ఇంతకు ముందు చెప్పిన కబుర్లు: లెట్స్ గో లెగో - 1 - తాజా తాజ్ కబుర్లు
మోగే పాటలు
పెదవుల మూగే పాటలు
పజిళ్ళ గళ్ళు
పుస్తకాల పుటలు
నా రోజువారి కాలక్షేపాలు
వీటన్నిటితో పాటు ఇంకొక్క ఇష్టమైన వ్యసనం, వ్యాపకం - లెగో బిల్డింగ్.
*******
*******
అదెలా మొదలయ్యిందంటే...
చిన్నప్పుడెప్పుడో వేసవి సెలవుల్లో హైద్రాబాదు వెళ్ళినప్పుడు - ఎవరో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళినప్పుడు - అక్కడ చూశాను - రంగురంగుల ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్స్, వాటితో చేసిన రకరకాల కట్టడాలు.
అప్పుడు చూసిన ఆ ఎరుపు, పసుపు, నీలం రంగులు కళ్ళలో కలలుగా కనిపిస్తూనే వుండేవి చాలా ఏళ్ళ పాటు.
ఆ తర్వాత - పెరిగి పెద్దై, చదువువై, ప్రేమై, పెళ్లై, తల్లై, వలసై - ఇన్నైన తర్వాత - అమెరికా వచ్చాము.
వచ్చాక అవసరం కొద్దీ ఓ కారు కొనుక్కున్నాము. కారంటూ కొన్నాక అది నడవడానికి గ్యాస్ కావాలి కదా! గ్యాస్ అంటే కారు టైర్లలో కొట్టే గాలి కాదు - కారు ట్యాంకులో పోసే గాసోలిన్ అనబడే పెట్రోలుకి ముద్దుపేరు.
*******
*******
అబ్బబ్బా! లెగోలు అంటుంది... రంగుల కలలు అంటుంది. అంతవరకు బాగానే వుంది. ఇంకా ఏవో ఊరించే రంగుల కబుర్లో, బొమ్మల కబుర్లో చెప్తుందనుకుంటే కారు-గ్యాసు అంటూ గాలికబుర్లేవో చెప్తోంది అని మాచెడ్డ చిరాకొచ్చేస్తోంది కదా!
బాగానే వుంది!
అనగనగా... అని మొదలెట్టేసి సరాసరి కథలోకెళ్ళిపోతే బోల్డన్ని కబుర్లెలా వస్తాయి మరీ?
సరే! కార్లో గ్యాస్ కోసమని గ్యాస్-స్టేషన్‌కి వెళ్తూ ఉంటాం కదా! అలా వెళ్ళినపుడు ఒకసారి తినడానికి ఏవో చిప్స్ కొనుక్కుందామని గ్యాస్-స్టేషన్ లోపలికి వెళ్ళాం - మేం ముగ్గురం - నేను, నాతో పాటు నా చేయి పట్టుకున్న బుజ్జిగాడు, మా ఇద్దరితో పాటు మాక్కావాల్సినవి కొనిపెట్టడానికి బద్రి.
లోపలికి వెళ్ళీవెళ్ళగానే - నాకూ, బుజ్జిగాడికి - అక్కడ రంగురంగుల ప్లాస్టిక్ సంచీలో వున్న మినీ-లెగో బ్లాక్స్ కనిపించాయి. అవి ఒక చిన్న మోటార్ బైక్ చేయడానికి సరిపోయేటన్ని. ఆ సంచీ మీద వేసిన బొమ్మలో బుల్లి హెల్మెట్ పెట్టుకున్న ఒక చిన్న లెగో-మాన్ కూడా ఉన్నాడు. వాడికో సూట్కేస్ కూడా ఉంది.
అది చూసీ చూడగానే వెలిగిన మా కళ్ళ మెరుపులకి చుట్టుపక్కలున్న అందరికీ కొన్ని సెకన్ల పాటు ఖచ్చితంగా కళ్ళు మిరుమిట్లు గొలిపి వుంటాయి. కాకపోతే మా మెరుపులూ, వెలుగులూ బద్రికి బాగానే అలవాటు కాబట్టి - మా చూపులెటున్నాయో ఇట్టే కనిపెట్టేసి ఆ లెగో-బ్లాక్సుని మాకు కొనిపెట్టేశారు.
అప్పట్నుంచీ ఇంకెప్పుడు ఆ గ్యాస్-స్టేషన్‌కి వెళ్ళినా ఒక మినీ-లెగో సెట్ తెచ్చుకునేవాళ్ళం. నెమ్మది నెమ్మదిగా మా లెగో-కలెక్షన్ పెరిగింది.
ఆ రోజుల్లో ToysRUs అని ఒక పెద్ద బొమ్మల అంగడి ఉండేది. నెలలో ఒకసారన్నా అక్కడికి వెళ్ళి బోల్డంత సేపు బొమ్మలన్నీ చూసి బుజ్జిగాడికో బొమ్మో, బోర్డుగేమో కొనుక్కుని వస్తూ ఉండేవాళ్ళం.
ఓసారి వెళ్ళినప్పుడు అక్కడ ఐదొందల లెగో బ్లాక్స్ వున్న ఒక ఎఱ్ఱడబ్బా కనిపించింది. ఈసారి మళ్ళీ మా కళ్ళు మెరిశాయి - ఆ మెరుపులకి షాపులో ఉన్న లైట్లన్నీ ఓ సారి ఆరి-వెలిగాయి. మా చేతుల్లోకి ఆ లెగో బ్లాకుల ఎఱ్ఱడబ్బా వచ్చి వాలింది.
అదిగో... అక్కడ... అలా... మొదలు లెగోలతో నా సావాసం.
*******
*******
ఆ తర్వాత కొన్నాళ్ళకి అన్నజింకకి తోడుగా బుజ్జిజింక కూడా పుట్టేశాడు. ఓ ఏడాదిన్నరలో బుడిబుడి అడుగులతో అన్నజింక వెనకాలే బుజ్జిజింక కూడా వీధికి అటుగా వున్న అన్న ఫ్రెండు జాష్ ఇంటికి వెళ్తుండేవాడు.
ఓ రోజు జాష్ వాళ్ళింటికి వెళ్ళొచ్చినపుడు - అక్కడ వాళ్ళింట్లో చూసిన లెగో కలెక్షన్ గురించి పిల్లలు చెప్పింది విన్నాక లెగో-బిల్డింగ్ ఒక మంచి హాబీ అవుతుందని అనిపించింది.
బుజ్జిజింకకి మూడేళ్ళప్పుడు అందరం ఇండియా వెళ్ళాం. అప్పుడు ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో వాడి కోసం మొట్టమొదటి లెగో - ఒక బుల్లి ఫైర్-ట్రక్ కొన్నాను.
ఇక అప్పట్నుంచి ఇంట్లో ఎవరి పుట్టిన రోజైనా, ఏ పండగొచ్చినా బుజ్జిజింకకి ఒక లెగో కొనాల్సిందే. వాడి పుట్టినరోజుకి తప్పకుండా ఒక పెద్ద లెగోసెట్ కొనేవాళ్ళం.
ఏదైనా కొత్త లెగో సెట్ కొన్నప్పుడు బుజ్జిజింక దాన్ని build చేస్తున్నప్పుడు - నేను వాడి పక్కనే కూర్చుని - pieces అందిస్తూ వుండేదాన్ని.
అసలు మా లెగో కలెక్షన్ ఎలా పెరిగి పెద్దదయిందో - దానికి సుస్మిత, వేనెట్ చేర్చిన సెట్ల కబుర్లు, కొన్ని సెట్ల కోసం లెగో వాళ్ళని నేను చేసిన ఎమోషనల్ బ్లాక్‌మెయిళ్ళ కబుర్లు - ఇలాంటివెన్నో - ఇంకోసారి చెప్తాను.
అవన్నీ చెప్తూ వుంటే ఇప్పుడు చెబ్దామనుకున్న కబుర్లు బోల్డుబోల్డయిపోతాయి మరి!
*******
*******
2008 నుంచి 2017 వరకు మా లెగోత్సాహం అప్రతిహతంగా సాగింది.
అప్పటికి బుజ్జిజింక ఏడవ తరగతి లోకి వచ్చాక - అంతటి బుజ్జిగాడూ తను పెద్దైపోయాననుకున్నాడో ఏమో బుల్లిబుల్లి లెగోలు వాడి కంటికి ఆనడం మానేశాయ్. వాటిని కొనమని అడగడం మానేశాడు.
వాడైతే అడగట్లేదు కానీ నాకు అప్పుడే లెగోల మీద ఇష్టం ఇంకా పెరగడం మొదలైంది.
మరప్పుడు కొత్త లెగోలు కొనాలంటే ఎలా?
ఇంటికి వచ్చే Lego Catalog లో నాకు నచ్చిన సెట్స్‌ని బుజ్జిజింకకి చూపించి "ఇది కొందాంరా!" అనడిగితే ఓ సారి దాని కేసి చూసి "నో' అనేసి వెళ్ళిపోయేవాడు.
నన్నేమో ఆ రంగురంగుల బొమ్మలు ఊరిస్తూ వుండేవి. ఇలాక్కాదని చెప్పి 2018లో నా పుట్టినరోజుకి లెగో సెట్ కావాలని ఇంట్లో అందరికీ చెప్పేశా.
అప్పుడు మా వెస్ట్ కౌంటీ మాల్‌లో వున్న లెగో స్టోరుకి వెళ్ళి ఒక రెండు లెగో సెట్లు కొనుక్కున్నాను - ఒకటి నూట ఏభై పెట్టి (బీచ్ హౌస్), ఇంకొకటి (Parisian Restaurant set) మూడొందల ఏభై పెట్టి.
ఆ రోజు ఉన్న ఆఫర్ ఏంటంటే వంద డాలర్ల పైన కొంటే ఒక చిన్న లెగోసెట్ ఉచితంగా ఇస్తారు. నేను కొన్నవాటి బిల్లు నాలుగొందల ఏభై అయింది కదా - అందుకని నాకు ఆ ఫ్రీ సెట్ ఇచ్చారు. దాంతో పాటు ఒక కొత్త కేటలాగ్ కూడా ఇచ్చారు.
ఇంటికి రాగానే - నాకెంతో నచ్చిన పారిస్ హోటల్ సెట్టుని చేయడం మొదలుపెట్టాను. అందులో వున్నవి 2,469 లెగో పీసెస్. అదంతా ఒక్క రోజులో ఎలాగూ చేసెయ్యాలని నాకేమీ తొందర లేదు.
చిన్నప్పుడు అమ్మ పెట్టిన తాయిలాన్ని కొంచెం కొంచెం కొరుక్కుంటూ బోల్డంత సేపు తిన్నట్టు - నా కొత్త లెగోని కూడా ఒక్కో రోజుకి ఒక్కో లెవెల్ మాత్రం కడుతూ - ఆ కట్టడాన్ని కట్టడాన్ని తెగ enjoy చేస్తూ ఉన్నాను.
ఇంతలో షాపులో ఉచితంగా ఇచ్చిన కేటలాగ్ తెరిచి చూస్తున్న నాకు - అందులో - ఆ మరుసటి రోజు నుంచి వంద డాలర్లకి లెగోస్ కొన్నవాళ్ళకి ఒక బుజ్జి ఆకుపచ్చ నింజా mini-figure ఉచితంగా ఇస్తారని రాసి ఉంది.
ఆ బుజ్జి నింజా గాడు ఎంత ముద్దుగా ఉన్నాడో ! నాకెలాగైనా వాణ్ణి ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది. కానీ ఆ నింజాని ఏమైనా లెగో సెట్ కొంటే ఫ్రీగా ఇస్తారు కానీ విడిగా కొంటామంటే అస్సలు అమ్మనే అమ్మరు.
మరప్పుడేం చెయ్యాలి?
*******
*******
ఇంట్లో నేనూ, బుజ్జిజింకే వున్నాం. వాడప్పుడే స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకంటూ ఉన్నాడు.
నేను నెమ్మదిగా వాడి పక్కన కూర్చుని "నాన్నగాడూ! ఇంకెంత సేపు పడుతుంది నీ హోంవర్క్ పూర్తవడానికి?" అనడిగాను.
వాడు తలెత్తకుండానే పెన్సిలుతో టిక్కూ-టిక్కూ లెక్కలు చేస్తూ "ఇంకో పది నిముషాలు అంతే!" అన్నాడు.
"అయితే మనిద్దరం ఐదున్నరకి బయల్దేరి లెగో స్టోరుకెళ్దామా?" అని నెమ్మదిగా అడిగాను.
అది వినగానే వాడు చేస్తున్న లెక్కలు ఆపేసి "మళ్ళీ లెగో స్టోరుకా... నేన్రాను" అనేశాడు.
"అలాక్కాదురా... నేను రెండు లెగోలు తెచ్చుకున్నాను కదా - అందులో ఒకటి నచ్చలేదు. అది తిరిగి ఇచ్చేస్తాను. నచ్చనిది ఎందుక్కదా ఉంచుకోవడం?" సాధ్యమైనంత అమ్మా-యకంగా అడిగా.
అది వింటూనే వాడు "తెచ్చినది నచ్చలేదా? నింజా ఎక్కువ నచ్చాడా?" అనడిగాడు.
అమ్మదొంగా ! అయితే నేను లెగో కేటలాగ్ పదేపదే తెరిచి ఆ నింజా కేసి చూడడం వాడు చూశాడన్నమాట.
ఇంకెందుకు అబద్ధం చెప్పడం! అందుకే చెప్పేశా "అవును! నాకు ఆ నింజా నచ్చాడు. నాక్కావాలి. తెచ్చుకుందాం వస్తావా?"
"అమ్మా! అంత చిన్న మినీ-ఫిగర్ కోసం మళ్ళీ ఆ లెగో-స్టోరు కెళ్ళాలా ఇవాళ? వీకెండులో నాన్నగారు వచ్చాక వెళ్ళు" అనేశాడు.
"అప్పటి వరకు ఆగితే అయిపోతాయి కూడా - అసలే until supplies last అన్నాడు లెగో వాడు. ఇవాళ వెళ్ళకపోతే నింజా బొమ్మ నాకు దొరకదురా" నా గొంతులో వినీవినిపించని వెక్కు.
"Ugh" అని చిన్నగా అరిచి - రాస్తున్న పెన్సిల్ని చప్పుడు చేస్తూ కింద పడేసి "పదమ్మా! ఇప్పుడే వెళ్దాం. కానీ ఇప్పుడే చెప్తున్నాను. లెగో స్టోరులో మాత్రం నువ్వెవరో, నేనెవరో. నేను నీ పక్కన ఉండనే ఉండను. దూరంగా నించుంటాను" అన్నాడు.
"నువ్వెక్కడైనా నించో పర్లేదు. నేను ఈ బీచ్ హౌస్ సెట్ తిరిగిచ్చేసి ఇంకో సెట్ కొంటాను. దాంతో పాటు నింజాని ఫ్రీగా తెచ్చుకుంటాను" అని వాడి అమ్మనని అందరికీ హింట్లిచ్చి embarass చేయనని భరోసా ఇచ్చేశా.
సరిగ్గా ఐదంటే ఐదు నిముషాల్లో ఇద్దరం కార్లో ఉన్నాం. ఆ తర్వాతి ముప్పయ్యో నిముషంలో లెగో స్టోరులో వున్నాం.
స్టోర్ లోకి వెళ్తూనే బుజ్జిజింక నాకు దూరంగా జరిగి అక్కడున్న లెగో సెట్లు కొనడానికి చూస్తున్నట్లు స్టోరు అంతా తిరుగుతూ ఉన్నాడు.
నేనేమో ఒక చేత్తో అంతకు ముందు కొన్న Beach house సెట్ , బిల్ పట్టుకుని, ఇంకో చేత్తో ఇవాళ కొందామనుకున్న లెగో ఆర్కిటెక్చర్ సెట్ ఒకటి తీసుకుని కౌంటర్ దగ్గరకి వెళ్ళి నించున్నాను.
కౌంటర్లో ఉన్నబ్బాయి "నేను మీకు ఏం సహాయం చేయగలవాడనూ?" అని ఎంతో మర్యాదగా అడిగాడు.
నేను వెంటనే నా చేతిలో ఉన్న బీచ్ హౌస్ లెగో సెట్టుని కౌంటర్ మీద పెట్టి, "ఇది రెండ్రోజుల క్రితమే ఇక్కడ కొన్నాను. ఇప్పుడు తిరిగిచ్చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ఆర్చిటెక్చర్ సెట్ కొందామనుకుంటున్నాను" అని చెప్పి ఆగిపోవచ్చు కదా - నేనూ, నా ఆత్రం కాకపోతే! అక్కడితో ఆగక గబగబా "ఈ ఆర్కిటెక్చర్ సెట్టుతో పాటు ఆ గ్రీన్ నింజా ఇస్తారు కదా! ఇది ఇస్తారని తెలీక నేను ఇంతకు ముందు రెండు లెగో సెట్లు కొనుక్కెళ్ళాను. లేకపోతే ఒకటే కొనుండేదాన్ని" అని వాడు అడగనివి, నేను అనకూడదు అనుకున్నవీ అన్నీ అనేశా!
అలా అంటూనే - ఒక కంట - ఓరకంట బుజ్జిజింక ఎక్కడున్నాడా అని చూస్తుంటే - దూరంగా నించుని వాడు - నేను మాట్లాడుతున్నదంతా వింటూ నోరు తెరిచి ఏదో అనబోయి - వెంటనే తల తిప్పేసుకుని - తల అడ్డంగా ఊపుకుంటూ అటు తిరిగి మళ్ళీ లెగో సెట్లు చూసుకుంటూ ఉండిపోయాడు.
ఇంతలో నా లె-ఘోషని ఆసాంతం విన్న లెగో షాపబ్బాయి - నా చేతిలో ఉన్న పాత బిల్లు తీసుకుని చూసి "ఇందులో రెండు సెట్లు కొన్నట్టు ఉంది. వాటితో పాటు ఓ ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది. ఈ బిల్లులో ఉన్నవన్నీ తీసుకొస్తేనే ఈ సెట్టు తిరిగి తీసుకుంటాను" అన్నాడు.
నాకు కంగారొచ్చేసింది.
"అదేంటి! ఇంతకు ముందు కొన్న వాటిల్లో బాగా ఖరీదైనది - 350 డాలర్లది - నేను ఉంచుకున్నాను కదా. మీ షాపులో ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఆ ఫ్రీ గిఫ్ట్ నాదే. ఇప్పుడు తిరిగిస్తున్నది కొనకపోయినా నాకు ఆ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అందులోనూ నేను ఇప్పటికే నా హోటల్ సెట్ కట్టడం మొదలెట్టేశాను. ఇప్పుడది తేవాలంటే ఎలా కుదురుతుంది? అందుకని ఈ బీచ్ హౌస్ సెట్ తీసేసుకోండి. ఇదిగో - ఈ కొత్త అర్చిటెక్చర్ సెట్ బీచ్ హౌస్ సెట్ కన్నా ఎక్కువ ఖరీదే! ఇది కొంటున్నాను. నాకు నా గ్రీన్ నింజా కూడా ఇవ్వండి ఇవాళ్టి ఆఫర్ ప్రకారం" అంటూ బో... ల్డంత మాట్లాడేశా.
నేను చెప్పిన కూడికలూ, తీసివేతలూ, లెక్కలూ, లాజిక్కులూ అస్సలర్థం కాక ఆ కౌంటర్లో వాడికి టెన్షన్.
నేనింత చెప్పినా వాడు నాకు నచ్చిన ఆకుపచ్చ నింజాని ఇస్తాడో ఇవ్వడో అని నాకు టెన్షన్.
మేమిద్దరం మాట్లాడుకుంటున్నది వింటూ వాణ్ణి నేనెక్కడ మాటసాయానికి పిలుస్తానో అని బుజ్జిజింకకి టెన్షన్.
కొన్ని క్షణాలు లెగో స్టోరులో - గాలి కూడా ఆడడానికి టెన్షన్ పడిపోయిందంటే నమ్మండి.
ఆ కొన్ని క్షణాలు - కౌంటర్లో వాడు తన చేతిలో ఉన్న బిల్లు కేసి, నేను ఆ పక్కనే ఉన్న గ్రీన్ నింజా కేసి, బుజ్జిగాడు సీలింగ్ కేసి చూసుకుంటూ ఉండిపోయాం.
ఆ టెన్-టెన్షన్ క్షణాల తర్వాత ముందుగా కోలుకున్నది, తేరుకున్నది లెగో స్టోర్ కౌంటర్ వాడే.
తల కొంచెం వంచి అడ్డంగా తిప్పుకుంటూ "Oh whatever! " అని గొణుక్కుంటూ నేను తీసుకెళ్లిన లెగో సెట్టు తిరిగి తీసుకుని, నేను కొన్న కొత్త అర్చిటెక్చర్ సెట్టుకి కొత్త బిల్లు వేసి - రెండు బిల్లులూ అడ్జస్ట్ చేసి - వాడి ఆస్తి ఏదో నాకు రాసిచ్చేస్తున్నంత బాధగా నా చేతిలో నింజాని పెట్టి - ఇంకసలు నాకేసి చూడకుండా అటెటో చూస్తూ నించున్నాడు.
నేను నా ఆకుపచ్చ నింజాని భద్రంగా పట్టుకుని మహదానందకందళితముఖారవిందనై బయటికి నడిచాను.
ఓ రెండు అడుగులు వెనగ్గా బయల్దేరిన బుజ్జిజింక ఓ రెండు నిముషాల తర్వాత నన్నందుకుని నా పక్కగా నడుస్తూ "అమ్మా! మనింట్లో నువ్వే ఓ పెద్ద child! నువ్వు ఒక చిన్న లెగో కోసం ఎంత గొడవ చేశావో!" అని "ప్చ్! ప్చ్1 అనుకుంటూ కారెక్కాడు.
అప్పుడు తెచ్చుకున్న నింజాని ఇప్పుడు చేసిన లెగో బోన్సాయ్ కింద నించోబెట్టా...

Very nice
రిప్లయితొలగించండిThank you!
తొలగించండిలెగోల కబుర్లు చాలా బావున్నాయి. ఆ షాప్ అబ్బాయి leghosha కూడా..!
రిప్లయితొలగించండిచెట్టు లెగో ఎంత ముద్దు గా ఉందో!!
బుజ్జి నింజడు superb!
ఆ బుజ్జి నింజడు మీకూ నచ్చాడూ... సంతోషం !!
తొలగించండిచదివాను .. చదివి ఆనందించాను... 2 చోట్ల గట్టిగా నవ్వాను... వాటిని screenshot తీసి పెట్టుకున్నాను... Very ice blog .. thoroughly enjoyed 🙂
రిప్లయితొలగించండినువ్వు నవ్విన చోట్లేవో చెప్పి నన్నూ మళ్ళీ నవ్వించావ్ :)
తొలగించండిమీరు lego తాజ్ మహల్ చెప్పారు. ఆవేశం గా అది మీరు చెప్పినప్పుడే తెప్పించాము. దాదాపు 3 ఏళ్ళు డబ్బాలోనే ఉంది. కరోనా వచ్చాక ఆ time లో ఖాళీగా ఉన్నపుడు చేసింది మా అమ్మాయి. ఇప్పుడు దానికి display బాక్స్ ఒకటి కొనాలి. అన్నట్టు అది retired అట ఇప్పుడు. చాలా ధన్యవాదాలు మీకు. ఏమిటో ఈ lego పిచ్చి కదా :)
రిప్లయితొలగించండి