27, అక్టోబర్ 2017, శుక్రవారం

భేజా-రిగ్రెట్... అని ఆట్టే అనిపించని - రవితేజాదీ Trait !

అనగనగా కిందటి శుక్రవారం...ఎప్పట్లాగే కాళ్ళకి స్ప్రింగులు మొల్చువారం - కంటిరెప్పలు ఎక్కువగా విచ్చి రాత్రిని కొల్చువారం. 

పొద్దున-పొద్దున్నే నమస్కార్దేశీ డాట్కామ్ ఈమెయిల్ మోసుకొచ్చిన వార్తలేంటంటే -
అదేదో హోటల్లో తినదల్చుకున్నవారికి తిన్నన్ని అట్లు - ఇదేదో థియేటర్లో చూడదల్చుకుని రెండ్రోజుల్లో చూడకపోతే చూద్దామన్నా చూడలేని సినిమాలు.

మొదటిది పెద్ద పట్టించుకోదగ్గ విషయమేమీ కాదు - తినుట తిరుగుట కొరకే గానీ - తినుటకు తిరుగుట అలవాటు అంతగా లేని వారం - దోసెల వార్తని పక్కకి తోసేసి - సినిమాలేమున్నాయబ్బా అని కనులార్చక చూస్తే - తెలుగు సినిమాల పట్టికలో పట్టించుకోదగినదిగా - రాజా ది గ్రేట్ - కనిపించింది.

ఒక్క నిముషం...  ఎందుకొచ్చిన సినిమా - అనవసరంగా ఒక శుక్రవారపు సాయంత్రం భేజా రిగ్రెట్ అవుతుందేమో! - అనిపించినా ధైర్యే సాహసే సిని-మా-లక్ష్మీ అనేసుకుని - బదరికి నా సినీ-మనవి చేసుకోగానే - "రవితేజానా హీరో? - పాపం ఈ మధ్య హిట్లేమీ లేనట్టున్నాయి కదా - వెళ్దాం" - అని ఏకగ్రీవంగా యుగళ-మాట అనేసుకున్నాం.

ఎవరైనా సినిమాలు హీరో మీద ఇష్టంతో చూస్తారు - హీరోయిన్ ఎలా ఉంటుందా అని ఇంట్రెస్టుతో చూస్తారు - మేం మాత్రం అప్పుడప్పుడు జాలితో కూడా చూస్తాం.

అందులోనూ - నిరుడో, ఆ పై ఏడాదో, ఇంకా ఆ ఆ పైదో - నిప్పో, దరువో - గుర్తు లేదు కానీ ఇలాగే రవితేజ సినిమా అని వెళ్తే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళకుండానే దార్లో ఎదురొచ్చిన వాళ్ళు చెప్పారు - సినిమా బాలేదని షో కాన్సెల్ చేశారండి - అని.

అప్పుడనిపించింది - "ఒక తాతగారి అంశో, ఇంకో తాతగారి వంశమో లేదనే కదా పాపం - ఇలా చేసి వుంటారు. పాపం రవితేజ!" -  అని.

చిన్నప్పడు సినిమా అంటే ఏంటో తెలీని రోజుల్లో - అమ్మా-నాన్న అభిమానంగా తలుచుకునే కమలాకర కామేశ్వర్రావు పౌరాణికాలు, విజయావారి సినిమాలు, విఠలాచార్య జానపద-విన్యాసాలు - ఆ తర్వాత శంకరాభరణం నుంచి శుభసంకల్పం దాకా కాశీనాథుని విశ్వనాధుల స-కారాద్య-చిత్ర-పరంపర - ముళ్ళపూడి రాశారని, బాపు గీశారని చూసిన బొమ్మలు - ఇంకొన్నాళ్ళు రాజేంద్ర ప్రసాద్ పేరు చూసి వెళ్ళిన సినిమాలు - అన్నజింక కిష్టమని చూసిన సిద్ధార్థ, మహేష్బాబు సినిమాలు - నవ్విస్తాడని నరేష్ సినిమాలు - నచ్చుతాయని నాని సినిమాలు - రమ్యంగా వుంటాయని రాజమౌళి సినిమాలు - ఇలా రకరకాల కారణాలకు ఏక-హీరో / ఏక-దర్శక సినిమాలు చూసే - మేము చూసే - ఇంకో ఏక-హీరో సినిమాలు రవితేజావి కూడా.

ఇడియట్టుతో మొదలుపెట్టి కిక్కు దాకా బానే చూశాం - దరువు దెబ్బేసేసింది. అదుగో... అప్పణ్ణుంచీ ఇప్పటిదాకా - దడుపు జ్వరం వచ్చినవాళ్ళలా మళ్ళీ రవితేజా-సినిమా పేరెత్తలేదు మేం.

కిందటి గురువారం దీపావళికి నాలికకి రుచించే పులిహోర భోజనం - మరుసటి రోజు శుక్రవారం బలిపాడ్యమికి (పన్నేమీ లేదండి!) ప్రణాళికేసుకుని వేంచేద్దామనుకున్న రాజా ది గ్రేట్  సందర్శనం.

సరే - మేమనేసుకుంటే సరిపోదు కదా! బుజ్జిజింకని ఒప్పించాలి కదా!

ఎప్పట్లాగే నా సినిమా-వేడుకోలు... వాడి రాననే-జవాబు-ఇచ్చుకోలు...  షరా మామూలు.

వాడిని అడిగీ-అడిగీ అలసటొచ్చి ఆఖరి అస్త్రంగా - అప్పుడెప్పుడో మా నాన్న నన్ను ఇండియా రమ్మని అడుగుతూ - 'బదరిని ఈ పాట పాడుతూ అడగనా నిన్ను పంపించమని'  అంటూ గుర్తు చేసిన "మా అన్నలొచ్చారు నన్నంపుతారా" పాట నమూనాలో - ఇదిగో ఈ పాట కట్టి - బుజ్జిజింకని బతిమిలాడి ... ఒప్పించడానికి ప్రయత్నించాను.

కలిపి ముద్దలు పెట్టే నీ కన్నతల్లీ
అడుగుతున్నది గూగుల్ సెర్చు జేసి
ఇపుడు వద్దనకు నా బుజ్జిజింకా
ఈ ఒక్కసారీ సినిమాకొస్తావా
నే...రాను నే...రాను - మీరెళ్ళి రండి

కౌచులో కూర్చున్న ఓ బుజ్జిజింకా
సిన్మాకు వెళ్దాము నువ్వు మాతో రారా
నే...రాను నే...రాను - మీరెళ్ళి రండి  

రాక రాక వచ్చె రవితేజ సినిమా
పాపమెవ్వరు చూడకపోతె ఫ్లాపౌను సినిమా
ఇపుడు వద్దనకు నా బుజ్జిజింకా
ఈ ఒక్కసారీ సినిమాకొస్తావా 


మొత్తానికి - ఆఫీసైన వెంటనే ఐదింటికి మొదలుపెట్టి ఏడున్నర అయేటప్పటికి -

ఈ ఒక్కసారికే సినిమాకొస్తా ఇదే ఆఖరను
ఇంకెప్పుడూ నన్నింక రమ్మనద్దు రాలేను నేను   

- బుజ్జిజింక చేత 'సరే' అనిపించగలిగాను మా- సిని-మా-ప్రయాణానికి.  

రాత్రి తొమ్మిదిగంటల-ఇరవై షోకి బయల్దేరేటప్పటికి పావుతక్కువ తొమ్మిది అయింది.

వెళ్ళేటప్పటికి పది-నిముషాలు సినిమా అయిపోయింది.

ఆ తర్వాతి పదినిముషాల్లో - ప్రతి సినిమాలో పదినిముషాలే వుండే కనకాల వారి వారసుడు - పదంకెలు లెక్కపెట్టి పనైపోయిందన్నట్టు - సినిమాపాత్రావతారం చాలించాడు.  అతని వెనకాలే ఇంకో పదంకెలు లెక్కపెట్టే లోపు ప్రకాష్ రాజ్ కూడా పాత్రను పరమాత్మ పరం చేశాడు.

తన తమ్ముడిని చంపించిందన్న పగ తీర్చుకోవాలనుకుంటున్న విలన్ బారి నుంచి హీరోయిన్ని రక్షించాలంటే ఎవరో ఒకరు రావాలి అనుకున్న వేళ - హీరో ఎంట్రీ.

అన్ని కథలకన్నా ఇదో వెరైటీ కథ ఎలా అయిందంటే హీరో అందమైన-అంధుడు - పైగా కళ్ళు కనిపించకపోయినా ఇన్విన్సిబుల్ అయినవాడు.

హీరో- హీరో వాళ్ళమ్మ పదేపదే చెప్పినట్లుగా - He is blind, but he is trained - తన చెవులతో విని, చేతులతో ముట్టుకొని - కాళ్ళ కింద ఉన్న నేల, చుట్టూ ఉన్న గాలి - మాత్రమే కాకుండా - చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని, మనుషుల్ని తన అధీనంలోకి తెచ్చుకోగలిగినవాడు - అందమైన అంధమైన హీరో - అంధీరో. 

ఆట్టే కథ చెప్పేయకుండా ఈ అబ్సర్డిస్ట్ కామెడీ సినిమాలో నాకు ఒప్పినవి చెప్పాలంటే:

1) మొదటగా చాలా రోజుల తర్వాత  హీరోగా వచ్చిన రవితేజా - తన హడావిడి ఏక్షన్, డాన్సులు.

2) తండ్రి (హీరో) చిన్నప్పటి  పాత్రలో నటించిన రవితేజ-తనయుడు.

3) రవితేజా తల్లిగా చేసిన రాధిక.

4) క్లీన్-కామెడీ చేసిన  శ్రీనివాసరెడ్డి.

5) ఒక పాటలో కనిపించినట్టనిపించిన డాన్స్ డైరెక్టర్ రాజు సుందరం (సినిమాల్లో అస్సలేమాత్రం ఊహించనప్పుడు - కథకే మాత్రం సంబంధం లేని వాళ్ళు ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోయే ఇలాంటి చమక్కులంటే నాకిష్టం)
 
6) ఇంకో పాటలో - హీరోయిన్‌తో పాటు మెరిసిన - ఇంకో హీరోయిన్ రాశీఖన్నా (ఈ అమ్మాయింకో చమక్కు - నచ్చడానికి అంతకన్నా కారణమింకోటేమీ లేదు) - వాళ్ళిద్దరూ వేసుకున్న లేతరంగుల పరికిణీలు-ఓణీలు.
 
7) 'ఆట్టే నటించేస్తానని ఊహించేసుకోకండి' అంటున్నట్టు - అంటూనే అలానే ఉంటున్నట్టు - 'నేను రాయిని - నాకు ఫీలింగ్స్ వుండవు' - అంటూ ముందే disclaimer ఇచ్చేసిన హీరోయిన్ మెహరీన్.  ముందుగానే చాలా low-expectation సెట్ చేస్తున్నట్టుగా మాట్లాడినా - మరీ రాయిలా ఉండకుండా - మరీ సినిమా అంతా కాకపోయినా అక్కడక్కడైనా  సీనుకి తగ్గట్టుగా నటించడం.

8) "ప్రసాదూ!" అని పిలిచి inter-era ప్రశ్నలడిగి వాటికి contemporary సమాధానాలు చెప్పిన  రాజేంద్రప్రసాదుని బాదేసిన తల్లి అన్నపూర్ణ.

9) ఆవిడ ఎందుకలా బాదుతోందో - అలా బాదకుండా ఉండాలంటే - ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్పిన రవితేజా లాజిక్కు.

10) Google maps ని ప్రమోట్ చేసిన పధ్ధతి.

11) కళ్ళు లేకపోయినా పర్వాలేదు - అసలుండాల్సింది కాన్ఫిడెన్ అన్న సినిమా-సందేశం.

12) రవితేజాని జాలి కలిగేలా కాక జాలీగా చూపించిన తీరు.


ఇంకెప్పటికీ తెలుగు సినిమా మారదని ఇంకొక్కసారి నొక్కి-వక్కాణిస్తూ అక్కజ పరచిన నిక్కమైన విషయాలు:

1) కళ్ళ-బలం, కాళ్ళ-బలం ఉన్న పోలీసులతో పోటీపడి కళ్ళులేని-హీరో చెవులతో ఆడి కబడ్డీ గెలవడం అనే విషయాన్ని నోరెత్తకుండా చూసే సినీ-సహనం నాకు సైతం అలవడడం.

2) మామూలు పోలీస్ కానిస్టేబులైన హీరోతల్లికి లేక్-వ్యూ ఉన్న ఇల్లు ఉండడం.

3) మామూలు పోలీస్ కానిస్టేబులైన హీరోతల్లి ఐజీకి ఆదేశాలు ఇవ్వడం - "పదండి సర్ - నా కొడుకు పడతాడు ఈ విలన్ పని" అంటూ.

4) పోలీసుల కన్నా హీరో ట్రైనింగ్ మిన్నగా ఉండడం.

5) ఏ ఆధారం లేకుండా హీరో వేగంగా వెళ్ళే (లేక వెళ్తోందని అనుకోవాల్సిన) ట్రెయిన్ మీద నించుని - Google maps సహాయంతో తను దిగాల్సిన చోట్లో దొరికిన స్తంభం పట్టుకుని సరిగ్గా దిగడం.

6) చెయ్యి నరం తెగిన తల్లిని కళ్ళు లేని హీరో సరిగ్గా ఇరవై నిముషాల్లో కనుక్కుని హాస్పిటల్లో చేర్చీ చేర్చగానే రెండ్రోజుల్లో ఆవిడ కోలుకోవడం.

7) ప్రతి సినిమాలో లాగే - ఒక్కసారిగా మీదపడి హీరోని కొట్టకుండా - అదేదో క్యూ-పద్ధతి మీద గౌరవం ఉన్నవాళ్ళలా విలన్లు ఒక్కొక్కళ్ళు వెళ్ళికొట్టించుకోవడం.

8) డార్జిలింగ్ వెళ్తున్నట్టు చూపించే సీనులో Air-India (అంతర్జాతీయ) విమానం చూపించడం - Indian Airlines (Domestic) బదులు. 

ఎప్పట్లాగే పట్టించుకోని విషయాలు (పట్టించుకుంటే సిన్మా చూసిన ఫలితం ఉండదుకాబట్టి):

1) అర్థం-పర్థం లేని Bank దోపిడీ సీను. 
2) హాస్యం పేరుతో ఊరికే చెంపదెబ్బలు కొట్టుకునే నటీ-నటులు. 
3) గందరగోళంగా ఉన్న సంగీతం.
4) గుర్తు చేసుకుందామన్నా గుర్తు రాని పాటలు (ఒక్క ఎన్నియల్లో అన్న మాట తప్ప).
5) ఒక్కోచోట అవసరమైన దానికన్నా ఎక్కువ శృతిలో ఉన్న డైలాగులు. 
6) ఇంకా ఇలాంటివెన్నో ఎన్నెన్నో...

మొత్తానికి ... కొంచెం భేజా-రిగ్రెట్ అయేలా 
కొంచెం రవితేజాదీ trait అనేలా
ఇంతకు ముందెన్ని చూడలా అనేసేలా  
పాపం! ఈ ఒక్కసారికి చూస్తే పోలా అనుకునేలా 
రాజా ది గ్రేట్ అనబడే ఈ మాస్-మసాలా
అనేకానేక వచ్చీ-పోయే తెలుగు సినిమాల్లో 
ఒకానొక absurdist comedy.

19, అక్టోబర్ 2017, గురువారం

త్వామనురజామి - 18 - పాడకున్న ఏమిలే - చదివేద్దాం రాతలే!

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి : త్వామనురజామి - 17 - మాట లేని రోజు అది - వాక్కు లేని walk అది!


డిసెంబర్ 20 - కాలేజ్ తొందరగానే అయిపోయింది.

రేపటి ప్రయాణం - ఇంటికి వెళ్తున్నాం అనే ఆలోచనే - అనుకోవడానికే భలే హాయిగా వుంది.
అమ్మాయిలు మామూలుగానే మాటల-జలపాతాలు
ఇప్పటికి...
కొంచెం కొంచెంగా పెరిగి కుంౘమంతైన
ఇంటికేగుతున్నామన్న ఇంపగు తలపు
ఇంతింతై మది పట్టలేనంతై
పెదవులపై దాగని చిరనవ్వై
పుడమిపై నిలవని పాదాల మువ్వై
వర్షానికి తడిసిన చెట్టు మీది నుంచి
జల జల రాలే చినుకుల్లా
పలకరిస్తేనే చాలు గలగలలాడే కబుర్లై
సెలవుల్లో రాబోయే పండగ సరదాల ఊహలై
ఒకచోట నిలవనీయకుండా సందడి చేయిస్తోంది మా అందరిచేతా

ఇంత హడావిడి మధ్య - అలిపిరి దగ్గరగా ఉన్నఒక రెసిడెన్షియల్ కాలనీలో వున్న - తిరుమల-నడక దారిలో కొత్తగా దొరికిన మా తమ్ముడు రవికుమార్ ఇంటిని - వెతుక్కుంటూ వెళ్ళి - వాళ్ళ ఇంట్లో పెట్టిన జంతికలు తినేసి, ఆరోజుకి హాస్టల్లో మిస్సైపోయిన టీ సేవించేసి - అడగ్గానే సనం తేరి కసం పాట నేను పాడేసి - మాకోసమని రవి వాళ్ళ నాన్నగారు ప్రత్యేకంగా తెప్పించిన తిరుపతి ప్రసాదం - లడ్డూలు, వడలు బోల్డన్ని మాతో తెచ్చేసుకున్నాం - నేను, మా క్లాసులో ఇంకొందరు అమ్మాయిలు.

ఆ రోజు రాత్రి డిన్నర్ అయాక - మా జంట-మేట్రన్లు కణ్ణగి, కొదై లతో పాటు - ఎప్పుడు నాకెదురుపడ్డా ఎంతో ఇష్టంగా నన్ను చూస్తూ - చిన్న నవ్వుతో పలకరించే ఇంకో అసిస్టెంట్ మేట్రన్ ఇందిరగారు - అందరికీ పేరుపేరునా ఊరికి వెళ్తున్నాను - సెలవులకి అని చెప్పి - రూంకి వచ్చి - సూట్‌కేస్ సర్దేసుకున్నాను.

డిసెంబర్ 21. ప్రయాణం రోజు.

ఈసారి గుంటూరు,  హైదరాబాదు  వెళ్ళే అమ్మాయిలమంతా ఒకే కంపార్ట్‌మెంటు అని ముందే తెలియడంతో ఎప్పుడెప్పుడు ట్రెయిన్ ఎక్కి పాటలు పాడేసుకుందామా అని తెగ ఉత్సాహ పడిపోతున్నాను.

ముందే అనుకున్నట్టు నేను, శ్రీలత ఒక రిక్షాలో వెళ్ళాము స్టేషన్ కి.

తిరుపతి రైల్వేస్టేషన్ లోకి వెళ్ళగానే - అబ్బ! ఎంత సందడో - ఎంత హడావిడో! బోల్డంత మంది అమ్మాయిలు - చీరల్లో, చుడీదారుల్లో.

నేను కూడా నాకు ఇష్టమైన ఒక నీలపుడుపు వేసుకుని దానిమీద - డిసెంబర్ నెల కదా - చలిగా వుందని శ్రీనన్న అంతకుముందు బెంగళూరులో కొనిచ్చిన తెల్ల స్వెటర్ వేసుకుని - ఒక చేతిలో నా పింక్‌బాగ్ , ఇంకో చేతిలో సూట్‌కేస్ పట్టుకుని - దాని బరువుకి ఒక పక్కకి ఒంగి నడుస్తూ శ్రీలతతో కలిసి నా కంపార్ట్‌మెంటు, సీటు వెతుక్కుంటూ చార్టులు చదువుకుంటూ - రైలు పెట్టెల పక్కగా నడుస్తున్నాను.

మాలాగే కంపార్ట్‌మెంట్లు వెతుక్కుంటూ - అటూ ఇటూ నడుస్తూ - పలకరిస్తున్న అమ్మాయిలందరికీ - Merry Christmas, Happy New Year, HappyPongal...and Happy Holidays - అని గట్టిగా అరుస్తూ విషెస్ చెప్తూ - పాదాల్లో స్ప్రింగులు మొలిచినట్లుగా నడుస్తున్నాను.

ఈలోగా నిరుపమ కనిపించి  - "మన కంపార్ట్‌మెంట్ ఈ పక్కదే - పద " - అని చెప్తే అటుకేసి వెళ్తూ చూస్తే  - దూరంనుంచే - మా కంపార్ట్‌మెంట్ మెట్ల దగ్గర ఒక పక్కగా నించుని  - 19వ తారీఖున రాజశేఖర్ తో కలిసి మా హాస్టల్ దగ్గరికి వచ్చిన ఆ మూగ-MBA-అబ్బాయి కనిపించాడు. చుట్టూ అతని ఫ్రెండ్స్ చాలా మంది వున్నారు.

అతన్ని చూడగానే - ఎంత ఎక్సైటేడ్ గా అనిపించందంటే - చేతిలో ఉన్న సూట్‌కేస్ అక్కడే వదిలేసి - నిరుపమని చూస్తూ ఉండమని చెప్పి - ఒక చేత్తో శ్రీలత చెయ్యి పట్టుకుని "ఇలా రండి " అని   "ఏంటి లల్ల్లీ - ఎక్కడికి? ఎందుకీ పరుగు - ట్రెయిన్ కదలడానికి ఇంకా టైంవుంది కదా?" అంటూనే నాతో సమానంగా పరిగెడుతూ - తను అడుగుతుంటే - "చెప్తాను ఉండండి" - అంటూ లాక్కెళ్ళి ఆ అబ్బాయి దగ్గర ఆగాను.

హఠాత్తుగా - హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన నన్ను, శ్రీలతని చూసి - అతని ఫ్రెండ్స్ అందరూ అప్పటిదాకా మాట్లాడుకుంటున్న వాళ్ళు మాటలాపేసి మాకేసి చూస్తున్నారు.

నేను కొంచెం ముందుకి వంగి - (మూగబ్బాయి కదా - చెవులు కూడా వినిపించవేమో - పోనీ గట్టిగా మాట్లాడితే వినిపిస్తాయేమో - అసలు నాకేమనిపించిదో కూడా పట్టించుకునే స్థితిలో లేను నేను) - మామూలు కన్నా కొంచెం గట్టిగా Merry Christmas, Happy New Year, HappyPongal...and Happy Holidays చెప్తూ - నేనెందుకలా అరుస్తున్నానో తెలియక అయోమయంగా చూస్తున్న శ్రీలత కేసి తిరిగి, "శ్రీలతా! మీకు చెప్పానుకదా MBA అబ్బాయి - మాట్లాడలేడు అనీ - ఇదిగో ఇతనే" అంటూ మళ్ళీ అతనికేసి తిరిగి ఒక వేలు శ్రీలత కేసి చూపిస్తూ - వెంటనే నాకేసి తిప్పుకుంటూ "She is Srilatha, my senior" అని చెప్తూ - దాన్నే సైగలతో చెప్పడానికి కూడా తెగ ఆపసోపాలు పడిపోయాను.

ఆ అబ్బాయి పెదవుల మీద చిన్న నవ్వు - కళ్ళ వెలుగే పెదవుల మీద మెరిసిందో - పెదవుల నవ్వే కళ్ళని వెలిగించిందో - అన్నట్టు మొహమంతా వెలుగు - అది నన్ను చూసి కాదు సుమా - అతని నవ్వే అంత.

అలాగే నవ్వుతూ - అర్థం అయిందన్నట్టు తలాడించాడు.

అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నాకేసి, శ్రీలత కేసి చూసి నవ్వుతూ - "హాయ్" - అని పలకరించి పరిచయం చేసుకున్నారు.

అప్పటికే చుట్టు పక్కల అందరూ - అంటే మా కాలేజ్ వాళ్ళు కాక  - ట్రెయిన్‌లో ఎక్కుతున్న మిగిలిన వాళ్ళు - నేను ఆ అబ్బాయితో అరిచి మాట్లాడం, ఆ అబ్బాయి మౌనంగా నవ్వుతూ తలాడించడం చూసి - అతని కేసి కొంచెం జాలితో, అతని నవ్వు చూడగానే అప్రయత్నంగా కలిగే ఇష్టంతో - చూస్తూ మా పక్కనుంచే కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కుతున్నారు.

ఈలోగా నాకు గుర్తొచ్చింది - సూట్‌కేస్ ప్లాట్‌ఫాం మీద వదిలేసి, నిరుపమని నించోబెట్టి  వచ్చానని.

వెంటనే ఆ అబ్బాయికేసి తిరిగి - Bye -  చెప్తున్నట్టు చెయ్యి ఊపి - సూట్‌కేస్ తెచ్చుకుందామని వెనక్కి వెళ్ళాను.

శ్రీలత అక్కడే నించుని అతని ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు - ఎలాగూ అదే మా బోగీ కదా - నేను సూట్‌కేస్ తెచ్చుకురాగానే ఇద్దరం కలిసి లోపలికి  ఎక్కొచ్చని.

వెనక్కి గబగబా వస్తున్న నాకు నన్నే విసుగ్గా చూస్తున్న నిరుపమ కనిపించింది. తన విసుగు-చూపులు నాకలవాటే.

అందుకే "సరే పద వెళ్దామింక" అంటూ సూట్‌కేస్ అందుకుని తన పక్కనే నడుస్తున్నాను.

తను నన్ను ఆగమని చెప్పి - కంటిచూపుతోనే నాకు ఆ మూగ అబ్బాయిని చూడమని చెప్తూ  - "లలితా - ఈ అబ్బాయా నువ్వు చెప్పిన మూగతను? నాకెందుకో డౌటుగా వుంది. తనకి మాటలొచ్చని" అంది.

"లేదు నిరుపమా! రావు - చూడు - తన చుట్టూ అందరూ అంత మాట్లాడుతున్నా నవ్వుతూ చూస్తున్నాడు కానీ - కనీసం అవును-కాదు అన్నట్లు తల కూడా ఊపట్లేదు. ఇందాక అంత అరిచి విషెస్ చెప్పానా? - అస్సలు విన్నట్టే లేడనుకో. శ్రీలత కేసి చెయ్యి చూపిస్తే మాత్రం తను నా ఫ్రెండ్ అని అర్థమయినట్టు వుంది అంతే!" - ఎందుకో తెలీదు ఆ అబ్బాయి మాటరాని-తనాన్ని లేమిగా కాక అదో అదనపు క్వాలిఫికేషన్‌లా తెగ సమర్థించేశాను.

"లేదే  - వాళ్ళిల్లు మా ఇంటి దగ్గరే. నేను BH కాలేజ్‌లో ఇంటర్ చదివేటప్పుడు, నాగార్జున మ్యూజిక్ కాలేజ్‌లో డాన్స్‌క్లాస్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళింటిమీంచే వెళ్ళేదాన్ని. ఎప్పుడూ చుట్టూ ఫ్రెండ్స్ - వాళ్ళింటిముందు కరెంటుస్తంభం కింద నించుని గంటలు గంటలు తెగ గోల చేస్తూ వుండేవాళ్ళు." - నిరుపమ విసుగు-మీటర్ పెరిగిపోతోంది.

"సర్లే - మాటలురాకపోతే మాత్రం ఫ్రెండ్స్ ఉండరా? - ఉన్నవాళ్ళు మాట్లాడరా? - నువ్వు సరిగ్గా చూసుండవ్. తినైతే మాట్లాడి ఉండడు" - అని స్థిరంగా చెప్పి - "పద - ఇంకా నేను నా బెర్త్ ఎక్కడో చూసుకోలేదు" అని మళ్ళీ నా పెట్టె మోసుకుంటూ వెళ్ళి కంపార్ట్‌మెంట్ మెట్ల దగ్గర ఆగాను.

అప్పటికే శ్రీలత లోపలికి వెళ్ళి తన సీటు వెతుక్కుని కూర్చున్నారు. నాది ఎప్పట్లాగే నాకిష్టమైన సైడ్‌బెర్త్ - కిందది. శ్రీలతది - నా పక్కనే వున్న సైడ్‌బెర్త్ -అదీ కిందదే.

నేను నా బాగ్‌లోంచి సూట్‌కేస్-శృంఖలాలు, వాటితో పాటు చిన్నసైజు గుండ్రాయి లాంటి గోద్రెజ్ తాళం తీసి - నా బెర్త్ కింద ఇనపరాడ్‌కి - నా సూట్‌కేస్‌ని గొలుసేసి కట్టేసి తాళమేసి - మళ్ళీ గా... ఠి....గా - పొరపాటున చేయి జారితే నేను వెళ్ళి వెనక్కి పడతానేమో అనిపించేంత గా... ఠి....గా లాగి చూసి - రెండు సైడ్ సీట్లూ కలిపి - సైడ్‌బెర్త్ మీద కూర్చుని నా పక్క సీట్లోకి ఎవరొస్తారా అని చూస్తున్నాను.

ఇంతలో ట్రెయిన్ కదిలే టైం అయింది. అప్పటిదాకా కింద మెట్ల దగ్గర కబుర్లు చెప్పుకుంటున్న SVU MBA అబ్బాయిలు అందరూ బిలబిలలాడుతూ లోపలికి వచ్చేశారు.

అందరి కన్నా వెనగ్గా - నెమ్మదిగా నడుచుకుంటూ మూగ-అబ్బాయి కూడా వచ్చి నా బెర్త్ దగ్గర ఆగి - వంగి సీట్ నంబర్ చూసుకుని - తన సూట్‌కేస్‌ నేను కూర్చున్న చోటుకి పై బెర్త్ మీద పెట్టుకుని - నా పక్క సీట్లో - అంటే నేను కూర్చున్న సైడ్‌బెర్త్ మీదే కూర్చున్నాడు.

నేను అతని కేసి చూసి నవ్వగానే అతనూ నన్ను చూసి నవ్వాడు.

ఇంకెవరన్నా అయితే ఇప్పటికి బోల్డన్ని కబుర్లు అయిపోయి ఉండేవి - ఇతనితో ఏం చెప్తాను?

కబుర్లూ-కాకరకాయలూ లేకుండా ఎన్నిసార్లు మొహం చూసి ఎంత నవ్వుతాను - కదా? అందుకే చుట్టూ వున్న అందరినీ చూస్తూ వున్నాను.

ఇంతలో మా ఎదురుగా వుండే ఆరు సీట్లలో వున్న ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు లేచి వచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న - ఇండియా టుడే, ఆంధ్రప్రభ లాంటి పుస్తకాలు - నా పక్కన కూర్చుని వున్న ఆ అబ్బాయి చేతిలో పెట్టి - "పర్లేదు-చదువుకో" - అన్నట్లు సైగ చేసి వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చున్నారు.

సరే! ఆ అబ్బాయి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. నాకూ ఇంకేం చేయాలో తోచలేదు.

ఇంతలో ఆ పక్క సీట్లలోంచి మా క్లాస్‌మేట్స్, సీనియర్స్ అందరూ అంత్యాక్షరి మొదలు పెట్టారు. నేనూ వెళ్ళబోయాను.

కానీ - నా పక్క సీట్లో అబ్బాయి అవేం పట్టనట్టు పుస్తకం చదువుకుంటూ ఉంటే - "అయ్యో! పాపం - పాడలేకపోతే పోనీ - కనీసం విని ఎంజాయ్ కూడా చేయలేడు కదా - నేను కాసేపు ఇక్కడే వుండి ఎలాగోలా సైగలతో అయినా మాట్లాడతాను - తనకి కొంచెం టైంపాస్ అవుతుంది " - అనుకుని ఆగిపోయాను.

కానీ సైగలు మాత్రం ఎంత చేయగలను?

బాగ్‌లోంచి ఒక నోట్‌బుక్, పెన్ తీశాను.

తీసి  "Shall we talk on this paper?" అని రాసి పుస్తకాన్ని అతని చేతికి ఇచ్చాను.

దాన్ని చదివి - అదే చిరునవ్వుతో నన్ను చూస్తూ - తన షర్ట్ జేబులోంచి పెన్ తీసి "Sure - why not?!" - అని రాసి నాకేసి జరిపాడు పుస్తకాన్ని.

ఇంతలో నిరుపమ పాటలు పాడుతూ ఆడుకుంటున్న అమ్మాయిల దగ్గర్నుంచి లేచి - నిద్రొస్తోందని తన బెర్త్ దగ్గరికి వెళ్తూ నా దగ్గర ఆగి - చిన్నగా నా చెవి దగ్గర - "నేన్నమ్మనే ఈ అబ్బాయిని - నాకేదో అనుమానంగా ఉంది" అంటూ గుసగుసలాడింది.

నేనూ అంతే గుసగుసగా "నేన్నమ్ముతాను - నాకనుమానమే లేదు" అని గీరగా గసగసలాడాను.

నిరుపమ "నీకు చెప్పలేనింక పోవే!" అని గట్టిగా విసుక్కుని వెళ్ళి దుప్పటి ముసుగేసుకుని పడుకుండిపోయింది.

నేను, నా పక్క సీట్లో మూగ-అబ్బాయి ఇంక బోల్డన్ని కబుర్ల్రాసేసుకున్నాం.

పేర్లు చెప్పుకోవడంతో మొదలుపెట్టి, హాబీస్, మా పప్పి-కుట్టి, వాళ్ళ తమ్ముడు-చెల్లెలు, మా అమ్మ-నాన్న, వాళ్ళ అమ్మగారు, నాకిష్టమైన పుస్తకాలు, పాటలు, తనకిష్టమైన జోకులు - ఇలా ఒకటి కాదు, రెండు కాదు - పుస్తకం ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళ చేతిలోకి మార్చుకుంటూ - రాసుకుంటూ - చదువుకుంటూ - నవ్వుకుంటూ మా లోకంలో మేమున్నాము.

నాకు పాటలు పాడడం ఇష్టం అని రాసిన దాని చదివి - తను రాసింది ఏంటంటే -  "Can you sing a song for me?"

 "Will you be able to hear if I sing ?" అన్నది నా ప్రశ్న.

"I can hear with my eyes - by looking at your face while you sing" - అంటూ రువ్విన ఇంకో నవ్వు.

నాకు ఆ ఊహే భలే fascinating గా అనిపించింది - Helen Keller గుర్తొచ్చింది.

"Then - okay " అంటూ మొదలు పెట్టి తనకి ఎలాగూ వినిపించదు కదా - అని చాలా మెల్లిగా - ఎవరికీ వినపడకుండా - నేను పాడుతున్నట్టు చుట్టూ ఎవరికీ అనుమానం రాకుండా - తల కొంచెం ఒంచి - చిన్నగా - నాకిష్టమైన ఘంటసాల పాట : తల నిండ పూదండ దాల్చిన రాణి - మొలక నవ్వుల తోడ మురిపించబోకే  - పాడేశాను.

పాట పాడినంతసేపు చూపు తిప్పకుండా - అదే చిరునవ్వుతో నన్ను చూస్తూ - నేను పాట ఆపగానే - కుడిచేతి బొటనవేలు-చూపుడువేలు కలిపి బావుంది అన్నట్టు మెచ్చుకున్నాడు.

అప్పుడే రాశాను - "It would be so nice if you can speak".

చదివిన కళ్ళలో మళ్ళీ నవ్వు మెరుపు.

ఇంతలో - తన క్లాస్‌మేట్ - కొంచెం స్టైల్‌గా జీన్స్ వేసుకుని, తేనెరంగు కళ్ళు - హిందీ సినిమాలో కొత్తగా వస్తున్న హీరోల హెయిర్-స్టైల్ వున్న - ఒకబ్బాయి వచ్చి తన పక్కనే కూర్చుని - మేమేం రాస్తున్నామా అని - టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్టు - మా చేతుల్లోంచి అటూ-ఇటూ మారుతున్న నోట్‌బుక్ కేసి చూస్తూ - ఓ పది నిముషాలు గడిపాడు.

మేమేమీ తనని పట్టించుకోలేదు - మా రాతల్లో మేమున్నాము - అని అర్థం కాగానే - లేచి మళ్ళీ - వాళ్ళ మిగిలిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు.

తను వెళ్ళగానే - రాతలో అడిగాను "Who is he?".

"He is Giriraj -  a very good friend of mine. He plays the Guitar so well " - ఆ రాతలోనే ఫ్రెండ్ మీద ఇష్టం గిటార్రాగాలు తీసింది.

నేను - మామూలు విషయాలు అయిపోయి - ఇంక నాకిష్టమైన sayings, tongue twisters ఇవీ అని - అవి కూడా రాయడం మొదలుపెట్టాను.

వాటిలో గుర్తున్న కొన్ని:

Keep smiling - That makes people wonder what you have been up to...

He who knows not and knows not that he knows not - Ignore him
He who knows not and knows that he knows not - Teach him
He who knows and knows not that he knows - Wake him
He who knows and knows that he knows - Follow him

She sells sea shells on the sea-shore.

Betty bought some butter. But the butter was bitter - so she bought some more better butter to make the bitter butter better.

అందులో మళ్ళీ అంకెల లెక్కలు కూడా :)
How can you prove 1=(-1)? అంటూ.  దాని ప్రూఫ్ కూడా రాసేశాను - నాకు తోచింది.
ఇదిగో ఇలా:



ఇలా పెదవులు కదలకుండా - బోల్డు మాటల్రాసేసుకున్నాం.

టైం ఎంతైందో చూసుకోలేదు - అప్పటిదాకా. చుట్టూ చూస్తే - అక్కడక్కడా నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలు  -  ఎవరో ఒకళ్ళో, ఇద్దరో తప్ప - అందరూ పడుకున్నారు.

నిద్రొస్తున్నటుగా అనిపించి - టైం చూస్తే పదకొండున్నర అయ్యింది.

అమ్మో - బోల్డు లేట్ అయిపొయింది - ఇంక పడుకోవాలి అనుకుని  - "It's been nice "talking' to you" అని రాసి - మళ్ళీ ఇంకోసారి  - "It would have been so nice if you could speak" - అని నేను రాసింది చదవగానే - సమాధానంగా "If I say something, it may hurt you" అని రాశాడు.

నాకర్థం కాలేదు .

"ఈరోజు మాత్రమే పరిచయం అయిన ఈ అబ్బాయి నాకేం చెప్తాడు? - అదే - రాతలో రాసి చూపిస్తాడు ? నేనేం హర్ట్ అవుతాను?" అనుకుని - "Not at all - You're a nice person - please go ahead" అని రాశాను.

అప్పుడు... ఆ అబ్బాయి పెన్ను కాగితం మీద పెట్టి ఏదో రాయబోయి - మెల్లిగా తలెత్తి ... నాకేసి తిరిగి .... నన్ను చూస్తూ ...

ఇక్కడ ఆపుతానేం - మరీ అన్నీ ఇవాళే చెప్పేస్తే వచ్చే నెలకి కబుర్లేముంటాయ్ - కదా?!

ఈలోగా టైటిల్ పాట వరసేంటో కనిపెట్టేయండి. 

ఈ కొసరు పాట వరస కూడా పాడుకుని వినిపెట్టేయండి. 

రాసుకున్నామూ ...మేమే చదువుకున్నామూ
ఈ పేజి నిండనీ - అని నింపుకున్నామూ
ఆనాడే .... మేము రాశామే....
ఆ ప్రాయాలలో ... అభిప్రాయాలని... 

ఊఁ ... ఊఁ ...ఊఁ ...ఊఁ ...

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>



15, అక్టోబర్ 2017, ఆదివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ముక్తాయింపు


అష్టావధానం ముందు భాగం చదవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ఉపోద్ఘాతం



నిషిద్ధాక్షరి మొదటి పాదం (జువ్వాది రమణగారు):

నరాల రామారెడ్డిగారు అవధానం ప్రారంభిస్తూ "మొదటగా నిషిద్ధాక్షరితో ప్రారంభిస్తాం. జువ్వాది రమణగారు నిషిద్ధాక్షరి అడుగుతారు" అన్నారు.

రమణగారు "అవధానిగారు! మీరు బాహుబలి సినిమా చూశారాండి ? ఈరోజు బాహుబలి మీద నిషిద్ధాక్షరి చేద్దాం. బాహుబలిని వర్ణిస్తూ చెప్పండి. మొదట అక్షరం నాదేనా?" అంటూ నాంది పలికారు.

"మీ ఇష్టం - ఆదిలో నిషేధం - మధ్య నిషేధం మీ ఇష్టం. మధ్య నిషేధం - మద్య నిషేధం కాదు - ప్రాస నిషేధం లేదు" అంటూ నవ్వులు పంచ్-తూ అవధానిగారు బదులిచ్చారు.

అయితే - "బా" (నిషేధం).

బా-తోనే మొదలు పెట్టారా? మొదటి అక్షరం "బా" రాకూడదన్నారు. మొదటి అక్షరం "ఔ" - ప్రాసనిషేధం లేదు కదా?

ర (నిషేధం)

అప్రస్తుత ప్రసంగం (నారాయణస్వామిగారు): "అప్రస్తుత ప్రసంగిగా కొంచెం లిబర్టీ తీసుకుంటున్నాను. అవధానవిద్య తెలియని వారి సౌలభ్యం కోసం - నిషిద్ధాక్షరి continous job అన్నమాట - ఒకసారి ప్రశ్న ఇచ్చేసి ఊరుకోవడం కాదు - ప్రతి రెండో అక్షరానికి పృచ్ఛకుడు అడ్డం పడి - మీరు ఈ ఫలానా అక్షరం మీరు వాడకూడదు - అని అడ్డం పడుతూ ఉంటాడు. ప్రాస వుండే పద్యాల్లో రెండో అక్షరం తప్పనిసరిగా అదే ప్రాస అక్షరం రావాలి. కాకపోతే మొట్టమొదటి పాదంలో ప్రాస ఏది అనే choice ఉంది కాబట్టి అది కూడా నిషిద్ధం చేస్తాను అని  పృచ్ఛకులవారు ఆ facility ఉపయోగించుకున్నారు. అవధానిగారు మొదటి అక్షరం "ఔ" అని మొదలు పెట్టారు. బాహుబలిమీద పద్యం కాబట్టి automatic గా ఒక పొగడ్తలాగా అది "ఔరా" అని వస్తుందేమో అని ఊహించి పృచ్ఛకుడు "ర" ని నిషేధించాడు. అవధానిగారికి ఎంత తెలివుందో - పృచ్ఛకుడు ఇంకో రెండాకులు ఎక్కువ చదివుండాలన్నమాట."

వెంటనే రమణగారు అందుకుని "Thank You అండి" అని నారాయణస్వామిగారితో అని - "అవధానిగారు! మీరు ఇది కూడా చెప్పండి - ఏమంటున్నారా అని ఊహించి - నేను ఎందుకు నిషేధిస్తున్నాను అని - ప్రేక్షకుల సౌలభ్యం కోసం" అని నరాల రామారెడ్డిగారిని కోరారు.

(లలిత ఉవాచ:ఈ నిషిద్ధాక్షారిలో ఒకరి తర్వాత ఒకరుగా రమణగారు, రామారెడ్డిగారు ఏకాక్షరాల్లో మాట్లాడుకున్నారు.)

రామారెడ్డిగారు: సరే! "ఔ" అన్నప్పుడు "రా" నిషేధం అన్నారు. నేను - "ఔనా"

మళ్ళీ"బ" (నిషేధం)
మా
క (నిషేధం)
క-కారం వద్దన్నారు - న
వ (నిషేధం)
స - "మానస" - అంటే మా నస కాదు. మీ నస కాదు - "మానస" అంటే మనసు. 
(లలిత ఉవాచ: ఈ నస కాని నసకి  బోల్డన్ని నవ్వులు ఇక్కడ గలగలలాడాయి)
ప (నిషేధం)
కా - దీర్ఘం
కా - దీర్ఘమా ? త (నిషేధం)

(లలిత ఉవాచ: నాకెందుకో ఇక్కడ రమణగారు ముందు "స" అన్నారేమో అన్నట్టు వినిపించింది - రామారెడ్డిగారు తల్లిలో తకారమా అనగానే కొంచెం తడబడి అవుననేశారు రమణగారు.)

తల్లిలో త-కారమా? త వద్దన్నారు. బిందుపూర్వక - ంక్షా - మానస కాంక్షా -

ఔనా మానస కాంక్షా - నిషిద్ధాక్షరిలో ఒక పాదం ముగిసింది.

ఇప్పుడు రెండవది సమస్య.

ఇప్పుడు సమస్య - ఎవరు? - అంటూ పాపం నరాల రామారెడ్డిగారు ఇంకా పేపర్లో పేరు చదవబోతున్నారు - నాకసలే హడావిడి ఎక్కువ కదా - ఇంతలోనే మొదలుపెట్టేసి - "అవధానిగారు - నేను మీకు ఇవ్వబోతున్న సమస్య ఏంటంటే - వరుసలు జూడగా మధురవాణి ... " అంటూ నా పరుగు-బాణీలో నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను.

ఇంతలో ఆయన - "లలితగారు సమస్య ఇస్తారు -చెప్పండి" - అంటూ నాకేసి చూశారు.

ఇంక చదివేశా "వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా" - అంటూ.

నేను చదివిన పద్య పాదాన్ని విని రామారెడ్డిగారు ఇంకోసారి దాన్నే మళ్ళీ చెప్తూ ఉండగా - ఇంతలో అప్రస్తుత ప్రసంగం చేస్తున్న నారాయణస్వామిగారు అందుకుని - "ఎలాగా - వాణి ప్రసక్తొచ్చింది కాబట్టి - మామూలుగా పృచ్ఛకుల్లో పద్యం రాయగలిగినవాళ్ళు ఉంటే - వారు పాపం మామీద అభిమానం తోటి, కొంత వాత్సల్యంతోటి -  పృచ్ఛకులందరూ ఏదో పండితీ పుత్రులని అన్నట్టుగా చమత్కారంగా పద్యం చెప్పారు. అందుకని బదులు తీర్చుకోవడానికి నేను కూడా అవధానిగారిని కాస్త పొగుడుతూ ఒక పద్యం చెప్తాను

వాణికి ముద్దుల బిడ్డవు
పాణిన్యాదుల చదువుల పాఱంగతుడౌ
మాణిక్యమ్మవు పండిత
శ్రేణులయందున నరాల రామారెడ్డీ !

(బోల్డన్ని చప్పట్లు నారాయణస్వామిగారి పద్యానికి)

అప్రస్తుత ప్రసంగం అంటే కేవలము డిస్టర్బన్సే కాదు - వినోద కారణం, విజ్ఞాన కారణం కూడా - అనే ధోరణిలో నేను చేసే పనిని పరిచయం చేసుకుంటూ - అష్టావధానం - విద్యా ప్రాభవ ప్రకటనం- సత్సాంగత్యం - పరస్పరం గౌరవ వందనం - మాత్సర్య రహితం - అవధానిగారిని ఇబ్బంది పెట్టటం అనేది ఒక పూను స్పర్థను విద్యయందే అన్న దృష్టితోనే తప్ప - వారి పాండిత్యం పట్ల, వారి రసికత పట్ల గౌరవం ప్రకటించుకుంటూనే - మాత్సర్య రహితం మైత్రీ వర్ధనం అప్రస్తుత ప్రసంగం సంతత వినోదకారణం" అంటూ రామారెడ్డిగారి మీద ఓ మంచి పద్యంతో పాటు అప్రస్తుతప్రసంగం గురించి కూడా బోల్డన్ని విశేషాలు చెప్పారిలా. 

రామారెడ్డిగారు  - "చంపకమాలలో లలితగారు ఒక సమస్యనిచ్చారు - వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా" - అని అంటూ నాకేసి తిరిగి "ఊరకే ఇచ్చారా? లేక పూరణం కూడా ఆలోచించారా? - అని అడిగారు.

ఆయనలా అడక్కముందే నా సమాధానం సిద్ధంగా వుంది కదా - తల అడ్డంగా తిప్పాను.

"మరట్లా ఇస్తే ఎట్లాండి? అదే నేను మొదట ఇంట్రడక్షన్లో చెప్పాను - సమస్యలో విరుద్ధార్థం వున్నప్పుడు  దానికి పూరణ కూడా ఉండాలి. ఎట్లాంటిది ఇవ్వొచ్చుగాక ఒక క్లూ అనేది దానికి దొరకాలి. ఆ పత్రికలో ఇచ్చిన ఒక సమస్య - అనంతపురం జిల్లాలో ఇచ్చినది - "జమునను జూడగా విజయశాంతి లభించె జయప్రదంబుగన్" - అని. ఇదంతా గందరగోళంగా వుంది - జమునను చూస్తే విజయశాంతి జయప్రదలా కనబడింది - కాబట్టి ఏదో క్లూ దాచిపెట్టాడనుకున్నాను. అయితే దాన్ని నేను సినిమారంగం నించి కాకుండా భగవద్గీతకి తీసికెళ్ళాను. అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు - నేను నెత్తుటికూడు తినలేను బావా - అంటూ. అపుడు విశ్వరూపం చూపిన విశ్వనాథుడు - ఆ భారతవీరునికి భగవద్గీత ఉపదేశం చేశాడు. ఏమంటున్నాడు?

సమరము చేయనంచు రభసమ్మున చాపము కింద వైచి
సంభ్రమునకు లొంగిపోయితివి బంధువులను హతమార్చనంచు
నీ భ్రమలు తొలంగె నేడు భగవంతుని రూపము నీదు హృత్సరో
జమునన్ చూడగా విజయా!  శాంతి లభించె జయప్రదంబుగన్

- అంటూ ఆ పద్యం చెప్పి మళ్ళీ నాకేసి తిరిగి - మొదటిపాదం చెప్పారు:
పరువము పాలపొంగువలె పరువులు తీయు వసంతవేళ భా
చంపకమాలలో ఒక పాదం ముగిసింది.

తర్వాత దత్తపది. రామచంద్రారెడ్డిగారు గాజులపల్లి - అని పిలిచారు రామారెడ్డిగారు.

రామచంద్రారెడ్డిగారు మైకందుకుని - సరాల, తరాల వరాలనరాల -ఈ నాలుగు పదాలతో తానా సభల అంతరార్ధాన్ని మీరొక పర్యాయం వర్ణించవలసిందిగా - అంటూ దత్తపదిని ఇచ్చారు.

రామారెడ్డిగారు "ఆ పదాలకు ముందూ వెనుకలు మార్చుకోవచ్చు కదా - ఈ పద్ధతిలో చేసుకుందాం అంటూ - తరాలతో ప్రారంభిస్తాను - అని చెప్పి - తరాల, సరాల, వరాల, చివరిలో నా  నరాల - ఇతివృత్తం మీరిచ్చారు - వృత్తం నాయిష్టమే కదా ?" అంటూ దత్తపది మొదటిపాదం చెప్పారు: తరాల దాక సాగుగాక తారలుండు దాక పూ

ఇక వర్ణన - కుప్పా విజయశ్రీగారు.

మా నానీల-నానీ విజయశ్రీగారు "సభకు నమస్కారం. రామిరెడ్డిగారు వారి ప్రారంభ పరిచయంలో రెండు మూడు పదాలు వాడారు. మామూలుగా నేను వర్ణనకి వేరే అంశం అనుకున్నదాన్ని వారి అత్యద్భుతమైనటువంటి ఆ పరిచయంలో కొన్ని చక్కటి హాస్యపూరితమైన, సరసపూరితమైన వాక్యాలు కొన్ని నాకు దొరికినై. నీలిమేఘమువోలె అన్న పదమొకటి, విజయచాపము అన్న పదం వారు వాడారు - వారు రామనామధేయాంకితులు కనక - ఈ పదాలతో వారినడుగుదామని ఇప్పటికిప్పుడు నాకనిపించింది. అంటే రామ అనే శబ్దం మీ నామంలో వుంది కనక రామాయణంలో అడుగుదామని ఆలోచన కలిగింది. రామాయణం అంటే అందరికీ తెలిసిందే. యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే -తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. అంత మహత్తరమైన కథలో - రామో విగ్రహవాన్ ధర్మః  - అన్నటువంటి అంశాన్ని తీసుకుని రామ అన్న వారి నామం తీసుకుని విజయచాపం అన్నది ప్రయోగించారు - నీలిమేఘం అన్నారు. ఈ మూడూ రాముడికి మనం ప్రత్యేకంగా అన్వయించుకోవక్కర్లేదు - సహజంగా వున్నటువంటివే - కాకపొతే ధర్మాన్ని హాస్యరసంలో చెప్పమని వారిని అడుగుతున్నాను. ధర్మానికి హాస్యరసం విరుద్ధమయినదే - ధర్మమంటే ఒక ప్రతిపాదనతో కూడిన వస్తువిశేషమే - ఆ రామో విగ్రహవాన్ ధర్మః అన్నది వాల్మీకి రామాయణంలో వున్నదానికి విశ్వనాథవారు ఏ విధంగా కొంత విశ్వనాథవారి విసుర్లలో హాస్యము అధికమే - అయితే ధర్మాన్ని హాస్యరస సమ్మేళనంతో చెప్పవలసిందిగా కోరుతున్నాను" అనగానే

ఒక చిరునవ్వు నవ్వుతూ నరాల రామారెడ్డిగారు - "నాకేమీ అర్థం కాలేదమ్మా " - అంటూనే - రామరూపము నయనాభిరామమగుచు - తేటగీతిలో ఒక పాదం ముగించారు వర్ణనలో.

తర్వాత న్యస్తాక్షరి - మద్దుకూరి చంద్రహాస్‌గారు.

"అందరికీ మరోసారి నమస్కారమండి" - అని మొదలుపెట్టి - "వృత్తం ఉత్పలమాల - ఇతివృత్తంమొదటిపాదం మూడో అక్షరం -హ - (ఇక్కడ  నారాయణస్వామిగారు - హాహాకారంతో మొదలుపెట్టారన్నమాట అని మహా-ప్రస్తుత ప్రసంగమే చేశారు ) రెండోపాదం ఐదో అక్షరం -రి. మూడోపాదం ఏడో అక్షరం - త. నాలుగోపాదం తొమ్మిదో అక్షరం - ము" - అనగానే నరాల రామారెడ్డిగారు తల్లిలో - త, ముద్దులో - ము అని అక్షరాలూ సరిచూసుకుంటూ ఉంటే - మంచి రసం పండించారు అంటూ సరస-ప్రసంగం చేశారు నారాయణస్వామిగారు.

హ-రి-త-ము - ఇతివృత్తం పర్యావరణ రక్షణ - వృత్తం-ఉత్పలమాల - ప్రకృతికి సంబంధించిన ఇతివృత్తం -అంటూ అన్ని అక్షరాలను బేసిసంఖ్యలో - 3, 5, 7, 9 - తీసుకుని - న్యస్తాక్షరి సమస్యనిచ్చారు చంద్రహాస్‌గారు.

అది వింటూనే - నారాయణస్వామిగారు - "ఇక్కడొక తమాషా చూడండి - ఆ నాలుగు అక్షరాలు కలుపుకుంటే - హరితము - అంటే పచ్చదనం అంటే అర్థం తోటి ఆయన అడిగిన ఇతివృత్తం కూడా పర్యావరణ రక్షణ గురించి అన్నమాట - అదీ చమత్కారం" - అంటూ చమత్కరించారు - చమక్కనిపించారు.

న్యస్తాక్షరి: మొదటి పాదం (మూడో అక్షరం - హ): జీవహరాంతరాయముగా స్నిగ్ధ జగమ్ములు రూపుమాపకన్

తర్వాతి అంశం - ప్రబంధపఠనం - దిట్టకవి సుందర్‌గారు - అని సంధానకర్త రామరాజభూషణుడుగారు ప్రకటించారు.

దిట్టకవి సుందర్‌గారు వసుచరిత్రలోని ఒక పద్యం చదవగానే - "అవధానిగారు ఈ పద్య సందర్భాన్ని మనకి వివరిస్తూ ఆ పద్యార్థం  మనకు చెప్తూ ఆ పద్యాన్ని విశ్లేషిస్తారు - అదీ ఈ ప్రబంధపఠన ఉద్దేశ్యం" -  అంటూ వివరించారు రామరాజభూషణుడుగారు.

"ఉద్దేశ్యం బాగానే వుంది - కానీ అవధానంలో అవధాని మనసు పద్య రచన మీద వేరే పద్ధతుల్లో వున్నపుడు ఈ వర్ణనాత్మకమైన పద్యం చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ప్రబంధపఠనం, పురాణపఠనం - దాని ఉద్దేశ్యం ఏంటంటే అవధాని యొక్క మనసును డైవర్ట్ చేయడం - అంతే దాని ప్రయోజనం - అంతే కానీ పాండిత్యపరీక్ష కాదు. సరే - వసుచరిత్రలో ఉన్నటువంటి అద్భుతమైన పద్యాల్లో ఇదొకటి - వసుడన్నారు కాబట్టి వసుచరిత్ర". - అని రామారెడ్డిగారు అంటూ ఉండగా సంధానకర్తగారు అందుకుని - "రామరాజభూషణుడు ఇక్కడ ఉన్నాడని వసుచరిత్రలో పద్యాన్ని ఎంచుకున్నారాయన" - అంటూ చమత్కారపు మెరుపు మెరిపించారు అష్టావధాన సభలో.

నరాలరామారెడ్డిగారు - "దిట్టకవి సుందర్ - మాంచి దిట్టకవి - రామరాజభూషణుడినే పట్టుకున్నారు" - అని ఇంకోసారి చమత్కరించి -  "వసుచరిత్రలో వసుమహారాజుని వర్ణించే పద్యాన్ని గుర్తుచేశారు మీరు" అంటూ - క్లుప్తంగా ప్రబంధపఠనాన్ని దాటవేశారు.

తర్వాత - ఆశువు - డాక్టర్ బండ్ల హనుమయ్యగారు - "మాజీ-తానా-అధ్యక్షులు,  తానా-మాజీ-అధ్యక్షులు" - అని పరిచయం చేశారు రామరాజభూషణుడుగారు.

హనుమయ్యగారు " నమస్కారమండి అందరికీ " అని ప్రారంభించి - "అవధానిగారూ - ఈ ఇరవయ్యొకటవ తానా మహాసభల థీము - ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ వెలుగు. అంటే తెలుగుభాష అనేది మన ఆంధ్ర దేశానికే పరిమితమైనది కాదని - అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తెలుగు వుందని చెప్పుకోవటానికి. అయితే మనందరికీ బాధాకరమైన విషయం ఏంటంటే మన భాషని మన పాఠశాలల్లోనే పిల్లలకి నేర్పటం లేదు. ఈ భాష మనుగడ ఏమిటి? భాష ఉంటుందా? లేక కనుమరుగైపోతుందా? అతి మధురమైన మనోహరమైన మన భాషని పదికాలాలు నిలుపుకోవాలంటే మన కర్తవ్యం ఏంటి? ఈ విషయం మీద మీరు ఒక పద్యం చెప్పండి." అని కోరారు.

రామరాజభూషణుడుగారు  అందుకుని - "దేశ భాషలందు తెనుగు లెస్స అని మన శ్రీకృష్ణదేవరాయలవారు చెప్తే - ఈ రోజున ఆంధ్రదేశంలో తెలుగు లెస్సు అంటున్నారు " అని అంటించారు.

"లెస్సా? అంటే లెస్ అయిందా? అనడుగుతున్నారు"  - అని అందుకుని రామారెడ్డిగారు -

తేనెసోనలు జాలువారు తెలుగుభాష మల్లెమొగ్గల మృదులత వెళ్లి విరియ
ముద్దుముద్దుగ మురిపాలు మూటకట్ట నాట్యమాడుత పిల్లల నాల్కమీద

- అనగానే

"అవధానిగారికి నాట్యమంటే బాగా ఇష్టమల్లే వుంది - ఇందాక వాణి మీద చెప్పిన పద్యంలో కూడా నా నాలుక మీద వాణి నాట్యం చేయాలి అని కోరుకున్నారు - అయ్యా - తమరు బహుకళా కోవిదులా ?" - అని ప్రస్తుతించారు అప్రస్తుతప్రసంగి నారాయణస్వామిగారు.

"నాకు నాట్యం చేసేది చేతకాదు కాబట్టి ఎవరైనా నాట్యం చేస్తే చూసి ఆనందిస్తా - మీరు చేసినా కూడా" - నన్నారు నరాలవారు.

"ఇంతటితో మొదటి వరుస పూర్తయింది. అధ్యక్షుడిగా నాకొక కీలక సమస్య ఎదురయేట్లుగా కనిపిస్తోంది ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ అష్టావధానాన్ని ఇంకొక గంటలో  పన్నెండు గంటలకల్లా ముగించే అవకాశం దొరుకుతుందా అని - కాబట్టి పృచ్ఛకులు కొంచెం తక్కువ సమయం తీసుకుని సూటిగా మీ సమస్యలు చెప్తే బావుంటుంది - ఇప్పుడు రెండో విడత అవధానిగారికి" - అంటూ రామరాజభూషణుడుగారు అష్టావధానంలో రెండో వరస ప్రారంభించారు.

మళ్ళీ జువ్వాది రమణగారి నిషిద్ధాక్షరితో రెండోవరస మొదలయింది.

"వ"
వ-కారం వద్దన్నారు - మొదటిపాదం కాంక్షా దగ్గర ఆగింది - ఇప్పుడు - ధీ - అనగానే రమణగారు "ప్రాస మీదేనా అనడిగారు. అవధాని గారు "ప్రాస నాదే - మీకు దానిమీద ధ్యాస ఉండకూడదు" అన్నది విని నవ్వుతూ రమణగారు " సరే - అయితే చెప్పండి" అన్నారు.

అవధానిగారు "ధీనా"
ర (నిషేధం)
వ
క (నిషేధం)
ధి
క (నిషేధం)
పూ
ర (నిషేధం)
జ్య
మ (నిషేధం)
ధా
ర (నిషేధం)
మ
దీ (యతిప్రాస నిషేధం లేదు)
న (నిషేధం)
క్షా
ప (నిషేధం)
రూ
డ (నిషేధం)
పా

దీనావధి పూజ్య ధామ దీక్షారూపా - రెండుపాదాల నిషిద్ధాక్షరి ముగిసింది - బాహుబలి ఇతివృత్తంతో. 

"ప్రేక్షకుల్లో పెన్నూ-కాగితం వున్నవారు ఎవరన్నా ఉంటే అవధానిగారు చెప్తున్నప్పుడు పద్య పాదాలు విడిగా రాసుకుని సరిచూసుకోండి - అది మీక్కూడా కాలక్షేపంగా ఉంటుంది" అని సూచించారు నారాయణస్వామిగారు.

సమస్య - మళ్ళీ గుర్తు చేశారు : వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా - అంటూ అధ్యక్షులు.

"భా అని పైనొక అక్షరం చెప్పాను కదా -
సురముగ సూన సాయకుడు సూటిగ బాణములేయుచుండ - సూటిగ - అంటే గురితప్పకుండా - యతి పొతే మతి పోతుందిక్కడ - గురి తప్పకుండా అంటే నాకొకటి జ్ఞాపకమొస్తోంది ఇక్కడ" - అంటూ ఒక జోక్ చెప్పారు అవధానిగారు.

ఆ జోకేంటంటే:

ఒక భర్త డాక్టరు దగ్గరకెళ్ళాడు. 
ఏం కంప్లైంటు అంటే - "డాక్టరుగారూ - ఐదు సంవత్సరాల నుంచి మా ఆవిడ రోజూ ఏది చేతికి దొరికితే అది తీసుకుని కొడుతూ వున్నది - తప్పించుకోలేకపోతున్నాను" అంటే
"మరి నువ్వేం చేస్తున్నావు" అనడిగాడు డాక్టర్.
"ఇంతవరకూ తప్పించుకుంటున్నానండి - ఎట్లాగో మేనేజ్ చేస్తున్నాను"
"మరిప్పుడేమయింది?"
"ఇప్పుడామె గురి తప్పకుండా కొడుతున్నది - ఎట్లా తప్పించుకోవాలో చెప్పండి " అన్నాడా భర్త.

అవధానిగారు చెప్పిన జోక్ నవ్వులు పూయిస్తే - "ఎట్లాగూ పద్యంలో మన్మధ బాణాల  ప్రసక్తి వచ్చింది కాబట్టి - గురి తప్పకుండా కొట్టడం వచ్చింది కాబట్టి ఎప్పుడూ పూలదండలూ, పూలు అవీ ఆవిడకి అందుబాటులో ఉంచితే ఆయన పని కొంచెం బావుంటుంది" - అంటూ ఇంకొన్ని నవ్వుల బాణాలేశారు నారాయణస్వామిగారు.

సురముగ సూన సాయకుడు సూటిగ బాణములేయుచుండ బం - అంటూ సమస్యాపూరణంలో రెండో పాదం పూర్తిచేశారు అవధానిగారు.

దత్తపది రెండవపాదం:
సరాల సౌరభాలు సారసాల మాలగా - అవధానిగారి రెండో పాదం పూరణ
రసాలూరుతున్నాయి - అంటూ నారాయణస్వామిగారి శ్లాఘన.

"అవధానిగారూ - ఇన్నిసార్లు అమెరికా వచ్చారు మా డాలరు నోట్లని చూసేవుంటారు - ఆకుపచ్చగా ఉంటాయి - పచ్చగా వున్నాడు అంటే బాగా డాలర్లువెనకేసుకున్నాడు అని అర్థం. మొన్నీ మధ్యనశ్రీపాద సుబ్రహమణ్యశాస్త్రిగారి అనుభవాలూ-జ్ఞాపకాలూ అన్న జీవిత చరిత్ర చదువుతూ ఉంటే అందులో ఆయన ఒక ఊరి కామందుగారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమంటే ఆయనొక పచ్చనోటిచ్చాడు అని రాసుకున్నారు - మరి ఆరోజుల్లో ఇండియాలో కూడా ఈ డాలరు నోట్లుండేవంటారా?" అన్న నారాయణస్వామిగారి ప్రశ్నకి సమాధానంగా రామారెడ్డిగారొక పాటను గుర్తుచేసుకుని - పచ్చజండా ఊపితే రైలు బండి వెళ్తుంది, పచ్చనోటు లేకపోతె జీవితపు బండి నడవదు - అంటూ మనకీ పచ్చనోట్లున్నాయి అని చెప్పి -

వర్ణన రెండో పాదం : నీలమేఘము నిగ్గులు నింపుకుని

న్యస్తాక్షరి రెండో పాదం: ఐదో అక్షరం - రి: జీవ తో మొదలుపెట్టాం కాబట్టి వ-కారం ప్రాస అంటూ చెప్పిన రెండోపాదం: పావన హారి భూజముల పచ్చదనమ్ములు పల్లవింపగా 

తర్వాత ప్రబంధ పఠనం వర్ణన ఎక్కువ లేకుండా ఇవ్వమని కోరారు అవధానిగారు - ఆలోచించడానికి సమయం ఎక్కువ లేదని.

దిట్టకవి సుందర్‌గారు శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదలోని పద్యం చదివారు. ఆ పద్యం వింటూనే - అవధానిగారు - ఈ పద్యం ఒక మఱ్ఱిచెట్టుని వర్ణించినది - మాలదాసరి కథలోనిది. మాలదాసరి మారులుతీగ తొక్కి దారితప్పి ఒక అరణ్యమధ్యానికి - ఒక పెద్ద మఱ్ఱి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మఱ్ఱిచెట్టుని శార్దూలంలో వర్ణించారు శ్రీకృష్ణదేవరాయలు. ఆ పద్యం కూడా శార్దూలంలా మన మీద పడుతుంది - అంటూ వివరించి ప్రబంధపఠనం అంశాన్ని ముగించారు.

[ప్రబంధపఠనం అంశాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి రాసుకోవాలి నేను - ఇందులో ఆముక్తమాల్యదలోని పద్యాన్ని  - నారికేళపాక - శార్దూలాన్ని - చేపలకూరని వర్ణిస్తూ ఉన్నదాన్ని - చాలా ఇష్టంగా  రామారెడ్డిగారు తలుచుకున్నారు - వింటూ రాయడానికి కూడా చాలా సమయం తీసుకునేలా వున్నాయి అవి - తర్వాత తీరిగ్గా వున్నప్పుడు వచ్చి చేరుస్తాను వాటిని.]

తర్వాత ఆశువు - బండ్ల హనుమయ్యగారు "డొనాల్డ్ ట్రంప్ గారి పేరు మీరు వినే  వుంటారు - మంచో చెడో ఒక ప్రభంజనంలా వచ్చి అలజడిని సృష్టించాడు - ఆ ట్రంప్ గురించి ఓ పద్యం చెప్పండి" అని కోరారు.

రామారెడ్డిగారి ఆశుకవిత:

అమెరికా దేశ సౌభాగ్యమతిశయింప  - అడుగు అడుగున ప్రత్యర్థులంతరింప 
కఠిన నిర్ణయ కౌక్షయ ఘాతములను - ట్రంపు డొనాల్డు ధీరత నింపుచుండె 
(కౌక్షయం అంటే ఖడ్గం.)

ఇప్పుడింక మూడో వరస:
నిషిద్ధాక్షరి (జవ్వాది రమణగారు)

మళ్ళీ బ (నిషేధం) అని మొదలు పెట్టబోయారు కానీ అష్టావధానానికి కేటాయించిన సమయం మించిపోతోందని అవధానిగారు మూడో పాదం నిషేధం లేకుండా పూర్తి చేయడం మొదలుపెట్టారు  - లీనమ్ముగా చిత్రమ్ముగా మాన - అంటూ.

అప్రస్తుతప్రసంగం: "అవధానిగారూ మీ పద్యాల్లో బాగా మంచి భావుకత, రసోత్పత్తి - రసం మంచి రుచిగా ఉంటోంది  ఇటువంటి రసవత్తరమైన పద్యాలు అల్లటానికి, చెప్పటానికి ఈ చేపల కూరల్లో రుచికి ఏమన్నా సంబంధం ఉందంటారా?" అని అడిగిన నారాయణస్వామిగారి ప్రశ్నకి "చేపల కూర పద్యం చెప్పానని అలా అడుగుతున్నారా అని నవ్వి దానికి - దీనికి సంబంధం ఏమీ లేదు' అని సమాధానమిచ్చి - నిషిద్ధాక్షరిలో మూడోపాదం - లీనమ్ముగా చిత్రమ్ముగా మానవ - చెప్పి సమయాభావం వల్ల నాలుగోపాదం కూడా పూరించేశారు : బాహుబలి రీతి మన్నన గాంచెన్ . 


పద్య రచనా ప్రక్రియలో వచ్చిన అంశాలలో ఇప్పుడు విడివిడిగా చెప్పిన పాదాలనన్నీ కలిపి చివరిలో ఏ పద్యానికా పద్యం ధారణ చెప్తారు అవధానిగారు - అని చెప్పారు అధ్యక్షులు మరియు నారాయణస్వామిగారు.

సమస్యాపూరణం లో మూడో పాదం:

కిందటి పాదంలో చివరి అక్షరం బంకలుపుకుని
(బం)ధురముగ  విక్రమించి కడు ధూర్తత నిత్యము చూపుచుండెగా

 వర్ణన మూడోపాదం మరియు నాలుగోపాదం : 

విజయచాపము రణమున విక్రమింప
బాణవర్షము కురిపించె  పాటవమున

అప్రస్తుతప్రసంగం: బాణవర్షం అనేటప్పటికి గురువుగారూ - అన్నమయ్య ఒక సంకీర్తనలో నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొనచూపులు నిలువునా పెరుకగా అంటిన నెత్తురు కాదు కదా? - అని రాశాడు - ఈ చూపుల తూపులు అమ్మవారు అయ్యవారి మీదకి వేసిందా? అయ్యవారు అమ్మవారిమీదకి వేశాడా?

అవధానిగారి సమాధానం: ఇద్దరి చూపులు తూపులేకదా? పరస్పరం రువ్వుకుంటారు అయినా అవి నిజంగా రక్తాలొచ్చే గాయాలేం కాదు - అవి మధురగేయాల్లాంటి గాయాలు - ఉత్ప్రేక్షాలంకారంలో చెప్పారన్నమాట.

దత్తపది మూడో - నాలుగో పాదాలు: 

వరాల హృద్య పద్య పాళి తాన కంఠమాలగా
నరాల రామరెడ్డి వంద నందనాలు పూయగా 

న్యస్తాక్షరి - మూడో పాదం: ఏడో అక్షరం - త:

భావన పొంగు చేతముల  స్వర్ణ వసంతము పుల్కరింపగా 

నాలుగో పాదం: తొమ్మిదో అక్షరం - ము:  

శ్రీ విలసిల్లి ఈ జగము చిక్కని శోభలు నింపుగావుతన్ 

ఇప్పటికి  నాలుగు విడతలు పూర్తయింది - ఇంకొద్ది నిముషాల్లో శ్రీ రామారెడ్డిగారు వీటన్నిటినీ ధారణ చేసి - అన్ని పద్యాలూ ప్రదర్శించారు.

నరాల రామారెడ్డిగారి ధారణ:
 
నిషిద్ధాక్షరి:

సోదరులు జువ్వాది రమణగారు బాహుబలి గురించి చెప్పామన్నారు. బాహుబలి నంబర్ వన్, నంబర్ టూ తర్వాత భారతదేశమే కాకుండా ప్రపంచమంతటా బాహుబలి-జ్వరం పట్టుకుంది - చలిజ్వరం లాగా. అది మనక్కూడా తప్పలేదు. నిషిద్ధాక్షరిలో అది నిషేధం చేయలేని పరిస్థితి గదా!

ఔనా మానస కాంక్షా
దీనావధి పూజ్య ధామ దీక్షారూపా 
లీనమ్ముగా చిత్రమ్ముగా మానవ
బాహుబలి రీతి మన్నన గాంచెన్  

సమస్యాపూరణం:

(మధురవాణి! అని సంబోధిస్తూ ధూర్తత అనే లక్షణం గిరీశం కూతురులా వుందే - అని చెప్తున్న చమత్కారం ఈ పద్యంలో వుంది.)

పరువము పాలపొంగువలె పరువులు తీయు వసంతవేళ భా
సురముగ సూన సాయకుడు సూటిగ బాణములేయుచుండ బం
ధురముగ  విక్రమించి కడు ధూర్తత నిత్యము చూపుచుండెగా  
వరుసలు జూడగా మధురవాణి! గిరీశము కూతురౌ గదా


దత్తపది: 

(తరాల -సరాల - వరాల-నరాల అనే పదాలు వాడి తానా సభల గురించి పంచచామరం అనే వృత్తంలో చెంగు-చెంగున ఎగురుతున్నట్టుగా చెప్పిన హృద్యమైన పద్యం ఇది.)

తరాల దాక సాగుగాక తారలుండు దాక పూ
సరాల సౌరభాల సారసాల మాలగా 
వరాల హృద్య పద్య పాళి తాన కంఠమాలగా
నరాల రామరెడ్డి వంద నందనాలు పూయగా
వర్ణన:

రామరూపము నయనాభిరామమగుచు
నీలమేఘము నిగ్గులు నింపుకుని 
విజయచాపము రణమున విక్రమింప 
బాణవర్షము కురిపించె  పాటవమున

న్యస్తాక్షరి:
 హ-రి-త-ము - ఇతివృత్తం పర్యావరణ రక్షణ - వృత్తం-ఉత్పలమాల - ప్రకృతికి సంబంధించిన ఇతివృత్తం -అంటూ అన్ని అక్షరాలను బేసిసంఖ్యలో - 3, 5, 7, 9 - తీసుకుని - న్యస్తాక్షరి సమస్యనిచ్చారు చంద్రహాస్‌గారు.

జీవహరాంతరాయముగా స్నిగ్ధ జగమ్ములు రూపుమాపకన్ 
పావన హారి భూజముల పచ్చదనమ్ములు పల్లవింపగా
భావన పొంగు చేతముల  స్వర్ణ వసంతము పుల్కరింపగా   
శ్రీ విలసిల్లి ఈ జగము చిక్కని శోభలు నింపుగావుతన్


[ఈ అష్టావధానం వీడియో తీసి, పంచుకున్న శ్రీ కూచి శాస్త్రిగారికి బోల్డన్ని ధన్యవాదాలు]


 



ఉపసంహారం: 

వీడియో వుంది కదా - రెండు ముక్కలేవో చెప్పి అది పోస్ట్ చేసేస్తే సరిపోతుంది కదా అనిపించింది చాలాసార్లు - కానీ తరతరాల తెలుగువారి సాహితీసంపదైన పసందైన అష్టావధానాన్ని - అంత పెద్ద వయసులో, అలసట (jet-lag) తీరకపోయినా - తమ కష్టం కనిపించనీయకుండా - తెలుగు మీద, పద్యం మీద ఎంతో ఇష్టంతో - ఆ హాలులో వున్న అతి కొద్దిమందే అయినా - నిరుత్సాహ పడకుండా -  సరే తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ఉత్సాహపడిన తెలుగు మాష్టారు-అవధాని నరాల రామారెడ్డిగారి మీద అభిమానంతో - మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా చదువుకోవడానికి వీలుగా నేను రాసుకున్న అష్టావధాన-పాఠం ఇది.  వీడియోలో ఉన్నది ఉన్నట్లు అంతా రాయలేకపోయాను కానీ ప్రధాన అంశాలు మాత్రం వదల్లేదు.

తెలుగు మీద నాకున్న ఎంతెంతో ఇష్టం - నాకొచ్చిన అంతంత మాత్రపు తెలుగులో...


ఎల్లలు దాటినా - తల్లి చాటునున్న తలపునిచ్చు
మెల్లగ అన్ననెవరైనా - చెవుల సోకి మనసు విచ్చు
చల్లని గంధపు పూతల హాయినిచ్చు
మల్లెల జాజుల మైమరపుల తావినిచ్చు
కమ్మనైన తెలుగు మాట మనది -
పలికితే పదికాలాలు మనవచ్చు 
నేను-నీవును మనము చేసి మనుమను దీవెనిచ్చు



8, అక్టోబర్ 2017, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 5 - నా కథావస్థల్లో క్రీడావస్థ

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 4 - రైలు ప్లాట్‌ఫారం నుంచి జైలు యూనిఫారం దాకా పళ్ళయ్యకథ


కొంతసేపు చదువులాపేసి నేనాడిన ఆటల గురించిచెప్తాను.

అసలు నేనాలోచిస్తూ వున్నాను - నా ఈ కథ మొదలుపెట్టినప్పట్నుంచీ - రామాయణంలో కాండలు, భారతంలో పర్వాల్లాగా -  నేను చెప్పుకుంటున్న నా కథలో భాగాలకి కూడా ఏదైనా పేరు పెడదామా అని.

జీవితంలో చతురవస్థలు - బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం - కాక ఈ కలియుగంలో ప్రతీది అవస్థే - పుట్టిందగ్గర్నుంచీ పెద్దయిపోవాలని అవస్థ, పెద్దయ్యిందగ్గర్నుంచీ చిన్నగా కనపడాలని అవస్థ - చదువుకోవాలంటే అవస్థ, చదివిందానికి తగ్గట్టు ఉద్యోగం తెచ్చుకోవాలంటే అవస్థ - నా కథ బ్లాగుగా రాయడం ఒక అవస్థ, రాసినది చదవడం ఇంకో అవస్థ.

అందుకే నా కథలో భాగాలు, కథకి విభాగాలు - అవస్థలు.

బాల్యావస్థ, విద్యావస్థ, క్రీడావస్థ, ఉద్యోగావస్థ - ఇలా రకరకాల అవస్థలన్నమాట.

ఇప్పటికి బాల్యావస్థ పూర్తయింది.

విద్యావస్థ సగంలో ఉన్నాను. దాన్నక్కడే ఆపి - నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటల విషయాలతో - ఇప్పుడు క్రీడావస్థ మొదలు.

చిన్నపుడేవో ఆటలు ఆడేవాణ్ణి - అవంతగా గుర్తులేవు.

ఫస్టుఫారం నుంచి థర్డుఫారం దాకా ఆడిన ఆటల విషయాలుఏంటంటే - మనింట్లో రెండు చక్రాల సైకిలు ఉండేదొకటి - పొట్టి సైకిలు. దానికి టైర్లు ఉండేవి కావు - రిమ్ములు ఉండేవి.  ఆ రిమ్ములతోనే సైకిలు తొక్కేహేవాణ్ణి.

ఒక ఇనప కుర్చీ - మడత కుర్చీ ఉండేది - దానిక్కింద చక్రాలుండేవి. దాంట్లో కూర్చుని - మా శిష్యకోటి ఉండేవారు కదా - వాళ్ళని పిలిచి - ఒరే నెట్టండ్రా - అనేవాణ్ణి - అదో ఆట ఆడేవాళ్ళం.

ఇది కాకుండా - గేట్లో దంగేటి చందర్రావుని ఒక సైకిలు షాపుండేది - రిపేరు షాపు. ఆ చందర్రావుకి నేనంటే మహా ముద్దు. పాపం - వాడేం చేసేవాడంటే - నన్ను పిలిచి తీసేసిన టైర్లు నాకిచ్చేవాడు. ఓ కర్రపుల్ల పట్టుకుని ఆ సైకిలుటైరు దొర్లించుకుంటూ అనాతారం ఊరంతా తిరిగుతుండేవాణ్ణన్నమాట.

వేసంకాలం ముంజికాయలొచ్చేవి.

ఒక గడకర్ర మధ్యలో సగం వరకు చీల్చి - ముంజికాయకి ఇంకో కర్రపుల్ల గుచ్చి - ముందు చీల్చిన గడకర్ర మయంలో ఆ ముంజికాయ పెట్టి -  గడకర్ర మూలల్లో కిరసనాయిలు పోసి - కిర్రూ-కిర్రూ మని శబ్దం చేసుకుంటూ తిప్పుకుంటే - అది ఒంటెద్దుబండి.

కొన్నాళ్ళయ్యాక - "ఎహె - ఈ ఒంటెద్దుబండి బాలేదు" అంజెప్పేహి - నాలుగు ముంజికాయలు తీసుకుని - ఒక కొబ్బరికమ్మ మధ్యలో వేసి - ముందున రెండు, వెనకాల రెండు పుల్లలు గుచ్చిన ముంజికాయలు కట్టి - మధ్యలో కొబ్బరికమ్మకి కన్నం పెట్టి - దాంట్లో ఒక కర్ర పొడుగ్గా చేతికందేలా పెట్టుకుని - దానికింకో ముంజికాయ పెట్టి - స్టీరింగు తిప్పుతూ కారులా తిప్పేవాణ్ణి.

సీతారామరాజుగారి సత్తికొండ, నాయనరాజుగారి సూరి - వీళ్ళేం జేసేవారంటే - రెండు ముంజికాయలు కట్టి - దానికేమో ఓ కర్ర పెట్టి తోసుకుంటూ వెళ్ళేవాళ్ళు .

చిన్నప్పటి ఆటలు అవే . 

ఫోర్తుఫారం నుంచి  కొంచెం జ్ఞానం పెరిగింది నాకు.

మా పొలంలో బాడ్మింటన్ కోర్ట్ ఒకటుండేది. మానాన్నగారు వాళ్ళు బాల్-బాడ్మింటన్ ఆడుతూ వుండేవాళ్ళు. వాళ్ళు వెనకాలకి కొట్టేహినప్పుడు ఔట్‌లైన్ దాటెళ్ళిన బంతిని పరిగెట్టుకుంటూ వెళ్ళితీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకిచ్చేవాడినన్నమాట.

నాకలా బాల్-బాడ్మింటన్ మీద దృష్టి పడింది.

ఫోర్తుఫారం నుంచి బాల్-బాడ్మింటన్, తర్వాత ఇంకేంటంటే .... ఇప్పుడు కబాడి అంటున్నారు - అప్పుడు చెడుగుడు అనేవాళ్ళం - ఆ చెడుగుడు, బేసుబాలు, వాలీబాలు, బాస్కెట్టుబాలు - ఈ ఐదాటలు - ఇంకా ఖో-ఖో ఒకటి - ఈ ఆరు ఆటలు మాత్రం బాగా ప్రాక్టీసు చేసేవాళ్ళమన్నమాట.

అందులో - చెడుగుడు ఎలా ఆడేవాళ్ళమంటే  - అటేడుగురు, ఇటేడుగురు వుండేవాళ్ళు. ఒక టీం పూర్తిగా అవుటై పోతే పది పాయింట్లు. ప్రతివాళ్ళూ కూతకెళ్ళడం - మధ్యలో సెంటర్ లైనుంటుంది - తర్వాత బార్క్ లైనంటారు - అది బోర్డర్ లైను - దాన్ని బార్క్ లైననే వారా రోజుల్లో.

కూత కెళ్లిన వాడేంటంటే ఆ బార్క్ లైను దాటాల. అది దాటకపోతే పెనాల్టీ పాయింటెళుతుందన్నమాట.

కూత కూసుకుంటూ బార్క్ లైను దాటి వెళ్ళిన వాణ్ణి అవతల టీం వాళ్ళు పట్టుకుంటే వాడవుటు - ఒక పాయింటు అవతలవాళ్ళకి. వెళ్ళినవాడు వాళ్ళలో ఎంతమందిని ముట్టుకుని ఔట్ చేస్తే అన్ని పాయింట్లు - ఇవతల టీముకి. టీం మొత్తం ఔటయితే పది పాయింట్లు ఇచ్చేవారు.

టీములో ఉన్నప్పుడు ఏడుగురేడుగురు ఆడినా - అనాతారంలో ఆడుకునేటప్పుడు ఇట్నలుగురూ, అట్నలుగురూ వున్నా ఆడేసుకునేవాళ్ళం.

సూదిబొత్తాలు - అదే ... పిన్నీసులు ఉంటాయి కదా అవి పందెం కాసుకునేవాళ్ళం. ఎంత మందుంటే అన్ని సూదిబొత్తాలు పందెం కాసుకునేవాళ్ళం - ఎవరు గెలిస్తే వాళ్ళు మొత్తం పట్టుకెళ్ళేవాళ్ళం.

అదీ చెడుగుడాట.

తర్వాత  బెచ్చాలాట.

బెచ్చాల్లో రేటింగు ఉండేదన్నమాట - డాలరు, రూపాయి లాగా. కాప్‌స్టన్  బెచ్చాకి డెక్కను  బెచ్చాలు ఇరవై ఇవ్వాలి. అలాగే బేర్సు, సిజర్సు, బర్కిలీ - ఇలా రకరకాల బ్రాండ్ల  బెచ్చాలుండేవి. ఒక్కోదానికి ఒక్కో రేటింగు - ఐదు  బెచ్చాలు, పది బెచ్చాలు, పదిహేను, ఇరవై - ఇలా ఉండేది.

ఈ  బెచ్చాలాట ఎలా ఆడేవాళ్ళమంటే - గుండ్రంగా ఓ చిన్నగిరి గీసి - అందులోనేమో బెచ్చాలు పేర్చేవాళ్ళం. పేర్చి దూరంగా లైన్లు గీసుకునేవాళ్ళం. నాపరాతిముక్కలు తెచ్చుకుని నున్నగా చుట్టూ చెక్కుకుని ఈ లైను దగ్గర నించుని ఆ మధ్యలో ఉంచిన బెచ్చాలని కొడితే  - ఎన్ని బెచ్చాలు బయటికి వస్తే అన్ని మనవి - కొట్లేకపోతే అవతల పార్టీకి వెళ్ళిపోతాయి.

బెచ్చాలాట ఆడే రోజుల్లో ఇంటినిండా బెచ్చాలు - ఓ...-  తెగ పెట్టేహేవాళ్ళం. ఎక్కడెక్కడి సిగరెట్టుపెట్లూ ఏరుకొచ్చేసి - చించేసి - బెచ్చాల కింద అట్టేపెట్టేసుకునేవాళ్ళం.

ఇదయ్యిన తర్వాత గోణేబిళ్ళ ఆడేవాళ్ళం. చిన్న గుంట తవ్వడం - చేతిలోనేమో మూరెడు కర్ర - ఓ చిన్నబిళ్ళుంటుంది - బిళ్ళ అంటే చిన్నకర్ర అన్నమాట. దాన్ని అటూ ఇటూ చెక్కి సూదిగా తయారుచేయడం - ఆ చిన్న గోతిమీద ఆ బిళ్ళ పెట్టడం - చేతిలోవున్న కర్రతో గూటాలి. దాన్ని అవతలవాడు క్యాచ్ పట్టుకుంటే మనం అవుటు. ఇద్దరుంటారు అవతల. క్యాచ్ పట్టకపోతే మళ్ళీ విసురుతాడు మనకి . విసిరినప్పుడు ఈ గుంట దగ్గర పడకూడదు ఆ బిళ్ళ. గుంట దగ్గర్నుంచి మనమేం చేయాలంటే - మన దగ్గరున్న కర్రతోటి గా...ఠిగా కొడతాం. కొడితే దూరంగా వెళ్ళి పడుతుందనుక్కో - పడింతర్వాత - ఎక్కడ పడిందో దాని కొన దగ్గర్నుంచి ఈ గుంటవరకు మన చేతిలో ఉన్న మూరెడు కర్రతో కొలవాలి. అది లాల అంటారు. కొలుచుకుంటూ వచ్చేటప్పటికి పది లాల్లు, ఐదు లాల్లు - ఇలా లాల్ల కింద లెక్క పెట్టుకోవాలి. అదో ఆట.

తర్వాతేమో - ఉప్పట్టొకటి ఆడేవాళ్ళం - దొంగుప్పట్టి. దొంగుప్పట్టంటే - ఓ గిరి గీయడం - అవతలేమో కొందరుంటారు ఈ గిరి లోపలేమో "ఆలింకు ఆలింకు" అని తిరుగుతూ వుంటారు కొందరు. వాళ్ళని ఆ గిరి దాటకుండా అవుటు చేయాలి.

హైస్కూలులో చెడుగుడుకి మాకొక కప్పు కూడా  వచ్చింది. చెడుగుడులో ఓ టీముండేది మాకు - గురుజ అర్జునరావని - ఇన్‌కంటాక్స్ కమీషనర్‌గాచేసేవాడు - వాడు కెప్టెనూ, నేను, అయ్యగారి వెంకట్రావు, నాయనరాజుగారి సూరి, నూకల విస్సి, జిన్నూరి కాశీ విశ్వేశ్వరరావు, సాయిబాబా, మంత్రిప్రగడ వాడొకడు - మేము ఏడుగురం టీము కింద ఉండేవాళ్ళం. అవతలి టీములో చిక్కాల వాడొకడు, ఉద్దిస భాస్కరరామమూర్తి, సూదా రామారావు వుండేవాళ్ళు.

ఖో కూడా ఆడేవాళ్ళం. అనాతారంలో వరహాభట్ల శంభన్నశాస్త్రి  అనేసి ఉండేవాడు. వాడందులో చాలా... చాలా టాపుగా ఆడేవాడు. వాడి టీములో నేనూ ఆడుతుండేవాడిని.

ఇలా ఆడుతూనే గ్రిగ్స్‌స్పోర్ట్స్‌కి వెళ్ళేవాళ్ళం.

అదే చెప్పాను కదా - బేస్‌బాల్‌ కూడా ఆడేవాళ్ళమని - బేస్‌బాల్‌కి  - నాలుగు బేసులు - ఒక పిచింగు, ఒక క్యాచ్ పట్టేవాడు, ఔటర్లో నలుగురు ఫీల్డ్ పట్టేవాళ్ళుంటారన్నమాట. ఆల్మోస్ట్ క్రికెట్టు లాగే ఉంటుంది ఆట. కాకపోతే క్రికెట్లో మూడు స్టంపులుంటాయి - ఇందులో నాలుగు బేసులుంటాయి. పోతుల ఆనందరావని చెప్పేసి - ఫుడ్ కార్పొరేషన్లో పనిచేసి రిటైర్ అయ్యాడు ఇప్పుడు - అతను మంచి హిట్టరు - అలాగే కొల్లు రామచంద్రరావని అతనేమో పిచ్చింగ్ చేసేవాడు. రాయడ నాగేశ్వర్రావు వెనకాల క్యాచులు పట్టేవాడు. మేము ఫీల్డులో ఉండేవాళ్ళం. వాళ్ళందరూ మెయిన్ కానీ నేను కొంచెం పక్కనే ఉండేవాణ్ణి.

బాల్-బాడ్మింటన్ మాత్రం మొట్టమొదట లెఫ్ట్-బ్యాక్ ఆడేవాణ్ణి. డిఫెన్స్ ఆడాలక్కడ. లెఫ్ట్-బ్యాక్ డిఫెన్స్ బాగా నేర్చుకున్న తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చి - వాళ్ళేం చేశారంటే కట్లు కొట్టడానికి - కట్టు కొట్టడమంటే - కో... డ్తే బాలు దిగిపోవాలన్నమాట - రైట్-ఫ్రంట్ ఇచ్చారన్నమాట. రైట్-ఫ్రంట్ మంచి ముఖ్యమైన స్థానం. నాకది డైరెక్ట్ ప్రమోషన్. ఎందుకంటే రైట్-బ్యాక్ ఇచ్చి రైట్-ఫ్రంట్ ఇస్తారు సాధారణంగా. అటువంటిది సరాసరి రైట్-ఫ్రంట్ ఇచ్చేశారు. రైట్-ఫ్రంట్ నుంచి సెంటరుకొచ్చేశాను. అంటే నలుగురుండే టీముకి నేను కాప్టెన్ అన్నమాట. సెంటర్ అంటే అన్నీ ఆడాల. ఆ విధంగా బాల్-బాడ్మింటన్లో బాగా ఎదిగాను. డబుల్స్ కూడా ఆడేవాళ్ళం. డబుల్స్ ఆడేటప్పుడు బ్యాక్ ఆడేవాణ్ణి. అది అక్కడ ముఖ్యమైన స్థానం - బ్యాడ్మింటన్ కోర్టులో.

గ్రిగ్స్‌స్పోర్ట్స్‌లో బాస్కెట్టుబాలులో - అమలాపురంలో ఆడినప్పుడు కూచిమంచి చంటబ్బాయి అని వాడు మా ప్రత్యర్థి. ఇప్పుడు మంచి ఫ్రెండు - వాడు, నేను, మాచిరాజు ప్రభాకర్ అని చెడుగుడు ఆడేవాడు - వాడు, తర్వాత ఇంకా చాలా మంది కలిసి ఆటలు ఆడేవాళ్ళం. ఇంకో తమాషా విషయం ఏంటంటే అప్పుడు అందరం ఇంటిపేర్లతోనే పిలుచుకునేవాళ్ళం - ఒరే మాచిరాజూ, ఒరే వడ్లమానీ, ఒరే కూచిమంచీ - ఇలాగన్నమాట!

ఇప్పటికి ఇవీ - నే చెప్పదలచుకున్న క్రీడావస్థ కబుర్లు.

ఇదిక్కడ ఆపాలి -  మళ్ళీ ఎస్సెల్సీ పూర్తయి కాలేజీకి వెళ్ళి - విద్యావస్థ దాటి ఉద్యోగావస్థలో కూడా ఆటలు వస్తాయి కాబట్టి. 

<వచ్చేనెల తరువాయి కథ>