29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ప్రవాస జీవనపు వంటింటి-కల్పభూజం

ఆ రోజులు - అల్లప్పటి రోజులు - అవెలాంటి రోజులంటే...
చెట్టుమీద మామిడి కాయ సరాసరి పప్పులోకి డుబుక్కుమని దూకే రోజులు
తీగమీంచే బుల్లి బుల్లి  కాకరకాయలు పచ్చలు పొదిగినట్లు హెచ్చులు పోయే రోజులు
నవనవలాడే వంకాయలు ఏ నవకాయపిండివంటలూ మా సాటి కావని కొమ్మ చిటారున చులాగ్గా మిలమిలలాడే రోజులు
పుష్యరాగం వంటి లేత అరటి దూట నున్నగా, వైఢూర్యాల దొంగాళ్ళు-పిల్లేళ్ళు ఊదారంగు దొప్పల్లో పొదువుకున్న అరటిపువ్వు మిన్నగా వంటింట కళకళలాడే రోజులు
తల్లి-పీచుపీచు, పిల్లలు-రత్నమాణిక్యాలు లేని -  తండ్రి-గరగరల కూర-పనసకాయ విరవిరలాడే రోజులు
తోటకూర మడిలోనే ఓ పక్కగా చిట్టిచిట్టి తలలూచుతూ వుండే కొత్తిమీరని ముక్కులతోనే వెతికే పట్టేసే రోజులు

తోటలో వనలక్ష్మిలా తిరుగుతూ మా చెల్లాయత్త - ఈ పూటకి ఏం వండుకుందామర్రా? - అని కూడా వున్న పిల్లసైన్యాన్ని అడుగుతూ - ఆ పూటకి కావల్సిన కూరలన్నీఒడినింపుకుని వంటింటి అరుగు మీద - పప్పులోకి ఇది, కారం పెట్టిన కూరకైతే అది, దీంతో పచ్చడి చేసుకుందామే- అంటూ శాకాలన్నిటినీ పంపకాలు చేసి - చివరాఖరుకి - మన చంద్రావతి ఇంటికి వెళ్ళి రావాలర్రా మీరు - అంటే ఎందుకబ్బా అంటే - మా ఇంటి పెరట్లో లేని రెండు చెట్ల ఆకులకి - దబ్బాకులకి, కరివేపాకు రెబ్బలకి.

ఏ వేళలో చంద్రావతి ఇంటికి వెళ్ళినా మేడమెట్లెక్కి పైకెళ్ళి ఆ మేడమీద ఎప్పుడూ తాళమేసి ఉండే బొమ్మలగది దర్శనం మాకొక అదనపు లాభం. అందుకని చంద్రావతి ఇంటికి వెళ్ళడానికి మేమెప్పుడూ సిద్ధమే. ఎక్కడికెళ్ళడానికి కాదూ - అని దీర్ఘం తీసి అడిగితే - ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పాలి మరి! ఆడే కాలు - పాడే నోరు బహు చురుగ్గా వుండే ఆటపాటల రోజులవి.

ఈవలనున్న అమ్మమ్మ ఇంటినుంచి రోడ్డుకావల వున్న చంద్రావతి గారింటికి - కాలు మార్చి కాలు మీద కుంటుకుంటూ, గెంతుకుంటూ వెళ్ళి - పెద్దపెద్ద స్తంభాల అరుగుల మధ్యనున్న బోల్డన్ని మెట్లెక్కి -మహా బరువుగా వుండే సింహద్వారపు తలుపొకటి తెరిచి లోపలికెళ్తే - తన ఇద్దరు కూతుళ్ళు - మిస్సమ్మ, బేబీతో కలిసి నవ్వుతూ మమ్మల్ని - రండమ్మా రండి ఎప్పుడొచ్చారూ, సెలవులా , ఉంటారా ఓ పద్రోజులూ? - అని పరామర్శిస్తూనే - ప్రసాదుగారి మేనకోడళ్ళొచ్చారు- అని - దబ్బాకులూ, కరివేపాకేనా? - అని అంటూనే పెరట్లో పక్కపక్కనే వున్నదబ్బ, కరివేప చెట్లనుంచి ఆకులు, రెబ్బలు దూసి ఇచ్చేవారు.

ఈలోగా మేమొకసారి మేడమీదకి మిస్సమ్మతోనో, బేబీతోనో ఒక్కసారి వెళ్ళి - అక్కడ ఓరగా తెరిచివున్న కిటికీలోంచి - లోపల అలమారుల్లో, నేలమీద  - పరుచుకుని వున్న బోల్డన్ని మట్టిబొమ్మలు, చెక్కబొమ్మలు, చందనపుబొమ్మలు, నాలుగ్గిన్నెల ప్లాస్టిక్ టిఫిన్ క్యారియర్లు, ఇత్తడి డేగిసాలు, లక్కపిడతలు - ఓహ్ ! ఒకటి కాదు రెండు కాదు - కనుచూపు సోకినంత మేరా - ఎటు చూసినా బొమ్మలే.

కళ్ళనిండా ఆ బొమ్మలు నింపుకుని - ఘుమఘుమలాడే దబ్బాకులు, కరివేపాకు పట్టుకుని మళ్ళీ గెంతుకుంటూ ఇంటికి వచ్చేసేవారం.

మా లక్ష్మిదొడ్డ  కవ్వంతో చిలికిన వెన్నమజ్జిగలో, తరవాణి కుండలో దబ్బాకులు పోచి చల్ల-అమృతం తయారు చేస్తే,  ఉడికించిన కందిపప్పు, పోపు రుబ్బి అరటికాయ, ఆనపకాయ వేసి - కళపెళలాడే  సాంబారులో, కొబ్బరి తియ్య పచ్చడిలో కరివేపాకు దూసి వేసి మా చెల్లాయత్త తనవంతు పుల్ల-అమృతం వండే వారు.

అద్దీ - తెలిసీ తెలియని వయసులో అలా మొదలైన కరివేప సావాసం - తరవాత్తర్వాత మా అమ్మ నాకోసమని - నాకిష్టమని ఇష్టంగా వండే వంటల్లో కరివేపాకు మెరుస్తూ, ముక్కుని మురిపిస్తూ ఉండేది.

అప్పటి రోజుల్లో - ఏ రోజు కూరలు ఆ రోజు తాజాగా కొనుక్కునే రోజుల్లో - చిన్నప్పుడు గిద్ద బియ్యానికి గుప్పెడు కరివేపాకు  అంటూ కూరలు తెచ్చే సుబ్బమ్మ బేరాలతో తెల్లారేది. వస్తుమార్పిడి గురించి అదొక దృష్టాంత సహిత ప్రయోగాత్మక పాఠం.

ఆ తర్వాత కొంచెం హెడ్డు పైకొచ్చి హైస్కూల్ రోజుల్లో సెలవులకి హైద్రాబాదు వెళ్ళినప్పుడు - అమెరికా వెళ్తున్నామని ఎవరైనా చెప్పినా,  ఇంకెవరో వెళ్తున్నారని తెలిసినా - వెంటనే పురుషోత్తం బాబయ్య - "అమెరికాలో కరివేపాకు దొరకదు , తప్పకుండా పట్టికెళ్ళండి" - అని మరీ మరీ చెప్తుంటే - ఆయన మాటలకి అందరితో పాటు నేనూ సరదాగా నవ్వేసేదాన్ని.

ఆడుతూ పాడుతూ పెద్దయ్యి - పెళ్ళయ్యి - వంటింటి-రాజ్యానికి ఏకచత్రాధిపతి నమూనాలో అనేక-పాత్రాధిపత్నిని అయ్యాక నా వంటల్లో కరివేపాకు ధారాళముగా - కరివేప ఆకుంది కొమ్మాలేకుండా పులిహోర సాంబారు ఘుమఘుమలాడాయి - అని దేవులపల్లి వారి గోరింటాకు-పాట వరసలో  పాడేసుకుంటూ దూసేసి వాడేసేదాన్ని.

అప్పటివరకూ కథలో పెద్ద మలుపులేవీ లేవు - కలుపుకున్న అన్నంలో కందని వేళ్ళకందిన ఆకుని కూరలో కరివేపాకులా - టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌లా - తీసిపారేయడమే.

అలా అలా - కాలం జరిగి మేము గాల్లో ఎగిరి - ప్రవాసం వచ్చామా - అప్పుడు మొదలయిందిక ఒక మెలిక.

ఈ నేల బట్టో , నేలలో వేసిన విత్తు బట్టో, రకరకాల దేశాల వెరైటీ వెరైటీ వంగడాల వల్లో  - ఏ శాకమూ అంత రుచిగా అనిపించేది కాదు. ఉన్నంతలో కరివేపాకు వేసిన వంటలు కొంచెం తినబుల్‌గా ఉండేవి.

అప్పుడర్థమయ్యింది - పురుషోత్తం బాబయ్య చేసిన కరివేప-ఆవశ్యక-ఉపదేశం.

వలసపక్షులమై ఎగిరొచ్చిన తొలినాళ్ళలో - మేమున్న చోట ఇండియన్‌స్టోర్లు అంతగా ఉండేవి కాదు. ఉన్న ఒకటీ రెండు కొట్లలో వడిలిపోయిన వంకాయలు, ఎండిపోయిన కరివేపాకు, పండిపోయిన కొత్తిమీర, సెల్-బై-డేట్ దాటి పుష్కరమైన గ్లూకోన్-డీ ప్యాకెట్లు ఉండేవి.

అందుకని కొంచెం దూరమైనా చైనావాళ్ళో - వాళ్ళలా వుండే మరేవాళ్ళో - నడిపే గ్లోబల్ ఫుడ్స్ అనే నానాదేశ-సరుకులు, కూరలు దొరికే అంగడికి వెళ్ళేవాళ్ళం.

అక్కడ ఆకుపచ్చ ఫోమ్-ట్రేలలో అందంగా  పేర్చి అమర్చిన కూరలు, ఆకుకూరలతో పాటు - ఒక పక్కగా - పదంటే పది రెబ్బలకి ఒక్కింటికీ పదేసి చొప్పున ఆకులతో అక్షరాలా-అంకెలారా వందంటే వంద ఆకుల కరివేపాకు పాకెట్టు ముత్యం-మూడ్డాలర్లకి కొనుక్కుని నలక్కుండా భద్రంగా ఇంటికి తెచ్చుకునేదాన్ని.

ఆ వందాకుల-కరివేపాకు - రెండు వారాల - అంటే పధ్నాలుగు రోజుల - అందులో కొన్ని పొద్దున్న ఫలహార వేళల  మినహాయించి - దాదాపు ముప్పైరెండు పూటల వంటకి - అనగనగా పూట వంటకి సరిగ్గా మూడాకుల లెక్కతో - వాడాలి అన్నది ఖచ్చితమైన ప్రణాళిక.

ఎప్పుడైనా పొరపాటున ముందుగా అయిపోతే మళ్ళీ కరివేపాకు తెచ్చుకునేదాకా వండిన ప్రతి  పదార్థమూ ప్రతిపదార్థాలు అర్థం కాని పద్యంలా, అసలు అర్థమే లేని శబ్దంలా - అనుకున్న రుచిలో కాకుండా ఇంకేదో రుచిలో ఏదేదోలా అనిపించేది.

మమ్మల్ని చూద్దామని, మాతో ఉందామని, మా పిల్లల ఆటపాటల్ని కనులారా కానీ, చెవులారా విని ఆనందిద్దామని అమెరికా వచ్చి - "చేసినన్నాళ్ళు చేశారు - మీరు హాయిగా కూర్చుని నేను వండింది తినండి" - అంటున్నా వినకుండా - మాకేదో వండి పెట్టేద్దామనుకుని హడావిడి పడుతూ మా అమ్మో, అత్తగారో - ఫ్రిజ్ తెరవగానే - వాళ్ళు ఏ కూర తీసినా అంతగా పట్టించుకోని నేను - కరివేపాకు దగ్గరకొచ్చేటప్పటికి - అసలు ఆ ట్రే మీద అతికించిన ప్లాస్టిక్ wrap ఎంత జాగ్రత్తగా తీయాలీ  - అందులోంచి రెండంటే రెండో, మరీ అంతగా కావాలనుకుంటే మూడో ఆకులు సున్నితంగా ఎలా ఈనె నుంచి వేరు చేయాలో - చెప్తూ అదేదో కరుణశ్రీ వారి పుష్పవిలాపం శైలిలో

నేనొక ప్లాస్టిక్కు ట్రేని తెరిచి - సుతారపు ఈనె వంచి 
గోరానిచి  మెల్లిగాను - ఆకునొక్కటి తుంచినాను

అన్నట్టు- కరివేప-పత్ర-పర్వరీణ-విమోచనా-విలాసము చూపుతుంటే మా అమ్మ తన పక్కనున్న మా అత్తగారితో అననే అంది - "మా లల్లి కరివేపాకు ఇచ్చే వరస చూస్తుంటే అదేదో సినిమాలో అల్లురామలింగయ్య - పూట వంటకి సామాన్లు కొలిచిస్తాడూ వాళ్ళావిడకి - అది గుర్తొస్తోందీ" - అంటూ.

ఇంక బదరి అయితే - "మా ఇంట్లో బంగారమైనా డ్రెస్సర్ మీదో, టేబుల్ మీదో - ఎక్కడపడితే అక్కడ వదిలేస్తాం కానీ కరివేపాకు మాత్రం భద్రంగా చలి తగిలి కమిలిపోకుండా బోల్డన్ని ప్లాస్టిక్కు పొరల్లో భద్రంగా దాచిపెడతాము" - అంటూ ఎంతో ముచ్చటగా నా కరివేపాకు-సంరక్షణ ముచ్చట చెప్తూ వుంటారు.

ఒకసారి ఇలాగే మూడేళ్ళ క్రితం దసరా-బొమ్మలకొలువు పేరంటానికి పిలిచారని మా ఇంటి దగ్గర వుండే ఒక తమిళవీట్టుకెళితే వాళ్ళింట్లో కొలువై వున్న కరివేప్పిలై మరం చూసి మరం-మరం- రొంబ మనోహరం అనేసుకుని - "కరివేప్పిలై ఎనక్కు పిడికుదు - నీంగ ఎనక్కు కొడుక్కిరాంగ? "- అని వచ్చీరాని అరవంలో అరవకుండా అడిగితే - ఆ వీడావిడ ఆవిడ మాట్లాడే అసలరవంలో మాట్లాడితే నాకేమీ అర్థం కాదని గ్రహించినదై - తమిళింగ్లీషులో ఏమందంటే - "రేపో కుండీలో మట్టి పోసుకుని తే - నేను మొక్క పెట్టి ఇస్తాను - చేతికి ఇవ్వను - జాగ్రత్తగా వేళ్ళు నలక్కుండా వేస్తేనే బతుకుతుంది" - అని చెప్తే భయభక్తులతో కళ్ళు విప్పుకుని చెవులప్పగించి విని తల గట్టిగా ఊపి - రెండోరోజు ఆవిడ చెప్పినట్టే కుండీలో మట్టి పోసుకెళ్ళి కరివేప-మరపు-సిరిని మా ఇంటికి తెచ్చుకున్నాను. ఇస్తూ ఇస్తూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఆవిడ అననే అంది - "నువ్వేదో అరవంలో అడిగావని ముచ్చటపడి ఇస్తున్నాను కానీ తల్లి మొక్కని వీడి ఈ పిల్ల మొక్కలు బతుకుతాయో లేదో - Kariveppilai is very sensitve you know"- అంటూ.

నా అతి జాగ్రత్త ఎక్కువయ్యో, లేక అరవావిడ వాక్కు ఫలించో - ఆ రెండు పిల్ల-కరివేప్పిలై మొక్కలూ వారం తిరిగేటప్పటికి తలలు వాల్చి, ఆకులు రాల్చి - శిశిరానికి చోటిచ్చి శీతవేళకి సమసిపోయాయి.

ఆ తర్వాత - ఇండియన్ స్టోరులో దొరికిందని ఇంకో మొక్క తెచ్చి వేసినా - అదీ తలా వాల్చేసి ఆకులు రాల్చేసింది.

నాకింక హరితాంగుష్ఠం లేదని నిశ్చయించుకుని కరివేప-మొక్క-పెంచుట కార్యక్రమానికి ముక్తాయింపు పలికాను.

నాకు అతి పెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే - వారానికో, రెండు వారాలకో వెళ్ళే కూరల అంగడిలో. అలాంటి ఒకానొక రోజు - కూరలు కొంటున్న నా దగ్గరికి వచ్చి - కన్నడాలో పలకరించి - కూరలబుట్ట-సహిత-నన్ను - "వరలక్ష్మీ హబ్బక్కె హరిశిణ-కుంకుమ తొగొళ్లక్కె నమ్మనేగె బన్ని" - అంటూ ఆహ్వానించిన శాంతి ఇంటికి పేరంటానికి వెళ్ళాను.

శాంతి పెట్టిన పుళియోగిరె తింటూ బావుందంటూ ఉండగా నా కంట పడింది పుట్టు-కరిబేవు-సొప్పిన మర.

తను చెప్పే మాటలకి నేను తలూపుతున్నా నా చూపెక్కడో ఉందని కనిపెట్టిన శాంతి నా కంటి-చూపుల వెంట గీత గీసుకుంటూ వెళ్తే అది కరిబేవు దగ్గర ఆగిందని తేలింది.

వెంటనే - నేనడక్కుండానే - గబగబా రెండు మొక్కలు తీసి ఒక తడిపిన కిచెన్ టవల్‌లో చుట్టి నాకిచ్చింది - శనగల వాయనంతో పాటు. 

దాన్నలాగే తెచ్చి ఇంటికి వచ్చీ రాగానే ఒక కుండీలో మట్టిపోసి వేసి నీరు పోసేశాను - కానీ అంతగా ఆశలేం పెట్టుకోలేదు - నిలుస్తుందని. ఆ తమిళావిడ అంత జా.....గ్రత్తగా అదేదో organ transplant స్థాయిలో వేసిస్తేనే మనలేదు - ఈ కిచెన్ టవల్‌లో తెచ్చిన మొక్క మొలుస్తుందా, నిలుస్తుందా - అని.

వంటింటి కిటికీలో ఎండ తగిలేచోట పెట్టి - జలుబు చేస్తుందేమో ఎక్కువ పోస్తే అన్నట్లు కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ - మొన్న పొరపాటున టీ-కాచిన నీళ్ళు పోశాను - ఏదో ఎప్పటిదో ఎక్కడో విన్న గులాబీ-మొక్క పోషణ చిట్కా గుర్తొచ్చి - దాన్ని తప్పుగా బియ్యం-కడుగు నీళ్ళు పోయాల్సిన కరివేపాకుకి  అన్వయించుకుని.

అమ్మో ! ఇంకేముంది - మొక్క అలిగి వాలిపోతుందేమో అనుకున్నాను.

కానీ ఆశ్చర్యం ... రాజన్-నాగేంద్ర గారి బాణీలో పాడుకోవడానికి వీలుగా ...



కరివేప మొక్క మారాకు వేసే - మారాకు వేసే టీకాయ తోనే 

మొత్తానికి బతికింది - మా ప్రవాస జీవనపు వంటింటి-కల్పభూజం. 

కరివేపాకు వాడడంలో నావైన నియమాలు:

నాకు కొన్ని వంటల్లో కరివేపాకు తో పాటు కొత్తిమీర mutually exclusive (ME)... కొన్నిట్లో complementary (C)... కొన్నిట్లో optional (O).

ఆ వైనమేమనగా...
ఉప్మాలో అల్లం, పచ్చిమిరపకాయ, ఉల్లి తరుగుతో పాటు ఘనంగా వేయాలి కరివేపాకు - కొత్తిమీర పైపైన జల్లనగు  - (O)
చింతపండు పులిహోరకి ప్రాణమైనది కరివేపాకు - నిమ్మకాయ, మామిడికాయ రకాలకి కొత్తిమీర బాగు (ME)
సాంబారు రుచికి త్రాణమైనది కరివేపాకు - పప్పుపులుసుకి కొత్తిమీర మిన్నగు (ME)
దద్ధోజనానికి ధరలో పేరు తెచ్చినది కరివేపాకు - ఇందులో జతగా కొత్తిమీర వుండదగు (C)
ఏ కూరకైన రుచి కూర్చునది కరివేపాకు - కొన్నింటిలోనే కొత్తిమీరతో కలపదగు (O)
నీరసాలు తగ్గించు మిరియాల చారుకి "రస"సిద్ధి కలిగించు - కొత్తిమీర-కరివేపాకు  (C)

నాకెంతో ఇష్టమైన కరివేపాకుకో నాదైన ఓ సిన్మతీ గిద్యం:

కరివేప ఆకులు దట్టిన
పులిహోరయు కూర సాంబారు వాసన మించున్
చారును రస సిద్ధి పొందగ
సువాసన గల ఆకులివె ఇలలో సిన్మతీ! 




28 కామెంట్‌లు:

  1. Mouth-watering post! మాయాబజార్ ఎస్వీఆర్ గుర్తొచ్చారు😃
    మీ కరివేపమొక్క మోడీఫాన్ అండి. చాయ్-పే-చర్చ వింటూ మొలిచి ఉంటుంది.త్వరలో కరివేపాకుపచ్చడి & పొడికి కూడా సరిపోయినంత ఆకుతో శాఖోపశాఖలై పెరుగుగాక 👐

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా కరివేపాకు మొక్కకి మోడీ పరిచయమే లేదండి - తేనీరుని తన్నీర నుకునివుంటుంది :) మీ దీవెనలనందుకుని పచ్చగా పెరుగుతోంది. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. మా ఊళ్ళో ఒక పేటపేరు కరివేపాకు పేట :)
    దొడ్డిలో వేప చెట్టంత కరివేప చెట్టుండేది. కావలసినవాళ్ళు కావలసినంతా కోసుకుపోయేవారు. ఎవరి కన్ను పడిందో,చెయ్యిపడిందో చచ్చిపోయింది. మరో మొక్క పెరగలేదు. వేళ్ళనించి చిన్న మొక్కలు లేచి ఆకులేస్తాయి,ఆకులు కోసుకున్న తరవాత ఆ మొక్క పనైపోయినట్టే.

    దొడ్డిలో బతికించలేకపోయినవి, కరివేప,మరువం.

    కరివేప విషయంలో సింగరాజు లింగరాజు..... :)

    రిప్లయితొలగించండి
  3. గిధ్యంతో సహా మీ టపా బోలెడంత బాగుంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది దాచుకోవాల్సిన ప్రశంసా-పత్రమే నాకు. బోల్డన్ని ధన్యవాదాలు మీకు!

      తొలగించండి
  4. నేను ఉత్తర భారతంలో గోంగూర కోసం ఇలాగే కష్టపడ్డాను. ఆ కబుర్లు ఇక్కడ...
    https://bonagiri.wordpress.com/2016/07/03/%e0%b0%af%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%97%e0%b1%8b%e0%b0%82%e0%b0%97%e0%b1%82%e0%b0%b0-%e0%b0%b5%e0%b0%a8%e0%b0%82/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పుడే చదివానండి. మీ గోంగూర-వన-భోగపు భోగట్టా బహుబాగు!

      తొలగించండి
  5. మీకు, మీ కుటుంబానికీ విజయదశమి శుభాకాంక్షలు లలిత గారూ 🌷.

    రిప్లయితొలగించండి
  6. పొయ్యిలోకి పుల్లల కోసం కరివేపాకు చెట్టు మీదనున్న పక్షిగూడు పడగొట్టమంటూ కరివేప మండ రాలినచో కడుపు చీల్చెదను సుమా అని వంటవాడితో అంటాడు సింగరాజు లింగరాజు, అదేనా శర్మ గారూ? ☺

    రిప్లయితొలగించండి
  7. అమరేంద్రోద్యానవనము
    ఘుమ ఘుమలాడు కరివేప కుటజము తేరన్
    తమనాధుడు బదరీశుడు
    తమ తోడుత నింద్రుపైకి తరలిర ! యేమీ !

    రిప్లయితొలగించండి
  8. అబ్బ... చివర్లో కరివేపాకు వాడకం, వాటి వంటలు వింటుంటే నోరూరిపోతుంది. మొత్తానికి కరివేపాకాయణం బహు బాగు.

    రిప్లయితొలగించండి
  9. Lalli కరివేపాకు కథ బాగుంది నువ్వు చెప్పింది correct కరివేపాకు లేకుండా అసలు వంట so-so అది వేస్తే నే taste 👌👌

    రిప్లయితొలగించండి
  10. Karivepaaku kathabagundi.... chinnapudu Maa maamma adigite kosiichina kooralu gurtochayi.... taruvata.... ippudu Maa intlo unna pergala vada annatlu perugutunna karivepaaku mokka kanipinchindi.

    రిప్లయితొలగించండి
  11. లల్లి సూపర్ చాల బావుంది ,శివకొడు కళ్ళకి కట్టినట్లు రాసావు,నీ శైలి అద్భుతంగా ఉంది అది చదువుతుంటే ప్రసాద్ మామయ్య గర్తు వచ్చారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ చదువుతున్న మీకు బోల్డన్ని థాంక్స్ :)

      తొలగించండి
  12. పోస్ట్ చదువుతుంటే ఆ వంటల రుచి తలచుకుంటే నోరూరిందండీ.చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  13. ఇది చాలామంది అమెరికా ప్రవాసుల కథ అని ఇవాళే తెలిసింది. ఇక్కడ మంచి తిండికి మొహం వాచిపోవటంలో ఆశ్చర్యం లేదు. అప్పటికి ఇప్పటికి కూరగాయల రుచిలో మార్పు లేదు.

    "వలసపక్షులమై ఎగిరొచ్చిన తొలినాళ్ళలో - మేమున్న చోట ఇండియన్‌స్టోర్లు అంతగా ఉండేవి కాదు. ఉన్న ఒకటీ రెండు కొట్లలో వడిలిపోయిన వంకాయలు, ఎండిపోయిన కరివేపాకు, పండిపోయిన కొత్తిమీర, సెల్-బై-డేట్ దాటి పుష్కరమైన గ్లూకోన్-డీ ప్యాకెట్లు ఉండేవి.

    అందుకని కొంచెం దూరమైనా చైనావాళ్ళో - వాళ్ళలా వుండే మరేవాళ్ళో - నడిపే గ్లోబల్ ఫుడ్స్ అనే నానాదేశ-సరుకులు, కూరలు దొరికే అంగడికి వెళ్ళేవాళ్ళం.

    అక్కడ ఆకుపచ్చ ఫోమ్-ట్రేలలో అందంగా పేర్చి అమర్చిన కూరలు, ఆకుకూరలతో పాటు - ఒక పక్కగా - పదంటే పది రెబ్బలకి ఒక్కింటికీ పదేసి చొప్పున ఆకులతో అక్షరాలా-అంకెలారా వందంటే వంద ఆకుల కరివేపాకు పాకెట్టు ముత్యం-మూడ్డాలర్లకి కొనుక్కుని నలక్కుండా భద్రంగా ఇంటికి తెచ్చుకునేదాన్ని."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎంత రుచి లేని కూరకైనా రుచి తెప్పించేస్తుందనే - కల్పభూజం అన్నది. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  14. మీ ‘కరివేప దళం’ గురించిన టపా బావుంది లలితా. Just kidding :) అమెరికా వచ్చిన కొత్తల్లో కరివేపాకు కోసం దిగులు పడుతుంటే ఎవరో చెప్పారు florida లో బోలెడు కరివేప చెట్లు ఉంటాయి అని. వెళ్లి తెచ్చేసుకుందాం అనుకునేదాన్ని. అప్పట్లో జామ, బెండ, చిక్కుడు లాంటి కూరలు దొరికితే అపురూపంగా ఉండేది. ఇప్పుడు లేని వస్తువు అంటూ దొరకట్లేదు.ఈ వ్యాఖ్య మీ బ్లాగులో పెట్టబోయి ఇంకోచోట పెట్టాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి - లేనివి లేవు - కానీ ఉండవలసినట్లుగా ఉండవు - రుచిలో. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి