2, జులై 2016, శనివారం

ఆతిథ్య హృదయం

 
సెలవు రోజనో 
నెలవు మారే రోజనో 
కొలువు దొరికిందనో 
మనువు కుదిరిందనో
పుట్టిన రోజనో 
ఏమీ తోచని ఉట్టి రోజనో 
హితులను  స్నేహితులను 
పిలుస్తాము 
మనసారా మాట్లాడుకుని - కలిసి భోంచేసి 

మళ్లీ ఇంకో అలాంటి రోజుకి ఎదురు చూస్తాం 
ఇది మామూలే ఎక్కడైనా - ఎవరికైనా 

అలా మామూలు కాని వారు - 

మా మంచి మనసున్న వారి కబురే ఈ ఆతిథ్య హృదయం

-----------------------------------------------------------------------------------
 
మనసెరిగిన వారు

అక్షరాభ్యాసపు వేళ ఓనమాలు రాయించిన మనవడు
అల్లంత దూరంలో వున్న కాలేజ్ కి వెళ్తున్నాడని
చేయి పట్టి బడిలో దింపే మురిపెం మరొక్కసారి తీర్చుకుందామని విమానం లో రెక్కలు కట్టుకు వాలారు అమ్మమ్మ, తాతగారు
అప్పటికే వచ్చి వున్నారు నాన్నమ్మ.
 

పెద్దవారి ముచ్చట తీర్చాలని అమ్మా, నాన్న తహతహలాడారు.
కానీ వచ్చినవారు పెద్దవారు - భోజనంలో పట్టింపు వున్నవా
రు - ఆరోగ్యావసరపు మన్నింపు కావాల్సినవారు - కష్టపెడతామేమో అని కొంచెం బెంగా-నూ పడ్డారు
కానీ ఉత్సాహపడుతున్న రెండో-బాల్యపు-పిన్నలని
భయాలన్నీ చెప్పి దిగులు పర్చలేరు కదా
ఏమైనా సరే అందరం వెళ్దామని అనేసుకున్నారు.
 

అల్లంత దూరం - కాలిఫోర్నియా లో వున్న స్నేహితులతో ఓ మాట చెబ్దాము - కుదిరితే కలుద్దామని-
బదరి ఫోన్ చేసి ఇలా చెప్పారో లేదో
వినీ వినగానే మదిలో మాట చదివే విద్య వుందో ఏమో
మనసు భాష బాగా తెలిసినవాడేమో
చిన్నవాడైనా మనసెదిగినవాడే - ఖచ్చితంగా
"బదరీ గారూ - హోటల్ లో దిగటం ఏంటండీ ? అందరూ మా ఇంటికి రండి" అని నోరారా ఆహ్వానం పలికాడు రమేష్. 

"లేదండీ - ఇబ్బంది అవుతుంది ఇంత మందితో - నేను, లలిత, మా అమ్మ, ఆంటీ, అంకుల్, మా బుజ్జి జింకలు - మొత్తం ఏడుగురం" అంటే -

"సరేనండీ! మిమ్మల్ని మొహమాట పెట్టను - మీకూ, మీ బుజ్జి జింకలకీ అమెరికా అలవాటే కాబట్టి మీకు పర్వాలేదు - కానీ మీ పెద్దవాళ్లు ఇబ్బంది పడతారు - నా మాట కాదనకుండా వాళ్ళని మాత్రం మా ఇంట్లో వుండనీయండి - వేరే మాటొద్దు" అంటూ మాకన్నా మిన్నగా మా పెద్దల గురించి ఆలోచించాడా అబ్బాయి

మూడు రోజులు మూడు రాత్రులు అత్తయ్య, అమ్మా-నాన్నలు పగలంతా అది చూద్దామని-ఇటు వెళదామని మాతో ఉత్సాహపడి తిరిగినా - సాయంత్రానికి ఇంటికి చేరామని, మన ఇంట్లోనే వున్నామని - అనుకునేలా - హాయి మీరేలా , సేద తీరేలా - కడుపు నింపి, కమ్మని నిద్రకి సౌకర్యం కలిగించిన రమేష్ దంపతులకి కృతజ్ఞతలు తెలపడానికి ఏ మాట సరిపోతుంది? ఏ భాష చాలుతుంది ?

చివరి రోజున పిలిచీ-పిలవని-పేరంటం లాంటి ఒక పిలుపుతో బ్యాగ్గులు సర్దేసుకొని బయల్దేరేసొచ్చిన పెద్దలు - అనుకోని ఆప్యాయతా-తిరస్కారానికి బాధ పడుతుంటే - అప్పటికప్పుడు హోటల్ రూం దొరకదేమో అని మేము బిక్క మొహం వేయబోతే - "ఇలాంటిదేదో అవుతుందని వూహించానండీ - బదరీ - మళ్లీ వాళ్ళని మా ఇంటికే తీసుకెళ్తాను ఈ రాత్రికి" అని - అభయమిచ్చి ఆశ్రయమిచ్చిన రమేష్! - ఉప్పు చేత బట్టమని సువర్చలకి చెప్పండి - మా మాటలకి మీకు దిష్టి తగిలితే దాన్ని తరమడానికి.

రమేష్: మీకు మేము ఎప్పటి నుంచో చెప్పాలి అనుకున్న కొన్ని మాటలు -
ఒక తల్లి కడుపున పుట్టిన రామలక్ష్మణుల్లా - మీరు, ప్రసాద్
తాను ఉద్యోగం చేస్తున్నా - సహధర్మచారిణి అన్నమాట సార్ధకం చేస్తూ - మీ కనుసైగతో మాకు ఏ లోటూ రానీయక అమ్మలా ఆదరించిన - మీ తోడు-నీడ - సువర్చల
సువర్చలకి అడుగు-అడుగునా సాయపడుతూ తోడికోడలంటే ఇదీ అర్థం అనిపించిన ప్రసాద్ భార్య ఉష -

మనసెదిగిన వారు మీరందరూ -
మనసెరిగిన వారూ మీరందరే !


మది నింపిన వారు

కాలిఫోర్నియా లో రెండో మజిలీ LA. సుహాస్ ని కాలేజ్ లో దింపేసి మిగిలిన ఆరుగురం కాలిఫోర్నియా రౌట్ 1 పొడుగునా పసిఫిక్ మహా సముద్రపు నీలి అంచులో వెండి నురగల మెరుపులు, తరగల అందాలు చూస్తూ - వెంకట్ వాళ్ళ ఇంటికి చేరేటప్పటికి రాత్రి పది.

సెయింట్ లూయిస్ నుంచి ఫోన్ చేసి "మేము వస్తున్నాము మీ ఊరికి" అంటే మరో మాట మాట్లాడనీయక మేమెక్కడ వుండాలో- అక్కడ వున్నప్పుడు ఏమేమి చూడాలో మా కన్నా ఎక్కువగా హడావిడి పడి - మా ఇంట్లో తప్ప ఇంకెక్కడా చుట్టుపక్కల ఉండకూడదని ప్రేమగా బెదిరించిన వెంకట్ బదరీకి మిత్రుడే. కానీ వెంకట్ భార్య రోజాని చూడడం, కలవడం అదే మొదటిసారి.

కార్ దిగీ దిగగానే -అంకుల్ అలిసిపోయారు - అని నాన్న అలసట తీరే ఔషధమిచ్చారు వెంకట్.

పరిచయం లేదని బిడియపడుతున్న నన్ను, అమ్మ, అత్తయ్యలని కలివిడి మాటలతో తన ప్రియవర్గం లోకి కలిపేసుకుంది రోజా

అది మొదలు ఐదు రోజులు - తెల్లవారకుండానే లేచి - బయటికి వెళ్తే ఎప్పుడో సాయంత్రానికి గానీ ఇల్లు చేరరు - బయట అలవాటు లేని ఆకులలముల భోజనం సహించక ఇబ్బంది పడతారు పెద్దవారని - ఒక్క చేతి మీద మా అందరికీ రోజుకో రెండు రకాలు - ఒకటి చిత్రాన్నం - ఇంకోటి వడలో, గారెలో - ఇంకా పెరుగన్నం - వండి, కలిపి జాగ్రత్తగా పాక్ చేసి ఇచ్చేది రోజా. మళ్లీ రాత్రి ఇంటికి రాగానే మళ్లీ - వివాహ భోజనంబు - అని పాడాలనిపించేలా ఇంకెన్నెన్నో - మా అందరి ఇష్టాలు కనుక్కుని మరీ వండిన వంటలు.

ఇంటికి పిలిచారు, పెట్టారు అని కాదు - అమెరికాలో ఏ సాయమూ దొరకని చోట - వాళ్ళకి ఉద్యోగాలు, ఎన్ని పనులూ వున్నా - విహారయాత్రకని వెళ్లిన మమ్మల్ని - ఏదో ఒక పూట వచ్చి వెళ్ళిపోనీలే అనుకోకుండా ఇంటి వారికన్నా ఎక్కువగా ఆదరించారు వెంకట్, రోజాలు.

వెంకట్, రోజా:

మీరు ఆదరణకు అరుదైన అర్థం చెప్పారు
మా మదిని హాయైన అనుభూతితో నింపారు.

మనసే ఇచ్చేసిన వారు

ఇక మూడో మజిలీ - శాన్ డియేగో.

ఇక్కడికి వచ్చాక ఎక్కడో వుంటారా - మళ్లీ మీ ఇంటికి నేను రావాలనేనా - అని ప్రేమగా చీవాట్లేసి మరీ స్వాగతం పలికిన వారు - విజయ, వెంకట్ లు.

కారు దిగీ దిగగానే - సొంత ఇంటి వారిలా - గలగల లాడుతూ కబుర్లు చెప్పేసుకున్నారు అమ్మా, అత్తయ్య.

దానికి కారణం విజయ గురించి - తనని నేను ఎంత విసిగిస్తానో ముందే చెప్పి వుండడం ఒకటీ, అప్పటికే ఇంతకుముందు మొదటిసారే చూసినా - సువర్చలా, ఉషా, రోజా చూపిన కలివిడితనం ఇచ్చిన భరోసా ఒకటీ - వాళ్ళకి ఈ ఇల్లు మనదే అనిపించేలా చేసినట్టున్నాయి.

ఇంక నాన్నైతే విజయ వాళ్ళ ఇంటి హాలు లో ఒక పక్కకి తన బాగ్ పెట్టేసుకుని ఇక్కడే నా పడక అని చనువుగా సొంతం చేసేసుకున్నారు.

వున్నది ఒక్క రోజే - ఆ ఒక్క రోజులోనే నీకిష్టం అని తన తోట లోని గోంగూర కోసి విజయ చేసిన పచ్చడి రుచి ఇంకా నాలుక మీద ఉంది.

మాతో లెగో లాండ్ కి రాలేమని ఇంట్లో వున్న అమ్మ-అత్తయ్యల - ఆడవాళ్లకే సొంతమైన - షాపింగ్ సరదా కనిపెట్టి దగ్గరుండి మరీ వాళ్ళ ముచ్చట తీర్చిన విజయని తలుచుకుని ఇప్పటికీ మురిసిపోతారు అమ్మా-అత్తయ్య.
 

ఆ రాత్రి నాన్న, బదరి తో కలిసి వెంకట్ చేసిన హుషారు
కనురెప్పలు వాలేదాకా విజయతో నేను చెప్పుకున్న కబుర్లు - ఓహ్! ఇంకొక్క రోజు వుండి వుంటే ఎంత బాగుండేదో అని ఇప్పటికీ అనిపించేస్తుంది.

వెంకట్, విజయ:

అడగక ముందే మీ మనసే ఇచ్చేశారు
బదులివ్వడానికి లేకుండా మా మనసులు గెలిచేసుకున్నారు

కొండం .... అండల్లే ...

ఇక్కడ మా దేహాలు
ఇండియాలో ప్రాణాలు
ఏ రాత్రి పూటో మోగే ఫోనులు
వణికే చేతులతో తీస్తే ఏం వింటామో అన్న దిగులూ
తీయకపోతే సమయానికి మాట సాయమైనా అందించలేమేమో అనే బెంగా
నిండు కుండలయ్యే కళ్ళు -
ఇలా ఇండియా లో వీచే ఏ చిన్న అసౌకర్యపు గాలికైనా అల్లాడి వణికే తీగల్లా ఉంటామని తెలిసే కాబోలు - తన రెండు చేతులా మా కంటి దీపాల్ని కాపాడే కొండంత అండగా వుంటారు - ఆ ఏడుకొండలవాడి పేరే తనదైన బాలాజీ.

ఏ దిగులు కమ్మిన మనసుతోనో - మనసులో మాట పంచుకోవడానికి ఫోన్ చేస్తే - ఆ మాటల్లో మా ఇంట్లో ఎవరికి ఒంట్లో బాలేదని చెప్పినా, ఎవరికైనా ఏ అవసరం వుందేమో - అని బరువు తలపు పంచుకున్నా - వెంటనే తనంతట తానే - మేమింకా ఎలా ఊరడిద్దామా అన్న ఆలోచనలో వుండగానే - ఆ ఊరటని ఆచరణలో పెట్టేసి - "బదరి! బెంగొద్దు - నేనున్నాను ఇక్కడ" - అనే
ఆప్త బంధువు బాలాజీని గురించి మేమనుకునే మాట  - ఏ వేళనైన మాకు ఇంత అండ వుండగా - బ్రతుకంతా పండగ - భయపడడం దండగ (పుహళేంది గారి పాటలోలా).

బాలాజీకి తగిన ఇల్లాలు - ప్రియ. అమెరికా ట్రిప్ తర్వాత అనుకోని ఆపరేషన్ కి హైద్రాబాదు స్టార్ హాస్పిటల్ లో చేరిన నాన్నకి ఏమవుతుందో అన్న భయంతో హైద్రాబాదు వెళ్లిన  మమ్మల్ని ఆదరించి, రెండు వారాలపాటు ఎప్పుడు లేచిందో - ఎలా వండిందో తెలియకుండా - ఇంటికి ఎందరు వచ్చినా మాతో పాటు అందరికీ అన్నీ అమరించి - "ఆంటీ! అంకుల్ హాస్పిటల్ లో వున్నారు - లలితకి ఇక్కడినుంచి రాజమండ్రి వచ్చే అవకాశం లేదు ఈసారి - అందుకని తనకి ఇష్టమైనవి ఏవో చెప్పండి - ఇక్కడే చేసి పెడదాము" - అని నేను వున్న రెండు వారాలూ మా అమ్మతో సమానంగా నాకోసం తాపత్రయ పడింది.

బాలాజీ, ప్రియ:

కుడి చేత్తో మీరు మాకు చేసే సహాయాన్ని మీ ఎడమ చేతికి కూడా తెలియనివ్వని మీరు
మా ఎడదల్లో ఎప్పుడూ కొలువుండే కొండంత అండ
-----------------------------------------------------------------------------------

 వీరందరి వద్దా దొరికిన ఆతిథ్య హృదయం 
మా హృదిలో - స్మృతిలో పదిలం పదిలం 

~ బదరి, లలిత

10 కామెంట్‌లు:

  1. lఅసలు చుట్టాలు రావడం గగనమైన ఈరోజుల్లో మీ లాంటి వారు మాయింటికి రావడం మాకెంతో అదృష్టం. మీ అభిమాన,ఆత్మీయతలకు ధన్యులము.

    అవునూ మీరింత చక్కగా ఎలారాస్తారు. అప్పట్లో ఈనాడు ఆదివారం అనుబంధం కోసం ఇంటిల్లిపాది ఎదురుచేసేవాళ్ళం, ఇప్పుడు మీ బ్లాగు.

    -ఓరుగంటి ఫ్యామిలీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిలుచుకున్న చుట్టాల ఆదరణకే ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో - మా అవసరం కోసం మేమొచ్చినా మీకున్న బిజీ స్కెడ్యూల్ లో మాకోసం అంత టైం కేటాయించగలిగిన మీకు థాంక్స్ అన్న మాట చాల చిన్నదై పోయింది - అందుకే ఇలా - బ్లాగ్ముఖం గా చెప్పాలని - బదరి, నేను అనుకున్నాము. It's definitely long overdue.

      ఇంక నా బ్లాగ్ రాతల గురించి - రోజూ వుండే ఉద్యోగపు ఒత్తిడికి ఇదొక ఆటవిడుపుగా మొదలుపెట్టాను - చదువుతున్నందుకు ధన్యవాదాలు :)

      తొలగించండి
  2. మన ఆంధ్రుల ఆతిధ్యం అభిమానం ఆప్యాయత గురించి చాలా అందముగా చెప్పావు, మీకు ఆతిథ్యం అందించిన అందరినీ పేరు పేరునా గుర్తు చేసుకుని చెపుతుంటే నాకు అక్షరాలు కనపడటం లేదు .....నీ మంచి మనసు కనపడుతుంది..హేట్సాఫ్ అక్కా!!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ బ్లాగ్ లో రాసిన వారే కాకుండా - ఇంకెన్నో సందర్భాల్లో ఇంకెందరి ఆతిథ్యమో మేము పొంది వున్నా - వీరి ప్రత్యేకత ఏంటంటే - మా అవసరార్థం మేము వెళ్ళేటప్పటికి - వాళ్ళందరికీ ఆఫీసులు, పిల్లల స్కూళ్ళు వున్నప్పటికీ- అవన్నీ చూసుకుంటూ కూడా మా కోసం ఎంతో చేశారు.

      నా అక్షరాల వెనక వుంది ఆ మంచి మనసులు :). నీ కమెంట్ కి థాంక్స్, హనుమాన్

      తొలగించండి
  3. నువ్వన్నట్టు మనసెదిగిన వారు, మనసెరిగిన వారు, హితులు, స్నేహితులు అయినవారి సాన్నిహిత్యం, ఆతిధ్యం, ఆత్మీయత ఎప్పుడూ మరువరానివే, మరువలేనివే, విలువ కట్టలేనివే.
    I can only think of the saying, "as you sow, so you reap".





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అడగకుండానే పెట్టే అమ్మవు - నీ వాక్కు ఫలించనీ - ఇలాంటి ఆతిథ్య హృదయాలు ఎన్నో పుట్టనీ!

      తొలగించండి
  4. కృతజ్ఞతకి నిర్వచనం ఆసాయం చేసిన వారిని ఎప్పుడు తలుచుకోవడమే (శ్రీచాగంటి వారి ఉవాచ)! అలా చేసిన మీకు, అలా చేయించగలిగిన మీ స్నేహితులకి ఎన్నో అభినందనలు, దణ్ణాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నన్నూ, నా స్నేహితుల్నీ, వాళ్ల గురించి రాసిన ఈ పోస్టునీ మెచ్చుకున్న మీకు ఎన్నో ధన్యవాదాలు, దణ్ణాలు!

      తొలగించండి