24, సెప్టెంబర్ 2016, శనివారం

కారే చోదకులు?! కార్లను నడపరే! - (అంతం కాదిది)

 ఆరంభం ఇక్కడ చదవండి : కారే చోదకులు?! కార్లను నడపరే! - (ఆరంభం)

సరే! డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది.
బస్సులో ఆఫీసుకి వెళ్లాలనుకున్న బదరి నిర్ణయం బావుంది 
ఇంటిముందు కట్టేసిన ఎర్రైరావతం లాంటి టొయోట కరోలా వుంది
జాబ్-మార్కెట్ డిప్ పుణ్యమాని ఇంకా రాని ఉద్యోగముంది
ఇంకేం కావాలి - నాలాంటి అత్యౌత్సాహిక చోదకులకి !?

ఇంతకీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన రోజెలాంటిదంటే...
ఎండాకాలపు మంట మండే రోజు
Kerry గుండె దడ దడలాడిన రోజు
చిన్నప్పుడు బడి రోజులలో కొంచెం ఇష్టమయిన రోజు
సెలవులయిపోయాయని మదికి మరి కొంచెం కష్టమయిన రోజు
అదే నాకెప్పటికీ గుర్తుండే జూన్ నెలలోని 13వ రోజు.

మరలాంటి రోజు లైసెన్స్ తెచ్చుకున్న చేయీ-కాలూ వూరికే వుండమంటే వుంటాయేంటి మరి?

పింకు టీ-చొక్కా, నీలి జీన్సు, పచ్చ కళ్లజోడు - ఎర్ర కారు - వ్వాటే కాంబినేషన్ ! బయల్దేరాను.

మేముంటున్న స్టీపుల్ చేజ్ అపార్టుమెంటు  పార్కింగ్ లాట్ లోంచి కారు రివర్స్ చేసి బయటికి వచ్చి ఎడమ పక్కకి మెక్ కెల్వీ రోడ్ లోకి తిరగగానే - అక్కడ గడ్డిలో కలుపు తీయడానికి వంగి వున్నజిమ్ము (Jim), పక్కనే ఆ తీసిన కలుపు వేయడానికి లాన్-వేస్ట్-బాగ్ పట్టుకుని నించుని వున్నజాకు (Jack) - ఒక్క సారిగా వాళ్లు చేసే పని ఆపి - ఎవరా అని కారుకేసి చూసి - స్టీరింగ్ పట్టిన నన్ను చూసి - ఉలికిపడినవారై - O man! Dangerous driver - అని చెరొక్క గెంతూ గెంతారు - నవ్వుతూ.

నేనంత కన్నా విలాసంగా నవ్వుతూ The grass is greener on the other side అంటారు ఈ వెర్రి వాళ్లు - అటే కాదు , ఇటూ పచ్చగానే వుందే  - అనుకుంటూ (అది నా పచ్చ కళ్లజోడు లోకానికి పూసిన హరిత వర్ణమని అప్పటికింకా అర్థం కాక) కారుని ముందుకి పోనిచ్చాను.

 మెక్ కెల్వీ రోడ్ పొద్దున్న పది గంటల తర్వాత కొంచెం ఖాళీగానే వుంటుంది. నెమ్మదిగా స్పీడ్ పెంచడం,  బ్రేక్ వెయ్యడం, తగ్గించడం - ఇలా మొత్తానికి కారుతో నేనూ, నాతో కారూ - కొంచెం కొంచెంగా అలవాటు పడుతూ సాగుతున్నాము.

ఇంతలో హఠాత్తుగా గుర్తుకొచ్చింది - బదరి పదే పదే గుర్తు చేసిన విషయం - బ్రేక్ వేసేముందు ఒకసారి rear-view mirror లో వెనకాల కార్లు వస్తున్నాయో లేదో చూసుకోవాలని. అరెరె! ఇంత సేపూ ఆ రూలు మర్చిపోయానే అనుకుని - ప్రతి రెండు నిముషాలకి బ్రేక్ వేయడం, వేసే ముందు అద్దంలో చూడడం చేయడం మొదలుపెట్టాను. అలా చూస్తూ అనుకున్నాను - నేనింతకుముందు నడిచి వచ్చే రోజుల్లో ఈ రోడ్డు నల్లగా కనిపించేది , ఇవాళేంటబ్బా కొంచెం గోధుమ రంగులో వుందీ- అని - మళ్లీ - ఈ కారు అద్దంలోంచి చూడడం కదా అలాగే వుంటుందేమో - అని నాకు నేనే సర్ది చెప్పేసుకున్నాను.

ఇంతలో ఒకటి రెండు కార్లు - ఆ సింగిల్ లేన్ రోడ్ లో ఎదురుగా ఏ కార్లూ రాకుండా ఖాళీగా వుండడంతో - నా కారుని పాస్ చేసి వెళ్తుంటే - ఇవేంటబ్బా అసలు నా కారు మిర్రర్ లో కనిపించకుండా ఎక్కడినుంచి వస్తున్నాయి - అని మళ్లీ rear-view mirror కేసి చూస్తే అప్పుడు అర్థం అయ్యింది - అది కొంచెం పైకి తిరిగి వుందీ, అప్పటిదాకా గోధుమరంగులో వుంది అని నేను మురిసిపోయి చూస్తున్నది రోడ్డు కాదు - మా కారు సీలింగూ అని :))

మొత్తానికి ఇంటికి జాగ్రత్తగానే వచ్చేశాను కళ్లద్దాలూ - కారద్దాలూ సరిగ్గా సర్దుకుని.

అలా - ఆ మొదటి కారెడ్వెంచర్ తర్వాత ఓ వారం రోజులు కారెక్కడానికీ - కార్తొక్కడానికీ కొంచెం బెంగగానే అనిపించింది.

ఇంతలో బుజ్జిజింకకి సమ్మర్ స్కూల్ మొదలవుతుందని ఈ-మెయిల్ వచ్చింది. సమ్మర్ క్లాసెస్ కి స్కూల్ బస్ రాదు. అంత ఎండలో - పాపం - వాడిని ఏం నడిపిస్తాను కదా - ఇంత కారూ నేర్చుకుని?! ఎలాగైనా సరే సమ్మర్ స్కూల్ మొదలయేలోగా డ్రైవ్ చేయడం అలవాటు చేసుకోవాలి అనుకున్నాను.

రెండో రోజు పొద్దున్నే లేచి - ఇంటి నుంచి పదడుగులు వేసి - అక్కడ వుండే సిగ్నల్ దగ్గరనుంచి ఇంకో పదిహేను అడుగులు వేస్తే - లేచి మరీ ఎదురొచ్చేట్లుండే - గ్రోసరీ స్టోర్ Schnucks కి కారులో బయల్దేరాను.

మామూలుగా రోజూ నేనూ, పప్పీ నడిచి వెళ్లేవాళ్లం Schnucks కి. (అప్పటికి పప్పీ ఇంకా ఇక్కడే వుంది - ఇద్దరం పక్క పక్క అపార్టుమెంట్లలో వుండేవాళ్లం). నడిచి వెళ్లేటప్పుడు అంతగా రూల్స్ ఏమీ వుండవు - ఎందుకంటే Pedestrian rules the road ;) కాబట్టి. ఇద్దరం కుడిపక్క రోడ్డులోంచి లోపలి వెళ్లి అదే రోడ్డులో బయటికి వచ్చేసేవాళ్లం.

ఇవాళ మరి కారు కదా - అందుకని నేను చేసిన  ధైర్యం అది చేయలేక పప్పీ రానంది - పైగా ఒక కార్లో రెండు కొప్పులు ఇమడవంది.

సరే! ఒక్కదాన్నేవెళ్లాను నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ. లోపలి వెళ్ళేటప్పుడు బానే వెళ్లాను. కొనాల్సినవి కొన్నాను - కొనక్కరలేనివీ కొన్నాను - అసలే అమెరికా ఆర్ధిక వ్యవస్థకి - నేను సైతం ఒక విచ్చు డాలర్ ఇచ్చివేశానూ - అని ఫీలయిపోవాలి కదా!

ఇంక బయటికి రావాలి. నడకకి అలవాటు పడ్డ కాళ్లు కదా - కారెక్కిన రూల్సు వేరే ఉంటాయి అని వాటికి తెలీదు కదా - నేను చెప్పాలి కదా - కానీ నేనేమో ఒక్కదాన్నీ షాపుకి వెళ్లి వస్తున్నానన్న సంతోషంలో ఎటు వెళ్తున్నానో చూసుకోవడంలేదు కదా!!!

ఇన్ని "కదా"లున్నప్పుడు ఏమవుతుంది మరి?! అదే అయింది - ఏ దారిలో అయితే లోపలికి వెళ్లానో అదే దారిలో బయటికి రాబోయాను. ఇంతలో ఎదురుగా ఇంకొక కారుని ఆపి టికెట్ రాస్తున్నాడు - దారి కాసి స్పీడుగా వచ్చే వారికి టిక్కెట్లు వడ్డించే అమెరికాపు (cop).

నా కన్నా ముందు నా కారుకి అర్థం అయినట్టుంది - ఏదో తప్పు చేశానని - టక్కున ఆగిపోయింది. ఆ కాపు-కాని-అమెరికాపు అక్కడ చేస్తున్న పనినాపి నా దగ్గరకొచ్చి - బంగారు తండ్రికి అప్పటికే అర్థం అయినట్టుంది నాది మొట్టమొదటి కార్నడుపుడు వ్యవహారమని -  "Ma'am! You need to go the other way" అని కుడిపక్కనున్న బయటికి వెళ్లే దారి చూపించాడు - మర్యాదగా.

నేను - బడిలో పొరపాటున వేరే క్లాసులోకి వెళ్లి ఉలిక్కిపడి -  వెనక్కి తిరిగే పిల్లాడి మొహం లాంటి మొహం పెట్టి తలూపి రివర్స్ చేయబోయాను. కంగారులో కొంచెం ఎక్కువ తిప్పేశానేమో - కారు వెనక్కి, ముందుకీ కాక - అడ్డం గా తిరిగింది. నేను స్టీరింగ్ తిప్పే కొద్దీ అది ఇంకా ఇంకా అడ్డంగా రోడ్డులో ఇరుక్కుపోతోందే కానీ వెనక్కి వెళ్లట్లేదు.

వెంటనే కారు దిగి వెళ్లి - ఆ పోలీస్ దగ్గరికే వెళ్లి - నా కారు రివర్స్ చేయడం రావట్లేదు, హెల్ప్ కావాలీ అనడిగాను. అప్పటికే ఎవెరికైతే టికెట్ ఇస్తున్నాడో ఆ కారతను నన్నూ - పోలీసునీ మార్చి మర్చి కొరకొరా చూస్తున్నాడు.

ఆ ... అలాంటివన్నీనేను పట్టించుకుంటానేంటి - అవతల నాకారు - పాపం - నా పాల బడ్డందుకు -రోడ్డుకి అడ్డంగా తిరిగి -  డ్రుం... డ్రుం...  అని -  ఘోషిస్తుంటే?!

పోలీస్ వచ్చాడు - మరి పదహారేళ్ల వయసునుంచీ కార్నడిపిన వాడు - ఆ మాత్రం చేయలేడేంటి?  చక్కగా నా కారుని వెనక్కి తిప్పి బయటికివెళ్లే రోడ్డులో ఆపి - మళ్లీ తనకోసం వెనక్కి జరుపుకున్న  డ్రైవింగ్ సీట్ నాకు తగ్గట్టు ముందుకి జరిపి - Now you can go! - అని సాదరంగా సాగనంపాడు.

సాయంత్రం - అదే విషయం చెప్తే - అసలు నీ లైసెన్స్ ఎందుకు కాన్సెల్ చేయలేదా అని నాకాశ్చర్యంగా వుంది - అని బో... ల్డంత ఆశ్చర్య పోయారు బదరి.

కానీ తనకి తెలియదు కదా - అది నాకు కారు నేర్పిన Kerry - తొలి - తోలి కాదు - తొలి he చేసిన పూజాఫలమూ అని  - అంత తొందరగా కాన్సెల్ కాదని.

సరే! అప్పటినుంచీ మరీ కాళ్లనే నమ్మకుండా కొంచెం కళ్లు కూడా వాడుతూ కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్ అన్న సముద్రాల వారిని మొదటిసారిగా (మనసులోనే చెంపలేసుకుని) వ్యతిరేకిస్తూ కుడి ఎడమయితే పొరపాటేనోయ్ - వూరుకోరోయ్ (వూరుకోరు+ఓయ్) అని - మనసులో అనుకుంటే మళ్లీ మర్చిపోతానేమోనని - పైకే పాడుకుంటూ - అప్రమత్తతతో కారు డ్రైవ్ చేయడం అలవాటు చేసుకున్నాను.

ఇంతలో బుజ్జిజింక సమ్మర్ స్కూల్ మొదలయింది. మొదటి రెండు మూడు రోజులూ కొంచెం ముందరే వెళ్లి స్కూల్ వెనకాల చదునుగా వుండే పార్కింగ్ లాట్ లో పార్క్ చేశాను. నాలుగో రోజు కొంచెం ఆలశ్యం అయ్యింది. ఎప్పుడూ పెట్టే చోట పార్కింగ్ దొరకలేదు. ఇంక ముందు పక్క పార్క్ చేయడం తప్పలేదు. సరే అని - ముందు పక్కకి వచ్చి పార్క్ చేస్తుంటే కొంచెం ఎక్కువ తొక్కానేమో నా కారు అలిగి ముందున్న గట్టెక్కి -  గట్టవతల లోయలా వున్న గడ్డిలోకి దిగింది. వెంటనే కారు ఆపి బుజ్జిజింకని కారు దిగిపొమ్మన్నాను - ఆ లోయలో ఏమన్నా పల్టీ కొడితే గిడితే వాడికి దెబ్బలు తగలకూడదని.

నేను మాత్రం - సముద్రంలో మునిగిపోతున్నా ఓడ వదలని కెప్టెన్ లా ఫీలయిపోతూ - కారుని ముందుకి పోనిచ్చి స్కూల్ చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి సవ్యంగా పార్క్ చేసి ఇవతలికి వచ్చాను. నేను ఆ ప్రదక్షిణ చేసే టైం లో ఆ గడ్డిలో నడిచి వస్తున్న బుజ్జిజింకని వాడి క్లాస్మేట్ ఒకడు "Is your mom crazy?" అనడగడం విని బో... ల్డంత నవ్వుకున్నాను :))

ఆ తర్వాత - కారూ, నేనూ - నా సరి నీవని , నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే - అని పాడుకుంటూ సాఫీగా సాగిపోతున్నాము. అపార్టుమెంట్ లో మొదటగా డ్రైవింగ్ నేర్చుకుంది నేనే. ఆ ఉత్సాహంలో - ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం తాజాగా వచ్చే కూరల కోసమని అంబికా స్టోర్ కి అనితనీ, పద్మనీ - ఇంకా ఎవరొస్తే వాళ్లని ఎక్కించుకుని ఒక చిన్న షటిల్ సర్వీస్ మెయింటెయిన్ చేసేదాన్ని.

మొత్తానికి నాకు సెయింట్ లూయిన్ లో లోకల్ రోడ్డులు దున్నడం వచ్చేసింది కానీ హైవే మీదకి వెళ్లడం బెరుగ్గానే వుంది. హైవే మీద మెర్జ్ అవడం ఇంకా భయమే.

అలాంటి ఒకానొక రోజు - బుజ్జిజింకని తీసుకుని St. Chalres Rock Road లో Circuit City కి ఏదో ఎలెక్ట్రానిక్స్ కొనడానికి వెళ్లాను - బదరికి కావాలంటే. కావలిసినవి తీసుకుని బయటికి వస్తూ కొంచెం కన్ఫ్యూజ్ అయి హైవే మీదకి వచ్చేశాను.

ఒక్క క్షణం ఎటు వెళ్లాలో అర్థం కాలేదు.  ఏదయితే అదయింది - అంతగా అయితే ఎదో ఎగ్జిట్ వచ్చేవరకూ ఎంత దూరమయినా వెళ్ళిపోదామని ఒక పక్కా - అలా వెళ్తే షికాగో దాకా వెళ్ళిపోతానేమో అని భయం ఇంకో పక్కా - దాంతో ఎప్పుడూ ఏదో కబుర్లు చెప్తూ పాటలు పాడుతూ వుండే నేను సైలెంట్ గా డ్రైవ్ చేస్తుంటే - వెనక సీట్లోంచి - బుజ్జిజింక గొంతు బెంగగా - "అమ్మా! Are you crying?" అంటూ వినిపించింది.

 "ఛ!  అదేం లేదు నాన్నా! అదిగో నెక్స్ట్ ఎగ్జిట్ లో తిరిగిపోదాం" అంటూ వున్నానో లేదో 17 - Dorsett Road అని - మా ఇంటికి వెళ్లే దారే  కనిపించింది.

అంతే .... మళ్లీ పాట మొదలు -
మేఘాల పైన సాగాలి .... నువ్వు కదం తొక్కుతూ ఉరకాలి - నే బ్రేకు తొక్కుతూ ఆపాలి .. అహహా అహహా 

అలా మొదలయిన నా కారు చోదనం - ఎప్పటికప్పుడు ... అంతం కాదిది ఆరంభం !

ఇవాళ్టితో నా కారు కబుర్లు సమాప్తం! ఇంకోసారి ఎప్పుడైనా నాకే తెలియని నా దారుల కబుర్లు!






19, సెప్టెంబర్ 2016, సోమవారం

త్వామనురజామి - 5 - లెక్కలు మార్చినా స్ట్రెస్సెంబరే

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ 

రత్నాంటీ బెంగళూరుకు తిరిగి వెళ్లడం, మళ్ళీ అపర్ణ నేను కాలేజ్ కి కలిసి వెళ్లడం - క్లాసుల్లేని టైం లో కాలేజ్ కి ఎదురుగా వున్న నర్సరీలో మొక్కలనీ-మొగ్గలనీ పలకరించి రావడం - మాకు వేడుకయిన వాడుక అయింది.


అపర్ణ బుద్ధిగా ఆంటీ చెప్పినట్టు విని మాథ్స్ (కోటేశ్వర రావు గారు), ఫిజిక్స్ (BRR - రాఘవేంద్రరావు గారు), కెమిస్ట్రీ (JBS - భవభూతిశర్మ గారు) ట్యూషన్లలో చేరింది.

నాకసలే ట్యూషన్స్ అంటే అంతగా గిట్టదు. పొద్దున్నే ఐదింటికి లేచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సరస్వతి ఆంటీతో అడివి బాపిరాజు - గోనగన్నారెడ్డి, శరత్-శ్రీకాంత్ కబుర్లు  చెప్పుకుంటూ వాకింగ్ చేయడంలో వున్న మజా అదే టైం లో చదువుకోవడానికి వెళ్లడంలో వుండదు.  అందుకే కదా ఇంజినీరింగ్ లో సీట్ రానీ  రాకపోనీ అని ఏ రవి లోనో , విజ్ఞాన్ లోనో చేరకుండా తప్పించుకుంది!

అసలు  B.Sc ఫస్ట్ ఇయర్  బాచ్ ట్యూషన్స్ ఫలానా రోజు మొదలవుతాయని తెలిసినా కావాలని కొంచెం ఆలశ్యంగా వెళ్లాను ;) నే కోరుకున్నట్టే ముగ్గురు లెక్చరర్లూ బాచెస్ పూర్తయ్యాయి - ఇంకెవరినీ చేర్చుకోలేమని చెప్పారు.

దాదాపు గంతులేస్తున్నట్టు ఇంటికి వచ్చాను - కానీ ఇంటి గేట్ దగ్గర్నుంచి మొహం లో బుగ్గలకి కొంచెం దిగులు రాసుకుని  అమ్మకి ఈ ఏడాదికి ట్యూషన్స్ కి వెళ్లడం కుదరదని  చెప్పాను.

"అవునే ఆస్కారి! ఇంక ఆ ముగ్గురూ తప్ప గుంటూరులో ట్యూషన్స్ చెప్పేవాళ్ళే లేరా ?" -  అమ్మ పక్కనే నించుని నా నటనకి ప్రశంసా పత్రమిస్తూ కుట్టి ప్రశ్న.

"నీకెందుకు నా గొడవ? " అని దాన్ని కసుర్తూ - మా అమ్మ "ఆస్కారి" అంటే ఏంటీ అని అడిగేలోగా  - "పోన్లేమ్మా,  నేను ఏ రోజు లెసన్స్ ఆరోజు చదివేసుకుంటాను" అని చెప్పబోతుండగా - మా అమ్మ వదులుతుందా - "అన్నీ సరే కానీ మాథ్స్ కి మాత్రం ఎక్కడో అక్కడ ట్యూషన్ కి వెళ్లాల్సిందే" - అని చెప్పింది.

ఇంకా తప్పదు కదా - అలా KSRK సుబ్బారావుగారి మాథ్స్ ట్యూషన్ లో నేను చేరడం - ప్రతీ రోజు సాయంత్రం పప్పీ, కుట్టీ నన్ను సైకిల్ మీద రవిశంకర్ హోటల్ పక్కనే వున్న ఆయన ఇంటి దగ్గర నన్ను దింపడం - తీసుకురావడం - సాయంకాలాలు అలా మేడ ఎక్కడానికి లేకుండా అయిపోయింది.

నాకు కదులుతున్న సైకిల్ ఎక్కడం వచ్చేది కాదు - అందుకని పాపం - సైకిల్ వెనక నన్నెక్కించుకోవడానికి పప్పీ కొంచెం ఇబ్బంది పడేది. జిగ్-జాగ్ గా తొక్కుతూ వారానికి రెండు సార్లయినా పడేయడం ప్రాక్టీస్ చేసేది - నేనెక్కడ భయపడకుండా దాని వెనకాల ఎక్కడం అలవాటు చేసేసుకుంటానో అన్నట్టు.

ఇదిలా కాదని ఒక రోజు కుట్టీ నడిగాను సైకిల్ తొక్కడం నేర్పించమని. సరే అని ఒక ఆదివారం మధ్యాహ్నం భోజనాలవగానే ఎర్రటి ఎండలో - పద నేర్పుతాను - అని ఎవరూ ఎక్కువగా తిరగని ఐదో లైను లోకి తీసుకెళ్లింది. నేను సైకిల్ ఎక్కి సీట్ మీద కూర్చోగానే వెనకాల పట్టుకుని - ఊ  తొక్కింక - అంది కుట్టి.

కొంచెం దూరం వెళ్లగానే - "ఎలా ఆపాలో తెలియట్లేదే" - అంటే హేండిల్ బార్ కి ఉంటాయి బ్రేకులు నొక్కమంది. నేను ఒక చేత్తో కుదరట్లేదని రెండు చేతులతో గట్టిగా బ్రేక్ వేయడానికి ట్రై చేస్తుంటే - కుట్టిపిల్ల సడెన్ గా సైకిల్ గట్టిగా పట్టుకుని ఆపేసి - "లల్లెమ్మా - ఇంక దిగవే - ఇలా అయితే అయినట్లే. నిన్ను గుద్ది ఎదుటివాళ్ళు బాధ పడతారు .  ఎందుకొచ్చిన గొడవ! నేనో పప్పమ్మో నిన్ను మోసుకెళ్లి ఆ ట్యూషన్లో పడేస్తాం - అవగానే ఇంటికి తెచ్చి పడేస్తాం - ఇంకీ  జన్మలో సైకిల్ తొక్కడానికి ట్రై చేయకు . నీకూ దేశానికీ కూడా మంచిది" - అని సైకిల్ ఒక చేత్తో , నన్నింకో చేత్తో ఇంటికి లాక్కొచ్చేసింది. అలా నా సైకిల్ తొక్కుట - మూడు పెడళ్ల  ముచ్చట అయిపోయింది.

ఇంక కాలేజ్ విషయానికి వస్తే అపర్ణకి, నాకు మా వందేళ్ల కాలేజ్ ని చూసుకుని భలే గర్వంగా వుండేది. ఫిజిక్స్ మెయిన్ అని చెప్పుకోవడం ఇంకా బావుండేది.

కాలేజ్ లో టర్మ్-ఫీ కట్టాలంటే నాకు చాలా మొహమాటంగా వుండేది. ప్రతీ టర్మ్ లో మూడు చలానాలలో పూర్తి పేరు రాయాలి. అది - పాపం - ఆఫీస్ లో వుండే సాల్మన్ అనే ఒకాయన డ్యూటీ. K.R. అపర్ణ అని తన మూడు చలానాలు రాసేసిన  తర్వాత నా పేరుతో రాయబోయే ముందు వేళ్లు ముందుకీ వెనక్కీ విరుచుకునేవారు ఆయన. "V.ల.లి.తా. త్రి.పు.ర.సుం.ద.రి" అని నా పేరులో వున్న అక్షరాలని వత్తి పలుకుతూ "ఎందుకమ్మా ఇంత పెద్ద పేరు పెట్టుకున్నావు?" అని నాపేరులో వున్న అక్షరమక్షరానికి అడుగుతూనే వుండేవారు.

టర్మ్-ఫీ కట్టిన ప్రతీసారీ అపర్ణతో చెప్పేదాన్ని - ఆ సాల్మన్ గారి కోసమయినా నేను పేరు మార్చేసుకోవాలి అని. అలా అని నిజంగానే ఒకరోజు చెప్పేశాను తనతో - "నాకు యండమూరి "ఆనందోబ్రహ్మ" నవలలో వాడిన నీహారిక (మంచుతెర) అన్న పదం నచ్చిందీ - ఇవాల్టినుంచి నా పేరు - లలితా నీహారిక"  అని. తనకీ అది తెగ నచ్చేసింది. నాకిష్టమయిన మాథ్స్ టెక్స్ట్ బుక్ మీద రాసేసుకున్నాను - నా కొత్త పేరు. చాలా మంది నా అసలు పేరు తెలియని వారు అదే నా పేరు అని నమ్మేంతగా పాపులర్ అయిపోయింది నా కొసరు పేరు - నా టెక్స్ట్ బుక్ అరువు తీసుకున్న సింహాచలం అనే ఒక అబ్బాయి పుణ్యమా అని. 


సాధారణంగా ప్రతీ క్లాస్ లోనూ ముందుగా అటెండెన్స్ తీసుకునేవాళ్లు  లెక్చరర్స్. అటెండెన్స్ తీసుకోగానే "ఎవరికి  క్లాస్ ఇంట్రెస్ట్ లేదో వాళ్లింక బయల్దేరచ్చు" అనగానే ఒక పదిమంది తప్ప అందరూ లేచి వెళ్లిపోయేవారు. ఒక్కోసారి అపర్ణ, నేనూ తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు. అలాంటప్పుడు Thermodynamics టీచ్ చేసే RSP (పార్థసారధి) గారు "మీ ఇద్దరూ కూడా వెళ్ళిపోతే నేను ఈ క్లాస్ కాన్సెల్ చేయొచ్చు కదమ్మా - నాకా ఛాన్స్ ఇవ్వరు మీరు" అని ముద్దుగా విసుక్కుంటూనే పాఠం చెప్పేవారు - అద్భుతంగా - మళ్లీ పరీక్షలకి చదివే అవసరం లేకుండా కూడా గుర్తుండేలా. అసలు ACC లో అందరు లెక్చరర్స్ అంతే - KRCP, JBS, KHR, KR - క్లాసులో ఇద్దరు వున్నా, వంద మంది వున్నా చెప్పే పాఠంలో తేడా ఉండేది కాదు - ఆ కాలేజ్ గురించి విని అక్కడ జరిగే గొడవ గురించి పట్టించుకోకుండా నన్నక్కడ చేర్చిన మా నాన్ననిర్ణయం ఎంత మంచిదో నాకే తెలుసు.

సరే! అపర్ణా, నేనూ - మాకు క్లాస్ లోపలా-బయటా క్లాసులకి క్రమం తప్పకుండా వచ్చే అమ్మాయిలుగా మాకు దొరుకుతున్న ఎక్స్ట్రా-ఎటెన్షన్ కి మురిసిపోతూ వున్న రోజుల్లో - ఒక రోజు - ఫస్ట్ అవర్ అని ఫిజిక్స్ బిల్డింగ్ వైపు వెళ్తూ వుంటే సింహాచలం ఎదురొచ్చి - "ఇవాళ క్లాస్ లేదు" అని చెప్పాడు. మేమిద్దరం మహా ఆనందంగా జనతా బజార్ పక్కనే వున్ననర్సరీకి వెళ్లాము - మా పూబాలలు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి.

తీరా ఆ రెండో రోజు తెలిసింది - RSP గారు వచ్చి క్లాస్ లో ఎవరూ లేరని వెనక్కి వెళ్లిపోయారని.

అంతే - ఇద్దరం గబగబా నడుచుకుంటూ ఫ్రెండ్స్ మధ్య కబుర్లు చెప్తూ నించున్న సింహాచలం దగ్గరికి వెళ్లాము.

"Are you the one who said there was no Physics class yesterday?" - సాధ్యమయినంత మర్యాదగా అడుగుతున్న అపర్ణ ప్రశ్న వినగానే ఎదో చెప్పడానికి ఆతను నోరు తెరవబోతుంటే -

ఇంకో మాట మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా

"Why did you say like that? Don't play such cheap tricks again!" - అని గట్టిగా చెప్పి అపర్ణని తీసుకుని ఇవతలికి వచ్చేస్తున్న నన్ను నోరు తెరుచుకుని చూశారు - సింహాచలం, అతని ఫ్రెండ్స్, ఆ వెనకాల వున్న మా సీనియర్స్.

అంతకు ముందు చూచాయగా విన్న నా రాళ్లు-రువ్వు-పర్వం ప్లస్ ఇప్పటి ఈ బెదిరింపు ఎపిసోడ్ కలిపి నాకు చా...లా మంచి పేరు తెచ్చిపెట్టాయి ACC లో :))

మొత్తానికి మా BSc ఫస్ట్ ఇయర్ ఆడుతూ పాడుతూ అయిపోవచ్చింది - మా ఫైనల్ ఇయర్ బ్యాచ్ వాళ్ల ఫేర్-వెల్ లో "భలే మంచి రోజు - పసందైన రోజు" పాడిన రవిప్రకాష్ సాక్షిగా :)

ఫైనల్ ఎగ్జామ్స్ - ఇంగ్లీష్, హిందీ అయ్యాయి - మూడోది మాథ్స్ -  పేపర్ తీసుకుని చూస్తే అంతా గ్రీక్ & లాటిన్.  ఎగ్జామ్ హాల్ లో ఇన్విజిలేటర్ల గుసగుసలు - అవుట్-ఆఫ్-సిలబస్ పేపర్ అని.

తల తిప్పి చూస్తే అపర్ణ తల వంచుకుని ఏదో రాసేస్తోంది. నాకేమో ఏం రాయాలో తెలీట్లేదు - అమ్మ చెప్పిన మాట విని అపర్ణ లాగా కోటేశ్వరరావు గారి దగ్గరికి మాథ్స్ ట్యూషన్ కి వెళ్లనందుకు నన్ను నేను తెగ తిట్టేసుకున్నాను.

ఒక అరగంటలో - మొదటిసారిగా - పరీక్ష రాయకుండా బయటికి వచ్చేశాను. ఇంకో రెండు గంటల తర్వాత అపర్ణ వచ్చింది. ఆ ఏడాది మార్చ్ లో మాథ్స్ పరీక్ష  అవుట్-ఆఫ్-సిలబస్ అయినా సరే రాసిన వాళ్లు ఇద్దరే అనుకుంటాను - అందులో సార్ధక నామధేయి - అపర్ణ ఒకటి. ఏదయినా మొదలు పెడితే పూర్తి చేసే తీరుతుంది తను - రిజల్ట్ గురించి ఆలోచించకుండా.

BSc ఫస్ట్ ఇయర్ లో మాథ్స్ లో కాలేజ్ ఫస్ట్ - నా ప్రియనేస్తం అపర్ణ.

ఇద్దరం బోల్డంత సంబరంగా వెళ్లి కాలేజ్ మాథ్స్ డిపార్టుమెంట్ ఇచ్చే సిల్వర్ మెడల్ తెచ్చుకున్నాం - వచ్చింది తనకే అయినా - నాకే ఇచ్చిన సంబరం.

తర్వాత - నా చదువు మొత్తంలో సెప్టెంబర్ లో రాసిన ఒకే ఒక్క పేపర్ - మొదటిదీ, చివరిదీ అదే - మాథ్స్.

అదేం అదృష్టమో ఆ ఏడాది సెప్టెంబర్ కూడా అవుట్-ఆఫ్-సిలబస్ పేపరే. కానీ ఈసారి వదిలేయలేదు - రాసేశాను.

ఈరోజుకీ ఆ మాథ్స్ పేపర్ గుర్తుకొస్తే అది మార్చ్ లో రాయక  లెక్కలు మార్చినా నా సెప్టెంబర్  స్ట్రెస్సెంబరే అయింది అనిపిస్తుంది !!

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>> 



8, సెప్టెంబర్ 2016, గురువారం

కారే చోదకులు?! కార్లను నడపరే! - (ఆరంభం)

"మీకన్నా మీ మూడేళ్ళ బాబుకి తొందరగా వస్తుందండీ డ్రైవింగ్!" - ఎంత ఏసీ కార్లో వున్నా నేను రోడ్డు మీద చేయాల్సిన ఫోకస్ కూడా తనే చేసిన అలసటతో -  కొంచెం చిరాకుతో అన్నారు కృష్ణార్జున్.

కృష్ణార్జున్ కాకినాడలో డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్. (అదే మొదటి సారి & ఆఖరు సారి ఆ పేరు వినడం - మళ్లీ ఆ పేరున్న వాళ్లు తటస్థ పడలేదు ఇప్పటిదాకా. అతను అప్పట్లో కాకినాడలో మంచి పేరున్న డ్రైవింగ్ స్కూల్ ఓనర్ అన్నట్లు గుర్తు.)

అప్పటికే COMSYS లో ఇంటర్వ్యూ అయ్యి ఇంకా రేపో మాపో అమెరికాకి విమానమెక్కాలి ఎక్కాలి అన్నట్టు వున్న రోజులు. బ్రిటన్ ఆఫీస్ నుంచి పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన Cathy చెప్పింది - బయలుదేరేముందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోమని. అది వినగానే ఫక్కున నవ్వబోయి - అసలే వచ్చీ రాని ఉద్యోగం  ఉరిమీ కురవని వానలాంటిది కదా - నా నవ్వు నాలుగ్గండాల పెట్టు అని ఆపుకున్నాను.

నాకు ముందు నుంచీ మెకానికల్ / ఎలెక్ట్రానిక్ వస్తువులు ఏవైనా వాడాలంటే ట్యూన్ అయ్యీ అవని రేడియోలాగా స్టార్టింగ్ ట్రబుల్. చిన్నప్పుడు ఇంట్లోనూ అంతే - ఏదయినా కొత్త టూఇన్-వన్నో, టీవీనో, వీసీఆరో - ఏది కొన్నా పప్పీనో,  కుట్టీనో పెడితే చూడడమే కానీ నేను ముట్టుకునేదాన్ని కాదు. అసలు నేనిప్పుడు చేసే ఉద్యోగానికి, నా స్వభావానికి పొంతనే లేదు :))

సరే ! మరి - డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా. అప్పటికే బదరి ఒక్క క్లాసు లోనే పూర్తి చేసి వున్నారు కృష్ణార్జున్ దగ్గర. బదరి డ్రైవింగ్ స్కిల్స్ తో మహా ఇంప్రెస్స్ అయిపోయిన కృష్ణార్జున్ ఉత్సాహంగా ఒప్పుకున్నారు - నాకూ నేర్పడానికి.

అప్పటికి అమ్మ-నాన్న ఇంకంటాక్స్ కాలనీలో ఇల్లు కొని గృహప్రవేశం చేశారని కాకినాడ వచ్చిన - పాపాయత్తయ్య, లక్ష్మి దొడ్డ, ప్రసాద్ మామయ్య, చెల్లాయత్త, తంబి మామయ్య - వలసపాకలలో  వున్న మాఇంటికి వచ్చి వున్నారు
నన్ను చూడడానికి .

పొద్దున్నే తొమ్మిదింటికి కృష్ణార్జున్ కార్ మా ఇంటి ముందు ఆగగానే - ఆ టైం కి ఇంట్లో వున్న వాళ్లు అందరూ బయట కాంపౌండ్ వాల్ దగ్గరికి వచ్చేసి - "మన లల్లెమ్మ కార్ డ్రైవింగు చేస్తోంది. చూద్దాం రండ్రండి"- అని అదేదో నేను అంతరిక్షయాత్రకి వెళ్తున్నానేమో అన్నంత సంబర పడిపోయేవారు - నేను, నా కారు కనిపించినంత మేరా చేతులు ఊపుతూ.

అసలే - నాకు సినిమా పరిజ్ఞానం ఎక్కువ.  కార్ ఎక్కీ ఎక్కకుండానే - హిందీ సినిమాలో దేవానందో, తెలుగు సినిమాలో కృష్ణో - పెదవి బిగబట్టి రౌడీలని వెంబడించేటప్పుడు స్టీరింగుని 360 డిగ్రీలు తిప్పేస్తూ వుంటారే - అలా తెగ తిప్పేద్దామని చూసేదాన్ని.  అలా తిప్పితేనే కారు వెళ్తుంది అని నేనొక కార్రూలు బుక్కు రాసేసేదాన్నే - పక్క సీటులోంచి - దాదాపు పళ్లు కొరుకుడు నేపథ్య సంగీతంతో - అప్పటికి పదిసార్లు "అది పవర్ స్టీరింగ్ అండీ - జస్ట్ కొంచెం తిప్పితే చాలు - కార్ డైరెక్షన్ మారుతుంది " అన్న మాటలు వినిపించకుండా వుండి వుంటే. 

అలా మొదలయిన నా డ్రైవింగ్ - మొదటి వారం, రెండో వారం, మూడో వారం - అదేదో నేను వెళ్లే దారులన్నీ ట్రాఫిక్-బందు-వారోత్సవాల్లో పాల్గొంటున్నట్టు  - నా కారుని చూడగానే జనాలు ఇంట్లోకి దూరి తలుపులు వేసుకుని కిటికీల్లోంచి మాత్రమే నన్ను చూసేలా - అయిపోయాయి కానీ నా చోదక శక్తి "యించు"కైనా ఇనుమడించలేదు.

నాలుగో వారం అవుతుండగానే - "బదరీ గారు - ఇలాక్కాదు గానీ. RTO ఆఫీసులో తెలిసిన వాళ్లుంటే లైసెన్స్ తెచ్చేసుకోండి" అనడం తడవు - నాకు బోల్డు ఆనందం - ఇంక డ్రైవింగ్ లెసన్స్ ఉండవని. మొత్తానికి నాకో లైసెన్స్ వచ్చింది - ఎలాగో నాకే తెలీదు - ఇప్పుడు చెప్పడానికి.

నాకు లైసెన్స్ వచ్చింది అని తెలిసిన దగ్గర్నుంచీ - మా నాన్న దగ్గర పనిచేసే కారుడ్రైవర్ హనుమంతరావు - మరీ అవసరం ఉంటే తప్ప నాతో  మాట్లాడడం మానేశాడు. ఒకరోజు నాతో - "పాపగారు! మీరు అంబాసడర్ డ్రైవ్ చేయడమేంటండీ చిరాగ్గా - మీకు ఫారిన్ కారే కరెక్ట్" - అన్నాడు కూడా. పాపం! ఏవో తనకీ ఏవో సినిమా సీన్లు గుర్తుకొచ్చి వుంటాయి - ఓనర్ కూతురు ఆక్సిడెంట్ చేస్తే డ్రైవర్ మీద పెట్టి జైలుకి పంపి కూతుర్ని రక్షించుకున్న కథలు. అందుకే తెలివిగా జాగ్రత్త పడ్డాడు. సర్లే ! నాకూ అంత వీరకారాభిమానం లేదు కాబట్టి "పోన్లే - బతికి పోనీ - బండి తోలుకోనీ" అని వదిలేసాను.

ముందు బదరీ, తరవాత నేనూ, బుజ్జిజింక (అన్న) అమెరికా వచ్చేశాము. వచ్చిన మూడు నెలలకి కారు కొన్నారు బదరి. అసలే ఇక్కడ కార్ డ్రైవింగ్ రాకపోతే నడవడం రాదేమో అన్నట్టే. బుజ్జిజింక స్కూల్ దగ్గరే ఆయినా డాక్టర్ అప్పాయింటుమెంట్లకీ, ఏవైనా గబుక్కున వెళ్లి తెచ్చుకోవాల్సిన షాపింగులకీ - అన్నిటికీ బదరీ ఆఫీస్ నుంచి వచ్చాక వెళ్దాము అంటే - పాపం - తనక్కూడా ప్రతీ దానికీ పరుగులు పెట్టడమే అవుతుంది కదా - అని ఇంక తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలని అనేసుకున్నాను. స్టేట్ రూల్స్ ప్రకారం రిటెన్ టెస్ట్ రాసి లెర్నర్స్ లైసెన్స్ తెచ్చుకున్నాను.

నా సంగతి తెలుసు కదా బదరీకి! అందుకని - తను తీసుకెళ్తే నాకు కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, తొందరగా నేర్చుకుంటాను - అని ఒక శనివారం పొద్దున్నే తొమ్మిది గంటలకి ఒక విశాలంగా వున్న ఒక స్కూల్ గ్రౌండ్ కి తీసుకెళ్లారు. వెనక సీట్లో బుజ్జిజింకతో సహా. తీరా అక్కడికి వెళ్లాక ఒక పది నిముషాలు కాగానే వెనక సీటులోంచి స్కూల్ గ్రౌండులో బెంచ్ మీదకి బుజ్జిజింక బదిలీ - బదరి దవడ కండరం బిగిసీ ;)

కాకపోతే - మేమసలే శాంతి కాముకులం - మాదసలే మహా శాంతియుత సాహచర్యం - కాబట్టి ఆట్టే కాలం వృధా చేయకుండా, రక్తపోటు మరీ హెచ్చకుండా - డ్రైవింగ్ లెసన్స్ తీసుకుందామని నిర్ణయించేసుకున్నాం - ఏకగ్రీవంగా.

మళ్ళీ - చరిత్ర పునరావృతం అయినట్టు - బదరి ఏ Kerry దగ్గరైతే కార్ నేర్చుకున్నారో - ఆ Kerryనే నాకూ డ్రైవింగ్ నేర్పడానికి వచ్చాడు.

మొదటి ఒకటి రెండు క్లాసుల్లో సరదాగా మాట్లాడుతూ ఇండియా గురించేవో జోకులు వేయిబోయాడు - "ఏంటీ?! మీ ఇండియాలో ఒక రోడ్డు మీద కొంచెం దూరం వెళ్లగానే తర్వాత రోడ్డు సడెన్గా మాయమయిపోతుందట కదా ?!" అంటూ.

మా అమ్మ అన్నట్టు విసుగు ముందు పుట్టి తరవాత నేను పుట్టానేమో - అతనికేసి విసుగ్గా చూసి - "అదెవరు  చెప్పారో తెలీదు కానీ నేను వచ్చిన సిటీలో ఇంతకన్నా బావుంటాయి రోడ్లు (ఆ మాట అనే టైంకి నా కళ్ల ముందు వెలిగిన రోడ్ - బెంగళూరులో నాకెంతో ఇష్టమయిన ఒకప్పటి - ఎం జి రోడ్)" అనగానే ఇంక జోకులు ఆపేసి సీరియస్ గా డ్రైవింగ్ నేర్పాడు. ఒక ఐదు క్లాసులు కాగానే టెస్ట్ కి తీసుకెళ్లాడు.

పారలెల్ పార్కింగ్ తో సహా అన్నీ బాగానే చేసి 85% మార్కులతో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాను. టెస్ట్ అయిపోగానే బయట చెట్టుకింద వెయిట్ చేస్తున్న Kerry దగ్గరికి వెళ్లి ఆనందంగా పాస్ అయ్యానని చెప్పగానే "ఉఫ్" అని ఒకసారి గా....ట్టిగా నిట్టూర్చి - " నీకసలు ఎనభై కూడా వస్తాయి అనుకోలేదు - అందుకే భయంగా చెట్టు చాటుగా నుంచుని చూస్తూనే వున్నాను - బానే చేశావు - I got to be very lucky" అని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు.

ఆ మాటలు విని ముందు ఉక్రోషంగా అనిపించినా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన సంతోషంలో అంతగా పట్టించుకోలేదు నేను.

అసలు కథ ఇప్పుడే ఆరంభం -
కానీ...
బ్రేక్ కే బాద్ - మై మరింత బాదూం!
అంత దాకా - Stay tuned ! :))

[మిగిలిన భాగం - వచ్చే వారం కాక ఆ పై వారం ]







4, సెప్టెంబర్ 2016, ఆదివారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 1 - నాన్నమ్మ


పిల్లలకి తొలిగురువు అమ్మ.
తర్వాత ఒడిలో కూర్చోబెట్టుకుని  చేయి పట్టి పలక మీద

              ఓ నమః
               శివాయః
              సిద్ధం నమః

- అని  అక్షరాభ్యాసం చేయించిన  రామశేషు మాస్టారితో మొదలుకొని  చదువు పూర్తయేదాకా ఇంకెందరో చదివించిన గురువులు.


ఈ అసలు గురువులే కాక - నా చేత ఏ పుస్తకాలూ చదివించకుండా, పరీక్షలు పెట్టకుండా -  జీవితాన్ని అందంగా దిద్దుకోవడానికి, అవసరమైన చోట నెగ్గడానికి - కావాల్సిన చదువుని నేర్పించీ నేర్పించనట్లు నేర్పించిన నేర్పరులయిన గురువులెందరో . అలాంటి కొందరు గురువులూ  - వాళ్లనుంచి నేను నేర్చిన పాఠాల కబుర్లే - ఈ చదివించని గురువులు series.

అందులో ప్రథమ తాంబూలం -  ఆది పూజితుడయిన పార్వతీ తనయుని గురించి -

అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుచేసి ప్రార్ధింతుమదిన్ !!


- అన్న అచ్చ తెలుగు పద్యం నాకు నేర్పిన మా నాన్నమ్మకే.


నాన్నమ్మ 

"కమలములు వికసించే
కమలాప్తుడుదయించే
లోకసుందరి బాలా మేలుకో
కమల మొదలయిన అమర కాంతలెల్లా
నిను గొల్వ వచ్చిరి మేలుకో
తెల్లవార వచ్చెనూ ..."

అన్న మేలుకొలుపుతో నాన్నమ్మ దినచర్య మొదలు.


మడి కట్టుకుని పదింటికల్లా - వంకాయ కారం పెట్టి కూర, కొబ్బరి కాయ తియ్య పచ్చడి, కందిపప్పు పోపుతో రుబ్బి పెరట్లో కాసిన అరటికాయ, పొలం నుంచి వచ్చిన ఆనపకాయ వేసి సాంబారు - దాదాపు రోజూ ఇలా ఒక కూర, పచ్చడి, పులుసో -సాంబారో - అంత వంటా పూర్తి చేసి - ఇంట్లో అప్ప, నాన్న, పిల్లలం మేమందరం భోంచేసే దాకా - ఆ మడిచీర తోనే  కటకటాల్లో (గ్రిల్ వేసి వుండే మా ఉయ్యాల బల్ల గదిని కటకటాలు అనే పిలుస్తాము - ఇప్పటికీ ) ఉయ్యాల బల్ల పక్కనే స్తంభం దగ్గర కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు.

చిన్నతనంలో ఒక్కోసారి అసలు నాన్నమ్మ ఏం చేస్తారో చూద్దాం అని ఆకతాయితనంగా ఆవిడని ముట్టుకుంటే వెంటనే పెరట్లో నూతి దగ్గరికి వెళ్లి చేదతో నీళ్లు తోడుకొని తలారా చన్నీళ్లతో స్నానం చేసి వచ్చి ఇంకో మడిచీర కట్టుకునే వారు తప్ప - చిన్న పిల్లనైన నన్ను ఒక్కసారి కూడా - విసుక్కున్న గుర్తు లేదు. అసలు ఆవిడకి కథలు, వినసొంపుగా సందర్భోచితంగా కబుర్లు చెప్పడం తప్ప ఒక్క మాట కూడా అనవసరమయినది - మాటవరసకయినా, కాలక్షేపానికయినా - మాట్లాడడం అలవాటు ఉండేది కాదు.

మా అందరి భోజనాలయ్యాక ఇద్దరు కోడళ్లతో (లలిత దొడ్డ, అమ్మ) కలిసి భోంచేసేసి మళ్లీ ఉయ్యాల బల్ల దగ్గర కూర్చునేవారు - భారతమో, భాగవతమో పట్టుకుని.


అప్పటికి ఒంటిగంట అయి ఉండేదేమో - ఒక్కొక్కరుగా నాన్నమ్మ స్నేహబృందం - పప్పు అమ్మమ్మగారు నర్సమ్మామ్మ, కాముడు తోచ్చి, సీతమ్మామ్మ, లచ్చిందేవి మామ్మ, కామమ్మ గారు - ఇలా అందరూ వాళ్ల వాళ్ల భోజనాలు ముగించుకుని వచ్చేసేవారు. నాన్నమ్మ చదివే భారతం, భాగవతం వినడానికి. మళ్లీ కాఫీల వేళకి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయేవారు.

నాన్నమ్మ పుస్తక పఠనంలో పిల్లలతో పోటీ పడేవారు. అప్ప (అంటే మా పెదనాన్నగారు) - ప్రతీ రోజు ఉదయం, ఈనాడు, హిందూ లాంటి పేపర్లతో పాటు -  ప్రతీ వారం ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర పత్రిక లాంటి వార పత్రికలూ - యువ, స్వాతి లాంటి మాసపత్రికలూ -  తెలుగు-ఇంగ్లీష్ చందమామలు - ఇలా బోల్డన్ని పుస్తకాలు తెప్పించేవారు. (ఇప్పటికీ ప్రస్తుతం మార్కెట్టులో దొరికే దిన, వార, మాస పత్రికలన్నీ తెప్పిస్తున్నారు కూడా.)


ప్రతీ వారం వారపత్రికలు వచ్చే టైంకి - నేను కనక అప్పటికి ఏ సెలవులో వుండి అనాతవరంలో వుంటే - నాన్నమ్మ, నాన్న, శ్రీను (మా అన్న), నేను - పుస్తకాల కోసం పోటీ పడేవాళ్లం. సాధారణంగా నాన్నో, శ్రీనో గెలిచేవారు. ఎందుకంటే వాళ్లిద్దరూ పేపర్ అబ్బాయి వచ్చే వేళకి వీధి అరుగు మీద నించుని వుండి పుస్తకాలు తీసేసుకుని ఒక బొత్తిలా పక్కన పెట్టుకుని ఒక్కొక్కటి చదివాకే నాకు, నాన్నమ్మకీ ఇచ్చేవాళ్లు. నాన్నమ్మ ఆ పుస్తకాల్లో పార్థు లాంటి సీరియల్సూ, పురాణం సీత - ఇల్లాలి ముచ్చట్లు, మాలతీ చందూర్ - పాత కెరటాలు - ఇలాంటివన్నీ కూడా చాలా ఆసక్తితో చదివేవారు.

ఇంక సాయంత్రం దీపాలు వెలిగించే వేళకి నాన్నమ్మ వీధి అరుగు మీద కూర్చునే వారు. అప్పుడింక ఇంట్లో పిల్లలతో పాటు  అనాతవరం - రెండో వీధి, వెనక వీధి, మూల వీధి - పిల్లలందరూ వచ్చేసేవారు - నాన్నమ్మ చెప్పే కథలు వినడం కోసం.


అప్పుడు నాన్నమ్మ - రామాయణం, భారతం, భాగవతంతో మొదలుపెట్టి  - కాశీ మజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అనే యుగంధర మంత్రాంగ కథలు - ఒక కథలోంచి ఇంకో కథ లోకి వెళ్ళిపోతూ మళ్లీ రాత్రి భోజనాల వేళ అయ్యేదాకా కథలూ, పొడుపు కథలూ, కబుర్లూ ఎన్నో చెప్పేవారు.


నాన్నమ్మ తను చెప్పిన నల-దమయంతి కథ విని తెలుగు పరీక్ష పాస్ అయిన అబ్బాయి గురించి చెప్పుకుని మురిసిపోయేవారు.


నాన్నమ్మ చెప్పిన కథల్లో నాకొక మంచి పాఠం నేర్పిన కథ: పాము - బుస్ కథ. అదిక్కడ చదవచ్చు: http://boldannikaburlu.blogspot.com/2011/03/blog-post_29.html.


ఎవరితోనూ కలహించకుండా - అలా అని ఎవరికీ లోకువ కాకుండా నేను నేనుగానే గానే ఉంటూ అందరిలో 'మనం' గా కలిసి తిరగడమెలాగో నాకు నేర్పిందీ కథ. నేనే కాదు - మా నాన్నమ్మ కథలని తలుచుకునే మా అందరికీ ఇష్టం ఈ కథ. మా పిల్లలకీ పదే పదే చెప్పుకున్న కథ ఇది.


ఇంక రాత్రి పడుకునే ముందు శుక్లాంబరధరం తో మొదలుపెట్టి శ్రీ రామ రామేతి అంటూ - బోల్డన్ని శ్లోకాలు, ఏక శ్లోకీ - రామాయణ, భారత, భాగవతాలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు మా పిల్లలందరికి చెప్తూ పాడించేవారు.

నాన్నమ్మ చెప్తూ వుండగా పిల్లలందరం ఆవిడతో పాటు చదివే -


                రామ స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం
                శయనేయః స్మరే నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి

- శ్లోకంతో మారోజు పూర్తయేది.

మా నాన్నమ్మ పాడే "కలువ రేకుల బోలు కనులు చూచితే చాలు..." అన్న పాట విని  కలకల నవ్వుతూ పెరిగిన పిల్లలమే మేమందరం. ఆ పాట  కోసమే ఇంకో పోస్ట్ రాయాలి నేను.

పిల్లలకి కానీ, పెద్దలకి కాన్నీ ఏ రోజూ ఇలా వుండాలి, ఇది చేయకూడదు అని ఉచిత సలహాలు ఇవ్వడం, అవసరం లేని చోట మాట్లాడడం, మాట్లాడే మాటల్లో పొల్లు మాట రానీయడం అసలు చేసేవారు కాదు నాన్నమ్మ.

ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కరమయిన సన్నివేశం ఎదురైతే అలాంటప్పుడు కూడా  ఏదో మంచి విషయానికి దాన్ని ముడి వేసి అందరినీ తేలికపరిచేవారు.

శివకోడులో - మా ప్రసాద్ మామయ్య పెద్దలనాటి ఇల్లు పడిపోతే - అదే స్థానంలో ఇల్లు కట్టి - గృహప్రవేశం చేసుకునేటప్పుడు - మా చెల్లాయత్త పాలు పొంగించి ప్రసాదం కోసం బియ్యప్పరవాణ్ణం చేసి పెడితే - రాత్రి ముహూర్తమేమో - ఆ చీకటి వేళ కుక్క వచ్చి ఆ గిన్నెని ముట్టుకుంది. ఒక్క క్షణం అందరికీ 'అయ్యో' అనిపించింది. అంతే - నాన్నమ్మ వెంటనే - 'కాలభైరవుడు తిన్నాడమ్మా ప్రసాదం, చెల్లాయి! మంచిదే !' అని సర్ది చెప్పినప్పుడు చిన్నబోబోయిన మా చెల్లాయత్త మొహంలోని నవ్వు ఆ రాత్రిని వెలిగించింది.

అదీ మా నాన్నమ్మ దగ్గర -సోదాహరణంగా - మనసుకి హాయి కలిగించే మాట మనిషికి ఎంత అందమయిన అలంకారమో - ఎప్పటికీ మర్చిపోకుండా నేనేర్చిన భర్తృహరి శ్లోక పాఠం  -

            'కేయూరా న విభూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా
             న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
             వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
             క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం'

నాన్నమ్మ - ఆవిడ జీవిత కాలంలో - అసలు వాడని ఒక పదం - 'లాకేత్వం - దాక్కొమ్ము' ('ల' కు ఏత్వం , 'ద' కు కొమ్ము). మా నాన్న ఆయన చిన్నప్పుడు - అసలెలాగైనా ఆవిడతో ఆ మాట అనిపించాలని - కావాలని - నాన్నమ్మ ఫలహారం కోసం రొట్టెలో, ఉప్పుపిండో చేసిన రోజు - అమ్మా ! భోజనం పెడ్తావా - అని నాన్న అడిగితే - 'ఫలహారం చేశాను - తిను' అనేవారట. నాన్న - ఇంకోసారి, మరోసారి -  అలా ఎన్నిసార్లు అడిగినా అసలు విసుక్కోకుండా ఏది చేశారో చెప్పేవారట గాని పొరపాటున కూడా వండని దాని గురించి  'లేదు' అని చెప్పేవారు కాదట. మాతో మాట్లాడేటప్పుడు కూడా 'లేదు' అనే మాట వాడకుండా 'లాకేత్వం - దాక్కొమ్ము' ఇవ్వకూడదు అనేవారు.

ఇప్పటికీ పిల్లలు ఏమయినా అడిగినప్పుడు అది ఇంట్లో లేకపోతే 'తెచ్చుకోవాలి నాన్నా!' అని చెప్పడం తప్ప 'లేదు' అని చెప్పాలంటే నాన్నమ్మ పక్కనే వుండి 'ఆ.. ఆ...' అని ఆపుతున్నట్టే వుంటుంది.

ఇప్పటికీ మా నాన్నమ్మని ఎరిగున్న ఎవరయినా  - ఎలాంటి పరిస్థితిలోనూ నవ్వుతూ - సందర్భోచితమయిన మయిన కబుర్లు, పాటలు, పద్యాలు, కథలతో - చుట్టూ వున్న అందరినీ అలరించిన మా నాన్నమ్మని - కథల మామ్మగారు, బుల్లెమ్మ గారు - అని ఎంతో ఇష్టంగా తలుచుకుంటుంటారు.


మూడు దశాబ్దాల క్రితం - నాన్నమ్మ వెళ్ళిపోయినా - ఆవిడ ఎప్పుడూ గుర్తు చేసుకునే -

                      కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
                      వారేరీ? సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
                     బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
                     యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!

అన్న భాగవత పద్యంతో సహా  - ఎప్పటికీ మరిచిపోలేని ఎన్నో జీవిత పాఠాలు -  నాకు, నాతో పాటు ఆవిడకి ఆత్మీయులు అన్న వారందరికీ ఇప్పటికీ నిన్నో మొన్నో విన్నట్లుగా గుర్తు వున్నాయి.