రోజూ పొద్దున్నే ఎప్పుడూ వచ్చేట్టే సూర్యుడొస్తాడు.
తూరుపు తెలవారుతుంది
ఊరు తెలుపారుతుంది
అది నిత్యసత్యం.
ఒక్కోరోజు ముసురొస్తే వచ్చేసిన సూర్యుడు మసకేస్తాడు.
తూరుపు విలవిలలాడుతుంది
ఊరు నలుపుదేఱుతుంది
అది తథ్యనిత్యం.
*******
*******
నిత్యసత్యమో, తథ్యనిత్యమో - ఐన సూర్యుడి రాక కన్నా - కుదిరితే కొంచెం వెనకో - కుదరక ఇంకొంచెం ఆనకో - పేపరోటి ఇంటి ముంగిట్లోకి గాల్లో ఎగిరొచ్చి వాలుతుంది.
ఎగిరొచ్చిన పేపర్లో తెలుపు-నలుపు గళ్ళనుడికట్టుతో మొదలు నా నిత్యకృత్యం.
నిజం చెప్పొద్దూ .... పేపర్ చేతి లోకి తీసుకోగానే ఆ తెలుపు-నలుపు గళ్ళ చతురస్రం మీద ఓ పాట కట్టేసి పాడుకోవాలనిపిస్తుంది. అది కూడా నాకు బల్-సరదా అయిన దర్శకరత్న-దాసరి కవితా-వారసత్వ వరసలో...
సమతలం - ఒక పెద్ద ౘదరం
ఒళ్ళంతా కళ్ళుగా - గళ్ళు గీసుకుంది
మోగిమోగి - మూసుకున్న కళ్ళు - నల్లగళ్ళు
తీగ సాగి - మోసులేసిన కళ్ళు - తెల్లగళ్ళు
తెల్లగళ్ళ - వెంట - నల్లగళ్ళు
నల్లగళ్ళ - జంటగా - తెల్లగళ్ళు
గళ్ళూ, గళ్ళూ - కలయ చుట్టుకుని
చుట్టుకున్న గళ్ళు - జట్టు కట్టుకుని
కట్టుకున్న జట్టులో - అచ్చరాలు కుట్టుకుని
మాటల పేర్పుకి - పడికట్టైనది
పేర్చిన మాటల - కనికట్టైనది
మా గళ్ళనుడికట్టూ ... - మా గళ్ళనుడికట్టూ ...
భాషామతల్లికే ముచ్చటైన ఒడికట్టూ
*******
*******
గళ్ళ మీద పాటలు కట్టుకుంటూ, గళ్ళలో మాటలు పేర్చుకుంటూ ఎంతసేపైనా అలాగే - పనీపాటల్లో మొదటిది మర్చిపోయి అలాగే ఉండిపోవాలనిపిస్తుంది.
కానీ... సరిగ్గా అప్పుడే - గుర్తుకొస్తాడు ఒకానొక చక్రవర్తి.
రోమ్ కాలిపోతుంటే - ఫిడేలు వాయించుకుంటూ - ఆ మంటలార్పడానికి నీరోయని మారాజోడున్నాడట కదా!
పేపర్ చేతిలోకి తీసుకుని - మైమరచి - ప్రపంచాన్ని మరిచి - చుట్టూ ఏమైపోతున్నా పట్టించుకోక గళ్ళనుడికట్టు చేసేయాలనిపించేవేళ వద్దన్నా గుర్తొస్తాడు ఆ నీరో సామ్రాట్టు.
వెంటనే నుడికట్టు పక్కనెట్టి - అప్పటికి చేయక ఆపిన పని తలకెత్తి, గబగబా కానిచ్చేసి - అప్పుడు మళ్ళీ గళ్ళలో కళ్ళు పెట్టి అక్షరాలు నింపుకుంటా.
*******
*******
మాటల్తో ఆడుకుంటూ - ఏదో ఇలా ఏదో రాసేస్తున్నానా?
నాలో ఉన్న ఇంకో నేను - నాలోంచి - చివాల్న బయటికొచ్చేసింది.
తన ఉనికి నేనే అని తెలిసి కూడా - నన్ను అడగరానిది అడిగి ఇబ్బంది పెడితే - అది తనకి కూడా దెబ్బే అని తెల్సినా నన్నెప్పుడూ నిలదీస్తూనే ఉంటుంది.
వచ్చి మొదలెట్టేసింది... అడిగేయడం అనబడు నన్ను-కడిగేయడం కార్యక్రమం.
"ఆగాగు... ఇదీ ఒక విషయమేనా? ఎవరైనా చేస్తారు గళ్ళు నింపడం - నుడికట్టు పూర్తి చేయడం! అదేమన్నా రాసుకుని మరీ మళ్లీమళ్లీ చదువుకోవాల్సిన విషయమా? హన్నా! ఆ మాత్రం దానికి నీరోయని నీరోని పోలిక-సాయం తెచ్చుకోవడమెందుకో - బడాయి కాకపోతే!"
"అబ్బే! అస్సలిది అలాంటిలాంటి విషయం కాదు - కానే కాదు! ముందు ఉపోద్ఘాతం ఉదాత్తంగా ఉంటుందని ఏదో నాలుగు జిగిబిగి కబుర్లు చెబ్దామని ఏదో రాశాను కానీ... అసలు కథ వేరే ఉంది. నన్ను చెప్పనీయ్!"
"తెలుపు-నలుపు గళ్ళు, అడ్డం-నిలువు ఆధారాలు, అవి పూర్తి చేయటానికి కిందా-మీద పడటాలు - ఇంతకు మించిన కథలూ, కబుర్లూ ఏముంటాయి?"
"... ... ... ... ... ... ... ... ... ... ... ... "
"సరిపోయింది! పుట్టినప్పట్నుంచి తెల్సిన భాషోటి, పొట్టకూటికి నేర్చుకున్న భాషోటి నీకొచ్చని తెల్సు - కానీ ఈ చుక్కల భాషేంటి మధ్యలో?"
"నన్నేమీ నోరు తెరిచి అననీయవ్. ఏమీ అనకపోయినా వదిలేయవ్! ఇదెక్కడి గొడవ! ఇప్పుడు చెప్తా విను. నేను చెప్పబోతున్న కబుర్లలో ఉన్నవి అవే గళ్ళు... కానీ వాటికి అడ్డం-నిలువు ఆధారాలు ఉండవు."
"అవే గళ్ళు! ఆధారాలు ఉండవు.... భలే! సూపర్ స్టార్ సినిమాకి సరిపోయే పేరూ, పేరు కింద పేరు. బాగానే ఉంది కానీ అవే గళ్ళో, ఇవే గళ్ళో, ఇంకేవో గళ్ళో - ఆధారాలు లేని గళ్ళు పెట్టుకుని ఏం నింపుదామని?"
"అడ్డం-నిలువు ఆధారాలు ఉండవు అన్నాను కానీ అసలేం ఆధారాలు ఉండవన్లేదు కదా! ఇందులో ఓ రెండక్షరాలు మాత్రం తెలుస్తాయి. మిగిలినవన్నీ మనం పూరించాలి."
"ఎట్టెట్టా! రెండు మాత్రం తెలిసేట్ఠా? మిగిలినవి నువ్వు పెట్టేట్టా?"
"ఆఁ ! అద్దీ! ఇప్పటికి దార్లోకొచ్చావ్. అట్టే! అట్టే!"
"ఇంకాట్టే విసిగించను కానీ అవెట్టాంటి గళ్ళో, వాటిని నింపుటెట్టో చెప్పేద్దూ!"
"మొదలెట్టేస్తున్నా - చదువు... నువ్వూ ఆ కిటుకు ఇట్టే పట్టేయగలవ్!"
*******
*******
ఇక్కడ మొదలు... అవే గళ్ళు ! ఆధారాలు ఉండవు...అనబడు సైమన్ షకర్ గారి కోడ్ క్రాకర్ (Simon Shuker's Code Cracker కథా-కమామీషూ.
అసలు నాకిది ఎలా దొరికింది అంటే - దానికి ముందు మా ఇంటికొచ్చే సెయింట్ లూయిస్ పోస్ట్ డిస్పాచ్ (St. Louis Post Dispatch) అనబడే పేపర్ గురించి చెప్పాలి.
పేపర్ నిండా బోల్డన్ని వార్తలున్నా నాకు అవేం పట్టవు.
ఎందుకంటే ఆ బాధామయ గాథల్ని చదివి ఆర్చి-తీర్చే అవకాశం, వనరులూ ఉండని నేను ఉబుసుపోకకి ఇంకొకరి బాధల్ని కాలక్షేపానికి చదువుకోవడం నచ్చక - అంతటి పేపర్లోనూ రంగులీనుతుండే కార్టూను పేపర్ మాత్రం చదువుతాను.
ఆ కార్టూన్లు ఉండే భాగంలో Sudoku, Cryptoquip, Cross -word లాంటి మెదడుకు-మేతలు మేటలు-మేటలుగా ఉంటాయి. అవి రోజూ ఎలాగూ చేస్తాను. అది కాదు విషయం.
కిందటి ఏడాది లాక్-డౌన్ మొదలైన దగ్గర్నుంచి - ప్రతి నెలా - "Brain Busters" అని దాదాపు 46 పేజీల ఒక special puzzle edition వస్తోంది. అందులో చాలా కొత్తరకాల పజిల్స్ దొరికాయి నాకు. అందులో నేను పూర్తి చేయగలిగిన ఒక కొత్త రకం పజిల్ - ఈరోజు నా కబుర్లకి టాపిక్కు & టాప్-పిక్: Simon Shuker's Code Cracker.
పైన ఫొటోలో సైమన్ గారు చెప్పిన కోడ్ క్రాకర్‌కి నేను పెట్టుకున్న అచ్చతెలుగు పేరు "సన్న-బీటిక". (Code=సంజ్ఞ; సంజ్ఞకి వికృతి సన్న. Crack=బీటిక).
పై బొమ్మలో ఉన్న విశేషాలు ఇవీ:
1) గళ్ళున్న పెద్ద చతురస్రం.
2) గడికో అంకె (1 నుంచి 26 దాకా).
3) పక్కనే అంకెలేసి నిలువుగా అమర్చిన పెట్టెలు రెండు వరసలు.
4) వరసకి 13 పెట్టెలు చొప్పున మొత్తం 26 పెట్టెలు.
5) ఆ 26 పెట్టెల్లో ఒక రెండు పెట్టెల్లో మాత్రం రెండు అక్షరాలు ఉన్నాయి. (25=F; 26=L).
6) ఆ రెండు పెట్టెల్లో ఉన్న ఆ రెండు అక్షరాలు ఈ గళ్ళ నుడికట్టు పూర్తిచేయడానికి ఆధారాలు.
నే ముచ్చటగా పేరెట్టుకున్న సన్న-బీటికని పూరించడానికి సైమన్ గారి సూత్రాలు ఏంటంటే:
ఆ గళ్ళలో ఉన్న ప్రతి అంకె ఇంగ్లీష్ వర్ణమాల లోని ఒక అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి పైనిచ్చిన సన్న-బీటికలో 26 అంటే L, 25 అంటే F.
ముందుగా తెలిసిన రెండు అక్షరాలనీ వాటి అంకెలున్న గళ్ళల్లో రాసుకోవాలి. అలా రాసుకున్న అక్షరాల వల్ల సగం-సగం ఏర్పడిన మాటలని పూరించాలి. దానితో ఖాళీగా ఉన్న అంకె-గడుల్లో కొత్త అక్షరాలు బయటపడతాయి. ఆ కొత్త అక్షరాల అంకెల్ని పక్కనున్న 26 నిలువు పెట్టెల్లో రాసుకోవాలి. కొత్తగా తెల్సిన అక్షరాల్ని మళ్ళీ గళ్ళనుడికట్టు లోని వాటివాటి అంకెల గడుల్లో రాసుకోవాలి. మళ్ళీ మాటలు పూరించాలి. ఇలా 26 అక్షరాలు తెలిసి, అన్ని గడుల్లో మాటలు రాశాక Code-Cracker పూర్ణంగా పూరింపబడి పూర్తవుతుంది.
*******
*******
ఇక మొదలెట్టేద్దామా!
ఇప్పుడు ఖాళీగా ఉన్న గళ్ళలో 26 ఉన్న చోటల్లా ఎల్లూ (26=L), 25 ఉన్న చోటల్లా ఎఫ్ఫూ (25=F) రాసేసుకోవాలి.
హల్లో! హల్లో!
అనుకోకుండా ఉఫ్ఫో-ఉఫ్ఫో...
చూడండి ఈ కింద గళ్ళో
ఎక్కడెక్కడ నింపానో ఎల్లూ, ఎఫ్ఫో!
25=F , 26=L అని నింపగానే ఒకే వరసలో ఉన్న ఆ అక్షరాల మధ్యలో ఉన్న అంకెల వరస (F-13-13-6-7-6-13-13-L చూడగానే నాకు తట్టిన ఒకే ఒక పదం FOOTSTOOL.
దాంతో నాకు 13=O అనీ, 6=T అనిన్నీ, 7=S అనినిన్నీ అని తెలిసిపోయిందోచ్! మరిక ఆగుతానా?
నువ్వో ఓ, అదో టీ
ఉస్సూ-హస్సూ మంటూ
మరోటి ఎస్సూ అనుకుంటూ
13, 6, 7 గళ్ళన్నిటినీ నింపేశా!
అప్పుడు దొరికాయయ్యా... చివరాఖరి గళ్ళలో మూడక్షరాలు!
అదెలాగా అంటే... చిట్టచివరి లైన్లో రెండు నల్లగళ్ళ పక్కనున్న ఎనిమిది తెల్లగళ్లనూ - అక్కడున్న T -3-2-S-T-12-12-S అన్న వరస చూడగానే తట్టేసింది - అది TRUSTEES కాక ఇంకేమీ కాదనీ - 3 తప్పకుండా R; 2 ఖచ్చితంగా U; 12 నిర్మొహమాటంగా E అని.
అంతే ఎక్కించేశా
3, 2, 12 లెక్కెట్టుకుంటూ
ఆరూ, యూ, ఈ
మూడూ, రెండూ, పన్నెండో గడీ
(3=R; 2=U; 12=E )
2=U; 3=R; 12=E అని గళ్ళన్నీ నింపగానే ఓ చోట వెర్సూ, వోర్టెక్సూ తప్ప ఇంకేమీ రావనిపించాయి. అనిపించిందే తడవు 22=V; 23=X అనేసుకున్నా.
ఆరూ, యూ, ఈ
అన్నాక వచ్చాయీ
అనుకోకుండా వెర్సూ, వోర్టెక్సూ
దాంతో దొరికేశాయి వీ, ఎక్సూ
అంటూ నేనయ్యా ఫిక్స్!
R-O-S-24 లో 24 ఈజీక్వల్టూ Y అని నేనంటే
Y-O-L-14-S లో పద్నాలుగుకే K ఇస్తానంటే
ఓకే -ఓకే అనక కాదనే వారుంటే -
ఎందుకు కాదంటారో - tell me why?
(24=Y; 14=K)
హమ్మయ్య! ఇప్పటికి ఎన్ని అంకెలకి ఏమేం అక్షరాలు వచ్చాయో చూద్దాం!
సైమన్ గారిచ్చినవి సూర్యచంద్రుల్లా రెండు
(25=F; 26=L)
నేను కనిపెట్టినవి దశావతారాల్లా పది
(2=U; 3=R; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 22=V; 23=X; 24=Y)
వెరసి ద్వాదశాదిత్యుల్లా పన్నెండు
(2=U; 3=R; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)
వచ్చిన అక్షర-పుష్కరాలకి ముచ్చట పడి ఆగిపోక ముందుకి సాగుదాం!
ముసిముసిగా నవ్వుకుంటూ
స్క్స్ -స్క్స్ అనుకుంటూ
ఉండగా ఉండగా తట్టేసిందే
4-S -K-S లో ఉన్న నాలుగే (ASKS)
ఆంగ్ల అచ్చు అదే , అదే... A!
దాంతో కొత్త వరస ఆయే
(2=U; 3=R; 4=A; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)
1-U-R-R-A-5-T-S
ఈ వరస చూడగానే నోరూరే
గుర్తొచ్చే ఎండు ద్రాక్షే (CURRANTS)
ఇక 1 C కాక మరేంటీ?
5 ఎన్ను కాక ఇంకేంటీ?
రాస్కో మరి కొత్త వరస...
(1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)
1=C; 5=N రాసేసి చుట్టూ చూస్తే
అడ్డంగా A-R-19-U-E-S కనిపిస్తే
19=G అని గా... ఠిగా అనిపించేస్తే (ARGUES)
R-A-N-K-16-N-G లో 16=I నేనేనంటే (RANKING)
15-A-I-N లో 15 మ్మ్... నేనే ఎమ్ అననంటే (MAIN)
ఎమ్మట్నే రాసుకోబ్బా -
15 ఎమ్మని, 16 అయ్యని, 19 జియ్యని !
కొంగొత్త వరస:
(1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 12=E; 13=O; 14=K; 15=M; 16=I; 19=G; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)
ఇప్పటికి అష్టాదశాంగాల్లా పద్ధెనిమిది అక్షరాలు చిక్కాయి.
ఇంకేం దొరుకుతాయీ అని చూసుకున్నా.
A-8-S-O-R-8-S లో 8 నేను B పోలిక అంది (ABSORBS)
C-9-A-R-M లో 9 ఏకాంకాల్లో హెచ్చు తానంది (CHARM)
A-10-U-A లో 10 అయ్యో! తాను కుయ్యోమంది (AQUA)
సరికొత్త వరస:
(1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 8=B; 9=H; 10=Q; 12=E; 13=O; 14=K; 15=M; 16=I; 19=G; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)
ఏకవింశతి పత్రాల్లా ఇరవై ఒక్క అక్షరాలు దక్కాయి - అజ్ఞాతవాసంలో ఉన్న పంచపాండవుల్లా ఆచూకీ చిక్కనివి ఐదంటే ఐదున్నాయి. వాటిని పట్టేద్దాం పదండి!
11-A-T-E-R లో 11 డబుల్ ఒకటి ఉంది నాకంది (WATER)
11-R-E-A-T-H-E లో 11 హే యూ! నేనే డబ్ల్యూ! అంది (WREATHE)
S-H-A-20-E-21 లో 20 R ఆల్రెడీ పోయే కాబట్టి P ని నేనంది,
S-H-A-20-E-21 లో మిగిలిన 21 నేనూ ఢీ అంటే ఢీ అంటానంది (SHAPED)
మన కొత్త వరస ఇదీ!
(1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 8=B; 9=H; 10=Q; 11=W ; 12=E; 13=O; 14=K; 15=M; 16=I; 19=G; 20=P; 21=D; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)
చతుర్వింశతి-గుణాల్లా ఇరవై నాలుగు అక్షరాలు కుదురుకున్నాయి.
అన్ని గళ్ళల్లో దొరికిన అక్షరాలన్నీ రాయగా, రాయగా ఇక మిగిలినవి దివా-రాత్రాల్లా రెండక్షరాలు. అవీ పట్టేద్దాం!
H-I-17-A-C-K లో 17 జై- జై అంది! (HIJACK)
B-R-E-E-18-E-D లో 18 తనెవరో చెప్పుకోవడం ఈజీ-పీజీ అంది (BREEZED)
(1=C; 2=U; 3=R; 4=A; 5=N; 6=T; 7=S; 8=B; 9=H; 10=Q; 11=W ; 12=E; 13=O; 14=K; 15=M; 16=I; 17=J; 18=Z; 19=G; 20=P; 21=D; 22=V; 23=X; 24=Y; 25=F; 26=L)
కళ్ళు రెండూ తెరిచిపెట్టి
గళ్ళ నిండా అక్షరాలు రాసిపెట్టి
గళ్ళల్లో దాక్కున్న నుడులను పట్టి
ఇక్కడ పెట్టా!
పట్టుకున్నవారికి పట్టుకున్నంత!
అన్నట్టు సైమన్ గారి ఈ కోడ్-క్రాకర్ నేను ఇంతకు ముందు రాసిన Cryptoquip కి దాయాది లానో, దాదీ లానో అనిపించింది. అదీ ఓ పాలి సూసొచ్చేయండి!













కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి