29, ఏప్రిల్ 2017, శనివారం

ఎక్కడికో చెప్పుకో - సర్‌ప్రైజెస్కో...

దాదాపు మూడు నెలల కిందట - శీతాకాలపు సెలవులకి అన్నజింక ఇంటికి రావడం - తిరిగి వెళ్లడం మధ్య కాలం ఏ కబుర్లలో జారిపోయిందో.

అన్నగాణ్ణి ఫ్లయిట్ ఎక్కించిన తర్వాత ఇంట్లో ముగ్గురమున్నా - మా ఒకరొకరికీ దగ్గరలేని వాడొక్కడి ధ్యాసే.

చుట్టూ పేరుకున్న- నిశ్శబ్దపు శీతాకాలపు  చిక్కటి నల్లటి సాయంత్రాలు - దిగులుగా గుబులుగా,  మామూలుకన్నా పొడుగ్గా -  అసలు గడుస్తాయా, సూరీడుకి దారిస్తాయా, వెచ్చబడనిస్తాయా అనిపిస్తూ - చలి ఇంకా తగ్గని జనవరి-సంజలు.

అప్పుడోరోజు - అనుకోకుండా వెచ్చబడిన రోజది. బదరి, నేను వాకింగ్‌కి వెళ్లాం కొంచెం ఒంటికి ఎండ పూసుకుని వద్దామని.

"అన్నగాడు వెళ్లాడు కదా - మళ్లీ స్ప్రింగ్‌బ్రేక్‌కే కదా రావడం?" - అనుకుంటున్నానో, పైకే అంటున్నానో.

"ఇంకెంత రెణ్ణెళ్లు - అంతే!" - తనకి తానే అనుకుంటూనే  నాకిచ్చిన బదులు.

"రెణ్ణెల్లే - కానీ - వుండేది వారమే కదా - మళ్లీ వెళ్లిపోతాడు కదా" - పైకనకపోయినా మనసులో పెట్టేసుకున్నా రోజుల్లెక్క.

పక్కనుంచి సన్నగా వినీ వినిపించకుండా అన్నది సరిగానే విన్నానా అన్ననుమానం వచ్చి - ఒక్కసారి దారిపక్క ఆగి " ఏంటన్నారు ? మళ్లీ చెప్పండి" అనగానే - ఈసారి ఇంతకుముందుకన్నా కొంచెం గట్టిగా "మనమే వెళ్తే బావుంటుందా పోనీ ?!" - చిరునవ్వు చాటునుంచి మురిపించే మాటలు ముత్యాల్లా రాలాయి.

"అదెలా - ఎలా వెళ్తాం? ఎప్పుడు వెళ్తాం ?" - హడావిడిగా దొర్లాయి నా నోటి పలుకులు.

"అన్నగాడి పుట్టినరోజుకి - ఫ్లయిట్లు, హోటళ్లు అన్నీ బుక్‌డ్. ఏప్రిల్‌లో ఓ నాల్గు రోజులు సెలవు పెట్టేయ్" - ఇంక పట్టలేని సందడి మనసులో, మాటలో.

ఇంకా తర్వాత నడక ఎలా సాగిందో చెప్పాలంటే  - పాదాలక్కూడా చెవులొచ్చి మా మాటలు వింటూ మేఘాలలో తేల్తున్నాయో అన్నట్టు అడుగులేశాయా అనిపించేట్టు.

"కానీ... ఈ విషయం అన్నగాడికి చెప్పొద్దు - వాడికి సర్‌ప్రైజ్ - ఈ ట్రిప్పు, దాంతోపాటు వాడు కావాలనుకుంటున్న కొత్త సోనీ కామెరా కూడా. అలాగే తమ్ముడికీ చెప్పొద్దు - మనం ఫ్లైట్ ఎక్కేదాకా" - చెప్పిన మాటకి బుద్ధిగా తలూపేశాను.

ఇంటికొచ్చేవరకూ ఆ మాటలే మాట్లాడుకుంటూ - ఆ తర్వాత ఇద్దరం గప్‌చుప్.

మార్చొచ్చింది - వాతావరణంలో మార్పొచ్చింది.
స్ప్రింగ్‌బ్రేకొచ్చింది - అన్ననొక వారం ఇంటికి తెచ్చింది.
మళ్లీ ఇల్లంతటా ఎలుగు - కళ్లంతటా వెలుగు

అన్నగాడు వున్న వారంలో ఒకరోజు "కొత్త కెమెరాలేమోచ్చాయో చూసొద్దాం రా " అంటూ బెస్ట్‌బై-కి కిటికీ-బేరానికి వెళ్లొచ్చాము - మరి వాడికే మోడలిష్టమో కనిపెట్టాలికదా!

వారం గిర్రున తిరిగింది - spring-break has sprung away.

ఏప్రిల్ మొదటివారం తమ్ముడి MAP schedule తెలిసింది - మూడోవారంలో లెక్కల పరీక్ష అని. మరి మా ప్రయాణం అప్పుడే.

వెంటనే లెక్కల-టీచర్ మిస్. ఫ్రామ్ కి ఈ-మెయిల్ ఇచ్చాను - ఒకసారి మీతో మాట్లాడాలని.

సోమవారం పొద్దున్నే తొమ్మిదింటికి టీచర్ నుంచి ఫోను - ఏంటీ సంగతీ - అని.

"మా ఇంట అన్నగాడి పుట్టినరోజు - కానీ వాడి కాలేజ్ జరుగుతూ వుండడం వల్ల - వాడికి ఇంట్లో వుండడం కుదరదు కాబట్టి - మేమే వాడి దగ్గరికి - వాడి పుట్టినరోజుని దగ్గరుండి జరిపిద్దామని వెళ్తున్నాము - మీరేమనుకోకుండా మా బుజ్జిజింకకి వచ్చాక వాడు మిస్ అవబోయే MAP లెక్కల పరీక్ష మళ్లీ పెడతారు కదూ - అన్నట్టు మీతో ఇలా మాట్లాడానని మా బుజ్జిజింకకి చెప్పకండి - మేము ఊరెళ్తున్నటు వాడికి కూడా తెలియదు -తెలియకూడదు" అని చెప్తూ - చివర్లో "సర్‌ప్రైజ్!!" అని గుసగుసలాడా.

చివరి గుసగుసల-గసగసకి మురిసిపోయి మిస్. ఫ్రామ్ కూడా మా సర్‌ప్రైజ్‌ని praiseworthy అని తెగ praise చేసేసింది. ఆవిడకి చెప్పాను - వాడిని ఎప్పట్లాగే ఏప్రిల్ 21న స్కూలుకి పంపించినా పదకొండింటికల్లా ఇంటికి తీసుకొచ్చేస్తామని - మధ్యాహ్నపు ప్రయాణానికి తయారవ్వాలి కదా మరి!

ఆరోజు సాయంత్రం - ఎందుకైనా మంచిదని - బుజ్జిజింకకి చెప్పాను "నాన్నగాడు! నిన్ను 21న పదకొండింటికి స్కూల్ నుంచి బయటికి తేవాలి - నాన్నగారు, నువ్వు, నేను వెళ్లి అన్నకేమన్నా గిఫ్ట్ కొని పంపిద్దామని అనుకుంటున్నాము" అని - మరి మళ్లీ వాడు ముందు చెప్పకుండా అప్పటికప్పుడు స్కూల్లో మీ అమ్మా-నాన్న నిన్ను తీసుకెళ్లడానికొచ్చారు అని చెప్తే - పాపం - కంగారు పడకూడదు కదా!

వెంటనే వాడు - కుదరదంటే కుదరదన్నాడు - కావాలంటే మీరిద్దరు వెళ్లండి - నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చి మీరొచ్చేదాకా హోంవర్క్ చేసుకుంటానన్నాడు.

వాడికొక హింట్ ఇచ్చాను కదా అని ఇంకెక్కువ వాదించలేదు - మళ్లీ ఆ మాటల్లో ప్రయాణం గురించి పొరపాట్న చెప్పేస్తానేమోనని.

ఏప్రిల్ 21 వ తారీఖున ప్రయాణం - బుజ్జిజింకకి తెలియకూడదని ఆరోజు పొద్దున్న వాడు స్కూలుకి వెళ్లేదాకా సూట్‌కేస్ సర్దలేదు.

తీరా వాడు స్కూల్‌కి వెళ్లాక - ఏడింటి నుంచి ఓ నాలుగు గంటలు నా ఆఫీస్ వర్క్ వుండి - పదకొండింటికి లాగ్ఆఫ్ చేశాక - గబగబా చేతికి అందిన బట్టలు సర్దేశాను.

ఈలోగా బదరి వెళ్లి బుజ్జిజింకని స్కూల్ నుంచి తీసుకొచ్చారు - రావడం బోల్డంత కోపంగా వచ్చాడు - కానీ సర్దివున్న సూట్‌కేస్ చూడగానే - ఒక చిన్ననవ్వు మొహంలో - వాడికి తెలిసిపోయింది ఎక్కడికో వెళ్తున్నామని - అదింకెక్కడికో కాదు అన్న దగ్గరికి అని.

హమ్మయ్య! మా పాపడి కోపాలయ్యె మురిపాలు - అమ్మకవె సమ్మతాలు. 

Alaska Airlines లో పోర్ట్‌లాండ్ దాకా ఒక ఫ్లైట్ - అక్కడినుంచి ఇంకోదాంట్లో - ఇంకో గంటలో శాన్‌ఫ్రాన్సిస్కోలో దిగి - ఎయిర్‌పోర్ట్‌లోనుంచి బయటికి వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అయింది.

రెంటల్ కార్ తీసుకుని - హోటల్‌కి వెళ్లేముందు అన్నని కలిసి - కనిపించి - సర్‌ప్రైజ్ చేద్దామని అనుకున్నాము.

అప్పటికే ఫోన్లో వాడివి మిస్డ్‌కాల్స్, మెసేజెస్ వున్నాయి - "అమ్మా! మీరందరూ ఇంట్లో లేరా? ఎక్కడున్నారు?" అంటూ.

చెప్పకుండా వెళ్తే -
అసలే శుక్రవారపు-సాయంత్రం -
ఆ రోజు ఎక్కడున్నా మేమందరం పఠించేది - ఆటవిడుపు మంత్రం -
వాడెక్కడికైనా వెళ్తే మాకే సర్‌ప్రైజ్ అవుతుందని ఫోన్ చేశాను.

"హలో నాన్నా ! ఎక్కడున్నావ్?"

"ఇంట్లోనే అమ్మా - కానీ ఇంకో గంటలో బయటికి వెళ్తాను ఫ్రెండ్స్‌తో"

"అయితే - ఇంట్లోనే వుండు - ఓ నలభై నిముషాల్లో కాల్ చేస్తాను"

"ఇంట్లో వుండడం ఎందుకమ్మా - నువ్వు ఫోన్ చేయడానికి?" - గొంతులో చిన్న కంగారు.

"నీతో మాట్లాడాలి - ఇంట్లోనే వుండు" - వాడి దగ్గరికి వెళ్లేదాకా మేము శాన్‌ఫ్రాన్సిస్కోకి వచ్చాము అన్నది దాచాలని - ఎక్కువ మాట్లాడితే బయట పడిపోతానని - సాధ్యమైనంత తక్కువగా మాట్లాడి వాడు మేము వెళ్లే దాకా రూమ్ లో ఉండేలా చేయాలని నా ఆరాటం. ఫోన్లో మాట్లాడడం ఆపేశాను.

వెంటనే టెక్స్ట్ చేశాడు - ఆదిలా సాగింది:


 
మా కార్ వాడి ఎపార్ట్‌మెంట్ దగ్గర ఆపేటప్పటికి - అన్న, వాడి ఫ్రెండ్ కెవిన్ - వాళ్ల ఐదో అంతస్తు నుంచి కిందకి దిగి రోడ్ పక్కనే వున్న ఫుట్‌పాత్ మీద కొంచెం ఆందోళనగా చూస్తూ నించుని వున్నారు.

ముందుగా కార్ దిగి వచ్చిన నన్ను, తమ్ముణ్ణి -  చూసి గబగబా దగ్గరికి వచ్చి అన్నగాడు మెరిసే కళ్లతో - ఇద్దరినీ పట్టుకుని - ఒక హగ్గిచ్చేశాడు. వాడి పక్కనే వున్న కెవిన్ - "ఎంత కంగారు పడ్డాడో సుహాస్" - అంటూ వాడూ ఒక హగ్గిచ్చాడు.

ఇంతలో కార్ దిగి వచ్చిన నాన్నగారికి ఒక పే...ద్ద హగ్గూ - వెంటనే - "This is the best birthday surprise I ever got" అంటూ గంతులూ -
"ఇంతే ఈ ఏడాదికి సర్‌ప్రైజ్ - నీక్కావల్సిన కామెరా నాకు నచ్చిన ప్రైస్ లో దొరకలేదుగా" - సన్నగా ఉడికిస్తూ నాన్నగారు - 
"That's okay, నాన్నగారు! You gave me the best surprise gift by coming over here" - అని మిడిసిపడుతూ అన్నగాడు -
వాళ్లిద్దరినీ మెరిసే కళ్లతో చూస్తూ - మురిసిపోతూ కెవిన్, నేను, తమ్ముడు.

అన్నగాడిని కలిసిన సంతోషంలో మా అలసటంతా మరిచి - కాసేపు కబుర్లు చెప్పి- వాడికి, కెవిన్‌కి బై చెప్పేసి ఆ రాత్రికి శాన్‌ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లో వున్న మా హోటల్‌కివెళ్లిపోయాం - రూంలోకి చేరిపోయాం - ఒళ్లు మరచి నిద్రపోయాం.


మరుసటిరోజు - శనివారం - అన్నకి ఫైనల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాల్సిన రోజు - కలవడం కుదరదని ముందే చెప్పాడు. ఆదివారం సాయంత్రం మా దగ్గరికి వస్తానని చెప్పాడు.

పొద్దున్న లేవగానే - కిటికీలోంచి బయటికి చూస్తే ఎదురుగా బోల్డన్ని కిటికీలతో ఒక బిల్డింగ్ - ఒక్కో కిటికీది ఒక్కో character  & characteristic అనిపించింది.

ఒక కిటికీలో తెల్ల పూల కుండీ
ఒక కిటికీలో నీలి గళ్ళ దిండు
ఒక కిటికీలో నల్ల గొడుగు మొన
ఇంకో కిటికీలో తెల్ల తెరల కొన
అన్ని కిటికీల్లో కామన్  characteristic - ఒక టేబుల్
అన్ని టేబుళ్ల మీద ఒక కంప్యూటర్

నాకూ - బుజ్జిజింకకీ - అసలా కిటికీలేంటా అని ఒకటే ఆపలేని ఆసక్తి ఓపలేనంతగా పెరిగిపోయింది. కిటికీల పైన కానీ-కనిపించని అక్షరాలతో Goodby Silverstein & Partners అనే పేరుని కూడబలుక్కుని చదివి - గూగుల్లో వెతికితే అదొక advertising agency అని తెలిసేదాకా మా చూపులన్నీ ఆ కిటికీలమీదనే.





శనివారం, ఆదివారం రెండు రోజులూ - శాన్‌ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లో  - హోటల్ పక్కనే వున్న - చైనాటౌన్, యూనియన్ స్క్వేర్, బ్రాడ్‌వే - వగైరాలన్నీ - మహా ఆనందంగా తిరిగాం.

బ్రాడ్‌వేలో మ్యూరల్స్ వేసిన బిల్డింగొకటి నచ్చేసి - క్లిక్కేసుకున్నామిలా:




ఆదివారం సాయంత్రం - అన్నని తీసుకుని శాన్‌హోజెలో వుండే ఆప్తులు- ఆతిధ్యహృదయులు - రమేష్, ప్రసాదుల ఇంటికి వెళ్లాము. రమేష్-ప్రసాదులు నా ఆతిధ్య హృదయం పోస్టులో మనసెరిగినవారు.

ఆదివారపు సాయంత్రం - 
మా మనసెరిగిన మిత్రులతో ఇండో-చైనీస్ భోజనం -
తినేచోట బోల్డంతమంది జనం -
ఒకరిమాట ఒకరికి వినిపించనంత కోలాహాలం -
అరిచి మాట్లాడి పోగొట్టుకున్న నా గళం.

ఆదివారం రాత్రి - మా దగ్గరకొచ్చిన అన్నగాడికి దొరికిన గిఫ్ట్ - ఇటీవల కాలంలో చదువుతో - ఎడతెగని హోంవర్క్‌తో కుదరని, దొరకని  - ఎనిమిదిగంటల అవిచ్ఛిన్న-నిద్ర.

సోమవారం పొద్దున్న - అన్నగాడికి దొరికిన ఇంకో సర్‌ప్రైజ్ - నాన్నగారి నుంచి - ఆన్‌లైన్‌లో కొన్న - వాడు కోరుకున్న సోనీ కెమెరా, దానికి కావాల్సిన లెన్స్.

సోమవారం సాయంత్రం - నాకు దొరికిన బహుమానం - నాకిష్టమైన శరవణ్‌భవన-భోజనం.

సోమవారం రాత్రికి అన్న వాడి ఇంటికి వెళ్ళిపోయాడు - మరుసటి రోజు పరీక్షకి చదువుకోవడానికి.

మంగళవారం - అన్న పుట్టినరోజు - పరీక్ష రోజు.

పగలు - మేం ముగ్గురం యూనియన్ స్క్వేర్ దగ్గర కేబుల్‌కార్ ఎక్కి - Pier39 దగ్గర Ghirardelli చాకొలెట్స్ కొనుక్కుని వచ్చాము.



మంగళవారం సాయంత్రం వాడి కాలేజ్ క్యాంపస్ లో వాడి ఫ్రెండ్ కెవిన్ తో కలిసి - వాళ్ళిద్దరికీ నచ్చిన ఒక restaurantలో భోజనం చేసి బయటికి రాగానే కనిపించిన ఒక నీలి రంగు ఆటో - దాన్ని చూసి సంబరపడుతూ - నేనూ, కెవినూ తీసుకున్న ఫోటో:



 చిత్రాన్న-భోజనాలు, ఆటోల-చిత్రాలు - అన్నీఅయిన తర్వాత - UCof B కాంపస్‌లో నడుచుకుంటూ వెళ్లి అన్ననీ, కెవిన్‌నీ వాళ్ల ఎపార్ట్‌మెంట్ దగ్గర దింపేసి - జాగ్రత్తలు చెప్పి హోటల్‌కి తిరిగివచ్చాము.

తెల్లవారితే బుధవారం - మా తిరుగు ప్రయాణం.

ఎక్కాల్సిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ గంట ఆలస్యం - దానివల్ల LA లో ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ దొరకదని - నేను, బుజ్జిజింక కష్టపడతామని బదరికి బెంగొచ్చింది.

అనుకోకుండా - మాకు ఆపత్కాల-బాంధవిలా AA లో పనిచేసే ఆవిడ ముందు వెళ్లే ఇంకో ఫ్లైట్ లో సీట్లు ఇవ్వడం వల్ల - అనుకున్నట్టుగా రాత్రి పన్నెండింటికి ఇంటికి చేరగలిగాము.

అలా ... అన్న పుట్టినరోజుని వాడికే కాక నాక్కూడా మరపురాని రోజుగా మారుస్తూ -
ఎందాకో ఎందాకో
ఎక్కడికో చెప్పుకో
తెలియలేదా - నా చేయి పట్టుకో
వెలిగే దీపాలవిగో
ఎత్తు ఎత్తు భవనాలవిగో
నగరం ఇది శాన్‌ఫ్రాన్సిస్కో
...అంటూ
నా కళ్ల నిండా బదరి నింపిన మెరుపు - సర్‌ప్రైజెస్కో...


20 కామెంట్‌లు:

  1. అక్కా చాలా బావుంది మీ సర్ప్రైజ్ యాత్ర నువ్వు చెప్పడం లో ఇంకా అందముగా వుంది అన్నగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు చెపుతున్నాడు అనుకోకు ఈ శుభాకాంక్షలు అరోజుకి వేసుకో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్, హనుమాన్ - అన్నగాడికి నీ శుభాకాంక్షలు అందజేశాను.

      తొలగించండి
  2. మీరిద్దరూ మీ జింకలతో 'బోల్డన్ని కబుర్ల'తో ఇలాగే హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి.🙏😊

    రిప్లయితొలగించండి
  3. శాన్ ఫ్రాన్సిస్కో లో మీ ఫామిలీ సర్ప్రైజేస్కొన్న సజీవ(ర)చనం చాలా బాగుంది. మీ సజీవ స్మృతులలో మరో కలికితురాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలికితురాయి - అన్న మీ మాట బోల్డంత బావుంది - థాంక్ యూ!

      తొలగించండి
  4. Chandra naga Srinivasa Rao Desu1 మే, 2017 4:19 AMకి

    Family reunion..in a surprisingly surprise manner..

    రిప్లయితొలగించండి
  5. లలిత గారు మీ నుంచి మరో అందమైన పోస్టు. UC of B దగ్గరకొచ్చేదాకా ఒకటే ఆతృత ఈవిడ అబ్బాయి కాలేజి పేరు చెప్పరే అని. హమ్మయ్య చెప్పేసారు (స్టాంఫోర్దా, బర్కిలీనా అన్నది సందిగ్ధం). ప్రఖ్యాతి పొందిన కళాశాలలో చదువుతున్న మీ అబ్బాయికి, అలాంటి వాణ్ని తయారుచేసిన మీకు శుభాకాంక్షలు. జీవితపు అందాలని ఆవిష్కరించడంలో మీకు మీరే సాటి.

    రిప్లయితొలగించండి
  6. పదాలతో మీ ఆటలు, మీ కబుర్లు బహు బాగు లలిత గారు.

    రిప్లయితొలగించండి
  7. బావుందండోయ్ మీ సర్ప్రైజ్...

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగుంది లల్లి ,సుహాస్ కి మా అందరి తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు,చిన్ని జింక కి ఆశీస్సులు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పేరు తెలిస్తే బావుండేది - మీ శుభాకాంక్షలకి, ఆశీస్సులకి ధన్యవాదాలు.

      తొలగించండి
  9. లలితా!
    శీతాకాలం లో ఒక సంజె కాలపు వ్యాహ్యాళి సరిగమలు,
    పదపదమంటూ పరుగున వెళ్ళిన శాన్ఫ్రాన్సిస్కొ పదనిసలు,
    అన్నగాడి బర్త్ డే సర్ప్రైజ్ కబుర్ల మిలమిలల గుసగుసలు
    ఎంత బావున్నాయొ!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాటన్నిటినీ పొగిడిన నీ మాటలూ అంతే బావున్నాయి!

      తొలగించండి
  10. సర్‌ప్రైజెస్కో... ఇలాంటి పదాలను కనిపెట్టడంలో మీకు మీరే సాటి లలితగారు.. మీ కబుర్లు చదువుతూ మీతో పాటు మేమూ తిరిగిన అనుభూతి కలిగింది... మీ కుటుంబం ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలని ఇలాంటి కబుర్లు మీరు బోలెడన్ని పంచుకోవాలనీ మనసారా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను వాడే సరదా-పదాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. మీ కమెంట్‌కి బోల్డన్ని థాంక్స్!

      తొలగించండి