నాకు ఆ కారు ప్రయాణం అంతగా గుర్తు లేదు కానీ తిరుపతి దాటి పలమనేరు ఘాట్ రోడ్డు మీదుగా - బోల్డంత దూరం వెళ్ళీ వెళ్ళీ - మొత్తానికి ఏ రాత్రికో బెంగుళూరు చేరిన జ్ఞాపకం మాత్రం మిణుకుమిణుకుగా ఎక్కడో మెరుస్తోంది.
మేమెక్కిన కారు చక్రాలు అరిగేలా తిరిగీ-తిరిగీ బెంగుళూరులో బనశంకరిలో విద్యాపీఠ్ సర్కిల్లో వున్న ఓ చిన్న కామత్ హోటల్ పక్కగా కుడివైపుకి మలుపు తిరిగి కొంచెం ముందుకెళ్ళి ఓ రెండస్తుల ఆకుపచ్చని మేడ ముందు ఆగింది.
అది అలా ఆగగా మేము దిగి - ఓ చిన్న గేటు తెరుచుకుని - ఎదురుగా వున్న మెట్లెక్కి తిన్నగా పైకెళ్ళి - మెట్లకి ఎడమ పక్కగా వున్న తలుపు తీసుకుని - ఓ బుల్లింట్లో అడుగు పెట్టగానే - బద్రి నవ్వులో విరిసి నా కళ్ళలో మెరిసిన వెలుగులకి - ఆ రాత్రి నక్షత్రాలేవైనా చూసుంటే అవీ మురిసుండేవి.
అలా విరిసి మెరిసి మురుస్తున్న నవ్వులని కాస్సేపలా అల్లాగే వుండమని వదిలి - ఓ రెండు మాటలు ఆ పందిరి లాంటి ఆకుపచ్చని మేడ గురించి కొన్ని విశేషాలు చెప్తా.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
విద్యాపీఠ్ సర్కిల్ దగ్గర్నుంచి బ్యాంక్ కాలనీ వైపుకి వెళ్దామని కుడివైపుగా బయల్దేరామనుకోండి.
అనుకున్నారా?!
సరే! అలా నడుస్తూ వుంటే ఓ నాలుగడుగులు వేసీ వెయ్యగానే రోడ్డుకి ఎడమ పక్కన "యశస్వి ఆటోమొబైల్సో & హార్డోవేర్సో" అనే ఒక అంగడి కనిపిస్తుంది. అందులో కళ్ళకి ఎండకి నల్లబడి చలవదేమో అనిపించే కళ్ళజోడొకటి పెట్టుకుని ఒకాయన కూర్చుని వుంటాడు. అతని పేరు మంజునాథ్.
ఆ మంజునాథ్‌దే చిలకలు వాలే చెట్టులా వున్న ఆ ఆకుపచ్చని మేడా - ఆ మేడ మీదుగా వాలి వున్న కొబ్బరిచెట్టూనూ.
ఆ మంజునాథ్ భార్య పేరు ముద్దమ్మ. వాళ్ళకో నాలుగేళ్ళ బాబు యశస్వి. వీళ్ళు ముగ్గురూ మొదటి అంతస్తులో కుడి పక్కనున్న వాటాలో వాళ్ళుండి, ఆ పక్కగా వున్న ఎడమ పక్క వాటా మాకు అద్దెకిచ్చారు. మా ఇద్దరి వాటా మధ్యగా ఇంకా పైకి - అంటే రెండో అంతస్తుకి వెళ్ళడానికి మెట్లుండేవి. ఆ మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ మేడ గోడల మీదుగా ఒక కొబ్బరిచెట్టు, దాని పక్కనే ఒక గదీ వుండేవి.
ఆ ఒక్క గదిలో ఇందిరమ్మ అని ఒకావిడ వుండేవారు. ఈవిడ NIIT లో డైరెక్టర్‌గా పని చేసే సుధ అనే ఆవిడ ఇంట్లో వంట చేసేవారు.
ఈ రెండంతస్తులకి కింద - మేము మొదటగా తీసుకొచ్చిన గేటుకి ఎదురుగుండా మెట్ల పక్కగా వున్న ఓ చిన్న వాటాలో మంజునాథ్ గారి తలిదండ్రులు వుండేవారు. వారు ఆ వీధిలో వున్న అందరికీ తాత-అజ్జి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఈ విశేషాలూ, వివరాలూ - మేమా ఇంట్లో అడుగు పెట్టగానే గోడల మీద రాసి పెట్టి లేవు. ఆ మరసటి రోజు పొద్దున్నే వెచ్చవెచ్చటి ఉప్పిట్టుతో పాటుగా మా ఇంటి ఓనర్లైన మంజునాథ్-ముద్దమ్మ దంపతులు చలచల్లగా పంచుకున్నవి.
అంతకు ముందు రాత్రేనా మేమొచ్చింది... ?! మరుసటి రోజు పొద్దున్న కల్లా నాన్న, మంజునాథ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.
కన్నడ-తెలుగులో మంజునాథ్ "ఏమండీ చెప్పండి" అంటే , అచ్చ -కన్నడలో నాన్న "నంగూ కన్నడ సొల్ప సొల్ప బరత్తదే" అంటూ ఎవరికి వాళ్ళు అవతలి వారి భాష తమకొచ్చన్నట్టు బదులిచ్చుకుంటూ ఒకరినొకరు సెబాసనేసుకున్నారు.
ఇక ముద్దమ్మయితే చకచకా తన ఇంట్లో పని చేసుకుంటూనే వాళ్ళింట్లోకి కొత్తగా వచ్చిన మాకు ఏం కావాలో కనిపెట్టి అమరుస్తూ కమకమ్మటి కన్నడ వంటలు చేసి మాకు ఇస్తూ ఎంతో ప్రీతీ, ఇష్టం చూపించింది.
తెలుగు రాని ముద్దమ్మకి, కన్నడ తెలియని నాకు - మా ఇద్దరికీ ఒకరికొకరం కావలసినవారమనిపించుకోవడానికి మాటల-పలకరింపులు అక్కరలేని చిరునవ్వుల-చిలకరింపుల భాష సరిపోయింది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఆ తర్వాత వున్న పదీ-పదిహేను రోజుల్లో అమ్మా-నాన్నా వెళ్ళి ఇంట్లో వున్న గదులూ, వంటింట్లో అరలూ నింపడానికి బోల్డన్ని సామాన్లు కొనుక్కొచ్చారు.
ఇలా కొన్నవన్నీ మంజునాథ్ గారి మేడ మీదకి మెట్ల మీదుగా బాగానే వచ్చేశాయి కానీ ఒక్క బట్టలు పెట్టుకోవడానికని కొన్న ఇనప బీరువా మాత్రం మా గదిలో అడ్డంగా అయితేనే పడతానంది. అందుకని బీరువాకి కింద ఉండే రెండు కోళ్ళనీ కత్తిరించి పట్టుకొచ్చి గదిలో నించోపెట్టారు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అసలు మా కొత్తింటి గురించి చెప్పాలంటే - అటో ఇరవై అడుగుల పొడుగు, ఇటో ఇరవై ఆడుగులు వెడల్పు వుండే ఓ బుల్లి చతురస్రంలో ఓ చిన్న వంటిల్లు, ఓ రెండు గదులు, అంతలోనే ఇంకో బుల్లి హాలూ, ఆ పక్కనే ఓ చిన్న బాత్రూం - వెరసి టూ-బెడ్రూం హౌస్!
అంత ఇంట్లోనూ గదులూ, గోడలూ తప్ప కొనుక్కున్న పేపర్లూ, వేసుకునే చెప్పులూ పేట్టుకోవడానికీ కూడా అలమార్లు ఏమీ లేవని చూశారు నాన్న.
వెంటనే వెళ్ళి మంజునాథ్‌ని అడిగి ఒక కార్పెంటర్‌ని తీసుకొచ్చి కొలతలు అవీ తీయించి హాలులో గోడకి అరలు పెట్టించి ఒక షెల్ఫ్‌లా తయారు చేయించారు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
బద్రీ, నేను - అమ్మా, నాన్నా, అత్తయ్యలతో కలిసి - విధాన్ సౌధ, కబ్బన్ పార్క్, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మ్యూజియం, ఆర్ట్ మ్యూజియం, అక్వేరియం - లాంటివన్నీ చూసొచ్చాము.
ఓ మంచి రోజు చూసి బద్రి తన స్నేహితులు బాలజీ, సాయి గిరిధర్‌లని భోజనానికి పిలిచారు.
అంతే! అమ్మా, అత్తయ్యా కలుపుగోలుగా, కలిసికట్టుగా కలగూరపప్పూ, కరివేపాకు-సహిత-పులిహోరా, కలకండతీపుల పరమాన్నమూ కమకమ్మగా వండి - కొసరికొసరి వడ్డించగా మా ఇంట మొట్టమొదటి బంతిభోజనాల విందు విజయవంతమయింది.
ఓ వారం తర్వాత - ఇంటి దగ్గర విజయ్, తులసి ఇద్దరే వున్నారని చెప్పి - అత్తయ్య గుంటూరుకి వెళ్ళి పోయారు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఆ తర్వాత - ఓ రోజు MG రోడ్‌లో ఒక ఎలక్ట్రానిక్స్ షాప్‌కి వెళ్ళాము. అక్కడ నాన్న ఒక బుల్లి ట్రాన్సిస్టర్ రేడియో, ఒక నల్ల టూ-ఇన్-వన్నూ కొన్నారు.
అందులో పెట్టుకుని వినడానికి ఆ పక్కనే వున్న HMV వారి మ్యూజిక్ షాప్‌లోబాలకృష్ణప్రసాద్ పాడిన అన్నమాచార్య కీర్తనలూ, కిషోర్ కుమార్‌వీ, కెజె యేసుదాస్‌వీ హిందీ పాటల కేసెట్లు కొనిపెట్టారు.
ఇంకో రోజు అందరం కలిసి శివాజీనగర్‌లో వున్న నరసాయి పిన్ని ఇంటికి వెళ్ళాము. ఈవిడ మా అమ్మకి పిన్ని. కానీ నరసాయి పిన్ని అనేది ఆవిడ నామమూ, సర్వనామమూ కూడా - ఎందుకంటే మా అమ్మతో పాటు మేమందరం కూడా ఆవిణ్ణి నరసాయి పిన్ని అనే పిలుస్తాము.
బెంగుళూరులో MG రోడ్డు, శివాజీనగరూ - ఇలా ఎక్కడికి వెళ్ళినా - ఓ చిన్నంచు పట్టుచీరా, బిగించి వేసిన జడకి జడగంటలూ - ఇదే నా ముస్తాబు. ఆ తళతళలాడే అంచులూ, జడకి బరువు పెంచే జడగంటలూ నాకు బోల్డంత ఇష్టంగా వుండేవి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అత్తయ్య ముందే వెళ్ళిపోయారని చెప్పా కదా... ఆవిడ వెళ్ళిన వారం-పది రోజులకి అమ్మా-నాన్నా కూడా గుంటూరు వెళ్ళారు.
కలలు - కలవరాలో, కల-వరాలో - నా వరకు నాకు రెండు రకాలు.
కావాలనుకోకపోయినా మగత నిదరలో కనుగొనేవి ఒక రకం.
కావాలననుకుని పగటి వెలుగులో అనుకునేవి ఇంకో రకం.
ఇవాళ ఈ రెండు రకాల గురించి కబుర్లాడుకునే అదనూ, అవకాశమూ అదాటుగా అమిరాయి.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ముందుగా అనుకోకుండా కనుగొన్న రకం:
అనుకోకుండా వచ్చిన ఈ కల గురించి చెప్పాలంటే రెండువేలఇరవయ్యో సంవత్సరం మార్చ్ నెల ఇరవయ్యో తారీఖు (20-3-2020)కి వెళ్ళాలి. అక్కడ మొదలు పెడితే కానీ ఈ కల వ్యవహారం ఓ పట్టాన తేలదు.
అనగనగా ...అంటూ మొదలెడితే కానీ చెప్పే కబుర్లకో రూపూ, ఆ కబుర్ల నుంచి పుట్టే కథకో ఊపూ వుండవని నాకో నమ్మకం. అందుకే నేనిప్పుడలానే చెప్పబోతున్నా.
అనగనగనగా.... అప్పుడే కోవిడ్ కామ్‌గా పుట్టి కార్చిచ్చుగా మారిన కాలం.
వీధి తలుపు తెరిచి గాలి పీలిస్తే ఊపిరి ఆగిపోతుందని అడలిపోతున్న రోజులు.
అప్పటికి నా ఆఫీసు లాప్‌టాప్ నా దగ్గరికొచ్చి మూడేళ్ళు అయింది. దాన్ని లీజ్-రోల్ ప్రాసెస్‌లో వెనక్కి పంపేసి కొత్త లాప్‌టాప్ తెప్పించుకోవాలి. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఒకట్రెండు ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి.
సరే! అప్పు తెచ్చుకున్న ఆఫీసు లాప్‌టాప్‌ని అప్పగింతలకి సిద్ధం చేస్తూ ఉండగా ఇంతలో - "కోవిడ్ వల్ల అన్ని ఆఫీసులూ మూసేస్తున్నామనీ - అందరూ ఎక్కడివాళ్ళు అక్కడే ఎవరింట్లో వాళ్ళుండి పోవాలనీ - ఎవరి దగ్గరున్న లాప్‌టాపులు ప్రస్తుతానికి వాళ్ళవాళ్ళ దగ్గరే వుంచేసుకోవాలనీ" ఒకదాని తర్వాత ఒకటిగా - గొలుసు కథల్లా - బోల్డు ఈ-మెయిళ్ళు వచ్చాయి.
అలా - అప్పట్నుంచీ అదే లాప్‌టాప్ వాడుతూ వున్నాను.
2020 వరకూ అయిన మూడేళ్ళూ, అప్పట్నుంచి ఇవాళ్టి దాకా అయిన ఇంకో ముప్పై మూడు నెలలూ - వెరసి మొత్తం మూణ్ణెల్లు తక్కువ ఆరేళ్ళుగా అదే లాప్‌టాప్ లీజ్-రోల్ కాకుండా నా దగ్గరే వుండిపోయినట్టు.
ఇలా వుంటుండగా ఏమైందంటే ఈ ఏడాది జూన్ లోనో, జులై లోనో ఒక రోజు రాత్రి నాకో కలొచ్చింది. అదేంటంటే నేను ఆఫీసు పని చేస్తుండగా నా లాప్‌టాప్ స్క్రీన్ మీద "నీ లీజ్-రోల్ అయిపోయింది. ఇక నువ్వు దీని మీద పని చెయ్యలేవు" అని ఠప్ మని లాప్‌టాప్ ఉలుకూ-పలుకూ లేకుండా ఉట్టేక్కేసినట్టు.
ఆ కల రాగానే నాకు హఠాత్తుగా మెలకువొచ్చేసింది.
"అమ్మో! అలా జరిగితే ఇంకేమన్నా వుందా? ఆ లాప్‌టాప్‌లో వున్న ఫైల్స్ అన్నీ పోతే అవన్నీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో కదా?!" - అన్న ఆలోచనతో కాసేపు నిద్ర పట్టలేదు.
మళ్ళీ నాకు నేనే - "ఇది కలే కదా! నిజంగా ఇలా జరిగే అవకాశమే లేదు"- సర్ది చెప్పుకుని పడుకున్నాను.
మరుసటి రోజు బద్రికి నాకొచ్చిన కల గురించి చెప్తే - మేమిద్దరం అదెంత వింత కలో అని నవ్వుకున్నాం.
ఆ తర్వాత ఆ కల గురించి మర్చిపోయాను.
కానీ... మొన్న గురువారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకి ఆఫీసులో అప్పటికి అరగంట ముందు మొదలైన ఒక మీటింగులో చేరి మాట్లాడుతూ వున్నాను.
ఇంతలో నా లాప్‌టాప్ స్క్రీన్ మీద "నీ లాప్‌టాప్ క్వారంటైన్ కాబడుతోంది. నువ్వింక దీని మీద పని చెయ్యలేవు. OK!" అని ఒక బెదిరింపు (warning-message) కనిపించింది.
వెంఠనే నా లాప్‌టాప్ తెర మీద చక్రాలు తిరగడం మొదలయ్యాయి. అవి తిరిగీ-తిరిగీ ఆగేటప్పటికి నా లాప్‌టాప్‌కి కళ్ళు తిరిగినట్టయ్యిందేమో పాపం! కిటికీలన్నీ మూసేసుకుని ముసుగు తన్నేసింది.
నేనేమో అలాంటి బెదిరింపులు లాప్‌టాప్ మీద ఇంతకు ముందెప్పుడూ చూసిన గుర్తు లేదు.
అందులోనూ ఆ quarantined అన్న మాట చూడగానే "అమ్మో! లాప్‌టాపులక్కూడా కోవిడ్ వస్తోందా ఏమిట్రా బాబూ!" అని బెంగేసేసింది.
అది కనిపిస్తూనే నా ఆఫీసు కనెక్షన్ పోయింది. అదృష్టవశాత్తూ ఫోన్ డిస్‌కనెక్ట్ కాలేదు కాబట్టి అస్క్రీన్‌వాణి లాగా మా టీముతో ఇంకా మాట్లాడగలుగుతున్నాను.
వెంటనే మీటింగులో నాతో మాట్లాడుతున్న వాళ్ళతో ఆ బెదిరింపు గురించి చెప్పి ఇంకెవరికైనా అలాంటి మెసేజ్ వచ్చిందా అనడిగాను.
వాళ్ళెవరికీ అదేంటో తెలీదని చెప్పి - అది ఏదో spam ఏమో అని ఒకళ్ళెవరో అన్నారు.
అది వింటూనే ఎందుకైనా మంచిదని నా లాప్‌టాప్‌ని రీ-స్టార్ట్ చేశాను. అయినా సరే ఆఫీసుకి కనెక్ట్ కానియ్యట్లేదు.
వెంటనే ఆ మీటింగు లోంచి బయటికొచ్చేసి మా ఆఫీసు హెల్ప్-డెస్క్‌కి ఫోన్ చేశాను.
అప్పుడు ఇనామ్ అనే అబ్బాయి సపోర్ట్ అబ్బాయి ఏం చెప్పాడంటే "మీ లాప్‌టాప్ మీ దగ్గరుండే రోజులు అయిపోయాయి. మీరు ప్రస్తుతానికి దీని మీద పని చెయ్యలేరు. కొత్త లాప్‌టాప్‌కి దరఖాస్తు పెట్టుకోండి.అదొచ్చాక దీన్ని unquarantine చేసి మీ ఫైల్స్ అన్నీ ఈ పాత లాప్‌టాప్ లోంచి ఆ కొత్త దాంట్లోకి మారుస్తాం" అని చెప్పేశాడు.
అది వింటూనే ఇనామ్‌కి - నాకంతకుముందొచ్చిన - నన్ను కలవరపరచిన - కల గురించి చెప్పకుండా వుండలేకపోయాను.
అది విన్న ఇనామ్ "మీ కల భలే నిజమయ్యిందే!" అని నాకో కితాబిచ్చి ఫోన్ పెట్టేశాడు.
మొదట నిద్రలో వచ్చినప్పుడు, తర్వాత నిజమై గుర్తొచ్చినప్పుడు కొంచెం కలవరపెట్టినా ప్రస్తుతానికి నా కల సుఖాంతమే.
నా కొత్త లాప్‌టాప్ ఆగ-మేఘాల మీద రేపొచ్చేస్తోంది.
ఇదీ... అనుకోకుండా నిద్రలో వచ్చేసి నిజమై పోయిన కలవరపు-కల కథ!
నా కల గురించి తలుచుకుంటే "ఇలా కలలన్నీ నిజమయ్యే కార్యక్రమాలు పెట్టుకుంటే ఎలాగబ్బా!" అనిపించింది. ఒకప్పుడు ఆత్రేయ రాసిన పాట వద్దనుకున్నా గుర్తొచ్చింది. అది ఈ కింద రాసిపెట్టా. పల్లవి గుర్తున్న వాళ్ళు పాడేసుకోండి.
కలలకు భయపడిపోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా!
సత్యాలన్నీ నరకాలేగా!
స్వప్నం సత్యమైతే వింత...
సత్యం స్వప్నమయ్యేదుందా ?
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇహిప్పుడు అనుకుని కలగన్న రకం:
నాకెప్పుడూ - "రేపు ఇలా ఉండాలీ. ఇలా ఉంటేనే బావుందనుకోవాలీ" అనుకోవడమూ, దాని కోసం పెద్దపెద్ద కలలు కనడమూ తెలీదు.
కానీ నా కోసం నేను - అనుకుని మరీ - నాకు నేనుగా తీర్చుకోగలిగిన - చిన్నచిన్న కలలు కంటూ ఉంటాను.
ఓ కాయితం మీద నాలుగ్గీతలు కుదురుగా గీసి బొమ్మేయడం, దాని కింద పేరు రాయకుండా నేను గీసిన బొమ్మేదో నేనే గుర్తించలేకపోవడం కల ఎంత మాత్రం కాదు. అది కల కాలేని నిజం. అందుకని బొమ్మలు గీయాలనే నా కలని ఎవరో వేసిన బొమ్మలకి రంగుపెన్సిళ్ళతో నింపేసి తీర్చేసుకుంటూ వుంటా. ఇది నేను అనుకుని కని తీర్చుకునే చిన్నకల.
ఏడాదికోసారి దసరా నవరాత్రులొచ్చేలోగా పాత అలిండియా-రేడియో వారి భక్తిరంజని స్తోత్రమేదో వెతికి పట్టుకుని దానిని కంఠస్థం చేయడం కూడా నేను పదేపదే కావాలనుకుని కనే ఇంకో కల. ఇది ప్రతీ ఏడాదీ తీరుతుందని పూచీ ఏమీ లేదు. ఒక్కో ఏడాది - నచ్చిన పాట దొరకలేదనో, దొరికినా నేర్చుకునే వీలు కుదరలేదనో - ఈ చిన్నపాటి పాట-కల కూడా నెరవేరదు.
ఈసారి మాత్రం నా ఈ రెండు కలలూ తీరాయి.
ఒకటి బొమ్మలకి నే వేసిన రంగుల కల.
అటొచ్చి ఓ రంగూ, ఇటొచ్చి ఓ రంగూ - చేతికొచ్చినదేదో వేసి - రంగులు నింపేశా. ఇదిగో ఈ కిందున్నది అదే!
చిన్నప్పుడు చదువుకున్న కథలో పరుగు పందాలేసుకునే కుందేలు-తాబేలు ఈ బొమ్మలో మాత్రం బోల్డంత ఫ్రెండ్లీగా కనిపిస్తున్నాయి. అదే నాకు బోల్డంత నచ్చేసింది. ముందసలు ఆ తాబేలుకి నలుపూ-తెలుపూ రంగులేసేద్దామనుకున్నాను. కానీ తాబేల్ని ఎక్కడ చూసినా మరీ రంగుల్లేకుండా వెలవెలా పోతుండడం గుర్తొచ్చింది. అందుకే తాబేలు-డిప్పలో ఒక్కో గడికి ఒక్కో రంగేశా.
ఈ ఏడాది నా పాట-కల కూడా నిజం చేసుకున్నా.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టి ద్వాదశి నాటికి దేవీ నవరత్నమాలికా స్తోత్రం నేర్చుకున్నా.
అదే ఈ కింద రాసి పెట్టుకున్నా.
ఈ దేవీ నవరత్న మాలికా స్తోత్రానికి పాఠాంతరాలు వున్నాయి కానీ నేను విన్న భక్తిరంజని (ఆలిండియా రేడియో) వారి స్తోత్రాన్ని అనుసరించి ఇది నేర్చుకున్నా - రాసుకున్నా.
ఈ స్తోత్రం భుజంగ-ప్రయాత వృత్తంలో రాశారట ఆదిశంకరులు. ఈ విషయం నాకు తెలియకముందే ఈ స్తోత్రం విన్నప్పుడు ఇందులోని పాదాలన్నీ ఒక దీర్ఘమైన గతిలో మెలికలుగా సాగుతున్నట్టనిపించింది. నేర్చుకోవడానికి కొంచెం కష్టపడ్డాను.
పది-పదిహేను రోజులుగా పొద్దున్నే లేవగానే ఒకసారి, రాత్రి పడుకోబోయేముందు ఇంకోసారి వింటూ మొత్తానికి నేర్చేసుకుని నా కల-వరాన్ని సొంతం చేసుకున్నా.
కాకపోతే నేను విన్న స్తోత్రంలో కొన్ని చోట్ల సంస్కృతపదాలు స్పష్టంగా వినిపించలేదు. అక్కడక్కడా బ్లాగుల్లో దొరికిన పాఠాంతరాల్లో ఈ స్తోత్రం లోని కొన్ని మాటలు సరిగ్గా అర్థవంతంగా అమరినట్టనిపించట్లేదు. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నేర్చుకున్న గుర్తుగా రాసిపెట్టుకున్నాను, కానీ మళ్ళీ వెనక్కి వచ్చి ఏమన్నా తప్పులుంటే సరిచేసుకుంటాను.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
హార నూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం
కారణేశవరమౌళికోటి పరికల్ప్యమాన పదపీఠికాం
కాలకాల ఫణిపాశ బాణ ధనురంకుశావరమేఖలాం
ఫాలభూతిలకలోచనాం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
గంధసార ఘనసార చారునవనాగవల్లిరసవాసినీం
సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం
మందరాయతవిలోచనాం అమల బాలచంద్ర కృతశేఖరీం
ఇందిరారమణసోదరీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం
హారదామ పరిశోభమాన కుచభారభీరుతనుమధ్యమాం
వీరగర్వహరనూపురాం వివిధకారణేశమణిపీఠికాం
మారవైరిసహచారిణీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
భూరిభారధర కుండలీంద్రమణిబద్ధ భూవలయపీఠికాం
వారిరాశి మణిమేఖలావలయ వహ్నిమండల శరీరిణీం
వారిధారవహకుండలాం గ్రహశేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్రరవిలోచనాం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
కుండలీ త్రివిధకోణమంటపవిహారిణీ పరివిభాసినీ
షట్-పుండరీక ముఖభేదినీం చ ప్రచండభానుభాసముజ్జ్వలాం
మండలేందు పరిహాహితామృతతరంగిణీం అమృతరూపిణీం
మండలాంత మణిదీపికాం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
వారణానన మయూరవాహముఖ దాహవారణ పయోధరాం
చారణాది సురసుందరీ చికుర శేఖరీకృతపదాంబుజాం
కారణాది పతిపంచక ప్రకృతి కారణాం ప్రథమమాతృకాం
వారణాంత ముఖ పారణాం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం ||
పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరానన సరోరుహాం
పద్మరాగ మణిమేఖలావలయనీ విశోభిత విలంబినీం
పద్మసంభవ సదాశివాంతమయ పంచవర్ణ మణిభాసురాం
పద్మినీం ప్రణవరూపిణీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం
ఆగమ ప్రణవపీఠికాం అమలవర్ణ మంగళశరీరిణీం
ఆగమావయవ శోభినీం అఖిలవేదసారకృతశేఖరీం
మూలమంత్ర ముఖమండలాం ముదిత నాదబిందు నవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం
కాళికా తిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం
చూలికా చికుర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
వాలికా మధుర గండమండల మనోహరానన సరోరుహాం
కాళికాం అఖిలనాయకీం - మనసి భావయామి పరదేవతాం
మనసి భావయామి పరదేవతాం
ఫలస్తుతి:
నిత్యమేవ నియమేన జప్యతాం
భుక్తి ముక్తి ఫలదాం అభీష్టదాం
శంకరేన రచితాం సదా జపేత్
నామరత్న నవమాలికాపదాం
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఆదిశంకరులు ఈ దేవీ నవరత్నమాలికా స్తోత్రాన్ని భుజంగప్రయాత వృత్తంలో రచించారని కొన్ని బ్లాగుల్లో చదివి కాబోసనుకుని - అదే రాసుకున్నా.
కానీ నా బ్లాగ్ చదివిన శ్రీ నాగేశ్వరరావుగారి వ్యాఖ్యల పుణ్యమా అని - అది భుజంగప్రయాత వృత్తం కాదూ, సురనర్తకీ (తరంగక) వృత్తంలో వుందని తెలిసింది. (https://eemaata.com/em/issues/200707/1127.html)
నేనింతకు ముందే చెప్పినట్టు స్తోత్ర పాదాలు పాడుకోవడంలో తరంగ-గతి లోనే సాగుతున్నట్టనిపించడం, ఆ పైన అవన్నీ సురనర్తకీ (తరంగక) వృత్తంలో వున్నాయని తెలియడం - ఈ స్తోత్రం మీదా ఇష్టాన్ని ఇంకా పెంచాయి.
ఆ పాటని పాడుతున్నట్టనిపించింది - బెంగాలీ బాబు బిశ్వజిత్.
ఆ పాటని వింటున్నట్టు కనిపించింది - నేపాలీ లేమ మాలా సిన్హా.
ఇన్ని వున్న ఆ పాట వున్న - సినిమా - "నైట్ ఇన్ లండన్".
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఆ పాటని ఎవరు పుట్టించినా,
దానినెవరు చూపెట్టినా -
ఆ పాటకి ప్రాణం పోసిన గరిమ మాత్రం
తనివాఱు మహ-తీరు రాగాల
లక్ష్మీకాంత్-ప్యారేలాల్ జోడీదే...
ఆ ప్రాణానికి ప్రణవం తెచ్చిన గాత్రం
మది సోలు మహ-హాయి గానాల
మహ... మహ... మహ... మహ...
మహ... మహ... రఫీదే...
మహమ్మద్ రఫీదంటే రఫీదే ...
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఈ పాట వినడం ఇదేం మొదటిసారి కాదు...
అలా అని దీన్ని పదేపదే పాడిందే పాటగా విన్నాననేం లేదు.
ఎప్పుడో, ఎక్కడో అనుకోకుండా ఎవరో ఏ రికార్డో పెట్టబట్టి వినడం తప్ప - నాకు నేనుగా వెతుక్కుని వినాలీ అని పట్టుబట్టి విన్న పాట మాత్రం కాదు.
కిందటి వారం ఎప్పట్లాగే రఫీ పాటల కోసం యూట్యూబులో వెతుక్కుని - ఒక్కో పాట వింటూ వుంటే - ప్రతీపాట తర్వాత ఈ పాట ఆ పక్కనే కనిపిస్తూ "నన్ను వినూ!" అంటున్నట్టు కనిపిస్తూనే వుంది.
ఈ పాటేమో "వినవా?" అని బ్రతిమాలుతున్నట్టొకసారి, "ఓ సారి వింటే నీ చెవులేమైనా అరిగిపోతాయా? " అని దబాయిస్తున్నట్టొకసారి, "వినమని ఎన్ని సార్లడగాలీ, ఓహోహో?!" అని సాధిస్తు న్నట్టొకసారి, "వినమని చెప్తుంటే నీక్కాదూ?" అని చెవి మెలేస్తున్నట్టొకసారి - ఆ కిందున్న సజెషన్సులో పైకి ఎగిరెగిరి కనిపిస్తూనే వుంది.
చివరాఖరికి ఓ పాట తర్వాత తోసుకుంటూ ముందుకొచ్చేసి "వినెహే!" అని అదే మొదలైపోయింది.
సర్లే! ఒకసారి వినేస్తే దీని గోలేంటో తెలిసిపోతుంది ఇహ దీని జోలికెళ్ళక్కర్లేదు అనుకుని చెవులు ఫోను కప్పగించి - పాటని ఆట్టే పట్టించుకోకుండా బెట్టు పోతూ ఉతికిన బట్టలేవో మడత పెట్టుకుంటున్నాను.
పాట మొదలవుతూనే ఓ గిటారు టింగ్-టింగుమని వినిపించింది.
ఆ వెంటనే "ఓ మై లవ్!" అంటూ ఏ గంధర్వ లోకాల్లోంచో పిలుస్తున్నట్టు న్న రఫీ గొంతూ...
ఆ వెనకనే ఉరుం-మబ్బేదో కదం తొక్కుతున్నట్టు ఓ బేస్-గిటార్ మోతా...
అవి వింటూనే చెవులప్పగించిన ఫోనుకి కళ్ళు కూడా అద్దెకిచ్చా.
చూస్తే అక్కడ ఏముందీ?
హయలయల హొయలుకి గిటారు మోగిందా?
గిటారు గీర-రాగాలకి తురంగాలు తరంగమాడాయా?
అంతే! నా చెవులూ, కళ్ళూ కూడబలుక్కున్నట్టు నా తలకేం చెప్పాయో కానీ నా చేతులు - మడతెడుతున్న బట్టలని కాసేపలా గాలికి రెపరెపలాడుతుండమని చెప్పి - టీవీ రిమోట్ తీసుకుని - చకచకా యూట్యూబులో వెతికి ఆ పాట పెట్టేశాయ్. ఈలోగా నా కాళ్ళేమో సోఫాలో నన్ను కూర్చోబెట్టేశాయ్.
అప్పుడు కూర్చుని మొట్టమొదటి సారిగా ఆ పాట చూశా!
పూర్తిగా చూశాక - మళ్లింకొక్కసారి చూశా!
మళ్ళీ ... మళ్ళీ చూశా !
ఆ హయ-గతికి గిటారు పాడిన స్వర-జతికి - "నజర్ న లగ్ జాయే!" అనుకున్నా!
ఎంత అందమైన పాట అది?
ఇన్నాళ్లూ నేనెందుకు చూడలేదబ్బా? అనుకున్నా.
ఈ పాట నాకు దక్కాలని రాసుండబట్టి ఇవాళ్టికైనా నాకు చిక్కిందనుకున్నా.
నన్నలరించిన ఈ పాటలో నాకు కనిపించిన విషయాలూ, నాకనిపించిన విశేషాలతో ఆ పాట కథా-కమామీషూ మీతో ఇలా పంచుకుంటున్నా.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
నే చెప్పే కబుర్లు చదివే ముందు మీరూ ఈ పాట చూడాలిగా!
యూట్యూబుకి - ఆకలేసి నీరసమొచ్చి మింగేసిందో - పాడలేక ఆయాసమొచ్చి ఆపేసిందో - కానీ చూసే పాటలో చివరి చరణాలు రెండే కనిపిస్తాయి. మొదటి చరణం హుళక్కి!
కాకపోతే కనిపించే రెండు చరణాలే కాక కనిపించని ఆ మూడో చరణం కూడా నేను రాసి పెట్టాలెండి! (ఇక్కడెందుకో నాకు సాయికుమార్ - పోలీస్ స్టోరీ గుర్తుకొచ్చింది. ఎందుకో చెప్పుకోండి చూద్దాం!)
మీకెవరికన్నా ఆ మూడు చరణాలు కంటి నిండుగా కనిపించే పాట మీక్కనిపిస్తే నాకొచ్చి చెప్పండేం!
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
లండన్లో థేమ్స్ నది ఒడ్డున సాగే ఈ పాటలో ఎఱుపు రంగు భలేగా మెరుస్తుంది.
మొట్టమొదటగా కనిపించే చిన్న బోటుపై రెపరెపలాడుతున్న తెల్ల క్రాసున్న జండా ఎఱుపు.
ఆ బోటు మీద నించున్న గిటార్రాగాల అబ్బాయి వేసుకున్న పొడుగు చేతుల చొక్కా ఎఱుపు
ఆ తర్వాత కెమెరా చూపు సోకిన రహదారి మీద వెళుతున్న చిన్న కారు ఎఱుపు, ఆ పక్కనే రయ్యిమన్న ఓ మాదిరి ట్రక్కు ఎఱుపు
"పీ-పీ" మంటూ ఊదుకుంటూ వస్తున్న గ్రెనడీర్ గార్డుల బ్యాండు వేసుకున్న యూనిఫార్మ్ రంగు ఎఱుపు
ఇంకా పాట సాగుతున్నంత సేపూ ఆ వెనకాల రోడ్ల మీద హడావిడిగా సిన్మాలో కనిపించాలన్నట్టు తిరుగుతున్న లండన్ బస్సులు ఎఱుపు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
పైన చెప్పిన ఎఱుపు రంగు చూసింతర్వాత ఈ పాటలో మెరిసినవారు బిశ్వజిత్, మాలా సిన్హా.
బిశ్వజిత్తుని చూడగానే బీఎస్సీలో మాథ్స్ ట్యూషన్ చెప్పిన కోటేశ్వర్రావుగారు గుర్తొచ్చారు.
ఏ ఆదివారమో టీవీలో ఓ మంచి హిందీ సిన్మా - ఏ షమ్మీ కపూర్ - తీస్రీ మంజిల్ - లాంటిదో వుందని ముందే తెలిసి - ఆ రోజు సెలవివ్వండి సర్ సిన్మా చూస్తాం - అనడిగితే - "చపాతీ మొహాలనేం చూస్తారు, ఎంచక్కా ట్యూషను కొచ్చి హాయిగా లెక్కలు చేసుకోండి - అని చెప్పేవారు.
ఇంకేం చేస్తాం! ఎలాగో మనసు చిక్కబట్టుకుని లెక్కలు చేసుకుంటూ కూర్చుంటే - ఇంతలో పక్కనే సర్ వాళ్ళింట్లోంచి "ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా... అల్లా...అల్లా ...ఇన్‌కార్ తేరా...ఆజా...అహ్హహాజా... " అని పాట వినగానే "ఉండండయ్యా ... నన్ను ఎందుకో పిలుస్తున్నట్టున్నారు" అని కట్టుకున్న తెల్ల గ్లాస్కో లుంగీని కుడిచేతి గుప్పెట్లో కాళ్లకడ్డం పడకుండా గట్టిగా ఒడిసి పట్టుకుని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి - ఆ పాటయ్యాక - తీరిగ్గా వచ్చేవారు మా కోటేశ్వర్రావు సర్.
ఇదిగో ఇవాళ మళ్ళీ నున్నటి మొహమున్న బిశ్వజిత్తుని చూడగానే ఆ చపాతీరో-మోహపు రోజులు గుర్తుకొచ్చాయి. ఏ పుణ్యలోకాలనో లెక్కలు పాఠాలు చెప్పుకుంటున్నారో - మా ప్రియమైన కోటేశ్వరరావు గారు కూడా గుర్తొచ్చారు.
బిశ్వజిత్ పక్కనే వున్న మాలాసిన్హా కూడా బల్-హాయిగా అనిపించిందండోయ్.
ఎప్పుడో పెళ్ళికి ముందు రోజుల్లో డీడీలో తెలుపు-నలుపు హిందీ సినిమాల్లో ఒకట్రెండు సినిమాల్లో చూసినప్పుడు ఇదే మాలాసిన్హా "నైన్ కియే నీచే నీచే... రహూ తేరే పీఛే పీఛే" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ, హీరో కాళ్ళావేళ్ళా పడిపోతూ వుండేది. ఈ పాటలో మాత్రం స్టైలిష్షుగా, పాలిష్డుగా బార్బీ బొమ్మలా భలే ఉంది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇహ పోతే - ఈ పాట చూస్తుండగా కనిపించిన లండన్ వీధులు, థేమ్స్ నది, బిగ్గు బెన్నూ దాటి ఓ పడవెక్కి హీరో-హీరోయిన్లు ఇద్దరూ ఓ జలపాతం దగ్గరికి వెళ్తారు.
అది చూడగానే ఇదెక్కడి జలపాతమబ్బా అనుకుంటూ గూగుల్లో వెతికా!
అప్పుడు తెలిసింది - ఈ పాట లండన్ థేమ్స్ నది నీటి అలల మీదుగా - అలా అలా గాలిలో తేలి స్విజ్జర్లాండు రైన్ ఫాల్స్ (Rhine Falls) జలపాతంలో చిందులేసిందని.
ఈ పాటకి రైన్ జలపాతం పొందిన ఆనందం చూడాలంటే "సామ్‌నే జో ఏక్ తూ న హో... దిల్ మే కోఈ ఆర్‌జూ న హో!" అన్న వాక్యాల దగ్గర బిశ్వజిత్, మాలాసిన్హా నించున్న అబ్జర్వేషన్ డెక్ వెనకాల నీటి చిందులు చూడాల్సిందే! (వీడియోలో 3:09 నుంచి 3:25 దాకా).
నాకు నచ్చిన పాటని ఈ కింద రాసి పెట్టుకున్నా.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఓ మై లవ్ !
నజర్ న లగ్ జాయే - కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!
నజర్ న లగ్ జాయే - కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!
దేఖ్ కర్ - తేరీ తరఫ్ - బహార్
ఆజ్ హో రహీ హై - బేకరార్
దేఖ్ కర్ - తేరీ తరఫ్ - బహార్
ఆజ్ హో రహీ హై - బేకరార్
ఛూ రహే ఫూల్ హై యూ తుఝే
జైసే హో ఇన్హే భీ తుఝ్‌సే ప్యార్
యే హో న జాయే - ఓ మై లవ్!
నజర్ న లగ్ జాయే - కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!
ఏ మేరీ హసీన్ దిల్‌రుబా!
మేరే దిల్ మే - ఛుప్‌కే బైఠ్ జా...
ఏ మేరీ హసీన్ దిల్‌రుబా!
మేరే దిల్ మే - ఛుప్‌కే బైఠ్ జా...
తుఝ్‌మే ముఝ్‌మే ఫరక్ నా రహే
ఆ... కరీబ్ - ఆ... కరీబ్ - ఆ...
తూ ఖో న జాయే - ఓ మై లవ్!
నజర్ న లగ్ జాయే - కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!
సామ్‌నే జో ఏక్ తూ న హో...
దిల్ మే కోఈ ఆర్‌జూ న హో!
సామ్‌నే జో ఏక్ తూ న హో...
దిల్ మే కోఈ ఆర్‌జూ న హో!
మంజిలే హజార్ హో మగర్
మంజిలోం కీ జుస్తుజూ న హో
యే హో న జాయే - ఓ మై లవ్!
ఓ మై లవ్ ! ఓ మై లవ్ !
ఓ మై లవ్ ! ఓ మై లవ్ !
నజర్ న లగ్ జాయే - కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
నాకైతే పాటలో వినిపించిన గిటార్ సంగీతం ఎంతో నచ్చింది.
దానికి జతగా కుదిరిన గుఱ్ఱపు-నడక కూడా - కనిపించింది కొన్ని సెకన్లయినా ఎంతో రాజసంగా వుంది.
ఈ పాట ఈ పూటకి దొరికిన పున్నెం.
నాకందిన ఈ నిన్నటి పున్నమల మించుని మీకూ పంచుకుంటూ...