24, జూన్ 2016, శుక్రవారం

సిన్మావలోకనం

సినిమాలు అందరికీ కాకపోయినా - ఆ అందరిలో కొందరైన ఎందరికో ఇష్టమే
సినిమాలు అన్నీ అందరూ కాకపోయినా
అన్నీ కొందరు -
కొన్ని అందరూ -
మొత్తానికి ఎన్నో కొన్ని
ఎందరో కొందరు చూస్తూనే వుంటారు.
 

అలా - అందరిలో కొందరిగా - కొందరిలో అందరిగా - మా ఇంట్లోనూ సినిమాలు చూస్తాము - బదరీ, నేనూ - వారానికి వరస తప్పకుండా - ఒకటో రెండో భాషలవి.

చిన్నప్పటి నుంచి
ఒక్కటొక్కటిగా నేనెక్కిన ఫిల్మెట్లు
వాటి కబుర్లు  - కథా కమామీషులే - ఈ సిన్మావలోకనం.

సిన్మోత్సాహము 

 
గూడు కట్టిన రెండెడ్ల బండిలో - గడ్డి ఒత్తుగా పరిచి -
ఆ గడ్డి గుచ్చుకోకుండా ఆ పైన మెత్తటి పరుపు వేసి -
 

బండి కింద చిక్కంలో చంటి పిల్లలకి పాల సీసాలు, పాలు పోసిన ఫ్లాస్కు -
కొంచెం పెద్ద పిల్లలకి ఒక డబ్బాలో జంతికలు, చక్కిలాలు -
ఇంకా అసలు-పెద్దవాళ్ళకి రొట్టెల డబ్బాలో రొట్టెముక్క- ఆవకాయ, ఒక ఫ్లాస్కుడు కాఫీ, మరచెంబులో నీళ్లు -

ఇంక బండిలో - ఇంకో బండి లో (జనాభాని బట్టి) -
మా మామ్మ -
ఆవిడ కోడలైన మా అమ్మమ్మ -

అమ్మమ్మ కూతుళ్లయిన మా అమ్మ, దొడ్డలు, పిన్నులు -
కోడలైన మా చలాకీ చెల్లాయత్త -
మా అమ్మ పిల్లలమైన మేం ముగ్గురం-


ఇలా ఇంట్లో వున్న నాలుగు తరాల స్త్రీ-జనమంతా పిల్లా-పాపలతో సహా - బయల్దేరి - రాజోలులో వున్న రెండు సిన్మా హాళ్లు - వెంకటరమణ, రవిలలో - వరసగా ఫస్ట్ షో , సెకండ్ షో చూసి వచ్చేవాళ్ళం. సిన్మా మధ్యలో నిద్రొచ్చిన పిల్లలని సీట్ల మధ్యలో బొంత వేసి పడుకోబెట్టేవాళ్ళు. అసలా బొంత-ప్రేక్షకుల గురించి ఎందుకు చెప్పానంటే నేనెప్పుడైనా ఏదైనా పాత సిన్మా మాటొచ్చినప్పుడు - నేనది చూళ్ళేదే - అనుకుంటూ వుంటే - మా అమ్మ - "లేదు - నువ్వు చూశావు - మళ్లీ చూడక్కర్లేదు" అనేసేది. ఇంతకీ నేనది ఏ సీట్ల మధ్య వేసిన బొంత మీదనో పవళించి చెవులతో "చూసి" ఉంటాను - కానీ మా అమ్మకి అది చూడడం కిందే లెక్క

సరే ! అసలు సిన్మా కి వెళ్తున్నాము అనగానే అప్పటిదాకా దేనికోదానికి పోటీలు పడి - పేచీలు పెట్టే మా ముగ్గురు అక్కచెల్లెళ్లకి ఎక్కడ లేని పొత్తూ కుదిరిపోయేది.
 

అప్పటిదాకా ఎప్పుడూ ఒకళ్ళదొకళ్ళం వేసుకోనివ్వని గౌనులు ఉదారంగా - "పర్వాలేదు - ఈ ఒక్క సిన్మాకి వేసుకో" - అని ప్రేమతో అరువిచ్చి- 
అంతవరకూ పక్కనే వుండి అరిచి చెప్పినా వినిపించుకోని మా అమ్మ మాట తెగ శ్రద్ధగా వినేసి- 
ఎవరేది అడిగినా గబగబా అందించేసి-
రోజూ ఎంత బాగా వేసినా బాగా రాలేదని పదిసార్లు విప్పి వేయించుకునే జడలని ఒక్క ఐదు సార్లు మాత్రమే విప్పి తిరిగి వేయించుకుని-
బండెక్కి-
గతుకు గతుకుకీ వచ్ఛే కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళం పడుతూ-
నవ్వుకుంటూ వెళ్లే మాది అక్షరాలా సిన్మోత్సాహమే!!

ఒకవేళ సిన్మా హాలులో అడుగు పెట్టేటప్పటికి పేర్లు మొదలయిపోతే బోల్డంత బాధ - ఏడుపు వచ్చేసేది మా పిల్ల-జనాభాకి. 


అక్కడే దెబ్బలాడేసుకునేవాళ్ళం - నువ్వు తొందరగా జడ వేయించుకోలేదు - అందుకే ఆలస్యం అయింది అనో, నువ్వు అన్నం దగ్గర పేచీ పెట్టకపోతే తొందరగా వచ్చేవాళ్ళం అనో - అని చిన్నగా మొదలయ్యి - చినికి చినికి - అది సిన్మా హాల్లోనే - నా గౌను నాకిచ్చేయి - అని గొడవ పడి - ఆ గొడవ పూర్తయేటప్పటికి - ఈతపాయల జడలు పీచులు రేగిన ఈతచాపల్లా అయ్యి - ఏ పేర్లయితే మొదలైపోయాయి అని గొడవ పడుతున్నామో - ఆ పేర్లు అయిపోయేవి. ఈలోగా మా చెల్లాయత్త ఏ చక్కిలం ముక్కో చేతిలో పెట్టేది - ఆ కరకరకి డైలాగులు వినిపించవేమో అని - నోట్లోనే నానించి మింగేసేవాళ్ళం.

ఆ తర్వాత రోజునుంచి ఓ పది రోజులు అందులో పాటలు పాడుకుంటూ, కళ్ళు-కాళ్ళు తిప్పుకుంటూ డాన్సులు చేసుకుంటూ వుంటే -

ఓహ్! - అల్లరి చేయుట మరిచిన పిల్లల తల్లిగా -

సిన్మోత్సాహము మా అమ్మకి
సిన్మా చూసినప్పుడె పుట్టదు, పిల్లలా
సిన్మా పాటలు పాడగా
సిన్మోత్సాహంబు నాడు పుట్టెను సిన్మతీ!


మా వేసవి సెలవులు అలా సిన్మాయలో ఇట్టే అయిపోయేవి. 


అలా చూసిన సిన్మాలు ఇన్-బొంత / ఔట్-ఆఫ్-బొంత లిస్ట్ ఏంటంటే: పవిత్ర బంధం, ప్రేమ్ నగర్, భక్త తుకారాం, భక్త ప్రహ్లాద, అందాల రాముడు ఎట్ సెటరా...

సిన్మెంటిమెంటు

ఎలిమెంటరీ స్కూల్ లో ఉండగా - ఇంక బడులు మొదలయ్యాక అంతగా సిన్మాలకి తీస్కెళ్ళేవాళ్ళు కాదు అమ్మా-నాన్న. 


కానీ నాన్న ఆఫీస్ కి, మేము స్కూల్ కి వెళ్ళిపోయాక అమ్మకి ఏం తోస్తుంది మరి ?! అందుకని అమ్మ వారానికొకసారో, రెండువారాలకొకసారో ఏదైనా మంచి సిన్మా వచ్చిందీ, చూడాలీ అనుకున్నప్పుడు - ఇంటి ఓనర్ అన్నపూర్ణమ్మ గారితో మధ్యాహ్నం మ్యాటినీ షో కి వెళ్తూ వుండేది. 

అలా వెళ్ళాలీ అనుకున్నరోజు ముందే నాన్నకి చెప్పేది - మధ్యాహ్నం భోజనానికి ఇంటికి కొంచెం ముందుగా రమ్మని. నన్ను కూడా తొందర చేసేది - అన్నం గబగబా తినేసి స్కూల్ కి వెళ్ళమని.

మొదట కొన్నిరోజులు ఎందుకలా తొందర చేస్తోందో అర్థం కాలేదు. 


ఒకరోజు అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ మనవడిని మేడ మీద వుండే మా ఇంటికి పంపించారు - మా అమ్మ తయారైందో లేదో చూసి రమ్మని. 

వాడు వచ్చి సిన్మాకి టైం అయిపోతోందని అమ్మతో అంటుంటే విన్న నాకింక స్కూల్ కి వెళ్లాలనిపించలేదు. 

కానీ అమ్మకి కోపం వస్తుందని - అప్పటికీ పదిసార్లు ముందుకీ వెనక్కీ వస్తూ - మొత్తానికి బడికి వెళ్ళాను. వెళ్లానే కానీ మనసంతా గూడు రిక్షాలో గణపవరం నుంచి చిలకలూరిపేట దాకా వెళ్ళీ-వెళ్ళీ,  అక్కడ కళామందిర్ లోనో, విశ్వనాథ్ లోనో, భాస్కర్-విజయభాస్కర్ లోనో - సిన్మానందాన్ని మిస్ అయిపోతానేమో అని బెంగొచ్చేసి - కడుపులో నొప్పిగా వుందని ఏడ్చి - ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చే టైంకి - అప్పుడే మా అమ్మ, అన్నపూర్ణమ్మ గారు ఎక్కిన రిక్షా ఇంటి నుంచి బయల్దేరింది.

పరుగెత్తుకుంటూ వస్తున్న నన్ను చూసి అమ్మ రిక్షా ఆపమని - స్కూల్ మానేసి అలా రాకూడదని చెప్పి నన్ను పంపిచేయబోయింది.

అప్పటికే బోల్డన్ని సిన్మాలు చూసేసి వున్నానేమో - వెంటనే ఏడుస్తూ - "అమ్మ! నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా - ఈ ఒక్కసారికీ తీసుకెళ్ళమ్మా - ఇంకెప్పుడూ అడగనమ్మా " అని ఎవరూ-రాయని-నా-ఆశు-డైలాగులు చెప్పేస్తూ వుంటే - పాపం - అన్నపూర్ణమ్మ గారు నవ్వాపుకుంటూ - "ఎండలో ఆ పిల్లని అలా ఏడిపిస్తారెందుకు - రానియ్యండి " అనడం తడవు - అప్పటికే నా సిన్మేడ్పు పుణ్యమా అని అమ్మ మొహంలో మెరిసిన కనీ కనిపించని చిన్ననవ్వు ఇచ్చిన ధైర్యం తో రిక్షా ఎక్కేశాను


అది మొదలు - 

సినిమా కెయ్యది ప్రస్తుత 
మప్పటికా డైలాగులాడి అమ్మల మనముల్ 
నొప్పింపక తా నొవ్వక 
సినిమా చూచుటయే ధ్యేయము సిన్మతీ!

- అన్నట్లాయెను నా సిన్మెంటిమెంటు ;)

ఇంకిప్పటి లిస్ట్: బలిపీఠం, అమెరికా అమ్మాయి, పంతులమ్మ, కార్తీక దీపం, అడవి రాముడు, యమగోల, రామకృష్ణులు, ముత్యాల ముగ్గు - ఇంకా ఎన్నో - మరెన్నో - అబ్బో! గణపవరం నుంచి చిలకలూరిపేట దాకా వున్న రోడ్డంత పొడవు అది. తెలుగే కాక నాన్న తీసుకెళ్లిన కన్నడ కంఠీరవ - మహావీర మయూర కూడా అప్పటిదే.

సిన్మాయాత్రలు 

ఇంకొంచెం పెద్దయ్యాక హైస్కూల్ కి వచ్చాక మేమున్న టంగుటూరులో మూడు సిన్మా హాళ్లు వుండేవి - ఎర్రబ్బాయి గారి అప్సర, పోతుల చెంచయ్యగారి మారుతి, మూడోది వెంకటేశ్వర.

మా కోనసీమకి దూరంగా వున్నామని అమ్మ బెంగ పడుతుందనో, వారమంతా చదువులు- సంగీతాలు అని తిరిగే పిల్లలకి ఆటవిడుపు కోసమనో, ఇంకా ఆ చిన్నవూళ్ళో వేరే కాలక్షేపం లేదనో - మా నాన్న ప్రతీ వారం అందరినీ సిన్మాకి తీసుకెళ్లేవారు

నా సిన్మాగ్రాఫ్ చాలా పైకి వెళ్ళింది టంగుటూరులోనే. చిన్న ఊరైనా అన్ని కొత్త సినిమాలు రిలీజ్ రోజుకే వచ్చేసేవి

లవకుశ, మాయాబజార్ తో  మొదలుపెట్టి ఎన్నో పౌరాణికాలు-
బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, మహామంత్రి తిమ్మరుసు లాంటి చారిత్రాత్మకాలు-
దాసరి ప్రేమాభిషేకంతో మొదలుపెట్టి ఏఎన్నార్ తో తీసిన శ్రీవారి ముచ్చట్లు, మేఘసందేశం, ప్రేమమందిరాలు-
బాల చందర్ ఆకలి రాజ్యం, గుప్పెడు మనసు 
చంద్ర మోహన్ వెంట తిరిగిన నాగమల్లి, పక్కింటమ్మాయి, గోపాలరావు గారి అమ్మాయి
కాశీనాథునివారి సాగరసంగమం, సీతామాలక్ష్మి వంటి విశ్వనాథాభరణాలు-
భారతీరాజా సీతాకోకచిలుకలు-
జంధ్యాల ముద్దమందారాల నాలుగు స్తంభాలాటలు-

ఒకటా రెండా - కాదు - పదులు డజన్లలో - అటు ఒంగోలు ఏ పని మీద వెళ్లినా - ఇటు సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లినా

టిక్కెట్టిచ్చువాడు, స్వీపరు 
నెప్పుడు నెడతెగక ఆటాడు సినిమా హాలున్ 
చొప్పడిన యూరనుండుము 
సిన్మా లేనట్టి యూరు చొరకుము సిన్మతీ!  
 
 - అని అసలు యాత్రతో పాటు మా కొసరు సిన్మాయాత్ర జరిగిపోయేది



సిన్మారాధన 



ఆ ప్రకారంగా మొదలైన సిన్మారాధన ... 

ఇంటర్ - డిగ్రీ రోజుల దాకా గుంటూరు లో -

విజయలక్ష్మీ లో శ్రీ రాజకపూర్ గారి ఆవారా వేసిన 420 వేషాలు 
శేషమహల్ లో మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సులూ
జాకీ ష్రాఫ్ హీరో అయిన విధం 
రాఘవేంద్రరావు ఆల్ "అల్లరి" సిరీస్ 
మంగా థియేటర్ లో మణిరత్నం గీతాంజలి, సూపర్ స్టారెక్కిన సింహాసనం, భయపెట్టేసిన బీస్ సాల్ బాద్
డాన్స్ మాస్టర్ కమలుడి గుణ
విశ్వనాథుని శ్రుతిలయలు, స్వయంకృషితో మెరిసిన స్వాతిముత్యపు -స్వాతి కిరణాల సిరివెన్నెలతో - 
జంధ్యాల పడమటి సంధ్యారాగమై 
కొనసాగుతూ - 

యూనివర్సిటీ చదువుల తిరుపతిలో -

రేపు ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే ఇవాళ - టిక్కెట్ల క్యూలో - ఒక చేత్తో టికెట్టుకి డబ్బులు, ఇంకో చేత్తో జె.ఎల్. పీటర్సన్ రాసిన ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ టెక్స్ట్ బుక్కూ - 
అపర సవ్యసాచిలా ఫీల్ అవుతూ - చూసిన - 

లమ్హే, ఫూల్ ఔర్ కాంటే, 
చిరంజీవి - ఘరానా మొగుడు, 
నాగార్జున - ప్రేమ యుద్ధం - 
వెంకటేష్ చంటి 
నట కిరీటి - ఏప్రిల్ 1 విడుదల, చెట్టుకింద ప్లీడరు
సీతారామయ్యగారి మనవరాలు మీనా ...

అబ్బో! తిరుమల మెట్లంత పొడుగు జాబితా అది -

చూడదగు నెక్కడ వచ్చిన 
వచ్చినంతనె టిక్కెట్టు కొని చూడదగున్ 
సిన్మా హాళ్ల అడ్రెస్సులెరిగిన 
మిత్రులె పో, నీ కిష్టులు మహిలో సిన్మతీ!

ఇప్పటికీ అదే జోరులో, హుషారుగా ప్రతీ వారం - 
ఎప్పుడో దుర్యోధన పాత్రలో తాతగారు కొట్టిన సౌండ్ నచ్చి ఇప్పటికీ తొడలు కొడ్తున్న నట-పుత్ర-పౌత్ర-రత్నాల దాకా 
తండ్రి నటసామ్రాట్  తరం నుంచి నాగార్జున పిల్ల-సామ్రాట్ల దాకా 
నటభూషణ శోభన్ బాబు నుంచి చంద్ర మోహన్, మురళీ మోహన్ దాకా 
నటశేఖర కృష్ణ - వారబ్బాయే కాకుండా మూడోతరపు సూపర్-పౌత్ర-స్టార్ దాకా
రెబెల్ స్టార్ నుంచి వంశాంకుర బాహుబలి దాకా 
అల్లుడు చిరంజీవి, తమ్ముడు పవన్కళ్యాణు మరియు అల్లు వారి చిరంజీవుతో పాటు
నారాయణ రావు, నరసింహరాజు, హరి ప్రసాదులూ 
నరేష్, సురేష్, సుమనూ & భానుచందరూ
వీబీరాజేంద్రుడి జగపతి, అసలు రాజేంద్రుడూ
తమకు తామై వేళ్లూనిన నట వృక్షాలు - శ్రీకాంత్, నాని, రవితేజాలు
వారసత్వపు మొలకలు - నితిన్, రామ్, శర్వానంద్ 
అల్లరి నరేష్ మొదలు అరవంలో తెలుగబ్బాయి విశాల్ దాకా 
మరియు మంచు మోహనుడి వారసులు... 
వారూ వీరని లేకుండా
ఎందరో  రైజ్ అయ్యే స్టార్ల నుంచి ఫాల్ అయ్యే తోకచుక్కల దాకా  
కొత్తా-పాల మేల్బంతులు - ఇంతులు - హీరోయిన్లు - ఎవ్వరైనా సరే
ఎలాంటి ఇష్టాయిష్టాలకీ తావివ్వకుండా 
తీసిందే మహా ప్రసాదమనుకుని 
బడ్డింగ్ దర్శకుడైనా , డబ్బింగ్ వీరుడైనా 
టిక్కెట్టు కొని మరీ చూసి 
ఒకవేళ హాలుకి వెళ్లే వీలు కుదరకపోతే పే-పర్-వ్యూలో చూసి 
యూ-ట్యూబు లో వీక్షించి 
టీవీలో "వేసిందే వేత - చూసిందే చూత" గా ఎన్ని సార్లు వేసినా అవే సిన్మాలు మళ్లీ మళ్లీ చూస్తూ... 

తీసేదే మనకోసమైతే చూడకపోతే ఎలాగనుకుంటూ
తీస్తుంది చూడకపోతే ఇంకా తీయరేమో అని బెంగెట్టేసుకుంటూ
తీసిన వాళ్ళకి పెట్టిన డబ్బులైనా రావాలని కోరుకుంటూ
తీసిన దానికి ఎక్కువ డబ్బులొస్తే ఇంకా ఇంకా తీస్తారని ఆశ పడుతూ -

మా యథాశక్తి సిన్మారాధనని విజయవంతంగా అనేక వారోత్సవాలలాగా నిర్వహిస్తున్నాము - నేను, నాతో పాటు నిర్బంధ-వీక్షుకుడిగా బదరి (సిన్మా పేర్లు పడే దగ్గర నుంచి శుభం అన్న అక్షరాలు కనపడే దాకా అష్ట దిగ్బంధం మరి తనకి :) )

మిస్సవ్వకుమీ థియేటరులోన 
మిస్సవ్వకుమీ టీవీయందును 
మిస్సవ్వకుమీ ఐమాక్స్ నందున 
మిస్సవ్వకుమీ సినిమా నెప్పుడు నయమిది సిన్మతీ!:)


 


  

16 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఈ కమెంట్ తో కలిగిన - నా సంతోషమూ, ఉత్సాహమూ - కూడా ఆగట్లేదు :)

      తొలగించండి
  2. ఆఫీస్ కి వెళుతున్నా నేను నవ్వుతుంటే డ్రయవర్ భయం...భయం .గా చూస్తున్నాడు !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీ నవ్వునీ, ఆ డ్రైవర్ భయాన్ని తలుచుకుని, తలుచుకుని నవ్వుకుంటున్నాను :)) మొత్తానికి నా పోస్ట్ నిన్ను నవ్వించినందుకు సంతోషం. థాంక్స్, హనుమాన్!

      తొలగించండి
  3. సిన్నమ్మీ! నీ 'సిన్మావలోకనం' తో సేసిన 'సిన్మాయ' , 'పెన్మాయ' యే గాని 'సిన్మాయ' కాదు సుమీ!

    సిన్మాతయు దయచేతను
    నీ రూఢిగ సకలజనులు నౌరా యనగా
    సిన్మాయలైన సంధుల
    నవులూరగ జనులు నవ్వ నుడివితివీ సిన్మతీ!




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వహ్వా, వహ్వా - నా సిన్మతీ పద్యాలని పొగుడుతూ ఇంకో సిన్మతీ!
      నా ఈ పోస్ట్ కి ఇది పెద్ద ప్రశంస.
      ఒక మాట లక్ష్మీ! నువ్వన్న "పెన్మాయ" కి మనిద్దరి అర్థం "పెను మాయ లేక పెద మాయ" అయితే - దానికి బదరి తీసిన అర్థం "పెన్" మాయ :) Your comment & B's new meaning for it - both made my day!

      తొలగించండి
  4. మీరు చూస్తున్న ఇంగ్లీష్ సినిమాల గురించి కూడా వ్రాసేస్తే ఒకపని అయిపోయేది కదా ? ఈ సినిమాలన్నీ చూసేసాను కొత్తవి చూద్దామనీ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది మొదలేనండీ - ఇంకా బోల్దన్ని సినిమా కబుర్లు వుంటాయి - ముందు ముందు నా బ్లాగ్ లో.
      తప్పకుండా ఇంగ్లీష్ సినిమాల గురించీ కొన్ని కబుర్లు వుంటాయి.
      ఈలోగా వీలైతే Pawn Sacrifice చూడండి - that's about the American Chess Grand Master - Bobby Fischer.

      తొలగించండి
  5. అమ్మో అందుకేనండీ ఎక్కడెక్కడి మంచి మంచి పాత పాటలన్నీ భలే చెప్పేస్తున్నారు మీరు :)
    మీ సిన్మావలోకనం బాగుంది...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సినిమా చూడందే వారం గడవదండీ నాకు :) ఇంక పాటంటారా - నా రోజు పాటతో మొదలయి పాటతోనే ముగుస్తుంది. నేనడిగిన, నాకు దొరకని పాటలని ఓపికగా పోస్ట్ చేస్తున్న మీకు థాంక్స్ చెప్పడానికి ఇంకొంచెం మంచి మాట వుంటే బాగుండును :)

      తొలగించండి
  6. సిన్మాయనం చాలా సరదాగా సాగింది....ఇంటర్వెల్ కబుర్లు కూడా కొన్ని చేర్చు 😃
    Very truly reflects our generation which grew up on cinema...keep it up

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సినిమా కబుర్లంటూ మొదలు పెడితే వాటికి అంతం వుంటుందా - ఇంటర్వెల్ కబుర్లు, ఇంటికి-వెళ్తూ కబుర్లు - చూద్దాం - ఇంకెన్ని రాయగలనో! For sure, there will be more. Stay Tuned!

      తొలగించండి
  7. ఇంతింతై, తెరకింతై, మరియు తానింతై ఐమాక్సుపై
    నంతై, అంతర్జాలమండలాగ్రమున కల్లంతై, యూట్యూబు రాశిపై
    నంతై, టీవీలందంతయై, తారలపైనంతై, మహాతెరపై
    నంతై, చిత్రపదోన్నతుండగుచు సెల్యులాయిడాంతసంవర్ధియై

    (ఏదో ప్రయత్నించాను మీ స్పూర్తితో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతం, శ్రీనివాస్‌గారు - మీ పేరడీ-భాగవత పద్యం చాలా బావుంది! నా స్ఫూర్తి అని మీరనడం మీ మంచితనం - తప్ప నా గొప్పదనం కానే కాదు. నా సిన్మతీ పద్యాలు చదినందుకు మాత్రం - చాలా థాంక్స్ ! ఒకప్పుడు ఈ పోస్టులన్నీ చాలా ఇష్టంగా రాసుకున్నవి - అందులోనూ ఒక పోస్ట్ ఉన్నట్లు ఇంకోటి ఉండకూడదు అని నాతో నేనే పోటీ పడి రాసుకున్నవి. వీటిని ఎవరైనా చదివి కమెంట్ పెడితే చాలా సంతోషంగా అనిపిస్తుంది.

      తొలగించండి
  8. కొందరు పేరడీలు మరికొందరు హాస్యము జల్లి పద్యముల్
    కొందల మంది కొంద రివి కూడ లిఖింపు మటన్న కోరికల్
    కొందరు నవ్వు లాపుకొన కుండని కారు ప్రయాణముల్ భళా !
    మందిని మంత్ర ముగ్థులుగ మార్చెగదా ! లలితమ్మ బాపురే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆత్మీయమైన మీ పద్యవ్యాఖ్యకు ధన్యవాదాలు, వెంకట రాజారావుగారు!

      తొలగించండి