అసలు పాట - మా నాన్న నోట (బండారు చిట్టిబాబుగారు కట్టినదట)
ఓ మునిమాపు సంధ్యలో - మింటనున్న రిక్కకో చూపునెక్కుపెట్టి - మా family anthem లాంటి కోయిల పాటను పాడిన నాన్న గొంతులో పలికిన అసలు పాట - తానెళ్తూ తన ఎఱుకగా మా కుట్టి మాకొదిలెళ్ళిన కోయిల పాట...
ఆ పాటతో నా మొదటి పరిచయం ఎప్పుడంటే ...
ఎర్రంచు తెల్ల మధుపర్కాలు
పసుపుతాడు తోడు, నల్లపూసల పేరు సౌరు
కంఠాన మెరుస్తున్న చమ్కీపూల కర్పూరదండలు
కంటి చివరన తళుకంటించుకున్న నీటిముత్యాలు
లాజహోమంలో వేడెక్కిన చేతులు మండుతున్నాయని వంకే గానీ
పాల నరచేయి ముంచి అమ్మ పెట్టిన అప్పగింతల తాలూకు బెంగేమీ లేదని
బింకాలు పోతున్న అమ్మాయిగా నేను ...
కొంగుముడి చాలదన్నట్టు చిటికెనవేలు మెలికతో కట్టేసుకున్నానని
నా బంగరుబొమ్మవు నీవని ఒట్టేసుకున్నానని ఒదిలేదిక లేదని
పొంకాలుచూపుతున్న అబ్బాయిగా బదరి ...
మా యిద్దరి చుట్టూ చేరిన స్నేహితులు సన్నిహితులు - పలకరింపులు - చిరునవ్వులు; ఛలోక్తులు - పకపకలు
ఉక్కిరిబిక్కిరయ్యే హడావిడి - ఊపిరాడనివ్వని సందడి
అలసిన అక్కని కనుసన్నల చల్లగా చూడమని - సన్నగా - బావగారికి పన్నీరు జల్లవచ్చిన చిట్టిమరదళ్ళు - ఈ అక్కకు చెల్లెళ్ళు - నా పక్కన చేరారు.
మాలో చిన్నది -
పాటలాధరాల పాటలనెప్పుడూ మోసే రాగాల పల్లకి -
పాటే శ్వాసైన నయగారాల వల్లకి -
ఎప్పుడైనా ఎవరైనా పాట పాడమంటే - "కోయిలను నేను - పాడమన్నప్పుడల్లా పాడను - నాకు పాడాలనిపించి నే పాడితే మీరు వినండి" - అని మాటలతో దబాయించే చిలిపితనపు కలికి -
బావగారి నోట నుంచి విన్న మొదటి కోరిక "నువ్వు బాగా పాడతావని మీ అక్క చెప్పింది - ఒక్క పాట పాడవా? " అంటూ.
వెంటనే గొంతు సవరించుకుని ఆ ఫాల్గుణ మాసపు మధ్యాహ్నాన - చిగురాకు-మేతరిని మావికొమ్మల వూగ రమ్మని పిలుస్తూ - తాను నేర్చిన ఓ పాట పాడింది మా ఇంటి కోయిల - విన్న బావగారి గుండెలో ఆ నవనీతగీతి మరపురాని మైమరపు-గీతి కాగా.
తర్వాత - ఎన్నోసార్లు - ఇంకెన్నెన్నో మార్లు - అడిగీ అడగకుండానే - అదే పాట పాడిందెన్ని సార్లో - విని చెవులపంట పండిందెన్నిమార్లో - లెక్క లేనే లేదు.
దేవులపల్లివారి - తొందర పడి ఒక కోయిల ముందే కూసింది - అన్న పాటను ఇంకోరకంగా - తొందర పడి ఒక కోయిల ముందే ఎగిరింది - అన్నట్టు అర్థం చేసుకుందో ఏమో - పాడుతూ పాడుతూ... పాటల లోకంలో తేలుతూ ... పాట మాత్రం మాకు వదిలి - కన్నుల మెరుపు, చిరునవ్వు తళుకు కలిపి నింగికో నక్షత్రాన్ని గుచ్చి - ఇదే నా ఆనవాలు మీకింక - అని చెప్పా పెట్టకుండా పయనమై వెళ్ళిపోయింది.
మా కుట్టి లేదు కానీ -
దాని పాట వుంది -
మా చెవుల్లో దాని కబుర్ల-గలగలల, నవ్వుల-సవ్వడుల అలికిడి ఇంకా అలానే వుంది.
మాకు నేర్పి వెళ్ళిన పాట-తోడు వుంది.
మాకు మప్పి పెట్టిన నవ్వుల-వాడుక వేడుక వుంది.
అదిగో --- ఆ గుర్తుతోనే ఆరు-పుష్కరాల వయసులో కూడా ఆరేళ్ళ-బాల్యోత్సాహంతో ఎప్పుడూ ఏదో కొత్త వ్యాపకం కల్పించుకునే మా నాన్న iPhone voice memo తో పాడి పంపిన పాట - యూట్యూబున పదిలమైందట - వినడమే తరువాయట...
మావికొమ్మల ఊయల
ఊగరావే కోయిల
మావికొమ్మల ఊయల
ఊగరావే కోయిల
కోయిలా... కోయిలా... ఊగరావే ఊయల
ఈ మండే వేసవి ఎండలో
నీ తీయని పాటలు గుండెలో
ఈ మండే వేసవి ఎండలో
నీ తీయని పాటలు గుండెలో
తేనెలా - రసవీణలా - కోనలో - చిరుసోనలా
స్వరగమక - తమకముల - పులకరింతలకు - తలపు కవితలై - ఉరికి పలుకగా
మావికొమ్మల ఊయల
ఊగరావే కోయిల
నీ దాగుడుమూతల దారిలో
నువు సాగే వసంత వాడలో
నీ దాగుడుమూతల దారిలో
నువు సాగే వసంత వాడలో
ఆగవా ... సుధలీయవా... అందవా... ప్రియబాంధవా!
నా గుండె గూటిలో - ఉండిపోయి - నవనీతగీతి - మైమరచి పాడగా
మావికొమ్మల ఊయల
ఊగరావే కోయిల
కోయిలా... కోయిలా... ఊగరావే ఊయల
కోయిలా... కోయిలా... ఊగరావే ఊయల
ఊగరావే ఊయల
ఊగరావే ఊయల
కొసరు పాట - బాలు-చిత్రల జంట-పాట (ఎస్వీ కృష్ణారెడ్డిగారు కిట్టించినదట)
మా పెళ్ళైన తర్వాత - పదహార్రోజుల పండగలోగా - అత్తవారింట అందరితో కలిసి చూసిన మొదటి సినిమా - రాజేంద్రుడు-గజేంద్రుడు.
ఒక పాట రాగానే - అరె! ఇది మన కుట్టి పాటలా ఉందే! - అనిపించింది. అనిపించడమేంటి - అలాగే వినిపించింది కూడాను.
సరే - కాపీ "రైటు" మరి - మనం దాన్ని రాంగుగా తీసుకోకూడదు - అనేసుకుని చెవులారా వినేసి అసలు పాటతో కొసరు రాగం సరిపోల్చేసుకుని - నవ్వుతూ తేల్చేసుకున్నాం.
ఏదేమైనా కానీ ఈ కొసరు పాటలో ఓ రెండు లైన్లంటే నాకు మక్కువ.
అవేంటంటే...
కాలమేంటి అంటే మనకు అనుకూలమైనదే - అనీ
మరి కానుక మాటేంటి అంటే - శుభ ముహూర్తం కాక మరేంటి - అనిన్నీ
అర్థమిచ్చే - కాలమా అనుకూలము - కానుక సుముహూర్తము అన్న వాక్యాలు
అంతే కాక - గోరింటపూల పొదరింటిలోన - అన్నమాటలు దేవులపల్లివారిని జ్ఞప్తికి తెచ్చి - ఈ పాట నాకిష్టం సుమా - అనేలా చేశాయి.
సరే ... జల్లు-వానలో డ్రిల్లు-డాన్సులా వుండే ఈ పాట చూసి-విని, పై అసలుతో ఈ కొసరుని పోల్చి నవ్వులు కొల్చేసుకోండి మరి ...
నీలి వెన్నెల జాబిలీ...
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
రా... మరి - నా దరి - అందుకో ప్రేమని
నీలి కన్నుల కోమలి
నీలి వెన్నెల జాబిలీ...
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
చేరనీ... - నీ దరి - పొందనీ ప్రేమని
రాగవీధుల సాగనీ
నా వలపుల కోవెల మంటపం
నీ రాకకు పలికెను స్వాగతం
సిరిమల్లెల రువ్వే సోయగం
తొలిప్రేమకు ఆయెను తోరణం
ప్రేమలే పెనవేయగా
ఆశలే నెరవేరగా
అనురాగ సిరులు - సరసాలసుధలు - మనసార మరులు - పండించుకొందమా
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
ఓ చల్లని చూపుల దేవత
ప్రతి జన్మకు కోరెద నీ జత
నా కుంకుమరేఖల బంధమా
జత చేరుమ జీవనరాగమా
కాలమా అనుకూలము
కానుక సుముహూర్తము
గోరింటపూల - పొదరింటిలోన - నీ కంటి దీపమై - జంట చేరనా
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
చేరనీ... - నీ దరి - పొందనీ ప్రేమని
రాగవీధుల సాగనీ
నీలి వెన్నెల జాబిలి - వీణ నవ్వుల ఆమని
రా... మరి - నా దరి - అందుకో ప్రేమని
నీలి కన్నుల కోమలి
అదండీ మరి ...
అసలు పాట మావికొమ్మల
కోయిల ఊయలలూగితే
కొసరుపాట నీటి జాడల
నీలి వెన్నెల కురిసెనట...
ఆ ఊయల ... ఈ వెన్నెల
నా బ్లాగున - మీకై ఈ నెల ...
~పాటల భైరవి
బాగా పాడారు Lalli Dasavataralu విన్నా and recent గా also Anathavaram group లో ఒక పాట voice msg తో పెట్టారు but song నా కు గుర్తు లేదు చాలా బాగా పాడారు.
రిప్లయితొలగించండిఇక kutti గురించి blog చదువు తున్నంతసేపూ kutti రూపమే అలా కళ్ళముందు మెదిలింది ముక్కు కి పుడక మాదిరిగా కాకుండా ring లాగా ఉండేది కాళ్ళ గజ్జెలు sound అలా కళ్ళముందు తన రూపము మెదిలింది.
అలా తన రూపము తలుచుకుంటూ నాన్న గారి voice తో ఆ పాట వింటున్నా.
చాలా థాంక్స్, శ్యామలా! - పాటను వింటూ కుట్టీని తలుచుకున్నందుకు.
తొలగించండినాకు "నీలివెన్నెల జాబిలి" ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు మీ నాన్నగారి "మావికొమ్మల ఊయల" దానికో మెట్టు పైన వుంది - ఎంతైనా అసలు పాట కదా. పాట వెనక కబుర్లు చదివాక బాధగా అనిపించినా మీ చెల్లెల్ని మీరు గుర్తు చేసుకునే తీరు అద్భుతంగా వుంది.
రిప్లయితొలగించండిఈ పోస్టుకి మీ ఈ వ్యాఖ్య ఎంతో అమూల్యమైయినది. మీరెవరో తెలిపితే ఇంకా సంతోషంగా వుండేది. Thanks a lot!
తొలగించండిపాట చాలా బావుంది లలితా . పైన అజ్ఞాత గారు చెప్పినట్లు మీరు మీ చెల్లెలు గారిని తల్చుకున్న తీరు ఎన్నో సంగతులు చెప్పకనే చెప్తోంది.
రిప్లయితొలగించండిఈ పోస్టుకి వచ్చే ఈ మెప్పులు నాకెంత విలువైనవో చెప్పలేను. బోల్డన్ని థాంక్స్!
తొలగించండిలలితా! మీ పెళ్ళి వేడుకలో మీ నవదంపతులను నువ్వు వర్ణించిన తీరు ఎంత బావుందో! !
రిప్లయితొలగించండితులసి పెళ్లికి వచ్చినప్పుడే మీ కుట్టిని నేను కలవడం.
అప్పుడు ఏదో హారతిపాట, 'నీరాజనం' అంటూ పాడింది.
'ఎంత బాగా పాడుతుంది ఈ అమ్మాయి', అనుకున్నా.
'తొందరపడి ఒక కోయిల ముందు ఎగిరింది'! నిజంగానే కోయిల పాట తనది.
సినిమా పాటకన్నా నాకు మీ నాన్నగారు పాడిన పాటే నచ్చింది.
పదాల పేరు, పాడిన తీరు రెండూ.
కుట్టిని తల్చుకుంటూ పాడినట్లనిపించింది.
సరిగ్గా కనిపెట్టావు - తనని, నన్ను, నాన్నని - మా ముగ్గురినీ - మా పాటని తెలిసిన నీకు - పాట వెనక విషయం తెలియడం విశేషం కాదు :)
తొలగించండి