ఇహనేం! లేడికి లేచిందే పరుగు - లలితకి తోచిందే తలపు కదా!
వెంఠనే.... చిట్టెన్ రాజు గారికి వాట్సాప్‌లో "నమస్తే సర్ ! నేను లల్లీ నండి (బోల్డన్ని కబుర్లు రాసే లలిత). అక్టోబరులో జరగబోయే 13 సాహితీ సదస్సులో సుభద్ర వేదుల (అగ్రహారం కథల రచయిత్రి) , నేను కలిసి కొత్తగా ఒక యుగళ - విశ్లేషణ చేద్దామనుకుంటున్నాము. దీని గురించి మీతో మాట్లాడడానికి కుదిరితే బావుండునని అనుకుంటున్నాను. మీకు వీలున్నప్పుడు చెప్పగలరు." అని సందేశం పంపించాను కొంచెం సందేహం గానే.
ఎందుకంటే 2021 తర్వాత ఆయనతో అస్సలు మాట్లాడలేదు. నువ్వెవరూ అనడిగితే ఏం చెప్పాలా అనుకుంటున్నా.
కానీ ఇవతల్నుంచి నా మాటలిలా వెళ్ళాయో లేవో - వెంటనే - "భలే...నీ టైమింగ్ బావుంది, లల్లీ....ఇప్పుడే నీకూ, సుభద్రకీ ప్రత్యేక ఆహ్వానాలు తయారు చేస్తున్నాను....నీది జత పరిచాను.......యుగళ విశ్లేషణ ఆలోచన బావుంది. నువ్వు ఎప్పుడైనా పిలవ వచ్చును...పగలు 11 దాటాక.. " అని బదులిచ్చారు.
ఆహా! అన్నీ మంచి శకునములే! వేదిక ఎక్కే సూచనలే ...లలలా...లలలా... అని పాడేసుకున్నా...
సుబ్బుకీ, నాకూ ఆహ్వానాలొచ్చేశాయి.
అవి అందుకోగానే చిట్టెన్ రాజు గారికి ఫోన్ చేసి "సుబ్బు ఇండియా వెళ్ళింది కదండీ - అందుకని మా ఇద్దరికీ మా ప్రసంగవ్యాసం తయారు చేసి పంపించడానికి కొంచెం ఎక్కువ సమయం కావాలీ" అనగానే "సుబ్బూనా ? అంటే సుభద్రా? సుభద్ర కన్నా సుబ్బుయే బావుంది, ఇహ నుంచి నేనూ అలాగే పిలుస్తాను" అన్నారు.
సభావిశేషసంచిక ప్రచురణ పనులు చూస్తున్న తాటిపాముల మృత్యుంజయుడు గారికో మాట చెప్పమన్నారు.
నేనదే మొదటిసారి మృత్యుంజయుడు గారి పేరు వినడం. చాలా ప్రత్యేకంగా అనిపించింది.
ఆయనకీ ఈమెయిల్ ఇచ్చాను కొంచెం వెసులుబాటు కావాలని.
"ఫర్వాలేదు... సెప్టెంబర్లో మొదటి వారం-పది రోజుల్లోగా పంపించండి" అన్నారు.
సుబ్బు ఇండియా నుంచి రాగానే ఇద్దరం మేమనుకున్న కథల గురించి రాసిన వ్యాసాన్ని సెప్టెంబర్ 10 వ తేదీ అర్ధరాత్రికి ఈ-మెయిల్ చేశాను.
కానీ మాదసలే ప్రత్యేకవ్యాసం - ప్రత్యేకంగా సమయం అడిగి మరీ పంపించినది కదా...
అందుకే... దాన్నంతే ప్రత్యేకంగా సభావిశేషసంచికలో ప్రచురించకుండా మహా-ప్రత్యేకంగా ఓ పక్కనెక్కడో అట్టేపెట్టుకున్నట్టున్నారు.
సరే! నా ఇంతోటి కథ-కబుర్లు వెయ్యకపోతే సభావిశేషసంచికకి తగ్గే విశేషమేమీ లేదు కానీ - పాపం! నాతో పాటు సుభద్రదీ అసింటా వుండిపోయిందే అనుకున్నాను.
నాదో బ్లాగ్ ఎలాగూ వుంది కదా ! ఇదిగో - ఇక్కడే మా కవలకథల కబుర్లు కూడా పంచుకుంటా.
*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***
ఇవాళ్టికి మాత్రం సరాసరి అక్టోబర్ 21, 2023 తేదీన మధ్యాహ్నభోజనానంతరకార్యక్రమం చూసెయ్యండి. సదస్సు గురించిన ఇంకొన్ని మంచి కబుర్లు వీలైతే వచ్చేవారమో - వీలు కుదరకపోతే ఆ పై వారమో చెప్తాను.
ఇవాళ్టి ప్రసంగాంశం - తెలుగు కథాప్రపంచంలో వస్తుస్వారూప్యము కలిగిన కథాయుగళ పరిచయం.
మేము పరిచయం చేయబోతున్న కథల జంట ఒకదానితో ఒకటి పోలినవి. రెండు వేర్వేరు తరాలకి చెందిన ఇద్దరు గొప్పరచయితలు రాసినవి.
1. అందులో ఒకటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1920 పరిసరాల్లో వ్రాసిన "మార్గదర్శి" కథ ఐతే...
2. రెండోది 1990ల్లో శ్రీరమణ గారు రచించిన "ధనలక్ష్మి".
కథాకాలాన్ని గమనిస్తే, రెంటికీ డెబ్భై ఏళ్ల వార.. రచయితలిద్దరి మధ్యా కనీసం ఒక తరం అంతరం.. అయినా ఈ రెండుకథల మధ్యా గల సారూప్యత మమంల్ని ఆకర్షించింది. గట్టిగా చెప్పాలంటే శ్రీపాద వారి కథలో చెప్పిన పాఠాలు, సూత్రాలుశ్రీరమణ గారి కథలో పాత్ర ఆకళింపు చేసుకుని వ్యాపారాన్ని, జీవితాన్ని తీర్చిదిద్దుకుందా? అనిపించేంతగా..
అందుకే ఈ రెండు కథలనీ కలిపి ఒకటిగా చూస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనకి మేమిచ్చుకున్న రూపమే ఇది.. మొదటగా..
మార్గదర్శి కథని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తెలుగు పాఠకులకి చేసిన వాణిజ్యగీతాబోధన అనవచ్చు. ఆద్యంతం మధ్యమపురుషలో సాగే ఓ ఉత్తమోత్తమ కథాకథనం.
చదువుకున్న ప్రతి చదువుకీ పెట్టిన ఖర్చునంతటినీ జీతం రూపంలో నూరూ వెయ్యి రెట్లుగా రాబట్టుకోవాలన్న దృక్పథంతో - సొంతంగా వ్యవసాయమో, వ్యాపారమో చేసుకోకుండా - ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, ఆత్మవిశ్వాస లేమితో, ఆత్మజ్ఞానమన్నదిఒకటుండాలి అన్న ఎఱుక లేకుండా నౌకరీలకి ఎగబడుతున్న స్కూలు ఫైనళ్ళు, బి ఏ లు చదివిన బ్రాహ్మణ యువకులకి సిఫార్సులు చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన అరవయ్యేళ్ళ చేబోలు శంభుశాస్త్రి గారి కథనమీ కథ.
ఈ కథలో వర్ణాశ్రమ ధర్మపరమైన ఆత్మగౌరవం ఉండాలీ అని చెబుతూనే విదేశీయుల అభివృద్ధిని గురించిన మెచ్చుకోలుఉంటుంది. ఇంగ్లీషు చదువుకున్న విద్యావంతులెవరికీ కూడా విజాతీయ క్రమవికాసం గురించి అవగాహన లేదని ఓ చిన్నపాటికినుక వుంటుంది. అదీ కాకుండా అసలు కథలెందుకు చదవాలీ అని ఒక ఒక తులనాత్మక వివరణ కూడా వుంటుంది. ఇవే కాకశ్రీపాదవారి బాల్యం గడిచిన మునికూడలి, మహేంద్రవాడల ప్రస్తావన, చెరుకుపానకపు మొదటిపొంగు వాసనల కబుర్లు ఇలాఅక్కడక్కడా ఆయన ఆత్మకథ "అనుభవాలూ-జ్ఞాపకాలూను" నుంచి కొన్ని చిరుమెఱుపులూ వుంటాయి. కానీ ఇవాళ్టి అంశంమాత్రం ఈ కథలో శ్రీపాదవారు ఉటంకించిన వర్తకపు కిటుకుల గురించి మాత్రమే.
శ్రీరమణ గారి "ధనలక్ష్మి" కథ - ధనలక్ష్మి భర్తయిన సీతారామాంజనేయులి స్నేహితుడి మాటల్లో ఉత్తమపురుషలో సాగుతుందిఒక్క మాటని కూడా వదలకుండా చదవాలనిపించే సరళమైన, అధ్బుత కథనం
రామాంజనేయులు తండ్రి ఈశ్వరయ్య గారి హయాంలో గుమాస్తాల మోసం వల్ల పోయిన ఆస్థినీ, వ్యాపారాన్ని ధనలక్ష్మితెలివితేటల వల్ల మళ్ళీ నిలబెట్టుకోవడమే కాక, దానికి నాలుగింతలు ఎలా పెరిగారు అనేది స్థూలంగా కథ. భార్యాభర్తలిద్దరూచదువుకోలేదు, అయినా బి.ఏ చదివిన మన కథకుడినీ(కథ ఈయన పరంగా చెప్పారు కనక సౌలభ్యం కోసం ఇలా అంటాను), చిన్నప్పుడు చదువు చెప్పిన మేస్టారినీ కూడా వారిదగ్గర పనిలో పెట్టుకుంటారు. అదీ ధనలక్ష్మి చాకచక్యం.
ముందుగా మార్గదర్శి కథకి పూర్వరంగం ఏంటో చూద్దాం.
కథాప్రదేశం రాజమండ్రి. కథాకాలం 1920 ల్లో. కథానాయకుడు అరవయ్యేళ్ళ చేబోలు శంభుశాస్త్రి గారు. బట్టల వర్తకుడు.
ఆయన దగ్గరికి ఒక రోజు ఓ యువకుడు వస్తాడు. అతనెలాటి వాడంటే పెళ్ళాయ్యీ ఇంకో రెండేళ్ళ దాకా భార్య కాపురానికి రానివాడు. తండ్రి పోగా చదువుకున్న స్కూలు ఫైనలుకి తగ్గట్టుగా సబ్ కోర్టులో నౌకరీకి సిఫార్సు కోసమని శంభుశాస్త్రి గారి దగ్గరికివస్తాడు.
అంతే!
ఆయన ఉత్తమవాగ్ధారకి మారు మాట లేకుండా మధ్యమపురుషామూర్తిమంతుడౌతాడు ఆ ఇరవయ్యేళ్ళ పంతులు.
అసలీ మార్గదర్శి కథ సద్బ్రాహ్మణుడైన శంభుశాస్త్రి గారు తన దగ్గరికి ఉద్యోగానికి సిఫార్సుకి వచ్చిన ఒక బ్రాహ్మణనవయువకునికి స్వంతంగా, స్వేఛ్చగా ఒకరికి లోబడకుండా జీవించాలంటే వర్తకం ఎంతటి మహత్తరమైన జీవనవిధానమోమప్పడానికి తన జీవితాన్నే దృష్టాంతంగా చూపబోవడమే.
కేవలం ఒక్క రూపాయి పెట్టుబడితో నాలుగు తువాళ్ళు, ఒక అంగాస్త్రం సరుకు కొని అంచెలంచెలుగా ఎనిమిది లక్షల ఆస్తిసంపాదించిన శంభుశాస్త్రికి మొట్టమొదటి వ్యాపార మార్గదర్శి - చిన్ననాటి జతగాడు కోమటి సుబ్బయ్య.
పదకొండేళ్ల వయసులో తీర్థంలో పకోడీలు కొనుక్కోమని తల్లి ఇచ్చిన ఒక్క అణా పెట్టుబడిగా తీర్థంలో కిళ్ళీలు అమ్మి - ఆఒక్కగానొక్క అణాని పాతిక అణాలు చేసి చూపిస్తాడు కోమటి సుబ్బయ్య. అతని దగ్గర శంభుశాస్త్రి నేర్చుకున్న మొట్టమొదటి పాఠం- వ్యాపారం చేయడానికి డబ్బు కన్నా పెద్ద పెట్టుబడి సంపాదించాలీ అనే బుద్ధి అని. అప్పుడే అతనికి పట్టుబడుతుంది "చిల్లరశివాలక్ష్మి" అనే మంత్రం.
శంభుశాస్త్రికి బలమూ, వెన్నుదన్నూ ఆయన తల్లి. "చేతిలో రూపాయి వుంటే యెంతో దిలాసా, ఎంతో ధైర్యం" అని నచ్చచెప్పేఆవిడ శంభుశాస్త్రికి చెప్పిన కథలెలాంటి వనుకున్నారూ? - దీపావళికి రూపాయి పెట్టి కొనుక్కున్న బాణాసంచాని అమ్మి ఐదురూపాయలు సంపాదించిన కోమటి పిల్ల కథ ఒకటైతే, పేలాల కోమటి కథ ఇంకోటి.
ఈ పేలాల కోమటి కథ మరీ తమాషా. పగిలి పోయిన కుండపెంకుల్లో ఒక పెంకుని మూడు మట్టి గడ్డలు పేర్చిన పొయ్యి మీదపెట్టి, ఎండు చితుకులతో నిప్పు రాజేసి - చేయబోయే పేలాల గురించి నోరూరించేలా చెప్పి "వడ్లకి సగం, బియ్యానికి సరికి సరి" అనిఎవరు తెచ్చుకున్న వడ్లు, బియ్యాలతో వాళ్లకే పేలాలు చేసిచ్చి కుంచెడు బియ్యం, నాలుక్కుంచాల వడ్లూ మిగుల్చుకుంటాడు.
ఇల్లాంటి కథలు చెప్పి శంభుశాస్త్రిని వర్తకం చేయడానికి ప్రోత్సాహిస్తుంది. అలాంటి తల్లి ఆశీస్సులే శంభుశాస్త్రి వర్తకవిజయానికిహేతువు.
ఉగ్గుపాలతో కాకపోయినా యుక్తవయసులో వ్యాపారధోరణిని పెంచి ప్రోత్సహించిన తల్లితో పాటు మొట్టమొదటి తువాళ్ళవ్యాపారానికి రూపాయి పెట్టుబడినిచ్చి, ఆ తర్వాత రోజుల్లో వ్యాపారం పెరిగాక నూటికి పదణాల వడ్డీతో నోటు లేకుండా ఇరవై ఐదువందలు అప్పిచ్చిన సోదెమ్మక్కయ్యగారు కూడా శంభుశాస్త్రికి మార్గదర్శి.
మార్గదర్శి కథలో నుంచి కొన్ని ఆణిముత్యాలైన మాటలు:
"ఎవరెన్నెన్ని ధర్మపన్నాలు చెప్పినా ఐహికాలికి డబ్బే ప్రధానం. జగత్తంతా మిధ్య అయితే మరి అలా బోధించేవాడి మాట?
పెట్టుబడి తక్కువా, బుద్ధి ఎక్కువా - వర్తకశాస్త్రంలో ఇదొక సూత్రం.
వర్తకులకు పెట్టుబడి కంటే ముందు మాట పొందిక చాలా అగత్యం.
వర్తకం చేసేవాడు విసుగు కనపడనివ్వకూడదు.
పనిచేసేవాడికి పరికరాలు కాదు ప్రధానం, దీక్షా ఏకాగ్రతానూ.
మనిషి వల్ల వర్తకం పాడవుతుంది గాని వర్తకం వల్ల మనిషి యెన్నడూ పాడయిపోడు.
ప్రకటన మీద యెక్కువ శ్రద్ధ పెట్టాలన్నది వర్తకశాస్త్రంలో ఒక గొప్ప సూత్రం. పాశ్చాత్యులు యింకో ఆరుమాసాలకు వస్తువుతయారవుతుందనగా యివాళే ప్రకటన ప్రారంభిస్తారు.
వర్తకుని చేతిలో వుండవలసింది సరుకు గాని డబ్బు కాదు.
పరపతికి నిదర్శనం అప్పు పుట్టడం కాదు, అణాపైసలతో అది తీర్చెయ్యగలగడం.
ధైర్యంగా ముందుకి వెళ్ళు. వెనకబడ్డవాళ్ళని వెంటబెట్టుకుని ముందుకి వెళ్ళు. సంపాదించు. కష్టపడి సంపాదించు. ఒకళ్ళనిచెరపకుండా సంపాదించు. అనుభవించు. ఆనందించు. అది ఐహికానికి పరమావధి."
పైన ఉదహరించినవి మచ్చుక్కొన్ని మెచ్చుతునకలు మాత్రమే! అసలీ కథ చదువుతున్నంతసేపూ నాకనిపించిందేంటంటే ఈకథని మా ముందు తరాల్లో తప్పనిసరి పాఠంగా చదివించి వుంటే భారతదేశంలో చదువుల పరిస్థితి, యువకుల మనఃస్థితి వేరేగా వుండేవని.
మన కథానాయిక ధనమ్మ కథలోకి వస్తే.. కారణాంతరాల వల్ల తమ పూర్వవైభవాన్ని కోల్పోయి వీధిన పడబోయిన ఒక జంట తిరిగి నిలదొక్కుకున్న వైనమే కథాంశం. బడి చదువు లేకపోయినా, జీవితాన్ని అద్భుతంగా చదివిన తెలివితో, లౌక్యంతో వ్యాపారాన్ని, ఇంటినీ తీర్చిదిద్దుకున్న ఆ ఇల్లాలి గడసరితనమే కథంతా..
గారాబంగా పెరిగిన దత్తుడు సీతారామాంజనేయులూ, అష్టవర్షాత్.. అనే మాటకి ఊపిరులూదుతూ ఎనిమిదేళ్ళకే అతని భార్య అయిన ధనలక్ష్మీ, ‘నేను ‘ అని ప్రథమ పురుషలో కథ మనకి చెప్పే పాత్రా, ఆయన బ్రాకెట్ బి.ఏ అర్ధాంగి శకుంతలా కథలో ముఖ్య పాత్రలు.
మితభాషిగా కనిపించే ఆంజనేయులి తెలివీ మితమైనదానిలాగే కని పిస్తుంది. సమయానికి సరిపోయేట్టు తెలివిగా మాట్లాడుతూ, ముందుచూపుతో, తెలివితేటలతో పన్లు చక్కబెట్టుకునే ధనలక్ష్మి , దానికి సరిగ్గా వ్యతిరేకంగా, చలాకీగా వ్యాపారపు మెళకువలన్నీ ఔపోసన పట్టినట్టుగా కనిపిస్తుంది..
కథానాయకి ప్రదర్శించిన లక్షణాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తే ఒక సరికొత్త బిజినెస్స్ మేనేజ్మెంట్ పుస్తకం రాయవచ్చు. ఇదేమాట మన కథకుడి భార్య శ్రీమతి శకుంతల కూడా అంటుంది. “ఓవర్ టైముకి ఓదార్పన్నమాట. తెలివంటే మీ చెల్లిదే. ఈ వ్యాపార మర్మాలన్నీ ఒక పుస్తకం రాయించడి. ఎం.ఏ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఓ పుస్తకంగా పెట్టొచ్చు” అని. నాదీ అదే మాట.
వ్యాపారానికీ బడిలో చదివిన చదువుకీ ఏ మాత్రం సంబంధం లేదు అని నిజజీవితంలో చూపించిన గొప్ప వ్యాపారవేత్తలకి నిలువెత్తు దర్పణం మన ధనలక్ష్మి.
గడ్డురోజులకి ఎదురొడ్డడమే ధైర్యం.. వ్యాపారానికి మూలం అదే.. ‘చీమలకింత చక్కెర దొరకగా లేనిది మనకి నాలుగు మెతుకులు దొరకవా?’ అంటూ తన మొదటి ప్రణాళిక అమలుచేస్తుంది.. అవకాశం అనుకున్నదేదీ వదిలిపెట్టని గడసరి..
అది పిండి మరలోనే సరుకు నిలవచేయడమైనా, 'చిల్లర శ్రీ మహాలక్ష్మి ' అంటూ వందకి పదిరూపాయల లాభంతో అమ్మిన చిల్లర పొట్లాలైనా.. వాణిశ్రీ బొమ్మతో అమ్మే ధనశ్రీ సున్నిపిండైనా.. ఆవిడ ఆచరణకి శభాష్ అనక తప్పదు.. తామిద్దరికీ చదువులేదు కనక, చదువుకున్నవాడు, తెలిసిన వాడు ఉంటే మంచిదనే కథకుడిని పార్ట్ టైం ఉద్యోగానికి ఒప్పించేయడమే కాక, ‘సరుకే లాయకి. మీ ఇంటికి నెలకి సరిపడా సరుకులన్నీ మన కొట్లోంచే, అయినా నువ్వెవరు? మేమెవరు?’ అని అతన్నీ, ఎప్పుడైనా కొట్లో ఆలస్యమైతే మల్లెపూలూ, జిలేబీలు ఇచ్చి అతని కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోమని ఇచ్చి పంపి అక్కడా మార్కులేయించుకుంటుంది..
అదనంగా అందే ఆ సాయమే కథకుడితో ' ధనమ్మ చెప్పినట్టు లక్ష మాటలైనా గుప్పెడు కొర్రలకి సరికావు కదా అనిపిస్తుంది
తలపెట్టినంత తేలిక కాదు ఏ పనినైనా నిర్వహించడం.. అది భద్రాచలం యాత్రా స్పెషల్ బస్సు యాత్రైనా, ఎక్కడ దొరకని వస్తువులక్కడకి తెలివిగా తెచ్చి అమ్మి సొమ్ము చేసుకోవడమైనా..
అమ్మకానికి పునాది నమ్మకమే. వినియోగదారులకి అది కల్గించడం లోనే వ్యాపా రానికి విజయం.. అదే నాయుడిగారి పచారీ ఖాతా ధనమ్మ కొట్లోకి మారడానికి కారణం.. ‘మంత్రసానితనం ఒప్పుకున్నాకా ఏదొచ్చినా పట్టాల’ అన్నధనమ్మ సూత్రం..
ఎరువుల ఏజెన్సీలంటే తలనొప్పి, డబ్బుంటే మన దగ్గరే ఉంటుంది కదా అంటూ ఏజెన్సీ తీసుకోవడానికి వెనకా ముందూ ఆడుతున్న భర్తకి.. ‘డబ్బు కూడా పచ్చి సరుకు లాంటిదే, ఇంట్లో ఉంటే గుండ్రాయి, బయటకెళితే కోడిపెట్ట’ అంటూ తర్కం విడమరిచి చెప్పి అతను విసుక్కున్నా సరే ఈశ్వర్ ఏజెన్సీస్ ని తెరిపిస్తుంది
ఇందిరాగాంధీ హత్య సమయం లో జరిగిన యూరియా బస్తాల ఉదంతంలో వచ్చిన లాభాలని చూసి ' తంతే గారెల బుట్టలో పడినట్టయిం ది’ అంటాడు కథకుడు.
' సమయం చూసి తన్నేవాళ్ళుందడ ద్దూ' అంటూ విషయాన్ని వివరించి ఆరుకాసుల నగని గుట్టు చప్పుడు కాకుండా ఆఫీసర్ గారికి ఇవ్వమన్నప్పుడు కథకుడి చేత ‘ఔరా’ అనిపిస్తుంది..
‘తాడిలోతు గుంట, ఏం చేసుకుంటాం?నిన్ను నిలబెట్టి సమాధి చెయ్యడానికి పనికొస్తుంది. అంటూ ఎద్దేవా చేసిన భర్తని సమాధాన పరిచి, అతనికి తెలియకుండా చిట్టీ డబ్బులు వేసి ఆ స్థలాన్ని కొని గోడౌవున్ కట్టించి,
‘ మీ రామాంజనేలు నివురుకప్పిన నిప్పు _ పైకి తేలడు గాని బుర్రంతా గుజ్జే … మా మగపురుషుడు మంకుపట్టుతో కూర్చోబట్టి ఆ ధరకి నిక్షేపంలాంటి స్థలం వచ్చింది. ఆ నిదానం … నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూచున్నాడు. దానివల్ల పాతిక వేలు లాభించింది …” ఊరోళ్ళంతా నీ గురించి చెప్పుకుంటున్నారు … దిష్టి తగుల్తుందో ఏం పాడో …’ అని రామాంజనేలుకి నిమ్మకాయ దిగతుడిచి..
తన సమర్ధత వల్ల భర్తలో పొడసూపుతున్న అసూయని అడ్డుకొవడానికే ఆ కిరీటాన్ని అతనికి పెట్టానని అన్నగా భావించే కథకుడికి చెప్తుంది..
చిన్నప్పుడు గుదిబండ అన్నాడనీ, తనవల్లే అతని చదువు ఆగిపోయిందని చిరాకు పడ్డాడనీ ఆమె ఆడ మనసు బాధపడినా, పదిపైసల బేరం కోసం కక్కుర్తి పడిందని తిట్టాడని కన్నీళ్ళు పెట్టుకున్నా అది తాత్కాలికమే.. ఆమె మనసెపుడూ కావలసిన పరిష్కారం మీదే...
‘అన్నీ ఉండి సంసారంలో సుకం లేకపోతే ఏంటి లాబం? లక్కా బంగారం అంటిపెట్టుకుని ఉంటేనే కదా తాళిబొట్టు నిండుగా ఉండేది. అంటుంది..
అలాగే వాళ్ళ నాన్న ఉప్పూ, చింతపండు అమ్ముకుంటే ఈశ్వర్ ఏబీసీడీ లు అమ్ముకోవాలి అన్నది ఆమె కల.. దానికే " దేవకమ్మ ఎనిమిదో కానుపు కంసుడికి ప్రాణగండం అయినట్టు మన వంశంలో ఎనిమిదో క్లాస్ గండం ఉంది రా నాన్నా! అంటూ వెటకారమాడి, తెలీకుండానే గారబాంతో కొడుకుని చెడగొడుతున్న భర్తని రెచ్చగొట్టి అతనంతట అతనే ' ఈశ్వరయ్యని ఎదైనా హాస్టల్ ఉన్న మంచి స్కూల్లో చేర్పించాలండి, ఇక్కడుంటే ఆడాళ్ళ గారాబంతో గాడిదైపోతాడు ' అనేలా చేస్తుంది..
ఇలా ఎన్ని సార్లు చదివినా ఎదో కొత్త వ్యాపార సూత్రమో, జీవితపు పాఠమో చెప్తూనే ఉంటుంది ధనమ్మ..
శ్రీపాద వారు చెప్పిన సూత్రాలు అలవర్చుకుని అత్యంత సమయస్పూర్థితో, చతురతతో జీవితాన్ని మలచుకున్న పాత్ర శ్రీ రమణ గారి ధనలక్ష్మి అనిపించడం ఎంతవరకూ కాకతాళీయం? అనిపించక మానదు..
గొప్పవారందరూ గొప్పగా ఆలోచిస్తారు, జీవితాన్నీ గొప్పగా మలచుకునే గొప్ప కథలే చెప్తారు అనిపించకా మానదు..
ఇదీ ఈ అద్వితీయకథాయుగళాన్ని గురించిన మా యుగళ-పునఃకథనం.
** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***