19, సెప్టెంబర్ 2017, మంగళవారం

త్వామనురజామి - 17 - మాట లేని రోజు అది - వాక్కు లేని walk అది!

కిందటి 19 చెప్పిన కబుర్లు: త్వామనురజామి - 16 - సెలవులు రావాలి ...మేమంతా - ఇంటికి వెళ్ళాలి!


ఇంక రెండు రోజుల్లో ప్రయాణం.


రోజూలాగే క్లాసులకి వెళ్ళివచ్చాను.

క్లాసులు ఆటవిడుపుగా జరిగాయి. సెలవులకి ముందు కదా - అందులోనూ డిసెంబర్ 21కి ఇంటికి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేది జనవరి 21కే.

నెలరోజులు ఎంచగ్గా ఇంట్లో ఉండొచ్చు అన్న ఆనందం ఒక పక్కా - దాదాపు ఏడాదింపావుగా హాస్టల్ రూముల్లో చిన్ని చిన్ని స్నేహపు మొలకల్లా మొదలయి - ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో - ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో - అన్న ఆత్రేయ పాటే ప్రవచనంలా - ఆ పాటకి నిర్వచనంలా -  క్లాసులు, కబుర్లు, పాటలు, అలకలు, అల్లరుల మధ్య - ఇప్పుడు మైత్రీలతల్లా అల్లుకున్ననేస్తాలని వదిలి ఒక నెల ఉండాలీ అన్న బెంగ ఒక పక్కా - ఆ బెంగని దాచుకుంటూ దాటవేయడానికి అన్నట్లు - "నేను సెలవులనుంచి వచ్చేటప్పుడు నీకోసం ఇది తెస్తాను, నీకిష్టం కదా!" - అంటూ చేసుకుంటున్న చిట్టి-పొట్టి-చిన్నారి రోజుల్ని జ్ఞాపకం చేసే అమాయకపు వాగ్దానాలు, "నేను తప్పకుండా నీకు ఒక్క లెటరైనా రాస్తాను" అంటూ చేతిలో చెయ్యి వేయకపోయినా అంత పనిచేస్తున్నట్టూ పెడుతున్న ఒట్లూ,  రైల్వే స్టేషన్‌కి ఎవరెవరు కలిసి ఒక రిక్షాలో వెళ్ళాలీ అనే ప్లానులూ-ప్రణాళికలూ - ఓహ్! క్లాసుల్లో పాఠాలు వింటున్నా , హాస్టల్లో భోజనాల దగ్గర కలిసినా - అవే ఆలోచనలు, అవే కబుర్లు.

మా చుట్టూ వున్న గాలికి కూడా చుట్ట చుట్టుకుని తన పెట్టె సర్దుకుని తన పుట్టినిల్లు వెతుక్కుంటూ వెళ్ళిపోవాలనిపించేంతగా  - పాదాలు నేల మీద నిలవని అమ్మాయిల కబుర్ల సరిగమలు - ప్రయాణపు పదనిసలు.

ఆ రోజు క్లాసులు కూడా అంత సీరియస్‌గా జరగలేదు. వచ్చిన ప్రతీ లెక్చరర్ ఒక పావుగంట ముందే పాఠం ముగించేశారు.

అదుగో - అప్పుడే - తనకే ప్రత్యేకమైన ఒక వెండి-tinge - అంటే రెండు పల్చగా వున్న వెండి తీగలు గొంతులో బిగించి ఉంచారేమో - అనిపించే హాయైన గొంతుతో కూనిరాగాలు తీస్తూ వుండే మా మెరుపుతీగ సునీత - అన్నపూర్ణ, సోనియా అడిగారని - కళ్ళ నిండా ఇష్టాన్ని నింపుకుని నిశ్చలంగా తన హీరోయిన్ అర్చనని చూస్తూ హీరో నవీన్ నిశ్చల్ పాడే रात कली एक ख्वाब में आयी - और गले का हार हुई  పాడింది. అదే మొదటిసారి సునీత పాడగా నేను విన్నది - <ఇప్పటికీ ఆ పాట విన్న ప్రతిసారీ అప్పటి సునీత గొంతు గుర్తుకొస్తుంది.>

అప్పుడే మా క్లాసు గాన-కోయిలలందరూ సెలవులకి ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళే - మా పడుచుదనపు-రైలు-బండిలో ఆడుకోబోయే అంత్యాక్షరి అనే పాటల-ఆటకి గొంతులు శృతి చేసుకోవడం మొదలుపెట్టారు. 

నేను క్లాసులన్నీ అయి హాస్టల్ రూంకి రాగానే - సూట్‌కేస్‌లో - బట్టలు, పుస్తకాలు, శిల్పంలో కొన్న న్యూఇయర్ గిఫ్ట్స్, గ్రీటింగ్‌కార్డ్స్ - అన్నీ సర్దేసుకున్నాను.

చదివినా చదవకపోయినా Koontz - O'Donnell, Keith Davis నాతోపాటు వున్నారంటే - ఎలాగోలా నా బుర్రలోకి ఎక్కేస్తారు - అని అదో ధైర్యం. అందుకే సెలవులకి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా - ఎందుకే మోసుకొస్తావు ఎలాగూ చదవ్వు, మాచేత బరువు మోయిస్తావు - అని పప్పి, కుట్టి విసుక్కున్నా - తప్పకుండా ఓ రెండు టెక్స్ట్‌బుక్స్ పట్టుకెళ్ళేదాన్ని.

ఆరోజు సాయంత్రం -  శ్రీలత, సంగీత, గుత్తిపద్మజ  - ఏదో కొనుక్కోవాలని కాలేజ్‌స్టోర్‌కి వెళ్తుంటే నేను కూడా వాళ్ళతో పాటు స్టోర్ దాకా వెళ్ళాను కానీ - లోపలి వెళ్ళాలని అనిపించలేదు - అందుకే కాలేజ్‌స్టోర్‌కి ఎదురుగా వుండే మా స్టేజ్ కున్న మెట్ల మీద కూర్చున్నాను.

మా హాస్టల్ నుంచి బయటికి వెళ్ళాలన్నా - బయటినుంచి హాస్టల్ వైపు రావాలన్నా - ఒక చిన్న గేటు దాటి పద్మావతి పాలిటెక్నిక్ హాస్టల్ (మా ఓల్డ్ హాస్టల్) మీదుగా వెళ్ళొచ్చు. ఆ దారే మేము సాధారణంగా తిరుపతి టౌనులోకి బస్సులెక్కడానికి వెళ్ళాలంటే వాడేవాళ్ళం.

ఆ చిన్నగేటుకి ఇవతలగా ఎడం పక్క కాలేజ్‌స్టోర్, మధ్యలో మేము వార్షికోత్సవాలకి ఆడే-పాడే-వారిని చూసి ఆనందించడానికి ఒక స్టేజ్, కుడి పక్కన కాలేజ్ అసెంబ్లీ మీటింగులో, SPIC-MACAY కార్యక్రమాలో జరిగే ఒక పొడవైన హాలు ఉండేవి.

అదుగో - ఆ స్టేజ్ మెట్లమీదే నేను కూర్చున్నది ఆ వేళ - నేనూ పల్చని బంగారు ఎండకి మాచింగ్‌గా పసుపు రంగు చుడీదార్ వేసుకుని.
 
శీతాకాలపు సాయంత్రం.

బోల్డంత నీలంగా వున్న మబ్బుల్లేని ఆకాశం.

నారింజ రంగు సూరీడు.

బంగారు వన్నె ఎండ.

ఆ నులివెచ్చని మలిసంజలో ఎండకాగుతూ నేను.

ఒక కన్ను చేత్తో మూసుకుని ఇంకో కంటి కనురెప్ప మీద చూపుడువేలు నొక్కిపెట్టి - ఆ లేలేత ఎండ వెలుగురేఖల్లో - నాకై నేను సృష్టించుకున్న వాన-లేని-వానవిల్లు చూసుకుంటూ - ఆ కిరణమాలి కిరణాలను మాలిమి చేసుకుని ఆడుకుంటున్నాను.

ఇంతలో ఎదురుగా ఇద్దరు అబ్బాయిలు వస్తూ కనిపించారు. - నా వైపే.

అందులో ఒకతను - రాజశేఖర్ - అప్పటికి రెండు సార్లు అతనితో మా(పో?)ట్లాట అయింది.

అతన్ని చూడగానే నాకోసమే వచ్చి ఉంటారని అనిపించి - అనుకోకుండానే లేచి వాళ్ళిద్దరికీ ఎదురెళ్ళాను.

అప్పటికే రెండు సార్లు రాజశేఖర్‌తో చాల రూడ్‌గా మాట్లాడాను - అదీ కాక ఇవాళ ఇంటికి వెళ్తున్నానన్న సంబరంలో హుషారుగా వున్నాను - అందుకే ఈసారి కొంచెం మంచిపిల్లలా ప్రవర్తిద్దామని - నవ్వుతూ పలకరించాను.

"హాయ్... హాయ్... "

"హాయ్" (నా రెండు "హాయ్" లకీ - ఒకే "హాయ్" బదులు - రాజశేఖర్‌ నుంచి - లుప్తమైన ఆ రెండో "హాయ్" గురించి అంతగా పట్టించుకోలేదు).

నేనెప్పుడూ అబ్బాయిలతో తెలుగులో మాట్లాడేదాన్ని కాదు - ఏసీ కాలేజ్‌లో డిగ్రీ చదివేటప్పటినుంచీ అదే అలవాటు - ఇంగ్లీషులో మాట్లాడే అమ్మాయిలని అబ్బాయిలు అంత తొందరగా ఏడ్పించరని tried & tested & proven fact - నావరకూ.

నన్ను పలకరించిన రాజశేఖర్‌కి ఒక పక్క నేను, ఇంకో పక్కన ఆ కొత్త అబ్బాయి - ముగ్గురం నడవడం మొదలు పెట్టాము.

కాలేజ్‌స్టోర్‌లో వున్న శ్రీలత వాళ్ళకి నాతో ఇది అలవాటే - వాళ్ళతో నేను వెళ్ళడం - ఈలోగా కొత్తగా ఫ్రెండ్స్ అయిన శుభ, రజని, అరుణ కనిపిస్తే వాళ్ళతో నేను వాకింగ్‌కి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం - రాత్రి డిన్నర్ టైంకి నెమ్మదిగా రూంకి చేరడం - ఈ రోజూ వాళ్ళు స్టోర్ నుంచి బయటికి రాగానే నేను కనిపించకపోతే - నేనెప్పటిలాగే ఎటో "ఆకలా... దాహమా ...చింతలా ... వంతలా ... ఈ కరణి వెఱ్ఱినై  ఏకతమ తిరుగాడ..." అని పాడుకుంటూ తిరిగివస్తానని అనుకుంటారని నాకు తెలుసు. అందుకే వాళ్ళకి చెప్పకుండానే ఆ ఇద్దరు అబ్బాయిలతో కబుర్లు చెప్తూ నడవడం మొదలు పెట్టాను.

మహా అయితే ఒక పది నిముషాలు గడిచి ఉంటాయి - మా చిన్నగేటు దాటి పాలిటెక్నిక్ హాస్టల్ దాటి పెద్దగేటు దగ్గరికి వెళ్ళేలోగా జరిగిన సంభాషణ వరస ఇదిగో ఇదీ:

"Hmm ... What brings you here?"

"We are here just to say "hi" to you"

ఇంతకు ముందు విన్నదే - అయినా ఈసారి అంతగా కోపం రాలేదు.

"That's nice of you. You know one thing? I am going home day after"

చెప్తున్న నా గొంతులో దాచుకోలేని సంతోషం.

"Really? By Narayanadri?"

"Yes - I got my tickets reserved last week"

నయం - అక్కడితో ఆగాను - రిక్షాలు, మాట్లాడేసుకున్నాం - సూట్కేసులు సర్దేసుకున్నాం - అంటూ ఏంటేంటో అంటూ-పొంతూ లేకుండా మాట్లాడేయకుండా.

"Oh - good to know. We need to go now. Bye!"

పర్లేదు - పది నిముషాల్లో వెళ్ళిపోతున్నారు - ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా - మంచబ్బాయిలే!

"Bye." అంతలో ఒక సందేహం - "One more thing - why is your friend so quiet?"

"He doesn't say anything - except smiling." - అని చెప్తూ నాకు ఇంకోసారి bye చెప్పేసి ఇద్దరూ పాలిటెక్నిక్ గేట్ దాటి పద్మావతి కాలేజ్ గోడ పక్కనుంచి SVU కి వెళ్ళిపోయారు.

ఒక్క నిముషం - నేను విన్నది నిజమేనా - అని అనిపించింది.

"ఆ రెండో అబ్బాయికి మాటలు రావా? అమ్మో - మాట్లాడకుండా అసలెవరైనా వుండగలరా? మాట్లాడకుండా ఉంటూ అసలు MBA ఎవరైనా చదవగలరా? ఆ అబ్బాయి నవ్వు ఎంత బావుంది - వెన్నెల్లా? ఆ అబ్బాయి వెనకాల వెళ్ళి ఇంకొక్కసారి ఆ నవ్వుమొహం చూస్తే ఎంత బావుండునో కదా?" - ఇలా ఆలోచిస్తూ వెనక్కి వస్తూ ఉంటే పాలిటెక్నిక్ హాస్టల్ (అదే మా ఓల్డ్ హాస్టల్) ముందు వుండే బజ్జీలకొట్టు దగ్గర బజ్జీలు కొనుక్కుని తింటూ కబుర్లు చెప్పుకుంటున్న ప్రగతి, మాధవీలత, ఉష, అపర్ణ కనిపించారు. మాధవీలతతో పాటు జర్నలిజంలోనో, Law లోనో  కొత్తగా చేరిన వాళ్ళ చెల్లెలు (తన పేరు మర్చిపోయాను - ఉమ అనుకుంటాను - ఉమామహేశ్వరి - కానీ నేను తప్పుగా గుర్తు పెట్టుకుని ఉండొచ్చు - ఎందుకంటే తనని ఎక్కువగా మాధవీలత చెల్లెలు అని రిఫర్ చేయడమే అలవాటు నాకు అప్పట్లో) కూడా వుంది. తననీ పలకరించి పరిచయం చేసుకుందామని వాళ్ళ దగ్గర ఆగాను.

నన్ను చూడగానే - మా క్లాసులో విశాఖయాసతో గలగలా కబుర్లు చెప్పే ప్రగతి - "మా క్లాసులో గోలపిల్ల ఇదే - గోలా చేస్తుంది - గోలగా పాడుతుంది కూడా" అని చెప్పేసి నేను అడగ్గానే పాడేస్తానని కూడా ప్రకటించేసింది.

అడగనివారిది పాపం - అడిగినవారిది అడిగినంత భాగ్యం అనుకునే టైప్ నేను - పాటల విషయంలో - ఆరోజు నేను పాడిన పాట (ఈ పాట అప్పుడే కలిసి వెళ్ళిన మూగ అబ్బాయిని గురించి ఆలోచిస్తున్న నాకు అనుకోకుండా తట్టి నే పాడేసిన పాట) :

కొమ్మ మీది కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది 
అది కూన విన్నదీ - ఓహో అన్నది

ఈనాడు చిగురించు చిగురాకు వగరే 
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో 
నాడు ఆ రాగ మే గుండె జతలో 
తానె శృతి  చేర్చి లయ కూర్చునో 
అని తల్లి అన్నది - అది పిల్ల విన్నది 
విని నవ్వుకున్నదీ -కలలు కన్నది 

కొమ్మ మీది కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది 
అది కూన విన్నదీ - ఓహో అన్నది  
ఈ లేత హృదయాన్ని కదిలించినావు 
నాలోన రాగాలు పలికించినావు 
నాకు తెలిసింది నీ నిండు మనసే 
నేను పాడేది నీ పాటలే 
అని ఎవరు అన్నది - అది ఎవరు విన్నది 
ఈ చిగురు చెవులకే - గురుతు వున్నది 

కొమ్మ మీది కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది 
అది కూన విన్నదీ - ఓహో అన్నది. 

పాట పాడడం అయిపోగానే - ప్రగతీ వాళ్ళకి bye చెప్పేసి దాదాపుగా పరిగెడుతున్నట్టుగా రూంకి వెళ్ళాను.

అక్కడ శ్రీలత తన మంచం మీద కూర్చుని ఏదో నోట్స్ రాసుకుంటున్నారు.

"శ్రీలతా! మీకో విషయం తెలుసా? ఇవాళ ఒక మూగ MBA అబ్బాయిని కలిశాను. మీగ్గుర్తుందా? - మనమొకసారి గుంటూరు వెళ్ళేటపుడు ఒక పింక్ షర్ట్ అబ్బాయి మన కంపార్టుమెంట్ లోనే వచ్చాడూ - అతని ఫ్రెండ్ ఇతను - మూగతను. కానీ MBA student. ఎంత గ్రేట్ కదా?!"

"మూగబ్బాయి MBA ఎలా చేయగలడు లల్లీ! నువ్వు మరీ చెప్తావు"

"లేదు, శ్రీలతా! నిజంగా. నేను చూడకపోతే మీలాగే నమ్మేదాన్ని కాదు - అతనికి నవ్వడం తప్ప ఏమీ రాదు"

"Really ?"

"అవును - అంతసేపు నేనూ - రాజశేఖర్ - అదే ఆ పింక్ షర్ట్ అబ్బాయి - మాట్లాడుతూనే వున్నామా - అస్సలతను ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు - అసలెవరైనా అలా మాట్లాడకుండా వుండగలరా? మీరే చెప్పండి!"

"ఏమో లల్లీ ! నువ్వింత చెప్తున్నావంటే నిజంగానే మూగవాడై ఉంటాడు. నువ్వన్నట్టు నిజంగానే చాలా గ్రేట్! అవునూ - MBA వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ అవీ ఉంటాయి కదా - మరెలా మేనేజ్ చేస్తాడో?"

"ఏముంది పేపర్ మీద రాసిస్తే వేరే ఎవరైనా చదువుతారేమో - ఎంత తెలివైన వాడు కాకపొతే MBA లో సీట్ ఇస్తారు వాళ్ళూ? ఆ మాత్రం consider చేయలేరా ఏంటి?" - అప్పుడే ఆ మూగ అబ్బాయి వైపు - అతనేదో నా ఫ్రెండ్‌లా సమర్థిస్తూ మాట్లాడేశాను నేను.

ఇంక ఆ రాత్రి డిన్నర్ దగ్గర కూడా కాసేపు ఆ మూగబ్బాయి గురించి సంగీత, పద్మజవల్లి, గుత్తిపద్మజ - అందరికీ చెప్పేశాక కానీ నా సరదా, సంబరం తీరలేదు - ప్రపంచంలో ఎనిమిదో వింత కనుక్కున్నంతగా కలిగిన నా ఉత్సాహం ఆగలేదు.

ఆ రాత్రి నిద్ర వచ్చేదాకా - కొమ్మమీది కోకిలమ్మ పాట  - continuous hum అన్నమాట !

ఇక్కడ ఆగి మళ్ళీ నే మిగిలిన కథ చెప్పడానికి వచ్చేలోగా ఈ పోస్ట్ టైటిల్ పాట - అసలు పాట ఏదో పట్టి-చెప్పండి.

ఈ కింది కొసరు పాట పట్టి-పట్టి పాడెయ్యండి:

టైపు చేసి నింపినా పేజీ నిండదు 
బోలెడన్ని చెప్పినా కథలు తరగవు
వారానికి ఒకటి అయినా - నెలకి నాలుగు పోస్టులైనా 
కబుర్లు చెప్పకపోతే ... ఆ హాయి నిండదు



<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>



10 కామెంట్‌లు:

  1. కొంచెం ఎక్కువ వ్రాస్తే ఏం పోయింది లలిత గారు.ఇంకా చదవాలనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ మాత్రం రాయడానికే వీలు కుదుర్చుకోవడం కుదరడం లేదండి - మీ అభిమానపూరిత వ్యాఖ్యకి ధన్యవాదాలు!

      తొలగించండి
  2. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నేను కూడా ఎక్కువ మాట్లాడను. కబుర్లు చెప్పడం అసలే రాదు. వినడం మాత్రం మహా ఇష్టం. వ్రాయడం కూడా బద్దకమే ! మాట్లాడే ఒకటీ అరా మాటలే తట్టుకోలేరు. సుధీర్ఘ ఉపన్యాసం ఎపుడిస్తానో అన్నది నా కల ! యాతమేసి లాగినా ఏరు ఎండదు...ప్లాస్టరేసి మూసినా మీ ....వద్దులెండి :))) టైటిల్ మహర్షి సినిమాలో పాట అనుకుంటున్నాను. నా పెళ్ళికి ముందు హైదరాబాద్ కి రాకముందు రాత్ కలీ సినిమాలో అర్చనలాగే ఉండేదాన్ని జిడ్డు ముఖంతో...పెళ్ళిచూపులు హైదరాబాద్ లో జరిగాయి... ఎర్రటి మైసూర్ క్రేప్ చీరలో కవర్ చేసేసరికి పెళ్ళయిపోయింది. నాకు మాటలు రావనుకుని బహు ముచ్చటపడి పెళ్ళి చేసుకున్నందుకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు :))

    రిప్లయితొలగించండి
  3. మా బంధువులమ్మాయి నల్లగా ఉంటుంది. తనని ఎవరూ కేర్ చేయట్లేదు అనుకున్నపుడు ఇంగ్లీష్ లో టక టకా మాట్లాడేస్తుంది. మీరన్న మాట నిజం ...ఇంగ్లీష్ లో మాట్లాడే స్లివ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న ఆడవాళ్ళంటే భయం తో కూడిన భక్తి ఎక్కువే !

    రిప్లయితొలగించండి
  4. ఇంతకీ అతను ముగబ్బాయేనా ఎదో డౌట్ పెట్టి ముగించేస్తే ఎలా అక్కో.....!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొంచెం ఓపిక పట్టు తమ్ముడూ - తొందరలోనే తెలుస్తుంది :)

      తొలగించండి
  5. ఎప్పటిలాగే కబుర్లు బావున్నాయండీ.. పోస్ట్ కంటెంట్ కి తగినట్టుగా అసలుపాట "మాటరాని మౌనమిది" అని అనుకుంటున్నాను.. కొసరుపాట "ఏతవేసి తోడినా" అనిపిస్తుంది.. అవునా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎప్పట్లాగే చదివినందుకు - పాటలు పట్టినందుకు బోల్డన్ని థాంక్స్!

      తొలగించండి