30, మే 2021, ఆదివారం

అదే కాయ - అదే పప్పు - అదే వద్దు!

    అప్పుడెప్పుడో - చదువుకునే రోజుల్లో గుంటూర్లో ఉన్నప్పుడు - నాన్న ఆఫీస్‌లో పనిచేసే వెంకటేశ్వర్లు - అప్పుడప్పుడూ - వాళ్ళూరి నుంచి వెన్న తెస్తూ, దాంతో పాటే వాళ్ళింట్లో కాశాయని ఓ రెండు పెద్దపెద్ద ఆనపకాయలు (తను వాటిని సొరకాయలు అనేవాడు) తెచ్చిచ్చేవాడు. 

    దాంతో మొదలు మాఇంట్లో ఆనపకాయ-వారోత్సవాలు. 

    ఆదివారం: ఆనపకాయ పులుసు

    సోమవారం: జీలకఱ్ఱ-ఎండుమిరపకాయ-కరివేపాకు వేసిన పోపులో ఆనపకాయ కూర 

    మంగళవారం: ఆనపకాయ తొక్కలు వేయించి ధనియాలు, జీలకఱ్ఱ, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, మెంతులు వేయించి, రెండు రెబ్బలు చింతపండు వేసి రుబ్బిన ఆనపకాయ-తొక్కల పచ్చడి 

    బుధవారం: ఆనపకాయ ముక్కలు, పెసరపప్పు ఉడికించి, జీలకఱ్ఱ-ఇంగువ-ఎండుమిరపకాయ-కరివేపాకు పోపేసి, దానికి combination గా కాల్చిన వంకాయని పచ్చిమిరపకాయ, కొత్తిమీరతో కలిపి చిన్న రోట్లో దంచి, చింతపండు పులుసు కలిపి - మెంతులు-ఆవాలు-ఎండుమిరపకాయ-ఇంగువ-కరివేపాకు పోపేసిన వంకాయ-పచ్చిపులుసు. 

    గురువారం: ములక్కాడ, అరటికాయ ముక్కలతో పాటు ఆనపకాయ ముక్కలు కూడా ఓ నాలుగేసి - వేయించిన ధనియాలు, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, రెండు మెంతి గింజలు, చిటికెడు జీలకఱ్ఱ, ఉడికిన కందిపప్పు, కొబ్బరి వేసి - రుబ్బి చేసిన -  సాంబారు 

    శుక్రవారం: ఇంకో నాలుగు ఆనపకాయ ముక్కలు వేసి చేసిన ఆవ-మిళిత-తోటకూర పులుసు 

    శనివారం: తెల్ల గుమ్మడి కాయ, ములక్కాడ, కేరట్, బంగాళాదుంప, వంకాయ ముక్కలతో పాటు - దీని కోసమే  దాచిపెట్టిన ఆనపకాయ ముక్కలు వేసి - ఉడకబెట్టి - కమ్మటి పెరుగు, రుబ్బిన కొబ్బరి-ధనియం-పచ్చిమిరపకాయ ముద్ద కలిపి - జీలకఱ్ఱ-ఆవాలు-ఇంగువ-సహిత నేతి పోపుతో చేసిన ఆవియల్. 

    అలా - అప్రతిహతంగా - ఆదివారం నుంచి శనివారం దాకా - మా అమ్మ జరిపించిన ఆనపకాయ-వారోత్సవాలలో - అప్పటికి "అబ్బా! ఆనపకాయ బాబోయ్!" అనుకున్నా - అనుకుకోండా ఆనపకాయ అలవాటు అయింది నాకు. 

    ఆనపకాయ దొరికితే పైన చెప్పిన ఏడు రకాలే కాకుండా నేను చేసే ఎనిమిదో రకం: పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకఱ్ఱ, ఎండుమిరపకాయలు, ఇంగువ నానబెట్టి కొంచెం కొబ్బరి వేసి రుబ్బి, ముందే ఉడకబెట్టిన ఆనపకాయముక్కలతో కలిపి పులిసీపులవని మజ్జిగలో రెండు పొంగులు రానిచ్చి, జీలకఱ్ఱ-ఆవాలు-ఇంగువతో నెయ్యిపోపు పెట్టిన మజ్జిగపులుసు. 

    అంతే కాకుండా మా అత్తగారు చేసినప్పుడు తిని, మహబాగా నచ్చేసి - నేను చేసుకునే తొమ్మిదో రకం - పాలుపోసి చేసే ఆనపకాయ కూర. 

    మొత్తానికి - నవనవలాడే ఒక్క ఆనపకాయతో - నవ-కాయ-వంటలు చేసేసుకుంటూ ఉంటా.   

    ఇప్పటికీ ప్రతివారం కూరలు తెచ్చుకునేటప్పుడు నేను ఆనపకాయ కొనకుండా ఇంటికి రాను. ఒకేవేళ నేను మర్చిపోయినా తను గుర్తు చేసి మరీ నా చేత ఆనపకాయ కొనిపిస్తారు బద్రి. 

    కూరల మధ్యలో లేతాకుపచ్చ రంగులో మెరిసిపోయే ఆనపకాయలని చూడగానే మెరిసే నా కళ్ళు చూసి "కూర బాసలు తెలుసు లల్లికి" అనుకుంటూ, ఆ నాటి పూలబాసల ఎంకిని తలిచి మురిసిన నాయుడుబావలా, ముసిముసినవ్వులు నవ్వుకుంటుంటారు కూడా. 

    ఇక్కడితో నా ఆనపకాయోపాఖ్యానం సమాప్తం. 


*******
*******


    అమెరికా వచ్చిన కొత్తలో ఒకానొక శనివారం... 

    మేము అంతకుముందు రోజే ఆనపకాయ కొనుక్కొచ్చినవారం. 

    నేను అత్యుత్సాహంగా పెసరపప్పు-ఆనపకాయ ముద్దకూర చేసి - వేడివేడి అన్నంలో నెయ్యి వేసి, నే చేసిన ముద్దకూర కలిపి, కోతీ-ఢాం-ఢాం కథ చెప్తూ - అన్నజింకకి ఆమ్ తినిపిస్తున్నాను. 

    గుండ్రటి కళ్ళతో - కనురెప్ప వేస్తే చెప్పే కథ ఆపేస్తానేమోనన్నట్టు - నన్నే చూస్తూ - నే చెప్తున్న కథ వింటూ వాడూ తింటున్నాడు. 

    పెసరపప్పు-ఆనపకాయ ముద్దకూర కలిపిన అన్నం తినిపించడం అయ్యింది. తర్వాత పెరుగు-అన్నం కూడా గబగబా తినేశాడు. 

    అంతా అయ్యాక -మూతి కడుక్కుని,  బుజ్జిగ్లాసులో మంచినీళ్ళు తాగేసి - ఎప్పట్లా వెళ్ళి వాడి బొమ్మలతో ఆడుకోకుండా - నాకేసే చూస్తూ నించున్నాడు. 

    ముందు నేను పట్టించుకోలేదు కానీ - ఒక రెండు నిముషాలయ్యాక వాడేదో చెప్పాలనుకుంటున్నాడేమో అనిపించి "ఏం మున్నుగాడూ! ఇంకా ఇక్కడే ఉన్నావూ? ఏమన్నా కావాలా?" అని అడిగాను. 

    బుజ్జిగాడు వెంటనే నా దగ్గరకొచ్చి - నా చేతిని వాడి బుల్లిబుల్లి చేతులతో పట్టుకుని - "అమ్మా! నువ్వు ఆ yellow పప్పు చాలా బాగా చేశావు. కానీ... నాకు ఇంకెప్పుడూ కల్పొద్దమ్మా..." అని నెమ్మదిగా -  నేను నొచ్చుకోకుండా - నేను చేసిన పప్పుని మెచ్చుకుంటూనే - అది తనకి నచ్చలేదని - నాకు నచ్చచెప్తున్నటు - వాడు చెప్పిన తీరుకి - ఏమనగలను?! 

    ఆ తర్వాత పెసరపప్పు-ఆనపకాయ వండడం మానలేదు కానీ - అది వండినరోజు బుజ్జిగాడి కోసం వేరే పప్పు చేసేదాన్ని. 

*******
*******


    ఇప్పుడు అన్నజింకకి తమ్ముడు బుజ్జిజింక తోడయ్యాడు. 

    నేనెప్పుడైనా  - seasonal గా దొరికే చిక్కుడుకాయలతో కూర చేసినా, అరుదుగా దొరికే గోంగూరతో పులుసు కూర చేసినా -  తినము అంటే తినమని ఇద్దరూ ఒక మాట మీదే ఉంటారు. 

    "ఇది చేసి చాలా రోజులయ్యిందిరా! నేను ఎప్పుడో కానీ చెయ్యను కదా! మీకు అన్ని రుచులూ తెలియాలంటే ఇలా అన్ని రకాల కూరలూ తినాలి" అనంటాను నేను.  

    బద్రి కూడా "అమ్మ ఈ కూర చాలా బాగా చేస్తుంది. కొంచెం అన్నంలో కలుపుతుంది. తిని చూసి నచ్చకపోతే వదిలెయ్యండి" అని ఎంత చెప్తారో!

    దానికి అన్నదమ్ములిద్దరూ "నాన్నగారూ! మీరు అబద్ధం చెప్పకండి. అమ్మ ఇది last week చేసింది - మాకు తెలీదనుకున్నారా?" అని దబాయించేసి నా చేత వేరే అన్నం కలిపించేసుకుంటారు.  

    కిందటి వారం అన్నజింక ఆఫీస్ పని మీద బోస్టన్ వెళ్ళాడు. 

    ఇక ఇంట్లో ఉన్న బుజ్జిజింక - నేను వండుతున్నప్పుడు వాడికి వాసన నచ్చిందని - వంకాయ-కొత్తిమీర కారం కూర అడిగి మరీ తిన్నాడు. 

    ఇదే మంచి అవకాశం అని చెప్పి మరసటి రోజు పెసరపప్పు-ఆనపకాయ ముద్దకూర చేశాను - వాడి చేత ఎలాగైనా తినిపించాలని. మళ్ళీ అన్నగాడు వస్తే నా మాట వినడు మరి! 

    అసలే ఆన్లైన్ స్కూల్.  

    మధ్యాహ్నం  lunch time -  స్కూల్ మధ్యలో వచ్చి తినడం కదా చాలా హడావిడిగా తినేస్తాడు.  పైగా ఈ కొత్త కూర అప్పుడు పెట్టి వాణ్ణి విసిగించడం ఎందుకులే అని రాత్రి భోజనంలో అన్నం కలిపేటప్పుడు వాడికి చెప్పే కలిపాను. 

    "నాన్నగాడూ! నిన్న వంకాయ-కొత్తిమీర కారం కూర నీకు నచ్చింది కదా! అసలు నువ్వు ఇంతకుముందు అన్నీ తినేవాడివి. ఇదిగో! ఇవాళ పెసరపప్పు-ఆనపకాయ కలుపుతున్నాను. తిని చూడు. నీకే తెలుస్తుంది. ఎంత బావుంటుందో!" అంటూ కలిపిన కంచం వాడి చేతికిచ్చాను. 

    పేపర్లో కార్టూన్స్ చదువుకుంటూ తింటున్నాడు. 

    తింటూ తింటూ "అమ్మా! ఒక పేపర్ తీసుకుని, దాని మీద  నేను ఇవాళ ఈ పప్పు తిన్నానని రాయి" అన్నాడు. 

    అది వింటూనే నేను  - ఏదో సరదాగా అంటున్నాడని "రాస్తాలేరా! ముందు తిను" అన్నాను. 

    ఈ లోగా వాడు ఆ అన్నం తినేసి, తర్వాత టొమాటో పచ్చడి అన్నం కలపమని వంటింట్లోకి వచ్చాడు. పచ్చడి వాడికి చాలా ఇష్టం. 

    వచ్చాడే కానీ కంచం నా చేతికివ్వడే!

    "కంచం ఇటివ్వరా నాన్నా! పచ్చడి అన్నం కలుపుతాను" అని నేనంటే "ముందు నువ్వు పేపర్ మీద నేను చెప్పినట్టు రాయి" అన్నాడు. 

    "సరే! నీకు అన్నం కలిపాకే రాస్తాను!" అని నేను. 

    "నువ్వు రాశాకే అన్నం కలుపుతావు" అంటూ వాడు. 

    "చూద్దాం! కంచం ఇవ్వకుండా ఎంత సేపుంటావో!" అని నా సవాల్. 

    "నీ ఇష్టం! నేనెంతసేపైనా తినకుండా ఉంటాను" అని వాడి జవాబు. 

    ఇంకేం చేస్తాను?!

    పక్కనే ఓ sticky note ఉంటే అది, దాంతోపాటే ఒక పెన్ను తీసుకున్నా. 

    వాడు చెప్పింది రాశాను. 

    రాయగానే "అమ్మా! కింద sign చేయి" అన్నాడు. 

    సంతకం చేశాను. 

    "ఇవాళ్టి Date రాయి" అన్నాడు. 

    రాశాను. 




    వెంటనే వాడి కంచం నా చేతికిచ్చి, టొమాటో పచ్చడి - అన్నం  కలపమని చెప్పి - ఆ నోట్ పట్టుకుని వాడి రూం లోకి వెళ్ళి - ఒక ఫోటో తీసుకుని, ఆ నోటుని వాడి టేబుల్ మీద పెట్టుకుని -అప్పుడు కిందకొచ్చి అన్నం తిన్నాడు. 

    "అలా ఎందుకురా చేశావ్?" అంటే "ఈసారెప్పుడైనా 'నువ్వు ఈ పప్పు తినలేదు, ఒకసారి ట్రై చెయ్యి'  అని నువ్వో, నాన్నగారో అంటే ఆ నోట్ చూపిస్తా"నన్నాడు. 

    వాడలా అనగానే.... చెప్పే తీరులు వేరైనా - ఒకప్పటి నోటిమాట, ఇప్పటి నోటుమాట - రెండూ ఒకటే అనిపించాయి "అదే కాయ - అదే పప్పు - అదే వద్దు!" అన్నట్టు. (హేండ్సమ్ విలన్ ఆర్నాగేశ్వర్రావ్‌కి సొర్గంలో పొలమారే ఉంటుంది.)


*******
*******

    అప్పుడే అయిపోలేదు - ఇవాళ్టి కబుర్లు. 

    వాతావరణంలో చలి తగ్గి - కొంచెం వెచ్చగా అనిపించగానే మా చీమ-చుట్టాలు గోడలు దిగి వస్తూ ఉంటాయి. 

    ఇల్లంతా పాకినా వాటికి ఏమీ దొరకదు కదా పాపం! అన్జెప్పి మా వంటింటి సింక్ పక్కనే పొడిగా తుడిచి - ఆ గోడ వారగా మూడ్రోజులకోసారి ఓ చిన్న చెంచాడు పంచదార వేస్తాను. 

    పొద్దున్నే morning walk కి వచ్చిన మొదటి చీమ ఏదో ఒకటి  అటూఇటూ తిరుగుతూ అక్కడ పంచదార ఉందని కనిపెడుతుంది. 

    వెంటనే హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మిగిలిన చీమల్ని లేపి పిలుచుకొస్తుంది. మొత్తానికి చిన్నా, పెద్దా చీమలన్నీ - జుట్లు ముడులేసుకుని, నైటీల్లోనే వచ్చేసి - ఆ చెంచాడు పంచదార పలుకుల్నీ దొర్లించుకునో, నెత్తిమీదకెక్కించుకునో పట్టుకెళ్ళిపోతాయి. 

    ఇలా ప్రతి మూడు రోజులకోసారి వాటికి రేషనిస్తాను నేను. 

    నిన్నేమయ్యిందంటే -  బద్రికి చైనీస్ ఫ్రైడ్ రైస్  తినాలనిపించి, మా ఇంటి పక్కనున్న చైనా-ఫస్ట్ restaurant నుంచి తెచ్చుకున్నారు. దాంతో పాటు ఓ మూడు fortune-cookies కూడా ఇచ్చారు చైనా-ఫస్ట్ వాళ్ళు. 

    సరే! రోజూ పంచదారే పెడితే చీమలక్కూడా bore కొడుతుంది కదా - కొంచెం వెరైటీ ఉంటుంది అని ఒక cookie లో ఒక చిన్నముక్క విరిచి, మళ్ళీ పెద్దముక్కలైతే చీమలకి మోసుకెళ్ళడం బరువవుతుంది అని చెప్పి - నేను ఇంగువ దంచుకునే రాయితో కుకీని పొడిపొడిగా చేసి - చీమలొచ్చే గోడ వారగా పోశాను. 

    నిన్నటి  ఉంచి ఒక్కటంటే ఒక్క చీమ కూడా ఆ కుకీ పొడి జోలికే వెళ్ళలేదు. 

    "ఇంగువ దంచిన రాయితో దంచాను, చీమలకి ఆ వాసనతో ఉన్న కుకీ పొడి నచ్చలేదేమో!" అని సందేహమొచ్చింది నాకు. 

    ఇవాళ పొద్దున్నే ఆ పొడిని తీసేసి - మళ్ళీ ఇంకో కుకీ లోంచి చిన్నముక్క విరిచి - దాన్ని పొడి చేసి - చీమలొచ్చే దారిలో పోశాను. 

    ఉహూఁ ! ఒక్క చీమంటే ఒక్కటి కూడా కుకీ పొడి తినడానికి, తీసుకెళ్ళడానికి రానే లేదు. చీమలన్నీ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాయి. 

    ఇలాక్కాదని ఇవాళ సాయంత్రం ఒక చెంచాడు పంచదార ఆ కుకీ పొడి పక్కనే పోశాను. 

    ఓ పది నిముషాల తర్వాత చూస్తే ఒక చీమ పంచదార గుట్ట మీద హడావిడిగా డాన్సాడేస్తోంది. 

    రెండు నిముషాల్లో పరిగెత్తుకుంటూ మా వంటింటి వాల్-పేపర్ చాటునున్న దాని అపార్టుమెంటుకెళ్ళి ఓ నాలుగు చీమల్ని పిలుచుకొచ్చింది. 

    అవన్నీ కలిసి - చాలా జాగ్రత్తగా కుకీ పొడి కేసి అస్సలు కన్నెత్తి కూడా చూడకుండా - పంచదార పలుకుల్ని నెత్తికెత్తుకుని మోసుకెళ్ళడం మొదలెట్టాయి. 




    అది చూడగానే నాకేమనిపించిందంటే - మనిషిగా నాకు తెలియని కల్తీ ఏదో చీమలకి ఆ చైనీస్ కుకీలో కనిపించిందేమోనని! 

    వెంటనే మిగిలిన కుకీ ముక్కలని trash లో పడేశాను.         

    అదృష్టపు-కుకీ(Fortune Cookie)ని చీమలు తినవూ అని తెలియడమూ, నేను వాటిని పడెయ్యడమూ -  ఆ కుకీలు తెచ్చిన అదృష్టం ఇన్నేళ్ళకి. 

    ఇంకెప్పుడూ మా చీమలకి కూడా వాటికి ఇష్టం లేని కుకీలని పెట్టనబ్బా! 

*******
*******


23, మే 2021, ఆదివారం

అవే గళ్ళు ! ఆధారాలు ఉండవు...

రోజూ పొద్దున్నే ఎప్పుడూ వచ్చేట్టే సూర్యుడొస్తాడు. 
తూరుపు తెలవారుతుంది 
ఊరు తెలుపారుతుంది 
అది నిత్యసత్యం. 


ఒక్కోరోజు ముసురొస్తే  వచ్చేసిన సూర్యుడు మసకేస్తాడు. 
తూరుపు విలవిలలాడుతుంది
ఊరు నలుపుదేఱుతుంది
అది తథ్యనిత్యం. 

*******
*******

    నిత్యసత్యమో, తథ్యనిత్యమో - ఐన సూర్యుడి రాక కన్నా - కుదిరితే కొంచెం వెనకో - కుదరక ఇంకొంచెం ఆనకో - పేపరోటి ఇంటి ముంగిట్లోకి గాల్లో ఎగిరొచ్చి వాలుతుంది. 

    ఎగిరొచ్చిన పేపర్లో తెలుపు-నలుపు గళ్ళనుడికట్టుతో మొదలు నా నిత్యకృత్యం. 

    నిజం చెప్పొద్దూ .... పేపర్ చేతి లోకి తీసుకోగానే ఆ తెలుపు-నలుపు గళ్ళ చతురస్రం మీద ఓ పాట కట్టేసి పాడుకోవాలనిపిస్తుంది. అది కూడా నాకు బల్-సరదా అయిన దర్శకరత్న-దాసరి కవితా-వారసత్వ వరసలో... 

సమతలం - ఒక పెద్ద ౘదరం
ఒళ్ళంతా కళ్ళుగా - గళ్ళు గీసుకుంది

మోగిమోగి - మూసుకున్న కళ్ళు - నల్లగళ్ళు 
తీగ సాగి - మోసులేసిన కళ్ళు - తెల్లగళ్ళు  

తెల్లగళ్ళ - వెంట - నల్లగళ్ళు 
నల్లగళ్ళ - జంటగా - తెల్లగళ్ళు 

గళ్ళూ, గళ్ళూ - కలయ చుట్టుకుని 
చుట్టుకున్న గళ్ళు - జట్టు కట్టుకుని 
కట్టుకున్న జట్టులో - అచ్చరాలు కుట్టుకుని 
మాటల పేర్పుకి - పడికట్టైనది 
పేర్చిన మాటల - కనికట్టైనది  
మా గళ్ళనుడికట్టూ ... - మా గళ్ళనుడికట్టూ ... 
భాషామతల్లికే ముచ్చటైన ఒడికట్టూ 

*******
*******

    గళ్ళ మీద పాటలు కట్టుకుంటూ, గళ్ళలో మాటలు పేర్చుకుంటూ ఎంతసేపైనా అలాగే - పనీపాటల్లో మొదటిది మర్చిపోయి అలాగే ఉండిపోవాలనిపిస్తుంది.

    కానీ... సరిగ్గా అప్పుడే - గుర్తుకొస్తాడు ఒకానొక చక్రవర్తి. 

    రోమ్ కాలిపోతుంటే  - ఫిడేలు వాయించుకుంటూ - ఆ మంటలార్పడానికి నీరోయని మారాజోడున్నాడట కదా! 

    పేపర్  చేతిలోకి తీసుకుని - మైమరచి - ప్రపంచాన్ని మరిచి - చుట్టూ ఏమైపోతున్నా పట్టించుకోక గళ్ళనుడికట్టు చేసేయాలనిపించేవేళ వద్దన్నా గుర్తొస్తాడు ఆ నీరో సామ్రాట్టు. 

    వెంటనే నుడికట్టు పక్కనెట్టి - అప్పటికి చేయక ఆపిన పని తలకెత్తి, గబగబా కానిచ్చేసి - అప్పుడు మళ్ళీ గళ్ళలో కళ్ళు పెట్టి అక్షరాలు నింపుకుంటా. 

*******
*******

    మాటల్తో ఆడుకుంటూ - ఏదో ఇలా ఏదో రాసేస్తున్నానా? 

    నాలో ఉన్న ఇంకో నేను -  నాలోంచి -  చివాల్న బయటికొచ్చేసింది. 

    తన ఉనికి నేనే అని తెలిసి కూడా - నన్ను అడగరానిది అడిగి ఇబ్బంది పెడితే - అది తనకి కూడా దెబ్బే అని తెల్సినా నన్నెప్పుడూ నిలదీస్తూనే ఉంటుంది. 

    వచ్చి మొదలెట్టేసింది... అడిగేయడం అనబడు నన్ను-కడిగేయడం కార్యక్రమం.  
 
    "ఆగాగు...  ఇదీ ఒక విషయమేనా? ఎవరైనా చేస్తారు గళ్ళు నింపడం - నుడికట్టు పూర్తి చేయడం!  అదేమన్నా రాసుకుని మరీ మళ్లీమళ్లీ చదువుకోవాల్సిన విషయమా? హన్నా! ఆ మాత్రం దానికి నీరోయని నీరోని పోలిక-సాయం తెచ్చుకోవడమెందుకో - బడాయి కాకపోతే!"

    "అబ్బే! అస్సలిది అలాంటిలాంటి విషయం కాదు - కానే కాదు! ముందు ఉపోద్ఘాతం ఉదాత్తంగా ఉంటుందని ఏదో నాలుగు జిగిబిగి కబుర్లు చెబ్దామని ఏదో రాశాను కానీ... అసలు కథ వేరే ఉంది. నన్ను చెప్పనీయ్!"

    "తెలుపు-నలుపు గళ్ళు, అడ్డం-నిలువు ఆధారాలు, అవి పూర్తి చేయటానికి కిందా-మీద పడటాలు - ఇంతకు మించిన కథలూ, కబుర్లూ ఏముంటాయి?"

    "... ... ... ... ... ... ... ... ... ... ... ... " 

    "సరిపోయింది! పుట్టినప్పట్నుంచి తెల్సిన భాషోటి, పొట్టకూటికి నేర్చుకున్న భాషోటి నీకొచ్చని తెల్సు - కానీ ఈ చుక్కల భాషేంటి మధ్యలో?"

    "నన్నేమీ నోరు తెరిచి అననీయవ్. ఏమీ అనకపోయినా వదిలేయవ్! ఇదెక్కడి గొడవ! ఇప్పుడు చెప్తా విను. నేను చెప్పబోతున్న కబుర్లలో ఉన్నవి అవే గళ్ళు... కానీ వాటికి అడ్డం-నిలువు ఆధారాలు ఉండవు."

    "అవే గళ్ళు! ఆధారాలు ఉండవు.... భలే! సూపర్ స్టార్ సినిమాకి సరిపోయే పేరూ, పేరు కింద పేరు. బాగానే ఉంది కానీ అవే గళ్ళో, ఇవే గళ్ళో, ఇంకేవో గళ్ళో - ఆధారాలు లేని గళ్ళు పెట్టుకుని ఏం నింపుదామని?"

    "అడ్డం-నిలువు ఆధారాలు ఉండవు అన్నాను కానీ అసలేం ఆధారాలు ఉండవన్లేదు కదా! ఇందులో ఓ రెండక్షరాలు మాత్రం తెలుస్తాయి. మిగిలినవన్నీ మనం పూరించాలి."

    "ఎట్టెట్టా! రెండు మాత్రం తెలిసేట్ఠా? మిగిలినవి నువ్వు పెట్టేట్టా?"

    "ఆఁ ! అద్దీ! ఇప్పటికి దార్లోకొచ్చావ్. అట్టే! అట్టే!" 

    "ఇంకాట్టే విసిగించను కానీ అవెట్టాంటి గళ్ళో, వాటిని నింపుటెట్టో చెప్పేద్దూ!"

    "మొదలెట్టేస్తున్నా - చదువు... నువ్వూ ఆ కిటుకు ఇట్టే పట్టేయగలవ్!"

*******
*******


    ఇక్కడ మొదలు...  అవే గళ్ళు ! ఆధారాలు ఉండవు...అనబడు సైమన్ షకర్ గారి కోడ్ క్రాకర్ (Simon Shuker's Code Cracker కథా-కమామీషూ. 

    అసలు నాకిది ఎలా దొరికింది అంటే - దానికి ముందు మా ఇంటికొచ్చే సెయింట్ లూయిస్ పోస్ట్ డిస్పాచ్ (St. Louis Post Dispatch) అనబడే పేపర్ గురించి చెప్పాలి. 

    పేపర్ నిండా బోల్డన్ని వార్తలున్నా నాకు అవేం పట్టవు. 

    ఎందుకంటే ఆ బాధామయ గాథల్ని చదివి ఆర్చి-తీర్చే అవకాశం, వనరులూ ఉండని నేను ఉబుసుపోకకి ఇంకొకరి బాధల్ని కాలక్షేపానికి చదువుకోవడం నచ్చక - అంతటి పేపర్లోనూ రంగులీనుతుండే కార్టూను పేపర్ మాత్రం చదువుతాను. 

    ఆ కార్టూన్లు ఉండే భాగంలో Sudoku, Cryptoquip, Cross -word లాంటి మెదడుకు-మేతలు మేటలు-మేటలుగా ఉంటాయి. అవి రోజూ ఎలాగూ చేస్తాను. అది కాదు విషయం. 

    కిందటి ఏడాది లాక్-డౌన్ మొదలైన దగ్గర్నుంచి - ప్రతి నెలా - "Brain Busters" అని దాదాపు 46 పేజీల ఒక special puzzle edition వస్తోంది. అందులో చాలా కొత్తరకాల పజిల్స్ దొరికాయి నాకు. అందులో నేను పూర్తి చేయగలిగిన ఒక కొత్త రకం పజిల్ - ఈరోజు నా కబుర్లకి టాపిక్కు & టాప్-పిక్:  Simon Shuker's Code Cracker. 




    పైన ఫొటోలో సైమన్ గారు చెప్పిన కోడ్ క్రాకర్‌కి నేను పెట్టుకున్న అచ్చతెలుగు పేరు "సన్న-బీటిక". (Code=సంజ్ఞ; సంజ్ఞకి వికృతి సన్న. Crack=బీటిక).

    
    పై బొమ్మలో ఉన్న విశేషాలు ఇవీ:

    1) గళ్ళున్న  పెద్ద చతురస్రం.  
    2) గడికో అంకె (1 నుంచి 26 దాకా). 
    3) పక్కనే అంకెలేసి నిలువుగా అమర్చిన పెట్టెలు రెండు వరసలు. 
    4) వరసకి 13 పెట్టెలు చొప్పున మొత్తం 26 పెట్టెలు. 
    5) ఆ 26 పెట్టెల్లో ఒక రెండు పెట్టెల్లో మాత్రం రెండు అక్షరాలు ఉన్నాయి. (25=F; 26=L). 
    6) ఆ రెండు పెట్టెల్లో ఉన్న ఆ రెండు అక్షరాలు ఈ గళ్ళ నుడికట్టు పూర్తిచేయడానికి ఆధారాలు. 

     నే ముచ్చటగా పేరెట్టుకున్న సన్న-బీటికని పూరించడానికి సైమన్ గారి సూత్రాలు ఏంటంటే: 

    ఆ గళ్ళలో ఉన్న ప్రతి అంకె ఇంగ్లీష్ వర్ణమాల లోని ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి పైనిచ్చిన సన్న-బీటికలో 26 అంటే L, 25 అంటే F. 

ముందుగా తెలిసిన రెండు అక్షరాలనీ వాటి అంకెలున్న గళ్ళల్లో రాసుకోవాలి. అలా రాసుకున్న అక్షరాల వల్ల సగం-సగం ఏర్పడిన మాటలని పూరించాలి. దానితో ఖాళీగా ఉన్న అంకె-గడుల్లో కొత్త అక్షరాలు బయటపడతాయి. ఆ కొత్త అక్షరాల అంకెల్ని పక్కనున్న 26 నిలువు పెట్టెల్లో రాసుకోవాలి. కొత్తగా తెల్సిన అక్షరాల్ని మళ్ళీ గళ్ళనుడికట్టు లోని వాటివాటి అంకెల గడుల్లో రాసుకోవాలి. మళ్ళీ మాటలు పూరించాలి. ఇలా 26 అక్షరాలు తెలిసి, అన్ని గడుల్లో మాటలు రాశాక Code-Cracker పూర్ణంగా పూరింపబడి పూర్తవుతుంది. 

*******
*******


    ఇక మొదలెట్టేద్దామా! 

    ఇప్పుడు ఖాళీగా ఉన్న గళ్ళలో 26 ఉన్న చోటల్లా ఎల్లూ (26=L), 25 ఉన్న చోటల్లా ఎఫ్ఫూ (25=F) రాసేసుకోవాలి. 

హల్లో! హల్లో! 
అనుకోకుండా ఉఫ్ఫో-ఉఫ్ఫో... 
చూడండి ఈ కింద గళ్ళో 
ఎక్కడెక్కడ నింపానో ఎల్లూ, ఎఫ్ఫో!



   25=F , 26=L అని నింపగానే ఒకే వరసలో ఉన్న ఆ అక్షరాల మధ్యలో ఉన్న అంకెల వరస (F-13-13-6-7-6-13-13-L  చూడగానే నాకు తట్టిన ఒకే ఒక పదం FOOTSTOOL
    
    దాంతో నాకు 13=O అనీ, 6=T అనిన్నీ, 7=S అనినిన్నీ అని తెలిసిపోయిందోచ్! మరిక ఆగుతానా? 


నువ్వో ఓ, అదో టీ
ఉస్సూ-హస్సూ మంటూ 
మరోటి ఎస్సూ అనుకుంటూ 
13, 6, 7 గళ్ళన్నిటినీ నింపేశా!



    అప్పుడు దొరికాయయ్యా... చివరాఖరి గళ్ళలో మూడక్షరాలు! 

    అదెలాగా అంటే... చిట్టచివరి లైన్లో రెండు నల్లగళ్ళ  పక్కనున్న ఎనిమిది తెల్లగళ్లనూ - అక్కడున్న T -3-2-S-T-12-12-S అన్న వరస చూడగానే తట్టేసింది - అది TRUSTEES కాక ఇంకేమీ కాదనీ - 3 తప్పకుండా R; 2 ఖచ్చితంగా U; 12 నిర్మొహమాటంగా E అని. 

అంతే ఎక్కించేశా 
3, 2, 12 లెక్కెట్టుకుంటూ 
ఆరూ, యూ, ఈ 
మూడూ, రెండూ, పన్నెండో గడీ 

(3=R; 2=U; 12=E )





    2=U; 3=R; 12=E అని గళ్ళన్నీ నింపగానే ఓ చోట వెర్సూ, వోర్టెక్సూ తప్ప ఇంకేమీ రావనిపించాయి. అనిపించిందే తడవు 22=V; 23=X అనేసుకున్నా. 

ఆరూ, యూ, ఈ 
అన్నాక వచ్చాయీ 
అనుకోకుండా వెర్సూ, వోర్టెక్సూ
దాంతో దొరికేశాయి వీ, ఎక్సూ 
అంటూ నేనయ్యా ఫిక్స్!





R-O-S-24 లో 24 ఈజీక్వల్టూ  Y  అని నేనంటే  
Y-O-L-14-S లో పద్నాలుగుకే K ఇస్తానంటే 
ఓకే -ఓకే అనక కాదనే వారుంటే -
ఎందుకు కాదంటారో - tell me why?

(24=Y; 14=K)




    హమ్మయ్య! ఇప్పటికి ఎన్ని అంకెలకి ఏమేం అక్షరాలు వచ్చాయో చూద్దాం!

 సైమన్ గారిచ్చినవి సూర్యచంద్రుల్లా రెండు 
(25=F; 26=L)
నేను కనిపెట్టినవి దశావతారాల్లా పది  
(2=U; 3=R; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 22=V; 23=X; 24=Y)
వెరసి  ద్వాదశాదిత్యుల్లా  పన్నెండు  
(2=U; 3=R; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)
వచ్చిన అక్షర-పుష్కరాలకి ముచ్చట పడి ఆగిపోక ముందుకి సాగుదాం!

ముసిముసిగా నవ్వుకుంటూ 
స్క్స్ -స్క్స్  అనుకుంటూ 
ఉండగా ఉండగా తట్టేసిందే 
4-S -K-S లో ఉన్న నాలుగే  (ASKS)
ఆంగ్ల అచ్చు అదే , అదే... A!
దాంతో  కొత్త వరస ఆయే 

(2=U; 3=R; 4=A; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)





1-U-R-R-A-5-T-S 
ఈ వరస చూడగానే నోరూరే  
గుర్తొచ్చే ఎండు ద్రాక్షే  (CURRANTS)
ఇక 1 C కాక మరేంటీ?
5 ఎన్ను కాక ఇంకేంటీ? 
రాస్కో మరి కొత్త వరస... 

(1=C2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)







1=C; 5=N  రాసేసి చుట్టూ చూస్తే 
అడ్డంగా  A-R-19-U-E-S  కనిపిస్తే 
19=G అని గా... ఠిగా అనిపించేస్తే  (ARGUES)
R-A-N-K-16-N-G లో 16=I నేనేనంటే (RANKING)
15-A-I-N లో 15 మ్మ్...  నేనే ఎమ్ అననంటే (MAIN)
ఎమ్మట్నే రాసుకోబ్బా - 
15 ఎమ్మని, 16 అయ్యని, 19 జియ్యని !

కొంగొత్త వరస: 
(1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 15=M; 16=I; 19=G; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L) 





ఇప్పటికి అష్టాదశాంగాల్లా పద్ధెనిమిది అక్షరాలు చిక్కాయి. 

ఇంకేం దొరుకుతాయీ అని చూసుకున్నా. 

A-8-S-O-R-8-S లో 8 నేను B పోలిక అంది (ABSORBS)
C-9-A-R-M లో 9 ఏకాంకాల్లో హెచ్చు తానంది (CHARM) 
A-10-U-A లో 10 అయ్యో! తాను కుయ్యోమంది (AQUA)

సరికొత్త వరస:
 (1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 8=B; 9=H; 10=Q; 12=E; 13=O; 14=K; 15=M; 16=I; 19=G; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L) 




    ఏకవింశతి పత్రాల్లా ఇరవై ఒక్క అక్షరాలు దక్కాయి - అజ్ఞాతవాసంలో ఉన్న పంచపాండవుల్లా ఆచూకీ చిక్కనివి ఐదంటే ఐదున్నాయి. వాటిని పట్టేద్దాం పదండి!


11-A-T-E-R లో 11 డబుల్ ఒకటి ఉంది నాకంది (WATER)
11-R-E-A-T-H-E లో 11 హే యూ! నేనే డబ్ల్యూ! అంది (WREATHE)
S-H-A-20-E-21 లో 20 R ఆల్రెడీ పోయే కాబట్టి P ని నేనంది, 
S-H-A-20-E-21 లో మిగిలిన 21 నేనూ ఢీ అంటే ఢీ అంటానంది (SHAPED)

మన కొత్త వరస ఇదీ!  

 (1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 8=B; 9=H; 10=Q; 11=W ; 12=E; 13=O; 14=K; 15=M; 16=I; 19=G; 20=P; 21=D; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L) 



    చతుర్వింశతి-గుణాల్లా ఇరవై నాలుగు అక్షరాలు కుదురుకున్నాయి. 

    అన్ని గళ్ళల్లో దొరికిన అక్షరాలన్నీ రాయగా, రాయగా ఇక మిగిలినవి దివా-రాత్రాల్లా రెండక్షరాలు. అవీ పట్టేద్దాం! 


H-I-17-A-C-K లో 17 జై- జై అంది! (HIJACK)
B-R-E-E-18-E-D లో 18 తనెవరో చెప్పుకోవడం ఈజీ-పీజీ అంది (BREEZED)

 (1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 8=B; 9=H; 10=Q; 11=W ; 12=E; 13=O; 14=K; 15=M; 16=I; 17=J; 18=Z; 19=G; 20=P; 21=D; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L) 




 కళ్ళు రెండూ తెరిచిపెట్టి 
గళ్ళ నిండా అక్షరాలు రాసిపెట్టి 
గళ్ళల్లో దాక్కున్న నుడులను పట్టి 
ఇక్కడ పెట్టా! 
పట్టుకున్నవారికి పట్టుకున్నంత! 




అన్నట్టు సైమన్ గారి ఈ కోడ్-క్రాకర్ నేను ఇంతకు ముందు రాసిన Cryptoquip కి దాయాది లానో, దాదీ లానో అనిపించింది. అదీ ఓ పాలి సూసొచ్చేయండి!

Happy Code-Cracking !



9, మే 2021, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 11 - తూ ప్యార్ కా సాగర్ హై...


మనిషి ఉనికికి 
ముందూ వెనకలుగా 
మూడుకాలాలు 

తనకి చెందని నిన్న 
తనదే ఐన నేడు  
తనకేమీ కాని ఓ నాడు

తనకి ముందు 
తను లేని నిన్నటి రోజొకటుంది
తనది కానిది... 

తను లేని నిన్నలో ... 
తన కన్నా ముందుగా... 
పగలుండేది - రేయుండేది 
మిన్నుండేది - మిణుకుండేది 
చెట్టుండేది - చెలముండేది 
మన్నుండేది - మనికుండేది 
తన కోసం ఎదురు చూపుండేది 

తనున్న ఇప్పుడు 
తనకే సొంతమైన నేడుంది 
తనదన్నది... 

తను ఉన్న నేటిలో ... 
తనతో పాటు తోడుగా ... 
పగలుంది - రేయుంది 
మిన్నుంది - మిణుకుంది 
తను పేనుకున్న బంధముంది 
చెట్టుంది - చెలముంది 
మన్నుంది - మనికుంది 
తను పెంచుకున్న నెయ్యముంది 

తన తర్వాత . 
తను ఉండబోని ఓ నాడూ ఒకటుంటుంది
తనది కాదది... 

తానుండబోని నాటిలో... 
తనతో ఆగక సాగే ... 
పగలుంటుంది - రేయుంటుంది 
తను లేని లోటుంటుంది. 
మిన్నుంటుంది - మిణుకుంటుంది 
తలపు లోన బాధుంటుంది
చెట్టుంటుంది - చెలముంటుంది 
తడి మోసే కనురెప్పుంటుంది
మన్నుంటుంది - మనికుంటుంది
తను వదిలిన గురుతుంటుంది

*******
*******

    "కలిసి ఉంటే కలదు సుఖం" అనుకునే కాలం ఒకప్పుడు. 

    కలివిడితనం కలిసి రాక, విడివిడిగా ఉండి ఉబుసు పోక - ఎవరికి వారు - ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాలం మనదిప్పుడు. 

    ఇలా సాగుతున్నా - "ఇప్పుడిలా ఉన్నా తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ మామూలు రోజులొస్తాయి" - అని అనుకోవడం, సాధ్యమైనంత వరకు ఏదో ఒక వ్యాపకంలో మునిగి ఉండడం అలవాటు చేసుకున్నాం. 

    మామూలుగా ఉండడం అన్నది ఇప్పుడసలు మామూలు విషయం కానే కాదు. 

     ఇంత జరుగుతుండగా - కలిసిరాని కాలం పామై కరిచి అకాలంగా రాలిపోయి తమ వారి నుండి తరలిపోతున్న వారెందరో! 

       ఎన్ని కుటుంబాలకి - ఎందరున్నా - ఎవరూ కూడా - ఆర్చలేని, తీర్చలేని బాధ కలుగుతోందో! 

   ఒకప్పుడు వేటూరి రాసిన ఓ పాట పల్లవి లోని ఒక వాక్యం  చాలా గొప్పగా అనిపించేది. అదేంటంటే "కన్ను తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు". 

    అదే వాక్యం ఇప్పుడు వేరే అర్థంలో వినిపిస్తోంది. 

    అది - ఎవరి గురించి ఎవరైనా - పాడుకునే సందర్భం రాకుండా ఉండాలి అనిపిస్తోంది.  

    పొద్దున్న లేస్తే - ఎందరు ఎవరెవర్ని కోల్పోయారో - మాటగా వింటుంటేనో, వార్తగా చదువుతుంటేనో - ఏదో నొప్పి. 

   తెలుసుకుని ఏమీ చేయలేని అసహాయత. 

    ఇది కళ్ళు మూసుకున్న నిద్రలో కంటున్న కలేమో - కళ్ళు తెరిచి చూసేటప్పటికి -  కాలం వెనక్కి మళ్ళి - ఇప్పటి దాకా జరిగినదంతా చెరిగిపోయి - అసలేమీ జరగనట్లు ఉండగలమేమో అన్న అలవిమాలిన ఆశ.     

*******
*******

   ఇల్లాంటి - ఏమీ చెయ్యలేని - చేతకాని వేళ - ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించదు. ఎవరికీ ఏమీ చెప్పాలనిపించదు. ఎవరేం చెప్పినా వినాలనిపించదు. 

    మాట-సాయం అరుదై మౌనమైన వేళల - తరచి తరచి వెతికి - ఎప్పటిదో ఒకటి తలచి తలచి  - తెచ్చుకుంటా - మనసుకి హాయి-మలాము పూసే పాట-సాయం. 

    ఇప్పుడు కూడా పట్టి తెచ్చుకున్నా అలాంటి పాటొకటి నాకు తోడుగా. 

    నాకు తోడొచ్చిన ఆ నచ్చిన పాటని వింటూ రాసి పెట్టుకున్నా.    . 

    ముందుగా నాకు సాయమొచ్చిన పాట పుట్టుపూర్వోత్తరాలు: 

    పాట: తూ ప్యార్ కా సాగర్ హై... 
    సినిమా: సీమా 
    పాట పాడినవారు: మన్నా డే 
    పాటలో పదాలు పేర్చినవారు: శైలేంద్ర 
    పాటకు స్వరాలు కూర్చినవారు: శంకర్-జైకిషన్ 
    పాటకు పెదవులు కదిల్చినవారుబల్‌రాజ్ సహానీ 
    పాటలో కదులుతూ కనిపించినవారు: నూతన్, శుభా ఖోటే, బోల్డు మంది పెద్దలు-పిన్నలు. 

    ఈ పాట మొదలవుతూనే మొదటగా కనిపించేది గో-సహిత దత్తాత్రేయ మూర్తి - ఎదురుగుండా కుర్చీలో కూర్చున్న బల్‌రాజ్ సహానీ, ఆయన కుర్చీ పక్కనే కింద కూర్చున్న ఒక చిన్నపాప, ఇంకొక పక్కన తలొంచుకుని కీబోర్డు లాంటి దేదో వాయిస్తున్న శుభా ఖోటే. అన్నట్టు ఈ శుభా ఖోటే ఆ రోజుల్లో మంచి సైక్లింగ్ ఛాంపియన్ అని మా నాన్న అంటుంటారు. 

    ఈ పాటలో - తెర వెనుక పాడిన మన్నా డే గళం నుండి జాలువారిన కరుణ రసం  - తెర మీద కనిపించే బల్‌రాజ్ సహానీ కళ్ళల్లో దయావృష్టిగా  మారినట్టనిపిస్తుంది. 
    
    విన్న ప్రతీ పాటకి సమానార్థం లోనో, సమాంతరంగానో ఇంకా ఏమేమి పాటలున్నాయీ అని వెతుక్కునే నాకు ఓ రెండు పాటలు చటుక్కున గుర్తొచ్చాయి. 

    ఈ పాటకి అర్థంలో దగ్గరగా అనిపించిన పాట - "అణువు అణువున వెలసిన దేవా! కనువెలుగై మము నడిపించరావా?!" అన్న పల్లవి.  

    ఈ పాటలోని ఆర్తికి సరితూగిన పాట మాత్రం "నడిరేయి ఏ ఝాములో ... స్వామి నిను చేర దిగివచ్చునో!" (రంగులరాట్నం సినిమాలో ఘంటసాల, ఎస్జానకి పాడిన పాట). 

*******
*******

    ఇంతకీ ఈ పాట ఎవరిని ఉద్దేశించి? దేని గురించి? 

    అప్పుడెప్పుడో నేను రాసుకున్నవే ఓ నాలుగైదు లైన్లు మళ్ళీ ఇక్కడ:

ఉనికి అందని దేవుడు  
ఉన్నాడంటే ఉన్నాడు
లేడన్న చోటా ఉన్నాడు 
అణువణువున ఉన్నాడు 
అడుగడుగున ఉన్నాడు 

    ఆఁ ...! అదే! ఆ ఊహకి అందని ఉనికున్నవాడి గురించే! 

    ఆ నిరంజనుడు
    ఆ నిర్గుణుడు. 
    ఆ నిరాకారుడు. 

    అనుకున్నవారికి - అనుకున్నట్టు కనబడేవాడు. 

    అనుకోనివారిని - అనుకోకపోయినా కనిపెట్టి ఉండేవాడు. 

    ఒకప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతుండేవాడో ఏమో - ఇప్పటికి మాత్రం చూపుకి చిక్కనివాడు. 

    అప్పుడప్పుడు - అక్కడక్కడ - అరుదుగా - తనది కాని బాధకి కదిలి తడిసి కురిసే కన్నులలో - జాలిగా  జాలువారుతున్నవాడు. 

    ఎప్పుడైనా - ఎక్కడైనా - ఎవరని చూడక, ఏమని అడగక - సాయమందించే చేతులలో - వేలుపుగా వెలుగుతున్నవాడు. 

    అంతా తానైనవాడు. అంతటా నిండినవాడు. ఏ దారీ తోచని అలజడి వేళల తనే ఊరట, ఓదార్పు. 

    భూమికి నిలకడ, గాలికి కదలిక, నీటికి ప్రవాహం, నిప్పుకి అదుపు, మింటికి లేమి - అన్నీ ఆ కనపడని శక్తి రూపమే!

    అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నట్టు నమ్మించి నవ్వించేదీ తనే! 

    అనుకోనిది జరిగినదనిపించి - సడలిన నమ్మకంతో కూడా - నడిపించేది తనే! 

    అనుకున్నవీ, అనుకోనివీ, ఆశలవీ, నిరాశలవీ, గెలుపులవీ, ఓటములవీ, ఊరించేవీ, ఊహకందనివీ  - అన్ని రాతలూ - ముందుగానే - రాసి పెట్టేదీ తనే! 

    ఉన్నానని కొందరికి అనిపించి, లేడేమో అని ఇంకొందరితో అనిపించి - ఆ లేనిపోని వాదనల తమాషాల కాలక్షేపమూ తనదే!

    నా వరకు నాకు - తనున్నాడో లేడో - అన్న సందేహమూ తనే! 

    ఒక వేళ తనున్నా - చూపుకే ఆనని ధూళిలో నలుసు లాంటి నా ఉనికి తనకు పట్టదన్న - నా  నమ్మకమూ తనే! 

    అన్నిటా ఉన్న తనున్న చోట - పక్కపక్కనే - మనసు మురిపించే సుఖమూ ఉంది, పక్కనే దిక్కు తోచని దుఃఖమూ ఉంది. ఇధర్ - ఝూమ్‌కే గాయే జిందగీ.. ఉధర్ - హై మౌత్ ఖడీ...

    అడగకుండానే అన్నీ ఇచ్చిన తనకి  - ఏదో నాడు అవన్నీ తిరిగిచ్చి వెళ్ళిపోవడమే. లౌటా - జో దియా తూ నే... చలే జాయేంగే - జహా సే హమ్!

*******
*******




తూ ప్యార్ కా సాగర్ హై... 
తూ ప్యార్ కా సాగర్ హై... 
తేరీ ఏక్ బూంద్ కే - ప్యాసే హమ్!
తేరీ ఏక్ బూంద్ కే - ప్యాసే హమ్!
లౌటా - జో దియా తూ నే.. 
లౌటా - జో దియా తూ నే... 
చలే జాయేంగే - జహా సే హమ్!
చలే జాయేంగే - జహా సే హమ్!

తూ ప్యార్ కా సాగర్ హై... 
తూ ప్యార్ కా సాగర్ హై... 
తేరీ ఏక్ బూంద్ కే - ప్యాసే హమ్!
తేరీ ఏక్ బూంద్ కే - ప్యాసే హమ్!
తూ ప్యార్ కా సాగర్ హై... 

ఘాయల్ మన్ కా - పాగల్ పంఛీ
ఉడ్‌నే కో బేకరార్... 
ఉడ్‌నే కో బేకరార్!
పంఖ్ హై కోమల్  - ఆంఖ్ హై ధుధలీ
జానా హై సాగర్ పార్... 
జానా హై సాగర్ పార్!
అబ్ - తూ హీ - ఇసే సమ్‌ఝా... 
అబ్ - తూ హీ - ఇసే సమ్‌ఝా... 
రాహ్ భూలే థే - కహా సే హమ్?!
రాహ్ భూలే థే - కహా సే హమ్?!


తూ ప్యార్ కా సాగర్ హై
తూ ప్యార్ కా సాగర్ హై
తేరీ ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ 
తేరీ ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ 
తూ ప్యార్ కా సాగర్ హై


ఇధర్ - ఝూమ్‌కే గాయే జిందగీ.. 
ఉధర్ - హై మౌత్ ఖడీ...
ఉధర్ - హై మౌత్ ఖడీ!
కోఈ క్యా జానే - కహా హై సీమా?!
ఉల్‌ఝన్ ఆన్ పడీ... 
ఉల్‌ఝన్ ఆన్ పడీ!
కానోం మే జరా కహ్ దే... 
కానోం మే జరా కహ్ దే... 
కి ఆయే కౌన్ దిశా సే హమ్?!
కి ఆయే కౌన్ దిశా సే హమ్?!

తూ ప్యార్ కా సాగర్ హై
తూ ప్యార్ కా సాగర్ హై
తేరీ ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ 
తేరీ ఏక్ బూంద్ కే ప్యాసే హమ్ 
తూ ప్యార్ కా సాగర్ హై
తూ ప్యార్ కా సాగర్ హై

*******
*******

    ఈ పాట నాకు దేవుడి ఉనికి
    పాటలో మాటలు దేవుడి ఉనికి
    పాటలోని స్వరాలు దేవుడి ఉనికి
    పాట పాడిన గళం దేవుడి ఉనికి
    పాటకి కూడిన నటన దేవుడి ఉనికి 
    పాటకి ఉబికే కన్నీరు దేవుడి ఉనికి
    పాటతో కలిగే ఊరట దేవుడి ఉనికి

~ పాటల భైరవి