21, జూన్ 2012, గురువారం

లక్ష్మణమూర్ఛ


అనాతవరం భజన పాటలు - లక్ష్మణమూర్ఛ

పాల వర్ణపు ఛాయ పలువరస చక్కనీ పలుకవేమిర తమ్ముడా!
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఘనముగా నీవేగి దనుజుని బాణముచే రణములో పడియుంటివా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

సీతాను నోదార్చి చింతించు చుంటివి విధాతా యిట్లు వ్రాసెనా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

హా! లక్ష్మణా యిట్టి ఆపదా నీకేలా ప్రాప్తించేరా తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

కైకచే వరమంది కానాలకేగియు కష్టముల పాలైతివా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

మన తండ్రి దశరథుడు మర్యాద తప్పక మనలా నడవుల కంపెనా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

చిలుకాలు హంసాలు అయోధ్య లోపల చిన్నాబోయి యుండునేమో 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

తమ్ముడేడని తల్లి సుమిత్ర నన్నడుగ ఎవరీ తమ్ముని జూపుదు
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

మన్నాన చేసేటి కన్నాతల్లడుగాగ మనవి యేమని సేతూరా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

భరత శత్రుఘ్నులు అన్నా యేడంటేను యేమని పలుకుదునురా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

నా భర్త ఏడని నళినాక్షి నన్నడుగ నాతీతో నేమందురా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఉప్పు కోసము బోయి కర్పూరమిడినట్లు పలుకావైతివి తమ్ముడా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

పసుపు కోసము బోయి బంగారమిడినట్లు పలుకావైతివి తమ్ముడా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

అయ్యయ్యో! లక్ష్మణా! నా ముద్దుల తమ్ముడా! ధరణీపై కూలిపోతివా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

తమ్ముడా! నివులేని తరుణీ రాజ్యములేల, సుఖమేల, జయమేలరా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

పుట్టినప్పుడే తల్లీ పెట్టితే విషమునూ కష్టములు తప్పునేమో 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

నీవంటి తమ్ముడూ నీతిపరుడు నాకు యే జన్మమునకు కల్గును 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

అమ్మ కొరకు మనము ఆపద పాలైతిమి కొమ్మ కొరకు కూలిపోతివా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

నిండుచంద్రుని బ్రోలు నీ మోము చూడంగ నీ సొగసు చెడియుండెరా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

కలువరేకుల తీరు కళ్ళా సొగసు తీరూ కాంతి వెలయారుచుండెరా  
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఒక్క మాట్లాడారా, చక్కనయ్యా! నాతో మక్కూవ తీరగాను 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

వదినకోసము బోయి వారాధి బంధించి ఒరిగిపోతివి తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

కుంచేడు ముత్యాలు కుప్పబోసిన రీతి కూలిపోతివ తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

పగవారి బాణాలు పైబాడి వస్తుంటే పలుకవేమిర తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఒక్క తమ్ముడు పోతే యెంతో దుఃఖించేవు లంకెట్లు సాధింతువు ఓ రాఘవా
ఓ రాఘవా! లంకెట్లు సాధింతువు   ||పాల||

ఎంత మాటాడితివి - ఓ వెర్రి జాంబవా! కుడి భుజము కూలిపోయెనూ 
జాంబవా! కుడి భుజము కూలిపోయెనూ   ||పాల||

కుడిభుజము నీవిపుడు కూలిపోతీవయ్యా యేమి చేయుదు తమ్ముడూ 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఆలి పోతే ఆలి అమరియున్నది గాని తోడూ నెక్కడ తెస్తునూ
జాంబవా! తోడూ నెక్కడ తెస్తునూ   ||పాల||

అంజనవరపుత్ర! కంజాదళేక్షణా! సంజీవికే వెళ్ళుమా వీరాంజనేయ 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

జాంబవంతుడు మున్ను చక్కగా నీతోటి ఎరిగించినట్టి తెరవు 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

ఇక్కడ ద్రోణాద్రి యిల మూడు లక్షల అరువది ఆమడలున్నది 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

మధ్యత్రోవలయందు మాయారాక్షసులుండ్రు మాయాచే నిన్ను మరపింపజూతూరూ 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

తెల్లని ఆకులు తేటగా యుండును ఎర్రని ఆకులు ఏర్పాటుగా యుండు 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

పండు పచ్చగానుండు పగలు రాత్రులయందు భాసిల్లు కాంతులచే పరమ మోదమునందు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

అమృతము గలదందు అన్ని మందులు గలవు గంధర్వులచ్చోట కావలి యుందురు 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

సూర్యవంశపు రాజుల సుతులమయ్య మేము సూర్యుడు ఉదయిస్తే జీవింపజాలము
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

ప్రొద్దు పొడవక ముందే తెచ్చితే సంజీవి మా ముద్దు లక్ష్మణుడు మూర్ఛ తెలిసి బ్రతుకు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

నా తమ్ముడూ గాదు - నీ తమ్ముడే హనుమా! నీకంటే బాంధవులు నాకెవ్వరింకా
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||



వీరాంజనేయా! రావయ్యా! మా సర్వ భారము నీదయ్యా 
కార్య భారము నీదయ్యా - ఓ కేసరినందన రావయ్యా 
కార్య నిర్వాహక రావయ్యా - ఓ కరుణాసాగర కావుమయ్యా 
వీరా! వీరా! వీరా! వీరా! వీరా పంచముఖి రారా 
రక్ష రక్ష రక్ష రక్ష! మా రక్ష రామభక్త 
రామ రామ రామ రామ! రామదూత వేగ రారా 
రామ రామ రామ రామ! రామభక్త వేగ రారా 
కపిరాజ వేగ రారా .....పంచముఖి వేగ రారా 
రామదూత వేగ రారా ....రామభక్త వేగ రారా !!!!

ఆ మాటలు వినగానే వాయుపుత్రుడు లేచి ఒక్క పరుగూ తీసెను 
వీరాంజనేయుడు ఒక్క పరుగూ తీసెను  ||ఒక్క||

వాయుపుత్రుడూ వెళ్లి చాలా సేపాయెను ఇంకా రాలేదేమిటో జాంబవా! 
ఇంకా రాలేదేమిటో జాంబవా!   ||ఇంకా||

ఆ బ్రహ్మ మనమీద దయ తప్పి యున్నాడు - బ్రహ్మాస్త్రము వేసెదా జాంబవా!
బ్రహ్మాస్త్రము వేసెదా జాంబవా!  ||బ్రహ్మా||

సూర్యుడూ జగమునా సూటి తప్పినాడు - సూర్య బాణము వేతునా జాంబవా!
సూర్య బాణము వేతునా జాంబవా!  ||సూర్య||

చంద్రూడూ మనమీద దయ తప్పి యున్నాడు - చంద్రా బాణము వేతునా జాంబవా!
చంద్రా బాణము వేతునా జాంబవా!  ||చంద్రా||

కౌసల్యా నందన! ఖగరాజ వాహనా! కాంతి వివరము తెల్పెద రాఘవా!
కాంతి వివరము తెల్పెద  ||కాంతి||

సూర్యోదయము కాదు - చూడూము ఆ వెలుగు - సుందరాకార! వేగ 
రాఘవా చూడూము ఆ వెలుగు ||రాఘవా||

సూర్య వంశోద్భవుని  సుమిత్రనందనుని సూశక్తి తెల్పింపుమా రాఘవా 
సంజీవికే వెళ్ళుమా వీరాంజనేయ!

సంజీవిని రప్పించి సానందు నూరించి తమ్మునికి తావేయుమా సుషేణా!
తమ్మునికి తావేయుమా సుషేణా!

అన్నన్న! ఓ అన్న! శ్రీరామచంద్రుడా! ఎంతా నిద్రా పోతిని రాఘవా!
నేనెంత నిద్రా పోతిని....

పాలవర్ణపు ఛాయ పలువరుస చక్కని పలికినావుర తమ్ముడా!
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!

బ్రతికితివి తమ్ముడా! బ్రతికితివి లక్ష్మణా! అయోధ్యకే పోదమా లక్ష్మణా!
అయోధ్యకే పోదమా లక్ష్మణా!  ||పాల||

అన్నన్న! ఓ అన్న! శ్రీరామచంద్రుడా! ఎంత మాటాడితివి, రాఘవా!
ఎంత మాటాడితివి, రాఘవా!

అభయమిచ్చి వేగ ఆ రావణాసురుని ధూర్తాగ్రేశుని చంపుమా, రాఘవా!
ధూర్తాగ్రేశుని చంపుమా, రాఘవా!

సీతాను దోడ్కొని ఘనముగా మనమిపుడూ అయోధ్యకే పోదమా, రాఘవా!
అయోధ్యకే పోదమా, రాఘవా!


7, మే 2012, సోమవారం

భజన పాటలు - దశావతారములు

అనాతవరంలో నా చిన్నతనంలో విన్న భజనపాటలు మా నాన్నగారు వ్రాసి పంపించగా వాటిని ఇక్కడ బ్లాగస్థం చేస్తున్నాను. అందులో మొదటగా "దశావతారములు" ఇక్కడ...

రామా! నీ మహిమలెన్నా  తరమా బ్రహ్మాదులకైను 
రామా! నీ మహిమలెన్నా  తరమా సనకాదులకైను ||రామా||


వచ్చి వారధిని జొచ్చి సోమకుని 
హెచ్చు శరంబుల గ్రుచ్చి నుతుల గొని
ఇచ్ఛతొ వేగమె తెచ్చి విధాతకు 
హెచ్చరికతో నీవు ఇచ్చి ఏలితివి 
మత్స్యావతారా! జయ మత్స్యావతారా!  ||రామా||

సురలు శరణుయని సొంపుతొ వేడగ
కరుణతొ మందర గిరి  పృష్టమునను
గురుతుగ నిడుకొని పరదేవతలను
నిరుపమానముగ నీవు బ్రోచితివి
కూర్మావతారా! జయ కూర్మావతారా!   ||రామా||

మనమున లేశము కరుణ లేకయా
కనకాక్షుడు భువి కలయ జుట్టగను
సనకసనందన మునులు వేడను
దనుజుని చుట్టియు ధర ఏలితివౌ 
వరాహావతారా! జయ వరాహావతారా!   ||రామా||

పరి పరి విధముల ప్రహ్లాదుడు నిను
హరి హరి యనచును మొరలిడగా విని
ఫెళ ఫెళమనచును స్తంభము వెడలి
కరమున హిరణ్య కశ్యపు వక్షమున 
వరనఖములచే వ్రక్కలు చేసిన
సింహావతారా! నరసింహావతారా!   ||రామా||

ముదముతో మూడడుగుల దానము 
సదయుడవని సంతుష్టిగ నొసగిన
వదలక దైత్యుని వడివేగంబున
పదములనణచిన  పరాక్రముడవౌ
వామనావతారా! జయ వామనావతారా!  ||రామా||

కరుణలేక నీవు కడు శౌర్యముతో 
వరాయుధంబున వసుధాస్థలిపై 
ఇరువదియున్నొక్కమారు భూపతుల 
శిరములు కూలగ శరముల వేసిన 
రామావతారా! పరశురామావతారా!  ||రామా||

దేవర బ్రహ్మేంద్రాదులు బెబ్బున
కావుమనగ కౌసల్య పుత్ర యా 
రావణాద్యఖిల రాక్షస సంహర 
ణీవె యొనర్ప విభీషణు  బ్రోచిన 
మాటిమాటికిని మారుతినేలిన
రామావతారా! శ్రీ రామావతారా  ||రామా||

కన్నెల చీరలు అన్నియు దొంగిలి 
చెన్ను మీరగను పొన్న గున్నపై
వెన్నదొంగ యా చిన్ని కృష్ణునకు 
అన్నవు గదరా ఎన్నిక హలధర 
రామావతారా! బలరామావతారా  ||రామా||

హద్దు మీరకను హరి నీ సేవయు 
ఒద్దిక తోడను వెదకి సేయ - పరి
శుద్ధ జనుల నివు సూటిగ కనుగొని
పరిశుద్ధ జనుల నీవు సూటిగ కనుగొని
సద్దు సేయకను సరగున బ్రోచిన
బౌద్ధావతారా! జయ బౌద్ధావతారా!  ||రామా||

ఇల సుజనుల నివు ఇంపుతొ గనుగొని 
ఖలులను కనుగొని ఖండించుటకును 
జలజనయన యీ కలియుగాంతమున
కలికి మూర్తివై కలిగెదవౌర 
కలికావతారా! జయ కలికావతారా!  ||రామా||

వాసిగ ఇరగవరాధీశుడవై  
కేశవ నీ కృప లేశము మరువక 
భాసురముగ కోసూరి రాఘవ 
దాసుని హృదయ నివాసుడవైతివి
దశావతారా! జయ జయ దశావతారా!  ||రామా||






1, మే 2012, మంగళవారం

విమర్శామృతాంజనం

ఏప్రిల్ "విహంగ"లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


విమర్శామృతాంజనం 

శ్రీ నందన నామ తెలుగు సంవత్సరాది వస్తోంది వస్తోంది అనుకునేలోగా రానూ వచ్చింది, అంతే హడావిడిగా వెళ్లనూ వెళ్ళింది. ఉగాది పచ్చడి కి అన్ని రుచులూ కుదిరాయి కానీ వేపపూతే దొరకలేదు. బహుశా పేపర్ చదవడం వల్ల తెలుస్తున్న (దుర్) వార్తల వల్ల అందాల్సినంత చేదు అందిపోతోందో ఏమో వేపపూత లోటు అంతగా కనిపించలేదు ఉగాది పచ్చడిలో. అంతా అయాక దూరంలో వున్న ఆత్మీయులైన బంధువులకి, స్నేహితులకి ఫోన్లు చేసి ఉగాది శుభాకాంక్షలు చెప్తూ వున్నాను. అలా ఒకరితో మాట్లాడుతూ వుండగా ఏదో మాటల సందర్భంలో ఆఫీసు కి వెళ్లాలని తొందరలో ఉగాది సంబరాన్ని తొందరగా ఎనిమిది  గంటల లోపలే ముగించానని చెప్తూ వుంటే - నువ్వే నయం లలితా! మన ఆంధ్రాకి, మన ఊరుకి దూరం గా వున్నా కూడా  చక్కగా అన్ని పండుగలూ పద్ధతిగా చేస్తావు. ఇంకా ఇక్కడ వున్న వాళ్ళే పాటించట్లేదు కొన్ని, కొన్ని పద్ధతులు  - అనగానే ఎప్పుడూ వినే మాటలే అయినా మళ్ళీ మొదటిసారే వింటున్నట్టు సంబరపడి పోయాను. ఇంకో పది నిముషాలు వారితో అవీ, ఇవీ విశేషాలన్నీ మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఆఫీసు కి వెళ్తూ ఆలోచించాను - ఆ సంభాషణ గురించి. తీరా ఆ కబుర్లని మననం చేసుకున్న తర్వాత అనిపించింది - నిజంగా నేనంత మెచ్చుకోదగినంత గొప్ప పని చేస్తున్నానా అని. అలోచించి చూడగా నా మనసుకి నాకే "కాదు" అని గట్టిగా అనిపించింది.

మన దేశానికి, రాష్ట్రానికి, ఊరికి దూరంగా వున్నా కూడా మనం చేసే పనుల్లో, ప్రవర్తనలో ఏమన్నా మార్పు ఉందా అని చూద్దామని రోజువారీ చేసే పనుల, ప్రవర్తనల జాబితా ఒకటి వ్రాసి చూద్దామనిపించింది. ఇదిగో ఈ క్రింద ఇచ్చానే అదే అది:

- అమెరికాలో కూడా సూర్యుడు ఉదయించే దిక్కుని తూర్పు అనే పిలుస్తున్నాను
- రాత్రి పడుకుంటున్నాను, పగలు పని చేస్తున్నాను
- ఎక్కడ ఏ రకమైన ఇటాలియన్, మెక్సికన్, చైనీస్, థాయి - ఏ రకమైన వంటకాలు తిన్నా ఆవకాయ అమృతం లాగే అనిపిస్తోంది ఇంకా
- నా పిల్లలు మాట వినాలని, బాగా చదివేయాలని అనుకుంటున్నాను 
- మా ఆయన నాతో బోల్డంత సేపు అలసట లేకుండా కబుర్లు చెప్పాలనే అనుకుంటున్నాను
- ఆకలి వేస్తోంది, నిద్రా వస్తోంది - ఎక్కడా అమృతం త్రాగిన దేవతా లక్షణాలేమీ రాలేదు
- రోజు రోజుకీ ఇండియాలో పెరిగినట్టే వయసు పెరుగుతోంది కానీ తగ్గట్లేదు
- ఇలా ఇంకా చాలా చాలా వున్నాయి కానీ వాటితోనే ఈ పేజీ నిండి పోతుందని ఇక్కడితో ఆపేస్తున్నాను.

మరి ఇవన్నీ ఎప్పట్లాగే జరుగుతున్నప్పుడు ఏ దేశం లో వున్నావీలయినంతవరకూ మన పద్ధతులు పాటించడం, పండగలు చేసుకోవడం నా బాధ్యత, మామూలుగా చేయవలసిన నా కనీస కర్తవ్యం అనుకోకుండా, అదేదో అపురూపమైన విషయం అన్నట్టు, నేనే ఏదో గొప్ప పని చేసి మన తెలుగు సంప్రదాయాన్ని నా భుజాల మోసేసి ఉద్ధరిస్తున్నట్టు అనేసుకుంటూ - "నేను కాబట్టి, ఇంత దూరంలో వున్నా ఎలా చేస్తున్నానో మీకు తెలుసా?" అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నానేమో అనిపించింది. అలా నాకు తెలియకుండానే నాకు తెలియని ఎవరినో నాతో పోల్చి విమర్శించేలా చేస్తున్నానేమో అనిపించింది. మరి నేను పండగ ఎలా చేసుకుంటున్నానో మరీ మరీ అదేదో ఒక అచీవ్మెంట్ లా చెప్పబట్టే కదా నేనేదో ఇండియా లో వున్నవాళ్ళకన్నా నయమనిపించింది?! కదా! కదా! 

అందరూ న్యూ ఇయర్ రిసోల్యూషన్స్ చేసుకుంటారు కదా - అలాగే నా ఈ నూతన సంవత్సర తీర్మానం, నిశ్చయం - పేరేదైనా సరే - ఏంటంటే అతి మామూలుగా చేయవలసిన, చేస్తున్న పనులని నేనే చేస్తున్నానని గొప్పగా అనుకోకూడదు, అలా ధ్వనించేలా మాట్లాడకూడదు, తెలీకుండా కూడా ఎవరినీ విమర్శించకూడదు. 

తెలీకుండా ఎవరైనా ఎవరిని విమర్శిస్తారు? అని మీరు అనుకోవచ్చు. నన్ను ఎవరైనా "నువ్వు కాబట్టి...." అని మెచ్చుకున్నారంటే వారు ఇంకో ఎవరితోనో నన్ను పోలుస్తున్నారనే అర్థం కదా - అంటే నాకు తెలియకుండానే నేను ఇంకొకరిని విమర్శించడానికి కారణం అవుతున్నాను కదా - అలా అన్న మాట.

విమర్శించడం అనే విషయం వచ్చింది కాబట్టి దీనిమీద ఈ మధ్య కాలం లో నేను గమనించిన కొన్ని విశేషాలు చెప్పేసుకోవాలి మరి.

అప్పుడెప్పుడో ఒక రేడియో కార్యక్రమం వింటూ వుంటే ఒక ఆసక్తి కరమైన సంభాషణ చెవుల బడింది. ఒక శ్రోత ఫోన్ చేసి ఒక పాట కోరారు, ఆ రేడియో వారు వేస్తామని అన్నారు. అంత వరకూ బాగానే వుంది. ఇంతలో పాట కోరిన వారు రేడియో వ్యాఖ్యాత గారిని అడిగారిలా - ఈ పాట వున్న సినిమా చూశారాండీ? అని. వెంటనే ఆ వ్యాఖ్యాత గారు - ముక్కూ, మొహం సవ్యం గా లేని అలాంటి హీరోల సినిమాలు చూసే అలవాటు లేదండి నాకు - అనేశారు. వెంటనే నాకనిపించింది సదరు "ముక్కూ మొహం సవ్యం గా లేని" హీరో గారు అనుకోకుండా ఆ రేడియో స్టేషన్ కి వస్తే, ఆ వ్యాఖ్యాత  గారితో చేయి కలిపి "హలో" అంటే ఆయన అలాగే "నీ ముక్కూ మొహం సవ్యం గా లేవోయి. నీ సినిమాలు చూడలేకపోతున్నాను. ఏక్షన్ మానేయి" అంటారా? లేకపోతే "మొదటి సినిమా అయినా, నటనానుభవం లేక పోయినా మీరు బాగా నటించారు - కీపిటప్" అంటారా?

ఒక పది మంది కలిస్తే సాధారణంగా సినిమాల తర్వాత వేడి వేడి గా మాట్లాడుకునేవి రాజకీయాల గురించి. ఎవరో, ఎక్కడో అన్యాయం చేసి దేశాన్ని దోచుకు తింటున్నారని ఒకానొక రాజకీయ నాయకుణ్నో, వారసుణ్నో తెగ తిట్టేస్తూ ఉంటారనుకోండి. ఇంతలో ఆవ్యక్తే అక్కడికి వచ్చేస్తే "నువ్వు ఇంత దుర్మార్గుడివి, అంత మోసగాడివి - ఎంతో దోచేశావిప్పటికి. దిగిపో ఇంకా" అంటారా? లేక "మిమ్మల్ని ఇలా కలిసినందుకు ఆనందం గా వుంది" అంటారా?

ఇంకో పది మంది కలిసి క్రికెట్ చూస్తూ వుంటారు. ఏ ఆటగాడో డకౌట్ అవుతాడు. అంతే ఇంక "వీడిని ఇంకా ఎందుకు తీసుకుంటున్నారో అస్సలర్థం కాదు. బాలు కొట్టడం రాదు, రన్ను చేయడం రాదు" అనేస్తారు. కానీ, బాబులూ! అన్ని వేల మంది మధ్య మనల్ని నిలబెడితేనో? మేమేమన్నా క్రికెటర్లమా అంటారా?  పోనీ క్రికెట్ ఆడడానికి కాదులెండి - మనకి వచ్చిన ఒక కూనిరాగం తీయడానికే అనుకోండి - ఎంత మంది చేయగలరు - అర చేతుల్లో చెమటలు పట్టకుండా, తడబడకుండా?

పోనీ ఇవన్నీ కొంచెం సాధారణమైన  విమర్శలు - పబ్లిక్ ఫిగర్స్ అయిన వ్యక్తుల గురించి ఎవరైనా ఎప్పుడో ఒకసారి మాట వచ్చినప్పుడు సందర్భానుసారంగా చేసేవి. 

ఇవి కాకుండా పని గట్టుకుని మనం చేయాల్సిన పని మానుకుని వేరే వారి పని గురించి చేసే విమర్శలు కొన్ని. 

వేటూరి గారో, ఆత్రేయ గారో వ్రాసిన పాటలుంటాయి. మనకి నచ్చేవీ వుంటాయి, నచ్చనివీ వుంటాయి. కొన్ని పాటలు నచ్చనంత మాత్రాన, మనకి అర్థం కాన్త మాత్రాన పోయిన వారి పాటల్లో తప్పులు పట్టి - "ఈయనకి ఏమీ రాక పోయినా అర్థం కాని మాటలు వాడి చాల తెలివిగా తానొక గొప్ప రచయితననే ఫీలింగ్ వచ్చేలా వ్రాశాడు" అన్నామనుకోండి -వారెలాగూ భౌతికంగా మన మధ్య లేరు ఎలాంటి వివరణా ఇవ్వడానికి కానీ, వారిని వారు సమర్ధించుకోవడానికి  కానీ. పోనీ ఒక వేళ వారు జీవించి వున్నా వారికి అదనం గా వున్న ఏ గంట సమయం లో అయినా ఇంకే సినిమాకి పాటలు వ్రాసే అవకాశం వస్తుందా అని చూసుకునేవారేమో తప్ప ఎలాంటి విమర్శలకూ జవాబివ్వాలని అనుకుంటారని మాత్రం నేననుకోను. అయినా "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు" అన్నట్టే వున్నారు కానీ "ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు" అని కాకుండా "ఉన్నోళ్ళు పోయినోళ్ళ తప్పులెన్నువారు" అనిపిస్తోంది.

నా మటుక్కు నాకు కయ్యానికి, వియ్యానికే  కాదు - విమర్శకీ సమ వుజ్జీ అయి ఉండాలనిపిస్తుంది. ఏ విద్యలో రాణించిన వారు ఆ విద్యకిసంబంధితమైన వ్యాఖ్యలు చేస్తే చదవడానికైనా, వినడానికైనా బావుటుంది. ఒక క్రికెటర్ గురించి గవాస్కర్ లాంటి వారు, ఒక సినిమా నటుడు / గీత రచయిత గురించి ఆ ఆ శాఖల్లో వున్నవారు - ఇలా సంబంధించిన వారు విమర్శించినా, వ్యాఖ్యానించినా ఒక విలువ వుంటుంది. ఆ విషయ  పరిధులకి ఆవల వున్న మిగిలిన వాళ్లందరమూ మనకు ఆయా "ఇంటలెక్చువల్ ప్రొడక్ట్స్" మనకి నచ్చాయో లేదో చెప్పగలము కానీ, అవి "బావున్నాయో, లేదో" అని పదిమందికీ చెప్పలేము. అలా చేస్తే నాకు వచ్చిన తలనొప్పికి నా చేతులతో నేను వాడిన సారిడానో, అనాసినో పని చేసిందని అదే టైం కి డాక్టర్ గారిచ్చిన ఇంకేదో మందు పనిచేయలేదని ఆయన్ని విమర్శించినట్లే  వుంటుంది.

సరే - ఇది కూడా పెద్ద వారి వ్యవహారం కాబట్టి - సర్లే ఆ విమర్శకులకి విద్వత్తు వుంది, వారెవరి  గురించి విమర్శలు వ్రాస్తే నీకెందుకు అంటారా- శుభం - ఇంకా మాట ఎత్తను లెండి. నా లెవెల్కి వచ్చేస్తాను.

అలా గోళ్ళు కొరుకుతున్నాడేంటి వీడు? మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఎక్కడి అలవాటో ఇది మరి? - ఒక బామ్మ గారి కంప్లెయింటు.
మీ పిల్లల్లా కాదు బాబూ...మా పిల్లలకి నేనెంత చెప్తే అంత. ఇలా "ఇది వద్దు, అది కావాలి" అని అడగనే అడగరు - ఒక ప్రక్కింటి పిన్నిగారి పిల్లల మురిపెం.
అదేం సెలెక్షన్ తల్లీ...మరీ అలుగ్గుడ్డలా వుంది ఈ చీర. ఇంత కన్నా ఏం దొరకలేదా నీకు? - ఒక అక్క ప్రశంస చెల్లెలి ఎంపికకి.
ఇలాంటివి తెచ్చారేంటి? నన్ను అడిగితే నేనూ రాకపోయానా సెలెక్షన్ కి? - ఏది తెచ్చినా ఒకావిడ / ఒకాయన అనే మాట.

ఏంటి ఇవేవీ మీకు విమర్శల్లా అనిపించట్లేదా? కొంచెం జాగ్రత్తగా చూడండి - వీటి అన్నిట్లో "రాజుగారి పెద్ద భార్య మంచిది" అనే వాక్యానికి పోలిక కనిపిస్తుంది ;)

అలాగే - ఔత్సాహికులైన తెలుగు వారు  కొందరు మాతృ భాషలో  తమ ఆలోచనలు, అనుభవాలు తోటి తెలుగు వారితో  పంచుకుందామని బ్లాగుల్లో ఎంతో ఇష్టంగా వ్రాసుకుంటారు. వాటిని చదివి నచ్చితే వ్యాఖ్య పెట్టనూ వచ్చు, లేదా ఇది మనకి సంబంధించిన విషయం కాదు అని హుందాగా తప్పుకోనూ వచ్చు. అంతే కాని శల్య పరీక్ష చేసి, లేని అర్థాలని వెతికి, మన ఉనికిని తెలియజేయడానికి అన్నట్టు వ్యాఖ్యలు పెడితే ఎవరికి ఉపయోగమో తెలియదు. మరి అలా సద్విమర్శా పూరిత వ్యాఖ్యలు పెట్టకపోతే తమ తప్పులు ఎలా తెలుసుకుంటారు అంటారా? అంత తెలుసుకోలేని తప్పులు ఉంటాయని అనుకోను, ఒకవేళ వుంటే ఎవరికి వారికి తప్పులు దిద్దేందుకు వారికి ఆత్మీయులైన వారు ఉండనే వుంటారు. అన్నీ మనమే కాయక్కర్లేదేమో కదా?!

అదేదో సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారి డైలాగ్ లో చెప్తారు కదా - పొగడ్త పన్నీరులాంటిది అని (ఇంద్ర అనుకుంటాను ఆ సినిమా). అలాగే నా దృష్టి లో విమర్శ అమృతాంజనం లాంటిది. సరి అయిన నొప్పికి తగు మోతాదులో అమృతాంజనం ఎంత ఉపశ మనాన్నిస్తుందో, అదే తగలరాని చోట అంటే కళ్ళల్లో పడితే ఎంత మండుతుందోఅందరికీ అనుభవమే కదా (సరే - అమృతాంజనం అంటే తెలియని  వారు జండు బామ్, లేకపోతే ఇంకో పేరుతో రిప్లేస్ చేసుకోండి). 

అలాగే విమర్శ కూడా కాని వేళల, కూడని విషయాల్లో ఏమీ ప్రయోజనం లేకుండా చేస్తే చేసే వారికి మంచి చేస్తున్నాము అనిపించినా పడే వారికి "కళ్ళల్లో పడిన అమృతాంజనం" లాగా - అబ్బా! ఎప్పుడు వదులుతుందిరా ఇది - అని మంట పుట్టిస్తుంది.

అలాంటి "విమర్శామృతాంజనం" బారిన మీరెవరూ పడకుండా వుండాలని కోరుకుంటూ...

ఈ నందన లో మీ జీవితం ఆనంద నందనం కావాలని ఆశిస్తూ...

నూతన సంవత్సర శుభాకాంక్షలతో.....

~లలితా TS

1, ఏప్రిల్ 2012, ఆదివారం

అవసరమా...అంతర్జాతీయ మహిళా దినోత్సవం?

మార్చ్ "విహంగ"లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


మార్చ్ "విహంగ"  పత్రికకి వ్యాసం పంపించాలి - గడువు దగ్గర పడుతోంది - ఏ విషయం మీద వ్రాద్దామా, అంత ఆసక్తి కలిగించే విషయాలు ప్రపంచం లో ఏం జరుగుతున్నాయా అని ఆలోచిస్తూ వుండగా ప్రక్క నుంచి ఫోన్ మ్రోగుతున్న శబ్దం వినిపించింది. కాలర్ ఐడీ లో నా ప్రియ నేస్తం పేరు కనిపించగానే ఒకసారి "హాయ్ హాయ్" అనుకుని ఫోన్ తీశాను. ఎప్పటిలాగే "బావున్నావా" అంటే "బావున్నావా" అనుకుని నెమ్మదిగా సన్నటి వాన జల్లులా మొదలైన మా సంభాషణ జడివాన స్థాయి వడిని అందుకని ఒక విషయం నుంచి ఇంకొక విషయానికి పరుగులు పెడుతూ వున్నప్పుడు అలవాటు ప్రకారం మా మాటలు, మనసులు మాకెంతో ఇష్టమైన మేము కలిసి చదువుకున్న మహిళా విశ్వ విద్యాలయం వైపుగా మళ్ళాయి. వెంటనే అన్ని విషయాలతో బాటుగా మార్చ్ లో వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము పాల్గొని గెలిచిన పోటీలు, డిబేట్ పేరుతో జరిగిన సరదా వాదోపవాదాలు గుర్తుకొచ్చాయి. అంతే...అరెరే..ఇంత మంచి విషయం పెట్టుకుని ఏంటబ్బా ఇంత ఆలోచిస్తున్నాను. సరి అయిన సమయం లో ఎంత మంచి టాపిక్ గుర్తుకొచ్చింది కదా - నా మార్చ్ వ్యాసానికి  "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" కన్నా మంచి విషయం ఏముంటుంది కదా అనే తెగ మురిసిపోయాను. నా నేస్తం తో మాట్లాడడం అయి ఫోన్ పెట్టేయగానే అతి ఉత్సాహంగా వ్రాసేద్దామని (అదే టైపు చేసేద్దామని) అనుకుని లాప్టాప్ తీసుకోగానే మొట్ట మొదటగా నాకై నాకే అడగాలి అనిపించిన ప్రశ్నలు ...అవునూ ఇంతకీ "అంతర్జాతీయ మహిళా దినోత్సవం" అంటే ఏంటి? అసలెందుకు చేసుకుంటారు? చెప్పద్దూ...కొంచెం అని మొహమాటానికి చెప్తున్నాను కానీ కొంచెం "బాగానే" సిగ్గుగా అనిపించింది - ఇంట్లో మొదటి ఆడపిల్లగా పుట్టి, ఇంకో ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన నేను, మహిళా విశ్వ విద్యాలయం లో చదివిన నేను, బోల్డంత మంది మంచి అమ్మాయిలకి స్నేహితురాలనయ్యే అదృష్టం కలిగిన నేను - గంభీరం గా చెప్పాలంటే ఒక మహిళకి పుట్టి, ఇంకో మహిళ ఇంటిని మెట్టి, అనేక మహిళా స్నేహిత బృందాదృష్ట సంహితనైన నాకు  (ఇది మహా దుష్ట సమాసం అయి ఉండొచ్చు...చదువరులూ - ఈ ఒక్కసారికీ క్షమించేయండి!) మహిళలకి అంత ముఖ్యమైన, అంతర్జాతీయ స్థాయి దినోత్సవం గురించి అసలేమీ తెలియనందుకు. 

వెంటనే గబా గబా గూగుల్ శోధనా పేటిక లో "International Women's day" అని టైపు చేశాను. వచ్చిన ఫలితాల్లో ఐదవ లింక్ అయిన వికీపీడియా మీద క్లిక్ చేసి అక్కడ వున్న విషయమంతా చదివాను. హ్మ్...ఎందుకో మరి అంత గొప్పగా అనిపించలేదు. 

 "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర  దేవతః" - అని చెప్తూ సర్వ మానవులకూ జీవనావసరమైన శక్తికి స్త్రీ రూపమిచ్చిన భారత దేశం లో పుట్టి అంత బేలగా మారి -  నన్ను గుర్తించండి, నాకు వనరులు కూర్చండి, వసతులు కల్పించండి - అంటూ అదేదో మహిళ అంటే ఒక రక్షిత పథకం లో పరిగణన లోకి తీసుకోవాల్సిన జాతిగా అనుకుంటూ, అందులో నేనూ ఒక భాగంగా - మహిళా దినోత్సవం అని ఒక రోజుని అనుకుని, దానికిఅభినందనలు తెలుపుకుని, అందుకుని, బహుమతులు తీసుకుని మురిసిపోవాలి అనిపించలేదు. అలా అని నాకు బాధిత మహిళల మీద, వాళ్ళు పడే బాధల మీద చిన్న చూపూ లేదు, వీళ్ళేమీ చేయకపోతే ఎందుకిలా అవుతుంది - చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అనుకునే ఏక పక్ష దురభిప్రాయమూ లేదు. వీలైతే అలాంటి వాళ్లకి సానుభూతి చూపడంతో ఆగిపోకుండా చేతనైనంత సహాయం చేయాలనీ వుంటుంది. వాళ్ళనలా భయం భయంగా పెంచిన తల్లులని తలుచుకుని బాధ, ఆ స్త్రీల భయాలని, బలహీనతలని ఆసరాగా తీసుకుని తమకి అనుకూలంగా ఉపయోగించుకునే వారిని  చూసి కోపం వస్తూ వుంటాయి. అలా ఉపయోగించుకునే వారిలో వారి సాటి స్త్రీలే వుండడం వింతగా అనిపిస్తుంది. 

నేనేంటో మరీ సీరియస్ గా ఏదేదో ప్రసంగ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టు వున్నాను...బాబోయ్...బయటికి వచ్చేస్తున్నాను...నాదైన దారిలోకి...

అసలు ఎప్పట్నుంచో మన దేశం లో - కడుపు నింపే అన్నపూర్ణ, చదువులిచ్చే సరస్వతి, సంపద నిచ్చే లక్ష్మి - ఇలా మనిషికి కనీసావసారాలు తీర్చే ఆహార, విద్యా, ధనాలు అన్నీ స్త్రీ రూపాలే. గొప్పగా విద్వత్తు ప్రదర్శించే పురుషులని "పుంభావ సరస్వతి" అని పిలుస్తారు కదా! మరి మనం ఆడవారిగా పుట్టినందుకు గొప్పగా అనుకోక మనమేంటి, మనకి మనమే తక్కువ చేసేసుకుని సమానత్వం-సమాన హక్కులు అని నినాదాలు చేయడమేంటి, దినోత్సవాలు జరుపుకోవడం ఏంటి?

ఏ ఇంట్లో పని చేసే పని అమ్మాయినో, ప్రతి బిల్డింగ్ దగ్గర ఇటుకలు మోసే కూలీ యువతినో కదిపి చూడండి. వారికి తామూ సంపాదించాలి అన్న ఆలోచన, ఈ పని పోతే వేరే పని దొరుకుతుంది అన్న ధీమా తప్ప ఏ సమానత్వ వాదనకూ టైమూ, తీరికా వున్నట్టు అనిపించదు.

అదే ఏ సెలెబ్రిటి వనితనో తీసుకుంటే తన వృత్తి, అందులో తాను ఎక్కగలిగే సోపానాలు, పొందిన అర్హతలని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప తాము ఎవరి కన్నానో తక్కువేమో అనుకునే భావనే కనిపించదు.

 అసలు ఆలోచిస్తే ఈ సమానత్వం గొడవలు మనుషుల్లో తప్ప ఇంక ఏ జీవ రాశిలోనూ వున్నట్టు అనిపించదు- శరీర ధర్మానికి తగినట్టు విధులు నిర్వర్తించడం తప్ప ఇంకే జీవులూ ఆడ - మగ భేదాలకి  అంత ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కనిపించవు. సర్లెండి! నేను పరకాయ ప్రవేశం  చేయలేను కాబట్టి ఇంత కన్నా నొక్కి క్కాణింలేను. ఇప్పటికి ఇది ఇలా వదిలేసి అసలు మహిళా దినోత్సవం మనస్పూర్తిగా జరుపుకోవడానికి ఒక గొప్ప కారణమేదైనా కనపడుతుందేమో చూడాలి.

రండి, రండి! ఇక్కడేదో పార్టీ జరుగుతున్నట్టుంది - రకరకాల చీరలు, లేటెస్ట్ నగలూ కనిపిస్తున్నాయి - పదండి మరి చూసొచ్చేద్దాము...
ఆ అమ్మాయి ఎంత బాగా అలంకరించుకుంది! ప్రక్కనే వున్న ఆవిడ తో కబుర్లు చెప్తోంది - కళ్ళల్లో మెఱుపులు మెరిపిస్తూ...ఒక చెవి అలా వేద్దామా (అవునండీ...నాకూ తెలుసు ఇంకొకళ్ళ మాటలు వినకూడదని - కానీ మనమిక్కడ ఎలాగైనా సరే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒక్క మంచి కారణమైనా వెతుక్కోవాలి కదా....)

హాయ్! ఎలా వున్నారు మీరు?
బావున్నామండీ...మీరెలా వున్నారు?
మళ్ళీ ఏదో లేటెస్ట్ జుయెలరి కొనుక్కున్నట్టు వున్నారు...
అవునండీ ...మొన్ననే ఇండియా నుంచి మా అత్తగారు తెచ్చారు...
(అర్రే! అదేంటి ఆ వినే ఆవిడ మొహం అలా అయిపోయింది - ఓహో...అత్తగారితో అన్యోన్యంగా వుండడం, అత్త అమ్మలా ఆభరణం పంపడం నచ్చలేదేమో !!!??? ఎలా మాట మార్చేస్తోందో చూడండి )
ఓ అలాగా! అది సరే కానీండి. అదిగో అక్కడ నుంచున్న వనితని చూసారా? మీకు ఆవిడ తెలుసా?
వనిత, నేను ఒక టీం లోనే చేస్తున్నామండీ...నాకు మంచి ఫ్రెండ్.
నిజమా! ఆవిడ ఎంత సింపుల్ గా వున్నారో చూడండి. ఎలా అయినా తెలివైన వాళ్ళు అంతే అండీ మనలాగా డ్రెస్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళలో ఆ నాచురల్ గ్లో వుంటుంది ఏ నగలూ పెట్టుకోకపోయినా....
(:( మీరూ కనిపెట్టారా - పాపం ఆ అమ్మాయి మొహం ఎలా చిన్నబోయిందో...సర్లెండి....ఇంకిక్కడ మనకేమీ దొరకదు - ఎంత చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నా బయట పడకుండా ఉండలేని అసూయా విహారం తప్ప...పదండి, పదండి...)

అదిగదిగో అక్కడ ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు - విందామా? (నేను వినేది మీరు వినలేరు కాబట్టి - మీరు చదవండి దయచేసి...)

ఏంటో  వదిన గారు! నల్ల పూసైపోయారు ఈ మధ్య...ఏంటి విశేషం?
కలవకూడదని ఏం లేదండీ ...ఇదిగో మా కోడలు నీళ్లోసుకుంది. చంటి పిల్ల వుంటే హడావిడి మీకు తెలియనిదేముంది. 
చంటి పిల్ల అంటున్నారు, వదినగారూ! మళ్ళీ మైనస్సేనా అయితే!
ఎంత మాటండీ ! దుర్గా, లక్ష్మీ, సరస్వతుల్లాగా ముగ్గురు మనవరాళ్ళు నాకు. అందరినీ కూడుకు కలుపుకు పోయే వాళ్ళే కానీ తీసివేయదగిన వాళ్ళు కాదు సుమండీ!

ఎంత చక్కని మాట చెప్పారు కదండీ - ఆ ముగ్గురు మనవరాళ్ళ మామ్మగారు?! అంత ఉన్నత వ్యక్తిత్వ ఛాయలో పెరిగిన ఆ ఆడపిల్లలు ఇంకెన్ని గొప్ప ఆలోచనల కొమ్మలకి అంట్లు కడతారో కదా! ఇద్దీ ...ఇదే మరి నాకు కావాల్సిన ఒక మంచి సందర్భం....

అసలు మన ఆడ వాళ్ళందరికీ వ్యక్తిత్వ వికాసపు తరగతులు తప్పనిసరి అయితే బాగుండును. ఆ తరగతిలో పాఠ్యాన్శంగా - ఇదిగో ఇవన్నీ వుండాలి...

- అసూయ కూడదు
- మాట్లాడే మాటకి అర్థమే తప్ప అపార్థాలు వుండకూడదు 
- చదువంటే కళాశాలలోనే కాదు - ఇంటిలోనూ, వంటింటి లోనూ చదవాలి 
- ఉద్యోగాలలోనే కాదు ఇంట్లోనూ గెలవాలి 
- పెళ్ళవగానే  ఒక ఆరు నెలలు తప్పకుండా అత్తా-కోడలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించాలి, సంతోషంగా కలిసి ఉండడానికి ఒకరినొకరు మన్నించుకోవాలి
- అమ్మ అయితే ఆడ పిల్ల కావాలనుకోవాలి
- మగ పిల్లవాడు పుడితే నడిచొచ్చే కూతురు (కోడలు) వస్తుందని మురవాలి 

అసలివన్నీ చెప్తున్నానని ఇప్పటికే చాల మందికి నా మీద బోల్డంత కోపం వచ్చేసి వుంటుంది - మరీ పాత చింత కాయ పచ్చడి  కబుర్లు చెబ్తున్నానని. 

కానీ - అమ్మలూ, అమ్మాయిలూ.....- చిన్నప్పట్నుంచీ మీరూ వినలేదూ? పెద్దల మాట చద్ది మూట అని....అందరితో కలిసి, అందరినీ కలుపుకుని బ్రతుకు చల్లగా సాగిపోవడానికి అది చాలదూ...

సరే ...ఇంకో మాట చెప్తాను ....

ఇదివరకటిలా కాక  - ఇది నా ఊహ మాత్రమే సుమండీ - ఇప్పటికన్నా అప్పటి ఆడవారే సుఖంగా వున్నారేమో తెలీదు - ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవారు ఇంటిపట్టున వుండి ఇంటికి పరిమితమైన పనులు చేస్తూ, శారీరక, మానసిక సున్నితత్వాన్ని కోల్పోకుండా జీవితాన్ని సాఫీగా గడిపారేమో అనిపిస్తూ వుంటుంది. అందరూ సుఖమే చూశారు, బాధలు పడ్డవారు లేరని కాదు. కాకపోతే ఆ బాధలకి తోడు ఈనాటి ఉద్యోగ బాధ్యతలు, అన్నీ తామే చూసుకోవాలనే "సూపర్ వుమన్ సిండ్రోములూ" లాంటివి ఉండేవి కాదు.  కాని- పుస్తకాల్లో చదివి, సినిమాల్లో చూసి ఊహించేసుకుని ఏర్పరచుకున్న భావాల ఆధారంగా - ఆ రోజులతో పోల్చుకుంటే  ఈ రోజుల్లో చాలా వరకూ ఆంక్షలు తగ్గి అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా విదేశాలకి కూడా ఒంటరిగా వెళ్లగలుగుతూ స్వేచ్ఛని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు కదా ...

అలాగే మన అందరికి "అప్ గ్రేడ్స్ " అంటే ఇష్టం కదా...
అందుకని International Women's Day ని International Humans Day గా అప్ గ్రేడ్ చేసేసుకుందామా? 
అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి అంతర్జాతీయ "మానవ" దినోత్సవం గా మార్చేసుకుందామా?
ఏం ఆడవారికేనా  అవసరం - అంతర్జాతీయ దినోత్సవం?

~లలితా TS