అనాతవరం భజన పాటలు - లక్ష్మణమూర్ఛ
పాల వర్ణపు ఛాయ పలువరస చక్కనీ పలుకవేమిర తమ్ముడా!
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
ఘనముగా నీవేగి దనుజుని బాణముచే రణములో పడియుంటివా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
సీతాను నోదార్చి చింతించు చుంటివి విధాతా యిట్లు వ్రాసెనా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
హా! లక్ష్మణా యిట్టి ఆపదా నీకేలా ప్రాప్తించేరా తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
కైకచే వరమంది కానాలకేగియు కష్టముల పాలైతివా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
మన తండ్రి దశరథుడు మర్యాద తప్పక మనలా నడవుల కంపెనా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
చిలుకాలు హంసాలు అయోధ్య లోపల చిన్నాబోయి యుండునేమో
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
తమ్ముడేడని తల్లి సుమిత్ర నన్నడుగ ఎవరీ తమ్ముని జూపుదు
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
మన్నాన చేసేటి కన్నాతల్లడుగాగ మనవి యేమని సేతూరా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
భరత శత్రుఘ్నులు అన్నా యేడంటేను యేమని పలుకుదునురా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
నా భర్త ఏడని నళినాక్షి నన్నడుగ నాతీతో నేమందురా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
ఉప్పు కోసము బోయి కర్పూరమిడినట్లు పలుకావైతివి తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
పసుపు కోసము బోయి బంగారమిడినట్లు పలుకావైతివి తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
అయ్యయ్యో! లక్ష్మణా! నా ముద్దుల తమ్ముడా! ధరణీపై కూలిపోతివా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
తమ్ముడా! నివులేని తరుణీ రాజ్యములేల, సుఖమేల, జయమేలరా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
పుట్టినప్పుడే తల్లీ పెట్టితే విషమునూ కష్టములు తప్పునేమో
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
నీవంటి తమ్ముడూ నీతిపరుడు నాకు యే జన్మమునకు కల్గును
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
అమ్మ కొరకు మనము ఆపద పాలైతిమి కొమ్మ కొరకు కూలిపోతివా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
నిండుచంద్రుని బ్రోలు నీ మోము చూడంగ నీ సొగసు చెడియుండెరా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
కలువరేకుల తీరు కళ్ళా సొగసు తీరూ కాంతి వెలయారుచుండెరా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
ఒక్క మాట్లాడారా, చక్కనయ్యా! నాతో మక్కూవ తీరగాను
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
వదినకోసము బోయి వారాధి బంధించి ఒరిగిపోతివి తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
కుంచేడు ముత్యాలు కుప్పబోసిన రీతి కూలిపోతివ తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
పగవారి బాణాలు పైబాడి వస్తుంటే పలుకవేమిర తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
ఒక్క తమ్ముడు పోతే యెంతో దుఃఖించేవు లంకెట్లు సాధింతువు ఓ రాఘవా
ఓ రాఘవా! లంకెట్లు సాధింతువు ||పాల||
ఎంత మాటాడితివి - ఓ వెర్రి జాంబవా! కుడి భుజము కూలిపోయెనూ
జాంబవా! కుడి భుజము కూలిపోయెనూ ||పాల||
కుడిభుజము నీవిపుడు కూలిపోతీవయ్యా యేమి చేయుదు తమ్ముడూ
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా! ||పాల||
ఆలి పోతే ఆలి అమరియున్నది గాని తోడూ నెక్కడ తెస్తునూ
జాంబవా! తోడూ నెక్కడ తెస్తునూ ||పాల||
అంజనవరపుత్ర! కంజాదళేక్షణా! సంజీవికే వెళ్ళుమా వీరాంజనేయ
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
జాంబవంతుడు మున్ను చక్కగా నీతోటి ఎరిగించినట్టి తెరవు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
ఇక్కడ ద్రోణాద్రి యిల మూడు లక్షల అరువది ఆమడలున్నది
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
మధ్యత్రోవలయందు మాయారాక్షసులుండ్రు మాయాచే నిన్ను మరపింపజూతూరూ
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
తెల్లని ఆకులు తేటగా యుండును ఎర్రని ఆకులు ఏర్పాటుగా యుండు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
పండు పచ్చగానుండు పగలు రాత్రులయందు భాసిల్లు కాంతులచే పరమ మోదమునందు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
అమృతము గలదందు అన్ని మందులు గలవు గంధర్వులచ్చోట కావలి యుందురు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
సూర్యవంశపు రాజుల సుతులమయ్య మేము సూర్యుడు ఉదయిస్తే జీవింపజాలము
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
ప్రొద్దు పొడవక ముందే తెచ్చితే సంజీవి మా ముద్దు లక్ష్మణుడు మూర్ఛ తెలిసి బ్రతుకు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
నా తమ్ముడూ గాదు - నీ తమ్ముడే హనుమా! నీకంటే బాంధవులు నాకెవ్వరింకా
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా ||పాల||
వీరాంజనేయా! రావయ్యా! మా సర్వ భారము నీదయ్యా
కార్య భారము నీదయ్యా - ఓ కేసరినందన రావయ్యా
కార్య నిర్వాహక రావయ్యా - ఓ కరుణాసాగర కావుమయ్యా
వీరా! వీరా! వీరా! వీరా! వీరా పంచముఖి రారా
రక్ష రక్ష రక్ష రక్ష! మా రక్ష రామభక్త
రామ రామ రామ రామ! రామదూత వేగ రారా
రామ రామ రామ రామ! రామభక్త వేగ రారా
కపిరాజ వేగ రారా .....పంచముఖి వేగ రారా
రామదూత వేగ రారా ....రామభక్త వేగ రారా !!!!
ఆ మాటలు వినగానే వాయుపుత్రుడు లేచి ఒక్క పరుగూ తీసెను
వీరాంజనేయుడు ఒక్క పరుగూ తీసెను ||ఒక్క||
వాయుపుత్రుడూ వెళ్లి చాలా సేపాయెను ఇంకా రాలేదేమిటో జాంబవా!
ఇంకా రాలేదేమిటో జాంబవా! ||ఇంకా||
ఆ బ్రహ్మ మనమీద దయ తప్పి యున్నాడు - బ్రహ్మాస్త్రము వేసెదా జాంబవా!
బ్రహ్మాస్త్రము వేసెదా జాంబవా! ||బ్రహ్మా||
సూర్యుడూ జగమునా సూటి తప్పినాడు - సూర్య బాణము వేతునా జాంబవా!
సూర్య బాణము వేతునా జాంబవా! ||సూర్య||
చంద్రూడూ మనమీద దయ తప్పి యున్నాడు - చంద్రా బాణము వేతునా జాంబవా!
చంద్రా బాణము వేతునా జాంబవా! ||చంద్రా||
కౌసల్యా నందన! ఖగరాజ వాహనా! కాంతి వివరము తెల్పెద రాఘవా!
కాంతి వివరము తెల్పెద ||కాంతి||
సూర్యోదయము కాదు - చూడూము ఆ వెలుగు - సుందరాకార! వేగ
రాఘవా చూడూము ఆ వెలుగు ||రాఘవా||
సూర్య వంశోద్భవుని సుమిత్రనందనుని సూశక్తి తెల్పింపుమా రాఘవా
సంజీవికే వెళ్ళుమా వీరాంజనేయ!
సంజీవిని రప్పించి సానందు నూరించి తమ్మునికి తావేయుమా సుషేణా!
తమ్మునికి తావేయుమా సుషేణా!
అన్నన్న! ఓ అన్న! శ్రీరామచంద్రుడా! ఎంతా నిద్రా పోతిని రాఘవా!
నేనెంత నిద్రా పోతిని....
పాలవర్ణపు ఛాయ పలువరుస చక్కని పలికినావుర తమ్ముడా!
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!
బ్రతికితివి తమ్ముడా! బ్రతికితివి లక్ష్మణా! అయోధ్యకే పోదమా లక్ష్మణా!
అయోధ్యకే పోదమా లక్ష్మణా! ||పాల||
అన్నన్న! ఓ అన్న! శ్రీరామచంద్రుడా! ఎంత మాటాడితివి, రాఘవా!
ఎంత మాటాడితివి, రాఘవా!
అభయమిచ్చి వేగ ఆ రావణాసురుని ధూర్తాగ్రేశుని చంపుమా, రాఘవా!
ధూర్తాగ్రేశుని చంపుమా, రాఘవా!
సీతాను దోడ్కొని ఘనముగా మనమిపుడూ అయోధ్యకే పోదమా, రాఘవా!
అయోధ్యకే పోదమా, రాఘవా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి