10, జూన్ 2016, శుక్రవారం

అలివేణీ ...అరువు దెబ్బలాటా ...




వరద గోదావరి

అనగనగా... 

ఓ అమ్మాయి - ఓ అబ్బాయి 
అమ్మాయి ముక్కున ముత్యాల బులాకీ 
అబ్బాయి మక్కువ చలాకీ 

చేతిలో చేయి
ఎండే - కానీ అనిపిస్తోంది - ఔనేమో అని - వెన్నెల రేయి
కులాసాగా విలాసంగా - నడక సాగుతోంది - హాయి హాయి 


అమ్మాయి నోటి మాట - నిముషమైనా నిశ్శబ్దం అంటే తెలియని నిరంతర గోదారి
అబ్బాయి ఇచ్చే బదులు - చిరునవ్వు - వెలిగించే పూదారి

అమ్మాయి - ఆగింది - ఏం గుర్తొచ్చిందో ఏమో !
"ఏంటీ ! ఎంత సేపూ నేనేనా మాట్లాడడం?
మీరేం అనరేం?" అంటూ .

విచ్చిన పెదవుల పటికబెల్లపు పలుకు - అబ్బాయిది
"నువ్వు మాట్లాడుతున్నావుగా - వింటున్నా " అని.

"అదేం కుదరదు - మీరూ మాట్లాడండి", అమ్మాయి ఆజ్ఞ
తన నోటిపై వేలు పెట్టి - తల అడ్డంగా తిప్పుతూ "నువ్వు కానీయ్ ", అన్నట్లు అబ్బాయి సంజ్ఞ

"అంటే నేను వాగేదాన్ని - మీరు మహా మౌని - అంతేగా !", ఉక్రోషంతో మాట మీరేసింది
 

అబ్బాయి కన్నుల కలవరం
"ఇప్పుడేడ్చేస్తుందా, ఏంటి?! - ఇప్పుడేమి చేయడం? ", అని
 

అప్పటికే అమ్మాయి కర-బంధం వీడింది
కన్నులు కెంపులవ - ఎర్రటి వరద గోదావరై - వడివడి గా - విదిలించుకు - సాగింది

"అమ్మో! ఇంకేమైనా వుందీ - అలా వెళ్ళనిచ్చేస్తే ?
పరుగు నిలిపేనా ? 

పరువు నిలిచేనా - నాబుజ్జాయికి - ఆ కంటి నీరు ఎవరి కంటైనా పడితే ..."
అనుకున్నాడేమో - మరేమో!

అబ్బాయి పెదవుల - పలవరింపైంది - అమ్మాయిని ముద్దుగా పిలిచిన -
"బుజ్జాయ్! బుజ్జాయ్ ! ఆగు - ఇదిగో మాట్లాడుతున్నాగా " అన్న పిలుపూ -
వెనువెంటనే పలికిన పలుకూ - "ఆగు మరి - మొన్న నిన్ను చూసాను - నిన్న కన్ను వేశాను - నేడు దారి కాశాను - రేపు చూసుకో ! మరి" - అంటూ -
తనకిష్టమైన ఓ పాటను మాటలుగా మాయ చేసేశాడు. 


ఆ పాట-మాట మంత్రమయింది - ఆ అమ్మాయి పరుగుకి పగ్గమయింది
అమ్మాయి బుగ్గల కెంపు మొగ్గ వేసింది - అబ్బాయి మనసు దిగ్గున ఎగసింది


కుదురు గోదావరి 



కాలం అక్కడే ఆగుతుందా? ఉహూ...
కొంచెం ముందుకు సాగింది - కళ్యాణ ఘడియయింది
అల్లరి పరుగులు పెట్టిన కన్నె గోదావరి - వధువయింది
ఆనక - ప్రేమ ఆనకట్టల - నిలకడగా నడిచింది
ఇల్లాలయ్యిందో - లేదో - ఇట్టే ఆరిందా అయ్యింది
ఇంట రోజూ పాటల వీణ - నవ్వుల వాన

మరి ఆకలుండదు - దాహముండదు నిన్ను చూస్తుంటే - అన్న కవెవరో గానీ -
ఈ అబ్బాయిని చూడలేదు అనుకుంది అమ్మాయి -
మురిపెంగా నవ్వుకుంది
ఆకలి వేళల అమ్మే అయింది -
అబ్బాయి కడుపే కాదు మనసు కూడా నిండింది.

అన్ని రోజులూ నెమ్మది అయితే మజా ఏముంది ?
ఓ రోజు...
అబ్బాయి కిష్టమని - టమాటా పప్పు చేసింది -
బంగాళా దుంపలు - ఎర్రగా వేయించింది

ఆరోజు వండినవన్నీ-
పెళ్ళినాడు అత్తవారు అల్లుడికి ముచ్చటనొసగిన -
తెలతెల్లని వెండి విస్తరాకులో -
కొసరి కొసరి వడ్డించింది.

అలసి వచ్చిన - ఆవురావురంటున్న అబ్బాయి - మొదటి ముద్ద తిని -
రోజూలాగ - "నాకో ముద్దా- నీకో ముద్దా" అంటూ అమ్మని మరిచేలా - అమ్మాయి నోటికందించే వాడల్లా - ఎందుకో ఆగాడు.
ఈరోజు నాకు బాగా ఆకలి వేస్తోందని గబగబా తానే మొత్తం తినేసాడు. 


అమ్మాయి సర్దుకుంది - "పోన్లే - ఈ ఒక్క రోజుకే ఇలా", - అని.
అబ్బాయి కిష్టమయిన తియ్య తాయిలం మట్టు గిన్నెలో తనకిచ్చి -
తానూ కంచంలో కలుపుకున్న - పప్పు అన్నం -
ఆ కబురూ-ఈ కబురూ చెప్తూ హడావిడి పడుతున్న నోట బెట్టింది.

అబ్బాయికి - అప్పుడే ఉప్పందిందో ఏమో -
రానున్న ముప్పు గురించి -
తలొంచుకు తినేస్తున్నాడు - దీక్షగా
చేతిలోని స్వీటును.

"ఇదెలా తినగలిగారు మీరు ? ఇంత చప్పగా వుంది పప్పు ?" అడిగింది అమ్మాయి
"చప్పగానే కదా - ఉప్పెక్కువైతే కష్టం గానీ ..." , ఆగాడు అబ్బాయి - తీపి ఇంకో చెంచాడు గుటకేస్తూ

"ఇవాళ వంట నా మొహం లా వుంది "
కారమెళ్ళిందా కళ్ళ లోకి అన్నట్లు నీరూరింది - నోరెలాగూ వూరలేదుగా -అందుకని

 
"ఊ ...ఊ " - అన్నాడు - ఒప్పుకోలుగా - అలా సరేనంటే - నీ మొహం ఎంత బావుంటుందో అని ఎప్పుడూ చెప్పే మాట గుర్తు తెచ్చుకుని - వంట అంత బావుందనీ తనంటున్నాడని - మురుస్తుందని. 


కానీ అమ్మాయికి వేరేలా అ(పా)ర్థ మయ్యింది.
"అంటే నా మొహం ఈ ఉప్పు-లేని-పప్పు లా చప్పగా ఏ కళా-కాంతీ లేకుండా వుంటుందనేగా!!" - ముక్కు పీల్చేసింది

చటుక్కున లేచాడు అబ్బాయి -
ముందుకి వంగి అమ్మాయి రెండు కళ్ళ కిందా అరచేతులు పట్టాడు

 
"ఏంటిది ?", అంది అమ్మాయి
"నీ బుగ్గల మీద ముత్యాలయ్యే నీ కంటి-నీలాలు నా చేత నిజం నీలాలు అవుతాయేమో అని - ఎంతైనా మంచి వాడిని కదా " అన్నాడు


"ముత్యాలేంటి? నీలాలేంటి? నేనింత ఏడుస్తుంటే మీ వెక్కిరింత ఏంటి ?- హా !!", అలిగింది అమ్మాయి

"అదే నేను ల్ల  అబ్బాయిని కదా - "నల్ల" అంటే మా చొక్కలింగం గారి భాషలో "మంచి" కదా!?" - చిలిపివాడు  అబ్బాయి -  ఒక కన్ను మూసి తెరుస్తూ
 

వెంటనే వంటింట్లో కిలకిలమంటూ మెరుపు మెరిసింది
"హమ్మయ్య ! నవ్విందిరా ఈ పూటకి - నా బుజ్జి రాక్షసి", అనుకున్నాడు - అబ్బాయి

 

నిండు గోదావరి

ఇంకొన్నాళ్ళకి అమ్మాయి అమ్మ అయ్యింది - అబ్బాయి నాన్న అయ్యాడు


అమ్మయ్యే అమ్మాయికి - నాన్నయ్యే అబ్బాయి
ముత్యమయితే కళ్ళల్లో చేరి అస్తమానూ మరిన్ని ముత్యాలుగా కురుస్తోందని 

నీ కళ్ళల్లో నక్షత్రాలు మాత్రమే మెరవాలంటూ 
కంటి-నీటి-ముత్యాన్ని ముక్కు బులాకీలో పట్టేసి నక్షత్రం చేసేశాడు 

పుట్టిన బుజ్జి-జింక ఆ నక్షత్రం బులాకీతో ఆడేవాడు
మళ్లింకొన్నాళ్ల కి మళ్లింకొక్కసారి అమ్మా-నాన్నా అయ్యారు
మళ్ళీ పుట్టిన బుజ్జి-జింక కూడా ఆ నక్షత్రం బులాకీతోనే ఆడేవాడు 

బుజ్జి-జింకలు పెద్దయ్యారు
ఆ క్లాస్ కి - ఈ క్లాస్ కి, ఆ ఆటకి - ఈ పాటకి అమ్మా నాన్నలని తిప్పుతున్నారు - తిరుగుతున్నారు


ఆట-పాటల ఆ రోజుల్లో 
ఓ రోజు 
శీతవేళ వెళ్లి చిగురువేళ వచ్చిన రోజు

అమ్మముస్తాబయ్యింది - 

గులాబీ రంగు చీర - 
చెవులకి కెంపులు
ముక్కున వేళ్ళాడే నక్షత్ర కాంతితో - 
ఎండలో తళతళలాడుతూ - 
నింపాదిగా ఆ గట్టూ, ఈ గట్టూ ఒరుసుకుంటూ - కదిలే వయ్యారి గోదారిలా - నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కింది - "షి"కారుకి.

ఎక్కుతూనే అద్దంలో - మొహం చూసుకుంది
చూసుకుంటూనే - అందీ
"హబ్బ ! ఎన్నాళ్ళయింది - నన్ను నేను ఇలా చూసుకుని - కదా !
ఆ కోట్లు, పేంట్లు , షర్టులు - పిచ్చిదానిలా వుండేదాన్ని - ఇవాళ ఎంత బావున్నానో "

పక్క సీటు లోంచి ఉలుకూ పలుకూ లేదు - నాన్న చేతులు కార్ స్టీరింగు మీద - చూపు తీక్షణంగా రోడ్డు మీద

మళ్ళీ అమ్మ...  "కదా - ఇవాళ బావున్నాను కదా! "

అమ్మా ! ఆశ ! నాన్న ఈసారి చిక్కదలుచుకోలేదు - చిక్కుల్లో పడదల్చుకోలేదు

"అమ్మో! నువ్వా మాటనేస్తే - నీ మాటల్లో పడిపోయి నేనవుననేస్తే -  

నేను ఇవాళ బావున్నాను అంటే ఒప్పుకున్నారంటే నిన్నటిదాకా బాలేననే కదా  అని మళ్ళీ దెబ్బలాడేద్దామనే?!! - హన్నా - నేనింక మాట్లాడను" -
అని పెదవులు బిగించి పైకనేసినా ... 

నాన్న మనసులో అనుకుంటున్నాననుకున్న ఇంకొక మాట
కానీ అమ్మాయి అప్పట్నుంచీ అమ్మతో  సావాసం కదా - 
ఆపుకోలేక వాక్-గోదావరిలా బయటికే ఉబికింది "మాయా శశిరేఖను కట్టబెట్టారు నాకు" అని.

అమ్మ అది విందో లేదో - ఫక్కున నవ్వి - 

దారిపక్కన వున్న పూలు - ఉలికిపడేలా - 
నాన్న మనసులో మల్లెలు పూయించింది

నాన్న నోట తనకెంతో ఇష్టమయిన

అలివేణీ - ఆణిముత్యమా

అన్న
తేనెలూరే  వేటూరి పాట

అలివేణీ - అరువు దెబ్బలాటా

అని పేరడీ కవితలూరింది


కొసమెరుపో - కొనసాగింపో ... 

అప్పుడెప్పుడో ... 

ఓ రోజు ...
అన్న స్కూల్ నుంచి వచ్చాడు 
గలగలా అమ్మతో "ఇవాళ ఏమయిందో తెలుసా, అమ్మా ..."
అని బడి సంగతులు చెప్తున్నాడు 
తమ్ముడు పక్కనే వుండి చెప్పే-అన్నను చూస్తున్నాడు
నవ్వుతూ వినే-అమ్మను చూస్తున్నాడు 
కబుర్ల సందడిలో తనని మరిచాని బుంగమూతి పెట్టి 
చిన్నగా ఏడవడం మొదలుపెట్టాడు 

అమ్మా, అన్నా ముందు పట్టించుకోలేదు 
నెమ్మదిగా పెరిగే శ్రుతితో పాటు 
తప తప లాడే చిన్ని అడుగుల తాళం తోడయ్యి 
తమ్ముడి అల్లరి నాట్యం మొదలయేటప్పటికి 
పరుగు-పరుగున తమ్ముడి దగ్గరికి వచ్చారు 
"ఏమయింది - ఏమయింది - బుజ్జి తమ్ముడికీ ?!" అంటూ 

తమ్ముడు రామాపడు - తాళం తప్పడు 
ఏమిటేమిటంటే బదులు చెప్పడు 

అమ్మ, అన్న - ఒకరినొకరు చూసుకున్నారు 
కనులతోనే మాటాడుకున్నారు 
మ్మ చేసిన సైగతో మాట మారుద్దామని 
అన్న అమ్మతో -
"మ్మా! ఆ గోడ మీద ఫోటోలో తమ్ముడు చూడు 
ఎంత ముద్దుగా ఉన్నాడో 
అసలేవకుండా", అన్నాడు 

తమ్ముడు ఒక్క నిముషం ఆగాడు 
ఫోటో కేసి చూసాడు 
అమ్మ అన్నకిచ్చిన బదులు - "అవును నాన్నా! చిన్నప్పుడు అసలేడ్చేవాడే  కాదు - ఎంచక్కా!",  విన్నాడు 

మళ్ళీ గట్టిగా - ఇంకా గట్టిగా - ఇంతక ముందు కన్నా -  గా....ట్టిగా ఏడుస్తూ 
"నేను బేబీ అప్పుడు ఏడవలేదు - గుడ్ బాయ్ లాగా 
ఇప్పుడు నేను బేబీ కాలేను - అందుకే ఏడుస్తాను....ఊ ... ఊ ...ఊ ..."
- అని ఏడుస్తూనే వున్నాడు 

దెబ్బకి - అమ్మ, అన్న - గబగబా - పారిపోయారు - తమ్ముడికి భయపడి 
నాన్నకి చెప్పారు

నాన్న వచ్చారు - 
"అమ్మ నోట్లోంచి వూడిపడ్డావురా - 
అరువు-దెబ్బలాట రాయుడా" అంటూ - ఎత్తి గిరగిరా తిప్పి
తమ్ముడికి - అచ్చు అమ్మకి లాగే - కబుర్ల మంత్రం వేశారు 
బుజ్జి బుగ్గల నవ్వుల దీపాలు వెలిగించారు.



18 కామెంట్‌లు:

  1. బ్లాగు మిత్రులు టి.ఎస్ లలిత గారికి
    నమస్కారం.
    తెలుగు బ్లాగులోకంలో మీదైన శైలిలో రచనలు చేస్తున్నందుకు, ఆ విధంగా అంతర్జాలంలో తెలుగు పాఠకులకు మరింత చేరువవుతున్నందుకు ముందుగా మీకు అభినందనలు. మేము ఇటీవలే అంతర్జాలంలో రచనలు చేస్తున్న తెలుగు రచయితలు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఒక వినూత్న ప్రయత్నాన్ని చేస్తూ ప్రతిలిపి.కామ్ అనే వెబ్‌సైట్ ప్రారంభించాము. ఒక బ్లాగులో మీరు ఎలాగైతే రచనలు చేస్తారో.. అదే విధంగా మీరు ప్రతిలిపిలో కూడా లాగిన్ అయ్యి మీ రచనలు, టపాలు ఉచితంగా పోస్టు చేసుకోవచ్చు. ఆ పోస్టులన్నియు కూడా ఈబుక్స్ రూపంలో, ఈ ఆర్టికల్స్ రూపంలో దర్శమిస్తాయి. వాటిని మీరు ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇదో కొత్త ప్రయత్నం. ప్రతిలిపిలో ప్రచురితమయ్యే ఉచిత పుస్తకాలు, వ్యాసాలు అన్నియు కూడా ఎప్పటికప్పుడు ప్రతిలిపిలో మీ పేరు మీద డేటాబేస్‌లో నిక్షిప్తం అవుతాయి. ఆ విధంగా నిక్షిప్తం అయ్యే మీ పోస్టులను ఎప్పటికప్పుడు మీరు ఒక బ్లాగును ఎలాగైతే యాక్సెస్ చేస్తారో అలాగే యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతిలిపిలో మీ ప్రొఫైల్‌ మీకు ఒక ఆన్‌లైన్ గ్రంథాలయంగానూ ఉపయోగపడే అవకాశం ఉంది.
    ప్రతిలిపిలో లాగిన్ అయ్యేందుకు మీరు http://telugu.pratilipi.com వెబ్‌సైట్‌ని వీక్షించగలరు.
    మీరు మీ బ్లాగును మేమే ప్రతిలిపిలోకి మార్చేందుకు కూడా అనుమతిని అందజేయవచ్చు.
    ప్రతిలిపి గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనేందుకు మీరు మాకు telugu@pratilipi.com ఈమెయిల్ అడ్రసుకు మెయిల్ చేయగలరు లేదా 9247810639 నెంబరులో గానీ సంప్రదించగలరు. ధన్యవాదాలు.
    ప్రతిలిపిలో రచయిత నమూనా ప్రొఫైల్
    http://telugu.pratilipi.com/gurajada-apparao
    ధన్యవాదాలు,
    మీ భవదీయుడు.
    కొయిలాడ.బాబు, ప్రతిలిపి తెలుగు విభాగం, బెంగళూరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను తప్పకుండా వీలు చేసుకుని మీ ప్రతిలిపిని సందర్శిస్తాను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  2. అక్కా!నీ అరువుదేబ్బలాట బావుంది చదువుతుంటే ఇంకా చాలా బోల్డంత బావుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అరువు దెబ్బలాట - ఆడేది నేను కదా హనుమాన్! - బాగానే వుంటుంది :) నీ అభిమానపూరిత కమెంట్ కి థాంక్స్!

      తొలగించండి
  3. ఒకరికొకరు సరిజోడు..... మాటలతో మంత్రాలు వేయడంలో.... మాయ చేయడం లో.
    చా......లా బావుంది.
    నీ ముత్యపు బులాకీ, వజ్రపు కాంతితో నక్షత్రపు రూపు సంతరించుకోవడం.... నాకు గుర్తే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా లైఫ్ లోని అతి ముఖ్యమైన, ప్రత్యేకమైన సందర్భాలలో నా పక్కనే వుండి - ఇప్పుడు నాతో సమానంగా వాటిని తలుచుకుని ఆనందిస్తూ - నన్ను నీ అభిమానంతో ఇంతగా ప్రోత్సహిస్తున్న నీ స్నేహం నన్నెపుడూ ఇలాగే వెన్నంటి వుండాలని కోరుకుంటూ

      మాటల్లొ చెప్పలేని ఇష్టంతో,
      నీ ప్రియ నేస్తం

      తొలగించండి

  4. బావుంది కథ :) ఏంటి ఈ వారం మీరు అందరూ (కష్టేఫలి వారు, శర్కరి గారు) రింగులు చుడుతూ మీ ఫ్లాష్ బ్యాక్ ల లోకి వెళ్లి మమ్మల్ని మా ఫ్లాష్ బ్యాక్ ల లోకి కి తోసేసారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "నా కథ" నచ్చి - మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  5. Hello Lalitha..
    Now I started to scan all the blogs..from the beginning after getting hang of your last 2 or 3 blogs..... Feeling nostalgic and feel sorry for the current generation of FB and whatsapp.

    I love Mullapudi and I miss him a lot . I 've grown up reading his short stories like Janatha express, Aaakali ananda rao , Eeswarechchca., Maharaju Yuva Raju . etc back in 1977 or so .As a kid I enjoyed a lot and even today I feel they are refreshing. Now ,I see similar style in your blogs in native language .. .. hope you continue this blog ,..Definitely It is need of an hour for all Telugu loving guys .. .

    - Giri

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks a lot, Giriraj - for taking time to read my blog. In response to your comment, all that I can say is - You made my day! Thanks Again!

      తొలగించండి
  6. అందాల గోదావరి దెబ్బలాడినా అందంగానే ఉంటుంది మరి...beautifulః

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రస్తుతం నీ పొగడ్తతో అయింది - ఆనంద గోదావరి :)

      తొలగించండి
  7. నిజం చెప్పండి ఈ టపా వ్రాయడానికి ఎంత సేపు పట్టిందో? గోదావరైనా గంగా ఝరిలా, మంచి పాటలా పదాలు యెంత బాగా పడిపోయాయో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది నా బ్లాగ్ పోస్టులన్నిటిలో నాకిష్టమయిన పోస్ట్.
      నా ప్రతి పోస్ట్ రాయడం సాధారణంగా శుక్రవారం రాత్రి పదింటికి మొదలు పెడితే ఒంటి గంటకి రాయడం అయిపోతుంది - దీనికీ అంతే :)

      తొలగించండి
  8. బహు బాగుంది మీ జీవిత కవిత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకిష్టమైన పోస్టు మీకు నచ్చినందుకు సంతోషం, నరేందర్ రెడ్డి గారు! Thanks for your comment.

      తొలగించండి