8, అక్టోబర్ 2017, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 5 - నా కథావస్థల్లో క్రీడావస్థ

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 4 - రైలు ప్లాట్‌ఫారం నుంచి జైలు యూనిఫారం దాకా పళ్ళయ్యకథ


కొంతసేపు చదువులాపేసి నేనాడిన ఆటల గురించిచెప్తాను.

అసలు నేనాలోచిస్తూ వున్నాను - నా ఈ కథ మొదలుపెట్టినప్పట్నుంచీ - రామాయణంలో కాండలు, భారతంలో పర్వాల్లాగా -  నేను చెప్పుకుంటున్న నా కథలో భాగాలకి కూడా ఏదైనా పేరు పెడదామా అని.

జీవితంలో చతురవస్థలు - బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం - కాక ఈ కలియుగంలో ప్రతీది అవస్థే - పుట్టిందగ్గర్నుంచీ పెద్దయిపోవాలని అవస్థ, పెద్దయ్యిందగ్గర్నుంచీ చిన్నగా కనపడాలని అవస్థ - చదువుకోవాలంటే అవస్థ, చదివిందానికి తగ్గట్టు ఉద్యోగం తెచ్చుకోవాలంటే అవస్థ - నా కథ బ్లాగుగా రాయడం ఒక అవస్థ, రాసినది చదవడం ఇంకో అవస్థ.

అందుకే నా కథలో భాగాలు, కథకి విభాగాలు - అవస్థలు.

బాల్యావస్థ, విద్యావస్థ, క్రీడావస్థ, ఉద్యోగావస్థ - ఇలా రకరకాల అవస్థలన్నమాట.

ఇప్పటికి బాల్యావస్థ పూర్తయింది.

విద్యావస్థ సగంలో ఉన్నాను. దాన్నక్కడే ఆపి - నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటల విషయాలతో - ఇప్పుడు క్రీడావస్థ మొదలు.

చిన్నపుడేవో ఆటలు ఆడేవాణ్ణి - అవంతగా గుర్తులేవు.

ఫస్టుఫారం నుంచి థర్డుఫారం దాకా ఆడిన ఆటల విషయాలుఏంటంటే - మనింట్లో రెండు చక్రాల సైకిలు ఉండేదొకటి - పొట్టి సైకిలు. దానికి టైర్లు ఉండేవి కావు - రిమ్ములు ఉండేవి.  ఆ రిమ్ములతోనే సైకిలు తొక్కేహేవాణ్ణి.

ఒక ఇనప కుర్చీ - మడత కుర్చీ ఉండేది - దానిక్కింద చక్రాలుండేవి. దాంట్లో కూర్చుని - మా శిష్యకోటి ఉండేవారు కదా - వాళ్ళని పిలిచి - ఒరే నెట్టండ్రా - అనేవాణ్ణి - అదో ఆట ఆడేవాళ్ళం.

ఇది కాకుండా - గేట్లో దంగేటి చందర్రావుని ఒక సైకిలు షాపుండేది - రిపేరు షాపు. ఆ చందర్రావుకి నేనంటే మహా ముద్దు. పాపం - వాడేం చేసేవాడంటే - నన్ను పిలిచి తీసేసిన టైర్లు నాకిచ్చేవాడు. ఓ కర్రపుల్ల పట్టుకుని ఆ సైకిలుటైరు దొర్లించుకుంటూ అనాతారం ఊరంతా తిరిగుతుండేవాణ్ణన్నమాట.

వేసంకాలం ముంజికాయలొచ్చేవి.

ఒక గడకర్ర మధ్యలో సగం వరకు చీల్చి - ముంజికాయకి ఇంకో కర్రపుల్ల గుచ్చి - ముందు చీల్చిన గడకర్ర మయంలో ఆ ముంజికాయ పెట్టి -  గడకర్ర మూలల్లో కిరసనాయిలు పోసి - కిర్రూ-కిర్రూ మని శబ్దం చేసుకుంటూ తిప్పుకుంటే - అది ఒంటెద్దుబండి.

కొన్నాళ్ళయ్యాక - "ఎహె - ఈ ఒంటెద్దుబండి బాలేదు" అంజెప్పేహి - నాలుగు ముంజికాయలు తీసుకుని - ఒక కొబ్బరికమ్మ మధ్యలో వేసి - ముందున రెండు, వెనకాల రెండు పుల్లలు గుచ్చిన ముంజికాయలు కట్టి - మధ్యలో కొబ్బరికమ్మకి కన్నం పెట్టి - దాంట్లో ఒక కర్ర పొడుగ్గా చేతికందేలా పెట్టుకుని - దానికింకో ముంజికాయ పెట్టి - స్టీరింగు తిప్పుతూ కారులా తిప్పేవాణ్ణి.

సీతారామరాజుగారి సత్తికొండ, నాయనరాజుగారి సూరి - వీళ్ళేం జేసేవారంటే - రెండు ముంజికాయలు కట్టి - దానికేమో ఓ కర్ర పెట్టి తోసుకుంటూ వెళ్ళేవాళ్ళు .

చిన్నప్పటి ఆటలు అవే . 

ఫోర్తుఫారం నుంచి  కొంచెం జ్ఞానం పెరిగింది నాకు.

మా పొలంలో బాడ్మింటన్ కోర్ట్ ఒకటుండేది. మానాన్నగారు వాళ్ళు బాల్-బాడ్మింటన్ ఆడుతూ వుండేవాళ్ళు. వాళ్ళు వెనకాలకి కొట్టేహినప్పుడు ఔట్‌లైన్ దాటెళ్ళిన బంతిని పరిగెట్టుకుంటూ వెళ్ళితీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకిచ్చేవాడినన్నమాట.

నాకలా బాల్-బాడ్మింటన్ మీద దృష్టి పడింది.

ఫోర్తుఫారం నుంచి బాల్-బాడ్మింటన్, తర్వాత ఇంకేంటంటే .... ఇప్పుడు కబాడి అంటున్నారు - అప్పుడు చెడుగుడు అనేవాళ్ళం - ఆ చెడుగుడు, బేసుబాలు, వాలీబాలు, బాస్కెట్టుబాలు - ఈ ఐదాటలు - ఇంకా ఖో-ఖో ఒకటి - ఈ ఆరు ఆటలు మాత్రం బాగా ప్రాక్టీసు చేసేవాళ్ళమన్నమాట.

అందులో - చెడుగుడు ఎలా ఆడేవాళ్ళమంటే  - అటేడుగురు, ఇటేడుగురు వుండేవాళ్ళు. ఒక టీం పూర్తిగా అవుటై పోతే పది పాయింట్లు. ప్రతివాళ్ళూ కూతకెళ్ళడం - మధ్యలో సెంటర్ లైనుంటుంది - తర్వాత బార్క్ లైనంటారు - అది బోర్డర్ లైను - దాన్ని బార్క్ లైననే వారా రోజుల్లో.

కూత కెళ్లిన వాడేంటంటే ఆ బార్క్ లైను దాటాల. అది దాటకపోతే పెనాల్టీ పాయింటెళుతుందన్నమాట.

కూత కూసుకుంటూ బార్క్ లైను దాటి వెళ్ళిన వాణ్ణి అవతల టీం వాళ్ళు పట్టుకుంటే వాడవుటు - ఒక పాయింటు అవతలవాళ్ళకి. వెళ్ళినవాడు వాళ్ళలో ఎంతమందిని ముట్టుకుని ఔట్ చేస్తే అన్ని పాయింట్లు - ఇవతల టీముకి. టీం మొత్తం ఔటయితే పది పాయింట్లు ఇచ్చేవారు.

టీములో ఉన్నప్పుడు ఏడుగురేడుగురు ఆడినా - అనాతారంలో ఆడుకునేటప్పుడు ఇట్నలుగురూ, అట్నలుగురూ వున్నా ఆడేసుకునేవాళ్ళం.

సూదిబొత్తాలు - అదే ... పిన్నీసులు ఉంటాయి కదా అవి పందెం కాసుకునేవాళ్ళం. ఎంత మందుంటే అన్ని సూదిబొత్తాలు పందెం కాసుకునేవాళ్ళం - ఎవరు గెలిస్తే వాళ్ళు మొత్తం పట్టుకెళ్ళేవాళ్ళం.

అదీ చెడుగుడాట.

తర్వాత  బెచ్చాలాట.

బెచ్చాల్లో రేటింగు ఉండేదన్నమాట - డాలరు, రూపాయి లాగా. కాప్‌స్టన్  బెచ్చాకి డెక్కను  బెచ్చాలు ఇరవై ఇవ్వాలి. అలాగే బేర్సు, సిజర్సు, బర్కిలీ - ఇలా రకరకాల బ్రాండ్ల  బెచ్చాలుండేవి. ఒక్కోదానికి ఒక్కో రేటింగు - ఐదు  బెచ్చాలు, పది బెచ్చాలు, పదిహేను, ఇరవై - ఇలా ఉండేది.

ఈ  బెచ్చాలాట ఎలా ఆడేవాళ్ళమంటే - గుండ్రంగా ఓ చిన్నగిరి గీసి - అందులోనేమో బెచ్చాలు పేర్చేవాళ్ళం. పేర్చి దూరంగా లైన్లు గీసుకునేవాళ్ళం. నాపరాతిముక్కలు తెచ్చుకుని నున్నగా చుట్టూ చెక్కుకుని ఈ లైను దగ్గర నించుని ఆ మధ్యలో ఉంచిన బెచ్చాలని కొడితే  - ఎన్ని బెచ్చాలు బయటికి వస్తే అన్ని మనవి - కొట్లేకపోతే అవతల పార్టీకి వెళ్ళిపోతాయి.

బెచ్చాలాట ఆడే రోజుల్లో ఇంటినిండా బెచ్చాలు - ఓ...-  తెగ పెట్టేహేవాళ్ళం. ఎక్కడెక్కడి సిగరెట్టుపెట్లూ ఏరుకొచ్చేసి - చించేసి - బెచ్చాల కింద అట్టేపెట్టేసుకునేవాళ్ళం.

ఇదయ్యిన తర్వాత గోణేబిళ్ళ ఆడేవాళ్ళం. చిన్న గుంట తవ్వడం - చేతిలోనేమో మూరెడు కర్ర - ఓ చిన్నబిళ్ళుంటుంది - బిళ్ళ అంటే చిన్నకర్ర అన్నమాట. దాన్ని అటూ ఇటూ చెక్కి సూదిగా తయారుచేయడం - ఆ చిన్న గోతిమీద ఆ బిళ్ళ పెట్టడం - చేతిలోవున్న కర్రతో గూటాలి. దాన్ని అవతలవాడు క్యాచ్ పట్టుకుంటే మనం అవుటు. ఇద్దరుంటారు అవతల. క్యాచ్ పట్టకపోతే మళ్ళీ విసురుతాడు మనకి . విసిరినప్పుడు ఈ గుంట దగ్గర పడకూడదు ఆ బిళ్ళ. గుంట దగ్గర్నుంచి మనమేం చేయాలంటే - మన దగ్గరున్న కర్రతోటి గా...ఠిగా కొడతాం. కొడితే దూరంగా వెళ్ళి పడుతుందనుక్కో - పడింతర్వాత - ఎక్కడ పడిందో దాని కొన దగ్గర్నుంచి ఈ గుంటవరకు మన చేతిలో ఉన్న మూరెడు కర్రతో కొలవాలి. అది లాల అంటారు. కొలుచుకుంటూ వచ్చేటప్పటికి పది లాల్లు, ఐదు లాల్లు - ఇలా లాల్ల కింద లెక్క పెట్టుకోవాలి. అదో ఆట.

తర్వాతేమో - ఉప్పట్టొకటి ఆడేవాళ్ళం - దొంగుప్పట్టి. దొంగుప్పట్టంటే - ఓ గిరి గీయడం - అవతలేమో కొందరుంటారు ఈ గిరి లోపలేమో "ఆలింకు ఆలింకు" అని తిరుగుతూ వుంటారు కొందరు. వాళ్ళని ఆ గిరి దాటకుండా అవుటు చేయాలి.

హైస్కూలులో చెడుగుడుకి మాకొక కప్పు కూడా  వచ్చింది. చెడుగుడులో ఓ టీముండేది మాకు - గురుజ అర్జునరావని - ఇన్‌కంటాక్స్ కమీషనర్‌గాచేసేవాడు - వాడు కెప్టెనూ, నేను, అయ్యగారి వెంకట్రావు, నాయనరాజుగారి సూరి, నూకల విస్సి, జిన్నూరి కాశీ విశ్వేశ్వరరావు, సాయిబాబా, మంత్రిప్రగడ వాడొకడు - మేము ఏడుగురం టీము కింద ఉండేవాళ్ళం. అవతలి టీములో చిక్కాల వాడొకడు, ఉద్దిస భాస్కరరామమూర్తి, సూదా రామారావు వుండేవాళ్ళు.

ఖో కూడా ఆడేవాళ్ళం. అనాతారంలో వరహాభట్ల శంభన్నశాస్త్రి  అనేసి ఉండేవాడు. వాడందులో చాలా... చాలా టాపుగా ఆడేవాడు. వాడి టీములో నేనూ ఆడుతుండేవాడిని.

ఇలా ఆడుతూనే గ్రిగ్స్‌స్పోర్ట్స్‌కి వెళ్ళేవాళ్ళం.

అదే చెప్పాను కదా - బేస్‌బాల్‌ కూడా ఆడేవాళ్ళమని - బేస్‌బాల్‌కి  - నాలుగు బేసులు - ఒక పిచింగు, ఒక క్యాచ్ పట్టేవాడు, ఔటర్లో నలుగురు ఫీల్డ్ పట్టేవాళ్ళుంటారన్నమాట. ఆల్మోస్ట్ క్రికెట్టు లాగే ఉంటుంది ఆట. కాకపోతే క్రికెట్లో మూడు స్టంపులుంటాయి - ఇందులో నాలుగు బేసులుంటాయి. పోతుల ఆనందరావని చెప్పేసి - ఫుడ్ కార్పొరేషన్లో పనిచేసి రిటైర్ అయ్యాడు ఇప్పుడు - అతను మంచి హిట్టరు - అలాగే కొల్లు రామచంద్రరావని అతనేమో పిచ్చింగ్ చేసేవాడు. రాయడ నాగేశ్వర్రావు వెనకాల క్యాచులు పట్టేవాడు. మేము ఫీల్డులో ఉండేవాళ్ళం. వాళ్ళందరూ మెయిన్ కానీ నేను కొంచెం పక్కనే ఉండేవాణ్ణి.

బాల్-బాడ్మింటన్ మాత్రం మొట్టమొదట లెఫ్ట్-బ్యాక్ ఆడేవాణ్ణి. డిఫెన్స్ ఆడాలక్కడ. లెఫ్ట్-బ్యాక్ డిఫెన్స్ బాగా నేర్చుకున్న తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చి - వాళ్ళేం చేశారంటే కట్లు కొట్టడానికి - కట్టు కొట్టడమంటే - కో... డ్తే బాలు దిగిపోవాలన్నమాట - రైట్-ఫ్రంట్ ఇచ్చారన్నమాట. రైట్-ఫ్రంట్ మంచి ముఖ్యమైన స్థానం. నాకది డైరెక్ట్ ప్రమోషన్. ఎందుకంటే రైట్-బ్యాక్ ఇచ్చి రైట్-ఫ్రంట్ ఇస్తారు సాధారణంగా. అటువంటిది సరాసరి రైట్-ఫ్రంట్ ఇచ్చేశారు. రైట్-ఫ్రంట్ నుంచి సెంటరుకొచ్చేశాను. అంటే నలుగురుండే టీముకి నేను కాప్టెన్ అన్నమాట. సెంటర్ అంటే అన్నీ ఆడాల. ఆ విధంగా బాల్-బాడ్మింటన్లో బాగా ఎదిగాను. డబుల్స్ కూడా ఆడేవాళ్ళం. డబుల్స్ ఆడేటప్పుడు బ్యాక్ ఆడేవాణ్ణి. అది అక్కడ ముఖ్యమైన స్థానం - బ్యాడ్మింటన్ కోర్టులో.

గ్రిగ్స్‌స్పోర్ట్స్‌లో బాస్కెట్టుబాలులో - అమలాపురంలో ఆడినప్పుడు కూచిమంచి చంటబ్బాయి అని వాడు మా ప్రత్యర్థి. ఇప్పుడు మంచి ఫ్రెండు - వాడు, నేను, మాచిరాజు ప్రభాకర్ అని చెడుగుడు ఆడేవాడు - వాడు, తర్వాత ఇంకా చాలా మంది కలిసి ఆటలు ఆడేవాళ్ళం. ఇంకో తమాషా విషయం ఏంటంటే అప్పుడు అందరం ఇంటిపేర్లతోనే పిలుచుకునేవాళ్ళం - ఒరే మాచిరాజూ, ఒరే వడ్లమానీ, ఒరే కూచిమంచీ - ఇలాగన్నమాట!

ఇప్పటికి ఇవీ - నే చెప్పదలచుకున్న క్రీడావస్థ కబుర్లు.

ఇదిక్కడ ఆపాలి -  మళ్ళీ ఎస్సెల్సీ పూర్తయి కాలేజీకి వెళ్ళి - విద్యావస్థ దాటి ఉద్యోగావస్థలో కూడా ఆటలు వస్తాయి కాబట్టి. 

<వచ్చేనెల తరువాయి కథ>

2 కామెంట్‌లు:

  1. //పెద్దయ్యిందగ్గర్నుంచీ చిన్నగా కనపడాలని అవస్థ//నిజంగా అవస్థే,అది పడేవాళ్లకి తప్ప😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదొక వేరేలా-కనిపించాలనుకునే పైకి-కనిపించని అవస్థ. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి