25, నవంబర్ 2016, శుక్రవారం

Canoనోపాఖ్యానం - అనబడు - ప్రహసన-వారసత్వపు కొనసాగింపు

నవంబర్ నెలలో నాలుగో గురువారం-Thanksgiving తో మొదలుపెట్టి నాలుగు వరస-సెలవు-రోజులు 
Out-Of-Office Status: "Running around being Thankful"

బుధవారం సాయంత్ర్రానికే - ఏవో కొత్త రెక్కలు మొలిచినట్లు - గాలిలో తేలుతున్నట్టు - జైంట్ వీల్ ఎక్కితే అప్రయత్నంగా వచ్చేసే నవ్వులాంటి - అనుకోకుండా వచ్చేసి ఆపుకోలేని నవ్వు -
సెలవులకని - కిందటి ఏడాదికన్నా ఒక రెండు రోజుల ముందు - ఇంటికొచ్చిన అన్నగాడు - వాడి వెనకాలే కబుర్లు చెప్తూ తిరిగే తమ్ముడు -
ఇప్పటితో మొదలుపెట్టి కొత్త సంవత్సరం వచ్చేలోగా కావాల్సినవారందరితో ఫోన్ చేసి పంచుకోవాలనుకునే - ఇచ్చకాలు, మెచ్చుకోళ్లు, నచ్చజెప్పుటలు -  బోల్డన్నికబుర్ల కబుర్లు - వాటి కోసం వేసుకునే ఫోన్-కాళ్ల ప్రణాళికలు -
చదవాలి అనుకొనీ  - చదువుతున్నాము అనీ - ఇంట్లో వున్న నలుగురిచేత  - ఇంటినిండా వెదజల్లబడిన నలభైకి పైగా  పుస్తకాలు...

వీటన్నిటి మధ్యా - ఏ బద్ధకపు మధ్యాహ్నమో - అమ్మ పెట్టిన నెయ్యి కలిపిన వేడన్నం - పప్పుతో, కూరతో, పచ్చడితో - తిని - సోఫాలో గువ్వపిట్టల్లా చేరి - నచ్చిన పాట గురించో - తాము మెచ్చిన చార్లీబ్రౌనో, కాల్వినో అన్న మాటల గురించో - చెప్పుకుని తలచుకుని, తలచుకుని నవ్వుకుంటున్న బుజ్జిజింకల సరసన  చేరుతుంది - అమ్మ.
 
"అమ్మో - అమ్మ వచ్చేసింది - ఇంక మన పని అంతే " - అంటూనే - నవ్వుతూనే తమ పక్కన అమ్మకి చోటిస్తారు బుజ్జిజింకలు.

అమ్మ వస్తే మామూలుగా రాదు మరి - కొన్ని ఆషామాషీ  కబుర్లూ -  చిరుజల్లులా మొదలయి ఆసాంతం తడిపే వానలా - చిన్నగా  మొదలెట్టి ఒళ్లంతా కుదిపే  నవ్వులూ - తీసుకొస్తుంది.

ఆ నవ్వులతో దొర్లి దొర్లి కిందపడిపోతామని ముందే అమ్మో-కారం చేసేస్తారు బుజ్జిజింకలు.

ఇదో రకం anitcipatory-regret of expected-delight వల్ల పుట్టే హాహాకారం అన్నమాట.

అలాంటప్పుడు గత నాలుగేళ్లుగా తమ-ఇంటి-థాంక్స్-గివింగ్-సంప్రదాయపు-కథ అనబడే Canoనోపాఖ్యానం అమ్మ గుర్తు చేసుకుంటుంది - ROFL-బుజ్జిజింకల నవ్వులలో తనూ ఓ నవ్వై పలుకుతుంది-వెలుగుతుంది.

Canoనోపాఖ్యానం:

అది సైబర్ శకం 2011వ సంవత్సరం.


అనగనగా బాల్విన్ అనే ఊళ్లో అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు వున్నారు - అప్పుడూ వున్నారు - ఇప్పుడూ వున్నారు - అప్పటినుంచీ ఇప్పటిదాకా అక్కడే - అలాగే వున్నారు.

అన్న పదో తరగతి చదువుతూ వున్నాడు. 

నవంబర్, డిసెంబర్ నెలలు వస్తే - నాన్న, అన్న, తమ్ముడు - లకి Electronic-పండగ-హడావిడి.
థాంక్స్ గివింగ్ కి తర్వాత జరిగే  - Black Friday, Cyber Monday అమ్మకాలు
ఆ తర్వాత Christmas అమ్మకాలు
ఏవి కొందామా అనే చర్చలు >> వాదాలు >>  వాదోపవాదాలు
వాళ్లు ముగ్గురిలో - ఎవరు కొన్నా- ఏమి కొన్నా - ఎన్ని కొన్నా - వాటి  వైర్లు చుట్టడం మాత్రం తనకి తప్పదనే వమ్ము-కాని-అమ్మ-నమ్మకాలు.

నవంబర్ వచ్చింది - ఎప్పటిలాగే అన్న వాడికి కావాల్సిన రెండిటి కోసం (ఇవి "అమ్మ పెట్టే రెండూ"  కావు సుమా!) - అనగా iPhone 4S, Canon EOS 7D కెమెరాల కోసం - రెండు నెలల ముందు నుంచే - ప్రాడక్ట్ రివ్యూలు చదువుతూ, అవెందుకు మంచివో - వాటికన్నా మిగిలినవి అంత మంచివెందుకు కాదో - కావాల్సిన తర్కాన్ని సమకూర్చుకుంటూ - వీలుకుదిరినప్పుడల్లా అలుపనేదే లేక వివరిస్తూ - నాన్నగారికి మరిచానని ఏ పరిస్థితి లోనూ చెప్పే అవకాశం ఇవ్వనివాడై, నక్షత్రక-పూనికతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు.

అన్న చెప్పేది నాన్నగారు విన్నారు - విన్నారు - విన్న తర్వాత - "నాన్నా! ఈసారికి iPhone 4S కొందాము - Canon కోసం మాత్రం 2102 వరకూ ఆగాల్సిందే" అన్నారు.

అన్న రెండు అడిగితే నాన్నగారు ఒకటే ఇస్తానన్న-  iPhone-సంప్రాప్త-అర్థసంతోషుడై - మరింత  కెమెరా-ప్రాప్తి-సంతోషార్థుడైనను - అదంతగా చూపించక  - బుద్ధిగా "సరే నాన్నగారు - కెమెరా నాకిప్పుడే వద్దులెండి" అన్నాడు.

(అన్న అనల్పసంతోషిత్వం గురించి సోదాహరణంగా చెప్పాలంటే - ఏడాదికి మహా ఐతే రెండో-మూడో జతల బట్టలు - వాడే వెళ్లి కొనుక్కునేవి, రెండ్ జతల షూస్, నెలకోసారి స్నేహితులతో బయటికి, మూడు నెలలకో మ్యూజిక్ కాన్సర్ట్, ఒక నాలుగైదు పుస్తకాలు, ఒక Spotify అకౌంటు - ఇంతే -  "అబ్బా! వీడసలు ఏమీ అడగడు పాపం" - అనుకుని ఆనందభాష్పాలు కార్చేలోగా - ఏ iMac కావాలనో ఒకమాట అనేస్తాడు అంతే - అదొక్కటే చాలు - అంటాడు. నోరు తెరిచి అడిగింది అదొక్కటే అయినప్పుడు అమ్మ-నాన్నకాదని ఎలా అనగలరు పాపం!  పైన అంత లిస్ట్ చెప్పి నోరుతెరిచి అడిగినదొక్కటే అంటే అర్థమేంటంటే - అవన్నీ అవసరాలని చెప్పబడతాయి - అడగబడార్హాలు కావని.)

నాన్నగారు తర్వాత అమ్మతో చెప్పారు - "వాడికి చెప్పకు - కెమెరా కూడా కొంటున్నాను -  surprise-gift అన్నకి అది" అని.

అమ్మ - అన్నగాడి సంబరం తల్చుకుని - బోల్డంత సంతోషపడింది - అదేదో కెమెరా తనకే ఇష్టమై కొనేసుకుంటున్నట్టుగా.

సెలవులు అయిపోయాయి - డిసెంబర్ మొదటివారం - అమ్మ ఊళ్లో-ఆఫీసు, అన్న-తమ్ముడు స్కూలు, నాన్నగారు-పై-వూళ్లో-ఆఫీసు - మళ్లీ ఉరుకులు, పరుగులు, ఆకాశంలో విహారాలు మొదలు.

ఒకానొక మంగళవారం - నాన్నగారినుంచి అమ్మకి ఫోను - రేపు బుధవారం కెమెరా వస్తుంది - రాగానే తీసుకుని అన్నకి కనిపించకుండా దాచి వుంచమని.

అమ్మకి ఒకటే ఆతృత - ఏంటో తెలీని అలజడి - ఒక వేళ UPS ట్రక్ వచ్చేటప్పటికి అన్న స్కూలునుంచి ఇంటికి వచ్చేస్తాడేమో - అట్టపెట్టె చూడగానే తెరిచి చూసేస్తాడేమో - అప్పుడేం  చెయ్యాలబ్బా  - అని.

తీరా బుధవారం వచ్చాక - అనుకోకుండా అమ్మ తమ్ముడిని తీసుకురావడానికి స్కూలుకి వెళ్లాల్సివచ్చింది. కార్లో తమ్ముడిని తీసుకొస్తూవాడికి ఎన్నో సార్లు చెప్పింది - ఇవాళ నాన్నగారిదేదో ఒక చాలా ముఖ్యమైన ప్యాకేజ్ వస్తుంది - తొందరగా ఇంటికి వెళ్లి తీసుకోవాలి - అని.

ఎంత తొందరగా ఇంటికి వచ్చేసినా - వచ్చేటప్పటికి - ఇంటి తలుపు మీద UPS డ్రైవర్ అంటించిన - Sorry we missed you - We will try again the next weekday- నోటీస్ కనిపించింది.

అది చూడగానే అమ్మగబగబా దాన్నితీసేసి దాచేసింది.

గురువారం వచ్చింది. పొద్దుటినుంచీ అమ్మ ఎదురుచూపులు UPS ట్రక్ కోసం - కానీ మధ్యాహ్నమైనా రాలేదు.   ఈలోగా అన్న-తమ్ముడు స్కూలునుంచి వచ్చేశారు.

అమ్మకేమో ఏంటో గాభరా - అన్నకి తెలిసిపోతే - పాపం - నాన్నగారు వాడిని సర్ప్రైజ్ చేద్దామనుకున్న సరదా తీరదని.

స్కూలునుంచి రాగానే అన్న - చలిగాలికి తలనొప్పి వచ్చింది - వేడి నీళ్లతో స్నానం చెయ్యాలని వుందని పైకి వెళ్లాడు.

వాడలా వెళ్లాడో లేదో UPS ట్రక్ ఇంటి ముందు ఆగింది - డ్రైవర్ తలుపు కొట్టకుండానే అమ్మ తలుపు తీసింది.

అప్పటికే ఓ పే...ద్ద Canon అట్టపెట్టె మోసుకుని UPS-అతను తలుపు దగ్గర ఆగి - ఆ బరువుగా వున్న పెట్టెని మోయలేక  సగం తెరిచివున్న తలుపు గుమ్మం మీద పెట్టీ పెట్టగానే - అమ్మ - గబగబా అతను పెట్టమన్న చోట సంతకం పెట్టి - అంతకన్నా గబగబా Canon పెట్టెని లోపలి లాగుతూ తమ్ముడికి చెప్పింది - సోఫామీద వున్న వాడి బుల్లి బ్లాంకెట్ తెమ్మని.

ఆ కెమెరా పెట్టె బో... ల్డంత  బరువుగా వుంది.

అమ్మ దాన్ని నెడుతోందో, అదే అమ్మని లాగుతోందో తెలియని స్థితిలోనే ఆ పెట్టెని గోడ దగ్గరికి లాక్కొచ్చింది అమ్మ.

అమ్మ గొంతులో కంగారు విని తమ్ముడు బుజ్జి-బంతిలా దొర్లుకుంటూవెళ్లి తన బ్లాంకెట్ తెచ్చి అమ్మకిచ్చాడు.

అది పూర్తిగా ఆ Canon పెట్టెని కప్పలేకపోయింది - అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంకో దుప్పటి తీసుకొచ్చికప్పింది - ఆ "కెమెరా" బాక్స్ మీద.

తమ్ముడికి అమ్మ ఎందుకంత హడావిడి పడుతోందో అర్థం కాలేదు - కానీ వాడు అడిగేలోగా అమ్మ "Mr. Lattanzi వస్తారు - వయొలిన్ క్లాసుకి తయారు కావాలి" - అని తొందర పెట్టింది.

వాడిది-పాపం - బుజ్జి గుండు కదా - క్లాసు మాట వినగానే అమ్మని ఏం అడగాలనుకున్నాడో మర్చిపోయి వయొలిన్ తీసి వాయించడం మొదలుపెట్టాడు.

ఇంతలో అన్న పైనుంచి రావడం,  Mr. Lattanzi కూడా వచ్చి అన్నకి-తమ్ముడికి వయొలిన్ పాఠాలు మొదలుపెట్టడం జరిగింది. అమ్మ "హమ్మయ్య" అనుకుంది.

గురువారం కదా - నాన్నగారు ఇంటికి వచ్చేటప్పటికి -ప్రతీవారంలాగే రాత్రి పది అయింది. అప్పటికే అన్న-తమ్ముడు పడుకుని గంట అయింది - మరి పొద్దున్నే స్కూలుకి వెళ్లాలి కదా .

నాన్నగారు ఇంట్లోకి వచ్చీ రాగానే అమ్మ - "వచ్చేసింది ఇవాళే Canon" - అని ఉత్సాహంగా ఆ దుప్పటి కప్పిన అట్టపెట్టె చూపిస్తూ నెమ్మదిగా ఆ దుప్పటిని ఇవతలికి లాగింది.

ఆ పెట్టెని చూస్తూనే నాన్నగారు అతి మామూలుగా "ఓ - ప్రింటర్ వచ్చిందా ? " అంటూ లోపలి వెళ్లారు.

"ప్రింటరా?" అమ్మ అయోమయంగా చూసింది.

అలా అంటూనే - ఆపెట్టె కేసి చూసిన అమ్మకు - Canon Image CLASS D420 అన్న అక్షరాలూ, వాటిపైనే ఒక ప్రింటర్ బొమ్మా కనిపించాయి.

ఇంతకీ జరిగిందేంటంటే Canon EOS కెమెరాతో పాటు ఇంట్లోకి అవసరం అని Canon ప్రింటర్ ఒకటి కూడా ఆన్లైన్ లో కొన్నారు నాన్నగారు. కానీ అది అమ్మకి తెలీదు కదా - వచ్చిన ఆ పెద్ద డబ్బానే కెమెరా అనుకుంది.

వెంటనే తను పడ్డ హడావిడి తలచుకుని తెగ నవ్వుకుంది.

కానీ గప్-చుప్ గా వుండిపోయింది - ఇంకా కెమెరా రాలేదు కదా మరి.

శుక్రవారం ఇంకో UPS పార్సెల్ వచ్చింది.

నాన్నగారు ఏమీ ఎరగనట్లు - "నాన్నగాడు - ఆ బాక్స్ ఏంటో తెరిచి చూడు" అనగానే - "అబ్బా! మీరు చెయ్యొచ్చు కదా నాన్నగారూ" - అంటూనే కత్తెరతో చుట్టూ వున్న టేప్ కత్తిరించి అట్టపెట్టె తెరిచిన అన్నగాడు మెరిసే కళ్లతో నాన్నగారి దగ్గరికి వెళ్లి కౌగిలించుకుని "I knew it, నాన్నగారు! I knew that you would get it for me"  అంటుంటే - అప్పుడు చూపించింది అమ్మ - 20 కిలోల ప్రింటర్ డబ్బాని.

చూపిస్తూ చెప్పింది - దాన్ని తనెంత కష్టపడి ఇంట్లోకి లాక్కొచ్చిందో - తనలా అంత పెద్ద పెట్టెనీ ఆ తెచ్చిన UPS-ట్రక్-అతను మళ్లీ ఎక్కడ వెనక్కి పట్టుకెళ్లిపోతానంటాడేమో అన్నట్లు లాక్కొచ్చేస్తుంటే UPS-అతను పైకనకపోయినా Has she gone crazy? అనుకున్నట్లు ఎలా చూశాడో -   నవ్వుతూ - నవ్వుల మధ్య మాటలతో - "అమ్మా - నవ్వన్నా చెప్పు - చెప్పన్నానవ్వు" అని అన్న అంటుంటే - ఇంకా నవ్వుతూ - నవ్వులతో చెప్పింది.

అమ్మ చూపించిన  20 కిలోల ప్రింటర్ డబ్బాని చూసి - "నువ్వు మరీనమ్మా! నేను 20 కిలోల కెమెరా మోసుకుని ఫోటోలు తీస్తాననే?" - అని అన్నా- వాడి వెనకాలే అక్షరాలా నేలమీదపడి దొర్లి నవ్వుతూ తమ్ముడూ - అమ్మని తెగ ఆట పట్టించారు.

ఇంతకు ముందోసారి చెప్పనే చెప్పింది కదా తన  ప్రహసన ప్రవాసం - కొనసాగుతున్న పార్వతీశంగారి వారసత్వం గురించి...

ఇదిగో - ఈ కింద వున్నదే - అమ్మ తీసి దాచుకున్న Canon పెట్టెల ఫోటో - ఇంకొక్కసారి నిరూపించబడ్డ - ప్రహసన-వారసత్వానికి గుర్తుగా...








19, నవంబర్ 2016, శనివారం

త్వామనురజామి - 7 - డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువోగ్రాఫు

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ



సెకండ్ ఇయర్ లో ఉండగానే మొదటిసారిగా శ్రీనన్న తీసుకెళ్తే బెంగళూరు చూశాను. తనకప్పుడు BHEL లో మొదటి ఉద్యోగం. విజయనగర్ లో సాగి (సాగి కృష్ణ ప్రసాద్), బాలగోపాల్ లతో కలిసి ఒక ఇంట్లో ఉండేవాడు.

బెంగళూరులో వున్న పదిరోజులూ - పగలు వాళ్లందరూ ఆఫీసుకి వెళ్లాక - R.K. లక్ష్మణ్ -You said it! సిరీస్, ఇంకా Jeffrey Archer నవలలు, Archies comics - ఇలా ఒకటని కాదు - అన్ని రకాల పుస్తకాలూ - వున్నవన్నీ మహా ఆనందంగా చదివింది చదవకుండా చదివేశాను.  

మొదటిసారి అమ్మతో కాకుండా ఇల్లు దాటి వెళ్లడమేమో కొంచెం బెంగగానే ఉండేది. పైగా గుంటూరు కారానికి అలవాటు పడిన నాకు చప్పగా వుండే కర్నాటక వంటలు నచ్చేవి కావు. శ్రీనన్న, సాగి పోటీలు పడి నాకోసం పెసరపప్పుతో టొమాటో పప్పు డిన్నర్ కి, French-toast పొద్దున్నే breakfast కి చేసి పెట్టేవారు. దాదాపుగా రోజూ అదే menu. అప్పుడే మరీ వాళ్ల వంట తిని ఇంటిమీద, అమ్మమీద బెంగ పెట్టేసుకుంటున్నానని నన్ను  ఆంధ్రా restaurants - అమరావతి, నాగార్జునకి తీసుకెళ్లేవాడు శ్రీనన్న.


శ్రీనన్నInd-Suzuki మీద తను,నేను - ఇంకో బైక్ మీద సాగి, ఇంకో ఫ్రెండ్ - నలుగురం వెళ్లి  భరచుక్కి , గగనచుక్కి అనే జలపాతాలు చూసొచ్చాము. మొత్తానికి వున్న ఆ పదిరోజుల్లోనే బెంగళూరుకి తెగ నచ్చేసింది - వదిలి వెళ్తుంటే  బెంగొచ్చేసింది. 


ఏమాటకామాట చెప్పాలంటే - ఓ వారం రోజులు అలా తిరిగివచ్చాక మా అమ్మ వంట విలువ తెలిసి వచ్చింది.


పాపం- మా అమ్మని నాన్నతో కలిసి తెగ tease చేసేదాన్ని. మధాహ్నం నాన్న భోంచేసి మళ్లీ ఆఫీసుకి వెళ్లేలోగా ఒక అరగంట పడుకునేవారు. ఎప్పుడైనా సెలవుల్లో ఇంట్లో వున్నప్పుడు - ఆయన పక్కనే మంచం మీద కూర్చుని - నేను పుస్తకమో, ఈనాడు పేపరో చదువుతూ ఉండేదాన్ని.

ఒక అలాంటి రోజు - ఈనాడు పేపర్ పట్టుకుని - హెడ్ లైన్స్ చూస్తూ - అలవాటైన విషం - అని చదివి - దానికి కొనసాగింపుగా - మా అమ్మ వంట - అని నా స్వంత కవిత్వం చేర్చాను. వెంటనే నాన్న మొహం మీద ముసిముసినవ్వు - అప్పుడే ఆక్కడికి వచ్చిన అమ్మ రుసరుస - "ఓ రెండు రోజులు ఎక్కడికైనా నేను లేకుండా వెళ్తే తెలుస్తుంది" - అన్న మాటల్తో కలిపి.

అదిగో - ఆవిణ్ణి అలా ఏడిపించిన పాపం వూరికే పోతుందా - బెంగళూరు పెసరపప్పు-వారోత్సవాల్లో చెల్లయిపోయింది.


ఇంక డిగ్రీ సెకండ్ ఇయర్ లో రోజులు అయిపోయాయి - ఆడుతూ పాడుతూ - ఆదివారం విజయలక్ష్మి థియేటర్ లో పప్పి-కుట్టిలతో హిందీ సినిమాలు చూస్తూ.

ఇంకెంత - ఇంకొక్క ఏడాది - ACC లో .

మా కోటేశ్వరరావుగారి గురించి చెప్పకుండా నా డిగ్రీ రోజుల జ్ఞాపకాలు పూర్తయినట్టు అనిపించవు.


కోటేశ్వరరావు గారే ACC లో మాకు Ancilliary Math క్లాసెస్ తీసుకున్నా - అక్కడ ఆయన ఎంత బాగా చెప్పినా కూడా - ఎలెక్షన్ అనీ, స్ట్రైక్ అనీ కాలేజ్ సరిగ్గానే జరిగేది కాదు - అందుకే మేము తప్పక ట్యూషన్ చేరాల్సి వచ్చేది.


కోటేశ్వరరావు గారి దగ్గర విడవకుండా రోజూ మాథ్స్ ట్యూషన్ ఉండేది. మేము ఎలాగైనా ఆయన చేత ఒక్కరోజైనా సెలవు ఇప్పించుకోవాలని రకరకాలుగా ప్రయత్నించేవాళ్లం. మేము సెలవడిగిన ప్రతి స-కారణాన్నీ తిప్పి కొట్టడానికి KR గారి దగ్గర న-కార బాణాలుండేవి.


"సర్ - రేపు వర్షం పడుతుందని న్యూస్ లో చెప్పారండీ" అని ఎవరైనా అబ్బాయిలు అంటే "బట్ట తడుపు వానకి భయపడతారేంటయ్యా" అనే వారు.


"రేపు పండగండీ సెలవియ్యండి" అంటే  - "అమ్మాయిల చేత ఇంట్లో పప్పు రుబ్బిస్తారు, అబ్బాయిల్నయితే - అది తే, ఇది తే - అని బజారుకి పంపిస్తారు. చక్కగా ట్యూషన్ కి వస్తే భోజనం టైంకి ఇంటికి పంపిస్తాను - హాయిగా ఇంటికెళ్లి పులిహార, పరవాణ్ణం తినొచ్చు" అని ఇంకో గంట ఎక్కువ లెక్కలు చేయించేవారు.


"ఆదివారం మంచి హిందీ సినిమా - షమ్మీ కపూర్ది ఉందండీ - సెలవిస్తే చూస్తాం" అంటే " ఆ చపాతీ మొహాలని ఏం చూస్తారు బాబూ !" అని మమ్మల్ని ట్యూషన్ లో కూర్చోబెట్టి - పక్కనే వున్న వాళ్ల ఇంట్లోంచి "ఆజా ఆజా మై హూఁ ప్యార్ తేరా - వల్లా వల్లా ఇన్ కార్ తేరా - ఆజా అహ్హహజా " అన్న పాట టీవీ లోంచి వినిపిస్తే - ఎవరో పిలిచినట్టు " ఆ వస్తున్నా" అని గబగబా ఇంట్లోకి వెళ్లి పాట చూసేసి  ఓ ఐదు నిముషాల తర్వాత వచ్చేవారు.


ఆయన ట్యూషన్లో - మొదటి రోజు చేరినప్పుడు ఎక్కడ ఎవరు కూర్చుంటే ఏడాది అంతా అవే ప్లేసెస్ లో కూర్చునేవాళ్లం.  నేను, అపర్ణ కూర్చునే ప్లేస్ స్పెషల్ -  గోడకి ఆనుకుని  కూర్చునే వీలు ఉండేది. ఇద్దరు మాథ్స్ మెయిన్ అమ్మాయిలు - మాతో పంతం పెట్టుకుని ఒకేరోజు అందరికన్నా ముందు వచ్చేసి మా గోడ-కుర్చీల్లో కూర్చునేశారు. నేనూ, అపర్ణ వాళ్లని అక్కడ చూసి మాట్లాడకుండా అందరికన్నా వెనక్కి వెళ్లి కూర్చున్నాము.


సర్ క్లాస్ చెప్పడానికి వచ్చి ఆయన కుర్చీలో కూర్చుంటూ మా ప్లేస్ లో కూర్చున్న అమ్మాయిల కేసి చూసి - వెంటనే మా ఇద్దరికోసం వెతుక్కున్నారు. వెనకగా వున్న మేము  కనపడగానే - "ఏంటమ్మా ! ఏదో మార్పు కనిపిస్తోంది - బాగాలేదు - రేపట్నుంచీ ఎవరి ప్లేస్ కి వాళ్లు వెళ్లిపొండి" అన్నారు. అంతే - తర్వాత నుంచీ మేమెంత ఆలస్యంగా వెళ్లినా అక్కడ ఎవరూ కూర్చునేవారు కాదు.

డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఇంకో మంచి సర్ప్రైజ్ ఏంటంటే - నాకు NGPE (National Graduate Physics Exmination) certificate రావడం.

BRR గారు ఒకరోజు ఫిజిక్స్ క్లాస్ లో చెప్పారు - ఆసక్తి వున్నవాళ్లు హిందూ కాలేజ్ లో జరగబోయే NGPE పరీక్షకి పేర్లు ఇవ్వొచ్చని.

పేరు ఇవ్వడం, ఒక ఆదివారం వెళ్లి రాయడం, తర్వాత రాశానన్న సంగతి మర్చిపోవడం - అన్నీ మామూలుగానే జరిగిపోయాయి.

ఒకరోజు BRR గారు క్లాస్ మొదలుపెట్టబోతూ NGPE లో గుంటూర్లో టెస్ట్ రాసినవాళ్లలో కొంచెం బాగా రాసి Achievement Certificates వచ్చినవాళ్ల పేర్లు పిలుస్తాను - అందరూ చప్పట్లు కొట్టండి అన్నారు.

మొదటి పేరు "నాగరాజు" - సరే - ఊహించిన పేరే - బాగా చదువుతాడు.

రెండో పేరు - "శ్రీకాంత్" - అన్నట్టు గుర్తు.  అది కూడా అనుకున్నదే.

ఇద్దరికీ గా...ట్టిగా జేజేలు చెప్పేశాం - చేతి తాళాల చప్పుళ్లతో.

సర్ మూడో పేరు చదవబోతున్నట్టుగా పేపర్ ఎత్తారో లేదో నేను చప్పట్లు కొట్టడంమొదలుపెట్టాను - ఒక పనయిపోతుంది కదా అన్నట్లు.

 "లలితా త్రిపుర సుందరి " - అని వినిపించగానే అది నాపేరనేదే గమనించకుండా ఇంకా గట్టిగా కొట్టాను చప్పట్లు  - ఒక రెండు సెకండ్ల తర్వాత అర్థమయ్యింది - అది నాకే అని.  పర్లేదు - బాగానే ఫిజిక్స్ అర్థమయినట్లుంది నాకు - అనిపించింది - నాకు నాకే - నా చేతిలో సర్టిఫికెట్ చూసుకుని - మనసులోనే  జయహో Resnick & Halliday! అనుకున్నాను.

అపర్ణతో కాలేజ్, ట్యూషన్ లకి పరుగులు - అవయిపోయాక - రెండో లైనులో అపర్ణ వాళ్లింటి సందు మొదట్లో నిల్చుని చిరుచీకటి పడి - ఈవెనింగ్ బ్యూటీ - (సాయంత్రం పూట అన్ని నక్షత్ర్రాలకన్నా ముందుగా వచ్చి కనిపించే ఒక నక్షత్రం అది - అదే మా ఈవెనింగ్ బ్యూటీ) - కనిపించేదాకా నించుని - కృష్ణశాస్త్రి కవితల గురించి - మల్లాది రామకృష్ణ శాస్త్రి పాటల గురించి - Wodehouse: Wooster-Jeeves గురించి -  Jane Austen-Mr. Darcy, Elizabeth ల గురించి -  రాజ్ కపూర్ సినిమాల గురించి -  మా నవోదయ నోట్ బుక్స్ లో రాసుకున్న హిందీ-తెలుగు పాటల గురించి - రన్నులు  చేయని గవాస్కర్-మట్టి రాసుకుంటేనే సిక్సర్ కొట్టే రవిశాస్త్రి గురించి -  సంక్రాంతికి వేయబోయే ముగ్గుల గురించి - బాలకుటీర్ గోడమీంచి కనిపించే గోరింటాకు చెట్టు పువ్వుల గురించి - కిటికీలోంచి కనిపించే వెన్నెలని చూస్తూ అపర్ణ  రూంలో మేమిద్దరం ఫైనల్స్ కి చేయబోయే కంబైన్డ్ స్టడీ గురించి - ఆరతి పెంచే చిలక కస్తూరి గురించి - అపర్ణ వాళ్లింట్లో ప్రతి బుధవారం మెడిటేషన్ కి కలిసే కన్నడ కుటుంబాలన్నీ కలిసి గీతాకేఫ్ రూఫ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కన్నడ కంఠీరవ-రాజ్ కుమార్ "బహద్దూర్ గండు" సినిమా గురించి - ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకున్నా - మధ్యలో మాటలు ఆగిన ఒకటి-రెండు సెకండ్ల గాప్ లో - "What else, అపర్ణే?" - అనడుగుతూ నేను - "అది కాదు లలితా - నిన్నేమయిందో తెలుసా ...." అంటూ ఇంకో కొత్త టాపిక్ లోకి వెళ్తూ అపర్ణ - ఆ కబుర్లలోనే - మా డిగ్రీ రోజులు - మా కబుర్లలో టాపిక్కుల్లా గబగబా దొర్లిపోయాయి.

ఆ కబుర్లతో పాటు - ఎక్కడ పట్టామో -ఇవిగో - ఈ హిందీ కవితలు - మాకు మేమే  చెప్పుకుని - మాలో మేమే నవ్వుకున్నవి :)

मैं ने उसको देखा angle बदल-बदलकर
उसने मुझे मारा sandal  बदल-बदलकर

मैं ने उससे बोला अबला समझकर
उसके पिता ने मुझे मारा तबला समझकर

घुंघरू की आवाज़ आयी
मैं समझा - वो आयी
सिन्धूर लेके मैं खड़ा
राखी लेके वो आयी


ఈలోగా మరి అందరం విడిపోయే రోజులు వచ్చేస్తున్నాయి కదా - ఫేర్-వెల్ పార్టీ  చేసుకుందామని పెద్ద ప్లానింగ్ - దానికి వోటింగ్ మొదలుపెట్టారు.

నేను, అపర్ణ, మాతో పాటు మిగిలిన అమ్మాయిలు  - గీతాకేఫ్ అయితే రూఫ్ గార్డెన్ లో హాయిగా చందమామని చూస్తూ దోశ తింటే బావుంటుందని - అబ్బాయిలేమో - శంకర్ విలాస్ అయితే ఇడ్లీ, ఐస్-క్రీం, బాసుందీ - ఇలా ఏదయినా బావుంటుంది, గీతా కేఫ్ వద్దనీ. - మొత్తానికి ఒక చిన్న సైజు కోల్డ్ వార్ నడిచింది.

ఈలోగా మధ్యవర్తులు అవతరించారు - అందులో ఒకతను - ఒకరోజు అపర్ణ, నేను - కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్దామని మా రిక్షాకేసి వెళ్లబోతుంటే  - మా దగ్గరికి వచ్చి - మమ్మల్నిద్దరినీ ఒప్పించాలంటే తాను మా పక్షంలో ఉన్నట్లు నమ్మకం కలిగిస్తే మేము మాట వింటామని అనుకున్నాడో - లేకపోతే ఏదో చెప్పాలని వచ్చి అపర్ణ పక్కన వున్న - అప్పటికే ఆంగ్ల-తిట్ల-రాక్షసిగా పేరు "మోసిన" నన్ను చూసి అసలేం చెప్పాలో మర్చిపోయాడో - మొత్తానికి - తొందర తొందరగా -"మీరు, నేను కొంచెం అర్థం చేసుకుని కన్విన్స్ అవుతామండీ  - కానీ జెంట్స్ ఒప్పుకోవట్లేదు - ఈసారికి శంకర్ విలాస్ కే వెళ్తే బావుంటుంది - మీరేం అంటారు?" అన్నాడు.

మేమేం అంటాం ? బుద్ధిగా - "సరే - అలాగే కానీయండి" అని మా రెండు తలలూ ఊపి మరీ చెప్పి - రిక్షా ఎక్కి ఇంటి దగ్గర దిగేదాకా -  ఆ అబ్బాయి అన్న "మీరు, నేను" vs. "జెంట్స్" ని తలచుకుని అపర్ణ-తెలుగులో పడీ-పడీ నవ్వుకుంటూనే వున్నాము.


మొత్తానికి శంకర్ విలాస్ లో మా ఫేర్వెల్  పార్టీ - మూడు కేకులు, ఆరు జోకులుగా - బానే జరిగింది.

మా నవ్వుల సందడిలో -ఆఖరి సంవత్సరం, ఆఖరి పార్టీ కదా - ఈ అమ్మాయి నవ్వుతోంది ఇవాళ్టికి ఏమీ అనదు - అని ధైర్యం చేసి వచ్చి - Bernoulli అడిగిన  ఆటోగ్రాఫూ - నేనడక్కపోయినా తనివ్వబోతే దాన్ని వెనక్కి తిప్పి  దానిమీదే All The Best To Bernoulli అని నేను రాసిచ్చిన ఒక తనదైన పాస్పోర్ట్ ఫొటోగ్రాఫూ - వోట్ ఆఫ్ థాంక్స్ కి శ్రీకాంత్ రాసుకొచ్చి చదివిన పేరాగ్రాఫూ - ఈ గ్ర్రాఫులన్నీ కాక ఫిజిక్స్ రికార్డులో నేను గీసే రకరకాల గ్రాఫులతో - నా ఫైనల్ ఇయర్ చదువోగ్రాఫు ఒక స్మూత్ సైన్-వేవ్ లా ACC-కాలంలో గీయబడింది. 

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>


12, నవంబర్ 2016, శనివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 3 - నాన్న


సీ|| శ్రీమనోహర! సురార్చిత సింధుగంభీర
భక్తవత్సల కోటిభానుతేజ
కంజనేత్ర  హిరణ్యకశ్యపాంతక శూర
సాధురక్షణ శంఖచక్రహస్త
ప్రహ్లాదవరద పాపధ్వంస సర్వేశ
క్షీరసాగరశాయి కృష్ణవర్ణ
పక్షివాహన నీలభ్రమరకుంతలజాల
పల్లవారుణపాదపద్మయుగళ

తే||  చారుశ్రీచందనాగరుచర్చితాంగ
కుందకుట్మలదంత వైకుంఠధామ
భూషణవికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర 

ఇదే కదా నాన్నా - మీరు నాకు జోలపాటగా పాడింది - మొన్న మొన్నటిదాకా బాలు, సాయిలకి వినిపించింది? 

నా బుజ్జిజింకలకి నిద్ర పుచ్చేవేళ లాలిపాటగా పాడినా, ఇప్పటికీ నాలో నేను పాడుకుంటున్నా,  మృదు మేఘధ్వని లాంటి మీ గొంతులో విన్నఆ నృసింహ శతక పద్యాలు ఎక్కడ విన్నా ఇది మా నాన్న పాట అని మురిసిపోతుంటాను. 

దాదాపు వారానికి నాలుగు రోజులు మీతో మాట్లాడుతూ ఉంటానా - అయినా ఇంకా ఏదో మీతో చెప్పాల్సిన  కబురేదో మిగిలివుందేమో అనిపిస్తూ వుంటుంది. 

ఆగండి - కొంచెం - గుర్తు తెచ్చుకోనీండి నన్ను - మీరూ మీ హడావిడీ! - చెప్పాలనుకుంటున్నదేదో చెప్పేయ్ - ఇంకెందుకాలశ్యం - అంటూ నన్నలా కంగారు పెట్టకండి. 

అమ్మ చెప్తూ ఉంటుంది - మీకసలు గోదావరి దాటి రావడం ఇష్టం ఉండేది కాదట కదా - గోదావరి దాటివెళ్తే గడ్డి తినాలి అనేవారట కదా!  మీ మెడికల్ షాపులో వచ్చినదంతా లాభమే అనుకుని అసలు, లాభం అప్పుడే పుట్టిన నా బేబీ పౌడర్లకి, గౌన్లకి - ఖర్చుపెట్టేస్తే మరి ఎలా? మిమ్మల్ని ఆ గోదావరి దాటించింది - నేనేనేమో అనిపిస్తుందిప్పుడు నాకు!


మీకు గుర్తుందా - మనం గణపవరంలో కరణంగారి మేడ  మీద ఒక్క గదిలో వున్నప్పుడు - తెల్లవారు ఝామునే నాలుగింటికి ఏడుస్తూ లేచేదాన్ని. పాపం - అమ్మ - పుట్టినదాదిగా కొబ్బరి చెట్లు, గోదావరి గట్లు, అన్నావదినల, అక్కాచెల్లెళ్ల మధ్య అబ్బరంగా పెరిగొచ్చింది కదా - ఆ గుంటూరు జిల్లాలో ఆ పల్లెటూళ్లో - ఊరి చివరికి వెళ్లి తెచ్చుకుంటేనే కానీ మంచి నీళ్లు దొరకని చోట - అలవాటులేని  పనితో అవస్థ పడుతోందని - ఆవిడని లేపకుండా మీరు లేచి - ఆ నాలుగింటికి అన్నం కలిపి నాకు తినిపించేవారు. 

మీకు ఖాళీ వున్నప్పుడు, సెలవు రోజుల్లో సరదాగా ఆడించేవారు - నాతో ఆడేవారు. ఒకసారి నా ఐదేళ్ళప్పుడు ఆ ఆట శృతి మించి నేను మీతో ఏదో అరువు-దెబ్బలాడి మీరు తెచ్చిన బిస్కెట్ పేకెట్ విసిరేసి - ఈ గౌను కూడా తీసేస్కో - అని అరుస్తూ వుంటే నా వీపు మీద పడ్డ మీ ఐదు వేళ్ల ఎర్రటి అరచెయ్యి ముద్ర - అది అదే మొదలు, అది అదే ఆఖరు - నాకు గుర్తుండి. ఇంకెప్పుడూ అలా చేయకూడదనుకుని మీకు మీరే ఒట్టు పెట్టుకున్నట్టుగా - నేను మీకెంత కోపం తెప్పించే పనులు చేసినా నన్ను పల్లెత్తు మాట అనలేదు ఈ రోజు దాకా!

అవును నాన్నా! మీకు జ్ఞాపకం ఉందా - ఒకసారి మనింటికి మీ ఆఫీసు వాళ్లు ఎవరో మీకోసం వచ్చారు. మీరారోజు ఇంట్లో లేరు. వాళ్లు - చిన్నపిల్లని కదా - నాతో ఒక రెండు పాటలేవో పాడించుకుని (ఆ పాటలు ఇప్పటికీ గుర్తే నాకు - ఒకటి రంగుల రాట్నంలోని -నడిరేయి ఏ ఝాములో స్వామి నిను చేర దిగివచ్చునో, ఇంకోటి భక్త తుకారాం లో - ఘనాఘన సుందరా), నన్నెందుకడిగారో తెలీదు - మీ నాన్నేం చేస్తాడు కంపెనీ లో - అంటే - నాకు నోటికొచ్చిన ఒకే ఒక మాట - అకౌంటెంట్ - అని చెప్తే - వాళ్ళు గట్టిగా నవ్వి - "అదేం కాదు - గుమస్తా "- అని అనేసి వెళ్లిపోయారు. ఆరోజు సాయంత్రం మీకు ఎప్పటిలాగే మీకు చెప్పే నా ఆరోజు-కబుర్లలో మీకది చెప్తే దానికే మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా నాతో సరదా కబుర్లు చెప్తూ ఆడేసుకున్నారు. 

అలాగే ఇంకోసారి - ఆఫీసులో అందరూ వనభోజనాలు plan చేసుకుని - ఒక పెద్ద van మాట్లాడుకుని - పొద్దున్నే నాలుగింటికి లేచి మనమందరం తయారయ్యాక - వచ్చి - బాబీ! అందరం van లో సరిపోము. మీరు రావొద్దు - అని చెప్తే చిన్నపిల్లలం నేను, కుట్టి యేడ్చినది నాకు గుర్తుంది కానీ మీరెప్పుడూ ఏమీ అనలేదు, ఆ తర్వాతెప్పుడూ అది తలుచుకుని మీరు బాధ పడ్డట్టు నాకు గుర్తు కూడా లేదు. అది మీకున్న వరం - నాన్నా! మీరెప్పుడూ మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ల మాటలని గుర్తు పెట్టుకోరు. 

ఆ తర్వాత ఏడాదికి ఆరు నెలలు మిమ్మల్ని చూడడానికే వుండేది కాదు - బొంబాయని,  మైసూరు సీజన్ అని వెళ్లి పోతూ వుండేవారు. ఈలోగా జంగారెడ్డిగూడెం ట్రాన్స్ఫర్ అన్నారు. పెద్దాడ రామచంద్రరావుగారి ఇంటికి ఎదురుగుండా ఉండే తాతగారి ఇంట్లో అద్దెకుండే వాళ్లం. రామచంద్రరావుగారి భార్య సరోజినీదేవిగారు, వాళ్ల అబ్బాయిలు - నవీన్, సుధీర్ - మనకి బోల్డన్ని సీతాఫలాలు ఇచ్చేవారు - వాళ్ల తోటలోవి.

జంగారెడ్డిగూడెంలో వున్నప్పుడు పొద్దున్న మేము లేవకుండా ఆఫీసుకి వెళ్లే మీరు రాత్రి మేము పడుకున్నాక ఇంటికి వచ్చేవారు. నెలకొకసారి తప్పకుండా మమ్మల్ని జీప్ లో ద్వారకాతిరుమలలో వేంకటేశ్వరస్వామి గుడికో, జీలకర్రగూడెంలో వున్న శిధిలమైన కోటలో, ఎర్రకాలవ పక్కన మద్ది ఆంజనేయస్వామినో - చూపించడానికి తీసుకెళ్లేవారు. అలా జీప్ డ్రైవ్ చేస్తున్న మిమ్మల్ని చూసి నాన్నమ్మ ఎంత మురిసిపోయేవారో కదా :) ప్రతీ దసరాకి మీ ఆఫీసులో కార్లు, జీపులు, లారీలు - అన్నిటికీ ఆయుధ పూజ చేయించేవారు మీరు. 

అవును కదూ - జంగారెడ్డిగూడెం వచ్చేటప్పటికే మిమ్మల్ని ఇంతకు ముందు తక్కువచేసిన అందర్నీ దాటివచ్చి ఉద్యోగంలో చాలా మెట్లెక్కేసి వున్నారు - కానీ ఎప్పుడూ కూడా మళ్లీ వెనక్కి చూసుకున్నది లేదు. అప్పటిదాకా నడక మాత్రమే తెలిసిన మీరు నడిచింది లేదు.

తర్వాత మీకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. జగన్నాథపురంలో - గరిమెళ్ల సుబ్బారావు గారి ఇంట్లో ఉండేవాళ్లం. అప్పుడే కదా - స్వప్న థియేటర్ లో - ఏమో పిల్లలకి బాగుండదేమో అని - అమ్మ, మీరు మాత్రం వెళ్లి - శంకరాభరణం చూసి వచ్చి- అయ్యో! ఇంత మంచి సినిమా పిల్లలకు చూపించాల్సిందే అని - అదే రోజు సాయంత్రం మమ్మల్ని తీసుకుని వెళ్లి మళ్లీ మాతో చూశారు. అప్పట్నుంచీ ప్రతి కె. విశ్వనాధ్ సినిమా అందరం కలిసి చూడడం మన family tradition లా మారింది. 

కాకినాడ అయితే ఇంటికి దగ్గరగా ఉంటాము - పిల్లలకి చదువులకి బావుంటుంది అని - అమ్మ, మీరు అనుకునేంతలో - మీకు టంగుటూరు ట్రాన్స్ఫర్. 

ఎక్కడి గోదావరి జిల్లా - ఎక్కడ ప్రకాశం జిల్లా! కానీ ఎలాంటి బెంగా లేకుండా - అమ్మ చెప్పినట్టు "జై-పరమేశ్వరా" అనుకున్నట్టు - టంగుటూరు చేరాము - ముందు కొన్ని రోజులు కొండలరావు గారి ఇంట్లో వుండి , తర్వాత స్కూలుకి దగ్గరగా వుండాలని కొణికి వెంకట శేషయ్య గారి ఇంటికి మారాము. 

టంగుటూరులో వున్న నాలుగేళ్లు - ఆ ఊళ్లో తీసుకెళ్లడానికి పార్క్ కానీ , మాకు వేరే వ్యాపకం కానీ లేవని - ప్రతీ వారం మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లేవారు - పరీక్షల రోజుల్లో కూడా మానకుండా. 

 అసలు నేను పరీక్షలకి ఎప్పుడయినా భయపడుతుంటే - "క్లాస్ లో పాఠం విన్నావు కదా - నీకు బాగానే గుర్తుంటుందిలే - పద - అలా సినిమాకి వెళ్లొస్తే మైండ్ ఫ్రెష్ గా అయ్యి పరీక్ష బా రాస్తావు" అని సినిమాకు తీసుకెళ్లేవారు. నా తెలివితేటల మీద నాకన్నా మీకు నమ్మకం ఎక్కువ. 

 టంగుటూరులో వున్న నాలుగేళ్లలో ఒంగోలు, సింగరాయకొండ, పాలేరు దగ్గర వనభోజనాలు - మీతో సరదా ప్రయాణాలు. సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నెలకొక్కసారైనా తీసుకెళ్లేవారు. వెళ్లినప్పుడల్లా హుండీలో డబ్బులు వెయ్యొద్దు - పూజారిగారు తెచ్చే పళ్లెంలో వేయమనేవారు మీరు. అలా ఎందుకు నాన్నా అనడిగితే హుండీలో వేస్తే ధర్మకర్తలకి వెళ్తాయి, పళ్లెంలో వేస్తే ఆ పేద బ్రాహ్మణులకి కొంచెమన్నా సహాయం చేసినట్టవుతుంది చెప్పేవారు. అది నేనిప్పటికీ అనుసరిస్తూనే వున్నాను. 

టంగుటూరు తర్వాత మీ బదిలీ - మన మజిలీ గుంటూరు. మీరు అంతగా ట్రావెల్ చేసేవారు కాదు. ప్రతీ రోజు సాయంత్రం మాతోపాటు కూర్చుని పాలు-చేలు తో మొదలుపెట్టి తొమ్మిదిన్నరకి వచ్చే ఇంగ్లీష్ న్యూస్ దాకా టీవీ చూస్తూ కబుర్లు చెప్తూ ఉండేవారు. మా ముగ్గురిని - అతివాది, మితవాది, తీవ్రవాది - అని మీరే ముద్దుగా వర్గీకరించేసి - సినిమాలు, రాజకీయాలు మాతో డిస్కస్ చేస్తూ ఉండేవారు. మీకు గుర్తుందో లేదో - ఒకసారి మన ఇంటిపక్క లాయరంకుల్ ఎలా మాట్లాడతారు అని కుట్టి ఇమిటేట్ చేసి చూపిస్తూ ఉంటే - పెద్దవాళ్ల గురించి అలా హేళనగా మాట్లాడకూడదు, పక్కింటి వారి విషయాలు చిన్నపిల్లలు మీరు పట్టించుకోకూడదు - అని కొంచెం గట్టిగానే చెప్పారు. అది నేను మీ దగ్గర నేర్చుకున్న ఇంకో మంచిపాఠం. 

ఏసీ కాలేజ్ లో డిగ్రీ కాగానే తిరుపతి హాస్టల్లో చదువు. ఆ టైం లో నేను తీసుకున్న ప్రతి  నిర్ణయాన్ని - మీరే నా స్నేహితులేమో అన్నట్లు విని - వాటి వల్ల మీరు ఎంత బాధ, టెన్షన్ పడ్డా - అవేమీ నాకు తెలియనీయకుండా -  నన్నూ, నాతో పాటు నామీద నాకు నమ్మకాన్ని పెంచుతూ - నా పిల్లల్ని నేను పెంచితే ఇలాగే పెంచాలి అనిపించేలా - ఎప్పటికప్పుడు నాకు వెన్నుదన్నుగా నిల్చిన మీకు - ఇదిగో ఇప్పటికి ఇలా చెప్పగలుగుతున్నాను. నాకిప్పటికీ గుర్తు - ఆడపిల్లవి నేను చెప్పినట్టు వినాల్సిందే అని అరిస్తే భయపడతాననో - లేకపోతే - నాతో మాట్లాడకుండా మౌనంగా వుండి సాధిస్తే మాట వింటాననో - ఇలా మామూలుగా పెద్దవాళ్లు వాళ్ల పిల్లలు తమ మాట వినేలా చేయాలంటే ఏం చేస్తారో అలాంటివేవీ లేకుండా - మీరు, అమ్మ - నా నిర్ణయాలన్నింటినీ సపోర్ట్ చేశారు కాబట్టే - నేనీరోజు ఇంత కాన్ఫిడెంట్ గా వున్నాను. 

ఇవన్నీ ఒక ఎత్తు - మూడు పదులు నిండకుండానే - అసలే దానికి లెక్కలంటే ఇష్టం లేదు కదా - నూరేళ్లని లెక్క తప్పేసేసుకుని - అదెళ్లిపోతే - దానాయుష్షు కూడా నాకే ఇచ్చి వెళ్లింది - అని దాని పిల్లల కోసం మీరు ఆరోగ్యంగా వుండాలి - అని - మీ ఆహారపు అలవాట్లు ఎంత మార్చుకున్నారో నాకు తెలుసు. దాదాపు పదహారేళ్లుగా "పొద్దున్న ప్రకృతి - రాత్రి వికృతి" అనుకుంటూ ఆరోగ్యం-నా భోగ్యం అన్నట్లుండడం మీకే చెల్లింది సుమా !

ఒక్క మాట నాన్నా! ఇప్పుడు కాదు కానీ - కొంచెం  చిన్నప్పుడు - మీరు-అమ్మ మీ పిల్లలమయిన మాకోసమైనా కొంచెం స్వార్థంగా వుంటే - బాగుండును అనుకున్న రోజులు వున్నాయి కానీ - అది మీకు నప్పదు అని నాకెప్పుడూ తెలుసు. అందుకే ఎప్పటిలాగే - అందరి గురించి ఆలోచిస్తూ - మీరు మీదైన పద్ధతిలో మీకు నచ్చిన విధంగా తీసుకునే నిర్ణయం ఏదయినా నాకు సమ్మతమే!  

అయిన వారి దగ్గర, కావాలనుకున్నచోట - దూషణ భూషణ అంగీకార తిరస్కారాలని ఒకేలా తీసుకోవడం మిమ్మల్నే చూసి నేర్చుకున్నాను. మనం చేసేది అందరికీ నచ్చాలని లేదు - అందరూ మనకి నచ్చినవే చేయాలనుకోకూడదు - అలాగని ఎవ్వరినీ వదులుకోకూడదు -  ఇదీ నేను మీ దగ్గర నేర్చుకున్న గొప్ప జీవిత పాఠం.

మామూలుగా మన ఇండియాలో -  నాన్నా! - ఎవరినైనా విమర్శించాలంటే పదిమంది మందిలో వున్నా ఆలోచించకుండా మాటనేస్తారు - అదే పదిమందిలో మంచి మాట చెప్పాలంటే మనసొప్పదు - మొహమాటపడతారు. కానీ నేనలా మొహమాటపడి - ఇలా రాయలేకపోతే - మీరు నా చేత దిద్దించిన అక్షరాలకు, నాకు చెప్పించిన చదువుకి సార్ధకత ఉండదేమో అనిపించింది.

ఎన్నో విషయాల్లో నా గురువు మీరు - నేను పడిపోతే మీరొచ్చి లేపకుండా - అలాగే "పడ్డ చోటు నిన్ను పడేసింది - హన్నా - కొట్టేద్దామా" అని ఇంకెవరిమీదో తప్పు నెట్టేయడం నాకు నేర్పకుండా - నా అంతట నేను లేవడం ఎలాగో నేర్పారు. ఇంతకన్నా గొప్ప పాఠం ఎవరు నేర్పుతారు కదా?!

నిన్న పొద్దున్న మీతో నా ఫన్-భాషణ గుర్తు చేస్తే ఇంకొక్కసారి నవ్వుకుంటారని... 

ట్రింగ్ ... ట్రింగ్ ... 
"ఆ... చెప్పు లల్లీ !"

"హలో నాన్నా - బావున్నారా?"

"ఓ  - బ్రహ్మాండం గా వున్నాను. ఆఫీసులొ వున్నానిప్పుడు"

"ఇప్పుడాఫీసేంటి నాన్నా - రాత్రి ఎనిమిదవుతుంటే?"

"ఇంక్రిమెంట్లు ఇచ్చారు - ఏదో చిన్న పార్టీ"

"ఓ - బావుంది బావుంది"

"నీకో విషయం చెప్పాలాగు మరి ! ఇప్పుడు మోడీ-హడావిడి కదా దేశమంతా ?! నాకు ఫోన్లు వస్తున్నాయి - కామేశ్వరరావు గారు - కోట్లు కొన్ని మేనేజ్ చేయాలండీ- 10% ఇస్తాము ఏదయినా మార్గం చూపించండి అని. వాళ్లకి చెప్తున్నాను - 10 కాదు 50 ఇస్తానంటే మీ కోట్లని మేనేజ్ చెయ్యొచ్చు. నేను మనుషులని తెస్తాను, నా రిస్క్ మీద అకౌంట్లు ఓపెన్ చేయిస్తాను - తలకు రెండు లక్షల చొప్పున మీ డబ్బంతా వాళ్ళ పేర్న  బ్యాంకులో వేయిస్తాను- వారం తర్వాత ఒక లక్ష మీకు - ఒక లక్ష వాళ్లకి. మీ పేరు చెప్పుకుని కుటుంబాలు బతుకుతాయి." అని చెప్పాను"

"మీరేంటి - సలహాలరావు మీ కొత్త అవతారమా ? మీకెందుకొచ్చిన గొడవ నాన్నా?"

"బావుంది - ఇప్పుడిస్తే ఆ పేదవాళ్లు - పాపం - నూరేళ్లు జీవించమని దీవిస్తారు - లేకపోతే - ఆ నోట్లన్నీ చలిమంట వేసుకోవాలి అంతే!"

"సరే లెండి! మీరింక తొందరగా ఇంటికి వెళ్లండి - ఎవరైనా వున్నారా - మీరే డ్రైవింగా?"

"నేనే! నాకేం భయం - పోలీసు ఎందుకయినా ఆపినా - నాజేబులో ఐదువందల రూపాయల నోట్లు వున్నాయి - ఇస్తాను  - వద్దు, వందివ్వండి - అంటాడు - లేదంటాను - వదిలేస్తాడు" అంటూ నవ్వు 

"బానే వుంది మీ సరదా - జాగ్రత్త మరి"

"ఇంకోటి విను - జేబులో 70 వేలు వేసుకొచ్చాను - పొద్దుటినించీ బాకీలు తీరుద్దామని. ఎవరికి 500 నోటు ఇచ్చినా - ఇప్పుడొద్దు సార్ - మార్చిలో ఇవ్వండి పర్వాలేదు అని పారిపోతున్నారు. హహహ!"

నవ్వులతో ముగిసిన మన ఫోన్ కాల్ తల్చుకుని ఇప్పటికీ నవ్వుకుంటున్నాను - ఆ నవ్వుతోనే, నవ్వుతూనే - కొన్ని నవ్వులతో నింపి పంపుతున్నాను -  మీ పుట్టినరోజు కానుకగా - ఈ బ్లాగ్ పోస్ట్! చదివేసుకోండి మరి!




9, నవంబర్ 2016, బుధవారం

చిదానందరూపః శివోహం శివోహం (నిర్వాణ షట్కమ్)

నాకు వున్న ఒక ఇష్టమయిన వ్యాపకమో, కాలక్షేపమో -పేరేదైనా కానీ - ఏంటంటే -నాకిప్పటివరకూ నోటికి రాని అష్టకాలూ, స్తోత్రాలూ నేర్చుకోవడం. వాటిని నాకు తెలిసిన కొంచెం సంస్కృత భాషాపరిజ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం.

అలా - రెండేళ్ల క్రితం- అనుకోకుండా ఈ శివ నిర్వాణ షట్కమ్ విన్నాను -( యూట్యూబ్ లింక్ ఇక్కడ ). షట్కమ్ అంటే ఆరు చరణాలు వున్న స్తోత్రం. దీనికి ఆత్మషట్కమ్ అనే పేరు కూడా వుంది.

నిర్వాణం అంటే నాకు అర్థమయినది ఏంటంటే "నేను" అనే ఉనికికి అంతిమంగా దొరికే స్వేచ్ఛ. అటు తర్వాత ఆ ఉనికి కోల్పోయాక ఏమీ ఉండని "నేను" ని వర్ణించేదే ఈ నిర్వాణ షట్కమ్.

 ఈ నిర్వాణ షట్కానికి చాలా పాఠాంతరాలు వున్నాయి - నాకు నచ్చినది మాత్రం ఈ క్రిందది. ప్రతీ చరణం కిందా వున్నది - తెలుగులో నాకు తోచిన అర్థం.



                                                                              1
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నేను మనస్సు కాదు - నేను బుద్ధి కాదు - నేను జ్ఞానం కాదు - నేను అహంకారం కాదు
నేను - చెవి, నాలుక, ముక్కు, కన్ను - ఇందులో ఏ ఇంద్రియమూ కాదు
నేను - ఆకాశం, భూమి, అగ్ని, వాయవు - ఏదీ కాదు
నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


                                                                                 2
న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుః న వా పంచకోశః
న వాక్పాణిపాదం న చోపస్థపాయుః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం
 
 


నేను - ప్రాణానికి ఉనికి కాదు - ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన మొదలైన పంచ వాయువులు కాదు
నేను - రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర - మొదలైన సప్తధాతువులు కాదు; నేను - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాది పంచకోశాలు కాదు
నేను - మాట, చేయి, పాదం, విసర్జకావయవాలు - ఏదీ కాదు
నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


                                                                                  3
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నాకు - ద్వేషం, అనురాగం, లోభం, మోహం - ఏదీ లేదు
నాకు - మదం (గర్వం), అసూయ - లేవు
నాకు - ధర్మార్థ కామ మోక్షాలు - ఏవీ లేవు
నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


                                                                                4
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నాకు - పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం - ఏవీ లేవు
నాకు - మంత్రం, పుణ్యతీర్థం, వేదం, యజ్ఞం - ఏవీ లేవు - దేనికీ నేను బద్ధుడిని కాదు
నాకు అనుభవం లేదు - నేను అనుభవించబడునది కాదు - నేను అనుభవించువాడను కాదు
నేను ఆనందరూప చిత్తమయిన శివుణ్ణి


                                                                               5
న మే మృత్యుశంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యం
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నాకు - మరణమంటే భయం లేదు - జాతి భేదం లేదు
నాకు - తండ్రి లేడు - తల్లి లేదు - జన్మ లేదు
నేను - బంధువులు కాను - స్నేహితుడిని కాను - గురువును కాను - శిష్యుడిని కాను
నేను - ఆనందరూప చిత్తమయిన - శివుణ్ణి


                                                                               6
అహం నిర్వికల్పో నిరాకార రూపః
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం
సదామే సమత్వం న ముక్తిర్న బంధః
చిదానందరూపః శివోహం శివోహం
చిదానందరూపః శివోహం శివోహం


నాకు - మార్పు లేదు - ఆకారం లేదు
నేను - అన్ని ప్రదేశాలలో - అన్ని ఇంద్రియాలలో - వ్యాపించి వున్నాను
నాకు - అన్నిటా సమదృష్టి ; నాకు - బంధము లేదు - నాకు విముక్తి లేదు
నేను ఆనందరూప చిత్తమయిన శివుణ్ణి


5, నవంబర్ 2016, శనివారం

నా సంగీత పరస్థానం - పల్లవి

(ఈ పోస్ట్ శీర్షిక పరస్థానమే
 ప్రస్థానం కాదు ...
 ఇదింకా పల్లవి మాత్రమే
శీర్షిక  వెనక అర్థానర్థాలు, నానార్ధాలు, విపరీతార్థాలు
ఇప్పటికి అనిపించినా - గందరగోళం...
అనుపల్లవి, చరణం తర్వాత
అగును తేటతెల్లం)

నేను పుట్టిన ఏడాదిన్నర - రెండేళ్లకి పాడడం మొదలు పెట్టానని చిన్నప్పట్నుంచీ నన్ను పెంచినవారూ, భరించినవారూ- అందరూ చెప్తూ వుంటారు.

అప్పటెప్పటి నా పాటేదో అంతగా గుర్తు వుంది మా ఇంట్లో అందరికీ అంటే అది ఎంత గాఢమైన-బాధాకర-పాటానుభవమో అనిపిస్తూ ఉంటుంది నాకు :)

"ఎవలి కోసం  - ఎవలికోసం " తో  మొదలుపెట్టి "గాంధి పుట్టిన దేశమా ఇది -నెగ్రు కోరిన సంఘమా" అని "దేవకి  వంట - వసుదేవు వెంట" అంటూ మెలకువగా వున్న ప్రతి నిముషం-గంట పాడుతూనే వుండే "పాడు" దాన్నిట నేను.

అలా పాడుకుంటూ, పాడుకుంటూ - బడికి వెళ్లేంత దాన్ని అయ్యానా  - మా అమ్మా-నాన్న నన్ను గణపవరం తీసుకెళ్లి అక్కడ బడిలో చేర్పించి - నా పాటల పాట్ల నుంచి తాత్కాలిక విముక్తి పొందారు.

ఇంతలో ఒక రోజు తుఫానొచ్చింది. బోల్డంత మబ్బు పట్టి - అంత కన్నా బోల్డంత వాన పడింది.

పొద్దున్నే లేచి నల్లని మబ్బుల ముసురు చూడగానే నెమలికైనా అంత ఆనందంగా అనిపిస్తుందో లేదో తెలీదు కానీ - నాకు మాత్రం బోల్డంత సంతోషం - బడి లోపల వాన కురిసి సెలవు వస్తుందని.

మా బడిలో మాస్టర్లు కురిపించింది సర్వకాల-వాత్సల్యపూరిత విద్యావర్షమైతె - మా బడి తరఫునుంచి దొరికేది వానాకాల -సెలవుల వర్షం.

తానెప్పుడైనా వెళ్లిందో లేదో ఆ నల్లమబ్బు - ఇక్కడ బడి వుంది కదా - చూసొద్దామని వచ్చి - మా బడి జరిగే పెంకుటింటి కప్పుకున్న చిన్న చిన్న చిల్లుల్లోంచి తొంగిచూసి - ఆ సంబరంలో కరిగి కురిసేదేమో - భలే భలే తడిపేసేది. ఇంకంతే మాకో సెలవు వచ్చేసేది.

బడి లేదు - మరి నాకు తోచదు కదా!

గణపవరం కరణం గారు - అనుమంచి లక్ష్మీనారాయణ గారి ఇంట్లో - మేడ పైన అద్దెకి వున్న మా ఏకాంకణ సౌధంలో - మా అమ్మ వెనకాలే  తిరుగుతూ ఆవిణ్ణి ప్రశాంతంగా పనిచేసుకోనీకుండా కబుర్లేవో చెప్తూ, పాటలు పాడుతూనే  వున్నాను.

ఇంతలో బయట పెద్దగా గాలి - ఆకాశం మరీ నల్లగా అయిపోయింది. అప్పటికే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కడుగుదామని అమ్మ బయట తూము దగ్గర పెట్టిన కంచాలు, గిన్నెలు - అదేదో విఠలాచార్య సినిమాలో - నడచి వెళ్లే గిన్నెల్లా - మా మేడ మెట్ల మీంచి దొర్లుకుంటూ కిందకి వెళ్లిపోవడం మొదలు పెట్టాయి.  వాటి వెనకాలే నేనూ, నా వెనకాలే గునగునా నడుచుకుంటూ కుట్టి - మెట్ల మీద నుంచి దిగుతూ వుంటే - అమ్మ కూడా మా వెనకాలే దిగి - అందరం కలిసి - కింద పెద్ద వాటాలో వున్న కరణం గారి ఇంట్లోకి వెళ్లాము.

అప్పటికే చీకటిగా అయిపోయింది - బయట ఎలెక్ట్రిక్ వైర్లు తెగిపోయి కరెంట్ పోయింది. కరణం గారి భార్య - సార్థక నామధేయులు అయిన - అన్నపూర్ణమ్మగారు మా ముగ్గుర్నీ చూడగానే - "రండి పాపగారూ - ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాము - మిమ్మల్ని పిల్లల్ని తీసుకుని కిందకి రమ్మని చెప్పమని మా చంద్రుడిని పంపిద్దామని అనుకుంటున్నాను - మీరే వచ్చి మంచి పని చేశారు. బాబీ గారు ఆఫీసు నుంచి రాగానే పైకి వెళ్లకుండా ఇటే  రమ్మని చెబుదాంలెండి" అంటూ మాక్కూడా సాయంత్ర్రానికి ఆ చీకట్లోనే వంట ఏర్పాట్లు మొదలు పెట్టారు. అమ్మ కూడా ఆవిడకి సాయం చేస్తోంది.

అప్పటికే కరణం గారి పిల్లలు అందరూ హాలులో ఒక పెట్రోమాక్స్ లైట్ పెట్టుకుని దానిచుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వున్నారు. ఆ రాత్రికి  భోజనాలు చేసి - అలా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రపోయామో తెలీలేదు.

పొద్దున్న లేచి చూస్తే ఇంటి ముందు వున్న బాదం చెట్టు కింద బోల్డన్ని బాదం కాయలు - వాటిని చూడగానే - నేనూ, కుట్టి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లాము - ఏరుకుని తెచ్చుకుందామని. అలా ఒకటి రెండు సార్లు వెళ్లామో లేదో మూడోసారి జారి  పడి  బట్టలు తడిపేసుకున్నాము.

మమ్మల్ని ఎలాగైనా కుదురుగా కూర్చోబెట్టాలని అనుకుని - కరణంగారి రెండో అమ్మాయి రాజ్యం - "లల్లీ! నీకు పాటలు ఇష్టం కదా - దా పాటలు పాడుకుందాం" అని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అన్న పాట నేర్పింది. ఇంకంతే - ఆ తర్వాత - తుఫాను వర్షం కారణంగా వాళ్లింట్లోనే మేముండాల్సి వచ్చిన మూడు రోజులూ - పాటల సందడే.

అప్పుడు నేర్చుకున్నదే ఇంకో పాట ఈ దేశం మా దేశం - భారత దేశం మా దేశం - కాకపొతే ఆ పాట ఇప్పుడు గుర్తూ లేదు - మళ్లీ ఎక్కడా దొరకనే లేదు.

సరే - అలా మొదలైన నా పాటల ప్రయాణం - తరవాత  గణపవరం మహిళామండలిలో తులశమ్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఒకానొక వార్షికోత్సవంలో నేను అక్కడ వున్న మా అమ్మ, ఇంకా పెద్ద వాళ్ళతో పోటీ పడి - వేయి వేణువులు మ్రోగేవేళ - అంటూ మొదలుపెట్టి పాడిన - నను పాలింపగా నడచీ వచ్చితివా - అన్న పాటకు మొదటి బహుమతి రావడంతో ఒక చిన్న సైజు (literally & figuratively) celebrity నయిపోయాను.

ఇంక -  శ్రావణమాసం పేరంటాలు, సంక్రాంతి భోగి పళ్లు, బొమ్మల కొలువులు -ఒకటేమిటి - ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు , ఎవరు అడిగితే వాళ్లకి - అడగని వాళ్లది "పుణ్యం" అన్నట్లు పాడి పాడి - దినదిన-పాటానర్థం  అవుతున్న నన్ను చూసి - ఈ శిక్ష నుంచి ఎలాగూ విడుదల వుండదు - కనీసం శిక్షణ ఇప్పిస్తే ఏమన్నా నా "పాడు"ట "బాగు" పడుతుందేమో - ఆయనకి కలిగే హృదయావేదన తొలగకపోయినా కొంచెమయినా తగ్గుతుందన్న ఆశతో - సంగీత ప్రియులయిన కరణం గారు - ఒక సంగీతం మాష్టార్ని నాకు, కుట్టికి, సెలవులకి వచ్సిన వాళ్ల మనవరాలు మృణాళినికి - సంగీతం నేర్పించడానికి మాట్లాడారు.

మా అమ్మ మంచి రోజు చూసి - స్వయం పాకం, ఒక పంచెల చాపు, తాంబూలం - సంగీతం మాష్టారికి మా చేత ఇప్పించి - సంగీతం పాఠాలు మొదలు పెట్టించింది. సంగీతం మాష్టారు - ఆయన హార్మణీ పెట్టె పట్టుకుని మహా ఉత్సాహంగా వచ్చారు.

మొదటి రోజు సా-పా-సా పాడించి మొదటి సరళీస్వరం నేర్పేదాకా మా పక్కనే మురిపెంగా చూస్తూ కూర్చున్న ఆవిడ - రెండో రోజు నుంచీ ముందు కటకటాల్లో చాప వేసి - మమ్మల్నిద్దరినీ మాష్టారి ముందు కూర్చోపెట్టి - లోపలి వెళ్లి పోయి తలుపు వేసేసుకునేది - ఎంతయినా నాకు అమ్మ కదా - నా తెలివితేటలే వచ్చాయి ఆవిడకి :)) మా పాఠం అయ్యేవరకూ తలుపు తీసేది కాదు.

అలా ఒక పదిహేను రోజులు జరిగాయి.

 స్వర స్థానాలు కాదు కదా - మా స్థానాల గురించి కూడా పట్టించుకోకుండా - కుదురు లేకుండా - మాకెదురు లేదన్నట్టు ఆడుతూ పాడుతున్న - మా సోదరీ ద్వయాన్ని చూసి మా మాష్టారికి సహనం కొండెక్కింది.

అమ్మని ఒక రోజు పిలిచి - "అమ్మా! మీ పిల్లలు లక్షణంగా పాడుతున్నారు - ఇంక శృతిబాక్సు కొనాల్సిందే" అన్నారు.

 (ఏంటీ! ఇంతోటి - ఐదో సరళీ స్వరానికే - అని పైకి అనకపోయినా - మా అమ్మ ఆశ్చర్యం)

మా అమ్మ కేసి చూడకుండా ఎటో చూస్తూ - "మీరు శృతిబాక్సు కొన్నాక కబురు పెట్టండి - అప్పుడొచ్చి కొత్త పాఠం చెప్తాను" అనేసి మా సంగీతం మాష్టారు వెళ్లడం వెళ్లడం - ఇంకా మళ్లీ మా ఇంటి వైపు రాలేదు.

మా అమ్మ కరణం గారి చేత చెప్పించినా కూడా  రాలేదాయన.

సర్లే - ఆయన కొనమన్న శృతితిబాక్సు కొందామని వాకబు చేస్తే అది ఆ రోజుల్లో మద్రాసులోనే దొరుకుతుందని తెలిసింది.

అప్పటికి అర్థమయింది మా అమ్మకి - అది మా సంగీతం మాష్టారు - ఆయన హార్మణీ పెట్టె విరక్కుండా - మా పాట సాగకుండా - ఉండడానికి వేసిన "దాటు" స్వరం అది అని.

అలా మా సంగీత పాఠాలకి ఆదిలోనే హంసపాదు - ఎక్కడ హంసధ్వని హింసధ్వని అవుతుందో అని ఆ వాతాపి గణపతే అనుకుని ఆపినట్టు.

<ఇక్కడితో లలిత-సంగీతం అయిపోలేదు -  అనుపల్లవి, చరణం  - త్వరలోనే వినిపి(చదివి)స్తాను>