పుస్తకాల కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తకాల కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మార్చి 2021, ఆదివారం

అనగనగా ఒక అన్వరుడు... అను ఒక హార్టిస్టు కథ - 2

    ఆఁ ! ఆఁ ! వచ్చేశారా? నేను చెప్పే హార్టిస్టు కబుర్ల కథ వినడానికేగా!?

    ఇంతకుముందు చెప్పినవి ఇప్పటికి  చదవకుండా ఉండి ఉంటే, ఇప్పటికే చదివేసినా ఇంకోసారి చదవాలనుకుంటే - ఓ పాలి అటేపోసారి వెళ్ళిపోచ్చెయ్యండి మరి: అనగనగా ఒక అన్వరుడు... అను ఒక హార్టిస్టు కథ - 1

ఇవాళ తిప్పుతున్న మొట్టమొదటి పేజీ... 

 గుండె జేబులో

    ఒక వైపు పైకి లేచి గోపురంలా ఉన్న ఉంగరాల జుత్తు, చామనఛాయ కన్నా పిసరు తక్కువగా ఉన్న ఒంటిరంగు, కళగల మొహం ఉండి - తన ఫ్రెండ్సుకి దర్జానిచ్చే బట్టలు కుట్టిన ఫ్రెండ్లీ దర్జీ కిషోర్ కథ ఇది. 

    అన్వర్ - అందరు ఫ్రెండ్సువీ, అన్వర్ - అదర్ ఫ్రెండ్సు అందరివీ - బట్టలు కిషోరే కుట్టేవాడట. 

    ఈ పేజీల్లో ఒక వాక్యం గురించి చెప్పాలి. "డిగ్రీ సమయానికి చదువు, సంధ్య వదిలేసి సంగీతం, సాహిత్యం, చిత్రకళ, లావణ్య అని కొన్ని పట్టుకుని హైద్రాబాద్ వచ్చేశా." 

    దీని గురించి బద్రి మాటలు ఏంటంటే ..." బుజ్జాయ్! లావణ్య అంటే అన్వర్ వైఫ్ కదా! ఆ వాక్యమెంత బావుందో కదా! రెండుసార్లు వెనక్కి వెళ్ళి మళ్ళీమళ్ళీ చదువుకున్నా."

    సరే! మళ్ళీ వెనక్కి కిషోర్ కథ దగ్గరికి వెళ్తే అన్వర్ పట్టుకొచ్చిన లావణ్యతో జంటరి గొడ్డు  అయ్యాననిపించుకుంటే, కిషోర్ మాత్రం ఒంటరి గొడ్డు గానే ఉండిపోయాడు. ఇంకా ఎన్నో ఏళ్ళు ఫ్రెండుగా తోడుగా ఉంటాడనుకున్నవాడు - ఒంటిగూడు వదిలి వెళ్ళిపోయి - అన్వర్ గుండెజేబులో ఉండిపోయాడు. 

    ఆ కిషోర్ కబుర్లని అన్వర్ మాటల్లో చదువుతుంటే తట్టిన ఓ పాట... 

నువ్వు వెళ్ళిపోయినా నీ రూపు చెరిగి పోలేదు 
నువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికీ ఇవ్వలేదు... 


సమ్మర్ చిత్రకళ 

    ఈ సమ్మర్ చిత్రకళ చదివడం మొదలు పెట్టీ పెట్టగానే  పెటీల్మని ఓ నవ్వు చిట్లుతుంది పెదవుల మీద. దానికి కారణం అన్వరుక్రోషం. 
 
    "అవునా మీరు ఆర్టిస్టా? వావ్! నా బొమ్మ గీస్తారా?" అని చిత్రకారులని చులాగ్గా అడిగేస్తారు కానీ - దొంగల్ని మాత్రం "మీరు దొంగా? Awesome! ఓ సారి మా ఇంటికి కన్నం వేయరా...ప్లీజ్! ప్లీజ్!" అని అస్సలెవ్వరూ అడగనే అడగరు అన్నదే  అన్వరుక్రోషం.  

    నేను రాసింది చదువుతున్న వారెవరైనా సరే మీ బుజ్జితల్లికో, బుల్లితండ్రికో పెయింటింగ్ పాఠాలు నేర్పిద్దాం అనుకునే ముందు అన్వర్రాత "సమ్మర్ చిత్రకళ" చదవాల్సిందే. 

    ఇది అప్పుడెప్పుడో ఈమాట webzine లో చదివినప్పుడు నేననుకుని, నేనే అన్న మాటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నా... 

    హార్టిస్టు గారూ! చిన్నప్పుడు నాకెంతో ఇష్టమైన సరదా కబుర్ల తెలుగు మాష్టారు చిట్టిబాబుగారు నేర్పిన ఓ పక్షి బొమ్మ ఇప్పటికీ ఆయన నేర్పినట్లే వేస్తాన్నేను. ఆ తర్వాత వృత్తలేఖినితో సున్నా మీద సున్నా – మూడు సున్నాలు చుట్టించీ, అందులో కొన్ని ముక్కలు చెరిపించి “శ్రీ” ని ఆర్టిస్టిక్(?)గా గీ(రా)యడం నేర్పిన డ్రాయింగ్ మాష్టారు నేర్పబోయిన బొమ్మలు మాత్రం పట్టుబడలేదు. మీర్రాసిన ఈ వేసవి పాఠం లాంటిది నాకప్పుడే దొరికుంటే నేనూ వేద్దునేమో ఓ పుంజీడు బొమ్మలు ! ప్చ్!

    మన చుట్టూ ప్రపంచంలో రంగులు నింపిన మహాచిత్రకారుణ్ణి తలుచుకుంటూ  ఓ మంచి పాటని ఈ పేజీకి జత చేస్తున్నా... 

ఏ కౌన్ చిత్రకార్ హై? ఏ కౌన్ చిత్రకార్?!
హరీ భరీ వసుంధరా పే నీలా నీలా ఏ గగన్... 
కే జిస్‌పే బాదలోం కీ పాలకీ ఉడా రహా పవన్!
దిశాయే దేఖో  - రంగ్ భరీ - చమక్ రహీ - ఉమంగ్ భరీ!
ఏ కిస్‌నే ఫూల్ ఫూల్ పే కియా శింగార్ హై?!
ఏ కౌన్ చిత్రకార్ హై? ఏ కౌన్ చిత్రకార్?!

కృష్ణస్మృతి 

    అన్వర్రాతల్లో ఈ పేజీ నాయుని కృష్ణమూర్తి గారి గురించి. 

    తనకి స్నేహం పంచిన చౌడేపల్లి - నాయుని కృష్ణమూర్తిగారి గురించి అన్వర్ రాసుకున్న ఈ పేజీ చదవగానే నాకు వెంటనే గుర్తొచ్చినవి - వరసగా -  హైస్కూల్లో పదవ తరగతిలో నెలనెలా చదువుకున్న పాఠశాల పుస్తకాలు, రామాయణంలో అరుణ్ గోవిల్,  అసలైన వ్యాస భారతాన్ని తెనిగించిన "జయమ్" పుస్తకం, "సుమం ప్రతి సుమం సుమం" పాట. 

    నాయుని కృష్ణమూర్తి గారితో తనకు దక్కిన స్నేహాన్ని తలుచుకుంటూ అన్వర్ రాసిన ఒక వాక్యం "జీవితకాలంలో ఎవరికీ అబ్బని కొన్ని అదృష్టాల్లో ఒక అదృష్టం అబ్బి, దాన్ని కోల్పోయిన దురదృష్టవంతుల కథ ఏవని చెప్పడం." 

    ఇది చదవగానే రామాయణంలో అరుణ్ గోవిల్ గుర్తుకొచ్చాడు. 

    హిందీ రామాయణం చూసే రోజుల్లో గుర్తున్న ఒక సీను, ఆ సీనులో మాటలు - రావణుడెత్తుకుపోయిన సీతా దేవిని తలుచుకుంటూ సుగ్రీవుడితో రాముడిలా అంటాడు... "నహి పానే సే దుస్సహ్, పా కర్ ఖోనా" అంటూ.  ఆ మాటలూ, ఆ సమయంలో రాముడిలా నటించిన అరుణ్ గోవిల్ దుఃఖం నాకెందుకో గుర్తుండిపోయాయి. దాని వెనకాల అసలు మాటలు రామచరితమానస్ రాసిన తులసీదాసువి అయ్యుంటాయి. 

    ఇన్నేళ్ళ తర్వాత అన్వర్రాతలో అచ్చు అదే భావం కనిపించింది. 

   ఆయనే రాసిన పాటని తలుచుకుంటూ - నాయుని కృష్ణమూర్తిగారికి నివాళిగా... ఆ పాటలో నాకు నచ్చిన లైన్లు... 

సుమం... ప్రతి సుమం సుమం..
వనం...  ప్రతి వనం వనం

వేణువా ...  వీణియా ...  ఏవిటి నాదము??

రంగులే రంగులు అంబరాలంతట
రంగులే రంగులు అంబరాలంతట!!

భానూదయాన... చంద్రోదయాలు!!


చందమామ నడక 

    చూసీ చూడగానే ఈ పేజీ శీర్షిక నాకు భలే నచ్చేసింది. 

    మొదటి పేరాలో మొట్టమొదటి గుల్జార్రాత "తుమ్ జో కెహదే తో ఆజ్ కీ రాత్ చాంద్ డూబేగా నహీ! రాత్ కో రోక్ లో..." చదివీ చదవగానే "అన్వర్రాతా! మన్ హో గయీ ఫిదా!" అనిపించేసింది. 

    నిజమబ్బా! ఈ పుస్తకమంతా గుల్మొహర్ పూల గుసగుసల్లా మూగుతున్న గుల్జార్మోహగీతోత్సవమే నాకు. 

    ఆకాశంలో ఉన్న ౘందమామని చూసి "నా వెంటే వస్తున్నాడు, నేనంటే ఇష్టమేమో" అని అనుకున్నాట్ట బుల్లి అన్వరు. 

    ఆ బుల్లి అన్వరుకి అనిపించినదే మా ఇంట్లో బద్రి మా బుజ్జిజింకలకి నేర్పించినది కూడా. 

    మునిమాపువేళ కారులో ఎక్కడికైనా వెళ్తున్నపుడు - వెనక సీట్లో కూర్చున్న బుల్లి బుగ్గల బుజ్జిజింకకి - కారుతో పాటే వస్తున్న ౘందమామని చూపించి "ౘందమామ చూడు నాన్నా ... మనతోనే వస్తున్నాడు" అంటే ఆ బుల్లిబుగ్గల మీద చమక్కుమన్న వెన్నెల ఆ పైనున్న దొంగకలువరేకుల్లోకి పాకి తళుక్కుమనేది. తన కన్నా తెల్లనైన పాలనవ్వు చూసి తెల్లబోయి చిన్నబోయేది. 

    అన్వర్ రాసిన ఇంకో మాట: "మా ఆవిడ కడుపులో ఉన్న శిశువుకు చందమామ అని పేరు పెట్టుకున్నాం." 

    అది నా తొలిచూలు రోజుల్నాడు మాకు అమ్మాయి పుడితే "వెన్నెల" అని పేరు పెడదామన్న బద్రి మాటలని గుర్తుకు తెచ్చింది. 

    ఈ "చందమామ నడక" చందమామతో నడిచిన నడకలతో మొదలుపెట్టి, వడ్డాది పాపయ్య వయ్యారి బొమ్మల చందమామ చదువుల దాకా సాగి - చేత తస్బిన్ (జపమాల) తిప్పుతూ, నోట "లా ఇలాహి ఇల్లాలాహ్" పలుకుతూ - బుల్లి అన్వర్ చేత పాలక మీద "ఓనామః, శీవాయః, సిద్ధంనమః" అని దిద్దించి అన్వరుని ఇంత గొప్ప రాతరి-గీతరిని చేసిన బంగారు జేజమ్మ బీబీ జాన్‌కి జేజేలు! 

నాయనమ్మా! నాయనమ్మా! 
మాయని ప్రేమే నీదమ్మా !
మాయని ప్రేమే నీదమ్మా!


శ్రమయేవ... & జ్ఞాపక రమణీయం 

        కొంటెబొమ్మల బాపు, బుడుగురాతల ముళ్ళపూడి - వీళ్లిద్దరి గురించి ప్రేమగా తలుచుకుంటూ అన్వర్ రాసిన ఈ రెండు పేజీలని విడదీయ బుద్ధవ్వక - ఈ రెంటినీ ఇక్కడ కలిపి తలుచుకుంటున్నాను. 

    నా వరకు నాకు తెలుగులో కార్టూన్ అంటే బాపు, కథలూ-కబుర్లూ అంటే ముళ్ళపూడి. కిలకిల నవ్వించే గీత ఒకరిదైతే, అలవోకగా సాగే రాత ఒకరిది.

    వారిద్దరితో పరిచయమున్న అన్వర్ రాసుకున్న ఆత్మీయజ్ఞాపకాలు అపురూపం. 

******************************
******************************

    పేజీపేజీలో నాకు నచ్చిన దాన్ని తరచి తరచి చదువుకుంటూ - తలచి తలచి మురుసుకుంటూ - మళ్లీమళ్లీ చదువుకుంటున్న పుస్తకం "అనగనగా ఒక చిత్రకారుడు". 

    ఇందులో నేను కావాలని - వద్దనుకుని - చదవని పేజీలు కొన్నున్నాయి. 

సత్యవతి కథలు 

    ఇది చదవలేదు. అసలు కథలు చదివిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి చదువుదామని. 

గ్రీన్ బుక్ 

    "గ్రీన్ బుక్" సినిమా గురించి ఎక్కడో ఓ రెండు లైన్లు ఎప్పుడో చదివాను. నాకు ఇలాంటి సినిమాలంటే భయం, బాధ. కాలక్షేపంగా చూడాలంటే తప్పు చేస్తున్న ఫీలింగ్. అందుకే ఇది చదవలేదు. నాకు నా బబుల్లో నేనుండి చుట్టూ అంతా మహబాగా కాకపోయినా ఎంతోకొంత బానే వుంది అనుకుంటూ ఉండిపోవడం బావుంటుందబ్బా! అంతకు మించి ఏమీ చేయలేనప్పుడు - నా ఇగ్నోరెన్సు, నాకు బ్లిస్సు! 

నల్లమేక పూనాచ్చి 

ఇదీ చదవలేదు. నిరుడు గౌరి గారితో మాట్లాడేటప్పుడు  చెప్పాను - తప్పకుండా చదువుతానని. ఇప్పటిదాకా పుస్తకం కొనడమే పడలేదు. త్వరలోనే కొనుక్కోవాలి. చదవాలి. అప్పుడు వెనక్కి వచ్చి ఈ నల్లమేక పూనాచ్చి సంగతేంటో సూద్దారి! 


******************************
******************************

    ఇక్కడితో నా పేజీమజిలీకబుర్లు ఆపుతూ - అన్వర్ రాసిన - కొన్ని మెచ్చుతునకలు, ఇంకొన్ని మేలుమాటలు ఇక్కడ తలుచుకుంటున్నా... 

    "క్షీరసముద్ర రాజ తనయ కంటే ముందుగా పద్మపత్ర విశాలాక్షి, పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి పుట్టిందని, ఈ సృష్టి నశించినా మళ్ళీ సృష్టి మొదలైతే కరెన్సీ అచ్చు కాక కాల్జేతుల అచ్చులు బొమ్మలుగా జగత్తుని నాగరికత వైపు నడిపిస్తాయని అర్థం చేసుకోండి. " (మహాకళ )

    "వీలయినంత ఖాళీగా  ఎంత బావుంటుంది. ఇల్లు కాని, ఒళ్ళు కాని, మనసు కానీ... నేను ప్రతిసారీ కొత్తగా ఉంటే ఎంత బావుంటుంది? తెలిసిన ప్రతి ఒక్కరినీ తెలీనట్టు కొత్తగా చూస్తుంటే ఎంత బావుంటుంది?" (జీవితానందం)

    "ఈ హైద్రాబాద్లో నాకు పెద్ద పెద్ద విషయాలు రాసే, చర్చించే, తమ తమ కాన్వాస్‌పై రంగులు వంపే మహా గజ ఈతగాళ్ళు పరిచయం అయ్యారు. వీరికి అన్నీ తెలుసు ఒక్క మర్యాద తప్ప. తలిదండ్రులే తొక్కలోనివాళ్ళు అయినపుడు నువ్వూ నేనూ, మన పసుపు అలికిన గడప, ఆ గడప ముందు తులసి చెట్టు ఎంత?" (మర్యాద మన్నన)

    "రవ్వంత ప్రేమ, గోరంత అభిమానానికే ఉబ్బితబ్బిబ్బులవాడి పరంపర వాడిని నేను." (పుట్టిన రోజు జేజేలు)

  
    "నువ్వు ఒకరిని పెట్టే నొప్పి అది తిరిగి నీ పాలిటి భయానక బాధకు ఆరంభం." (గాలితరం)

  "స్నేహం అంటే ఏవిటో తెలుసా? ఈ నా ప్రతీదిలో నువ్వు తోడు ఉంటావని కాదు, నా కష్టాలు మోస్తావనీ కాదు. నాకు సంబంధించిన ప్రతీదిలో నువ్వు గుర్తుకు రావడమే స్నేహం. " (కృష్ణస్మృతి)

******************************
******************************

ఈ "అనగనగా ఒక చిత్రకారుడు"  చదువుతూ బద్రి అన్న ఒక మాట ఇక్కడ చెప్పాల్సిందే... "ఈ అన్వర్ రాసినది చదువుతూ ఉంటే ఎలా ఉందంటే - కాలేజ్‌లో చదివే రోజుల్లో మొట్టమొదటిసారిగా యండమూరి నవలలు - 'ఆనందోబ్రహ్మ', 'ముత్యమంత  ముద్దు' - చదివినప్పుడు అనిపించింది చూడు - especially - 'ముత్యమంత ముద్దు' -  చాలా self -introspective గా ఉంటుంది. మళ్ళీ ఇన్నేళ్ళకు అచ్చు అలాగే అనిపించింది ఈ 'అనగనగా ఒక చిత్రకారుడు' చదువుతుంటే! "

మళ్ళీ బద్రినే వెతుక్కుని మరీ flickr లో అన్వర్ బొమ్మలని చూసి "ఇతను భలే గొప్ప ఆర్టిస్టు" అంటూ అన్వర్గీతలని పదేపదే చూసి మురిసిపోయారు. (www.flickr.com/photos/anwartheartist ). 




 
    నా వరకు నాకు "అనగనగా ఒక చిత్రకారుడు" చదువుతున్నంతసేపు  - నాకు గుర్తొచ్చిన ఒక మహానుభావుడు  - "నేను కాశీ విశ్వనాథుడిని, విశాలాక్షిని  వదలనని, వారు లేని చోట నా షెహనాయ్ పలకద" ని కాశీ లోనే ఉండిపోయిన బిస్మిల్లాఖాన్. 

అందుకే అంటున్నా... 

కుంచెతో  గీసిన అన్వర్గీత చెప్పింది 
అన్వర్ ఒక ఆర్టిస్టు అని 
గుండెతో  రాసిన అన్వర్రాత తెలిపింది 
అన్వర్ ఒక హార్టిస్టు అని 

అన్వర్రాతలో విన్నా 
గుల్మొహర్ పూల గుసగుసంగీతం  
అన్వర్రాతలో విన్నా 
 గుల్జార్మోహగీతం 
అన్వర్రాతలో విన్నా 
కులమతరహిత స్నేహగీతం 
అన్వర్రాతలో విన్నా 
బిస్మిల్లాఖాన్ షెహనాయ్ సంగీతం 


******************************
******************************




6, మార్చి 2021, శనివారం

అనగనగా ఒక అన్వరుడు... అను ఒక హార్టిస్టు కథ - 1

    చిమ్మ చీకటి... చుక్క మిణుకు. 

    కిటికీకి అవతల - అప్పుడప్పుడూ దూది మబ్బు దుప్పటి కప్పుకుంటూ, అప్పుడే పక్కకి తప్పుకుంటూ - తప్పించుకున్న మబ్బులు పూర్తిగా కప్పేయకుండా ఎంత సేపుంటాడో తెలీకుండా - దోబూచులాడుతున్న వెండి జాబిలి. 

    పక్కనే దేశీ-రేడియోలో వినీ వినిపించకుండా - "ఓ బచ్‌పన్ కే దిన్! రులా న దేనా" అని అంటూ లతామంగేష్కరూ, "ఆజ్ హసే, కల్ రులా న దేనా " అని షంషాద్ బేగమూ పాడుకుంటున్న పాట వింటూ బెంగ పడిపోతున్నాను అప్పుడే - ప్రతి రోజూ లాగే!

    పగటి వెలుగులో హడావిడి పడిపోతూ తెగ ఆరాట పడే నా మైండ్ మెల్లగా అలముకునే చీకటితో చల్లబడుతుంది. 

    చిక్కబడుతున్న చీకటి పూట చెప్పుకునే కబుర్లు నాకు బోల్డంత ఇష్టం. 

    నిశ్శబ్దపు రాత్రిని చెదరగొట్టకూడదన్నట్టు తమకు తామే తగ్గి నెమ్మదిగా మోగే గొంతుల మాటలు నాకు మరీ ఇష్టం. 

    పసుప్పచ్చ దీపపు వెలుగులో సోఫాలో ఓ మూలకి ఒదిగి - ముడుచుకుని - నేను దాన్ని కప్పుకుని మూటనయ్యానో, అది నన్ను చుట్టి మూట కట్టిందో - చెప్పలేనంతగా నేనూ, నన్ను చుట్టుముట్టిన బొంతా కలిసి, చలితో దెబ్బలాడేసి, చెల్లాచెదురయ్యేలా తరిమికొట్టేసి - పుస్తకం పట్టుకున్న చెయ్యి ఒక్కటి మాత్రం బయటపెట్టి, కదలకుండా - చదువుకునే పుస్తకంతో - చెప్పే కబుర్లు నాకు మరీ మరీ ఇష్టం. 

    నాగ్గుర్తుండి ఈ మధ్యకాలంలో - చిన్నప్పటి జ్ఞాపకాలతో ఇష్టంగా కొనుక్కున్న Anne of Green Gables సిరీస్, Little House on the Prairie సిరీస్ తప్ప - ఒక్క పుస్తకం కూడా పట్టుమని పది పేజీలు కుదురుగా చదివింది గుర్తులేదు. 

    కానీ ఈ వారం మొదట్లో సోమవారం రోజు ఇండియా నుంచి అమ్మ పంపించిన ఉసిరావకాయతో పాటు వచ్చిన ఒక పసుప్పచ్చటి పుస్తకం - వచ్చినప్పటినుంచీ ఊరిస్తూనే ఉంది. దానికి తోడు - ఆ పుస్తకం చుట్టూ చుట్టిన కవరూ, దాని మీద ఊరి మట్టిలో మొలిచి, చిగురించిన పచ్చనాకు లాంటి ఆకుపచ్చ అచ్చరాలలో రాసి ఉన్న నాన్న పేరు, ఇంటి అడ్రెస్స్ చూస్తూ "భలే! ఎంత అందంగా ప్రింటు చేశారో అడ్రెస్ కూడా" అని మురిపోతున్న నాతో "అదీ... అతను చేత్తో రాసినట్టున్నాడు" అని అంటూనే ఎంతో అపురూపంగా ఆ పుస్తకాన్ని అందుకుని - అప్పుడే చదవడం మొదలెట్టేశారు బద్రీ. 

    అటు వెళ్లి ఓ రెండు పేజీలు చదవడం... వంటింట్లో ఏదో పాడుకుంటూ నా పనేదో చేసుకుంటున్న నన్ను కదిలించి  "బుజ్జాయ్! ప్రతీ పేజ్ ఒక gem!" అనడం. 

    మళ్ళీ ఇంకో గంటకో, గంటన్నరకో ఇంకో రెండో, మూడో పేజీలు చదవడం... బుద్ధిగా ఏ ఆఫీసు డాక్యుమెంటో చెక్కుతున్న నా చెవి దగ్గరకొచ్చి జేసుదాస్ కేసెట్లు పట్టుకుపోయిన టేస్టున్న దొంగ గురించి చెప్పడం. 

    మరసటి రోజు - మళ్ళీ వచ్చి - "పులక్ బిశ్వాస్ గీసిన చెట్టు, చెట్టుకి తేడా ఉంటుందట" - అనీ మెరిసే కళ్ళతో చెప్తూ - మరునిముషంలోనే "నీకు తెలుసా? మహానంది అడవుల్లో చెట్లకి ఉండే ఆకుల పచ్చరంగూ, పాపికొండల్లో చెట్ల ఆకుల రంగూ వేరు వేరుగా ఉంటాయీ" అంటూ - చేతిలో పట్టుకున్న పసుపుపచ్చ పుస్తకాన్ని పదేపదే మునివేళ్ళతో ముట్టుకుంటూ, మురుసుకుంటూ ఉన్న బద్రిని చూసి - చెప్పొద్దూ - కొంచెం కన్నా ఎక్కువగానే కుళ్ళుకున్నా. 

    మధ్యమధ్యలో నేనూ వెళ్ళి పుస్తకం పట్టుకుని పేజీలు తిప్పబోయాను. కానీ అలా చదవడానికి మనసొప్పలేదు. తిప్పబోయిన పేజీలని కుదురుగా బజ్జోపెట్టి మళ్ళీ నా పని లోకో, పాట లోకో వెళ్లిపోయేదాన్ని. అలా వెళ్ళిన ప్రతీసారీ నా రెండు చేతులనీ నా కళ్ళకెదురుగుండా పెట్టుకుని చూసుకునేదాన్ని - ఆ వేళ్ళ చివరల ఏమైనా చిత్రకారుడి రాతల రంగురంగులు ఏమన్నా అంటుకున్నాయేమో అని. 

    సోమవారం నుంచి గురువారం దాకా ఇదే తంతు. 

    ఇహ ఇలాక్కాదని గురువారం రాత్రి భోజనాలు అయ్యాక అయ్యగారు-అబ్బాయిలు ఎవరి గదుల్లో వాళ్ళు కుదురుకున్నాక - మర్నాడు శుక్రవారం ఆఫీస్ ఉందన్న స్పృహ ఎంతున్నా కూడా - ఆ స్పృహని "ఎహె! అవతలికెళ్ళు" అని కసిరేసుకుని - 

మళ్ళీ నేను, 
నా వాలుపు సోఫా పొంత, 
నే మీద వేసుకున్న బొంత, 
నా చేత రేఖాయాత్ర ప్రచురణ 
దాని గుండా మొదలయిన నా పఠనా యాత్ర.  

    ఎన్నో ఏళ్ళ తర్వాత - చదవడం మొదలెట్టి - - అక్కడక్కడా ఉన్న పుస్తకాల కబుర్లు, సినిమాల కబుర్లు తప్పించి - మిగిలిన పుస్తకమంతా - మా అమ్మ అన్నట్టు "శ్రీరామ" నుండి "చిత్తగించవలెను" దాకా - ఆపకుండా రెండున్నర గంటలు చదివిన మొట్టమొదటి పుస్తకం "అనగనగా ఒక చిత్రకారుడు". 

    అలా ఎందుకు చేశానూ అంటే... నిజానికి నేను ఆ పుస్తకం చదవలేదు. 

    ఆ పుస్తకంలో పేజీ పేజీ నాతో కబుర్లాడింది. 

    రాత్రి పూట - పక్కన పడుకున్న బుల్లి బుజ్జాయి లేవకూడదనుకుంటూ - అలా అని మాట్లాడుకోకుండా ఉండలేక గొంతు తగ్గించుకుని మెత్తగా మాట్లాడుకుంటామే - అచ్చు అలానే మాట్లాడింది ఈ పుస్తకం కూడా. 

    అంత మాట్లాడుకున్న తర్వాత - ఆ పసుప్పచ్చ రంగు పుస్తకంతో అంత దోస్తీ కుదిరాక - "భలే వుంది, అదేదో చదివినట్లుంది" - అని ఓ రెండు పొడి మాటలనేసి ఆనక అలమార అరల్లో అలంకరించేసుకుని - "అన్వరూ! ఆల్ డన్!" - అనేయాలనిపించలేదు. 

    అందుకే నాతో మాట్లాడిన పుస్తకం కబుర్లని "అనగనగా ఒక అన్వరుడు ఏమన్నాడంటే ..." అని మొదలెట్టి మీకు కథలు కథలుగా చెబ్దామనీ... 

    
    తల ఓ పక్కకి కొద్దిగా ఒంచి - కుడి అరచేతిలో కుడి చెంపని ఆన్చుకుని నే చెప్పబోయే కబుర్ల కథలు వింటారనీ... 

    మొదలెట్టేస్తున్నా.... మొదలెట్టేస్తున్నా.... 

    అన్నట్టూ... ముందే చెప్పేస్తున్నా - నాకు నచ్చిన - ఎన్ఠీఆరు, వాణిశ్రీ, కృష్ణ, ఎస్పీబీ, రఫీ, కిషోర్కుమారు, లతామంగేష్కరు, ముళ్ళపూడి బుడుగు  - లాంటి ఎన్నో నిత్య ప్రియవచనాల్లో అన్వరుడు ఇంకో ప్రియవచనం - అంతే!  గార్లూ, బూర్లూ కావాలంటే వండుకుని తిందాం గానీ పేర్ల చివర అతికించలేదని నన్నాట్టే సాధించకండి. 

    రెడీ... వన్ ... టూ... త్రీ.... గో!



అపురూపం 

    ఎవరికైనా "డూ యువర్ బెస్ట్" అని అతి మామూలుగా చెప్పేస్తాం - కానీ - ఎన్ని పనులు, ఎవరు, ఎంత బెస్టుగా చేస్తున్నామో - అంతా ఒట్టి టేకెన్ ఫర్ గ్రాంటెడేగా! 

    రోజూ మామూలుగా చెప్పే "థేంక్స్" అనే మాటని కృతజ్ఞతని నింపుకుని అంటే, ఆ మాట విన్న మనిషిని ప్రేమ కూడా తాకాలట. ఇది అపురూపానికే అపురూపమనిపించే అపురూపమైన ఆలోచన. చదువుతుండగానే "ఇద్దీ! ఇలాంటి మాటలే అనండర్రా, వినండర్రా!" అని గాఠిగా చెప్పెయ్యాలనిపించింది. 

    అంతా సవ్యంగా సాగిపోతున్నప్పుడు - స్థిరంగా పని చేస్తున్న చేతులు, తడబడకుండా నడుస్తున్న కాళ్ళు, అన్నాన్ని గుటక వేయగలిగిన గొంతు దాకా తీసుకెళ్లగలిగే నాలుక - వీటన్నిటినీ మహా-taken-for-granted ‌గా తీసేసుకుంటాం గానీ - అవి granted-to-us-for-using-consciously అన్నది - నొక్కి వక్కాణించి చెప్తున్నట్టున్న ఈ అపురూపం  చదువుతుంటే నాకు శశికపూర్ గుర్తుకొచ్చాడు. 

    కపూర్ల ఇంటి కడగొట్టు పిల్లడు, రాజ్ కపూర్, షమ్మీ కపూర్ల బుల్లి తమ్ముడు ఎంత చలాకీగా ఉండేవాడో స్క్రీన్ మీద! నవ్వితే మొహమంతా మతాబాల వెలుగే. పాటకి ఆడడం మొదలు పెడితే - ఒంట్లో చేతులూ, కాళ్ళూ దేనికవే వేటికి కావాల్సిన దిక్కులో అవి స్ప్రింగుల్లా ఆడుతూ ఉండేవి. 

    అలాంటి శశికపూర్ చివర్లో చక్రాల కుర్చీలో కూర్చుని చిన్నప్పుడు తను నటించిన సినిమాలు చూసుకుని "అది నేనేనా ? ఈ చక్రాల కుర్చేలో కూర్చున్న ఈ నేను, అక్కడ హుషారుగా గెంతుతున్న ఆ నేను ఒకరేనా?" అని ఎంతో బాధ పడేవాడట. 

    సరిగ్గా అలాంటి పరిస్థితినే అందరికీ గుర్తుచేస్తుంది అపురూపం

    చదివే ప్రతి దాంట్లో కవిత్వపు ఛాయలు వెతుక్కునే నాకు ఇందులో ఇంకో అపురూపమైన బోనస్ - "కిసీ కీ ముస్కురాహటోం పే హో నిసార్" పాట ప్రసక్తి. 

      ఈ అపురూపం చదవడం అయ్యాక - నాకు అలవాటే అయినా - ప్రతిక్షణం అపురూపంగా గడపడం మీద ప్రీతి - ఇంకొంచెం పెరిగింది నాకు.   

కిసీ కీ ముస్కురాహటోం పే హో నిసార్
కిసీ కా దర్ద్ మిల్ సకే తో లే ఉధార్ 
కిసీ కే వాస్తే హో తేరే దిల్ మే ప్యార్ 
జీనా ఇసీ కా నామ్ హై 

    పాడుకుంటూ తర్వాతి పేజీ కబుర్లలోకి... 


ప్రయాణం 

    ఇక్కడ ప్రయాణం ఒక ఊరిలో మొదలు పెట్టి - ఇంకో ఊరిలో మజిలీ చేసి - చివరికి ఏదో గమ్యం చేరి "హ్మ్!" అంటూ నిట్టూర్చే టైపు కాదు. 

    బొమ్మల కోసం ఒక చిత్రకారుడు - అనుక్షణం తన ఆలోచనే తన తోటి యాత్రికుడై - తన లోపలి ఆలోచనలని తరచి చూసుకుంటూ -తనతో తను చేసుకునే యాత్ర. 

    ఆ యాత్రలో తారసపడిన గడ్డి, చెట్టు, ఇళ్ళు, ఇంటి రేకులు, ఆ రేకుల మీదుగా వెలిగిపోయే సూర్యోదయాలు - ఇవే కాదు... ముంబాయి క్రాఫర్డ్ మార్కెట్లో - రహదారులే గృహాలుగా చేసుకుని తిరుగాడే వేలాది జనాలు - వీళ్ళందరూ కూడా ఈ చిత్రకారుడి చేతిలో జీవం పోసుకునే బొమ్మలే. ఆ అన్వరుడి ఆలోచనల్లో జీవించే బొమ్మల కథలే. 

    ఈ ప్రయాణంలో గీతకారుడు అన్వరుతో పాటు రాతకారుడు పూడూరి (?) రాజిరెడ్డి కలిసి చేసిన ప్రయాణపు విశేషం కూడా ఒకటి ఉందండోయ్ - అదే నాకు దక్కిన బోనస్ ఈ ప్రయాణం కబుర్లలో. 

    ప్చ్! ఇందులో పాటలేం లేవు. అయినా ఫర్లేదు...ముందు ముందు ఉండే ఉంటుంది మురిపించే పాటల పండగ!

    తర్వాతి పేజీలోకి వెళ్ళిపోతున్నా - నాకు తోచిన పాట పాడుకుంటూ... 

పక్షుల రెక్కలు ... అద్దెకు దొరికితే - ఒంటికి తొడిగి పైకె గురూ... 
పక్షులకెన్నడూ ... పాస్‌పోర్ట్ లేదు - ఖండాలన్నీ దాటెళ్ళు!

సామాజిక స్మగ్లర్లు 

    పుల్లయ్య అనబడే రామసుబ్బయ్య, శీను, శేఖర్, మధు, నాగరాజు, సురేష్, రమేష్, మోహన్, కుమార్, చింతపండు, సుబ్బలక్మి - 

    వీళ్ళందరూ ఏమట్లు? 

    అన్వరుకి ఏమయేట్లు? 

    వీళ్ళందరూ సామాజిక స్మగ్లర్లు అయ్యిందెట్లు? 

    అది తెలవాలంటే మీరు మాత్రం అనగనగా ఒక చిత్రకారుడు పుస్తకంలో పదో పేజీ నుంచి పన్నెండో పేజీ దాకా చదవాల్సిందేనబ్బా! 

ఆ రెండు, మూడు పేజీల్లోనే 

చూడాలని ఉంది... 
అమ్మా! చూడాలని ఉంది
నిన్ను - చూడాలని ఉంది
పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి
... ... ...  ... ... ...  ... ... ...  ... ... ...  ... ... ... 
ఒకసారి మాత్రం నిన్ను చూస్తే చాలులే అమ్మా 

    అని అమ్మ కోసం ఆశగా వెతుక్కునే పసి-అన్వర్ కూడా పలకరిస్తాడు. 


ప్రేమ ప్రకటన 

    ప్రేమప్రకటన పలు రకాలు... 

    ఆ రకాల రకరకాలు పలురకాలు. 

    ఆ పలురకాల బహుముఖాలు ఎలాంటివంటే... 

    "ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా ..." పాట వినీవినగానే నచ్చేసి -  "1942 ఎ లవ్ స్టోరీ" సినిమా పాటల  క్యాసెట్లు ఒకేసారి మూడు కొనడం ఒక రకం. 

    హెచ్‌ఎంవీ వాడు వేసిన జేసుదాసు పాటలవి - రెండు సెట్ల క్యాసెట్లని కొని - జేసుదాస్ పాటలు కాపీ చేసుకుని ఇస్తానన్న మనిషికి ఒక సెట్టు అరువిచ్చి - అది అరువు కాదు అచ్చంగా అట్టుకుపోవడం అని అర్థమయ్యాక - ఆ పట్టుకెళ్ళిపోయినవాణ్ణి మంచి టేస్టున్న దొంగ అని మెచ్చుకోవడం రెండో రకం. 

    కొడవటిగంటి, చలం, శేషేంద్రశర్మ, పెద్దిభొట్ల - వీళ్లందరి పుస్తకాలు, ఐదు సెట్ల సైగల్ పాటల క్యాసెట్లు కొనుక్కుని - వాటిని రెండు చేతులతో పట్టుకుని  - ఊరిని వాటికి, ఊరికి వాటిని చూపిస్తూ - ఊరింపుగా, ఊరేగింపుగా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లడం మూడో రకం. 

    (ఈ మూడో రకం గురించి చదివీ చదవగానే నాకు చెప్పిందే చెప్పి "భలే! ఇలాంటి ఇష్టం - అంటే ఇష్టమైన పుస్తకాలు చేతిలో పట్టుకుని నడవాలనిపించేంత పుస్తకమోహం ఉంటుందని ఊహించలేం కదా!" అని బద్రి ఎంత మురిసిపోయారో! అది కూడా ఒక రకమైన ప్రేమ ప్రకటన రకమే మరి!)

    తమిళ కథకులు పిచ్చమూర్తిగారు రాసిన "భగవదర్చన" కథకి పది రకాల గోపురాల స్కెచ్చులు వేయడం నాలుగో రకం. 

    శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి "మార్గదర్శి" కథలోని చేబోలు శంభుశాస్త్రి పేరుని తనకి ఇంకో కొడుకు ఉంటే వాడికి పెట్టాలనుకోవడం ఐదో రకం. 

    (శ్రీపాదవారి కథల్లో నాకు అత్యంత ఇష్టమైన "మార్గదర్శి" కథ గురించిన ప్రస్తావన అన్వర్రాతలో చూడగానే నేనూ మురిసిపోయి - ఒక్కసారి లేచెళ్ళి నా లైబ్రరీలో ఉన్న శ్రీపాద వారి రెండవ కథల సంపుటం తెరిచి "మార్గదర్శి" కథనో సారి దర్శించుకొని వచ్చి కూర్చుని ఇది రాస్తున్నాను. ఇదీ ఓ రకం ప్రేమప్రకటనే!)

    ఆర్టిస్టు చంద్ర గారు చేయి అందించినా - మించిన గౌరవభావంతో - అందించిన చేయిని అందుకోకుండా - రెండు చేతులూ జోడించి దండం పెట్టడం ఆరో రకం. 

    బాపు గారి  నుంచి ఫోన్ వస్తే మాట్లాడేటప్పుడు వేసుకున్న చెప్పులు విప్పేయడం ఏడో రకం. 

    భుక్తి పెట్టే విద్య బొమ్మలేయడం, రంగులేయడం. ఆ సరస్వతి కోసం వందల కొద్దీ పెన్నులు, పెన్సిళ్లు, రంగులు, కుంచెలు కొనడం ఎనిమిదో రకం. 

    ఇంకా బోల్డు రకాలు ఉండే ఉంటాయి - కానీ ఎన్ని రకాలని ఏముంది?!  ప్రేమంటూ ఉంటే -అది ఎన్నో రకాలుగా ప్రకటితమవుతూనే ఉంటుంది. అది - ఇది, అది - అని లేని - ఎన్నెన్నో రకాలు! 

    అందుకే పాడుకుంటూ అంటున్నా ... అన్వర్! తేరా రాత బడా ప్యారా! 

అలా పాడుకుంటూ 17 వ పేజీ లోకి...  


ఐదో దిక్కున అతడు

    ఇందులోని అతడు ప్రముఖ కార్టూనిస్ట్ టి. మోహన్ గారు. 

    రాసిన సందర్భం ఆయన స్వర్గస్థులైన రోజు సెప్టెంబర్ 21, 2017. 

    ఇక్కడ నాకు గుర్తుకొచ్చిన పాట ... 

ఈ అనంత కాల గమనంలో 
ఈ రవ్వంత జీవన పయనంలో 
అందరు నీవారు - చివరకు మిగిలేదెవరూ లేరు 

తర్వాతి పేజీ లోకి కదిలిపోతూ... 


రంగు బలపం 

    చిన్నారి పొన్నారి బాలలను పుస్తకాల వైపుకి ఆకర్షించడానికి, అలరించడానికి బాలల కథల పుస్తకాలకు బొమ్మలూ, రంగులూ వేసిన మెత్తటి రంగుల బలపం లాంటి చిత్రకారుడు పులక్ బిశ్వాస్ కథ ఇది. 

     నాకు ఇది చదివే వరకు ఇండియాలో బొమ్మల పుస్తకాలు ఉంటాయని, వాటిల్లో పిల్లలని మురిపించి, మైమరపించే రంగురంగుల బొమ్మలుంటాయని అస్సలు తెలీదు. నేను కాల్విన్ గాడి దగ్గర్నుంచి లాగేసుకోవాలని చూసే హాబ్స్ పులి కన్నా అందమైన పులుల్ని పులక్ బిశ్వాస్ గారు గీసి రంగులతో నింపారని చదవగానే - వెంటనే గూగుల్లో వెతుక్కుని ఆయన వేసిన బొమ్మలు చూసి - మహా పులకితం మదీయ మానసం!

    
    ఇది చదువుతూ పాడుకున్న పాట (నా మాటల్లో)... 

రంగ్ బిరంగే ఫూల్ ఖిలే హై 
కుఛ్ లోగ్ హీ ఫూలోం జైసే ... 

    ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా కొని తెచ్చుకుంటా ఆ రంగుల-బొమ్మల-ప్రపంచాలు. 

తొలి ప్రేమలేఖ 

    వెన్నెల ఎందుకు కాస్తుంది?

    పూలెందుకు పూస్తాయి?

     కృష్ణశాస్త్రి కవిత్వమెందుకు రాస్తారు?

    ముళ్ళపూడి వారి అప్పారావు అప్పులెందుకు చేస్తాడు?

    ఎందుకు? ఎందుకు? ఎందుకు?

    చిత్రకారుడు స్కెచ్చులు అందుకే వేస్తాడు. 

    ఆ స్కెచ్చులు  వేసే స్కెచ్చుబుక్కే చిత్రకారుడి ప్రేమలేఖ. 

    ఆ స్కెచ్చు బుక్కులో ఉండేవి ఏంటంటేకదలని చెట్లు, కదిలే రైళ్ళు, ఆడే పిల్లలు, టీవీ ముందు పడతులు, ఆశాపాతకుల ఏడ్పు మొహాలు, ఊళ్ళో వీధులు, ఊరి బయటి గుట్టలు మిట్టలు, నడిచే గుంపులు, పడుకుని నిలబడి జారిగిలబడి మొబైల్ చూసుకుంటున్నవాళ్ళు, వికారంగా మొహం పెట్టుకుని కవిత్వం పుస్తకం చదివే పాపం వాళ్ళు, ఫేస్‌బుక్‌లో మొహం దూర్చి ఎన్ని లైకులు ఏమేం కామెంట్లు ఎవరెవరు ఇచ్చారు అని ఆత్రంగా చూసేవాళ్ళు; ఇంకా పెద్దపెద్ద పొట్టలవాళ్ళు, వంగిన వీపులవాళ్ళు, నడుములు లేని అమ్మాయిలు, బోలెడు బోల్డ్ మడతలు గల నడుములు గలవాండ్లు, కాటన్ ప్యాంట్ నిలువు ఫోల్డులు, స్కిన్ టైట్ జీన్స్ ప్యాంట్ మోకాలి కింది అడ్డ ఫోల్డ్స్, బూట్‌కు కట్టిన లేస్, స్నీకర్స్ సోల్-రన్నింగ్ షూ సోల్‌ల మధ్య తేడా, ....వీటన్నిటి స్కెచ్చులూ, అవి పోయే హెచ్చులూ. 

    అపుడెప్పుడో ఈమాటలో అనుకుంటా చూశా - అన్వర్గీతలు - ఒక పేజీ నిండా కిక్కిరిసినట్టుగా వేసిన బోల్డన్ని బొమ్మల స్కెచ్చులు. ఆ బొమ్మల మెరుపులకి కళ్ళు చెదిరాయి. ఆ మెరుపు-కళలు మళ్ళీ ఈ "తొలి ప్రేమలేఖ" చదువుతుంటే గుర్తొచ్చాయి.  

    ఇది చదువుతూ హమ్  చేసుకున్న పాట - బొమ్మలమ్మి సువర్ణసుందరి పాడుకున్న - బొమ్మాలమ్మా ... బొమ్మలూ... 

*********
*********

    ఒకటా, రెండా - ఏభై నాలుగు కబుర్ల కథలు. ఇప్పటికివి చాలు. వారానికి ఇన్నీ అని - రెండు వారాలకోసారి - పేజీ-మజిలీ-కబుర్లలా చెప్పుకుందామేం?!

     అడగడం మర్చిపోయాను - హార్టిస్టుగారూ! 

    సాధారణంగా రాతొచ్చినవారికి గీత రాదు. గీతొచ్చిన వారికి రాత కుదరదు. 

    గీత-రాత సవ్యంగా-దివ్యంగా తెలిసిన సవ్యసాచి మీరు. 

    మీ పుస్తకంలో రాతలకి పైనో, కిందో కొన్ని గీతలు (స్కెచ్చులు) గీసుంటే ఇంకెంత బావుండేదోనండి! 

    ఈసారి పుస్తకం వేసే ముందు ఈ మాట గుర్తుంచుకోండేం!


2, డిసెంబర్ 2019, సోమవారం

అందమైన ఊహలా... నేహల

 హంపి ... ఆ పేరు విన్నప్పుడల్లా ఏదో చెప్పలేని fascination.

హంపి అంటే.... నావరకు నాకు....

చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో చదువుకున్న హంపి విజయనగరంలో కుందేళ్ళు వేటకుక్కలను తరిమిన వైనం ...

పాఠంలా కాకుండా చారిత్రిక నవలలా చదువుకున్న Non-detailed Text Book "విశ్వనాథ నాయకుడు" కథ ...

ముత్యాల తలపాగా పెట్టుకుని భువనవిజయంలో "తిలకాష్ఠ మహిషబంధనం" అంటే ఏంటో విప్పిచెప్పిన తెనాలి రామకృష్ణుడి కొంటె తనానికి గుబురుమీసాల చాటు నుంచి ముసిముసినవ్వులు నవ్విన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే సాహితీ సమరాంగణ సార్వభౌముడూ అనేసుకోవడం...

మహామంత్రి తిమ్మరుసుని దోషిగా నిలబెట్టి "చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికి పట్టినదా?" అంటూ కుమిలిన నటసార్వభౌముడితో పాటు తెలీకుండానే గొంతులో పట్టేసిన దుఃఖం తెలియడం...

బెంగుళూరు నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళిన ప్రతి సారి పెనుగొండ అన్న ఊరి పేరు చూసి ఇది కూడా మన శ్రీకృష్ణ దేవరాయలు కాలూనిన ఊరే అని మురిసిపోవడం...

శ్రీకృష్ణ దేవరాయలు - ఆముక్తమాల్యద -  భువనవిజయం -  అష్ట దిగ్గజాలు -  ఏకశిలారథం -  విరూపాక్ష ఆలయం -  హజార రామాలయం -  తుంగభద్రా నది...ఈ పేర్లు తలచినంత మాత్రాన "నీ పేరు తలచిన చాలు... మదిలో పొంగు జయ తుంగభద్రా తరంగాలు..." అని పాట మార్చి మరీ పాడుకోవడం...

అలాంటి హంపి విజయనగరం ఒకే ఒక్కసారి చూడగలిగాను - బీహెచ్‌లో ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు excursion కని హంపీకి వెళ్ళినప్పుడు.

ఇంటి దగ్గరే ఎంచుకుని మరీ పట్టుకెళ్ళిన పచ్చిమామిడి కాయ రంగుకి గులాబీ అంచున్న పట్టు పరికిణీ వేసుకుని మాత్రమే తుంగభద్రని చూడాలీ, ఏకశిలారథం తాకాలీ అనుకుని అదే పరికిణీ కుచ్చిళ్ళ అంచుల్లో తుంగభద్ర నీటి ముత్యాల్ని కూర్చుకుని,  వాటికి జోడింపుగా ఏకశిలారథ ప్రాంగణపు సైకతమణుల్ని పేర్చుకుని ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు నడిచిన దారుల్లో నడుస్తున్నానని ఎంత మురిసిపోయానో!  భువనవిజయపు ఆనవాలు కోసం ఎంతగా వెతుక్కున్నానో!

అది అప్పటి మాట.

నాలాగే బదరికి కూడా హంపి అంటే చాలా ఇష్టం. తనూ నాలాగే డిగ్రీ చదివే రోజుల్లో హంపి వెళ్లొచ్చారు. కాకపోతే తన ఇష్టం కాలేజ్ రోజుల్లో excursion వెళ్ళి రావడం, ఆ జ్ఞాపకాలతో మురిసిపోవడం దగ్గర ఆగిపోలేదు. Google Books లో కనిపించిన A Forgotten Empire, Vijayanagar అన్న పుస్తకం చదివి, దాన్ని ప్రింటులో దక్కించుకోవడం దాకా సాగింది.

అలా హంపి కథ పుస్తకమై నా చేతిలో వాలింది.







2014లో ఈ పుస్తకం చదివినప్పుడు మాత్రం అంత మంచిగా అనిపించలేదు - అలా అనిపించకపోవడానికి కారణం - రాజులూ, రాజ్యాల మధ్య జరిగిన రక్తపాతానికి హంపి కేంద్రమయిందని Nuniz, Firishtah, Briggs లాంటి చరిత్రకారులు రాసినవి చదవలేక చదువుతూ A Forgotten Empire పూర్తి చేశాను.

అలా చదివినప్పుడు అంతటి "drank the sherbet of martyrdom" లాంటి రాతల మధ్య ఒక అందమైన అమ్మాయి ప్రసక్తి - ఒకట్రెండు పేజీలదే - ఆసక్తిగా అనిపించింది.

Firishtah మాటల్లో "There resided in th town of Mudkul a farmer, who was blessed with a daughter of such exquisite beauty, that the Creator seemed to have united all his powers in making her perfect." అంటూ మొదలయ్యే పెర్తల్ అన్న పేరున్న ఆ అమ్మాయి పరిచయం చదివినప్పుడు భలే అనిపించింది. ఆ అమ్మాయి వల్లే యుద్ధం కూడా జరిగిందని ఆ తర్వాత పేరాల్లో చదివినప్పుడు, ఇంక ఆ తర్వాత ఎక్కడా పెర్తల్ ప్రసక్తి ఎక్కువగా లేనప్పుడు "అరె! ఈ పెర్తల్ ఎవరో, ఆ యుద్ధం ఎలా, ఎందుకు జరిగిందో తెలిస్తే బావుండును" అనుకున్నాను.

Firishtah పెర్తల్ అని పిలిచిన ఆ అమ్మాయినే Briggs నేహల్  అని పిలిచాడని foot-note లో చదివి - విజయనగరాన్ని Beejanuggur అని రాసిన ఈ విదేశీ చరిత్రకారుల కలాల్లో "పెర్తల్, నేహల్" గా మారిన ఆ అందమైన అమ్మాయి అసలు పేరేంటా అని అనుకున్నాను. అంతకు మించి వివరాలు ఎక్కడా దొరక్క ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. 


ఆ తర్వాత నాలుగేళ్ళకు నా బ్లాగులో రాసుకున్న గాలికబుర్లలో కొన్నిటిని పోగుచేసి "బోల్డన్ని కబుర్లు" గా అచ్చు వేసినప్పుడు ఒక పుస్తకాన్ని కాలిఫోర్నియాలో వున్న గొర్తి సాయి బ్రహ్మానందం గారికి పంపించాను. మరి 2017-తానా సమావేశాల్లో  ఆయన రాసిన నవల అంతర్జ్వలన అడిగి మరీ తీసుకోవడమే కాకుండా మా ఊరి తెలుగు పుస్తకప్రియులు అమృతరెడ్డిగారికి కూడా ఇప్పించాను కదా!

నేనలా నా "బోల్డన్ని కబుర్లు" పంపించగానే బదులుగా సాయి బ్రహ్మానందం గారు తను రాసిన చారిత్రిక నవల "నేహల" పంపించారు.

ఆ పుస్తకం చూడడానికే ఎంత అందంగా ఉందో! పైగా అందులో అంతకన్నా అందమైన book-mark.






ముందు పక్కే కాదు వెనక కవర్ కూడా అంతే అందంగా వుంది.






అసలా పుస్తకాన్ని చూడగానే అంత అందంగా ఉందా!

మరి ముట్టుకోవడానికి వెన్నపూస పూసినట్టు మెత్తని స్పర్శ.

పుస్తకంలో ఒక అక్షరం చదవకుండానే నాకు భలే నచ్చేసింది.

ఆ కవర్ల మీద బొమ్మలు అంత అందంగా వేసింది ఎవరా అని చూస్తే...ఇంకెవరూ? ఆర్టులో హార్టుని నింపే హార్టిస్టు అన్వర్ గారు.

తన పుస్తకాన్ని అంత అందంగా డిజైన్ చేసుకున్నసాయి బ్రహ్మానందం గారిని బదరి భలే మెచ్చుకున్నారు. అందులోనూ తనకి చారిత్రిక నవలలు అంటే ఇష్టమేమో వెంటనే చదవడం మొదలు పెట్టేశారు. ఒక వారపు విమాన ప్రయాణంలో తనకి తోడు "నేహల". చదవడం పూర్తి కాగానే చెప్పారు "చాలా బావుంది... నువ్వూ చదువు" అని. నేనెలాగూ తనెప్పుడు పూర్తి చేస్తారా, నేను చదువుదామా అని ఎదురు చూస్తున్నాను కదా... నేనూ చదవడం మొదలు పెట్టాను.

ఇదొక రైతు కుటుంబంలో పుట్టి అల్లారుముద్దుగా పెరిగిన స్వాభిమాని అయిన ఒక అందమైన అమ్మాయి నేహల కథ.

నేహలని ప్రేమించి, నేహలచే ప్రేమించబడిన రేవన్న కథ.

నేహలని ప్రేమించి, ఆమె ప్రేమకి పాత్రుడు కాలేక రేవన్న మీద అసూయతో నేహలని రాజుల పాలు చేసిన శంభుడి కథ.

నేహలకి మంచి చేస్తున్నాననుకుని ఆమెని దేవరాయల జనానాలో బందీ చేయబోయిన వేదరాయశర్మ కథ.

నేహలని అందుకోలేక పోయిన దేవరాయల కథ.

నేహల మీద సానుభూతి వున్నా, ఏమీ చేయలేక ఆమెని రాజరికానికి బలిచేసిన మౌల్వీ గిసుదరాజ్ కథ.

"నా చేతను, నీ చేతను" అన్నట్లు వీరందరి స్వార్థాలూ, దురభిమానాల కారణంగా - తను కోరుకున్న చిన్న చిన్న ఆనందాల జీవితం దక్కక - చేతకాని హసన్ భార్య అయి అలమటించిన నేహల కథ.

ఆ కథ ఏంటో తెలియాలంటే "నేహల" నవల చదవాల్సిందే.

ఇది చదువుతుండగానే - సగంలోనే - ఇంత మంచి నవల రాసిన సాయి బ్రహ్మానందంగారికి - మెసేజ్ చేశాను "చాలా బావుందండి మీ నేహల. ఇటీవల కాలంలో contemporary తెలుగు రచయితలు రాసిన చారిత్రిక నవలల్లో నాకిది చాలా బాగా నచ్చింది" అంటూ.

అప్పుడే అనుకున్నాను ఎప్పటికైనా నేహల గురించి నా బ్లాగులో రాసుకోవాలని. నాకు నచ్చిన ఈ పుస్తకం గురించి అందరికీ చెప్పాలని.

ఈ నవలలో నాకు నచ్చిన విషయాలు చాలా వున్నాయి.

నవల మొదలుపెట్టబోయేముందు ప్రతి అధ్యాయంలో మొదటిసారిగా పరిచయం చేయబోయే పాత్రలన్నిటినీ "ప్రధాన పాత్రలు - ప్రవేశపరంగా" అని ఒక జాబితాగా ఇవ్వడం చాలా నచ్చింది.


ఇంకా  ఏంటంటే కథని చాప్టర్ 1 , చాప్టర్ 2 అని విభజించకుండా  ఆ కథ జరిగే ప్రదేశాల పేర్లతో - అంటే - ముద్గల్, లింగసుగూరు, హంపి విజయనగరం - అంటూ చెప్పడం చాలా బావుంది.

అలా చేయడం వల్ల పాఠకులకి ఒకే సమయానికి రెండు ప్రదేశాల్లో సమాంతరంగా జరుగుతున్న సన్నివేశాల్ని చదువుతూ, ఆ రెండిటికి మధ్య వున్న ఒక subtle connection ని ఊహించుకుంటూ చదవగలిగే వీలు కుదిరింది. ఒక్క మాటలో చెప్పాలంటే "నేహల" ఒక మంచి సినిమా కాదగిన  స్క్రీన్‌ప్లేలా వుంది.

అన్నట్టు ఈ నవలలో ఒక చోట రేవన్న నేహల కోసం జయదేవుని అష్టపది "సా విరహే తవ దీనా" లో ఒక చరణాన్ని తెలుగులో రాసి ప్రేమపత్రంగా ఇస్తాడు.

"నిందతి చందనమిందుకిరణమను విందతి ఖేదమధీరం ।
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరమ్‌ ॥
మాధవ మనసిజ విశిఖ భయాదివ భవదవనయా త్వయి లీనా ।
సా విరహే తవ దీనా!"


పై చరణానికి సాయి బ్రహ్మానందం గారి తెలుగు సేత... ఈ కింద... నాకైతే -  "వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరమ్‌" కి "మలయ పవనము హలమై తోచగా లాలన చెందెను ఖేదనం" - అంత సరిగా కుదిరినట్లు అనిపించలేదు కానీ మొత్తం మీద బావుంది. 


"అలరుల గంధము శీతల వెన్నెల కలతలా చెంత మదీయం 
మలయ పవనము హలమై తోచగా లాలన చెందెను ఖేదనం 
మాధవ తలపున పూవులు తాకెడి భావనలే మదిలోనా 
నా విరహం కనలేవా?"

[లలిత ఉవాచ: ఈ అష్టపది చరణానికి నాకు తోచిన అర్థం: 
కినిసి కసరితి గంధమునే, మరి శీతల కౌముదినే... 
వీచు మలయ పవనము తోచె చందనతరువసిత సర్పపు విషమై...
మాధవ! బేలను...ఓర్వలేను విరిశరముల, దాగెద నీ చాటున...
దీనను...నీ దానను... విరహిణి రాధను...
]


ఒక భాగం అయ్యాక తరవాతి భాగానికి వెళ్ళే ముందు - ముందు జరగబోయే కథకి హింట్ ఇస్తున్నట్లుగా రాసిన కొస మాటలు నాకు భలే నచ్చేశాయి. ఆ కొస మాటలన్నీ quotable quotes లా చాలా thought-provoking గా వున్నాయి. కొన్ని ఆలోచనలు వచన కవిత్వంలా వున్నాయి.

అవన్నీ ... ఇదిగో ఈ కింద రాసి పెట్టా... కొసలు కావివి Quotes అంటూ. 

కొసలు కావివి Quotes:



"ఆవేశాన్నీ, అగ్నినీ నియంత్రించకపోతే జరిగేవి మహాప్రళయాలే!"

"ప్రతీకారానికి వివేకమూ, విచక్షణా ఉండదు."

"కష్టాలూ ఉపద్రవాలూ ఎవరికీ చెప్పి రావు. వాటిని సాదరంగా ఆహ్వానించి ధైర్యం తోనే సాగనంపాలి." 

"మానవ ప్రయత్నం మీద నమ్మకం సన్నగిల్లినప్పుడే దైవత్వం మీద ఆధారపడవలసి వస్తుంది. నమ్మకం ఉండాల్సింది దేవుడి మీద కాదు, మనుషుల మీద."

"తరచి చూస్తే నమ్మకం చుట్టూనే ప్రపంచం గుండ్రంగా తిరుగుతుంది. అదే లేకపోతే ఈ ప్రపంచమే లేదు."

"స్వేచ్ఛకి తండ్రిలా అతడూ, ప్రేమకి ప్రతీకలా ఆమె."

"మార్పు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మొదలుపెట్టాలి."

"అప్పా! మనం గ్రహించం కానీ, ఈ జీవితం చాలా చిన్నది. మనం పెద్ద పెద్ద గమ్యాలు చేరుకోడంలో చిన్న చిన్న ఆనందాలూ, కోరికలూ పక్కన పెట్టేస్తాం. తీరా అనుకున్నది సాధించాకా కోల్పోయినవి వెనక్కి తిరిగి తీసుకురాలేం."

"అధికార దాహం ముందు బంధుత్వాలూ, రక్తసంబంధాలూ పిపీలికాలు. దానికి ఎదురుగా ఉన్న సింహాసనం ధగధగలు తప్ప మరేం కనిపించవు."

"ఒక్కోసారి మన చేతలే తలరాతలుగా మారుతాయి."

"మనిషికి విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసపు వెలుగు క్రింద అహంకారం నీడ కూడా ఉంటుంది. నీడ వెలుగు కన్నా పెద్దది కాకూడదు. అది జరిగితే చివరకి మిగిలేది చీకటే!"

"ఆత్మవిశ్వాసం జాగ్రత్తని అధిగమించకూడదు. అదే జరిగితే ఎంతటి ప్రమాదమయినా రావచ్చు. ప్రమాదాలకీ, కష్టాలకీ రాజూ, పేదా అన్న తేడా ఉండదు."

"యుద్ధకాంక్షకీ, రాజ్యకాంక్షకీ కారణాలుండవు, ధ్యేయాలు తప్ప."

"కీర్తి కండూతీ, అధికార వాంఛ పెద్ద వ్యాధులు ఈ ప్రపంచంలో. అవి దరిదాపులకి రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి ఆవహించాక ఓ పట్టాన వదలవు."

"రాజకీయం రెండు వైపులా పదునున్న దుర్మార్గమైన ఆయుధం. దానికి ఒక్కోసారి సొంతవాళ్ళే బలవుతారు."

"అన్నీ అప్రయత్నంగా కదిలిపోతున్నాయి, ఒక్క కాలం తప్ప."

"నిర్లక్ష్యం నిప్పు లాంటిది. చిన్నదయినా చిట్టడివిని కూడా దహించగలదు."

"పంటి కింద పలుకూ, మెతుకూ రెండూ లేవు."

"బలమైన కోరికలకి అబద్ధమే పెద్ద ఆసరా!"

"మనుషుల్ని నమ్మాలి. విశ్వసించాలి. కానీ గుడ్డి నమ్మకమూ, గుడ్డి ప్రేమా ఎవరికయినా అనర్థదాయకమే!"

ఒక ఆశ - మరొక ఆశయం. 
ఒక సాంగత్యం - ఒక స్వేచ్ఛ. 
వెరసి రెండు జీవితాలు. 
విధి ఎంత చిత్రమైంది?

"అవును, ప్రతి స్త్రీ ఒక పెద్ద మతం 
ఒక ఇంటి నుండి మరొక ఇంటికి 
ఒక ఊరి నుండి మరొక ఊరికి 
ఒక కట్టుబాటు నుండి మరొక కట్టుబాటుకి 
ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకి
జీవన ప్రవాహంలో విశ్వాసాన్ని మించిన శక్తి లేదు."

"సదుపాయాలు సుఖాన్ని ఇవ్వవు మౌల్వీ!"

"అహం - అధికారం 
స్వేచ్ఛ - స్వాతంత్య్రం 
గాలీ - నీరూ 
మనిషికేం కావాలి?
స్వాతంత్య్రం ఒక ఎండమావి. 
స్వేచ్ఛ ఒక మిథ్య."

ఏదో రెండు పేజీలు కూడా లేని "పెర్తల్ / నేహల్ " కథ లోంచి గొర్తి సాయి బ్రహ్మానందం గారు 365 పేజీల చారిత్రిక నవల రాయడం సామాన్యమైన విషయం కాదు. ఇంత బావున్న నవలలో - పరమాన్నంలో పటికబెల్లపు పలుకుల బదులు పలుకురాళ్ళొచ్చినట్లు - కొన్ని అచ్చుతప్పులు దొర్లాయి. వీటిని ఎత్తి చూపించడంలో ఉద్దేశ్యం "నేహల" విలువ తగ్గిద్దామని కానే కాదు. ఎంతో మంది కొని చదవబోతారు. మరెన్నో ప్రతులు ముద్రిస్తారు. అప్పుడు సరిదిద్దుకుంటారేమో అని... అంతే!
 
కంటిలోపడ్డ నలకలు - పంటికింద పలుకురాళ్ళు :

16 వ పేజీ: దేవరాయలకి వేదరాయశర్మంటే ఎంతో గౌరవం. గురుతుల్యుడిగా భావిస్తాడు.
17 వ పేజీ: దేవరాయల్ని చూడగానే అత్యంత వినయంతో నమస్కరించి మహారాజు కీర్తిని ప్రస్తుతిస్తూ రాగయుక్తంగా స్తుతించాడు దేవరాయశర్మ. 

లలిత ఉవాచ: దేవరాయలికి వేదరాయశర్మ గురుతుల్యుడైతే 17వ పేజీలో వాక్యంలో దేవరాయల్ని చూడగానే వేదరాయశర్మ అత్యంత వినయంతో నమస్కరించడం సరి అనిపించలేదు.

19 వ పేజీ: "దేవరాయా! తరతరాలుగా మీ కుటుంబం మాకు చేసిన సేవలకి మెచ్చి ముద్గల్లు అశ్వత్థనారాయణుడి దేవాలయం దగ్గరున్న నూరు 'గ' ల భూమిని మీకు దశవంధంగా ఇస్తున్నాము. దసరా సందర్భంగా ఇది మా కానుక. మా రాజముద్ర ఉన్న తామ్రపత్రం ఇది," అంటూ వేదరాయశర్మకి అందించాడు.

లలిత ఉవాచ: ఇక్కడ "వేదరాయా" అని ఉండాలి.

129 వ పేజీ: "నేహల పొరుగింటి వాళ్లు సురేంద్ర ఇంటికొచ్చిన వాళ్లని పరిశీలనగా చూస్తూనే వున్నారు.

 లలిత ఉవాచ: నేహల తండ్రి "హరీంద్ర". ఈ నవలలో "సురేంద్ర" అన్న పాత్రే లేదు.

చివరగా నా మాటల్లో నేహల... 

ఈ నవల నేలిన నవల
స్వేచ్ఛ కోరిన బాల
నేహల...

చరిత్రనే మాత్రం ఏమార్చక కూర్చిన
బ్రహ్మానందం గారి కథల పోహళింపు...
నేహల...

అన్వర్ గారి కుంచెలో...
ఒదిగె అందమైన ఊహలా...
నేహల...

["నేహల" నవల ప్రతుల కోసం ఎవరైనా సాయి బ్రహ్మానందం గారిని సంప్రదించాలనుకుంటే వారి ఈ-మెయిల్: gorthib@yahoo.com]

25, నవంబర్ 2018, ఆదివారం

ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం!!

ఉపోద్ఘాతం:

2010 లో జరిగిన విషయం. నాన్నకి ఒంట్లో నలతగా ఉందని తెలిసి కొంచెం బెంగగా వున్న నన్ను, నాతో పాటు బుజ్జిజింకని అప్పటికప్పుడు టికెట్లు కొని, ఇండియా ఫ్లైట్ ఎక్కించారు బదరి.

నాన్నని సర్‌ప్రైజ్ చేద్దామని మేము బయలుదేరినట్లు బాలాజీకి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు బదరి - బాలాజీకి కూడా నేను ఇండియా వస్తున్నానని ఎవరికీ చెప్పొద్దని చెప్పారు.

హైద్రాబాదులో తెల్లవారుఝామున నన్ను రిసీవ్ చేసుకున్నబాలాజీ నన్నూ, బుజ్జిజింకనీ ఆ రోజు పొద్దున్న పదింటికి  రాజమండ్రి ఫ్లైట్ ఎక్కించే ముందు నాన్నకి ఫోన్ చేశారు.

"అంకుల్! బదరి అమెరికా నుంచి మీకోసం ఏదో పంపించాడు. మీరోసారి పదకొండు గంటల ప్రాంతంలోరాజమండ్రి ఏర్‌పోర్ట్‌కి వెళ్ళాలండి"

"బదరి నాకేంటో పంపించడమేంటి? నిన్ననే కదా నాతో మాట్లాడాడు - నాకేం చెప్పలేదే !?" - నాన్న గొంతులో కంగారు.

బాలాజీ వెంటనే నాకేసి తిరిగి "అంకుల్ ఇప్పుడే రికవర్ అవుతున్నారు - ఆయన్ని టెన్షన్ పెట్టొద్దు ఇంక - చెప్పేస్తాను" అని, ఫోన్లో నాన్నతో "లలిత, కిరణ్ వచ్చారంకుల్! వాళ్ళిద్దరూ టెనో క్లాక్ ఫ్లైట్‌లో రాజమండ్రి వస్తున్నారు. రిసీవ్ చేసుకోండి" అని చెప్పేశారు.

నేనలా రాజమండ్రి వెళ్ళినప్పుడు నాన్నని చూద్దామని లలితత్తయ్య కూడా వచ్చారు వైజాగ్ నుంచి. హైద్రాబాదు నుంచి లక్ష్మిదొడ్డ, తంబి మామయ్య కూడా వచ్చారు. ఓ రెండు వారాల పాటు వాళ్లందరితో గడిపే అపురూప అవకాశం నాకది.

ఒక రోజు మధ్యాహ్నం పుస్తకాలు తిరగేస్తున్న నాకు స్వాతి లోనో, నవ్య లోనో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన 'సత్యభామ' సీరియల్ కనిపిస్తే చదివాను. నాకంతగా నచ్చలేదు.

అదే సంగతి  "ఏం చదువుతున్నావ్ లల్లీ?" అనడిన లలితత్తయ్యకి చెప్తూ ఆ పుస్తకం పక్కన పెట్టేశాను.

అప్పుడే లక్ష్మీప్రసాద్ గారు రాసిన 'ద్రౌపది' నవల గురించి నాకు చెప్తూ ఆ మాటల్లోనే "లల్లీ! నేను భారతం, భాగవతం పూర్తిగా చదివాను. రెండిట్లో పోతన భాగవతం మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటావ్?" అన్నారు అత్తయ్యనాకు టెస్ట్ పెడుతున్నట్లు.

దానికి సమాధానం చెప్పడానికి నేను ఆట్టే ఆలోచించలేదు. "అత్తయ్యా! భారతం రాసిన కవిత్రయం రాజరాజనరేంద్రుడు అడిగితే రాశారు. పోతన రామభద్రుడు చెప్తే రాశాడు - అదీ తేడా!" అన్న నా సమాధానం  లలితత్తయ్యకి నచ్చేసినట్లే అనిపించింది.

అప్పుడే  రాజమండ్రి నుంచి వస్తూ బమ్మెర పోతన రచించిన శ్రీ మద్భాగవతం రెండు వాల్యూములు తెచ్చుకున్నాను. అప్పట్నుంచీ వారానికి ఒకసారైనా కొన్ని పద్యాలు చదువుతూ చిన్నప్పుడు నా చేత భాగవత పద్యాలు వల్లె వేయించిన నాన్నమ్మని, రామ్ బాబయ్యని తలుచుకుంటూ వుంటాను.

ఎప్పటికైనా నాకు నచ్చిన భాగవత పద్యాల గురించి నాకు తోచిన నోట్స్ రాసుకోవాలని వున్నా ఎప్పటికప్పుడు వాయిదా వేసేస్తూ ఉండేదాన్ని.

ఈ సంవత్సరం అక్టోబర్లో  మా వూళ్ళో తెలుగుభాషాభిమానులూ, పుస్తకిష్టులూ అయిన అమృతరెడ్డిగారు ఫోన్ చేసి "TAS - Telugu Association of St. Louis వారి దీపావళి జ్ఞాపిక (souvenir)లో ప్రచురించడానికి వ్యాసాలు కావాలి, మీరేమైనా రాసివ్వండి లలితా!" అనడగ్గానే నాకు ముందుగా గుర్తొచ్చింది భాగవతం గురించి నేను రాసుకొందామనుకున్న నోట్స్.

వెంటనే ఆయనకి తప్పకుండా రాస్తానని చెప్పి పంపించిన నా భాగవత వ్యాసంలో "శ్రీరామ చంద్రుడిలా అని కాకుండా శ్రీరామచంద్రుడిలా అని ఆ extra space తీసేసి సరిదిద్దగలరా లలితా కొంచెం?" అంటూ కనీకనిపించకుండా వున్న పలుకురాళ్లలాంటి తప్పులని సరిచేసిన అమృతరెడ్డిగారికి, నా ఈ వ్యాసాన్ని TAS Souvenir కోసం టైప్ చేసినప్పుడు వచ్చిన తప్పులని ఓపిగ్గా దిద్దిన TAS President ఆలూరి జితేందర్ గారికి బోల్డన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ... పోతన భాగవతం మీద నా మొట్టమొదటి వ్యాసం - ఇదిగో ఇక్కడే... 


ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం!!  

రంగా లాలీ... పండరి రంగా లాలీ 
మంగళాంగా దయాంతరంగ శుభాంగా లాలీ 

తల్లికి విశ్వరూపము చూపిన నల్లవాడా 
చల్లని నీ కృప చల్లర మాపై గొల్లపిల్లవాడా !

రంగా లాలీ... పండరి రంగా లాలీ 
మంగళాంగా దయాంతరంగ శుభాంగా లాలీ


తరతరాలుగా తెలుగింటి అమ్మలు పొత్తిళ్ళలో పాపని కృష్ణుడే అనుకుని పాడుకున్న లాలి పాట ఇది.

ఒక తమాషా అయిన విషయం ఏంటంటే తెలుగునాట పెళ్ళైన ప్రతి అమ్మాయి తన భర్త శ్రీరామచంద్రుడిలా వుండాలనుకుంటుంది. తన కడుపున పుట్టిన కొడుకుని మాత్రం జుట్టు కట్టి, నెమలి పింఛం పెట్టి, ముత్యాల హారాలు వేసి, చిన్న పట్టుపంచె కట్టి చిన్నికృష్ణుడిలా అలంకరించి మురిసిపోతుంది. ఏతావాతా చివరికి తేలేదేంటంటే రాముడిలా ఉండాలనుకునే ఆ అమ్మాయి భర్త కూడా ఓ అమ్మకి కృష్ణుడి లాంటి కొడుకే!

ఇంతకీ అమ్మలందరూ తమ పిల్లలు కృష్ణుడిలా వుండాలని ఎందుకనుకుంటారో?... ఎందుకంటే వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో, తాతయ్యలో ఎప్పుడో ఒకప్పుడు కృష్ణలీలల్ని కథలుగా చెప్పే వుంటారు. నిజమైతే బావుణ్ణు అనిపించే ఆ కథల్లో కృష్ణుడేం చేసినా ముద్దుగా ఉంటుంది. ఉట్లు తెంపినా, వెన్న దొంగిలించినా, ఆ అల్లరికి, ఆగడానికి గోపెమ్మలకి కోపం వచ్చినా, కృష్ణుడి ముద్దుమోము చూడగానే ఆ కోపాన్ని మించిన మురిపెం కలుగుతూనే ఉంటుంది.

ఆ కథల్లోని కృష్ణుడికి భయమంటే తెలియదు. కోపం రాదు, విసుగు లేదు. సాధించలేని విషయం లేదు. సొంతం కాని విజయం లేదు. ఎలాంటి సందర్భంలో నైనా కృష్ణుడిదే పై చేయి. అన్నిటా కృష్ణుడికే అగ్రతాంబూలం. ఎన్నడూ కృష్ణుడు స్వేచ్ఛావిహారి. కృష్ణుడి జీవితంలో దుఃఖానికి తావు లేదు. అన్నిటా, అంతటా సుఖమే, శుభమే. అంత మధురమైన కృష్ణలీలల గురించి విన్నవారికి మధురాధిపతే అఖిలం మధురం అనిపించక మానదు. అందుకే కన్నకొడుకు మీద మమకారం వున్న తల్లి తన కొడుకు కృష్ణుడిలానే అందరి కన్నా మిన్నగా ఉంటూ, ఎప్పుడూ ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడపాలని కోరుకుంటుందేమో!

అంతటి మధురమైన కృష్ణలీలల్ని అచ్చతెలుగులో ఎంతో హృద్యంగా, హృదయంగమంగా కృష్ణుడి వేణుగానానికి దీటైన శబ్దాలంకార భూషితమై, బాలకృష్ణుడి సిరిమువ్వ గజ్జెల లయకి సరితూగు నడక గల పద్యాల్లో ఎవరైనా రచించగలిగితే, అది మనం చదవగలిగితే ఎంత బావుంటుందో కదా! అలా రచింపబడిన గ్రంథమే భాగవతం. ద్వాదశ స్కంధ పద్య మాణిక్య భూషితమైన శ్రీ మదాంధ్ర భాగవతాన్ని రచించిన వారు బమ్మెర పోతన. ఆ రచన ఎలా జరిగిందో పోతన పద్యంలోనే చదువుకుంటే బావుంటుంది.

పలికెడిది భాగవత మఁట
పలికించెడివాడు రామభద్రుం డఁట నేఁ
బలికిన భవహర మగునఁట
పలికెద వేఱొండు గాథ బలుకఁగ నేలా? 


తాను పలికినది భాగవతమట. దానిని పలికించింది సాక్షాత్తూ శ్రీరామ చంద్రుడట. అది పలికితే భవబంధాలు తొలుగుతాయట. అందుకనే ఇంత గొప్పదైన భాగవతం తప్ప ఇంకోటి పలకనని అంటూ పోతన భాగవత రచన సాగించారు.

తాను రాయబోయే కృష్ణలీలల లోని చిలిపిదనాన్ని తనకెవరన్నా ఆపాదించి ఆక్షేపణ చేయకుండా మర్యాదా పురుషోత్తముడైన రాముణ్ణి ఊతగా తెచ్చుకున్న పోతన ఎంత చమత్కారి అనిపిస్తూ ఉంటుంది నాకు భాగవతం చదువుతూ ఉంటే!

తెలుగు వారి ఆస్తిక-ఆస్తి అనదగ్గ గ్రంథాలు ముఖ్యంగా మూడు. అవి రామాయణ, మహాభారత, భాగవతాలు.

రామాయణంలో దంపతులైన సీతారాముల వియోగం నిర్వేదం కలిగిస్తుంది. మహాభారతం లోని దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య వైరం, ఆపైన జరిగిన కురుక్షేత్ర యుద్ధం మనసుని వ్యాకుల పరుస్తాయి.

అదే భాగవతం లోని ముఖ్యపాత్రధారి కృష్ణుడు ఎలాంటివాడంటే ... పోతన పదాల్లోనే చదువుకుంటే విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు - అంటే సర్వవ్యాపి, ప్రకాశించువాడు, ఎల్లప్పుడూ జయమే పొందువాడు, సహనశీలి అయినవాడు కృష్ణుడు. కృష్ణుడంటే ఆనందం. కృష్ణుడంటే నమ్మకం. కృష్ణుడంటే భరోసా. పిలిస్తే పలుకుతాడు. కృష్ణుడంటే సాక్షాత్తూ విష్ణువు అంశ.

విష్ణువు ప్రహ్లాదుడిని దుష్టుడైన తండ్రి పెట్టే బాధల నుంచి రక్షిస్తాడు. మొసలి కోరల్లో చిక్కుకున్న గజేంద్రుడిని కాపాడుతాడు. వామనుడై దానమడిగి బలి చక్రవర్తిని పాతాళానికి సాగనంపుతాడు. కృష్ణావతారంలో వేలితో కొండనెత్తి గోపాలకులకు కొండంత అండై నిలుస్తాడు. సత్యభామా సమేతుడై నరకాసురుని వధించి ఇంటింట దీపావళి జరిపిస్తాడు. అలాంటి కృష్ణుడి కథలు మధురాతి మధురంగా కాక ఇంక వేరేలా ఎలా ఉంటాయి? అంతటి మధురమైన కథల సముదాయమైన భాగవతాన్ని పన్నెండు స్కంధాలలో తీయనైన తేట తెలుగులో పోతన మనకందించారు.

అది కూడా ఎలా?

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్ 


నీచులైన రాజులకి అంకితమిచ్చి అగ్రహారాలు, వాహనాలు, డబ్బులు, వస్తువులు తీసుకొని, వాటిని ఈ లోకంలో అనుభవించి, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే సమ్మెట పోట్లు తినడం ఇష్టం లేక బమ్మర పోతరాజు అనే నేను ప్రపంచ శ్రేయస్సు కోరి అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను అని చెప్తూ భాగవత రచనకి పూనుకున్నారు.


భాగవతంలో దశమ స్కంధం అంతా శ్రీకృష్ణ లీలల గురించే. అందులో ఒక భాగంగా రుక్మిణీ కళ్యాణ విశేషాలు తెలిపే పద్యాలు కూడా వుంటాయి. మునుపటి రోజుల్లో కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం పద్యాలు చదివిస్తే తొందరగా వివాహం జరుగుతుందని నమ్మేవారు. 
 

అంతటి ప్రశస్తమైన భాగవతం లోని కొన్ని పద్యాలు ఇక్కడ తలుచుకుందాం.

మొదటగా ... బళ్ళోకి పంపిస్తూ చదువుకునే పిల్లలకి సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ దండం పెట్టుకోమని చెప్తూ ఎంతో మంది తల్లులు నెమరేయించిన పద్యం...

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు భారతీ! 


ధవళవస్త్రధారిణి అయిన సరస్వతీ దేవిని పోతన తన ఊహలో పోల్చడానికి ఎంత మంచి ఉపమానాలు వాడాడో ! శరత్కాల మేఘాలు, చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, మల్లెపూల దండలు, మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మొల్లలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగ - ఇవన్నీ కూడా తెల్లని తెలుపురంగులో భాసిస్తూవుంటాయట. సరస్వతీ దేవికి ఉపమానాలట. అట్టి చల్లని తల్లి  కటాక్షం ఎప్పుడు కలుగుతుందా అని పోతన అడుగుతున్నారు.

భాగవతంలో వున్న పద్యాల్లో 'ఇది బావుంది' అని ఎంచి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని పద్యాలూ కూడా ఒక దానిని మించి ఇంకొకటి అన్నట్లు ఎంతో బావుంటాయి అర్థ-శబ్ద-అలంకారాలతో.


మధురమైన కృష్ణలీలా కథామృతాన్ని గురించి ప్రహ్లాదుడి చేత పోతన పలికించిన పద్యం:

మందార మకరంద మాధుర్యమునఁ దేలు;
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు;
రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;
కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక;
మరుగునే సాంద్ర నీహారములకు? 


నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?


ఎంత అద్భుతమైన భావం! నారాయణ మంత్రం భజించే ప్రహ్లాదుడిని హరినామం మానమని అన్న తండ్రి హిరణ్యకశ్యపుడి మాటలు విని తన గురువైన చండామార్కుడితో ప్రహ్లాదుడు "ఓ గురూత్తమా! మందార పూలలోని తేనె తీయదనాన్ని అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల కేసి పోతుందా? స్వచ్చమైన ఆకాశగంగలో విహరించే రాజహంస  వాగుల దగ్గరకు వెళ్ళదు కదా? పాటలు పాడే కోయిల తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తింటుంది కానీ   కొండ మల్లెల వైపు పోతుందా? నిండు పున్నమి పండువెన్నెలలో విహరించే చకోర పక్షి మంచు తెరల వైపునకు వెళ్తుందా? అలాగే విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోలటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. హరిపాదాల మీద నిమగ్నమై వున్న నా మనసు ఇతర విషయాల పైకి ఏమాత్రం పోవటం లేదు." అన్న సందర్భం లోనిది పైన ఉదాహరించిన సీసపద్యం.

ఇలా చెప్పుకుంటూ వెళ్తే భాగవతంలోని ఏ ఒక్క పద్యాన్నీ వదలాలనిపించదు. అలా అని మొత్తం భాగవతాన్ని ఇక్కడ రాసుకోవడం కుదరదు. అందుకని శబ్దాలంకార పూరితమైన పద్యాలు కొన్నిటిని మాత్రం ఇక్కడ గుర్తు చేస్తున్నాను. 

(గజేంద్ర మోక్షం నుంచి మూడు పద్యాలు)
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.


కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో? 



ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. 



(నరకాసుర వధ నుంచి రెండు పద్యాలు)
లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "

నారి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నారీమణి బలసంప
న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా!  


(గోపికా వస్త్రాపహరణం నుంచి ఒక పద్యం)
మామా వలువలు ముట్టకు
మామా! కొనిపోకుపోకు మన్నింపు తగన్
మా మాన మేల కొనియెదు?
మా మానసహరణ మేల? మానుము కృష్ణా! 


చివరిగా వామనావతారంలో బలి మహారాజు వామనుని మూడడుగుల దానమివ్వబోతుండగా వద్దని వారించిన శుక్రాచార్యునితో బలి చెప్పిన మాటల (ఈ కింది పద్యంలో) ద్వారా ఈ లోకంలో కీర్తి మాత్రమే శాశ్వతం అని చెప్తారు పోతన.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా! 


ఓ భృగుపుత్రా!  శుక్రాచార్యా! ఇంతకు మునుపు ఎందరో రాజులు ఉన్నారు . రాజ్యాలు ఉన్నాయి . వాళ్ళు తమ  ఔన్నత్యాన్ని చూసి గర్వించిన వారే! కాని వారెవరు తాము సంపాదించిందేదీ మూటగట్టుకొని పోలేదు కదా! కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదే!  శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారికి లేదనకుండా దానాలు చేశారు. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా!

ఎన్ని మంచి పద్యాలో భాగవతంలో! వాటిలో కొన్నింటినైనా ఇలా మళ్ళీ స్మరించుకోవడం ఎంతో బాగుంది.

అన్ని వందల పద్యాల భాగవతాన్ని సంక్షిప్తంగా ఒక శ్లోకంలో పాడుకునే వీలుంది. అదే ఈ క్రిందనున్న ఏక శ్లోకీ భాగవతం !

ఆదౌ దేవకి దేవి గర్భ జననం గోపీగృహే వర్ధనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీ సుతాం పాలనం
ఏతద్భాగవతం పురాణథితం శ్రీకృష్ణ లీలామృతం

స్వస్తి!