మాటలు, పాటలు, జోకులు - ఈ మూడూ మామూలు మనుషులకీ, సినిమా ప్రేక్షకులకీ కామన్. కానీ మామూలు మనుషుల్నుంచి సినిమా ప్రేక్షకులని వేరు చేసేదే సినిమా.
ఇదిగో ---- ఇలా అనుకునే ...
"శుక్రవారం కదా - సినిమా ఏమైనా చూద్దామా" - అని బదరి అనగానే - నిన్న శుక్రవారం - గబగబా వంట చేసేసి, భోజనాలు కానిచ్చేసి - వాషర్లో బట్టలు వేసి - హడావిడిగా వచ్చి సోఫాలో కూర్చున్నాను.
పాపం! అప్పటికీ తను ఏ ఎయిర్ లిఫ్టో, మదారీనో చూద్దామని చెప్తూనే వున్నా - నిన్నటి నా నక్షత్రాలు బాలేవో ఏమో - వినకుండా - ఏమయినా తెలుగు సినిమా చూద్దామా అని తెగ విసిగించేసరికి - మొత్తానికి ఒక తెలుగు సినిమా పెట్టారు.
పొగాకు పండించడం, సిగరెట్లు తయారు చేయడం నిషేధించగలిగితే జనం మారతారు కానీ - కాలిస్తే ఇలా అవుతారు - అని చూపిస్తే చూడడం మానేస్తారు తప్ప కాల్చడం కాదు - అన్న చిన్న ప్రాథమిక సూత్రం తెలియని ఒక బాధ్యతా-పూజ్యయిన ప్రకటనతో సినిమా మొదలు.
మొహం పక్కకి తిప్పుకుని, టీవీ మ్యూట్ లో పెట్టి మొత్తానికి ఆ ప్రకటన పూర్తి కాగానే - సౌండ్ పెడితే హీరో గారి గొంతుతో ఒక ఇంకొక బాదాపూరిత ప్రకటన -
రోడ్డు మీద ప్రయాణము చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి
మనం సక్రమంగా వెళ్తున్నాకూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి
మీమీదే ఆశలు, మీమీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురుచూస్తుంటారు
మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలోనూ జరగకూడదని ఆశిస్తున్నాము
- అంటూ.
అది చదువుతూ, వింటూ సినిమా చూస్తున్న మేమిద్దరం అనుకున్నాము - "ఎవరింట్లో ఏమయిందబ్బా?" - అని.
"సర్లే - మనమసలే మన దేశానికి, ఊరికి దూరంగా వున్నాము - ఏదో జరిగి వుంటుంది - అన్నీ మనకి తెలియాలని రూలేం లేదు కదా" - అని సర్దేసుకుని మా సినీ-వీక్షణం కొనసాగించాము.
కానీ అది మాకు - మా IQ లెవెల్ కి పరీక్ష పెడుతూ కోడ్ భాషలో చెప్పిన సందేశం అని సినిమాలో కొంచెం ముందుకు వెళ్లాక ఇదిగో - ఇలా అర్థం అయింది :
ఈ సినిమా పెట్టుకుని చూసేటప్పుడు జాగ్రత్తలు వహించండి
మనం ఏదో వినోదం ఉంటుందని అనుకున్నాకూడా ఎన్నో విపరీతాలు పొంచి ఉంటాయి
మీ మానసిక ఆరోగ్యం మీదే ఆశలు, మీమీదే ప్రాణాలు పెట్టుకున్న పిల్లలు మీ ఇంట్లో మీతోనే వున్నారు
మా కుటుంబంలో చూసిన సినిమా ఏ కుటుంబంలోనూ చూడకూడదని ఆశిస్తున్నాము
అలా - అది అర్థం చేసుకునే తికమకలో మేముండగానే - సినిమాలో / వెనక పనిచేసిన వాళ్ల పేర్లు చదవ(లే)కుండానే అయిపోయాయి.
ఇంతకు ముందు ఈ పోస్ట్ మొదట్లో నేను రాశానే - అలాంటి తేడాలు - "ఆకలి, @@@, నిద్ర; ఈ మూడూ మనుషులకీ, జంతువులకీ కామన్. కాని మనుషులనుంచి జంతువులని వేరు చేసేదే ఎమోషన్" అంటూ - ఇంకా ఏంటేంటో ఏవో మనసులో అనుకుంటూ (మాకు బాగా వినిపించేలా) - సీరియస్ గా నడుచుకుంటూ వస్తూ -
పెరట్లో నూతి చప్టా మీద కడగడానికి పెట్టిన నేతి గిన్నె ఎత్తుకు పోబోతున్న కాకిని ఎగిరి తోలే హడావిడిలో -
దార్లో అడ్డు వచ్చే నీళ్ల గంగాళాలు, డేగిసాలూ - లాంటి వాటిమీద దూక్కుంటూ - వెళ్లే వాడిలాగా హీరో -
రోడ్డు పక్కనున్న బెంచీల మీద కూర్చున్న బ్రిటిష్ వారిమీదుగా దూకి - వస్తూ వుంటాడు.
చూడగానే అనుకున్నాను - ఈ అబ్బాయి కిందటి సినిమా దాకా బానే ఉండేవాడు - ఈ హీరోకి ఆ గడ్డం, హరిదాసు కొప్పు పెట్టిన వాడికి (అదే hair-stylist కి) ఈ సినిమా వరసగా పది షోలు చూపించినా పాపం లేదు - అని.
ఇంతలో - ఆ హీరో వచ్చేసి - రోడ్డు మీద వున్న ఓ నలుగురిని - గాలిలో కనిపించని నైలాను తాళ్లు పట్టుకుని ఊగుతూ - తన్నేసి కొట్టేసి కింద పడేస్తాడు. ఎందుకబ్బా ఈ హడావిడి అని నోరు తెరుచుకుని చూస్తున్న నాకు - ఒక పది నిముషాల తర్వాత అర్థం అయిందేంటంటే - ఇల్లిక్కడ మొదలయిన మన స్వచ్ఛ భారత్ ని అల్లక్కడ లండన్ దాకా మన తెలుగు సినిమా పట్టుకెళ్లి అంతర్జాతీయ ఖ్యాతి పాల్జేసిందనిన్నీ - ఆ హీరో అంత హడావిడీ చేసింది - ఆ నలుగురిలో ఒకడు తాగేసిన కాఫీ కప్పు డస్ట్ బిన్ లో వేయబోయి కింద పడినందుకూ అని.
ఇంతకీ లండన్ లో ఇలా రోడ్ల మీద పడి కొట్టేసుకుంటూ ఉంటే పోలీసులు రారేమో - లేకపోతె - అదేదో పోలీసులు పొరపాటున కాలు కాదు కదా వేలు కూడా మోపని - మా షికాగోలో వుండే దీవాన్ స్ట్రీట్ లాంటి వీధేమో అనుకుందామనుకుంటే - మనసొప్పలేదు కానీ - అలాగే సరి పెట్టేసుకున్నాను. ఎక్కువ ఆలోచిస్తే సినిమా చూడాలనిపించదు.
అసలే - మా ఇంట్లో ఒక సినిమా రూలు వుంది - మొదలు పెట్టరాదు, పెట్టి ఆపరాదు - అని.
ఆ రూలు ప్రకారం సినిమా చూసే ఇద్దరిలో ఎవరు ఒక రెండు మూడు నిముషాలకైనా సోఫాలోంచి కదిలి అవతలికి వెళ్లాల్సి వచ్చినా వాళ్ళు తిరిగి వచ్చేదాకా సినిమా తాత్కాలికంగా నిలిపివేస్తాం.
సినిమాలో - కల కంటూ ఉలిక్కి పడి లేస్తున్న హీరోయిన్ ని పరిచయం చేస్తున్న సీన్ మొదలయింది.
అప్పటిదాకా పక్క రూములో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న బుజ్జి జింకకి నిద్ర వస్తోందంటే బదరి లేచి వాడిని పడుకోబెట్టి దుప్పటి కప్పడానికి వెళ్లారు.
నేను గమనించలేదు కానీ - టీవీ రిమోట్ సోఫాలో ఈ చివర కూర్చున్న నా చేతి కందనంత దూరంలో పెట్టి వెళ్లారు.
అది ఒక పది నిముషాలయినా ఆ మైండ్-బ్లోయింగ్ IQ "testing" సినిమా నుంచి తప్పించుకోవడానికి తను వేసిన ఎత్తని నాకప్పటికింకా అర్ధమయ్యే స్థితిలో లేను నేను.
ఎందుకంటే కనురెప్పపాటులో - imaginary లంబ కోణాలు, సరళరేఖలూ గీసేస్తూ - ఫిజిక్స్ లోంచి బయాలజీ లోకి - ఆక్కడినుంచి కెమిస్ట్రీ లోకి దూకేస్తూ - నా కళ్ళముందు నేను తప్పించుకున్న చిన్నప్పటి ట్యూషన్ లన్నీ గుర్తు చేసేస్తూ - మోకాలి మీద కొడితే మెదడు దెబ్బతినే లాజిక్కులు చెప్తూ సినిమా తెర అంతటా - దర్శకత్వ విశ్వరూపం.
ఈలోగా వాషర్ లోంచి తీసి డ్రైయర్ లో వేసిన బట్టలు ఆరాయి అన్నట్టుగా కుయ్-కుయ్ అని డ్రైయర్ భాషలో తీయ్-తీయ్ అని సిగ్నల్ వచ్చింది.
"మీరేం సినిమా ఆపక్కర్లేదు" అని చెప్పి నేను వెళ్తూ ఉంటే - "హన్నా! నువ్వు అసలు మిస్సవ్వడానికి వీల్లేదంటే వీల్లేదు" అని పాజ్ చేసేశారు బదరి.
ఈ సినిమాలో విలన్ తెలివైనవాడు. హీరో అతి తెలివయినవాడు. ఆఖరికి ఏ తెలివీ వుండకూడని - వున్నా చూపించకూడని అపర-తెలుగు హీరోయిన్ కూడా తెలివయినదే . ఏదో వెంట్రుక ముక్క పట్టుకుని - ఆ వెంట్రుక తాలూకు DNA పరీక్ష ఎవరి బ్లడ్ శాంపుల్ తో జరిగిందో తెలుసుకోవడానికి జైలుకి వెళ్తుంది. అనుకోకుండా వాళ్లమ్మని కలుస్తుంది. కల నిజం చేసిన హీరోని ఆరాధనగా చూస్తుంది.
ఏమాటకామాట చెప్పుకోవాలి - ఆ యూరప్ జైలు గార్డులు తెలుగులో మాట్లాడుతూ ఉంటే నా తెలుగు-ప్రేమిక హృదయం ఆనందంతో ఉప్పొంగి పోయింది - ఐరోపా సామ్రాజ్యపు పౌరుల నోట బడి - ఢోకా లేనిదాయె పో మన తెలుగు పలుకుబడి - అని .
ఇంతకీ అందరూ తెలివయిన వాళ్లే అయిన ఈ సినిమాలో - ఎవరి కారణంగా అయితే తనకు బాధ కలిగిందో వాళ్ళని ఏమీ అనలేకపోతే - తనకు అందుబాటులో వున్నవాళ్లమీద పడి కొట్టి కోపం తీర్చుకుంటూ వుంటాడు హీరో. అలా కొట్టేసి "సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో - జీరో ఎమోషన్స్ జీరో ఎనెమీస్ " అంటుంటాడు.
ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక ముమెంట్ ఇంకెక్కడో ముమెంట్ ని డిసైడ్ చేస్తుంది - అన్నది అతని లాజిక్ - అదేంటో సీతాకోకచిలుకల రెప్పల అడుగున పుట్టే గాలికి అమెరికాలో తుఫానులు వస్తాయిట.
ప్రతి సినిమాలోనూ చక్కగా నోరారా మాట్లాడే ఆ మనవడ్-హీరో-ధాత్తుడు - అలా పళ్లు బిగబట్టి మాట్లాడుతూ ఉంటే - సగం సినిమా అర్థమే కాలేదు :(
ఇంకందులో అతను చెప్పిన లాజిక్కులు - మేధ-మే-ట్రిక్కులు అర్థం చేసుకునే ఓపిక లేకపోయింది - అసలే వారాంతపు-బ్రెయిన్ ఆయె! చురుకుపాలు తక్కువ - కబుర్లపాలు ఎక్కువ కదా మరి!
మొత్తానికి సినిమా తెర మీద ఎగురుతున్న నీలి సీతాకోక చిలుకల సాక్షిగా సినిమా చూసేశాము - అనిపించేశాము - సతీపతులం - మేమిరువురం.
ఈ సినిమా లోని ఎమోషన్ కి నా రివర్సెమోషన్ - దర్శకులకి మాత్రమే!
సినిమా చూసేవాళ్లని మూడురకాలుగా చెప్తాను
[ఈ కింద వున్న నిర్వచనాలకి స్ఫూర్తి ఇదిగో ఇక్కడ: Youtube ] :))
1) చూసేసేవాడు 2) చూద్దామనుకుని - ఆలోచించి చూసే వాడు 3) చూడకుండానే చూసినట్టు చెప్పేవాడు
1) చూసేసేవాడు
వేరే వాళ్లు తీసిన సినిమాలో కాకుండా - మీరు తీసిన సినిమాలోనే కథ వుందని తను అనుకోవాలని - మీరు అనుకుంటారు కాబట్టి మీ సినిమా రిలీజ్ చేస్తారు.
వాడు వేరే సినిమా చూస్తాడు
అయినా బుక్కయిపోతాడు.
2) చూద్దామనుకుని - ఆలోచించి చూసి వాళ్లు
మీరు తీసిన సినిమాలోనే కథ వుందని తను అనుకోవాలని - వేరే వాళ్ల సినిమా తను చూడకూడదని మీరు అనుకుంటారని - తను అనుకుంటాడు కాబట్టి -
మీ సినిమా మానేసి వేరేవాళ్ల సినిమా చూద్దామనుకుంటాడు -
ఇలా ఆలోచించి చూసి మరీ బుక్కయిపోతాడు.
3) చూడకుండానే చూసినట్టు చెప్పేవాడు - అంటే (ఒక్కోసారి-మా లాంటి) వాడు
మీరు తీసిన సినిమాలోనే కథ వుందని - మీరు అనుకుంటారని - తను అనుకోవాలని ... మీరు అనుకుంటున్నారని తను అనుకుంటున్నాడు కాబట్టి
అసలే సినిమాలూ చూడకుండా రివ్యూలు చదివేసి కథంతా తెలుసు అన్నట్టు మాట్లాడుతూ వుంటాడు -
మీరు బుక్కయిపోతారు
అసలు ఈ మధ్య సినిమాలు చూసీ చూడని తెలివైన సినిమా ప్రేక్షకుడు ఎలా చూస్తున్నాడో తెలుసా?!
సినిమాలు డబ్బులు పెట్టి థియేటర్లో చూడకుండా-
Pay-per-view లో కూడా చూడకుండా-
youtube లోనో-
సగం చూపెట్టి మళ్లీ రెండు గంట తర్వాత మిగిలిన పార్టు డౌన్లోడ్ చేసుకో అనే సైట్ లోనో-చూస్తున్నాడు
అప్పుడు ఆ సగం చూసి మిగిలిన సగం చూడకుండా మానేస్తాడన్నమాట .
అలా - తెలివిగా - పూర్తిగా బుక్కై పోకుండా తప్పించుకుంటున్నాడు.
మీ సినిమాలు అలా ఫ్రీగా చూసేసి - సినిమా ఎలాతీసినా ప్రేక్షకుడు చూసేస్తాడు అనుకునే ధీమాకి ప్రతీక ఈ దర్శకుడు - అనేసుకుని - వీకెండ్లో మీ సినిమా చూశానన్న విషయమే గుర్తులేనట్టు - సోమవారం పనిజీవనస్రవంతి లో కలిసిపోతాడు.
కొసమెరుపు:
అలా ఈ ఆశ్వీయుజ మాసపు శరన్నవరాత్రుల - శుక్రవారపు రాత్రి తెలుగు సినిమా చూసి - ఆ సినిమాతో ప్రభావితులమయ్యి - ఆ సినిమా చూసి కలిగిన ఎమోషన్ ని టీవీ పగలగొట్టో, వైర్లు తెంపేసో తీర్చుకోలేక - ఎదురెదురుగా సోఫాల్లో కూర్చుని - ఎప్పుడో పెళ్లి అయిన కొత్తలోనుంచి ఇప్పటిదాకా - ఏవేవో అక్కర్లేనివన్నీ గుర్తు తెచ్చుకుని - తెల్లవారుఝామున రెండున్నర దాకా - నువ్విలా చేశావు అని బదరి నన్నంటే - కాదు మీరే అర్థం చేసుకోలేదు నన్ను - అని నేనంటూ .... మా ఎమోషన్స్ ని జీరో చేసేసుకున్నాము
సో ఇప్పుడు మా ఎమోషన్ జీరో - జీరో ఎమోషన్స్ జీరో సినిమాస్!
సారీ - నా బ్లాగ్ చదివేవాళ్ళూ! నేనిదంతా రాసింది మీ మీద కోపం తో కాదు ఆ సినిమా చూసిన ప్రేమతో.
ఓసినిమాకు ప్రేమతో...
ఓసినిమాకు ప్రేమతో...
ఓ ...ఓ ... ఓ ... ఓ ...
తెనుగు సినిమాచూసి నాలుగు దశాబ్దాలయిందోచ్! :) అందుకే ఇంకా మానసికంగా ఆరోగ్యంగా ఉంటినా?
రిప్లయితొలగించండిబాగా చెప్పారండీ - అదే మీ మానసికారోగ్య రహస్యమేమో :) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబాగా చెప్పా రండీ !
బ్లాగు చదువు వారలు! యిది బాగౌ సినిమా
భోగము తెలుంగు వారల
కై గలిగిన యోగమోయి కైవల్యమనన్ :)
జిలేబి
కలిగె నాకీ భోగము
తొలగించండిఫిల్ము వీక్షణ భాగ్యమనన్
కైవల్యమె గాదు
కపాల మోక్షమనన్!!
మీ పద్య-వ్యాఖ్యే స్ఫూర్తి పై నాలుగు లైన్లకి . బోల్డన్ని ధన్యవాదాలు :)
లలిత గారూ,
రిప్లయితొలగించండినేను ఏ జాబితా కి చెందుతానో తెలియదు గానీ, నేనూ ఈ సినిమా చూసి, సినిమాకి ప్రేమతో అని రాయలేక, సుబ్బారావుకి కోపంతో (https://anaganagaokurradu.blogspot.com/2016/04/subbaaravuki-kopamto.html) అని నాబాధని వెళ్ళగక్కేను. .
మొదలు పెట్టరాదు, పెట్టి ఆపరాదు , ఇది మేమూ ఫాలో అయ్యి అప్పుడప్పుడూ బుక్కై పోతుంటాము.
బాగుంది టపా.
మీ పోస్ట్ చదివి బాగా నవ్వుకున్నాము - అసలు సినిమా చూసిన ప్రేక్షకులమిద్దరమూ - మా బదరికి మీ బ్లాగ్ తెగ నచ్చేసింది :)
తొలగించండిలలితా! ఈ చిత్రరాజమును వీక్షించని నా భాగ్యవశమున కాబోలు, నువ్వు రాసిన (నిర్)వచనాలు ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఏంటి ఈ 'చిత్రం' చెప్మా! అని ఆ చిత్రరాజమును పెట్టుకుని ఓ ఇరవై నిముషాలు మాత్రం చూసి, ఇక చేతకాక, నిర్మొహమాటంగా ఆపేశాను.
రిప్లయితొలగించండిఓపిగ్గా చూడ్డమే కాక వాటికి parody లు కూడా రాశావా?? :-)
సాధారణంగా సినిమాలని open mind తో చూడ్డానికి ప్రయత్నిస్తాము - అంతగా విమర్శించకుండా - ఎందుకంటే ప్రతి సినిమాని తీసేవాళ్లు కష్టపడి ఒక project లా తీస్తారని - అది అంత చిన్న effort కాదని. కాకపోతే ఈసారి మా tolerance threshold has crossed. So I put more effort in reverse-emotion that was taught in the movie - నీవు నేర్పిన విద్యయే సుకుమారా - అన్నట్లు ;)
తొలగించండిశ్రీ గారు చెప్పినట్లు, చూసింది కాక, ఎంత బాగా వ్రాసారండీ. మొన్న భారత దేశ యాత్ర కి వెళ్ళినపుడు ఎమిరేట్స్ వారి ధర్మమా అని ఈ సినిమా ఒకటి , నాగార్జున,రమ్య కృష్ణ సినిమా(పేరు తెలియదు) ఒకటి చూసి బలయిపోయాను. కష్టేఫలి వారి లాగే భారత దేశం తో పాటు సినిమాలు వదిలేసాను. మా సినిమా టైం మెషిన్ అక్కడితో ఆగిపోయింది. రామ్ చరణ్ తేజ అంటే ఎవరు అన్న ప్రశ్న వేస్తే జనం వెర్రి దాన్ని చూసినట్లు చూసారు. అన్నట్లు డ్రైయర్ భాష బావుందండీ. నేనూ ఎప్పుడూ గమనించలేదు :)
రిప్లయితొలగించండి
తొలగించండిమీరు చెప్పిన నాగార్జున-రమ్యకృష్ణ ఇంకో గొప్ప చిత్రరాజం - కాకపోతే చూసిన వెంటనే మర్చిపొయే అదృష్టం మాది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు ఆ సినిమాని. ఒక్కోసారి సినిమా సగం చూసేవరకు అదే ఇంతకుముందు చూసి సరిగ్గా అక్కడే ఆపేశాం అని గుర్తుకి రాదు :))
లలిత గారు, మీరన్నట్లు సరిగ్గా రెండు వారాల క్రితం మా ఇంట్లోనూ ఈ లంబ కోణాలు, సరళ రేఖలు అర్థం చేసుకోలేక చచ్చాం.
రిప్లయితొలగించండిపోన్లెండి - ఈ సినిమా అర్థం కానిది మాకే కాదు - అని మీ కమెంట్ కొంచెం ఊరటనిచ్చింది :)
తొలగించండిలలిత గారూ, మీ ఈటపా చదివిన తరువాత ఆదునికకాలపు తెలుగుసినిమా అంటే ఎన్నడూ లేనిది వల్లమాలిన భయం పట్టుకుంది. ఇంత హర్రర్ వ్యాసం ఈమధ్యకాలంలో ఎన్నడూ చదవలేదండి.
రిప్లయితొలగించండి"ఇంత హర్రర్ వ్యాసం ఈమధ్యకాలంలో" ...
తొలగించండిచురుక్కు మనేట్లుగా (సంబంధితులకు)
లలిత గారలా అలవోకగా వ్రాస్తే ...
మీరిలా చమక్కు మనిపించారు ఒక్క ముక్కలో ...
మరి జనాల మైండ్స్ ఏయే కోణాల్లో
తిరిగాయో గానీ సినిమా సూపర్ హిట్టంట (గా) !! ...
జబ్బలింకా చరుచుకుంటూనే ఉన్నారు ...
:)
nmrao bandi గారు,
తొలగించండినా వ్యాసానికి చురుక్కు చమక్కులద్దిన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!
శ్యామలీయం గారు,
తొలగించండిమీరు నా వ్యాసాన్నిhorror category లో వేయడం బాగా నచ్చింది. హారర్ కబుర్లు అనాలేమో వీటిని :))
తెలుగు సినిమాల కన్న , 'మా'తెలుగు 'సీ'
రిప్లయితొలగించండిరియల్సు గొప్పవి , చూచు భాగ్యాలు కలుగ
లేద ? ఆడాళ్ళ క్రైము స్టోరీలు పండి
'బోలె 'డానంద మిచ్చు మీ బోటి వార్కి .
మీ పద్య వ్యాఖ్యకి ధన్యవాదాలు. నేను టీవీ అసలు చూడనండి - ఏ భాషలోనూ. అందుకే నాకు సీరియల్స్ గురించి, ఇంకే టీవీ కార్యక్రమాల గురించి అంతగా తెలీదు.
తొలగించండి.... టీవీ అసలు చూడనండి - ఏ భాషలోనూ .....
తొలగించండిఎంత అదృష్టవంతులు!
టీవీ "చూడక"పోవడం "అ-దృష్ట" మేనండీ :)
తొలగించండిఎంత తెలివైనవారు అనాలేమో శ్యామలరావు గారూ ? 🙂
రిప్లయితొలగించండివున్న కొంచెం తెలివిని టీవీని కానక కాపాడుకునేవారమండీ :)
తొలగించండినాకు నఛలేదు అంటే నన్నుఅదోలా చూసారు కొంతమంది ఇక్కడ ఇంకొంతమంది నీకు అర్దం kaa
రిప్లయితొలగించండిఇంకొంతమంది నీకు అర్దం కాలేదు అన్నారు నాకే ఒక డౌట్ వచున్ది నేను లెక్కల్లో బాగ వీకు లెక్కలు బాగా తేలిసినోల్లే ఈ సినిమా చూడాలి అనుకున్నా అందుకే చూసాను అని చెప్పకుండా కొంతమంది వద్ద చెప్పా!
రిప్లయితొలగించండిఇప్పుడు మనస్సు ప్రశాంతముగా ఉంది ఎవడైనా ఎందుకు బాలేదని అడిగితే వివరం గా చెపుతా తీసినోడి పైత్యం కాదుగానీ ఈ చిత్రరాజo వీక్షించిన తర్వాత చాలా రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపాం
థాంక్స్ అక్కా నా డౌట్ క్లీయర్ చేసావ్
తొలగించండిచివరికి ఆ సినిమా మా ఫ్రెండ్ అన్నట్లు "రాజుగారి కొత్త బట్టలు" కథలా అయ్యిందన్నమాట :) నువ్వొక్కడివే కాదు, హనుమాన్ - నేన్నీకు తోడు - ఇప్పటికీ ఆ సినిమా "వడ దెబ్బ" నుంచి తేరుకోలేదు.