31, జులై 2021, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 24 - పల్టీ కొట్టిన కారు; పట్టి నేర్చుకున్న ఆకు...

 కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 23 - గోల్డెన్ రోజులు అలా మొదలు...


    కిందటి మాటు -  గోల్డెన్ లో చేరిన తర్వాత నాకు ప్రొడక్షన్ మేనేజర్ గా ఒక పది గ్రేడింగ్ పాయింట్లు ఇచ్చారు అని చెప్పాను కదా!  

    అవీ - సింగరాయకొండ, చింతలపూడి, కామయ్యపాలెం, ఉప్పలపాడు, టంగుటూరులో రెండు పాయింట్లు, నాయుడుపాలెం,  త్రోవగుంట దగ్గరున్న మార్లగుంటపాలెం, మేదరమెట్ల - ఆ తర్వాత -  చీరాల దగ్గర వేటపాలెం అని కూడా చెప్పాను. 

    చీరాల దగ్గర వేటపాలెంలో  కోటేశ్వరరావుగారు అని కమిషనర్ గారు ఉండేవారు. పెద్దాయన - అప్పటికి అరవై ఏళ్ళుంటాయ్.  

    ఆయన్ని ICVC కోటేశ్వరరావు గారు  అనేవారు. ఆయన్ది గుంటూరు. ICVC అంటే ఇండియన్ కంట్రీ అండ్ వర్జీనియా టొబాకో కంపెనీ. దాని ఓనరు ఆయన. ఆయన గ్రేడింగ్ కమిషన్ చేసేవాడు. ఆయనకి వేటపాలెంలోఓ పెద్ద గ్రేడింగ్ హాలుంది . ఆయన అక్కడుండేవాడన్నమాట. కళ్ళు సరిగ్గా కనపడేవి కాదు. మసక మసగ్గా ఉండేవి. పాపం కఱ్ఱ పట్టుకు నడుస్తుండేవాడు. నేనంటే చాలా అభిమానం ఆయనకి. 

    ఇంక వారం మొత్తంలో నా దినచర్య ఏంటంటే - ప్రతి రోజూ టంగుటూరు చుట్టుపక్కలున్న సింగరాయకొండ మొదలుకొని టంగుటూరు ఏరియాలో  ఉన్న గ్రేడింగ్ పాయింట్లన్నీ కూడా ఒక రెండు రోజులు వరసగా  తిరగాలి. 

    అప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చేసేవాణ్ణి. భోజనం కాంగానే మళ్ళీ వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేసేవాణ్ణి. 

    మా ఆఫీసేమో ఒంగోల్లో ఉండేది. 

     ఒక రెండ్రోజుల తర్వాత ఏంటంటే నాయుడుపాలెం చూసుకుని - మార్లగుంటపాలెం చూసుకుని -  మేదరమెట్ల చూసుకుని - వేటపాలెం వెళ్ళాలి. 

    వేటపాలెం అంటే టంగుటూరుకి కొంచెం దూరమది  - చీరాల దగ్గర కదా!

    ఆ వేటపాలెం వెళ్ళినప్పుడు గ్రేడింగ్ పాయింట్ చూసుకుని ఆ రాత్రికి నైట్ హాల్ట్ అక్కడ ఉండిపోయేవాణ్ణి. ఎందుకంటే చీరాల సముద్రపొడ్డున ICVC కోటేశ్వరరావుగారికి ఓ గెస్టుహౌసు ఉండేది. 

    మేమిద్దరం ఆ గెస్టుహౌసులో ఉండేవాళ్ళం. ఓ వంట మనిషుండేవాడు. చక్కగా అతను వండింది భోంచేసి రాత్రి అక్కడే పడుక్కుని మరుసటిరోజు పొద్దున్నే బయల్దేరి - మళ్ళీ వేటపాలెం చూసుకుని - తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మేదరమెట్ల అవీ చూసుకుని - ఒంగోలు ఆఫీసుకొచ్చేవాణ్ణి. ఒంగోల్లోనే హోటల్లో భోంచేసేసి ఒంగోలు ఆఫీసులో సాయంత్రం వరకు ఉండి టంగుటూరు వెళ్ళేవాణ్ణి. నా రెగ్యులర్ ప్రోగ్రాం ఇది. 

    ఇవన్నీ తిరగడానికి  నాకు ఇచ్చిన అంబాసడర్ కారుకి డ్రైవర్ - హనుమంతరావు అని చెప్పేసి ఓ నలభై ఐదేళ్ళ అతను. 

    అతనే ఓనరు-కం-డ్రైవర్ కూడా ఆ కారుకి. బండి చాలా నిదానంగా తోలేవాడు, బా తోలేవాడు. అతనిది ఒంగోలు. 

    సాధారణంగా  నేను కార్లో పడుకోను.  హనుమంతరావు ఎలాగూ నిదానంగా, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడని గమనించి - అతని డ్రైవింగులో కొంచెం నిద్రపోవడం అలవాటు చేసుకున్నాను. ఒక పాయింటు నుంచి  ఇంకో పాయింటుకి వెళ్లే మధ్యలో ఓ కునుకు తీస్తుండేవాణ్ణి.  

    ఓ రోజు ఏమైందంటే - హనుమంతరావు కొడుకుకి పుట్టినరోజు ఫంక్షన్ ఏదో ఉందని చెప్పి -  తనింట్లో ఉండి - వేరే  డ్రైవర్నెవర్నో పంపించాడు. వాడి పేరు రామకృష్ణ అన్నట్టు గుర్తు. ఆ రామకృష్ణ కుఱ్ఱాడు. 

    నేను  బండెక్కిన తర్వాత ఊరికే కొంచెం సేపు పాటు వాణ్ణి అబ్సర్వ్ చేశాను. బానే తోలుతున్నాడు. టంగుటూరు చూసుకున్న తర్వాత ఉప్పలపాడు వెళ్ళాం. 

    ఉప్పలపాడు నుంచి కామయ్య పాలెం వెళ్తున్నప్పుడు దార్లో వచ్చేవన్నీ చిన్న చిన్న గ్రామాలు. చిన్న పిల్లలు రోడ్డు మీదే ఆడుకుంటుంటారు.  

    కామయ్యపాలెం దగ్గర  ఓ పిల్ల పరిగెత్తుకుంటూ కారు కడ్డమొచ్చేసింది. అదృష్టం ఏంటంటే రామకృష్ణ సడన్ బ్రేక్ కొట్టాడు. కార్ ఆగింది. పిల్ల పక్కకెళ్ళిపోయింది. 

    అప్పుడు  "ఒరే! ఓ రెండు విషయాలు చెప్తాను గుర్తు పెట్టుకో. ఒకటి - పల్లెటూళ్ళో జాగ్రత్తగా తోలుతూ ఉండు బండి. రెండోది ఎక్కడైనా శిశువులు, పశువులు కనబడ్డప్పుడు బండి బాగా స్లో చేయడం నేర్చుకో. వాళ్ళెటు మూవ్ అవుతారో తెలీదు." అని వాడికి బుద్ధులు చెప్పాను. 

    ఇలా చెప్పింతర్వాత ... సరే! ఆ రోజలా అయిపోయింది. మరుసటి రోజు కూడా వాడే డ్రైవరు. ఆ రోజు నేను వేటపాలెం వెళ్ళాలి. 

    పొద్దున్న టంగుటూరులో ఏదో పనుంటే గ్రేడింగ్ పాయింట్లో అది చూసుకుని, భోంచేసి వెడదాములే అనుకుని పన్నెండు గంటలకి ఇంటికొచ్చి భోంచేసేసి ఓ అరగంట రెస్ట్ తీసుకుని బయల్దేరాను. డ్రైవర్ని కూడా భోంచేసేయ్యమన్నాను. వాడూ తినేశాడు.

    టంగుటూరు-ఒంగోలు మధ్య దూరం ఇరవై కిలోమీటర్లుంటుంది. రామకృష్ణ కార్ టేప్ రికార్డర్లో  శోభారాజు పాటలు అన్నమాచార్య కీర్తనలు పెట్టాడు. అవి వింటూ  - భుక్తాయాసంతో ఉన్నానేమో - నేను ఓ కునుకు తీశాను. 

    ఒంగోలు బైపాస్ దగ్గరకొచ్చేటప్పటికి "సార్! మనం ఊళ్ళోంచి వెళదామా? బైపాస్ మీంచి వెళదామా " అనడిగాడు వాడే! 

    "ఊళ్ళో పనేం లేదు. బైపాసులో పోనీయ్" అన్నా. 

    చెప్పి మళ్ళీ అలా కళ్ళు మూసుకున్నాను. 

    అలా కళ్ళు మూసుకున్నానో లేదో -  ఒక పది నిముషాల్లోనే - ఎంతా అంటే - ఒక రెండో, మూడో కిలోమీటర్లు వెళ్ళుంటామంతే! 

    వాడికీ తూగొ చ్చినట్టుంది. ఆ మగతలో రోడ్డుకి ఎడమ పక్కనున్న మైలురాయిని కొట్టేశాడు. ఆ కొట్టడం-కొట్టడం - ఆ  దెబ్బకి  నిద్రమత్తు వదిలి - హఠాత్తుగా వాడేం చేశాడంటే కుడిపక్కకి కట్ చేశాడు. 

    మిట్టమధ్యాహ్నపుటెండవేళ  - ఒకటిన్నరో, రెండో అయుంటుంది టైము. 

    రోడ్డు ఖాళీగా ఉంది లంచ్ టైం కాబట్టి. 

    లేకపోతే అయిపోయేవాళ్ళమే ఏ లారీలో ఏవో వెళ్తుంటే. 

    హఠాత్తుగా అలా కట్ చేసేటప్పటికి ఏమైందంటే మేమున్న కారు మూడు పల్టీలు కొట్టి - కుడిపక్క మార్జిన్ లోకి వెళ్ళిపోయి - స్టాండ్ అయింది. 

    పచ్చడి-పచ్చడి అయిపోయింది కారు. 

    డోర్స్ లాక్ అయిపోయి ఉన్నాయి. లోపలుండిపోయాం మేము. మొత్తానికి కారు స్టాండ్ అయి - ఆగిపోయింది. 

    కారు ఆగీ ఆగగానే - ముందు అర్జంటుగా డోర్ లాక్ తీసుకుని ఇద్దరం దిగాం. 

    నాకు ఎక్కడా దెబ్బలు తగిలినట్లు కనపళ్ళా. 

    రామకృష్ణకి కాలి బొటనవేలు దగ్గర తెగింది బాగానూ. ఆ తెగిన చోట రక్తం వస్తోంది. 

    సరే! కారు దిగాం. ఇద్దరికీ నోట మాట రావట్లేదు - నించున్నాము అక్కడ. 

    ఎఱ్ఱటి ఎండ. 

    ఈ లోపులో - అదే రోడ్డులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వాళ్ళ ఆఫీస్ అక్కడుంది. వాళ్ళు చూశారు ఈ ఆక్సిడెంట్. 

    వాళ్ళందరూ పాపం గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేశారు. ఆ  మధ్యలో ఓ కాంపాండు వాల్ పిట్టగోడ ఉంటుందన్నమాట. 

    నన్ను తీసుకెళ్ళి ఆ గోడ మీద కూర్చోబెట్టి "ఏమిటి సార్! ఏమైనా దెబ్బలు తగిలాయా?" అనడిగారు. 

     "ఏమీ లేదు. నాకేమీ కాలేదు" అన్నాను. 

    పాపం వాళ్ళు గమ్మున వెళ్ళి కాఫీ పట్టుకొచ్చారు నాకు. సరే! అలా కూర్చున్నాను. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. 

    ఈలోగా ఈ డ్రైవర్ ఏం చేశాడంటే "సార్! మా ఓనర్ని పిలుచుకొస్తాను నేను. మీరు కారు దగ్గరే ఉండండి" అని వెళ్ళి పరారైపోయాడు.  

    వెళ్ళిన వీడెంత సేపటికీ రాడు. ఆ కారు దగ్గరే అలాగే కూర్చున్నాను నేను.

    చాలా సేపు కూర్చుని కూర్చుని ఇహ విసుగెత్తి లేచి రోడ్డుమీదకొచ్చాను. 

    రోడ్డుమీదకొచ్చేటప్పటికి లక్కీగా నా ఇమీడియట్ బాసు చింతల వీరయ్యగారు - ఆయన టంగుటూరు వెళ్తూ - ఆయనా నిద్రపోతున్నాడు ఆయన కార్లో. 

    ఆయన డ్రైవర్ పేరు కూడా వీరయ్యే. ఆ వీరయ్య నన్ను చూశాడు. 

    చూసి ఆయన్ని లేపి "సార్! కామేశ్వరరావు గారిక్కడ రోడ్డు మీదున్నారు. కారేదో ఆక్సిడెంట్ అయినట్టుంది." అనగానే "ఆపాపు బండి" అని కార్ ఆపి - నన్నా కారులో ఎక్కించుకుని టంగుటూరు తీసుకెళ్ళాడాయన. 

    "ఏమైంది కామేశ్వరరావుగారూ?" అని వీరయ్య గారడిగితే  "ఇలా జరిగిందండి - డ్రైవరు ఓనర్ కోసం వెళ్తానన్నాడు, ఎప్పటికీ రాలేదు. మరెటు పారిపోయాడో ఏంటో " అనగానే "దెబ్బలేమన్నా తగిలాయా" అనడిగాడు వీరయ్యగారు.   

    "దెబ్బలేమీ తగల్లేదు. నాకు బానే వుంది"  అని చెప్పి వెళ్ళి - మళ్ళీ ఆయనతో పాటు టంగుటూరు ఏరియాలో ఆ గ్రేడింగ్ పాయింట్లు తిరిగేశాను. సాయంత్రం ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడాయన. 

    వెళ్తున్నప్పుడు "ఒక నాల్రోజుల పాటు రెస్ట్ తీసుకో. నువ్వు ఆఫీసుకి రావద్దు. నేనిక్కడ ఒంగోల్లో ఉండి చూసుకుంటానులే.!" అంజెప్పేసి అన్నాడాయన. సరే అని ఉండిపోయాను ఇంటి దగ్గర. 

    కాకపోతే ఏవిటంటే తర్వాతి రోజు నుంచి ఎవరైనా వచ్చి పలకరిస్తే నాకు మాటొచ్చేది కాదు. ఏడుపొచ్చేసేసేది. 

    "ఎంత పెద్ద ప్రమాదం తప్పింది కదా! అసలేంటిది? పిల్లలేమో చిన్నపిల్లలు. ఆవిడకేమో అసలు ఇల్లు తప్పితే ఓ బ్యాంకు వ్యవహారం, డబ్బు వ్యవహారాలు ఏమీ తెలీదు. నాకసలు ఏమైనా అయుంటే వీళ్ళ పరిస్థితి ఏంటసలు?"  ఇదే ఆలోచన నాకు. 

    దాంతోటి నాకు ఎవరైనా కనపడితే దుఃఖం వచ్చేసేది. 

    అదృష్టవశాత్తూ నా పక్కన రామ్మోహన్ అంచెప్పేసి సుబ్బన్న గారి కజిన్ కొడుకు ఉండేవాడు. అతను 1978లో మైసూర్లో చేరాడు మా ML కంపెనీలో. 

    నేను ML నుంచి బయటికొచ్చి గోల్డెన్‌లో చేరిన తర్వాత టంగుటూరులో అతన్ని నా స్థానంలో మేనేజరుగా తీసుకొచ్చారు. 

    అతను కూడా మా పక్కనే ఉండేవాడు. మా పక్కనున్న ఇంట్లో సుజాత-సత్యం  అని చెప్పేసి దంపతులిద్దరు షోడాలమ్ముతూ ఉండేవారు. ఆ పక్కన విజయ్ అని చెప్పి పోస్టుమాన్ ఇల్లు ఉండేది. ఆ  రెండిళ్ళవతలున్న ఇంట్లో రామ్మోహన్ అద్దెకుండేవాడు. 

    అలాగే మా ఇంటి పక్క వాటాలో పామూరి సుబ్బారావు అని సుబ్బన్నగారి మేనమామ కొడుకు - వాడు కూడా నా ఫ్రెండే. వాడు సింగరాయకొండలో మా గ్రేడింగ్ హాలుకి ఇన్-ఛార్జ్ . వాడు, వాడి భార్య లలిత గారని చెప్పేసి వీళ్ళు కూడా టంగుటూరు లోనే ఉండేవాళ్ళు. 

    పాపం! వాళ్ళే నాకు సపోర్టుగా ఉండి, 'ఏం భయపడక'ని చెప్పేసి - ఈ రామ్మోహను, సుబ్బారావు నన్ను కాస్త అటు చీరాల-వేటపాలెం సముద్రపుటొడ్డుకి, తర్వాతేమో కందుకూరు మేనేజర్ వెంకట్రావు గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సినిమాలేవో చూడడం - ఇలా ఏదో ఊళ్ళు తిప్పుతూ నన్ను లైన్లో పెట్టారు వీళ్ళు. 

    అప్పుడే  మా శంకర నారాయణగారు "చాలా పెద్ద ఆక్సిడెంట్ తప్పి చచ్చి బతికాడు వీడు. వీడికి వందేళ్ళ ఆయుష్షు" అనేవాడాయన. 

    ఆయన, మా సుబ్బన్నగారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆ నాల్రోజులు. 

    తరవాత నేను మళ్ళీ రొటీన్లో పడిపోయాను. 

    మామూలుగా గ్రేడింగ్ పాయింట్లు తిరుగుతూ చూసుకుంటూ 82, 83 డిసెంబర్ దాకా అలా చేస్తూనే వున్నాను. ఇంక అక్కడ కొత్త విశేషాలు ఏమీ లేవు. 

    కాకపోతే మా సుబ్బన్నగారు చెప్పేవాడు "ఒరే! నువ్వు వచ్చేటప్పుడలా కార్లో గుప్పెడాకులు వేసుకుని నీకు తోచినట్టుగా గ్రేడ్ చేసుకుని ఏరుకో. నా కార్ ఎదురైనప్పుడు నాకు చూపెట్టు - ఏవన్నా తప్పులుంటే చెప్తాన"ని చెప్పేసి అలా ఆయన నాకు లీఫ్ నేర్పాడు. 

    ఒక విధంగా టొబాకో లీఫులో నేను మాస్టరైపోయాను. అసలు పొగాకులో లో-గ్రేడ్ తప్ప ఏమీ తెలియనివాణ్ణి ఇహ అసలు గ్రేళ్ళూ కూడా కంటితో చూడగానే చెప్పేసేవాణ్ణి - అది ఏ గ్రేడ్ అని చెప్పేసి. 

    ఆ రకంగా సుబ్బన్న గారి దగ్గర ట్రైనింగ్ అయి దాంట్లో మంచి ప్రావీణ్యత సంపాదించాను. 

     ఇహిక్కణ్ణించి ఏం జరిగిందో ఇంకోమాటు చెప్తాను.


<వచ్చేమాటు తరువాయి కథ>


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి