30, అక్టోబర్ 2023, సోమవారం

వంగూరి చిట్టెన్ మహారాజ్యపు వార్తలు - 1 - కవలకథలతో మొదలు

     అక్టోబర్ 20 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన 13వ వంగూరి ఫౌండేషన్ సాహితీ సదస్సుకి వెళ్ళి వచ్చాను. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ మధ్య కబుర్లు రాసి చా...లా రోజులయింది. 

    అందుకే జూన్ ఒకటో తేదీన మొదలుపెట్టి అక్టోబరు 22వ తేదీ వరకూ జరిగిన విశేషాలన్నీ మరీ పూస గుచ్చినట్టు కాకపోయినా పూల మధ్య దవనం పేర్చినట్టు అక్కడక్కడా కొన్ని గుర్తున్నవీ, చెప్పాలనుకుని గుర్తుంచుకున్నవీ, గుర్తుంచుకున్న వాటిల్లో చెప్పాలనుకున్నవీ - ఇప్పుడు చెప్తా.  

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ కబుర్లు నెలలవారీగా నేస్తా...కలబోస్తా...

    ముందుగా వంగూరి వారి సదస్సులో చెప్పిన కవల-కథల కబుర్లతో మొదలుపెడతాను. 

చదవబోయేవారికి 
చదవలేక పారిపోబోయేవారికి
చదివి బోరు-బోరు మనేవారికి 
అందరికీ ముందస్తు  దండాలు! 
చివరి వరకూ చదివేవారికి మళ్ళింకొన్ని దండాలు!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
జూన్ 1, 2023

    వంగూరి చిట్టెన్ రాజు గారి దగ్గర్నుంచి 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు గురించిన మొట్టమొదటి ప్రకటన ఈ-మెయిల్లో వచ్చింది. 

    నేను దాన్నంతగా పట్టించుకోలేదు. అదెక్కడో కాలిఫోర్నియాలో మిల్పిటాస్‌లో జరుగుతుంది - అంత దూరం వెళ్ళాలా అనుకున్నాను. 

    అసలదే కాకుండా ఈ 13వ సాహితీ సదస్సు జరిగే లోగా నాకు ఇంకో రెండు ప్రయాణాలు వున్నాయి. 

    ఒక ప్రయాణమేమో న్యూజెర్సీలో సెప్టెంబర్లో సంస్కృతభారతి వాళ్ళు నిర్వహిస్తున్న "జాహ్నవి" వేసవి శిబిరం. 

    రెండో ప్రయాణం మా కిరణ్‌ని అండర్-గ్రాడ్‌లో చేర్చడానికి వెళ్ళాల్సిన శాన్ డియేగో. 

    ఎక్కే విమానం, దిగే విమానం అనుకోవడానికి బాగానే వుంటుంది కానీ వెళ్ళి వచ్చామనుకోవడానికి తప్ప ఆ సదస్సులో నేను చేయబోయేదీ, చెందబోయేదీ ఏముంటుంది కదా అనిపించింది. 

    ఇది మనక్కాదులే అనుకుంటే మర్చిపోవడం సులువు నాకు.

    అలా అనుకునే 13వ సాహితీ సదస్సు ఈమెయిల్ గురించి మర్చిపోయాను. 

*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***

    కానీ ఆ సాహితీసదస్సు పుటల మీదో, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయపు ప్రాంగణం మీదుగా వీచే గాలి రెక్కల మీదో నా పేరెక్కడో రాసి పెట్టబడి వున్నట్టుంది. 

    అలాగే ఈ బ్లాగ్ ఇలా రాయాలని రాసిపెట్టి వున్నట్టుంది. 

    అసలు వెళ్లాలనే అనుకోని నేను - వెళ్ళడమే కాకుండా - వెళ్ళి వేదిక నెక్కి మాట్లాడి మరీ వచ్చాను - అది కూడా "కకవి"గా.  

    ఇక్కడ ... చదవడం ఆపి "కవీ, సుకవీ, కుకవీ- అన్న మాటలు కవుల గురుంచి విన్నాం. ఈ కకవి ఏంటబ్బా?" అనాలోచించేవాళ్ళు ఎవరన్నా వుంటే - ఇక్కడే ఆగిపోకుండా ఈ కబుర్లు కొసాకి చదివితే మీకే ఇట్టే అర్థమైపోతుంది. 


*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***

జులై 23, 2023

    ఓ ఆదివారపు మధ్యాహ్నప్పూట ఎప్పట్లాగే సుబ్బుతో మాట్లాడదామని ఫోన్ చేశాను.  

    సుబ్బు అంటే ఎవరో కాదు అగ్రహారం కథలు, మహానగరం కథలు రాసిన ప్రముఖ కథారచయిత్రి వేదుల సుభద్ర. 

    2019 లో వంగూరి వారి 11 వ సాహితీ సదస్సుకి ఆర్లాండో వెళ్ళినప్పుడు లలిత-సుభద్రలుగా ఒకరికొకరం పరిచయమయ్యి - ఒక వారం రోజుల్లోపునే లల్లి-సుబ్బులమై పోయాము. 

    అప్పట్నుంచి వారానికోసారి ఏ వారానికా వారం చదివిన పుస్తకాల గురించి, సినిమాల గురించి కబుర్లాడుకోవడం మాకలవాటు. 

    ఆ రోజు ఫోన్ ఎత్తగానే సుబ్బు అడిగిన మొదటి ప్రశ్న "లల్లీ! వంగూరి సదస్సుకి ఏమన్నా పంపిస్తున్నావా?" అని. 

    "లేదు సుబ్బూ! వెళ్ళేదా, పెట్టేదా అప్పుడే పక్కకు పెట్టేశాను. కాకపోతే కిందటి మాటు 2019 లో వెళ్ళినప్పుడు చిట్టెన్ రాజు గారిని కలవలేకపోయాను. ఇప్పుడు వెళ్ళాలన్నా ఆయన్ని చూడడానికి వెళ్ళాలంతే! అసలు అక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా నాకేమీ తట్టట్లేదు" అన్నాను. 

    తను వెంటనే "పోనీ మనిద్దరం కలిసి ఏమన్నా చేస్తే బావుంటుందేమో, ఆలోచించు" అంది. 

    నాకు ఆ ఆలోచన కొంచెం బాగానే వున్నట్టనిపించింది. 

    అందులోనూ నేనెప్పట్నుంచో నాకు ఎంతో ఇష్టమైన రెండు గొప్ప కథల గురించి ఏమైనా రాద్దామనుకుంటూనే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నాను. 

    అసలు 2019 లో వంగూరి సదస్సుకి వెళ్ళే ముందు అక్కడ శ్రీపాద వారి "మార్గదర్శి" గురించి మాట్లాడదామనుకున్నాను కానీ, అప్పుడు ఇండియా వెళ్ళి వచ్చిన హడావిడిలో నాకు ఆ వ్యాసం రాయడానికి సమయం సరిపోక అప్పటికప్పుడు పుట్టించిన నా "బోల్డన్నికబుర్ల" గురించిన కబుర్లేవో చెప్పేశాను. 

    సుబ్బుతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక నాకు చటుక్కున గుర్తుకొచ్చింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి "మార్గదర్శి" కథ, శ్రీరమణ గారి "ధనలక్ష్మి " కథ దాదాపుగా ఒకే విషయాన్ని చెప్పే రెండు కవల-కథల్లా వుంటాయని. 

    నాకసలే పాటల్లో కవల-పాటలూ, కథల్లో కవల-కథలూ వెతుక్కోవడం మహ సరదా. 

    ఇక ఆగలేక వెంటనే సుబ్బుకి వాట్సాప్ చేశాను. 

    "సుబ్బూ --- ఒక రెండు గొప్ప కథలు - మంచి పోలిక వున్న కథలు - నేనెప్పట్నుంచో విశ్లేషిద్దామని అనుకుంటున్న కథలు - శ్రీపాద వారి మార్గదర్శి , శ్రీరమణ గారి ధనలక్ష్మి . మనిద్దరం వీటి మీద ఒక combined analysis చేస్తే బావుంటుందని. ఏమంటావ్?"

    "తప్పకుండా చేద్దా" మంటూ సుబ్బు సమాధానం, 

    "నువ్వు ధనలక్ష్మి చేస్తావా ? మిథునం కధాసంపుటి వుందా నీ దగ్గర ?" ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్నా నేను. 

    "చేస్తాను... ఉంది." తను  ఇండియా ప్రయాణం హడావిడిలో వుండి కూడా  నా ప్రశ్న మీద ప్రశ్నకి ఓపిగ్గా జవాబులు చెప్తూనే వుంది. 

    ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసినప్పుడు మాటల్లో సుబ్బు "ధనలక్ష్మి నాకు చాలా ఇష్టమైన కథ. ఎప్పుడో ఆ కథ గురించి నేనొక బ్లాగ్ కూడా రాసుకున్నాను" అంది.

    జులై 25 న  సుబ్బు ఇండియాకి వెళ్తోంది. మళ్ళీ ఆగస్టు 30 కి కానీ న్యూ జెర్సీకి తిరిగి రాదు. మా ఇద్దరికీ కొంచెం తీరిగ్గా మాట్లాడుకుని - అసలెలా చేద్దామా అని ఆలోచించుకునే సమయమే లేకపోయింది. 

    కాకపోతే నాకొక ధైర్యం - తను ఎలాగూ ధనలక్ష్మి గురించి రాసి పెట్టి వుంది. తను ఇండియా వెళ్ళి వచ్చేలోగా నేను మార్గదర్శి గురించి రాసి వుంచితే - తను తిరిగి రాగానే రెండిటినీ కలిపి పంపించొచ్చు అనేదే నా ధైర్యం. 

    ఇహనేం! లేడికి లేచిందే పరుగు - లలితకి తోచిందే తలపు కదా! 

    వెంఠనే.... చిట్టెన్ రాజు గారికి వాట్సాప్‌లో "నమస్తే సర్ ! నేను లల్లీ నండి (బోల్డన్ని కబుర్లు రాసే లలిత). అక్టోబరులో జరగబోయే 13 సాహితీ సదస్సులో సుభద్ర వేదుల (అగ్రహారం కథల రచయిత్రి) , నేను కలిసి కొత్తగా ఒక యుగళ - విశ్లేషణ చేద్దామనుకుంటున్నాము. దీని గురించి మీతో మాట్లాడడానికి కుదిరితే బావుండునని అనుకుంటున్నాను. మీకు వీలున్నప్పుడు చెప్పగలరు." అని సందేశం పంపించాను కొంచెం సందేహం గానే. 

    ఎందుకంటే 2021 తర్వాత ఆయనతో అస్సలు మాట్లాడలేదు. నువ్వెవరూ అనడిగితే ఏం చెప్పాలా అనుకుంటున్నా.  

    కానీ ఇవతల్నుంచి నా మాటలిలా వెళ్ళాయో లేవో - వెంటనే - "భలే...నీ టైమింగ్ బావుంది, లల్లీ....ఇప్పుడే నీకూ, సుభద్రకీ ప్రత్యేక ఆహ్వానాలు తయారు చేస్తున్నాను....నీది జత పరిచాను.......యుగళ విశ్లేషణ ఆలోచన బావుంది. నువ్వు ఎప్పుడైనా  పిలవ వచ్చును...పగలు 11 దాటాక.. " అని బదులిచ్చారు. 

    ఆహా! అన్నీ మంచి శకునములే! వేదిక ఎక్కే సూచనలే ...లలలా...లలలా... అని పాడేసుకున్నా...

    సుబ్బుకీ, నాకూ ఆహ్వానాలొచ్చేశాయి. 

    అవి అందుకోగానే చిట్టెన్ రాజు గారికి ఫోన్ చేసి "సుబ్బు ఇండియా వెళ్ళింది కదండీ - అందుకని మా ఇద్దరికీ మా ప్రసంగవ్యాసం తయారు చేసి పంపించడానికి కొంచెం ఎక్కువ సమయం కావాలీ" అనగానే "సుబ్బూనా ? అంటే సుభద్రా? సుభద్ర కన్నా సుబ్బుయే బావుంది, ఇహ నుంచి నేనూ అలాగే పిలుస్తాను" అన్నారు. 

     సభావిశేషసంచిక ప్రచురణ పనులు చూస్తున్న తాటిపాముల మృత్యుంజయుడు గారికో మాట చెప్పమన్నారు. 

    నేనదే మొదటిసారి మృత్యుంజయుడు గారి పేరు వినడం. చాలా ప్రత్యేకంగా అనిపించింది. 

    ఆయనకీ ఈమెయిల్ ఇచ్చాను కొంచెం వెసులుబాటు కావాలని. 

    "ఫర్వాలేదు... సెప్టెంబర్లో మొదటి వారం-పది రోజుల్లోగా పంపించండి" అన్నారు. 

    సుబ్బు ఇండియా నుంచి రాగానే ఇద్దరం మేమనుకున్న కథల గురించి రాసిన వ్యాసాన్ని  సెప్టెంబర్ 10 వ తేదీ అర్ధరాత్రికి ఈ-మెయిల్ చేశాను. 

    కానీ మాదసలే ప్రత్యేకవ్యాసం - ప్రత్యేకంగా సమయం అడిగి మరీ పంపించినది కదా... 

    అందుకే... దాన్నంతే ప్రత్యేకంగా సభావిశేషసంచికలో ప్రచురించకుండా మహా-ప్రత్యేకంగా ఓ పక్కనెక్కడో అట్టేపెట్టుకున్నట్టున్నారు. 

    సరే! నా ఇంతోటి కథ-కబుర్లు వెయ్యకపోతే సభావిశేషసంచికకి తగ్గే విశేషమేమీ లేదు కానీ - పాపం! నాతో పాటు సుభద్రదీ అసింటా వుండిపోయిందే అనుకున్నాను. 

    నాదో బ్లాగ్ ఎలాగూ వుంది కదా ! ఇదిగో - ఇక్కడే మా కవలకథల కబుర్లు కూడా పంచుకుంటా. 


*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***

    ఇవాళ్టికి మాత్రం సరాసరి అక్టోబర్ 21,  2023 తేదీన మధ్యాహ్నభోజనానంతరకార్యక్రమం చూసెయ్యండి. సదస్సు గురించిన ఇంకొన్ని మంచి కబుర్లు వీలైతే వచ్చేవారమో - వీలు కుదరకపోతే ఆ పై వారమో చెప్తాను. 






    
    చూశారా? నేన ఆ "ఉన్నత"వేదిక మాటున - ఉన్నానో లేనో అన్నట్టు  - కనీ కనపడకుండా వినబడి కకవి నైన వైనం కన్నారా? 

    పైనున్న వీడియోలో మేము చెప్పిన కవలకథల కబుర్లు ఈ కింద కూడా చదవొచ్చు. 

    కాకపోతే నా వాటాకొచ్చిన పదినిముషాల్లో నేను నాకు నచ్చిన  శ్రీపాదవారి వాక్యాలేవీ చదవలేకపోయాను కానీ వాటిని ఈ కింద ఇచ్చిన వ్యాసంలో చదువుకోవచ్చు. 

  

*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***



ఇవాళ్టి ప్రసంగాంశం -  తెలుగు కథాప్రపంచంలో వస్తుస్వారూప్యము కలిగిన కథాయుగళ పరిచయం

 

    మేము పరిచయం చేయబోతున్న కథల జంట ఒకదానితో ఒకటి పోలినవిరెండు వేర్వేరు తరాలకి చెందిన ఇద్దరు గొప్పరచయితలు రాసినవి

1.     అందులో ఒకటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1920 పరిసరాల్లో వ్రాసిన "మార్గదర్శికథ ఐతే...

 

2.     రెండోది 1990ల్లో శ్రీరమణ గారు రచించిన "ధనలక్ష్మి". 

 

కథాకాలాన్ని గమనిస్తే, రెంటికీ డెబ్భై ఏళ్ల వార.రచయితలిద్దరి మధ్యా కనీసం ఒక తరం అంతరం.. అయినా  రెండుకథల మధ్యా గల సారూప్యత మమంల్ని ఆకర్షించిందిగట్టిగా చెప్పాలంటే శ్రీపాద వారి కథలో చెప్పిన పాఠాలుసూత్రాలుశ్రీరమణ గారి కథలో పాత్ర ఆకళింపు చేసుకుని వ్యాపారాన్నిజీవితాన్ని తీర్చిదిద్దుకుందాఅనిపించేంతగా..

 

అందుకే  రెండు కథలనీ కలిపి ఒకటిగా చూస్తే ఎలా ఉంటుందిఅన్న ఆలోచనకి మేమిచ్చుకున్న రూపమే ఇది.. మొదటగా..


    మార్గదర్శి కథని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తెలుగు పాఠకులకి చేసిన వాణిజ్యగీతాబోధన అనవచ్చుఆద్యంతం మధ్యమపురుషలో సాగే  ఉత్తమోత్తమ కథాకథనం

    చదువుకున్న ప్రతి చదువుకీ పెట్టిన ఖర్చునంతటినీ జీతం రూపంలో నూరూ వెయ్యి రెట్లుగా రాబట్టుకోవాలన్న దృక్పథంతో - సొంతంగా వ్యవసాయమోవ్యాపారమో చేసుకోకుండా - ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టిఆత్మవిశ్వాస లేమితోఆత్మజ్ఞానమన్నదిఒకటుండాలి అన్న ఎఱుక లేకుండా నౌకరీలకి ఎగబడుతున్న స్కూలు ఫైనళ్ళుబి  లు చదివిన బ్రాహ్మణ యువకులకి సిఫార్సులు చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన అరవయ్యేళ్ళ చేబోలు శంభుశాస్త్రి గారి కథనమీ కథ

     కథలో వర్ణాశ్రమ ధర్మపరమైన  ఆత్మగౌరవం ఉండాలీ అని చెబుతూనే విదేశీయుల అభివృద్ధిని గురించిన మెచ్చుకోలుఉంటుందిఇంగ్లీషు చదువుకున్న విద్యావంతులెవరికీ కూడా విజాతీయ క్రమవికాసం గురించి అవగాహన లేదని  చిన్నపాటికినుక వుంటుందిఅదీ కాకుండా అసలు కథలెందుకు చదవాలీ అని ఒక ఒక తులనాత్మక వివరణ కూడా వుంటుందిఇవే కాకశ్రీపాదవారి బాల్యం గడిచిన మునికూడలిమహేంద్రవాడల ప్రస్తావనచెరుకుపానకపు మొదటిపొంగు వాసనల కబుర్లు ఇలాఅక్కడక్కడా ఆయన ఆత్మకథ "అనుభవాలూ-జ్ఞాపకాలూనునుంచి కొన్ని చిరుమెఱుపులూ వుంటాయికానీ ఇవాళ్టి అంశంమాత్రం  కథలో శ్రీపాదవారు ఉటంకించిన వర్తకపు కిటుకుల గురించి మాత్రమే.

    శ్రీరమణ గారి "ధనలక్ష్మికథ - ధనలక్ష్మి భర్తయిన సీతారామాంజనేయులి స్నేహితుడి మాటల్లో ఉత్తమపురుషలో సాగుతుందిఒక్క మాటని కూడా వదలకుండా చదవాలనిపించే సరళమైన, అధ్బుత కథనం

రామాంజనేయులు తండ్రి ఈశ్వరయ్య గారి హయాంలో గుమాస్తాల మోసం వల్ల పోయిన ఆస్థినీవ్యాపారాన్ని ధనలక్ష్మితెలివితేటల వల్ల మళ్ళీ నిలబెట్టుకోవడమే కాకదానికి నాలుగింతలు ఎలా పెరిగారు అనేది స్థూలంగా కథభార్యాభర్తలిద్దరూచదువుకోలేదుఅయినా బి. చదివిన మన కథకుడినీ(కథ ఈయన పరంగా చెప్పారు కనక సౌలభ్యం కోసం ఇలా అంటాను), చిన్నప్పుడు చదువు చెప్పిన మేస్టారినీ కూడా వారిదగ్గర పనిలో పెట్టుకుంటారుఅదీ ధనలక్ష్మి చాకచక్యం.

    ముందుగా మార్గదర్శి  కథకి పూర్వరంగం ఏంటో చూద్దాం

    కథాప్రదేశం రాజమండ్రికథాకాలం 1920 ల్లోకథానాయకుడు అరవయ్యేళ్ళ చేబోలు శంభుశాస్త్రి గారుబట్టల వర్తకుడు

    ఆయన దగ్గరికి ఒక రోజు  యువకుడు వస్తాడుఅతనెలాటి వాడంటే పెళ్ళాయ్యీ ఇంకో రెండేళ్ళ దాకా భార్య కాపురానికి రానివాడుతండ్రి పోగా చదువుకున్న స్కూలు ఫైనలుకి తగ్గట్టుగా సబ్ కోర్టులో నౌకరీకి సిఫార్సు కోసమని శంభుశాస్త్రి గారి దగ్గరికివస్తాడు

    అంతే

    ఆయన ఉత్తమవాగ్ధారకి మారు మాట లేకుండా మధ్యమపురుషామూర్తిమంతుడౌతాడు  ఇరవయ్యేళ్ళ పంతులు

    అసలీ మార్గదర్శి కథ సద్బ్రాహ్మణుడైన  శంభుశాస్త్రి గారు తన దగ్గరికి ఉద్యోగానికి సిఫార్సుకి వచ్చిన ఒక బ్రాహ్మణనవయువకునికి స్వంతంగాస్వేఛ్చగా ఒకరికి లోబడకుండా జీవించాలంటే వర్తకం ఎంతటి మహత్తరమైన జీవనవిధానమోమప్పడానికి తన జీవితాన్నే దృష్టాంతంగా చూపబోవడమే

    కేవలం ఒక్క రూపాయి పెట్టుబడితో నాలుగు తువాళ్ళుఒక అంగాస్త్రం సరుకు కొని అంచెలంచెలుగా ఎనిమిది లక్షల ఆస్తిసంపాదించిన శంభుశాస్త్రికి మొట్టమొదటి వ్యాపార మార్గదర్శి - చిన్ననాటి జతగాడు కోమటి సుబ్బయ్య

    పదకొండేళ్ల వయసులో తీర్థంలో పకోడీలు కొనుక్కోమని తల్లి ఇచ్చిన ఒక్క అణా పెట్టుబడిగా తీర్థంలో కిళ్ళీలు అమ్మి - ఒక్కగానొక్క అణాని పాతిక అణాలు చేసి చూపిస్తాడు కోమటి సుబ్బయ్యఅతని దగ్గర శంభుశాస్త్రి నేర్చుకున్న మొట్టమొదటి పాఠంవ్యాపారం చేయడానికి డబ్బు కన్నా పెద్ద పెట్టుబడి సంపాదించాలీ అనే  బుద్ధి అనిఅప్పుడే అతనికి పట్టుబడుతుంది "చిల్లరశివాలక్ష్మిఅనే మంత్రం

    శంభుశాస్త్రికి బలమూవెన్నుదన్నూ ఆయన తల్లి. "చేతిలో రూపాయి వుంటే యెంతో దిలాసాఎంతో ధైర్యంఅని నచ్చచెప్పేఆవిడ శంభుశాస్త్రికి చెప్పిన కథలెలాంటి వనుకున్నారూ? - దీపావళికి రూపాయి పెట్టి కొనుక్కున్న బాణాసంచాని అమ్మి ఐదురూపాయలు సంపాదించిన కోమటి పిల్ల కథ ఒకటైతేపేలాల కోమటి కథ ఇంకోటి

     పేలాల కోమటి కథ మరీ తమాషాపగిలి పోయిన కుండపెంకుల్లో ఒక పెంకుని మూడు మట్టి గడ్డలు పేర్చిన పొయ్యి మీదపెట్టిఎండు చితుకులతో నిప్పు రాజేసి - చేయబోయే పేలాల గురించి నోరూరించేలా చెప్పి "వడ్లకి సగంబియ్యానికి సరికి సరిఅనిఎవరు తెచ్చుకున్న వడ్లుబియ్యాలతో వాళ్లకే పేలాలు చేసిచ్చి కుంచెడు బియ్యంనాలుక్కుంచాల వడ్లూ మిగుల్చుకుంటాడు

    ఇల్లాంటి కథలు చెప్పి శంభుశాస్త్రిని వర్తకం చేయడానికి ప్రోత్సాహిస్తుందిఅలాంటి తల్లి ఆశీస్సులే శంభుశాస్త్రి వర్తకవిజయానికిహేతువు

ఉగ్గుపాలతో కాకపోయినా యుక్తవయసులో వ్యాపారధోరణిని పెంచి ప్రోత్సహించిన తల్లితో పాటు మొట్టమొదటి తువాళ్ళవ్యాపారానికి రూపాయి పెట్టుబడినిచ్చి తర్వాత రోజుల్లో వ్యాపారం పెరిగాక నూటికి పదణాల వడ్డీతో నోటు లేకుండా ఇరవై ఐదువందలు అప్పిచ్చిన సోదెమ్మక్కయ్యగారు కూడా శంభుశాస్త్రికి మార్గదర్శి.

    మార్గదర్శి కథలో నుంచి కొన్ని ఆణిముత్యాలైన మాటలు

    "ఎవరెన్నెన్ని ధర్మపన్నాలు చెప్పినా ఐహికాలికి డబ్బే ప్రధానంజగత్తంతా మిధ్య అయితే మరి అలా బోధించేవాడి మాట?

    పెట్టుబడి తక్కువాబుద్ధి ఎక్కువా - వర్తకశాస్త్రంలో ఇదొక సూత్రం

    వర్తకులకు పెట్టుబడి కంటే ముందు మాట పొందిక చాలా అగత్యం

    వర్తకం చేసేవాడు విసుగు కనపడనివ్వకూడదు

    పనిచేసేవాడికి పరికరాలు కాదు ప్రధానందీక్షా ఏకాగ్రతానూ

    మనిషి వల్ల వర్తకం పాడవుతుంది గాని వర్తకం వల్ల మనిషి యెన్నడూ పాడయిపోడు

    ప్రకటన మీద యెక్కువ శ్రద్ధ పెట్టాలన్నది ర్తకశాస్త్రంలో ఒక గొప్ప సూత్రంపాశ్చాత్యులు యింకో ఆరుమాసాలకు వస్తువుతయారవుతుందనగా యివాళే ప్రకటన ప్రారంభిస్తారు

    వర్తకుని చేతిలో వుండవలసింది సరుకు గాని డబ్బు కాదు

    పరపతికి నిదర్శనం అప్పు పుట్టడం కాదుఅణాపైసలతో అది తీర్చెయ్యగలగడం

    ధైర్యంగా ముందుకి వెళ్ళువెనకబడ్డవాళ్ళని వెంటబెట్టుకుని ముందుకి వెళ్ళుసంపాదించుకష్టపడి సంపాదించుఒకళ్ళనిచెరపకుండా సంపాదించుఅనుభవించుఆనందించుఅది ఐహికానికి పరమావధి."

    పైన ఉదహరించినవి మచ్చుక్కొన్ని మెచ్చుతునకలు మాత్రమేఅసలీ కథ చదువుతున్నంతసేపూ నాకనిపించిందేంటంటే కథని మా ముందు తరాల్లో తప్పనిసరి పాఠంగా చదివించి వుంటే భారతదేశంలో చదువుల పరిస్థితియువకుల మనఃస్థితి వేరేగా వుండేని

 మన కథానాయిక ధనమ్మ కథలోకి వస్తే.. కారణాంతరాల వల్ల తమ పూర్వవైభవాన్ని కోల్పోయి వీధిన పడబోయిన ఒక జంట తిరిగి నిలదొక్కుకున్న వైనమే కథాంశం. బడి చదువు లేకపోయినా, జీవితాన్ని అద్భుతంగా చదివిన తెలివితో, లౌక్యంతో  వ్యాపారాన్ని, ఇంటినీ తీర్చిదిద్దుకున్న ఆ ఇల్లాలి గడసరితనమే కథంతా.. 

 గారాబంగా పెరిగిన దత్తుడు సీతారామాంజనేయులూ, అష్టవర్షాత్.. అనే మాటకి ఊపిరులూదుతూ ఎనిమిదేళ్ళకే అతని భార్య అయిన ధనలక్ష్మీ, ‘నేను ‘ అని ప్రథమ పురుషలో కథ మనకి చెప్పే పాత్రా, ఆయన బ్రాకెట్ బి.ఏ అర్ధాంగి శకుంతలా కథలో ముఖ్య పాత్రలు.

మితభాషిగా కనిపించే ఆంజనేయులి తెలివీ మితమైనదానిలాగే కని పిస్తుంది.  సమయానికి సరిపోయేట్టు తెలివిగా మాట్లాడుతూ, ముందుచూపుతో, తెలివితేటలతో పన్లు చక్కబెట్టుకునే ధనలక్ష్మి , దానికి సరిగ్గా వ్యతిరేకంగా, చలాకీగా వ్యాపారపు మెళకువలన్నీ ఔపోసన పట్టినట్టుగా కనిపిస్తుంది..

కథానాయకి ప్రదర్శించిన లక్షణాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తే ఒక సరికొత్త బిజినెస్స్ మేనేజ్మెంట్ పుస్తకం రాయవచ్చు. ఇదేమాట మన కథకుడి భార్య శ్రీమతి శకుంతల కూడా అంటుంది. “ఓవర్ టైముకి ఓదార్పన్నమాట. తెలివంటే మీ చెల్లిదే. ఈ వ్యాపార మర్మాలన్నీ ఒక పుస్తకం రాయించడి. ఎం.ఏ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఓ పుస్తకంగా పెట్టొచ్చు” అని. నాదీ అదే మాట. 

వ్యాపారానికీ బడిలో చదివిన చదువుకీ ఏ మాత్రం సంబంధం లేదు అని నిజజీవితంలో చూపించిన గొప్ప వ్యాపారవేత్తలకి నిలువెత్తు దర్పణం మన ధనలక్ష్మి.

గడ్డురోజులకి ఎదురొడ్డడమే ధైర్యం.. వ్యాపారానికి మూలం అదే.. ‘చీమలకింత చక్కెర దొరకగా లేనిది మనకి నాలుగు మెతుకులు దొరకవా?’ అంటూ తన మొదటి ప్రణాళిక అమలుచేస్తుంది.. అవకాశం అనుకున్నదేదీ వదిలిపెట్టని గడసరి..

అది  పిండి మరలోనే సరుకు నిలవచేయడమైనా, 'చిల్లర శ్రీ మహాలక్ష్మి ' అంటూ వందకి పదిరూపాయల లాభంతో అమ్మిన చిల్లర పొట్లాలైనా.. వాణిశ్రీ బొమ్మతో అమ్మే ధనశ్రీ సున్నిపిండైనా.. ఆవిడ ఆచరణకి శభాష్ అనక తప్పదు.. తామిద్దరికీ చదువులేదు కనక, చదువుకున్నవాడు, తెలిసిన వాడు ఉంటే మంచిదనే కథకుడిని పార్ట్ టైం ఉద్యోగానికి ఒప్పించేయడమే కాక, ‘సరుకే లాయకి.  మీ ఇంటికి నెలకి సరిపడా సరుకులన్నీ మన కొట్లోంచే, అయినా నువ్వెవరు? మేమెవరు?’ అని అతన్నీ, ఎప్పుడైనా కొట్లో  ఆలస్యమైతే  మల్లెపూలూ, జిలేబీలు ఇచ్చి అతని కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోమని ఇచ్చి పంపి అక్కడా మార్కులేయించుకుంటుంది..

అదనంగా అందే ఆ సాయమే కథకుడితో ' ధనమ్మ చెప్పినట్టు లక్ష మాటలైనా గుప్పెడు కొర్రలకి సరికావు కదా అనిపిస్తుంది

తలపెట్టినంత తేలిక కాదు ఏ పనినైనా నిర్వహించడం.. అది భద్రాచలం యాత్రా స్పెషల్ బస్సు యాత్రైనా, ఎక్కడ దొరకని వస్తువులక్కడకి తెలివిగా తెచ్చి అమ్మి సొమ్ము చేసుకోవడమైనా..

అమ్మకానికి పునాది నమ్మకమే. వినియోగదారులకి అది కల్గించడం లోనే వ్యాపా రానికి విజయం.. అదే నాయుడిగారి పచారీ ఖాతా ధనమ్మ కొట్లోకి మారడానికి కారణం.. ‘మంత్రసానితనం ఒప్పుకున్నాకా ఏదొచ్చినా పట్టాల’ అన్నధనమ్మ సూత్రం..

ఎరువుల ఏజెన్సీలంటే తలనొప్పి, డబ్బుంటే మన దగ్గరే ఉంటుంది కదా అంటూ ఏజెన్సీ తీసుకోవడానికి వెనకా ముందూ ఆడుతున్న భర్తకి..  ‘డబ్బు కూడా పచ్చి సరుకు లాంటిదే, ఇంట్లో ఉంటే గుండ్రాయి, బయటకెళితే కోడిపెట్ట’ అంటూ తర్కం విడమరిచి చెప్పి అతను విసుక్కున్నా సరే ఈశ్వర్ ఏజెన్సీస్ ని తెరిపిస్తుంది

ఇందిరాగాంధీ హత్య సమయం లో జరిగిన యూరియా బస్తాల ఉదంతంలో వచ్చిన లాభాలని చూసి ' తంతే గారెల బుట్టలో పడినట్టయిం ది’ అంటాడు కథకుడు.

' సమయం చూసి తన్నేవాళ్ళుందడ ద్దూ' అంటూ విషయాన్ని వివరించి ఆరుకాసుల నగని గుట్టు చప్పుడు కాకుండా ఆఫీసర్ గారికి ఇవ్వమన్నప్పుడు కథకుడి చేత ‘ఔరా’ అనిపిస్తుంది..

‘తాడిలోతు గుంట, ఏం చేసుకుంటాం?నిన్ను నిలబెట్టి సమాధి చెయ్యడానికి పనికొస్తుంది. అంటూ ఎద్దేవా చేసిన భర్తని సమాధాన పరిచి, అతనికి తెలియకుండా చిట్టీ డబ్బులు వేసి ఆ స్థలాన్ని కొని గోడౌవున్ కట్టించి,

‘ మీ రామాంజనేలు నివురుకప్పిన నిప్పు _ పైకి తేలడు గాని బుర్రంతా గుజ్జే … మా మగపురుషుడు మంకుపట్టుతో కూర్చోబట్టి ఆ ధరకి నిక్షేపంలాంటి స్థలం వచ్చింది. ఆ నిదానం … నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూచున్నాడు. దానివల్ల పాతిక వేలు లాభించింది …” ఊరోళ్ళంతా నీ గురించి చెప్పుకుంటున్నారు … దిష్టి తగుల్తుందో ఏం పాడో …’ అని రామాంజనేలుకి నిమ్మకాయ దిగతుడిచి..

            తన సమర్ధత వల్ల భర్తలో పొడసూపుతున్న అసూయని అడ్డుకొవడానికే ఆ కిరీటాన్ని అతనికి పెట్టానని అన్నగా భావించే కథకుడికి చెప్తుంది..

చిన్నప్పుడు గుదిబండ అన్నాడనీ, తనవల్లే అతని చదువు ఆగిపోయిందని చిరాకు పడ్డాడనీ ఆమె ఆడ మనసు బాధపడినా,  పదిపైసల బేరం కోసం కక్కుర్తి పడిందని తిట్టాడని కన్నీళ్ళు పెట్టుకున్నా అది తాత్కాలికమే.. ఆమె మనసెపుడూ కావలసిన పరిష్కారం మీదే...

‘అన్నీ ఉండి సంసారంలో సుకం లేకపోతే ఏంటి లాబం? లక్కా బంగారం అంటిపెట్టుకుని ఉంటేనే కదా తాళిబొట్టు నిండుగా ఉండేది. అంటుంది..

అలాగే వాళ్ళ నాన్న ఉప్పూ, చింతపండు అమ్ముకుంటే ఈశ్వర్  ఏబీసీడీ  లు అమ్ముకోవాలి అన్నది ఆమె కల.. దానికే " దేవకమ్మ ఎనిమిదో కానుపు కంసుడికి ప్రాణగండం అయినట్టు మన వంశంలో ఎనిమిదో క్లాస్ గండం ఉంది రా నాన్నా! అంటూ వెటకారమాడి, తెలీకుండానే గారబాంతో కొడుకుని చెడగొడుతున్న భర్తని రెచ్చగొట్టి అతనంతట అతనే ' ఈశ్వరయ్యని ఎదైనా హాస్టల్ ఉన్న మంచి స్కూల్లో చేర్పించాలండి, ఇక్కడుంటే ఆడాళ్ళ గారాబంతో గాడిదైపోతాడు ' అనేలా చేస్తుంది..

ఇలా ఎన్ని సార్లు చదివినా ఎదో కొత్త వ్యాపార సూత్రమో, జీవితపు పాఠమో చెప్తూనే ఉంటుంది ధనమ్మ..

            శ్రీపాద వారు చెప్పిన సూత్రాలు అలవర్చుకుని అత్యంత సమయస్పూర్థితో, చతురతతో జీవితాన్ని మలచుకున్న పాత్ర శ్రీ రమణ గారి ధనలక్ష్మి అనిపించడం ఎంతవరకూ కాకతాళీయం? అనిపించక మానదు.. 

గొప్పవారందరూ గొప్పగా ఆలోచిస్తారు, జీవితాన్నీ గొప్పగా మలచుకునే గొప్ప కథలే చెప్తారు అనిపించకా మానదు..

ఇదీ  అద్వితీయకథాయుగళాన్ని గురించిన మా యుగళ-పునఃకథనం. 

 

** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** *** 

 

 

6 కామెంట్‌లు:

  1. బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మార్గదర్శి-ధనలక్ష్ములు నిరూపించింది అదేనండి. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఈ రెండు కథలున్ను వ్రాసిన "శ్రీ" లు నిజంగా
    ఎంత "శ్రీ" మంతులయ్యేరు :) ( కథకు దక్కిన కాణీలెన్ని :))

    నారదా!

    బుర్ర లోన గుంజున్నచో బూడిదైన
    నమ్ము కొనుచు బ్రతుక వచ్చు నమ్మ లలిత!
    తాత బల్కె పసిడి మాట దాని కెదురు
    చెప్ప గల విదురు లెచట చిగురుబోడి:)

    కుశలమాండి ?

    ఈ "చిట్టెన్" రాజు గారు ఏమన్నా నిక్ నేమాండీ ?
    విచిత్రమైన పేరులా వుంది ?


    జిలేబి


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారు! మీ పద్యవ్యాఖ్యకి ధన్యవాదాలు.

      కథకి దక్కిన కాణీలెన్ని అనడిగారు కదా!? కాలానికి ఎదురీది కాలాలు దాటి మనగలిగిన కథలివి. అమూల్యాలే తప్ప కాణీలకి తూగుతాయా?

      తమంతట తాము చేయలేకపోయినా తమకి తెలిసినది కథల్లో చెప్తే చదువుకున్నవాళ్ళెవరైనా నేర్చుకుని బాగుపడతారని ఆ "శ్రీ"యుతులు ఆయా కథలు వ్రాసి వుంటారండి. "పెద్దవాళ్ళు చేసినట్టు కాక చెప్పినట్టు చెయ్య"మన్నది అందుకే అయ్యుంటుంది. వారు చెప్పిన ఆ కథల్ని ఇప్పటికీ నా బోటి వాళ్ళు తలుచుకుంటున్నారంటే అదీ "శ్రీ" కరమే కదండీ! అయినా ఇవన్నీ మీకు తెలిసే నా చేత చెప్పించాలనుకున్నారని నేననుకుంటున్నా!


      వంగూరి చిట్టెన్ రాజు గారిది అసలు పేరేనండి. వారి వల్లనే ఈ రోజుకీ అమెరికాలో ఏ సినిమా వాసనలూ సోకని తెలుగు సమావేశాలు జరుగుతున్నాయి. వారి గురించిన కబుర్లు రాబోయే బ్లాగ్ పోస్టుల్లో పంచుకుంటాను.

      తొలగించండి
  3. అపర్ణ శ్రీపాద31 అక్టోబర్, 2023 8:28 PMకి

    లలిత గారు, ఎంత మంచి ఆలోచన!!!! YT లో మీ ఇద్దరు చేసిన యుగళ విశ్లేషణ చూస్తున్నంత సేపు ఆనందాతిశయోద్వేగంతో కళ్ళు చెమర్చాయి 👏👏

    projector లో వేసి చూపించాను మావారికి. తెరమీద మీ విశ్లేషణ చూస్తూ మేమిద్దరం ఈ కథల గురించీ ఒక సాయంత్రం మాట్లాడుకున్న విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఎంతో ఆనందించాం. మీ స్నేహితురాళ్ళు నాకు అక్కచెల్లెళ్లో ఆడపడుచులో అనిపించారు.

    I completely agree!! ఇప్పటి పిల్లకాయలందరిచేత చదివించాలి లేదా అర్థమయ్యేలా చదివి వినిపించాలి. శ్రీపాద వారి కథలు నాన్న దగ్గర్నుంచి అపురూపంగా తెచ్చుకున్న ఆస్తి. రమణ గారి కథా సంపుటి సరదా కబుర్ల కోసమో గుండె బరువయినప్పుడో మళ్ళీ మళ్లీ చదివిస్తుంది. మా ఇంటికొచ్చి ఎవరైనా తీసుకెళ్ళి ఇస్తామంటే మనసు పీకుతుంది మళ్ళీ ఇస్తారో లేదో అని.

    ఎంత మంచి మాట చెప్పారు - పెద్దవాళ్ళు చేసింది కాదు, చెప్పింది చేయాలి అని. గొప్ప లోతైన మాట. చాలా గర్వంగా ఉందండి. దిష్టి తీయించుకుందురు 🥰🫶🙏👏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అపర్ణా! అపురూపంగా దాచుకోవాల్సిన మాటలివి. మీ ప్రేమకి బోల్డన్ని ధన్యవాదాలు!

      తొలగించండి