, వాటి వల్ల అయ్యే నీటి ఆదాలూ అంటూ ఓ పే...ద్ద పాఠం అప్పచెప్తూ ఉంటాను. ఎవరైనా వింటే నేనే ఆ డిష్ వాషర్లని తయారు చేసి అమ్ముతున్నానేమో అనుకునేలా.
అదే ఇక్కడ మళ్ళీ మళ్ళీ - పునరపి వచనమ్! అవధరించుడి!
డిష్ వాషింగ్ అనేది మూడంచెల పధ్ధతి.
మొదటి అంచె - వండిన గిన్నెల్ని, వాడిన గరిటల్ని, తిన్న కంచాలని - వాటివాటికి అతుక్కున్న పదార్థాలని నీళ్లతో తొలిచి వదిలించడం.
రెండో అంచె - అన్నిటికీ సబ్బు అనబడు స్తోమక్షారం రాయడం.
మూడో అంచె - రాసిన సబ్బుని నీళ్లతో కడగడం.
డిష్ వాషర్ వాడేటప్పుడు మొదటి అంచె మాత్రమే నా వంతు. మిగిలిన రెండూ డిష్ వాషర్ వంతు. అంటే నాకు గిన్నెలు కడిగే టైములో రెండొంతుల టైము ఆదా. పైగా కిందా, పైనా అన్ని పక్కల్నించీ వేడివేడి నీళ్ళు చల్లి గిన్నెలన్నిటికీ తలంటేసి ఎక్కడా జిడ్డు లేకుండా మిలమిలలాడేట్టు చేసే డిష్ వాషర్ అంటే నాకు బోల్డంత ఇష్టం.
కిందటి వారం మా డిష్ వాషర్ ఎప్పట్లాగే కిందా, పైనా అరల్లో ఉన్న గిన్నెలన్నిటినీ తళతళలాడేట్టు తోమింది.
డిష్ వాషర్లన్నాక ఏవైనా అదే పని చేస్తాయి. అందులో విశేషం ఏమీ లేదు.
మా గిన్నె-తోమరి కొంచెం తుంటరి.
తోమింది తోమినట్టుండక - పై అరలో పెట్టిన ఒక గాజు గ్లాసుని ముక్కలు చేసింది.
రెండేళ్ళ క్రితం ముచ్చట పడి కొనుక్కున్న గాజుగ్లాసులు మూడు ముక్కలవ్వడం ఇది మొదటి సారేమీ కాదు - మూణ్ణాలుగులీక్వల్టూ-పన్నెండో సారి.
"ఇంకెప్పుడూ ఇలాంటి గ్లాసులు కొనకూడదు" అని ఆ పగిలిన గాజుముక్కలేరుతూ పన్నెండో సారి అనుకున్నా.
ఈ స్టెప్పు వరకూ ఇంతకూ ముందు పదకొండు సార్లు ఎలా జరిగిందో అదే సీక్వెన్స్ - అదేదో ఇంతకు ముందెప్పుడో అచ్చు ఇలాగే జరిగిందే అనిపించే deja vu లాగా.
మరుసటి రోజు పొద్దున్నే - ఉన్న రెండు అరల నిండుగా - కళాత్మకంగా సర్దిన కంచాలని, గిన్నెలని, గరిటల్నీ - కళ్ళ నిండుగా చూసుకుని - నీలి రంగులో జాలువారుతున్న డిష్ వాషర్ డిటెర్జెంటుని వేసి - ఆన్ చేయగానే - దడదడలాడుతూ హడావిడిగా తిరగాల్సిన మా డిష్ వాషర్ ఉన్నట్టుండి ఉలుకూ-పలుకూ లేకుండా ఉండిపోయింది.
డిష్ వాషర్ పని చెయ్యట్లేదు అని చెప్పగానే బదరికి వచ్చిన మొట్టమొదటి ఆలోచన - పగిలిన గాజు ముక్కలేమన్నా లోపల పడ్డాయేమోనని. మళ్ళీ మనకి మనమే అనుకోవడం ఎందుకని మా ఇంటికెప్పుడూ వచ్చే ఎలక్ట్రీషియన్ రిక్‌ని పిలిచి అతనికోసారి చూపిద్దామని అనుకుని ఫోన్ చేస్తే ఆయనేమో ఓ రెండ్రోజుల దాకా రావడం కుదరదన్నాడు.
ఇక చేసేదేముంది?! వంతుల వారీగా "ఆడుతు పాడుతు తోమేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ?!" అని ఆడుకుంటూ-పాడుకుంటూ కాలక్షేపం చేసుకున్నాం.
ఇంట్లో ఉన్న పిల్లజింకలిద్దరూ - అటొచ్చీ-ఇటొచ్చీ వంటింట్లో గిన్నెల-కొలువు చూస్తూ - "అమ్మా! డిష్ వాషర్ లేదు కదా - డిషెస్ ఏమైనా తగ్గించి వాడుతున్నావా?" అని పరామర్శించడం - దానికి నేను "డిష్ వాషర్ లేదని వండే డిష్షులు తగ్గలేదు కదమ్మా!" అని బదులివ్వడం.
ఇలా ఓ రెండ్రోజులు గడిచాక రిక్ వచ్చాడు. వస్తూనే డిష్ వాషర్ లోకి తొంగి చూసి - మల్టిమీటర్ పెట్టి దాని నాడి చూసి - "మోటార్ బాగానే ఉన్నట్టుంది. ఇదిగో ఈ బయటున్న ఎలక్ట్రానిక్ టచ్ ప్యాడ్ పోయింది" అని చెప్తూనే "ఇది కొత్తది వేయించుకునే బదులు ఇంకొక కొత్త డిష్ వాషర్ కొనుక్కోవడం మంచిది. మీరు కొత్తది కొన్నా దాని వారంటీ పీరియడ్ అయిపోగానే ఎలాగూ పాడవుతుంది. అందుకని ఆట్టే ఎక్కువ డబ్బులు పెట్టకుండా తక్కువలో కొనుక్కోండి" అని చెప్పి "నేను చేసిందేమీ లేదు కాబట్టి నాకు డబ్బులు ఏమీ ఇవ్వొద్దు" అని డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు - మా సత్యకాలపు రిక్!
ఈ లోగా బదరి కిచెన్-ఎయిడ్ సపోర్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు "టచ్ ప్యాడ్ ఐదొందలవుతుంది. ఒక వేళ మీరంత పెట్టి కొందామనుకున్నా ఫిబ్రవరి దాకా అది మీకు పంపించడానికి కుదరదు" అంటూ "దాని బదులు కొత్త డిష్ వాషర్ కొనుక్కోండి" అని వాళ్ళ వంతు మార్కెటింగ్ కోటా పూర్తి చేసుకున్నారు.
ఇక ఇంట్లో కోలాహలం - కొత్త డిష్ వాషర్ కొనబోతున్న ఉత్సాహం.
"మనం ఒక మంచి డిష్ వాషర్ కొందాం. అదెలా ఉండాలంటే నువ్వు ఆఫీసులో ఉండగా నీ సెల్ ఫోనుకి తోమిన గిన్నెల ఫోటోలు మెసేజ్ పంపించాలి. గిన్నెలు తోమడం అయిపోగానే అవి ఎవరు unload చెయ్యాలో అదే task assign చెయ్యాలి." అంటూ బోల్డన్ని ఊహలు బదరివి - నన్ను ఊరిస్తున్నట్టుగా.
మళ్ళీ అంతలోనే "అంట్లు తోమడానికి అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. ఆ రిక్కు చెప్పినట్టు మామూలుదేదో కొనుక్కుందాము" అన్జెప్పి చుట్టుపక్కల ఉన్న Appliance stores అన్నిటికీ వెళ్ళి వచ్చాము. ఏమీ నచ్చలేదు. ఆన్లైన్లో వెతుక్కుందాము అని ఇంటికొచ్చేశాము.
ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుకుంటున్నా - అన్ని దారులూ రోమ్ వైపు వెళ్ళేట్టుగా - మా మాటలన్నీ డిష్ వాషర్ గురించే.
ఇంతలో బదరి డిష్ వాషర్ దగ్గరికి వెళ్ళి - "చిన్నప్పుడు రేడియోలు పని చెయ్యకపోతే అటూ-ఇటూ రెండు దెబ్బలేస్తే పని చేసేది కదా! దీనికీ ఓ రెండు దెబ్బలేస్తా. ఎలాగూ పని చెయ్యట్లేదు. ఇప్పుడు కొడితే కొత్తగా పోయేదేమీ లేదు" అంటూ గట్టిగా రెండు దెబ్బలేసి ఈలోగా రిక్ నుంచి ఫోన్ వచ్చిందని అవతలికెళ్ళారు.
ఇంతకీ ఆ రిక్ ఎందుకు చేశాడంటే - అతనేదో కొనుక్కుందామని హోమ్ డిపోకి వెళ్తే అక్కడ డిష్ వాషర్లు చూసి మేము గుర్తొచ్చామట. అందుకని ఫోన్ చేశాడట.
బదరి రిక్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. నేనీ లోగా డిష్ వాషర్ దగ్గరికి వెళ్ళగానే నా చెయ్యి తగిలి "డ్ర్ర్ర్ ..." అని శ్రావ్యంగా పలికింది మా తోమరి.
వెంటనే "బావా!" అంటూ నా ఆనందాతిశయ కేక!
ఏమయిందో అని హడావిడిగా పరిగెత్తుకొచ్చిన బదరికి - తాను కొట్టిన దెబ్బలకి చుక్కలు కనిపించాయో ఏమో అన్నట్టు - చుక్కల్లాంటి లైట్లు వెలుగుతూ పనిచేస్తూ కనిపించింది మా కిచెన్-ఎయిడ్.
ఇహ ఇప్పుడు "దెబ్బకి డిష్ వాషర్ కూడా పనిచేస్తుంది" అన్నది మా ఇంటి కొత్త నానుడి.
అన్నట్టు కిచెన్-ఎయిడ్ వాళ్ళ ట్రబుల్ షూటింగ్ గైడ్‌లో ఈ "ఆగిపోయిన డిష్ వాషర్‌కి వెయ్యండి రెండు దెబ్బలు" టిప్ కూడా చేర్చుకోమని చెప్పాలి.
30, నవంబర్ 2020, సోమవారం
థాంక్స్‌గివింగ్ తలపోతలు
खाली हाथ शाम आयी है - खाली हाथ जायेगी...!
ఆ గుల్జారే మళ్ళీ ఇంకోచోట అన్నట్టు ...दिन खाली खाली बर्तन है -और रात है जैसे अंधा कुआँ !




