29, జూన్ 2019, శనివారం

ఎంత బాగా చేశావయ్యా...ఏజెంటాత్రేయా!

అనగనగా ఒక ఊరు - అదే అందరికీ తెలిసిన నెల్లూరు.
ఆ వూళ్ళో ఓ ఏజెంటు  - నెల్లూర్లో వెలిసిన FBI ఏజెంటు.
  
కాడతను , కానే కాడు ఏజెంటాఫ్ ఎల్లైసీ.
తాను చేసేది దేశీ జాసూసీ.

ఈ సరి కొత్త డిటెక్టివ్ హీరో...
తెలుగు తెరకో pseudo షాడో!

కోటు తొడిగి, టోపీ పెడితే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.
ఏ నైటో కలవరించి, కళ్ళ నీళ్లు తిరిగే వేళ శ్రీను అనే అమ్మ చాటు పాపాయే!

ఏజెంటాత్రేయకి ఓ అసిస్టెంటు స్నేహ.
వీళ్ళిద్దరి బంధం ఏజెంటు-అసిస్టెంటు - అంతే!

డ్యుయెట్లు లేవ్, రొమాంటిక్ ట్రాకుల్లేవ్.
కాలితో తన్ని పడిపోతే నవ్వుకునే అ-కామెడీ జోకుల్లేవ్.

కాకపోతే కథ చెప్పేది కాదు.
చెప్పేస్తే సరదా లేదు.
చూడాల్సిందే!

రెండు గంటల సినిమాలో ఫ్రేమ్-ఫ్రేముకి వున్న చిన్నచిన్న డీటెయిల్స్ ఎవరికి వాళ్ళు చూసి నవ్వుకోవాల్సిందే!
చూసే సినిమాలో ఉత్సుకతనీ, కుతూహలాన్నీ పెంచేలా వున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విని, వింటూ సినిమా చూసి నచ్చుకోవాల్సిందే! 

మా  ఇంట్లో కిందటి వారమే మాట్లాడుకున్నాం ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా గురించి. పెద్ద హీరోల సినిమాలు ఎవరైనా చూస్తారు, మనం మాత్రం ఇలాంటి కొత్తవాళ్ళు తీసే మంచి సినిమాలు మాత్రం తప్పకుండా థియేటర్లో చూడాల్సిందే అని కూడా అనేసుకున్నాం.

అనుకున్నాం కదా మరి...ఆన్లైన్లో టికెట్లు కొనేసుకున్నాం. శుక్రవారం అంటే నిన్న నాలుగింటికి చూస్తే మావే మొట్టమొదటి టికెట్లు. ఇంకా ఎవరూ కొనలేదు.

రాత్రి తొమ్మిదింటికి మేము సినిమా హాల్లో అడుగు పెట్టగానే కనిపించిన ఇంకో నలుగురంటే నలుగుర్ని మాత్రమే చూసి ఓ నిముషం ఉసూరుమనిపించింది. కానీ సినిమా ఇంకో పది నిముషాల్లో మొదలవుతుందనగా సీట్లు గబగబా నిండడం చూసి అదేదో మా సొంత సినిమాకే అందరూ వచ్చేస్తున్నట్లు మురిసిపోయాం. చూస్తున్నంత సేపూ థియేటర్లో బోల్డన్ని నవ్వులు, నవ్వులు ఆగినంత సేపూ ఊపిరి బిగపెట్టినంత నిశ్శబ్దం. అసలీ ఈ సినిమా ఇంటర్వల్లో నాకైతే పక్కనున్న వాళ్ళు నాకస్సలు తెలీకపోయినా పలకరించేసి "సినిమా బావుంది కదా!" అని చప్పట్లు కొట్టాలనిపించింది. సినిమాలో అక్కడక్కడ తళుక్కున మెరిసిన నెల్లూరు యాస భలే నచ్చింది మాకు!

ఇంక సినిమా గురించి ఏమన్నా చెప్పాలీ అంటే... ముందే చెప్పినట్లు కథ కానీ, కథ గురించి హింట్ గానీ ఇవ్వకుండా - ఉట్టుట్టినే పైపైన చెప్తా...

పొద్దున్నే మీ ఇంటి ముందు కట్టిన బుట్టలో పాల పాకెట్లు పోతున్నాయా?
దొరికిన ఇద్దరు దొంగల్లో ఎవరు అసలు దొంగోఅంతుపట్టట్లేదా?
చెయ్యని నేరానికి జైల్లో పడితే బెయిలు కావాలా? 

"సమస్యలతో రా...
పది సమస్యలతో రా ...
పదిపది పెంచుకుంటూ రా ...
భయం లేదు పరిష్కారం పది సెకన్లలో ...
ఇచ్చట అన్ని కేసులు పరిష్కరించబడును."
అని  పిలిచేస్తున్నాడు మన FBI నెల్లూరు ఏజెంటాత్రేయ. 
అతనికి సాయం వుంది క్యూట్ & స్వీట్ అసిస్టెంటు స్నేహ 

ఔటాఫ్ స్టేట్ సమస్యలకి సంప్రదించండి - FBI హసన్, కర్ణాటక ఏజెంటు బాబీ. 

ఇంకెందుకాలస్యం!


"థియేటర్‌కి రా...
పది మందితో రా ...
పదిమందిని కలుపుకుంటూ రా...
కథ వుంది, కాలక్షేపం వుంది రెండు గంటల్లో ... 
ఇచ్చట ఎన్నో నవ్వులేరుకోవచ్చును."
అని పిలుస్తోంది...  ఓ మంచి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ!


~సినీ-మా-లక్ష్మి


23, జూన్ 2019, ఆదివారం

చినుకు కోసం...

మొన్నా...నిన్నా...రేపటికి నిన్నా 
ఎండాకాలపు ఎండ ఉసురుసురనిపిస్తుంటే
"అబ్బబ్బా" అనుకున్న మాటేదో వినబడ్డట్టు, 
ఆ పై మాటింకేముంటుందా విందామనుకున్నట్టు 
మబ్బులన్నీ గుంపులు గుంపులుగా ఉరికురికి వచ్చేశాయి
ఎండ నేలకు సోకకుండా నల్లని గొడుగు పట్టి నిలిచాయి
గాలి వాలున నీటిజాలుల కురిసి పోశాయి. 

కిటికీ కవతల కురిసే వానలో 
తలంటోసుకుని తళతళలాడుతున్న చెట్లని చూస్తూ,  
మురుస్తూ రాసుకున్నదిది ... 
 
*********************************************

చిన్ని మొలక
చిట్టి  చిగురు
పలవరింపు ఎందుకోసం ?

మట్టి నేల
గడ్డి పూవు
ఎదురుచూపు దేని కోసం?

ఉరుము పిలుపు
మెరుపు వెలుగు
పుడమి ఎలుగు ఎవరికోసం? 

కారు మబ్బు 
చూరు నుంచి 
చిలకరింపు ఎందుకోసం ?

మింటి అంచున జారి జారి
వానవిల్లు పంచన  జాలువారి

ఉరికి ఉరికి
నేల పురికి

గాలి పురుల అల్లుకు
మేలి సరాల దారుల ఉరుకు 

చిందుచిందుకు తొణకు
అందకందక మిడుకు 

అల్లనల్లన దూకు వాన కోసం 
చల చల్లని చినుకు కోసం

చినుకు పోసే ఉసురు కోసం
ఉసురు పెంచే ఉనికి కోసం

ఉనికి కోసం...
ఉసురు కోసం...
చినుకు కోసం... 

*********************************************

19, జూన్ 2019, బుధవారం

త్వామనురజామి - 37 - సాయంత్రానికి ఏమి జరుగునో...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:  త్వామనురజామి - 36 - కొరియరు పోస్టులో... పక్షి బొమ్మలొచ్చాయి...

తెల్లవారగానే అంతా మామూలుగానే అసలు రాత్రి మేం మాట్లాడుకున్నది కలలోనేమో అన్నట్లు, మా మధ్య అసలు మాటలేమీ జరగనట్లు అమ్మా, నాన్నా, నేనూ మా అనుదిన-జీవన-స్రవంతిలో కలిసిపోయాం.

నేను తొందర్లోనే బెంగుళూరు వెళ్ళాలి NAL లో ప్రాజెక్ట్ చేయడానికి.

అమ్మ ఇంక ఆ ప్రయాణ సన్నాహాల్లో పడింది - ఏం చీరలు సర్దుకోవాలి, ఎన్ని సర్దుకోవాలి అనుకుంటూ.

అంతే కాకుండా ప్రయాణంలో తినడానికని - నాన్నకిష్టమని మజ్జిగట్లు, నాకిష్టమని సొజ్జప్పాలు - లక్ష్మి దొడ్డతో కలిసి బోల్డు హడావిడి పడుతూ చేసింది. లక్ష్మి దొడ్డ అవన్నీ ఒబ్బిడిగా టిఫిన్ బాక్సుల్లో పెట్టి ఓ వైరు బుట్టలో సర్దింది. వాటితో పాటు తాగడానికి పల్చటి మజ్జిగ కూడా ఓ సీసాలో పెట్టింది దొడ్డ, ప్రయాణంలో తాగితే కడుపులో చల్లగా ఉంటుంది అంటూ.

నేను కూడా నాక్కావాల్సిన పుస్తకాలు, బట్టలు అన్నీ సర్దుకున్నాను. వెళ్ళేది బెంగుళూరు కదా చలిగా ఉంటుంది అన్జెప్పి నా డిగ్రీ సెకండ్ ఇయర్లో బెంగుళూరు వెళ్ళినప్పుడు శ్రీను నాకు కొనిచ్చిన తెల్ల స్వెటర్ కూడా పెట్టుకున్నాను. దాంతో పాటు నాకిష్టమైన లిండాగుడ్‌మన్ రాసిన సన్ సైన్స్ పుస్తకం, బాపు కార్టూన్లు, బారిష్టర్ పార్వతీశం - ఇవన్నీ సర్దేసుకున్నా. వాటితో పాటు యూనివర్సిటీలో చదువైపోయినా ఇంకా మోజు తీరక వదిలిపెట్టలేని RL Peterson - Operating Systems పుస్తకం కూడా పెట్టెలో పెట్టేసుకున్నా.

నేనివన్నీ సర్దుకుంటూ సర్దుకుంటూ - సర్దుకుంటున్నంతసేపూ ఒకటే పాట - నేను సర్దుకోవాలనుకున్నవి ఒక్కోటి పెట్టెలో పెడుతూ - వాటిని పెడుతున్న ప్రతిసారీ - నోటికి వచ్చిన నాలుగు లైన్లు తిప్పితిప్పి అవే మళ్లీమళ్లీ పాడుతూనే వున్నా...

దిల్ దీవానా
బిన్ సజ్‌నా కే మానేనా
ఏ పగ్‌లాహై సమ్‌ఝానే సే సమ్‌ఝేనా

దిల్ దీవానా
బిన్ సజ్‌నా కే మానేనా

దిల్ దీవానా
బిన్ సజ్‌నా కే మానేనా
- అంటూ.

నేను పెట్టె సర్దుకుంటున్నంత సేపూ నా పక్కనే ఉండి అవీఇవీ అందిస్తున్న పప్పి, కుట్టి విన్నంతసేపు విన్నారు. ఇంకో సారి నేను దిల్ దీవానా బిన్ సజ్‌నా కే మానేనా అనగానే కుట్టి ఒక్కసారి గట్టిగా "మానేయవే బాబూ...ఎన్నిసార్లు మానేనా, మానేనా అనడుగుతావ్? అసలు నిన్నెవరు పాడమన్నారు?" అనరిచింది. దాంతో పాట మానేసి, ముందు ఉక్రోషంతో ఏడవబోయి - కానీ ఏడుపు రాక -  బోల్డంత నవ్వేసుకున్నా. 

మొత్తానికి అనుకున్నట్టుగానే అమ్మా-నాన్నా-లలితమ్మాయీ (అంటే నేనే) బయల్దేరి జులై ఆఖరి వారంలో బెంగుళూరు వెళ్లాం. ఎందుకంటే ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి నా ప్రాజెక్ట్ మొదలవుతుంది. రైలెక్కేముందు అమ్మ స్టేషన్‌లో వున్న హిగ్గిన్ బాథమ్స్ స్టోర్‌లో నాకోసం ఓ స్టార్ డస్ట్, ఒక టింకిల్, ఒక రీడర్స్ డైజెస్ట్, ఆంధ్రప్రభ వీక్లీ తీసుకుంది. ట్రెయిన్‌లో కూడా నాన్న నాకిష్టమైన సైడ్ బెర్త్ వచ్చేలా బుక్ చేశారు. హాయిగా కాళ్ళు జాపుకుని కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ, మధ్యమధ్యలో అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ, ఆకలేసినప్పుడు మజ్జిగట్లు, సొజ్జప్పాలు తింటూ, అవి చాలక అప్పుడప్పుడూ ట్రెయిన్ పాంట్రీ లోంచి వచ్చే వేడివేడి టొమాటో సూప్, కట్లెట్లు కొనుక్కుని తింటూ - పట్టాలమీద పడవలాగా ఊక్కుంటూ వెళ్తున్న రైలు కంపార్టుమెంటుతో పాటు ఊగుతూ-తూగుతూ మొత్తానికి బెంగుళూరు చేరాం.

రైల్వే స్టేషన్‌కి శ్రీను వచ్చాడు. అమ్మా, నాన్నా ఒక ఆటో, ఇంకో ఆటోలో నేనూ, శ్రీనూ ఎక్కి విజయనగర్ రెమ్‌కో లేఔట్‌లో వున్న శ్రీను వాళ్ళింటికి వెళ్ళాము. మేము ఇంటి దగ్గర ఆటో దిగ్గానే శ్యామల ఎదురొచ్చి పలకరించింది. వాళ్ళ పెళ్లి తర్వాత ఇదే మొదటిసారి నేను శ్యామలని చూడడం. కానీ అస్సలు కొత్తా-పాతా లేకుండా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది.

అంత దూరం రైలు ప్రయాణం చేసివచ్చామేమో - అందులోనూ బెంగుళూరు బోల్డంత చల్లగా వుంది -వేడి నీళ్ల స్నానం, వెచ్చవెచ్చని భోజనం కాగానే గెస్ట్ బెడ్‌రూంలో రగ్గు కప్పుకుని హాయిగా నిద్రపోయాను. ఎంత సేపు పడుక్కున్నానో తెలీలేదు. లేచేటప్పటికి భలే చలిగా, చీకటిగా వుంది. నేను లేచేటప్పటికి అమ్మా, నాన్నా, శ్రీను, శ్యామల అందరూ లివింగ్ రూంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

నన్ను చూడగానే అమ్మ "అదుగో లేచింది, త్రిపురసుందరి!" అంటూ నవ్వుతూ "వేడిగా పాలు తాగుతావేంటి?" అనడిగింది.

అమ్మలో ఏదో కొత్త హుషారు. ఈ మధ్య కాలంలో చూడని ఒక పెద్ద రిలీఫ్. నాకూ అమ్మని అలా చూడగానే భలే హాప్పీగా అనిపించింది. ఎందుకంటే అమ్మ తిరుపతి వచ్చి బదరిని కలిసి వెళ్ళినప్పట్నుంచి పాపం! ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగానే ఉంటోంది. పైకి నాతో ఏమీ  అనకపోయినా, నన్నేమీ అడగకపోయినా తనలో తాను తనకే ప్రశ్న వేసుకుంటూ, సమాధానమూ తనే చెప్పుకుంటూ వుంటున్నట్టుగా ఉంటోంది.

అమ్మ అలా అడగ్గానే శ్యామల "మా బెంగుళూరు వాతావరణానికి టీ బావుంటుంది" అని ఓ మాంఛి ఏలకులు వేసి చేసిన టీ ఇచ్చింది. ఇంక ఆ సాయంత్రం అంతా కబుర్లతో సరదాగా గడిచిపోయింది. అమ్మా, నాన్న ఓ రెండ్రోజులుండి బయలుదేరేట్టు. తిరుగుప్రయాణానికి కూడా టికెట్లు బుక్ చేసేసుకున్నారు.

ఆ మర్నాడు ఇంట్లో వాతావరణం ఏంటో కొంచెం సందడిగా వున్నట్లనిపించింది - ఇంట్లో వున్నది నిన్న వున్న వాళ్ళమే అయినా.  సాయంత్రం ఎవరో రాబోతున్నట్లు హడావిడి.

పొద్దున్నే లేవగానే అమ్మ నాతో "లల్లీ! తలంటు పోసుకుని రవి పెళ్ళికి కొనుక్కున్నావు చూడూ ...ఆ సాఫ్ట్ సిల్క్ చీర కట్టుకో. గుడికెళ్ళొద్దాం" అంది.

 "అదా? అది నాకు చాలా ఇష్టం. గుళ్లో కుంకాలు, పసుపులు అంటుకుంటే ఇంకెప్పుడూ కట్టుకోలేను. అయినా గుడి కెళ్లడానికి అదెందుకమ్మా?" నా అయోమయపు ప్రశ్న.

"అంటే... చక్కగా సాయంత్రం దాకా అదే వుంచుకోవచ్చు. మనింటికి పిన్ని, బాబయ్య వాళ్ళు వస్తారు కూడాను" అమ్మ చాలా నెమ్మదిగా అనునయంగా అదేదో సాయంత్రం ఏదో అద్భుతం జరగబోతోంది అన్నట్లు ఊరిస్తూ అంది.

"పిన్ని, బాబయ్య వాళ్ళా? పిన్ని, బాబయ్య కాకుండా ఇంకా 'వాళ్ళు' ఎవరు?" నా ఆరా.

"ఎవరో ఒకళ్ళు... ముందు తలంటుకురా... మళ్ళీ గుడిలో పూజ చేయించే టైముండదు" అమ్మకి అణిచి పెట్టుకున్న విసుగు పెరుగుతోంది.

ఇంకేం మాట్లాడకుండా వెళ్లి తయారై వచ్చాను - అమ్మ చెప్పిన సాఫ్ట్ సిల్క్ చీర కాకుండా - ఏరి కోరి బాందినీ  చుక్కల - మెంతి, వంగ, గులాబీ - మువ్వన్నె రంగుల  జెండా లాంటి  చీర కట్టుకుని.

నన్నా చీరలో చూడగానే  అమ్మ -  "అదేం చీర?" - అనడగబోయి ఆగింది - "ఏదో ఒకటి చీర కట్టుకుంది అంటే చాలు - ఏ కుచ్చుల స్కర్టో వేసుకోకుండా - అసలే చండిక" - అనుకుందో ఏమో!

తీరా చూస్తే ఇంకెవ్వరూ రెడీ కాలేదు. మైసూర్ రోడ్డులో వున్న రాజరాజేశ్వరి దేవాలయానికి రానూపోనూ ఆటో మాట్లాడి నన్నూ, అమ్మనే పంపించారు. నాకు అప్పుడే ఏదో డౌట్ వచ్చింది. నాకు తెలీకుండా ఏదో స్కీం జరుగుతోంది అని. ఏదో inkling సాయంత్రం నాకిష్టం లేనిది ఏదో జరగబోతోంది అంటూ.  కానీ అదేంటో సరిగ్గా తెలీట్లేదు. వచ్చేది ఎవరో అస్సలు క్లారిటీ లేదు. ఒక్క నిముషం  బోల్డంత తిక్కగా, ఉక్రోషంగా అనిపించింది. కానీ ఏం చేయగలను?  ఏదైతే అది కానీయ్ అనుకున్నాను.

గుళ్ళో విరాజిల్లుతున్న రాజరాజేశ్వరి అమ్మవారు నవ్వుతూ పలకరించింది - నల్లనిదేవి - చల్లనిచూపులతో.
అమ్మ గోత్రనామాలు చెప్పి కుంకుమ పూజ, అష్టోత్తరం చేయించింది.

పూజైపోగానే దండం పెట్టుకుని, ప్రసాదం పుచ్చుకుని - చేతిలో పువ్వు తల్లో తురుముకుంటూ ఇవతలకి వస్తూ అమ్మ ప్రశ్న - "ఏమని దండం పెట్టుకున్నావ్?" - అంటూ.

"నీ సంగజ్జెప్పు ముందు" - అన్నాన్నేను.

"ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు - సవ్యంగా అడిగిందానికి జవాబు చెప్పు" - అమ్మకి అప్పటిదాకా దాచుకున్న విసుగు కొంచెం-కొంచెంగా బయటికి వస్తోంది.

"సరే విను - నువ్వేం కోరుకున్నావో అదవ్వకూడదని నే కోరుకున్నాను" - ఒక్కొక్క అక్షరం నొక్కి పలుకుతూ చెప్పాను.

అమ్మ కోపం మీద కప్పుకున్న మురిపాల-తొరక కరిగిపోయింది.

"ఎందుకెందుకని ఊరుకుంటుంటే నీ వ్యవహారం శృతి మించుతోంది - మిగిలిన విషయాల్లో మీ నాన్నా, నువ్వూ ఒకటే అయినా ఈ విషయంలో నాదీ-నాన్నదీ ఒకే మాట - ఏంటనుకున్నావో?!" - అమ్మ బెదిరింపు.

"మాటే మీది - నేను కాదన్నానా? తతిమాదంతా నాది" - నా తిక్క సమాధానం. అసలే ఉక్రోషంగా వుంది మరి.

"ముద్దు చేసినందుకు బానే బుద్ధి చెప్పావు - నువ్వసలూ ... "- మాటలు వెతుక్కుంది అమ్మ

"....."  అమ్మకేం గుర్తు రావట్లేదో నాకూ తట్టట్లేదు.

" ఆ ... అదీ... నువ్వసలూ...  వయోముఖ-విషకుంభానివి. చూడ్డానికి అమాయకంగా ఉంటావు కానీ నీ పంతం నీదే" - అమ్మ మాటలు కోపంతో తడబడుతున్నాయి

"హహ్హహ్హ" - నవ్వాపుకోలేకపోయాను. 

"సిగ్గు లేనమ్మకి చిరునవ్వే సింగారం - ఎందుకా నవ్వు?"

"అదీ - పయోముఖవిషకుంభమమ్మా - వయోముఖ కాదు - పయః అంటే సంస్కృతంలో పాలు - అంటే పాలకుండలా కనిపించే విషపు కుండ  ---" నాకు నవ్వాగట్లేదు.

"నీ తెలివితేటలన్నీ నాదగ్గరే - అదేదో పనికొచ్చే విషయాల్లో చూపిస్తే అందరం సంతోషిస్తాం.

అమ్మకి ఇంక మాట్లాడలేనంత కోపం వచ్చిందని తెలుస్తోంది.

కాకపోతే ఇంకంతకన్నా ఎక్కువ మాట్లాడితే అసలుకే మోసం వస్తుందనుకుందో ఏమో ఇంకేమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఇద్దరం కల్సి ఆటో ఎక్కి ఇంటికొచ్చేశాం.

మధ్యాహ్నం భోజనం చేసి శ్రీను దగ్గరున్న పుస్తకాల్లోంచి The Count of Monte Cristo తీసుకుని చదువుదామని పట్టుకుని సోఫాలో కూర్చున్నానే కానీ... 

సాయంత్రానికి ఏమి జరుగునో ఎటులూహించెదనూ 
అమ్మ ప్రణాళికను తప్పించుటకై ఎటుల సాహసించగలనూ ఊఁ ఊఁ ఊఁ  
(ఈ పాటే వరసలో ఉందబ్బా? ఎవరికైనా తెలుసా?)

  <<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

15, జూన్ 2019, శనివారం

గీతం...సంగీతం...సతతహరితం - 1 - తం తననం తన తాళంలో

పాట నా నవ్వు  - పాట నా నొవ్వు  
పాట నా తోడు  - పాట నా సైదోడు

నా మాట పాట - నా మౌనం పాట
నా ఊసు పాట - నా ఊహ పాట

పెదవులు కదపగ అలికిడి నా పాట 
కదలని పెదవుల మఱగది నా పాట 

ఒక్కో పాట వింటుంటే... 
గొంతు కలిపి పాడమంటుంది 
పాట రాని చోట, పాడలేని చోట, ఒప్పో-తప్పో పట్టని తననా-తానా-తంతననా తాళమౌతుంది 
వేళ్ళ చివర చిటికెలూరుతుంది 
పదం కదం తొక్కుతుంది
వంటింటిలో గరిట తిప్పేవేళ - కుతకుతలాడు కూరో,  కళపెళలాడు చారో -  ఏదోదాని లయకి  కాలి చిందవుతుంది
పగలంతా ఉనికి-చాటింపుకో, మనుగడ-పాటింపుకో చేసే కొలువులో అలసిన  మనసుకి విందవుతుంది
పాట నా నవ్వు.

ఒక్కో పాట పాడబోయి గొంతు విప్పితే... 
ఏదో గుర్తు కదిలి - పాడబోయిన గొంతు పాడలేనంటుంది
నన్నిక పాడమనకంటుంది
మాట వినక పాట సాగించబోయిన నా మీద అలిగి డగ్గుత్తికయిడుతుంది
కంటిలోన ఉబికిన నీరవుతుంది
పాట ఆగి, పాట నోపని బాధవుతుంది 
పాట నా నొవ్వు. 

ఒక్కో పాట పాడుతుంటే... 
మనసు నేల విడిచి నింగిమబ్బు అంచునచేరుతుంది, ఊగుతుంది, తూగుతుంది 
ఏవేవో లోకాల సాగుతుంది 
పాట లేని నేను ఏమౌతానో అనే బెంగ పుడుతుంది 
పాట నొదిలి ఉండలేని ప్రేమవుతుంది  
పాట నా తోడు. 

పాటని నేనెంత ప్రేమించానంటే... 
నేనే పాట పాడినా అది నాదవుతుంది 
నన్ను నీకిచ్చేసుకున్నా - నన్ను పాడుకుంటూ నువ్వుండిపొమ్మంటుంది 
నేనెలా పలికినా, పెగలక పిగిలినా  - ఏం ఫర్లేదు నీతోనే నేనున్నానంటుంది 
పాట నా సైదోడు. 

పాట నా నవ్వు  - పాట నా నొవ్వు  
పాట నా తోడు  - పాట నా సైదోడు.

*********************************************************************

ఒక్కసారైనా పాట నన్ను తాకని రోజుండదు.
నేను పాడని రోజుండదు.
నేను పాట వినని రోజుండదు.

అలా రోజూ వినే పాటల్లో కొన్ని విన్నప్పుడల్లా అవి ఏదో ఒక కాలానికి మాత్రమే సంబంధించినవిగా అనిపించవు. ఎన్నిసార్లు విన్నా పాత బడ్డట్టుగా వుండవు. ఇప్పటికి ఇంకో వందేళ్ల తర్వాత కూడా ఈ పాట విన్నప్పుడు నాలాంటి ఎవరో నేనిప్పుడు మురిసినట్లే సంబర పడతారు తప్పక అనిపిస్తూ ఉంటుంది.

అలాంటి పాటలకి భాషాభేదం ఉండదు. సమయాసమయాలు వుండవు. చెవులకి సోకినంతనే కళ్ళని వెలిగించి, ఉనికిని మరపించడమే ఆ పాట ప్రభావం.

ఎవరో రాసిన ఆ గీతం...దానికి ఇంకెవరో కూర్చిన సంగీతం... ఎప్పటికీ ఆ గీతం, సంగీతం... సతతహరితం.

అదుగో...అలాంటి సతతహరిత సంగీతభరిత గీతాలన్నిటినీ  పట్టి, ఈ చోట అట్టేపెట్టుకుందామని మొదలు పెట్టానీ గీత పరంపర.

అందులో మొదటగా భారతీరాజా తను దర్శించి మనకు సదృశం కావించిన కొత్తజీవితాలు సినిమాలోంచి ఓ పాట.
దీనికి లయ ఇళయరాజా సంగీతం.
గళపు హొయలు  పీసుశీల, ఎస్జానకి.
పాట - తం తననం తన తాళంలో . 

ఈ పాట ఎప్పుడు చూసినా హీరో, హీరోయిన్లైన హరిప్రసాద్, సుహాసినిల కన్నా వాళ్లకి దండలేస్తూ, వాళ్ళెక్కిన రథం లాగుతూ కూడా మండుటెండలో మల్లెపూలల్లా నవ్వుతూ కనిపించే తెల్లరెక్కల ఏంజెల్స్‌ని చూడడం నాకు భలే ఇష్టం.

ఆ ఏంజెల్స్ ఎలా ఉంటారూ - ఏం చేస్తుంటారూ అంటే... 
తమాషాగా గొడుగులు తిప్పుతారు
ఆకాశం నుంచి దేవకన్యల వర్షంలా కురుస్తారు
నేల మీద వెల్లకిలా వాలి పావురాళ్ళలా పాకుతారు
ఎండలో  వెన్నెల గువ్వల్లా నవ్వుతారు
ఇరువురి మనుషుల బరువు రథం లాగుతూ కిలకిలలాడుతూ పరుగులు పెడుతుంటారు
తమాషాగా చేతులూపుతూ నాట్యాలు చేస్తారు
పాటకి పెదవులు కదుపుతుంటారు
బెంగా, దిగులూ చేరని పాపల్లా కలకలలాడుతుంటారు
కలవరమెరుగని కలల కళ్ళతో తళతళమంటుంటారు
ఈ పాట నేను అచ్చంగా వాళ్ళ కోసమే చూస్తాను
చూస్తూ, నాకు వాళ్ళెంత నచ్చుతారో వాళ్లకి ఎలాగైనా తెలుపగలిగితే ఎంత బావుండునో అని ఈ పాట చూసిన ప్రతీసారీ అనుకుంటాను.
వాళ్ళ కోసమే మళ్లీమళ్లీ చూస్తుంటాను.
వాళ్ళని మీకూ చూపిద్దామని...

~పాటల భైరవి




తననం... తననం... తననం... తననం.త...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ.ఆ.
తం... తననం.తననం... తననం... తననం.

తం తననం తన తాళంలో 
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

తం తననం తన తాళంలో 
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

నవ భావనయే సుమ మోహనమై... 
ఆపై వలపై పిలుపై కళలొలుకగ

తం తన నంతన తాళంలో 
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

తనన తని నననని నననని తనన
తని నననని నననని తనన
తని నననని నననని తనన తనన తనన.

ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే... 
మది దోచెనులే... 
మరు మల్లెలు సైగలు చేసెనులే
ఆ... ఆ... ఆ... ఆ...
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే... 
మది దోచెనులే... 
మరు మల్లెలు సైగలు చేసెనులే

కన్నియ ఊహలు వెన్నెలలై... కదలే కదలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో... కన్నులు దాటిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే... చిరు మరులను చిలుకగ

తం తన నంతన తాళంలో
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

పొంచిన మదనుడు పువ్వుల బాణం... నాటెనులే
ఎద మీటెనులే 
పులకింతలు హద్దులు దాటెనులే
ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
పొంచిన మదనుడు పువ్వుల బాణం... నాటెనులే.
ఎద మీటెనులే 
పులకింతలు హద్దులు దాటెనులే

మ్రోగెను పరువం రాగిణియై... మురిసే మురిసే చెలి మోహినియై
వన్నెల చుక్కల  పందిరిలో... వెన్నెల రాయని కౌగిలిలో
ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే... మృదుమధురిమలొలుకగ

తం తన నంతన తాళంలో
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

నవ భావనయే సుమమోహనమై... 
ఆపై వలపై పిలుపై కళలొలుకగ...

తం తన నంతన తాళంలో
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

తం తననం తననం తననం తననం తననం

9, జూన్ 2019, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 17 - నా కళ్ళు ఎఱ్ఱనా...ఎక్కాయి చప్పునా...

కిందటి మాటు కబుర్లు:  అవతారంగారి నారాయణగారి బాబి - 16 - ౘాప కింద నీరు... తెచ్చిన తీరు!


1977 ఆగస్టు-సెప్టెంబర్ ప్రాంతంలో ఒకసారి మైసూర్ వెళ్ళొచ్చాను. ఒక మూణ్ణాలుగు రోజులు అక్కడుండి అక్కడ స్టాఫు, సెటప్ అంతా సరిగా ఉందో లేదో చూసుకుని వచ్చేశాను.  అక్కడున్న అజిత్ ఒంబత్కరె అంచెప్పేసి ఆయన కూడా మా గురువు గారే! నా కన్నా చాలా పెద్దవాడు. ఆయన "ఇంక ఇక్కడికి ఇంత దూరం వద్దురా నువ్వు. అక్కడే ఉండి వ్యవహారం చూసుకో" అని చెప్పేశాడు. దాంతో నేనింక మైసూర్ వైపు వెళ్ళలేదు.

ఫిబ్రవరి నుంచి జూన్ వరకు NLS-Northern Light Soils అని చెప్పి జంగారెడ్డి గూడెం ఏరియాలో అటువేపు ఉండేవాణ్ణన్నమాట. అంటే ప్రతి సోమవారం జంగారెడ్డిగూడెం వచ్చి శనివారానికి గణపవరం వచ్చేస్తూ ఉండేవాణ్ణి. తర్వాత ఏంటంటే జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా నేను గణపవరంలోనే ఉండేవాణ్ణి. ఉంటూ ఆ సౌత్ బ్రాంచెస్ ఉండేవి మాకు - మార్టూరు, రేలంగివరం చెక్క, ముప్పవరం, మేదరమెట్ల  - తర్వాత... అప్పటికింకా టంగుటూరు లేదు, కందుకూరు ఉండేది, కావలి దగ్గర. ఈ బ్రాంచెస్ అన్నిటికీ వెరిఫికేషన్‌కి వెళ్లి వచ్చేస్తూ ఉండేవాణ్ణి. అది పెద్ద పనేం కాదు. కాకపోతే నవంబర్, డిసెంబర్లో మాత్రం తప్పకుండా ఏజెన్సీకి వెళ్ళాల్సొచ్చేది.  ఆ ఏజెన్సీ రైతుల వ్యవహారం అదీ నేనే సెటిల్ చేశాను కదా! నే చెప్పినట్టుగానే అక్కడ స్వామిని మేనేజర్ని చేశారక్కడ.

ఇలా జరుగుతుండగా - మా సీతారామయ్య పంతులు గారికి 1977లో హార్ట్-స్ట్రోక్ వచ్చింది. ఆయనింక హెడ్డాఫీసుకే పరిమితమై పోయారు. బయటికి వచ్చేవారు కాదు. అంచాత ఏంటంటే జంగారెడ్డిగూడెంలో MVR ప్రసాద్ అని బ్రాంచ్ మేనేజర్ ఉండేవాడు. వాడూ నేనూ కలిసి CK రాజగోపాల్ అని మంగళగిరిలో పోలీస్ ట్రైనింగ్ అవుతున్నాడాయన. ఆయన అంతకు ముందు ILTD కంపెనీలో బయ్యరుగా పని చేశాడు జీరుగుమిల్లి, బుట్టాయిగూడెం ఏరియాల్లో. ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడి లక్ష్మయ్యగారికి చెప్పి ఆయన్ని కంపెనీ లోకి తీసుకునేలా చేశాం. ఆయన పోలీస్ డిపార్టుమెంట్ వదిలి వచ్చేసి జంగారెడ్డిగూడెంలో సర్కిల్ మేనేజరుగా చేరాడు. ఏలేశ్వరంలో నేమో స్వామి బ్రాంచ్ మేనేజర్. చైనులు క్యాషియర్.

సరే! ఇలా నడుస్తూ ఉండేది. నేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ దాకా జంగారెడ్డిగూడెం ఏరియా, నవంబర్, డిసెంబర్ ఏలేశ్వరం చూసుకునేవాణ్ణి. జనవరి నెల నాకు ఖాళీ. జనవరి నెల్లో పిల్లల్ని తీసుకుని అనాతవరం పండగలకి మా ఇంటికి వెళ్ళేవాణ్ణి. మా అమ్మ, మా అన్నగారు, వదిన, పిల్లలూ వుండేవాళ్ళక్కడ. పండగలకి వెళ్లి వాళ్ళందర్నీ చూసొచ్చేవాణ్ణి.

ఇలా జరుగుతూ ఉండగా ఏమయ్యిందంటే

1977-78లో సంగతి ఇది. నేను, VSV  ప్రసాద్, KTLN మూర్తి - మేం ముగ్గురం బీకామ్ డిగ్రీ మూడు సంవత్సరాలూ కూడా క్లాస్మేట్సుమి. , వాడూ,  క్లాస్మేట్సు. VSV ప్రసాద్ CA కూడాచేశాడు - వడ్లమాని ఉమామహేశ్వరరావు దగ్గర గుంటూర్లో. చేసి...  వీడు తర్వాత అనకాపల్లిలో విజయా బాంకులో క్లార్కుగా పని చేసేవాడు .

VSVP ఫ్రెండే కాకుండా మాకు చుట్టం కూడా. ఈ ఉమామహేశ్వరరావుగారు వాణ్ణి తీసుకొచ్చి కంపెనీలో ఇంటర్నల్ ఆడిటరుగా ప్రవేశ పెట్టాడు. వాడితో పాటు KTLN మూర్తి కూడా వచ్చి అకౌంట్స్ ఆఫీసులో క్లార్కుగా చేరాడు. మేం ముగ్గురం క్లాస్మేట్స్ కదా -బయట సరదాగా తిట్టుకుంటాం, జోకులేసుకుంటాం ఒకళ్ళ మీదొకళ్ళు. ఇలా నడిచేది.

వాళ్లిద్దరూ నాతోబాటే కంపెనీలో జేరింతర్వాత VSVPని బయటికి పిలిచి చెప్పా.

"ఒరే! నువ్వు ఇంటర్నల్ ఆడిటరుగా వచ్చావు. నాకు సుపీరియర్వి. నేనిక్కడ క్లెరికల్ పోస్టులో వున్నాను. అంచేత ఆఫీసులో వున్నప్పుడు నేన్నిన్ను 'ఏవండీ' అని పిలుస్తాను. 'ఏవండీ ప్రసాద్ గారూ' అనే మాట్లాడతా. నువ్వు మాత్రం నన్ను 'ఏవండీ' అనకపోయినా 'ఏవయ్యా' అన్నా పర్లేదు నాకు. కానీ 'ఒరే, అరే' అన్నావనుకో తాట లేచిపోతుంది. పిచ్చి వేషాలెయ్యొద్దు అలాగ. ఎందుకంటే మన ఇద్దరి రిలేషన్ వాళ్లకి తెలియకూడదు." అన్జెప్పి అన్నా.

వాడు కూడా "సరేరా! ఆఫీసులో ఉన్నప్పుడు అలా చేద్దాం. బయటికొచ్చినప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు" అంచెప్పేసి నాతో అన్నాడు.

KTLN మూర్తి, నేను 'ఒరే' అంటే 'ఒరే' అనుకునేవాళ్ళం మాఇద్దరి క్యాడర్ ఒకటే కాబట్టి. ఈరకంగా నడుస్తోంది.

ఈలోపులో ఏమయ్యిందంటే 1978లో నేను నవంబర్ నెలలో ఏలేశ్వరం దగ్గర అమీనాబాద్ కాలనీలో వున్నాను. బయ్యింగ్ జరుగుతోంది. దాదాపు వెయ్యి బేళ్ళెన్నో  వచ్చున్నాయి అక్కడ. బయ్యర్ వచ్చి బయ్యింగ్ చేస్తున్నాడు.

మా పంతులుగారి మేనల్లుడు ప్రసాద్ అని చెప్పి ఒహతనున్నాడు. మా పంతులు గారికి ఒక్కరే సంతానం. ఈ మేనల్లుడంటే మహా ప్రేమ ఆయనకి. 1978 నవంబర్ చివర్లో  మేమక్కడ బయ్యింగులో వున్నప్పుడు ఆయన హఠాత్తుగా కాలం చేశారు. ఏలేశ్వరం ఆఫీసుకి లైట్నింగ్ కాలొచ్చింది "ఇలా పంతులు గారు పోయారు. కామేశ్వరారావుకి, ప్రసాదుకి వెంటనే బయలుదేరమని" చెప్పేసి మా ఫ్యాక్టరీ మేనేజర్ సుబ్బన్నగారు ఫోన్ చేసి చెప్పారు. దాంతో ఆఫీసులో ఒకతను ఏలేశ్వరం నుంచి అమీనాబాద్ కాలనీకి వచ్చి ఆ కబురు మాకు చెప్పాడు.

అక్కణ్ణించి చేతిలో బులెట్ మోటార్ సైకిలుంది కదా! అప్పుడింక బస్సులు, గిస్సులు అంటే టైం సరిపోదు. ఎందుకంటే సాయంత్రమే కార్యక్రమాలన్నీ అయిపోవాలి. అప్పుడింక అమీనాబాదు కాలనీ నుంచి  నుంచి బయల్దేరి దాదాపు 24 కిలోమీటర్లు గెడ్డంగి మీదుగా ఏలేశ్వరం, 45 కిలోమీటర్లేమో హైవేకి రావాల. అక్కణ్ణించి ఓ 35-40 కిలోమీటర్లు రాజమండ్రి. రాజమండ్రి నుంచి 200 కిలోమీటర్లు విజయవాడ, మళ్ళీ విజయవాడ నుంచి చిలకలూరిపేట దాదాపు 60 కిలోమీటర్లుంటుంది. ఈ మొత్తం ప్రయాణం బుల్లెట్ మోటార్ సైకిల్ మీదే -  ప్రసాదు నెక్కించుకుని బయల్దేరి వచ్చేశాను.

రాజమండ్రిలో ఆగి హోటల్లో ఏదో తినేసి మధ్యాహ్నం మూడు గంటల కల్లా చిలకలూరిపేటలో వున్నాము. అప్పుడు ఊరేగింపు జరుగుతోంది. ఓ లారీ మీద పంతులుగార్ని పెట్టి పూలూ అవన్నీ జల్లుతూ, ఎక్కడెక్కడి నుంచో రైతులు, గ్రేడర్స్, కంపెనీ స్టాఫు - వీళ్లంతా మొత్తం చిలకలూరిపేట వీధుల్లో మధ్యాహ్నం మూడు గంటలకి మొదలుపెట్టిన ఊరేగింపు సాయంత్రం ఐదూ-ఐదున్నర దాకా సాగింది. ఆ కార్యక్రమాలన్నీ అయింతర్వాత ఆ రాత్రికి గెస్ట్ హవుసులో ప్రసాదుని విదిలేసి, నేను గణపవరంలో మా ఇంటికి వెళ్ళిపోయాను. మరసటి రోజు రెస్టు. సుబ్బన్నగారు కూడా "వద్దులే! వెళ్లొద్దు. ఇంకో రోజు ఆగెళ్ళు" అన్నాడాయన. అలాగే ఉండిపోయి ఆ తర్వాతి రోజు పొద్దున్నే ఐదింటికి నేనొక్కణ్ణే బయల్దేరి బుల్లెట్ వేసుకుని ఏలేశ్వరం వచ్చేశాను.

ఆ రకంగా ఆ సీజన్ అయిపోయింది. మళ్ళీ ఫిబ్రవరిలో NLS మొదలయింది. అంటే జంగారెడ్డిగూడెం ఏరియా. అంటే మేమందరం వెళ్ళాలి కదా అక్కడికి! వింటాబెక్స్ అనే కంపెనీ ఉండేది. టోనీ లూయిస్ కానీ, మాక్స్ బెలోనీ కానీ నేనొస్తే కానీ ఊరుకొనేవాళ్ళు కాదు. తప్పకుండా నేనక్కడ ఉండాల. సరే! ఇంకక్కడ బ్రాంచెస్ అన్నీ తెరిచి అక్కడే ఉండేవాణ్ణి. C. K. రాజగోపాల్ గారు సర్కిల్ మేనేజర్. నేను మామూలుగా నా పని బ్రాంచెస్‌లో చేస్తూ తిరుగుతూ ఉండేవాణ్ణి.

అక్కడ ఈలోపులో హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఒక రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - ఆయన్ని జంగారెడ్డిగూడెంలో కంపెనీకి తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే 78లో టోబాకోకి ఎక్సైజ్ పోయింది. చౌదరీ సింగ్ ప్రధాన మంత్రి అయినప్పుడు పొగాకు మీద ఎక్సైజ్ తీసేశాడు. ఒక ఫ్యాక్టరీ సేల్స్ మీదే కానీ రైతులు ఎక్సైజ్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ బెనెఫిట్ ఇచ్చాడాయన. అప్పుడేంటంటే ఎక్సైజ్ మీద పెద్ద పనేం ఉండేది కాదు. అంత పనేం లేకపోయినా పాత అలవాటు ప్రకారం కంపెనీలో ఎక్సైజ్ కొనసాగింది బుక్స్ అవన్నీ కూడా.

హరిశ్చంద్ర ప్రసాద్ గారు మాకు ఎక్సైజ్ ఇన్-ఛార్జ్. నేను, నా స్టాఫు పని చేసుకుంటూ స్టాటిస్టిక్సులో ఉండేవాణ్ణి.  వింటాబెక్స్ ఎకౌంట్ మెయిన్ నాకు.

హరిశ్చంద్ర ప్రసాద్ గారు నా దగ్గరి కొచ్చి "ఇదిగో కామేశ్వరరావుగారూ! మీరు ప్రతీ రిపోర్టు నాకివ్వాలి. నాకిచ్చింతర్వాతే వింటాబెక్స్ వాళ్ళకివ్వాలి" అన్నాడు.

అప్పుడు నేను "నాకు, మీకు సంబంధం లేదు. మీ పని మీరు చేసుకోండి. నా పని నంజేయనివ్వండి. అంతే గానీ నా జోలికి రావొద్దు." అని చెప్తే అది వినకుండా "ఇవ్వాలి, ఇవ్వాలి" అని గొడవ గొడవ జేసేవాడు. లెక్క ప్రకారం ఆయనకి నేనేం చూపించక్కర్లేదు. ఇలా విసిగిస్తున్నాడని ఎప్పుడడిగితే అప్పుడు, ఎంతవరకైతే అంతే సగంసగం చేసిన ఎకౌంట్లు చూపించేవాణ్ణి. నిజానికి ఆయనకవి ఎలాగూ అక్కర్లేదు, పైగా అర్థం అయ్యేవి కాదు. ఇంక నా జోలికి రావడం తగ్గించాడు.

సరే! ఆయన సంగతలా వదిలేస్తే VSV  ప్రసాద్ ఒకడు కొత్తగా జేరాడు కదా! మామూలుగా నేను చెప్పినట్టుగానే వాడు "ఏమయ్యా కామేశ్వరరావు!" అంటూ ఉండేవాడు. మాకు పెద్దగా పనిలో ఏ సంబంధమూ లేదు. వాడు ఎకౌంట్స్, నేను లీఫ్ సైడు. అయినా సరే బ్రాంచ్ ఎకౌంట్స్ అవీ చూస్తూండేవాణ్ణి కాబట్టి అవన్నీ పిలిచి అడుగుతూ ఉండేవాడు.

వాడు హెడ్డాఫీసులో వున్నప్పుడు ఓసారి నాగార్జునసాగర్ ప్రోగ్రాం పెట్టాడు. "ఒరే! రేపు మనందరం కలిసి నాగార్జునసాగర్ వెళ్తున్నాం ఫామిలీస్ తోటి" అంజెప్పేసి అంటే నేను ఇంట్లో చెప్పి, అందర్నీ రెడీ చేసుకుని - ఓ నాలుగు రోజుల్లో వెళ్దామని ప్లాన్. సరిగ్గా వెళ్లే రోజు పొద్దున్న ఐదింటికి పిల్లల్ని లేపి తయారు చేస్తుండగా వాడొచ్చి "ఒరే! కారు ఖాళీ లేదు. నువ్వు డ్రాప్ అయిపో" అన్నాడు. నాకిబ్బంది లేదు - నేనాగిపోతా. కానీ పిల్లలు - లల్లి, కుట్టి ఇద్దరూ మొహాలు వేళ్ళాడేసేసుకుని అప్పటివరకూ నాగార్జున సాగర్ వెళ్తున్నామంటూ ఎగురుతున్నవాళ్ళు కాస్తా ఒక్కసారిగా డల్ అయిపోయారు. వాళ్ళనలా చూడగానే అస్సలు నాకు చాలా ఇబ్బందనిపించింది. సర్లే! చూద్దాం. వీడి సంగతి. ఎప్పుడోకప్పుడు దొరక్కబోడు అని అప్పట్నుంచి వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండేవాణ్ణి.  KTLN మూర్తితో బానే ఉండేది.

ఇది జరిగింతర్వాత ఈ NLS వచ్చింది కదా! ఫిబ్రవరిలో బ్రాంచెస్ తెరిచాం. కొనుగోళ్లు మొదలు పెట్టారు. VSV ప్రసాద్ మార్చ్ నెల్లో జంగారెడ్డిగూడెం ఎకౌంట్ వెరిఫికేషన్‌కి వచ్చాడు . మరి వాడి క్యాడర్ ఇంటర్నల్ ఆడిటర్. CK రాజగోపాల్ సర్కిల్ మేనేజర్ కదా! ఆయన దగ్గర కూర్చుంటాడు. ఓ రోజు మధ్యాహ్నం పూట వీళ్ళిద్దరూ బీర్ తాగారు. తాగి మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఓ గంట రెస్ట్ తీసుకున్నారు. మూడున్నరకెంతకో ప్రసాద్ ఆఫీసుకొచ్చాడు. వచ్చి అకౌంట్స్ మొత్తం వెరిఫై చేయడం మొదలుపెట్టాడు. సాధారణంగా ఇంటర్నల్ ఆడిటర్ చేసే పనే అది.

ఆఫీసులో మొదటి గది రాజగోపాల్‌ది.

అప్పుడు ASN మూర్తి అనే అతను క్యాషియరుగా ఉండేవాడు. అతను గుంటూరతను. NBR ప్రసాద్ మేనేజర్. తర్వాతి గదిలో వీళ్ళుండేవాళ్లు.

మూడోది ఓ పెద్ద హాలు. ఆ హాల్లో నా సీటుండేది. మిగతా వాళ్ళందరూ నా స్టాఫు వుండేవాళ్ళు.  వాళ్ళందరి పనులూ నా కంట్రోల్లో ఉండేవి. స్టాటిస్టిక్స్, ఎక్సైజ్ వాళ్ళందరూ అక్కడ వుండేవాళ్ళన్నమాట.

సరే! ఈ మూడు గదులూ కూడా ఒక రైల్వే కంపార్టుమెంటులా ఒకదానికొకటి అనుకుని ఓపెన్‌గా ఉండేవి. ఇంక VSV  ప్రసాద్ అకౌంట్స్ చూస్తూ క్యాషియర్ దగ్గర కూర్చున్నాడు. పక్కనే NBR ప్రసాద్ వున్నాడు. ఆ పక్క గదిలో రాజగోపాల్ కూర్చున్నాడు.

ఇంతలో అకౌంట్స్ చూస్తున్నVSV ప్రసాద్‌కి నాది అడ్వాన్స్ అకౌంట్ ఒహటి కనబడింది అక్కడ. నేను చిలకలూరిపేట నుంచి వస్తుంటాను కదా! ఇక్కడ అడ్వాన్స్ వాడుతూ ఉంటా. వాడి మళ్ళీ అక్కడికెళ్ళినప్పుడు అకౌంట్స్ సబ్మిట్ చేసి తీసుకొచ్చి కాష్ కడుతూ వుంటాను. జరుగుతున్నది అది.

నా అడ్వాన్స్ అకౌంట్ కనపడగానే వీడు క్యాషియర్‌ ASN మూర్తిని అడిగాడు "ఏంటి? ఈయన అడ్వాన్స్ ఏంటిక్కడ?" అంటూ.

వెంటనే ASN మూర్తి "మరి ఆయన పేట నుంచి వస్తున్నాడు కదండీ ఇక్కడకి!. ఇక్కడ అడ్వాన్స్ తీసుకుంటుంటాడు. మళ్ళీ చిలకలూరిపేట వెళ్ళినప్పుడు ఆ బిల్స్ అవీ పెట్టుకుని, వచ్చినప్పుడు మాకేమో ఇక్కడ అడ్వాన్స్ క్లియర్ చేస్తూ ఉంటాడు." అంచెప్పేసి అన్నాడు.

NBR ప్రసాద్ కూడా నా ఫ్రెండే. వాడు కూడా "అదే జరుగుతోంది, ప్రసాద్ గారు! కాకపోతే వాడికి ఖర్చెక్కువ కదా! కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటాడు." అన్నాడు.

అనేటప్పటికి వీడేం చేహాడంటే నన్ను పిలిచాడు. ఆ పిలివడం కూడా ఎలాగా... బీరు తాగున్నాడు కదా "ఒరే కామేశ్వర్రావ్! ఇట్రా!" అన్నాడు.

అప్పటికే నాకు "ఓహో! మన ఒప్పందం జారిపోయింది. "ఒరే" కొచ్చేశాడు వీడు. అయినా చూద్దాం. ఇంకేం జరుగుతుందో" అనుకుని - ఎందుకంటే స్టాఫ్ అంతా వున్నారు కదా - వాళ్ళ ముందు అనవసరంగా ఆవేశపడి వాడి మర్యాద పోగొట్టకూడదు కదా! - అనుకుని వాడున్న రూంలోకి వచ్చాను. తలుపులన్నీ తెరిచే వున్నాయి.

"ఏరా! ఏంటిక్కడ అడ్వాన్స్ ఏంటి? అసలేమనుకుంటున్నావ్? నువ్వక్కణ్ణించి తెచ్చుకోవాలి. ఇక్కడ అడ్వాన్స్ తీస్కోకూడదు." అన్నాడు వాడు.

"ప్రతివారం వస్తున్నాను ఇక్కడికి. మరి అక్కణ్ణించి తెచ్చుకున్నది సరిపోదు కదా ! అందుకే అడ్వాన్స్ వాడుతున్నాను." అని నేను గౌరవంగానే మాట్లాడాను.

మాట్లాడితే వీడేం చేశాడంటే ఆ ASN మూర్తితో "ఇదో మూర్తీ! ఈ వెధవకి ఇంకిక్కణ్ణుంచి రూపాయివ్వకు నువ్వు. ఎందుకంటే వీడు ఇక్కడ తీసుకోవడం, అక్కడ బిల్స్ సబ్మిట్ చేయడం ఇలాంటివన్నీ నాక్కుదరవ్.  ఈ వెధవకి రూపాయివ్వకు" అన్నాడు.

అది వినగానే ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా స్టన్నైపోయారు. వాడు పెద్ద గొంతు పెట్టుకుని మాట్లాడేటప్పుడే వాళ్ళందరి దృష్టీ నా మీదుంది "కామేశ్వరరావుగారినేదో తిట్టేస్తున్నారు' అని.

ఎందుకంటే స్టాఫ్ అంతా నేను ఎంచుకుని పెట్టుకున్నవాళ్ళే! నా సంగతి వాళ్లందరికీ తెలుసు. 'ఈయన ఎలా రియాక్ట్ అవుతాడో ?!" అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉండగా - వీడెప్పుడైతే ఆ మాటన్నాడో నాక్కళ్ళు ఎఱ్ఱబడిపోయినయ్. వెంబడే ఒంగుని ఎడంకాలి చెప్పు తీసి చేత్తో పట్టుకుని రౌద్రంగా నిలబడ్డా.

అలా నించుని....

ఇక్కడికి ఆపుతా!

నా కళ్ళు ఎఱ్ఱనా ...
ఎక్కాయి చప్పునా ...
ఆ పైన ఏమైందో ...
ఆనక చెప్పనా...!


<వచ్చేమాటు తరువాయి కథ>

2, జూన్ 2019, ఆదివారం

నే...డ్డే చదవండి - 6 - యువరాజు



ఆగానని, ఆగి తాగానని – తింటానని, దెబ్బ తింటానని
అనుకోమాకు కలగనమాకు గోదారీ 
అంటూ తూగే ఓ ఆల్కహాలిక్ హడావిడి


కానిచోట కాశావు వెన్నెలా!
కారడవుల కాశావు వెన్నెల
ఎవరి కొరకు కాశావే వెన్నెలా?
అడవి కాసినా వెన్నెలా! ...
అంటూ సాగే ఓ మెలాంకలిక్ ఆరడి 


నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడి పోతే
అదే అచ్చట అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంటా 
అంటూ ఊగే ఓ రొమాంటిక్ మెలొడీ 

ఎప్పుడు పాడతారో 
ఎవరు పాడతారో 
ఎందుకు పాడతారో 
ఎలా పాడతారో 
తెలుసుకోవాలంటే 

నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
  జూన్ నెల సంచికలో...
ఈ లింక్ దారి వెంబడి నడిచి అలా అలా: జూన్ నెల సరదా సిన్మాయణం
 
మన్నించుమా చదువరీ!  ఈసారి సరదా సిన్మాయణంలో - చక్కగా కుదిరిన ఊరీఊరని మెంతిముక్కల్లో అక్కడక్కడా నలగక, నమిలే పంటి కింద పడి సతాయించే మెంతి బద్దల్లా  - ఓట్రెండ్మూణ్ణాలుగు అచ్చుతప్పులు చదివే కంటిని సతాయిస్తాయి.  వాటిని ఈ మాటుకి ఆట్టే పట్టించుకోకుండా చదివేస్తిరా - ఇంక మీదటకి, ఇంకో మాటుకి ఆ పొరపాటు అలవాటు కాకుండా చూసుకుంటానని ఖామీ (అనగా....ఖాయమైన హామీ) రాసిస్తున్నా!
 
~ సినీ-మా-లక్ష్మి వ్రాలు