నాన్న కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాన్న కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జూన్ 2022, మంగళవారం

అవతారంగారి నారాయణగారి బాబి - 26 - కోబ్రా కాదట... "కో.బ్రా." అట!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 25 - గాబరా పెట్టిన కోబ్రా! 

    ఆ ఐటీసీ మేనేజర్ తోటి కొంచెం సీరియస్‌గా I am a cobra అంజెప్పేసి  "రండి ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుందాం" అని ఆఫీసు లోకి వెళ్ళిపోయాను కదా!?

    అలా నేను వెళ్ళాక - కొంసేపట్లో - నా వెనకాలే ఆయన కూడా నా రూంలోకి వచ్చాడు కదా!?

    ఈలోపులో ఓ చిన్న విషయం జరిగింది. 

*** *** ***
*** *** ***

    నేను  వెళ్ళిపోయాక ఈయన స్టన్నయ్యాడు మనిషి. 

    కొంచెం చెమటలు పట్టినయ్. 

    విశ్వనాథం గారని చెప్పేసి ఐటీసీ గోడౌన్ ఇన్‌ఛార్జ్ ఉన్నాడు కదా మా దగ్గర - ఆ పెద్దాయన!

    ఈ మేనేజరు విశ్వనాథం గారి దగ్గరికెళ్లి "ఏంటి...వీడి సంగతీ? కోబ్రా అంటాడూ, చాలా సీరియస్‌గా వెళ్ళాడూ, ఏంటీడి పరిస్థితి? అసలు వీడెవరు?" అంజెప్పేసి అడిగాట్ట. 

    అడిగితే ఆ విశ్వనాథంగారేంమో కొంచెం గొంతు తగ్గించి "సార్! ఈ గుంటూరు ముఠా వాళ్ళు తొంభై మందున్నారు ఆయన దగ్గర. అందులో రౌడీ షీటర్సు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళని మేనేజ్ చేస్తున్నాడాయన. పైగా... రెండోది ఈయనుండేది బ్రాడీపేట నాలుగూ పజ్జెనిమిది. దానికి దగ్గర్లోనే కోబాల్టు పేట. వాళ్ళతో కూడా సంబంధాలున్నాయేమో ఈయనకి. తర్వాత... ఈయన రోజూ అరండల్ పేట డొంకరోడ్డు లోంచి వస్తాడు. ఆ డొంకరోడ్డులో కూడా ఈ కంపెనీకి బొగ్గు వేసేవాళ్ళు ఉన్నారు కదా? వాళ్ళతో కూడా ఈయనకి సంబంధాలు ఉన్నాయేమో? కొంచెం ఎందుకైనా మంచిది ఆయనతో జాగ్రత్తగా మాట్టాడండి" అని చెప్పాడట.  

    అది విని ఈయన కొంచెం భయపడుతూనే వచ్చాడు ఆఫీసు లోకి. 

*** *** ***
*** *** ***

    వచ్చాక కూర్చున్నాడు. 

    నేను కూడా రిలాక్స్ అయి కూర్చున్నాను. 

    నాకో ఆఫీసు బాయ్ వుండేవాడు వెంకటేశ్వర్లు. 

    ఆ వెంకటేశ్వర్లుని పిల్చి "ఓ రెండు కాఫీ తీసుకురా మంచి స్ట్రాంగ్‌గా" అని చెప్పాను. 

    వాడు కాఫీ తేవడానికి వెళ్ళాడు. 

    ఈలోపులో ఈయనతో "ఒక ఐదు నిముషాలు బయటికి వెళ్ళొస్తాను. ఇక్కడే కూర్చుని ఉండండి" అని చెప్పి బయటికెళ్ళాను. 

    అప్పటికి మిగిలిన స్టాఫు వచ్చారు ఆఫీసుకి.   

    ఆఫీసులో ముఠా మేస్త్రులు ఇద్దరుండేవారు - వీరాస్వామి, పెదకోటయ్య అని. వాళ్ళిద్దర్నీ పిలిచాను.  

    శర్మ అనే క్లర్కుండేవాడు. అతన్నీ పిలిచాను. 

    వాళ్ళు ముగ్గుర్నీ పిలిచి  "ఒకసారి పదో నంబర్ గోడౌన్‌కి వెళ్ళి రండి. ప్రతీ కేసు జార్తగా చూడండి. ఎక్కడైనా కేసులు తడిసినయ్యా అని చూసి నాకో అరగంటలో రిపోర్టు ఇవ్వండి" అంజెప్పి వాళ్ళకి చెప్పి మళ్ళీ ఆఫీసు లోపలికి వచ్చాను. 

    వచ్చి కూర్చున్నా. 

    సరే...కాఫీలొచ్చినయ్. 

    నేనూ, ఐటీసీ మేనేజర్ - ఇద్దరం కాఫీలు తాగాం. 

    సిగరెట్టు ఆఫర్ చేశాను. ఆయనో సిగరెట్టు, నేనో సిగరెట్టు తాగాం. 

    అవన్నీ అయింతర్వాత ఆయనే మొదలుపెట్టాడు. 

    "ఆ... ఇప్పుడు చెప్పు! ఏంటీ ఇందాకేంటో కోబ్రా అన్నావ్. అంటే ఏమిటసలు నీ పరిస్థితి? కోబ్రా అంటే ఏంటి?" అనడిగాడు నన్ను. 

    "అంటే ...సరే... ఏదో అన్నాను. అక్కడ స్టాఫున్నారు. లైను కుఱ్ఱాళ్ళు వాళ్ళూ ఉన్నారు. వాళ్ళ ముందెందుకు గొడవపడడం? ఆఫీసులోకి రండి మాట్లాడుకుందాం అని చెప్పాను. మీరు వినకుండా ఏదో రెచ్చిపోతున్నారు. అందుకని కొంచెం సీరియస్‌గా చెప్పాను. ఏం లేదు లెండి. దాని సంగతెందుకు మనకి. ఇప్పుడు కేసులేం తడిసుండవు. నేను మనుషుల్ని పంపించాను చూసి రమ్మని. వాళ్ళు చూసొస్తారు ఒక అరగంటలో మనకి రిపోర్టు వస్తుంది" అని చెప్పా. 

    "నో నో... అలా కాదు. ఆ కోబ్రా అనే మాటెందుకొచ్చింది నీ నోటెంబట? అది చెప్పాలి నాకు." అని కూచున్నాడు. 

    నేనోసారి నవ్వి "ఏం లేద్సార్! మాది కోనసీమ. అమలాపూరం దగ్గర్ అనాతవరం అనే గ్రామం మాది. మేం ద్రావిళ్ళం. ఆ ఊళ్ళో బ్రాహ్మణ కుటుంబం లోంచి వచ్చాన్నేను. కోనసీమ బ్రాహ్మణ్ణి కాబట్టి "కో...బ్రా...". ఇంతకన్నా ఇంకేం లేదండీ బాబూ" అన్నా! 

    ఆయనొక్కసారి బిత్తరపోయి - తేరుకుని - పకపకా నవ్వి "నీ దుంపతెగ! ఎంత భయపెట్టావు నన్ను...ఏదీ ఇంకో సిగరెట్టియ్యి" అని ఇంకో సిగరెట్టడిగి తీసుకుని తాగి నవ్వుతూనే ఉన్నాడు. 

    మనిషొక్కసారిగా బోల్డు రిలాక్స్ అయినట్టు కనిపించాడు. 

    ఆ తరవాత ఇద్దరం కూర్చుని  ఏవో మాటాడుకుంటూ ఉన్నాం. 

    ఇంతలో శర్మొచ్చి "ఒక్క కేసు కూడా తడవలేదండి. అన్నీ బావున్నాయి" అని చెప్పాడు. 

    విశ్వనాథం గారు కూడా వచ్చి "రాత్రంతా ఈయనిక్కడే వున్నాడండి. కుఱ్ఱాళ్ళని పెట్టి గోతులు తవ్వించి నీళ్ళు తోడిస్తూనే వున్నాడు. నేను చెప్తూనే ఉన్నాను మీకు. ఏమీ పాడవలేదని చెప్పేసి. మీరు ఊరికే ఇదైపోయారు" అని.

    "అబ్బే! చూశా కదా...గమ్మున ఏమన్నా నీళ్ళెళ్ళినయ్యేమో - పొగాకు పాడవుతుందేమో అని భయమేసి అలా అన్నాలే. సరే...ఇక మీరెళ్ళండి... " అని వాళ్ళని పంపించేశాడు ఆ ఐటీసీ మేనేజర్.  

*** *** ***
*** *** ***

     ఈ " కో. బ్రా. " అనే మాటని ఐటీసీ మేనేజరు  మా కంపెనీలో అజిత్ గారని చెప్పేసి ఒక మైసూరు నుంచొచ్చిన ఫేక్టరీ మేనేజర్ ఉండేవాడు కదా -.ఆయనా, ఈయనా ఫ్రెండ్స్ - ఆ అజిత్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పాడు.

    అంతే కాకుండా గుంటూరు టొబాకో సర్కిల్స్ అన్నిట్లో అంటించాడు - కామేశ్వరావు "కో. బ్రా. " అని చెప్పి. 

    ఆ అజిత్ గారు కర్ణాటక మొత్తం - బయ్యింగ్‌కి వెళ్తాం కదా మేము - రామనాథపుర, షిమోగా, పెరియపట్న, హున్సూరు - మొత్తం అన్ని చోట్లా కూడా ఆయన - ఈ విషయం అక్కడ చెప్పి "ఒరే! వీడు కోబ్రాగాడురోయ్ వీడు" అని చెప్తుండేవాడు. 

    ఆయనే లక్ష్మయ్యగారికి కూడా చెప్పాడు. 

    లక్ష్మయ్య గారు జరిగింది తెలుసుకుని -  "ఇంత జరిగిందా" అని నవ్వి -  "అందుకే కామేశ్వర్రావుని అక్కడ పెట్టాను. ఇటువంటి తమాషాలు చేస్తాడనే కదా" అని అన్నాట్ట ఆయనా! 

    ఇప్పటికి నా "కో. బ్రా." పొడుపుకథ విప్పా కదా - ఇక్కడ ఆపుతున్నా! తతిమ్మా విషయాలు మళ్ళీ ఇంకోసారి చెప్తా! 


<వచ్చేమాటు తరువాయి కథ>

9, జనవరి 2022, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 25 - గాబరా పెట్టిన కోబ్రా!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 24 - పల్టీ కొట్టిన కారు; పట్టి నేర్చుకున్న ఆకు...


    గోల్డెన్ కంపెనీలో చేరింతర్వాత మా కృష్ణస్వామిగారికి ఫోన్ చేశాను. ఆయనే నా మొదటి గురువు ఎక్సైజులో ఎమ్మెల్ కంపెనీలో. ఆయన తోనే కదా నేను ఛాలెంజ్ చేశాను - ఇదే కంపెనీలో నేను ఐదంకెల జీతం తెచ్చుకుంటానని! 

    ఆయనకి ఫోన్ చేసి "కృష్ణస్వామిగారూ...నేనిలా గోల్డెన్‌లో చేరానూ, మూడంకెల్లోంచి నాలుగంకెల్లోకి ప్రవేశించానని" చెప్పాను. చెప్తే ఆయన సంతోషించి "ఒరే...నువ్వు అదే గోల్డెన్‌లో కంటిన్యూ అవ్వూ... మాన్యుఫాక్చరర్స్ కంపెనీ అదీ... నువ్వక్కడే కొనసాగితే ఐదంకెలు కాదు ఆరంకెలక్కూడా వెళ్ళిపోతావు" అంజెప్పి ఆశీర్వదించాడాయన. 

*******
*******

    సరే - ఆ విధంగా గోల్డెన్ టొబాకోస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. 

    ఈ లోపులో ఏమైందంటే 1982 నవంబర్‌లో నాకు బ్రేకు పడే వ్యవహారం వచ్చింది. గోల్డెన్ కంపెనీలో ఉద్యోగానికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 

    అదెలాగంటే... 83 నవంబర్ దాకా ఈ గ్రేడింగ్ పాయింట్లూ అవీ చూస్తున్నాను. 

    మార్టూరులో లక్ష్మయ్య గారికి త్రెషింగ్ ప్లాంటూ, ఫేక్టరీ వున్నాయి. ఈ గోల్డెన్ టొబాకో కంపెనీ దాన్ని పాతికేళ్ళకి లీజుకి తీసుకుంది. 

    మా బాసు ఖేతాన్ గారు గోల్డెన్ కంపెనీలో జనరల్ మేనేజర్  ఆయన నన్ను అంతకు ముందు 1981 లో ఎమ్మెల్ కంపెనీలో ఫేక్టరీ కో-ఆర్డినేటర్‌గా టెస్ట్ చేసున్నాడు కదా! ఆయనేం చేశాడంటే - నన్ను గుంటూరుకి పిలిపించి "కామేశ్వరరావుగారూ! మార్టూరు ఫేక్టరీ కో-ఆర్డినేటర్‌గా మిమ్మల్ని నియమిస్తున్నాం. మీరు వెళ్ళి మార్టూరులో ఉండాలి. అక్కడ కంపెనీకి మనం పాతిక సంవత్సరాలు లీజుకి తీసుకున్నాం." అంజెప్పేసి అన్నాడు. 

    ఇది ఎప్పుడూ...1983 నవంబర్-డిసెంబర్ ఆ ప్రాంతాల్లో. "ఓకే వెళ్తాను సర్...దాందేవుంది...ఎక్కడన్నా చేయాల్సిందే కదా!" అని నేనన్నాను. 

    వెంటనే ఆయన "సరే మరి! అయితే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ మన గెస్టు హౌసులేవో ఉన్నాయి. మీరు మీ ఫామిలీతో ఆ గెస్ట్ హౌసులో ఉండి జాగ్రత్తగా ఆ ఫేక్టరీ మేనేజ్‌మెంటు చూసుకోండి" అన్నాడు. 

    అప్పుడు నేనొకటే చెప్పాను ఆయనకి. "చూడండి సర్! నేను పొగాకు కంపెనీల్లో ఉద్యోగం మొదలుపెట్టినప్పట్నించీ పల్లెటూళ్ళలోనే పని చేయడం వల్ల నా పిల్లల్ని ఎప్పుడూ కూడా గవర్నమెంటు స్కూళ్ళలోనే గానీ ఎక్కడా కాన్వెంట్లలో చదివించలేకపోయాను. ఇప్పుడు పెద్దమ్మాయి పదోతరగతి చదువుతోంది. ఇక వచ్చే ఏడాది కాలేజ్‌కి వెళ్తుంది. మిగతా ఇద్దరు పిల్లలు కూడా హైస్కూలుకి వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో నాకేదైనా టౌన్ బేస్ ఇవ్వండి. నేను అక్కడుండి మార్టూరులో పని చేస్తాను." అని. 

    నేనలా అనగానే ఆయన "ఎక్కడ కావాలి టౌన్‌బేస్ నీకు" అనడిగాడు. 

    దానికి నేను "గుంటూరు మంచి ఎడ్యుకేషన్ సెంటర్. నాకు గుంటూరు టౌన్‌బేస్ ఇస్తే నేను రోజూ మార్టూరుకి అప్-ఎండ్-డౌన్ చేస్తాను. ఏదన్నా అర్జెంటు పని ఉన్నప్పుడు ఒకట్రెండ్రోజులు అక్కడే గెస్టుహౌస్‌లో ఉండిపోతాను. అంచేత నాకు గుంటూరు టౌన్‌బేస్ ఇస్తే నేను జాబ్ చేస్తాను" అని చెప్పాను. 

    అది విని ఆయన "నో! దానికవకాశం లేదు. నువ్వు మార్టూరు లోనే ఉండాలి. అక్కడ ఫేక్టరీలో మన సొంత ప్యాకింగు. చాలా పని ఉంటుంది. రౌండ్-ది-క్లాక్ అక్కడే ఉండి చూసుకోవాల్సి ఉంటుంది. పొదున్న ఆరింటి నుంచి రాత్రి పదింటి దాకా నువ్వు అక్కడే ఉండాలి. అంచేత నీకు మార్టూరు లోనే ఇస్తాము. నువ్వక్కడే ఉండాలి" అని ఖచ్చితంగా చెప్పాడు.

    ఆయనలా చెప్తున్నప్పుడు - శంకరనారాయణ గారు, వీరయ్యగారు, నరేంద్ర అని ఓ ఫైనాన్స్ మేనేజరు - వీళ్ళందరూ కూడా ఆ బోర్డ్-మీటింగులో ఉన్నారు. 

    అలా చెప్పాక ఖేతాన్ గారు "ఆలోచించుకుని రేపు పొద్దున్న చెప్పు" అన్నాడు. 

    గుంటూర్లో గోల్డెన్ గెస్ట్‌హౌస్ ఉండేది. అక్కడకెళ్ళినప్పుడు ఆ గెస్ట్‌హౌస్ లోనే ఉండేవాణ్ణి నేను.

    ఈ లోపులో వీరయ్యగారు నా దగ్గరకొచ్చాడు. వచ్చి "కామేశ్వర్రావు గారూ! వచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఓకే అనెయ్యండి. తర్వాత నెమ్మదిగా చూద్దాం." అన్నాడు. 

    నేనప్పుడు "లేదండీ! ఇప్పుడే తేల్చుకోకపోతే కష్టమిది. నాకేదైనా టౌన్‌బేస్ కావాలి. అదిస్తే మాత్రం ఉంటా. లేకపోతే ఉండను." అని చెప్పేసి చెప్పా. 

    "సరే! ఆలోచించుకోండి" అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. 

*******
*******

    మర్నాడు పొద్దున్న ఖేతాన్ గారి దగ్గరికెళ్ళా. 

    వెళ్ళి కూర్చుని "నాకు టౌన్‌బేస్ ఇవ్వనంటున్నారు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నానండి ఉద్యోగానికి. నేను వెళ్ళిపోతాను ఇక్కణ్ణించి" అన్నాను. 

    "వెళ్ళిపోయి ఏం చేస్తావ్" అనడిగాడు ఖేతాన్ గారు.  

    "నాకు కోనసీమలో వ్యవసాయం ఉంది. పక్కనే అమలాపురంలో నేను చదివిన ఎస్కేబీఆర్ కాలేజ్ ఉంది. పిల్లనక్కడ జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళిపోతానండి. నే ఉండనిక్కడ. నాకిస్తే టౌన్‌బేస్ ఇవ్వండి. ల్యాపోతే నేను చెయ్యను" అని చెప్పా. 

    దానికి ఆయన "నీ ఇష్టం! ఇంకో నాల్రోజులు టైమిస్తున్నా. ఆలోచించుకుని చెప్పు" అన్నాడు. 

    "ఇందులో ఇక నేనాలోచించేది ఏవీ లేదు.  నా ఎకౌంటు సెటిల్ చేసేయండి. నేనుండను." అని చెప్పి బైటకొచ్చేశాను. 

    వచ్చేసి గెస్ట్‌హౌస్ నుంచి మా సుబ్బన్నగారికి ఫోన్ చేశాను. చేస్తే ఆయన కూడా "సరే! ఆలోచించుకో. తొందర పడకు." అన్నారు. 

*******
*******

    ఈలోపులో ఇక్కడ పోలిశెట్టి సోమసుందరం గారి కంపెనీ ఒకటుంది. అందులో హరిగారని చెప్పేసి సోమసుందరం గారి తమ్ముడు ఉండేవాడు.  ఆయన కూడా నాకు బాగా తెలుసు. లక్ష్మయ్య గారి కంపెనీతో సమానమైన కంపెనీ పోలిశెట్టి వాళ్ళది. వాళ్ళకి బయ్యర్స్ అవసరమని చెప్పేసి తెలిసింది. అది నాకు సుబ్బన్నగారే చెప్పారు. 

    మరుసటి రోజు పొద్దున్నే హరి గారి దగ్గరికెళ్ళాను. 

    వెళ్ళి "సర్! నేను ఇట్లా ఎమ్మెల్‌లో చేసి, అక్కణ్ణించి వెళ్ళి గోల్డెన్‌లో చేసొచ్చాను. నాకు టౌన్‌బేస్ కావాలని అక్కడ మానేస్తున్నాను. మీరేదైనా అవకాశం ఉంటే ఇస్తే మీ దగ్గర జాయిన్ అవుతాను" అంటే పాపం ఆయన తక్షణమే నాకు ఉద్యోగం ఆఫర్ ఇచ్చేశాడు. 

    నేనప్పుడు "మీరు బయ్యింగుకి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. మైసూరు పంపించినా, వెస్ట్ గోదావరి పంపించినా, ఎక్కడికైనా వెళ్తా. కానీ నేను ఉండడం గుంటూర్లోనే ఉంటా." అని చెప్పా. దానికి సరేనన్నాడాయన. 

    ఇహ వెంటనే ఖేతాన్ గారి దగ్గరికి వెళ్ళి నా ఎకౌంట్ సెటిల్ చేయించుకుని టంగుటూరు వెళ్ళిపోయాను. 

*******
*******

    ఈలోపులో అక్కడ కొన్ని మార్పులు జరిగాయి. 

    లక్ష్మయ్య గారికి గుంటూర్లో ఫేక్టరీ ఒకటుంది. కే ఎస్ సుబ్బయ పిళ్ళై పేరు మీద ఉండేదది. 1973లో లక్ష్మయ్యగారు కొన్నాడది. ఆ ఫేక్టరీ ఆయన అన్నగారు మద్ది సత్యం గారికి లీజుకిచ్చాడు. ఆ లీజ్ పీరియడ్ ఇప్పుడు అయిపోయింది. 

    అక్కడ మేనేజర్ డిసౌజా అని ఒకాయన ఉండేవాడు. ఆ డిసౌజా వేరే చోట ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోదామనుకుని ఇక్కడ ఫేక్టరీలొ రిజైన్ చేద్దామనుకున్నాడు. ఈలోగా లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది. సత్యం గారు ఫేక్టరీని విదిలేస్తున్నాడు.   

    లక్ష్మయ్యగారూను, ఖేతాన్ గారూను మంచి స్నేహితులు. ఇద్దరూ రోజూ కలుసుకుంటూ ఉండేవారు. ఓ రోజు లక్ష్మయ్యగారు ఖేతాన్ గారి దగ్గర కూర్చున్నప్పుడు "గుంటూరు ఫేక్టరీ మళ్ళీ నా హ్యాండ్-ఓవర్ లోకి వచ్చేస్తోంది. దానికి మంచి ఫేక్టరీ మేనేజర్ కావాలి. ఎవరైనా మంచి కుఱ్ఱాడైతే బావుంటుంది. అది లాంగ్-టైం వుంటుంది కదా!" అన్నాడట. 

    అది వింటూనే ఖేతాన్ గారు నన్ను రికమెండ్ చేశాడట. "ఎవరో ఎందుకు? మీ దగ్గర పని చేసినవాడే ఉన్నాడు కదా! వాణ్ణే తీసుకోవచ్చు కదా!" అని.

    దాంతో లక్ష్మయ్యగారు "ఎవరూ నా దగ్గర పనిచేసినవాళ్ళు?" అనడిగాడట.

    "అదే ... కామేశ్వర్రావని మీ దగ్గరే ఇంతకు ముందు చేశాడు. ఈ మధ్య రెండేళ్ళు నా దగ్గర చేశాడు. అతనికేమో టౌన్‌బేస్ కావాలంటున్నాడు. నేనేమో మార్టూరు ఫేక్టరీ మేనేజర్‌గా పంపిద్దామనుకుంటే - 'నేను వెళ్ళను, నా ఎకౌంట్ సెటిల్ చేసేయ'మన్నాడు. గుంటూరు ఇమ్మంటున్నాడు. అంచేత ఆ కుఱ్ఱాణ్ణే తీసుకోవచ్చు కదా! మంచి వర్కర్ అతను." అని చెప్పేసి ఖేతాన్ గారే నన్ను లక్ష్మయ్య గారికి రికమెండ్ చేశాడట. 

    అది వింటూనే  లక్ష్మయ్య గారేమో "అతనొస్తానంటే నాకభ్యంతరం ఏముంటుంది? నాకు తెలుసు అతను. చాలా బాగా వర్క్ చేస్తాడని" అనేసి - అంతటితో ఆగక అప్పాయింటుమెంటు లెటర్ కూడా నా పేరు మీద ఇచ్చేశాడట. 

    గుంటూరు ఫేక్టరీలో డిసౌజా గారికి ఆ లెటర్ పంపించి "మా ఫేక్టరీ మేనేజర్ కామేశ్వరరావు అని వస్తాడు. ఇన్వెంటరీ అంతా కూడా అతనికి హ్యాండోవర్ చేసేయండి" అని చెప్పాడట. 

    నాకు ఈ విషయాలన్నీ అసలు తెలీదు. 

    నేనేమో టంగుటూరు వెళ్ళిపోయాను కదా! 

    డిసెంబర్ 31 వ తేదీన మా సుబ్బన్నగారికి, ఖేతాన్ గారికీ న్యూ ఇయర్ విషెస్ చెబ్దామనుకుని నేను బయల్దేరి చిలకలూరిపేట వచ్చాను.

1984 జనవరి ఒకటో తారీఖు

    నేను టంగుటూరు నుంచి బయల్దేరి సుబ్బన్న గారికీనూ, ఖేతాన్ గారికీను గ్రీటింగ్స్ చెబ్దామని చిలకలూరిపేట వచ్చాను. వచ్చి బొకేలు అవీ తీసుకుని సుబ్బన్న గారింటికెళ్ళా.

    ఆ టైములో సరిగ్గా ఆయన బ్రేక్‌ఫాస్టు చేయబోతున్నాడు. 

    నన్ను చూసి "రారా బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం" అని నన్ను కూడా పిలిచాడక్కడికి. వాళ్ళమ్మగారు వాళ్ళూ కూడా నాకు బాగా తెలుసు. ఆ చనువుతో నేను కూడా ఆట్టే మొహమాటపడకుండా సుబ్బన్న గారితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. 

    ఆయనకి చాలా ఇష్టమైనదేంటంటే కట్టు పొంగలి. ఆ రోజు కట్టుపొంగలి చేశార్టింట్లో.  ఇద్దరం కూర్చుని బ్రేక్‌ఫాస్టు చేసింతర్వాత ఆయనకి గ్రీటింగ్స్ చెప్పాను. 

    ఆ తర్వాత ఆయన "ఎప్పుడు జాయిన్ అవుతున్నావు నువ్వు గుంటూరు ఆఫీసులో?" అనడిగాడు. 

    అది వింటూనే  నేను గుంటూరులో చేరబోతున్న పోలిశెట్టి హరి గారి ఆఫీసు గురించి అడుగుతున్నారేమో అనుకుని "పండగెళ్ళాక జాయిన్ అవుతానని ఆయనతో చెప్పొచ్చానండి" అన్నా. 

    "ఎవరికి చెప్పావు? ఏంటి" అన్నాడు సుబ్బన్న గారు. 

    "మీరు నాకు గుంటూరు పోస్టింగ్ కావాలీ అంటే పోలిశెట్టి హరిగారి దగ్గరికి  వెళ్ళమన్నారు కదా! వెళ్ళాను. ఆయన సరే నన్నాడు. అంచేత అక్కడ జాయిన్ అవుతున్నాను" అన్నా. 

     నేనలా అనగానే సుబ్బన్న గారు "లేదు లేదు. లక్ష్మయ్యగారు నీకు గుంటూరు ఫేక్టరీ మేనేజర్‌గా పోస్టింగ్ ఇచ్చాడు. మళ్ళీ మన కంపెనీకే వస్తున్నావు నువ్వు. అంచేత మన కంపెనీ ఫేక్టరీలో ఎప్పుడు చేరుతున్నావని అడిగాను. ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవుతున్నావ్?" అని మళ్ళీ అడిగాడాయన. 

    నాకది అసలు ఊహించని పరిణామం. 

    "నాకసలు తెలీదు సర్ ఇది, నాకెవ్వరూ చెప్పలేదు." అన్నాన్నేను.

    "సరే! అయితే. ఓ పని చెయ్. నువ్విప్పుడు ఓ బొకే తీసుకుని లక్ష్మయ్య గారింటికి వెళ్ళు. ఆయనకి గ్రీటింగ్స్ చెప్పు. ఆయనే చెప్తాడు నీకు" అని ఓ సలహా ఇచ్చాడు నాకు సుబ్బన్నగారు. 

    ఆయన చెప్పినట్టే లక్ష్మయ్య గారి దగ్గరికి వెళ్ళాను. లక్ష్మయ్య గారికి పూల బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాక, ఆయన "ఆ! కామేశ్వర్రావ్! ఎప్పుడు జాయిన్ అవుతున్నావ్?" అనడిగాడు. 

    నేను వెంటనే "సంక్రాంతి పండగ వెళ్ళాక జాయిన్ అవుతాను " అని అనేశాను. 

    ఆయనకి ఇంకేమీ చెప్పలేదు. అలా అనేసి వచ్చేశాను. 

    వచ్చి మళ్ళీ సుబ్బన్నగారి దగ్గరికెళ్ళి "సర్!ఇదేం ట్విస్ట్ ఇది? నేనేమో పోలిశెట్టిలో జేరతానని హరి గారికి చెప్పాను. ఈయనేమో ఎప్పుడు జాయిన్ అవుతావంటే ఈయనకేమో పండగెళ్ళాక అని చెప్పాను. ఇప్పుడేమిటి సర్ చేయడం" అన్నా. 

    సుబ్బన్న గారు "సరే! ఓ పన్జెయ్. నువ్విపుడింక గుంటూరు వెళ్ళకు. వెనక్కి టంగుటూరు వెళ్ళిపో. మంచిరోజు చూసుకుని బయల్దేరి చిలకలూరిపేట రా. మనిద్దరం కలిసి గుంటూరెళ్దాం. నిన్నేమో డిసౌజాకి పరిచయం చేస్తా. అక్కడ ఫేక్టరీలో ఛార్జ్ తీసుకో. తీసుకున్నాక ఇద్దరం కలిసి హరి గారి దగ్గరికెళ్దాం. ఆయన తోటి నేను కూడా మాట్లాడతాను. ఆయన కూడా ఏమనడులే" అని చెప్పేసి అన్నాడు. 

    సరే అని  - సుబ్బన్నగారు చెప్పినట్టే నేను టంగుటూరు వచ్చేశాను. 


*******
*******

    వచ్చేసి మళ్ళీ మంచిరోజు చూసుకుని పదో తారీఖు లోపులో - ఐదారు తారీఖుల్లో అనుకుంటా - తేదీ సరిగ్గా గుర్తు లేదు నాకు - ఆ టైములో మళ్ళీ చిలకలూరిపేట వెళ్ళాను. అక్కణ్ణించి సుబ్బన్నగారూ, నేనూ కార్లో గుంటూరు వెళ్ళాం. 

    గుంటూరెళ్ళింతర్వాత ఫేక్టరీకి వెళ్ళాం. అక్కడ అప్పటికి మేనేజరుగా డిసౌజా గారున్నాడక్కడ. ఆయనకి నన్ను పరిచయం చేశాడు సుబ్బన్న గారు. "వీడే కామేశ్వర్రావ్. మా కొత్త ఫేక్టరీ మేనేజరు" అని చెప్పాడు. 

    అప్పుడు ఆ డిసౌజా కూడా  - ఆయనేదో వేరే చోట ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు - "నేను తొందరగా హేండోవర్ చేసేస్తాను. నేను కూడా రిలీవ్ అయి వెళ్ళిపోవాలి" అంటే నేను ఆయనతో "వుంటానండి ఓ రెండ్రోజులిక్కడ. ఛార్జ్ తీసుకునే నేను వెనక్కి వెళ్తాను" అంజెప్పేసి అన్నాను . 

    అక్కడికదయ్యాక సుబ్బన్నగారు, నేను కలిసి పోలిశెట్టి హరి గారి దగ్గరికెళ్ళాం. 

    నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే అంతకు ముందు అసలేమీ అడక్కుండా నాకు ఉద్యోగం ఇచ్చేశాడు. అటువంటిది ఆయన దగ్గర చేరట్లేదని చెప్పడానికి కొంచెం మొహమాట పడ్డాను. 

    నాతో కూడా సుబ్బన్న గారు వచ్చారు కదా! ఆయనేమో హరి గారితో  "హరీ! ఇదీ పరిస్థితి. లక్ష్మయ్యగారు మళ్ళీ వీణ్ణి వెనక్కి రమ్మన్నాడు. ఫేక్టరీ మేనేజర్ కావాలి మాకు." అన్నారు. 

    దాంతో హరి గారు  "దాందేవుంది! మొదట్నుంచీ మీ కంపెనీ లోనే చేస్తున్నాడు కదా- ఓకే! ఇట్సాల్రైట్! నో ప్రాబ్లం" అని నాకేసి తిరిగి "ఓకే కామేశ్వర్రావ్! అక్కడే కంటిన్యూ చేసుకో. అప్పుడప్పుడూ వస్తూండు కంపెనీకి" అన్నాడు. 

    సరే! అక్కడితోటి ఆ సమస్య పరిష్కారమైపోయింది. 

*******
*******

    ఆ తర్వాత సుబ్బన్నగారితో "నేను ఓ రెండ్రోజులు గుంటూర్లో ఉండిపోతానండి! ఎందుకంటే పండగెళ్ళాక నేనిక్కడికి రావాలంటే - అంటే జాయిన్ అవడం పది లోపులో జాయిన్ అవుతానని చెప్పాను. కానీ ఛార్జ్ ఆయన దగ్గర ఆల్రెడీ తీసేసుకుంటాను. రేపూ-ఎల్లుండీ కూడా మంచిరోజులేను! తీసేస్కుని నేను ఇల్లోటి వెతుక్కోవాలి కదా - ఫామిలీ షిఫ్ట్ చేయాలి నేను టంగుటూరు నుంచి గుంటూరుకి. అందుకని చెప్పేసి నేను ఓ రెండ్రోజులు ఆగి వెళ్తాను " అంజెప్పి గుంటూర్లో ఆగిపోయాను. 

    అలా నేను గుంటూర్లో ఆగిపోయాను. సుబ్బన్నగారు పేటకి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నేను గుంటూరు ఫేక్టరీలో డిసౌజా గారి దగ్గర ఛార్జ్ తీసుకున్నాను.

    గుంటూర్లో ఇంటి కోసం వెతికితే - శ్రీనివాస్ నగర్ కాలనీ - అంటే జేకేసీ కాలేజ్ దగ్గర అంటే గుజ్జనగుళ్ళ - అక్కడ దొరికింది ఒక ఇల్లు. 

    వెళ్ళి ఆ ఇంటి ఓనర్‌తో మాట్లాడుకుని - పిల్లల పరీక్షలు అయిపోయాక వేసవి సెలవుల్లో వచ్చి ఇంట్లో చేరతామని వాళ్ళకి చెప్పి నేను బాక్ టు టంగుటూర్! 

    టంగుటూరు వచ్చేసింతర్వాత పండగలు టంగుటూర్లో అయిపోయినాయి. శేషయ్య గారు మా ఇంటి ఓనరు కదా! 

    "ఇరవై తర్వాత నేను వెళ్ళిపోతున్నానండి గుంటూరూ ... నాకు ప్రమోషన్ వచ్చింది ఫేక్టరీ మేనేజరుగా. ఫామిలీ కూడా షిఫ్ట్ చేస్తున్నాను. నేను ముందుగా ఇరవయ్యో తారీఖు కల్లా గుంటూరు వెళ్ళిపోతాను. మా లల్లి టెంత్ క్లాస్ పరీక్షలు అయిపోగానే మీ ఇల్లు ఖాళీ చేస్తాము.  ముందుగా మీకు చెప్తున్నాను. ఏప్రిల్ నెల ఇంటి అద్దె కూడా మీకు పూర్తిగా ఇచ్చేస్తాన" అని చెప్పానాయనతోటి. 

    ఆయన కూడా ఒక పక్కన సంతోషించాడు. ఇంకో పక్కన బాధ పడ్డాడు. బాధెందుకంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నానని బాధ పడ్డాడు. నాకు ప్రమోషన్ వచ్చింది అని సంతోషించాడు.  

    అనుకున్నట్టుగానే లల్లి పరీక్షలు అవగానే బయల్దేరి గుంటూరెళ్ళిపోయాం - గుజ్జనగుళ్ళ దగ్గరున్న  ఎస్వీఎన్ కాలనీకి. 

    ఎక్కువకాలం లేమక్కడ - మూడో నాలుగో నెలలు వున్నామంతే! . అక్కణ్ణించి మళ్ళీ బ్రాడీపేట నాలుగో లైను, పద్ధెనిమిదో అడ్డరోడ్డు - భీం నాయక్ గారింట్లో మధ్య వాటా లోకి అద్దెకెళ్ళాం. ఇక గుంటూర్లో వున్నంత కాలం - దాదాపు పదేళ్ళు ఆ ఇంట్లోనే అద్దెకున్నాం. 

    మొట్టమొదటేమో మధ్య వాటాలో ఉండేవాళ్ళం. తర్వాత అదే ఇంట్లో చివరి వాటా లోకి మారాము. పిల్లల్లో లల్లీ నేమో బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్ కాలేజ్ లోనూ, పప్పి, కుట్టీలిద్దర్నీ బండ్లమూడి హనుమాయమ్మ హైస్కూల్లోనూ చేర్చాము.

    నా మొట్టమొదటి ఉద్యోగంలో గురువుగారు కృష్ణస్వామి గారు  అప్పుడు మద్ది లక్ష్మయ్య గారి కంపెనీలో మానేశాడు. గుంటూరు లోనే ఉండేవాడాయన, అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. 

    గుంటూరు ఫేక్టరీ మేనేజరుగా రొటీన్ నడుస్తోంది. నేను రష్యన్ ప్యాకర్స్‌కి ఓ పది మందికి ప్యాకింగ్ చేసేవాణ్ణి. అది కాక డొమెస్టిక్ ప్యాకింగ్‌కి ఓ నూటేభై మంది ఉండేవారు. మొత్తమ్మీద రెండొందల మందికి ప్యాక్ చేస్తూ ఉండేవాణ్ణి. 

*******
*******

    

    ఇక్కడ 86లో జరిగిందోటి చెప్పాలి. 1986లో గాలివాన వచ్చింది. తూర్పు, పశ్చిమ గోదావరుల్లో విపరీతమైన గాలీ, వానానూ. అదే సమయంలో గుంటూర్లో కూడా తెగ వానలు కురిశాయి. 

   లక్ష్మయ్య గారిది ఒక గోడౌను ఇరవై వేల అడుగులదొహటి ఖాళీగా ఉంది. దాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి - లక్ష్మయ్య గారికి చెప్పి ఐఎల్టీడీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి స్టాక్ గోడౌన్ కింద ఇచ్చాను. 

ఐఎల్టీడీ వాళ్ళు స్టాక్స్ పెట్టుకున్నారక్కడ. అవీ ప్లైవుడ్ కేసులు. ప్రతీ కేసులో రెండొందల కిలోల పొగాకుండేది. అటువంటి వాటితో  ఇరవైవేల అడుగులు పూర్తిగా నింపేశారు వాళ్ళు - రెండ్రెండు కేసుల చొప్పున ఒకదానిమీదొకటి పెట్టుకుని.

    ఆ గోడౌన్ ఐఎల్టీడీకి ఇచ్చిన తర్వాత కేసులు అవీ పెట్టి విశ్వనాథం గారని చెప్పేసి ఓ పెద్దాయన ఏభై ఐదేళ్ళుంటాయి ఆయనకి అప్పటికి - ఆయన్ని అక్కడ గోడౌన్ కీపర్‌గా పెట్టారు. ఆ  పెద్దాయన కంపెనీ లోనే ఉండేవాడు. అక్కడే బయటేక్కడో భోంచేసేవాడు. రాత్రి అక్కడే పడుక్కునేవాడు. మొత్తానికి గోడౌన్ దగ్గరే ఉంటుండేవాడాయన. 

    1986లో ఈ భయంకరమైన వర్షాలు పడ్డప్పుడు ఏమయిందంటే ముఠావాళ్ళందరికి వర్షాలని ఫేక్టరీకి సెలవిచ్చా. వాళ్ళు సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి వెళ్ళిపోయారు. 

    ఈ వర్షాలు ఎప్పుడైతే  మొదలయ్యాయో ఆ గోడౌన్ లోకి నీళ్ళు రావడం ప్రారంభించాయి . నాకసలు మతి పోయింది. 

    అక్కడ కింద వరస మొత్తం నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అప్పటికప్పుడు ఇంకెవ్వరు లేరు - ముఠావాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాచ్‌మెన్లు ఇద్దరున్నారు. వాళ్లతో పాటు విశ్వనాథం గారూ, నేనూను. 

    నాకేం చెయ్యాలో తోచక ఆ పక్కనే మా ఫేక్టరీలో పని చేసే లైన్ బాయ్స్ ఉండేవారు - ఓ ఆరుగురు. 

    వెళ్ళి ఆ వర్షంలో వాళ్ళని పట్టుకొచ్చాను. పట్టుకొచ్చి తెల్లవార్లూ వాళ్ళకి డ్యూటీ వేశాను. 

    అక్కడ గోడౌన్లో రెండు మూడు మూలల్లో బండలు తీసేసి గోతులు తవ్వించి ఆ నీళ్ళన్నీ ఆ గోతుల్లోకి చేరేలా చేసుకుని - ఈ ముగ్గురికీనేమో బకెట్లిచ్చి "ఒరే! తోడి బయట పారబోయండ్రా" అని చెప్పేసి అంటే పాపం! ఆ తెల్లవార్లూ నీళ్ళు తోడి పోస్తూనే వున్నారు - ఆరుగురూ కూడా షిఫ్టుకి ముగ్గురు చొప్పున. 

    తెల్లవారేటప్పటికి వర్షం తగ్గిపోయింది. 

    విశ్వనాథం గారూ, నేనూ కూడా తెల్లవార్లూ అక్కడే ఉన్నాం. మేం కూడా ఎక్కడికీ వెళ్ళలా. పొద్దున్నకల్లా - వర్షం తగ్గిందీ, ఆ నీళ్ళూ అవీ కూడా తగ్గిపోయినయ్. నేనప్పుడు ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ తొమ్మిదిన్నరకి ఆఫీసుకెళ్ళా.

  ఈ గోడౌన్సుకి ఇన్-ఛార్జ్  ఐఎల్టీడీలో ఓ మార్కెటింగ్ మేనేజర్. 

    ఆయన తొమ్మిదింపావుకో ఎంతకో గోడౌన్ దగ్గరికి వచ్చాడు. 

    విశ్వనాథంగారు కూడా టిఫిన్ చేయడానికని బయటికి వెళ్ళాడట. 

    ఈ మార్కెటింగ్ మేనేజర్ కారు దిగి సరాసరి గోడౌన్ లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి చూస్తే అక్కడ పొగాకు కేసుల అడుగు కింద వరస కొద్దిగా తడిసింది. 

    అది చూసి ఇక అక్కణ్ణించి ఆయన చిందులేయడం మొదలు పెట్టాడు. 

    ఈలోపులో నేనొచ్చాను. 

    ఐఎల్టీడీ మేనేజర్ వచ్చాడని చెప్తే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళాను.     

    వెళ్ళేటప్పటికి ఆయన గొంతు పెంచి మాట్లాడుతున్నాడు. 

    "అంతా పాడు చేసేశారు!  గోడౌన్లోకి నీళ్ళొచ్చేశాయి." అంటూ. 

    నేనెళ్ళి "ఏంది, సర్! గోడౌన్ లోకి నీళ్ళొస్తే నేనేం చేస్తాను? నాచురల్ కలామిటీ ఇది! నా చేతిలో లేంది. వర్షాన్ని నేనాపలేను కదా! నేనేం రావణాసురుణ్ణి కాదు - నేనేం చెయ్యగలను? వచ్చింది. అప్పటికీ ఏదో ప్రయత్నం చేశాం రాత్రి." అని చెప్పేసి అంటుంటే ఆయన అదేం వినిపించుకోకుండా "ఏం చేశావ్? ఇప్పుడొచ్చావ్ నువ్వు. ఏం చేశావ్ ప్రయత్నం?" అని గద్దిస్తూ మునిగిపోయే ఓడ పోలికొకటి చెప్పాడు నాకు. 

    "ఒక ఓడ ఏంకరింగ్ అయింతర్వాత తుఫాను వచ్చినప్పుడు ఆ ఓడలో ఉన్న క్రూనంతా బయటికి పంపించి కెప్టెన్ ఓడలో ఉండిపోతాడు ఓడ మునిగేవరకు. అలా ఉండాలి మేనేజర్ అంటే. నీ పాటికి నువ్వు సాయంత్రం వర్షం పడిందని వెళ్ళిపోయి బయటెక్కడో ఎంజాయ్ చేసి ఇంటికెళ్ళిపోయావ్. చూడు ఇక్కడేం జరిగిందో" అంటూ ఊరికే ఎగిరెగిరి పడిపోతున్నాడు. 

    ఈ లోపులో విశ్వనాథం గారొచ్చాడు. 

    వచ్చి" లేదు సర్! కామేశ్వర్రావు గారు, నేను తెల్లవార్లూ ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడే ఉండి..." అని చెప్తూ వున్నాడాయన. 

    అయినా ఈయన వినట్లా. వినకుండా ఎగిరెగిరి పడిపోతున్నాడు. 

    నేనెప్పటికీ తమాయించుకుని  "చూడండి! నేను రాత్రంతా ఇక్కడే ఉన్నాను. పొద్దున్న వెళ్ళాను నేనింటికి. ఆ నీళ్ళన్నీ ఆరుగురు కుఱ్ఱాళ్ళని తీసుకొచ్చి తెల్లవార్లూ డ్యూటీ వేసి తోడించాను. విశ్వనాథం గారూ, నేనూ కూడా ఇక్కడే కూర్చున్నాము కుర్చీలు వేసుకుని. తెల్లావార్లూ మాకు నిద్దర్లేదు." అని సామరస్యంగా చెప్తున్నాను. 

    అయినా సరే ఇంకా ఏమీ వినకుండా ఊరికే తాండవం చేసేస్తున్నాడాయన. 

    నాకూ కోపమొచ్చింది. కొంచెం కళ్ళెఱ్ఱబడ్డాయి. 

    "ఏంటి? మర్యాదిచ్చి జరిగిందేదో చెప్తుంటే ఎక్కువ మాటాడుతున్నారేంటి? అసలు నా సంగత్తెలుసా నీకు? ఏవనుకుంటున్నావు నువ్వు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ నువ్వూ?" అని నేను ఎదురు మాట్లాడడం మొదలు పెట్టాను. 

    అప్పుడాయన కొంచెం తగ్గి "అంటే ఏంటి? ఏం జేస్తావ్? అసలెవర్నువ్వు?" అనడిగాడు నన్ను. 

    అడిగేటప్పటికి "సీ మిస్టర్ మేనేజర్! అయాం ఏ కోబ్రా!" అన్నా. 

    అనేటప్పటికి ఆయనకి నేనేమంటున్నానో ఏమీ అర్థం కాలేదు.  కోబ్రా అన్న మాట వినగానే ఒక్కసారిగా చల్లబడిపోయాడు మనిషి. 

    "కోబ్రానా? కోబ్రా అంటే?" అని గాబరా పడిపోయాడు. 

    "కోబ్రా అంటే తెలీదా నీకు? కళ్ళల్లోకి విషం చిమ్ముతుంది. కళ్ళు గుడ్డివైంతర్వాత కాటేస్తుంది. తెలుసుకో. ఏవనుకుంటున్నావ్? ఇష్టమొచ్చినట్టు మాటాడుతున్నావ్! ఇక్కడ ఆ కుఱ్ఱాళ్ళు, స్టాఫూ వాళ్ళందరూ ఉన్నారు. నడు ఆఫీసు లోకి! మాటాడుదాం. అక్కడ కూచుందాం దా1 " అని చెప్పేసి నేనొచ్చేశాను. 

    ఆయన భయపడి చల్లబడ్డాడు. 

    నా వెనకాలే ఆయన కూడా నా ఆఫీసు లోకి వచ్చాడు. ఇద్దరం నా ఆఫీసులో కూర్చున్నాం. 

    కూర్చున్నాక ఆఫీసు బాయ్‌ని పిలిచి "అరెయ్! ఓ రెండు కాఫీలు తీస్కురా!" అన్నా. 

    కాఫీలొచ్చాయి. ఇద్దరం కాఫీలు తాగాం. చెరికో సిగరెట్టు ముట్టించుకున్నాం. 

    ఆయన కూలయ్యాడు. నేనూ ప్రశాంతంగా ఉన్నాను. 

    కోబ్రా-కథా-కమామీషులతో కొనసాగింపు ఇంకోమాటు! 

<వచ్చేమాటు తరువాయి కథ>

 

6, సెప్టెంబర్ 2021, సోమవారం

పోలాల అమావాస్య పూట - అప్పటికప్పుడు ఆశువుగా నాన్న పాట...

ఒక పాట ఎలా పుడుతుంది?
ఒకరు మాటలు పేరిస్తే ... 
ఇంకొకరు స్వరాలు కూరిస్తే ... 
వేరొకరు దరువేస్తే ... 
మరెవరో గొంతు సవరిస్తే ... 

ఇందరు సమకూడితేనే... 
కదా!

ఒక్కో పాట పుట్టాలంటే ఏం జరగాలి?
మనసు కదలాలి 
మాట మెదలాలి 
వరస కుదరాలి 
పదము పలకాలి 

ఇవన్నీ సమకూరితేనే... 
అవునా?!

*******
*******


    కానీ - పోలాల అమావాస్య పూట మా నాన్న పాడిన పాటకి ఇన్ని వివరాలు ఉన్నట్లు లేవు, అన్ని విశేషాలు అమరినట్లూ లేవు. అయినా ఆయన పాడిన పాట నాకు నచ్చేసింది. 

    "పాట భలే ఉంది, నాన్నా! మీరే కట్టారా?" అని నేనడిగితే ఫోనుకి అవతల నుండి గలగలలాడుతూ "కందమొక్క తెచ్చారు పొద్దున్నే పోలాలమావాస్య పూజ కోసమనీ - అంతే! పాట కట్టి పాడేశా!" నంటూ అహహ్హాలాడారు నాన్న. 

    పాటలో మాటలు అప్పటికప్పుడు అల్లుకుని - నీలం రంగు మూత పెట్టిన ప్లాస్టిక్ డబ్బా మీద దరువేసుకుని - మధ్యమధ్యలో మా అమ్మ నవ్వులని, కాలి మువ్వల సవ్వడిని కూడా కలుపుకుని - రెండు పాటల వరసలని వాడుకుని (ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మీ తల్లీ! అన్న పాట వరసలో మొదలుపెట్టి సీతారాముల కళ్యాణము చూతము రారండీ... అన్న పాట వరసని కూడా వాడేసుకుని) - పైగా చివర్లో - పాటని ఆపకుండా ఆశువుగా పాడేసుకున్నందుకు - మీకు మీరే  "శెభాష్!" అనేసుకోవడం - నాన్నా! మీ ఉత్సాహం భలే! భలే! బాగు... బాగు!

    ఇదిగో --- మీ పాట ఈ కింద రాసి పెట్టా... అంత కన్నా కింద యూట్యూబ్ లింక్ కూడా పెట్టా! కనండి... వినండి... కలకలమనండి! 



*******
*******

పోలమ్మ తల్లీ... రావమ్మా!
అమ్మా ... ఆ... 
పోలమ్మ తల్లీ... రావమ్మా!
మము గన్న జననీ... 
పోలమ్మ తల్లీ... రావమ్మా!

కందమొక్కను - ఇంటికి తెచ్చి 
మొక్కకు చుట్టూ - ముగ్గులు పెట్టి 
కందమొక్కను - ఇంటికి తెచ్చి 
మొక్కకు చుట్టూ - ముగ్గులు పెట్టి 
పసుపు కొమ్ములు - చెట్టుకు గట్టి 
ఆ... ఆ... ఆ... ఆ... అఅఅఆ.... 
పసుపు కొమ్ములు - చెట్టుకు చుట్టి 
ప్రతిష్ఠ చేసి పూజించేము... 

పోలమ్మ తల్లీ... రావమ్మా!
మము గన్న తల్లీ...  
పోలమ్మ తల్లీ... రావమ్మా!
మము గన్న జననీ... 
పోలమ్మ తల్లీ... రావమ్మా!
అమ్మా ... ఆ... 
పోలమ్మ తల్లీ... రావమ్మా!


*******
*******


యూట్యూబ్ లింక్: Naanna Paata - YouTube




31, జులై 2021, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 24 - పల్టీ కొట్టిన కారు; పట్టి నేర్చుకున్న ఆకు...

 కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 23 - గోల్డెన్ రోజులు అలా మొదలు...


    కిందటి మాటు -  గోల్డెన్ లో చేరిన తర్వాత నాకు ప్రొడక్షన్ మేనేజర్ గా ఒక పది గ్రేడింగ్ పాయింట్లు ఇచ్చారు అని చెప్పాను కదా!  

    అవీ - సింగరాయకొండ, చింతలపూడి, కామయ్యపాలెం, ఉప్పలపాడు, టంగుటూరులో రెండు పాయింట్లు, నాయుడుపాలెం,  త్రోవగుంట దగ్గరున్న మార్లగుంటపాలెం, మేదరమెట్ల - ఆ తర్వాత -  చీరాల దగ్గర వేటపాలెం అని కూడా చెప్పాను. 

    చీరాల దగ్గర వేటపాలెంలో  కోటేశ్వరరావుగారు అని కమిషనర్ గారు ఉండేవారు. పెద్దాయన - అప్పటికి అరవై ఏళ్ళుంటాయ్.  

    ఆయన్ని ICVC కోటేశ్వరరావు గారు  అనేవారు. ఆయన్ది గుంటూరు. ICVC అంటే ఇండియన్ కంట్రీ అండ్ వర్జీనియా టొబాకో కంపెనీ. దాని ఓనరు ఆయన. ఆయన గ్రేడింగ్ కమిషన్ చేసేవాడు. ఆయనకి వేటపాలెంలోఓ పెద్ద గ్రేడింగ్ హాలుంది . ఆయన అక్కడుండేవాడన్నమాట. కళ్ళు సరిగ్గా కనపడేవి కాదు. మసక మసగ్గా ఉండేవి. పాపం కఱ్ఱ పట్టుకు నడుస్తుండేవాడు. నేనంటే చాలా అభిమానం ఆయనకి. 

    ఇంక వారం మొత్తంలో నా దినచర్య ఏంటంటే - ప్రతి రోజూ టంగుటూరు చుట్టుపక్కలున్న సింగరాయకొండ మొదలుకొని టంగుటూరు ఏరియాలో  ఉన్న గ్రేడింగ్ పాయింట్లన్నీ కూడా ఒక రెండు రోజులు వరసగా  తిరగాలి. 

    అప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చేసేవాణ్ణి. భోజనం కాంగానే మళ్ళీ వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేసేవాణ్ణి. 

    మా ఆఫీసేమో ఒంగోల్లో ఉండేది. 

     ఒక రెండ్రోజుల తర్వాత ఏంటంటే నాయుడుపాలెం చూసుకుని - మార్లగుంటపాలెం చూసుకుని -  మేదరమెట్ల చూసుకుని - వేటపాలెం వెళ్ళాలి. 

    వేటపాలెం అంటే టంగుటూరుకి కొంచెం దూరమది  - చీరాల దగ్గర కదా!

    ఆ వేటపాలెం వెళ్ళినప్పుడు గ్రేడింగ్ పాయింట్ చూసుకుని ఆ రాత్రికి నైట్ హాల్ట్ అక్కడ ఉండిపోయేవాణ్ణి. ఎందుకంటే చీరాల సముద్రపొడ్డున ICVC కోటేశ్వరరావుగారికి ఓ గెస్టుహౌసు ఉండేది. 

    మేమిద్దరం ఆ గెస్టుహౌసులో ఉండేవాళ్ళం. ఓ వంట మనిషుండేవాడు. చక్కగా అతను వండింది భోంచేసి రాత్రి అక్కడే పడుక్కుని మరుసటిరోజు పొద్దున్నే బయల్దేరి - మళ్ళీ వేటపాలెం చూసుకుని - తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మేదరమెట్ల అవీ చూసుకుని - ఒంగోలు ఆఫీసుకొచ్చేవాణ్ణి. ఒంగోల్లోనే హోటల్లో భోంచేసేసి ఒంగోలు ఆఫీసులో సాయంత్రం వరకు ఉండి టంగుటూరు వెళ్ళేవాణ్ణి. నా రెగ్యులర్ ప్రోగ్రాం ఇది. 

    ఇవన్నీ తిరగడానికి  నాకు ఇచ్చిన అంబాసడర్ కారుకి డ్రైవర్ - హనుమంతరావు అని చెప్పేసి ఓ నలభై ఐదేళ్ళ అతను. 

    అతనే ఓనరు-కం-డ్రైవర్ కూడా ఆ కారుకి. బండి చాలా నిదానంగా తోలేవాడు, బా తోలేవాడు. అతనిది ఒంగోలు. 

    సాధారణంగా  నేను కార్లో పడుకోను.  హనుమంతరావు ఎలాగూ నిదానంగా, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడని గమనించి - అతని డ్రైవింగులో కొంచెం నిద్రపోవడం అలవాటు చేసుకున్నాను. ఒక పాయింటు నుంచి  ఇంకో పాయింటుకి వెళ్లే మధ్యలో ఓ కునుకు తీస్తుండేవాణ్ణి.  

    ఓ రోజు ఏమైందంటే - హనుమంతరావు కొడుకుకి పుట్టినరోజు ఫంక్షన్ ఏదో ఉందని చెప్పి -  తనింట్లో ఉండి - వేరే  డ్రైవర్నెవర్నో పంపించాడు. వాడి పేరు రామకృష్ణ అన్నట్టు గుర్తు. ఆ రామకృష్ణ కుఱ్ఱాడు. 

    నేను  బండెక్కిన తర్వాత ఊరికే కొంచెం సేపు పాటు వాణ్ణి అబ్సర్వ్ చేశాను. బానే తోలుతున్నాడు. టంగుటూరు చూసుకున్న తర్వాత ఉప్పలపాడు వెళ్ళాం. 

    ఉప్పలపాడు నుంచి కామయ్య పాలెం వెళ్తున్నప్పుడు దార్లో వచ్చేవన్నీ చిన్న చిన్న గ్రామాలు. చిన్న పిల్లలు రోడ్డు మీదే ఆడుకుంటుంటారు.  

    కామయ్యపాలెం దగ్గర  ఓ పిల్ల పరిగెత్తుకుంటూ కారు కడ్డమొచ్చేసింది. అదృష్టం ఏంటంటే రామకృష్ణ సడన్ బ్రేక్ కొట్టాడు. కార్ ఆగింది. పిల్ల పక్కకెళ్ళిపోయింది. 

    అప్పుడు  "ఒరే! ఓ రెండు విషయాలు చెప్తాను గుర్తు పెట్టుకో. ఒకటి - పల్లెటూళ్ళో జాగ్రత్తగా తోలుతూ ఉండు బండి. రెండోది ఎక్కడైనా శిశువులు, పశువులు కనబడ్డప్పుడు బండి బాగా స్లో చేయడం నేర్చుకో. వాళ్ళెటు మూవ్ అవుతారో తెలీదు." అని వాడికి బుద్ధులు చెప్పాను. 

    ఇలా చెప్పింతర్వాత ... సరే! ఆ రోజలా అయిపోయింది. మరుసటి రోజు కూడా వాడే డ్రైవరు. ఆ రోజు నేను వేటపాలెం వెళ్ళాలి. 

    పొద్దున్న టంగుటూరులో ఏదో పనుంటే గ్రేడింగ్ పాయింట్లో అది చూసుకుని, భోంచేసి వెడదాములే అనుకుని పన్నెండు గంటలకి ఇంటికొచ్చి భోంచేసేసి ఓ అరగంట రెస్ట్ తీసుకుని బయల్దేరాను. డ్రైవర్ని కూడా భోంచేసేయ్యమన్నాను. వాడూ తినేశాడు.

    టంగుటూరు-ఒంగోలు మధ్య దూరం ఇరవై కిలోమీటర్లుంటుంది. రామకృష్ణ కార్ టేప్ రికార్డర్లో  శోభారాజు పాటలు అన్నమాచార్య కీర్తనలు పెట్టాడు. అవి వింటూ  - భుక్తాయాసంతో ఉన్నానేమో - నేను ఓ కునుకు తీశాను. 

    ఒంగోలు బైపాస్ దగ్గరకొచ్చేటప్పటికి "సార్! మనం ఊళ్ళోంచి వెళదామా? బైపాస్ మీంచి వెళదామా " అనడిగాడు వాడే! 

    "ఊళ్ళో పనేం లేదు. బైపాసులో పోనీయ్" అన్నా. 

    చెప్పి మళ్ళీ అలా కళ్ళు మూసుకున్నాను. 

    అలా కళ్ళు మూసుకున్నానో లేదో -  ఒక పది నిముషాల్లోనే - ఎంతా అంటే - ఒక రెండో, మూడో కిలోమీటర్లు వెళ్ళుంటామంతే! 

    వాడికీ తూగొ చ్చినట్టుంది. ఆ మగతలో రోడ్డుకి ఎడమ పక్కనున్న మైలురాయిని కొట్టేశాడు. ఆ కొట్టడం-కొట్టడం - ఆ  దెబ్బకి  నిద్రమత్తు వదిలి - హఠాత్తుగా వాడేం చేశాడంటే కుడిపక్కకి కట్ చేశాడు. 

    మిట్టమధ్యాహ్నపుటెండవేళ  - ఒకటిన్నరో, రెండో అయుంటుంది టైము. 

    రోడ్డు ఖాళీగా ఉంది లంచ్ టైం కాబట్టి. 

    లేకపోతే అయిపోయేవాళ్ళమే ఏ లారీలో ఏవో వెళ్తుంటే. 

    హఠాత్తుగా అలా కట్ చేసేటప్పటికి ఏమైందంటే మేమున్న కారు మూడు పల్టీలు కొట్టి - కుడిపక్క మార్జిన్ లోకి వెళ్ళిపోయి - స్టాండ్ అయింది. 

    పచ్చడి-పచ్చడి అయిపోయింది కారు. 

    డోర్స్ లాక్ అయిపోయి ఉన్నాయి. లోపలుండిపోయాం మేము. మొత్తానికి కారు స్టాండ్ అయి - ఆగిపోయింది. 

    కారు ఆగీ ఆగగానే - ముందు అర్జంటుగా డోర్ లాక్ తీసుకుని ఇద్దరం దిగాం. 

    నాకు ఎక్కడా దెబ్బలు తగిలినట్లు కనపళ్ళా. 

    రామకృష్ణకి కాలి బొటనవేలు దగ్గర తెగింది బాగానూ. ఆ తెగిన చోట రక్తం వస్తోంది. 

    సరే! కారు దిగాం. ఇద్దరికీ నోట మాట రావట్లేదు - నించున్నాము అక్కడ. 

    ఎఱ్ఱటి ఎండ. 

    ఈ లోపులో - అదే రోడ్డులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వాళ్ళ ఆఫీస్ అక్కడుంది. వాళ్ళు చూశారు ఈ ఆక్సిడెంట్. 

    వాళ్ళందరూ పాపం గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేశారు. ఆ  మధ్యలో ఓ కాంపాండు వాల్ పిట్టగోడ ఉంటుందన్నమాట. 

    నన్ను తీసుకెళ్ళి ఆ గోడ మీద కూర్చోబెట్టి "ఏమిటి సార్! ఏమైనా దెబ్బలు తగిలాయా?" అనడిగారు. 

     "ఏమీ లేదు. నాకేమీ కాలేదు" అన్నాను. 

    పాపం వాళ్ళు గమ్మున వెళ్ళి కాఫీ పట్టుకొచ్చారు నాకు. సరే! అలా కూర్చున్నాను. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. 

    ఈలోగా ఈ డ్రైవర్ ఏం చేశాడంటే "సార్! మా ఓనర్ని పిలుచుకొస్తాను నేను. మీరు కారు దగ్గరే ఉండండి" అని వెళ్ళి పరారైపోయాడు.  

    వెళ్ళిన వీడెంత సేపటికీ రాడు. ఆ కారు దగ్గరే అలాగే కూర్చున్నాను నేను.

    చాలా సేపు కూర్చుని కూర్చుని ఇహ విసుగెత్తి లేచి రోడ్డుమీదకొచ్చాను. 

    రోడ్డుమీదకొచ్చేటప్పటికి లక్కీగా నా ఇమీడియట్ బాసు చింతల వీరయ్యగారు - ఆయన టంగుటూరు వెళ్తూ - ఆయనా నిద్రపోతున్నాడు ఆయన కార్లో. 

    ఆయన డ్రైవర్ పేరు కూడా వీరయ్యే. ఆ వీరయ్య నన్ను చూశాడు. 

    చూసి ఆయన్ని లేపి "సార్! కామేశ్వరరావు గారిక్కడ రోడ్డు మీదున్నారు. కారేదో ఆక్సిడెంట్ అయినట్టుంది." అనగానే "ఆపాపు బండి" అని కార్ ఆపి - నన్నా కారులో ఎక్కించుకుని టంగుటూరు తీసుకెళ్ళాడాయన. 

    "ఏమైంది కామేశ్వరరావుగారూ?" అని వీరయ్య గారడిగితే  "ఇలా జరిగిందండి - డ్రైవరు ఓనర్ కోసం వెళ్తానన్నాడు, ఎప్పటికీ రాలేదు. మరెటు పారిపోయాడో ఏంటో " అనగానే "దెబ్బలేమన్నా తగిలాయా" అనడిగాడు వీరయ్యగారు.   

    "దెబ్బలేమీ తగల్లేదు. నాకు బానే వుంది"  అని చెప్పి వెళ్ళి - మళ్ళీ ఆయనతో పాటు టంగుటూరు ఏరియాలో ఆ గ్రేడింగ్ పాయింట్లు తిరిగేశాను. సాయంత్రం ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడాయన. 

    వెళ్తున్నప్పుడు "ఒక నాల్రోజుల పాటు రెస్ట్ తీసుకో. నువ్వు ఆఫీసుకి రావద్దు. నేనిక్కడ ఒంగోల్లో ఉండి చూసుకుంటానులే.!" అంజెప్పేసి అన్నాడాయన. సరే అని ఉండిపోయాను ఇంటి దగ్గర. 

    కాకపోతే ఏవిటంటే తర్వాతి రోజు నుంచి ఎవరైనా వచ్చి పలకరిస్తే నాకు మాటొచ్చేది కాదు. ఏడుపొచ్చేసేసేది. 

    "ఎంత పెద్ద ప్రమాదం తప్పింది కదా! అసలేంటిది? పిల్లలేమో చిన్నపిల్లలు. ఆవిడకేమో అసలు ఇల్లు తప్పితే ఓ బ్యాంకు వ్యవహారం, డబ్బు వ్యవహారాలు ఏమీ తెలీదు. నాకసలు ఏమైనా అయుంటే వీళ్ళ పరిస్థితి ఏంటసలు?"  ఇదే ఆలోచన నాకు. 

    దాంతోటి నాకు ఎవరైనా కనపడితే దుఃఖం వచ్చేసేది. 

    అదృష్టవశాత్తూ నా పక్కన రామ్మోహన్ అంచెప్పేసి సుబ్బన్న గారి కజిన్ కొడుకు ఉండేవాడు. అతను 1978లో మైసూర్లో చేరాడు మా ML కంపెనీలో. 

    నేను ML నుంచి బయటికొచ్చి గోల్డెన్‌లో చేరిన తర్వాత టంగుటూరులో అతన్ని నా స్థానంలో మేనేజరుగా తీసుకొచ్చారు. 

    అతను కూడా మా పక్కనే ఉండేవాడు. మా పక్కనున్న ఇంట్లో సుజాత-సత్యం  అని చెప్పేసి దంపతులిద్దరు షోడాలమ్ముతూ ఉండేవారు. ఆ పక్కన విజయ్ అని చెప్పి పోస్టుమాన్ ఇల్లు ఉండేది. ఆ  రెండిళ్ళవతలున్న ఇంట్లో రామ్మోహన్ అద్దెకుండేవాడు. 

    అలాగే మా ఇంటి పక్క వాటాలో పామూరి సుబ్బారావు అని సుబ్బన్నగారి మేనమామ కొడుకు - వాడు కూడా నా ఫ్రెండే. వాడు సింగరాయకొండలో మా గ్రేడింగ్ హాలుకి ఇన్-ఛార్జ్ . వాడు, వాడి భార్య లలిత గారని చెప్పేసి వీళ్ళు కూడా టంగుటూరు లోనే ఉండేవాళ్ళు. 

    పాపం! వాళ్ళే నాకు సపోర్టుగా ఉండి, 'ఏం భయపడక'ని చెప్పేసి - ఈ రామ్మోహను, సుబ్బారావు నన్ను కాస్త అటు చీరాల-వేటపాలెం సముద్రపుటొడ్డుకి, తర్వాతేమో కందుకూరు మేనేజర్ వెంకట్రావు గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సినిమాలేవో చూడడం - ఇలా ఏదో ఊళ్ళు తిప్పుతూ నన్ను లైన్లో పెట్టారు వీళ్ళు. 

    అప్పుడే  మా శంకర నారాయణగారు "చాలా పెద్ద ఆక్సిడెంట్ తప్పి చచ్చి బతికాడు వీడు. వీడికి వందేళ్ళ ఆయుష్షు" అనేవాడాయన. 

    ఆయన, మా సుబ్బన్నగారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆ నాల్రోజులు. 

    తరవాత నేను మళ్ళీ రొటీన్లో పడిపోయాను. 

    మామూలుగా గ్రేడింగ్ పాయింట్లు తిరుగుతూ చూసుకుంటూ 82, 83 డిసెంబర్ దాకా అలా చేస్తూనే వున్నాను. ఇంక అక్కడ కొత్త విశేషాలు ఏమీ లేవు. 

    కాకపోతే మా సుబ్బన్నగారు చెప్పేవాడు "ఒరే! నువ్వు వచ్చేటప్పుడలా కార్లో గుప్పెడాకులు వేసుకుని నీకు తోచినట్టుగా గ్రేడ్ చేసుకుని ఏరుకో. నా కార్ ఎదురైనప్పుడు నాకు చూపెట్టు - ఏవన్నా తప్పులుంటే చెప్తాన"ని చెప్పేసి అలా ఆయన నాకు లీఫ్ నేర్పాడు. 

    ఒక విధంగా టొబాకో లీఫులో నేను మాస్టరైపోయాను. అసలు పొగాకులో లో-గ్రేడ్ తప్ప ఏమీ తెలియనివాణ్ణి ఇహ అసలు గ్రేళ్ళూ కూడా కంటితో చూడగానే చెప్పేసేవాణ్ణి - అది ఏ గ్రేడ్ అని చెప్పేసి. 

    ఆ రకంగా సుబ్బన్న గారి దగ్గర ట్రైనింగ్ అయి దాంట్లో మంచి ప్రావీణ్యత సంపాదించాను. 

     ఇహిక్కణ్ణించి ఏం జరిగిందో ఇంకోమాటు చెప్తాను.


<వచ్చేమాటు తరువాయి కథ>


13, జూన్ 2021, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 23 - గోల్డెన్ రోజులు అలా మొదలు...

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 22 - ఎజ్దీ పోయి ఎలక వాహనమాయె - ఎస్కార్టుగా మారి అభిమానించె టంగుటూరే!

    1981 టొబాకో సీజన్ కూడా మామూలుగానే గడిచింది. 

    చిలకలూరిపేట హెడ్ ఆఫీసులో ఫ్యాక్టరీ - త్రెషింగ్ ప్లాంట్ కోఆర్డినేటర్ - భాస్కర్రావు గారని చెప్పేసి ఒకాయన ఉండేవాడు. '81 నవంబర్లో ఆయన రాజీనామా చేశాడు.  

    లక్ష్మయ్య గారి అబ్బాయి బాబు ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు. భాస్కర్రావు గారు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి - చిలకలూరిపేటకి వచ్చి రిపోర్ట్ చేయమని చెప్పారు. తీరా వెళ్ళాక ఇన్-ఛార్జ్ ఫ్యాక్టరీ కోఆర్డినేటర్‌గా నన్ను చూడమని చెప్పారు. 

    దాని కోసం టంగుటూరు నుంచి చిలకలూరిపేటకి వెళ్ళి - అక్కడే ఉండాల్సి వచ్చింది. ప్రతీ సోమవారం పొద్దున్నే బయల్దేరి టంగుటూరు నుంచి చిలకలూరిపేటకి వెళ్ళేవాణ్ణి. 

    అప్పుడు చిలకలూరిపేట నరసరావుపేట జంక్షన్లో రెడ్డిగారిని చెప్పేసి ఒకాయన కృష్ణా లాడ్జ్ అని కొత్తగా కడుతున్నారు. అదింకా construction లో ఉంది. మొదటి రెండు అంతస్తులు పూర్తయ్యాయి. నాకు మొదటి అంతస్తులోనే ఒక మంచి రూమ్ ఇచ్చారు రెడ్డిగారు. 

    ఆ రూములో ఉంటూ - ప్రతిరోజూ తెల్లవారుఝామున అయిదున్నరకల్లా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయేవాణ్ణి. 

    ఫ్యాక్టరీలో మొత్తం మూడు షిఫ్టులు. అందులో త్రెషింగ్ ప్లాంటువి రెండు షిఫ్టులు. దాంతో పొద్దున్న ఆరింటి నుంచి రాత్రి పదింటి వరకూ - రెండు త్రెషింగ్ షిఫ్టుల సమయమంతా అక్కడే ఉండేవాణ్ణి. రాత్రి పది దాటాక  రూముకి వచ్చేసి మళ్ళీ మర్నాడు పొద్దున్న వెళ్తుండేవాణ్ణి. . 

    ఆ రోజుల్లోనే మా ఫ్యాక్టరీకి గోల్డెన్ టొబాకో కంపెనీ ప్యాకింగుకి వచ్చింది. మా ఫ్యాక్టరీలోనే త్రెషింగ్ చేసి ప్యాకింగ్ చేసేవాళ్ళం. దాని జనరల్ మేనేజర్ ఖైతాన్ అని చెప్పేసి బొంబాయి ఆయన.

    ఆయన ఒకట్రెండుసార్లు మా ఫ్యాక్టరీకి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆయన నన్ను పరిక్షిస్తున్నట్టుగా ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. 

    "ఇందులో లీఫ్ పెర్సెంటేజ్ ఎంతొస్తుంది? లాస్ ఎంతొస్తుంది? స్టెమ్మింగ్ ఎంతొస్తుంది" -  ఇలాంటి విషయాలన్నీ అడుగుతూ ఉండేవాడు. వాటన్నిటికీ సరిగా సమాధానాలు చెప్తూనే ఆయన్ని ఆ యూనిట్స్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రాక్టికల్‌గా వివరిస్తూ చెప్పేవాణ్ణి. అది విని ఆయన బానే సంతృప్తి చెందేవాడు. అలా మాట్లాడుతూనే నా వివరాలు అడిగేవాడు. ఆయన అలా అడిగినప్పుడు "నేను 72లో చేరాను ఇక్కడ. అప్పట్నుంచి ఇక్కడే వీళ్ళతోటే పని చేస్తున్నాను. " అని చెప్పాను. అక్కడికి అది అయిపోయింది. 

    సరే! డిసెంబర్ నెలకి గోల్డెన్ టొబాకో ప్యాకింగులు కూడా అయిపోయాయి. ఈలోగా నేను కూడా టంగుటూరు వచ్చేశాను. మళ్ళీ టంగుటూరులో నా బ్రాంచ్ మేనేజర్ పని నేను చేసుకుంటూ ఉండేవాణ్ణి. 

    ఇలా చేసుకుంటున్నపుడు "ఎంత కాలమిలా చేస్తాం? కృష్ణస్వామి గారితో అన్నట్టు నా ఐదంకెల జీతం చేరుకునేదెప్పటికి?" అన్న ఆలోచన నా బుఱ్ఱలో ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. 

    ఇంతలో గోల్డెన్ టొబాకో కంపెనీ వాళ్ళు స్టాఫుని తీసుకుంటున్నారని తెలిసింది. అందులో South కి గ్రేడింగ్ అదీ చూసుకోవడానికి ఒక మేనేజర్ కావాలని కూడా ఉంది. 

    South కొకళ్ళు, North కొకళ్ళు, Central లో ఒకళ్ళు - ఈ ముగ్గురి మీదా ఒక ప్రొడక్షన్ మేనేజర్ చింతం వీరయ్య గారని ఉండేవారు. 

    ఆ South position నాకు ఆఫర్ చేశారు. నాకేమో అప్పటికి లీఫ్ అంత బాగా తెలీదు. ఏదో గ్రేడింగ్ హాల్లోకి వెళ్ళి దబాయించుకొచ్చేవాణ్ణి కానీ. ఎందుకంటే గ్రేడింగ్ చేసే మేస్త్రులు ఆడవాళ్ళుండేవారు. వాళ్ళు మొదట్నుంచి పొగాకు వ్యవసాయంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకున్నంత knowledgeఅవగాహన నాకుండదు. గమ్మున మనం పొరపాటు మాట్లాడితే మనకు తాటాకులు కట్టేస్తారు వాళ్ళు. 

    అంచేత అసలు నాకు లీఫ్ నాలెడ్జ్ లేదు - అలా లేనప్పుడు దీనికసలు వెళ్లడమా, మానడమా - అంజెప్పేసి ఆలోచిస్తుంటే అసలు ఏం చెయ్యాలో తోచక నాకు అయోమయమైపోయింది. 

    ఈ లోగా మా గురువుగారు సుబ్బన్న గారు ఓ రోజు చిలకలూరిపేట నుంచి బ్రాంచుకొచ్చాడు. ఆయనతో "సర్! ఇదీ పరిస్థితి. నాకేమో గోల్డెన్ లో ఆఫర్ తీసుకోవాలని ఉంది. నాకేమో లీఫ్ గురించి ఏమీ తెలీదు. ఏం చేయాలో తోచట్లేదు" అనగానే ఆయన "ఒరే! ఓ పంజెయ్. వెళ్ళు - గోల్డెన్ కెళ్ళు. నువ్వు సెలెక్ట్ ఐతే చేరిపో. తర్వాత ఏం చెయ్యాలో నేజెప్తాను. ముందా పని చెయ్" అని చెప్పేసి ఆయన నాకు భరోసా ఇచ్చాడు. దాంతో నేను ఇంకేమీ ఆలోచించకుండా గోల్డెన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. 

    వెళ్ళాక ఖైతాన్ గారు చూశాడు. "ఏంటి ఇలా వచ్చావ్? నువ్వక్కడ ఫ్యాక్టరీలో చేస్తున్నావు కదా?!" అన్నాడు. 

    వెంటనే నేను "నేను ఫ్యాక్టరీలో కాదు. టంగుటూరు బ్రాంచులో చేస్తూ ఫ్యాక్టరీలో ఇన్-ఛార్జ్ గా వచ్చాను." అని అన్నాను. 

    "అయితే వెంటనే వచ్చి చేరతావా? నేను లక్ష్మయ్యకి చెప్పాలా?" అన్నాడాయన. 

    "చెప్పాలో వద్దో అది  మీ ఇష్టం" అంజెప్పేసి నేనంటే "సరే! రేప్పొద్దున్న రా. చెప్తాన్నేను" అన్నాడు. 

    మర్నాడు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు రాత్రి నేను సుబ్బన్నగార్ని కలిశాను. ఆయనప్పుడు ఒంగోల్లో ఊర్వశి హోటల్లో ఉన్నాడు. 

    ఆయన్ని ఊర్వశి హోటల్ రూంలో కలిసి "సర్! వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. వాళ్ళు లీఫ్ గురించి అడిగితే ఏం జరుగుతుందో ఏంటో!" అన్నాను. 

    దానికి ఆయన వెంటనే "ఏం ఫర్లేదు. అక్కడ మనవాడొకడున్నాడు. శంకరనారాయణ గారని చెప్పేసి ఉంటాడక్కడ - గోల్డెన్ టొబాకో కంపెనీలో లీఫ్ మేనేజర్. నీకేం ఫర్వాలేదు వెళ్ళు" అన్నాడు. 

    అంతే కాకుండా సుబ్బన్నగారు లీఫ్ గురించి, ఎక్సపోర్ట్స్ గురించి కొన్ని విషయాలు నాకు ఆ రాత్రి చెప్పారు. 

    మరుసటి రోజు ఇంటర్వ్యూలో ఖైతాన్ గారు, శంకరనారాయణ గారు, ప్రొడక్షన్ మేనేజర్ చింతం వీరయ్యగారు, నరేంద్ర అని ఒక గుజరాతీ ఆయన - ఫైనాన్స్ మేనేజర్ - ఈ నలుగురూ కూర్చుని నన్ను ఇంటర్వ్యూ చేశారు. 

    అలా చేసినప్పుడు ఖైతాన్ గారు అడిగాడు. ఏమనంటే "సరే! మనం టొబాకో కొంటున్నాం. ఏ గ్రేడ్ మనకి పనికొస్తుంది? ఏ గ్రేళ్ళు గోల్డెన్ టొబాకోకి దేనికి పనికొస్తాయి?" అని. 

    "సర్! గోల్డెన్ టొబాకోకి గ్రేడ్ 3  అనేది ఒకటుంది. అది జపానుకెళ్తుంది. వచ్చిందాంట్లో గ్రేడ్ చేసినప్పుడు ఆ గ్రేడ్ 3 జపాన్ ఎక్సపోర్ట్స్. తర్వాత గ్రేడ్సులో గ్రేడ్ 4 అంజెప్పేసి ఉంటుంది. ఆ గ్రేడ్ 4 అనేది లండన్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ రెండూ కాక కాంపోజిట్ గ్రేడ్స్ ఉన్నాయి. వాటిని 4సి అంటారు దాన్ని. ఈ గ్రేడు ఇంపీరియల్ టొబాకోకి పనికొస్తుంది ఇది." అన్నాను. 

    అలా అన్నాక "మరి ఆ తర్వాత కింద గ్రేడ్స్ అన్నీ కూడా ఆ బి-ఎక్సులూ, బ్రౌన్లూ అవన్నీ ఏమిటీ? " అన్నాడు ఖైతాన్ గారు. 

    "సర్! అవన్నీ మీ మ్యానుఫ్యాక్చరింగే సర్ అవి. మీరు బ్లెండ్ చేసుకుని మీ పనామా సిగరెట్లలో కలుపుకొందుకు ఆ కింద గ్రేళ్లన్నీ పనికొస్తాయి" అనేటప్పటికి ఫక్కున నవ్వాడాయన. నవ్వి "You're selected" అన్నాడు. 

    అలా గోల్డెన్ టొబాకోలో ప్రవేశించాను. అప్పుడు ఖైతాన్ గారు  చెప్పిందేంటంటే "గోల్డెన్ టొబాకోకి డైరెక్టుగా నిన్ను తీసుకోవట్లేదు. దీనికి సిస్టర్-కన్సర్న్ ఒకటుంది. TMT అని - అంటే తిరుపతి మ్యాచ్ టొబాకో కంపెనీ. అంటే వాళ్ళు అగ్గిపెట్టెలు కూడా తయారు చేస్తారు. దాంతో పాటే టొబాకో కూడా. దాంట్లో నువ్వు సౌత్లో గ్రేడింగ్స్ మొత్తం నువ్వు చూడాలి" అని. 

    "ఒకే సర్" అన్నాన్నేను.  

    అప్పుడు సౌత్లో నాకిచ్చిన గ్రేడింగ్ సెంటర్స్ ఏంటంటే టంగుటూరులో ఒక రెండు గ్రేడింగ్ పాయింట్లు - గూడూరు భూషయ్య గారిది ఒకటి, పత్తిపాటి సుబ్బరావు (ఎఱ్ఱబ్బాయి) దొకటి.  ఈ రెంటికీ కాంట్రాక్టర్ ఎవరంటే పైడి కిష్టయ్య. ఆ తర్వాత ఉప్పలపాడు, కామయ్య పాలెం, చింతలపూడి, మేదరమెట్ల, త్రోవగుంట దగ్గరున్న మర్లగుంట పాలెం, వేటపాలెం - ఈ మొత్తం పాయింట్స్ మీద నేను ఇన్-చార్జుని. ఆ రకంగా నాకు అపాయింటుమెంటు ఇచ్చారు. ప్రొడక్షన్ మేనేజర్ వీరయ్యగారు నాకు ఇమ్మీడియట్ బాస్. 

    నేను ఎమ్మెల్ కంపెనీలో ఉన్నప్పుడు గ్రేడింగ్ టేబుల్స్ దగ్గర నల్లపొగాకు అదీ ఏరి పక్కన పెడుతూ ఉండేవాణ్ణి కదా... దాన్ని బేస్ చేసుకుని ప్రతిచోటా కూడా తక్కువ రకం ఏదుందో - సెలైన్ టొబాకో, బ్లాక్ టొబాకో, గ్రీన్స్ - ఇటువంటివన్నీ పట్టుకునేవాణ్ణి. ఈ మేజర్ గ్రేడ్స్ వచ్చినప్పుడు అలాంటివాటిని పట్టుకుని దబాయించేసేవాణ్ణి. దీంతోటి ఏమైందంటే "అబ్బో! ఈయనేదో చాలా నాలెడ్జ్ ఉన్నవాడ"ని చెప్పేసి అందరూ భయపడిపోయేవారు. ఈ గ్రేడింగ్ సెంటర్స్ అన్నిట్లో కూడా నేను వెళ్తే గడగడలాడుతూ ఉండేవారు. ఆ రకంగా 82 దాకా మేనేజ్ చేశాను. 

    ఈలోగా నాకో ఆక్సిడెంట్ అయింది. అదెలా జరిగిందంటే... 

  

<వచ్చేమాటు తరువాయి కథ>

15, ఫిబ్రవరి 2021, సోమవారం

అవతారంగారి నారాయణగారి బాబి - 22 - ఎజ్దీ పోయి ఎలక వాహనమాయె - ఎస్కార్టుగా మారి అభిమానించె టంగుటూరే!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 21 - ఆత్మీయ అన్నాబత్తిన! 

    జులై 80 ప్రాంతానికి పర్చేజ్ సీజన్ అయిపోయింది. నేనేమో ఇక గ్రేడింగులు, ప్యాకింగులు అవీ చూసుకోవాలి.  

    సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు - ఈ ఊళ్లన్నిటిలో కూడా మా  చైనా ప్యాకింగులు జరిగేవి.

     నాకేమో హెడ్డాఫీసు నుంచి ఒక ఎజ్దీ (Yezdi) మోటార్ సైకిలు ఇచ్చారు. ఆ మోటార్ సైకిలేసుకుని తిరిగేవాణ్ణన్నమాట గ్రేడింగ్ హాల్సుకి. అక్కడే ప్యాకింగులు అవీ జరుగుతూ ఉండేవి.  కొంతకాలం తర్వాత ఆ బైకు చెడిపోయింది. అదలా చెడిపోగానే "దీనికి రిపేర్లు అవీ చేయిస్తూ నేను తిరగలేను, కావలసినప్పుడు ఏ ప్యాకింగుకో వెళ్ళాలంటే కార్లో వెళ్తాను" అని చెప్పి ఆ బైకుని వెనక్కి తిప్పి హెడ్డాఫీసుకి పంపించేశాను. 

    ఈ లోగా నాకు ఆఫీసులో స్టాఫ్ కూడా పెరిగారు. నరసింహారావు అని ఓ క్యాషియర్, గ్రేడింగులో టోకెన్స్ ఇవ్వడానికి ఓ ఇద్దరు క్లర్కులు, గ్రేడింగ్ రిపోర్టులు తయారుచేయడానికి ఇంకో క్లర్కు - ఇట్లా మొత్తం ఐదారుగురు స్టాఫ్ పెరిగారు - పాత సూపర్వైజర్లు వాళ్ళూ కాకుండా. 

    గ్రేడింగులో ఏంటంటే - మా గ్రేడింగ్ హాల్లో నాలుగొందలమంది పని చేసేవాళ్ళు. జమ్ములపాలెం, కాకుటూరివారిపాలెం, ఆలకూరపాడు, ఉప్పలపాడు - ఇలా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చేవారన్నమాట. నాలుగొందలమంది గ్రేడర్సు - అంటే - వరసకి ఇరవై చొప్పున దాదాపు ఒక ఇరవై వరసలు. అందులో ఒక పదిమంది మేస్త్రీలు ఉండేవాళ్ళు. వాళ్లంతా ఆడ మేస్త్రీలు. తర్వాత ఓ పది మంది లైన్-గర్ల్స్ వుండేవాళ్ళు. వాళ్లేంటంటే - గ్రేడ్ చేసిన పొగాకు తీసుకొచ్చి టేబుల్స్ మీద వేసేవాళ్ళు. అలా ఓ పది టేబుల్స్ ఉండేవి. ఆ పది బల్లలకి ఇరవై మంది టేబుల్ చెకర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే గ్రేడింగ్ చేసి పంపించిన తర్వాత అందులో ఏమన్నా తేడా-పాడా ఉండి కొద్దిగా ఒకట్రెండు ఆకులు సరిగా లేకపోతే వాటిని తీసేసి పక్కన వేసేసి మంచి గ్రేడెడ్ పొగాకేమో పెట్టెల్లో వెయ్యాలి. టేబుల్స్ పక్కనే పెట్టెలు కట్టేవారన్నమాట బేలు తొక్కడానికి. ఆ పెట్టెల్లో మళ్ళీ పదిమంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళు పెట్టెలు తొక్కుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు కాకుండా ఒక పది-పదిహేను మంది ముఠావాళ్ళు ఉండేవాళ్ళు. ఇవీ ఆ గ్రేడింగ్ హాలు - అందులో పని చేసేవాళ్ళ వివరాలు.  

    నేను గ్రేడింగ్ హాలుకి వెళ్తే మాత్రం చాలా భయపడేవారు జనం - "మేనేజరొస్తున్నాడు, మేనేజరొస్తున్నాడు" అని. ఎందుకంటే కొంతమంది చేస్తున్న పని ఆపేసి మధ్యమధ్యలో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు . అలా కబుర్లు చెప్పుకునేవాళ్ళు నా క్కనిపిస్తే వాళ్ళని కూర్చున్న చోటు నుంచి లేపేసి బయటికి పంపించేసేవాణ్ణి.  అందుకే నేను వెళ్ళినప్పుడు ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు. అలా ఆ గ్రేడింగులు నడుస్తూ ఉండేవి.

    అలా జరుగుతున్న టైములో ఓ సారి ఏమయ్యిందంటే -  సాధారణంగా లక్ష్మయ్య గారి కంపెనీలో ఏంటంటే ఈ కొనుగోళ్ళకు డబ్బు చెల్లించడం కొంచెం ఆలస్యం అయ్యేది. పొగాకు బయ్యింగ్ మేనేజ్ చెయ్యడం వరకే నా బాధ్యత. అదే కాకుండా  గ్రేడర్స్ పేమెంట్స్, ముఠా వాళ్ళ పేమెంట్స్ మాత్రం నేను చేసేవాణ్ణి. 

    రైతులకి ఇవ్వాల్సిన పేమెంట్లకి నా బాధ్యత లేదు. దానికి పెద్ది సాంబశివరావుగారని చెప్పేసి - ఆయనది గుంటూరు. ఆయన సర్కిల్ మేనేజర్. రైతుల చెల్లింపు బాధ్యత ఆయనది. ఆయన అప్పుడప్పుడు టంగుటూరు వస్తూ ఉండేవాడు. ఆయనొచ్చినప్పుడు రైతులు వచ్చి వాళ్ళకి రావల్సిన డబ్బుల గురించి అడిగితే ఆయనేదో సర్దిచెప్తూ ఉండేవాడు. ఇలా జరిగిపోతూ ఉండేది. 

    దీంట్లో ఓ సారి ఏవయిందంటే - ఆ జమ్ములపాలెంలోనో, ఎక్కడో ఇద్దరు కవలలు ఉండేవాళ్ళు. వాళ్ళు టీచర్స్. అందులో ఒకతను బాగానే ఉండేవాడు. రెండో అతను కొంచెం డ్రింక్ చేసేవాడు. సాయంత్రం అయేటప్పటికి రోజూ డ్రింక్ చేసేవాడు. 

    అతనోసారి ఏం చేశాడంటే - ఓ రోజు నేను సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి వస్తూ ఉండగా - టంగుటూరు ఊళ్ళో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత నన్ను ఆపి "నా దగ్గర పొగాకు కొనేశారు. నాకు పేమెంట్ ఇవ్వరు. ఎందుకివ్వట్లేదు? నాకర్జంటుగా ఇప్పుడు డబ్బులియ్యి." అని నన్ను పట్టుకు కూర్చున్నాడు. 

    నేనేమో విడిపించుకుంటూ "ఇలా రోడ్డు మీద ఆపి అడిగితే ఎలా? పైగా ... మీ డబ్బులకి నేను కాదు రెస్పాన్సిబిలిటీ. ఆ సాంబశివరావుగారొచ్చినప్పుడు అడగండి. నన్నడిగితే ఉపయోగం ఏంటి?" అంటే అతను వినలా. 

    "లేదు. నాకు ఇప్పుడు పేమెంటు ఇచ్చి కదులు" అని కూర్చున్నాడు. 

    లక్కీగా ఈ లోపులో ఎర్రబ్బాయి తమ్ముడు చిన్నా - అదే కరాటే ఫైటర్ అని చెప్పాను కదా - అతను నా ఫ్రెండు - అతను వస్తున్నాడు ఆ దార్లోనే. 

    వస్తూ నన్ను చూసి "ఏంది బాసూ...సంగతులు!" అన్నాడు. 

    "వీడెవడో చూడవయ్యా బాబూ! వీడి గోలెక్కువయింది. నేనిప్పుడు పేమెంట్ ఇవ్వాలంట వీడికి. నన్నింటికి పోనీకుండా ఆపేశాడు " అనగానే ఆ చిన్నా "నువ్వింటికెళ్ళిపో బాసూ... నేను చూసుకుంటా" అని వాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. 

    ఈ విషయం తర్వాత అన్నాబత్తిన వెంకటసుబ్బయ్యకి తెలిసింది. 

    తెలిసి మర్నాడు పొద్దున్నే ఆ టీచర్ని పిలిచి - "ఏంది మా పంతులు జోలికొస్తావా? ఏమనుకుంటున్నావ్? అసలు ఆయనకి సంబంధమేంటి పేమెంట్సుతో ?" అని చీవాట్లేసేశాడు. 

    ఆ రోజు నుంచి నాకిద్దరు ఎస్కార్ట్స్ (escorts) ని కుదిర్చాడు అన్నాబత్తిన వెంకటసుబ్బయ్య. 

    అందులో ఒకడు ఆలకూరపాడులో నార్నె బాలయ్య అని అతను కూడా మా బయ్యరు. 

    రెండో ఎస్కార్టు -  అన్నాబత్తిన వెంకటసుబ్బయ్య రెండో కొడుకు నాగేశ్వర్రావు - వాడిని కూడా నేనే జేర్చాను - అసిస్టెంటు బయ్యరుగా. 

    వీళ్ళిద్దర్నీ పిలిచి "ఒరే! మీరిద్దరూ మేనేజరు ఇంటికి వెళ్ళేవరకు తోడుగా వెళ్ళి, ఆయన్ని ఇంటి దగ్గర దించి, అప్పుడు ఇళ్ళకి వెళ్ళండి మీరు" అని వాళ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వెంకటసుబ్బయ్య. 

    వాళ్ళేమో కుఱ్ఱాళ్ళు. ఒక్కోడూ ఐదడుగుల పదకొండు అంగుళాలు ఉండేవారు. 

    వాళ్ళు రోజూ నా తోటి రావడం. 

    "ఎందుకురా, బాబూ?! ఏదో ఆ రోజంటే వాడేదో తాగేసి నా మీదకొచ్చాడు కానీ రోజూ ఎవడొస్తాడు నా దగ్గరికి? నా కూడా రావక్కర్లేదు , పొండ్రా మీరు" అంటే నా మాట వినేవారు కాదు. రోజూ నాతో ఇంటి దాకా వచ్చి దిగబెట్టి కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్లేవారు కాదు. 

    అలా ఎక్కణ్ణుంచో గోదారి అవతల నుంచి ఉద్యోగ నిమిత్తమై వెళ్ళిన నన్ను తనవాణ్ణి చేసుకుని - కళ్ళలో పెట్టుకుని కాచినవారు టంగుటూరు ఊరివారు.  

    ఇక్కడో చిన్న విషయం - నాతో ఇప్పటికీ ఉన్న ఒకనాటి టంగుటూరు జ్ఞాపకం. 

    ఇంతకు ముందే చెప్పాను కదా రిపేర్లు వచ్చిందని ఎజ్దీ మోటార్ సైకిలు వెనక్కి పంపించేశానని?! ఆ  తర్వాత - ఈ నార్నె బాలయ్య దగ్గర లూనా ఒకటి ఉండేది - చిన్న మోపెడ్. అది కొన్నాను అతని దగ్గర. 

    కొని నేను అదేసుకుని తిరుగుతూ ఉండేవాణ్ణి. అది ఇంటికి, ఆఫీసుకి మాత్రమే. ఊరు దాటి బయటికి వెళ్లాలంటే టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళేవాణ్ణి. అప్పటి వరకు నన్ను పెద్దబండి ఎజ్దీ మీద తిరగడమే ఎరిగున్న మా లల్లి, పప్పి, కుట్టి - చిన్న మోపెడ్ లూనాని చూసి - "ఎలక వాహనం" - అని పిలిచేవాళ్ళు. 

    అప్పుడే ఒంగోల్లో కొత్త  స్కీమొకటి పెట్టారు ఓ షాపు వాళ్ళు. అదేంటంటే పది నెల్లో, సంవత్సరమో నెలనెలా కొంత డబ్బు కట్టాలి. కడితే మధ్యలో మనకి లాటరీ తగిలితే ఆ వస్తువులు మనకిచ్చేస్తారు. లేదంటే స్కీం పూర్తయిన తర్వాత వస్తువులు ఇస్తారు. 

    దానికి నేనేంటంటే - ఒక డ్రెస్సింగ్ టేబులు, ఒక సుమీత్ మిక్సీ - ఈ రెంటికీ కట్టాను. నెలకింత అని ఇన్‌స్టాల్‌మెంట్ కడుతున్న నాకేమో మూడో నెల్లోనే లాటరీ తగిలేసింది. వెంటనే లూనా మీద మా ఆవిణ్ణి ఎక్కించుకుని ఒంగోలు వెళ్ళిపోయాను. వెళ్ళి ఆ పసుప్పచ్చ డెకొలాం వేసిన డ్రెస్సింగ్ టేబుల్, సుమీత్ మిక్సీ ఒక లారీలో వేయించి తెచ్చేసుకున్నాం. ఆ సుమీత్ మిక్సీ మా అన్నగారమ్మాయి బద్రు పెళ్ళికి గిఫ్ట్ కింద ఇచ్చేశాం. ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఇవాళ్టికి కూడా నా దగ్గరుంది. అనాతవరంలో మా ఇంట్లో నా గదిలో పెట్టుకున్నాను. 

1981 నుంచి జరిగిన విశేషాలు ఇంకో మాటు... 


<వచ్చేమాటు తరువాయి కథ>



13, డిసెంబర్ 2020, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 21 - ఆత్మీయ అన్నాబత్తిన!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 20 - తలపులమ్మ పంపిన ఊరు... టంగుటూరు!


    టంగుటూరులో ML అంటే పెద్ద కంపెనీ కింద లెక్క. ITC తర్వాత ML కంపెనీయే. 

    నాదొక చిన్న ఆఫీసు, పక్కనే పెద్ద గ్రేడింగ్ హాల్ పత్తిపాటి సుబ్బారావు (ఎ ర్రబ్బాయి) గారిది. దాదాపు ఐదారొందలమంది - చుట్టుపక్కలున్న - జమ్ములపాలెం, కాకుటూరివారి పాలెం, ఆలకూరపాడు, ఉప్పలపాడు - గ్రామాల నుంచి గ్రేడింగుకి వచ్చేవాళ్ళు. 

    ఇద్దరు సూపర్‌వైజర్లు - షేక్ ఆదమ్ అని ఒక సీనియర్ గ్రేడింగ్ సూపర్‌వైజరు - పేరయ్య అని ఒక జూనియర్ గ్రేడింగ్ సూపర్‌వైజరు -  సాంబశివరావు అని ఒక క్లర్కు -  నాగేశ్వర్రావు అని ఒక ఆఫీసు బాయ్ - కోటయ్య అని ఒక వాచ్‌మన్ కమ్ సెక్యూరిటీ - ఇదీ నా టంగుటూరు బ్రాంచ్ ఆఫీస్ స్టాఫ్. ప్రస్తుతానికి క్యాషియర్ లేడింకా. బ్రాంచ్ మేనేజర్ కమ్ క్యాషియర్ నేనేనన్నమాట. 

    మాకు పద్ధెనిమిది బయ్యింగ్ పాయింట్స్ ఉండేవి - నెల్లూరు నుంచి చౌదరి పాలెం, కావలి, వేటపాలెం-  ఇలా చీరాల దాకా 18 ఉండేవి. వీటన్నిటికీ పద్ధెనిమిది మంది బయ్యర్లు ఉండేవాళ్ళు. అన్నాబత్తుని వెంకటసుబ్బయ్య జమ్ములపాలెం నుంచొచ్చేవాడు. ఆయన ఓ కమ్యూనిస్ట్ లీడరు. లక్ష్మయ్య గారికి బాగా కావాల్సిన వాడు. ఈ 18 మంది బయ్యర్లని ఆయనే పెట్టాడు. ఆయనే ఆ బయ్యర్ల టీముకి లీడర్ కూడా. ఆయన నేనంటే "పంతులుగారు" అంటూ ప్రాణం ఇచ్చేవాడు. నేను నా ఆఫీసు చుట్టూ చిన్న గార్డెన్ ఒకటి వేయించాను. దానికోసమని ఆయనే వెంకన్న అని ఒకణ్ణి పెట్టాడు తోటమాలిగా. 

    ఇక టంగుటూరులో బీనీడి వెంకట నరసయ్యగారు మంచి ఫ్రెండయ్యాడు. ఆయన్ని బట్టి అందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. పత్తిపాటి సుబ్బారావు (ఎర్రబ్బాయి ) తమ్ముడు చిన్నా అని అతను కరాటే ఫైటర్. అతను కూడా మంచి ఫ్రెండయ్యాడు నాకు. అంతే కాకుండా పైడి కిష్టయ్య అని ఇంకొకతను, గుత్తా వెంకటసుబ్బయ్యగారు, బెల్లం కోటయ్యగారు - వీళ్ళందరూ కూడా మంచి స్నేహితులయ్యారు నాకు. 

    సింగరాయకొండలో మిట్టపల్లి వాళ్ళ కంపెనీ ఉండేది. అది కూడా ఒక ఫ్యాక్టరీ . మిట్టపల్లి పాండురంగారావు గారని ఆయన కూడా పరిచయమయ్యారు. అప్పుడప్పుడూ సరదాగా కలుస్తూ ఉండేవాళ్ళం. 

    మాకు అప్పుడు చైనా ఆర్డర్స్ వస్తూ ఉండేవి. మా 18 బయ్యింగ్ పాయింట్సులో దాదాపు 3 వేల టన్నుల పొగాకు కొన్నాము. చాలా వేగంగా కొన్నాము. 

    అప్పుడు ఫ్యాక్టరీలు అవసరమయ్యి బీనీడి వెంకటనరసయ్య గారి ఫ్యాక్టరీ, మిట్టపల్లి వారి ఫ్యాక్టరీ, అలాగే ఆంజనేయ టొబాకో కంపెనీ అని చెప్పేసి దాముచర్ల ఆంజనేయులుగారు - ఆయన ఫ్యాక్టరీ, తర్వాత గూడూరు భూషయ్యగారు - ఆయన ఫ్యాక్టరీ, లావణ్య టొబాకోస్ అని చెప్పేసి ఒంగోలు ఫ్యాక్టరీ ఒకటి - తర్వాత టంగుటూరులో భారత్ లీఫ్ అని రంగారావుగారి ఫ్యాక్టరీ ఒకటి ఉండేది - ఇన్ని ఫ్యాక్టరీలు ఆపరేట్ చేసేవాళ్ళం. వీటన్నిటికీ నేనే ఇన్-ఛార్జ్. అక్కడ ప్యాకింగులు, ఇక్కడ గ్రేడింగులు అన్నీ నేనే చూస్తూ ఉండేవాణ్ణి. 

    ఇలా అంతా బాగానే నడుస్తోంది. అన్నీ చేస్తున్నా, ఇంత వ్యవహారం నడుపుతున్నా అప్పుడెప్పుడో కృష్ణస్వామిగారన్నట్టు జీతం మాత్రం నెలకి మూడంకెల్లోనే నడుస్తోంది. నేను సవాల్ చేసినట్టుగా ఐదంకెలు కానే కావట్లేదు.  సరే! ఇప్పుడే కదా మేనేజ్‌మెంటు వైపుకి వచ్చింది. కొంతకాలం కానీయ్ చూద్దామనుకున్నాను. 

    అన్నట్టు మేమింకా కొండలరావు గారింట్లోనే అద్దెకి ఉండే రోజుల్లో - ఓ సారి  ఏం జరిగిందంటే నేనో రోజు రాత్రి పూట కంపెనీ నుంచి ఇంటికి వస్తున్నాను. వచ్చే దారిలో బెల్లం కోటయ్యగారి ఇల్లు ఉంది. అక్కడ రోడ్డు మీద నల్ల కుక్కొకటి పడుకుని ఉంది. ఆ చీకట్లో నాక్కనపడక దాన్ని తొక్కేహాను. టక్కన నా పిక్క పట్టుకుని పీకేసింది అది. 

    ఎలాగో ఇంటికి వచ్చేశాను. మా ఇంటికెదురుగుండా కఱ్ఱ సాము చేసే సుబ్బారావు ఉండేవాడు కదా! అతను అంత రాత్రి పూట వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి నాతోపాటే డాక్టర్ దగ్గరికి వచ్చాడు. ఆ డాక్టర్ గారు కుక్క కరిచిన చోట అంతా చూశాడు. శుభ్రం చేసి కట్టు కట్టాడు. 

    "ఓ పధ్నాలుగు ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ చెయ్యాల. ఆపకుండా  వరసగా పధ్నాలుగు రోజులు చెయ్యాలి" అన్నాడు డాక్టరు గారు. 

    "ఇంజెక్షన్ చెయ్యి కానీ బొడ్డు చుట్టూ వద్దు - నువ్వు చేతికి చేస్తావో, తుంటికి చేస్తావో చేసుకో - బొడ్డు చుట్టూ మాత్రం వద్దు" అని చెప్పా నేను. 

    "సరే అయితే!"  అని రోజూ తుంటికి చేసేవాడు. "ఒక్కరోజు వేయించుకోవడం తప్పినా మళ్ళీ పధ్నాలుగు చేయించుకోవాలి" అన్నాడు. 

    సరే అని రోజూ వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటున్నాను. సరిగ్గా పది రోజులయ్యాక చిలకలూరిపేట నుంచి ఫోనొచ్చింది అర్జెంటుగా బయల్దేరి రమ్మని. ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికెళ్లి "ఆ మిగిలిన నాలుగు ఇంజెక్షన్లూ చేసెయ్యవయ్యా" అంటే ఆయన కుదరదన్నాడు. ఇలాక్కాదని చెప్పి చిలకలూరిపేట వెళ్ళిపోయాను. అక్కడ పనవ్వగానే వెనక్కొచ్చిన తర్వాత ఓ రోజు ఆఫీసుకి వెళ్తున్న నన్ను - డాక్టర్ గారు  రోడ్డు మీద ఆపి "పది రోజులు కాగానే ఇంజెక్షన్లు ఆపేశావు . మళ్ళీ రా - నీకు మొదట్నుంచీ  మళ్ళీ పధ్నాలుగు రోజుల పాటు ఇంజెక్షన్లు చెయ్యాలి అన్నాడు. 

    నేను ఆయనతో "నేను మళ్ళీ పధ్నాలుగు చేయించుకోను. చేస్తే ఆ మిగిలిన నాలుగు చెయ్యి. లేకపోతే లేదు. నన్ను కరిచిన కుక్క బతికే ఉంది. దానికేమీ పిచ్చి పట్టలేదు. రోజూ దాన్ని చూస్తూనే ఉన్నాను. పైగా దానికి బిస్కెట్లు అవీ పెడుతున్నాను. అది కూడా రోజూ తోకాడించుకుంటూ నా వెనకే వస్తోంది. నాకింకేమీ ఢోకా లేదు. . అంచేత ఇటుపైన ఇంక నీ దగ్గరికి రాను. ఇంకా గట్టిగా మాట్లాడావంటే ఆ మిగిలిన ఇంజెక్షన్లు నువ్వు చేసేసుకో" అని చెప్పేసి వచ్చేశా.  

    "ఈయన రాక్షసుడండి, బాబూ!  ఇంత మొండోడేంటండీ ఈ పంతులు?" అని ఆ తర్వాత అన్నాబత్తిన వెంకట సుబ్బయ్యతో అన్నాడట ఆ డాక్టర్. 

    వెంకట సుబ్బయ్య వచ్చి "ఏంది పంతులూ! ఆ డాక్టరన్నట్టే నువ్వేం రాక్షస జాతివాడవయ్యా?!" అంటూ ఒకటే నవ్వు. 

    ఇహ బయ్యింగ్ సీజన్లో పొగాకు ఎక్కువ కొనేశామన్నాను కదా! లక్ష్మయ్యగారేమో ఫోన్ల మీద ఫోన్లు - "ఆపెయ్యండి కొనడం ఇంక" అంటూ. 

    ఈ వెంకటసుబ్బయ్యేమో ఆగట్లేదు. టీము లీడరు ఆయనే కదా! పైగా పెద్దాయన. మంచి అడ్మినిస్ట్రేటరు. ఆ పరిసరాల్లో మంచి పలుకుబడి ఉన్నవాడు. 

    ఆయన వెళ్ళి పొగాకు కొనకుండా ఆపడమెలా అని ఆలోచించి నేనేం చేశానంటే - మా కంపెనీకి ఉన్న పద్ధెనిమిది డీజిల్ కార్లలోనూ డీజిల్ అయిదు లీటర్లకి మించకుండా ఉండేలా చూశాను. అప్పుడు అవి ఓ పట్టాన స్టార్ట్ కావు. ఆయన ఎక్కడికీ వెళ్ళలేడు అని. 

    అది తెలిసి ఆయన ఏం చేశాడంటే "నీ పని ఇట్టా ఉందా? నాకు ఏరియాకి వెళ్ళడానికి ఒక్క కారు కూడా లేకుండా చేస్తావా నువ్వు?" అన్జెప్పి  - పదిహేడు కారుల్లోంచి లీటరు, లీటరు చొప్పున డీజిల్ తీసి పద్ధెనిమిదో కారులో పోసి - ఆ కారేసుకుని చక్కా వెళ్ళిపోయాడు. 

కారులవి పద్ధెనిమిదుండు
కదలరాదని కారులేవీ - 
కారునున్న డీజిలంత తోడు... 
కదలని కారు-కారునా డీజిలేమొ ఐదుండు
పంతాన అన్నాబత్తిన తోడియెత్తె -
ఒక్కొక్క లీటరు  కారు, కారు నుంచి...  
కూడె ఒక కారుకి ఐదుకి తోడు పదిహేడు
దడదడమని కదలాడె కారు 
దడ పుట్టించుతు అన్నాబత్తిన ఉరికాడు!

    వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పా "ఓయ్ వెంకటసుబ్బయ్యా! నీ వల్ల నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది ఇక్కడ. ఇక పొగాకు కొనకయ్యా బాబూ!" అంటే - పాపం! - అప్పుడు నా మాట విని కొనుగోలు ఆపేశాడు. 

    అప్పట్నుంచి నన్ను చూస్తే "బ్రాహ్మణస్య! ఘాతకస్య !" అనేవాడు అంటే "పంతులూ - నువ్వు పాపిష్టోడు!" అని ఆయన భాషలో. హహహహా!

    ఆయన ఎటువంటి వాడంటే ఒక ఖద్దరు చొక్కా, ఖద్దరు పంచె వేసుకుని -కమ్మూనిస్టు లీడరు - రష్యా అంతటి చలిదేశానికి ఆయన విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు - దాదాపు పది రోజులు - అదే ఖద్దరు చొక్కా,  అదే ఖద్దరు పంచె - చేతిలో వావిలాల గోపాలకృష్ణయ్య గారేసుకున్నట్టుగా ఓ చిన్న చేతి సంచీ - అందులో ఇంకో నాలుగు జతలు ఖద్దరు పంచెలు, చొక్కాలు - కోటు కూడా వేసుకోకుండా - రష్యా వెళ్ళాడు. అంత మొండోడు ఆయన! ఎంత మొండివాడో అంత మంచి మనిషి - అలాంటి మంచి మనిషి నాకు మంచి  స్నేహితుడు కూడా!


<వచ్చేమాటు తరువాయి కథ>

5, జులై 2020, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 20 - తలపులమ్మ పంపిన ఊరు... టంగుటూరు!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 19 - కాకినాడ రేవులో ఓడెక్కి ... తుఫాను అలలలో ఊగామే!


నేను 79-80ల్లో కాకినాడ వెళ్ళేటప్పటికి - కాకినాడలో అప్పటికి నా పాత స్నేహితులు, క్లాస్‌మేట్స్ కొందరుండేవారు.

మొదటగా - పోతుల ఆనందరావని చెప్పేసి నా హైస్కూల్‌మేటు. మేమిద్దరం స్కూల్లో బేస్‌బాల్ ఆడుతుండేవాళ్ళం అప్పుడు. మా స్కూల్ బేస్‌బాల్ టీము చాలా మంచి టీం. అందులో నేను, ఈ పోతుల ఆనందరావు, రాగిడి నాగేశ్వరరావు, కొల్లు వాడు మేమందరం ఆడేవాళ్ళం. మాకు అమలాపురం కాలేజీ, ముమ్మిడివరం కాలేజీల మీద పోటీ ఉండేది. ఎప్పుడూ వాళ్ళ మీద గెలుస్తూనే ఉండేవాళ్ళం మేము. ఆ పోతుల ఆనందరావు ఎస్సెల్సీతో ఆపేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) లో చేరాడు. వాడు కాకినాడలోనే ఉండేవాడు.

అలాగే సరస్వతుల నర్సింహారావు అనేవాడు నాకు కాలేజ్ మేటు. వాడేంటంటే సేల్స్ టాక్స్ దాంట్లో పని చేసేవాడు. వాడు జగన్నాథ పురం చెక్ పోస్టులో ఉండేవాడు. వాడో ఫ్రెండు.

తర్వాత మూడోవాడు కూచిమంచి రమణ అని చెప్పి నాకు సీనియర్. వీడిదో ఎపిసోడు.

ఈ కూచిమంచి రమణ ఏంటంటే వాడు మంచి సింగర్. నాకు తెలీదా విషయం. కాలేజీ పోటీల్లో వార్షికోత్సవాలు జరిగినప్పుడు నేను పాటల పోటీల్లో పాడుతూ ఉండేవాణ్ణి. సాధారణంగా గుండమ్మ కథలో "లేచింది మహిళాలోకం" ఇలాంటి పాటలు పాడుతూ ఉండేవాణ్ణి.

ఆరోజు ఏం చేశానంటే - మా ఫ్రెండ్స్ అందరూ "ఒరే! అమరశిల్పి జక్కనలో "ఈ నల్లని రాలలో" పాట పాడమన్నారని  ఆ పాట పాడా. విన్నవాళ్ళందరూ "బావుంది, బావుంది" అని బానే చప్పట్లు కొట్టారు. మరుసటి రోజు ఈ కూచిమంచి రమణ అదే పాట పాడాడు. అద్భుతం! అసలు ఘంటసాలని దించేశాడు. నేను ప్రేక్షకుల్లో కూర్చున్నవాణ్ణి లేచెళ్లి వాడికి దండం పెట్టి "నేనీ పాటని పాడనింక స్టేజ్ మీద" అని చెప్పాను వాడికి. వాడు కూడా నాతో "నువ్వు కూడా ఎంచగ్గా పాడావు" అన్నాడు. అప్పుడు నేను "నీలా పాడలేకపోయాన్నేను. అసలు నువ్విలా పాడతావు అని తెలిస్తే నేనసలు పాడేవాణ్ణి కాదు." అన్నాను. నాకు ప్రైజ్ రాదని నాకు తెలిసిపోయింది. నేను దాన్ని స్పోర్టివ్ గానే తీసుకున్నాను.

అప్పుడు సుబ్బరాజుగారని మా ప్రిన్సిపాల్ గారు నాకన్నా ఎక్కువ బాధ పడిపోయారు నాకు ప్రైజ్ రాలేదని. అంతకు ముందు రెండేళ్ళూ మొదటి బహుమతి నాదే. ఈ మాటు అయన నా దగ్గరికొచ్చి "నీకింకో అవకాశం ఇస్తున్నాను, ఇంకో పాట పాడు" అనంటే అప్పడు నేను "నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో" అని పాడేశాను. దాంతో కూచిమంచి రమణతో పాటు నాకూ ఓ ప్రైజ్ ఇచ్చేశారు మా ప్రిన్సిపాలు గారు.

ఆ కూచిమంచి రమణ - కాకినాడ పోర్టులో క్లర్కుగా పని చేసేవాడు.

తర్వాత నా క్లాసుమేటు ఆర్వీ రావు అని ఇంకొకడు. ఈ ఆర్వీ రావు వాళ్ళ నాన్నగారు ఇంజినీర్. వీడు పీయూసీ ఒకటే చదివాడు అమలాపురంలో. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ లో సెక్రటరీ పోస్టుకి ఎలక్షన్ వస్తే వాడిని సపోర్ట్  చేసి గెలిపించాం. వాడు పీయూసీ అయ్యాక రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళిపోయాడు. వాడేమో ఒక  మార్వాడీ వాళ్ళ ఫెర్టిలైజర్స్ కంపెనీలో పని చేస్తుండేవాడు. వాళ్ళు రైస్ బ్రాన్ ఎగుమతి చెయ్యడం, ఫెర్టిలైజర్స్ దిగుమతి చేసుకోవడం చేస్తుండేవాళ్లు. అందులో వాడు మేనేజర్.

వీళ్ళు నలుగురూ నాకు కాకినాడలో ఫ్రెండ్స్. వీళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉండేవాణ్ణి.

నిజానికి నాకు కాకినాడలో డిసెంబర్ దాకా పని లేదు. ఎందుకంటే shipments డిసెంబరు దాకా గానీ రావు. నన్ను పంపించింది ఎందుకంటే అక్కడ గోడౌన్లు మాట్లాడుకోవడం, ఆ కస్టమ్స్ వ్యవహారాలు తెలుసుకోవడం కోసం నన్ను ముందుగా పంపించారు మా హెడ్డాఫీసు వాళ్ళు.

డిసెంబర్లో కానీ మనకి ఎక్సపోర్ట్స్ రావు అని చెప్పాను కదా!  అప్పటిదాకా ఖాళీ. ఈలోపులో జంగారెడ్డిగూడెం నుంచి మూర్తి,  ఏలేశ్వరం స్టాఫ్  మొత్తం మూడు జీపులేసుకుని భద్రాచలం బయల్దేరారు.

అలా బయల్దేరిన వాళ్ళలో - అచ్యుతరామయ్య అని చెప్పేసి ఓ బయ్యరు, నా ఫ్రెండు కూడా - రవి శంకర్ అని నా శిష్యుడు - వీళ్ళు కూడా వున్నారు. వాళ్ళు బయల్దేరే ముందు నాకు ఫోన్ చేసి నన్ను కూడా రమ్మంటే నేను నాతో పాటు మా లల్లీ, కుట్టీలని కూడా తీసుకెళ్ళాను. వాళ్ళిద్దరినీ తీసుకుని ఏలేశ్వరం వెళ్లి, ఏలేశ్వరం నుంచి మూర్తి వాళ్ళతో జాయిన్ అయ్యా.

మూడు జీపులు వేసుకుని - వయా అడ్డతీగల, మారేడుమల్లి - అట్నుంచి అలా భద్రాచలం వెళ్దామని మా ప్లాను. రాత్రి పూట బయల్దేరాం. తెల్లవారేటప్పటికి కిన్నెరసాని వాగు దగ్గర ఆగాం. అక్కడే దంతధావనాలు అవీ చేసుకున్న తర్వాత రెండు జీపులు వాగు దాటి వెళ్లిపోయాయి.  మా లల్లీ, కుట్టి ఆ ముందు జీపుల్లో వున్నారు.

ఆఖరి జీపులో  నేను, అచ్యుతరామయ్య, మూర్తి వెడుతూ ఉంటే వాగు ఉధృతంగా వచ్చేసింది. జీపు మొత్తం ఇంజిన్ దాకా మునిగిపోయింది. మేమప్పటికి లుంగీలతో వున్నాం. ఆ లుంగీలు పైకి కట్టేసుకుని ఈ జీపుని తోసుకుంటూ ఒడ్డెక్కాం.

ఒడ్డెక్కాక ఇహ అక్కడ మా జీపు నడవదు కదా - మిగతా రెండు జీపుల్లో ఓ జీపుకి తాడేసి కట్టి దీన్ని కొత్తగూడెం దాకా తీసుకెళ్ళాం. కొత్తగూడెంలో రిపేరు చేయించుకుని సాయంత్రానికి భద్రాచలం చేరాం. ఆ రాత్రి భద్రాచలంలో వున్నాం. తర్వాతి రోజు దర్శనాలు చేసుకుని, పంచవటి అదీ చూసుకుని ఆ రోజు సాయంత్రానికి బయల్దేరి ఒరిసా బోర్డర్లో వున్న సీలేరు థర్మల్ స్టేషన్ పిల్లలకి చూపించిన తర్వాత వెనక్కి బయల్దేరేశాం.

అలా వస్తూ దారిలో మారేడుమల్లి వచ్చేటప్పటికి అర్థరాత్రి అయ్యింది. అక్కడ కోయవాళ్ళు వాళ్ళేదో వేటకొచ్చారు బాణాలు పట్టుకుని. మా జీవుల్ని చూసి ఆపేశారు. ఆపేస్తే అందరూ భయపడుతున్నారు. నేనూ, అచ్యుతరామయ్య దిగి "ఏం ఫర్వాలేదు భయపడకండి. మేము మాటాడతాం" అని వెళ్లి వాళ్ళతో "ఒరే బాబూ...మేమేదో భద్రాచలం చూద్దామని సరదాగా వచ్చాము. మీరేంటీ ...? సిగరెట్లు తాగుతారా?" అనడిగి వాళ్లందరికీ తలకో సిగరెట్టు ఇచ్చాము. అందరూ సిగరెట్లు తీసుకుని "జాగ్రత్తగా వెళ్లి రండి" అని మమ్మల్ని వెళ్లనిచ్చారు.

మొత్తానికి అందర్నీ ఏలేశ్వరంలో డ్రాప్ చేసి లల్లీ, కుట్టీలతో కలిసి నేను కాకినాడ వచ్చేశాను.

డిసెంబర్ దాకా నాకు ఏ పనీ లేదని చెప్పాను కదా! నాకు వూరికే ఆఫిసుకి వెళ్లడం, అక్కడ సాయంత్రం దాకా కబుర్లతో కాలక్షేపం చేయడం కొంచెం చికాగ్గానే ఉండేది.

ఆ పరిస్థితిలో - ఒకప్పుడు కృష్ణస్వామిగారు నేను కంపెనీలో జాయిన్ అయినపుడు అయన "మూడంకెల మించి నీకు ఈ కంపెనీలో జీతం రాద"నేవాడు కదా! ఆయనతో ఛాలెంజ్ గా తీసుకున్నాను "ఇదే కంపెనీలో ఐదంకెల జీతం తీసుకుంటా"నని. అదీ మనసులో కదులుతూనే వుంది.

పైగా రెండోది ఏంటంటే "ఇక్కడ పని లేదు. ఏదైనా ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తే బావుంటుంది, ఇక్కడ ఉండడం చాల కష్టంగా వుంది" అని ఆలోచిస్తూ ఉంటే ఈ లోపు అనుకోకుండా మా ముఠామేస్త్రీ విష్ణు వచ్చి "అయ్యగారూ! ఇక్కడ తుని దగ్గర తలుపులమ్మ లోవ అనుంది. అక్కడికెళ్లి మనం ఏం కోరుకుంటే అదవుతుంది.  మేమందరం అక్కడికి వెళ్దామనుకుంటున్నాము. మీరు కూడా రండి అక్కడికి" అనడిగాడు.

నిజానికి ఆ అమ్మవారి పేరు తలుపులమ్మ కాదు తలపులమ్మ. తలచుకుంటే కరుణిస్తుందన్నమాట.

అక్కడ పరిస్థితి ఏంటంటే...ఇప్పుడంటే బ్రాహ్మలు వాళ్ళూ చేరి ఎండోమెంటుకొచ్చి వాళ్లు అర్చనలూ అవీ చేస్తున్నారు చేస్తున్నారు కానీ నేనక్కడున్న రోజుల్లో ఆసాదులు ఉండేవారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఓ కోడిని తీసుకెళ్లాలి. ఆ కోడిని అక్కడే బలిచ్చి, అక్కడే వండుకుని, ఆ దేవతకి నైవేద్యం పెట్టి, అది ప్రసాదంగా తిని రావాలి. అదీ పధ్ధతి ఆ రోజుల్లో.

మా ముఠావాళ్ళతో పాటు - నేను, శాస్త్రిగారు, శ్రీనివాసరావుగారు, వెంకటరావు అని చెప్పేసి శాస్త్రిగారి శిష్యుడు - మేము కూడా బయల్దేరి కారేసుకుని వెళ్ళాం. వెళ్ళాక అక్కడ " ఒరే! మేము కోడిని కొయ్యం కానీ మీరు కొయ్యండి. ఓ ముక్క ప్రసాదం తింటాలెండి" అన్నా. నేనక్కడ ఆ అమ్మవారిని "ఎంతకాలం ఈ గుమాస్తా వుద్యోగం నాకు?! ఏదైనా ఇండిపెండెంట్ ఛార్జ్ కావాలి నాకు తల్లీ! పైగా ఇక్కడ పనే లేదు. నాకు ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళిపోతాన్నేను." అని కోరుకుంటూ దండం పెట్టుకున్నాను. ఈ కార్యక్రమం అంతా అయిపోయాక మళ్ళీ కాకినాడ వచ్చేశాం.

నిజంగా చెప్తే నమ్మరు ఎవరూ... మరుసటి రోజు పొద్దున్న నేను ఆఫీసుకి వెళ్ళలేదు పనెలాగూ ఉండట్లేదని. భోంచేసి, పడుక్కుని లేచి మధ్యాహ్నం వెళ్ళాను. వెళ్ళగానే నా టేబుల్ మీద ఓ టెలిగ్రాం .

మా జనరల్ మేనేజర్ HR రామచంద్ర అని - కన్నడ ఆయన. ఆయన "Report immediately at Head office with bag అండ్ baggage " అంజెప్పి ఓ టెలిగ్రామ్ ఇచ్చారు నాకు. .

నాకైతే కొంచెం చెమటలు పట్టాయి. "ఏంట్రా బాబూ...మనమేమన్నా తప్పు చేశామా ఏంటి? ఈ టెలిగ్రామేంటి? ఎందుకు రమ్మన్నారు నన్ను?" అని వెంబడే ఇంటికెళ్ళిపోయి రాత్రి పది గంటలకి బస్సెక్కి చిలకలూరి పేట వెళ్ళిపోయాను.

మరుసటి రోజు పొద్దున్నే వెళ్లి కలిశాను రామచంద్ర గారిని. కలిస్తే... ఆయన చెప్పింది ఏంటంటే "నిన్ను ప్రమోట్ చేసి టంగుటూరు బ్రాంచ్ మేనేజర్ గా వేశారు. నువ్వర్జంటుగా వెళ్ళి ఛార్జ్ తీసుకో అక్కడ" అని.

నాకైతే ఒక విధంగా ఎంత సంతోషమేసిందో! "ఒరే బాబూ నిజంగా ఆ తల్లి - తలపులమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. దానివల్లనే మనకిది వచ్చింది" అనుకుని ఆ అమ్మవారికి మనసులో ఓ వెయ్యిదండాలు పెట్టుకుని "సరే సార్! నేను కాకినాడెళ్ళి వెళతాను" అంటే ఆయన "లేదు. నీకు కాకినాడకి వెళ్ళడానికి కూడా టైం లేదు. ముందు టంగుటూరు వెళ్లి ఛార్జ్ తీసేసుకో. తీసుకుని అక్కడ ఓ రెండ్రోజులుండి చూసుకుని ఆ ఆతర్వాత కాకినాడ వెళ్ళు" అన్నారు.

మరి నాకక్కడ టంగుటూరులో ఉండడానికి వసతిగా ఏమన్నా ఉన్నాయా అనడిగితే  "అక్కడ పత్తిపాటి సుబ్బారావు ఒకాయన వున్నాడు. ఎర్రబ్బాయ్ అంటారు ఆయన్ని. ఆయనకి ఓ నాలుగు గోడౌన్స్, గ్రేడింగ్ హాలు, ఓ చిన్న గెస్ట్ హౌస్ అన్నీ వున్నాయి అక్కడ ఆయన గెస్ట్ హౌస్లో వుండు. అక్కడుండి ముందు ఛార్జ్ తీసుకుని తరవాత కాకినాడెళ్ళి నీ ఫ్యామిలీని షిఫ్ట్ చెయ్యి" అని చెప్పారాయన.

ఇదెప్పుడూ అంటే 1980 ఏప్రిల్-మే ప్రాంతాల్లో. పిల్లలేమో MSN ఛారిటీస్‌లో చదువుతున్నారు. వీళ్ళకి మళ్లీ టంగుటూరు స్కూల్లో సీట్లు అవీ కావాలి అంటే ఏప్రిల్-మే నెలల్లో స్కూళ్ళలో సీట్లూ అవీ ఎవరిస్తారు? అసలే అకడెమిక్ ఇయర్ అయిపోవస్తూ ఉంటుంది.

ఇలాక్కాదని చెప్పి సుబ్బన్న గారి దగ్గరికి వెళ్ళాను. నాకు గురువుగారు, నా వెల్-విషర్ కదా!

ఆయన "ఒరే! వెళ్ళి అక్కడ బీనీడి వెంకట నరసయ్య అని చెప్పేసి వున్నాడు. ఆంజనేయ టొబాకో కంపెనీ వాళ్ళదే టంగుటూర్లో. నేను వాడికి చెప్తాను. నువ్వు వెళ్ళు. నీ పిల్లలకి స్కూల్లో సీట్లు అవన్నీ ఎరేంజ్ చేస్తాడు. అని చెప్పారు.

నేవెళ్ళి ఆ బీనీడి వెంకట నరసయ్యని కలిశాను. ఆయన "కామేశ్వరరావు! మీరు ఎప్పుడొచ్చినా సరే మీ పిల్లలకి హైస్కూల్లో సీట్లు ఉంటాయి. ఏం ప్రాబ్లెమ్ లేదు. నువ్వు బయల్దేరొచ్చేయ్. నీకు ఇల్లు కూడా నేనే చూస్తాను" అని చెప్పి కొండలరావు గారని చెప్పేసి ఆయన ILTD లో పని చేసి రిటైర్ అయ్యాడాయన. ఆయన ఇల్లు కూడా అద్దెకుందని చెప్పాడు నాకు. ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. అలా ఓ నాలుగు రోజులు టంగుటూరు లోనే ఉండి పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కాకినాడకి తిరిగి వచ్చేశాను. వచ్చేసి కాకినాడలో అందరికీ "నాకు టంగుటూరు ట్రాన్స్ఫర్ అయింది" అని చెప్పాను. నెలకి నాలుగంకెల జీతం కావాలనుకున్న నాకు టంగుటూరు కూడా మూడంకెల్లోనే మొదలయింది. సరే! ముందు ఇండిపెండెంట్ ఛార్జ్ వచ్చింది కదా అని నాకు నేనే సర్ది చెప్పుకుని టంగుటూరు వెళ్ళిపోయాను.

ఇక్కడ ఇంతకు ముందు మరిచిపోయిన కొన్ని సంగతులు చెప్పాలి. నేను కాకినాడలో ఉన్నప్పుడు లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఎలాగంటే నాకు చిన్నప్పణ్ణించి కూడా అనాతవరంలో వనసర్ల సాయిబ్బు అని చెప్పేసి అతనికి ఒంటెద్దు బండి ఉండేది. నేను, మా నాన్న, మా అమ్మ అమలాపురంలో వున్న మా అక్కగారు పాపాయమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ బండేసుకెళ్ళేవాళ్ళం. ఆ ఒంటెద్దు బండి తోలేవాణ్ణి నేను సరదాగా. తర్వాత మన పొలంలో అల్లుడు-మావల జత అంజెప్పేసి ఓ ఎడ్ల జత ఉండేది. ఆ ఎడ్ల జతకి రెండెడ్ల బండి నేనే నేర్పి ఆ బండేసుకుని ముమ్మిడివరం సినిమాలకి వెళ్ళేవాణ్ణి. దాంతర్వాత ఏంటంటే ఊళ్లోకి కొత్తగా రిక్షాలొచ్చాయి. ఓ సాయెబుండేవాడు. మా అమ్మగారికో అలవాటుండేది కదా! అమలాపురం వెళ్ళడానికి బండి వాళ్ళో, రిక్షావాళ్ళో వస్తే వాళ్ళని లోపలికి రమ్మని వాళ్లకేదో టిఫినో, పలహారమో పెట్టేది వెనకాల పెరట్లో. వాళ్ళలా లోపలికి తినడానికి వెళ్ళినప్పుడు ఆ రిక్షా వేసుకుని వెళ్లిపోయేవాణ్ణి. రిక్షా కూడా తొక్కేసేవాణ్ణి. వీటన్నిటితో పాటు గుఱ్ఱపు స్వారీ, గుఱ్రబ్బళ్ళు తోలడం సరే సరి!

ఇవన్నీ అయ్యాక తర్వాత్తర్వాత మోటర్ సైకిళ్ళు  - ఎస్సెల్సీలో ఉండగానే మొదట నేను నేర్చుకున్నదే బులెట్ మోటార్ సైకిలు - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ది. తరవాత కంపెనీకి వచ్చింతర్వాత కార్లు, జీపులు - ఇవి కంపెనీలో నేర్చుకున్నాను.

లారీ ఎలా నేర్వనేర్చుకున్నానంటే కాకినాడలో చైనా ఎక్స్‌పోర్ట్స్ వచ్చినప్పుడు మాది పదివేల టన్నుల ఆర్డర్.

మా జనరల్ మేనేజర్ రామచంద్రకి ఓ విచిత్రమైన రూలు ఉండేది - లారీలు అన్నీ ఒకసారే వెళ్ళాలి, ఒకసారే రావాలి. ఓ లారీలో స్టెప్నీ, ఓ లారీలో జాకీ, ఓ లారీలో వీల్ రెంచు - ఇలా పెట్టి పంపించేవాడు. పన్నెండు లారీలు ఉండేవి మాకు. ఆయనే ఆటోమొబైల్ ఇన్‌చార్జ్ కూడా. ఈ లారీలు మొత్తం ఒకేసారి అక్కడ లోడ్ చేసుకుని కాకినాడ వచ్చి పోర్టుకి రాగానే మొదటి లారీ అన్లోడ్ కాంగానే ఆ లారీ తీసుకుని మిగతా లారీలు అన్లోడ్ అయ్యేవరకు ఆపోర్టులో ఈ లారీ వేసుకుని తిరుగుతూ వుండేవాణ్ణన్నమాట. అలా నేల మీద నడిచే ప్రతి వాహనం - ఒక్క ట్రెయిన్ తప్ప అన్నీ నేను డ్రైవ్ చేసేవాణ్ణి.

సరే! 1980 జూన్ నెలకి టంగుటూరు వచ్చేశాను.

టంగుటూరులో పత్తిపాటి సుబ్బారావుగారి గ్రేడింగ్ పాయింట్స్ ఉండేవి. ఆరొందల మంది గ్రేడర్స్ అక్కడ.

బయ్యింగ్ పాయింట్స్ ఓ పద్ధెనిమిది ఉండేవి. నెల్లూరు నుంచి కావలి, సింగరాయకొండ, జమ్ములపాలెం, టంగుటూరు, ఇలా చాలా పాయింట్స్ వుండేవి. వీటన్నిటిలో కూడా పొగాకు కొనుగోలు చేసే కంట్రోల్ మొత్తం నాదే. పద్ధెనిమిది కార్లుండేవి అక్కడ కూడా.

అన్నాబత్తుల వెంకట సుబ్బయ్య అని ఒకతను ఉండేవాడు. అతనిది జమ్ములపాలెం. అతను కూడా నేనంటే చాలా అభిమానంగా ఉండేవాడు. కందుకూరులో కూడా ఒక బ్రాంచ్ ఉండేది. అది కూడా ఒక గ్రేడింగ్ పాయింట్. ఆదిపూడి వెంకట్రావు గారని చెప్పేసి ఆయన అక్కడ మేనేజర్. ఆయనకిద్దరు భార్యలు. ఆయన్ని సరదా చేస్తూ "ఒక పక్కన గంగమ్మ, ఒక పక్కన గౌరమ్మ,,, ఇద్దరు భార్యల ముద్దుల మగడా విభూతి మల్లన్నా... మెడలో నాగుల మల్లన్నా!"  పాట పాడేవాణ్ణి.

కొండలరావుగారింట్లో అద్దెకు దిగాం కదా! అక్కడ ఎదురుగుండా ఇంట్లో సుబ్బారావు అని ఒకాయన కఱ్ఱసాము నేర్పుతూ ఉండేవాడు. ఆయనకి ఇద్దరాడ పిల్లలు - అమృతరాణి, విషారాణి - భలే వింతైన పేర్లు. ఆ పెద్దపిల్లకి అప్పటికి ఓ పదిహేనేళ్ళు వుంటాయేమో కఱ్ఱసాము భలేగా చేసేది. వాళ్ళింటికి ఎదురుగుండా కరణంగారి ఇల్లు పిల్లలతో సందడిగా ఉండేది.

కొండలరావు గారింట్లో ఓ ఏడాది పాటు ఉన్నాక పిల్లలకి హైస్కూల్ దగ్గరగా ఉండాలని చెఱువు గట్టు మీద చింతచెట్లతోపు దగ్గరగా - కొణికి వెంకట శేషయ్యగారని - ఆయన ఇంట్లోకి మారాము. ఆ ఇంటికి ఏంటంటే ముందో వరండా, తర్వాత రెండు గదులు ఉండేవి అంతే! బాత్రూములు అవీ కూడా లేవు. నేను ఆ వరండాకి ఇనప గ్రిల్ పెట్టించి మూడో గదిలా వాడుకున్నాను. బాత్రూములూ అవీ కూడా నేనే కట్టించుకున్నాను.

(ఇక్కడో మాట చెప్పాలి. 2018లో మా అమ్మాయి లల్లి పదో తరగతి వాళ్ళందరూ పూర్వ విద్యార్థుల సమావేశం జరుపుకున్నప్పుడు మేమందరం టంగుటూరు వెళ్ళాము. అప్పుడు కొణికి వెంకట శేషయ్యగారు మంచం మీద వున్నవాడు కూడా నన్ను చూడ్డానికని లేచి వచ్చాడు. నా రెండు చేతులూ పట్టుకుని "నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు, కామేశ్వరరావుగారూ!" అని ఒకటే ఏడ్చేశాడు.  పెద్దాయన పాపం! నన్ను చూసి ఎంతో ఆనందించాడు.

వాళ్ళ ఇల్లు అద్దెకు అడగడానికి వచ్చినవాళ్లు ఆ ముందు గ్రిల్ తీయించేస్తేనే అద్దెకు వస్తామని అంటే - ఆ గ్రిల్ కామేశ్వరరావుగారు కట్టించారూ,  అదలా ఉండాల్సిందే, మీరు అద్దెకి రాకపోయినా ఫర్వాలేదు అని చెప్పి - ఆ రెండు వాటాలు ఈ రోజుకీ అలాగే ఖాళీగా ఉంచేసుకున్నాడు. నేనంటే ఎంత అభిమానమో!)

<వచ్చేమాటు తరువాయి కథ>

26, జనవరి 2020, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 19 - కాకినాడ రేవులో ఓడెక్కి ... తుఫాను అలలలో ఊగామే!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 18 - జంగారెడ్డిగూడెంలో జాలీగా...

1979 ఏప్రిల్, మే ప్రాంతాల్లో మా కంపెనీకి చైనా ఎక్స్‌పోర్ట్స్ వచ్చాయి. ఆ ఆర్డర్ దాదాపు మూడువేల టన్నులో ఎంతో. అవన్నీ కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్‌పోర్ట్. అప్పుడేం చేశారంటే కాకినాడ పోర్టులో నాలుగు గోడౌన్లు - ఒక్కోటి 4000 చదరపు అడుగులు - అంటే మొత్తం పదహారువేల అడుగులు - వాటిని అద్దెకు తీసుకుని నన్ను కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు. కాకినాడ వెళ్ళి ఆ ఎక్స్‌పోర్ట్స్ చూడమని.

అప్పుడే మా పెద్దమ్మాయి లల్లీని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆరో తరగతిలో చేర్చాము. మళ్ళీ అంతట్లోనే ఈ కాకినాడ ట్రాన్స్ఫర్. మరి ఏ స్కూల్లో సీట్ దొరుకుతుందో చూడాలి. ఆ స్కూలుకి దగ్గరగా ఇల్లు దొరకాలి. ఇవన్నీ కుదిరితేనే కానీ మేమందరం కలిసి కాకినాడ వెళ్ళలేము. అందుకే నేనెళ్ళి మా సర్కిల్ మేనేజర్ రాజగోపాలుకి "ముందు నేనెళ్ళి ఇల్లూ, స్కూళ్ళూ చూసుకుని వస్తాను. ఆ తర్వాత ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాను" అని చెప్పాను. ఆయన సరేనన్నాక నేనొక్కణ్ణీ బయల్దేరి కాకినాడ వెళ్ళాను.

కాకినాడలో తిరుమల ఎక్స్‌పోర్ట్స్ అని చెప్పేసి  ఉండేది - వాళ్ళు C & F ఏజెంట్స్. వాళ్ళ ద్వారానే మా చైనా ఎక్స్‌పోర్ట్స్ వ్యవహారాలన్నీ జరిగేవి. అందులో కేలప్పన్ అని ఒకాయన, ఆయన కొడుకు రాజీవ్ - కేరళ వాళ్ళు వుండేవాళ్ళు. కేలప్పన్ మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళు  బియ్యం, ఊక (Rice Bran), మొక్కజొన్న లాంటివన్నీ ఎగుమతి చేస్తూ వుండేవాళ్ళు.

పొగాకుకి ప్రత్యేకించి ఒక విభాగం పెట్టి D S శాస్త్రి అని ఏలేశ్వరంలో చేసిన D S శాస్త్రికి అన్నగారీయన - దారా శాస్త్రి. ఆయన టొబాకోలో పని చేశాడు చిలకలూరిపేటలో MSN కంపెనీలో.

మద్ది లక్ష్మయ్యగారి అన్నగారుండేవాడు మద్ది సత్యనారాయణగారని. ఆయన కంపెనీలో ఈ దారా శాస్త్రి జనరల్ మేనేజరుగా పని చేశాడు. కాకినాడలో భానుగుడి సెంటర్ - పద్మాలయా థియేటర్ దగ్గర ఆయన ఇల్లుండేది. ఆయన సత్యనారాయణగారి కంపెనీలో పని మానేసి, కాకినాడకొచ్చి ఈ కేలప్పన్ కంపెనీలో టొబాకో డివిజన్‌లో చేరాడు. కేలప్పన్ కూడా టొబాకో ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్ వస్తాయని ఈ దారా శాస్త్రిగారిని మేనేజరుగా పెట్టుకున్నాడు.

సరిగ్గా అప్పుడే మద్ది లక్ష్మయ్యగారి చైనా ఎగుమతులు, పోలిశెట్టి సోమసుందరం గారివి, బొమ్మిడాల వాళ్ళవి రష్యా ఎగుమతులు అన్నీ కూడా తిరుమల ఎక్స్‌పోర్ట్స్‌కే వచ్చాయి. అవన్నీ దారా శాస్త్రిగారి ద్వారానే జరిగేవి.

దారా శాస్త్రిగారి దగ్గర శ్రీనివాసరావు గారని ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉండేవాడు. మూర్తి అని ఒక క్లార్కు ఉండేవాడు. ఆ టైములో నన్నూ అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు.

అక్కడ మద్ది లక్ష్మయ్యగారి టొబాకో ఎక్స్‌పోర్ట్స్ వ్యవహారాలు నన్ను చూడమన్నారు. సరే! అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. చైనా ఎక్స్‌పోర్ట్స్ నడుస్తున్నాయి. బానే చేయిస్తున్నాము. ఉద్యోగంలో కుదురుకున్నాను. మరి ఇప్పుడు ఇల్లు అద్దెకు తీసుకోవాలి కదా!

జగన్నాథపురంలో శ్రీనివాసరావుగారి ఇంటి దగ్గరే గారపాటి సుబ్బారావు గారని MSN చారిటీస్ స్కూల్లో పని చేసే ఓ తెలుగు లెక్చరర్ ఉండేవారు. ఆయన ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా వుంది అంటే వెళ్లి చూశాను. ముందు కటకటాలు, మధ్యలో గది, వంటిల్లు, వెనకాల చిన్న పెరడు - ఇల్లు బావుంది. ఆ ఇల్లు అద్దెకి తీసేసుకున్నాను. శ్రీనివాసరావుగారి భార్య కూడా MSN చారిటీస్ లోనే లెక్చరరుగా పని చేసేవారు. ఆవిడని మేము మేడం గారని పిలిచేవాళ్ళం.


ఆ ఇల్లు తీసుకున్నాక జంగారెడ్డి గూడెం వచ్చి, మళ్ళీ అప్పటికప్పుడు సామానంతా సర్దుకుని జంగారెడ్డిగూడెం నుంచి కాకినాడ వెళ్ళాము. లల్లీని, కుట్టీని కూడా MSN చారిటీస్ స్కూల్లో చేర్చాము.

గారపాటి సుబ్బారావు గారికి ఇద్దరు పిల్లలు - బాల, బాబి.

బాల మా లల్లీ కన్నా ఏడాది పెద్దది. బాబి మా కుట్టీ తోటివాడే. వాళ్ళతో పాటు సుబ్బారావుగారి తల్లి కూడా వుండేవాళ్ళు. ఆవిణ్ణి అందరమూ మామ్మగారనే పిలిచేవాళ్ళం.

సుబ్బారావుగారు బాబి చదువుకునే పాఠాలన్నీ ఆయన గొంతుతో ఓ కేసెట్లో రికార్డ్ చేసి రోజూ పొద్దున్నే బడికి వెళ్ళే ముందు బాబిని కూర్చోపెట్టి టేప్ రికార్డర్లో కేసెట్ పెట్టి వాడితో పాటు - పక్క వాటాలో వున్న మా అందరికీ కూడా వినిపించేవారు.

మొదట్లో ఆఫీసుకి బులెట్ మీద వెళ్ళేవాణ్ణి. పోనుపోనూ దానిమీద ఖర్చు పెరిగి అదో ఐరావతంలా తయారయింది. అందుకని దాన్ని జంగారెడ్డిగూడెం పంపించేసి రోజూ ఆఫీసుకి రిక్షాలో వెళ్ళి వచ్చేవాణ్ణి.

ఒకసారి ఏమైందంటే చైనాకి పొగాకు పంపించడానికి Fir wood cases లో ప్యాక్ చేశాము. ఆ పెట్టెలన్నీ స్టీమరుకి వెళ్ళిపోయాయి. ఇంతలో ఏమైందంటే కెప్టెన్ నుంచి కబురొచ్చింది.

ఏమనీ...?

"Hatches లో కేసులు అన్నీ చెదలు పట్టాయి. మీరొచ్చి రిపేరు చేసుకుంటారా, లేకపోతే అన్నీ సముద్రంలో పారేయమంటారా?" అని.

అది చూడగానే వెంటనే నేను, శ్రీనివాసరావుగారు, ఆ మూర్తి  అనేవాడు , విష్ణు అనే ముఠామేస్త్రి ఉండేవాడు - అతను, ఓ పదిమంది ముఠావాళ్ళు, ఓ పదిమంది కార్పెంటర్సు - ఇలా మేమందరం కలిసి ఓ ఇంజిన్ పడవలో ఓడ దగ్గరికి వెళ్ళడానికి బయల్దేరాం. అలా ఎందుకంటే కాకినాడ పోర్టులో షిప్ లోడింగుకి వెళ్ళాలంటే ఆరు మైళ్ళు సముద్రంలోకి వెళ్ళాలి. డైరెక్టు హార్బరుకి రాదది.

సరే! పడవలో మేమందరం పొద్దున్నే బయల్దేరాం రెండు పడవల్లో. ఆ పడవలో వెళ్ళడం ఎలాగంటే వెళ్ళేటప్పుడు ఇంజిన్ మీద తీసుకెళ్తాడు. వచ్చేటప్పుడు ఇంజిన్ ఆపేసి తెరచాప గాలివాలుకి తీసుకొస్తాడు ఆయిల్ ఆదా చేయడం కోసం. మొత్తానికి ఓడని చేరాం. పైకి వెళ్ళి ఆ hatches లో లోపలికెళ్ళిపోయాం. కార్పెంటర్లు పని మొదలుపెట్టేశారు.

అక్కడ మాకు భోజనము అదీ కెప్టెనే ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం అయింది.

మాకు తెలీలేదు కానీ అప్పటికి తుఫాను వస్తోందని అనౌన్స్ చేశారు. మాకా విషయం తెలీదు. Hatches లో ఉండిపోయాం. మధ్యాహ్నానికి First Flag ఎగరేశారట. సముద్రంలో అలల ఉధృతాన్ని బట్టి ఎగరేస్తారు కాబట్టి దాన్ని surf flag అంటారు. తుఫాను వచ్చినప్పుడు మూడు ఫ్లాగులు ఎగరేస్తారు. మొదటిది వచ్చినప్పుడు మాకు తెలీలేదు. ఇంతలో రెండోది కూడా ఎగరేశారు. అప్పుడు కెప్టెను మా దగ్గరికొచ్చి "మీరు వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కణ్ణించి. Second surf flag కూడా ఎగరేశారు. ఇంకా ఎక్కువ కాకుండానే మీరు ఒడ్డుకి వెళ్లిపోవడం మంచిది." అనగానే మేము కూడా బయల్దేరేశాం. ఈలోపులో మా పనులు కూడా అయిపోయాయి లోపల.

బయల్దేరామే కానీ షిప్పులోంచి పడవలోకి దిగలేకపోయాం. విపరీతమైన గాలి సముద్రంలో. మేము దిగుదామని చూస్తే ఆ నిచ్చెన అటూ ఇటూ ఓ....  ఊగిపోతోంది.

అప్పుడు కెప్టెను ఏం చేశాడంటే - పడవల్లోంచి కేసులు షిప్పులోకి చేర్చే క్రేన్స్ ఉంటాయి. మమ్మల్ని ఆ క్రేన్సులో కూర్చోబెట్టి పడవల్లోకి దించాడు. అందరం పడవుల్లోకి ఎక్కాం. మరి పడవవాళ్ళు ఇంజిన్లు ఆపేశారు కదా. తెరచాపలు ఎత్తారు.

మేమందరం రెండు పడవల్లో ఎక్కి వెళ్తుంటే.... అలల తాకిడికి అటూ ఇటూ కొట్టుకుంటూ పడవలు వెళ్తుంటే అసలెలా ఉందంటే ... చుట్టూ ఎటు చూసినా నీళ్ళు. పైన ఆకాశం నల్లగా... ఆ నీడ పడి కింద నీళ్ళు ఇంకా నల్లగా ...పెద్ద పెద్ద అలలు... గాలి... భయంకరంగా వుంది. ఆ పెద్ద అలల్లోంచి సముద్రపు నీళ్లు మమ్మల్ని ఛెళ్ళుఛెళ్ళున కొట్టేస్తున్నాయి.

ఇంతలో శ్రీనివాసరావుగారికి ఆ పడవ కుదుపు, అలల తాకిడికి తట్టుకోలేక వాంతులు మొదలయ్యాయి.

మూర్తి ఏమో తెరచాప కొయ్య గట్టిగా పట్టుకుని కావలించుకుని కూర్చుని ఒకటే ఏడుపు ... "మా అమ్మకి నేనొక్కణ్ణే కొడుకుని బాబోయ్! ఇప్పుడు ఒడ్డుకెలా చేరుతాంరో దేవుడోయ్...!" అంటూ.

ముఠావాళ్ళు కొంచెం గట్టిగానే వున్నారు. లోపల్లోపల భయంగా వున్నా - అది బయటపడితే అందరూ ఇంకా బెంబేలెత్తిపోతారని - నేను ముఠావాళ్ళతో కలిసి ఈ భయపడ్తున్న వాళ్ళందరిని సముదాయిస్తూ "ఏం ఫర్వాలేదు. ఒడ్డుకి చేరిపోతాం. ఒకవేళ మన పడవ మునిగిపోయినా ఏ హెలికాఫ్టరో వచ్చి మనల్ని తీసుకెళ్తుంది. ఇబ్బంది లేదు. ఆల్రెడీ పోర్టుకి కబురెళ్ళింది మనం ఇలా పడవల్లో వస్తున్నామని" అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడి ధైర్యం చెప్తూ ...మొత్తానికి ఒడ్డుకి చేరాం.

ఇంక అదే ఆఖరు... ఆ తర్వాత ఇంకెప్పుడూ సముద్రం లోపలికెళ్ళలేదు - వెళ్ళే ఆలోచన కూడా చెయ్యలేదు.

<వచ్చేమాటు తరువాయి కథ>