15, జూన్ 2019, శనివారం

గీతం...సంగీతం...సతతహరితం - 1 - తం తననం తన తాళంలో

పాట నా నవ్వు  - పాట నా నొవ్వు  
పాట నా తోడు  - పాట నా సైదోడు

నా మాట పాట - నా మౌనం పాట
నా ఊసు పాట - నా ఊహ పాట

పెదవులు కదపగ అలికిడి నా పాట 
కదలని పెదవుల మఱగది నా పాట 

ఒక్కో పాట వింటుంటే... 
గొంతు కలిపి పాడమంటుంది 
పాట రాని చోట, పాడలేని చోట, ఒప్పో-తప్పో పట్టని తననా-తానా-తంతననా తాళమౌతుంది 
వేళ్ళ చివర చిటికెలూరుతుంది 
పదం కదం తొక్కుతుంది
వంటింటిలో గరిట తిప్పేవేళ - కుతకుతలాడు కూరో,  కళపెళలాడు చారో -  ఏదోదాని లయకి  కాలి చిందవుతుంది
పగలంతా ఉనికి-చాటింపుకో, మనుగడ-పాటింపుకో చేసే కొలువులో అలసిన  మనసుకి విందవుతుంది
పాట నా నవ్వు.

ఒక్కో పాట పాడబోయి గొంతు విప్పితే... 
ఏదో గుర్తు కదిలి - పాడబోయిన గొంతు పాడలేనంటుంది
నన్నిక పాడమనకంటుంది
మాట వినక పాట సాగించబోయిన నా మీద అలిగి డగ్గుత్తికయిడుతుంది
కంటిలోన ఉబికిన నీరవుతుంది
పాట ఆగి, పాట నోపని బాధవుతుంది 
పాట నా నొవ్వు. 

ఒక్కో పాట పాడుతుంటే... 
మనసు నేల విడిచి నింగిమబ్బు అంచునచేరుతుంది, ఊగుతుంది, తూగుతుంది 
ఏవేవో లోకాల సాగుతుంది 
పాట లేని నేను ఏమౌతానో అనే బెంగ పుడుతుంది 
పాట నొదిలి ఉండలేని ప్రేమవుతుంది  
పాట నా తోడు. 

పాటని నేనెంత ప్రేమించానంటే... 
నేనే పాట పాడినా అది నాదవుతుంది 
నన్ను నీకిచ్చేసుకున్నా - నన్ను పాడుకుంటూ నువ్వుండిపొమ్మంటుంది 
నేనెలా పలికినా, పెగలక పిగిలినా  - ఏం ఫర్లేదు నీతోనే నేనున్నానంటుంది 
పాట నా సైదోడు. 

పాట నా నవ్వు  - పాట నా నొవ్వు  
పాట నా తోడు  - పాట నా సైదోడు.

*********************************************************************

ఒక్కసారైనా పాట నన్ను తాకని రోజుండదు.
నేను పాడని రోజుండదు.
నేను పాట వినని రోజుండదు.

అలా రోజూ వినే పాటల్లో కొన్ని విన్నప్పుడల్లా అవి ఏదో ఒక కాలానికి మాత్రమే సంబంధించినవిగా అనిపించవు. ఎన్నిసార్లు విన్నా పాత బడ్డట్టుగా వుండవు. ఇప్పటికి ఇంకో వందేళ్ల తర్వాత కూడా ఈ పాట విన్నప్పుడు నాలాంటి ఎవరో నేనిప్పుడు మురిసినట్లే సంబర పడతారు తప్పక అనిపిస్తూ ఉంటుంది.

అలాంటి పాటలకి భాషాభేదం ఉండదు. సమయాసమయాలు వుండవు. చెవులకి సోకినంతనే కళ్ళని వెలిగించి, ఉనికిని మరపించడమే ఆ పాట ప్రభావం.

ఎవరో రాసిన ఆ గీతం...దానికి ఇంకెవరో కూర్చిన సంగీతం... ఎప్పటికీ ఆ గీతం, సంగీతం... సతతహరితం.

అదుగో...అలాంటి సతతహరిత సంగీతభరిత గీతాలన్నిటినీ  పట్టి, ఈ చోట అట్టేపెట్టుకుందామని మొదలు పెట్టానీ గీత పరంపర.

అందులో మొదటగా భారతీరాజా తను దర్శించి మనకు సదృశం కావించిన కొత్తజీవితాలు సినిమాలోంచి ఓ పాట.
దీనికి లయ ఇళయరాజా సంగీతం.
గళపు హొయలు  పీసుశీల, ఎస్జానకి.
పాట - తం తననం తన తాళంలో

ఈ పాట ఎప్పుడు చూసినా హీరో, హీరోయిన్లైన హరిప్రసాద్, సుహాసినిల కన్నా వాళ్లకి దండలేస్తూ, వాళ్ళెక్కిన రథం లాగుతూ కూడా మండుటెండలో మల్లెపూలల్లా నవ్వుతూ కనిపించే తెల్లరెక్కల ఏంజెల్స్‌ని చూడడం నాకు భలే ఇష్టం.

ఆ ఏంజెల్స్ ఎలా ఉంటారూ - ఏం చేస్తుంటారూ అంటే... 
తమాషాగా గొడుగులు తిప్పుతారు
ఆకాశం నుంచి దేవకన్యల వర్షంలా కురుస్తారు
నేల మీద వెల్లకిలా వాలి పావురాళ్ళలా పాకుతారు
ఎండలో  వెన్నెల గువ్వల్లా నవ్వుతారు
ఇరువురి మనుషుల బరువు రథం లాగుతూ కిలకిలలాడుతూ పరుగులు పెడుతుంటారు
తమాషాగా చేతులూపుతూ నాట్యాలు చేస్తారు
పాటకి పెదవులు కదుపుతుంటారు
బెంగా, దిగులూ చేరని పాపల్లా కలకలలాడుతుంటారు
కలవరమెరుగని కలల కళ్ళతో తళతళమంటుంటారు
ఈ పాట నేను అచ్చంగా వాళ్ళ కోసమే చూస్తాను
చూస్తూ, నాకు వాళ్ళెంత నచ్చుతారో వాళ్లకి ఎలాగైనా తెలుపగలిగితే ఎంత బావుండునో అని ఈ పాట చూసిన ప్రతీసారీ అనుకుంటాను.
వాళ్ళ కోసమే మళ్లీమళ్లీ చూస్తుంటాను.
వాళ్ళని మీకూ చూపిద్దామని...

~పాటల భైరవి




తననం... తననం... తననం... తననం.త...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ.ఆ.
తం... తననం.తననం... తననం... తననం.

తం తననం తన తాళంలో 
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

తం తననం తన తాళంలో 
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

నవ భావనయే సుమ మోహనమై... 
ఆపై వలపై పిలుపై కళలొలుకగ

తం తన నంతన తాళంలో 
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

తనన తని నననని నననని తనన
తని నననని నననని తనన
తని నననని నననని తనన తనన తనన.

ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే... 
మది దోచెనులే... 
మరు మల్లెలు సైగలు చేసెనులే
ఆ... ఆ... ఆ... ఆ...
ఉల్లము ఝల్లన అల్లరి తెమ్మెర వీచెనులే... 
మది దోచెనులే... 
మరు మల్లెలు సైగలు చేసెనులే

కన్నియ ఊహలు వెన్నెలలై... కదలే కదలే విరి ఊయలలై
పున్నమి వేసిన ముగ్గులలో... కన్నులు దాటిన సిగ్గులలో
తేనెలకందని తీయని కోరికలే... చిరు మరులను చిలుకగ

తం తన నంతన తాళంలో
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

పొంచిన మదనుడు పువ్వుల బాణం... నాటెనులే
ఎద మీటెనులే 
పులకింతలు హద్దులు దాటెనులే
ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
పొంచిన మదనుడు పువ్వుల బాణం... నాటెనులే.
ఎద మీటెనులే 
పులకింతలు హద్దులు దాటెనులే

మ్రోగెను పరువం రాగిణియై... మురిసే మురిసే చెలి మోహినియై
వన్నెల చుక్కల  పందిరిలో... వెన్నెల రాయని కౌగిలిలో
ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే... మృదుమధురిమలొలుకగ

తం తన నంతన తాళంలో
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

నవ భావనయే సుమమోహనమై... 
ఆపై వలపై పిలుపై కళలొలుకగ...

తం తన నంతన తాళంలో
రస రాగంలో మృదునాదంలో 
నవ జీవన భావన పలికెనులే

తం తననం తననం తననం తననం తననం

7 కామెంట్‌లు:

  1. I have heard this sing so many times and this is one of my favorite so GS too..... But the video, I swear, I saw it for the first time and it is unbelievable!!! The "angel energy" left me gasping for breath, and I had a good laugh!!!! But this is just the trimming. The real thing is the poetic preface!! Very nicely written... Yes, what would we do without songs?!!!!!?!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Aparne! When I write these songs I remember those days when we used to fill the margins of our note books with song lyrics. For us, Saasonse nahin...kadmon se nahin...geethonse chalthi hai duniyaa :)

      తొలగించండి
  2. ఈ పాట చాలా సార్లు విన్నాను, చూడటం ఇదే ఫస్ట్ . Thanks for sharing.పాట బావుంది కానీ సుహాసిని గారిని ఈ డ్రెస్ లో చూడలేకపోతున్నా.,,😢😢

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనూ చూడగలిగిన పార్ట్ గురించే రాయగలిగాను :) Thanks for your comment!

      తొలగించండి
  3. అపర్ణ శ్రీపాద24 ఫిబ్రవరి, 2024 12:53 PMకి

    Chala బావుందండీ పాట. చాలా బాగా రాశారు కూడా. Sorry vacation లో ఉండి మీకు చెప్పడం లేటయ్యింది.

    నాకెందుకో మీరు బాగా పాడతారనిపిస్తోంది. ఈసారి ఏదైనా మీకు నచ్చిన పాటో పద్యమో పాడి మీ బ్లాగ్లో వినిపించండి నాకోసం.

    నిజమే Angels హడావుడి చాలా ముద్దుగా ఉండి అసలు నటులను కనబడనీయలేదు. ఈ పాట వినడమే కానీ ఎప్పుడూ తీరిగ్గా చూడలేదు. ఇలా ఉండి ఉంటుందని అనుకోలేదు కూడా. వంశీ పాటల్లో కూడా ఇలాంటి దృశ్యాలు ఉంటుంటాయి. చాలా మంచి పాటని గుర్తు చేసినందుకు చూపించినందుకు ధన్యవాదాలు 🙏🥰🤗 ‎

    రిప్లయితొలగించండి