31, మార్చి 2011, గురువారం

కిరణ్ - బుల్లిచీమ కథ

(ఇది కిరణ్ కోసం వాడే హీరోగా అల్లిన కథ....)


అనగనగా బాల్విన్ అనే వూళ్ళో అమ్మ, నాన్నగారు, అన్న, కిరణ్ వుంటారు. ఒకరోజు నాన్నగారు ఆఫీసుకి వెళ్ళారు. అన్న స్కూల్ కి వెళ్ళాడు. ఇంట్లో అమ్మ, కిరణ్ వున్నారు.


అమ్మ, కిరణ్ ఇంట్లో వుంటే ఏం చేస్తారు? వాక్యూం చేస్తారు. 


(కిరణ్ కి చిన్నప్పుడు వాక్యూం క్లీనర్ అంటే చాలా ఇష్టం. ఎవరి ఇంటికి వెళ్ళినా వాడి చేత అల్లరి చేయకుండా ఆమ్ తినిపించాలంటే వాళ్ళింట్లో నేను వాక్యూం చేస్తే చాలు - వాళ్ళ ఇల్లు శుభ్రం - బుజ్జి కిరణ్ ప్లేటు శుభ్రం :) )


అలా అమ్మ, కిరణ్ వాక్యూం చేసాక బోల్డంత డస్ట్  వస్తుంది కదా - వాక్యూం క్లీనర్లో మరి - అందుకని అమ్మ ఆ డస్ట్ అంతా ఒక ట్రాష్ బాగ్లో వేసి గరాజ్ లో ట్రాష్ కేన్ లో పడేయడానికి వెళ్తుంది. వెళ్తూ కిరణ్ కి - కిరణ్ నాన్నా! నువ్వు ఫ్రిజ్ దగ్గర కూర్చుని "Q says ka" ఆడుకుంటూ ఉండూ అని చెప్పి వెళ్తుంది. (ఫ్రిజ్ మీద Leap-Frog వాళ్ళ English Alphabet sounds నేర్పే  గేమ్  వుంటుంది మరి.)


బుజ్జి కిరణ్ అమ్మ చెప్పినట్టే ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో అటు ఒక బుల్లి చీమ టుయ్-టుయ్ అని బుజ్జి కిరణ్ దగ్గరికి వస్తుంది. దాన్ని చూసి కిరణ్ "హాయ్" చెబ్దామని చేయి ఎత్తుతాడు. అది చూసి ఆ బుల్లి చీమ కిరణ్ కొడ్తాడేమో అని భయపడి "వూవూ...వూవూ" అని ఏడుస్తుంది. అది విని బుల్లి చీమకి అమ్మచీమ వుంటుంది కదా! - ఆ అమ్మచీమ పరిగెత్తుకుంటూ వచ్చేసి కిరణ్ బుగ్గమీద ఎక్కేసి కుట్టేసింది. పాపం! బుజ్జికిరణ్ కి ఆయి అయ్యి (నొప్పి వచ్చి) "అమ్మా ఆ... ఆ...ఆ... ఆ..." అని గాఠిగా ఏడ్చాడు. 


మరి కిరణ్ వాళ్ళ అమ్మ గరాజ్ లో వుంది కదా- కిరణ్ ఏడుపు విని - ఏమయిందబ్బా మా బుజ్జి కిరణ్ కీ - అనుకుంటూ ప్పరిగేత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది. వచ్చి "ఏమైంది కిరణ్ నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగింది. అప్పుడు కిరణ్ - మామా! నన్ను చీమ కుట్టిందీ..ఈ ఈ - అని ఏడుస్తూ చెప్పాడు. అది విని అమ్మ అమ్మచీమని - హన్నా అమ్మచీమా! మా కిరణ్ ని ఎందుకు కుట్టావు? అని అడిగింది. 


అప్పుడు అమ్మచీమ - మరి మా బుల్లి చీమని కొట్టాడు కదా అందుకని - అని చెప్పింది. వెంటనే అమ్మ కిరణ్ ని అడిగింది - ఏమ్మా కిరణ్! బుల్లి చీమని కొట్టావా? తప్పు కదూ - అని. కిరణ్ అమ్మ అలా అనగానే - లేదమ్మా...నేను బుల్లి చీమ ని కొట్టలేదు. హాయ్ చెబ్దామని చెయ్యి ఊపాను. అది ఎందుకో ఏడ్చింది - అని చెప్పాడు. అది వినగానే అమ్మచీమ తన బుల్లి చీమని నిజమేనా అని అడిగింది. బుల్లిచీమ మెల్లగా అవునని తలూపింది. అప్పుడు అమ్మ బుల్లిచీమకి sorry చెప్పింది - మరి కిరణ్ కి భయపడింది కదా - మనం ఎవరినీ fun కి కూడా భయపెట్టకూడదు  కదా - అందుకని. కిరణ్ కూడా బుల్లిచీమకి, అమ్మచీమకి "చావీ" చెప్పాడు.


వెంటనే అమ్మచీమ కిరణ్ దగ్గరికి వచ్చి "చావీ! Big Hug!!!" అంది. (చావీ = Sorry in Kiran :) - when telling Kiran stories, I usually speak Kiran ;))


అప్పుడు అమ్మ-బుల్లిచీమ, కిరణ్-బుల్లిచీమ, అమ్మ-పెద్దచీమ - అన్నీ చావీలు చెప్పుకుని Big Hugs ఇచ్చుకుని హాప్పీగా ఆడుకున్నాయి.

29, మార్చి 2011, మంగళవారం

పాము - బుస్ కథ

( ఈ కథ చిన్నప్పుడు అనాతవరంలో మా నాన్నమ్మ ప్రతీ సాయంత్రం చెప్పే కథల్లో నాకు బాగా నచ్చిన కథ.)


అనగనగా ఒక ఊళ్ళో ఒక పాము వుండేది. ఆ పాము తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కరుస్తూ వుండేది. దాంతో భయపడి ఊళ్లోవాళ్ళు ఎవ్వరూ పాముతో స్నేహం చేసేవారు కాదు. అందరూ కలిసి మెలిసి వుండడం, తనతో మాట్లాడకపోవడం చూసి పాముకి దిగులు వేసింది- తనకి స్నేహితులు ఎవరూ లేరని. 


ఇలా వుండగా ఆవూరికి ఒక సాధువు వచ్చారు. అందరితోనూ మాట్లాడి, పాము ఎవరితోనూ కలవకపోవడం చూసి పాము వున్న పుట్ట దగ్గరికి  వచ్చి ఇలా అడిగారు - పామూ, పామూ! నువ్వెందుకు అలా దూరంగా ఎవరితోనూ మాట్లాడకుండా వున్నావు? అని.


అప్పుడు పాము - స్వామీ! నేను ఇంతకు ముందు ఈవూరివారిని కరుస్తూ వుండేదాన్ని. అందుకని భయం వేసి నా దగ్గరికి రావడం మానేసారు - అని చెప్పింది.


సాధువు: పామూ! నువ్వు నిజం చెప్పినందుకు చాలా సంతోషం. మరి నువ్వు అలా ఎందుకు అందరినీ కరిచావు?


పాము: స్వామీ! మనుషులెవరైనా నా వద్దకి వస్తే వారు నన్నేమైనా చేస్తారేమో అన్న భయంతో అలా చేసాను. కానీ నన్ను చూడగానే వాళ్ళందరూ అలా దూరంగా పారిపోతుంటే నాకిప్పుడు చాలా బాధగా వుంది - నాతో ఇంకెప్పుడూ స్నేహం చేయరని.


సాధువు పాముతో - అలా అయితే నేను చెప్పినట్టు చేయి. ఇప్పటినుంచి ఎవరు నీదగ్గరగా వచ్చినా ఏమీ చేయకు. వూరికే చూస్తూ వుండిపో. నువ్వేమీ చేయకపోవడం చూసి అందరూ తొందరలోనే నీ స్నేహితులవుతారు - అని చెప్పి మళ్ళీ నెల తర్వాత వస్తానని పాము దగ్గర శలవు తీసుకుని ఆవూరి నుంచి వెళ్ళిపోయారు.


ఆరోజునుంచి పాము సాధువుకిచ్చిన మాట ప్రకారం అందరినీ కరవడం మానేసింది. తన పుట్ట దగ్గరికి ఎవరైనా వస్తే పైకి వచ్చి వాళ్ళతో మాట కలపబోయేది. కానీ పాము సాధువు మాట విని మంచిగా మారిపోయింది అని తెలియని ఊరివారు పాము తాము రాగానే బయటికి రావడం చూసి ఎక్కడ తమకూ, తమ పిల్లలకూ హాని చేస్తుందో అనుకుని రాళ్ళతో కొట్టడం మొదలు పెట్టారు. పాము సాధువుకి ఇచ్చిన మాట ప్రకారం మనుష్యులని కరవకూడదు కాబట్టి తనని తను రక్షించుకోవడం కోసం పుట్టలోపలికి వెళ్లి దాక్కుంది. ఊరివారు బయటికి వస్తారు అన్న భయంతో లోపలే ఉండిపోయింది. దాంతో సరైన ఆహారం దొరక్క బక్కచిక్కి పోయింది. 


అన్నమాట ప్రకారం నెల తర్వాత సాధువు పాముని చూడడానికి పుట్ట దగ్గరికి వచ్చారు. వచ్చి- పామూ, పామూ! బయటికి రా. నువ్వు ఎలా వున్నావో చూసి, ఈ నెలలో ఎందరు స్నేహితులని సంపాదించుకున్నావో నువ్వు చెప్తే వినాలని వచ్చాను - అన్నారు.


సాధువు గొంతు విని పాము నీరసంగా పుట్టపైకి వచ్చింది. చిక్కిపోయిన పాముని చూసి సాధువు ఆశ్చర్యపోయి - అదేంటి పామూ! ఇలా వున్నావేంటి? ఏం జరిగింది? - అని అడిగారు.


అప్పుడు పాము చాలా బలహీనమైన గొంతుతో - ఏం చెప్పమంటారు స్వామీ? నేను మీరు చెప్పినట్టే కరవడం మానేసాను. నా పుట్ట దగ్గరకి వచ్చిన వాళ్ళతో స్నేహం చేద్దామని పైకి వస్తే నన్ను రాళ్ళతో కొట్టారు. అందుకే ఆహారానికి వెళ్ళడానికి కూడా భయపడి నా పుట్టలోనే ఉండిపోయాను - అని చెప్పింది.


సాధువు కొంచెం సేపు ఆలోచించి  - అయ్యో పాము! ఎంత పని జరిగింది. నిన్ను కరవవద్దన్నాను కానీ బుస కొట్టద్దన్నానా? ఈసారి నుంచి ఎవరైనా నీ దగ్గరికి వస్తే కరవకుండా, అలా అని వూరికే ఉండకుండా ఒక్కసారి "బుస్" అను. ముందు కొన్ని రోజులు భయపడ్డా , నువ్వు "బుస్" అనడం తప్ప కరవవని అర్థం చేసుకుని తొందరలోనే మీఊరివారు నీ స్నేహితులవుతారు - అన్నారు.


పాము సాధువుకి ధన్యవాదాలు చెప్పి ఆరోజు నుంచి ఎవరైనా పుట్ట దగ్గరికి వస్తే ఒకసారి "బుస్" అని తర్వాత ఊరుకోవడం మొదలుపెట్టింది. ఊరివారు పాము ఏమీ చేయదని తొందరలోనే గ్రహించి తాము పుట్ట దగ్గరికి వచ్చేటప్పుడు పాలు, కోడిగ్రుడ్లు పాముకి ఫలహారంగా తెచ్చి ఇచ్చేవారు. 


ఆవిధంగా వూరివారిని మంచి చేసుకున్న పాము హాయిగా వారితో కలిసిమెలిసి వుంది.









28, మార్చి 2011, సోమవారం

మాయాక్షరాలు



నమస్తే!
మార్చ్  నెల వనితా మాలిక (అంతర్జాల పత్రిక) లో నా మాయాక్షరాలు వ్యాసం ప్రచురింపబడింది :) 
~లలిత


                    మాయాక్షరాలు 

మాయాక్షరాలు  అంటే మాయ చేసే అక్షరాలో, మంత్రాలలో ఉండేవో కాదు. మన తెలుగు భాషలోంచి నిశ్శబ్దంగా మాయమైపోతున్న అక్షరాలు.

తెలుగులో మూడు వుండే "చ" కారాలు, "జ" కారాలు రెండు అయ్యాయి. ఫలితంగా చందమామ తెలుగువారికి హిందీత్వం (చందా) కలుపుకుని వినిపిస్తున్నాడు. జల్లెడ తన అసలు పేరు మరిచిపోయింది. ణ, ళ తమ ఉనికిని వెతుక్కుంటున్నాయి . ఏ అక్షరం మారినా అంతగా బాధ పడని తెలుగు భాష "ళ"కారం దూరమైతే తన కళని, తళతళల్ని, పరిమళాన్ని కోల్పోయి ఉసూరుమంటుంది.

ఇవాళ నేను నా ళ-పురాణం లోని కొన్ని సరదా "కథకళుల్ని" మీతో పంచుకోవాలనుకుంటున్నాను :)

1. మల్లి అనబడే మల్లికార్జున రావుకి ఒక ళ-పలకని-స్నేహితుడి మాటలు ఇవి:

మల్లీ! నీ పెల్లికి మల్లీ మీ ఊరు రావాలంటే మా బాస్ ని శలవు అడగాలి. ఆయనేమో మల్లీ నేను శలవడిగితే  కల్లు ఎర్రజేసి కల్లు తాగిన కోతిలా అరుస్తాడు.

మనబడికి వెళ్ళే ఉత్తర అమెరికా తెలుగు విద్యార్థులు ఇది చదివారంటే "మల్లీ, కల్లు" అర్థాల  మధ్య తికమక పడి బాబోయి తెలుగు వద్దు అనే ప్రమాదం కూడా వుంది.

2. మన తెలుగు దర్శకులు రాఘవేంద్ర రావు గారి "త్రిశూలం" అనే సినిమాలో ఒక అందమైన పెళ్లి పాట ఇలా వింటున్నామని ఊహించండి:

పెల్లంటే పందిల్లు సందల్లు తప్పెట్లు 
తాలాలు తలంబ్రాలు....
మూడే ముల్లు ఏడే అడుగులు
మొత్తం కలిసి నూరేల్లు...
........................
చెలిమికి సంకెల్లు వెయ్యేల్లు....

ఏంటో ఏదో అర్థం అయీ అవనట్లుగా వుంది కదూ.....

ఆ పాటనే ఇలా వింటున్నామని అనుకోండి:



పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు 
తాళాలు తలంబ్రాలు....
మూడే ముళ్ళు ఏడే అడుగులు
మొత్తం కలిసి నూరేళ్ళు...
........................
చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు....


ఆ పాడే పెదవులతో అందమైన పాటని అల్లుతున్నట్లు అనిపిస్తోంది కదా :)

ఇంకా ముచ్చటగా మూడో ఉదాహరణ:

౩. ఈ మధ్య మన ఎఫ్ ఎం రేడియోలో పదహారణాల తెలుగు ఆడపడుచులు ఎలా మాట్లాడుతున్నారో చూద్దామా ;) (ఈ ఎఫ్ ఎం ఆడపడుచుల గురించి త్వరలోనే ఇంకో బ్లాగ్ విడుదల చేస్తాను. ఇక్కడ మాత్రం మన "ళ" ఎలా "ల" అవుతోందో చూపించడమే నా ఉద్దేశ్యం.)

Welcome to SO&SO Telugu Radio!!!
 ఇప్పుడు మీ  bubbly బొమ్మాలితో  "పాత  పరిమలాలు " old songs live program.
మన first caller ఎవరో చూద్దామా?
హలో! ఎవరండీ call చేస్తున్నారు? సరల గారా?
How are you, సరల గారు?
ఎక్కడనుంచి call చేస్తున్నారు? శ్రీకాకులమా?
మీకు  ఏ  song కావాలి ? పెల్లి పుస్తకం  లో  title songa?
I too like that song అండీ!
మీకు ఇష్టమైన పెల్లి పుస్తకం  లోని   title సాంగ్ మీ కోసం.
విని enjoy చేయండి.
Bye సరల గారు! మీరిలాగే మల్లీ మల్లీ call చేస్తూ  వుండండి.

ఫై సంభాషణలో తెలుగు ఎంత వుందీ అనేది పక్కన పెడితే  వున్న తెలుగు అసలు ఎంత బావుంది అంటే మొహమాటం లేకుండా 10 కి  2 మార్కులు  కూడా  వేయాలని అనిపించదు కదూ !

ఈ రోజుల్లో కనుక  దేవరకొండ బాల గంగాధర తిలక్ వుండి వుంటే

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు



-----అని కవిత వ్రాయడానికి కొంచెం ఆలోచించేవారేమో.

తెలుగు భాషకే తళతళలద్ది, కళకళలాడేట్లు చేసిన "ళ" లేకపోతే మన తెలుగు పరిమళాలు సౌరభాన్నే కోల్పోతాయి.

శ్రీ ఆది శంకరాచార్య వ్రాసిన మహిషాసుర మర్దినీ స్తోత్రం లాంటివి పేలవంగా వినిపిస్తాయి (అలాంటి ఒక శ్లోకం ఇక్కడ చదవండి ):

కల మురళీ రవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే...
మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైల నికుంజ గతే...
మృగ గణ భూత మహా శబరీ గణ రింగణ సంభ్రుత కేళి భ్రుతే....
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైల సుతే...

తెలుగు ద్రవిడ భాషల్లో  ప్రాచీనమైనది - ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అనిపించుకున్నది. రామాయణ, భాగవత, భారతాలు, ఎన్నెన్నో ప్రబంధాలు, కావ్యాలు, కవితా సంకలనాలు, కథా సంకలనాలు వున్న చిక్కని చక్కని భాష మన తెలుగు. చేతనైనంతలో మన పిల్లలకి మంచి భాష, ఉచ్ఛారణ నేర్పగలిగితే మన వంతు తెలుగు ఉద్యమం చేసినట్లే.

మీరు ఏమంటారు?

~లలిత



27, మార్చి 2011, ఆదివారం

నేటి ఇరుగు-పొరుగు



అంతర్జాల పత్రిక "విహంగ"లో ప్రచురింపబడిన నా కవితకై ఈ లింక్ మీద క్లిక్ చేయండి :
నేటి ఇరుగు-పొరుగు 


నువ్వూ… నేనూ…

పక్క పక్కనే ఉంటున్నాం

ఇరుగూ-పొరుగూ

అనుకుంటున్నాం


మీ ఇరుగింట్లో మేము

మా పొరిగింట్లో మీరు

ఎవరికి వారం

కలవని ద్వీపాలం


ఉలుకూ లేదు పలుకూ లేదు

పలుకరించే చొరవా లేదు

ఊసూ లేదు బాసా లేదు

మనసు విప్పే ధ్యాసే లేదు


చిరునవ్వు రువ్వితే

మాట కలుస్తుందని జడుస్తాం

పక్కింట్లో పరిచయానికి

పెడమొగమై వెరుస్తాం


నాలుగిళ్ళ లోగిళ్ళ

ఆప్యాయతలు మరిచి

మూసిన తలుపుల చాటు

ఒంటికాయ సొంఠి కొమ్ములయ్యాం


ఖండాంతరాల్లో  స్నేహాలు కలుపుతాం

అంతర్జాలంలో ఆత్మ బంధువులవుతాం

మీ ఇంటి పక్కన  ఎవరుంటారంటే

సిరా చుక్కలేని తెల్ల కాగితాలవుతాం


ఇలా ఎందుకూ

అని నిలదీసి అడిగితే

జీవితపు పరుగుని

అద్దంలో భూతాన్ని చేస్తున్నాం


-లలిత

4, మార్చి 2011, శుక్రవారం

ఆకు

(ఏదో బ్లాగ్ లో "ఆకు" మీద కవితల పోటీ చూసి సరదాగా వ్రాసి పంపినదీ నా "ఆకు" కవిత )

ఆకు...


ముక్కంటి మెచ్చే మారేడాకు
ఆతండ్రి బిడ్డ మెచ్చే వివిధ ఆకు
విష్ణు  ప్రియ తులసి ఆకు 
ప్రాణం  పోసే సంజీవనాకు 
పురుగు నార్పే వేపాకు 
పూలు మెచ్చే మరువపాకు 
ఆకలేస్తే విస్తరాకు
కడుపునింపే కూరలాకు 
నీడకోసం కొబ్బరాకు
పూరికోసం తాటి ఆకు
నోరు పండ తమలపాకు
పండగొస్తే మామిడాకు
ఆషాఢ మాసపు ములగాకు
పెళ్లి మంటపం అరటి ఆకు   
గవద  బిళ్ళకు అవిశ ఆకు
తల నొప్పికి యూకలిప్టసాకు
నీలికురులకు మందారాకు
చేతి ఎరుపుకు గోరింటాకు
ఆశ పెంచే చిగురుటాకు 
నెమ్మదిచ్చే పండుటాకు 
విలువ తెలిసి, నీరు పోసి పెంచితే 
ఆకు, ఆకు పులకరించి 
చేస్తుంది నీ జీవితాన్ని 
వడ్డించిన విస్తరాకు....