15, అక్టోబర్ 2017, ఆదివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ముక్తాయింపు


అష్టావధానం ముందు భాగం చదవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ఉపోద్ఘాతం



నిషిద్ధాక్షరి మొదటి పాదం (జువ్వాది రమణగారు):

నరాల రామారెడ్డిగారు అవధానం ప్రారంభిస్తూ "మొదటగా నిషిద్ధాక్షరితో ప్రారంభిస్తాం. జువ్వాది రమణగారు నిషిద్ధాక్షరి అడుగుతారు" అన్నారు.

రమణగారు "అవధానిగారు! మీరు బాహుబలి సినిమా చూశారాండి ? ఈరోజు బాహుబలి మీద నిషిద్ధాక్షరి చేద్దాం. బాహుబలిని వర్ణిస్తూ చెప్పండి. మొదట అక్షరం నాదేనా?" అంటూ నాంది పలికారు.

"మీ ఇష్టం - ఆదిలో నిషేధం - మధ్య నిషేధం మీ ఇష్టం. మధ్య నిషేధం - మద్య నిషేధం కాదు - ప్రాస నిషేధం లేదు" అంటూ నవ్వులు పంచ్-తూ అవధానిగారు బదులిచ్చారు.

అయితే - "బా" (నిషేధం).

బా-తోనే మొదలు పెట్టారా? మొదటి అక్షరం "బా" రాకూడదన్నారు. మొదటి అక్షరం "ఔ" - ప్రాసనిషేధం లేదు కదా?

(నిషేధం)

అప్రస్తుత ప్రసంగం (నారాయణస్వామిగారు): "అప్రస్తుత ప్రసంగిగా కొంచెం లిబర్టీ తీసుకుంటున్నాను. అవధానవిద్య తెలియని వారి సౌలభ్యం కోసం - నిషిద్ధాక్షరి continous job అన్నమాట - ఒకసారి ప్రశ్న ఇచ్చేసి ఊరుకోవడం కాదు - ప్రతి రెండో అక్షరానికి పృచ్ఛకుడు అడ్డం పడి - మీరు ఈ ఫలానా అక్షరం మీరు వాడకూడదు - అని అడ్డం పడుతూ ఉంటాడు. ప్రాస వుండే పద్యాల్లో రెండో అక్షరం తప్పనిసరిగా అదే ప్రాస అక్షరం రావాలి. కాకపోతే మొట్టమొదటి పాదంలో ప్రాస ఏది అనే choice ఉంది కాబట్టి అది కూడా నిషిద్ధం చేస్తాను అని  పృచ్ఛకులవారు ఆ facility ఉపయోగించుకున్నారు. అవధానిగారు మొదటి అక్షరం "ఔ" అని మొదలు పెట్టారు. బాహుబలిమీద పద్యం కాబట్టి automatic గా ఒక పొగడ్తలాగా అది "ఔరా" అని వస్తుందేమో అని ఊహించి పృచ్ఛకుడు "ర" ని నిషేధించాడు. అవధానిగారికి ఎంత తెలివుందో - పృచ్ఛకుడు ఇంకో రెండాకులు ఎక్కువ చదివుండాలన్నమాట."

వెంటనే రమణగారు అందుకుని "Thank You అండి" అని నారాయణస్వామిగారితో అని - "అవధానిగారు! మీరు ఇది కూడా చెప్పండి - ఏమంటున్నారా అని ఊహించి - నేను ఎందుకు నిషేధిస్తున్నాను అని - ప్రేక్షకుల సౌలభ్యం కోసం" అని నరాల రామారెడ్డిగారిని కోరారు.

(లలిత ఉవాచ:ఈ నిషిద్ధాక్షారిలో ఒకరి తర్వాత ఒకరుగా రమణగారు, రామారెడ్డిగారు ఏకాక్షరాల్లో మాట్లాడుకున్నారు.)

రామారెడ్డిగారు: సరే! "ఔ" అన్నప్పుడు "రా" నిషేధం అన్నారు. నేను - "ఔనా"

మళ్ళీ"బ" (నిషేధం)
మా
క (నిషేధం)
క-కారం వద్దన్నారు - న
వ (నిషేధం)
స - "మానస" - అంటే మా నస కాదు. మీ నస కాదు - "మానస" అంటే మనసు. 
(లలిత ఉవాచ: ఈ నస కాని నసకి  బోల్డన్ని నవ్వులు ఇక్కడ గలగలలాడాయి)
ప (నిషేధం)
కా - దీర్ఘం
కా - దీర్ఘమా ? త (నిషేధం)

(లలిత ఉవాచ: నాకెందుకో ఇక్కడ రమణగారు ముందు "స" అన్నారేమో అన్నట్టు వినిపించింది - రామారెడ్డిగారు తల్లిలో తకారమా అనగానే కొంచెం తడబడి అవుననేశారు రమణగారు.)

తల్లిలో త-కారమా? త వద్దన్నారు. బిందుపూర్వక - ంక్షా - మానస కాంక్షా -

ఔనా మానస కాంక్షా - నిషిద్ధాక్షరిలో ఒక పాదం ముగిసింది.

ఇప్పుడు రెండవది సమస్య.

ఇప్పుడు సమస్య - ఎవరు? - అంటూ పాపం నరాల రామారెడ్డిగారు ఇంకా పేపర్లో పేరు చదవబోతున్నారు - నాకసలే హడావిడి ఎక్కువ కదా - ఇంతలోనే మొదలుపెట్టేసి - "అవధానిగారు - నేను మీకు ఇవ్వబోతున్న సమస్య ఏంటంటే - వరుసలు జూడగా మధురవాణి ... " అంటూ నా పరుగు-బాణీలో నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను.

ఇంతలో ఆయన - "లలితగారు సమస్య ఇస్తారు -చెప్పండి" - అంటూ నాకేసి చూశారు.

ఇంక చదివేశా "వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా" - అంటూ.

నేను చదివిన పద్య పాదాన్ని విని రామారెడ్డిగారు ఇంకోసారి దాన్నే మళ్ళీ చెప్తూ ఉండగా - ఇంతలో అప్రస్తుత ప్రసంగం చేస్తున్న నారాయణస్వామిగారు అందుకుని - "ఎలాగా - వాణి ప్రసక్తొచ్చింది కాబట్టి - మామూలుగా పృచ్ఛకుల్లో పద్యం రాయగలిగినవాళ్ళు ఉంటే - వారు పాపం మామీద అభిమానం తోటి, కొంత వాత్సల్యంతోటి -  పృచ్ఛకులందరూ ఏదో పండితీ పుత్రులని అన్నట్టుగా చమత్కారంగా పద్యం చెప్పారు. అందుకని బదులు తీర్చుకోవడానికి నేను కూడా అవధానిగారిని కాస్త పొగుడుతూ ఒక పద్యం చెప్తాను

వాణికి ముద్దుల బిడ్డవు
పాణిన్యాదుల చదువుల పాఱంగతుడౌ
మాణిక్యమ్మవు పండిత
శ్రేణులయందున నరాల రామారెడ్డీ !

(బోల్డన్ని చప్పట్లు నారాయణస్వామిగారి పద్యానికి)

అప్రస్తుత ప్రసంగం అంటే కేవలము డిస్టర్బన్సే కాదు - వినోద కారణం, విజ్ఞాన కారణం కూడా - అనే ధోరణిలో నేను చేసే పనిని పరిచయం చేసుకుంటూ - అష్టావధానం - విద్యా ప్రాభవ ప్రకటనం- సత్సాంగత్యం - పరస్పరం గౌరవ వందనం - మాత్సర్య రహితం - అవధానిగారిని ఇబ్బంది పెట్టటం అనేది ఒక పూను స్పర్థను విద్యయందే అన్న దృష్టితోనే తప్ప - వారి పాండిత్యం పట్ల, వారి రసికత పట్ల గౌరవం ప్రకటించుకుంటూనే - మాత్సర్య రహితం మైత్రీ వర్ధనం అప్రస్తుత ప్రసంగం సంతత వినోదకారణం" అంటూ రామారెడ్డిగారి మీద ఓ మంచి పద్యంతో పాటు అప్రస్తుతప్రసంగం గురించి కూడా బోల్డన్ని విశేషాలు చెప్పారిలా. 

రామారెడ్డిగారు  - "చంపకమాలలో లలితగారు ఒక సమస్యనిచ్చారు - వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా" - అని అంటూ నాకేసి తిరిగి "ఊరకే ఇచ్చారా? లేక పూరణం కూడా ఆలోచించారా? - అని అడిగారు.

ఆయనలా అడక్కముందే నా సమాధానం సిద్ధంగా వుంది కదా - తల అడ్డంగా తిప్పాను.

"మరట్లా ఇస్తే ఎట్లాండి? అదే నేను మొదట ఇంట్రడక్షన్లో చెప్పాను - సమస్యలో విరుద్ధార్థం వున్నప్పుడు  దానికి పూరణ కూడా ఉండాలి. ఎట్లాంటిది ఇవ్వొచ్చుగాక ఒక క్లూ అనేది దానికి దొరకాలి. ఆ పత్రికలో ఇచ్చిన ఒక సమస్య - అనంతపురం జిల్లాలో ఇచ్చినది - "జమునను జూడగా విజయశాంతి లభించె జయప్రదంబుగన్" - అని. ఇదంతా గందరగోళంగా వుంది - జమునను చూస్తే విజయశాంతి జయప్రదలా కనబడింది - కాబట్టి ఏదో క్లూ దాచిపెట్టాడనుకున్నాను. అయితే దాన్ని నేను సినిమారంగం నించి కాకుండా భగవద్గీతకి తీసికెళ్ళాను. అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు - నేను నెత్తుటికూడు తినలేను బావా - అంటూ. అపుడు విశ్వరూపం చూపిన విశ్వనాథుడు - ఆ భారతవీరునికి భగవద్గీత ఉపదేశం చేశాడు. ఏమంటున్నాడు?

సమరము చేయనంచు రభసమ్మున చాపము కింద వైచి
సంభ్రమునకు లొంగిపోయితివి బంధువులను హతమార్చనంచు
నీ భ్రమలు తొలంగె నేడు భగవంతుని రూపము నీదు హృత్సరో
జమునన్ చూడగా విజయా!  శాంతి లభించె జయప్రదంబుగన్

- అంటూ ఆ పద్యం చెప్పి మళ్ళీ నాకేసి తిరిగి - మొదటిపాదం చెప్పారు:
పరువము పాలపొంగువలె పరువులు తీయు వసంతవేళ భా
చంపకమాలలో ఒక పాదం ముగిసింది.

తర్వాత దత్తపది. రామచంద్రారెడ్డిగారు గాజులపల్లి - అని పిలిచారు రామారెడ్డిగారు.

రామచంద్రారెడ్డిగారు మైకందుకుని - సరాల, తరాల వరాలనరాల -ఈ నాలుగు పదాలతో తానా సభల అంతరార్ధాన్ని మీరొక పర్యాయం వర్ణించవలసిందిగా - అంటూ దత్తపదిని ఇచ్చారు.

రామారెడ్డిగారు "ఆ పదాలకు ముందూ వెనుకలు మార్చుకోవచ్చు కదా - ఈ పద్ధతిలో చేసుకుందాం అంటూ - తరాలతో ప్రారంభిస్తాను - అని చెప్పి - తరాల, సరాల, వరాల, చివరిలో నా  నరాల - ఇతివృత్తం మీరిచ్చారు - వృత్తం నాయిష్టమే కదా ?" అంటూ దత్తపది మొదటిపాదం చెప్పారు: తరాల దాక సాగుగాక తారలుండు దాక పూ

ఇక వర్ణన - కుప్పా విజయశ్రీగారు.

మా నానీల-నానీ విజయశ్రీగారు "సభకు నమస్కారం. రామిరెడ్డిగారు వారి ప్రారంభ పరిచయంలో రెండు మూడు పదాలు వాడారు. మామూలుగా నేను వర్ణనకి వేరే అంశం అనుకున్నదాన్ని వారి అత్యద్భుతమైనటువంటి ఆ పరిచయంలో కొన్ని చక్కటి హాస్యపూరితమైన, సరసపూరితమైన వాక్యాలు కొన్ని నాకు దొరికినై. నీలిమేఘమువోలె అన్న పదమొకటి, విజయచాపము అన్న పదం వారు వాడారు - వారు రామనామధేయాంకితులు కనక - ఈ పదాలతో వారినడుగుదామని ఇప్పటికిప్పుడు నాకనిపించింది. అంటే రామ అనే శబ్దం మీ నామంలో వుంది కనక రామాయణంలో అడుగుదామని ఆలోచన కలిగింది. రామాయణం అంటే అందరికీ తెలిసిందే. యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే -తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. అంత మహత్తరమైన కథలో - రామో విగ్రహవాన్ ధర్మః  - అన్నటువంటి అంశాన్ని తీసుకుని రామ అన్న వారి నామం తీసుకుని విజయచాపం అన్నది ప్రయోగించారు - నీలిమేఘం అన్నారు. ఈ మూడూ రాముడికి మనం ప్రత్యేకంగా అన్వయించుకోవక్కర్లేదు - సహజంగా వున్నటువంటివే - కాకపొతే ధర్మాన్ని హాస్యరసంలో చెప్పమని వారిని అడుగుతున్నాను. ధర్మానికి హాస్యరసం విరుద్ధమయినదే - ధర్మమంటే ఒక ప్రతిపాదనతో కూడిన వస్తువిశేషమే - ఆ రామో విగ్రహవాన్ ధర్మః అన్నది వాల్మీకి రామాయణంలో వున్నదానికి విశ్వనాథవారు ఏ విధంగా కొంత విశ్వనాథవారి విసుర్లలో హాస్యము అధికమే - అయితే ధర్మాన్ని హాస్యరస సమ్మేళనంతో చెప్పవలసిందిగా కోరుతున్నాను" అనగానే

ఒక చిరునవ్వు నవ్వుతూ నరాల రామారెడ్డిగారు - "నాకేమీ అర్థం కాలేదమ్మా " - అంటూనే - రామరూపము నయనాభిరామమగుచు - తేటగీతిలో ఒక పాదం ముగించారు వర్ణనలో.

తర్వాత న్యస్తాక్షరి - మద్దుకూరి చంద్రహాస్‌గారు.

"అందరికీ మరోసారి నమస్కారమండి" - అని మొదలుపెట్టి - "వృత్తం ఉత్పలమాల - ఇతివృత్తంమొదటిపాదం మూడో అక్షరం -హ - (ఇక్కడ  నారాయణస్వామిగారు - హాహాకారంతో మొదలుపెట్టారన్నమాట అని మహా-ప్రస్తుత ప్రసంగమే చేశారు ) రెండోపాదం ఐదో అక్షరం -రి. మూడోపాదం ఏడో అక్షరం - త. నాలుగోపాదం తొమ్మిదో అక్షరం - ము" - అనగానే నరాల రామారెడ్డిగారు తల్లిలో - త, ముద్దులో - ము అని అక్షరాలూ సరిచూసుకుంటూ ఉంటే - మంచి రసం పండించారు అంటూ సరస-ప్రసంగం చేశారు నారాయణస్వామిగారు.

హ-రి-త-ము - ఇతివృత్తం పర్యావరణ రక్షణ - వృత్తం-ఉత్పలమాల - ప్రకృతికి సంబంధించిన ఇతివృత్తం -అంటూ అన్ని అక్షరాలను బేసిసంఖ్యలో - 3, 5, 7, 9 - తీసుకుని - న్యస్తాక్షరి సమస్యనిచ్చారు చంద్రహాస్‌గారు.

అది వింటూనే - నారాయణస్వామిగారు - "ఇక్కడొక తమాషా చూడండి - ఆ నాలుగు అక్షరాలు కలుపుకుంటే - హరితము - అంటే పచ్చదనం అంటే అర్థం తోటి ఆయన అడిగిన ఇతివృత్తం కూడా పర్యావరణ రక్షణ గురించి అన్నమాట - అదీ చమత్కారం" - అంటూ చమత్కరించారు - చమక్కనిపించారు.

న్యస్తాక్షరి: మొదటి పాదం (మూడో అక్షరం - హ): జీవరాంతరాయముగా స్నిగ్ధ జగమ్ములు రూపుమాపకన్

తర్వాతి అంశం - ప్రబంధపఠనం - దిట్టకవి సుందర్‌గారు - అని సంధానకర్త రామరాజభూషణుడుగారు ప్రకటించారు.

దిట్టకవి సుందర్‌గారు వసుచరిత్రలోని ఒక పద్యం చదవగానే - "అవధానిగారు ఈ పద్య సందర్భాన్ని మనకి వివరిస్తూ ఆ పద్యార్థం  మనకు చెప్తూ ఆ పద్యాన్ని విశ్లేషిస్తారు - అదీ ఈ ప్రబంధపఠన ఉద్దేశ్యం" -  అంటూ వివరించారు రామరాజభూషణుడుగారు.

"ఉద్దేశ్యం బాగానే వుంది - కానీ అవధానంలో అవధాని మనసు పద్య రచన మీద వేరే పద్ధతుల్లో వున్నపుడు ఈ వర్ణనాత్మకమైన పద్యం చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ప్రబంధపఠనం, పురాణపఠనం - దాని ఉద్దేశ్యం ఏంటంటే అవధాని యొక్క మనసును డైవర్ట్ చేయడం - అంతే దాని ప్రయోజనం - అంతే కానీ పాండిత్యపరీక్ష కాదు. సరే - వసుచరిత్రలో ఉన్నటువంటి అద్భుతమైన పద్యాల్లో ఇదొకటి - వసుడన్నారు కాబట్టి వసుచరిత్ర". - అని రామారెడ్డిగారు అంటూ ఉండగా సంధానకర్తగారు అందుకుని - "రామరాజభూషణుడు ఇక్కడ ఉన్నాడని వసుచరిత్రలో పద్యాన్ని ఎంచుకున్నారాయన" - అంటూ చమత్కారపు మెరుపు మెరిపించారు అష్టావధాన సభలో.

నరాలరామారెడ్డిగారు - "దిట్టకవి సుందర్ - మాంచి దిట్టకవి - రామరాజభూషణుడినే పట్టుకున్నారు" - అని ఇంకోసారి చమత్కరించి -  "వసుచరిత్రలో వసుమహారాజుని వర్ణించే పద్యాన్ని గుర్తుచేశారు మీరు" అంటూ - క్లుప్తంగా ప్రబంధపఠనాన్ని దాటవేశారు.

తర్వాత - ఆశువు - డాక్టర్ బండ్ల హనుమయ్యగారు - "మాజీ-తానా-అధ్యక్షులు,  తానా-మాజీ-అధ్యక్షులు" - అని పరిచయం చేశారు రామరాజభూషణుడుగారు.

హనుమయ్యగారు " నమస్కారమండి అందరికీ " అని ప్రారంభించి - "అవధానిగారూ - ఈ ఇరవయ్యొకటవ తానా మహాసభల థీము - ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ వెలుగు. అంటే తెలుగుభాష అనేది మన ఆంధ్ర దేశానికే పరిమితమైనది కాదని - అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తెలుగు వుందని చెప్పుకోవటానికి. అయితే మనందరికీ బాధాకరమైన విషయం ఏంటంటే మన భాషని మన పాఠశాలల్లోనే పిల్లలకి నేర్పటం లేదు. ఈ భాష మనుగడ ఏమిటి? భాష ఉంటుందా? లేక కనుమరుగైపోతుందా? అతి మధురమైన మనోహరమైన మన భాషని పదికాలాలు నిలుపుకోవాలంటే మన కర్తవ్యం ఏంటి? ఈ విషయం మీద మీరు ఒక పద్యం చెప్పండి." అని కోరారు.

రామరాజభూషణుడుగారు  అందుకుని - "దేశ భాషలందు తెనుగు లెస్స అని మన శ్రీకృష్ణదేవరాయలవారు చెప్తే - ఈ రోజున ఆంధ్రదేశంలో తెలుగు లెస్సు అంటున్నారు " అని అంటించారు.

"లెస్సా? అంటే లెస్ అయిందా? అనడుగుతున్నారు"  - అని అందుకుని రామారెడ్డిగారు -

తేనెసోనలు జాలువారు తెలుగుభాష మల్లెమొగ్గల మృదులత వెళ్లి విరియ
ముద్దుముద్దుగ మురిపాలు మూటకట్ట నాట్యమాడుత పిల్లల నాల్కమీద

- అనగానే

"అవధానిగారికి నాట్యమంటే బాగా ఇష్టమల్లే వుంది - ఇందాక వాణి మీద చెప్పిన పద్యంలో కూడా నా నాలుక మీద వాణి నాట్యం చేయాలి అని కోరుకున్నారు - అయ్యా - తమరు బహుకళా కోవిదులా ?" - అని ప్రస్తుతించారు అప్రస్తుతప్రసంగి నారాయణస్వామిగారు.

"నాకు నాట్యం చేసేది చేతకాదు కాబట్టి ఎవరైనా నాట్యం చేస్తే చూసి ఆనందిస్తా - మీరు చేసినా కూడా" - నన్నారు నరాలవారు.

"ఇంతటితో మొదటి వరుస పూర్తయింది. అధ్యక్షుడిగా నాకొక కీలక సమస్య ఎదురయేట్లుగా కనిపిస్తోంది ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ అష్టావధానాన్ని ఇంకొక గంటలో  పన్నెండు గంటలకల్లా ముగించే అవకాశం దొరుకుతుందా అని - కాబట్టి పృచ్ఛకులు కొంచెం తక్కువ సమయం తీసుకుని సూటిగా మీ సమస్యలు చెప్తే బావుంటుంది - ఇప్పుడు రెండో విడత అవధానిగారికి" - అంటూ రామరాజభూషణుడుగారు అష్టావధానంలో రెండో వరస ప్రారంభించారు.

మళ్ళీ జువ్వాది రమణగారి నిషిద్ధాక్షరితో రెండోవరస మొదలయింది.

"వ"
వ-కారం వద్దన్నారు - మొదటిపాదం కాంక్షా దగ్గర ఆగింది - ఇప్పుడు - ధీ - అనగానే రమణగారు "ప్రాస మీదేనా అనడిగారు. అవధాని గారు "ప్రాస నాదే - మీకు దానిమీద ధ్యాస ఉండకూడదు" అన్నది విని నవ్వుతూ రమణగారు " సరే - అయితే చెప్పండి" అన్నారు.

అవధానిగారు "ధీనా"
ర (నిషేధం)

క (నిషేధం)
ధి
క (నిషేధం)
పూ
ర (నిషేధం)
జ్య
మ (నిషేధం)
ధా
ర (నిషేధం)

దీ (యతిప్రాస నిషేధం లేదు)
న (నిషేధం)
క్షా
ప (నిషేధం)
రూ
డ (నిషేధం)
పా

దీనావధి పూజ్య ధామ దీక్షారూపా - రెండుపాదాల నిషిద్ధాక్షరి ముగిసింది - బాహుబలి ఇతివృత్తంతో. 

"ప్రేక్షకుల్లో పెన్నూ-కాగితం వున్నవారు ఎవరన్నా ఉంటే అవధానిగారు చెప్తున్నప్పుడు పద్య పాదాలు విడిగా రాసుకుని సరిచూసుకోండి - అది మీక్కూడా కాలక్షేపంగా ఉంటుంది" అని సూచించారు నారాయణస్వామిగారు.

సమస్య - మళ్ళీ గుర్తు చేశారు : వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా - అంటూ అధ్యక్షులు.

"భా అని పైనొక అక్షరం చెప్పాను కదా -
సురముగ సూన సాయకుడు సూటిగ బాణములేయుచుండ - సూటిగ - అంటే గురితప్పకుండా - యతి పొతే మతి పోతుందిక్కడ - గురి తప్పకుండా అంటే నాకొకటి జ్ఞాపకమొస్తోంది ఇక్కడ" - అంటూ ఒక జోక్ చెప్పారు అవధానిగారు.

ఆ జోకేంటంటే:

ఒక భర్త డాక్టరు దగ్గరకెళ్ళాడు. 
ఏం కంప్లైంటు అంటే - "డాక్టరుగారూ - ఐదు సంవత్సరాల నుంచి మా ఆవిడ రోజూ ఏది చేతికి దొరికితే అది తీసుకుని కొడుతూ వున్నది - తప్పించుకోలేకపోతున్నాను" అంటే
"మరి నువ్వేం చేస్తున్నావు" అనడిగాడు డాక్టర్.
"ఇంతవరకూ తప్పించుకుంటున్నానండి - ఎట్లాగో మేనేజ్ చేస్తున్నాను"
"మరిప్పుడేమయింది?"
"ఇప్పుడామె గురి తప్పకుండా కొడుతున్నది - ఎట్లా తప్పించుకోవాలో చెప్పండి " అన్నాడా భర్త.

అవధానిగారు చెప్పిన జోక్ నవ్వులు పూయిస్తే - "ఎట్లాగూ పద్యంలో మన్మధ బాణాల  ప్రసక్తి వచ్చింది కాబట్టి - గురి తప్పకుండా కొట్టడం వచ్చింది కాబట్టి ఎప్పుడూ పూలదండలూ, పూలు అవీ ఆవిడకి అందుబాటులో ఉంచితే ఆయన పని కొంచెం బావుంటుంది" - అంటూ ఇంకొన్ని నవ్వుల బాణాలేశారు నారాయణస్వామిగారు.

సురముగ సూన సాయకుడు సూటిగ బాణములేయుచుండ బం - అంటూ సమస్యాపూరణంలో రెండో పాదం పూర్తిచేశారు అవధానిగారు.

దత్తపది రెండవపాదం:
సరాల సౌరభాలు సారసాల మాలగా - అవధానిగారి రెండో పాదం పూరణ
రసాలూరుతున్నాయి - అంటూ నారాయణస్వామిగారి శ్లాఘన.

"అవధానిగారూ - ఇన్నిసార్లు అమెరికా వచ్చారు మా డాలరు నోట్లని చూసేవుంటారు - ఆకుపచ్చగా ఉంటాయి - పచ్చగా వున్నాడు అంటే బాగా డాలర్లువెనకేసుకున్నాడు అని అర్థం. మొన్నీ మధ్యనశ్రీపాద సుబ్రహమణ్యశాస్త్రిగారి అనుభవాలూ-జ్ఞాపకాలూ అన్న జీవిత చరిత్ర చదువుతూ ఉంటే అందులో ఆయన ఒక ఊరి కామందుగారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమంటే ఆయనొక పచ్చనోటిచ్చాడు అని రాసుకున్నారు - మరి ఆరోజుల్లో ఇండియాలో కూడా ఈ డాలరు నోట్లుండేవంటారా?" అన్న నారాయణస్వామిగారి ప్రశ్నకి సమాధానంగా రామారెడ్డిగారొక పాటను గుర్తుచేసుకుని - పచ్చజండా ఊపితే రైలు బండి వెళ్తుంది, పచ్చనోటు లేకపోతె జీవితపు బండి నడవదు - అంటూ మనకీ పచ్చనోట్లున్నాయి అని చెప్పి -

వర్ణన రెండో పాదం : నీలమేఘము నిగ్గులు నింపుకుని

న్యస్తాక్షరి రెండో పాదం: ఐదో అక్షరం - రి: జీవ తో మొదలుపెట్టాం కాబట్టి వ-కారం ప్రాస అంటూ చెప్పిన రెండోపాదం: పావన హారి భూజముల పచ్చదనమ్ములు పల్లవింపగా 

తర్వాత ప్రబంధ పఠనం వర్ణన ఎక్కువ లేకుండా ఇవ్వమని కోరారు అవధానిగారు - ఆలోచించడానికి సమయం ఎక్కువ లేదని.

దిట్టకవి సుందర్‌గారు శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదలోని పద్యం చదివారు. ఆ పద్యం వింటూనే - అవధానిగారు - ఈ పద్యం ఒక మఱ్ఱిచెట్టుని వర్ణించినది - మాలదాసరి కథలోనిది. మాలదాసరి మారులుతీగ తొక్కి దారితప్పి ఒక అరణ్యమధ్యానికి - ఒక పెద్ద మఱ్ఱి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మఱ్ఱిచెట్టుని శార్దూలంలో వర్ణించారు శ్రీకృష్ణదేవరాయలు. ఆ పద్యం కూడా శార్దూలంలా మన మీద పడుతుంది - అంటూ వివరించి ప్రబంధపఠనం అంశాన్ని ముగించారు.

[ప్రబంధపఠనం అంశాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి రాసుకోవాలి నేను - ఇందులో ఆముక్తమాల్యదలోని పద్యాన్ని  - నారికేళపాక - శార్దూలాన్ని - చేపలకూరని వర్ణిస్తూ ఉన్నదాన్ని - చాలా ఇష్టంగా  రామారెడ్డిగారు తలుచుకున్నారు - వింటూ రాయడానికి కూడా చాలా సమయం తీసుకునేలా వున్నాయి అవి - తర్వాత తీరిగ్గా వున్నప్పుడు వచ్చి చేరుస్తాను వాటిని.]

తర్వాత ఆశువు - బండ్ల హనుమయ్యగారు "డొనాల్డ్ ట్రంప్ గారి పేరు మీరు వినే  వుంటారు - మంచో చెడో ఒక ప్రభంజనంలా వచ్చి అలజడిని సృష్టించాడు - ఆ ట్రంప్ గురించి ఓ పద్యం చెప్పండి" అని కోరారు.

రామారెడ్డిగారి ఆశుకవిత:

అమెరికా దేశ సౌభాగ్యమతిశయింప  - అడుగు అడుగున ప్రత్యర్థులంతరింప 
కఠిన నిర్ణయ కౌక్షయ ఘాతములను - ట్రంపు డొనాల్డు ధీరత నింపుచుండె 
(కౌక్షయం అంటే ఖడ్గం.)

ఇప్పుడింక మూడో వరస:
నిషిద్ధాక్షరి (జవ్వాది రమణగారు)

మళ్ళీ బ (నిషేధం) అని మొదలు పెట్టబోయారు కానీ అష్టావధానానికి కేటాయించిన సమయం మించిపోతోందని అవధానిగారు మూడో పాదం నిషేధం లేకుండా పూర్తి చేయడం మొదలుపెట్టారు  - లీనమ్ముగా చిత్రమ్ముగా మాన - అంటూ.

అప్రస్తుతప్రసంగం: "అవధానిగారూ మీ పద్యాల్లో బాగా మంచి భావుకత, రసోత్పత్తి - రసం మంచి రుచిగా ఉంటోంది  ఇటువంటి రసవత్తరమైన పద్యాలు అల్లటానికి, చెప్పటానికి ఈ చేపల కూరల్లో రుచికి ఏమన్నా సంబంధం ఉందంటారా?" అని అడిగిన నారాయణస్వామిగారి ప్రశ్నకి "చేపల కూర పద్యం చెప్పానని అలా అడుగుతున్నారా అని నవ్వి దానికి - దీనికి సంబంధం ఏమీ లేదు' అని సమాధానమిచ్చి - నిషిద్ధాక్షరిలో మూడోపాదం - లీనమ్ముగా చిత్రమ్ముగా మానవ - చెప్పి సమయాభావం వల్ల నాలుగోపాదం కూడా పూరించేశారు : బాహుబలి రీతి మన్నన గాంచెన్ . 


పద్య రచనా ప్రక్రియలో వచ్చిన అంశాలలో ఇప్పుడు విడివిడిగా చెప్పిన పాదాలనన్నీ కలిపి చివరిలో ఏ పద్యానికా పద్యం ధారణ చెప్తారు అవధానిగారు - అని చెప్పారు అధ్యక్షులు మరియు నారాయణస్వామిగారు.

సమస్యాపూరణం లో మూడో పాదం:

కిందటి పాదంలో చివరి అక్షరం బంకలుపుకుని
(బం)ధురముగ  విక్రమించి కడు ధూర్తత నిత్యము చూపుచుండెగా

 వర్ణన మూడోపాదం మరియు నాలుగోపాదం : 

విజయచాపము రణమున విక్రమింప
బాణవర్షము కురిపించె  పాటవమున

అప్రస్తుతప్రసంగం: బాణవర్షం అనేటప్పటికి గురువుగారూ - అన్నమయ్య ఒక సంకీర్తనలో నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొనచూపులు నిలువునా పెరుకగా అంటిన నెత్తురు కాదు కదా? - అని రాశాడు - ఈ చూపుల తూపులు అమ్మవారు అయ్యవారి మీదకి వేసిందా? అయ్యవారు అమ్మవారిమీదకి వేశాడా?

అవధానిగారి సమాధానం: ఇద్దరి చూపులు తూపులేకదా? పరస్పరం రువ్వుకుంటారు అయినా అవి నిజంగా రక్తాలొచ్చే గాయాలేం కాదు - అవి మధురగేయాల్లాంటి గాయాలు - ఉత్ప్రేక్షాలంకారంలో చెప్పారన్నమాట.

దత్తపది మూడో - నాలుగో పాదాలు: 

వరాల హృద్య పద్య పాళి తాన కంఠమాలగా
నరాల రామరెడ్డి వంద నందనాలు పూయగా 

న్యస్తాక్షరి - మూడో పాదం: ఏడో అక్షరం - త:

భావన పొంగు చేముల  స్వర్ణ వసంతము పుల్కరింపగా 

నాలుగో పాదం: తొమ్మిదో అక్షరం - ము:  

శ్రీ విలసిల్లి ఈ జగము చిక్కని శోభలు నింపుగావుతన్ 

ఇప్పటికి  నాలుగు విడతలు పూర్తయింది - ఇంకొద్ది నిముషాల్లో శ్రీ రామారెడ్డిగారు వీటన్నిటినీ ధారణ చేసి - అన్ని పద్యాలూ ప్రదర్శించారు.

నరాల రామారెడ్డిగారి ధారణ:
 
నిషిద్ధాక్షరి:

సోదరులు జువ్వాది రమణగారు బాహుబలి గురించి చెప్పామన్నారు. బాహుబలి నంబర్ వన్, నంబర్ టూ తర్వాత భారతదేశమే కాకుండా ప్రపంచమంతటా బాహుబలి-జ్వరం పట్టుకుంది - చలిజ్వరం లాగా. అది మనక్కూడా తప్పలేదు. నిషిద్ధాక్షరిలో అది నిషేధం చేయలేని పరిస్థితి గదా!

ఔనా మానస కాంక్షా
దీనావధి పూజ్య ధామ దీక్షారూపా 
లీనమ్ముగా చిత్రమ్ముగా మానవ
బాహుబలి రీతి మన్నన గాంచెన్  

సమస్యాపూరణం:

(మధురవాణి! అని సంబోధిస్తూ ధూర్తత అనే లక్షణం గిరీశం కూతురులా వుందే - అని చెప్తున్న చమత్కారం ఈ పద్యంలో వుంది.)

పరువము పాలపొంగువలె పరువులు తీయు వసంతవేళ భా
సురముగ సూన సాయకుడు సూటిగ బాణములేయుచుండ బం
ధురముగ  విక్రమించి కడు ధూర్తత నిత్యము చూపుచుండెగా  
వరుసలు జూడగా మధురవాణి! గిరీశము కూతురౌ గదా


దత్తపది: 

(తరాల -సరాల - వరాల-నరాల అనే పదాలు వాడి తానా సభల గురించి పంచచామరం అనే వృత్తంలో చెంగు-చెంగున ఎగురుతున్నట్టుగా చెప్పిన హృద్యమైన పద్యం ఇది.)

తరాల దాక సాగుగాక తారలుండు దాక పూ
సరాల సౌరభాల సారసాల మాలగా 
వరాల హృద్య పద్య పాళి తాన కంఠమాలగా
నరాల రామరెడ్డి వంద నందనాలు పూయగా
వర్ణన:

రామరూపము నయనాభిరామమగుచు
నీలమేఘము నిగ్గులు నింపుకుని 
విజయచాపము రణమున విక్రమింప 
బాణవర్షము కురిపించె  పాటవమున

న్యస్తాక్షరి:
 హ-రి-త-ము - ఇతివృత్తం పర్యావరణ రక్షణ - వృత్తం-ఉత్పలమాల - ప్రకృతికి సంబంధించిన ఇతివృత్తం -అంటూ అన్ని అక్షరాలను బేసిసంఖ్యలో - 3, 5, 7, 9 - తీసుకుని - న్యస్తాక్షరి సమస్యనిచ్చారు చంద్రహాస్‌గారు.

జీవహరాంతరాయముగా స్నిగ్ధ జగమ్ములు రూపుమాపకన్ 
పావన హారి భూజముల పచ్చదనమ్ములు పల్లవింపగా
భావన పొంగు చేముల  స్వర్ణ వసంతము పుల్కరింపగా   
శ్రీ విలసిల్లి ఈ జగము చిక్కని శోభలు నింపుగావుతన్


[ఈ అష్టావధానం వీడియో తీసి, పంచుకున్న శ్రీ కూచి శాస్త్రిగారికి బోల్డన్ని ధన్యవాదాలు]


 



ఉపసంహారం: 

వీడియో వుంది కదా - రెండు ముక్కలేవో చెప్పి అది పోస్ట్ చేసేస్తే సరిపోతుంది కదా అనిపించింది చాలాసార్లు - కానీ తరతరాల తెలుగువారి సాహితీసంపదైన పసందైన అష్టావధానాన్ని - అంత పెద్ద వయసులో, అలసట (jet-lag) తీరకపోయినా - తమ కష్టం కనిపించనీయకుండా - తెలుగు మీద, పద్యం మీద ఎంతో ఇష్టంతో - ఆ హాలులో వున్న అతి కొద్దిమందే అయినా - నిరుత్సాహ పడకుండా -  సరే తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఉత్సాహపడిన తెలుగు మాష్టారు-అవధాని నరాల రామారెడ్డిగారి మీద అభిమానంతో - మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా చదువుకోవడానికి వీలుగా నేను రాసుకున్న అష్టావధాన-పాఠం ఇది.  వీడియోలో ఉన్నది ఉన్నట్లు అంతా రాయలేకపోయాను కానీ ప్రధాన అంశాలు మాత్రం వదల్లేదు.

తెలుగు మీద నాకున్న ఎంతెంతో ఇష్టం - నాకొచ్చిన అంతంత మాత్రపు తెలుగులో...


ఎల్లలు దాటినా - తల్లి చాటునున్న తలపునిచ్చు
మెల్లగ అన్ననెవరైనా - చెవుల సోకి మనసు విచ్చు
చల్లని గంధపు పూతల హాయినిచ్చు
మల్లెల జాజుల మైమరపుల తావినిచ్చు
కమ్మనైన తెలుగు మాట మనది -
పలికితే పదికాలాలు మనవచ్చు 
నేను-నీవును మనము చేసి మనుమను దీవెనిచ్చు



13 కామెంట్‌లు:

  1. వీడియో పెట్టినా కూడా మీరు వివరంగా వ్రాయటం నాకు నచ్చింది. ఒకటి, అష్టావధానం గురించి తెలుసుకోవాలంటే టూకీగా ఇది చదివితే చాలు (cheat sheet). రెండు, మీ జ్ఞాపకాలని అక్షరబద్దం చేయటం. మూడోది తెలుగు మీద మీకున్న అవ్యాజమైన ప్రేమ. క్లుప్తంగా మీదగ్గరనుంచి మరో బహుమంచి పోస్ట్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్లుప్తంగానే అంటూ ఎంత మంచి మాట చెప్పారు - ధన్యవాదాలు!

      తొలగించండి

  2. బాగు బాగు !


    సరసిజ నాభ సోదరి! విసంచితివే ! గురజాడ పొత్తమున్
    బిరబిర చూచినాను! కనిపించిన వారిని ప్రశ్న వేసితిన్
    "వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా?"
    సరియని చెప్పలేమనుచు సారము దెల్పె, బుజంగికాయటన్!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. నేనింత కళ్ళకు కట్టినట్టు రాయడానికి ముఖ్య కారకులు మీరు, సర్! మీకు నా కృతజ్ఞతలు.

      తొలగించండి
  4. FANTABULOUS. I wish I had been there to enhoy these proceedings. Thanks in tons.

    రిప్లయితొలగించండి

  5. మొత్తం వీడియో చూసాక
    అనిపించిందేమిటంటే కొత్తపాళి వారు
    ప్రస్తుత ప్రసంగం ఎక్కువ అప్రస్తుతానికన్న :)

    సంచాలకులగా కొత్తపాళి మారాలి :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. అరయగ - నిట్టిపోష్టు - 'లలిత'మ్మను నిట్లనవచ్చునేమొ ,
    అరుదగు కన్యశుల్కమున నద్భుతపాత్ర యిదంచు చెప్పెదన్ ,
    సరస వచో విభూషితులు చక్కని నాన్నకు ఈవిడేమగున్ ,
    వరుసలు - జూడగా - మధురవాణి , గిరీశము , కూతురౌ గదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బావుందండి సమ్మస్యాపూరణం :) - మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  7. అష్టావధానం 101 కోర్సు లా బాగా చెప్పారు. ఇంతకు ముందు తెలియని విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు లలిత గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అష్టావధానం గురించి వినడమే కానీ ఇంత కుదురుగా - పూర్తిగా చూసి తెలుసుకునే అవకాశం నాకూ ఇదే మొదటిసారి. అందుకే రాసుకోవాలనిపించింది - నాకే ఒక రిఫరెన్స్‌లా. మీకు నచ్చినందుకు సతోషం.

      తొలగించండి