అనాతవరం కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనాతవరం కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, సెప్టెంబర్ 2017, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 4 - రైలు ప్లాట్‌ఫారం నుంచి జైలు యూనిఫారం దాకా పళ్ళయ్యకథ

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 3 - మూడాటలు-ఆరుస్వారీలు

SLC లోకొచ్చాను.

ఫస్ట్ ఫారం నుంచి SLC వరకు మాతో పాటు ఆరుగురు ఆడపిల్లలు, ముప్ఫయి నాలుగు మంది మగపిల్లలం - మొత్తం నలభై మంది మా క్లాసులో.

SLC లో వెంట్రప్రగడ జగన్నాథరావుగారని మా హెడ్మాస్టరు - ఆయన కూడా క్లాసులు తీసుకునేవారు. అనాతవరం నుంచి తెలుగు మాస్టారు - కర్రా చంద్రశేఖర శాస్త్రిగారు, ఆకెళ్ళ సుబారావుగాని ఇంకొక టీచరు వచ్చేవారు. వెంట్రప్రగడ జగన్నాథరావుగారు భీమనపల్లిలో ఉండేవారు.

ఆరుగురు ఆడపిల్లల్లో ఒకమ్మాయి మా సుబ్బన్న మాస్టారి కూతురు - పరిమి సుబ్బలక్ష్మి. ఇంకొకామేమో సోషల్ మాస్టారి కూతురు కృష్ణవేణి. ఇంకొకమ్మాయేమో గుండాబత్తులప్రభావతి అని అనాతారం నుంచే వచ్చేది - మిల్లు వాళ్ళమ్మాయి. ఇంకో అమ్మాయి మారిశెట్టి సూర్యకుమారి అని. ఇంకొక అమ్మాయేమో క్రిస్టియన్ అమ్మాయి - డోరాగ్రేస్ అని. ఆరో అమ్మాయి పేరు గుర్తు లేదు. ఈ ఆరుగురు ఆడపిల్లలు ఫస్టుఫారం నుంచీ మాతోనే కలిసి చదువుకున్నారు.

మాకు SLC లోకి వచ్చేటప్పటికి మాథ్స్‌లో కాంపోజిట్టు, జెనరల్ అని రెండుండేవి. ఈ కాంపోజిట్టు కొంచెం కష్టం - ఆ ఈక్వేషన్స్ అవీ నాకు వచ్చేవి కావు. అసలే ఆల్జీబ్రా - గుండె గాబ్రా కదా! అందుకని నేను జెనరల్ తీసుకున్నా. క్లాసుని  A, B సెక్షన్లు చేశారు. ఎవరి సెక్షన్ వాళ్ళం వున్నా - మాథ్స్‌కి మాత్రం కాంపోజిట్ వాళ్ళందరూ ఒక క్లాసుకి, జెనరల్ వాళ్ళం ఒక క్లాసుకి వెళ్ళేవాళ్ళం. ఈ రావడం - పోవడంలో ఏమైందంటే - ఒకరోజు - ఒక అమ్మాయిని - ఎవరితోనో ఆట్లాడుతూ పరిగెత్తుతూ వెళ్తూ - చూసుకోకుండా గుద్దేశాను. ఆ అమ్మాయి చేతిలో పుస్తకాలు కిందపడిపోయాయి. నేను నవ్వుకుంటూ పారిపోయాను.

అది మా హెడ్మాస్టరు చూశారు - ఎక్కడో దూరం నుంచి.

ఆయన దగ్గర ఒక అలవాటుండేది - ఆయనదగ్గర మాం... ఛి పేకబెత్తమొకటి ఆయన రూములో ఉండేది. ఆయన ఎవరినయినా కొట్టాలనుకుంటే వాడినే పంపించి ఆ బెత్తం తెప్పించేవారు. తెప్పించి చితగ్గొట్టేహేసేవారన్నమాట.

నన్ను పిలిచి "ఒరే వడ్లమానీ! అక్కడ సత్యం ఉంటాడు - వాణ్ణడిగి నేనిమ్మన్నానని చెప్పి ఆ బెత్తం తీసుకురా! " అన్నారు.

సత్యం అంటే మా బళ్ళో గంటలు కొట్టే అటెండరు.

నాకప్పుడే అర్థం అయిపోయింది - మనకు మూడింది ఇవాళ అని.

సరే! వెళ్ళాను ఊపుకుంటూ హెడ్మాస్టరు గారి ఆఫీసుకి.

సత్యం, రాజు అని ఇద్దరు ఉండేవారు. దసరా వచ్చిందంటే చెరో రెండు రూపాయలు ఇచ్చేవాణ్ణి - ఆ రోజుల్లోనే. అది అప్పటికి చాలా గొప్ప. అంచేత నేనంటే వాళ్ళకి - పాపం - ప్రత్యేక అభిమానం ఉండేది.

"సత్యం! హెడ్మాస్టరు బెత్తం తెమ్మన్నారు - అది ఇటియ్యి" అన్నాను.

వాడికి తెలుసు నన్నే కొట్టేస్తారని.

అయినా కూడా "ఎవరికీ మూడింది బాబూ ఇవాళా ?" అనడిగాడు.

"ఏమో - నాకేం తెల్సు. ఎవడో అల్లరి చేశాడు లోపల - నన్ను బెత్తం తీసుకు రమ్మన్నారు" అన్నాను.

"సరే అయితే - తీసుకెళ్ళు బాబూ!" అంటూ భద్రంగా ఇచ్చాడు బెత్తం.

ఆ బెత్తం పట్టుకుని వచ్చాను.

వచ్చేటప్పటికి "చెయ్యి పట్టమ్మా!" అని రెండు చేతులూ చాచి పెడితే తెగ బాదేహారు. చేతులు ఉబ్బిపోయినై.

ఆ ఉబ్బిపోయిన చేతులతో - ఇంకా రోజుకి ఆటల్లేవు - ఎలాగోలా కష్టపడి సైకిలు తొక్కుకుంటూ ఇంటికివెళ్ళాను.

అన్నం తినడానిక్కూడా లేదు - చేతులంతా మంటలు. మా అమ్మే - ఉయ్యాలబల్ల మీద కూర్చోబెట్టి - నోట్లో పెట్టేహేది అన్నం.

మా నాన్నగారికి అనుమానమొచ్చింది.

"ఏమైందిరా అది?" అనడిగారు.

"అబ్బే! ఏం లేదు. ఆడుతూ ఆడుతూ చేతులు కింద ఆనించేశాను. అక్కడ రాళ్ళేవో వున్నాయ్. అంచేత అవేవో తగిలాయి" - అనేదో అబద్ధం ఆడేశాను.

ఈ లోపులో - తెలుగు మాస్టారు - మా చుట్టం కూడా ఆయన - కర్రా చంద్రశేఖరశాస్త్రిగారు - ఆయనొచ్చారు.

వచ్చి - "నారాయణగారూ! - ఏడీ ఉన్నాడా మనవాడూ ?!" అన్నారు.

"ఆ రండి మాస్టారూ - ఏంటి సంగతి?" అన్నారు మా నాన్న.

"ఏం లేదు - ఇవాళ వీడూ ... ఏదో అల్లరి చేసుకుంటూ వచ్చి ఓ అమ్మాయిని గుద్దేహాడు. హెడ్మాస్టరు పట్టుకుని చితక్కొట్టేహాడు. ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాను" అన్నాడాయన.

ఇంక చూసుకోండి మా నాన్నగారు మళ్ళీ ఫుట్‌బాల్ ఆడేశారు నన్ను - ఇంకెప్పుడూ మళ్ళీ ఇలాంటి వెధవపనులు చేయకంటూ.

ఇవాళ్టి రోజుల్లో అయితే కుర్రాణ్ణి కొట్టారంటే పెద్దలెళ్ళి స్కూల్ మీద పడి టీచర్సుని తిడుతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళని తిట్టడం కాదు మమ్మల్నే చితకబాదేసేవారు - మళ్ళీ ఇంట్లో "వెధవా! తప్పు చేశావు" అన్చెప్పి.

ఒక సంగతి మర్చిపోయాను - ఫిఫ్తుఫారంలో వున్నప్పుడు మా అన్నయ్యగారికి అమ్మాయి పుట్టింది - విజయవాడలో ప్రసవించారు మా వదినగారు. విజయవాడలో విజయా మెడికల్ సిండికేట్‌లో పనిచేసే వారు మా అన్నయ్య. మా వదినవారిని ప్రసవం అయ్యాక ఐదో నెల్లో ఒకసారి అనాతవరం తీసుకొచ్చారు.

విశాఖపట్నంలో మా అక్కయ్య లలిత, బావగారు రామంగారు (లాయరుగారు) వుండేవాళ్ళు. విశాఖ నుంచి మా లలిత కూడా ప్రసవానికి వచ్చింది. ఆమెకీ ఆడపిల్ల పుట్టింది.

వదినగారు, లలిత అక్కయ్య ఓ పదిహేను రోజులు అనాతవరంలోనే ఉన్నారు. అంతలో మా వదినగార్ని విజయవాడ పంపించాలి - మరి మా అక్కయ్యని వైజాగ్ పంపించాలి.

మా అక్కయ్య " నేను కూడా విజయవాడ వెళ్తాను - అక్కడ నాలుగు రోజులుండి వైజాగ్ వెళ్తాను " అంది.

వాళ్లకి ఎస్కార్టుగా నన్ను పంపించారు - నాకు సెలవులప్పుడు.

 బోల్డు లగేజీ.

ఈ లోపులో - మా పెద్దక్క పాపాయి అమలాపురంలో ఉండేది - "నేను కూడా వస్తాను, మంగళగిరి చూద్దాం అందరం కలిసి" - అంది.

మేమందరం కలిసి బయల్దేరి - రాజమండ్రి వెళ్ళి - ఈ రాజమండ్రేంటంటే బొబ్బర్లంక వెళ్ళి అక్కడ్నుంచి లాంచీ ఎక్కి లాంచీలో గోదారిమీదెళ్ళాలి - వెళ్ళి - రాజమండ్రి వెళ్ళి అక్కడ విజయవాడకి ట్రైన్ ఎక్కాలన్నమాట. అదీ అప్పటి పరిస్థితి.

మా ఇంట్లో వున్న అలవాటేంటంటే - పళ్ళయ్య ఉండేవాడు కదా మా ఇంట్లో !?- ఎవరు ఊరు వెళ్ళినా కూడా - ఇటు వేపు వెడితే బొబ్బర్లంక రేవు గోదారి దాటి లాంచీ మీద అవతల ట్రైన్ ఎక్కేవరకూ ఉండాలి - ట్రైన్ ఎక్కించి మళ్ళీ అతను వెనక్కి వెళ్ళిపోతాడు. అలాగే అటువైపు కాకినాడవైపు విశాఖపట్నం వెళ్ళాలంటే - ముక్తేశ్వరం వచ్చి రేవు దాటించి కోటిపల్లిలో మమ్మల్ని బస్సెక్కించి వెనక్కెళ్ళిపోయేవాడన్నమాట. ఇది మామూలు ప్రాక్టీసు మాకింటి దగ్గర అప్పుడు.

సరే! ఈ పళ్ళయ్య కూడా మాతో పాటొచ్చాడు.

లగేజీ, పిల్లలు, మా ఇద్దరక్కయ్యలు, మా వదినగారు, ఎస్కార్ట్ నేను - రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళి టౌన్‌స్టేషన్‌కి వెళ్ళాం.

వెళ్ళాక - పళ్ళయ్యని లగేజీ పట్టుకోమని - అందరినీ ప్లాట్‌ఫారం మీదకెళ్ళిపొండి - టికెట్లు నేను పట్టుకొస్తానని చెప్పి - నేనేం చేశానంటే - విజయవాడకి టిక్కెట్లు తీశాను నాలుగు. ప్లాట్‌ఫారంటికెట్టు మర్చిపోయాను. అప్పటికహలు గుర్తు లేదు నాకు - తీయాలని కూడా తట్టలేదు.

టికెట్లు తీసుకుని వెళ్ళిపోయాం స్టేషన్ లోపలికి. ఈలోగా హౌరా నుంచి మెయిలొచ్చింది. ఆ మెయిల్లో విజయవాడ వెళ్ళాలి. లగేజీ అంతా సర్దేసుకుని మెయిలెక్కేశాం.

ఎక్కేసేటప్పటికీ - మెయిలు కదలబోతుండగా పళ్ళయ్య గబగబా నా దగ్గరకొచ్చి - "బాబిగారు - నేను బయటికెళ్ళాలి - ఎలాగా - ఎలా వెళ్ళాలి?'  - అన్నాడు.

అప్పుడు గుర్తుకొచ్చింది - అమ్మో-  ప్లాట్‌ఫారం టికెట్ తీయలేదని.

ఎదురుగుండా నల్ల కోటేసుకుని స్టేషను మాస్టరెవరో కనబడుతున్నాడు. ఆయన్ని చూపించి "పళ్ళయ్యా! ఓ పని చెయ్యి - ఆయన దగ్గరకెళ్ళి అడుగు. ఎలా వెళ్ళాలో ఆయన చెప్తాడు" - అని చెప్పేసి - పళ్ళయ్యకి భోజనానికి, వెనక్కి వెళ్ళడానికి డబ్బులిచ్చి - మేం వెళ్ళిపోయాం.

ఈ పిచ్చి పళ్ళయ్యేమో ఆయన దగ్గరికెళ్ళి - "నేనూ మా కామందులూ వచ్చామండి అమలాపురం నుంచి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి చెప్ప" మంటే - సరే ఇక్కడే కూర్చో అనీ - "టికెట్టుందా , ప్లాట్‌ఫారం టికెట్టూ?" - అనడిగాడట ఆయన.

"నాకేం ఇవ్వలేదండీ మా కామందులూ" - అని పళ్ళయ్య జవాబు.

అది వినగానే పళ్ళయ్యని రైల్వే పోలీసులకి అప్పగించేశాడాయన.

ఆ రోజుల్లో రైల్వే పోలీసులకి అప్పగిస్తే తిన్నగా సెంట్రల్ జైలుకి పట్టుకుపోయేవారు.

పళ్ళయ్యని ఆ పళంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి అతను కట్టుకున్న పంచె, చొక్కా, భుజం మీది తువ్వాలు తీసేసి జైలుడ్రెస్సు వేసేశారు చారలది - వేసేసి లాకప్పులో పడేశారు.

సరే -  మేమూ విజయవాడ వెళ్ళిపోయాం.

ఇక్కడ ఇంటి దగ్గర మా నాన్నగారు వాళ్ళు రెండు రోజులకీ పళ్ళయ్య రాకపోతే - లగేజీ అదీ వుంది కదా, పళ్ళయ్యని కూడా విజయవాడ తీసుకుపోయి ఉంటార్లే - అనుకున్నారు. మేమేమో ఈ పాటికి ఇంటికెళ్ళి పోయి వుంటాడులే అనుకున్నాం.

కానీ ఆ రెండు రోజులూ జైల్లో వున్నాడు పళ్ళయ్య.

అదృష్టవశాత్తూ ఆ జైల్లో తెలిసున్న కానిస్టేబుల్ ఒకడు చూశాడు పళ్ళయ్యని.

"ఏంటి పళ్ళయ్యేగారూ - ఇక్కడున్నారు?" అడిగితే పళ్ళయ్య ఏడుస్తూ - ఇలా ఇలా జరిగింది - అని చెప్తే - పాపం అతను - ఇంటికెళ్ళాక పంపిద్దురు గానీ - అని డబ్బులు కట్టి, విడిపించి - ఇంటికి పంపించాడు.

పళ్ళయ్య అనాతవరం వెళ్ళి - గుమ్మంలోంచే ఏడుస్తూ వెళ్ళి మా నాన్నగారికి జరిగిందంతా చెప్తే ఆయన అది విని ఆ కానిస్టేబుల్‌కి పంపించాల్సిన డబ్బులు - మనియార్డర్ కట్టమని మళ్ళీ పళ్ళయ్యకే ఇచ్చి పంపించారు.

ఈ విషయం మా నాన్నగారు - మేము విజయవాడనుంచి విశాఖ వెళ్ళేలోగా ఓ పోస్టుకార్డు మీద రాసి - విశాఖపట్నం మా లలిత అక్కయ్య మావగారికి పోస్ట్ చేశారు.

మేమీలోగా ఇక్కడ విజయవాడ వెళ్ళాం కదా! - అక్కడ అమ్మన్నత్తయ్య అనీ మా తాతగారి దాయాదుల సంతానంలో ఒకరు -  ఆవిడ కొడుకు రామకృష్ణగారని విజయవాడలో వుండేవారు.

ఆ అమ్మన్నత్తయ్య, మా అక్కలు, నేను -  అందరం కలిసి మంగళగిరి వెళ్ళాం.

చక్కగా నడుచుకుంటూ మెట్లెక్కి కొండ మీదికి వెళ్ళాం.

పూజారి ఏదో పనుండి కిందికి వెళ్ళాడు. ఎంతసేపటికీ పైకి రావట్లేదు.

ఈలోగా నేను మా అమ్మన్నత్తయ్య దగ్గరికెళ్ళి "చూడు అమ్మన్నత్తయ్యా - నువ్వు కూడా స్నానం చేసి మంచి పొత్తుపంచె కట్టుకొచ్చావ్ - ఆ శఠగోపం ఏదో మా నెత్తిన పెట్టి, ఆ ప్రసాదం ఏదో పెట్టేస్తే మనం కిందకి వెళ్ళిపోవచ్చు కదా - ఎంతసేపుంటాం ఇక్కడ ఇలా మనం?" - అన్నాను.

పాపం - ఆవిడ " వద్దురా బాబూ. ఆయన మళ్ళీ వచ్చి ఏమన్నా అనుకుంటాడు - మనకొద్దులే - కాసేపు కూర్చుందాంలే" - అంది.

"అలా కాదు చేయవమ్మా తల్లీ. ఏమనుకోడు - నేను చెప్తాను కదా ఆయన్తోటి?!" - అనేటప్పటికి మా అమ్మన్నత్తయ్య - వెర్రావిడ - గబగబా వెళ్ళి ఆ పళ్ళెం పట్టుకొచ్చేసి - ఆ శఠగోపం మా నెత్తిన పెట్టేసి, తీర్థం చేతుల్లో పోసేసి, పూలు, ప్రసాదం పెట్టేసింది.

ఈ లోపులో పూజారి రానే వచ్చాడు. వచ్చి ఇంక ఆయన ఒక మాట కాదు - "తల్లీ - ఈ పనేంటిది ? నేనిదంతా సంప్రోక్షణ చేసుకోవాలి - ప్ర్రాయశ్చిత్తం చేసుకోవాలి - అంతా అపవిత్రం చేశారు - వెళ్ళండి" - అని తెగ వాయించి పడేశాడు.

పాపం - మా అమ్మన్నత్తయ్యకి మొహం చిన్నదైపోయింది. నేనెళ్ళి దూరంగా మెట్ల దగ్గర మాట్లాడకుండా కూర్చున్నాను.

కిందకి దిగి బస్సెక్కి విజయవాడ వస్తూ ఉంటే - మా అక్కలిద్దరూ, అమ్మన్నత్తయ్య - ఈ విషయం చెప్పుకుంటూ ఉంటే బస్సులో విన్న వాళ్ళందరూ ఒకటే నవ్వు.

ఆ తర్వాత విజయవాడలో ఇంకో రెండు రోజులుండి - విశాఖపట్నం బయల్దేరాం. నేను - మా ఇద్దరక్కయ్యలూ, వాళ్ళ పిల్లలూ.

విశాఖపట్నంలో రైలు దిగి రిక్షాలు చేసుకుని ఇంటికి చేరాం - మేం గుమ్మంలో దిగేటప్పటికి - నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు అందరూ అక్కడ.

నన్ను చూసి నవ్వుతున్నారు - ఏమయిందా అని నేనకుంటూ వుంటే - లోపలి వెళ్ళగానే మా మావయ్యగారు - మా అక్క మావగారు" ఏం పని చేశావయ్యా బాబీ నువ్వు? " అన్నారు ఎదురొచ్చి.

"నేనేం చేశానండి ?" - అని నేను .

"ఆ పళ్ళయ్యని జైల్లో పెట్టించావు కదా?" అన్నారాయన.

"నేను పెట్టించడమేంటండి?"  - అన్నాను అయోమయంగా.

అప్పుడాయన అనాతవరం నుంచి మా నాన్నగారు రాసిన పోస్టుకార్డు సంగతి చెప్పారు.

అలా నేను ప్లాట్‌ఫారం టికెట్టు తీయించకపోవడం పళ్ళయ్యకి జైలు యూనిఫారం వేయించింది.


<వచ్చేనెల తరువాయి కథ>



5, ఆగస్టు 2017, శనివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 3 - మూడాటలు-ఆరుస్వారీలు

గతనెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 2 - ఇంటూ-ఫస్టుఫారం టూ ఫోర్తుఫారం


నేను థర్డ్‌ఫారంలో వుండగా - మా అన్నయ్యకి - అంటే వడ్లమాని సోమేశ్వరరావుగారు ఆయన పేరు - నాని గారంటారు -  ఆయన పెళ్ళి  కాకినాడ-గాంధీ నగర్‌లో మా వదినగారి మేనత్తగారి ఇంటి దగ్గర జరిగింది.

అనాతారం నుంచి - వూళ్ళోవాళ్ళు,  బంధువులు, మా నాన్న గారు, మేమందరం - చగ్గా కోటిపల్లి వరకు వెళ్లి - కోటిపల్లిలో గోదావరి దాటి - SRMT బస్సుల్లో కాకినాడ పెళ్ళికి తరలి వెళ్ళాము అందరమునూ.

మా దివాణం ఇంట్లో ఓ పే... ద్ద  విసనకర్ర  ఉండేది. అది ఎంత పెద్దదంటే - మామూలు విసనకర్రలకి  పదిరెట్లు ఉంటుందన్న మాట. దాన్ని ఊపుతూ విసరడానికి మా ఆస్థాన క్షురక-విద్వాంసుడు వీరన్న అని ఉండేవాడు. 

ఆ విసనకర్ర-వీరన్న, నన్ను సినిమాలకి తీసుకెళ్ళే పళ్ళయ్య - వీళ్ళు కూడా పెళ్ళికి మాతో కాకినాడ వచ్చారు.

అది మూడు రోజుల పెళ్ళి. ఆ రాత్రి పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక సదస్యం, మర్నాడు నాగవెల్లి.

మర్నాడు పొద్దున్న పూట పన్లేవీ లేవు.

కాకినాడలో కుళాయిచెరువు అని - గాంధీ నగర్ పక్కన  రామారావు పేట దగ్గరుంటుంది.

ఆ కుళాయి చెరువు పక్కన పేద్ద గులాబ్జాం తోట ఒకటుండేది.

మా కుర్రాళ్ళందరూ - అసలే న-వాల-(వా)-నరావతారులం కదా! - అలవోకగా తోటలో అలా దూరి - అవలీలగా చెట్లెక్కి - ఆ గులాబ్జాంపళ్ళు - అందినవి అందినట్టు, అందనివి అందిపుచ్చుకుని - కోసుకుని - తింటూ మళ్ళీ వెనక్కి పెళ్ళివారింటికి వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాం.

మాతో పాటే - వీరన్న, పళ్ళయ్య కూడా వచ్చారు.

గాంధీ నగర్‌పార్కు  దగ్గరకొచ్చేటప్పటికి - వీరన్న మెల్లిగా నా పక్కకొచ్చాడు.

"బాబీగారూ! నేనొకటికి వెళ్ళాలి. కడుపుబ్బరంగా వుంది. ఎక్కడెళ్ళాలో తెలియట్లేదు. ఎక్కడెళ్ళాలండి?" అన్నాడు.

అప్పుడే పార్క్ దగ్గరకి వచ్చాం కదా!

నేను చుట్టూ చూసి - "ఈ పార్కంతా మనోళ్ళదే  - మనదే ఈ స్థలమంతా -  అంచేత నీ ఇష్టం!  ఎక్కడో అక్కడ కానిచ్చేసేయ్" అన్నా.

అనగానే వీరన్న గబగబా పార్క్ గోడ దగ్గర పనికానిచ్చుకున్నాడు.

అది ఓ పోలీసాయన చూసి -  వీరన్నని పట్టుకుని తీసుకెళ్ళి  పోలీస్‌స్టేషన్‌లో కూర్చోపెట్టేశాడు. మేం కుర్రాళ్ళం, మాతోపాటు పళ్ళయ్య - భయపడి పరిగెట్టుకుంటూ వచ్చేశాం ఇంటికి.

ఈ లోపులేమో - వధూవరులకి - విసనకర్ర విసరాల్సిన టైం వచ్చింది.

మా నాన్నగారేమో - "ఏడీ వీరన్న? పిలవండి"  అంటే - అప్పుడు పళ్ళయ్య - వీరన్నని పోలీసులు తీసుకు పోయారు - అంటూ - భయపడుతూనే జరిగిన సంగతి చెప్పాడు.

అయ్యో అని చెప్పి - అప్పుడు మా వదినగారి తండ్రి పేరి ప్రసాదరావుగారు, మా వదినగారి మేనత్త భర్త అయిన  శిఖా  కామేశ్వరరావుగారు - వీళ్ళిద్దరూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి వీరన్నని విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చారు.

అదుగో - అలా తెలిసీ తెలియని వయసులో - ఆడుకుంటూ-పాడుకుంటూ - అన్నిటినీ చులాగ్గా తీసుకుంటూ - నెమ్మదిగా ఫిఫ్తుఫారం దాకా వచ్చాను.

ఫిఫ్తుఫారంలో ప్రవేశించేటప్పటికి నాకు గుర్రపు స్వారీ అదీ బాహా అలవాటైపోయింది.

అదెలా అంటే...

నేను లెక్కల్లోనూ, ఇంగ్లీషులోను బాగా పూరు. అందుకని మా నాన్న గారేం చేసారంటే - లెక్కలూ, ఇంగ్లీషు ప్రైవేటు చెప్పే ముక్కామల కృష్ణ మూర్తిగారికి - మా ఇంట్లో ఓ మూడు గదులు  అద్దెకిచ్చారు - ఒక పోర్షన్ కింద.

ముక్కామల కృష్ణ మూర్తిగారికి - సుబ్బారావు, శేషగిరిరావు అని ఇద్దరు మగపిల్లలు - బాగా చిన్నవాళ్ళు.  ఆయన, ఆయన భార్య, తల్లి, ఓ తమ్ముడు - వీళ్ళందరూ ఆ ఇంట్లో ఉండేవారు.

నాతో పాటు మా వూళ్ళో కుర్రాళ్ళు - నాయనరాజుగారి సూరిగాడు, నారాయణమూర్తి సత్తిగాడు, మెహబుల్లా అని ఓ ముస్లిమూ- ఇలా మొత్తం ఏడెన్మండుగురు ప్రైవేటుకి వచ్చేవాళ్ళు.  రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటలవరకు చదువు. తర్వాత అరుగుమీదే పడుకునేవాళ్ళం.

నాకసలు చీకటన్నా, దొంగలన్నా, ఆఖరికి పాములన్నా - అందరూ చీకటి రాత్రుల్లో అనవసరంగా తలచుకుని అంతకన్నా అత్యనవసరంగా భయపడిపోయే దెయ్యాలన్నా - భయం లేదు.


అందరూ పడుక్కున్నాక - పదీ-పదిన్నరకి గంటలకు లేచేవాళ్ళం - నేను, నాయనరాజుగారి సూరిగాడు. లేచి - స్మశానానికి వెళ్ళేవాళ్ళం.

ఆ సమయంలో అక్కడ గుఱ్ఱబ్బండివాళ్ళ గుఱ్ఱాలు గడ్డి మేస్తూ ఉండేవి. అవి రాత్రల్లా స్మశానంలో గడ్డి మేసి ఏ తెల్లవారుఝామునో ఇంటికి తిరిగి వెళ్ళేవి.

నేను వెళ్తూ నాతోపాటు ఒక కొబ్బరితాడు పట్టికెళ్ళేవాడిని.

అప్పటికి గుఱ్ఱానికి - నాలిక పైకెత్తి కింది దవడకి కళ్ళెం ఎలా వెయ్యాలో నేర్చుకున్నాను. అంతే - గడ్డి మేస్తున్న గుఱ్ఱాల్లో ఒకదాన్ని పట్టుకుని - దానికి కళ్ళెమేసి - దాన్నెక్కి నెమ్మదిగా చెరువు గట్టున స్వారీ చేస్తూ ఉండేవాణ్ణి. మళ్ళీ రాత్రి ఏ పన్నెండు, ఒంటిగంటకో గుఱ్ఱాన్ని విదిలేసేవాణ్ణి.

ఇదంతా ఎవరికీ తెలీకుండా చేసేవాణ్ణి.

ఓ రోజు మంచి వెన్నెలగా వుంది. రోజూలాగే ఓ గుఱ్ఱాన్ని పట్టుకుని ఎక్కి - ఇవాళ పొలం వైపు వద్దు - ఊరి వీధుల్లో తిరుగుదాం - అనుకుని రెండో వీధిలో తిరుగుతున్నాను - పాండురంగమహాత్మ్యంలో ఎన్టీఆర్ లాగా తెల్ల చొక్కా వేసుకుని.

అదేమో మహాపేచీ-గుఱ్ఱం - ఓ పట్టాన లొంగలేదు. ఎలాగో లొంగదీసుకుని కళ్ళెం వేశాను. మాంచి దౌడు మీద వెళ్తోంది.

రెండోవీధిలో చిన్నమేష్టారు ఓరుగంటి అప్పారావు గారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆ పెంకిగుఱ్ఱం ముందు రెండు కాళ్ళు తన్నిపెట్టి తలకాయ వంచేసి - హఠాత్తుగా ఆగిపోయింది. దాంతో - చిన్నమేష్టారి ఇంటికి వున్న ఇనుపగేటు మీద పడిపోయాను. ఆ గేటుకి ఇనపఊసలు - బల్లేల్లా ఉండేవి. అందులో ఒక ఊస కంటి పైన దిగిపోయింది. ఇంకా - నయం కన్ను పోలేదు.

నా తెల్లచొక్కా అంతా ఎర్రగా రక్తం. ఒక్కసారిగా "అయ్యబాబోయ్" అని అరిచాను. ఆ ఎదురుగుండా కృష్ణమూర్తిగారి కాముడు అని ఉండేవారు - అనిపిండివారు. నా అరుపు విని లేచొచ్చి - నా దెబ్బ చూసి - "అమ్మయ్యో-ఎంత రక్తమో" అంటూ నా చొక్కానే విప్పి కట్టుకట్టి ఇంటికి తీసుకెళ్ళారు.

ఇంటికి వెళ్ళగానే - మా నాన్న ఆ రక్తం అదీ చూసి - అంత రాత్రిపూట ఏదో దెబ్బలాటకెళ్ళి తన్నులు తినొచ్చాననుకుని - నాకు దెబ్బ తగిలిందని కూడా చూడకుండా - ఇంకో నాలుగు దెబ్బలు గా...ఠిగా వడ్డించారు.

ఇంతలో గమ్మున మా అమ్మ - "అయ్యో పిల్లాడికి దెబ్బ తగిలింది" - అంటే అప్పుడు చూసి ఆయన - మా పొలాలు అవీ చూసే దాట్లరాజుగారిని పిలిచారు. ఆ రాజుకిగారికి కొంచెం ఆయుర్వేదం తెలుసు. ఆయనచేత కట్లు కట్టించి - అంత రాత్రిపూట గుఱ్ఱబ్బండి కట్టించి - మా నాన్న, నేను, దాట్లరాజుగారు కలిసి - అమలాపురంలో - MBBS డాక్టర్ మంథా  సుబ్బారావుగారని - మా వదినగారి చుట్టం ఉండేవారు - ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి రాత్రి రెండున్నరో-మూడో అయింది. అక్కడ పప్పు సత్యం గారని కాంపౌండరు ఉండేవారు. ఆయన్ని లేపుకొచ్చారు. డాక్టరుగారు - దెబ్బ చూసి - దీన్నిలా వదిలేస్తే కాదు కుట్టాల్సిందే - అని అన్నారు.

ఆ రోజుల్లో ఏంటంటే - అలా ఏమన్నా దెబ్బ తగిలి కుట్టాలంటే - అనస్తీషియా ఇచ్చేవారు కాదు - సూదిలో దారమెక్కించి బొంత కుట్టినట్టు కుట్టేసేవారు.

నేను - డాక్టరుగారి మాట వినగానే - కాళ్ళతో చేతుల్తో అందరిని తన్నేసి ఎవర్నీ దగ్గరికి రానీయకుండా, నా దెబ్బని ముట్టుకోనీకుండా - గొడవ గొడవ చేసేశాను.

డాక్టరుగారు - "వీడింక కుట్టనీడు - మచ్చుంటే ఉంటుంది" - అంజెప్పి డ్రెస్సింగ్  చేసేసి మందులిచ్చి పంపించేశారు.

అప్పట్నుంచి - రెండేసి రోజులకొకసారి - మా మేనత్తకొడుకు నాగన్నకి సైకిలిచ్చి - నన్ను వాడితో అమలాపురం పంపించి - డ్రెస్సింగ్ మార్పించేవారు. నెమ్మదిగా ఆ దెబ్బ తగ్గిపోయింది.

అలా అని గుఱ్ఱాలెక్కడం మానలేదు. పైగా వాటినెక్కి పంట బోదెల్లొ ఇట్నుంచి అటు దూకిస్తూ వుండేవాణ్ణి. ఓసారి అలా దూకిస్తుంటే కళ్ళెం తెగిపోయి బోదెలో పడి ఎడం చెయ్యి విరిగింది.  మళ్ళీ దానికో కట్టు.

మా నాన్న అమలాపురం వెళ్ళడానికి గుఱ్ఱబ్బండి వచ్చేది. ఆ బండతనికి మా అమ్మ - ఏదో ఒక టిఫిను, కాఫీ తినడానికి-తాగడానికి ఇచ్చేది. అతను సందులోంచి పెరట్లోకి వెళ్ళి తింటుండగా - ఈ లోపులో నేను ఆ బండేసుకుని మూడు వీధులూ తిరిగొచ్చేవాణ్ణి.

"అయ్‌బాబోయ్! బాబీగారు బండేసుకుని వెళ్ళిపోయారండి ! " అని వెతుక్కుంటూ వచ్చేవాడు బండతను.

అప్పటికి మా నాన్న కొట్టడం తగ్గించారు - కళ్ళెఱ్ఱజేసేవారు అంతే.

ఈలోగా అమలాపురానికి కొత్తగా రిక్షాలొచ్చాయి. రిక్షా వచ్చి ఇంటిముందు ఆగితే అది కూడా వేసుకెళ్ళిపోయి మూడు వీధులూ తిరిగి తొక్కేసేవాణ్ణి.

ఈలోగా విత్-హెల్డ్ నుంచి మామూలు హాజరుకొచ్చేశాను. నడక-పనిష్మెంటు కూడా ముగిసిపోయింది. ఆ రోజుల్లో - ర్యాలీ, హెర్క్యులెస్, రాబిన్‌హుడ్ - అని మూడు రకాల సైకిళ్ళు ఉండేవి. నాకు మా నాన్న రాబిన్‌హుడ్ సైకిలు కొనిచ్చారు.

ఆ సైకిలు మీద భీమనపల్లి హైస్కూలుకి వెళ్ళడం, రావడం - స్కూల్లో కబడ్డీ, బాల్-బాడ్మింటను, బేస్‌బాలు - లాంటి స్పోర్ట్స్ ఆడేవాణ్ణి.  అమలాపురం, కొత్తపేట, ముక్తేశ్వరం- స్కూళ్ళతో గ్రిగ్స్ ఆటలపోటీలు ఉండేవి.

అలా మూడు స్వారీలు-ఆరు ఆటలుగా ఫిఫ్తుఫారం గడిచింది.

<వచ్చేనెల తరువాయి కథ>

2, జులై 2017, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 2 - ఇంటూ-ఫస్టుఫారం టూ ఫోర్తుఫారం

గత నెల కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 1 - పెద్దొకటి

ఊఁ - సరే. పెద్దొకటి అయిపోయింది.

అయిపోయింతర్వాతేమో -  నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూలు కెళ్ళాను.

వెళ్తే - పాపం - మా రాజుమేష్టారు "ఒరే  నువ్వెళ్ళి రెండో క్లాసులో కూర్చోరా - నా ఒకటి పాసైపోయావు" అన్నాడీయన .

అంటే - సరే వెళ్లి రెండో క్లాసు  - రెండో క్లాసు మూడో క్లాసు అంటే  ఏంటంటే - ఓరుగంటి అప్పారావుగారని మన కాలిఫోర్నియాలో వుంటాడు - రమేషు  - వాళ్ళ తాతగారు - ఆయన్ని చిన్నమేష్టారు అనేవాళ్ళం - ఆయన దానికి టీచరు.

రెండో క్లాసుకేమో ఒక వరస బెంచీలు. వాళ్లెదురుగానే మూడో క్లాసు వాళ్ళు ఒక వరస బెంచీలు.

ఈ మూడో క్లాసు వాళ్ళెవరంటే - నాతో పాటు  ఒకటో క్లాసు చేరిన వాళ్ళే!

వాళ్ళు నా కన్నా ముందెళ్ళిపోయారు కదా! - అందుకే ఆ వరసలో వాళ్ళు కూర్చున్నారు.

వాళ్ళెదురు వరసలో మేము కూర్చునేవాళ్ళం - నేను, నారాయణరాజుగారి సూరి గాడు.

మేమేమిద్దరమే పెద్దొకటి చదువుతా.

సరే - ఇదయింతర్వాత - మొత్తం రెండో క్లాసు ఐపోయింది. మళ్ళి ప్రమోషన్ నెక్స్ట్ ఇయర్కి.

మూడో క్లాసు - ఇట్నించి వెళ్ళి ఆ బెంచీల్లో కూర్చున్నాం.

అప్పుడేదో - మా చిన్నమేష్టారు - ఏవో చిన్నచిన్న వేమన పద్యాలు, సుమతీ శతకాలు చెప్తుండేవారు.

అవన్నీ వల్లె వేసుకుంటూ నేర్చునేవాళ్ళం.

కాపోతే మనసులో బాధేంటంటే - నాలుగైదు క్లాసులకి పెద్ద బెంచీలుండేవి.

ఒకటి, రెండు, మూడు క్లాసులు నేల బెంచీలు - అవేమో పెద్ద బెంచీలు.

నాతోటి చేరిన వాళ్ళు - నాకన్నా ముందు ఒకటో క్లాసు పాసైపోయినవాళ్ళు ముందు వున్నారు కదా - వాళ్ళెళ్ళి పెద్ద బెంచీల మీద  కూర్చుని - నేనేమో ఇక్కడ నేల బెంచీ మీద కూర్చునేవాణ్ణి.

నన్ను వెక్కరించే వారాళ్ళు.

సరే - మొత్తానికి - ఎలా అయితేనేం ఆ సంవత్సరం కూడా చిన్నంగా ఏదో ఇబ్బంది పడుతూ లాగించేశాం .

నాలుగో క్లాసు జాయిన్ అయ్యాం.

దానికేంటంటే - మరువాడ అప్పారావుగారని ఆయన హెడ్మాస్టరుండేవారు - పెద్దమేష్టారు అనేవాళ్ళమాయన్ని.

ఆయనేమో రిటైరయిపోయి - ఆయన కొడుకు మరువాడ శంకరం గారని చెప్పేసి - ఆయన హెడ్మాస్టరక్కడ. నేనంటే మంచి అభిమానం అదీనూ.

ఆ పెద్ద బెంచీలు రెండు వరసల్లో ఉండేవి -ఒక వరస ఐదో క్లాసు, ఒక వరస నాలుగో క్లాసు. ఈ రెండు క్లాసులు కూడా శంకరంగారే చూసేవారు.

సరే - ఓ మూణ్ణాలుగునెల్లు గడిచిపోయింది. ఈలోగా శంకరంగారు - పాపం - ఆరోగ్యం బావులేక - ఆయన పరమపదించారు.

ఒక పదిహేను రోజులు, నెల్లాళ్ళపాటనుకుంటా - ఎవరూ టీచర్ లేరు మాకు.

చిన్నమేష్టారే వచ్చి ఆ క్లాసులకీ చెప్తుండేవారన్నమాట.

ఒక నెలతర్వాత ఒక కొత్తయనొచ్చారు టీచరు - సూర్యనారాయణగారని చెప్పేసి.

ఇంత లావుగా ఉండేవారు - కుర్చీ నిండా ఉండేవారు ఏనుగులాగా.  ఎందుకో ఆయన నాకు నచ్చలేదు - ఫస్టు నించీ కూడా.

దానికి తోడేమో నా ఎదురు బెంచీల్లో కూర్చునేవాళ్ళు - ఐదో క్లాసు కదా! వీళ్ళందరూ అప్పుడప్పుడు మమ్మల్ని వెక్కిరిస్తూ ఉండడం - ఇవన్నీ జరుగుతూ వుండేవన్నమాట.

ఈలోపులో నాలుగో క్లాసుకొచ్చేటప్పటికే కొంచెం నాకు - ఈ తెలుగులో భాషాప్రవీణ్ణుడయ్యాను- కొద్ది తెలివితేటలబ్బుతున్నాయన్నమాటప్పుడే.

మా ఎలిమెంట్రీ స్కూల్లో సిమెంటు స్తంభాలుండేవి. ఆ స్తంభాలమీద సూక్తులు రాసేవారు - విద్య లేని వాడు వింత పశువు, విద్య యొసఁగు వినయంబు - అటువంటి సూక్తులుండేవి.

ఓ రోజేం చేశానంటే - చాక్పీసు తీసుకుని ఆ విద్య లేని వాడు వింత పశువు అనే దగ్గర - ఆ లేని కింద ఇంటూమార్కు పెట్టి - పైనేమో - విద్య నేర్పినవాడు వింతపశువు - అని పెట్టా.

మర్నాడు మా సూర్నారాయణ మేష్టారు చూశాడు. చూసి "ఎవడ్రా - ఈ భాషాపండితుడెవరు తెలుగు లోనూ ?" అనేటప్పటికి  - మా ఎదురు బెంచీ వాళ్ళు - నా మీద కోపం కదా వాళ్ళకీ - "ఇదో ఈ బాబే రాసేశాడండీ - బాబోయ్ - బుల్నారాయణగారి బాబీ రాసేశాడండీ - అంటూ గోలగోల చేసేశారు.

ఆయన దెగ్గరికి పిలిచి - "బానే నేర్చుకున్నావురా తెలుగు నువ్వూ - ఏది - ఏ చేత్తోటి రాశావ్? - చూపెట్టు - ఆ చెయ్ చూపెట్టూ!" - అన్నాడు.

అన్నాక ఆ చెయ్యి తిప్పి తీసుకుని డ్రాయరు సొరుగులో పెట్టి నొక్కేశాడు.

ఇంకల్లాడి పోయానన్నమాట. "అయ్‌బాబోయ్" - డాన్సు కట్టేహానక్కడ.

సరే - అలా - ఇంకలాగైపోయింది - ఏడ్చుకుంటూ వచ్చి కూర్చున్నాను. 

ఇంకసలిక్కడ చదవకూడదు - ఈయనదగ్గర అసలు చదవకూడదు - అంజెప్పి - రెండు బాధలు - ఒకటి ఆయన కొట్టాడు - ఆయన దగ్గర చదవకూడదు అనేదొకటి - రెండు ఒకటో క్లాసు నాతొ జాయినైనవాళ్లు నాకన్నా ముందు హైస్కూలుకెళ్ళిపోతారనే బాధ ఇంకొకటి.

ఈ రెండు దృష్టిలో పెట్టుకుని - అసలింక - ఇంటికెళ్ళిపోయి మా నాన్న దగ్గర చెప్పేవాణ్ణి కాదు - మా అమ్మ దగ్గరే - వెళ్ళి - "నేం చదవనింక  ఈ స్కూల్లో - నేను పొలమెళ్ళిపోతాను - లేదంటే నన్ను హైస్కూల్లో జేర్చేయండి" - అంటే సరే మా అమ్మ మా నాన్నతో - "వీడు హైస్కూల్లో జేరిపోతానంటున్నాడు" - అంటే - "అప్పుడే అన్ని తెలివి తేటలొచ్చేశాయా వీడికి - ఐదవ క్లాసు చదవకుండానూ?"  - అన్నారు మా నాన్న.

అప్పుడు - ఇంటూ ఫస్ట్ ఫారం అని ఉండేది. ఫోర్త్ క్లాసులో  ఇంటూ-ఫస్ట్ ఫారం పరీక్షలు రాస్తే - మనం పాసైతే డైరెక్టుగా ఫస్టు ఫారంలో జాయినైపోవచ్చు.

"సరే - చూద్దాం అప్పటి సంగతి  - ముందు ఈ నాలుగో క్లాసు పూర్తవనీ" - అన్నారు.

నాలుగోక్లాసు పూర్తయింది.

ఈ లోపులో - ఈ మధ్యకాలంలో ఏంటి - నాకు సూర్నారాయణ మేష్టారి మీద కోపం వుంది కదా నాకు ?

నాలుగో క్లాసులో ఉండగానే అట్లతద్దొచ్చింది.

అట్లతద్దికేంటంటే - ఊళ్ళో ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ తెల్లవారుఝామున లేచి గోంగూరపచ్చడి, ఉల్లిపాయపులుసు వేసుకుని అన్నం తినేసి - తెల్లవారుఝామున నాలుగింటికి - తాంబూలాలేసేసుకుని - ఇంక బయటపడి ఆ వెన్నెల్లో చక్కగా -ఉప్పట్లు ఇవన్నీ ఆడుకునేవాళ్ళం.

ఈ మేష్టారు అద్దెకున్న ఇంటి ముందు ఆట మొదలు పెట్టాం.

అంతకు ముందు రోజు ఏం చేహానంటే - ఈ సంగత్తెల్సు - ఇక్కడే ఆడతామని చెప్పి. పొలమెళ్ళి పచ్చి ఆవుపేడ బంతులు తయారు చేశాను. వాటినేమో ఇసుకలో పొర్లించి నీటుగా తయారుచేసి ఓ సంచిలో పెట్టుకున్నాను.

పెట్టుకుని తెలవారుఝామున ఈ ఆటలకొచ్చాం. మా మేష్టారు తెల్లవారుఝామున లేచి బాత్రూంకని బయటికి వచ్చాడు. ఆ చీకట్లో వెనకనించి ఆ బంతులు పెట్టి ఆయన్ని కొట్టేహాను. ఆయన ఒళ్ళంతా పేడైపోయింది. పారిపోయాను.

పారిపోయింతర్వాత - ఇదెవరు చేశారో ఎవరికీ తెలీదు. నా మీద డౌటే ఆయనకి - వీడే చేసుంటాడని. ఎందుకంటే - ఆ ఊళ్ళో అవతారంగారి నారాయణగారంటే - ఆయన ఓల్డ్ BA - పైగా దివాణం. ఆయన మీదేంటంటే ప్రేమతో కూడిన అభిమానంతో కూడిన గౌరవం ఉండేది. నారాయణగారి బాబిగాడంటే భయంతో కూడిన ప్రేమతో కూడిన అభిమానముండేది. ఎందుకంటే - వీడో అల్లరి వెధవ ఎక్కడ రాళ్ళేస్తాడో మీదని చెప్పేసి. ఆయనకి డౌటుండేది - ఆ డౌటు బయట పెట్టకుండా - పాఠం రాలేదని  వేరే వంకేదో పెట్టి కొట్టేహాడు.

సరే - ఇంకీయన దగ్గర చదవకూడదని చెప్పేసి - నాలుగో క్లాసు అవగానే ఇంటూ-ఫస్టుఫారం పరీక్షలు రాసేశాను.

నాతో మొట్ట మొదట చదివిన వాళ్ళతో కలిసి హైస్కూలుకి వెళ్ళిపోయాను - భీమనపల్లి హైస్కూల్ - సిరంగు రంగనాయకమ్మ హైస్కూల్. తర్వాత జిల్లా పరిషత్తు అయ్యింది. అందులో వెంట్రప్రగడ జగన్నాథరావుగారని చెప్పేసి ఆయనేమో హెడ్మాస్టరు.

తర్వాత మన ఊళ్ళో అనాతవరంలో తెలుగు టీచర్స్ ఉండేవాళ్ళు - ఆకెళ్ళ సుబ్బారావుగారు, చంద్రశేఖరశాస్త్రిగారు - వీళ్ళందరూ అనాతవరం నించే రోజూ వెళ్తుండేవారు. చంద్రశేఖరశాస్త్రిగారు వాళ్ళు మనకు చుట్టాలే. ఆయన కూడా - జాయిన్ చేసేయండి నారాయణగారూ - అంటే నన్ను హైస్కూల్లో చేర్చేశారు. ఫస్టుఫారం , సెకండుఫారం, థర్డుఫారం - చెప్పుకోదగ్గవేమీ లేవు. ఏదో సరదాగా బడికెళ్ళడం, రావడం గడిచిపోతూ ఉండేది.

ఇంటి దగ్గర అల్లర్లవీ మామూలే.

ఒకసారి సెలవులకి అమ్మ, నాన్న , నేను శివకోడు వెళ్ళాం - మా మేనమామగారి ఊరు. మాతామహుల ఊరు. మా తాతగారు, అమ్మమ్మ అందరూ ఉండేవారు.

ఆ శివకోడు వెళ్ళినప్పుడు అంతకు ముందు రోజు రాత్రే నేను సినిమాకు వెళ్తానని గొడవ చేశాను. పంపించలా. పంపించకుండా - "అస్తమాను సినిమాలేంటి - ఆడుకోండి" - అని కసిరేసింది మా అమ్మ.

మర్నాడు సాయంత్రం నాలుగింటికి అందరూ శివాలయానికి బయల్దేరారు - మా అమ్మ, మా అత్తయ్య, మా అమ్మమ్మ, ఆడపిల్లలు - వీళ్ళందరూ కూడా.

నేను సినిమాకి పంపలేదని కోపం ఆపుకోలేక దోసిళ్ళతో ఇసక తీసుకెళ్ళి వాళ్ళ తలల మీద పోసేసి పారిపోయాను.
ఇంక వాళ్ళు గుడి కెళ్ళడం  మానేసి ఇంట్లో కొచ్చి - తలంతా ఇసక కదా - తలంట్లు అవీ పోసుకుని వాళ్ళ బాధలేవో వాళ్ళు పడ్డారు.

నేను దొరకలేదు వాళ్ళకి. మహా కోపంగా వుంది.

మా నాన్న కూడా వీధరుగు మీదే కూర్చున్నారు కానీ ఆయనా చూళ్ళేదు నన్ను.

వెనకనుంచి పెరట్లోంచి ఇంట్లోకి వెళ్ళిపోయి - మా మావయ్య గారింట్లో చాకలికి వేసే బట్టల కోసం పెద్ద పెట్టి ఉండేది. దానికి జాలీలవీ గాలి పోవడానికి ఉండేవి. దాన్నిండా ఉతకాల్సిన బట్టలున్నాయి.

నేను వెళ్ళిపోయి - సగం బట్టలు తీసేసి అందులోకి దిగిపోయి ఆ బట్టలు నా నెత్తిమీద కప్పేసుకున్నాను. ఆ బట్టల పెట్టిలో అలా ఉండిపోయాను. కాసేపటికి నిద్రొచ్చేసింది నాకు - నిద్ర పోయాను లోపలే.

చాకళ్ళు సాయంత్రం వచ్చి బట్టలు పట్టికెళ్ళేవాళ్ళు. సాయంత్రం ఆరింటికో ఎప్పుడో చాకలి మనిషి వచ్చింది. వచ్చి ఆ బట్టలు తీసినప్పుడు - అప్పుడే మునిమాపు చీకటి పడుతోంది - లోపలేదో ఆకారం కనపడి "అయ్యబాబోయ్" అని పెద్దగా అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మండువాలో పడిపోయింది.

ఏంటేంటి అని అందరూ అడుగుతుంటే - "బాబోయ్ - ఆ బట్టల పెట్టిలో ఎవరో వున్నారండి బాబూ" - అని గొడవ గొడవ చేసేసింది.

గబగబా వచ్చి చూస్తే నేనున్నాను లోపల - నిద్ర పోతూ. నన్ను తట్టిలేపి మా అమ్మ పైకి తీసుకొచ్చింది.

మా అమ్మమ్మ - ఆవిడకి నేనంటే పాపం మహా జాలి. ప్రేమెక్కువ - "వాణ్ణి ఏమనకే పాపం ఏదో సినిమా అని అడిగాడు"  అంటే మా అమ్మ - "అబ్బెబ్బే ! నేను వాణ్ణేమంటానూ !? రేప్పంపిస్తాను సినిమాకీ. రేపెళ్దువుగానీ సినిమాకి రా నాయనా " - అని చక్కగా గాదె సావిట్లోకి తీసుకెళ్ళి పిక్కపాశాలు పెట్టేసింది.

గట్టిగా కేకలు పెట్టాననుకో మళ్ళీ మా నాన్నొచ్చి మళ్ళీ ఇంకో నాలుగు పీకుతారు నన్ను - అందుకని  గట్టిగా నా నోరు మూసేసింది.

ఆ రోజలా గడిచింది కానీ మర్నాడు నన్ను సినిమాకి పంపించారు.

అదుగో - అదొక్కసారే మా అమ్మ నన్ను కొట్టింది. మళ్ళి ఎప్పుడూ కూడా నన్ను కొట్టలేదు. అదే ఫస్టు అదే లాస్టు.

శివకోడు వెళ్ళినా కూడా అక్కడ అందరూ నా ఫ్రెండ్సే. బాబొచ్చాడు - బాబొచ్చాడు అనేటప్పటికి హడావిడిగా వుండేవాళ్ళు అన్నమాట. చెడుగుళ్ళు ఆడడం - ఎక్కడికెళ్ళినా సందడే.

కాకపోతే ఫస్టుఫారం నుంచి  థర్డుఫారం వరకు నేను ప్రాక్టీసు చేసిందేంటంటే - చెట్లు చేమలు ఎక్కడం, చెరువులు, కాల్వలు ఈదడం.

అసలు చెట్ల మీదే ఉండేవాణ్ణి నేను. జీడిమావిడి చెట్లు, నేరేడు చెట్లు, జామచెట్లు - కొబ్బరి చెట్లు కూడా ఎక్కేసేవాణ్ణి - బొండాలకి. ఈత చెట్లెక్కి గెలలు కొట్టుకొచ్చేసేవాణ్ణి.

చెరువు వార్న నేరేడు చెట్లు, మావిడి చెట్లు ఉండేవి. అవెక్కి ఆ కొమ్మలమీంచి చెర్లోకి దూకేసేవాణ్ని. దూకేసి అక్కడ ఈత కొట్టేవాణ్ణన్నమాట. ఆ మూడు సంవత్సరాలూ - ఈ ప్రాక్టీసు సరిపోయింది నాకు.


భీమనపల్లి హైస్కూల్ రెండు కిలోమీటర్లు అనాతవరానికి.  నడిచి వెళ్ళాల్సివచ్చేది. అందుకని మా నాన్నేం చేశారంటే - గొల్ల నారాయడని మాకు పాలు అవీ పోస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. మన పొలం లోనే గేదెలు అవీ మేపుకుంటూ ఉండేవాడు. ఆ గొల్ల నారాయడు అద్దె సైకిళ్ళు పెట్టాడు.

మా నాన్న - ఆ గొల్ల నారాయడికి పురమాయించారు  - "నారాయుడూ! పొద్దున్నే స్కూలుకి తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తీసుకురా" - అని.

రోజూ పొద్దున్నే ఎనిమిదిన్నరకి వచ్చి తీసుకెళ్ళి సాయంత్రం ఐదింటికి తీసుకొస్తూ ఉండేవాడు. ఈ అద్దె సైకిలు వ్యవహారం థర్డుఫారం వరకు నడిచింది. థర్డుఫారం వచ్చేసరికి ఎగ్గొట్టడం ఎక్కువయ్యింది కదా - గొల్ల నారాయడికి హాండిచ్చేసి వెళ్ళిపోయి కోతుల మామ్మగారని ఇద్దరు మామ్మలుండేవారు. ఓ తాటాకిల్లు అదీనూ. వాళ్ళింట్లో చద్దన్నం ఉండేది. నేను, సూరిగాడు స్కూలెగ్గొట్టేసి, ఆ చద్దన్నం తినేసి అక్కడే ఆట్లాడుకుంటూ ఉండేవాళ్ళం.

ఫస్టుఫారం నుంచి థర్డుఫారం దాకా సైకిల్లేదు కదా నాకు. మరి సినిమాకి వెళ్ళాలి ఎలా? సినిమాకెళ్ళాలంటే ఓ రోజంతా పేచీ పెట్టాలి.

పేచీ పెట్టింతర్వాత మా నాన్నేమో నాలుగు తగిలించి - నాలుగు వాయించేసేవారు ముందు - తర్వాత మళ్ళీ జాలి కదా  - మా పొలంలో బొక్కా పళ్ళయ్య అని చెప్పేసి ఉండేవాడు.

ఆ బొక్కా పళ్ళయ్య నిచ్చి - "ఇదిగో పళ్ళయ్యా - వీణ్ణి తీసుకుని సినిమాకి తీసుకెళ్ళు" - అని బెంచీకి టిక్కెట్టిచ్చేవారు. అంటే పెద్ద బెంచీలు.

ఈ బొక్కా పళ్ళయ్య వెళ్ళేటప్పుడు నన్నెక్కించుకుని సినిమాకి తీసుకు వెళ్ళేవాడు.

వస్తూ వస్తూ ఇంటి దగ్గర పురమాయించుకురావడం అనుకుంటాను బొక్కా పళ్ళయ్య పెళ్ళాం, ఓ ముగ్గురు పిల్లలు - వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చేసేవారు అమలాపురం సినిమాకి.

సినిమాలో బెంచి టిక్కెట్టు తీసేవాడు కాదు - నేల టిక్కెట్లు తీసేవాడు - నేల బెంచీలు.

సరే - మనకి సినిమా ముఖ్యం కానీ బెంచీ ముఖ్యం కాదు కదా - చగ్గా సినిమా చూసేసేవాణ్ణి.

సినిమా అయిపోయింతర్వాత ఈ పళ్ళయ్య ఏం చేసేవాడంటే - నన్నేమో వెనకాల సైకిలు కారేజ్ మీద కూర్చోపెట్టేవాడు. సీటు మీద ఆయన కొడుకొకడు. ముందు కడ్డీ మీద ఇద్దరు కొడుకుల్ని కూర్చోపెట్టి - సైకిలు నడిపించుకుంటూ పళ్ళయ్య, పెళ్ళాం  - అమలాపురం నుంచి అనాతవరం ఎనిమిది కిలోమీటర్లు -  నడుచుకుంటూ వచ్చేవారు -  రాత్రి పదకొండు అయిపోయేది ఇంటికొచ్చేటప్పటికి.

మా నాన్న - "ఏంటి ఇంత  లేట్ అయింది పళ్ళయ్యా?"  - అనడిగితే - పళ్ళయ్య - "సైకిలు దారిలో పంచరైపోయిందండి, పంచరేయించుకుని వచ్చేటప్పటికి ఆలస్యం అయిందండి" - అని ఏదో మాయ చేసేవాడు.

నేనూ ఏమీ చెప్పేవాణ్ణి కాదు - సరే - పోనియ్ మన్ని తీస్కెళ్తున్నాడు కదా సినిమాకి అంజెప్పేసి నేనూ మాట్లాడేవాణ్ణి కాదు.  అదీ సినిమాల సంగతి.

అనాతారంలో సుబ్బన్న, వెంకటరెడ్డి అని ఇద్దరుండేవారు. వాళ్ళు పెసర పుణుకులు, బొంబాయి చట్నీ చేస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర చిన్నంగా చేరి మధ్యాహ్నంపూట ఒకటీ అరా తినేసి  అప్పు పెట్టేవాణ్ణి.

వాళ్ళు ఓ వారం పది రోజులయ్యాక ఇంటికొచ్చి మా నాన్న దగ్గరకొచ్చి - "బాబుగారు పెసర పుణుకులు అవీ తిన్నారండి - ఇంతయ్యింది" - అంటే పాపం - తినడానికే కదా అని వీళ్ళు కూడా ఇచ్చేసేవారు. ఆ రకంగా వాళ్ళకి అరువు పెట్టడానికి అలవాటు పడ్డాను నేను.

వీళ్ళు కాకుండా - భీమనపల్లిలో - నారాయణమూర్తి, తాతయ్య అని రెండు హోటల్స్ ఉండేవి. ఆ రెండు హోటల్సులో తీపిగారెలు వేసే వారన్నమాట మధ్యాహ్నం. అక్కడ కూడా అప్పు పెట్టడం మొదలుపెట్టా. మొదలుపెడితే వాళ్ళు కూడా వచ్చినప్పుడు - సరే ఏదో పాపం మధ్యాహ్నం పూట తింటున్నాడు పోనీ  - అంజెప్పేసి ఇంట్లోవాళ్ళు పట్టించుకునేవారు కాదు నన్ను. అలాగే వాళ్ళకీ డబ్బులు ఇచ్చేస్తూ ఉండేవారు. థర్డుఫారం దాకా అలాగే ఆడుతూ పాడుతూ గడిచిపోయింది.

థర్డుఫారంలో స్కూల్ ఎక్కువ ఎగ్గొట్టాను కదా - అందుకే ఫోర్త్ ఫారంలోకి వెళ్ళాక - పరీక్ష పాసయ్యి ఫోర్తుఫారంలోకి వెళ్ళాను కానీ విత్-హెల్డ్ అని రాశారక్కడ. ఎందుకు రాశారంటే అటెండెన్స్ తక్కువయ్యింది. థర్డుఫారం క్లాసులోనేమో అటెండెన్స్ వేయించుకోవాలి. పాఠాలు వినడానికి ఫోర్తుఫారం క్లాసుకెళ్ళాలి.

ఫోర్తుఫారంలో ఎప్పుడైతే విత్-హెల్డులోకి వచ్చానో  - అప్పుడు మా నాన్న కర్రా చంద్రశేఖరశాస్త్రిగారు, ఆకెళ్ళ సుబ్బారావుగారు ఉండేవారు కదా మేష్టర్లు - వాళ్ళని అడిగారు - ఏంటి వీడు విత్-హెల్దేమిటి మళ్ళీ- అంటే - "లేదండి వీడు కూర్చోడం ఫోర్తుఫారంలోను - వెధవకి అటెండెన్స్ తక్కువయ్యింది - ఎక్కడ ఎగ్గొట్టాడో వీడు - అంచేత అటెండెన్సేమో థర్డుఫారంలోను" - అని వాళ్ళు చెప్పేటప్పటికీ - నాకేం చేశారంటే ఇంక ఆ సైకిలు కట్ చేసేశారు గొల్ల నారాయుడిది. పనిష్మెంటన్నమాట. "ఇంక నీకు సైకిల్లేదు - రోజూ నడిచి పోయి నడిచిరా"- అన్నారు. అలా ఫోర్తుఫారం అంటా నడక. పొద్దున్నే నడుచుకుంటూ వెళ్ళడం - సాయంత్రం నడుచుకుంటూ రావడం.  ఈలోగా దారిలో సైకిళ్ళ వాళ్ళెవరైనా కనబడితే - ఓరి బాబ్బాబ్బాబూ - కాస్త అనాతారం తీసుకెళ్ళండ్రా అంటే - వాడు మంచివాడైతే వెనకాల ఎక్కమనేవాడు - లేపోతే నువ్వు తొక్కు, నే కూర్చుంటా - అనేవాడు. నేను సైకిలు తొక్కడం వాడు వెనకాల కూర్చోవడం.

అలా ఫోర్తుఫారం గడుస్తూ వుంది.

<వచ్చేనెల తరువాయి కథ>

2, జూన్ 2017, శుక్రవారం

అవతారంగారి నారాయణగారి బాబి - 1 - పెద్దొకటి

అనగనగా తూర్పుగోదావరిజిల్లాలో ఒక అందమైన పల్లెటూరు. 

ఆ పల్లెటూర్లో ఒక అబ్బాయి . 

ఆ  అబ్బాయిపెరిగి పెద్దయ్యి, పెళ్ళై - తండ్రై - తాతై తన కథ తనే చెప్పుకోవాలనుకున్నప్పుడు - ఆ కథకి నా బ్లాగు ఊతమయ్యింది. 

సినిమాకి  వెళ్దామంటే  రాలేదని అమ్మ గుడికి వెళ్తుంటే పూజ బుట్టలో ఇసక పోసేయడం-
కోపం వస్తే ఇంట్లో ఎవ్వరికీ లేకుండా అన్నం, కూరలు అన్నీ తినేయడం-
గుఱ్ఱాలెక్కడం-
గుఱ్ఱం  దొరక్కపోతే గాడిదకి తాటాకులు కట్టి పరిగెత్తించడం-
మంగళగిరి పానకాల స్వామి గుడిలో పూజారి పానకం బిందెలు తెచ్చేలోగా ఆలశ్యం అయిపోతోందని మడి కట్టుకున్న అమ్మన్నత్తయ్యతో అందరికీ  తీర్థ-ప్రసాదాలు ఇప్పించెయ్యడం-
సింహాచలం వెళ్దామనుకున్న వారిని సింహాచలం నుండి తిరిగొచ్చేసిన బస్సెక్కిచ్చడం-

- అబ్బో ఒకటి కాదు ఇలా చెప్పుకుంటే ఓ పే........ద్ద లిస్టే అవుతుంది. 
ఇంతకీ ఈ కథ ఎవరిదో వారి మాటల్లోనే చెప్తేనే బావుంటుంది ..
ఇదిగో నా కథ చెప్తున్నాను - నేను చెప్పినట్లే నా మాటల్లోనే రాయి. 
కథకి పేరు - అవతారంగారి నారాయణగారి బాబి - అని పెట్టు. 
అల్లా ఎందుకంటే మా వూళ్ళో ఐదుగురం బాబీలు వున్నాం - పంచబాబీలు పంచభీముళ్ళలా. 
నేను పుట్టడం 1945 -కొత్తింట్లో. 
అప్పటికే పుట్టి వున్నవారు, పుట్టిపోయినవారితో కలిపి ఏడుగురి తర్వాత అష్టమగర్భం నేను. నాకు ముందు పుట్టిన పిల్లాడికి మా తాత అవతారంగారి పేరు పెడితే వాడు పోయాడని వాడి తర్వాత పుట్టిన నాకు అవతారంగారి తండ్రిగారు - కామయ్యగారి పేరు పెట్టారు - కామేశ్వర్రావని. 
మా నాన్నగారు 1942లో ఇల్లు కట్టారు - అనాతారంలో - మిగతావాళ్ళందరూ శివకోడులో పుట్టారు గానీ నేను కొత్తింట్లో పుట్టాను - 1945 నవంబర్ 13వ తారీఖు. 
నెహ్రూగారికి నాకు ఒక రోజే తేడా. 
ఒక రోజు తేడాతో ఆయన ప్రైమ్మినిస్టర్ అయాడు - నేనిలాగయిపోయాను. 
లేపోతే ప్రైమ్మినిస్టర్ అయిపోయేవాణ్ణి నేను కూడాను. 
అదో - అలా - 45 లో పుట్టి చిన్నంగా పెరుగుతూ వస్తో ఉంటే నాకప్పుడు మూడో - ఐదో నెలలు వచ్చాయి నాకు. 
ఈ స్టోరీ ఎర్రమామ్మ చెప్పింది నాకు. 
ఎర్రమామ్మంటే మా నాన్నమ్మ తోడికోడలు. 
ఆవిడ సరదాగా అందరినీ తిడుతూ ఉండేది - ఎవరు కనపడ్డా - ఆఖరికి ఊరి ప్రెసిడెంట్ కనపడ్డా అలాగే తిట్టేసేది. పన్ను కట్టలేదని ప్రెసిడెంటొచ్చి సామాను బయటపడి ఇల్లు జప్తు చేయిస్తానంటే - నా సామాను బైట పడేస్తానంటావురా - అని తెగ తిట్టి పోసేది. 
ఆవిడేం చెప్పిందంటే - ఓ రోజు ఆ ఎర్రమామ్మ, మా నాన్నమ్మ తులసి కోట పళ్ళెంలో కూర్చుని కబుర్లు చెపుకుంటున్నారట. 
ఈలోపులో మా కాళత్తయ్యొచ్చిందట - నాకు మూణ్ణెళ్లు ముందు పుట్టింది - కాళత్తయ్య కూతురు - దాన్నెత్తుకుని. 
ఆ కాళత్తయ్యొచ్చీ - మా నాన్న దగ్గర - "అన్నయ్యా అన్నయ్యా - మళ్ళీ కామయ్యగారు, కావమ్మగారు పుట్టేశారూ" అంటే "నువ్వూ -  నీ వెర్రి కబుర్లు - వీడికన్నా అది మూడు నెలలు పెద్దది కదా"  అని మా నాన్న అన్నారట . 
అంటే "రాముడి కన్నా సీత పెద్దది కాదేంటి - వీళ్లిద్దరికీ పెళ్లి చేసేద్దాం" అన్న కాళత్తయ్యని పట్టుకుని తెగతిట్టి ఇంకా కోపం తగ్గక - "ఈ వెధవకి ఇప్పుడే పెళ్లా" అని ఆ రెక్కట్టుకుని ఆ ఐదునెలల పిల్లాణ్ణి నన్ను కటకటాల్లో ఉయ్యాలా బల్ల దగ్గర్నుంచి విసిరేశారట పెరట్లోకి. 
విసిరేస్తే ఎర్రమామ్మ ఒళ్ళో పడ్డాను. "భడవకానా - నా ఒళ్ళో పడి బతికావ"నేది. 
ఇంకక్కడనుంచి దినదిన ప్రవర్ధమానం. 
ఐదేళ్ళ వయసువరకూ పుట్టు వెంట్రుకలు లేవు. నా ఫోటో వుంది - పుట్టువెంట్రుకలు తీయకుండా వున్నది - కింద బూట్లు, పైన గిరజాల జుట్టూ నేను. 

ఐదోసంవత్సరంలో నాకు పుట్టు వెంట్రుకలు తీశారు. 
ఆరో సంవత్సరంలో అక్షరాభ్యాసం, బళ్ళో వేయడం జరిగింది. 
స్కూలుకి వెళ్ళేవాడినికాదు. 
మా వూళ్ళో అనుపిండి రామ్మూర్తిగారని ఉండేవారు - మునసబుగారి అన్నగారు. 
ఆయనొక బెత్తం పట్టుకుని వెనకాల నిక్కరు పిఱ్ఱ మీద కొడుతూ బడికి తీసికెళ్ళి అక్కడ పడేసేవారు మమ్మల్ని- నన్నూ, కాళత్తయ్యగారి నాగన్నని. 
ఏదో ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళం బళ్ళో. 
ఈలోగా నాతో చేరినవాళ్ళందరూ ఒకటో క్లాసునుంచి రెండో క్లాసుకెళ్ళారు. 
రాజూ మాష్టారని ఒకాయన - "ఒరే! నువ్వింకా ఒకటేరా" అన్నాడు. 
అంటే మనం ఒకటో క్లాసే ఫెయిల్ అన్నమాట. 
ఫెయిల్ అంటే ఏడుస్తానని - "నువ్వు పెద్దొకటిరా" - అనేవారు. 
అలా పెద్దొకటి కూడా చదివాను నేను.

<వచ్చేనెల తరువాయి కథ>

24, ఏప్రిల్ 2013, బుధవారం

చక్కిలాల లెక్క




అల్లసాని వారికి కావ్యం వ్రాయడానికి ఎన్ని కావాలో చూడండి 

నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త
ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,
దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

ఆయన ఆంద్ర కవితా పితామహులు కాబట్టి తప్పకుండా వ్రాయడానికి ఆ మాత్రం సరంజామా కావాల్సిందే.

ఆ పద్యం స్పూర్తితో  చదవడానికి నాకేం కావాలో నేనూ ఒక లిస్టు తయారుచేసుకున్నాను. 

ఒకానొక శీతాకాలపు మంచు కురిసిన మధ్యాహ్నం 
భోజనం చేసి siesta కై పడక గదికి తరలిన శ్రీవారు 
బొజ్జలు నిండి పుస్తకాలు చదువుతూ, బొమ్మలతో ఆడుకుంటూ వుండే పిల్లలు 
ఏటవాలుగా ఎండ పడుతూ వున్న కిటికీ ప్రక్కనున్న, కాళ్ళు చాపుకునే వీలుగల రిక్లైనర్ సోఫా 
ప్రక్కనే పళ్ళెంలో కరకరలాడే జంతికలో, చక్కిలాలో 
అన్నిటినీ మించి ఒక మాంచి తెలుగో, ఇంగ్లిషో పుస్తకం ...

అదిగో ...ఆ చక్కిలాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నా చిన్నప్పటి ఒక తమాషా లెక్కల చమత్కారపు కథ ఒకటి గుర్తుకొస్తుంది. అదేంటో చెప్పేస్తాను. మీరు మాత్రం చివర నేను ఇచ్చే సమాధానం చూడకుండా మీరు దీనిని విప్పగలరేమో చూడండి. ఇంకో విషయం "చక్కిలం" అంటే ఏంటో తెలియకపోతే కథలో దాని బదులు "మురుకు" ప్రతిక్షేపించేసుకోండి.

అసలు కథ మొదలు.

పూర్వం ఒక రాజు తన కోశాగారానికి  ఒక నమ్మకమైన కోశాధికారిని  (అంటే treasurer) నియమించే బాధ్యతని తన మంత్రికి అప్పగించారు. మంత్రి "కోశాధికారి కావలెను" అని ప్రకటించగానే బోల్డన్ని దరఖాస్తులు వచ్చాయి -  ధనాగారంలో ఉద్యోగం మరి. అన్ని రకాల పరీక్షలు, వడపోతలు అయ్యాక ఇద్దరు మిగిలారు. వాళ్లని రామయ్య, సోమయ్య అనేద్దాము. 

మంత్రి వాళ్ళిద్దరినీ పిలిచి ఇద్దరికీ చెరో పాతిక చక్కిలాలు, ఒక ఉత్తరం  ఇచ్చి అడవికి అవతల వున్న రాజుగారి బావమరిదికి అవి ఇచ్చి, బదులుగా ఆయన దగ్గరనుంచి తను పంపుతున్న లేఖకి సమాధానం తీసుకురమ్మనాడు. ఉత్తరాలు రెండూ పెట్టెలలో పెట్టి తాళం వేసి ఇచ్చాడు - దారిలో ఎవరూ తెరిచి చదవకుండా. ఆ పెట్టెలని తెరవగల తాళాలు రాజు గారు మరియు ఆయన బావమరిది మాత్రమే వుంటాయి అని కూడా చెప్పాడు. వీటన్నిటికీ తోడు ఇంకో షరతు - రామయ్య, సోమయ్య దారిలో తినడానికి ఏమీ తీసుకెళ్లకూడదు. ఇంకా రామయ్య, సోమయ్య విడివిడిగా బయలుదేరాలి; ప్రయాణంలో ఒకరికి ఒకరు తారసపడకూడదు.

మంత్రి ఇచ్చినవన్నీ తీసుకుని, నియమాలన్నీ మననం చేసుకుంటూ రెండో రోజు ప్రోదున్నే బయల్దేరారు రామయ్య, సోమయ్యలు. చెప్పినట్టే ఎవరికి  వారు ప్రయాణం చేసి వెళ్లి రాజుగారి బావమరిదిని విడివిడిగా కలిసి  మంత్రి ఇచ్చిన చక్కిలాలు, ఉత్తరం పెట్టె ఇచ్చారు. ఆ బావమరిది పెట్టెలోని ఉత్తరం చదువుకుని, చక్కిలాలు ఎలా వున్నాయో చూసుకుని, తెచ్చిన వారిని ఒకటి రెండు కుశల ప్రశ్నలు వేసి, ఆ ఉత్తరానికి సమాధానం వ్రాసి అదే పెట్టెలో పెట్టి తాళం వేసి రామయ్య సోమయ్యలని సాగనంపాడు.

మంత్రి రామయ్య, సోమయ్యలు తెచ్చిన సమాధానపు లేఖలని రాజుగారికి చదివి వినిపించాడు.

రామయ్య  తెచ్చిన లేఖ:

బావ గారికి నమస్కారాలు. ఉభయ కుశలోపరి. ఈ రామయ్య తెచ్చిన పెట్టెలో 21 చక్కిలాలు వున్నాయి. మాటల సందర్భంలో ఆకలేసి ఆగలేక చక్కిలాలు తిన్నానని, నన్ను ఏమీ అనుకోవద్దని చెప్పాడు.

సోమయ్య తెచ్చిన లేఖ:

బావ గారికి నమస్కారాలు. ఉభయ కుశలోపరి. సోమయ్య తెచ్చిన పెట్టెలో 25 చక్కిలాలు వున్నాయి. మనిషి మంచి మాటకారిలా వున్నాడు. అతను వున్న కాసేపు కబుర్లతో కాలమే తెలియలేదు.

ఆ లేఖల సారాంశం వినగానే రాజుగారికి రామయ్య మీద చాలా కోపం వచ్చేసింది. వెంటనే మంత్రి వైపు తిరిగి సోమయ్యని వేరే ఆలోచన లేకుండా కోశాధికారిని చేయమని ఆదేశించారు. 

మంత్రి చిరునవ్వు నవ్వి  ఆలేఖలలో ఆంతర్యం విప్పి చెప్పి,  రామయ్యే కోశాధికారి పదవికి తగినవాడు అనగానే రాజు మంత్రి తెలివితేటలను మెచ్చుకుని రామయ్యనే తన కోశాగారానికి అధికారిని చేశాడు.

ఇంతకీ మంత్రి ఏం చెప్పాడో మీరు కనుక్కోగలరా? క్రింది చుక్కలగీత దాటి మీ చూపు వెళ్ళేలోగా ఆలోచించండి. ఈలోగా మీకొక అనుమానం రావొచ్చు - అల్లసాని వారి పద్యానికి, ఈ చక్కిలాల లెక్కకి సంబంధమేంటీ అని. అస్సలేమీ లేదు - ఏదో బోడిగుండుకి, మోకాటికీ ముడెయ్యాలనే ఆత్రం తప్ప.

ఇంతకీ జవాబు తెలిసిందా ?లేదా....అయితే చూపుని కొంచెం ఆ చుక్కల క్రిందికి జరపండి మరి!
.......................................................................................................................................................................................

సరే మంత్రి రాజుకి చెప్పినది ఇదీ.....!!!

"సోమయ్య ఆకలి వేయగానే మూట విప్పి ఏదో నాలుగో, ఐదో చక్కిలాలు తినకుండా తను తిన్న విషయం బయట పడకుండా వుండాలని ప్రతీ చక్కిలానికి బయట చుట్టుని తినేశాడు. రాజుగారి బావమరిది అది ఎక్కడ కనిపెడతాడో అని మాటల గారడీ చేశాడు. రామయ్య అలా కాకుండా లెక్క తెలిసేలాగా ఒక నాలుగు తిన్నాడు - లెక్క పెట్టుకుంటారని తెలిసి కూడా. కోశాగారానికి అందుకే రామయ్యే తగిన వాడు."
......................................................................................................................................................................................
 మన దేశంలో ప్రస్తుతానికి చక్కిలాల సోమయ్య వారసులు చాలా మందే వున్నారని మీకనిపించట్లేదూ ? ;) 

~లలితా TS

21, జూన్ 2012, గురువారం

లక్ష్మణమూర్ఛ


అనాతవరం భజన పాటలు - లక్ష్మణమూర్ఛ

పాల వర్ణపు ఛాయ పలువరస చక్కనీ పలుకవేమిర తమ్ముడా!
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఘనముగా నీవేగి దనుజుని బాణముచే రణములో పడియుంటివా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

సీతాను నోదార్చి చింతించు చుంటివి విధాతా యిట్లు వ్రాసెనా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

హా! లక్ష్మణా యిట్టి ఆపదా నీకేలా ప్రాప్తించేరా తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

కైకచే వరమంది కానాలకేగియు కష్టముల పాలైతివా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

మన తండ్రి దశరథుడు మర్యాద తప్పక మనలా నడవుల కంపెనా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

చిలుకాలు హంసాలు అయోధ్య లోపల చిన్నాబోయి యుండునేమో 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

తమ్ముడేడని తల్లి సుమిత్ర నన్నడుగ ఎవరీ తమ్ముని జూపుదు
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

మన్నాన చేసేటి కన్నాతల్లడుగాగ మనవి యేమని సేతూరా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

భరత శత్రుఘ్నులు అన్నా యేడంటేను యేమని పలుకుదునురా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

నా భర్త ఏడని నళినాక్షి నన్నడుగ నాతీతో నేమందురా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఉప్పు కోసము బోయి కర్పూరమిడినట్లు పలుకావైతివి తమ్ముడా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

పసుపు కోసము బోయి బంగారమిడినట్లు పలుకావైతివి తమ్ముడా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

అయ్యయ్యో! లక్ష్మణా! నా ముద్దుల తమ్ముడా! ధరణీపై కూలిపోతివా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

తమ్ముడా! నివులేని తరుణీ రాజ్యములేల, సుఖమేల, జయమేలరా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

పుట్టినప్పుడే తల్లీ పెట్టితే విషమునూ కష్టములు తప్పునేమో 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

నీవంటి తమ్ముడూ నీతిపరుడు నాకు యే జన్మమునకు కల్గును 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

అమ్మ కొరకు మనము ఆపద పాలైతిమి కొమ్మ కొరకు కూలిపోతివా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

నిండుచంద్రుని బ్రోలు నీ మోము చూడంగ నీ సొగసు చెడియుండెరా 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

కలువరేకుల తీరు కళ్ళా సొగసు తీరూ కాంతి వెలయారుచుండెరా  
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఒక్క మాట్లాడారా, చక్కనయ్యా! నాతో మక్కూవ తీరగాను 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

వదినకోసము బోయి వారాధి బంధించి ఒరిగిపోతివి తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

కుంచేడు ముత్యాలు కుప్పబోసిన రీతి కూలిపోతివ తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

పగవారి బాణాలు పైబాడి వస్తుంటే పలుకవేమిర తమ్ముడా
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఒక్క తమ్ముడు పోతే యెంతో దుఃఖించేవు లంకెట్లు సాధింతువు ఓ రాఘవా
ఓ రాఘవా! లంకెట్లు సాధింతువు   ||పాల||

ఎంత మాటాడితివి - ఓ వెర్రి జాంబవా! కుడి భుజము కూలిపోయెనూ 
జాంబవా! కుడి భుజము కూలిపోయెనూ   ||పాల||

కుడిభుజము నీవిపుడు కూలిపోతీవయ్యా యేమి చేయుదు తమ్ముడూ 
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!    ||పాల||

ఆలి పోతే ఆలి అమరియున్నది గాని తోడూ నెక్కడ తెస్తునూ
జాంబవా! తోడూ నెక్కడ తెస్తునూ   ||పాల||

అంజనవరపుత్ర! కంజాదళేక్షణా! సంజీవికే వెళ్ళుమా వీరాంజనేయ 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

జాంబవంతుడు మున్ను చక్కగా నీతోటి ఎరిగించినట్టి తెరవు 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

ఇక్కడ ద్రోణాద్రి యిల మూడు లక్షల అరువది ఆమడలున్నది 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

మధ్యత్రోవలయందు మాయారాక్షసులుండ్రు మాయాచే నిన్ను మరపింపజూతూరూ 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

తెల్లని ఆకులు తేటగా యుండును ఎర్రని ఆకులు ఏర్పాటుగా యుండు 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

పండు పచ్చగానుండు పగలు రాత్రులయందు భాసిల్లు కాంతులచే పరమ మోదమునందు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

అమృతము గలదందు అన్ని మందులు గలవు గంధర్వులచ్చోట కావలి యుందురు 
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

సూర్యవంశపు రాజుల సుతులమయ్య మేము సూర్యుడు ఉదయిస్తే జీవింపజాలము
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

ప్రొద్దు పొడవక ముందే తెచ్చితే సంజీవి మా ముద్దు లక్ష్మణుడు మూర్ఛ తెలిసి బ్రతుకు
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||

నా తమ్ముడూ గాదు - నీ తమ్ముడే హనుమా! నీకంటే బాంధవులు నాకెవ్వరింకా
వీరాంజనేయ! సంజీవికే వెళ్ళుమా  ||పాల||



వీరాంజనేయా! రావయ్యా! మా సర్వ భారము నీదయ్యా 
కార్య భారము నీదయ్యా - ఓ కేసరినందన రావయ్యా 
కార్య నిర్వాహక రావయ్యా - ఓ కరుణాసాగర కావుమయ్యా 
వీరా! వీరా! వీరా! వీరా! వీరా పంచముఖి రారా 
రక్ష రక్ష రక్ష రక్ష! మా రక్ష రామభక్త 
రామ రామ రామ రామ! రామదూత వేగ రారా 
రామ రామ రామ రామ! రామభక్త వేగ రారా 
కపిరాజ వేగ రారా .....పంచముఖి వేగ రారా 
రామదూత వేగ రారా ....రామభక్త వేగ రారా !!!!

ఆ మాటలు వినగానే వాయుపుత్రుడు లేచి ఒక్క పరుగూ తీసెను 
వీరాంజనేయుడు ఒక్క పరుగూ తీసెను  ||ఒక్క||

వాయుపుత్రుడూ వెళ్లి చాలా సేపాయెను ఇంకా రాలేదేమిటో జాంబవా! 
ఇంకా రాలేదేమిటో జాంబవా!   ||ఇంకా||

ఆ బ్రహ్మ మనమీద దయ తప్పి యున్నాడు - బ్రహ్మాస్త్రము వేసెదా జాంబవా!
బ్రహ్మాస్త్రము వేసెదా జాంబవా!  ||బ్రహ్మా||

సూర్యుడూ జగమునా సూటి తప్పినాడు - సూర్య బాణము వేతునా జాంబవా!
సూర్య బాణము వేతునా జాంబవా!  ||సూర్య||

చంద్రూడూ మనమీద దయ తప్పి యున్నాడు - చంద్రా బాణము వేతునా జాంబవా!
చంద్రా బాణము వేతునా జాంబవా!  ||చంద్రా||

కౌసల్యా నందన! ఖగరాజ వాహనా! కాంతి వివరము తెల్పెద రాఘవా!
కాంతి వివరము తెల్పెద  ||కాంతి||

సూర్యోదయము కాదు - చూడూము ఆ వెలుగు - సుందరాకార! వేగ 
రాఘవా చూడూము ఆ వెలుగు ||రాఘవా||

సూర్య వంశోద్భవుని  సుమిత్రనందనుని సూశక్తి తెల్పింపుమా రాఘవా 
సంజీవికే వెళ్ళుమా వీరాంజనేయ!

సంజీవిని రప్పించి సానందు నూరించి తమ్మునికి తావేయుమా సుషేణా!
తమ్మునికి తావేయుమా సుషేణా!

అన్నన్న! ఓ అన్న! శ్రీరామచంద్రుడా! ఎంతా నిద్రా పోతిని రాఘవా!
నేనెంత నిద్రా పోతిని....

పాలవర్ణపు ఛాయ పలువరుస చక్కని పలికినావుర తమ్ముడా!
లక్ష్మణా! చిన్ని ముద్దుల తమ్ముడా!

బ్రతికితివి తమ్ముడా! బ్రతికితివి లక్ష్మణా! అయోధ్యకే పోదమా లక్ష్మణా!
అయోధ్యకే పోదమా లక్ష్మణా!  ||పాల||

అన్నన్న! ఓ అన్న! శ్రీరామచంద్రుడా! ఎంత మాటాడితివి, రాఘవా!
ఎంత మాటాడితివి, రాఘవా!

అభయమిచ్చి వేగ ఆ రావణాసురుని ధూర్తాగ్రేశుని చంపుమా, రాఘవా!
ధూర్తాగ్రేశుని చంపుమా, రాఘవా!

సీతాను దోడ్కొని ఘనముగా మనమిపుడూ అయోధ్యకే పోదమా, రాఘవా!
అయోధ్యకే పోదమా, రాఘవా!