26, ఆగస్టు 2017, శనివారం

నేనర్స్ Vs. నాన్నగాడు - తల-వెనక-కథలు


"యో నేనర్స్!  క్లాస్‌కి టైమయ్యింది - వెళ్దాం పదండి. "

"ఆగు నాన్నా! "

"అబ్బా నేనర్స్! మళ్ళీ అదేనా ... అదే ఆ వాట్సాప్ చూస్తున్నారా?"
 
"కాదురా బుజ్జిగాడు! వచ్చేవారం ట్రావెల్ కదా - ఫ్లైటు, హోటల్, కారు అన్నీబుక్ చేసుకోవాలి కదా !"

"అబద్ధం చెప్తున్నారు - I know that you are reading ఈనాడు."

"అబద్ధమా? నేను అబద్ధం అసలు చెప్తానా, నాన్నగాడు?"

"ఇప్పుడు అదేగా చెప్తున్నారు?!"

"సరే... సరే...  పద! లేట్ అవుతోంది. కార్లో మాట్లాడుకుందాం."

"నేనర్స్! అమ్మేది?"

"పైనుందిరా - బుజ్జిగాడు. ఎందుకు ఏం కావాలి?"

"నా సాక్స్ కనిపించట్లేదు - Oh wait! I found them."
.... .....
.... .... 




 

"మధ్యలో కూర్చోరా, బుజ్జిగాడు! మాట్లాడేటప్పుడు నువ్వు కనిపించాలి కదా!"

"అబ్బా!!  పదండి నేనర్స్! ఇదిగో - మధ్యలోనే కూర్చుని బెల్ట్ పెట్టుకుంటున్నాను. మిర్రర్లో చూడండి. "

"అవున్రోయ్ ...నాకు తెలీలేదే!"

"మరీ .... పేరెంట్స్ అందరికీ తలవెనకాల కూడా కళ్ళు ఉంటాయి అనేవారు కదా నేను బేబీ గా వున్నప్పుడు?"

"నువ్వు ఇప్పటికీ బేబీవేరా!"

"అదే అదే ... నేను బేబీనే."

"అయితే ఏమంటావిప్పుడు?"

"నిజంగా మీకు, అమ్మకీ తల వెనకాల కళ్ళు ఉన్నాయా? లేవా? చెప్పండి ముందు."

"అమ్మ అంటే గుర్తొచ్చింది - అమ్మకి - పాపం - ఇంకా వర్క్ అవలేదు. ఏదో కాల్లో వుంది. ఇవాళ బయట తిందాంరా బుజ్జిగాడు?"

"ఓకే నేనర్స్! I'm fine either way. కానీ కళ్ళు ఉన్నాయా - లేవా?"

"ఎందుకు లేవూ! శుభ్రంగా వున్నాయి - నాకు నాలుగు, అమ్మకి రెండు."

"ఆ కళ్ళు కాదు - చిన్నప్పుడు మీ కుర్చీ వెనకాల నేను నించునుంటే మీరు చెప్పేవారు కదా!  మీకు నేనేం చేసినా  మీ తల వెనక కళ్ళకి కనిపించేస్తుంది అంటూ?!"

"అవునా ? అలా చెప్పానా?"

"అవును... అవును"

"అయితే చెప్పానేమో ... అరె ! మాటల్లోనే వచ్చేశాంరా  నాన్నా!"

"ఓకే నేనర్స్ - bye!!"

"మంచినీళ్ల బాటిల్ మర్చిపోకురా - తీసుకుని దిగు - సీట్లో నీ పక్కనే ఉంది."

"I got it , నేనర్స్ !"

"Alright నాన్నా ! Have Fun!"
...... ...... .....
..... ..... ......

"హాయ్ నేనర్స్ !"

"ఎలా అయింది నాన్నా - ఇవాళ క్లాస్ ?"

"అయింది  - its over"

"మంచినీళ్ళు తాగినట్లు లేవు - బాటిల్ ఓపెన్ చేయనా?"

"ఊఁ ..."

"అలిసిపోయావా?"

"ఊఁ ..."

"ఇంకేంటి నాన్నా ! టాహా వచ్చాడా ఇవాళ?"

"ఆఁ ..."

"ఆకలి వేసేస్తోందా? పోనీ నీకు నచ్చే కబుర్లు చెప్పుకుందాం కాసేపు - అదేంటిరా బుజ్జిగాడు - అదేదో కొనాలన్నావ్ Nintendo Stitch  కోసం?"

"అదా - next version upgrade - Yarn 2.0"

"అదేంటి నాన్నా - మొన్నే కదా కొన్నాం - అప్పుడే upgrade ఏంటి? Yarn ?"

.....

"ఆహాఁ ...బుజ్జిగాడు - నన్నాట  పట్టిస్తున్నావా? Nintendo Switch ని Stitch అన్నానని?"

"హహ్హహ్హ నేనర్స్ ! అదే మరి - అది Stitch అయితే upgrade Yarn అవుతుంది కదా !"

"నిజమేరోయ్!  హహ్హహ్హ - you got me there !"

"నేనర్స్ ! Are we going out today for dinner?"

"అవున్నాన్నా! అమ్మకి ఇంకా వర్క్ అయినట్లు లేదు - పాపం - అమ్మక్కూడా ఆకలేస్తూ వుంటుందీ పాటికి."

"Hmmm"

"ఇంటికి వెళ్ళగానే గబగబా స్నానం చేసేస్తే తాజ్-ఇండియాకి వెళ్దాం."

"ఓహ్ నేనర్స్! మళ్ళీ అక్కడికేనా ?"

"ఏమ్మా! బోర్ కొట్టేసిందా?

"Hmmm"

"ఈసారి ఏదైనా కొత్తది ట్రై చేద్దాం...సరేనా!"

"కొత్తదంటే ... ఆ రాహు-గారి-కోడి-something ?"

"హహ్హహ్హ - అది రాజుగారి - రాహుగారి కాదు - స్పానిష్‌లో J - H అయినట్టు Indian పేరులో అవ్వదు - Raju అంటే రాజు, రాహు కాదు. ఇంతకీ నీకా పేరు ఎలా తెలుసు?"

"నేను తిన్నాను కదా - అలా!"

"నువ్వు తిన్నావా? అదెప్పుడురా?"


"మా CCL లో  ఫీల్డ్‌ట్రిప్పులకి వెళ్ళినప్పుడు."

"అదేదో ఇంట్రెస్టింగ్ టాపిక్లా ఉందే - చెప్పు చెప్పు!"

"నేను ఫిఫ్త్‌గ్రేడ్‌లో వున్నప్పుడు మమ్మల్ని రెండు restaurants కి తీస్కెళ్ళారు."

"ఎందుకూ?"

"ఒకటి how to do a business, రెండోది how not to do a business చూపించడానికి."

"భలేరా! మీ CCL వాళ్ళకి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. ఎక్కెడెక్కడికి వెళ్ళారేంటి?"

"How to do a business కి చాలా దూరం డౌన్‌టౌన్‌కి వెళ్ళాం. కానీ how not to do a business చూడడానికిఎక్కడికి వెళ్ళామో తెలుసా, నేనర్స్?"

"నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నువ్వే చెప్పు. "

"చెప్పేస్తున్నా .... చెప్పేస్తున్నా.... తా...జ్ - ఇం ...డి ...యా !"

"నిజంగారా? బుజ్జిగాడు !"

"అవును నేనర్స్ !"

"That's a shame, నాన్నగాడు! ఏం చెప్పారు మీకక్కడ? ఎలా సర్వ్ చేయకూడదు - అలాంటి examples ఏమన్నా చూపించారా?"

"ఊఁ  - నాకు గుర్తు లేదు నేనర్స్ - but they said something like that."

"అయ్యో - పాపం !మన తాజ్-ఇండియా వాళ్ళకి తెలిసిందో లేదో - వాళ్ళని ఇలాంటి ఉదాహరణగా వాడుకుంటున్నారని. అమ్మతో చెప్పాలి తప్పకుండా ఇది - మీకు practical గా ఎంత మంచి విషయాలు నేర్పిస్తున్నారో !"

..... .....
..... .....

"ఏంట్రా బుజ్జిగాడు! సైలెంటుగా వున్నావు? బాగా ఆకలి వేస్తోందా? ఇదిగో ఇంటికి వచ్చేశాం - దిగు!"

"హహ్హహ్హ.... హహ్హహ్హ.... I got you one more time,  నేనర్స్! I got you one more time,  నేనర్స్!"

"ఆరి బుజ్జిగాడు! ఇంతసేపు నువ్వు చెప్పింది కథరా ? భలే నమ్మించావు నన్ను!"

"అదే నేనర్స్ ! మీ తల-వెనకాల-కళ్ళ-కథకి , మీ తల-వెనక నుంచి-నే-చెప్పిన-కథకి బాలన్స్ అయింది కదా!"


21, ఆగస్టు 2017, సోమవారం

పట్టపగలు ౘందమామ కమ్మిన రోజు - ఆకాశం విష్ణుచక్రమై వెలిగిన రోజు

అప్పుడే రెండేళ్ళు అయింది - ఇండియా వెళ్ళి, యింటివారిని చూసి - వెళ్ళొద్దాం ఈ ఏడాది అనుకున్నాం.

తీరా చూస్తే వెళ్ళడానికి వీలు కానన్ని విఘ్నాలు, అవరోధాలు.

అన్నిటికన్నా అసలు విషయం ఏంటంటే వెళ్ళడానికి వలసిన వీసాలు - ముగింపు కొస్తున్న తేదీలతో వెళ్ళ వీల్లేదన్నాయి. 

వాటన్నిటినీ మించి - బుజ్జిజింక - ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆగస్టు-21కి మా గూట్లో మేముండాలి అని పెట్టిన పేచీ.

ఎందుకురా అనడిగితే - "ఎప్పుడో దాదాపు ఐదువందల ఏళ్ళ క్రితం (1442 లో) వచ్చిన గ్రహణపు చుట్టం మళ్ళీ వస్తోంది - మనూరికి. ఇప్పుడు చూడకపోతే మళ్లింకో ఐదు వందలేళ్ళకి కానీ రాదు. అప్పటికి నేనుండను - అందుకే ఇప్పుడు వచ్చినప్పుడు నేనూళ్ళో ఉండాల్సిందే - పట్టువిడుపులు చూడాల్సిందే!" - అని విడుపులేని పట్టు పట్టాడు.

సరే! వస్తున్నాం-వస్తున్నాం అని సంబరంగా చెప్పుకున్న మా రాక-కబురుని మార్చి మళ్ళొచ్చే ఏడాది ఇదే సమయానికి వస్తాం-వస్తాం అని మార్చి చెప్పుకున్నాం.

అలా మొదలయింది - ఈ  అమవసకై ఎదురుచూపు.

జులై ఆఖరివారంలో - అలవాటుగా - ప్రతి ఏడాది చేయించుకునే కంటిపరీక్షకి ఇంటిల్లిపాదీ తరలి వెళ్ళినప్పుడు మా కంటి-వెజ్జు సెకాయ్‌గారి డాక్టరాఫీసులో ఓ కళ్ళజోళ్ళ బొత్తి కనిపించింది - ఊరికే తీసుకోండి - అంటూ.

ఏంటబ్బా ఇవి - చిన్నప్పుడు మన శివకోడు ముసలమ్మ తీర్థంలో కొనుక్కున్న రంగు-రంగు కళ్ళజోళ్ళలా వున్నాయి అని చూద్దునా - అవి గ్రహణాన్ని చూడడానికి వీలైన మేలైన కంటి-జోళ్ళు.

ముందు వైపు రంగులు.... 



వెనక వైపు అక్షరాల-హంగులు...



లాభం, రెండూ, మూడూ,నాలుగూ - అని లెక్కెట్టి - రెండుజోళ్ళ  కళ్ళజోళ్ళు తీసుకున్నాం.

తీసింది నా ఒక్కచెయ్యి అయినా ఆ తీసి-వేత వెనకాల ఒక తల-ఊపు-ఊత, ఒక okay mama -అనే-బుజ్జిజింక-కేరింత వున్నాయి కాబట్టి "తీసుకున్నాం" అనే అనాలి.

ఈలోగా పరీక్ష రాసి, వేసవి సెలవుల  చిటారురోజుల్ని మాతో గడపవచ్చిన అన్నజింక ఒకటి పట్టుకెళ్ళగా మాకు మిగిలినవి ముత్యం-మూడు-కళ్ళజోళ్ళు.

ఎదురు చూడగా చూడగా - ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా తన దారిన తాను తిరిగే కాలచక్రం తిరిగి-తిరిగి - ఎంతగానో ఎదురు చూసిన ఆగస్టు-21 తానే రానే వచ్చింది.

బుజ్జిజింక బడి నుంచి బోల్డన్ని మెయిళ్ళు, ఈ-మెయిళ్ళు - మేమందరం బయటకి వెళ్ళి గ్రహణం చూసేస్తామహో - మీ పిల్లలకి కళ్ళజోళ్ళు మేమే ఇస్తామహో - అంటూ.

బళ్ళోవాళ్ళు పిల్లవాళ్ళకి ఇచ్చిన కళ్ళజోళ్ళు ఇలాంటివి ...ముందు రంగు వేరైనా వెనక వున్న అక్షరాలు అక్షరాలా పైనున్న కళ్ళజోడులాంటివే.



సరి! నేనూ, బదరి మా రెండు-జోళ్ళ-కళ్ళకి కావల్సిన రెండు కళ్ళజోళ్ళు - నీకొకటి-నాకొకటి అని పంచుకోగా ఇంకొక జోడు-కళ్ళకి మిగిలిందొక కళ్ళజోడు.

ఇవాళ పొద్దున్నేవెళ్ళేటప్పుడు ఆఫీస్‌లో నేస్తం కోసమని తన కళ్ళజోడుకి జోడుగా ఆ మిగిలిన కళ్ళజోడు కూడా సంచిలో పెట్టుకుని పట్టుకెళ్ళారు బదరి. 

బుజ్జిజింక బడికి వెళ్ళగానే - నాదైన సోమవారపు ఆఫీసు పని మొదలయింది.

సరిగ్గా మధ్యాహ్నం పన్నెండున్నరకి పక్కనున్న కిటికీలోంచి బయటికి చూస్తే - చుట్టూ వున్న చెట్లు కనిపించినంతమేరా,  వాటితో పాటు కనిపించని గాలి కూడా బంగారపు మేలి ముసుగు కప్పుకున్నట్టు - వ్యాఖ్యాతీతమైన అపరంజి వన్నె - కళ్ళను మాయ చేసింది.

ఒంటిగంటకి లంచ్ టైం. ఇంతలో బదరి నుంచి మెసేజ్ - బయటికి వెళ్ళి చూడు - చాలా బావుంది అంటూ.

గబగబా తలుపు తీసుకుని ఒక చేత్తో ఫోన్, ఇంకో చేత్తో కళ్ళజోడు పట్టుకుని వెళ్ళి - బయటికి వెళ్ళగానే - ఎదురింటి తలుపులు తెరుచుకుని ఒక చిన్నిపాప, వాళ్ళమ్మ-  పక్క ఇంటినుంచి ఒకాయన, ఆ ముందు ఇంటినుంచి ఇంకా బోల్డంతమంది - కాళ్ళజోళ్ళు వేసుకుని, కళ్ళజోళ్ళు పెట్టుకుని - మెడ వెన్నుమీదగా వెనక్కి వాల్చి - చూపు మిన్ను మీద సారించి - చూస్తూ వున్నారు - ఊఁ ...ఆఁ ... ఓహ్ ! అంటూ.

నేనూ నా ఫోన్ కింద పెట్టి నా కళ్ళజోడులోంచి ఆకాశంలోకి చూడడం మొదలుపెట్టాను.

అప్పటికే గ్రహణం మొదలయి చాలాసేపు అయిందేమో - చిన్నప్పుడు ఇష్టంగా తిన్న గోరుమిటీ ఆకాశంలో ఉన్నట్టు కనిపిస్తే -  అబ్బా! ౘందమామ నెయ్యిలో దోరగా వేయించిన జీడిపప్పులా నారింజ రంగులో ఎంత బావున్నాడో - అని మురిసిపోబోతూ - ఉండగా తట్టింది - నేను చూస్తున్నది ౘందమామని కాదు - ఆ మామ కమ్మిన సూరీడు-మామనని.

నెమ్మదిగా బంగారపు-వన్నెలో ఉన్న ఎండ తగ్గి - బాపు సినిమాలో కనిపించే వెన్నెల రంగులోకి తిరిగింది - పరిసరాల రంగు.

[బాపు సినిమాలో వెన్నెల రంగు ఎలా ఉంటుందంటే - భక్తకన్నప్ప సినిమాలో - ఎన్నీయల్లో ఎన్నీయల్లో సందామామా - అనే పాట చూడాలి. అది ఎండలో తీసిన వెన్నెల-పాట అని తెలిసిపోతూ ఉంటుంది.]

అలా చూస్తూ చూస్తూ ఉండగానే - చీకటి కమ్మేసింది - చుట్టూ కీచురాళ్ళ రొద మొదలయింది - ఇళ్ళ ముందున్న dusk-lights వెలిగాయి.




మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంపూర్ణ సూర్య గ్రహణం చూడబోను కదా - అందుకని  చీకటిని - కీచురాళ్ళ నేపథ్య సంగీత సహితంగా ఒక చిన్న వీడియో కూడా తీసి దాచుకోవాలనిపించింది.

స్మార్ట్‌ఫోనుంటే అప్‌లోడ్లక్కొదవా అని కదా ఐఫోన్నానుడి !!

ౘందమామ సూర్యుడిని మూసిన చీకటుల వేళ ...



సూన్నారాయణుడు విడుదల అవుతుండగా కురిసిన పగటి-వెన్నెలల హేల ...


ఏ ఫోటోకి, వీడియోకి అందని - నేను చూడగలిగిన అందమైన దృశ్యం ఏంటీ అంటే - 
కనురెప్ప పాటులో మాత్రమే చూడగలిగినది-
కనురెప్ప మూసినా కరగిపోనిది-
కాలమెంత గడిచినా కమ్మని కలలా మిగిలిపోయేది-
కాలాలకావల నాలాంటి మరెవ్వరో కల-కాని వేళ చూడగలిగేది-
అది... 
ౘందమామ సూర్యభగవానుడిని పూర్తిగా కప్పేసిన వేళ - ఆ నారాయణుని వేలిపై తిరిగే విష్ణుచక్రమే కనిపించిందా నింగిలో -  అనిపించిన జ్యోతిర్మండలం!!!

19, ఆగస్టు 2017, శనివారం

త్వామనురజామి - 16 - సెలవులు రావాలి ...మేమంతా - ఇంటికి వెళ్ళాలి!

కిందటి 19 చెప్పిన కబుర్లు: త్వామనురజామి - 15 - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట!

థర్డ్ సెమిస్టర్ - నవంబర్ నెల.

కార్తీకమాసం - శరదృతువు.

తక్కువైన పగళ్లు - మిక్కిలైన రాత్రులు.
శీతవేళలో - చుట్టూ వున్న కొండలు తేలికైన ఎండతో బంగరపు పూత పూసుకున్నహేలలో - రోజులు ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుండును అనిపించేవి.

పైగా డిసెంబర్‌లో రాబోతున్న క్రిస్మస్ నుంచి సంక్రాంతి దాకా వుండే సెలవులు,  న్యూఇయర్ సెలబ్రేషన్స్ గురించి బోల్డన్ని కబుర్లు, పప్పి, కుట్టీలకి కొనబోయే సర్ప్రైజ్ గిఫ్టులు - చెప్పలేనంత ఉత్సాహంగా ఉండేది.

అందులోనూ ఈసారి నా క్లాస్‌మేట్స్ అందరికీ న్యూఇయర్ గ్రీటింగ్స్ పంపించాలి అనుకుని అందరి దగ్గరా వాళ్ళ ఇంటి అడ్రెస్సులు తీసుకున్నాను. ఎందుకో వాళ్లకి చెప్పలేదు - సర్ప్రైజ్ చేయాలి కదా మరి!

సర్ప్రైజ్ గిఫ్టులు, గ్రీటింగ్స్ కార్డ్స్ కొనడానికి గాంధీరోడ్‌లో వున్న ఆర్చీస్ గ్రీటింగ్ కార్డులుండే షాప్ -శిల్పం- కి వెళ్ళినప్పుడు శ్యామల, పుని కనిపించారు - వాళ్ళూ నాలాగే  Santy-మోడ్‌లో వున్నారు (అమ్మాయిలం కదా Santa కాలేం కాబట్టి).

నన్ను చూడగానే శ్యామల గుర్తు చేసింది - "సెకండ్ సెమిస్టర్ పరీక్షలు అవగానే వస్తానన్నావు మా రూంకి - ఇప్పటి దాకా రాలేదు నువ్వు"- అంటూ.

నవంబర్ ఆఖరివారంలో ఇంటర్నల్స్ అయిపోగానే వస్తానని చెప్పి తన ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్ ఎక్కడ వుందో, అక్కడికి ఎలా వెళ్ళాలో అడిగితే చెప్పింది - SVU - SBM (School of Business Management) గేట్లోంచి తిన్నగా లోపలి వస్తే ఎడం పక్కగా ఉంటుంది అని.

అలా శ్యామలతో కబుర్ చెప్తూ న్యూఇయర్ షాపింగ్ కానిచ్చేసి హాస్టల్‌కి వచ్చాను.

ఇంటర్నల్స్ అయిపోయాయి. అనుకున్నట్టుగానే శనివారం సాయంత్రం అరుణాచంచల దగ్గర పర్మిషన్ తీసుకుని శ్యామల వాళ్ళ హాస్టల్‌కి బయల్దేరాను.

తీరా SBM దగ్గరికి వెళ్ళగానే - అదే మొదటిసారి ఆ క్యాంపస్‌కి వెళ్ళడమేమో - కొంచెం కన్ఫ్యూజ్ అయి కుడివైపుగా వున్న బిల్డింగ్ వైపు వెళ్ళాను. అక్కడ అసలు అమ్మాయిలే కాదు - అసలెవరూ కనిపించలేదు. శీతాకాలపు సాయంత్రం చీకటి తొందరగా పడిపోతుంది కదా - కొంచెం బెరుకుగా అనిపించింది. వెనక్కి నా రూంకి వెళ్ళిపోదామని గబగబా నడుస్తూ వచ్చేస్తూ వుంటే - ఇంతలో ఆ బిల్డింగ్‌లోంచి ఒకతను వస్తూ కనిపించాడు. "హమ్మయ్య" అనుకుంటూ ఆగి - ఎలాగోలా పలకరించి శ్యామల రూంకి దారి అడగాలి అనుకుని "May I  know your name?" అనగానే అతను "సతీష్" అని చెప్పి - అప్పటికే అతనికి అర్థం అయింది నేను అక్కడికి పొరపాటుగా వచ్చానని. తన పేరు చెప్తూనే - "These are men's hostels"  అని చెప్తూ నాతో నడిచి వచ్చి ఆ పక్కనే వున్న గర్ల్స్ హాస్టల్ దగ్గర వదిలి వెళ్ళాడు. మాటల్లో తను MBA చేస్తున్నట్టు చెప్పాడు. సతీష్‌కి థాంక్స్ చెప్పి హాస్టల్ దగ్గర కనిపించిన ఒక అమ్మాయిని శ్యామల పేరు, ఇంజనీరింగ్ బ్రాంచ్ చెప్పి తన రూమ్ ఎక్కడ అనడిగితే శ్యామల తనకి తెలుసని  చెప్పి - రూం దాకా తీసుకెళ్ళి తలుపు కొట్టింది.

శ్యామల నన్ను చూడగానే బోల్డంత సంబరపడింది. చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాక - శ్యామల, పుని వెళ్ళి ఈరోజుకి చదువుకుంటూ రూంలోనే భోంచేస్తామని చెప్పి- వాళ్ళ మెస్ లోంచి నాక్కూడా భోజనం తీసుకొచ్చారు.

ఆ ఒక్క రాత్రికి నేను తన రూంకి వెళ్ళడం, రాత్రి ఒంటిగంట దాకా కబుర్లు చెప్పుకోవడం - శ్యామల, నేను - ఏదో పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయాం. అంతే కాదు - ఆరోజు రాత్రి పదకొండు కాగానే - అన్ని రూముల్లో లైట్లు ఆగిపోయి అందరూ పడుకున్నాక - నేను, శ్యామల, పుని స్వెట్టర్లు వేసుకుని బయటికి వెళ్ళి వాళ్ళ హాస్టల్ రూం  బయట వున్న ఒక చెట్టెక్కి కూర్చుని - కబుర్లు చెప్పుకుని, ఫోటోలు తీసుకుని లోపలి వచ్చేశాం. ఆ చెట్టు-కొమ్మాధిరోహణం శ్యామల నాకు మాటిచ్చిన  ప్రి-న్యూఇయర్-గిఫ్ట్ :)

తెల్లవారితే ఆదివారం - పొద్దున్నే లేచి బ్రేక్‌ఫాస్ట్ టైంకి నా హాస్టల్ రూంకి వచ్చేశాను - వాళ్ళకి నేనుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని.


సెలవులకి ఇంటికి వెళ్ళేలోగా ఒకసారి తిరుమల నడిచి ఎక్కి - నడిచి దిగి వద్దామని ప్లాన్ చేసుకున్నాం మా క్లాస్ అంతా. డిసెంబర్ 21కి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. 12న తిరుమల వెళ్దామని  అనేసుకున్నాం.

డిసెంబర్ నెల ఉత్సాహంగా మొదలయింది. ఏదో ఒక MIS సెమినార్ తప్ప ఇంక టెస్టులు కూడా ఏమీ లేవు.

ఒకరోజు క్లాసులు అయిపోగానే రూంకి వచ్చి ఆ తర్వాతి రోజు MIS సెమినార్ కోసం నోట్స్ తయారు చేసుకుందాం అనుకుంటూ  వున్నాను - ఇంతలో కింద నుంచి "603-A లలితా - విజిటర్స్" అని వినిపించింది.

ఇప్పుడు నాకోసం వచ్చే విజిటర్స్ ఎవరబ్బా - ఎవరైనా మా ఊరినుంచి వస్తుంటే నాన్న ఫోన్ చేసి చెప్తారు కదా - అనుకుంటూ మూడో అంతస్తులో వున్న నా రూమ్ నుంచి -  కళ్ళకడ్డం పడుతున్న జుట్టుని ఒక చేత్తో పట్టుకుని, కాళ్ళకడ్డం పడుతున్న స్కర్ట్‌ని ఇంకో చేత్తో పట్టుకుని - రెండేసి మెట్లు ఒకేసారి దిగుతూ - దాదాపు పరిగెడుతూ - విజిటర్స్ రూంలోకి వెళ్ళాను.

తీరా అక్కడికి వెళ్ళాక టేబుల్ దగ్గర రెండు కుర్చీల్లో కూర్చున్న ఇద్దరు అబ్బాయిలు తప్ప ఎవరూ లేరు. వాళ్ళే నాకోసం వచ్చిన విజిటర్స్ అని అర్థం అయింది.

నేను  తిన్నగా వెళ్ళి వాళ్ళిద్దరి ఎదురుగుండా వున్న ఇంకో కుర్చీలో కూర్చున్నాను.

"హాయ్"
"హలో"

ఇద్దరూఒకరి తర్వాత ఒకరుపలకరించారు నన్ను.

అందులో ఒకతన్ని గుర్తు పట్టాను - దసరాకి ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రైన్‌లో ఎక్కిన పింక్ షర్ట్ అబ్బాయి.

కాకపొతే అతన్ని నేను గుర్తుపట్టనట్టు చూసి "హాయ్"అని "Who are you? May I know your names? Why are you here?" అని మధ్యలో వాళ్ళకి జవాబు చెప్పే గ్యాప్ ఇవ్వకుండా వరసగా ప్రశ్నలు అడిగాను.

వాళ్లిద్దరూ ఒకరి కేసి ఒకరు  చూసుకుని నా ప్రశ్నలకి జవాబివ్వడం మొదలు పెట్టారు.

"I'm RajaSekhar" (ఇతనే ఇంతకు ముందు కలిసిన inky-pinky-ponky).

"I'm Rama Krishna" (ఇతన్ని ఇంతకు ముందు చూడలేదు).

"ఓకే - మీరెవరో నాకు తెలీదు - ఎందుకిలా వచ్చారు?"

"మేమిద్దరం SVUలో MBA చేస్తున్నాము. నిన్ననే మా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఒకసారి హాయ్ చెబ్దామని వచ్చాము" అన్నాడు రాజశేఖర్ అన్న అబ్బాయి.

నాకప్పటికే కొంచెంకొంచెంగా వున్న కోపం హెచ్చేసింది.

వీళ్ళెవరో నాకు తెలీనే తెలీదు - పైగా కాలక్షేపం కబుర్ల కోసం నా దగ్గరికి వస్తారా - హన్నా! - అనేసుకుని - ఇంక వీళ్ళతో మంచిగా మాట్లాడితే కుదరదు అంజెప్పి - "మీరెవరో నాకు తెలియనప్పుడు అసలు నేను మీతో మాట్లాడతానని ఎలా అనుకున్నారో అర్థం కావట్లేదు. మీరింక వెళ్ళొచ్చు" - అనేసి వెనక్కి తిరిగి చూడకుండా నా రూంకి వెళ్ళిపోయాను - మళ్ళీ రెండేసి మెట్లెక్కుతూ.

రూంలోకి రాగానే శ్రీలత అడిగారు - "ఎవరు లల్లీ వచ్చింది?" -అంటూ. నేనుచెప్పినది వింటూనే నన్ను టీజ్ చేస్తూ తను "హాయ్ హాయ్ లల్లీ ! MBA అబ్బాయిలు వస్తే కబుర్లు చెప్పకుండా పంపించేస్తావా" అంటుంటే నవ్వేసి నా MIS నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టాను.

ఆ అబ్బాయిల సంగతి అప్పుడే మర్చిపోయాను.

డిసెంబర్ 12న అనుకున్నట్టుగానే మా క్లాసులో అమ్మయిలందరం తెల్లవారుఝామునే బయల్దేరి అలిపిరి దాకా బస్సులో వెళ్ళి - అక్కడి నుంచి తిరుమల నడిచి వెళ్ళాము. నడక దారిలో కారం-దోసెలు తింటూ, జీలకర్ర పొడి కలిపిన నిమ్మకాయ షోడాలు (సోడా కాదు అప్పటి పిలుపు షోడానే :) ) తాగుతూ, మా మాటలు, నవ్వులతో కొండలన్నీ చెవులు చేసుకుని వినేలా - మధ్య మధ్యలో కొండల మధ్యలో రీసౌండ్ వచ్చేలా అరుస్తూ - కొండలు మాతో మాట్లాడుతున్నాయి అనుకుని మురిసిపోతూ - తెగ హుషారుగా ఏడుకొండలూ ఎక్కి - ధర్మదర్శనం చేసుకుని - గుడిలోనే పులిహోర, దద్ధోజనం, లడ్డు ప్రసాదం తిని, గుడి ఎదురుగుండా మెట్ల దగ్గర గాజులు, పూసలు కొనుక్కుని - సాయంత్రం నాలుగింటికి బయల్దేరి కిందకి నడిచి దిగడం మొదలు పెట్టాము.

ఒక పదిహేనేళ్ళ అబ్బాయి - రవికుమార్ అని - మమ్మల్ని - అక్కా -  అని పిలుస్తూ మాట కలిపి సరదాగా కబుర్లు చెప్తూ  మాతోపాటు నడక దారిలో వచ్చాడు. వాళ్ళ నాన్నగారు TTD లో పనిచేస్తారు అని చెప్పి సెలవులకిమా ఊళ్ళకి వెళ్ళేలోగామాకు లడ్డూలు, వడలు తెప్పించి పెడతానన్నాడు. మేమందరం అలిపిరిలో మా హాస్టల్ వైపు వెళ్ళే టౌన్‌బస్ ఎక్కేదాకా మాతో వుండి - తన అడ్రెస్ ఇచ్చి వాళ్ళింటికి రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళాడు.

మొదటిసారేమో -  ఏడుకొండలు నడిచి ఎక్కడం, మళ్ళీ అదేరోజు నడిచి దిగిరావడం - కాళ్ళు బాగా నొప్పొచ్చాయి - మా అందరికీ. ఏ ఇద్దరు కలిసినా ముందు కాళ్ళ గురించి పరామర్శలే - ఆ తర్వాతే ఇంకే మాటలైనా.

డిసెంబర్ 15న సురేష్‌కుమార్‌గారు నన్ను SV ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి రమ్మన్నారు - SPIC-MACAY గురించేదో మాట్లాడాలి అని.  ఆ రోజు బుద్ధిగా నాకిష్టమైన పసుపు రంగు ప్లెయిన్ షిఫాన్ చీర కట్టుకుని ( formal attire for SPIC-MACAY చీరే మరి! ) మరీ వెళ్ళాను.

నాతో పాటు నా జూనియర్స్ శుభా రామస్వామి , రజని, అరుణ కూడా వచ్చారు. తీరా అక్కడికి వెళ్ళాక మా నలుగురిని SBM లో వున్న లలితారామకృష్ణన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ స్టాఫ్‌రూంలో కూర్చుని వచ్చే ఏడాది మేము ఏర్పాటు చేయాల్సిన ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుతూ - వున్నట్టుండి సురేష్‌కుమార్‌గారు నన్ను అడిగారు - "నువ్వు తిరుపతి చాఫ్టర్ కల్చరల్ సెక్రెటరీగా చేస్తావా?"  అని.

ఆయన చెప్పిన దాన్ని బట్టి SPIC-MACAY కల్చరల్ సెక్రెటరీగా నేను చేయాల్సిన పని - మెంబర్ల నంబర్లు పెంచడం. ఎక్కువమందిని చేర్చడానికి వీలుగా మెంబర్‌షిప్ ఫీ పదిహేను రూపాయలకి తగ్గించారు.

నాకు "ఓస్ ఇంతేగా!" అనిపించింది. ఆనందంగా తలని వీలైనంత స్పీడుగా ఊపి "సరే" అన్నాను.

ఆ తర్వాత - ఆ స్టాఫ్‌రూంలోంచి బయటికి వచ్చేటప్పుడు నా పాదాలు - భూమికి ఒక రెండంగుళాల పైనే - నడిచి వుండాలి.

అలా SBM లోంచి బయటికి వస్తుంటే - అప్పుడే క్లాస్ అయినట్టుంది - MBA చదివే అమ్మాయిలు, అబ్బాయిలు బయటకొచ్చి నించుని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ వున్నారు.

నేనూ, నా జూనియర్స్ ముగ్గురూ - మేం నలుగురం - SPIC-MACAY కబుర్లు, సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేం చేయబోయాలనుకుంటున్నామో వాటి గురించిన కబుర్లు - చెప్పుకుంటూ మా హాస్టల్‌కి వచ్చేశాం.

ఇంక ఆర్రోజుల్లో మా ప్రయాణం - ఇంటికి వెళ్ళబోతున్నామని అందరికీ చాలా హ్యాపీగా వుంది. డైనింగ్‌హాల్‌లో కలిసిన ప్రతీసారి ఎవరితో మాట్లాడినా - నువ్వే ట్రైన్‌కి వెళ్తున్నావు అంటే నువ్వే ట్రైన్‌కి అంటూ అవే ప్రశ్నలు, అవే జవాబులు.

ఈ సందడంతా చూసి నేను పాడేసుకున్నానిలా ...

(ఇది నా కొసరు పాట - ఇంకో అసలు పాటకి  - పట్టేయండి ఆ అసలు పాటని మరి!)

సెలవులు రావాలి ...మేమంతా - ఇంటికి వెళ్ళాలి!
హాయ్! ఉరుకుల పరుగుల చకచక ఛుకుఛుకు  ట్రైన్ ఎక్కాలి మా ఇల్లు చేరాలి... 

ఆ టైటిలు పాటతో పాటు ఇంకో సరదా-కొసరు వచ్చేనెల దాకా  ... పాత పాటలు వినే, కొసరు-పాటలకి అసలు-పాటలు కనిపెట్టే సరదా వున్న నా పాట-మిత్రుల కోసం .... 

అదేను హాలిడే అదేను జాలిడే
అమ్మాయిలంత కూడి ఇంటికెళ్ళె సందడే ... 




<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
















11, ఆగస్టు 2017, శుక్రవారం

మనసే జతగా పాడిందిలే - 5 - కవలపాటలు - అసలు పాట మావికొమ్మల ఊగితే, కొసరుపాట నీలి వెన్నెల కురిసెనట!


అసలు పాట - మా నాన్న నోట (బండారు చిట్టిబాబుగారు కట్టినదట)

ఓ మునిమాపు సంధ్యలో - మింటనున్న రిక్కకో చూపునెక్కుపెట్టి  - మా family anthem లాంటి కోయిల పాటను పాడిన నాన్న గొంతులో పలికిన అసలు పాట - తానెళ్తూ తన ఎఱుకగా మా కుట్టి మాకొదిలెళ్ళిన కోయిల పాట...

ఆ పాటతో నా మొదటి పరిచయం ఎప్పుడంటే ...
 
ఎర్రంచు తెల్ల మధుపర్కాలు
పసుపుతాడు తోడు,  నల్లపూసల పేరు సౌరు
కంఠాన మెరుస్తున్న చమ్కీపూల కర్పూరదండలు
కంటి చివరన తళుకంటించుకున్న నీటిముత్యాలు
లాజహోమంలో వేడెక్కిన చేతులు మండుతున్నాయని వంకే గానీ
పాల నరచేయి ముంచి అమ్మ పెట్టిన అప్పగింతల తాలూకు బెంగేమీ లేదని
బింకాలు పోతున్న అమ్మాయిగా నేను ...
కొంగుముడి చాలదన్నట్టు చిటికెనవేలు మెలికతో కట్టేసుకున్నానని
నా బంగరుబొమ్మవు నీవని ఒట్టేసుకున్నానని ఒదిలేదిక లేదని
పొంకాలుచూపుతున్న అబ్బాయిగా బదరి ...
మా యిద్దరి చుట్టూ చేరిన స్నేహితులు సన్నిహితులు - పలకరింపులు - చిరునవ్వులు; ఛలోక్తులు - పకపకలు
ఉక్కిరిబిక్కిరయ్యే హడావిడి - ఊపిరాడనివ్వని సందడి 

అలసిన అక్కని కనుసన్నల చల్లగా చూడమని - సన్నగా - బావగారికి పన్నీరు జల్లవచ్చిన చిట్టిమరదళ్ళు - ఈ అక్కకు చెల్లెళ్ళు - నా  పక్కన  చేరారు.

మాలో చిన్నది -
పాటలాధరాల పాటలనెప్పుడూ మోసే రాగాల పల్లకి -
పాటే శ్వాసైన నయగారాల వల్లకి -
ఎప్పుడైనా ఎవరైనా పాట పాడమంటే - "కోయిలను నేను - పాడమన్నప్పుడల్లా పాడను - నాకు పాడాలనిపించి నే పాడితే మీరు వినండి" - అని మాటలతో దబాయించే చిలిపితనపు కలికి -
బావగారి నోట నుంచి విన్న మొదటి కోరిక "నువ్వు బాగా పాడతావని మీ అక్క చెప్పింది - ఒక్క పాట పాడవా? " అంటూ.

వెంటనే గొంతు సవరించుకుని ఆ ఫాల్గుణ మాసపు మధ్యాహ్నాన - చిగురాకు-మేతరిని మావికొమ్మల వూగ రమ్మని పిలుస్తూ - తాను నేర్చిన ఓ పాట పాడింది మా ఇంటి కోయిల - విన్న బావగారి గుండెలో ఆ నవనీతగీతి మరపురాని మైమరపు-గీతి కాగా.

తర్వాత - ఎన్నోసార్లు - ఇంకెన్నెన్నో మార్లు - అడిగీ అడగకుండానే - అదే పాట పాడిందెన్ని సార్లో - విని చెవులపంట పండిందెన్నిమార్లో - లెక్క లేనే లేదు.

దేవులపల్లివారి - తొందర పడి ఒక కోయిల ముందే కూసింది - అన్న పాటను ఇంకోరకంగా - తొందర పడి ఒక కోయిల ముందే ఎగిరింది - అన్నట్టు అర్థం చేసుకుందో ఏమో - పాడుతూ పాడుతూ...  పాటల లోకంలో తేలుతూ ... పాట మాత్రం మాకు వదిలి - కన్నుల మెరుపు, చిరునవ్వు తళుకు కలిపి నింగికో నక్షత్రాన్ని  గుచ్చి - ఇదే నా ఆనవాలు మీకింక - అని చెప్పా పెట్టకుండా పయనమై వెళ్ళిపోయింది.

మా కుట్టి లేదు కానీ -
దాని పాట వుంది -
మా చెవుల్లో దాని కబుర్ల-గలగలల, నవ్వుల-సవ్వడుల అలికిడి ఇంకా అలానే వుంది.
మాకు నేర్పి వెళ్ళిన పాట-తోడు వుంది.
మాకు మప్పి పెట్టిన నవ్వుల-వాడుక వేడుక వుంది.

అదిగో --- ఆ గుర్తుతోనే ఆరు-పుష్కరాల వయసులో కూడా ఆరేళ్ళ-బాల్యోత్సాహంతో ఎప్పుడూ ఏదో కొత్త వ్యాపకం కల్పించుకునే మా నాన్న iPhone voice memo తో పాడి పంపిన పాట - యూట్యూబున పదిలమైందట - వినడమే తరువాయట...



మావికొమ్మల ఊయల 
ఊగరావే కోయిల
మావికొమ్మల ఊయల 
ఊగరావే కోయిల
కోయిలా... కోయిలా...  ఊగరావే ఊయల

ఈ మండే వేసవి ఎండలో
నీ తీయని పాటలు గుండెలో
ఈ మండే వేసవి ఎండలో
నీ తీయని పాటలు గుండెలో
తేనెలా - రసవీణలా - కోనలో -  చిరుసోనలా
స్వరగమక - తమకముల - పులకరింతలకు - తలపు కవితలై - ఉరికి పలుకగా


మావికొమ్మల ఊయల 
ఊగరావే కోయిల

నీ దాగుడుమూతల దారిలో
నువు సాగే వసంత వాడలో
నీ దాగుడుమూతల దారిలో
నువు సాగే వసంత వాడలో
ఆగవా ... సుధలీయవా...  అందవా...  ప్రియబాంధవా!
నా గుండె గూటిలో -  ఉండిపోయి - నవనీతగీతి - మైమరచి పాడగా

మావికొమ్మల ఊయల 
ఊగరావే కోయిల
కోయిలా... కోయిలా...  ఊగరావే ఊయల
కోయిలా... కోయిలా...  ఊగరావే ఊయల
ఊగరావే ఊయల
ఊగరావే ఊయల



కొసరు పాట - బాలు-చిత్రల జంట-పాట (ఎస్వీ కృష్ణారెడ్డిగారు కిట్టించినదట)

మా పెళ్ళైన తర్వాత - పదహార్రోజుల పండగలోగా - అత్తవారింట అందరితో కలిసి చూసిన మొదటి సినిమా - రాజేంద్రుడు-గజేంద్రుడు.

ఒక పాట రాగానే - అరె! ఇది మన కుట్టి పాటలా ఉందే! - అనిపించింది. అనిపించడమేంటి - అలాగే వినిపించింది కూడాను.

సరే - కాపీ "రైటు" మరి - మనం దాన్ని రాంగుగా తీసుకోకూడదు - అనేసుకుని చెవులారా వినేసి అసలు పాటతో కొసరు రాగం సరిపోల్చేసుకుని - నవ్వుతూ తేల్చేసుకున్నాం.

ఏదేమైనా కానీ ఈ కొసరు పాటలో ఓ రెండు లైన్లంటే నాకు మక్కువ.

అవేంటంటే...
కాలమేంటి  అంటే మనకు అనుకూలమైనదే - అనీ
మరి కానుక మాటేంటి అంటే - శుభ ముహూర్తం కాక మరేంటి - అనిన్నీ
అర్థమిచ్చే - కాలమా అనుకూలము - కానుక సుముహూర్తము  అన్న వాక్యాలు


అంతే కాక - గోరింటపూల పొదరింటిలోన - అన్నమాటలు దేవులపల్లివారిని జ్ఞప్తికి తెచ్చి - ఈ పాట నాకిష్టం సుమా - అనేలా చేశాయి.

సరే ... జల్లు-వానలో డ్రిల్లు-డాన్సులా వుండే ఈ పాట చూసి-విని, పై అసలుతో ఈ కొసరుని పోల్చి నవ్వులు కొల్చేసుకోండి మరి ...







నీలి వెన్నెల జాబిలీ... 
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
రా... మరి - నా దరి - అందుకో ప్రేమని 
నీలి కన్నుల కోమలి

నీలి వెన్నెల జాబిలీ...
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
చేరనీ... - నీ దరి - పొందనీ ప్రేమని 
రాగవీధుల సాగనీ

నా వలపుల కోవెల మంటపం
నీ రాకకు పలికెను స్వాగతం
సిరిమల్లెల రువ్వే సోయగం
తొలిప్రేమకు ఆయెను తోరణం
ప్రేమలే పెనవేయగా  
ఆశలే నెరవేరగా
అనురాగ సిరులు - సరసాలసుధలు - మనసార మరులు - పండించుకొందమా

నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని

ఓ చల్లని చూపుల దేవత
ప్రతి జన్మకు కోరెద నీ జత
నా కుంకుమరేఖల బంధమా
జత చేరుమ జీవనరాగమా
కాలమా అనుకూలము
కానుక సుముహూర్తము
గోరింటపూల - పొదరింటిలోన - నీ కంటి దీపమై - జంట చేరనా


నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
చేరనీ... - నీ దరి - పొందనీ ప్రేమని 
రాగవీధుల సాగనీ


నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
రా... మరి - నా దరి - అందుకో ప్రేమని 
నీలి కన్నుల కోమలి

అదండీ మరి ... 
అసలు పాట మావికొమ్మల 
కోయిల ఊయలలూగితే 
కొసరుపాట నీటి జాడల 
నీలి వెన్నెల కురిసెనట... 
ఆ ఊయల ... ఈ వెన్నెల 
నా బ్లాగున - మీకై ఈ నెల ... 

~పాటల భైరవి 

5, ఆగస్టు 2017, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 3 - మూడాటలు-ఆరుస్వారీలు

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 2 - ఇంటూ-ఫస్టుఫారం టూ ఫోర్తుఫారం


నేను థర్డ్‌ఫారంలో వుండగా - మా అన్నయ్యకి - అంటే వడ్లమాని సోమేశ్వరరావుగారు ఆయన పేరు - నాని గారంటారు -  ఆయన పెళ్ళి  కాకినాడ-గాంధీ నగర్‌లో మా వదినగారి మేనత్తగారి ఇంటి దగ్గర జరిగింది.

అనాతారం నుంచి - వూళ్ళోవాళ్ళు,  బంధువులు, మా నాన్న గారు, మేమందరం - చగ్గా కోటిపల్లి వరకు వెళ్లి - కోటిపల్లిలో గోదావరి దాటి - SRMT బస్సుల్లో కాకినాడ పెళ్ళికి తరలి వెళ్ళాము అందరమునూ.

మా దివాణం ఇంట్లో ఓ పే... ద్ద  విసనకర్ర  ఉండేది. అది ఎంత పెద్దదంటే - మామూలు విసనకర్రలకి  పదిరెట్లు ఉంటుందన్న మాట. దాన్ని ఊపుతూ విసరడానికి మా ఆస్థాన క్షురక-విద్వాంసుడు వీరన్న అని ఉండేవాడు. 

ఆ విసనకర్ర-వీరన్న, నన్ను సినిమాలకి తీసుకెళ్ళే పళ్ళయ్య - వీళ్ళు కూడా పెళ్ళికి మాతో కాకినాడ వచ్చారు.

అది మూడు రోజుల పెళ్ళి. ఆ రాత్రి పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక సదస్యం, మర్నాడు నాగవెల్లి.

మర్నాడు పొద్దున్న పూట పన్లేవీ లేవు.

కాకినాడలో కుళాయిచెరువు అని - గాంధీ నగర్ పక్కన  రామారావు పేట దగ్గరుంటుంది.

ఆ కుళాయి చెరువు పక్కన పేద్ద గులాబ్జాం తోట ఒకటుండేది.

మా కుర్రాళ్ళందరూ - అసలే న-వాల-(వా)-నరావతారులం కదా! - అలవోకగా తోటలో అలా దూరి - అవలీలగా చెట్లెక్కి - ఆ గులాబ్జాంపళ్ళు - అందినవి అందినట్టు, అందనివి అందిపుచ్చుకుని - కోసుకుని - తింటూ మళ్ళీ వెనక్కి పెళ్ళివారింటికి వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాం.

మాతో పాటే - వీరన్న, పళ్ళయ్య కూడా వచ్చారు.

గాంధీ నగర్‌పార్కు  దగ్గరకొచ్చేటప్పటికి - వీరన్న మెల్లిగా నా పక్కకొచ్చాడు.

"బాబీగారూ! నేనొకటికి వెళ్ళాలి. కడుపుబ్బరంగా వుంది. ఎక్కడెళ్ళాలో తెలియట్లేదు. ఎక్కడెళ్ళాలండి?" అన్నాడు.

అప్పుడే పార్క్ దగ్గరకి వచ్చాం కదా!

నేను చుట్టూ చూసి - "ఈ పార్కంతా మనోళ్ళదే  - మనదే ఈ స్థలమంతా -  అంచేత నీ ఇష్టం!  ఎక్కడో అక్కడ కానిచ్చేసేయ్" అన్నా.

అనగానే వీరన్న గబగబా పార్క్ గోడ దగ్గర పనికానిచ్చుకున్నాడు.

అది ఓ పోలీసాయన చూసి -  వీరన్నని పట్టుకుని తీసుకెళ్ళి  పోలీస్‌స్టేషన్‌లో కూర్చోపెట్టేశాడు. మేం కుర్రాళ్ళం, మాతోపాటు పళ్ళయ్య - భయపడి పరిగెట్టుకుంటూ వచ్చేశాం ఇంటికి.

ఈ లోపులేమో - వధూవరులకి - విసనకర్ర విసరాల్సిన టైం వచ్చింది.

మా నాన్నగారేమో - "ఏడీ వీరన్న? పిలవండి"  అంటే - అప్పుడు పళ్ళయ్య - వీరన్నని పోలీసులు తీసుకు పోయారు - అంటూ - భయపడుతూనే జరిగిన సంగతి చెప్పాడు.

అయ్యో అని చెప్పి - అప్పుడు మా వదినగారి తండ్రి పేరి ప్రసాదరావుగారు, మా వదినగారి మేనత్త భర్త అయిన  శిఖా  కామేశ్వరరావుగారు - వీళ్ళిద్దరూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి వీరన్నని విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చారు.

అదుగో - అలా తెలిసీ తెలియని వయసులో - ఆడుకుంటూ-పాడుకుంటూ - అన్నిటినీ చులాగ్గా తీసుకుంటూ - నెమ్మదిగా ఫిఫ్తుఫారం దాకా వచ్చాను.

ఫిఫ్తుఫారంలో ప్రవేశించేటప్పటికి నాకు గుర్రపు స్వారీ అదీ బాహా అలవాటైపోయింది.

అదెలా అంటే...

నేను లెక్కల్లోనూ, ఇంగ్లీషులోను బాగా పూరు. అందుకని మా నాన్న గారేం చేసారంటే - లెక్కలూ, ఇంగ్లీషు ప్రైవేటు చెప్పే ముక్కామల కృష్ణ మూర్తిగారికి - మా ఇంట్లో ఓ మూడు గదులు  అద్దెకిచ్చారు - ఒక పోర్షన్ కింద.

ముక్కామల కృష్ణ మూర్తిగారికి - సుబ్బారావు, శేషగిరిరావు అని ఇద్దరు మగపిల్లలు - బాగా చిన్నవాళ్ళు.  ఆయన, ఆయన భార్య, తల్లి, ఓ తమ్ముడు - వీళ్ళందరూ ఆ ఇంట్లో ఉండేవారు.

నాతో పాటు మా వూళ్ళో కుర్రాళ్ళు - నాయనరాజుగారి సూరిగాడు, నారాయణమూర్తి సత్తిగాడు, మెహబుల్లా అని ఓ ముస్లిమూ- ఇలా మొత్తం ఏడెన్మండుగురు ప్రైవేటుకి వచ్చేవాళ్ళు.  రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలవరకు చదువు. తర్వాత అరుగుమీదే పడుకునేవాళ్ళం.

నాకసలు చీకటన్నా, దొంగలన్నా, ఆఖరికి పాములన్నా - అందరూ చీకటి రాత్రుల్లో అనవసరంగా తలచుకుని అంతకన్నా అత్యనవసరంగా భయపడిపోయే దెయ్యాలన్నా - భయం లేదు.


అందరూ పడుక్కున్నాక - పదీ-పదిన్నరకి గంటలకు లేచేవాళ్ళం - నేను, నాయనరాజుగారి సూరిగాడు. లేచి - స్మశానానికి వెళ్ళేవాళ్ళం.

ఆ సమయంలో అక్కడ గుఱ్ఱబ్బండివాళ్ళ గుఱ్ఱాలు గడ్డి మేస్తూ ఉండేవి. అవి రాత్రల్లా స్మశానంలో గడ్డి మేసి ఏ తెల్లవారుఝామునో ఇంటికి తిరిగి వెళ్ళేవి.

నేను వెళ్తూ నాతోపాటు ఒక కొబ్బరితాడు పట్టికెళ్ళేవాడిని.

అప్పటికి గుఱ్ఱానికి - నాలిక పైకెత్తి కింది దవడకి కళ్ళెం ఎలా వెయ్యాలో నేర్చుకున్నాను. అంతే - గడ్డి మేస్తున్న గుఱ్ఱాల్లో ఒకదాన్ని పట్టుకుని - దానికి కళ్ళెమేసి - దాన్నెక్కి నెమ్మదిగా చెరువు గట్టున స్వారీ చేస్తూ ఉండేవాణ్ణి. మళ్ళీ రాత్రి ఏ పన్నెండు, ఒంటిగంటకో గుఱ్ఱాన్ని విదిలేసేవాణ్ణి.

ఇదంతా ఎవరికీ తెలీకుండా చేసేవాణ్ణి.

ఓ రోజు మంచి వెన్నెలగా వుంది. రోజూలాగే ఓ గుఱ్ఱాన్ని పట్టుకుని ఎక్కి - ఇవాళ పొలం వైపు వద్దు - ఊరి వీధుల్లో తిరుగుదాం - అనుకుని రెండో వీధిలో తిరుగుతున్నాను - పాండురంగమహాత్మ్యంలో ఎన్టీఆర్ లాగా తెల్ల చొక్కా వేసుకుని.

అదేమో మహాపేచీ-గుఱ్ఱం - ఓ పట్టాన లొంగలేదు. ఎలాగో లొంగదీసుకుని కళ్ళెం వేశాను. మాంచి దౌడు మీద వెళ్తోంది.

రెండోవీధిలో చిన్నమేష్టారు ఓరుగంటి అప్పారావు గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ పెంకిగుఱ్ఱం ముందు రెండు కాళ్ళు తన్నిపెట్టి తలకాయ వంచేసి - హఠాత్తుగా ఆగిపోయింది. దాంతో - చిన్నమేష్టారి ఇంటికి వున్న ఇనుపగేటు మీద పడిపోయాను. ఆ గేటుకి ఇనపఊసలు - బల్లేల్లా ఉండేవి. అందులో ఒక ఊస కంటి పైన దిగిపోయింది. ఇంకా - నయం కన్ను పోలేదు.

నా తెల్లచొక్కా అంతా ఎర్రగా రక్తం. ఒక్కసారిగా "అయ్యబాబోయ్" అని అరిచాను. ఆ ఎదురుగుండా కృష్ణమూర్తిగారి కాముడు అని ఉండేవారు - అనిపిండివారు. నా అరుపు విని లేచొచ్చి - నా దెబ్బ చూసి - "అమ్మయ్యో-ఎంత రక్తమో" అంటూ నా చొక్కానే విప్పి కట్టుకట్టి ఇంటికి తీసుకెళ్ళారు.

ఇంటికి వెళ్ళగానే - మా నాన్న ఆ రక్తం అదీ చూసి - అంత రాత్రిపూట ఏదో దెబ్బలాటకెళ్ళి తన్నులు తినొచ్చాననుకుని - నాకు దెబ్బ తగిలిందని కూడా చూడకుండా - ఇంకో నాలుగు దెబ్బలు గా...ఠిగా వడ్డించారు.

ఇంతలో గమ్మున మా అమ్మ - "అయ్యో పిల్లాడికి దెబ్బ తగిలింది" - అంటే అప్పుడు చూసి ఆయన - మా పొలాలు అవీ చూసే దాట్లరాజుగారిని పిలిచారు. ఆ రాజుకిగారికి కొంచెం ఆయుర్వేదం తెలుసు. ఆయనచేత కట్లు కట్టించి - అంత రాత్రిపూట గుఱ్ఱబ్బండి కట్టించి - మా నాన్న, నేను, దాట్లరాజుగారు కలిసి - అమలాపురంలో - MBBS డాక్టర్ మంథా  సుబ్బారావుగారని - మా వదినగారి చుట్టం ఉండేవారు - ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి రాత్రి రెండున్నరో-మూడో అయింది. అక్కడ పప్పు సత్యం గారని కాంపౌండరు ఉండేవారు. ఆయన్ని లేపుకొచ్చారు. డాక్టరుగారు - దెబ్బ చూసి - దీన్నిలా వదిలేస్తే కాదు కుట్టాల్సిందే - అని అన్నారు.

ఆ రోజుల్లో ఏంటంటే - అలా ఏమన్నా దెబ్బ తగిలి కుట్టాలంటే - అనస్తీషియా ఇచ్చేవారు కాదు - సూదిలో దారమెక్కించి బొంత కుట్టినట్టు కుట్టేసేవారు.

నేను - డాక్టరుగారి మాట వినగానే - కాళ్ళతో చేతుల్తో అందరిని తన్నేసి ఎవర్నీ దగ్గరికి రానీయకుండా, నా దెబ్బని ముట్టుకోనీకుండా - గొడవ గొడవ చేసేశాను.

డాక్టరుగారు - "వీడింక కుట్టనీడు - మచ్చుంటే ఉంటుంది" - అంజెప్పి డ్రెస్సింగ్  చేసేసి మందులిచ్చి పంపించేశారు.

అప్పట్నుంచి - రెండేసి రోజులకొకసారి - మా మేనత్తకొడుకు నాగన్నకి సైకిలిచ్చి - నన్ను వాడితో అమలాపురం పంపించి - డ్రెస్సింగ్ మార్పించేవారు. నెమ్మదిగా ఆ దెబ్బ తగ్గిపోయింది.

అలా అని గుఱ్ఱాలెక్కడం మానలేదు. పైగా వాటినెక్కి పంట బోదెల్లొ ఇట్నుంచి అటు దూకిస్తూ వుండేవాణ్ణి. ఓసారి అలా దూకిస్తుంటే కళ్ళెం తెగిపోయి బోదెలో పడి ఎడం చెయ్యి విరిగింది.  మళ్ళీ దానికో కట్టు.

మా నాన్న అమలాపురం వెళ్ళడానికి గుఱ్ఱబ్బండి వచ్చేది. ఆ బండతనికి మా అమ్మ - ఏదో ఒక టిఫిను, కాఫీ తినడానికి-తాగడానికి ఇచ్చేది. అతను సందులోంచి పెరట్లోకి వెళ్ళి తింటుండగా - ఈ లోపులో నేను ఆ బండేసుకుని మూడు వీధులూ తిరిగొచ్చేవాణ్ణి.

"అయ్‌బాబోయ్! బాబీగారు బండేసుకుని వెళ్ళిపోయారండి ! " అని వెతుక్కుంటూ వచ్చేవాడు బండతను.

అప్పటికి మా నాన్న కొట్టడం తగ్గించారు - కళ్ళెఱ్ఱజేసేవారు అంతే.

ఈలోగా అమలాపురానికి కొత్తగా రిక్షాలొచ్చాయి. రిక్షా వచ్చి ఇంటిముందు ఆగితే అది కూడా వేసుకెళ్ళిపోయి మూడు వీధులూ తిరిగి తొక్కేసేవాణ్ణి.

ఈలోగా విత్-హెల్డ్ నుంచి మామూలు హాజరుకొచ్చేశాను. నడక-పనిష్మెంటు కూడా ముగిసిపోయింది. ఆ రోజుల్లో - ర్యాలీ, హెర్క్యులెస్, రాబిన్‌హుడ్ - అని మూడు రకాల సైకిళ్ళు ఉండేవి. నాకు మా నాన్న రాబిన్‌హుడ్ సైకిలు కొనిచ్చారు.

ఆ సైకిలు మీద భీమనపల్లి హైస్కూలుకి వెళ్ళడం, రావడం - స్కూల్లో కబడ్డీ, బాల్-బాడ్మింటను, బేస్‌బాలు - లాంటి స్పోర్ట్స్ ఆడేవాణ్ణి.  అమలాపురం, కొత్తపేట, ముక్తేశ్వరం- స్కూళ్ళతో గ్రిగ్స్ ఆటలపోటీలు ఉండేవి.

అలా మూడు స్వారీలు-ఆరు ఆటలుగా ఫిఫ్తుఫారం గడిచింది.

<వచ్చేనెల తరువాయి కథ>