22, నవంబర్ 2025, శనివారం

ఆ...తెలిసింది...తెలిసింది! (గారెలొండడమెలా? అను అతిమతీ-అయోమయోపాఖ్యానం)

 

    ఈ మధ్య అస్సలేమీ రాయడానికి కుదురు లేదు, కుదరట్లేదు. 

    చడీ-చప్పుడూ లేకుండా స్తబ్ధంగా వున్న నా బ్లాగుని మళ్లొక్కసారి కదుపుదామని, మేల్కొలుపుదామని ఇంతకు ముందు చెప్పిన కథనే తిరిగి తిరగరాసి చెప్తున్నా. 

    అందులోనూ ఈ కథని చెప్పమని మా పప్పెమ్మ అడిగింది. దాని కోసమని కూడా మళ్లీ చెప్తున్నా.

    ఇది నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన సరదా కథల్లో ఒకటి . 

    మా నాన్నమ్మ చెప్పిన కథని ఆవిడ చెప్తున్నప్పుడు విన్నంత కుదురుగా కాకుండా - నేను చెప్తే ఎలా వుంటుందో అలాగే చెప్తున్నా - వినండి (అదే...చదివే ఓపికున్నవాళ్లు చదవండి).

    నా మాటల్లో చెప్తున్న కథ కాబట్టి కథలో పాత్రల పేర్లూ నా ఇష్టమే కాబట్టి నాకిప్పటికిప్పుడు తట్టిన పేర్లు పెట్టేస్తున్నా. 

    అన్నట్టు - పాత్రలంటే గిన్నెలూ, డేగిసాలూ, గోకర్ణాలూ కావూ - కథలో మాట్లాడుకునే ముచ్చటగా ముగ్గురంటే ముగ్గురు మనుష్యులు. 

    వాళ్లెవరంటే - గారెలు తినాలనుకునే అయోమయరావు, గారెలు వండి పెట్టాలనుకునే అతిమతి, ఆ గారెలు ఎలా వండాలో చెప్పే ధవళవస్త్రకిరీటధారిణి ఐన ఓ మామ్మగారు. 


    ఇప్పటికి కథ గురించిన కథ చెప్పడమయింది. ఇప్పుడిహ అసలు కథ మొదలు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    అనగనగనగనగా...

    అదొక శరవణ భవన్లూ, హోం డెలివరీలూ లేని కాలం. 

    భార్యలు -  వారివారి respective భర్తలు తిందామని ఆశ పడ్డవేవో - ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టకుండా - ఇంట్లోనే వండి పెడుతున్న కాలం. 

    అపార్టుమెంటుల్లోనో, విల్లాల్లోనో కాకుండా రైలుపెట్టె-గదుల వాటాల్లో అద్దెకున్న మనుషులు కలిసిమెలిసి వున్న కాలం. 

    ఇంటి పెరట్లో వున్న రుబ్బురోల్లో గారెల పిళ్లూ, గారెల్లోకి అల్లప్పచ్చళ్లూ చులాగ్గా రుబ్బుకుంటున్న కాలం.
    
    ఉలుకూ-పలుకూ లేక యూట్యూబు వీడియోల్లో మునిగిపోకుండా పక్కింటి మామ్మగార్ని పలకరించి వంటలెలా చేయాలో నేర్చుకుంటున్న కాలం. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
    
    అల్లాంటి కాలంలో ఒకానొక అయోమయరావుకి గారెలు తినాలనిపించింది. 

    వెంటనే తన భార్యైన అతిమతిని పిలిచి గారెలు చేసి పెట్టమని అడిగాడు. 

    (ఇక్కడో చిన్న కాలవిశేషం, కాలక్షేపవివరమూ ఏంటంటే -  ఏ కాలమైనా సరే భార్యలని అడగాలే కానీ చెప్పకూడదని భర్తలకి బాగా తెల్సిన కాలమే అయుంటుంది.) 


    తన భర్త వచ్చి గారెలు తినాలని వుందని చెప్పగానే అతిమతి " అయ్యో! నాకు గారెలు చేయడం రాదండి." అంది. 

    వెంటనే అయోమయరావు  "గారెలు చేయడం బ్రహ్మవిద్యేం కాదు. మన పక్క వాటాలో వున్న మామ్మగారు బాగా చేస్తారు. ఆవిడని అడిగి చూడు ఎలా చేయాలో" అని అన్నాడు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


        ఆ మరుసటి రోజు అతిమతి పక్కింటి మామ్మగారి దగ్గరికి వెళ్లింది.

        మామ్మగారు ఆమెని చూస్తూనే -

        "రా...అమ్మాయి.... రా... ! పక్కనే వున్నా ఎప్పుడూ ఇలా రానేలేదు. ఏంటి విశేషం?"

        "అయ్యో ! రాకూడదనేం లేదండి మామ్మగారూ! ఏదో పని హడావిడిలో కుదరలేదంతే."

        "పోనీలేమ్మా! ఇన్నాళ్లకైనా వచ్చావు. ఇలా కూర్చో."

        "మరేం లేదండి, మామ్మగారూ! మా వారికి గారెలు తినాలనిపించింది, నాకేమో ఎలా చేయాలో తెలీదు. మిమ్మల్ని అడిగి నేర్చుకుందామని వచ్చాను."

   అది వినగానే ఆ మామ్మగారు "దానికేం భాగ్యమమ్మా! గారెలు చేయాలంటే మినప్పప్పు నానేసి, నానాక పొట్టు తీసి నీళ్లు పారబోయాలి..." అంటూ గారెలు వండే విధానం చెప్పడం మొదలు పెట్టారు. 

    అతిమతికి కొంచెం తొందరరెక్కువ. 

    ఎవరైనా ఏదైనా చెప్పడం మొదలు పెట్టగానే పూర్తిగా వినకుండానే  "ఆ...తెలిసింది...తెలిసింది" అనడం ఆవిడ అలవాటు. 

     ఇప్పుడు కూడా మామ్మగారి నోట్లోంచి మొదటి వాక్యం వినగానే "ఆ...తెలిసింది...తెలిసింది...వస్తానండి, మామ్మగారు..." అనేసి నోరు తెరుచుకుని చూస్తూ వున్న మామ్మగారిని వదిలేసి వాళ్ళ వాటాలోకి వెళ్ళిపోయింది. 

    బయటికి వెళ్ళే తొందరలో వున్న భర్తకి సాయంత్రంకల్లా గారెలు తయారుగా ఉంటాయని చెప్పింది.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
 
    గారెలడిగిన అయోమయరావు రోజువారీ వ్యవహారాలన్నీ ముగించుకుని సాయంత్రం వేళకి ఇంటికి చేరుకున్నాడు. తినబోయే గారెల గురించి కలలు గంటూ స్నానం చేసొచ్చి వంటింట్లో పీట వాల్చుక్కూర్చుని భార్యని గారెలు వడ్డించమన్నాడు.     

    అతిమతి హడావిడిగా చేతులు తుడుచుకుంటూ వచ్చి " మీరన్నట్టే గారెలొండడం బ్రహ్మవిద్యేమీ కాదు సుమండీ! కానీ ఇంత సులువుగా అయిపోతాయి అని తెలిస్తే రోజూ అవే వండి పెట్టకపోదునా?!" అంది. 

    అది వినగానే అయోమయరావుకొంచెం అనుమానంగానే చూస్తూ " అసలు ముందు పట్రా. ఎలా చేశావో చూస్తాను" అన్నాడు. 

    వెంటనే అతిమతి ఒక డేగిసా తెచ్చి భర్త ముందు పెట్టింది. 
 
    అందులోకి  తొంగి చూసిన అయోమయరావు "ఇంతకీ గారెలేవి?" అని అడిగాడు. 

    "అయ్యో రామా! ఇక్కడ కూడా వేళాకోళమేనా? ఆకలి మీద ఉన్నట్టున్నారు. ముందు గారెలు తినండి" అని డేగిసా లోంచి ఒక గరిటెతో నానిన మినప్పప్పు తీసి కంచంలో వేసింది అతిమతి.
 
    అది చూసి అయోమయరావు " నీ మొహం...ఇది నానిన మినప్పప్పు కానీ గారెలు కాదు. నువ్వు సులువుగా వండేశాను అని అన్నప్పుడే ఇలాంటిదేదో అయుంటుందని ఊహించాను. నీ ధోరణి లో నువ్వు ఆ మామ్మగారు చెప్పేది సరిగ్గా వినకుండా వచ్చేసి ఉంటావు. ఈసారి మళ్ళీ వెళ్లి వివరంగా మామ్మగారిని అడిగి గారెలు ఎలా చెయ్యాలో కనుక్కుని రా" అని చెప్పాడు.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మరుసటి రోజు అతిమతి మామ్మగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. 

    "మన్నించండి! మామ్మగారూ! క్రితం మాటు నేను సరిగా వినలేదు. ఏమనుకోకుండా ఇంకోసారి చెప్తారా గారెలు ఎలా చేయాలో?"

    "ఫర్వాలేదు లేమ్మా...ఏదో తొందరలో వుండి వెళ్లి ఉంటావు అనుకున్నానులే. సరే విను మరి. గారెలు చేయడానికి మినప్పప్పు నానపోసుకోవాలి. ఆ నానిన మినప్పప్పుని ఆట్టే నీళ్లు పోయకుండా మే...త్తగా  రుబ్బుకోవాలి..."

    అంతే - అతిమతికి అంతా అర్థమైపోయినట్టనిపించింది.  

    వెంటనే  "ఆ...తెలిసింది...తెలిసింది..." అని లేచి చక్కా వెళ్లి పోయింది గారెలు వండడానికి.

    సాయంత్రానికి ఆశతో వచ్చిన అయోమయరావుకి కంచం నిండా మినప్పిండి వడ్డించింది.

    అంతే అయోమయరావుకి కోపం వచ్చేసి , "ఇదిగో..ఇలాక్కాదు కానీ ...ఈసారి ఆ మామ్మగారు గారెలు ఎప్పుడు చేస్తున్నారో కనుక్కొని ప్రతీదీ ఆవిడ ఎలా చేస్తునారో చూసి తు. చ, తప్పకుండా అలాగే చేయి" అని గా...ఠిగా కోప్పడేశాడు.

    ఇంతలో ఓ రోజు  అయోమయరావు ఆఫీసు పని మీద వూరికెళ్లాల్సి వచ్చింది.  

    అప్పుడు అతిమతి ఏమందంటే, " ఏమండీ! మీరు వూరెళ్తున్నారు కదా ! మీరు  వచ్చేటప్పటికి గారెలు చేసి ఉంచుతాను. మామ్మగారింట్లో రేపు గారెలు వండుతున్నారు. నాకు నేర్చుకోవడానికి మంచి అవకాశం" అని చెప్పింది. 

    తినబోతున్న గారెల్ని ఊహించుకుంటూ అయోమయరావు సంతోషంగా వూరికి వెళ్ళాడు.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఆ మర్నాటి సాయంత్రం అయోమయరావు ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా గారెలు వేగుతున్న కమ్మటి వాసన వస్తోంది. 
    
    అది పీలుస్తూ ఇన్నాళ్ళకి తనకి ఇష్టమైన గారెలు తినబోతున్నాను కదా అని ఆనందంతో ఇంట్లోకి వచ్చాడు అయోమయరావు. 

    గబగబా వంటింట్లోకి వెళ్లాడు. అక్కడ అతిమతి లేదు. ఎవరో ధవళవస్త్రకిరీటధారిణి పొయ్యి దగ్గర గారెలు వేస్తూ కనిపించింది. 

    అతిమతి పెరట్లో ఉందేమో అనుకుని  " అతీ! ఎక్కడ వున్నావ్? త్వరగా వచ్చి గారెలు పెట్టు" అని గట్టిగా పిలిచాడు. 

    పొయ్యి దగ్గర వున్న ధ. వ. కి. ధా అతని కేసి తిరిగి "ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు. మెల్లగా చెప్తే నాకు వినబడదనుకున్నారా ఏంటి?," అని విసుక్కుంది.

    ఆవిడని చూసి అయోమయరావు "అయ్యో, అయ్యో! నేను బ్రతికి ఉండగానే ఈ అవతారమేంటి? అసలు నీకేమైనా మతి ఉందా,  అతీ!," అని అరవడం మొదలు పెట్టాడు.

    వెంటనే అతిమతి కళ్ళనీళ్ళు పెట్టుకుని " ఇంతకుముందు గారెలు సరిగ్గా చెయ్యలేదని తిట్టారు. ఇప్పుడు మీరు చెప్పినట్టే చేస్తున్నా తిడుతున్నారు. మీరే కదా 'ఈసారి ఆ మామ్మగారు గారెలు ఎప్పుడు చేస్తున్నారో కనుక్కొని ప్రతీదీ ఆవిడ ఎలా చేస్తునారో చూసి తు. చ, తప్పకుండా అలాగే చేయి' అన్నారు. అందుకే అచ్చు ఆవిడలాగే తయారయి ఆవిడలాగే గారెలు వండాను. మీరే చూడండి - గారెలెంత బాగా వస్తున్నాయో?!" అంది.

    అది వింటూనే అయోమయరావు "ఆ...తెలిసింది...తెలిసింది" అంటూ గారెలు తినకుండానే మూర్చ పోయాడు.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***