24, సెప్టెంబర్ 2016, శనివారం

కారే చోదకులు?! కార్లను నడపరే! - (అంతం కాదిది)

 ఆరంభం ఇక్కడ చదవండి : కారే చోదకులు?! కార్లను నడపరే! - (ఆరంభం)

సరే! డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది.
బస్సులో ఆఫీసుకి వెళ్లాలనుకున్న బదరి నిర్ణయం బావుంది 
ఇంటిముందు కట్టేసిన ఎర్రైరావతం లాంటి టొయోట కరోలా వుంది
జాబ్-మార్కెట్ డిప్ పుణ్యమాని ఇంకా రాని ఉద్యోగముంది
ఇంకేం కావాలి - నాలాంటి అత్యౌత్సాహిక చోదకులకి !?

ఇంతకీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన రోజెలాంటిదంటే...
ఎండాకాలపు మంట మండే రోజు
Kerry గుండె దడ దడలాడిన రోజు
చిన్నప్పుడు బడి రోజులలో కొంచెం ఇష్టమయిన రోజు
సెలవులయిపోయాయని మదికి మరి కొంచెం కష్టమయిన రోజు
అదే నాకెప్పటికీ గుర్తుండే జూన్ నెలలోని 13వ రోజు.

మరలాంటి రోజు లైసెన్స్ తెచ్చుకున్న చేయీ-కాలూ వూరికే వుండమంటే వుంటాయేంటి మరి?

పింకు టీ-చొక్కా, నీలి జీన్సు, పచ్చ కళ్లజోడు - ఎర్ర కారు - వ్వాటే కాంబినేషన్ ! బయల్దేరాను.

మేముంటున్న స్టీపుల్ చేజ్ అపార్టుమెంటు  పార్కింగ్ లాట్ లోంచి కారు రివర్స్ చేసి బయటికి వచ్చి ఎడమ పక్కకి మెక్ కెల్వీ రోడ్ లోకి తిరగగానే - అక్కడ గడ్డిలో కలుపు తీయడానికి వంగి వున్నజిమ్ము (Jim), పక్కనే ఆ తీసిన కలుపు వేయడానికి లాన్-వేస్ట్-బాగ్ పట్టుకుని నించుని వున్నజాకు (Jack) - ఒక్క సారిగా వాళ్లు చేసే పని ఆపి - ఎవరా అని కారుకేసి చూసి - స్టీరింగ్ పట్టిన నన్ను చూసి - ఉలికిపడినవారై - O man! Dangerous driver - అని చెరొక్క గెంతూ గెంతారు - నవ్వుతూ.

నేనంత కన్నా విలాసంగా నవ్వుతూ The grass is greener on the other side అంటారు ఈ వెర్రి వాళ్లు - అటే కాదు , ఇటూ పచ్చగానే వుందే  - అనుకుంటూ (అది నా పచ్చ కళ్లజోడు లోకానికి పూసిన హరిత వర్ణమని అప్పటికింకా అర్థం కాక) కారుని ముందుకి పోనిచ్చాను.

 మెక్ కెల్వీ రోడ్ పొద్దున్న పది గంటల తర్వాత కొంచెం ఖాళీగానే వుంటుంది. నెమ్మదిగా స్పీడ్ పెంచడం,  బ్రేక్ వెయ్యడం, తగ్గించడం - ఇలా మొత్తానికి కారుతో నేనూ, నాతో కారూ - కొంచెం కొంచెంగా అలవాటు పడుతూ సాగుతున్నాము.

ఇంతలో హఠాత్తుగా గుర్తుకొచ్చింది - బదరి పదే పదే గుర్తు చేసిన విషయం - బ్రేక్ వేసేముందు ఒకసారి rear-view mirror లో వెనకాల కార్లు వస్తున్నాయో లేదో చూసుకోవాలని. అరెరె! ఇంత సేపూ ఆ రూలు మర్చిపోయానే అనుకుని - ప్రతి రెండు నిముషాలకి బ్రేక్ వేయడం, వేసే ముందు అద్దంలో చూడడం చేయడం మొదలుపెట్టాను. అలా చూస్తూ అనుకున్నాను - నేనింతకుముందు నడిచి వచ్చే రోజుల్లో ఈ రోడ్డు నల్లగా కనిపించేది , ఇవాళేంటబ్బా కొంచెం గోధుమ రంగులో వుందీ- అని - మళ్లీ - ఈ కారు అద్దంలోంచి చూడడం కదా అలాగే వుంటుందేమో - అని నాకు నేనే సర్ది చెప్పేసుకున్నాను.

ఇంతలో ఒకటి రెండు కార్లు - ఆ సింగిల్ లేన్ రోడ్ లో ఎదురుగా ఏ కార్లూ రాకుండా ఖాళీగా వుండడంతో - నా కారుని పాస్ చేసి వెళ్తుంటే - ఇవేంటబ్బా అసలు నా కారు మిర్రర్ లో కనిపించకుండా ఎక్కడినుంచి వస్తున్నాయి - అని మళ్లీ rear-view mirror కేసి చూస్తే అప్పుడు అర్థం అయ్యింది - అది కొంచెం పైకి తిరిగి వుందీ, అప్పటిదాకా గోధుమరంగులో వుంది అని నేను మురిసిపోయి చూస్తున్నది రోడ్డు కాదు - మా కారు సీలింగూ అని :))

మొత్తానికి ఇంటికి జాగ్రత్తగానే వచ్చేశాను కళ్లద్దాలూ - కారద్దాలూ సరిగ్గా సర్దుకుని.

అలా - ఆ మొదటి కారెడ్వెంచర్ తర్వాత ఓ వారం రోజులు కారెక్కడానికీ - కార్తొక్కడానికీ కొంచెం బెంగగానే అనిపించింది.

ఇంతలో బుజ్జిజింకకి సమ్మర్ స్కూల్ మొదలవుతుందని ఈ-మెయిల్ వచ్చింది. సమ్మర్ క్లాసెస్ కి స్కూల్ బస్ రాదు. అంత ఎండలో - పాపం - వాడిని ఏం నడిపిస్తాను కదా - ఇంత కారూ నేర్చుకుని?! ఎలాగైనా సరే సమ్మర్ స్కూల్ మొదలయేలోగా డ్రైవ్ చేయడం అలవాటు చేసుకోవాలి అనుకున్నాను.

రెండో రోజు పొద్దున్నే లేచి - ఇంటి నుంచి పదడుగులు వేసి - అక్కడ వుండే సిగ్నల్ దగ్గరనుంచి ఇంకో పదిహేను అడుగులు వేస్తే - లేచి మరీ ఎదురొచ్చేట్లుండే - గ్రోసరీ స్టోర్ Schnucks కి కారులో బయల్దేరాను.

మామూలుగా రోజూ నేనూ, పప్పీ నడిచి వెళ్లేవాళ్లం Schnucks కి. (అప్పటికి పప్పీ ఇంకా ఇక్కడే వుంది - ఇద్దరం పక్క పక్క అపార్టుమెంట్లలో వుండేవాళ్లం). నడిచి వెళ్లేటప్పుడు అంతగా రూల్స్ ఏమీ వుండవు - ఎందుకంటే Pedestrian rules the road ;) కాబట్టి. ఇద్దరం కుడిపక్క రోడ్డులోంచి లోపలి వెళ్లి అదే రోడ్డులో బయటికి వచ్చేసేవాళ్లం.

ఇవాళ మరి కారు కదా - అందుకని నేను చేసిన  ధైర్యం అది చేయలేక పప్పీ రానంది - పైగా ఒక కార్లో రెండు కొప్పులు ఇమడవంది.

సరే! ఒక్కదాన్నేవెళ్లాను నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ. లోపలి వెళ్ళేటప్పుడు బానే వెళ్లాను. కొనాల్సినవి కొన్నాను - కొనక్కరలేనివీ కొన్నాను - అసలే అమెరికా ఆర్ధిక వ్యవస్థకి - నేను సైతం ఒక విచ్చు డాలర్ ఇచ్చివేశానూ - అని ఫీలయిపోవాలి కదా!

ఇంక బయటికి రావాలి. నడకకి అలవాటు పడ్డ కాళ్లు కదా - కారెక్కిన రూల్సు వేరే ఉంటాయి అని వాటికి తెలీదు కదా - నేను చెప్పాలి కదా - కానీ నేనేమో ఒక్కదాన్నీ షాపుకి వెళ్లి వస్తున్నానన్న సంతోషంలో ఎటు వెళ్తున్నానో చూసుకోవడంలేదు కదా!!!

ఇన్ని "కదా"లున్నప్పుడు ఏమవుతుంది మరి?! అదే అయింది - ఏ దారిలో అయితే లోపలికి వెళ్లానో అదే దారిలో బయటికి రాబోయాను. ఇంతలో ఎదురుగా ఇంకొక కారుని ఆపి టికెట్ రాస్తున్నాడు - దారి కాసి స్పీడుగా వచ్చే వారికి టిక్కెట్లు వడ్డించే అమెరికాపు (cop).

నా కన్నా ముందు నా కారుకి అర్థం అయినట్టుంది - ఏదో తప్పు చేశానని - టక్కున ఆగిపోయింది. ఆ కాపు-కాని-అమెరికాపు అక్కడ చేస్తున్న పనినాపి నా దగ్గరకొచ్చి - బంగారు తండ్రికి అప్పటికే అర్థం అయినట్టుంది నాది మొట్టమొదటి కార్నడుపుడు వ్యవహారమని -  "Ma'am! You need to go the other way" అని కుడిపక్కనున్న బయటికి వెళ్లే దారి చూపించాడు - మర్యాదగా.

నేను - బడిలో పొరపాటున వేరే క్లాసులోకి వెళ్లి ఉలిక్కిపడి -  వెనక్కి తిరిగే పిల్లాడి మొహం లాంటి మొహం పెట్టి తలూపి రివర్స్ చేయబోయాను. కంగారులో కొంచెం ఎక్కువ తిప్పేశానేమో - కారు వెనక్కి, ముందుకీ కాక - అడ్డం గా తిరిగింది. నేను స్టీరింగ్ తిప్పే కొద్దీ అది ఇంకా ఇంకా అడ్డంగా రోడ్డులో ఇరుక్కుపోతోందే కానీ వెనక్కి వెళ్లట్లేదు.

వెంటనే కారు దిగి వెళ్లి - ఆ పోలీస్ దగ్గరికే వెళ్లి - నా కారు రివర్స్ చేయడం రావట్లేదు, హెల్ప్ కావాలీ అనడిగాను. అప్పటికే ఎవెరికైతే టికెట్ ఇస్తున్నాడో ఆ కారతను నన్నూ - పోలీసునీ మార్చి మర్చి కొరకొరా చూస్తున్నాడు.

ఆ ... అలాంటివన్నీనేను పట్టించుకుంటానేంటి - అవతల నాకారు - పాపం - నా పాల బడ్డందుకు -రోడ్డుకి అడ్డంగా తిరిగి -  డ్రుం... డ్రుం...  అని -  ఘోషిస్తుంటే?!

పోలీస్ వచ్చాడు - మరి పదహారేళ్ల వయసునుంచీ కార్నడిపిన వాడు - ఆ మాత్రం చేయలేడేంటి?  చక్కగా నా కారుని వెనక్కి తిప్పి బయటికివెళ్లే రోడ్డులో ఆపి - మళ్లీ తనకోసం వెనక్కి జరుపుకున్న  డ్రైవింగ్ సీట్ నాకు తగ్గట్టు ముందుకి జరిపి - Now you can go! - అని సాదరంగా సాగనంపాడు.

సాయంత్రం - అదే విషయం చెప్తే - అసలు నీ లైసెన్స్ ఎందుకు కాన్సెల్ చేయలేదా అని నాకాశ్చర్యంగా వుంది - అని బో... ల్డంత ఆశ్చర్య పోయారు బదరి.

కానీ తనకి తెలియదు కదా - అది నాకు కారు నేర్పిన Kerry - తొలి - తోలి కాదు - తొలి he చేసిన పూజాఫలమూ అని  - అంత తొందరగా కాన్సెల్ కాదని.

సరే! అప్పటినుంచీ మరీ కాళ్లనే నమ్మకుండా కొంచెం కళ్లు కూడా వాడుతూ కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్ అన్న సముద్రాల వారిని మొదటిసారిగా (మనసులోనే చెంపలేసుకుని) వ్యతిరేకిస్తూ కుడి ఎడమయితే పొరపాటేనోయ్ - వూరుకోరోయ్ (వూరుకోరు+ఓయ్) అని - మనసులో అనుకుంటే మళ్లీ మర్చిపోతానేమోనని - పైకే పాడుకుంటూ - అప్రమత్తతతో కారు డ్రైవ్ చేయడం అలవాటు చేసుకున్నాను.

ఇంతలో బుజ్జిజింక సమ్మర్ స్కూల్ మొదలయింది. మొదటి రెండు మూడు రోజులూ కొంచెం ముందరే వెళ్లి స్కూల్ వెనకాల చదునుగా వుండే పార్కింగ్ లాట్ లో పార్క్ చేశాను. నాలుగో రోజు కొంచెం ఆలశ్యం అయ్యింది. ఎప్పుడూ పెట్టే చోట పార్కింగ్ దొరకలేదు. ఇంక ముందు పక్క పార్క్ చేయడం తప్పలేదు. సరే అని - ముందు పక్కకి వచ్చి పార్క్ చేస్తుంటే కొంచెం ఎక్కువ తొక్కానేమో నా కారు అలిగి ముందున్న గట్టెక్కి -  గట్టవతల లోయలా వున్న గడ్డిలోకి దిగింది. వెంటనే కారు ఆపి బుజ్జిజింకని కారు దిగిపొమ్మన్నాను - ఆ లోయలో ఏమన్నా పల్టీ కొడితే గిడితే వాడికి దెబ్బలు తగలకూడదని.

నేను మాత్రం - సముద్రంలో మునిగిపోతున్నా ఓడ వదలని కెప్టెన్ లా ఫీలయిపోతూ - కారుని ముందుకి పోనిచ్చి స్కూల్ చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి సవ్యంగా పార్క్ చేసి ఇవతలికి వచ్చాను. నేను ఆ ప్రదక్షిణ చేసే టైం లో ఆ గడ్డిలో నడిచి వస్తున్న బుజ్జిజింకని వాడి క్లాస్మేట్ ఒకడు "Is your mom crazy?" అనడగడం విని బో... ల్డంత నవ్వుకున్నాను :))

ఆ తర్వాత - కారూ, నేనూ - నా సరి నీవని , నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే - అని పాడుకుంటూ సాఫీగా సాగిపోతున్నాము. అపార్టుమెంట్ లో మొదటగా డ్రైవింగ్ నేర్చుకుంది నేనే. ఆ ఉత్సాహంలో - ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం తాజాగా వచ్చే కూరల కోసమని అంబికా స్టోర్ కి అనితనీ, పద్మనీ - ఇంకా ఎవరొస్తే వాళ్లని ఎక్కించుకుని ఒక చిన్న షటిల్ సర్వీస్ మెయింటెయిన్ చేసేదాన్ని.

మొత్తానికి నాకు సెయింట్ లూయిన్ లో లోకల్ రోడ్డులు దున్నడం వచ్చేసింది కానీ హైవే మీదకి వెళ్లడం బెరుగ్గానే వుంది. హైవే మీద మెర్జ్ అవడం ఇంకా భయమే.

అలాంటి ఒకానొక రోజు - బుజ్జిజింకని తీసుకుని St. Chalres Rock Road లో Circuit City కి ఏదో ఎలెక్ట్రానిక్స్ కొనడానికి వెళ్లాను - బదరికి కావాలంటే. కావలిసినవి తీసుకుని బయటికి వస్తూ కొంచెం కన్ఫ్యూజ్ అయి హైవే మీదకి వచ్చేశాను.

ఒక్క క్షణం ఎటు వెళ్లాలో అర్థం కాలేదు.  ఏదయితే అదయింది - అంతగా అయితే ఎదో ఎగ్జిట్ వచ్చేవరకూ ఎంత దూరమయినా వెళ్ళిపోదామని ఒక పక్కా - అలా వెళ్తే షికాగో దాకా వెళ్ళిపోతానేమో అని భయం ఇంకో పక్కా - దాంతో ఎప్పుడూ ఏదో కబుర్లు చెప్తూ పాటలు పాడుతూ వుండే నేను సైలెంట్ గా డ్రైవ్ చేస్తుంటే - వెనక సీట్లోంచి - బుజ్జిజింక గొంతు బెంగగా - "అమ్మా! Are you crying?" అంటూ వినిపించింది.

 "ఛ!  అదేం లేదు నాన్నా! అదిగో నెక్స్ట్ ఎగ్జిట్ లో తిరిగిపోదాం" అంటూ వున్నానో లేదో 17 - Dorsett Road అని - మా ఇంటికి వెళ్లే దారే  కనిపించింది.

అంతే .... మళ్లీ పాట మొదలు -
మేఘాల పైన సాగాలి .... నువ్వు కదం తొక్కుతూ ఉరకాలి - నే బ్రేకు తొక్కుతూ ఆపాలి .. అహహా అహహా 

అలా మొదలయిన నా కారు చోదనం - ఎప్పటికప్పుడు ... అంతం కాదిది ఆరంభం !

ఇవాళ్టితో నా కారు కబుర్లు సమాప్తం! ఇంకోసారి ఎప్పుడైనా నాకే తెలియని నా దారుల కబుర్లు!






12 కామెంట్‌లు:

  1. నారీమణుల్ చోదకులైననేమి? అన్నారు కదండి 🙂. Happy driving 👍.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నది నిజమే - సత్కవుల్ హాలికులయినప్పుడు - నారీమణుల్ చోదకులయిననేమి ?! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు :)

      తొలగించండి
  2. చదువుతున్నంత సేపూ, ఆ తర్వాత కూడా నవ్వుతూనే ఉన్నాను లలితా!
    మాటలు, పాటలు, హాస్యం ముప్పేటలా భలే కూర్చావుగా!
    నీ కలం ఇలాగే, ఇంకా, ఇంకా కదం తొక్కుతూ, పదునెక్కుతూ ఉరకాలి మరి. :)



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవి జరిగినప్పుడూ, మళ్లీ నిన్న రాసినప్పుడూ కూడా నేను నవ్వుతూనే వున్నాను - నీ లాగే!
      కలం (కీ-కలం) పదం-కదం తొక్కుతుంది కానీ పదును-అదును చెప్పలేను ;)

      తొలగించండి
  3. నిజం గా వంశి సినిమానే అక్కా నా కళ్ళ ముందు చుపిన్చావు బాగా నావుకున్నా అక్కా ఇలాగే మమ్మలిని నవ్విస్తూ నవ్వుతూ ఉండాలని కోరుకునే నీ తమ్ముడు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్, హనుమాన్! నవ్వడం-నవ్వులు పంచడం నాకెంతో ఇష్టమైన వ్యాపకాలు. అందులోనూ నేను రాసినవి చదివి - నాతో కలిసి నవ్వే నీలాంటి తమ్ముడితో పంచుకునే నవ్వులు ఇంకా ఇష్టం. Stay Tuned :)

      తొలగించండి
  4. Very nice...I think it is time for you to publish a book 😀... thank you for sharing .. You are very talented .

    రిప్లయితొలగించండి
  5. లలిత గారు,
    ఇంతకూ జీవాతుమై యుండు చిలుకా అన్న సంకీర్తనం ఆడియో విన్నారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండు, మూడు సార్లు ప్రయత్నించానండీ - 404 error వస్తోంది :(

      తొలగించండి
  6. Khhashtapadi nee klishtamaina Carventurez chadivenu .. Nuvvu Ullasamga .. Adutu Paadutu chesina ..savari's baagunnai. Loved you car Hummings the most !!! 👍👍👍😊😊

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్, సాగీ! అసలు మీరు తెలుగు చదువుతున్నారు అంటేనే కొంచెం ఆశ్చర్యం, ఇంకొంచెం ఆనందం! అందులోనూ నా బ్లాగ్ పోస్ట్ చదివారని బోల్డంత సంతోషం. You made my blog-day by saying that you liked my నా కారు పాట్లు-పాటలు :)

      తొలగించండి