బుజ్జిజింకల కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బుజ్జిజింకల కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

మిస్టర్ ఎమ్మెల్కే, మేం కలిసున్నాం మీ వల్లే!


అప్పుడెప్పుడో బో...ల్డన్ని రోజుల క్రితం - దాదాపు ఆరున్నొక్కేళ్ళ క్రితం.
అబ్బరాల మనవల్ని చూసి మురిసిపోవడానికి గాలిదారుల వచ్చారప్పుడే మా అత్తగారు
అప్పటికింకా అన్నజింక హై స్కూల్లో, బుజ్జిజింక ఎలిమెంటరీ స్కూల్లో.
అప్పుడప్పుడే ఇద్దరికీ శీతాకాలపు సెలవులు ముగిశాయి.
జనవరిలో మూడో సోమవారం నాడు  ఉత్తర అమెరికా అంతా జరుపుకునే  మార్టిన్ లూథర్ కింగ్ (MLK Jr.) పుట్టినరోజు సెలవు కూడా చెల్లిపోయింది.

అక్కడ - ఇండియాలో ధనుర్మాసపు సంక్రాంతి సంబరాలు ముగిశాయి
ఇక్కడ అమెరికాలో - వారాంతపు సంక్రాంతి వేడుకలు మొదలయాయి
ఆ ఆటలు, పాటలు చూసి-విని, విందుభోజనం తిని వద్దాం పద అనుకుని, అందరం కలిసి బయలుదేరాం కారులో - అమ్మ, నాన్న, పిల్లలిద్దరూ, నాన్నమ్మ.

వెనక సీట్లో ఇద్దరి మనవల మధ్యన నాన్నమ్మ కూర్చున్నారు. వాళ్ళ కబుర్ల కుహు-కుహూలు వింటూ మురిసిపోతున్నారు.

బుజ్జిజింక చేతిలో అంతకు ముందు రోజు బళ్లో వాడు వేసుకొచ్చిన  మా ఫామిలీ పోర్ట్రయిట్. అందులోకి తొంగి చూసిన నాన్నమ్మ "అదేంటమ్మా! మీ నలుగురే వున్నారు? నాన్నమ్మ ఏదీ?" అనడిగారు బుంగమూతి పెట్టి - రెండోబాల్యపు కినుకతో.

మాటల కుప్ప వాడు దొరుకుతాడా?మెరిసే జింక కళ్ళతో చేతిలో వున్న కాగితపు-బొమ్మని చూస్తూ...



"నాన్నమ్మా! మీఱూ ..."  (మీరు లో "రు" ని రోల్ చేస్తూ మాట్లాడ్తాడు బుజ్జిగాడు)

"ఆ! నేనూ ..."  ఏం చెప్తాడా అని నాన్నమ్మకి ఆత్రం.

మిగిలిన ముగ్గురమూ కూడా చెవులప్పగించాం.

అంతలో... వాడికేం గుర్తొచ్చిందో - హఠాత్తుగా బుజ్జిజింక గుండ్రని బుగ్గల్లోంచి తోసుకొచ్చిన మాటలు "మనమందరం అమ్మతో కలిసి ఉన్నామంటే దానికి కారణమెవరో తెలుసా?" అంటూ.

అప్పటి దాకా ముందు సీట్లో కూర్చుని ఏవో కబుర్లాడుతున్న నేను వెనక్కి తిరిగాను ఆ ప్రశ్న అర్థం కాక.

"అదేంటి నాన్నగాడూ? అలా అడిగావేంటమ్మా? నాన్నమ్మ కదా ఆ బొమ్మలో నేనెక్కడా అని అడుగుతున్నారు? అమ్ముంది కదా అందులో?" రోడ్డు మీద నుంచి చూపు తిప్పకుండానే బదరి బుజ్జిజింకని అడిగారు.

"అమెరికాలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు కలిసుండడానికి కారణం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్" మెరుస్తున్న కళ్ళు తిప్పుకుంటూ చెప్తున్న బుజ్జి బుగ్గల్లోంచి జారిన విజ్ఞాన గుళికలివి.

అప్పటికీ మాకెవ్వరికీ ఏమీ అర్థం కాలేదు.

"భలే చెప్పావే! స్కూల్లో చెప్పారా? అది సరే గానీ నువ్వేసిన బొమ్మలో నేనెక్కడా?" నాన్నమ్మ అసలు విషయం వదిలిపెట్టదలుచుకోలా.

"మీఱు… మీఱు… వాకింగ్‌కి వెళ్ళాఱు. అందుకే నా బొమ్మలో లేఱు" తేల్చి చెప్పేశాడు బుజ్జిమనవడు.

భళ్ళున నవ్వారు నాన్నమ్మ, "అమ్మదొంగా! ఈ మాట ఆలోచించడానికి తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అంటూ మాట మారుస్తావా?" అంటూ.

"ఊఁ" - బుజ్జిజింక పరధ్యానపు సమాధానం కంటి చూపు కిటికీలోంచి బయటి దీపాల్ని లెక్క పెడుతూ, కాళ్ళ ఊపు ఎదురుగుండా సీటుకి ఎక్కి పెడుతూ.

ఆ బుజ్జి తలలో ఏవో రంగురంగుల ఊహల సీతాకోకచిలుకలు సందడి చేస్తున్నాయని అమ్మకీ, నాన్నగారికి ఉప్పందిపోయింది.

"మార్టిన్ లూథర్ కింగ్ డే అయిపోయి రెండు వారాలయ్యింది కదా? ఇంకా అదే పాఠం చెప్తున్నారా?" అన్న అడగనే అడిగాడు అమ్మా-నాన్నల మనసులోని మాట తనకి తెలిసిపోయినట్లుగా.

"ఊఁ అన్నా! అందుకే అమ్మ మనతో ఉంది" మళ్ళీ అదే మాట వల్లె వేస్తున్నట్లుగా. 

"మార్టిన్ లూథర్ కింగుకీ, అమ్మ మనతో కలిసుండడానికి సంబంధం ఏంటి?" ఇంక ఆగలేక అడిగేశారు అమ్మా-నాన్న బుజ్జిజింకని ఓ యుగళ-ప్రశ్న.

చిట్టిచిట్టి చేతి వేళ్ళు ఒక్కొక్కటిగా మూసిన గుప్పిట్లోంచి తెరుస్తూ "నేను... , అన్న... , నాన్నగారు...  నల్లవాళ్ళం" - ఇక్కడితో కుడిచేతి నుంచి ఎడమకి చేతికి మారి, ఇంకో రెండు వేళ్ళు లెక్కపెడుతూ "అమ్మ... , నాన్నమ్మ...  తెల్లవాళ్ళు. మనమందరం కలిసున్నామంటే అది మార్టిన్ లూథర్ కింగ్ జూనియరే వల్లే! లేకపోతే మనమిలా కలిసి ఉండగలిగేవాళ్ళమే కాదు. We should thank MLK Jr."

హమ్మయ్య! పొడుపు కథ విప్పేశాడు బుగ్గల-దొర.

పనిలో పనిగా బొమ్మలో చేర్చని నాన్నమ్మ అలక తీర్చడానికి అమ్మతో కలిపి లెక్కెట్టేశాడు ఇద్దరు తెల్లవాళ్ళుగా. 

["Me, Anna, Naannagaru are black people & Amma and Naannamma are white people. We are all living together today because of Martin Luther King Jr. Otherwise, it would not have been possible. We should thank MLK Jr"]

ఫక్కుమని రాబోయిన నవ్వు పంటి వెనకాలే నొక్కి పట్టేశాం - కార్లోని శ్రోతలం నలుగురం.
నవ్వితే ఇంకేమన్నా ఉందీ?!
మా నవ్వులు పువ్వులు పూయడం మాట అటుంచి, బుజ్జిజింక బుగ్గలు పూరించి, కన్నుల నీలాలు కురిపించేవి.
కారిన నీలాలతో మారాము మీరేది
మీరిన మారాముతో పండగ జరిగే వీలేది?
అందుకే... అందరం చేతులెత్తి దండమెట్టి
అనుకున్నాం...
గట్టిగా అన్నాం కూడా ...
మిస్టర్ ఎమ్మెల్కే,  మేం కలిసున్నాం మీ వల్లే! 
ఎప్పటికీ మర్చిపోము మీ మేలే !

16, ఏప్రిల్ 2018, సోమవారం

బుజ్జోడు - విజ్జోడు

పై నుంచి కింద దాకా మేచింగ్ వేసుకోవడం అలవాటు - బుజ్జిజింకకి...

రేపటికి ఏం వేసుకోవాలో ఈ రోజు రాత్రే తీసి పెట్టేసుకుంటాడు.

ఓ నాలుగు నెలల క్రితం రోజూ లాగే ఒకానొక ఆరోజు కూడా ఎంచుకున్నది - ఆపాదమస్తకం నీలవర్ణవస్త్రధారణం....

బజ్జోడానికి ముందు కొన్ని కబుర్లు - అవీ, ఇవీ చెప్పుకుని చెవులదాకా దుప్పటి కప్పి ఇవతలికి రాబోతుంటే... ఇంతలో ఓ నిట్టూర్పు.

"హ్మ్!"

ఏంటో పాపం హోంవర్క్ ఏమన్నా మర్చిపోయాడా అని - అడగబోయేలోగా - మళ్ళీ ఇంకో నిట్టూర్పు. 

"హ్మ్ - ఏంటో రేపు ఎలా వెళ్ళాలో స్కూల్‌కి?!"

"అదేం - రేపేమన్నా బస్ రాదా? నాకేం నోట్ రాలేదే స్కూల్ నుంచి?"

"అదేం కాదు. బస్సొస్తుంది "

"మరింకేంటి?"

"రేపు స్కూల్లో మిస్‌మేచ్ డే...."

"అంటే?"

"అస్సలు ఏదీ కూడా మేచ్ అవ్వకూడదు."

"సరే.... మరి...రేపటికి నీ డ్రెస్ అంతా నువ్వంతా మేచ్ చేసుకున్నావు కదా - నీ స్కూల్ బేగ్ తో సహా - అంతా బ్లూనే కదా?"

"నాకెప్పుడూ నా shtuff అంతా ఒకేలా ఉంటేనే ఇష్టం."

(వాడనే ఆ shtuff అనే వాడి మాట వాడంటూ ఉండగా వినడం నాకెంతో ఇష్టం.)

"అలాగే కానీయ్ మరి... నీకెలా ఇష్టమైతే అలా ఉండడమే నయం."

"అవుననుకో ...కానీ .... "

Chin-కింద చెయ్యి పెట్టి కాసేపు thinking అయ్యాక - "Oh well! I go a step farther than everybody. I mismatch the mismatch day. Get it, Amma?"

"ఓ - భలే ఉందిరా - అది height of mismatch కదా?"

"Oh yeah! They all mismatch their shtuff and I mismatch the mismatch itself!"


"ఇదేదో బావుంది నీ mismatch quote - నేను రాసుకుని దాచుకుంటాను."

"మరమ్మా... mismatch నితెలుగులో ఏమంటారు?"

"ఊఁ - ఒక్క నిముషం ఆలోచించనీ - match అవ్వడం అంటే... జోడు కుదరడం."

"మరి mismatch అంటే?"

"జోడు కుదరకపోవడం"

"అబ్బా - అలా కాదు - ఇంకో అ-మాట లేదా?"

"అ-మాట?"

"అదే ... నువ్వు చెప్తావే సత్యం-అసత్యం, న్యాయం-అన్యాయం ...అలా జోడు-అజోడు కాదా?"

"హహహ ఓ అలాగా ... అబ్బే అజోడు లేదు కానీ విజ్జోడు వుంది - తెలుగు dictionary లో చూశా"

"అంటే జోడు-విజ్జోడు?"

"అవును - అదే match కి mismatch లా జోడుకి విజ్జోడు సరిజోడు"

"భలే భలే నాన్నగారు నన్నేమంటారూ?"

"బుజ్జోడు"

"మరి నా match కి mismatch  ఏంటీ - తెలుగులో?"

"జోడుకి విజ్జోడు"

"నేను బుజ్జోడు - mismatch of my match - అంటే జోడుకి విజ్జోడు"

"ఇదేదో బావుందిరోయ్ - బుజ్జోడు, జోడు, విజ్జోడు, సరిజోడు - నేనిక్కడే ఉంటే నువ్వు బజ్జోడు కానీ నన్నింక వెళ్ళనిచ్చి చూడు - గుడ్ నైట్!"

"గుడ్ నైట్ అమ్మా"
 

26, ఆగస్టు 2017, శనివారం

నేనర్స్ Vs. నాన్నగాడు - తల-వెనక-కథలు


"యో నేనర్స్!  క్లాస్‌కి టైమయ్యింది - వెళ్దాం పదండి. "

"ఆగు నాన్నా! "

"అబ్బా నేనర్స్! మళ్ళీ అదేనా ... అదే ఆ వాట్సాప్ చూస్తున్నారా?"
 
"కాదురా బుజ్జిగాడు! వచ్చేవారం ట్రావెల్ కదా - ఫ్లైటు, హోటల్, కారు అన్నీబుక్ చేసుకోవాలి కదా !"

"అబద్ధం చెప్తున్నారు - I know that you are reading ఈనాడు."

"అబద్ధమా? నేను అబద్ధం అసలు చెప్తానా, నాన్నగాడు?"

"ఇప్పుడు అదేగా చెప్తున్నారు?!"

"సరే... సరే...  పద! లేట్ అవుతోంది. కార్లో మాట్లాడుకుందాం."

"నేనర్స్! అమ్మేది?"

"పైనుందిరా - బుజ్జిగాడు. ఎందుకు ఏం కావాలి?"

"నా సాక్స్ కనిపించట్లేదు - Oh wait! I found them."
.... .....
.... .... 




 

"మధ్యలో కూర్చోరా, బుజ్జిగాడు! మాట్లాడేటప్పుడు నువ్వు కనిపించాలి కదా!"

"అబ్బా!!  పదండి నేనర్స్! ఇదిగో - మధ్యలోనే కూర్చుని బెల్ట్ పెట్టుకుంటున్నాను. మిర్రర్లో చూడండి. "

"అవున్రోయ్ ...నాకు తెలీలేదే!"

"మరీ .... పేరెంట్స్ అందరికీ తలవెనకాల కూడా కళ్ళు ఉంటాయి అనేవారు కదా నేను బేబీ గా వున్నప్పుడు?"

"నువ్వు ఇప్పటికీ బేబీవేరా!"

"అదే అదే ... నేను బేబీనే."

"అయితే ఏమంటావిప్పుడు?"

"నిజంగా మీకు, అమ్మకీ తల వెనకాల కళ్ళు ఉన్నాయా? లేవా? చెప్పండి ముందు."

"అమ్మ అంటే గుర్తొచ్చింది - అమ్మకి - పాపం - ఇంకా వర్క్ అవలేదు. ఏదో కాల్లో వుంది. ఇవాళ బయట తిందాంరా బుజ్జిగాడు?"

"ఓకే నేనర్స్! I'm fine either way. కానీ కళ్ళు ఉన్నాయా - లేవా?"

"ఎందుకు లేవూ! శుభ్రంగా వున్నాయి - నాకు నాలుగు, అమ్మకి రెండు."

"ఆ కళ్ళు కాదు - చిన్నప్పుడు మీ కుర్చీ వెనకాల నేను నించునుంటే మీరు చెప్పేవారు కదా!  మీకు నేనేం చేసినా  మీ తల వెనక కళ్ళకి కనిపించేస్తుంది అంటూ?!"

"అవునా ? అలా చెప్పానా?"

"అవును... అవును"

"అయితే చెప్పానేమో ... అరె ! మాటల్లోనే వచ్చేశాంరా  నాన్నా!"

"ఓకే నేనర్స్ - bye!!"

"మంచినీళ్ల బాటిల్ మర్చిపోకురా - తీసుకుని దిగు - సీట్లో నీ పక్కనే ఉంది."

"I got it , నేనర్స్ !"

"Alright నాన్నా ! Have Fun!"
...... ...... .....
..... ..... ......

"హాయ్ నేనర్స్ !"

"ఎలా అయింది నాన్నా - ఇవాళ క్లాస్ ?"

"అయింది  - its over"

"మంచినీళ్ళు తాగినట్లు లేవు - బాటిల్ ఓపెన్ చేయనా?"

"ఊఁ ..."

"అలిసిపోయావా?"

"ఊఁ ..."

"ఇంకేంటి నాన్నా ! టాహా వచ్చాడా ఇవాళ?"

"ఆఁ ..."

"ఆకలి వేసేస్తోందా? పోనీ నీకు నచ్చే కబుర్లు చెప్పుకుందాం కాసేపు - అదేంటిరా బుజ్జిగాడు - అదేదో కొనాలన్నావ్ Nintendo Stitch  కోసం?"

"అదా - next version upgrade - Yarn 2.0"

"అదేంటి నాన్నా - మొన్నే కదా కొన్నాం - అప్పుడే upgrade ఏంటి? Yarn ?"

.....

"ఆహాఁ ...బుజ్జిగాడు - నన్నాట  పట్టిస్తున్నావా? Nintendo Switch ని Stitch అన్నానని?"

"హహ్హహ్హ నేనర్స్ ! అదే మరి - అది Stitch అయితే upgrade Yarn అవుతుంది కదా !"

"నిజమేరోయ్!  హహ్హహ్హ - you got me there !"

"నేనర్స్ ! Are we going out today for dinner?"

"అవున్నాన్నా! అమ్మకి ఇంకా వర్క్ అయినట్లు లేదు - పాపం - అమ్మక్కూడా ఆకలేస్తూ వుంటుందీ పాటికి."

"Hmmm"

"ఇంటికి వెళ్ళగానే గబగబా స్నానం చేసేస్తే తాజ్-ఇండియాకి వెళ్దాం."

"ఓహ్ నేనర్స్! మళ్ళీ అక్కడికేనా ?"

"ఏమ్మా! బోర్ కొట్టేసిందా?

"Hmmm"

"ఈసారి ఏదైనా కొత్తది ట్రై చేద్దాం...సరేనా!"

"కొత్తదంటే ... ఆ రాహు-గారి-కోడి-something ?"

"హహ్హహ్హ - అది రాజుగారి - రాహుగారి కాదు - స్పానిష్‌లో J - H అయినట్టు Indian పేరులో అవ్వదు - Raju అంటే రాజు, రాహు కాదు. ఇంతకీ నీకా పేరు ఎలా తెలుసు?"

"నేను తిన్నాను కదా - అలా!"

"నువ్వు తిన్నావా? అదెప్పుడురా?"


"మా CCL లో  ఫీల్డ్‌ట్రిప్పులకి వెళ్ళినప్పుడు."

"అదేదో ఇంట్రెస్టింగ్ టాపిక్లా ఉందే - చెప్పు చెప్పు!"

"నేను ఫిఫ్త్‌గ్రేడ్‌లో వున్నప్పుడు మమ్మల్ని రెండు restaurants కి తీస్కెళ్ళారు."

"ఎందుకూ?"

"ఒకటి how to do a business, రెండోది how not to do a business చూపించడానికి."

"భలేరా! మీ CCL వాళ్ళకి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. ఎక్కెడెక్కడికి వెళ్ళారేంటి?"

"How to do a business కి చాలా దూరం డౌన్‌టౌన్‌కి వెళ్ళాం. కానీ how not to do a business చూడడానికిఎక్కడికి వెళ్ళామో తెలుసా, నేనర్స్?"

"నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నువ్వే చెప్పు. "

"చెప్పేస్తున్నా .... చెప్పేస్తున్నా.... తా...జ్ - ఇం ...డి ...యా !"

"నిజంగారా? బుజ్జిగాడు !"

"అవును నేనర్స్ !"

"That's a shame, నాన్నగాడు! ఏం చెప్పారు మీకక్కడ? ఎలా సర్వ్ చేయకూడదు - అలాంటి examples ఏమన్నా చూపించారా?"

"ఊఁ  - నాకు గుర్తు లేదు నేనర్స్ - but they said something like that."

"అయ్యో - పాపం !మన తాజ్-ఇండియా వాళ్ళకి తెలిసిందో లేదో - వాళ్ళని ఇలాంటి ఉదాహరణగా వాడుకుంటున్నారని. అమ్మతో చెప్పాలి తప్పకుండా ఇది - మీకు practical గా ఎంత మంచి విషయాలు నేర్పిస్తున్నారో !"

..... .....
..... .....

"ఏంట్రా బుజ్జిగాడు! సైలెంటుగా వున్నావు? బాగా ఆకలి వేస్తోందా? ఇదిగో ఇంటికి వచ్చేశాం - దిగు!"

"హహ్హహ్హ.... హహ్హహ్హ.... I got you one more time,  నేనర్స్! I got you one more time,  నేనర్స్!"

"ఆరి బుజ్జిగాడు! ఇంతసేపు నువ్వు చెప్పింది కథరా ? భలే నమ్మించావు నన్ను!"

"అదే నేనర్స్ ! మీ తల-వెనకాల-కళ్ళ-కథకి , మీ తల-వెనక నుంచి-నే-చెప్పిన-కథకి బాలన్స్ అయింది కదా!"


29, ఏప్రిల్ 2017, శనివారం

ఎక్కడికో చెప్పుకో - సర్‌ప్రైజెస్కో...

దాదాపు మూడు నెలల కిందట - శీతాకాలపు సెలవులకి అన్నజింక ఇంటికి రావడం - తిరిగి వెళ్లడం మధ్య కాలం ఏ కబుర్లలో జారిపోయిందో.

అన్నగాణ్ణి ఫ్లయిట్ ఎక్కించిన తర్వాత ఇంట్లో ముగ్గురమున్నా - మా ఒకరొకరికీ దగ్గరలేని వాడొక్కడి ధ్యాసే.

చుట్టూ పేరుకున్న- నిశ్శబ్దపు శీతాకాలపు  చిక్కటి నల్లటి సాయంత్రాలు - దిగులుగా గుబులుగా,  మామూలుకన్నా పొడుగ్గా -  అసలు గడుస్తాయా, సూరీడుకి దారిస్తాయా, వెచ్చబడనిస్తాయా అనిపిస్తూ - చలి ఇంకా తగ్గని జనవరి-సంజలు.

అప్పుడోరోజు - అనుకోకుండా వెచ్చబడిన రోజది. బదరి, నేను వాకింగ్‌కి వెళ్లాం కొంచెం ఒంటికి ఎండ పూసుకుని వద్దామని.

"అన్నగాడు వెళ్లాడు కదా - మళ్లీ స్ప్రింగ్‌బ్రేక్‌కే కదా రావడం?" - అనుకుంటున్నానో, పైకే అంటున్నానో.

"ఇంకెంత రెణ్ణెళ్లు - అంతే!" - తనకి తానే అనుకుంటూనే  నాకిచ్చిన బదులు.

"రెణ్ణెల్లే - కానీ - వుండేది వారమే కదా - మళ్లీ వెళ్లిపోతాడు కదా" - పైకనకపోయినా మనసులో పెట్టేసుకున్నా రోజుల్లెక్క.

పక్కనుంచి సన్నగా వినీ వినిపించకుండా అన్నది సరిగానే విన్నానా అన్ననుమానం వచ్చి - ఒక్కసారి దారిపక్క ఆగి " ఏంటన్నారు ? మళ్లీ చెప్పండి" అనగానే - ఈసారి ఇంతకుముందుకన్నా కొంచెం గట్టిగా "మనమే వెళ్తే బావుంటుందా పోనీ ?!" - చిరునవ్వు చాటునుంచి మురిపించే మాటలు ముత్యాల్లా రాలాయి.

"అదెలా - ఎలా వెళ్తాం? ఎప్పుడు వెళ్తాం ?" - హడావిడిగా దొర్లాయి నా నోటి పలుకులు.

"అన్నగాడి పుట్టినరోజుకి - ఫ్లయిట్లు, హోటళ్లు అన్నీ బుక్‌డ్. ఏప్రిల్‌లో ఓ నాల్గు రోజులు సెలవు పెట్టేయ్" - ఇంక పట్టలేని సందడి మనసులో, మాటలో.

ఇంకా తర్వాత నడక ఎలా సాగిందో చెప్పాలంటే  - పాదాలక్కూడా చెవులొచ్చి మా మాటలు వింటూ మేఘాలలో తేల్తున్నాయో అన్నట్టు అడుగులేశాయా అనిపించేట్టు.

"కానీ... ఈ విషయం అన్నగాడికి చెప్పొద్దు - వాడికి సర్‌ప్రైజ్ - ఈ ట్రిప్పు, దాంతోపాటు వాడు కావాలనుకుంటున్న కొత్త సోనీ కామెరా కూడా. అలాగే తమ్ముడికీ చెప్పొద్దు - మనం ఫ్లైట్ ఎక్కేదాకా" - చెప్పిన మాటకి బుద్ధిగా తలూపేశాను.

ఇంటికొచ్చేవరకూ ఆ మాటలే మాట్లాడుకుంటూ - ఆ తర్వాత ఇద్దరం గప్‌చుప్.

మార్చొచ్చింది - వాతావరణంలో మార్పొచ్చింది.
స్ప్రింగ్‌బ్రేకొచ్చింది - అన్ననొక వారం ఇంటికి తెచ్చింది.
మళ్లీ ఇల్లంతటా ఎలుగు - కళ్లంతటా వెలుగు

అన్నగాడు వున్న వారంలో ఒకరోజు "కొత్త కెమెరాలేమోచ్చాయో చూసొద్దాం రా " అంటూ బెస్ట్‌బై-కి కిటికీ-బేరానికి వెళ్లొచ్చాము - మరి వాడికే మోడలిష్టమో కనిపెట్టాలికదా!

వారం గిర్రున తిరిగింది - spring-break has sprung away.

ఏప్రిల్ మొదటివారం తమ్ముడి MAP schedule తెలిసింది - మూడోవారంలో లెక్కల పరీక్ష అని. మరి మా ప్రయాణం అప్పుడే.

వెంటనే లెక్కల-టీచర్ మిస్. ఫ్రామ్ కి ఈ-మెయిల్ ఇచ్చాను - ఒకసారి మీతో మాట్లాడాలని.

సోమవారం పొద్దున్నే తొమ్మిదింటికి టీచర్ నుంచి ఫోను - ఏంటీ సంగతీ - అని.

"మా ఇంట అన్నగాడి పుట్టినరోజు - కానీ వాడి కాలేజ్ జరుగుతూ వుండడం వల్ల - వాడికి ఇంట్లో వుండడం కుదరదు కాబట్టి - మేమే వాడి దగ్గరికి - వాడి పుట్టినరోజుని దగ్గరుండి జరిపిద్దామని వెళ్తున్నాము - మీరేమనుకోకుండా మా బుజ్జిజింకకి వచ్చాక వాడు మిస్ అవబోయే MAP లెక్కల పరీక్ష మళ్లీ పెడతారు కదూ - అన్నట్టు మీతో ఇలా మాట్లాడానని మా బుజ్జిజింకకి చెప్పకండి - మేము ఊరెళ్తున్నటు వాడికి కూడా తెలియదు -తెలియకూడదు" అని చెప్తూ - చివర్లో "సర్‌ప్రైజ్!!" అని గుసగుసలాడా.

చివరి గుసగుసల-గసగసకి మురిసిపోయి మిస్. ఫ్రామ్ కూడా మా సర్‌ప్రైజ్‌ని praiseworthy అని తెగ praise చేసేసింది. ఆవిడకి చెప్పాను - వాడిని ఎప్పట్లాగే ఏప్రిల్ 21న స్కూలుకి పంపించినా పదకొండింటికల్లా ఇంటికి తీసుకొచ్చేస్తామని - మధ్యాహ్నపు ప్రయాణానికి తయారవ్వాలి కదా మరి!

ఆరోజు సాయంత్రం - ఎందుకైనా మంచిదని - బుజ్జిజింకకి చెప్పాను "నాన్నగాడు! నిన్ను 21న పదకొండింటికి స్కూల్ నుంచి బయటికి తేవాలి - నాన్నగారు, నువ్వు, నేను వెళ్లి అన్నకేమన్నా గిఫ్ట్ కొని పంపిద్దామని అనుకుంటున్నాము" అని - మరి మళ్లీ వాడు ముందు చెప్పకుండా అప్పటికప్పుడు స్కూల్లో మీ అమ్మా-నాన్న నిన్ను తీసుకెళ్లడానికొచ్చారు అని చెప్తే - పాపం - కంగారు పడకూడదు కదా!

వెంటనే వాడు - కుదరదంటే కుదరదన్నాడు - కావాలంటే మీరిద్దరు వెళ్లండి - నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చి మీరొచ్చేదాకా హోంవర్క్ చేసుకుంటానన్నాడు.

వాడికొక హింట్ ఇచ్చాను కదా అని ఇంకెక్కువ వాదించలేదు - మళ్లీ ఆ మాటల్లో ప్రయాణం గురించి పొరపాట్న చెప్పేస్తానేమోనని.

ఏప్రిల్ 21 వ తారీఖున ప్రయాణం - బుజ్జిజింకకి తెలియకూడదని ఆరోజు పొద్దున్న వాడు స్కూలుకి వెళ్లేదాకా సూట్‌కేస్ సర్దలేదు.

తీరా వాడు స్కూల్‌కి వెళ్లాక - ఏడింటి నుంచి ఓ నాలుగు గంటలు నా ఆఫీస్ వర్క్ వుండి - పదకొండింటికి లాగ్ఆఫ్ చేశాక - గబగబా చేతికి అందిన బట్టలు సర్దేశాను.

ఈలోగా బదరి వెళ్లి బుజ్జిజింకని స్కూల్ నుంచి తీసుకొచ్చారు - రావడం బోల్డంత కోపంగా వచ్చాడు - కానీ సర్దివున్న సూట్‌కేస్ చూడగానే - ఒక చిన్ననవ్వు మొహంలో - వాడికి తెలిసిపోయింది ఎక్కడికో వెళ్తున్నామని - అదింకెక్కడికో కాదు అన్న దగ్గరికి అని.

హమ్మయ్య! మా పాపడి కోపాలయ్యె మురిపాలు - అమ్మకవె సమ్మతాలు. 

Alaska Airlines లో పోర్ట్‌లాండ్ దాకా ఒక ఫ్లైట్ - అక్కడినుంచి ఇంకోదాంట్లో - ఇంకో గంటలో శాన్‌ఫ్రాన్సిస్కోలో దిగి - ఎయిర్‌పోర్ట్‌లోనుంచి బయటికి వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయింది.

రెంటల్ కార్ తీసుకుని - హోటల్‌కి వెళ్లేముందు అన్నని కలిసి - కనిపించి - సర్‌ప్రైజ్ చేద్దామని అనుకున్నాము.

అప్పటికే ఫోన్లో వాడివి మిస్డ్‌కాల్స్, మెసేజెస్ వున్నాయి - "అమ్మా! మీరందరూ ఇంట్లో లేరా? ఎక్కడున్నారు?" అంటూ.

చెప్పకుండా వెళ్తే -
అసలే శుక్రవారపు-సాయంత్రం -
ఆ రోజు ఎక్కడున్నా మేమందరం పఠించేది - ఆటవిడుపు మంత్రం -
వాడెక్కడికైనా వెళ్తే మాకే సర్‌ప్రైజ్ అవుతుందని ఫోన్ చేశాను.

"హలో నాన్నా ! ఎక్కడున్నావ్?"

"ఇంట్లోనే అమ్మా - కానీ ఇంకో గంటలో బయటికి వెళ్తాను ఫ్రెండ్స్‌తో"

"అయితే - ఇంట్లోనే వుండు - ఓ నలభై నిముషాల్లో కాల్ చేస్తాను"

"ఇంట్లో వుండడం ఎందుకమ్మా - నువ్వు ఫోన్ చేయడానికి?" - గొంతులో చిన్న కంగారు.

"నీతో మాట్లాడాలి - ఇంట్లోనే వుండు" - వాడి దగ్గరికి వెళ్లేదాకా మేము శాన్‌ఫ్రాన్సిస్కోకి వచ్చాము అన్నది దాచాలని - ఎక్కువ మాట్లాడితే బయట పడిపోతానని - సాధ్యమైనంత తక్కువగా మాట్లాడి వాడు మేము వెళ్లే దాకా రూమ్ లో ఉండేలా చేయాలని నా ఆరాటం. ఫోన్లో మాట్లాడడం ఆపేశాను.

వెంటనే టెక్స్ట్ చేశాడు - ఆదిలా సాగింది:


 
మా కార్ వాడి ఎపార్ట్‌మెంట్ దగ్గర ఆపేటప్పటికి - అన్న, వాడి ఫ్రెండ్ కెవిన్ - వాళ్ల ఐదో అంతస్తు నుంచి కిందకి దిగి రోడ్ పక్కనే వున్న ఫుట్‌పాత్ మీద కొంచెం ఆందోళనగా చూస్తూ నించుని వున్నారు.

ముందుగా కార్ దిగి వచ్చిన నన్ను, తమ్ముణ్ణి -  చూసి గబగబా దగ్గరికి వచ్చి అన్నగాడు మెరిసే కళ్లతో - ఇద్దరినీ పట్టుకుని - ఒక హగ్గిచ్చేశాడు. వాడి పక్కనే వున్న కెవిన్ - "ఎంత కంగారు పడ్డాడో సుహాస్" - అంటూ వాడూ ఒక హగ్గిచ్చాడు.

ఇంతలో కార్ దిగి వచ్చిన నాన్నగారికి ఒక పే...ద్ద హగ్గూ - వెంటనే - "This is the best birthday surprise I ever got" అంటూ గంతులూ -
"ఇంతే ఈ ఏడాదికి సర్‌ప్రైజ్ - నీక్కావల్సిన కామెరా నాకు నచ్చిన ప్రైస్ లో దొరకలేదుగా" - సన్నగా ఉడికిస్తూ నాన్నగారు - 
"That's okay, నాన్నగారు! You gave me the best surprise gift by coming over here" - అని మిడిసిపడుతూ అన్నగాడు -
వాళ్లిద్దరినీ మెరిసే కళ్లతో చూస్తూ - మురిసిపోతూ కెవిన్, నేను, తమ్ముడు.

అన్నగాడిని కలిసిన సంతోషంలో మా అలసటంతా మరిచి - కాసేపు కబుర్లు చెప్పి- వాడికి, కెవిన్‌కి బై చెప్పేసి ఆ రాత్రికి శాన్‌ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లో వున్న మా హోటల్‌కివెళ్లిపోయాం - రూంలోకి చేరిపోయాం - ఒళ్లు మరచి నిద్రపోయాం.


మరుసటిరోజు - శనివారం - అన్నకి ఫైనల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాల్సిన రోజు - కలవడం కుదరదని ముందే చెప్పాడు. ఆదివారం సాయంత్రం మా దగ్గరికి వస్తానని చెప్పాడు.

పొద్దున్న లేవగానే - కిటికీలోంచి బయటికి చూస్తే ఎదురుగా బోల్డన్ని కిటికీలతో ఒక బిల్డింగ్ - ఒక్కో కిటికీది ఒక్కో character  & characteristic అనిపించింది.

ఒక కిటికీలో తెల్ల పూల కుండీ
ఒక కిటికీలో నీలి గళ్ళ దిండు
ఒక కిటికీలో నల్ల గొడుగు మొన
ఇంకో కిటికీలో తెల్ల తెరల కొన
అన్ని కిటికీల్లో కామన్  characteristic - ఒక టేబుల్
అన్ని టేబుళ్ల మీద ఒక కంప్యూటర్

నాకూ - బుజ్జిజింకకీ - అసలా కిటికీలేంటా అని ఒకటే ఆపలేని ఆసక్తి ఓపలేనంతగా పెరిగిపోయింది. కిటికీల పైన కానీ-కనిపించని అక్షరాలతో Goodby Silverstein & Partners అనే పేరుని కూడబలుక్కుని చదివి - గూగుల్లో వెతికితే అదొక advertising agency అని తెలిసేదాకా మా చూపులన్నీ ఆ కిటికీలమీదనే.





శనివారం, ఆదివారం రెండు రోజులూ - శాన్‌ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లో  - హోటల్ పక్కనే వున్న - చైనాటౌన్, యూనియన్ స్క్వేర్, బ్రాడ్‌వే - వగైరాలన్నీ - మహా ఆనందంగా తిరిగాం.

బ్రాడ్‌వేలో మ్యూరల్స్ వేసిన బిల్డింగొకటి నచ్చేసి - క్లిక్కేసుకున్నామిలా:




ఆదివారం సాయంత్రం - అన్నని తీసుకుని శాన్‌హోజెలో వుండే ఆప్తులు- ఆతిధ్యహృదయులు - రమేష్, ప్రసాదుల ఇంటికి వెళ్లాము. రమేష్-ప్రసాదులు నా ఆతిధ్య హృదయం పోస్టులో మనసెరిగినవారు.

ఆదివారపు సాయంత్రం - 
మా మనసెరిగిన మిత్రులతో ఇండో-చైనీస్ భోజనం -
తినేచోట బోల్డంతమంది జనం -
ఒకరిమాట ఒకరికి వినిపించనంత కోలాహాలం -
అరిచి మాట్లాడి పోగొట్టుకున్న నా గళం.

ఆదివారం రాత్రి - మా దగ్గరకొచ్చిన అన్నగాడికి దొరికిన గిఫ్ట్ - ఇటీవల కాలంలో చదువుతో - ఎడతెగని హోంవర్క్‌తో కుదరని, దొరకని  - ఎనిమిదిగంటల అవిచ్ఛిన్న-నిద్ర.

సోమవారం పొద్దున్న - అన్నగాడికి దొరికిన ఇంకో సర్‌ప్రైజ్ - నాన్నగారి నుంచి - ఆన్‌లైన్‌లో కొన్న - వాడు కోరుకున్న సోనీ కెమెరా, దానికి కావాల్సిన లెన్స్.

సోమవారం సాయంత్రం - నాకు దొరికిన బహుమానం - నాకిష్టమైన శరవణ్‌భవన-భోజనం.

సోమవారం రాత్రికి అన్న వాడి ఇంటికి వెళ్ళిపోయాడు - మరుసటి రోజు పరీక్షకి చదువుకోవడానికి.

మంగళవారం - అన్న పుట్టినరోజు - పరీక్ష రోజు.

పగలు - మేం ముగ్గురం యూనియన్ స్క్వేర్ దగ్గర కేబుల్‌కార్ ఎక్కి - Pier39 దగ్గర Ghirardelli చాకొలెట్స్ కొనుక్కుని వచ్చాము.



మంగళవారం సాయంత్రం వాడి కాలేజ్ క్యాంపస్ లో వాడి ఫ్రెండ్ కెవిన్ తో కలిసి - వాళ్ళిద్దరికీ నచ్చిన ఒక restaurantలో భోజనం చేసి బయటికి రాగానే కనిపించిన ఒక నీలి రంగు ఆటో - దాన్ని చూసి సంబరపడుతూ - నేనూ, కెవినూ తీసుకున్న ఫోటో:



 చిత్రాన్న-భోజనాలు, ఆటోల-చిత్రాలు - అన్నీఅయిన తర్వాత - UCof B కాంపస్‌లో నడుచుకుంటూ వెళ్లి అన్ననీ, కెవిన్‌నీ వాళ్ల ఎపార్ట్‌మెంట్ దగ్గర దింపేసి - జాగ్రత్తలు చెప్పి హోటల్‌కి తిరిగివచ్చాము.

తెల్లవారితే బుధవారం - మా తిరుగు ప్రయాణం.

ఎక్కాల్సిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ గంట ఆలస్యం - దానివల్ల LA లో ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ దొరకదని - నేను, బుజ్జిజింక కష్టపడతామని బదరికి బెంగొచ్చింది.

అనుకోకుండా - మాకు ఆపత్కాల-బాంధవిలా AA లో పనిచేసే ఆవిడ ముందు వెళ్లే ఇంకో ఫ్లైట్ లో సీట్లు ఇవ్వడం వల్ల - అనుకున్నట్టుగా రాత్రి పన్నెండింటికి ఇంటికి చేరగలిగాము.

అలా ... అన్న పుట్టినరోజుని వాడికే కాక నాక్కూడా మరపురాని రోజుగా మారుస్తూ -
ఎందాకో ఎందాకో
ఎక్కడికో చెప్పుకో
తెలియలేదా - నా చేయి పట్టుకో
వెలిగే దీపాలవిగో
ఎత్తు ఎత్తు భవనాలవిగో
నగరం ఇది శాన్‌ఫ్రాన్సిస్కో
...అంటూ
నా కళ్ల నిండా బదరి నింపిన మెరుపు - సర్‌ప్రైజెస్కో...


10, మార్చి 2017, శుక్రవారం

ఏంటండో అచ్చట? - నింటెండో స్విచ్చట!

అచ్చంగా... ముత్యం-మూడు నెలల కిందట - శీతాకాలపు సెలవులట
అన్న ఇంటికి వచ్చినప్పుడట  - మొదలయిందట - ఆ  ముచ్చట
అదేంటో గేమింగ్ టాబ్లెట్టట  - ఇద్దరు ఆడుకోవచ్చట
అదే పనిగా  - అన్నాతమ్ముళ్ళట - చెప్పుకుని తలచుకుని మరీ మురిశారట

ఎక్కడైనాట - ఎప్పుడైనాట 
ఒక్కరట - అపుడో-ఇపుడోట 
ఇద్దరట  - ఇంట్లోనట
ఇంకొందరట  - ఇంటర్నెట్లోనట
ఇలా రకరకాలుగా ఆడుకోవచ్చట

ఒక ముక్కుకి అటూ-ఇటూ రెండుకళ్లున్నట్లు
ఓకే - ఎంజాయ్ అనుకోవడానికి 
ఒకే జాయ్-కాన్ కి  రెండు కంట్రోళ్లట
ఒకటి అన్నకిచ్చి - ఇంకోటి తమ్ముడికట 

ఒకటే టాబ్లెట్టట - స్విచ్చాటకైనా - అది తెచ్చే అమ్మ-నెత్తి-పోటుకైనా
ఆ టాబ్లెట్టు టీవీకి కలపొచ్చట - కలపకనూ ఆడొచ్చట

అమ్మ కావాలనుకుంటే - టీవీలో - పాటలు చూడాలనుకుంటే
అడ్డం లేకుండా చూడొచ్చట - ఒక్కతే - గొంతు కలిపి పాడుకోవచ్చట
అన్నదమ్ములు అమ్మ పక్కనే కూర్చుని ఆడుకోవచ్చట
అందరూ కలిసి గువ్వపిట్టల్లా ఒక్కచోటే కువకువలాడొచ్చట

ఇలా వినక తప్పని - ఎన్నో ఎన్నెన్నో పొగడికలట
ఇంక కొనక తప్పించుకోవటం - పగటికలట

సరే ! ఇంతకీ ఎక్కడ దొరుకుతుందటా?
ఎప్పుడు - ఎక్కడ - ఎవరు అమ్ముతారటా ?
అది కనుక్కోవడం నాన్నగారి ఒంతటా
దానికి పిల్లలతో పాడే అమ్మ వంతటా

అమ్మా-నాన్న - తమ్ముడూ-అన్న - నలుగురూనట
ఐఫోనులూ, లాప్టాపులూ - సెర్చించారట
అవన్నీ చెప్పేశాయట  - స్విచ్చొచ్చేది మార్చిలోనట
అదీ మూడో తారీఖట - అర్థరాత్రి దాటాకనేట

మన-స్విచ్చు కబుర్లతో - కాలక్షేపాలతో గడిచినవి పగళ్లట
మనస్విచ్చు కలలతో - కలవరింతలతో తెల్లారినవి రాత్రుళ్లట

కిందటి గురువారం మార్చి రెండట
బుజ్జిజింక బడి - తర్వాత వాయులీన-వాదనమట
ఆపై కొరియన్ మార్షలాట - టేక్వాండోట
అవన్నీ అయ్యాక - పదండి వెళ్దాం టాటా - అని సందడట 
స్విచ్చొచ్చి సెలవిచ్చె అమ్మ వంటింటికట 

అర్థరాత్రి పన్నెండు వరకూ - ఏ కొట్టుముందు ఎంత జనముందురోనని బెంగపడిరట
చలికాలపు వణుకు నెదిరించుటకట - కారు ట్రంకులో - కుర్చీలు-దుప్పట్లు సర్దిరట
రాజు-వెడలె అన్న తీరుగానట - కారు-రథంలో కదిలారట
బంగ్లాదేశపు "శాఫ్రాన్" రెస్టారింటికట - (తెలుగులో)మాడని (కన్నడ)ఊట మాడు-టకట
వెళ్లే దారిలో అమ్మ కంట బడిరట - బెస్ట్-బై దగ్గర టెంట్లు కట్టి నించున్నవారట
అమ్మ స్వగతంగా అందట -  "ఏంటండో అచ్చట?"
నాన్న సంగతేంటో చెప్పారట - "నింటెండో స్విచ్చట!"
ఇంకా అన్నారట - "పన్నెండింటికే  బెస్ట్-బై తలుపు తెరుస్తార" నిట

అమ్మ - "అమ్మో చలి! ఇప్పుడే వణుకొస్తోందన్న" దట
బెస్ట్-బై కాక ఇంకెక్కడ అమ్ముతున్నారో అని వెతికిందట
పక్కనే ఇరవై-నాలుగ్గంటల వ్వాల్మార్టొకటుందట  
అక్కడైతే ఎంచక్కా - వెచ్చగా లోపల కూర్చోవచ్చట

వెచ్చవెచ్చని భోజనమారగించిరట
వచ్చె-వచ్చేమంటూ వాల్మార్టున అడిగిడిరట
తొమ్మిది గంటలకి మొదలెట్టిన వరసలో -  తొమ్మిదోవారైరట
తొమ్మిదిలో-మూడోవంతు-గంటల పాటు - వేచి-వేచి నిద్ర-వాలు-కళ్లవారైరట





గడియారపు ముల్లు - పన్నెండు దాటి ఒక నిముషమైనదట
మార్చి రెండు - ఏమార్చక - తేదీ మార్చి -  మూడైనదట
లెండి-లెండి అని అందరితో పాటు లేచిరట
వరస కదలగా - అడుగు కదిపిరట
స్విచ్చు చేతికొచ్చినది - ఒంటిగంటకట
బుజ్జిజింక నవ్వు విచ్చుకొనెనట  - నాన్నగారికో 'హగ్గు' నిచ్చుకొనెనట
అమ్మా-నాన్నకి  ఈ స్విచ్చిచ్చిన-ముచ్చట బహు-ఇచ్చకమైనదట

ఒక బహు-ముచ్చటైన చిన్న-ముచ్చట:

ఆ రాత్రి - నింటెండో స్విచ్ కోసం వచ్చిన - ముప్పై మందిలో - ముప్పైకి-ఒకటి తక్కువగా అందరూ అమెరికన్లే.

వరసలో బుజ్జిజింక కన్నా ముందు వున్న పంథొమ్మిదేళ్ల అబ్బాయి తన స్విచ్ కొనుక్కోబోతూ - అక్కడ వున్న నాలుగు రంగుల్లో - ఒకటి ఎరుపు, ఇంకొకటి నీలం, మరో రెండు బూడిద రంగువి వుండడం చూసి - వెనక్కి తిరిగి బుజ్జిజింకకేసి చూసి: "Which color do you like?" - అనడిగాడు.

బుజ్జిజింక "Grey" అని చెప్పాకే ఆ అబ్బాయి తనకి కావలిసిన ఎరుపు తీసుకున్నాడు - ఒకవేళ వీడు "Red" అని వుంటే అతను ఎరుపు తీసుకునేవాడు కాదు.

అది గమనించి బుజ్జిజింక ఎంతో పొగిడేశాడు ఆ అబ్బాయిని.
బుజ్జిజింకకి అదొక స్విచ్చిచ్చిన - మనస్విచ్చిచ్చిన - మరువరాని-ముచ్చట. 





3, మార్చి 2017, శుక్రవారం

ఒక టి నుంచి ప(ది)ల దాకా...

రోజులు ఒక వారగా వచ్చి వారమై  - వారాల నెలవు నెలై  - నెలల కూడిక ఏడాదై
ఏడుకొకయేడు తోడై - బడి రోజుల అమ్మాయి నుండి - బడికంపే అమ్మనయినా

ఆమని పచ్చని - ఎండ ఎరుపుని - తొలకరి మేఘపు సన్నటి మెరుపుని
శిశిరపు పసుపుని - శీతలపు తెలుపుని - చుక్కల వెలుగులో తళుకుమనే నలుపుని

పూటేదైనా - అది పూసుకున్న రంగేదైనా
వేళేదైనా - కలలదైనా - తలపోసుకున్న కలతదైనా

ఎదలో - ఏమూలనుంచో - ఎప్పుడూ పలకరించి - కలవరింపజేసి 
పెదవిపై  - చిట్టి బుడగలా పగిలి - పెగిలి పెగిలి - వరదలా వెలికివచ్చి

దో ...బూ... చీ - అని అలరించే ఆ పసితనపు గిలిగింత జాడ నాకింకా తోడే

ఆ తోడుందన్న ధీమాతోనే కాబోలు - అప్పుడప్పుడే కాదు - ఎప్పుడంటే అప్పుడు - బుజ్జిజింకల లోకంలోకి పరిగే...త్తుకుంటూ వెళ్లిపోతుంటా.

వెళ్లి ఊర్కుంటానా? -
చెట్టెక్కి ఊగే కొమ్మల వాలి - కింద తూగే ఊడల జారుతా
పోటెత్తే కడలి నురగల అలల వుయ్యాలలూగుతా
రెక్కల-పిట్టల విమానాల చంద్రుని చేరి వెన్నెల కోసుకొస్తా
వెలుగు పూసల దారుల సూర్యుని చిన్నెల పూసుకొస్తా
చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, రోజులు దాటిపోయాయని బెంగ పడనుగా
Green Eggs And Ham, Hop on  Pop, The Cat In The Hat - ఇలా ఇంకెన్నో వున్నాయిగా.

అదుగో ...అలా ...
Dr. Seuss పుస్తకాల ప్రేమలో పడి
కలల-దోనెలో వాలి
కథల-కబుర్ల-వాగులో అల్లి-బిల్లిగా వెళ్తున్న నాకు -
ఓ రెండు వారాలముందు ఏమనిపించిందంటే ...
ఈ Seuss గారు ఇన్ని మంచి పుస్తకాలు ఎన్నో పిల్లల కోసం రాశారు కదా -
ఇవన్నీ చదువుతున్న -  చదువుతూ మురిసిపోతున్న నేను  -
ఆయనంత బాగా కాకపోయినా -
కొంతైనా తెలుగులో రాయగలనా? - రాయనా? - రాసి చూడనా? - అని.

వెంటనే గబగబా నాకెంతో ఇష్టమైన అంకెల లెక్కలు మాటల్లో పెట్టి రాసేశాను -
ఒక-టి నుంచి ప-ది-ల దాకా...
ఒకటంటే ఒక 'టి'  నుంచి పది 'ది' ల దాకా.
రాసి ఊర్కున్నానా ?-
ఇంకా...  వెంటనే 'ఈమాట' వారికి పంపించాను.


ఈమాట వారు - మంచి మాటల వారు - మామంచివారు
ఇంకా...  ఇంకా...  వెంటనే వేసేసుకుంటామన్నారు
ఇంకా - పనిలోపనిగా - మీ ఈ అంకెల మాటలని పాట కట్టిద్దామమనుకుంటున్నాము - పోనీ మీరే పాడతారా? - అనడిగారు
నే రాసిన మాట - నేనే పాట కట్టటమా - ఇకంతకన్నా పసిడిమూట ఏముంటుంది నాకు ?!
అడిగిందే తడవు - మాటల్ని పాట-కాని-పాట కట్టేశా.
ఈమాట వారు మెచ్చేశారు - నా మాటని అచ్చేశారు - నా పాటని అక్కడే మాల గుచ్చేశారు. 


నా పాట-కాని-పాట చదివి వినాలంటే ఈమాట  మీద క్లిక్ చేయండి.
అక్కడ బోల్డన్ని కథలూ, కవితలూ, కబుర్లూ - గొప్ప గొప్ప రచయితలు రాసేవి బోల్డు వుంటాయి.
 వాటి పక్కనే - నా చిన్ని-చిన్ని మాటల అంకెల-పాటా వుంటుంది.

అక్కడకి - వెళ్లి పై బొమ్మలో కనిపిస్తోందే - Dr. Seuss గారి అందమైన బొమ్మతో నా కవిత ఒకటి నుంచి పదిల దాకా...

దానిమీద కూడా క్లిక్ చేశారనుకోండి -  చదివే టైమూ, వీలూ- మీకుంటే ఇప్పుడే చదవొచ్చు 
మీ కళ్లు బిజీ గా వున్నాయనుకోండి - హాయిగా వినేయొచ్చు - ఆ హాయి వినగలిగే వీలుకే!
వినడం మాత్రం - ఏ మాత్రం నా పూచీలేని - ఎట్ యువర్ ఓన్ రిస్కే!


26, ఆగస్టు 2016, శుక్రవారం

సెలవులకేం నెలవు దొరికిందో? అప్పుడే వెళ్లిపోయాయి!


బడికి వీడుకోలని సెలవులిక మొదలని 
వీడు యిక కాలు నిలవని సంబరాల నెలవని 
వాడుక మరవని పాటల - అల్లరి ఆటల కొలువని 
ఈ మురిపెం నిన్నా-మొన్నటిదిలా వుండగానే ... 
ఆ సెలవులకేం నెలవు దొరికిందో? అప్పుడే వెళ్లిపోయాయి!

ఇంతలోనే స్కూళ్ల నుంచి ఈ-మెయిళ్లు 
ఎక్కడ మీ కోయిలలు నెమళ్ళు అంటూ 
పుస్తకాలు కొనండి పెన్సిళ్లు చెక్కండి 
బేగ్గులు సర్దండి - బళ్లోకి పంపండి అంటూ 

ఇంకేం చేస్తాం... 
చుక్క పొడవగానే ఆమ్ పెట్టేశాం 
రాతిరిని తొందరగా రమ్మన్నాం 
నక్షత్రాలను రెప్పల మాటున దాచేసి 
చందమామల దుప్పటి కప్పి బజ్జోపెట్టేశాం 
వేగుచుక్క పొడిచీ పొడవకముందే 
అల్లిబిల్లి సరదా పాటల మేలుకొలిపి  
తెరిచీ తెరవని కన్నుల కాంతులు వెలిగించి  
విరిసీ విరియని లేతమొగ్గల బుగ్గలు తుడిచి 
కడుపారా పాలు పట్టి - కన్నారా రూపు పట్టి 
బడికి పంపాం - బావురుమన్నాం :(




రెండున్నర నెలల సెలవులు ఇట్టే అయిపోయాయి. 

ఈ ఏడాది ప్రత్యేకత - నిన్నామొన్నటి బుల్లి బుజ్జి-జింక ఆరవ తరగతికి మిడిల్ స్కూల్ కి వెళ్లడం. 

సిక్స్త్ గ్రేడ్ ఓరియెంటేషనూ , లాకర్ అసైన్మెంట్లు, PE యూనిఫార్ములూ - ఓ .... బోల్డంత హడావిడీ - ఇల్లంతా సందడి. 

ఈలోగా - వేసవి సెలవుల్లో కూడా చదువని కాలేజ్ లో వుండిపోయిన అన్న - సెలవుల చివరి వారానికి ఇంటికి రావడంతో  - ఆ సందడి - ఇబ్బడి ముబ్బడి. 

ఆ చివరి వారం సెలవు కూడా గడిచిపోయింది - చదువు పుస్తకంలో కొత్త పుట మొదలైంది. 




29, జులై 2016, శుక్రవారం

కలల కొనసాగింపుగా...కనులకింపుగా...

పదకొండేళ్ల క్రితం ... అప్పుడు ... 

ఇల్లు కొన్న మొదటి రోజులు 
ఇంట్లో - అమ్మా, నాన్నా, అన్న కాబోతున్న ఓ బుజ్జి-జింకా
ఆ ముగ్గురి కళ్లనిండా ఎదురు చూపుల దీపాలు 
అవి వెలిగించి పెట్టింది - ఇంకో నెలలో రాబోతున్న బుజ్జి-పాపడు 

ఇల్లంటే - ఆకూ కొమ్మా , వెన్నెల వెల్లా ...
ఇల్లంతా - అనుకున్నట్లే అంతా వెన్నెల వెల్లే

అన్నకి తమ్ముడు తోడు రాబోతున్నాడన్న సంబరం 
తమ్ముడొచ్చాక - ఆ ఆలనలో-పాలనలో - అలసి-సొలిసే అమ్మ ఆదమరపుగా వుందని అన్న దిగులు పడకూడదు కదా!
అందుకు నాన్న వేసిన కిటుకు ఏంటంటే - అన్నకి ఇష్టమయిన బొమ్మలతో ఓ రంగుల గది సృష్టించేయడం. 
అది ఎలా చేయడం? నాన్న దగ్గర - అమ్మని, అన్నని నవ్వించే -  బుజ్జిపాపడిని రాత్రంతా ఎత్తుకుని లాలించే - ప్రేమంత్ర దండం వుంది కానీ - "రంగేయరా-బొమ్మ గీయరా డింభకా!" అంటే చిటికెలో గోడల్ని చిత్ర-కుడ్యాలుగా మార్చే మాయల ఎల్ఫులు లేరే మరి ?!


అందుకని - అమ్మా-నాన్న కలిసి అక్కడ వెతికి-ఇక్కడ వెతికి మొత్తానికి రంగులు-బొమ్మలు వేయడం వచ్చిన ఒక అమ్మాయిని పట్టుకున్నారు.


ఆ అమ్మాయి వచ్చింది - అమ్మని, నాన్నని అడిగింది - "ఏం బొమ్మ వేయనూ?", అని.
అమ్మ-నాన్న కలిసికట్టుగా, కూడబలుకుగా "నేనెరుగ నేనెరుగ - మా జింకనడుగు " అన్నారు.


అన్న గంతులేసుకుంటూ చెప్పాడు - ఆటలాడుకునే స్నూపీ, వుడ్ స్టాక్ - బొమ్మలు కావాలని.
తెల్లగా వుండే స్నూపీ , ఎల్లోగా వుండే వుడ్ స్టాక్ - వెల్లవేసిన గోడలమీద - వెలవెలలాడతారు కదా! అందుకని నీలపు ఆకాశంలో ఆడుకుంటున్నట్టు కావాలన్నాడు.


అంతే! గోడలేమయ్యాయో మీరే చూడండి మరి!!!

NASCAR మంచాన్నే కారులా నడిపేయడానికి ముస్తాబయిన స్నూపీ







బంతి గురించి ఊహిస్తూ, బంతాడుతూ, బంతుల నడుమ - చీర్-లీడరైన వుడ్ స్టాక్






క్లోజెట్ కి అటూ ఇటూ నుంచుని హాకీ ఆడుతున్న స్నూపీ - వుడ్ స్టాక్






స్కేట్ బోర్ద్ మీద స్నేహితులు - బంతాడుతూ స్నూపీ




టెన్నిస్ ఆడుకుంటూ .... 





పదకొండేళ్ల తర్వాత... ఇప్పుడు

అన్న ఎదిగాడు - ఇంకా ఎదిగించే చదువుల బడికి వెళ్లాడు
పదకొండేళ్ల క్రితం కన్నుల వెలిగిన ఇంకొక దీపం - అన్నెడబాటుకి బెంగిలి చిన్న బుచ్చుకున్నాడు
మళ్లీ నాన్న మంత్రం వేయాల్సివచ్చింది
ఇంకేం - ఇంకొక రంగుల-బొమ్మల-కారిణిని పిలుచుకొచ్చారు

ఈసారి తమ్ముడి వంతు - బొమ్మల ఎంపిక
శలవులకి ఇంటికి వచ్చిన అన్న అయ్యాడు - తమ్ముడికి బొమ్మల-కన్సల్టెంట్ 
తమ్ముడు  కావాలన్నాడు - బుజ్జి కాల్విన్ చారల హాబ్స్ తోడుగా 
అన్న వేశాడు ఆమోదముద్ర - అంతకన్నా హుషారుగా 

మరి - వాళ్లిద్దరూ ఎన్నిసార్లు చదివారో లెక్కే లేదు - మూడు వాల్యూముల - ఒక్కొక్కటి ఐదేసి వందల పేజీల కాల్విన్ & హాబ్స్ అల్లరి కథలు 
ఇంట్లో ఒక - చిన్నదేమిటి - ఒక పెద్ద సైజు డిజైన్ సెషనే నడిచింది - ఆ పుస్తకాల్లోని ఏ బొమ్మలని గోడకెక్కిద్దామా అని 
మొత్తానికి బొమ్మల ఎంపిక పూర్తయింది 
ఈసారి మంచు రంగు గోడలమీద వేయిద్దామని అనుకున్నారు 

అదుగో...కాల్విన్ & హాబ్స్ - మా బుజ్జి-జింక కలలాంతఃపుర కుడ్యారోహులైన వైనం 

ఎడమ పక్క గోడ కింద మొదలుపెట్టి కుడి గోడ కిందుగా పూర్తయిన నాట్య విన్యాసం (from Book#3 - Pg.351) 




వేసవి కాలపు సరదాలలో కాలవ మీదుగా నడుస్తూ (from Book#1 - Pg. 144)




శిశిరపు రంగులలో హంగులు పోతూ (from Book#1 - Pg. 133)






వాక్-ఇన్ క్లోజెట్ లో - ఒకరికొకరుగా - సేదతీరుతూ 




చివరిగా - కొత్త ప్రారంభానికి ఎదురుచూస్తూ .... (from Book#3 - Pg. 481)

ఇది Bill Watterson వేసిన ఆఖరి కామిక్ స్ట్రిప్ - మా బుజ్జి-జింకలకి - ఇద్దరికీ అతి ఇష్టమైనది :) 



ఆటల పాటల అలిసి
చదువూ-సంధ్యల సొలిసే
బుజ్జి-జింకల కలలు నిండిన కళ్ళు తెరవగానే
ఆ కలల కొనసాగింపుగా - కనులకింపుగా వుండాలని 
కలల-గదులకి రంగుల-హంగుల ముస్తాబు చేసి ఇచ్చేశారు - అమ్మా-నాన్న...



8, మే 2016, ఆదివారం

బుజ్జిజింకలు తెచ్చే 365 అమ్మ-రోజులు

ఉత్తర అమెరికా అంతటా సందడీ - హడావిడీ. 
అంగడులన్నీ అమ్మలకిచ్చే బహుమతుల కోసం నింపుకున్న సరంజామా - సామగ్రీ 
అమ్మల రోజు వస్తోంది కదా - ఈ రోజు !!!
ప్రతీ ఏడాది మే నెలలో రెండవ ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారు అమెరికాలో.

మా పక్కనే వుండే టాడ్ ఇల్లు, ఎదురుగా వుండే రేండీ ఇల్లు - ఇరువైపుల - అంటే - భార్యా భర్తల ఇద్దరి తల్లిదండ్రుల రాకతో, తాత - అమ్మమ్మ / నాన్నమ్మలను చూసిన సంతోషంలో గంతులు వేసే పిల్లల సంబరంతో - బోల్డంత సందడి సందడి గా వుంటాయి. 

వీధిలో మిగిలిన ఇళ్ళ ముందు కూడా ఎప్పుడూ ఉండేవి కాక ఇంకో రెండో మూడో కార్లు ఎక్కువ పార్క్ చేసి వుంటాయి. 

స్వధర్మే నిధనం శ్రేయః - పరధర్మో భయావహః  - అన్నది నమ్మికో, ఇష్టం లేని వాటిని తప్పించుకోవడానికి వాడుకునే నెపమో - ఎప్పుడూ అలవాటు లేని, కాలేని మదర్స్ డే జరుపుకోలేదు. 

ఆఫీసు లో మెలిస్సా ప్రశ్న - లలితా! ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు మదర్స్ డే అని. 

ఇద్దరు అబ్బాయిల అమ్మనైన నేను - మేలో ఈ ఒక్కరోజేమేటి - ఏడాదిలో ప్రతి రోజూ సెలబ్రేట్ చేసుకుంటాను మదర్స్ డేని - అనేది నా ఉత్తరం. 

గత పదేళ్లుగా అదే తను అడుగుట - అదే  నేను చెప్పుట. 

సరే! నేను అనుకున్నా- అనుకోకపోయినా, జరుపుకున్నా- జరుపుకోకపోయినా, ప్రతీ ఏడాది తమ తమ అమ్మల కోసమని బుల్లి బుజ్జాయిలు బడిలో తమ చిట్టి చిట్టి చేతులతో చేసిన బొమ్మో, నాటిన మొక్కో, రాసిన కవితో తీసుకొచ్చి ఉరికే కాళ్ళతో వచ్చి అమ్మ చేతిలో పెట్టి అమ్మ మెప్పు కోసం మెరిసే కళ్ళతో, నవ్వే బుగ్గలతో అమ్మ మొహంలోకి ఆతృతగా చూస్తారు కదా - అందులో మా బుజ్జిజింక కూడా వుంటుంది. (నెలల పాపాయిలప్పట్నుంచీ అమ్మ, నాన్న ఎత్తుకుని కబుర్లు చెప్తుంటే జింక పిల్లల్లాగా కళ్ళు తిప్పుతూ ఊ ... కొట్టేవారని మా బుజ్జి బుజ్జాయిలని బుజ్జిజింకలని పిలవడం అలవాటు.)

అలాంటి ఒకానొక మదర్స్ డేకి - 
అమ్మ హోం వర్క్ కాగితాలు వెతుకుతుంటే దొరికింది 
బుజ్జిజింక తెచ్చిన అమ్మ - పొగడిక పత్రం
అందులో చదివిన మాట మాటకీ 
అమ్మకి కలిగిన ఉలికిపాటో - కలవరపాటో
ఇంకేదో - మరేదో - ఇదిగో ఇలా... 

"మున్నమ్మా! ఏంటమ్మా ఇది అమ్మ కోసం రాశావా" - ఆనందంగా, ఏం రాశాడో చూద్దామని  ఆతృతగా అమ్మ. 

"ఊ ...", నేస్తులతో ఆటలకి ఉరికే పరధ్యానంలో బుజ్జిజింక. 

"అప్పుడే రారులే - శ్యాము, అనీషు. గబగబా స్నాక్ తిని మనిద్దరం కలిసి చదువుదామా?" అమ్మ ఆత్రపు ప్రశ్న. 

"ఊ ... ఊ ... ", స్నాక్ నోట్లో వుంది కదా - అందుకే రెండు ఊ-లు - అంటే సరే అని. 

"అయితే - దా. నేను చదువుతాను, నువ్వు విను", సంబరంగా అమ్మ. 

"ఊ ... ఊ ... " - ఇంకో రెండు ఊ-లు. 

అమ్మ తెరిచింది కాగితం. ఒక పక్క  - గడ్డి పరకల్లాంటి జుట్టుతో వున్న అమ్మ,  పక్కనే బుజ్జిజింక వున్న బొమ్మకనిపించింది. 



బుంగమూతి పెట్టింది - పెన్సిల్ కి ఇష్టం లేనప్పుడు గీసినట్లున్న అమ్మతో-వున్న-బుజ్జిజింక బొమ్మ చూసి. 

"ఇదేంటమ్మా - అమ్మ జుట్టు ఇలా వుంది?" 


"ఊ ... ఊ ... ఉ ... ఉ... ఊ ... " - చిలిపి కన్నుల జాలువారిన నవ్వులతో వెలిగిన బుగ్గలతో "నేనే గీశా - బావుందా?", అనడం అది. 

ఆ వెలుగుకే ఎప్పటిలా కర్పూరమై కరిగి మురిసింది అమ్మ. 

"నువ్వు గీసిన నేను చాలా బావుంది." కుడి చేతి బొటనవేలు, చూపుడువేలు సున్నాలా చుట్టి బుగ్గన చిటిక వేసి గలగలా నవ్వింది. 

కింద వున్నది బుజ్జిజింక ఎలా పాడుతుందో అలాగే పాడుతూ చదవడం మొదలు పెట్టింది అమ్మ.

మై మామ్ రాక్స్! షి ఈజ్ ఆసం
"ఆసం అన్నావా మున్నమ్మా! యూ ఆర్ మై ఆసం సన్" - పట్టరాని సంబరం అమ్మ గొంతులో

వెన్ షి స్లాప్స్ మి, ఇట్ మేక్స్ మి సో హాపీ
అమ్మ తల ఎత్తి అడిగింది - "ఇదేంటి నాన్నా - నేను కొడితే సంతోషమా ?"

అమ్మ మాటలో తేడా ఏదో తెలిసిందేమో బుజ్జిజింక కన్నార్పక చూపు కలిపింది.

మొదటి నిట్టూర్పుతో అమ్మ ముందుకు చదివింది - ఇంకొన్ని నిట్టూర్పులు ముందు ముందు ఇంకేం ఉంటాయో అని దాచుకుంటూ. 

ఐ లవ్ డూయింగ్ థింగ్స్ విత్ హర్, ఎస్పెషల్లీ టాకింగ్
మళ్ళీ అమ్మ మాటలో హుషారు ...

షి ఈజ్ గుడ్ ఎట్ కుకింగ్
అమ్మకి అమృతం తాగినా కలగనంత తృప్తి... 
 

 షి రియల్లీ ఈజ్ ద బెస్ట్ 
 అమ్మకి  ఎలిజబెత్ రాణి కన్నా ఎత్తుగా కూర్చున్నట్టు అనిపించింది... 

ముందు పక్క చదవడం అయ్యింది కదా - కాగితం వెనక్కి తిప్పింది అమ్మ. 



"అయ్యో! ఇటు బొమ్మ లేదే! పోన్లే బుజ్జిజింకకి టైం సరిపోలేదా?!!" - సర్దేసుకుంది అమ్మ

మళ్ళీ బుజ్జిజింక పూరించిన ఖాళీల వెంట అమ్మ కళ్ళ పరుగులు...

 మై మామ్ ఆల్వేస్ సేస్ స్టాప్ ఇట్

 అర్రే! మళ్ళీ అమ్మ జోరు తగ్గింది...  - (రెండో నిట్టూర్పు)
 
మై మామ్ లుక్స్ ప్రెట్టీ వెన్ వి గో ఔట్
అయ్యో! ఇంట్లో బావుండనా ?! అంతేలే నాన్నా - ఇలా అనేస్తావా అమ్మను? -  (మూడో నిట్టూర్పు)

 బుజ్జి జింక కళ్ళలో తగ్గిన మెరుపు... అమ్మకేదో నచ్చట్లేదని... 

మై మామ్ లైక్స్ టు కుక్ నథింగ్ 

అరె! అమ్మ కంట్లో ఏంటది మెరిసింది - ముత్యమైతే కాదే - తెల్లగా లేదే - ఓహ్ - నీటి ముత్యమా! - (నాలుగో నిట్టూర్పు)

నవ్వబోతూ సాగబోయిన బుగ్గలు మొగ్గలల్లే ముడుచుకున్నాయి - బుజ్జాయికి.
  
మై మామ్ మేక్స్ మి లాఫ్ వెన్ షి మేక్స్ వియెర్డ్ ఫేసెస్
కంట మెరిసిన నీటి ముత్యం జారకుండా అమ్మ పూరించిన బుగ్గలు ఆపాయి... 
హమ్మయ్య! అమ్మ నవ్వింది - అనుకున్నాడు బుజ్జిజింక.

ఐ లవ్ మై మామ్ బికాజ్ షి ఈజ్ మై మామ్
అమ్మ సంతోషం శిఖరమే దాటింది - ఆనందం అంబరమే అయ్యింది 
నాలుగు నిట్టూర్పులూ మరచి నాలుగు దిక్కులా తనే అయినట్టు రెండు చేతులతో బుజ్జిజింకని పట్టేసుకుని ఎత్తేసుకుంది ... 

కానీ అమ్మకి ఏదో తెలియని ఉక్రోషం ... 
కన్నులు రెండూ నీటి ముత్యాల సరాలు పేర్చాయి ... 
బుజ్జిజింకకిప్పుడు తెలిసింది ఇంక - అమ్మకేదో ఆయ్ అయ్యిందని. 
కొంచెం కన్నా ఇంకొంచెం ఎక్కువే అర్థమయ్యింది - మందేదో తనే ఇవ్వాలని ... 

అమ్మ పక్క మెల్లగా చేరింది .... 

"అమ్మా ! మనిద్దరం ఒకటోసారి:రెండోసారి:నాలుగోసారి-ఆట  ఆడేటప్పుడు నేను మూడోసారి అనడిగితే ... చెప్పేది నేనా నువ్వా అని ... చెంప మీద కొడితే నేను నవ్వుతానే ... అందుకే వెన్ ఐ ప్లే దట్ గేమ్ విత్ యు, అండ్ వెన్ యు స్లాప్ మీ, ఇట్ మేక్స్ మీ హ్యాపీ" - మొదటి నిట్టూర్పు బుజ్జి బుగ్గ మీద ముద్దయ్యింది. 

"మరీ! నేను చాలా సార్లు అల్లరి చేస్తూ ఏడుస్తూ వుంటే - చాలా సేపు ఏమనకుండా ఊరుకుని - అప్పుడు స్టాప్ ఇట్ - అంటావు కదా! నేనేడవకపోతే నువ్వనవు కదా!! మరి నువ్వన్నప్పుడు అన్నావని రాయాలి కదా - అందుకే అలా ...." - రెండవ నిట్టూర్పు బుజ్జి కంటి మీద ముద్దు ముత్యమయింది. 

"నువ్వు ఇంట్లో కూడా బావుంటావు. కానీ మనం ఆంటీ వాళ్ళింటికో, పార్టీకో వెళ్తే మంచి షైనీ-షైనీ చీర కట్టుకుంటావు కదా - అది నాకిష్టం - అప్పుడెక్కువ బావుంటావని అలా రాశా" - మూడవ నిట్టూర్పు బుజ్జి అరచేతిలో ముద్దు ముద్ర వేసింది

"మరి యు కుక్ సో గుడ్ అండ్ యు ఆర్ ద బెస్ట్ కుక్ - కానీ మనం రెస్టొరాంట్ కి వెళ్తే నువ్వు మంచిగా చీర కట్టుకుని హాపీగా వస్తావు. అదే ఇంట్లో వంట చేస్తే యు లుక్ సో టయర్ద్ - నిజమే కదమ్మా !!! - నాల్గో నిట్టూర్పు అమ్మ పట్టరాని ప్రేమై బుజ్జి జింకని చుట్టేసింది. 

అమ్మ నవ్వు గోదావరిలా గలగలా - అమ్మ నవ్వు చూసి బుజ్జి జింక కిలకిలా!!!

అమ్మకి ఇప్పుడు మరింత నమ్మకం కుదిరింది - సంవత్సరానికి 365 అమ్మ-రోజులని ... అవి బుజ్జి జింకలు తెస్తాయని... 









9, నవంబర్ 2011, బుధవారం

కిరణ్ - బుజ్జి కోతి- టార్గెట్ ట్రిప్ కథ


(ఈ కథ కిరణ్ కి పదిహేను నెలల వయసు నుంచి వాడికి మూడేళ్ళు వచ్చేదాకా ప్రతీ వారం రోజు విడిచి రోజు చెప్పినది. ఇందులో వాడే హీరో :). టార్గెట్ ఆ రోజుల్లో కిరణ్ కి ఇష్టమైన స్టోర్. ఇంకా వాడికి ఎల్లో కార్ ఇష్టం, వాక్యూం క్లీనర్ ఇష్టం. కిరణ్ ఆమ్ తినాలంటే అమ్మ ఇల్లు వాక్యూం చేస్తే సరి - అది చూస్తూ గబగబా తినేసేవాడు - మన ఇల్లు వాక్యూం చేస్తున్నామా, వేరే వాళ్ళ ఇల్లా అనే పట్టింపు లేదు :) ఫ్రెండ్స్ ఎవరి ఇంటికి వెళ్ళినా కిరణ్ ఆమ్-టైం కి నాకొక వాక్యూం క్లీనర్ ఇచ్చేసేవాళ్ళు :)   కిరణ్ ఇందులో బుజ్జికోతికి చేసినవన్నీ వాళ్ళ అమ్మని (అమ్మకోతిని కాదండోయ్) చూసి నేర్చుకున్నవి  :)) )


అనగనగా బాల్ల్విన్ అనే ఊళ్ళో అమ్మ, నాన్నగారు, అన్న, కిరణ్ వుంటారు. 
ఒక రోజు అన్న స్కూల్ కి, నాన్నగారు ఆఫీసు కి వెళ్ళారు. అమ్మ ఆం వండుతోంది. 
కిరణ్ గరాజ్ లో బాల్ తో ఆడుకుంటూ వున్నాడు.
పక్క ఇంట్లో అమ్మకోతి, ఒక బుజ్జికోతి వున్నాయి.
అమ్మకోతి గరాజ్ లో ఆడుకుంటున్న కిరణ్ దగ్గరికి వచ్చి " కిరణ్! కిరణ్! మా బుజ్జికోతికి బోర్ కొట్టి ఏడుస్తోంది. ఒకసారి నువ్వు టార్గెట్ కి టాటా తీసుకెళ్తావా, ప్లీజ్?" అని అడిగింది.

మరి ఏదైనా చేయాలంటే ముందు కిరణ్  అమ్మకి చెప్పాలి కదా! 
అందుకని  కిరణ్ "వుండు. మా అమ్మ ని అడిగి వస్తాను" అని అమ్మకోతికి చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు.
అమ్మ కిరణ్ ని చూసి "ఏంటి కిరణ్ నాన్నా? ఏం కావాలి" అని అడిగింది.
అప్పుడు కిరణ్ బుజ్జికోతిని టాటా తీసుకెళ్ళాలి అని చెప్పాడు.
అమ్మ అప్పుడు "సరే కిరణ్ నాన్నా! నీ ఎల్లో కార్ లో జాగ్రత్తగా వెళ్లి రా" అని చెప్పింది.
కిరణ్ అప్పుడు ఎల్లో కార్ కీస్, తన కళ్ళకి గ్లాసెస్, వాలెట్  తీసుకుని గరాజ్ లోకి వచ్చాడు.

బుజ్జికోతిని వాళ్ళ అమ్మకోతి ఎల్లో కార్ లో బేబీ సీట్ లో కూర్చోబెట్టింది.
అప్పుడు కిరణ్ బుజ్జికోతికి సీట్ బెల్ట్ పెట్టి, ఎల్లో కార్ స్టార్ట్ చేసి నెమ్మదిగా రివర్స్ చేసి, గరాజ్ వేసేసి, కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుని  "జుయ్, జుయ్" అని ఫాస్ట్ గా మాంచెస్టర్ రోడ్ మీద వుంటుందే.....ఆ టార్గెట్ కి వెళ్ళాడు.
అక్కడ దిగగానే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి, సీట్ బెల్ట్ తీసి బుజ్జికోతిని టార్గెట్ షాపింగ్ కార్ట్ లో ఎక్కించి,  మరి బెల్ట్ పెట్టకపోతే బుజ్జికోతి కార్ట్ లోంచి జారిపడిపోతుంది కదా అందుకని  - బుజ్జికోతికి   ఆ కార్ట్ కి వున్న బెల్ట్ పెట్టి , టార్గెట్ లోకి తీసుకుని వెళ్ళాడు. 
చెప్పడం మర్చిపోయాను - టార్గెట్ లోకి వెళ్లబోయేముందు కిరణ్ గ్లాస్సెస్ తీసేశాడు - లేకపోతే అన్నీ డార్క్, డార్క్ గా కనిపిస్తాయి కదా - అందుకని.

టార్గెట్ లోకి వెళ్ళగానే బుజ్జికోతి చాకొలేట్ కావాలీ..ఈ..ఈ.. అని ఏడ్చింది. 
కిరణ్ అప్పుడు "హుష్, బుజ్జుకోతీ! అలా గట్టిగా ఏడవకూడదు." అని బుజ్జికోతి చెవిలో నె...మ్మదిగా చెప్పి ఒక చాకొలేట్ తీసి బుజ్జికోతికి పట్టుకోమని ఇచ్చాడు - మరి మనం బిల్ పే  చేసేవరకూ తినకూడదు కదా.
కిరణ్ టార్గెట్ లో ఒక రెడ్ లాన్ మోవర్ కిరణ్ కి, ఒక బ్లాక్  లాన్ మోవర్ బుజ్జికోతికి కొన్నాడు. 
మళ్ళీ ఒక ఎల్లో వాక్యూం క్లీనర్ కూడా కొన్నాడు. ఎందుకంటే కిరణ్ కి  లాన్ మోవర్, వాక్యూం క్లీనర్ ఇష్టం కదా అందుకని. 
అన్నీ షాపింగ్ కార్ట్ లో పెట్టుకున్నాడు.
ఇంతలో బుజ్జికోతి మళ్ళీ ఊఊ...ఊఊ... అని ఏడవడం మొదలుపెట్టింది - దానికి ఒక ఎల్లో కార్ బొమ్మ కావాలని. 
మళ్ళీ కిరణ్ ఏం చేస్తాడు పాపం! బుజ్జికోతి చెవిలో  "బుజ్జికోతీ! అలా ఏడవకూడదు" అని చెప్పి ఒక ఎల్లో కార్ బొమ్మ బుజ్జికోతికి ఇచ్చి పట్టుకోమన్నాడు.

అలా కావలసినవి అన్నీ తీసుకుని కౌంటర్ దగ్గర అమ్మాయికి వాలెట్ లోంచి డెబిట్ కార్డు తీసి బిల్ పే  చేసేసి, కిరణ్  మళ్ళీ రెడ్ లాన్ మోవర్, బ్లాక్  లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్, ఎల్లో కార్ బొమ్మ - అన్నీ షాపింగ్ కార్ట్ లో పెట్టుకుని, చాకొలేట్ ఓపెన్ చేసి బుజ్జికోతికి ఇచ్చి, మళ్ళీ ఎల్లో కార్ దగ్గరికి వచ్చాడు. 

వచ్చి ఎల్లో కార్ ట్రంక్ తెరిచి రెడ్ లాన్ మోవర్, బ్లాక్  లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్, ఎల్లో కార్ బొమ్మ - అన్నీ ట్రంక్ లో పెట్టుకుని ట్రంక్ క్లోస్ చేసేశాడు. 
బుజ్జికోతిని కార్ సీట్ లో కూర్చోబెట్టి , మళ్ళీ బెల్ట్ పెట్టి, కిరణ్ కూడా కార్ లో ఎక్కి గ్లాస్సెస్ పెట్టుకుని "జుయ్, జుయ్" అని ఫాస్ట్ గా ఇంటికి వచ్చేశాడు. 

ఇంటికి వచ్చి బుజ్జికోతిని, బ్లాక్  లాన్ మోవర్ ని, ఎల్లో కార్ బొమ్మ ని అమ్మకోతి దగ్గర దింపేసి రెడ్ లాన్ మోవర్, ఎల్లో వాక్యూం క్లీనర్ ని తీసుకుని అమ్మ దగ్గరికి వచ్చేసి, ఇచ్చేసి,  పప్పు-ఆమ్, పెరుగు-ఆమ్ తినేసి హా....యిగా బజ్జున్నాడు. 

7, ఏప్రిల్ 2011, గురువారం

నాకు కోపం పోతోంది... :)

మా సుహాస్ సెయింట్ లూయిస్ "మన బడి" లో నాలుగో సంవత్సరం - ప్రభాసంలో తెలుగు చదువుతున్నాడు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు కొంచెం తికమక పడతాడు :) 


ఒకసారి ప్రభాసం తరగతి గదిలో మాస్టారు "I lost my temper" అంటే "నాకు కోపం వస్తోంది" అని అర్థం చెప్పారట. వెంటనే మా బుజ్జి సుహాస్ కి సందేహం వచ్చేసింది. మాస్టారుని ఇలా అడిగాడట - అంకుల్! "losing" అంటే పోవడం కదా అందుకని "నాకు కోపం పోతోంది" అనాలి కదా అని :)) 


కోపమేమో గాని నేనే అక్కడ టీచర్ ని అయుంటే నేను తరగతి గది బయటికి "పోయి" వుండేదాన్ని. ఆ తెలుగు చెప్పే ఆయన మంచివారు కాబట్టి సందర్భానుసారంగా సుహాస్ కి బదులిచ్చారు.


ఇంక మాబుల్లి తెలుగు పండితుడు ఇంటికి రాగానే కిరణ్ ఏదో అల్లరి చేస్తుంటే - తమ్ముడూ! అలా చేయకు. నాకు కోపం పోతోంది - అని అల్లరిగా నవ్వాడు. అదేంట్రా అని అడిగిన మాకు (అమ్మా, నాన్నగార్లకి) తెలుగు తరగతి గదిలో జరిగిన సంభాషణ గురించి చెప్పాడు.

4, ఏప్రిల్ 2011, సోమవారం

శ్రీ ఖర నామ ఉగాది - పొద్దున్న పులిహోరు, సాయంత్రం సాంబారు - గులాబ్ జామూన్ గుర్!

శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు ....


మాకు ఈఉగాదికి వేపపూత దొరకలేదు. పోన్లే కొంచెం సర్దుకుందాం అనిచెప్పి కాకరకాయ పైచెక్కుతో ఉగాది పచ్చడి చేసుకుని వేపపూతని ఊహించుకుంటూ ఉగాది పండగ చేసుకుందామూ అనుకుంటే ఎందుకో అంత బాగా అనిపించక కలిపిన పచ్చడి అలాగే ఉంచేశాను. ఇంతలో సోమవారం కదా - మా బుజ్జికిరణ్ స్కూల్ కి వెళ్దామని ఏడింటికి లేచి వచ్చాడు. సుహాస్ కిరణ్ కి గుర్తు చేసాడు - తమ్ముడూ! ఇవాళ తలస్నానం చేయాలి -అల్లరి చేయకుండా అని. కిరణ్ దానికి ఏదో "కుహు - కుహు" అంటున్నాడు (అంటే బుజ్జి పక్షిలా తల అడ్డంగా తిప్పి చేయను అన్నాడు కానీ - మళ్ళీ అన్న చెప్పాడని బుద్ధిగా తలంటు పోయించుకున్నాడు). రోజూలాగే వాడి లంచ్ క్యాలెండర్ చూస్తున్నాను - ఏంటా ఇవాళ స్కూల్ లో లంచ్ కి అని. అందులో చీస్ రావియోలి అని వుంది. పోన్లే కాఫెటేరియా కి ఏమీ నోట్ పంపించక్కర్లేదు అనుకుంటూ వున్నాను (లంచ్ క్యాలెండర్ లో బీఫ్, పోర్క్ ఐటమ్స్ వుంటే స్కూల్  కాఫెటేరియా కి నోట్ పంపిస్తాను-వేరే ఐటం పెట్టమని కిరణ్ కి ). 


ఈలోగా కిరణ్ ఇవాళ - ఇండియా లో న్యూ ఇయర్ అని చెప్పావు. నాకు లంచ్ కి పులిహోరు (వాడి భాషలో పులిహార) కావాలీ..ఈ..ఈ.. అన్నాడు. వాడు ఇంకా ఎన్ని ఈ..ఈ..లు కలుపుతాడో దానికి అని గబగబా "పులిహోరు" చేసి బాక్స్ లో పెట్టాను. నిన్న రాత్రి (ఆదివారం) వాడికి ఆమ్ తినిపిస్తూ వుంటే అడిగాడు - సాంబారు ఎప్పుడు చేస్తావు అని. అలవాటుగా "రేపు డిన్నర్ కి " అనేశాను. వెంటనే కిరణ్ ఇవాల్టి  మెన్యూ ఇలా చెప్పాడు -అదీ- అలా పుట్టింది - "పొద్దున్న పులిహోరు-సాయంత్రం సాంబారు" అనే టైటిల్ :)) 


ఆగండాగండి - అమ్మయ్య మీ కొత్త సినిమాకి టైటిల్ దొరికిందని అప్పుడే సంబరపడి పోకండి -అక్కడితో కథ అయిపోలేదు - మా కాపీ రైటెడ్ టైటిల్ ఇంకొంచెం పెద్దది. మా మున్ను సుహాస్ కి గులాబ్ జామూన్ చాలా ఇష్టం. నేను ఉగాది కోసం మామిడికాయ, కొబ్బరికాయ లాంటి పచ్చడి సామాగ్రి కొనడానికి వెళ్తుంటే కనీసం నాలుగుసార్లు గుర్తుచేశాడు - గులాబ్ జామూన్ ప్యాకెట్ తెమ్మని. ఓ..అలాగే అని ఆ నాలుగుసార్లూ తలవూపి మాంచెస్టర్ రోడ్ మీద వున్న కొత్త ఇండియన్ స్టోర్ - హర్ష గ్రోసరీస్ లోకో వెళ్లి కూడా తేవడం మర్చిపోయాను. అయ్యో అనుకునేలోగా దార్లో "జబీహా గ్రోసరీస్" లో అదృష్టవశాత్తూ గిట్స్ గులాబ్ జామూన్ పాకెట్స్ దొరికాయి. పాపం! ఇంటికి రాగానే చేయమని అడిగినా పండగకి చేస్తాననగానే ఊరుకున్నాడు. సుహాస్ కి చెప్పాను - రేపు (సోమవారం) స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి ఉంచుతానని. ఇవాళ... అదే... ఉగాది రోజు మధ్యాన్నం నాలుగున్నరకి ఆఫీసు వర్క్ అయిపోగానే - సుహాస్ ఆరింటికి వచ్చేలోగా తొందరగా చేసేయాలని - చాలా శ్రద్ధగా ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ మీద నమ్మకం లేక నా ఫ్రెండ్ విజయకి ఫోన్ చేసి, విసిగించి ;) గులాబ్ జామూన్ పర్ఫెక్ట్ గా రావాలని మ్రొక్కుకుని జాగ్రత్తగానే చేసాను - ఎప్పుడు సుహాస్ వస్తాడా అను ఎదురుచూస్తూ వుంటే వాలీ బాల్ అయిపోగానే వచ్చాడా- ఆశగా ఒక రెండు జామూనులు బౌల్ లో వేసుకుని తిని - "ప్చ్" అని పెదవి విరిచి స్నానం కి వెళ్ళిపోయాడు.  స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చేసి వుంచుతానంటే - వాడు వచ్చే టైం కి అప్పుడే వేడిగా చేస్తూ వుంటాననుకున్నాడట :( కుంచెం కమ్యూనికేషన్ గ్యాప్ :( ఏం చేస్తాం...రేపు మళ్ళీ చేసి పెడదామనుకున్నాను. వాడికి చెప్పలేదు. హుష్! మీరూ చెప్పకండేం!!? 


అదండీ - అలా ఒక కొత్త టైటిల్ సినిమా కోసం కాపీ రైట్  చేసి పెట్టాను - "పొద్దున్న పులిహోరు, సాయంత్రం సాంబారు - గులాబ్ జామూన్ గుర్!" అని. మీకెవరికన్నా సినిమా తీయాలని వుంటే చెప్పండి.



పేరులో  "ఖరం" వున్నా ఈ  ఖర నామ సంవత్సరం మీ అందరికీ -
శ్రీకరం
శుభకరం
శ్రేయస్కరం -
కావాలని శుభాకాంక్షలు తెలుపుతూ....



~లలిత 

31, మార్చి 2011, గురువారం

కిరణ్ - బుల్లిచీమ కథ

(ఇది కిరణ్ కోసం వాడే హీరోగా అల్లిన కథ....)


అనగనగా బాల్విన్ అనే వూళ్ళో అమ్మ, నాన్నగారు, అన్న, కిరణ్ వుంటారు. ఒకరోజు నాన్నగారు ఆఫీసుకి వెళ్ళారు. అన్న స్కూల్ కి వెళ్ళాడు. ఇంట్లో అమ్మ, కిరణ్ వున్నారు.


అమ్మ, కిరణ్ ఇంట్లో వుంటే ఏం చేస్తారు? వాక్యూం చేస్తారు. 


(కిరణ్ కి చిన్నప్పుడు వాక్యూం క్లీనర్ అంటే చాలా ఇష్టం. ఎవరి ఇంటికి వెళ్ళినా వాడి చేత అల్లరి చేయకుండా ఆమ్ తినిపించాలంటే వాళ్ళింట్లో నేను వాక్యూం చేస్తే చాలు - వాళ్ళ ఇల్లు శుభ్రం - బుజ్జి కిరణ్ ప్లేటు శుభ్రం :) )


అలా అమ్మ, కిరణ్ వాక్యూం చేసాక బోల్డంత డస్ట్  వస్తుంది కదా - వాక్యూం క్లీనర్లో మరి - అందుకని అమ్మ ఆ డస్ట్ అంతా ఒక ట్రాష్ బాగ్లో వేసి గరాజ్ లో ట్రాష్ కేన్ లో పడేయడానికి వెళ్తుంది. వెళ్తూ కిరణ్ కి - కిరణ్ నాన్నా! నువ్వు ఫ్రిజ్ దగ్గర కూర్చుని "Q says ka" ఆడుకుంటూ ఉండూ అని చెప్పి వెళ్తుంది. (ఫ్రిజ్ మీద Leap-Frog వాళ్ళ English Alphabet sounds నేర్పే  గేమ్  వుంటుంది మరి.)


బుజ్జి కిరణ్ అమ్మ చెప్పినట్టే ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో అటు ఒక బుల్లి చీమ టుయ్-టుయ్ అని బుజ్జి కిరణ్ దగ్గరికి వస్తుంది. దాన్ని చూసి కిరణ్ "హాయ్" చెబ్దామని చేయి ఎత్తుతాడు. అది చూసి ఆ బుల్లి చీమ కిరణ్ కొడ్తాడేమో అని భయపడి "వూవూ...వూవూ" అని ఏడుస్తుంది. అది విని బుల్లి చీమకి అమ్మచీమ వుంటుంది కదా! - ఆ అమ్మచీమ పరిగెత్తుకుంటూ వచ్చేసి కిరణ్ బుగ్గమీద ఎక్కేసి కుట్టేసింది. పాపం! బుజ్జికిరణ్ కి ఆయి అయ్యి (నొప్పి వచ్చి) "అమ్మా ఆ... ఆ...ఆ... ఆ..." అని గాఠిగా ఏడ్చాడు. 


మరి కిరణ్ వాళ్ళ అమ్మ గరాజ్ లో వుంది కదా- కిరణ్ ఏడుపు విని - ఏమయిందబ్బా మా బుజ్జి కిరణ్ కీ - అనుకుంటూ ప్పరిగేత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది. వచ్చి "ఏమైంది కిరణ్ నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగింది. అప్పుడు కిరణ్ - మామా! నన్ను చీమ కుట్టిందీ..ఈ ఈ - అని ఏడుస్తూ చెప్పాడు. అది విని అమ్మ అమ్మచీమని - హన్నా అమ్మచీమా! మా కిరణ్ ని ఎందుకు కుట్టావు? అని అడిగింది. 


అప్పుడు అమ్మచీమ - మరి మా బుల్లి చీమని కొట్టాడు కదా అందుకని - అని చెప్పింది. వెంటనే అమ్మ కిరణ్ ని అడిగింది - ఏమ్మా కిరణ్! బుల్లి చీమని కొట్టావా? తప్పు కదూ - అని. కిరణ్ అమ్మ అలా అనగానే - లేదమ్మా...నేను బుల్లి చీమ ని కొట్టలేదు. హాయ్ చెబ్దామని చెయ్యి ఊపాను. అది ఎందుకో ఏడ్చింది - అని చెప్పాడు. అది వినగానే అమ్మచీమ తన బుల్లి చీమని నిజమేనా అని అడిగింది. బుల్లిచీమ మెల్లగా అవునని తలూపింది. అప్పుడు అమ్మ బుల్లిచీమకి sorry చెప్పింది - మరి కిరణ్ కి భయపడింది కదా - మనం ఎవరినీ fun కి కూడా భయపెట్టకూడదు  కదా - అందుకని. కిరణ్ కూడా బుల్లిచీమకి, అమ్మచీమకి "చావీ" చెప్పాడు.


వెంటనే అమ్మచీమ కిరణ్ దగ్గరికి వచ్చి "చావీ! Big Hug!!!" అంది. (చావీ = Sorry in Kiran :) - when telling Kiran stories, I usually speak Kiran ;))


అప్పుడు అమ్మ-బుల్లిచీమ, కిరణ్-బుల్లిచీమ, అమ్మ-పెద్దచీమ - అన్నీ చావీలు చెప్పుకుని Big Hugs ఇచ్చుకుని హాప్పీగా ఆడుకున్నాయి.