ఈసారి కబుర్లు చెప్పటం మొదలెట్టేముందు - ఓ చిన్న పొడుపు కథ...
అనగనగనగనగా...
అక్కడెక్కడో పుట్టింది
మా ఇంటికొచ్చింది
సోమరి కాదు తోమరి తానంది
మీట నొక్కితే ఆడింది
ఆడుతు పాడుతు తోమింది
తోమి తోమి తోమలేక ఆగింది
ఆగింది, ఆగింది, ఆగిపోయింది
అయ్యో! అనేలోగా -
హఠాత్తుగా లేచి సాగింది
ఆడింది ఏంటది ? తోమింది ఏంటది?
ఆగింది ఎందుకది? సాగింది ఎక్కడికది?
చెప్పుకోండి చూద్దాం!
వారం వారం ఏం కబుర్లు చెప్తుందా అని ఎదురు చూసే నా నేస్తాలు ఇది చదవగానే ఏమనుకుంటారో. నన్నేమడగాలనుకుంటారో నాకు తెలుసు.
అసలీ తోమరి ఏంటి?
అంతకు ముందు ఆడుతున్నదేంటి?
ఇప్పుడు ఆడక ఆగిందేంటి?
ఆగినది ఆగినట్టుండక మళ్ళీ సాగిందేంటి?
ఆ సాగిందెక్కడికో చెప్పకుండా ఈ బ్లాగింగేంటి?
హన్నా! - అని నన్ను నిలదీస్తారని తెలుసు.
నేను రాయబోయేది ఏమన్నా -
ఇప్పుడే అందిన వార్తా?
ఎప్పుడూ జరగని వింతా?
చెప్పుకోదగిన విశేషమా?
చెప్పుకోలేని రహస్యమా?
ఇంటికో, వంటింటికో పనికొచ్చే టిప్పా?
టైం-పాస్ గాసిప్పా?
అబ్బే! అదేమీ కాదు!
ఇది చాలా మందికి - అతి సాధారణమైన, బహు సామాన్యమైన, మహా uninteresting topic కూడా అయ్యుండొచ్చు. నాకు మాత్రం మిగిలిన అన్ని విషయాల్లాగే - కాదేదీ ఇంటరెస్ట్ కనర్హం - అనిపించే విషయం.
ఒక రోజులో నేను చేసే పనులని నాలుగు రకాలుగా విభజిస్తే అవి ఇలా ఉంటాయి:
సమయానికి చెయ్యాల్సిన పని - అంటే ఆఫీసు, ఉద్యోగం, అమ్మ-నాన్న-అత్తగార్ల సీరియళ్ళకి అంతరాయం కలక్కుండా వాళ్ళకి వీలైన టైములో ఫోన్ చేసి మాట్లాడడం లాంటివి.
సమయం చూసుకుని చెయ్యాల్సిన పని - ఒంటికి చురుకిచ్చే నడక, మెదడుకి చురుకిచ్చే పజిల్స్.
సమయం ఉంటే చెయ్యాల్సిన పని - చదవడం, రాయడం, స్నేహితులతో మాట్లాడడం లాంటివి.
సమయం ఉందా లేదా అన్న ఛాయిస్ లేని పని - వంట, వంటింటి శుభ్రం.
ఉన్న ఇంతోటి పనులని ఎన్ని ముక్కలుగా విడగొట్టుకున్నా వీటన్నిటినీ చేసేటప్పుడు వేటికి కావాల్సిన ఉత్సాహం వాటికి ఉంచుకుంటేనే - నా రోజు ఆడుతూపాడుతూ గడుస్తుంది. లేకపోతే "సమయం ఉంటే చెయ్యాల్సిన పని"ని ఎక్కువ చేసేసి "సమయం ఉందా లేదా అన్న ఛాయిస్ లేని పని"ని ఎగ్గొట్టేయ్యాలనిపిస్తుంది.
అందుకే రాసి పెట్టుకున్నా: Happiness is... doing what I like & liking what I do అంటూ నా మాటగా.
నాకిష్టమైన పనిని చేయడమే ఆనందమనుకుని ఆగిపోక, చేసే ప్రతిపనినీ ఇష్టపడంలో ఆనందముందని అనుకోవడం హాయబ్బా!
ఇంతకీ ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకూ అంటే ఇవాళ్టి కబుర్లలో హీరోయిన్ను - కిచెన్‌లో నా ఎయిడూ, మా వంటింటి తోమరి అనబడే కిచెన్ ఎయిడ్ - డిష్ వాషర్.
నాకు డిష్ వాషర్ ఒక మంచి కిచెన్ అసిస్టెంట్. నేను చెప్పినట్టు విని, నాకు కావాల్సినట్టు పని చేసే నాకనువైన డొమెస్టిక్ హెల్ప్.
సాధారణంగా డిష్ వాషర్ వాడకం గురించి ఒక కంప్లైంట్ లాంటి కామెంటు వినిపిస్తూ ఉంటుంది "మీ అమెరికాలో డిష్ వాషర్లు ఉన్నాయీ అనుకోవడమే కానీ మీరు అన్నీ కడిగి పెడితే కానీ అవేమీ తోమవట కదా?" అని. నేనది విన్నప్పుడల్లా డిష్ వాషర్లూ, వాటి ఉపయోగాలూ, వాటి వల్ల అయ్యే నీటి ఆదాలూ అంటూ ఓ పే...ద్ద పాఠం అప్పచెప్తూ ఉంటాను. ఎవరైనా వింటే నేనే ఆ డిష్ వాషర్లని తయారు చేసి అమ్ముతున్నానేమో అనుకునేలా.
అదే ఇక్కడ మళ్ళీ మళ్ళీ - పునరపి వచనమ్! అవధరించుడి!
డిష్ వాషింగ్ అనేది మూడంచెల పధ్ధతి.
మొదటి అంచె - వండిన గిన్నెల్ని, వాడిన గరిటల్ని, తిన్న కంచాలని - వాటివాటికి అతుక్కున్న పదార్థాలని నీళ్లతో తొలిచి వదిలించడం.
రెండో అంచె - అన్నిటికీ సబ్బు అనబడు స్తోమక్షారం రాయడం.
మూడో అంచె - రాసిన సబ్బుని నీళ్లతో కడగడం.
డిష్ వాషర్ వాడేటప్పుడు మొదటి అంచె మాత్రమే నా వంతు. మిగిలిన రెండూ డిష్ వాషర్ వంతు. అంటే నాకు గిన్నెలు కడిగే టైములో రెండొంతుల టైము ఆదా. పైగా కిందా, పైనా అన్ని పక్కల్నించీ వేడివేడి నీళ్ళు చల్లి గిన్నెలన్నిటికీ తలంటేసి ఎక్కడా జిడ్డు లేకుండా మిలమిలలాడేట్టు చేసే డిష్ వాషర్ అంటే నాకు బోల్డంత ఇష్టం.
"ఉద్యోగం పురుష లక్షణం" అని అప్పుడెప్పుడో ఎవరో రాసి పెట్టేసి - అసలలా రాయడానికి కారణమైన సందర్భమేదో సరిగ్గా తెలీకపోవడంతో - బయటికెళ్ళి చేసే ఉద్యోగాలు మాత్రం మగపనులు, అవి కాకుండా మిగిలిన ఇంటి పనులన్నీ ఆడపనులని అనుకునేలా చేసేశారు. ఆ ప్రకారంగా గిన్నెలు కడగడం అనేది ఆడపని, అంతగా మాటాడుకోకూడని పని అయిపోయింది. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని పనులనీ ఆడా-మగా తేడా లేకుండా అందరూ వీలైనంత వరకు నేర్చుకోవాలి. అదే కదా చిన్నప్పుడు విన్న పేదరాశి పెద్దమ్మ కథల్లో నేర్చుకున్నది?!
ఇప్పుడు నేనో కథ చెప్తా...
అనగనగా ఓ రాజు. ఆయనకో రాణి. వాళ్ళకి ఓ రాకుమారుడు పుడతాడు. ఆ రాజేమో రాకుమారుడికి అన్ని విద్యలూ నేర్పిస్తాడు - ఒక ప్రత్యేకమైన కుట్టుతో బొంతలు కుట్టడంతో సహా. ఆ తర్వాత రాకుమారుడు దేశాటనకి వెళ్తాడు. ఈలోగా దుష్ట సేనాధిపతి పన్నాగాల వల్ల రాజ్యం పోగొట్టుకున్న రాజు, రాణి వేరే నగరానికి పారిపోయి మారు వేషాల్లో ఎక్కడో తలదాచుకుంటారు. ఈ విషయం దేశాటన నుంచి తిరిగొచ్చిన రాకుమారుడికి ఓ పేదరాశి పెద్దమ్మ చెప్తుంది. అప్పుడా రాకుమారుడు ఓ ప్రత్యేకమైన బొంత కుట్టి పేదరాశి పెద్దమ్మకి ఇచ్చి - ఎవరైతే ఆ బొంతని చూడగానే "ఇది ఫలానా కుట్టు" అని గుర్తుపట్టగలుగుతారో వాళ్ళ వివరాలు కనుక్కోమంటాడు. అలా తన తలిదండ్రుల జాడ తెలుసుకుంటాడు. ఆ ఆ తర్వాత దుష్ట సేనాధిపతిని ఓడించి తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యం తిరిగి సంపాదించుకుంటాడు. ఆ రాకుమారుడు బొంతలు కుట్టడం ఆడపని అని నేర్చుకోవడం మానేసి ఉంటే ఇంత కథ జరిగేది కాదు కదా! (ఈ కథ చిన్నప్పుడు విన్న పేదరాశి పెద్దమ్మ కథల వరసలో నేను అల్లుకున్న ఓ కథ.)
ఇదంతా - అంటే పైన రాసిన పొడుపు కథలూ, పేదరాశి పెద్దమ్మ కథలూ - ఇవన్నీ కూడా - "గిన్నెలు కడగడం, డిష్ వాషర్లూ" లాంటి విషయాలు కబుర్లు రాయడానికి అనర్హం కాదని చెప్పడానికి నేను build చేసుకున్న persuasive argument.
ఇప్పుడింక అసలు విషయం లోకి - అంటే మా గిన్నె-తోమరి అనబడే డిష్ వాషర్ కబుర్లలోకి వస్తే...
కిందటి వారం మా డిష్ వాషర్ ఎప్పట్లాగే కిందా, పైనా అరల్లో ఉన్న గిన్నెలన్నిటినీ తళతళలాడేట్టు తోమింది.
డిష్ వాషర్లన్నాక ఏవైనా అదే పని చేస్తాయి. అందులో విశేషం ఏమీ లేదు.
మా గిన్నె-తోమరి కొంచెం తుంటరి.
తోమింది తోమినట్టుండక - పై అరలో పెట్టిన ఒక గాజు గ్లాసుని ముక్కలు చేసింది.
రెండేళ్ళ క్రితం ముచ్చట పడి కొనుక్కున్న గాజుగ్లాసులు మూడు ముక్కలవ్వడం ఇది మొదటి సారేమీ కాదు - మూణ్ణాలుగులీక్వల్టూ-పన్నెండో సారి.
"ఇంకెప్పుడూ ఇలాంటి గ్లాసులు కొనకూడదు" అని ఆ పగిలిన గాజుముక్కలేరుతూ పన్నెండో సారి అనుకున్నా.
ఈ స్టెప్పు వరకూ ఇంతకూ ముందు పదకొండు సార్లు ఎలా జరిగిందో అదే సీక్వెన్స్ - అదేదో ఇంతకు ముందెప్పుడో అచ్చు ఇలాగే జరిగిందే అనిపించే deja vu లాగా.
మరుసటి రోజు పొద్దున్నే - ఉన్న రెండు అరల నిండుగా - కళాత్మకంగా సర్దిన కంచాలని, గిన్నెలని, గరిటల్నీ - కళ్ళ నిండుగా చూసుకుని - నీలి రంగులో జాలువారుతున్న డిష్ వాషర్ డిటెర్జెంటుని వేసి - ఆన్ చేయగానే - దడదడలాడుతూ హడావిడిగా తిరగాల్సిన మా డిష్ వాషర్ ఉన్నట్టుండి ఉలుకూ-పలుకూ లేకుండా ఉండిపోయింది.
డిష్ వాషర్ పని చెయ్యట్లేదు అని చెప్పగానే బదరికి వచ్చిన మొట్టమొదటి ఆలోచన - పగిలిన గాజు ముక్కలేమన్నా లోపల పడ్డాయేమోనని. మళ్ళీ మనకి మనమే అనుకోవడం ఎందుకని మా ఇంటికెప్పుడూ వచ్చే ఎలక్ట్రీషియన్ రిక్‌ని పిలిచి అతనికోసారి చూపిద్దామని అనుకుని ఫోన్ చేస్తే ఆయనేమో ఓ రెండ్రోజుల దాకా రావడం కుదరదన్నాడు.
ఇక చేసేదేముంది?! వంతుల వారీగా "ఆడుతు పాడుతు తోమేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ?!" అని ఆడుకుంటూ-పాడుకుంటూ కాలక్షేపం చేసుకున్నాం.
ఇంట్లో ఉన్న పిల్లజింకలిద్దరూ - అటొచ్చీ-ఇటొచ్చీ వంటింట్లో గిన్నెల-కొలువు చూస్తూ - "అమ్మా! డిష్ వాషర్ లేదు కదా - డిషెస్ ఏమైనా తగ్గించి వాడుతున్నావా?" అని పరామర్శించడం - దానికి నేను "డిష్ వాషర్ లేదని వండే డిష్షులు తగ్గలేదు కదమ్మా!" అని బదులివ్వడం.
ఇలా ఓ రెండ్రోజులు గడిచాక రిక్ వచ్చాడు. వస్తూనే డిష్ వాషర్ లోకి తొంగి చూసి - మల్టిమీటర్ పెట్టి దాని నాడి చూసి - "మోటార్ బాగానే ఉన్నట్టుంది. ఇదిగో ఈ బయటున్న ఎలక్ట్రానిక్ టచ్ ప్యాడ్ పోయింది" అని చెప్తూనే "ఇది కొత్తది వేయించుకునే బదులు ఇంకొక కొత్త డిష్ వాషర్ కొనుక్కోవడం మంచిది. మీరు కొత్తది కొన్నా దాని వారంటీ పీరియడ్ అయిపోగానే ఎలాగూ పాడవుతుంది. అందుకని ఆట్టే ఎక్కువ డబ్బులు పెట్టకుండా తక్కువలో కొనుక్కోండి" అని చెప్పి "నేను చేసిందేమీ లేదు కాబట్టి నాకు డబ్బులు ఏమీ ఇవ్వొద్దు" అని డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు - మా సత్యకాలపు రిక్!
ఈ లోగా బదరి కిచెన్-ఎయిడ్ సపోర్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు "టచ్ ప్యాడ్ ఐదొందలవుతుంది. ఒక వేళ మీరంత పెట్టి కొందామనుకున్నా ఫిబ్రవరి దాకా అది మీకు పంపించడానికి కుదరదు" అంటూ "దాని బదులు కొత్త డిష్ వాషర్ కొనుక్కోండి" అని వాళ్ళ వంతు మార్కెటింగ్ కోటా పూర్తి చేసుకున్నారు.
ఇక ఇంట్లో కోలాహలం - కొత్త డిష్ వాషర్ కొనబోతున్న ఉత్సాహం.
"మనం ఒక మంచి డిష్ వాషర్ కొందాం. అదెలా ఉండాలంటే నువ్వు ఆఫీసులో ఉండగా నీ సెల్ ఫోనుకి తోమిన గిన్నెల ఫోటోలు మెసేజ్ పంపించాలి. గిన్నెలు తోమడం అయిపోగానే అవి ఎవరు unload చెయ్యాలో అదే task assign చెయ్యాలి." అంటూ బోల్డన్ని ఊహలు బదరివి - నన్ను ఊరిస్తున్నట్టుగా.
మళ్ళీ అంతలోనే "అంట్లు తోమడానికి అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. ఆ రిక్కు చెప్పినట్టు మామూలుదేదో కొనుక్కుందాము" అన్జెప్పి చుట్టుపక్కల ఉన్న Appliance stores అన్నిటికీ వెళ్ళి వచ్చాము. ఏమీ నచ్చలేదు. ఆన్లైన్లో వెతుక్కుందాము అని ఇంటికొచ్చేశాము.
ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుకుంటున్నా - అన్ని దారులూ రోమ్ వైపు వెళ్ళేట్టుగా - మా మాటలన్నీ డిష్ వాషర్ గురించే.
ఇంతలో బదరి డిష్ వాషర్ దగ్గరికి వెళ్ళి - "చిన్నప్పుడు రేడియోలు పని చెయ్యకపోతే అటూ-ఇటూ రెండు దెబ్బలేస్తే పని చేసేది కదా! దీనికీ ఓ రెండు దెబ్బలేస్తా. ఎలాగూ పని చెయ్యట్లేదు. ఇప్పుడు కొడితే కొత్తగా పోయేదేమీ లేదు" అంటూ గట్టిగా రెండు దెబ్బలేసి ఈలోగా రిక్ నుంచి ఫోన్ వచ్చిందని అవతలికెళ్ళారు.
ఇంతకీ ఆ రిక్ ఎందుకు చేశాడంటే - అతనేదో కొనుక్కుందామని హోమ్ డిపోకి వెళ్తే అక్కడ డిష్ వాషర్లు చూసి మేము గుర్తొచ్చామట. అందుకని ఫోన్ చేశాడట.
బదరి రిక్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. నేనీ లోగా డిష్ వాషర్ దగ్గరికి వెళ్ళగానే నా చెయ్యి తగిలి "డ్ర్ర్ర్ ..." అని శ్రావ్యంగా పలికింది మా తోమరి.
వెంటనే "బావా!" అంటూ నా ఆనందాతిశయ కేక!
ఏమయిందో అని హడావిడిగా పరిగెత్తుకొచ్చిన బదరికి - తాను కొట్టిన దెబ్బలకి చుక్కలు కనిపించాయో ఏమో అన్నట్టు - చుక్కల్లాంటి లైట్లు వెలుగుతూ పనిచేస్తూ కనిపించింది మా కిచెన్-ఎయిడ్.
ఇహ ఇప్పుడు "దెబ్బకి డిష్ వాషర్ కూడా పనిచేస్తుంది" అన్నది మా ఇంటి కొత్త నానుడి.
ఏ పాటునైనా పాట కట్టేసి పాడేసుకోవడం మా అలవాటు... ఆ అలవాటులో ఒక పాటగా ...
ఇది వారంటీ ఎండ్ అనీ
ఇక గ్యారంటీ లేదనీ
తొందరపడి మా తోమరి -
ఎందుకో ఆగిందీ...
దెబ్బకి సాగిందీ...
అన్నట్టు కిచెన్-ఎయిడ్ వాళ్ళ ట్రబుల్ షూటింగ్ గైడ్‌లో ఈ "ఆగిపోయిన డిష్ వాషర్‌కి వెయ్యండి రెండు దెబ్బలు" టిప్ కూడా చేర్చుకోమని చెప్పాలి.