బెంగళూరు కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బెంగళూరు కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, డిసెంబర్ 2020, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 23 - కవలపాటలు - కన్నడద "నగువ నయన", తెలుగులో "కలిసే సమయం"...

కలత పడిన మదికి మఱపు... 
మఱచి పోలేని వెలితికి తెరిపి... 
ఎప్పుడూ ఓ పాటే!

ఆ పాట... 
విన్నపాటున ఎదకు చేరుకుంటుంది 
చేరుకున్న చోట ఒదిగి చుట్టుకుంటుంది 
చుట్టుకున్న మదిని పట్టిపట్టి పలకరించి 
పలకరించిన ప్రతీ పూటా పలవరింతై 
పెదవుల మీద పదేపదే పలుకుతుంటుంది 

అదుపులేని - కలవరమై  
ఆపలేని - కలరవమై  
అదుపు లేని - ఆపలేని - కూనిరాగమౌతుంది 

ఆగలేక - ఉలికిపాటుగా  
సాగిపోతూ - ఉనికిపాటగా 
ఆగలేక - సాగిపోతూ - ఊపిరి-పాటౌతుంది 
  
పలికి పలికి
వెలితి తరిగి 
కలత కరిగి  
కలల మరిగి 
వెలుగుతున్న 
మదికి మెరుపు 
అప్పుడూ ఆపాటే!
 అది ఎప్పటికీ నా పాటే!

*******
*******


    ఒక్కో జ్ఞాపకం ఎంత బాధ పెడుతుందంటే ఆ జ్ఞాపకం గురించిన జ్ఞానమే లేకపోతే ఎంత బావుండునో అనిపించేంత. 

    కానీ ఒకసారి ఏదైనా జరిగిపోయాక దాని గురించిన జ్ఞానమూ, జ్ఞాపకమూ ఎంత విదిలించినా వదిలిపోవు. వదిలించుకోవాలనుకున్నా మరపు రావు. 

    విదిలించిన కొద్దీ మొండిగా, వద్దన్నా వదలక పెంకిగా వెంటనంటి వస్తూనే ఉంటాయి. వాటినల్లాగే రానిచ్చేస్తే ఇంకేమన్నా ఉందా? 

    ఉన్నచోట ఉండనీయక, తిన్న తిండి ఒంటబట్టనీయక, కంటి మీద కునుకు రానీయక - చికాకు పెడతాయి. 

    సరిగ్గా ... అలాంటప్పుడు హడావిడిగా ఓ పాట కోసం వెతుక్కుంటా. ఆ పాటతో పాటు - ఆ నొప్పి పెట్టే గురుతులని తిప్పి కొట్టే ఇంకో మంచి జ్ఞాపకం తోడు  తెచ్చుకుంటా. 

కన్నడద "నగువ నయన, మధుర మౌన ":

    అలా ఎప్పటి రోజులదో అప్పు తెచ్చుకున్న పాటొహటి - ఇవాళ్టి కవల పాటల్లో మొదటిది  -  అమ్మనుడి-తెలుగు తర్వాత బహు కమ్మగా అనిపించే కన్నడ భాషలో వచ్సిన "పల్లవి-అనుపల్లవి" సినిమా లోది. 

     ఆ పాటేంటంటే ఎస్పీబీ-ఎస్జానకి పాడిన ఇళయరాజా సంగీత-మంత్రజాలం "నగువ నయన, మధుర మౌన..." అన్న పాట. 

    ఈ కన్నడ సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా. ఇందులో నటించిన హీరో-హీరోయిన్లు అనిల్ కపూర్-కిరణ్ హిందీ సినిమాల్లోంచి వచ్చినవాళ్ళే . వీళ్ళిద్దరితో పాటు లక్ష్మి కూడా ఉంది ఈ సినిమాలో. ఇప్పటి వరకు ఈ పాట వినడమే కానీ సినిమా చూడలేదు. యూట్యూబ్‌లో ఉన్న ఈ కన్నడ సినిమా వచ్చేవారం చూడ్డానికి టిక్కు పెట్టుకుని ఉంచుకున్నాం. 

    ఈ పాట విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా గుర్తుకొచ్చే తీపి జ్ఞాపకాలు - ఒకప్పటి బెంగుళూరు రోజులు.

    కళ్ళ ముందు కలలా కదిలే  ఆ జ్ఞాపకాల్లో కనిపించేవి - MG రోడ్ కావేరి ఎంపోరియం ముందు నుంచి తిరిగిన దారులు - కబ్బన్ పార్క్ వెదుళ్ళ బాటల్లో మాటలూ - చెట్ల ఆకుల సందుల్లోంచి కురిసే వెచ్చటి నీరెండ వేసిన నీడ ముగ్గుల్ని తొక్కకుండా నడవాలంటూ ఆటలూ - చలిచలి నడకల్లో రోడ్డు పక్క బండి మీద కొనుక్కుని ఊదుకుంటూ తిన్న వేడివేడి మొక్కజొన్న పొత్తులు - ఎండ పొడకి ఉలిక్కిపడిన మబ్బు అలిగి ఉన్నట్టుండి కురిసిన పూలలాంటి చినుకులు - వడి పెరిగి చినుకులకి పరుగులిడిన నడకలకి గొడుగెత్తిన చెట్లు. 

    ఇవన్నీ ఒకెత్తు అయితే - రాత్రి కాగానే మంచు మేలిముసుగు చాటున రంగురంగు రత్నాల హారాలూ, తళతళలాడే వజ్రాల వడ్డాణాలూ అలంకరించుకుని మురిసిపోతున్నట్టుండే దీపకాంతుల బెంగుళూరిణి అందం ఇప్పటికీ కళ్ళ ముందు మెదిలి మురిపిస్తుంది.  

    బెంగుళూరుని ఇంతగా గుర్తు తెచ్చే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. నాకిష్టమైన ఈ పాటని మళ్ళీమళ్ళీ తలుచుకోవడానికి వీలుగా ఈ రోజుకి ఇలా కవల-పాటల్లో రాసుకున్నా!

     అన్నట్టు ఈ కవల-పాటల్లో తెలుగు పాటలో రొటీనుగా - తెలుగుని రోట్లో వేసి రుబ్బి - మీటర్ల కొద్దీ మేటర్ రాసినట్టు - ఎప్పట్లాగే అవే మాటలు - మందారాలు, శ్రీకారాలు, శృంగారాలు - గట్రాలు, ఎట్సెట్రాలు.  

     కన్నడ పాటలో మాత్రం కొన్ని మాటలు ఎంత బావున్నాయో! అందులో ఒకటి "ఎందెందు అళిసద రంగోలి" - అంటే అర్థం "ఎప్పటికీ చెరగని ముగ్గు". 

    ఇంకో  సొగసైన మాట "హొంగణసను".  ఈ మాటకి అర్థం "బంగారపు కలను" (హొన్ను + కణసను). ఈ సంధి ఏంటో తెలుసుకోవాలి :) 

కన్నడ పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=Dajcwrykmf8




లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ...
లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ....

ఉహు...హూహుహుహూ...అహ...హాహహహా...
లలలా..లలలల ...లాలా....


నగువ నయన... మధుర మౌన... 
మిడివ హృదయ ఇరె మాతేకె?
హొస భాషెయిదు - రస కావ్యవిదు
ఇద హాడలు కవి బేకె?

నగువ నయన... మధుర మౌన...
మిడివ హృదయ ఇరె మాతేకె?

నింగాగి హేళువె కథె నూరను
నానిందు నగిసువె ఈ నిన్నను
ఇరుళల్లి కాణువె కిరునగెయను
కణ్ణల్లి హుచ్చెద్ద హొంగణసను
జొతెయాగి నడెవె నా మళెయలు
బిడదంతె హిడివె ఈ కైయ్యను
గెళెయ! జొతెగె - హారీ - బరువె...
బాణ ఎల్లె దాటి నలివె... 

నగువ నయన... మధుర మౌన... 
మిడివ హృదయ ఇరె మాతేకె?

ఈ రాత్రి హాడో పిసుమాతలె
నా కండె  ఇనిదాద సవి రాగవ
నీనల్లి... నానిల్లి... ఏకాంతవె
నా కండె నమ్మదె హొస లోకవ
ఈ స్నేహ తందిదె ఎదెయల్లి
ఎందెందు అళిసద రంగోలి
ఆసే ... హూవా...  హాసీ...  కాదే...
నడె నీ - కణసా...  హొసకీ బిడదే... 

నగువ నయన... మధుర మౌన...
మిడివ హృదయ ఇరె మాతేకె?
హొస భాషెయిదు - రస కావ్యవిదు
ఇద హాడలు కవి బేకె?

లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ...
లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ....

తెలుగులో "కనులు, కనులు -కలిసే సమయం":


    ఇదే పాట తెలుగులో కూడా ఉంది - కానీ తెలుగులో జానకి బదులు చిత్ర పాడినట్టు అనిపించింది. తెలుగు పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=skxfOtR9XOE


లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ...
లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ....

ఉహు...హూహుహుహూ...అహ...హాహహహా...
లలలా..లలలల ...లాలా....

కనులు... కనులు... కలిసే సమయం 
మనసు... మనసు... చేసే స్నేహం
నీ చేరువలో - నీ చేతలలో
వినిపించెను శ్రీ రాగం

కనులు... కనులు... కలిసే సమయం
మనసు... మనసు... చేసే స్నేహం

నీ నవ్వులో విరిసె మందారము
నీ చూపులో కురిసె శృంగారము
నీ మాటలో ఉంది మమకారము
నా ప్రేమకే నీవు శ్రీకారము
పరువాలు పలికేను సంగీతము
నయనాలు పాడేను నవగీతము
నేనే నీకూ కానా ప్రాణం?!
నీవే నాకు కావా లోకం?!

కనులు... కనులు... కలిసే సమయం
మనసు... మనసు... చేసే స్నేహం

నీ గుండె గుడిలో కొలువుండనీ
నీ వెంట నీడల్లె నను సాగనీ
నీ పూల ఒడిలో నను చేరనీ
నీ నుదుట సిందూరమై నిలవనీ
చెవిలోన గుసగుసలు వినిపించనీ
ఎదలోన మధురిమలు పండించనీ
నీలో నేనే కరగాలట
రోజూ స్వర్గం చూడాలంట!


కనులు... కనులు... కలిసే సమయం
మనసు... మనసు... చేసే స్నేహం
నీ చేరువలో - నీ చేతలలో
వినిపించెను శ్రీ రాగం

లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ...
లలల్లా ...లలల్లా ..లలల్లా ..లలల్లా ....

*******
*******

అప్పుడెప్పుడో లేతమనసులు సినిమాలో ఓ పాటలో ఆరుద్ర రాసిన ఓ వాక్యముంటుంది "మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే" అని. 

అది బావుంటుంది. 

కానీ నాకు మాత్రం దాన్ని ""మాట కలుపుకున్న మౌనమే చెలిమి అగునులే" అని పాడుకోవడం poetic గా అనిపిస్తుంది. అలాగే పాడుకుంటూ ఉంటా కూడా. 

అలాగే నాకిష్టమైన జ్ఞాపకాల పాటల్ని ఎప్పటికప్పుడు తలుచుకుంటూ నా మాటల్లో - నా పాటగా "పాట నిలుపుకున్న జ్ఞాపకం పదిలమౌనులే" అని కూడా పాడుకుంటా.

అలా పాడుకుంటూ ... 

~ పాటల భైరవి 

15, అక్టోబర్ 2016, శనివారం

బెందకాళూరుకి - బెంగతో ...

ప్రియ సంగాతి బెందకాళూరుకి,

ఇక్కడ నేను క్షేమం. నీవక్కడ కుశలమా?

ఎన్నేళ్లయింది నిన్ను వదిలి - నిన్ను నిన్నుగా చూసి? అప్పుడప్పుడు నిన్ను అటూ ఇటూ వస్తూ వెళ్తూ చూసినా - ఏదీ నీతో కూర్చుని పట్టుమని పది నిముషాలైనా కుదురుగా గడపడం కుదరలేదు కదా - అనేదే నా బెంగ :(

అసలెక్కడ మొదలయిందంటే నీతో నా స్నేహం - నీకు గుర్తుందా?  - నేను చిన్నప్పుడు మూడవ తరగతి చదివేటప్పుడు నాన్న టొబాకో సీజన్ కని  హస్సన్ వచ్చేవారు కదా? అలా వెళ్లి మళ్లీ గణపవరం తిరిగి వచ్చినప్పుడు ఎన్ని కబుర్లు తెచ్చేవారంటే - అవి ఎన్ని సార్లు చెప్పినా ఇంకా ఇంకా వినాలనిపించేది.

అదిగో ... అప్పుడే ... మొదటిసారిగా - పుడుతూనే నేర్చుకున్న అమ్మ పలుకు, చదువులో ఒంటబడుతున్న ఇంగ్లిష్ చెలువు - కాక కమ్మనైన కన్నడ కస్తూరి తావి తగిలింది - నాన్న - ఆయన నేర్చుకొచ్చి - ಒಂದು, ಎರಡು, ಮೂರು, ನಾಲುಕ್ಕು, ಐದು, ಆರು, ಏಳು, ಎಂಟು, ಒಂಬತ್ತು, ಹತ್ತು - అంటూ నేర్పిన అంకెలలో అంచెలంచెలుగా పెరుగుతూ.

అప్పుడే ఒక తమాషా విషయం కూడా చెప్పారు - ఒకసారి నాన్న, ఇంకా ఆఫీసులో బయ్యర్లు - అంతా కలిసి ఏమీ తోచట్లేదు, ఏదైనా సినిమా చూద్దామని - కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన మహావీర మయూర చూద్దామని హస్సన్ లో ఒక సినిమా హాలుకి వెళ్లారట.

ఇంతలో ఒకరికి బాత్రూముకి వెళ్లాల్సిన అవసరపడితే - నాన్న వారికి సహాయం చేయబోయి -  ಹೆಂಗಸರಿಗೆ ಮಾತ್ರ, ಗಂಡಸರಿಗೆ ಮಾತ್ರ - అని రాసివున్న టికెట్ కౌంటర్లని - ಮಾತ್ರ ని ఒక కొమ్ము ఎక్కువ వేసుకుని చదివి - ఎలా పొరపాటు పడ్డారో చెప్తుంటే - కళ్లు పెద్దవి చేసుకుని విని బుగ్గలు నెప్పెట్టేలా నవ్వుకునేవాళ్లం - మేం ముగ్గురం.

అప్పుడు - అలా - మొదలయిన నీ మీద ఇష్టం - ఇంటర్ లో అపర్ణ స్నేహంతో ఇంకా ఎక్కువయింది - మేమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు - ఆంటీ - ಆದಷ್ಟು ಬೇಗ ಬನ್ನಿ - అన్నప్పుడల్లా - ఎప్పటికైనా నీ దగ్గరికి ఒక్కసారైనా చూడడానికి రావాలనిపించేది. అదుగో - అప్పుడే నేను మొట్టమొదటి కన్నడ వాక్యం నేర్చుకుంది - ಮೂಗಲ್ಲಿ ಬೆಟ್ಟು ಇಡುಕೋ ಬಾರದು - అంటూ శిరీషకి చెప్పే ఆర్తి దగ్గర.

ఇంతలో నీ దగ్గర వుండే శ్రీనన్న నా డిగ్రీ సెకండ్ ఇయర్లో నన్ను నీ దగ్గరికి తీసుకెళ్తానంటే బోల్డంత ఆనందంగా - నిజంగానే - గెంతుకుంటూ వచ్చాను. అదిగో ...అప్పుడే ... అలా జరిగింది నీతో మొదటి పరిచయం.

ఆ చలి చలి రోజులు, చినుకుల తడిసిన ఆకుపచ్చటి చెట్ల గొడుగులు, ఎండ వున్నా వెలుగు తప్ప వేడి లేని మధ్యాహ్నాలు - ఎంత నచ్చేశావంటే - ఒక్కసారికి కాదు వందేళ్లు నీతో గడపాలనిపించేలా.

ఇంతలో డిగ్రీ అయిపోయింది  - కొండల నడుమ చదువు మొదలయింది - అక్కడ అనుకోకుండా - నాకు దొరికిన బంగారుకొండకీ చెప్పేశాను - ఎలాగైనా నీ దగ్గరే ఉండాలి ఎప్పటికీ మేమిద్దరం అని.

ఆ తర్వాత  NAL లో  ప్రాజెక్ట్ - అవగానే కళ్యాణ వేడుక - మేమిద్దరం అయ్యాము నీకు చేరిక.

అక్కడక్కడా విన్న, నేర్చుకున్న ఒకటి, రెండు మాటలు తప్ప మరి కన్నడ రాదే? మరెలా? అప్పుడు నాకొక ఐడియా వచ్చింది - రోజూ రేడియోలో కన్నడ పాటలు పెట్టుకుని వినేదాన్ని. అలా అలా - ఫర్వాలేదు - అనిపించేలా నీ భాష నేర్చుకున్నాను.

నీకు గుర్తుండే వుంటుంది - మేమప్పుడు విద్యాపీఠ్ సర్కిల్ లో వుండేవాళ్లం - ముద్దమ్మ, మంజునాథ్ గార్ల ఇంట్లో.  నేను వాళ్ల ఇంటి ఆడపడుచునైనట్టు గారంగా చూసేవాళ్లు. ఆ ఇంటిపైన ఒంటి గదిలో వుండే ఇందిరమ్మ గారు నన్ను ಪುಟ್ಟು ಗೌರಿ అని ఎంతో అభిమానంతో పిలిచేవారు.

ముద్దమ్మ వాళ్ల షాప్ పేరు - ಯಶಸ್ವಿ ಆಟೋಮೊಬೈಲ್ಸ್ & ಹಾರ್ಡ್ ವೇರ್ - ని - ఆటో మొబైల్సో- హార్డో వేరో -అని చదువుకుని తెగ నవ్వుకునేవాళ్లం నేను, బదరి. అదే కాదు ప్రతి షాప్ పేరుని షాపో, స్టోరో అని అన్నిటికీ ఓ-కారమాపాదించే వాళ్లం.

ఆ ఇంటి వెనకాల వుండే హనుమక్క గుర్తుందా? ఆవిడకి ఇద్దరు అబ్బాయిలు - ఇద్దరూ ఆటో నడిపేవాళ్లు - ఆటో నడిపేవాళ్లకి అంతంత పెద్ద ఇళ్లు వుంటాయని నీ దగ్గరికి వచ్చాకే తెలిసింది. ఆ హనుమక్క అంటే ఆ వీధిలో అందరికీ భయం - వాళ్ల అబ్బాయిలు కొంచెం రౌడీయిజం చలాయిస్తారని - మరి అంత  గట్టిగా లేకపోతే అన్ని ఆటోలు మేనేజ్ చేయడం కష్టమేమో కదా?! అందరితో పాటే నేనూ భయపడి ఆవిడ ఎదురుగా వచ్చినా తలా వంచుకునో, కళ్ళు తిప్పుకునో - ఆవిడని చూడనట్టు గబగబా దాటిపోయేదాన్ని - నీకు తెలుసు కదా!

ఒకసారి ఆషాఢమాసంలో - చిన్నప్పట్నుంచీ వస్తున్న అలవాటుగా - ఆదివారం పెట్టుకోవడానికి గోరింటాకు, తినడానికి  ములగాకు దొరకలేదని - నేను అదేదో నా బాధ - ప్రపంచ బాధ అన్న ధోరణిలో తెగ బాధపడిపోవడం ఎప్పుడు విందో గానీ ఆవిడ - ఒక శుక్రవారం సాయంత్రం పూట - దాదాపు ఆకంతా పూతతో సహా దూసేసిందా అనిపించేలా గోరింటాకు, కొమ్మలన్నీ విరుచుకొచ్చిందా అనుకునేలా ములగాకు - ఆపసోపాలు పడుతూ నేనున్న మేడమీదనున్న ఇంట్లోకి తెచ్చిచ్చి - ತೊಗೋ ನಿಂಗೆ ಇದೆಲ್ಲಾ - అన్న సమయాన ఆవిడ ప్రతీ ఏడాది పందిళ్లు వేయించి ఉత్సాహంతో జాతర జరిపించే ಅಣ್ಣಮ್ಮ ತಾಯಿ లాగే కనిపించింది అనుకో! అంతే - ఆ తర్వాత మరింకెప్పుడూ మాట్లాడలేదు కానీ - ఆ వీధిలో నేనటూ, ఇటూ తిరిగే టైంలో - ఆవిడ వాళ్లింటి గోడమీంచి నన్ను చూసేదని నాకు తెలుసని ఆవిడకు తెలుసనుకో :))

అదిగో - అప్పుడేగా -ఆ హనుమక్కజరిపించే అణ్ణమ్మ ఉత్సవంలోనే మొదటి సారి నీపేరు బెంగళూరు కాదు బెందకాళూరు అని తెలిసిన రోజు డిగ్రీలో Einstein's Theory of Relativity ప్రూఫ్ అర్థమయినప్పటంత సంబరమేసేసింది.

కొంచెం నువ్వలా అలవాటయ్యావో లేదో - నిన్నింకా తెలుసుకోవాలనిపించింది - అంతే కాకుండా చదువుకున్న చదువు మర్చిపోతానేమో అని బెంగేసి - పుస్తకాలు దులిపి - చేతికొచ్చిన పట్టా - చెట్టా పట్టి - సెయింట్ మార్క్స్ రోడ్ లోవున్న ఇన్ఫోటెక్ కంపెనీల చుట్టూ తిరిగేదాన్ని - నీకు జ్ఞాపకం వుంది కదూ!

అప్పుడే కదా -"మీకు ఎక్సపీరియన్స్ లేదు కదా ఉద్యోగం ఎలా ఇవ్వనూ?" -  అని ITC లో హెచ్చార్ మేనేజర్ సాగదీసి అడిగితే - "మీరుద్యోగం ఇవ్వనిదే ఎక్సపీరియన్స్ ఎక్కడినుంచి తేనూ?!" -  అని అంతకన్నా ఎక్కువగా రాగం తీసి - విసుక్కుని బయటికి వచ్చేశాను.

అదే ఊపులో NIIT లోకి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ నన్నూ, నేను కట్టుకున్న కంజీవరం పట్టు-కట్టూ చూసి - బెదురుతూనే  ప్రశ్నలడిగిన తర్వాత - "మీ కారెక్కడ పార్క్ చేసి వచ్చారు" - అని ఆ ఇంటర్వ్యూ చేసినతను అడిగితే - "పక్కనే" - అని చెప్పేసి బయటికి వచ్చి తెగ నవ్వుకున్న నేను, నాతో పాటు ఆ చలి ఎండలో తళుక్కుమన్న నువ్వూ - నాకొక తీపి గుర్తే!

అయినా నాకు తెలీకడుగుతాను - నువ్వే చెప్పు - ఎంత చీరంటే ఇష్టమయితే మాత్రం - ఇంటర్వ్యూకి, ఇంటి-వ్యూకి - ఎక్కడికి పడితే అక్కడికి పట్టుచీర కట్టుకెళ్లిన నాలాంటివాళ్లని ఇంకెప్పుడైనా చూశావా?

ఆ ఇంటర్వ్యూ ప్రహసనాల్లోనే ఒకసారి సిటీ బ్యాంకు లో ఏవో సిస్టమ్స్ ఎనలిస్ట్ కి రిటెన్ టెస్ట్ పెడుతున్నారంటే వెళ్లి రాసి వచ్చి - ఆ రిజల్ట్ కోసం ఎదురు బయట నించుని చూస్తుంటేనే కదా - నా సీనియర్ మైథిలి కూడా కనిపించి ఆ పక్కనే రాజాజీ నగర్ లో ఉంటున్నానని చెప్తే - తనకి తెగ సంబరంగా బదరిని చూపించి - రాసిన పరీక్ష గురించి కూడా మర్చిపోయి - మా SPIC-MACAY కబుర్లు చెప్పేసుకున్నాము.

ఇంతలో పక్కనే ఎవరో తెలిసిన మొహంలా, తెలుగు వెలుగులా కనిపిస్తే - పలకరించి -
అతను " నేను  ఏసీ కాలేజ్ లో చదివాను మీరు తెలుసు, నేను మీకు సీనియర్ ని"  అనగానే -
శాపవశాన మర్చిపోయిన పూర్వజన్మ మళ్లీ జ్ఞప్తి కొచ్చినట్లు - "అవునాండీ ! మీరు మా సీనియరా ? భలే ! అవునూ - మీకు - మీ క్లాస్మేట్ శ్యామ్ సుందర్ తెలుసా?" - అనగానే ఏదో చెప్పబోయిన అతన్ని - సుమ్మనిరి - అన్నట్టు చేత్తో ఆపేసి -

"అదే - మీకు గుర్తు రాట్లేదూ?
శ్యామ్ సుందర్ -
ఘర్ కే అందర్
బడా సుందర్
ఘర్ కే బాహర్
బడా బందర్ -
అని పాడి నవ్వుకునేవాళ్లం -
అతనూ - అతనండీ - అతనే - మీకు గుర్తు లేడూ ??!"

- అని నేను తెగ ఉత్సాహంతో రెట్టించి అడిగేటప్పటికి -

అతను - చిన్న గొంతుతో "నేనేనండీ - ఆ శ్యామ్ సుందర్ ని " అనగానే
అది కూడా పట్టించుకోకుండా - "ఓహ్ ! అవునా - కాలేజ్ లో మిమ్మల్ని ఎప్పుడూ గుండు - టోపీ తో చూసినట్టు గుర్తు - ఇప్పుడందుకే గుర్తుపట్టలేకపోయాను - సారీ - ఏమనుకోకండి" - అని వచ్చేసిన నా తెలిసీ-తెలియని ఆకతాయితనాన్ని  చూసి - పెళ్లి అయినా పెద్దరికం రాలేదని నువ్వు అలిగి ఎర్రటి ఎండ కన్నుతో చూడడం నాకు గుర్తే సుమీ ;)

మరీ బావుంది - చదువయ్యి, యూనివర్సిటీ గేట్ దాటి - పట్టుమని ఆరునెలలు కూడా కాలేదు - అప్పుడే పెద్దవాళ్లయిపోతారేంటి - ఎంత పెళ్ళయితే మాత్రం - మరీను!

 అద్సరే - నాకు అల్సూర్ లోవున్న లిడో థియేటర్ ఎంతో ఇష్టం కదా. అక్కడే కదా - మొదటిసారి  కభీ-కభీ,  ఆఖరిసారి కహూనా ప్యార్ హై - చూసింది ! మొన్ననే ఆ లిడో పేరు వెనకాల వున్న  ఒక తమాషా కథ తెలిసింది - అపర్ణ వాళ్ల తాతగారు లింగణ్ణ గారు, వారి స్నేహితులు దొడ్డణ్ణ గారు కలిసి ఆ థియేటర్ లీజ్ కి తీసుకుని సినిమాలు వేసేవారట. వాళ్లిద్దరి పేర్లలో మొదటి అక్షరాలు తీసుకుని లిడో అని పేరు పెట్టారట - ఇది వాళ్ల అజ్జి చెప్పేవారట.

అవీ - విశేషాలు - ఇప్పటికింతే మరి.

చెప్పటం మర్చిపోయాను - మొన్నా మధ్య నీ దగ్గరికి వచ్చినప్పుడు - MG రోడ్ చూస్తే చాలా దిగులుగా అనిపించింది - ఈ కొస నుంచి ఆ కొస దాకా - దీపాల వడ్డాణం పెట్టుకుని కళకళలాడుతూ వుండే తను - దుమ్ములో, ధూళిలో మునిగిపోయి - బిక్కుబిక్కుమంటూ వుంటే - నేను పక్కనుంచి వెళ్తూ కూడా అస్సలు గుర్తుపట్టలేదంటే నమ్ము!

అదే టైం లో విజయనగర్ చూస్తే - ప్రాణం లేచి వచ్చింది - తను నేను మొదట చూసినప్పటిలాగే లాగే - పచ్చగా విచ్చిన పూవులా వుంది - కళ్ల నిండా కలలా నింపుకుని వచ్చాను.

ఎప్పుడూ అక్కడే వుండే నీకు తెలీదని కాదు - కానీ కొంచెం జాగ్రత్త - నీ ఉనికే మారిపోయేలా వుంది. 

నీతో వున్న అన్ని రోజులూ హాయిగా గడిచిపోయాయి అనుకో - ఎంత హాయి అంటే మాటల్లో చెప్పలేను - పాట లో మాత్రం చెప్పగలను - ಇದೇ ನಾಡು ಇದೇ ಬಾಷೆ ನನ್ನದಾಗಿರಲಿ - ಎಲ್ಲೇ ಇರಲಿ ಹೇಗೇ ಇರಲಿ ಕನ್ನಡವೇ ನನ್ನ ಉಸಿರಲ್ಲಿ ... 

మొదటిసారిగా అడుగుపెట్టిన విజయనగర్ 
చదువు గట్టెక్కించిన మారతహళ్ళి 
వెన్నెల్లో చూసిన విధాన సౌధ 
ఎర్రగా మెరిసే హై కోర్ట్ 
సాంస్కృతిక కేంద్రం బెంగళూరు పాలస్ 
నడిచి తిరిగిన NR కాలనీ 
పువ్వులతో నవ్విన లాల్బాగ్ 
నందిని వున్న నటికలప్ప సర్కిల్  
మురిపించిన మెజెస్టిక్ 
మెరిసిపోయే మహాత్మా గాంధీ రోడ్ 
కాల్మోపనివ్వని చిక్ పేట, బళె పేట 
కన్ను తిప్పనివ్వని కమర్షియల్ స్ట్రీట్ 
కళా నైపుణ్యపు కావేరి 
కలల లోకపు బ్రిగేడ్స్ ... 
ఇంకా శివాజీ నగర్, KR మార్కెట్ 
ఒకటా రెండా - ఎన్నో - ఎన్నెన్నో గుర్తులు నీతో నాకు 
ఇప్పటికి నువ్వలా లేవు కానీ 
అప్పటి నీ జ్ఞాపకాల్లోనే - ఎప్పటికీ నేను 

అసలెప్పటికీ నిన్ను వదిలి వెళ్దాము అన్న ఆలోచనే వుండేది కాదు మాకు - కానీ  - సర్లే -ఇంత  దూరం వచ్చేశాక బెంగ పడద్దూ అని చెప్పి ఓదార్చడానికి - ఇంకా నీవంటూ జ్ఞాపకాలు మాతోనే వున్నాయి -  కాబట్టే బెంగళూరు వయ్యావు. 

ఇప్పటికీ ఎక్కడ కన్నడ మాట విన్నా కమ్మటి నీ తలపే...

అప్పటి రోజుల్ని అందంగా గుర్తు చేసే ఈ పాటతో నిన్నుతలుచుకుంటూ: భలే భలే చందద చెందుళ్ళి హెణ్ణు నీను - మించు కూడ నాచువ మించిన బళ్ళి నీను 





నీ మీద బెంగతో,
నిన్ను వదిలి వచ్చిన నేను


9, నవంబర్ 2011, బుధవారం

నా "నీకో-పాఖ్యానం"



 మేము బెంగళూరులో ఉండేటప్పుడు 
నేను నీకో సోప్ వాడేదాన్ని- ఎందుకంటే నాకు తిరుపతి హాస్టల్ నీళ్ళకి ఏదో స్కిన్ ఎలర్జీ వచ్చింది. దాంతో పరుచూరి రాజారామ్ అనే స్కిన్ స్పెషలిస్ట్ (ఈయన గుంటూరు లో వుండేవారు - కథలు కూడా వ్రాసేవారు) మెడికేటెడ్  సోప్ అయిన "నీకో" వాడమని చెప్పారు. 

నా MCA వైవా, ప్రాజెక్ట్ సబ్మిషన్ కాగానే  పెళ్ళయింది. అప్పుడు నాకు (అప్పటికి, ఇప్పటికీ కూడా) ఇష్టమైన బెంగళూరుగె  హోగిదివి ;)

పెళ్ళయిన తర్వాత మొదటి సారిగా బదరి, నేను ఇంట్లోకి కావలసినవి కొందామని ఒక పే...ద్ద లిస్టు వ్రాసుకుని ఇంటి దగ్గర విద్యాపీఠ్ సర్కిల్ లో వున్న ఫాన్సీ / మెడికల్ షాప్ కి వెళ్ళాము. 
అక్కడ లిస్టు లో వున్నవి అన్నీ తీసుకున్న తర్వాత బదరి అడిగారు ఇంకేమైనా కావాలా అని. 
నాకు వెంటనే నా స్పెషల్ సోప్ లిస్టు లో వ్రాయడం మరిచిపోయానని  గుర్తు వచ్చింది. వెంటనే నేను హడావిడిగా "నీకో!" అన్నాను. 
బదరి అది వినగానే "నాకు సరే, నీకేం కావాలో చెప్పు" అన్నారు. నేను మళ్ళీ "నీకో!" అన్నాను. 
పాపం! బదరి మళ్ళీ సాధ్యమయినంత ప్రశాంతంగా " బుజ్జాయి! నీకు కావలసినది ఏంటో చెప్పు, నా సంగతి తర్వాత " అన్నారు. 
మళ్ళీ నేను అదే "నీకో!" పాటే పాడాను.
పాపం షాప్ అతను మా ఇద్దరికేసి టెన్నిస్ మాచ్ చూస్తున్నట్టు ఎవరు మాట్లాడితే వాళ్ళవేపు తిరుగుతూ చూస్తూ అలిసిపోయి తల పట్టుకుని ఈ బేరం తెగేది కాదన్నట్టు చూస్తూ నించున్నాడు. 
అంతే ప్రశాంత-బదరి కాస్తా అశాంత-బదరి అయిపోయి "బుజ్జాయి! నీకేం కావాలో చెప్పు- సరేనా?" అన్నారు- ఖోపం గా!
నేనూ ఇంకా ఖోపంగా "నీకో అని చెప్పానా? నాకు "నీకో" సోప్ కావాలి అన్నాను....
అంతే ఆ షాప్ అతను ఇంకాసేపు వుంటే నేను ఇంకేం తంటా తెస్తానో అని భయపడి పోయి గబగబా సోప్ ఒక బాగ్ లో వేసి, బిల్ బదరి చేతిలో పెట్టేశాడు.
నేను ఏమీ ఎరగనట్టు, అసలేమీ జరగనట్టు నా నీకో సోప్ వున్న బాగ్ ఊపుకుంటూ, బదరికి జరిగిన దాన్ని గుర్తు చేసుకుని ఇంకేదో అనే ఛాన్స్ ఇవ్వకుండా రకరకాల కబుర్లతో కన్ఫ్యూస్ చేసేస్తూ గెంతుకుంటూ తనతో పాటు ఇంటికి వచ్చేశాను.
అదండీ నా "నీకో-పాఖ్యానం" :)

మరిన్ని కబుర్లతో మళ్ళీ మళ్ళీ ఇలాగే విసిగిస్తానని హామీ ఇస్తూ... ;)